గురజాడ కార్పెంటర్ దృష్టిలో స్త్రీ
‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో విట్‌మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు ఎడ్వర్డ్.
స్త్రీవాద సాహిత్యంలో తరచు కన్పించే ‘వంటిల్లు తగలబెట్టడం’ అనే ప్రతీకకు మూలాలు గురజాడ అసంపూర్ణంగా విడిచిపెట్టిన ఒక రచనలో కన్పిస్తాయి. మెడ్రాస్ రెవ్యూ మాసపత్రికలో Edward Carpenter - His life and times శీర్షికతో గురజాడ రచించిన వ్యాసం చదివిన తర్వాత ఈ విషయం స్ఫురించింది. ఇందులో కార్పెంటర్‌ను టాల్‌స్టాయ్, విలియం మోరిస్, జాన్ రస్కిన్, వాల్ట్ విట్‌మన్, షెల్లి వంటి మానవతావాదులు, యుగకర్తల సరసన పేర్కొని ప్రశంసించారు గురజాడ. 1883లో కార్పెంటర్ రచించిన Towards Democracy కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు. కార్మిక సంఘాలు శక్తివంతంగా పనిచెయ్యాలనీ, రాజకీయ వ్యవస్థలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, లాభాల కోసం కాక, మానవుల శ్రమను పొదుపుగా వాడుకొని మానవులు సృజనాత్మకంగా జీవించే అవకాశం రావాలనీ, స్త్రీలు సమానహక్కుల కోసం ఉద్యమించాలనీ కార్పెంటర్ ప్రతిపాదించారు. చరిత్రకారులు కార్పెంటర్‌ను తొలి పర్యావరణ శాస్త్రవేత్తగా, ఫేబియన్ సోషలిస్టుగా అభివర్ణించారు.
గురజాడ ప్రస్తావించిన కార్పెంటర్ మరోరచన Love's Coming of Age. కార్పెంటర్ ఈ రచనలో స్త్రీ పురుషుల శృంగార సంబంధాలు, వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితం, భవిష్యత్తరాలతో స్త్రీ పురుషులు నిర్వహించబోయే బాధ్యతలను చర్చించారు.
మర్యాదస్తులైన స్త్రీలు, ఇంటి చాకిరికి అంకితమైన స్త్రీలు, వేశ్యలు అని స్త్రీలను కార్పెంటర్ మూడు వర్గాలుగా విభజించారు. యమకూపాల్లో అనామకంగా రాలిపోయే స్త్రీలు, ప్రతిరాత్రి శరీరాన్ని అమ్ముకొని స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే స్త్రీలు (Free Women) అని వేశ్యలను మళ్లీ రెండువర్గాలు చేశారు. Woman in freedom ప్రకరణంలో పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లో వ్యవహరించే స్త్రీలు తమ ఇచ్ఛానుసారం జీవించగలరనీ, కుటుంబాలు సమూహాలుగా ఏర్పడి శ్రమను పంచుకొన్నట్లయితే స్త్రీ కొంత మటుకైనా చాకిరి నుంచి విముక్తి పొందుతుందనీ, స్త్రీలు పురుషుల నీడలోంచి వెలుపలికి వచ్చి స్వతంత్రంగా వ్యవహరించే రోజు సమీపంలోనే ఉందనీ కార్పెంటర్ భవిష్యద్దర్శనం చేశారు.
‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో వాల్ట్ విట్‌మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు. అసలు ఈ లక్షణాలు తమకు సహజమైనవి కాదని స్త్రీలే భావించేంతగా పురుషులు ప్రవర్తించారంటారు కార్పెంటర్. తనకు లభ్యమైన కార్పెంటర్ రచనలన్నీ గురజాడ చదివినట్లనిపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య అన్నిరంగాల్లో సమానత్వాన్ని ఇద్దరూ కాంక్షించారు. స్త్రీలు ఆటపాటల్లో పాల్గొని తమను తాము కాపాడుకోగల సామర్థ్యం కలిగి ఉండాలని భావించారు. మొదట Love's Coming of Age లోని కొన్ని వాక్యాల అనువాదం:
‘‘ఇంటిచాకిరితో మురిగిపోయే ఇల్లాలి బ్రతుకు బానిస బ్రతుకు. ఆమె శక్తియుక్తులన్నీ ఇల్లు చక్కబెట్టుకోడానికే సరిపోతాయి. ఈ చాకిరిలో ఆమె మరొక రకంగా జీవించడానికి అవసరమైన జ్ఞానం, కాంతి లభించదు. ఇప్పుడు సమాజంలో వస్తున్న సాధారణమైన మార్పులు, సాంఘికమైన మార్పులు స్త్రీ జాతి విముక్తికి దోహదం చేస్తాయి. అత్యాధునిక సౌకర్యాలతో గృహ నిర్మాణం, భుజించడానికి సిద్ధంగా వండిన ఆహార పదార్థాలను అమ్మే విక్రయశాలలు, లాండ్రీలు, ఇతరేతర సౌకర్యాలు ఏర్పడటం, మనం భుజించే ఆహారాన్ని గురించి, గృహోపకరణాలను గురించి ప్రజల ఆలోచనల్లో వచ్చే విప్లవాత్మకమైన మార్పులు స్త్రీల చాకిరిని తగ్గించి వేస్తాయి. అలవాట్లలో స్త్రీలు సంప్రదాయవాదులైనా మార్పులు వస్తే వాటిని స్వీకరిస్తారు.’’
గురజాడ ‘సౌదామిని’ కథానాయికగా చిత్రించిన నవలలో ఒక పాత్రను ‘నేను’ దృష్టికోణం నుంచి రాశారు. కథాస్థలం ఊటి. ‘నేను’ వెంట అతని కవిమిత్రుడు గూడా ఉంటాడు. ‘నేను’ పాత్రను బాలయ్యనాయుడు తన అతిథిగా ఉండమని ఆహ్వానిస్తాడు. ‘నేను’, అతని కవిమిత్రుడు బాలయ్యనాయుడు బంగళాలో అతిథులుగా ఉంటారు. నాయుడికి సౌదామిని అనే అందమైన పెళ్లీడు కుమార్తె ఉంటుంది. ‘నేను’, కవిమిత్రుడు, బాలయ్య నాయుడు కూలాసాగా కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు కవిమిత్రుడంటాడు:
స్త్రీలు మేల్కోనాలి, తిరుగుబాటు చెయ్యాలి.
మానవ జాతిలో స్త్రీ ఉత్తమమైనది. స్త్రీ బలహీనురాలని మీరనొచ్చు. అది అందరూ అనే మాటే. మనదేశంలో రైతు కుటుంబాల్లో స్త్రీ చాలా దృఢమైనది, ఆమెకు ఎంతో ఓర్పు ఉంది, పురుషుడి కన్నా ఎక్కువ సహనం కలది, నారేత వేస్తుంది, పొలాల్లో ప్రత్తి తీస్తుంది, చింతపండు వొలుస్తుంది, ధాన్యం దంచుతుంది, అన్ని పనుల్లో దాసీగా వ్యవహరిస్తుంది.
పై కులాలకు చెందిన మన ఆడవాళ్ల విషయానికొద్దాం. ఆమె నీళ్లు చేదుతుంది, వంట చేస్తుంది, మరెన్నో పనులు చేస్తుంది. దేవుడు చెక్కిన శిల్పాలు వీళ్లు. సున్నితంగా, నాగరీకంగా ఉండే మన ఆడవాళ్లు శారీరకంగా బలహీనులే అని నేను అంగీకరిస్తాను. మృగప్రాయులను ఎదుర్కొనేందుకు ఒక ఆయుధాన్ని ఆమె చేతులో ఉంచుదాం. కత్తియుద్ధం స్త్రీలు మాత్రమే అభ్యాసం చెయ్యాలి. ‘నేను’ (కథ చెప్పే వ్యక్తి): వాళ్లకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో బాగా తెలుసులేండి! కవి: ఎప్పుడు చతుర్లాడాలో నీకు తెలీదు. పురుషుడు విచక్షణాశక్తి కోల్పోవడం చేత, పురుషుడి క్రూరత్వం చేత స్త్రీలు కత్తిసాము అభ్యసించవలసి వస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ సాయుధ కావాలి. ఆమె చాకో, రివాల్వరో దగ్గర ఉంచుకొని బయటకు వెళ్లాలి.
