మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.
అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.
తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.
మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప
Comments
Please login to add a commentAdd a comment