మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? | Sakshi
Sakshi News home page

మిస్టరీ: సిటీ ఆఫ్‌ ది డెడ్‌.. ఈ సిటీ ఒక భయానకం!

Published Sun, Mar 31 2024 1:23 PM

 Have You Ever Heard Of This Scary City? - Sakshi

మిస్టరీ..

ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్‌’ ఒకటి. రష్యాలోని ‘నార్త్‌ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్‌లో గిజెల్డన్‌ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్‌ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్‌ ది డెడ్‌’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్‌. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు.

‘నార్త్‌ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్‌ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్‌.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్‌లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు.
      అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్‌ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్‌లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు.
నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది.

18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట.

      నిజానికి దార్గాస్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్‌ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్‌ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు.

ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్‌ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
— సంహిత నిమ్మన

ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..

Advertisement
Advertisement