కథ: ఔను.. అందరి దైవం అమ్మే! | KK Raghunandana Telugu Story: Andhari Daivam Amme in Sakshi Funday | Sakshi
Sakshi News home page

కథ: ఔను.. అందరి దైవం అమ్మే!

Published Sat, Nov 5 2022 7:31 PM | Last Updated on Sat, Nov 5 2022 7:31 PM

KK Raghunandana Telugu Story: Andhari Daivam Amme in Sakshi Funday

‘మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఇబ్బందేమీ లేదు’ ఆ రోజు రాత్రి పక్కమీద చేరాక వేదవ్యాస్‌ రమణితో చెప్పిన మొదటి మాట..
‘మీక్కాదు.. నాకు ఇబ్బంది. మా అమ్మ క్షణక్షణం తినేస్తోంది. మడి తడి అంటోంది. చెప్పిందే పదిసార్లు చెబుతోంది..’ అంది రమణి విసుగ్గా. 

‘వయసు మీద పడింది కదా! ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు. ముసలైనాక నీకూ వస్తుందిలే!’ అన్న భర్త మాటకు అడ్డుపడుతూ.. ‘ఐనా మా తరం మరీ అంతలా బుర్ర తినేయం లెండి’ జవాబిచ్చింది రమణి.

‘వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి. ఉడిగాక మన కళ్ళముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా కనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం’ మళ్ళీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్‌.

వారిద్దరి నడుమ సాగిన చర్చకు అసలు కారణం రమణి తల్లి.. నాగమ్మ! ఆమె భర్త నాంచారయ్య పదిహేనేళ్ళ క్రితం తనువు చాలించాడు. రమణికి ఒక్క అన్నదమ్ముడు వెంకటాచలం. అతగాడు ఒక్కోసారి తీసుకెళ్లి మూడునెలలపాటు ఉంచుకుని దిగబెట్టేస్తాడు. మిగతా తొమ్మిది నెలలు రమణే భరిస్తుంది. వేదవ్యాస్, రమణి దంపతులకు ఒక పాప సంహిత, బాబు రక్షిత్‌.

 కొంతకాలం రమణి ఒక చోట చిన్న ఉద్యోగం చేసింది. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్లకి ఏ లోటూ రాకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మే సంరక్షణ చేసింది. వేదవ్యాస్‌కి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వలన అసలు తీరికుండేది కాదు. ఐనప్పటికీ వంటవార్పులలో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది. అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్‌కి పోయి అన్నీ కొనుక్కొచ్చేది. ఇంత చేసినా తల్లి అంటే భార్య రమణికి ఈమధ్య కాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కాలేదు వేదవ్యాస్‌కి.

ఒకరోజు బైటకెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్‌ లేకపోవడం చూసిన నాగమ్మ ‘అమ్మా! ఎక్కడైనా మరచిపోలేదు కదా? నీకు మతిమరపు మరీ ఎక్కువౌతోంది’ అని చీవాట్లేసింది.

‘అయ్యో! నువ్వలా తినీకు.. చెప్పులు విప్పుతూ బైట బల్లమీద మరచిపోయానమ్మా!’ అంది పళ్ళు నూరుతూ.
‘అందులో నీ ఆధార్‌ కార్డ్, లైసెన్స్, ఏటీఎమ్‌ కార్డ్‌ ఉంటాయి కదాని జాగ్రత్త చెప్పానంతే’ అంది బాధగా నాగమ్మ.
‘నువ్వు చెబితే కాని నాకు తెలీదా? ప్రతిదానికీ  రియాక్ట్‌ ఐపోతున్నావ్‌?’ చిరాగ్గానే అన్నది రమణి.

విషయం తెలుసుకుని వేదవ్యాస్‌ ‘చెబితే తప్పేముంది రమణీ! నీ అజాగ్రత్తకి చెప్పిందామె! వినటం నీ ధర్మం’ అన్నాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం, ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే!

తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది. వీలైనప్పుడు ఫోన్‌ చేస్తే సరిపోతుంది. ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండకత్తెరలాగే తోస్తోంది. అందుకనే వెంకటాచలాన్ని రెండుమూడుసార్లు అభ్యర్థించింది ‘తమ్ముడూ! అమ్మని నువ్వు ఆరునెలల కాలం ఉంచుకోవచ్చుకదా! నీక్కావలిస్తే నేను డబ్బు పంపిస్తూంటాను’అని. ఐనా అతను అందుకు ఒప్పుకోలేదు. ‘నా దగ్గర ఉంటే మా ఆవిడకీ అమ్మకీ ఉప్పు..నిప్పులా ఉంటోంది. సమర్థించడం నా వల్ల కావడం లేదు. అదేదో నువ్వే చూసుకో. కేవలం మూడు నెలలే భరిస్తాను’ అని నిక్కచ్చిగా చెప్పేశాడు. తదాదిగా తల్లి బాధ్యత రమణిదే అయింది.

‘నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసుర్లు అనవసరం. ఎలాగోలా సర్దుకుని ఉండాలి. ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బందైతే ఒక పనిమనిషిని పెట్టుకో’అనేవాడు వేదవ్యాస్‌.

అప్పుడే కుదిరింది పనిమనిషిగా సుబ్బులు. ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది. ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మనసు గింజుకోవడం లేదు. ఐతే పనిమనిషి సుబ్బులు కొద్దిగా వాగుడుకాయ. తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది. ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది. ‘సూడమ్మా! మనకు పెద్దోల్లు ఏవేవో సెబుతుంటారు. ఆట్ని మనం పెడసెవిన పెడుతుంటాం గానీ ఆటిలో ఎంత సారముంటాది? ఉన్నన్నాల్లు తెలీదమ్మా పెద్దోల్ల యిలువ! పెతి పనికీ  అడ్డు తగులుతున్నట్లుంటాది గానీ, అది మనకే మంచిదమ్మా!’ అంటూ. ఇప్పుడింత అధాటుగా తనకు ఉద్బోధ చేస్తోందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణికి. ఒకవేళ తను లేని సమయంలో తల్లి.. పనిమనిషికి గత సంగతులన్నీ పూసగుచ్చలేదు కదా? లేకపోతే ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తోంది? తన వైఖరిగాని పసిగట్టలేదు కదా? అలాగైతే చులకన అయిపోమూ?

‘అమ్మా! నువ్వు ఆ పనిమనిషి సుబ్బులుతో  అన్ని విషయాలు వాగుతున్నావా? ఇరుగుపొరుగుకి అన్నీ చేరవేస్తుంది’ అంటూ ఒకరోజున హెచ్చరించింది రమణి.
‘నేనెందుకు చెబుతానమ్మా! దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తూంటాను. అంతేగానీ మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా?’అని కొట్టి పారేసింది నాగమ్మ. సుబ్బులుతో పెద్దగా మాట్లాడ్డమూ మానేసింది. 

అది పసిగట్టిన సుబ్బులు ‘ఏటమ్మా! ఏటైనాది? బంగారంనాటి మాటల్సెప్పేవోరు.. ఇప్పుడేటైనాదని నోరు మూసేసుకున్నారు? మీతో మాటాడితే మాయమ్మతో మాటాడినట్టుంటాది. మా అమ్మంటే ఎంతిట్టమో నాకు’అని నాగమ్మ వైపు దృష్టిసారిస్తూ చెప్పింది.

‘ఐనా ఆవిడతో నీకేమిటే మాటలు? నీ కష్టాలేమైనా ఆవిడ తీర్చగలదా? ఎందుకు లేనిపోని పోచుకోలు కబుర్లు?’ సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి.
‘వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు? మీ అమ్మంటే సుబ్బులుకిష్టం కాబోలు’ ఎప్పుడైనా అక్కడ ఉంటే ఒక మాటగా అనేవాడు వేదవ్యాస్‌. అది సహించలేకపోయేది రమణి.

ఇలా ఉండగానే ఒకరోజున అధాటుగా దిగాడు వెంకటాచలం..‘అక్కా! అమ్మను నాతో తీసుకెళ్లడానికొచ్చాను. కొంతకాలం నా దగ్గర ఉంచుకొని పంపిస్తానులే! నీకూ కొంత హాయిగా ఉంటుంది’ అంటూ. 

‘అదేంటి మొన్ననేగా నా దగ్గర దిగబెట్టావు. ఏమైందిట?’ అలా అన్నదేగాని తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరకు పంపడం రమణికి సంబరంగానే ఉంది. 
‘అబ్బే!ఏం లేదులే! మామూలే! పిల్లలు తలుస్తున్నారు’ అన్నాడు.

 మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడ్కొని.
‘చాలా ఆశ్చర్యంగా ఉందే? మూడు నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా? ఇంత హఠాత్తుగా తీసుకెళ్లాడేమిటి మీ తమ్ముడు?’ అన్నాడు వేదవ్యాస్‌ సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక.

‘వెళ్ళనిద్దురూ! హాయిగా ఉంటుంది ప్రాణానికి’ అంటూ నిట్టూర్చింది రమణి.
ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమాక గమనించి ‘అదేటమ్మగోరూ! అమ్మ కనబడ్నేదేటి?’ అన్నది విస్తుబోతూ.
‘మా తమ్ముడు తీసుకెళ్ళాడు’ ముక్తసరిగా చెప్పింది రమణి.

‘అదేటోనమ్మా! మీకెలాగుంటదో గానీ మాయమ్మ ఒక్క సెనం నాకాడ లేకపోతే నాకుండబట్టదు. ఒల్లమాలిన పేమ. నన్నొగ్గదు కూడా. దాని యిసయంలోనే మా అన్నకీ నాకూ గొడవలు. దాన్ని ఆల్ల ఇంటికి తీసుకుపోతానంటాడు.. అది నాకు సిర్రెత్తిపోద్ది’ అంటూంటే మనసులో నవ్వుకుంది రమణి. పిచ్చిదానిలా ఉంది. తనకే రోజు గడవడం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది. మరి తల్లి బాధ్యత పడడం అంత ఇష్టంగా చెప్పుకుంటోందేమిటి? అనుకుంటూ. 

సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరకు చేరి ‘అమ్మా! అమ్మమ్మ ఏదమ్మా? కనబడటం లేదు?’ ప్రశ్నించారు.
‘మీ మామయ్య తీసుకెళ్ళాడు. ఎంతసేపూ మీకు అమ్మమ్మ ధ్యాసేనా? హోమ్‌వర్క్‌ చేసుకుని పడుండలేరా?’ కసురుకుంది రమణి.

‘అమ్మమ్మ ఐతే ఎంచక్కా కథలు చెబుతుంది. మంచి మంచి పాటలు పాడుతుంది. సామెతలు చెబుతుంది. పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది’ ఆమెలేని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు.

పిల్లలిద్దరికీ తన తల్లి మీదే మక్కువ ఎక్కువగా ఉంది. కొంతకాలానికి తననే మరచిపోయేట్లున్నారు. ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమౌతుంది. అందువల్ల కూడా తల్లిని తైనాతూ ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తోంది రమణికి. 

ఒక రెండురోజుల తరువాత ఆఫీసు నుంచి వస్తూనే వేదవ్యాస్‌ ‘మీ తమ్ముడు మహాఘటికుడు. అమ్మపైన అధాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే! అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్లిందట! పనిమనిషి కూడా మానేసి చాలాకాలమైందట. అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడట. వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే! అతడి వలన ఈ భోగట్టా అంతా తెలిసొచ్చింది’ చెప్పాడు.

‘అక్కడెలా ఏడ్చినా నాకనవసరం. వాడు తీసుకెళ్తానన్నాడు అంతే! అంతకు మించి నేనాలోచించలేదు. మళ్ళీ కొంతకాలమైనాక ఎలాగూ తప్పదు కదా? ఆవిడగారి రాక!’ నిమిత్తమాత్రంగా అన్నది రమణి.

ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్‌కి. ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలీదు. తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్‌. తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాకటం తనకిప్పటికీ జ్ఞాపకమే! తన ఇద్దరు అక్కచెల్లెళ్ల పెళ్ళి తనొక్కతేధైర్యంగా నిలబడి చేసింది. తనను కూడా ఇంటి వాడిని చేసింది ఆమే! తల్లి బతికున్నంత కాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే! ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమే ముందుండేది. తన భర్త పింఛను కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది. కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది. ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలచుకుంటే కళవళపడుతుంది మనసు.

మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు బావురుమన్నది. ‘ఏం జరిగింది? అంతలా ఏడుస్తున్నావ్‌?’ అడిగింది రమణి.

‘సెబుతున్నా పెడసెవినెట్టి మాయమ్మను ఆల్ల యింటికి లాక్కెల్లిపోయాడు. నలుగురినీ పంచాయతి ఎట్టయినా నాకాడికి తెచ్చుకుంటా. ఎదవ సచ్చినాడు. దాన్సేత ఏ ఎట్టిసాకిరి సేయిత్తాడోనని గుండె గుబేల్మంటోంది. అసలే దానికి అలికెక్కువ (ఆయాసం). డాకటేరు కాడిక్కూడా సూపించడు. ముదనట్టపోడు’ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మెటికలు విరిచింది సుబ్బులు.

‘నువ్వెందుకలా గింజుకుపోతున్నావో నాకు అర్థంకావడం లేదు. ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ! మీ అన్న దగ్గరే కదా ఉంది. పోషణంతా అతగాడే చూసుకుంటాడు కదా? ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు. మళ్ళీ మరో బరువు నీ మీదనేసుకుంటావు. కష్టం కాదా? ఎందుకలా?’ అంది మేధావిలా మాట్లాడుతూ రమణి.

‘కష్టమనుకుంటే ఎలాగమ్మా? మనం సిన్నబిడ్డలుగా ఉన్నపుడు ఆల్లు అడ్డాలలో పెట్టి మనల్ని చూసుకోనేదా? అప్పుడు మనం బారమనుకుని ఒగ్గీనేదు కదా? అందుకే ఆల్లు పెద్దయినపుడు మనం సూసుకోవాలి. మా అన్న తాగుబోతు నా కొడుకు. సమంగా సూత్తాడో నేదోనని నా బయం.. వత్తానమ్మా!’ అని ఇల్లు ఊడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు.

‘దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు. ఇల్లు సంభాళించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట’ తన మనసులోనున్న మాట ఆ రాత్రి వచ్చిన భర్త వేదవ్యాస్‌ దగ్గర అన్నది. ఐనా మౌనమే వహించాడు.

ఒకరోజున సాయంత్రం వేదవ్యాస్‌ ఇంటికి వచ్చేసరికి విచార వదనంతో కనిపించింది రమణి..  ‘సంహితకి ఒళ్ళు కాలుతోందండీ’ అంటూ.
బైట వాతావరణం ఏమీ బాగులేదు. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే వేదవ్యాస్‌ ‘ఎందుకైనా మంచిది డాక్టర్‌కి చూపించాలి. మన సొంత వైద్యాలొద్దు. మరి ఇంటి దగ్గర బాబును చూసుకోడానికి ఎవరుంటారు?’ అంటూ ఆలోచనలో పడ్డాడు.

బైట వాన మొదలైంది భారీగానే. అంతలోనే వీధి తలుపు చప్పుడైంది. వెళ్లి తీశాడు. గొడుగులో వచ్చిన సుబ్బులు. పరిస్థితి తెలుసుకుని ‘మీరేం కంగారు పడకండమ్మా! ఆసుపత్రికి జాయిన్‌ సేయండి. మీరెల్లండి.. నేనీడ బాబుని సూసుకుంటా’అన్నది ధైర్యమిస్తూ.

వేదవ్యాస్, రమణి ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరమని తేల్చారు. ఒక వారంరోజుల పాటు అక్కడే ఉండాలన్నారు. ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా గుండె దడ పట్టుకుంది ఇద్దరికీ. ఇంటి దగ్గర బాబుని చూసుకునే దిక్కు లేదు. ఇక్కడ ఆసుపత్రిలో సహాయం చేసేవాళ్లు కరువైనారు. ఏం చేయాలో ఓ పట్టాన బోధపడలేదు. డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గది తీసుకుని అక్కడ నర్స్‌కి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వేదవ్యాస్‌. బాబుకి బిస్కట్లు తినిపిస్తూ కనిపించింది సుబ్బులు. అతన్ని చూసి దిగ్గున లేచి ‘ఏటన్నారు బాబూ! పాపకి ఏటైనాది?’ అని అడిగింది ఆత్రుతగా.

వేదవ్యాస్‌ చెప్పి కలవరపడుతుంటే ‘ఇంటికాడ సంగతి నాకొగ్గేయండయ్యా! ఇల్లు సక్కంగా సూసుకుంటాను. బాబు గురించిన బెంగ మీకక్కర్లేదు. పనుంటే అక్కడికెళ్ళండి’ అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైంది.

వేదవ్యాస్‌ వెళ్ళేసరికి పాపకి ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరగడం కోసం అప్పటికే డాక్టర్‌ చికిత్స మొదలెట్టినట్లు చెప్పింది రమణి. మూసిన కన్ను తెరవలేదు సంహిత. బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు.

ఒక ఐదురోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది. ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు డాక్టర్‌. మర్నాడుదయం ఇల్లు చేరారు. లోపలికెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముసలామె కనిపించేసరికి గాబరాపడి ‘ఏయ్‌! ఎవర్నువ్వు?’ అని గదమాయించేసరికి ఉలిక్కిపడి ‘బాబూ! నాను సుబ్బులు అమ్మను. అది నాలుగిల్లల్లో పనులు సేయడానికి ఎల్లింది. మీరొచ్చీసరికి వచ్చేత్తానంది’ అంటూండగానే సుబ్బులు బైట నుండి లోపలికి అడుగుపెడుతూ ‘ఔనయ్యా! మాయమ్మే! తైనాతూ నేనీడుండడానికి అవదని మా ఈదిలో పెద్దల్ని మా అన్న కాడికి పంపి మాయమ్మను రప్పించీసినాను. ఎంటనే యిక్కడి యిసయం తెలుసుకుని తోడుంటానని లగెత్తుకొచ్చింది. ఇందుకేనయ్యా మాయమ్మంటే నాకు సాలా ఇట్టం. నా పెనిమిటి కుదుర్నేక తిరుగాడుతున్నా మాయమ్మే నిచ్చెం నాతో కలిసుంటాది’ అని తెగ సంతోషపడుతూ సంహితను దగ్గరగా తీసుకుంది.
‘సుబ్బులూ! నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు వేదవ్యాస్‌.

‘ఎంతమాటయ్యా! ఎపుడే ఆపదొచ్చినా ఇట్టా కాకిసేత కబురెడితే సాలు అట్టా వాలతాను. కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా?’ అని తల్లి మరియమ్మతో సహా బైటకు నడిచింది సుబ్బులు.
సుబ్బులు మాటలు వింటూంటే గుండె కలుక్కుమనసాగింది రమణికి.

‘చూశావా రమణీ! మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో? తల్లిపట్ల నీకుండే భావాలు వేరు. మీ అమ్మ నీ తమ్ముడి దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యోచనలో నువ్వుంటే సుబ్బులేమో తన తోడబుట్టిన వాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తన తోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది. పైగా మనక్కూడా ఉపయోగపడేలా చేసింది. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా సంప్రదింపుకైనా లేదా చిన్నచిన్న సహాయాలకైనా మనకే ఉపయోగపడతారు. వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితిలో మీ అమ్మే మన దగ్గరుంటే కొండంత అండగా నిలబడి ధైర్యం ఇచ్చేది. తల్లిని కోల్పోయిన నేను ఆరోజుల్లో ఎంత గుంజాటన పడ్డానో చెప్పలేను. నీకు తల్లి ఉండి కూడా ఆమెను చాదస్తమంటూ, ఎద్దేవా చేస్తున్నావ్‌. నువ్వు నీ తల్లిని దూరం  చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకూ అదే అబ్బుతుంది. రేపు వాళ్లూ నిన్ను దూరం చేసినా తప్పు లేదనుకుంటారు. దెప్పుతున్నాననుకోకు.. తల్లి తోడు.. నీడ.. అన్నీను!’ అన్నాడు వేదవ్యాస్‌.

భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి. ఆ వెంటనే మరో మాటకు తావులేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం.

తల్లిని చూడ్డంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలికపడినట్లయింది రమణికి. పిల్లలిద్దరినీ చూసి తన అక్కున చేర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్‌ దంపతులు. ‘ఔను! ప్రపంచంలో అందరి దైవం అమ్మే!’అనుకుంది రమణి.. కళ్ళల్లో నీరు చిమ్ముతుండగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement