poetry
-
పరమ యోగి..
రాలిపడిన పూవుల గాయాలరహస్యాలను శోధించే తోటమాలివి నీవు...దుర్గంధంతో జ్వలించే కీకారణ్యాన్ని జయించి చావు తావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు...పార్థివ దేహ గర్భగుడిలో సంచరించిమృత్యువు మూలతత్త్వాన్నిఅపర నారాయణులకుప్రవచించే పరమ యోగి నీవు...కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతోనిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను, కామ తృష్ణ పరమ హింసలో ఛిద్రమైన శుక్త ఖండాలను,ఆచూకీ తెలియనిఉక్కు పాదాలకింద నలిగినఅనాథ కళేబరాలనువేయి చూపులతో దర్శించిమరణమూల్యాంకనం చేస్తావు..కుష్ఠురోగిని ఇష్ట దైవంగా కొలిచిన మహాతల్లిలా కుళ్లిన శవాలను ప్రాణమిత్రుల వలెపరామర్శిస్తావు...శవాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవడం చాలా సులభం!కానీ మూటగట్టిన శవాల్లోకినిర్భయంగా తొంగి చూడటమే కష్టం!వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులుబతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే, శవాలను కూడా మనుషులుగా ప్రేమించే కరుణా జలపాతం నీవుమూర్తీభవించిన సాహసం నీవు స్ఫూర్తీభవించిన దివ్య సేవానిరతి నీవు.కన్నీటి ఎడారుల సాక్షిగామార్చురీ మైదానంలో నిర్విరామంగామహా యజ్ఞం నిర్వహించినమేరే ప్యారే సలీం భాయ్!పవిత్రమైన నీ చేతులనునాకిప్పుడు ముద్దాడాలనిపిస్తోంది! – కోయి కోటేశ్వరరావు, 9440480274 -
ఆమె ఎవరంటే...!?
ఆమె ఎవరని అడుగుతారేమో ఏమని చెప్పాలి!?ఆమె అక్షరం అని చెప్పనా..కష్ట జీవుల కన్నీటి వ్యథ అనాలా..ఆమె ఓ ధిక్కార స్వరం అని చెప్పనా!?ఏమని చెప్పాలి?అణిచివేతల సాచివేతల రాజ్యంలో ఆమె ఓ పోరాట జ్వాల..చీకటి కొనల మీద చిక్కటి వెలుగు తాను..ఆమె ఎవరని అడుగుతారేమో!ఆమె అన్నార్తులఆకలి కేకల పోరు నాదమని..గొంతు లేని ప్రజల గొంతుకని..ఆమె అక్షరం తెలియని వాళ్లఅడుగు జాడల్లో అక్షర దివిటని..ఆమె ప్రజా పోరు దారుల్లోఓ అడుగు జాడని చెప్పగలను..ఆమె గొంతు ఎందుకునొక్కుతున్నారని అడిగితే మాత్రం ఆమె శోషితుల పక్షమై నిల్చినందుకు..ఆమె పౌర హక్కులు అడిగినందుకు..ఆమె స్త్రీ సమానత్వం కోరినందుకు..ఆమె జాతి విముక్తి నినదించినందుకు..ఆమె స్వేచ్ఛను కోరినందుకే కదా!రాజ్య ద్రోహం అనే రాజ్య బహుమానం!! – వంగల సంతోష్ (అరుంధతీ రాయ్‌పై పెట్టిన కేసును ఖండిస్తూ)ఇవి చదవండి: సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
‘ముకుంద’ కవితా రూపం
తెలుగు వర్తమాన వచన కవులలో నాకు మిక్కిలి ఇష్టమైన ముగ్గురు నలుగురు కవులలో యల్లపు ముకుంద రామారావు ఒకరు. మా గురువర్యులు ఆచార్య పింగళి లక్ష్మికాంతం సాహిత్య విమర్శ పాఠం చెపుతూ ‘కవిత్వము – వేదాంతము ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు’ అన్నారు. ఈ రెండు పువ్వుల సౌరభాలను మేళవించి, సారమతితో మంచి కవిత్వం చెప్పిన వారిలో ముకుంద రామారావు మొట్టమొదటి వారు. వృత్తిరీత్యా కంప్యూ టర్ ఇంజనీరు అయిన ముకుంద రామారావు ప్రవృత్తి రీత్యా మూర్తీభవించిన కవి. రామారావు 1995 నుండి 2017 వరకు 22 ఏళ్ల కాలంలో స్వీయ కవితా సంపుటాలను మాత్రమే ప్రచురించారు. రామారావు ఏ కవిత అయినా సరే సంక్షిప్తంగా, అనుభూతి సాంద్రంగా, ఆత్మీయతానుబంధంతో కూడి ఉంటుంది. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ దాగి ఉన్న సృష్టి రహస్యాన్ని వెదుకుతూ ఉంటుంది. తమ పెద్దమ్మాయికి పెండ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత ఆమె కోసం బెంగపెట్టుకొని ‘వలసపోయిన మందహాసం’ అనే మొట్టమొదటి కవిత వ్రాశారు రామా రావు. ఆ కవితకు ఎంతో పేరు వచ్చింది. 1995లో ఇదే శీర్షికతో మొదటి కవితా సంపుటిని వెలువరించారు. అక్కడి నుండి ఆయన కవితా దిగ్విజయ యాత్ర కొనసాగింది. ‘మరో మజిలీకి ముందు’ కవితా సంపుటికి ప్రముఖ కవి ఇస్మాయిల్ ‘కవిత్వ మజిలీ కథలు’ అనే పేరుతో చాలా గొప్ప పీఠిక వ్రాశారు. అందులో ‘ముకుంద రామారావు కవితల్లో సున్ని తమైన హృదయం అనుభవ ప్రకంపనలకు స్పందించే తీరు కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడేది హృదయం, హేతువు కాదు...’ అని రాశారు. ‘ఎవరున్నా లేకున్నా’ కవితా సంపుటికి ప్రముఖ కవి, అను వాదకుడు అయిన దీవి సుబ్బారావు తాను రాసిన పీఠికలో ‘ముకుంద రామారావు గారి వ్యక్తిత్వం నుండి కవిత్వాన్ని విడదీసి చూడలేము... ఇలాంటి కవిత్వాన్ని చెప్పడానికి మనిషి తాత్త్వికుడై ఉండాలి. చుట్టూరా ఉన్న మనుషుల్ని ప్రేమించ గలిగిన వాడై ఉండాలి. ముకుంద రామారావు గారు ఆ కోవకు చెందినవారు’ అని రాశారు. ‘నిశ్శబ్దం నీడల్లో’ కవితా సంపుటిలో శరీరంలోని ప్రాణాన్ని ఒక దీపంతో పోల్చుతూ ‘దేహ దీపం’ అనే ఆ చిన్న కవిత వ్రాశారు–‘దళసరి చర్మం / ఎముకల గూడు / రహస్య స్థావరంలో / దేహ దీపం! / ఎంతోకొంత వెలిగి / ఆరిపోతుందో / ఎగిరి పోతుందో / ఎవరికెరుక? / ఆపలేక / అందుకోలేక / జీవితాంతం ఆరాటం!!‘ స్వీయ అనువాద రచనలు రామారావు సాహిత్య కృషిలో ముఖ్యమైనవి. దీనిలో మొత్తం 14 గ్రంథాలున్నాయి. వీటిలో మొదటి అయిదు పుస్తకాలు ఈ ప్రపంచ సృష్టికి మూల భూతములయిన పంచభూతాల పేర్లతో వెలువడ్డాయి. ‘ఆకాశం – గాలి – నేల – కాంతి – నీరు‘ అనే వరుసలో తమ అనువాద గ్రంథాలను వెలువరించారు. ‘అదే నీరు’ పీఠికలో తనలో దాగివున్న పంచభూతాలను తెలియజేస్తూ, ఒక చక్కటి కవిత వ్రాశారు. ‘అవును/సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు –/ఆకాశం అదే!/ అలలు వస్తుంటాయి పోతుంటాయి –/సముద్రం అదే!/సముద్రం నువ్వయితే –/నీటిలో మునిగి ఈదాలనుకునే చేపని నేను!’ అని సాగే ఇంత గొప్ప కవితను ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దీనిని చదివిన నేను ‘ఈ కవితలో కలసిపోతిని, కరిగిపోతిని, కాన రాకే కదిలి పోతిని!’ – ప్రొ‘‘ తంగిరాల వెంకట సుబ్బారావు, సాహితీవేత్త (అజో–విభొ కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం నేడు విశాఖలో ముకుంద రామారావు అందుకుంటున్న సందర్భంగా) -
దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...
‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’ – (జూలూరు పథం: పుట 43) తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం. ‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది. తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట. ‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’ వ్యాసకర్త సాహితీ విమర్శకులు (రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) -
వ్యక్తిగత విషయాలపై ఇంత విషమా..!
జగిత్యాలటౌన్: ‘తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఆడబిడ్డనైన నన్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలు మీ ఆడబిడ్డలను అంటే మీకు సమ్మతమేనా..? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుందా మా..? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా..? ’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌లో తాను ఓడిపోయాక, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానని, గెలిచిన వ్యక్తి బాధ్యతలు విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యక్తి గతంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న చచ్చిపోతే పది లక్షలిస్తా.. మీ నాన్న ఇట్లా..’ అంటూ అర్వింద్ మాట్లాడటం.. ఇటువంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాపాలకులపై మన నేతలు ఇలా అమర్యా దగా మాట్లాడలేదని గుర్తుచేశా రు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కక్షలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. ఇలా అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఉంటారనే అడబిడ్డలను ఉద్యోగాలకు పంపించడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు. -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
నూరేళ్లుగా ఫలవంతం
ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్ లాండ్’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్. ఎలియట్ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరుల్లో ప్రచురితమైంది. డిసెంబరులో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్! నీకేం కావాలి?’’ ‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’ బ్రిటిష్ గాథల్లో ‘హోలీ గ్రెయిల్’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్ కింగ్. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్ ఖండాన్ని కూడా ఎలియట్ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు. అమెరికాలోని ‘బోస్టన్ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్‌లో స్థిరపడిన ఎలియట్ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్‌తో కలిసి ఇంగ్లండ్‌లోని కెంట్ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గత సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చి పోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చి పోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధాన విషయం’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి. ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్‌ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతిని స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్‌కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ‘ఇది ప్రపంచాన్ని ప్రభా వితం చేయబోయే కవిత’ అని సరిగ్గానే గుర్తించాడు. ఏప్రిల్ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్ లాండ్’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్స్పియర్, మిల్టన్, హెర్మన్ హెస్, బాదలేర్ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్. దాన్ని భావ సంగీతం అన్నాడు. సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్. అన్నీ అవాస్తవికం. లండన్ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తు న్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడు స్తున్నారు. మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్‌ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ణి చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్ లాండ్’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్ ఎరిక్ షూమేకర్ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 ఏళ్ల లోపు వయసున్న తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులని పేర్కొన్నారు. కథలు, కవితలు దేశభక్తి, భారత స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతదేశ ఘన చరిత్రపై ఉండాలని సూచించారు. స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్‌సైట్స్, పత్రికల్లో మరెక్కడా ప్రచురించినవి ఉండకూడదని స్పష్టంచేశారు. కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని, కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్‌లో ఏ4 సైజులో మాత్రమే అంటే సింగిల్ సైడ్ పేజీలో కథ, చేతిరాత బాగాలేని వారు డి.టి.పి కానీ లేదా ఇతరులతో అందంగా రాయించి పంపాలన్నారు. అలాగే కథ, కవిత పిల్లల సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, సెల్‌ఫోన్ నంబర్ ఉండాలని, పోస్ట్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ కథలు, కవితలను.. ఆవుల చక్రపాణి యాదవ్, తెలుగు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ, గడియారం హాస్పిటల్ పక్కన కర్నూలు–518001 అనే చిరునామాకు ఆగస్టు 8 లోపు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9963350973 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రథమ బహుమతి కింద రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000.. మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి రూ.వేయి చొప్పున అందిస్తామని గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. -
రెహ్మాన్ జయంతి: కవితల పోటీలు నిర్వహించిన లింగుస్వామి
దివంగత ప్రఖ్యాత కవి అబ్దుల్ రెహ్మాన్ తనకు గురువులాంటి వారని దర్శకుడు లింగుస్వామి అన్నారు. రెహ్మాన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా లింగుస్వామి కవితల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలుతో పాటు మరో 50 మందికి తలా వెయ్యి రూపాయలు నగదును అందించారు. హైకూ కవిదై- 2022 పేరుతో స్థానిక కస్తూరి రంగన్ రోడ్డులోని రష్యా కల్చరల్ హాలులో జరిగిన ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించి (53 మంది రాసిన కవితలతో ముద్రించిన) హైకూ కవిదై - 2022 బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం లింగుస్వామి మాట్లాడుతూ ఇకపై ఏటా ఆయన పేరుతో కవితల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. చదవండి: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్ ‘చింగారీ’ సాంగ్ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా? -
ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె
Deepika Padukone Shares Poetry She Wrote In 7th Class: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లలో దీపికా పదుకొణె ఒకరు. హావాభావాలు, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో నటనలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్గా 'ఓం శాంతి ఓం' సినిమాతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో బిజీగా ఉండే దీపికా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా దీపికా పదుకొణె తన ఇన్‌స్టా హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'నేను తొలిసారి, అలాగే చివరిసారిగా రాసిన కవిత. అప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నాను. నాకు 12 ఏళ్లు. మా టీచర్లు మమ్మల్ని రెండు పదాలతో (ఐ యామ్) ఏదైనా కవిత రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత రాశాను. అలా కవిత రాయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు.' అని దీపికా తన కవిత చరిత్ర గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమాలో నటిస్తోంది. దీపికా పదుకొణె-షారుఖ్ ఖాన్ జంటగా నటించడం ఇది నాలుగోసారి. ఇప్పటివరకు ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలలో వీరు కలిసి నటించారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
తీరని దాహం
History Of Poetry: మనకు చిన్నప్పటి నుంచే కవిత్వంతో పరిచయం ఏర్పడుతుంది. తల్లులు పాడే లాలిపాటల్లో సంగీత మాధుర్యమే కాదు, కవన మర్మమూ ఉంటుంది. బుడిబుడి అడుగుల వయసులో బడిలోకి అడుగుపెట్టాక, అక్కడ చెప్పే నీతిపద్యాలు కవిత్వం కాక మరేమిటి? వాల్మీకిని పూజిస్తారు, కాళిదాసును కొలుస్తారు, వేమనను పొగుడుతారు, గురజాడను గురువులా ఆరాధిస్తారు, శ్రీశ్రీని నెత్తినెత్తుకుని మరీ ఊరేగుతారు. తమ ఇళ్లలోని కుర్రాళ్లెవరైనా కవిత్వం గిలికితే మాత్రం కసురుకుంటారు, చిన్నబుచ్చుతారు. ‘కవిత్వమూ కాకరకాయలూ కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ఎందుకొచ్చిన వెర్రిమొర్రి రాతలు’ అంటూ కవిత్వం రాసే కుర్రకారును ఈసడించుకునే మర్యాదస్తుల మంచిలోకం మనది. ఆరంభ దశల్లో నానా రకాల దూషణ తిరస్కారాదులను తట్టుకుని, కవిత్వంలో స్థితప్రజ్ఞతో ముందుకుసాగే ధీరులే కవియోధులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఆటుపోట్లను తాళలేని అర్భకులు అదే చరిత్రలో ఆనవాలైనా లేకుండా కొట్టుకుపోతారు. కవిత్వంలో కాకలుతీరినా, దక్కాల్సిన గుర్తింపు దక్కని కవిపుంగవులూ తక్కువేమీ కాదు. అసలు కవిత్వం ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం దుస్సాధ్యం. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?/ చంద్రికలనేల వెదజల్లు చందమామ?/ ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?/ ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్నాడు కృష్ణశాస్త్రి. ప్రకృతి« సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి. ‘ఎందుకు?’ అని ప్రశ్నించినంత తేలికగా వాటికి సహేతుకంగా సమాధానం చెప్పడం కుదరదు. కవిత్వం కూడా కవికి సహజధర్మం. సత్కవుల ఘనతను కీర్తించడమూ, కుకవులను నిందించడమూ ఒకానొక కాలంలో కవిత్వ సంప్రదాయంగా ఉండేది. ఇప్పుడైతే కవులుగా చలామణీ అవుతున్న అకవులను కనీసం విమర్శించే పరిస్థితులు కూడా సాహితీలోకంలో లేవు. ఇంగ్లిష్ కవివరేణ్యుడు షెల్లీ తన ‘ఎ డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ’ వ్యాసంలో ‘కవులు ఈ ప్రపంచానికి ఎన్నికవని శాసనకర్తలు’ అన్నాడు. ఆయన కవులను బాగానే వెనకేసుకొచ్చాడు. కవుల గురించి షెల్లీ వకాల్తా పుచ్చుకున్నాడు సరే, మరి కవిత్వం గొప్పదనమేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బహుశా అలాంటి వారికి సమాధానంగానే కాబోలు గ్రీకు తత్త్వవేత్త ప్లేటో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలోనే ‘చరిత్ర కంటే కవిత్వమే పరమసత్యానికి చేరువగా ఉంటుంది’ అని తేల్చిచెప్పాడు. ‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. అలవాటు పడితే ఒకపట్టాన తీరని దాహమది! ఒకసారి కవిత్వంలో మునిగాక ఒడ్డున పడటం అంత తేలిక కాదు. మునకీతలు కొడుతూ ముందుకు సాగాల్సిందే! కొందరు బాల్యంలోనే కవిత్వంలో పడతారు. ఇంకొందరు యౌవనావస్థలో కవిత్వంలో పడతారు. కవిత్వంలో పడ్డవారు కవిత్వాన్ని తమ ప్రియతముల కంటే గాఢంగా ప్రేమిస్తారు. ‘వాణి నా రాణి’ అన్నాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. పదిహేనో శతాబ్దిలో ఆయన ఆ మాట అంటే, ఆనాటి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఇరవయ్యో శతాబ్ది ‘అహంభావ’కవి పఠాభి ‘కైత నా దయిత’ అంటే జనాలు పెద్దగా ఆశ్చర్యపడిపోలేదు. ఇన్ని శతాబ్దాల వ్యవధిలో కవిత్వంలోనూ మార్పులు వచ్చాయి, కవుల్లోనూ మార్పులు వచ్చాయి, కవిత్వాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించే పాఠకుల్లోనూ మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినా, కవిత్వానికి గల మౌలిక లక్షణం ఒక్కటే! దాని గురించే– ‘కవిత్వం ఒక ఆల్కెమీ/ దాని రహస్యం కవికే తెలుసును/ కాళిదాసుకు తెలుసు/ పెద్దన్నకి తెలుసు/ కృష్ణశాస్త్రికి తెలుసు/ శ్రీశ్రీకి తెలుసు’ అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈ మర్మం కనిపెట్టిన తిలక్‌కి మాత్రం కవిత్వంలోని ఆల్కెమీ తెలీదనుకోగలమా? తిలక్‌కి కూడా కవిత్వ రహస్యం తెలుసు. అందుకే ఆయన ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగలిగాడు. కవిత్వం గురించి చాలా చరిత్రే ఉంది. చరిత్రలో కవిత్వానికి తనదైన పాత్ర ఉంది. అయితే, చరిత్ర కంటే ఘనమైనది కవిత్వమేనంటాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ‘చరిత్ర కంటే కవిత్వం మెరుగైనది, మరింత తాత్తికమైనది. కవిత్వం విశ్వజనీనమైన విషయాన్ని వెల్లడిస్తుంది. చరిత్ర నిర్దిష్టమైన విషయాన్నే వెల్లడిస్తుంది’ అన్నాడాయన. ఎంతైనా ప్లేటో శిష్యుడు కదా! చాలామంది కవులు ‘కృత్యాద్యవస్థ’ను ఎదుర్కోవడం కద్దు. ఈ అవస్థ ఆదిలోనే కాదు, అంతంలోనూ ఉంటుందంటారు కొందరు. కవిత రాయడం మొదలుపెట్టిన ఏ కవీ తన కవితను ముగించడు, దానిని అర్ధాంతరంగా వదిలేస్తాడనే అభిప్రాయమూ ఉంది. ‘ఒక కవిత ఎన్నటికీ పూర్తి కాదు, అర్ధాంతరంగా విడిచిపెట్టబడుతుందంతే!’ అంటాడు ఫ్రెంచ్ కవి పాల్ వాలెరీ. కవిత్వానికీ సత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. అలాగని కవిత్వం నిండా సత్యవాక్కులే ఉంటాయనుకోవడానికి లేదు. కవిత్వం ధ్వనిప్రధానమైన కళ. స్తుతినింద, నిందాస్తుతి, శ్లేషలాంటి నానా అలంకార ప్రయోగాలు ఉంటాయి. ‘కన్నొక్కటి మిగిలెగాని కంతుడు గావే’నని ఒక కవి నేర్పుగా ఎత్తిపొడిస్తే, తనను పొగిడాడనుకొని మురిసిపోయాడు మతిలేని మారాజొకడు. ఒక్కొక్కసారి కవి మాటలు అబద్ధాల్లా కూడా అనిపించవచ్చు. అది కవి పొరపాటు కాదు. ‘ఎల్లప్పుడూ నిజాలే చెప్పే అబద్ధాలకోరు కవి’ అన్నాడు ఇంగ్లిష్ కవి జీన్ కాంక్టో. అదీ సంగతి! -
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
అతడూ ఆమె: ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’!
అప్పుడు..అతడూ ఆమె మధ్య కమ్ముకున్న మంచుతెరల్ని ఒక్కొక్కటిగా భానుడి చూపులు చీలుస్తున్న దృశ్య సమయం ఒత్తిళ్లను పొత్తిళ్లలోనే దాచేసే ఉడుకు నెత్తురు వురుకుళ్ల నడుమ ఉత్తేజం అణువణువూ దాగుంది క్రతువులన్నీ ఋతువుల్లా మారిపోతూ కాలచక్రం వెంటే కలిసి ప్రయాణం ప్రతీ అడుగూ జోరుగా హుషారుగా.. ఏ చెక్లకూ ఏ చిక్కులకూ వంగని నిటారు వెన్నుపూసలు ఒకానొక ప్రేమ వాక్యానికి ఆసాంతం సాగిలబడుతున్నాయి ఇరుగు పొరుగు సమాజం కొన్ని తలకాయలు ఎన్నో కళ్లు అసంబద్ధ కుత్సిత కావ్యాన్ని రచించుకుంటూ వున్నాయి ఎన్నో అవాంతరాలు... నిశీధిలో విచ్చుకునే తలపులు... చల్లని చలి తాకిళ్లకు హృది తలుపుల్ని పదే పదే తెరుస్తూ.. సాహచర్యాన్ని స్వాగతిస్తోంది ఓ నిశ్శబ్ద యుద్ధం అన్ని చిక్కు ముళ్లను విప్పేస్తూ మరో ఉదయాన్ని ఆవిష్కరిస్తోంది..! ∙∙ ఇప్పుడు.. ఆమె అతడు మధ్య వాలు కుర్చీలో కూలబడ్డ వృద్ధదేహం అటూ ఇటూ ఊగిసలాడుతున్న నిద్రమత్తు బతుకంతా అలసిన మనసులు సేద తీరటానికి ఎన్ని చీకట్లయినా ఎన్ని వెలుతుర్లయినా సరిపోని త్రిశంకుస్వర్గం ఆత్మీయ ఆలింగనాలకు వీలుకాని కాలం ఇరువురి మధ్య ఎన్ని నిప్పుల్ని కుమ్మరిస్తోందో వెచ్చని ఘాతాలతో మనసంతా చిల్లుపడ్డ కుండవుతోంది అయినా.. వణికిస్తున్న చిక్కని చలిలో అతని పంజరం చైతన్యాన్ని కప్పుకుని కదుల్తోంది కాలం వెంట నెమ్మది నెమ్మదిగా.. ఆమె చెయ్యి పొగలుగక్కే వేడి వేడి టీ కప్పును అందిస్తోంది ఒక్క గుటకేస్తూ వేయి నిట్టూర్పులను వొదిలేసి మనిషితనం లోపించి మసకబారిన ఈ మాయదారి లోకాన్ని చీల్చి చెండాడాలనీ కళ్లల్లో కత్తుల్ని విత్తుకుంటూ.. ఆయన ఉదయాన్నే బిగ్గరగా అరుస్తాడు ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’! -డా.కటుకోఝ్వల రమేష్ మౌనస్పర్శ ఊహలెప్పుడూ సమాంతరంగా ఉండవు గతంలోంచి వర్తమానంలోకి ఎగసిపడుతూనే ఉంటాయి కాలం మండే నిప్పుకణమై కళ్ళ ముందు బద్దలవుతుంటే ఊహలు ఉప్పెనలుగా ఎగసి పడుతుంటాయి ఉప్పొంగే బతుకు శ్వాస ఎప్పుడూ ఒకే సరళరేఖ మీద ప్రయాణిస్తుంటాయి తడబడిన పాదముద్రల్ని సరిచేస్తూ కొత్త దారుల వెంట ప్రయాణిస్తుంటే గాఢ నిద్రలో సైతం మెలకువ ఉదయాలే కళ్ళ ముందు మెదులుతుంటాయి మనుషులెక్కడుంటారో అక్కడే నా ఉనికిస్పర్శ కొత్త ఊహల్ని తట్టిలేపుతుంటాయి జీవితంలో యుద్ధం మొదలైనప్పట్నుంచీ ఇదే వరుస బారులు తీరిన అడుగులు మంద్ర మంద్రంగా తెరలు తెరలుగా అరల పొరలుగా అడుగుల్ని కప్పేస్తున్న వేళ గతం ఆశతో వర్తమానంలోంచి భవిష్యత్తులోకి తొంగి చూస్తుంది -∙మానాపురం రాజా చంద్రశేఖర్ -
కవిత యువత
‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే’ అని రాశాడు శ్రీశ్రీ. ‘జయభేరి’ పేరుతో ‘మహాప్రస్థానం’లో ఉన్న ఆ కవిత రాసే సమయానికి శ్రీశ్రీకి 23 ఏళ్లు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నాను. ఇంకా ఒక మంచి కవిత రాయలేదే’ అని బాధ పడతాడు మహాకవి జాన్ మిల్టన్. అతడు తన మాగ్నమ్ ఓపస్ ‘ప్యారడైజ్ లాస్ట్’ ప్రచురించే సమయానికి అరవై ఏళ్లు రాక తప్పలేదు. ‘సర్రియలిజం’ను సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఝంఝామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో టీనేజ్లోనే రాయవలసిందంతా రాసేసి 20వ ఏటకు రిటైర్ అయిపోయాడు. అంటే 20 తర్వాత రాయాల్సింది ఏమీ లేదని అనుకున్నాడు. 80 ఏళ్ల వరకూ జీవించిన ఇంగ్లిష్ కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ లేటు వయసులో అమెరికా వెళితే కుర్రవాళ్లు అతని పద్యాలను చదవడం మొదలుపెట్టారట. వర్డ్స్‌వర్త్ వారిని ఆపి ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు. నా తొలి రోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అన్నాడట. కవిత్వానికి యువరక్తానికి గట్టి సంబంధం ఉంది. ఒంట్లో కండరాలు గట్టిపడి, నరాల్లో నెత్తురు ఉత్సాహంగా దౌడు తీస్తూ, కళ్లు చురుగ్గా చూస్తూ, గుండె సరైన కారణాలకు కొట్టుకుంటూ, స్పందించే సమయాలలో నాలుక పిడచగడుతూ ఉంటే గనక బహుశా కవిత్వమే వస్తుంది. టి.ఎస్. ఇలియట్ మాస్టర్ పీస్ ‘ది వేస్ట్ ల్యాండ్’ పాతికేళ్ల లోపలే రాసినా, జాన్ కీట్స్ అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసి మరణించినా వయసు తాలూకు తాజా స్పందన కవిత్వంలో ప్రవహించడమే కారణం. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితిని’ అని శ్రీనాథుడు రాసుకోవడం వల్లే అతడు చేసిన కవన కృషి మనకు తెలిసింది. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు, అరాచకత్వం, బేఫర్వా, అమరత్వ అభిలాష... కవికి భావోద్వేగాల ఆవేశాన్ని ఇస్తాయి. కవిత్వం ఉబుకుతుంది. ధార అవుతుంది. స్వచ్ఛదనం దానికి సజీవత్వం ఇస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులు ఐతే ఆ ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనవంతులుగా ఉన్నప్పుడో రాసిన కవిత్వంలోని పదును, వాక్యం తాకి చూస్తే చీరుకునే వాదర ఆ తర్వాతి స్థిర పంక్తులలో కనిపించవు. ఈ ఒక్క గుణం చేతనే కవిత్వం ఎప్పటికప్పుడు యువ మునివేళ్లను వెతుక్కుంటూ వెళ్లి ప్రతి తరంలోనూ మరుజన్మ పొందుతూ ఉంటుంది. ‘వత్తి జేసి నూనె బోసి బతుకును వెల్గించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టి పోయిండు’ అని రాస్తాడు తగుళ్ల గోపాల్. మహబూబ్ నగర్ నుంచి కవిత్వం రాస్తున్న ఇతడు ‘దండ కడియం’ పేరుతో కవిత్వం వెలువరించాడు. ‘టేబుల్‌పై ఎన్ని కూరలున్నా మాటల్ని కలుపుకుని తిన్నప్పుడే కడుపు నిండా తిన్నట్టుంటుంది’ అంటాడు ‘నాలుగు గిన్నెల కూడలి’ కవితలో. మరో కవి పల్లిపట్టు నాగరాజు ‘దూడ మూతి వాసన’ కవితలో ‘మనలా మనుషులైతే కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో కసువు తినే బిడ్డలు కదా... కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన’ అని రాస్తాడు. ఇతనిది చిత్తూరు జిల్లా. ‘యాలై పూడ్సింది’ ఇతని పుస్తకం. ‘ఇవ్వాళంతా వాన కురిసింది. నువ్వు లాలనగా తాకినట్టు గాలి. నువ్వు కోపంతో తోసినట్టు వరద. నువ్వు నిదానంగా కూర్చున్నట్టు ఊరు’ అని రాస్తాడు నంద కిశోర్ తన కవిత్వ పుస్తకం ‘యథేచ్ఛ’లో. ఇతనిది వరంగల్. మొన్న ప్రకటించిన ‘సాహిత్య అకాడెమీ యువ పురస్కారం– 2021’కి తుది పోటీలో నిలిచిన ఎనిమిది పుస్తకాలూ కవిత్వానివే కావడం చూస్తే కవిత్వం యువ కవులను అంటి పెట్టుకునే ఉన్నది అనిపిస్తుంది. గత యాభై ఏళ్లలో అక్షరాస్యత తాకిన వర్గాల నుంచి, గత రెండు మూడు దశాబ్దాలలో తాగునీరు, సాగునీరు చూసిన పల్లెల నుంచి వస్తున్న ఇటీవలి కవులు తమ ప్రాంతాల, నేపథ్యాల, జీవనాల గాథలు గాఢంగా కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్మితమైన ఉపగ్రహాలు అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను లొకేట్ చేస్తాయి... ఆదివాసీ నవ్వు పువ్వులను చిదిమేస్తాయి’ అని రాస్తాడు సురేంద్రదేవ్ చెల్లి తన ‘నడిచే దారి’ పుస్తకంలో. ఇతనిది యానాం. తండ హరీష్ గౌడ్, బండారి రాజ్‌కుమార్, రమేశ్ కార్తిక్ నాయక్, జాని తక్కెడ శిల... వీరంతా ఈ పురస్కారం కోసం చివరి పట్టికలో నిలిచినవారిలో ఉన్నారు. పోటాపోటీగా ఢీకొన్నారు. యువ సాహిత్యకారులను ప్రోత్సహించడానికి అకాడెమీ ‘యువ పురస్కారం’ ప్రకటించిన గత కొన్నేళ్ల నుంచి యువతీ యువకులు ఉత్సాహంగా చేయదగ్గ కృషి చేస్తున్నారన్నది వాస్తవం. చిన్న వయసులో గుర్తింపు దక్కితే పొంగిపోతున్నారన్నదీ వాస్తవం. అయితే ఆ తర్వాతి కొనసాగింపు గురించే కొందరికి చింత ఉన్నది. చిన్న వయసులో ఎక్కువ గుర్తింపు వస్తే సృజన క్షుద్బాధ తీరి ఒడ్డున కూర్చుంటారని హెచ్చరించే పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకూ యువ పురస్కారం పొందిన వారు ఆ పురస్కారం పొందాక ఏ మేరకు కృషిని హెచ్చింపు చేసుకున్నారో పరిశీలించుకోవాల్సి ఉంది. పెద్ద గీత గీయాల్సి ఉంది. యువకులే భావి సాహిత్య నిర్మాతలు. ఆశలు వారిపైనే! కాకపోతే ప్రవాహాన్ని వీడ వద్దని, తెడ్డు వదల వద్దని, ఈత వచ్చేసిందని పొగడ్తల సుడిలో దూకేయవద్దని హితవు!! యువ కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
Sirivennela Sitarama Sastry Demise: పాట విశ్రమించింది..
పదహారు కళల పౌర్ణమి వంటి పాట కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది. పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది. చలువ వెన్నెలలో మునిగి అలల మువ్వలను కూర్చి ఒక కలం గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని వీధి మలుపు తిరిగిపోయింది. కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది. తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు తెలిమంచులా కరిగిపోయింది. తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది. ‘అమ్మలాల.. పైడి కొమ్మలాల.. వీడు ఏమయాడె.. జాడ లేదియాల’... అయ్యో... కట్ట వలసిన పాట వరుస హార్మోనియం మెట్ల మీద పడి భోరున విలపిస్తూ ఉంది. -
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్‌ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్‌పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్‌ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
నిరంతర జనకవిత్వ సృజన శిఖరం
మహాత్మా పూలే, అంబేడ్కర్, పెరియార్, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా వంటి సంస్కర్తల దారిలో... వర్తమాన సాహిత్యాన్ని, చరిత్రను సుసంపన్నం చేస్తున్న మహాకవి కత్తి పద్మారావు. గత ఐదు దశాబ్దాలుగా కఠోర అధ్యయనం, పరిశోధన, ఆచరణతో ముందుకు సాగుతున్నారు. ఒక సమగ్ర సామాజిక మార్పు కోసం తన రచనలను, ఆచరణను అంకితం చేశారు. తన జాతి జనుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని అపారంగా రచించారు. అమ్మ చెప్పిన మాటతో కులం పునాదుల్ని వెలికితీసి అనేకానేక వివక్షలను, ఆధిపత్యాలను సమాధి చేస్తున్నారు. వేలాదిమంది పీడితులకు తన అక్షర సైన్యంతో ధైర్యమై నిలిచారు. ‘కులం పునాదుల మీద ఒక జాతినీ, ఒక నీతినీ నిర్మించలేరన్న’ అంబేడ్కర్ సత్య వాక్కు కత్తి పద్మారావు కవితా ఝరి. ‘సత్యవాక్యంబెవ్వడుల్లంఘింపడో వాడేపో నరుడిద్ధరా మండలిన్’ అనే జాషువా మహాకవి మాట కత్తి పద్మారావు గారి కవిత్వానికి ఊపిరి. పద్మారావు జీవితంలో కులజీవన విధానం లేదు. ఆయన కులనిర్మూలన వాది. క్లాసులో చెప్పే పాఠాలకు మించి వేలాది సభల్లో, విశ్వవిద్యాలయాల్లో మాట్లాడిన మహోపాధ్యాయుడు. ‘అణగారిన ప్రజల మూగభాషను నా కవిత్వం ఉక్కు నాలుకతో సంభాషిస్తుంది అంటూ దళితులకు సామాజికంగా, సాంస్కృతికంగా తాత్వికంగా నాయకత్వం వహిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ కవిగానే పుడతా’నంటున్న కవిత్వ శ్వాస అతడు. ‘దళిత కవితా దిక్సూచి అతడు. ‘పక్షి గమనం నాకు ఆదర్శం, ప్రకృతి సౌందర్యం నాకు స్ఫూర్తి, మనిషిలోని వైరుధ్యం నా తర్కం, సమన్వయం నా దర్శనం’ అంటున్న నల్ల సముద్రం అతడు. సజీవ వాస్తవిక మానవ సంఘర్షణల మహాకావ్యం ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’ కత్తి పద్మారావు. తీవ్రమైన కులవివక్షకు గురైన పనికులాల పక్షం వహించిన ప్రజాకవి. ‘నా తర్కం చార్వాకం, నా తత్వం బౌద్ధం, నా ఆయుధం అంబేడ్కరిజం’ అంటూ పీడక శక్తులపై కలాన్ని కత్తిగా దూసిన యుగ కవి కత్తి పద్మారావు. కడుపు నిండా ఆకలిని, గుండెల నిండా అవమానాలను, బతుకు నిండా కష్టాలను నింపుకున్న నిరుపేద కుటుంబం లోంచి వచ్చిన పద్మారావు... అగాథపు అంచుల్లో ఉన్న జనాన్ని కవిత్వ వస్తువులు చేసి వారికి సాహితీ గౌరవం కల్పించారు. దళిత జీవితంలోని సౌందర్యాన్ని, తాత్వికతని పద్మారావు అద్భుతంగా అక్షీకరించారు. అందుకే తరతరాల నిరంతర జనకవిత్వ సృజన శిఖరంగా నిలిచారు. పిడికెడు ప్రేమకోసం, మానవ స్వేచ్ఛా సమానతల కోసం దీపధారిగా నిలిచారు. మహాకవి గుర్రం జాషువా మహాసభలు ముంబైలో జరిగినప్పుడు ముఖ్యఅతిథిగా పాల్గొని జాషువా కవిత్వ గొప్పతనాన్ని వినిపించారు. తన ‘సాంఘిక విప్లవ చరిత్ర’లో కూడా జాషువా సాహిత్య ప్రస్థానం గురించి పేర్కొన్నారు. ‘దళిత సాహిత్యవాదం – జాషువా’ (1995),‘జాషువా సామాజిక తత్త్వం’ (1996), ‘మహాకవి జాషువా–సామాజిక విప్లవం’(2007) అనే మూడు బృహత్ గ్రంథాల ద్వారా తెలుగు సాహిత్యానికి జాషువా సామాజిక, సాహిత్య దర్శనాన్ని అందించారు. జాషువా కవితా శిల్పం, ఆర్ద్రత, మానవతా దృక్పథం, విశ్వజనీన తత్వం అనేవి తన నుండి ఈ నాటి దళిత బహుజన కవులందరికీ ఆదర్శం అంటారు. ‘కులం పునాదులు’ మీంచి ‘నల్లకలువ’లు, ‘నీలికేక’లు, ‘భూమిభాష’లు, ‘ముళ్ళకిరీటం’లు, ‘కట్టెలమోపు’లు, ‘ఆత్మగౌరవ స్వరం’లు, ‘అస్పృశ్యుని యుద్ధగాథ’లును చరిత్రకు అందించినవారు. పునర్నిర్మాణానికీ, ప్రత్యామ్నాయ సంస్కృతీ విధానానికీ దారులు వేసిన 95 గ్రంథాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విశేషంగా తన ఉపన్యాసాలతో రాబోయే తరాలను చైతన్యపరిచారు. ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి పలు జాషువా రచనల మీద గొప్ప కృషి చేసారు. కత్తి పద్మారావు సామాజిక జీవితంలో రాజకీయ పార్శ్వం ఉంది. దళిత బహుజనుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అద్వితీయ పాత్ర వుంది. వక్తృత్వ పోటీలు, నాటకాలు, బుర్రకథలు పాటలు రాయడం, నాటకాలు రాసి తనే పాత్ర పోషించి ప్రదర్శించడం శాంతినగర్ లూథరిన్ చర్చ్ సండే స్కూల్లో చిన్నప్పుడే అలవడినాయి. భారతీయ అలంకార శాస్త్రాలు, గ్రీకు అలంకార శాస్త్రాలు, పాశ్చాత్య ఆధునిక ఈస్థటిక్స్, మనస్తత్వ శాస్త్రాలు, భాషా శాస్త్రాలు అధ్యయనం విస్తృతంగా చేశారు. వాల్మీకి, కాళిదాసు మొదలు ఖలీల్ జిబ్రాన్, షెల్లీ వర్డ్సవర్త్, జాన్ మిల్టన్, జిడ్డు కృషమూర్తి తదితరుల ప్రకృతి వర్ణాలను అధిగమించి ఆధునిక మానవునిలోని ప్రకృతి స్పృహని నూతనంగా తన రచనల్లో నింపారు. ‘అమృత నిష్యంతనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. ఔషధపు కట్టలు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉందంటూ’ తన తల్లి ప్రభావం తనపై ఎలా అణువణువునా నిండి ఉందో అనేక కవితల్లో చెప్పారు. ‘నీ జోలపాటే ప్రపంచ సాహిత్యానికి పల్లవి’ అంటూ అడుగడుగునా వాళ్ళమ్మను గుర్తుచేసుకుంటారు పద్మారావు. ‘శిల్పమూ నీవే, చిత్రమూ నీవే, చిరునవ్వూ నీవే, ప్రళయాగ్నివీ నీవే. నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది. నువ్వు కరిగితే సముద్రానివి. నువ్వు మండితే అగ్ని గోళానివి’ అంటూ వాళ్ళ అమ్మను కవిత్వీకరిస్తారు. ‘పొద్దున్నే చల్ల చారుతో, చద్ది బువ్వ కలిపి ఎర్రగారపు పచ్చడి నంజు పెడితే శాస్త్రవేత్తలా కనిపించింది అమ్మ’ అంటారు. డా. కత్తిపద్మారావు నిరంతర సాహితీ కృషిలో వారి సహచరి స్వర్ణకుమారి సహకారం విశేషమైనది. వెనుతిరగని నది మాటలా, నిర్మలమైన పాటల ఆకాశంలా, పవిత్రమైన నిప్పుల నినాదంలా, స్వచ్ఛమైన నీటి చెలమలా, అచ్చమైన తల్లి గాలి ప్రేమలా, భూమితల్లి జోలలా అతడు ప్రజలకవి. అతనిది ప్రజాకవిత్వం. ఇటీవలే ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి లోకనాయక్ ఫాండేషన్, విశాఖపట్నం వారు స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ హరివంశరాయ్ బచ్చన్ స్మృత్యర్థం ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం ‘అస్పృశ్యుని యుద్ధగాథ’కు గానూ రెండు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని కత్తిపద్మారావు అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం ద్వారా ఆయనపై బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. -శిఖా–ఆకాష్ వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘం మొబైల్: 93815 22247 (నవంబర్ 1న డా.కత్తి పద్మారావు, ఏపీ ప్రభుత్వ ‘వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారా’న్ని అందుకుంటున్న సందర్భంగా) -
పచ్చ నెత్తుటి మరక...
వూరు చేరాలంటే ముందు నిన్నే ముద్దాడాలి! చూట్టానికి జుట్టంతా విరబోసుకున్న రాకాసిలానే కనిపిస్తావ్ కానీ నువ్వో నిశ్చల తాపసివి! నా గురించో... వూరి గురించో... శివసత్తిలా సిగమూగుతూ అందమైన తలపోతేదో చేస్తూనే వుంటావ్– నువ్విప్పుడు జ్ఞాపకమయ్యేంతలా వలసపోయాను కానీ వేలాడి వూగిన వూడల జాడలు ఈ నా మునివేళ్లకి తగుల్తూనే వుంటాయ్, నేనే చోటున్నా సరే! పొలిమేర ఖిల్లాలా వుంటావ్ యెన్నెన్ని శకలాలో నీలో... వూయలూగిన బాల్యాన్ని దోసిట్లోకి నింపుకునేంతగా– దూపగొన్న గొంతు... మర్రితాడు రుచిని మర్రాకులోకి వొంపుకుంటే చాలు; దిగులు ముంతను బొట్టు బొట్టుగా దింపుకోవచ్చు. ఆకు ఆకులో లాలించే పచ్చ సముద్రమే వుంది; గుండెల్లోకి తోడుకునేంత తావే లేదు కాకపోతే! దేన్నీ యెదగనీయవనే అపనింద మోస్తూనే... యెండా... వానా... గొడుగై కాసిన లోగిట్లోంచి డొప్పలిచ్చింది నాకే కాదు; వూరు వూరంతటికీ. కాయో... పండో... పువ్వో... కాదు, పచ్చని కంచమై... పండగ్గానో? పబ్బంగానో? పత్ర సందేశంగా వచ్చేస్తావ్ కదా! చివరికి చిరిగిన విస్తరాకై... యే చిరునామాకూ చిక్కకుండా తప్పిపోతావ్! అచ్చంగా నాలోని నేను తప్పిపోయినట్టు!! వేలి కొసల్లో ఎడార్లు మొలిచాక... ప్రతీ చదరపు అడుగూ లెక్కలోకొస్తుంది; ప్రతీ క్షణం... డాలర్ డేగై యెగిరొచ్చి ఎడం భుజమ్మీద వాలాక... విధ్వంసక ప్రగతి నమూనా విసిరి పారేస్తుంది నిన్ను పెనుగులాడిన వూడలతో సహా! పూదోటలు... మియావాకీలు... కొత్తగా యేం అలికినా... తులసికోట లేని ముంగిల్లా... వూరి గుమ్మం బోసిపోయింది. కూలదోసిన పచ్చ గుడారం జ్ఞాపకాలు మాత్రం... ఉరితాళ్ళలా వేలాడుతున్నాయ్! -బోగ బాలసుబ్రహ్మణ్యం ► వంతెన పైన నేను నడుస్తుంటాను వంతెన మీద ఏకాంతంగా ఎటూతేల్చుకోలేని సందేహాలతో. ఎవరూ ఏంచెప్పొద్దు. వంతెన దాటేముందు నా అవయవాలన్నీ అదృశ్యమై మెదడు మాత్రమే జీవించివుంటుంది. నేనెవరికీ గుర్తుండను. దూరంగా రైలు సైరను వినిపిస్తుంది. పిచ్చిగా నగరంవైపే చూస్తుంటాను. నా ముఖం లోని మడతలు ఎన్నో కథలు చెప్పే వుంటాయి. చాలా దూరం వచ్చేశాను. నాకు నేను అర్థం కాకుండా! క్షమించు! నేను నిన్ను హత్తుకోవాలి. ఈ మాయా నిశ్శబ్దాన్ని ఛేదించాలి. కొత్త రుచుల వెతుకులాటలో సమస్త అడవులగుండా, మైదానాల మీదుగా ప్రయాణిద్దాం. అక్కడ రెండు గ్లాసులు మనల్ని ఆహ్వానిస్తున్నాయ్. ఎర్రజీరల గద్ద కళ్లతో! -ఏటూరి నాగేంద్రరావు ► మేలిమి పద్యం నిను వేగించును నిత్యదుఃఖమను వహ్నీజ్వాల, తతాతపసం జనితంబైన మహానుభూతి యొక డాచ్ఛాదంబుగా నీవు సా గిన త్రోవల్ జగతీ చరిత్రగతి సాగెన్ క్రొత్త యధ్యాయమై మును లేకున్నది, నేడు రాని దొక డొప్పున్ నీ మహాలక్ష్యమై! (కుందుర్తి ‘వీథిమానిసి’ ఖండిక నుంచి) ఏడులోకాల కనుసన్న నేలువాడు ఇరుకు చీకటిగుడిలోన మరిగినాడు నాకు లేనట్టి దేవుడు లోకములకు లేడు, లేడింక, పిలిచినా, రాడు రాడు. (శంకరంబాడి సుందరాచారి ‘నైవేద్యము’ నుంచి) రేయినలసిన కనులకు రెప్పవేసి లోకచిత్రంబు మూయగల్గుదునె గాని, లోన చెలరేగు నల్లకల్లోలమునకు కనులుమూసి నిద్రింపజాలను క్షణంబు. (పాలగుమ్మి పద్మరాజు ‘లోన – బయట’ ఖండిక నుంచి) పేదల రక్తమాంసముల బెంపు వహించి దయా సుధా రసా స్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం దూదరపోవు పాడు బ్రదుకొక్క నిమేషము సైప నాయెదన్! (వేదుల సత్యనారాయణశాస్త్రి ‘కాంక్ష’ ఖండిక నుంచి) -
అమ్మా నేను మా కుట్టు మిషను
చిరిగిన జేబుని కుట్టడమే కాదు ఖాళీ జేబులో పైసలొచ్చి పడడం దానివలనే! కత్తెర కావాలన్నా దారం కావాలన్నా సూది కావాలన్నా మిషను సరుగునుండి దర్జాగా తీసుకునే హక్కు నాది! చిన్నపుడు.. డస్టర్లు కుట్టిపెట్టి సూదీదారాలు అప్పిచ్చి బడిలో నా విలువని పెంచిన మాట వాస్తవమే ఆడుకునేప్పుడు.. దానిని ఆటవస్తువు చేసుకునేవాణ్ని అన్నం తినేప్పుడు.. దానిని డైనింగ్ టేబుల్‌గా మార్చుకునేవాణ్ని కావాలని తన్నినపుడో కోపంలో నెట్టినపుడో అమ్మ మందలించేది అవును నిజమే కదా దాని వలనే ఎంతోమంది పరిచయమై..స్నేహితులై..బంధువులైనారు! పాపాయి నుండి అమ్మాయివరకూ ఎంతమందికి అదనపు అందాన్ని జోడించిందో తెలుసా? పుట్టినరోజుల నుండి పెళ్లిరోజుల వరకూ ఎన్ని శుభకార్యాలను జరిపించిందో తెలుసా? మా అమ్మ తన మిషనుతో అద్భుతన్నే సృష్టిస్తుంది బహుశా నల్లని ఆకాశానికి నక్షత్రాలు అతికి చందమామను కుట్టింది మా అమ్మేనేమో! అమ్మ శక్తితో నడిచిన ఒంటి చక్రపు కుట్టు మిషన్ మా కుటుంబాన్ని ఎంతోకొంత ముందుకు తీసుకువెళ్లింది అన్నది యదార్ధమే.! ఎన్నో ఏళ్ళు ఆసరా అయిన కుట్టుమిషను ఇపుడు కొంచెం పాతదై మూలకు చేరింది కానీ.. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు అని ఎవరైనా అడిగితే మాత్రం తడుముకోకుండా మా కుట్టుమిషన్ని కూడా కలిపే సమాధానం చెబుతాం మేము. - దొరబాబు మొఖమాట్ల -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
కవితల పండుగ: ఫేమస్ కవితలు చూసేద్దామా!
