నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు | Prasiddha Telugu Nakalu Books Review By Penugonda Lakshminarayana | Sakshi
Sakshi News home page

నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు

Published Wed, Jan 26 2022 6:56 PM | Last Updated on Wed, Jan 26 2022 6:59 PM

Prasiddha Telugu Nakalu Books Review By Penugonda Lakshminarayana - Sakshi

‘నాటకం తరతరాల నుంచి మానవ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ వస్తున్నది. మిగిలిన ఏ ఇతర సాహిత్య ప్రక్రియ ఇవ్వలేని ఆత్మతృప్తి నాటకం ఇస్తున్నది’ – ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. 

ఒక జమీందారీ హయాంలో పెత్తనం చలాయించే రాజోద్యోగులు చేసే దుష్టచర్యలను గ్రహించి విచారించి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పరిస్థితులను చక్కదిద్దిన ఇతివృత్తంతో నడిచిన నాటకం ‘నందక రాజ్యము’. గుంటూరు సీమలోని రేపల్లె ప్రాంతానికి చెందిన కారుమూరు గ్రామవాసి వావిలాల వాసుదేవశాస్త్రి ఈ నాటక రచయిత. తెలుగులో తొలి సాంఘిక నాటకం ‘నందక రాజ్యము’. రచనా కాలం 1880. 

తెలుగునాట శతాబ్ది కిందట కొనసాగిన వృద్ధ వివాహ దురాచారాన్ని ‘నిర్మాణ కాలంలో కల్యాణమా? మరణశయ్య మీద మంగళహారతులా?’ అని ప్రశ్నిస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావు 1910లో రచించిన ‘వృద్ధ వివాహము’ నాటకం ఆనాటి సాంఘిక దురాచారాల్ని నిరసించింది. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి)

స్వాతంత్య్రోద్యమకాలంలో అమృతసర్‌ జలియన్‌వాలాబాగ్‌లో 1919 సంవత్సరం ఏప్రిల్‌ 13న (నేడు వామపక్షాలు మృతవీరుల దినంగా జరుపుకుంటున్న రోజు) జరిగిన ఘోర దురాగతానికి పౌరాణిక రూపమిచ్చి దేశభక్తిని రగిల్చిన నాటకం ‘పాంచాల పరాభవము’. గుంటూరుకు చెందిన న్యాయవాది దామరాజు పుండరీకాక్షుడు 1921లో రాసిన ఈ నాటకం నిషేధానికి గురైంది. నాటక రచనల వలన జైలుపాలైన దేశభక్తుడీ రచయిత. ‘ఈ పంజాబు దుండగాలు ఆరని అగ్రిహోత్రమై మన దాస్య బంధనములను దహించివేయును’ అనే తీవ్ర ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన నాటకం ‘పాంచాల పరాభవము’.

1880లో ప్రారంభమైన తెలుగు నాటకం 2020 వరకూ అంటే ఈ 140 ఏళ్లలో సమాజంతోపాటు నడుస్తూ, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ ప్రగతిశీల దృక్పథంతో నడిచిందనటానికి నిదర్శనంగా ఈ మూడు నాటకాలను రేఖా మాత్రంగా పరిచయం చేశాను. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు)

ఈ నూటా నలభై ఏళ్ల కాలంలో తెలుగు సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సమూహాలకు చేరువైన నూరు నాటకాలను సంకలనం చేసి సుమారు ఐదువేల పేజీలతో ఆరు నాటక సంకలనాలుగా అందించారు వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి. నాలుగు దశాబ్దాలుగా నాటకంతో ప్రయాణిస్తున్న ఈ ఇరువురూ తెలుగు నాటకరంగానికి అందించిన అపూర్వకానుకలు ఈ సంకలనాలు. గతంలో ‘ప్రసిద్ధ తెలుగు నాటికలు’, ‘ప్రసిద్ధ తెలుగు హాస్యనాటికలు’, 108 నాటికలను రెండు సంకలనాలుగా, ‘ప్రసిద్ధ పిల్లల నాటికలు’ సంకలనాన్ని అందించిన చరిత్ర ఈ సంపాదకులకు ఉంది. (మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన)

అరవింద ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు జిల్లా, తానా ప్రచురణలు – ఉత్తర అమెరికా ప్రచురించిన ఈ సంకలనాలను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 19 నవంబర్‌ 2021న హైదరాబాద్‌లో జరిగిన ఒక  కార్యక్రమంలో ఆవిష్కరించారు. తెలుగు నాటకానికి తేజస్సునూ ఓజస్సునూ కలిగించిన వారు గురజాడ వెంకట అప్పారావు. 1897లో తొలి ముద్రణ పొంది 1909లో నూతన జవజీవాలు పోసుకొని ప్రజల చేతికీ, నోటికీ అందిన తొలి నాటకం కన్యాశుల్కం. తెలుగులో వాడుక భాషలో వచ్చిన కన్యాశుల్కం పాశ్యాత్య పోకడలను పోయి ‘సోషల్‌ కామెడీ’ని అందించింది. సామాజిక ప్రయోజనాలను సాధించింది. గురజాడ మార్గంలో ఆధునిక తెలుగు కథ, గీతం నడిచినట్లుగానే నాటకమూ నడిచింది. (కన్యాశుల్కం అందుబాటులో ఉన్నందున ఈ సంకలనాలలో ఆ నాటకాన్ని సంపాదకులు చేర్చలేదు) అందుకు సాక్ష్యాలు ఈ వంద నాటకాలు.  

‘సంఘ సంస్కరణాభిలాషతో ప్రారంభమైన సాంఘిక నాటకం జాతీయోద్యమకాలంలో దేశభక్తి ప్రబోధంగా నిలబడి ప్రజలను ఉద్యమ కార్యోన్ముఖులను చేసింది. స్వతంత్రం ప్రకటించిన తదుపరి భారతదేశంలో చెలరేగిన మత కలహాలను నిరసించింది. కులం, మతంలాంటి సాంఘిక దురాచారాల్ని దుయ్యబట్టింది. బొగ్గుగని కార్మికుల సమస్యలను ఎత్తి చూపింది. 

స్వాతంత్య్రానంతర కాలంలో స్వదేశీ పాలనలో వేళ్లూనుకొంటున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, స్వార్థపూరితమైన ఓట్ల రాజకీయాల్ని ఎండగట్టింది. కార్మికులు, కర్షకులు, కూలీనాలీ జనం శ్రమదోపిడీని ఎలుగెత్తి చూపింది. ఆకలి, నిరుద్యోగం, వైవాహిక సమస్యలు, భూమి సమస్య, శ్రమ దోపిడీ, దళారి వ్యవస్థ, రాజ్యహింస, దళిత సమస్యలు, విద్యావిధానంలోని మార్పులు, విద్య కార్పొరేటీకరణ, విద్యార్థులపై ఒత్తిడులను చర్చించింది. పట్టణ ప్రాంతపు ప్రజల సాధకబాధకాలను దృశ్యమానం చేయగలిగింది. పురుషాహంకారం, స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలలోని లోటుపాట్లు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య, మానవ సంబంధాల్లో లోపిస్తున్న మానవీయత మొదలగు అనేక అంశాలను అభ్యుదయ దృష్టితో చర్చించగలిగింది’. తెలుగు నాటకం – సామాజికత శీర్షికన సంకలన సంపాదకుడు వల్లూరు శివప్రసాద్‌ రాసిన ఈ మాటలు ఈ వంద నాటకాల సారాల్ని మన ముందుంచాయి. ఈ మాటలతో పాటు ‘తెలుగు నాటకం నిరాడంబరంగా కొనసాగిందేమో కాని నిష్ప్రయోజనంగా మాత్రం అపఖ్యాతిని మూటగట్టుకోలేదు. తెలుగు నాటకం సామాన్యుల కోసం రాయబడింది. సామాన్యుల ప్రయోజనం కోసం ఆడింపబడింది. సామాజిక అభ్యున్నతి కోసం నిలబడింది’. శివప్రసాద్‌ చెప్పిన మాటలు తెలుగు నాటక చరిత్రను పరిశీలిస్తున్న వారూ, పరిశోధిస్తున్న వారూ నిజమేనంటారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నట్లు, ఈ వంద నాటకాలు నిస్సందేహంగా ఒకటిన్నర శతాబ్దపు సమాజ చరిత్ర రచనకు విశ్వసనీయమైన ఆధారాలుగా నిలుస్తాయి!

ఈ నాటకాల రచయితలు ప్రసిద్ధులు. ప్రతి నాటకమూ ఒక ప్రత్యేకతతో కూడుకున్నదే. అనేకం ప్రదర్శనాపరంగా జయప్రదమైనవే. జీవద్భాషను మాట్లాడినవే. మొత్తంగా తెలుగు సమాజాన్ని మన ముందుంచిన ఈ నాటక సంకలనాలను ఆదరించాల్సిన బాధ్యత తెలుగు సమాజానిది. ఏ అకాడమీలో, పీఠాలో, విశ్వవిద్యాలయాలో చేయ్యాల్సిన ఈ పనిని వారెవరూ చెయ్యకపోయినా, చేస్తారని ఎదురు చూడకుండా అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రజా సాంస్కృతికోద్యమంతో ప్రగాఢ సంబంధాలున్న వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి ఎంతో శ్రమకోర్చి సాహిత్యం, సమాజం పట్ల బాధ్యతతో ఈ సంకలనాలను అందించినందుకు మాటల్లో  అభినందనీయులు. 

– పెనుగొండ లక్ష్మీనారాయణ
‘అరసం’ జాతీయ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement