రాలిపడిన పూవుల గాయాల
రహస్యాలను శోధించే
తోటమాలివి నీవు...
దుర్గంధంతో జ్వలించే
కీకారణ్యాన్ని జయించి
చావు తావులను పసిగట్టే
సత్యాన్వేషివి నీవు...
పార్థివ దేహ గర్భగుడిలో సంచరించి
మృత్యువు మూలతత్త్వాన్ని
అపర నారాయణులకు
ప్రవచించే పరమ యోగి నీవు...
కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతో
నిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను,
కామ తృష్ణ పరమ హింసలో
ఛిద్రమైన శుక్త ఖండాలను,
ఆచూకీ తెలియని
ఉక్కు పాదాలకింద నలిగిన
అనాథ కళేబరాలను
వేయి చూపులతో దర్శించి
మరణమూల్యాంకనం చేస్తావు..
కుష్ఠురోగిని ఇష్ట దైవంగా కొలిచిన మహాతల్లిలా
కుళ్లిన శవాలను ప్రాణమిత్రుల వలె
పరామర్శిస్తావు...
శవాల మీద విసిరిన చిల్లరను
మూటగట్టుకోవడం
చాలా సులభం!
కానీ మూటగట్టిన శవాల్లోకి
నిర్భయంగా తొంగి చూడటమే కష్టం!
వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులు
బతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే,
శవాలను కూడా మనుషులుగా ప్రేమించే
కరుణా జలపాతం నీవు
మూర్తీభవించిన సాహసం నీవు
స్ఫూర్తీభవించిన దివ్య సేవానిరతి నీవు.
కన్నీటి ఎడారుల సాక్షిగా
మార్చురీ మైదానంలో నిర్విరామంగా
మహా యజ్ఞం నిర్వహించిన
మేరే ప్యారే సలీం భాయ్!
పవిత్రమైన నీ చేతులను
నాకిప్పుడు ముద్దాడాలనిపిస్తోంది!
– కోయి కోటేశ్వరరావు, 9440480274
Comments
Please login to add a commentAdd a comment