దేహం.. గాలిలో కదిలే దీపం! | Bhattu Venkata Rao's Comments On Uncertainty Guest Column News | Sakshi
Sakshi News home page

దేహం.. గాలిలో కదిలే దీపం!

Published Thu, Jul 25 2024 10:09 AM | Last Updated on Thu, Jul 25 2024 10:09 AM

Bhattu Venkata Rao's Comments On Uncertainty Guest Column News

ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.

వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..

దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సం
దోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ స
న్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీ
యైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!

పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!

‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement