Life style
-
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్‌బోట్. చాట్‌బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్‌గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్‌గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్‌ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్‌ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్‌తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్‌ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్‌ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్‌ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్‌ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్‌లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్‌లోనూ సిగ్నేచర్ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!
లతిక సుథాన్ ఇల్లు కలువల కొలను. కమలాల సరస్సు. ఇంటి చుట్టూ నీరు, నీటిలో తేలుతూ పూలు. ఒకటి కాదు, రెండు కాదు. వంద రకాల కమలాలు, ఎనభై రకాల కలువలు వికసించిన సుమనిలయం ఆమె ఇల్లు. వాటిలో ఒకటి అత్యంత అరుదైన వెయ్యి రేకుల కమలం. ఇవన్నీ ఆమెకు చక్కటి ఆదాయ వనరుగా కూడా మారాయి. నెలకు నలభై వేల రాబడినిస్తున్నాయి. లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును తెచ్చాయి. విశ్రాంత జీవితాన్ని ఇంత సుగంధ భరితం చేసుకున్న లతిక ఒక స్కూల్ టీచర్. ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైన ఉన్నన్ని రోజులూ తనకిష్టమైన మొక్కల పెంపకం అభిరుచిని పక్కన పెట్టాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఆమె తన హాబీకి మొగ్గ తొడిగింది. మొక్కలకు దూరంగా ఇరవై ఏళ్లు..లతిక సుథాన్ది కేరళ రాష్ట్రం, త్రిశూర్. ‘చిన్నప్పుడు మొక్కలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. కమలం విచ్చుకోవడాన్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఒక్కో రెక్క విచ్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపించేది. చదువు, పెళ్లి, ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగంతో ఇరవై ఏళ్లపాటు మొక్కలకు దూరమయ్యాను. ఉద్యోగం నుంచి 2018లో రిటైరయ్యాను. అప్పటి నుంచి ఇక మొక్కల మధ్య సీతాకోక చిలుకనయ్యాను. ప్రపంచంలో ఉన్న కలువలు, కమలాల జాతుల మీద ఒక అధ్యయనమే చేశాను. దేశంలోని వివిధ ్రపాంతాల నుంచి మొక్కలు తెచ్చి పెంచాను. అలాగే థాయ్‌లాండ్, వియత్నాం, జపాన్ దేశాల నుంచి కూడా తెప్పించుకున్నాను. పెంపకంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక వర్క్‌షాపులకు హాజరయ్యాను. వ్యవసాయాభివృద్ధి శాఖ నిర్వహించే సదస్సులకు వెళ్లి నిపుణుల సూచనలను తెలుసుకున్నాను’ అన్నారు లతిక.మొక్కల పాఠాలు..కమలాలు, కలువల్లో అరుదైన జాతులను సేకరించడం, వాటి పెంపకం గురించి మెళకువలు తెలుసుకోవడంతో ఆ మొక్కల పెంపకం గురించి ఉపన్యసించగలిగినంత పట్టు సాధించారు లతిక. పిల్లలకు పాఠాలు చెప్పిన ఆమె అనుభవం ఇప్పుడు మొక్కల పాఠాలు చెప్పిస్తోంది. ఈ పూల గురించి ఒక్క సందేహం వ్యక్తం చేస్తే చాలు... అనర్గళంగా వివరిస్తుంది. కమలాలు, కలువల మొక్కలు, గింజల కోసం హాస్పిటల్, హోటల్, రిసార్టుల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తుంటాయి. హాబీగా మొదలైన కమలాల పెంపకం మంచి లాభాలనిస్తూ ఆమెకు స్థానికంగా లోటస్ ప్రెన్యూర్ అనే గుర్తింపును కూడా ఇచ్చింది.ఇవి చదవండి: iSmart హోమ్స్ -
నిద్రలేమిని దూరం చేసే కళ్లజోడు.. ఎప్పుడైనా వాడారా..!?
ఈ కళ్లజోడును రోజూ ధరించినట్లయితే, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ సరైన వేళకు చక్కగా నిద్రపడుతుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ ‘రీటైమ్’ ఈ హైటెక్ లైట్‌థెరపీ కళ్లజోడును తాజాగా ‘రీటైమర్–3’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడలాయిడ్లోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ లియోన్ ల్యాక్ ‘రీటైమ్’ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఈ కళ్లజోడును రూపొందించారు.ఈ కళ్లజోడును ధరిస్తే, దీని నుంచి నిర్ణీత తరంగదైర్ఘ్యంలో నీలి–ఆకుపచ్చ రంగులోని కాంతి కళ్ల మీద పడుతుంది. ఈ కాంతి కళ్ల అలసటను పోగొడుతుంది. దీని నుంచి వెలువడే కాంతి శరీర గడియారానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా, వేళకు చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఈ కళ్లజోడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఆరుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 179 డాలర్లు (రూ.15,021) మాత్రమే!ఎక్కడైనా వాడుకోగల పోర్టబుల్ ఏసీ..ఇది పోర్టబుల్ ఏసీ. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇళ్లల్లోనే కాదు, పిక్నిక్లకు, ఫారెస్ట్ క్యాంపులకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా వేసుకున్న టెంట్లలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. చైనాకు చెందిన ‘హావోరాన్’, ‘యిఫీలింగ్ డిజైన్ ల్యాబ్’లకు ఇంజినీర్లు ‘యూయీ’ పేరుతో ఈ పోర్టబుల్ ఏసీకి రూపకల్పన చేశారు. ఒకదానికి మరొకటి అనుసంధానమై రెండు భాగాలుగా ఉండే ఈ ఏసీని సూట్‌కేసులా ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు.ఏసీ భాగాన్ని టెంట్ లోపల లేదా గది లోపల పెట్టుకుని, ఏసీ అడుగున ఉన్న భాగాన్ని టెంట్ లేదా గది వెలుపల పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గది లేదా టెంట్ లోపల ఉన్న వేడిని బయటకు పంపి క్షణాల్లోనే చల్లబరుస్తుంది. అంతేకాదు, ఇది పనిచేసే పరిసరాల్లోకి దోమలు, ఇతర కీటకాలు చేరలేవు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే మిల్లీరోబోలు..డచ్ వైద్యశాస్త్రవేత్తలు రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయే ఈ మిల్లీరోబోలను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇవి నేరుగా రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి, సూచించిన దిశలో ముందుకు సాగుతూ, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన చోట ఏర్పడిన అవరోధాలను సునాయాసంగా తొలగించి, సజావుగా రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. నెదర్లండ్స్‌లోని ట్వంటీ యూనివర్సిటీ, రాడ్‌బోడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ మిల్లీరోబోలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు.అయస్కాంతం ద్వారా వీటి కదలికలకు దిశా నిర్దేశం చేయడానికి వీలవుతుంది. ఈ మిల్లీరోబోల పనితీరుపై ఇంకా లాబొరేటరీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చినట్లయితే, గుండెజబ్బులు, పక్షవాతంతో బాధపడే చాలామంది రోగులకు చికిత్స చేసే పద్ధతి మరింత సులభతరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి!
అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయ్యింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే, ఆమె ‘అవును.. పెళ్ళి అంగరంగవైభవంగా చేయాలి. ఎందుకంటే మనకు ఒక్కగానొక్క కొడుకాయే!’ అంది. అదే విషయాన్ని రాజు మంత్రితో చెబితే, ఆయనా రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణమూ, రాజోద్యోగులూ ‘అవును ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి చేయాలి’ అన్నారు.రాజుగారు అందరిమాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కనీవినీ ఎరుగనంత వైభవంగా చేశాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలోని ప్రజలంతా ‘ఇలాంటి పెళ్ళి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు’ అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం అట్టేకాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి.. ఖజానా ఖాళీ అయిందని! ‘పరిష్కారం ఏమిటీ?’ అని రాజుగారు అడిగితే, ‘కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే’ అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినపుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు, మంత్రి ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరారు.పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేదదీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దామనుకుని, గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికెళ్లారు. గ్రామాధికారి కూతురి పెళ్ళి జరుగుతున్నది. పట్టుమని వంద మంది అతిథులు కూడా లేరు. ‘అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్ళి చేస్తున్నాడేమిటీ?’ అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్థుల్ని విచారించాడు. ‘ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే లక్షవరహాలు దాటేటట్టు అనిపించింది. ఆయనకది ఇష్టంలేకపోయింది.పెళ్ళి నిరాడంబరంగా జరిపి, ఆ లక్షవరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారు కూడా ఆలోచించి ఉంటే అనవసర వ్యయం తగ్గివుండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేసుంటే తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవారు. మాకు ఈ కొత్త పన్నుల బాధ తప్పేది’ అన్నారు నిష్ఠూరంగా. రాజుగారికి ఎవరో చెంప ఛెళ్ళుమనిపించినట్లయింది.ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి, చర్చలు జరిపి కొత్త పన్నులను రద్దు చేశాడు. అంతఃపుర ఖర్చులు తగ్గించాడు. వేట, వినోద కార్యక్రమాల ఖర్చులూ తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలను తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా సులువుగానే నిండింది. అప్పటినుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నయినా ఒకటికి పదివిధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచిపేరు సంపాదించుకున్నాడు. – డా. గంగిశెట్టి శివకుమార్ఇవి చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'? -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!
