మిస్టరీగా మిగిలిన చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'.
అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం.
నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు.
చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు
కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్‌లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట.
కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట.
నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment