mistory unvieled
-
నిక్ స్కుబిష్..! అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి?
అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి మరణించింది. తన వెంటే ఉన్న మూడేళ్ల కొడుకు కొనప్రాణాలతో మిగిలాడు. మరణించిన తర్వాత కూడా ఆ తల్లి–కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి, ఆ కొడుకు ప్రాణాలు నిలిచాయి. పెరిగి పెద్దవాడైన కొడుకు మనసులో ఆ జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి.1994 జూన్ 11 రాత్రి, సమయం పదకొండు దాటింది. కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా పర్వతశిఖరాల పక్కనే ఉన్న ‘హైవే నంబర్ 50’ వైపు ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారుని డెబోరా హోయ్ట్ అనే 35 ఏళ్ల మహిళ నడుపుతోంది. బాగా చీకటిపడటంతో ఆమెకు నిద్ర రాకుండా ఉండటానికి పాటల కచేరీ మొదలుపెట్టాడు పక్క సీట్లో కూర్చున్న ఆమె భర్త డేవిడ్. దాంతో డెబోరా కూడా డేవిడ్‌తో కలసి గొంతు కలిపింది. ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై భీకరమైన చలిలో పొగమంచును చీల్చుకుంటూ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి.ఉన్నట్టుండి డెబోరా చూపు రోడ్డు తిన్నగా కాకుండా రోడ్డు పక్కకు మళ్లింది. ఒంటి మీద నూలుపోగు లేని ఒక అందమైన అమ్మాయి వెనక్కి తిరిగి, వయ్యారంగా నేలపై పడుకుని ఉంది. ఆమె అచ్చం పాలరాతి బొమ్మలా ఉంది. రెండు చేతులూ పైకి పెట్టుకుని, మోకాళ్లు కాస్త ముడుచుకుని హొయలు పోతున్నట్లే కనిపిస్తోంది. అయితే అది బొమ్మా? మనిషా? ప్రాణం ఉందా? లేదా? అర్థం కాలేదు డెబోరాకు. వెంటనే భర్తకు ఆ దృశ్యాన్ని చూపిస్తూ కారు స్లో చేసింది. అది చూసిన డేవిడ్ ‘హేయ్ ఆపొద్దు! పోనీ పోనీ!’ అని అరిచేశాడు కంగారుగా. దాంతో డెబోరా కారు గేర్ మార్చింది. అతడి భయమేంటంటే, అలా అందమైన అమ్మాయిలను రోడ్లపై పడుకోబెట్టి, దొంగలు కాపుగాసి ఉండవచ్చు. లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండవచ్చు.‘అర్ధరాత్రి అలా ఎక్కడపడితే అక్కడ కారు ఆపడం ప్రమాదమని నీకు తెలియదా?’ అని తిట్టాడు డేవిడ్. అది నిజమే అనిపించింది డెబోరాకి. దాంతో పోలిస్ స్టేష¯Œ కి వెళ్లి రిచ్ స్ట్రాసర్ అనే డిప్యూటీ అధికారికి విషయం చెప్పారు. ‘పదండి ఎక్కడో చూపించండి’ అన్నాడు స్ట్రాసర్. దాంతో డెబోరా కారు యూటర్న్ తీసుకుంది. తీరా ఆ అమ్మాయి కనిపించిన చోట రెండు లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. నిజానికి ‘ఆ అమ్మాయి కనిపించింది సరిగ్గా ఇక్కడే’ అని ఆ దంపతులిద్దరూ గుర్తించలేకపోయారు. సరైన ల్యాండ్ మార్క్ లేకపోవడంతో పాటు కంగారుగా అక్కడి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ గందరగోళం చెందారు. అయితే ఆ చోటికి వెళ్లగానే, రిచ్ స్ట్రాసర్ మదిలో ఓ తల్లికొడుకుల మిస్సింగ్ కేసు మెదిలింది.సరిగ్గా ఐదు రోజుల కిందట క్రిస్టీన్ స్కుబిష్ అనే 23 ఏళ్ల అమ్మాయి తన మూడేళ్ల కొడుకు నిక్‌తో కలసి కారులో ఇదే దారి గుండా వెళ్లిందట! ఆ తర్వాత వాళ్లు ఇంటికి రాలేదు. ఆ మిస్సింగ్ కేస్ మా దగ్గరకొచ్చింది. మీరు ఒకసారి రేపు ఉదయాన్నే రండి. పగటిపూటైతే మనకు ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా’ అన్నాడు డెబోరాతో స్ట్రాసర్.మరునాడు ఉదయాన్నే స్ట్రాసర్ను కలసిన డెబోరా రాత్రి తమ ప్రయాణాన్ని, నగ్నంగా కనిపించిన అమ్మాయి దృశ్యాన్నీ ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా గుర్తు చేసుకుని, ‘బులియన్ బెండ్‘ అనే ప్రమాదకరమైన చోటును చూపిస్తూ ‘ఇక్కడే సార్! రాత్రి నేను చూసింది ఇక్కడే!’ అంది బలంగా. అక్కడే లోయవైపు కారు టైర్ల గుర్తులు ఆనవాళ్లుగా కనిపించాయి స్ట్రాసర్కి. కొద్ది దూరంలో ఒక చిన్న çషూ రక్తం మరకలతో కనిపించింది. వెంటనే వెతుకులాట మొదలుపెట్టించాడు. అదే లోయలో కాసేపటికి క్రిస్టీన్ కారు కనిపించింది. ఆ పక్కనే ఆమె మృతదేహం కనిపించింది. కాస్త దూరంలో బాబు పడి ఉన్నాడు. పల్స్ కొట్టుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.నిజానికి జూన్ 6 తర్వాత రోడ్డు మీదకు కొండచరియలు విగిరిపడటంతో సుమారు రెండు రోజుల పాటు అటుగా రాకపోకలు కూడా ఆగిపోయాయి. అంటే జూన్ 6న నిక్, క్రిస్టీన్ వెళ్తున్న కారు మీద అవి పడి, ఆ ధాటికి కారు లోయలో పడిపోయి ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే క్రిస్టీన్ చనిపోయిందని పోస్ట్ మార్టమ్‌లో తేలింది. మరి చిన్న బాబు పగలు భీకరమైన వేడిని, రాత్రి వణికించే చలిని తట్టుకుని, సుమారు ఆరు రోజులు ఎలా ప్రాణాలతో ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి డెబోరా కన్ను ఆ నగ్నంగా కనిపించే అమ్మాయి మీద పడకుండా ఉండి ఉంటే, నిక్ ఎవరికీ కనిపించేవాడే కాదు.ప్రమాదంలో క్రిస్టీన్ చనిపోయాక ఆత్మగా మారి, లోయలో పడిన తన బిడ్డను బతికించు కోవడానికే దారిన పోయేవారికి నగ్నంగా కనిపించి ఉంటుందని డెబోరా నమ్మింది. ఆ వార్త బయటికి రాగానే, అటుగా వెళ్లిన చాలామంది ప్రయాణికులు పోలీసులను కలిశారు. జూన్ 8 , 11 మధ్యలో తమకి కూడా ఆ నగ్నంగా ఉన్న అమ్మాయి కనిపించిందని, భయపడి ఆగలేదని చెప్పారు. ఇక బాబు స్పృహలోకి వచ్చిన తర్వాత, తన చుట్టూ కమ్మిన ఓ ప్రకాశవంతమైన కాంతి గురించి అస్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో క్రిస్టీన్ తన బిడ్డను తానే ఆత్మ రూపంలో కాపాడుకుందని నమ్మారు. బాబు పెద్దవాడయ్యాక, ఆ రాత్రులను తలచుకుని చాలా ఇంటర్వ్యూలిచ్చాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు, చాలా ఎత్తు నుంచి కారు పల్టీలు కొట్టింది. నాకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కానీ ప్రతి క్షణం మా అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది, నాకసలు భయమేయలేదు’ అని ఇప్పటికీ చెబుతుంటాడు నిక్.అంత చిన్న బాబు అన్ని దెబ్బలతో, అలాంటి వాతావరణంలో, అడవిలాంటి ప్రాంతంలో అన్ని రోజులు బతకడం కష్టమని డాక్టర్లు సైతం తేల్చేశారు. ఇదిలా ఉంటే, క్రిస్టీన్ తల్లికి ఈ ప్రమాదం జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి వరుసగా పీడకలలు వచ్చేవట! ఆ కలల్లో పెద్ద లోయ, కారు పల్టీలు కొట్టడం, మైలు రాయి 16 ఎక్కువగా కనిపించేవట. అయితే యాక్సిడెంట్ అయిన చోట 16 నంబర్ మైలు రాయి నిజంగానే ఉంది. దాంతో మనసులను మెలిపెట్టే ఈ కథలోని ప్రతి సన్నివేశం మిస్టరీనేగా మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
Mystery Death: ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’..?
ఇది ఓ చిట్టి గుండెకు, స్వచ్ఛమైన నవ్వుకు జరిగిన అన్యాయం. కాలం సైతం మాన్చలేని గాయం. మూర్ఖత్వానికి, క్రూరత్వానికి.. నిర్దాక్షిణ్యంగా బలైన నిండు జీవితం. కుయుక్తులు, కుతంత్రాలు తెలిసిన ఈ ప్రపంచానికి ఎదురీదలేక.. నీరుగారిన పోరాటం.1995 ఏప్రిల్ 23 రాత్రి, దగ్గరదగ్గరగా తొమ్మిది కావస్తోంది. ఫ్లోరిడా, న్యూ స్మిర్నా బీచ్ అంతా ఆటుపోట్లతో ఎగసిపడుతోంది. కారుచీకటిని చీల్చుకుంటూ ఓ బ్యాటరీ లైట్.. స్థిమితం లేకుండా అటూ ఇటూ కదలాడుతోంది. ‘మూర్.. మూర్.. మూర్’ అనే అరుపు.. హోరుహోరుమనే సముద్రగాలికి.. గమ్యం లేకుండా ఎదురీదుతోంది. ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’ అనే కేక.. క్రమక్రమంగా ఆ పరిసరాల్లో అల్లకల్లోలాన్నే సృష్టిస్తోంది. ఆ అలజడంతా ఓ కన్నపేగుది. ఏదో కీడు శంకిస్తున్న ఓ తల్లి మనసుది.‘ఓరా లీ’ తన ఎనిమిదేళ్ల కొడుకు డిమీట్రీక్ మూర్ని.. మూడు నాలుగు గంటలు ఊరంతా వెతికీ వెతికీ.. చివరికి సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ కూడా ఏ జాడ లేకపోయేసరికి.. పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు.. ఆడుకుని వస్తానంటూ బయటికి వెళ్లిన నా కొడుకు మూర్ తిరిగి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. నా బిడ్డను ఎలాగైనా వెతికిపెట్టండి సారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరునాడు ఉదయం నుంచి బాబును వెదకడం మొదలుపెట్టారు. స్థానికుల్లో కొందరు మూర్ని వెతకడంలో సాయం చేశారు.ఆ రోజు సాయంత్రం 4 అయ్యేసరికి మూర్.. ఓరా కారు డిక్కీలోనే శవమై కనిపించాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. మొదట బాబు.. తెలియక ఆ డిక్కీలోకి తనంతట తానే వెళ్లి ఇరుక్కుని చనిపోయాడేమో అనుకున్నారంతా. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. హత్య అని తేలింది. బాడీపై వేలిముద్రలు లేకుండా కడిగినట్లు ఆనవాళ్లున్నాయి. ప్రాణం పోయి 18 నుంచి 24 గంటలు కావస్తోందని నిర్ధారించారు. తడిసిన బాబు బట్టలు కూడా ఆ పరిసరల్లోనే దొరికాయి. తెలివిగా.. వాటిని ఉతికి శుభ్రం చేసి పెట్టారని స్పష్టమైంది. శవం.. తల్లి కారులోనే దొరికింది కాబట్టి కేసు ఓరా మెడకే చుట్టుకుంది. ఆమెను పలుమార్లు.. గంటలు గంటలు విచారించారు పోలీసులు. అరెస్ట్ కూడా చేశారు.‘ఆ రోజు 8 లోపే మూర్ ఇంటికి వచ్చేశాడు. అయితే రెండు గంటలకు వెళ్లిన మూర్ అన్ని గంటల తర్వాత.. బట్టల్నీ మురికి చేసుకుని వచ్చేసరికి ఓరా.. మూర్‌పై తీవ్రంగా కోప్పడింది. ఆ ఆవేశంలో బాబుని బాగా కొట్టింది. ఆ అరుపులు, ఏడుపులు మేము విన్నాం.. ఆ సమయంలోనే మూర్ చనిపోయి ఉంటాడు. అందుకే ఓరా.. తెలివిగా కేసుని పక్కదోవ పట్టించడానికి కారులో శవాన్ని దాచి.. ఊరంతా వెతికి ఉంటుంది’ అంటూ కొందరు సాక్షులుగా నిలిచారు. దాన్ని నమ్మిన పోలీసులు.. ఓరాను అరెస్ట్ చేశారు. అయితే ఓరా అలాంటిది కాదని మరికొందరు వాదనకు దిగారు.కేసు కోర్టుదాకా పోయింది. వాద, ప్రతివాదాల మధ్య నలిగిన ఓరా.. 1996 జూన్ కల్లా నిర్దోషిగా విడుదలైంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కేసును క్లోస్ చేశారు పోలీసులు. అయినా సరే ఓరా ఆగలేదు. తన బిడ్డ మూర్ మరణానికి కారణమెవరో తేల్చాలంటూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాట ఫలితంగా 1997 ఫిబ్రవరిలో కేసు రీ ఓపెన్ అయ్యింది. ఈసారి రూట్ మార్చారు అధికారులు. ఆ రోజు మూర్తోపాటు ఆడుకోవడానికి వెళ్లిన ఇరుగుపొరుగు పిల్లలను విచారించారు. అయితే అందులో కొందరు ఆ రోజు మూర్‌ను కలవనేలేదని, చూడనేలేదని చెప్పారు.అప్పుడే మూర్ స్నేహితుడొకడు.. కీలక సాక్ష్యమయ్యాడు. ‘మూర్తో కలసి ఆడుకునే స్థానిక పిల్లలంతా అతని కంటే పెద్దవాళ్లే. దాంతో చాలామంది పిల్లలు మూర్ని చిన్నదానికీ పెద్దదానికీ బెదిరించేవారు. ఏదో ఒక కారణంతో ఏడిపించేవారు. గతంలో ఒకసారి ఒక పెద్ద కుర్రాడు మూర్ని నేలపై పడేసి.. బలవంతంగా మట్టి తినిపించడం నేను కళ్లారా చూశాను’ అని మూర్ స్నేహితుడు చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే విచారణలో ‘మూర్ని ఆరోజు చూడనేలేదు’ అని చెప్పినవారే.. అతని దృష్టిలో నిందితులు. దాంతో పరిశోధకులు.. మూర్ని తోటి స్నేహితులే అనవసరంగా గొడవపడి, ప్రమాదవశాత్తూ చంపేసి ఉంటారని.. కేసు మీదకు రాకుండా తమ తల్లిదండ్రుల సాయం తీసుకుని మూర్ శరీరాన్ని, దుస్తుల్ని శుభ్రం చేసి ఉంటారని అంచనాకొచ్చారు.ఇంతలో ఓరాకు మరో సంగతి గుర్తొచ్చింది. అసలు కారులోకి శవం ఎలా వచ్చింది? అని ఆలోచిస్తే.. ఒక అనుమానాస్పద సన్నివేశం ఆమె కళ్లముందు కదలాడింది. ఓరా ఆ రోజు బాబుని వెతుకుతుంటే.. ఇద్దరు ఆడవాళ్లు వచ్చి.. ‘మూర్ రైలు పట్టాల దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నాడు’ అని చెప్పారు. తీరా ట్రాక్ దగ్గరకు.. ఓరా పరుగుతీస్తే అక్కడంతా ప్రశాంతంగానే కనిపించింది. అంటే.. తను రైలు పట్టాల దగ్గరకు వెళ్లినప్పుడే.. ఎవరో బాబు శవాన్ని లాక్ చేయని తన కారు డిక్కీలో పెట్టి ఉంటారని నమ్మింది ఓరా.మరోవైపు మూర్ కనిపించకుండా పోయిన మరునాడు మధ్యాహ్నం, శవం దొరక్కముందు.. ‘స్టెఫానీ వాషింగ్టన్’ అనే పొరుగు నివాసి.. ఓరాకు ఓ అబద్ధం చెప్పాడట. ‘మూర్తో ఆడుకున్న అబ్బాయిల్లో ఒకరిని.. ఎవరో కొట్టి చంపి.. రైలు పట్టాల దగ్గర వేశార’ని ఆ వ్యక్తి చెప్పడంతో మూర్కు ఏమై ఉంటుందోనని మరింత భయపడిందట ఓరా. నిజానికి.. ఆ సమయంలో మూర్ మృతికి ముందు కానీ తర్వాత కానీ.. ఏ పిల్లలూ మిస్ అవ్వలేదు. మరి ఇరుగుపొరుగు ఎందుకలా అబద్ధం చెప్పారో తెలియదు. ఏది ఏమైనా మూర్ మృతికి.. అతడి తోటి స్నేహితులే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ, సరైన ఆధారాలు దొరకలేదు.మొత్తానికి మూర్ మృతికి అసలు కారకులు ఎవరు? పొరుగువారైయ్యుండి ఎందుకు ఓరాని తప్పుదారి పట్టించారు? మూర్ బాడీని.. అతని తల్లి ఓరా కారులో ఎవరు పెట్టారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
వీడిన ఉదయ్‌కిరణ్ హత్యకేసు మిస్టరీ
-
వీడిన ఉదయ్‌కిరణ్ హత్యకేసు మిస్టరీ
హయత్‌నగర్ సమీపంలోని బాటసింగారంలో ఉదయ్ కిరణ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి, హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఉదయ్ కిరణ్ ఇంటికి సమీపంలోనే ఉండే నవీన్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బు కోసమే అతడీ పనిచేసినట్లు తెలిసింది. కేసు వివరాలను డీసీపీ రవివర్మ మీడియాకు తెలిపారు. ఉదయ్ కిరణ్‌ను కిడ్నాప్ చేసిన నవీన్.. అతడిని దూరంగా ఉన్న ప్రాంతానికి మోటారుసైకిల్‌పై తీసుకెళ్లాడు. తీరా అక్కడ పరిస్థితి ఇబ్బందిగా మారడంతో బాలుడి పీక నులిమి చంపేసి, బండరాయి కట్టి మన్సూరాబాద్ చెరువులో పారేశాడు. పుస్తకాల బ్యాగును కూడా పారేశాడు. బాబు ఐడెంటిటీ కార్డు అక్కడకు సమీపంలో కనిపిస్తే అనుమానిస్తారని దాన్ని వేరేచోట దాచాడు. చివరకు భయంతో సరూర్‌నగర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. నవీన్‌తో పాటు అతడికి సహకరించిన ఉపేందర్, నర్సింహ, నవీన్‌కుమార్ అనే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో నవీన్ కుమార్ మాజీ హోంగార్డు. మూడు నెలల పాటు అతడు హోంగార్డుగా పనిచేసినట్లు తెలిసింది. నలుగురిలో ఎవరికీ ఇంతకుముందు నేరచరిత్ర లేదని, తనకు సహకరించినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చాడని కూడా పోలీసులు తెలిపారు.