
చిరిగిన జేబుని కుట్టడమే కాదు
ఖాళీ జేబులో పైసలొచ్చి పడడం దానివలనే!
కత్తెర కావాలన్నా
దారం కావాలన్నా
సూది కావాలన్నా
మిషను సరుగునుండి
దర్జాగా తీసుకునే హక్కు నాది!
చిన్నపుడు..
డస్టర్లు కుట్టిపెట్టి
సూదీదారాలు అప్పిచ్చి
బడిలో నా విలువని పెంచిన మాట వాస్తవమే
ఆడుకునేప్పుడు..
దానిని ఆటవస్తువు చేసుకునేవాణ్ని
అన్నం తినేప్పుడు..
దానిని డైనింగ్ టేబుల్గా మార్చుకునేవాణ్ని
కావాలని తన్నినపుడో
కోపంలో నెట్టినపుడో
అమ్మ మందలించేది
అవును నిజమే కదా
దాని వలనే ఎంతోమంది
పరిచయమై..స్నేహితులై..బంధువులైనారు!
పాపాయి నుండి అమ్మాయివరకూ
ఎంతమందికి అదనపు అందాన్ని జోడించిందో తెలుసా?
పుట్టినరోజుల నుండి పెళ్లిరోజుల వరకూ
ఎన్ని శుభకార్యాలను జరిపించిందో తెలుసా?
మా అమ్మ తన మిషనుతో
అద్భుతన్నే సృష్టిస్తుంది
బహుశా నల్లని ఆకాశానికి
నక్షత్రాలు అతికి చందమామను కుట్టింది మా అమ్మేనేమో!
అమ్మ శక్తితో నడిచిన
ఒంటి చక్రపు కుట్టు మిషన్
మా కుటుంబాన్ని ఎంతోకొంత
ముందుకు తీసుకువెళ్లింది అన్నది యదార్ధమే.!
ఎన్నో ఏళ్ళు ఆసరా అయిన కుట్టుమిషను
ఇపుడు కొంచెం పాతదై మూలకు చేరింది
కానీ.. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు అని ఎవరైనా
అడిగితే మాత్రం
తడుముకోకుండా మా కుట్టుమిషన్ని కూడా
కలిపే సమాధానం చెబుతాం మేము.
- దొరబాబు మొఖమాట్ల
Comments
Please login to add a commentAdd a comment