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ. కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి... ‘పురుషుండు గార్దభమునున్ స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్ గరుణ దలంపక నెలకొక పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్’ ఇదంతా ఇప్పటితరం పాఠకులకు ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది. కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం... ‘పొగచుట్టకు సతిమోవికి అగణితముగ మద్యమునకు అమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్’ గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు: ‘‘ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచుటై్ట జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’’ ‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక... ‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదమగాను కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది దాని కడుపు కాల ధరణిలోన’ ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ: ‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్’ ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు. ‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్’పదులు. ‘అరవ్వాడి దోసై మీద తోచించి వ్రాశై ఏవో విట్లు వేశై ఏవో ఫీట్లు చేశై తర్వాత చూసుకుందాం ప్రాసై...’ ‘పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల సృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహపుష్టి నైవేద్య నష్టి!’ ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు ‘కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు వడివడిగ దిగిరాడు ఓ కూనలమ్మా!’ ‘బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మా!’ పేరడీ గారడీలు ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన... ‘‘సిందూరం, రక్తచందనం బందూకం, సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎర్రనిజెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. ‘‘మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రలాపం, కోపం వైజాగులో కారా కిల్లీ సామానోయ్ సరదాపాటకు...’’ శ్రీశ్రీ ఒరిజినల్ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు: ‘అవాకులన్నీ చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ ఎగబడి చదివే పాఠకులుండగ విరామమెరుగక పరిశ్రమిస్తూ అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు వారికి జరిపే సమ్మానాలకు బిరుదుల మాలకు దుశ్శాలువలకు కరతాళాలకు ఖరీదు లేదోయ్...’ పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి... ‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ ప్రాణమైన పదవి భంగమందు కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు బొంగకవచ్చు నఘము పొందడధిప’ పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది: ‘కలదందురు మంజీరలొ కలదందురు గండిపేట కాలువలందున్ కలదందురు పంపులలో కలదు కలందనెడు నీరు కలదో లేదో!’ శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ... ‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’ శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... ‘కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’ వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి... ‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా జంకు గొంకు లేక పొంకముగను ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా విశ్వదాభిరామ! వినుర వేమ! ‘గంగిగోవు పాలు గంటెడే చాలునా కడివెడేడ దొరుకు ఖరముపాలు భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా విశ్వదాభిరామ! వినుర వేమ!’ ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి... ‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె గారె బూరె పప్పుచారె మిగిలె బుర్ర కరిగి బొర్రగా మారెరా విశ్వదాభిరామ వినురవేమ’ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి... ‘లుచ్ఛా జమాన ఆయా అచ్ఛోంకో హాథ్ దేన హర్ ఏక్ సీకా అచ్ఛా జమాన ఫిర్ కబ్ వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ (నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్ వలీ సాహెబు) అని అడిగితే, ‘బందేనవాజ్ బుజురుగ్ జిందాహై ఆజ్తో న జీతే హం ఖుదా బందాహి జానె వహసబ్ గందరగోళం జమాన ఖాజాసాబూ! (చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు. ఆధునిక చాటువులు స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని... ‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి... ‘గజగమన గాదు ఇయ్యది గజసదృశ శరీర సీటు కంతయు తానై అజగరమై కూర్చున్నది గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్’ ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం... ‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె చదువు ముదిరిపోయి షంకరుండనెనయా స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస! మిశ్రభాషా కవనవినోదం ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు... సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం... ‘మార్నింగు కాగానె మంచము లీవింగు మొఖము వాషింగు చక్కగ సిటింగు కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు క్లబ్బును రీచింగు గాంబులింగు విత్తము లూసింగు చిత్తము రేవింగు వెంటనే డ్రింకింగు వేవరింగు మరల మరల రిపీటింగు మట్టరింగు బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు దారిపొడుగున డాన్సింగు థండరింగు సారె సారెకు రోలింగు స్రంబలింగు’ నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి... ‘ది స్కై ఈజ్ మబ్బీ... ది రోడ్ ఈజ్ దుమ్మీ మై హెడ్ ఈజ్ దిమ్మీ...’ అంటూ కవిత చెప్పారు. -
సిగలో అవి విరులో...
‘ఊహ తెలిశాక నేను చదివిన తొలి కవిత– నీ పేరు’ అంటాడు వినీత్ టబూతో ‘ప్రేమికుల దేశం’లో. ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అంటాడు ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు. ‘మరుమల్లెల కన్నా తెల్లనిది’ అని ఇదే శోభన్‌బాబు ‘మల్లెపూవు’లో కవిత్వం రాస్తాడు. ‘సిగలో అవి విరులో’ అని అక్కినేని జయసుధలోనే తన ఊహాసుందరిని వెతుక్కుంటాడు ‘మేఘసందేశం’లో. ‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్’ అని తానే శ్రీశ్రీగా అవతరిస్తాడు కమలహాసన్ ‘ఆకలి రాజ్యం’లో. ఢిష్యూం ఢిష్యూం హీరోలకు కవిత్వం చుక్కెదురే. కాని కొన్ని సినిమాలలో వారి వల్ల కవిత్వం మెరిసింది. ‘నేడు ప్రపంచ కవితా దినోత్సవం’ సందర్భంగా సినిమాల్లో కవులపై సండే స్పెషల్... ‘సాగర సంగమం’లో కమలహాసన్ గొప్ప డాన్సర్. కాలక్షేపానికి కల్చరర్ రిపోర్టర్‌గా చేస్తూ శైలజ డాన్స్‌ని విమర్శించాడని అతణ్ణి అవమానిస్తారు. దానిని ఎంత భరించాలో అంత భరిస్తాడు. కాని చాలక అతడి స్నేహితుడైన శరత్‌బాబును ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అది మాత్రం భరించలేకపోతాడు. శరత్ బాబు అదే పేపర్లో ప్రూఫ్‌రీడర్. కాని అతడు ఒక గొప్ప కవి. ‘ఒక మహా కవికి ప్రూఫ్‌రీడర్ ఉద్యోగం ఇవ్వడమే కాక మళ్లీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారా’ అని పత్రికాఫీసుకు వెళ్లి నానా రభసా చేస్తాడు. ‘టూ మిస్టేక్స్.. టూ మిస్టేక్స్’ అని రొప్పుతాడు. నిజమే. కవి అరుదు. కవి గౌరవం ఇవ్వవలసినవాడు. కవి సగటు మనిషి కంటే ఒక మెట్టు ఉన్నతుడు. అతడు కవిత్వం పలుకుతాడు. మనిషికి అవసరమైనది ఆహ్లాదపరిచేది అందులో ఏదో ఉంటుంది. అందుకే అతడు ఉన్నతుడు. పద్యమే... అది మన సొంతం ప్రపంచమంతా కవిత్వం ఉంది. తెలుగు వారికి పద్యం ఉంది. పదం ఉంది. వాగ్గేయకారులు ఉన్నారు. అందుకే సామాన్యులకు వచనం రాసేవారు, నాటకం రాసేవారు, నవలలు రాసే వారు ఎక్కువగా తెలియదు. ‘కై’గట్టేవాళ్లే తెలుస్తారు. తెలిశారు. ‘వాడు కైగడతాడురా’ అంటారు. బడికి వెళ్లి చదువుకోనివారికి కూడా ఒక వేమన పద్యం తెలుసు. పోతన భాగవతం తెలుసు. అందుకే కవికి ఆ దర్జా ఆ హోదా. తెలుగు సినిమా ఆ విషయాన్ని కనిపెట్టకుండా ఎలా ఉంటుంది. అందుకే కవులే కథా నాయకులుగా సినిమాలు వచ్చాయి. చిత్తూరు వి.నాగయ్య మనకు తెలుగు తెర మీద కవిని చూపించారు. ‘యోగి వేమన’ ఆయనే. ‘భక్త పోతన’ ఆయనే. రెంటికీ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక కవి అచ్చతెనుగులో మరో కవి గ్రాంథిక తెనుగులో కవిత్వం చెప్పి తెలుగువారి సారస్వతానికి లంకెల బిందెలు ఇచ్చి వెళ్లారు. వెండితెర అది నిక్షిప్తం చేసింది. కవి అంటే అక్కినేనే కత్తి పట్టుకునే ఎన్.టి.రామారావు ఘంటం పట్టుకుంటే బాగోదని నిర్మాత దర్శకులు అనుకున్నారో ఏమో అక్కినేనిని కవిని చేశారు. ‘మహాకవి కాళిదాసు’లో అక్కినేని కాళిదాసుగా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారు. ‘మాణిక్యవీణాం ముఫలాల యంతి’ అని సరస్వతి కటాక్షం తర్వాత తన్మయత్వంతో ఆయన చేసే స్తోత్రం పులకింప చేస్తుంది. అక్కినేనికే ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ’ కవి పాత్ర పోషించే గొప్ప అవకాశం దొరికింది. ఈ వికటకవి తెలుగువారికి ప్రీతిపాత్రుడు. సినిమాని అందుకే హిట్ చేశారు. ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా అక్కినేని ఆదరించడం, ఆయన అల్లరికి అదిరిపోవడం ఈ సినిమాలో చూశాం. అక్కినేనికి భక్తికవుల పాత్రలు దొరికాయి. ‘భక్త జయదేవ’, ‘భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ ఇవన్నీ ఆయనకు దొరికిన అదృష్టపాత్రలే అనుకోవాలి. నాగార్జున అన్నమయ్యలో ‘భక్త కబీర్’గా కూడా ఆయన నటించారు. కబీర్ మహాకవి కదా. శ్రీనాథ కవిసార్వభౌమ అయితే ఎన్.టి.ఆర్కు మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడి పాత్ర పోషించాలని ఉండిపోయింది. ఆయన ‘బ్రహ్మంగారి’ పాత్ర పోషించినా ఆయన కవితాత్మకంగా భవిష్యత్తు చెప్పినా అది కాలజ్ఞానంగా జనం చెప్పుకున్నారు తప్ప కవిత్వంగా కాదు. కనుక తెలుగువారి ఘన కవి శ్రీనాథుడిని వెండి తెర మీద చూపడానికి ఎన్.టి.ఆర్ ఏకంగా బాపు, రమణలను రంగంలోకి దించారు. ఎంతో ఇష్టపడి కష్టపడి నటించారు. అయితే మునపటి దర్శక నిర్మాతల అంచనాయే కరెక్టు. ఎన్‌టిఆర్‌ను కవిగా ప్రేక్షకులు పెద్దగా మెచ్చలేకపోయారు. చరణ కింకిణులు సాంఘిక సినిమాలు వచ్చేసరికి కవిగా శోభన్‌బాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ‘చెల్లెలి కాపురం’లో నిజ కవి సి.నారాయణరెడ్డి సహాయంతో తెర మీద ఆయన చెలరేగిపోయారు. ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ అని ఆయన పాడే పాట నేటికీ హిట్. ‘ప్యాసా’ రీమేక్‌గా తెలుగులో ‘మల్లెపువ్వు’ సినిమా తీస్తే హిందీలో గురుదత్ వేసిన పాత్ర శోభన్‌బాబుకు దక్కింది. ఆ పాత్రను ఆయన హుందాగా చేసి సినిమా హిట్ కావడానికి కారకుడయ్యాడు. ‘మరుమల్లెల కన్నా తీయనిది’, ‘ఎవరికి తెలుసు చితికిన మనసు’, ‘చిన్నమాటా ఒక చిన్నమాటా’ పాటలన్నీ అందులోవే. ఆకలేసి కేకలేసి ‘ఆకలేసి కేకలేశాను’ అన్నాడు శ్రీశ్రీ. ఆకలేసిన కుర్రకారు తన ఆగ్రహన్ని, ఆక్రందనను శ్రీశ్రీ కవితల ద్వారానే వ్యక్తం చేశారు. అలా చేయని వారిని ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అని హేళన చేశారు. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమలహాసన్ ప్రతి ముఖ్యమైన సందర్భంలో శ్రీశ్రీని తలుచుకుంటాడు. ‘పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా ఏడవకండేడవకండి’ అని పొయెట్రీ చెబుతాడు. ఆకలికి తాళలేక శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. ‘విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు విలువ 3 రూపాయలు’ అని కన్నీరు కారుస్తాడు. ఒక నిజ కవి సినిమాలో నిజ కవిగా వ్యక్తీకరణ కావడం ఈ సినిమాతోనే మొదలు ఆఖరు. ప్రేమ కవిత్వం ఊహాసుందరిని ఊహించుకుని కవిత్వం చెప్పే తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ‘సువర్ణ సుందరి’లో చంద్రమోహన్, ‘మేఘ సందేశం’లో నాగేశ్వరరావు ఇలా కనిపిస్తారు. మేఘసందేశంలో భార్యను తన ఊహా సుందరిగా మలుచుకోవడానికి అక్కినేని చూసినా ఆమెకు అదంతా తెలియదు. ఆ ఆర్తిని జయప్రద తీర్చాల్సి వస్తుంది. ‘సంకీర్తన’లో నాగార్జున కవిగా కనిపిస్తాడు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలో కవిత్వం కనిపిస్తుంది. మణిరత్నం ‘ఇద్దరు’, ‘అమృత’ సినిమాలలో కవిత్వం విస్తృతంగా ఉంటుంది. ‘ప్రేమదేశం’లో కవిత్వాన్ని చెప్పే ఆస్వాదించే కుర్రాళ్లను చూపిస్తాడు దర్శకుడు. కొత్తతరం హీరోలు ఈ కవిత్వానికి దూరంగా ఉన్నారు. జీవితంలో అయినా సినిమాల్లో అయినా పొయెట్రీ మిస్ కావడం వెలితి. కవిత్వం వర్థిల్లాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
రెప్ప వేయని రాత్రి
ఒకటా రెండా? ఎన్ని యుగాలు నడిచిపోలేదు సూర్యుడి చిటికెనవేలు పట్టుకొని రాత్రైతే చంద్రదీపం వెలిగించుకొని వర్తమానం నుంచి చరిత్ర గుమ్మం వరకు. ఒకరా, ఇద్దరా? ఎందరెందరు విడిచిపోలేదు పంచభూతాలల్లిన మాంసపంజరాన్ని మానవతా వాదాన్ని తలకెత్తుకున్న వాళ్లు. మనం మానవులం అని నిరూపించుకున్నవాళ్లు మంచిని పెంచి, వంచించిన వాళ్లని కాలరాసి తడిలేని హృదయాల తలుపులు తడుతూ తమని తాము దీపాలుగా వెలింగిచుకున్న వాళ్లంతా చివరికి చీకటిపాలైన ఉదంతాలన్నీ చరిత్ర పుటల్లో మురిగిపోతున్నాయి. ఇప్పుడు మనుషులు మనుషుల్లా లేరు పడగల్ని తలపుట్టల్లో దాచుకొని పెదవులపై వెన్నెల పండగలు జరుపుకుంటూ లోలోపల అగ్ని పర్వతాలై బద్దలై పోతున్నారు. వాతావరణంతో పాటు కలుషితమై పోతూ జనారోగ్యంపై రోగాలదోమలై వాలిపోతున్నారు. రేపటి వసంతానికి పట్టిన చీడపురుగులై కులాల సంతల్లో పాయలై ప్రవహిస్తున్నారు. ప్రతి వొక్కడు తన అజెండాతో ఓ జెండా మోస్తూ ఐకమత్యానికి పురిటిరోగమై ప్రవభవిస్తున్నాడు. రేపటి సూర్యుడి కోసం నిరీక్షించే నేత్రాలు మాత్రం ఆకాశం చిట్టచివ్వరి తెర వరకూ చూపులుసారిస్తూ విశ్వనరుడి ఆవిర్భావం కోసం రాత్రి రెప్పవేయటం లేదు. - ఈత కోట సుబ్బారావు