సాక్షి, సిటీబ్యూరో: జిమ్‌కు వెళ్లడం అనేది శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం అనేది అందరికీ తెలిసిన విషయం. నాణేనికి మరో వైపు ఆదాయ మార్గం ఉంది. శరీర సౌష్టవం కలిగిన వారికి పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నగరంలో వందలాది కుటుంబాలు ఈ రకంగా ఉపాధి పొందుతున్నాయి. కండలు తిరిగిన యువత బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం, ఉన్నత శ్రేణి కుటుంబాలకు బాడీగార్డులుగా, ఈవెంట్స్, ప్రముఖ వ్యాపార సంస్థలకు బౌన్సర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరికి ఉపాధితో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.నిత్యం జిమ్ చేస్తూ ఆరోగ్యంగా, బలంగా ఉన్న వారికి మార్కెట్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వారికి పార్ట్ టైం, ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలూ లభిస్తున్నాయి. భాగ్యనగరంలో రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం ప్రైవేటుగా బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఏవైనా జన సమీకరణ కార్యక్రమాలు ఉన్నపుడు బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఉన్నత శ్రేణి కుటుంబాలు, సినిమా, ఇతర సెలబ్రిటీలు బయటకు రావాలన్నా, ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా బౌన్సర్లను పెట్టడం అలవాటుగా మారిపోయింది. కొన్ని వర్గాలకు బౌన్సర్లను పెట్టుకోవడం స్టేటస్‌గానూ భావిస్తున్నారు. దీంతో నగరంలో బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది.ఈవెంట్స్‌ను బట్టి..ఒక్కో ఈవెంట్‌కు అక్కడ పరిస్థితులను బట్టి 8 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఇలా సమయాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. బౌన్సర్లకు 8 గంటలకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. 12 గంటలు, ఆపై సమయాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. మరోవైపు పబ్‌లు, పేరొందిన రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ప్రముఖ దుకాణాల్లోనూ నెలవారీ వేతనాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. బాడీగార్డు, బౌన్సర్లకు నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తున్నారు.17 ఏళ్ల వయసు నుంచి..నాకు 17 ఏళ్ల వయసు నుంచి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాను. ఇపుడు 30 ఏళ్లు. తొలి రోజుల్లో ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం వెళ్లాను. అందరిలోనూ మనం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాను. శరీరం ఆకర్షణీయమైన ఆకృతిలో తయారయ్యింది. తదుపరి రోజుల్లో బౌన్సర్‌గా అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల తరువాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. ప్రస్తుతం పార్ట్ టైం బౌన్సర్‌గా పనిచేస్తున్నాను. ఈవెంట్స్ ఉన్నపుడు వెళుతున్నా. 8 గంటలకు కనీసం రూ.1500 ఆపైన వస్తాయి. 12 గంటలు అయితే రూ.2 వేల వరకూ ఇస్తున్నారు. ఈ ఆదాయం ఆర్థిక వెసులుబాటు కలి్పస్తుంది. – అమోల్, బౌన్సర్, బంజారాహిల్స్పర్సనల్ బాడీగార్డుగా..గత పదేళ్ల నుంచి జిమ్‌కు వెళుతున్నాను. డైట్ పాటిస్తాను. ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటాను. నాకు తెలిసిన వారి రిఫరెన్స్ ద్వారా పర్సనల్ బాడీగార్డుగా చేరాను. నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. మంచి వేతనం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరమైన జీవితం సాగిస్తున్నాను. – ఆదిల్, జూబ్లీహిల్స్ఇవి చదవండి: Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది! -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్. -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్‌ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్‌కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్‌కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్‌తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్‌గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్‌కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్‌గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్‌గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్‌ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్‌లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్‌లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్‌క్రాఫ్ట్;ప్లాట్‌ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
కథ చెబుతాం.. ఊ కొడతారా..!
‘అనగనగా ఓ మహారాజు ఉన్నాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురూ వేటకువెళ్లి ఏడు చేపలు తెచ్చారు...’ ఇలా పిల్లలకు పాత కథలు మాత్రమే తప్ప కొత్త కథలు, కొత్తగా చెప్పడం రాని ఆధునిక తల్లిదండ్రులు.. కథలు నేర్పే స్టోరీ టెల్లర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. వీరు మాత్రమే కాదు పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు చెప్పే కౌన్సిలర్స్ వరకూ అందరూ కథా కళ..లో నైపుణ్యం కోసం క్యూ కడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రధానంగా నగరంలో ఈ కళకు డిమాండ్ తీసుకురావడంతో తల్లిదండ్రులే మహారాజు పోషకులుగా కనిపిస్తున్నారు. పిల్లలకు కథలు చెప్పడం మానసిక వికాసానికి మార్గమని సైకాలజిస్ట్‌లు సూచిస్తుండడం ఈ పోకడకు ఆజ్యం పోస్తోంది. పిల్లలకు కథలు చెప్పడం కేవలం వినోదం కాదని, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇది తప్పనిసరి అని చెబుతున్నారు స్టోరీ టెల్లర్ దీపాకిరణ్. కథలు చెప్పడం వల్ల పెద్దలు, పిల్లల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారామె.ప్రయోజనాలెన్నో...సంభాషించడానికి మాత్రమే కాదు నేర్చుకోవడానికీ.. ఆలోచనల్లో పరిణితికీ భాష అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్నారుల్లో భాషా పరిజ్ఞానం సంతరించుకోవడం ఆలస్యం కావడం సహజంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నారులను ఆకట్టుకునేలా కథలు చెప్పడం నేర్చుకున్న పెద్దలు ఆ నైపుణ్యాన్ని పిల్లలకు అందిస్తారు. కథల ద్వారా సంస్కృతి గురించి నేర్పవచ్చు. అలాగే ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు అంటున్నారు నిపుణులు.మనవడికి కథలు చెబుతున్నా...కొన్ని రోజుల క్రితం నా పదేళ్ల మనవడు అమ్మమ్మా కథ చెప్పమని నన్ను అడగడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ కాలంలో కూడా పెద్దల నోటి ద్వారా కథలు వినడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యి కొత్త కొత్త కథలు, ఆకట్టుకునేలా చెప్పగలడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మనవడు/మనవరాళ్లతో అనుబంధం మరింత బలోపేతం చేసింది. – భారతి రామినేనిమెళకువలు నేర్చుకుంటే మేలెంతో..స్టోరీ టెల్లింగ్ సెషన్స్‌కి హాజరవడం వల్ల కథకు సంగీతాన్ని జత చేయడం, ముఖ కవళికలు, గొంతు పలికే తీరులో మార్పుచేర్పులు చూపడం.. వంటివి నేర్చుకుని నా మూడేళ్ల కొడుకుకి మంచి కథలు చెప్పగలుగుతున్నా. తనతో అనుబంధాన్ని మరింతగా ఆనందిస్తున్నా. – దాసన్నకళ అబ్బింది.. కథ వచ్చింది.. కథలు చెప్పడమే కదా ఎంత సేపు అనుకుంటాం కానీ.. ఈ ఆర్ట్‌ను నేర్చుకుంటే.. జీవితంలో ప్రతీ సందర్భాన్ని ఒక కథగా మలిచే సామర్థ్యం వస్తుంది. సంగీతాన్ని కలుపుతూ మా అబ్బాయికి కథ చెప్పడం, కథలోని క్యారెక్టర్స్ ఆవాహన చేసుకుని చెప్పడం వంటివి తనకి బాగా కనెక్ట్ అవుతోంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి బాగా ఉపకరిస్తోంది. విశేషం ఏమిటంటే తనే కథలు అల్లేసి నాకు చెబుతున్నాడు. – సుధారాణిప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రజెంటేషన్స్కూ..ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాకు వృత్తి జీవితంలో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం ఉపకరించింది. ముఖ్యంగా పలు అంశాలపై ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి సహకరించాయి. నిజానికి నా సోదరి కూతుర్ని పెంచాల్సిన బాధ్యత వల్ల స్టోరీటెల్లింగ్ నేర్చుకోవాల్సి వచి్చంది. అలా నేర్చుకుని తనకు చెప్పిన కొన్ని కథలు తనని క్లాస్‌లో టాపర్‌గా మార్చాయి. మంచి హాబీస్‌ను అలవర్చాయి. తను ఎప్పుడైనా ఏడుపు ముఖం పెట్టిందంటే నేను అనగనగా అనగానే ముఖ కవళికలు మార్చేసి ఆసక్తిగా చూస్తుంది. కథలు చెప్పడం వల్ల నా కూతురికి కూడా చాలా మానసిక వికాసం వచ్చేలా చేయగలిగాను. చాలా ఇళ్లలో పిల్లల వల్ల ఎదురయ్యే అల్లరి చిల్లరి ఇబ్బందులెప్పుడూ నాకు ఎదురు కాలేదు. దానికి కారణం కథలే అని చెప్పగలను. అందరు పిల్లలూ వీడియోగేమ్స్‌లో బిజీగా ఉండే సమయంలో మా పిల్లలు నన్ను కథ చెప్పవా అని అడుగుతారు. – వసుధకథలతో అనుబంధాలు బలోపేతం..స్టోరీటెల్లింగ్ అనే కళలో నైపుణ్యం సాధించే విషయంలో టీచర్లతో పాటు అవ్వా, తాతలకు, తల్లిదండ్రులకు బాగా ఆసక్తి పెరిగి మా స్టోరీ సూత్ర సంస్థను సంప్రదిస్తున్నారు. కథలు చెప్పే కళలో నైపుణ్యం సాధించిన వారు ఇలా పిల్లలతో తమ మధ్య అనుబంధం బలపడిందని, అంతిమంగా అది తమ ఆరోగ్యానికి, ఆనందానికి సైతం ఉపకరిస్తోందని చెబుతున్నారు. – దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్‌ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్‌ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్‌స్టా్రగామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్‌లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్‌ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్‌ను లేదా ఫ్రిస్బీ ప్లేట్‌ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మీకు తెలుసా! ఇదీ.. వందేళ్ల వండర్ఫుల్ అరకు కాఫీ!
నురగలు కక్కుతూ నిద్ర మత్తును వదలగొట్టే పానీయం.. మదిని ఉత్తేజపరచే ఔషధం.. అవనిలో దొరికే ఆ అమృతం.. చిక్కటి.. చక్కటి రుచిగల ఉదయాలకు ప్రారంభం! ఈ కాంప్లిమెంట్‌కి కాఫీనే ఎలిజిబుల్!‘అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు.. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు.. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు.. అమృతమన్నది హంబక్కు అయ్యలార.. జై కాఫీ’ అంటూ ‘మిథునం’ సినిమా కోసం జొన్నవిత్తుల కూడా కాఫీ మహిమను కీర్తించారు. ఇలా జనుల జిహ్వన నానుతున్న కాఫీ మన అరకు లోయలోనూ సాగవుతోంది. నిజమే కానీ ఈ ఘుమఘుమల ప్రస్తావన ఇప్పుడెందుకు? జూన్ 30న ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో ‘అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కృషి అభినందనీయం .. అరకు కాఫీని ఆస్వాదించండి’ అని ప్రత్యేకంగా ప్రశంసించినందుకు!టేస్ట్పుల్ ఇమేజ్‌తో అనేక దేశాలు గ్రోలుతున్న ఈ వండర్ఫుల్ అరకు కాఫీకి వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉంది. 1898లో.. ఓ ఆంగ్లేయ అ«ధికారి.. తూర్పుగోదావరి జిల్లా, పాములేరు లోయలో కాఫీ పంటను వేశారు. 1920 నాటికి విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీథి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీ నగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లోనూ కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు.స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లా రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను వేసింది. ఆ తోటలను 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ప్రత్యేకంగా కాఫీ తోటల అభివృద్ధి విభాగమొకటి ఏర్పాటైంది. కాఫీ బోర్డు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల్లో సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు పోడు వ్యవసాయం నుంచి కాఫీ సాగు వైపు మళ్లి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.అరకులో కాఫీ తోటలు సరే.. కాఫీ చరిత్రను చాటే కాఫీ మ్యూజియం కూడా ఉంది. 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బుడాన్ .. కర్ణాటకలోని చిక్ మగళూరు నుంచి ఏడు కాఫీ గింజలను తెచ్చి తన ఆశ్రమంలో నాటారని కాఫీ బోర్డు వెబ్సైట్లో పేర్కొన్నారు.వాతావరణం అనుకూలం..సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ.. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. అందుకే పదివేల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు ఇప్పుడు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ పొడవైన సిల్వర్ ఓక్ చెట్లు, టేకు చెట్ల నీడలో.. ఏటవాలు ప్రాంతాల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఆ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం వల్ల ఆ కాఫీకి ప్రత్యేక రుచి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆ తోటలకు నీడ కోసం.. ఓక్ చెట్ల మొదళ్లలో మిరియాలు వేసి.. అవి ఓక్ చెట్ల మీదుగా పాకేలా చేస్తున్నారు. దీనివల్ల మిరియాలు అదనపు పంటగా మారి.. అదనపు ఆదాయాన్నీ వాళ్లు పొందుతున్నారు.అంతర్జాతీయ ఖ్యాతి..ప్రపంచంలో అధికంగా కాఫీ పండించే దేశాల్లో .. మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మనం ఏడవ స్థానంలో ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని బెంగళూరులో ప్రాసెస్ చేసి జర్మనీ, వియత్నాం, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ.. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ప్యారిస్‌లో ‘అరకు కాఫీ బ్రాండ్’ పేరుతో ఓ కాఫీ షాప్ తెరిచారు. దీని టేస్ట్ జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లండ్ దేశాలకూ పాకింది. బెస్ట్ కాఫీ బ్రాండ్లకు పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోలు.. అరకు స్ట్రాంగ్ కాఫీ ముందు లైట్ అయిపోతున్నాయి. తద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్‌నే కాదు ఫేమ్నీ పెంచుతున్నాయి. అరకు కాఫీ బేవరేజ్గానే మిగిలిపోలేదు. పలు రకాల పండ్లు, ఫ్లేవర్స్‌తో కలసి చాకోలెట్స్గానూ చవులూరిస్తోంది.జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటవీ ఫలసాయం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో రికార్డు స్థాయిలో గిరిజనులకు మేలు జరిగింది. గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలను అందించింది. దీనికితోడు జీసీసీ సైతం గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా మద్దతు ధరను చెల్లించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సిర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలూ చేపట్టి గిరిజన రైతులను ప్రోత్సహించింది.అవార్డులు.. ప్రశంసలు!గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహించిన ప్రపంచస్థాయి ‘ఫైన్ కప్’ పోటీలో ఏపీ ప్రభుత్వం తరఫున కాఫీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన అరకు కాఫీ ‘ఫైన్ కప్’ అవార్డును దక్కించుకుంది. పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రపంచ కాఫీ పోటీల్లో 12 ఏళ్ల తర్వాత మన కాఫీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 2022 ఆగస్టు 9 నుంచి 11 వరకు కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ సదస్సులో 14 రాష్ట్రాలు పాల్గొనగా.. మన కాఫీ మొదటిస్థానంలో నిలవడంతో జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన జి–20 సదస్సులోనూ సర్వ్ అయిన అరకు కాఫీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. గతంలో పారిస్‌లో ప్రి ఎపిక్యూర్స్ పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది. – యిర్రింకి ఉమమహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!