నేను: చంపడానికి ఆమె కళ్లు చాలని నా ఉద్దేశం.కవి: అవును, సంస్కారులైన వారిని జయించడానికి. మృగప్రాయులను ఎదుర్కోడానికి కృపాణం కావాలి, బుల్లెట్లు కాదు. అప్పుడే క్రూరాత్ముల నుంచి ఆత్మరక్షణ చేసుకోగలదు. స్త్రీ వంటపని చేయడాన్ని నిషేధించాలి. నీకవసరమైన ఆహారం భోజన పదార్థాలమ్మే షాపులో దొరుకుతుంది. ఆహారాన్ని వేడిచేసుకోవడానికి నీవద్ద ఒక సాధనం ఉంటేచాలు. ప్రతివీధిలో అలాంటి షాపొకటి ఉండాలి. కుటుంబ సభ్యులందరూ ఏ బాదరబందీ లేకుండా అక్కడ భోజనం చేయొచ్చు. పెపైచ్చు మానవ శ్రమ ఎంత పొదుపౌతుంది!
నేను: పేదవాళ్లు భోజనం కొనుక్కోలేరు!బాలయ్య నాయుడు: అతని ఆదర్శ లోకంలో పేదలే ఉండరు!కవి: ఆదర్శ లోకమా! నేను నిజమైన ఈ లోకాన్ని గురించే మాట్లాడుతున్నా! కవీ, తత్వవేత్తా తమ కాలం కన్నా చాలా ముందుంటారు. కవి ప్రతిపాదనను బాలయ్య నాయుడు ఆమోదిస్తాడు. సౌదామినికి కవి కత్తియుద్ధం, కవిత్వం నేర్పుతాడు. ఒక జమీందారు సౌదామినిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె జమీందార్ను బాకుతో గాయపరిచి, క్షణాల్లో పావురంలా ఇల్లు చేరుకుంటుంది. తర్వాత వివాహవ్యవస్థ పరిమితులను గురించి హీరో పాత్రద్వారా కొంత చర్చ నడిపారు గురజాడ. భర్తలు విడిచిపెట్టిన భార్యలు, భార్యల చేత విడిచిపెట్టబడ్డ భర్తలు స్వీయపోషణలో అసమర్థులైతే అటువంటి వారికోసం ప్రభుత్వమే అనాథాశ్రమాలు పెట్టి సంరక్షణ చేయాలని. ‘‘ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో వెసులుబాటు తక్కువ’’ అనే వాక్యంతో గురజాడ నవలను పూర్తిచేయకుండా విడిచిపెట్టారు.
స్త్రీ పురుషుల విషయంలో కార్పెంటర్ అభిప్రాయాలన్నిట్నీ గురజాడ ఆమోదించారని చెప్పడంలేదు. ‘కవి’ పాత్ర ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలను ‘నేను’, బాలయ్య నాయుడు పాత్రలు పరిహాసం చేస్తాయి. సౌదామిని పాత్రద్వారా స్త్రీలు ఆత్మరక్షణ పద్ధతులు తెలుసుకొని ఉండాలని మాత్రం సూచించారు. వివాహవ్యవస్థకున్న పరిమితులను మరింత సాకల్యంగా తెలుసుకోడానికి గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలు ఉపకరిస్తాయి. (కార్పెంటర్ మీద గురజాడ రాసిన ఇంగ్లీషు వ్యాసం రాజాం వెలుగు సంస్థ ప్రచురించిన ‘గురజాడ నూరవ వర్ధంతి సంచికలో అచ్చయింది.)
- డాక్టర్ కాళిదాసు పురుష్తోతం
drkpurushotham@yahoo.com