telugu story
-
కథ: అబ్బాజాన్.. ఇలాంటి తండ్రి ఉంటే..
‘నేను సిగరెట్ తాగను ...’ సాబిరాకు ఏమీ అర్థంకాలేదు. ‘అదేనండీ! నేను సిగరెట్ తాగను ...’ అటు ఇటు కళ్ళు తిప్పి చూసింది సాబిరా. ఎవరూ లేరు. అతను తనకే చెప్తున్నాడని అర్థమై ‘అయితే?’ అంది. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘బెస్ట్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు తీసుకొని స్టేజీ దిగి కిందకి రాగానే స్టేజ్ మీద నుంచి ఒక సివిల్ సర్వీసెస్ అధికారి తన వెనకాలే వచ్చి పలకరించి ఇలా చెప్పడం కొంచెం స్ట్రేంజ్‌గా అన్పించింది సాబిరాకు. అతను నవ్వి ‘మీరు రఫీ మాస్టర్ గారి అమ్మాయి కదా ...’ అన్నాడు. ‘అవును. మీకెలా తెలుసు?’ ఆశ్చర్యంగా అడిగింది. ‘నా పేరు ఫసీఉద్దీన్. మీకు నేను గుర్తుండకపోవచ్చు గానీ నన్ను చదివించిన మాస్టర్ గారిని నేను ఎలా మర్చిపోతాను?’ అప్పుడు ఫ్లాష్ అయ్యింది సాబిరాకు. ‘సాయంత్రం అవార్డీస్కి మినిస్ట్రీ నుండి పార్టీ ఇస్తున్నాం. హోటల్‌కి వెళ్ళి సాయంత్రం వచ్చేయండి ’ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని వైపే చూస్తూ నిలబడింది. లైట్ బ్లూ కలర్ సూట్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇతడు తమ ఇంట్లో ఒక మనిషిగా ఉండాల్సింది. కాని లేడు. 20 ఏళ్ళ కింది మాట– ‘బేటా.. నబీ సాబ్ కొడుక్కి ఇంజనీర్ల సీటు వొచ్చిందట హైదరాబాద్‌ల. బట్టల కిస్తీ కట్టనికొచ్చి చెప్పిండు’ స్కూలు నుంచి వచ్చిన కొడుకుతో చెప్పింది కరీంబీ. ‘అట్లనా అమ్మీ! పిల్లలు బాగా చదివితే అంత కంటే ఏం గావాలె ఏ తల్లిదండ్రికైనా ...’ షర్టు విప్పి చిలక్కోడుకు తగిలించి తల్లి పక్కన కూర్చున్నాడు రఫీ. ‘పస్టు వొచ్చిండట. పేపర్ల సుత పుటువ వొచ్చిందని సూపిచ్చె నబీ సాబ్’ ‘ఫసీ చిన్నప్పటి నుంచి బాగా చదువుతడు అమ్మీ. మా స్కూల్లనే చదివిండు . నా స్టూడెంటే గాదూ’ అన్నాడు రఫీ. అప్పుడే స్కూలు నుంచి వచ్చిన జమీల టీ తీసుకొని వచ్చి భర్తకు, అత్తకు ఇచ్చి కుర్చీ లాక్కొని వాళ్ళిద్దరితోపాటు కూర్చుంది. ‘మరి నబీ భాయిజాన్ కొడుకుని పట్నం ఎప్పుడు పంపుతున్నడట’ అడిగింది జమీల. దానికి పెద్దావిడ అందుకుంది– ‘జమీలమ్మా! నబీ సాబ్ చాలా పరేషాన్లున్నడు బేటా. రికాడ్ అసిస్టెంటు నౌకరిలో ఆరుగురు పిల్లల్ని సాదుడే ఎక్కువ. పెద్దోడు ఉన్నూల్లెనే సదువుకొని మంచిగ ఫైల్ల్లోకి వస్తాండు. ఇప్పటి దాంకా ఏదో సదిరిన ఫుప్పూ. ఏం సమజైత లేదు. ఎట్లనో ఏమో అన్నడు. ధైర్నంగుండు బేటా... అల్లా దయ వల్ల అంతా మంచే జరుగుతది అన్న ...’ అంది కోడలితో. ‘దానికి మనిషి కదిలితే గదా. తలగోక్కుంట నిలబడ్డడు. ఎంత గవర్నమెంటు సీటైనా నెలకు మూడు నాలుగు వేలు అయితయి... గుడ్డలేంది? పెడ్డలేంది? బుక్కులేంది? అన్నీ జుమ్లా యాడాదికి యాభై వేలు చేతుల బెట్టుకోవాలె ఫుప్పూ. ఏం సమజైత లేదు’ అని దిగాలు వడ్డడు. తలో సెయ్యి ఏద్దాంలే బేటా... పరేషాన్ గాకు అని నచ్చజెప్పి పంపిన’ అందామె. ‘అమ్మీజాన్.. నా మనసులో మాటున్నది చెప్పుదునా? తల్లీకొడుకులిద్దరూ కోపమైతరా నా మీద?’ అంది జమీల. ‘అదేంది జమీలా? ఎప్పుడన్న ఉన్నదా అట్ల? చెప్పు ఏందో ...’ అంది కరీంబీ. ‘అమ్మీజాన్! నబీ భాయిజాన్ కూటికి పేదోడుగని గుణానికి కాదు. పద్ధతికల్ల కుటుంబం. భాభీ గూడ ఉన్న దాంట్లొనే గుట్టుగ సంసారం గుంజుకొస్తాంది. అంతమంది మగపిల్లలు ఉన్నగాని ఇంట్లె ఉన్నరో లేరో అన్నట్టుంటరు’ ‘అదైతే నిజమే. పొల్లగాండ్లు తల్లి నోట్లెకెల్లి ఊసిపడ్డట్టె ఉన్నరు ముద్దుగా’ కరీంబీ జోడించింది. ‘మన టౌన్ల రెండొందల గడప ముసల్మాన్లలో అంతా ఏదో యాపారం చేసుకునో, చిన్న నౌకరీలు చేసుకునేటోల్లేనాయె. పిలగాండ్లను పెద్దగ చదివిస్తున్నోల్లు గూడా కనవడతలేదు. మనకు ముగ్గురు ఆడపిల్లలాయె. ఇప్పట్నుంచి ఆలోచన చెయ్యకపోతే కష్టమైతదని అన్పిస్తుంటది’ ‘నువ్వనేది నిజమే బేటా’ ‘మన పెద్ద పిల్ల సాబిరాను ఫసీకి ఇస్తమని సంబంధం ఖాయం చేసుకొని, ఫసీని మనమే చదివిద్దాం. ఇద్దరి చదువు అయిపోయి జాబ్‌లు వచ్చినంక పెళ్ళి చెయ్యొచ్చు. ఏమంటరు అమ్మీజాన్’ ‘నా మతిల ముచ్చెట గుంజకున్నవ్ పొల్ల. నాకైతే సమ్మతమే’ అంది కరీంబీ. ‘ఇట్ల బాగుంటదా అమ్మీ?’ కొడుకు అడిగాడు. ‘ఏమైతది బేటా.. ఇండ్ల బాగుండక పోయేదేంది? కాలంతోని మనం మారాలె. అవురత్ బచ్చీలను బాగా సదివిద్దాం అనుకొంటుంటిమి. బిడ్డలు ముద్దుగ సదువుకొంటున్నరు. రేపు వాల్లు మంచి పొజిషన్ల కొచ్చినంక అంతకు మీద ఉన్నోన్ని సూడకపోతే కుదురుతదా? గప్పుడు ముక్కుమొకం జెవలనోళ్ళకు ఇచ్చుడు కంటే ఇదే నయ్యం’ ‘సరె మీరిద్దరంటున్నరు గదా. అట్లనే చేద్దాం. అమ్మీ నువ్వు నబీ సాబ్‌ను పిలిచి మాట్లాడు. నేను ఫసీతోని మాట్లాడుత. పిల్లల ఆలోచనా తెలుసుకోవాలి కదా’ అన్నాడు రఫీ. తెల్లారి నబీ సాబ్ ‘అంత కంటెనా ఫుప్పూ’ అన్నాడు ఖుష్ఖుష్ అవుతూ. ఒకసారి భార్య షబ్నంను, కొడుకును విచారించి చెప్తానన్నాడు. సాబిరా అప్పుడు తొమ్మిదో క్లాసులో ఉంది. రఫీ.. ఫసీతో మాట్లాడాడు. ‘నిజంగ ఇస్తరా సార్’ తలొంచుకొని సిగ్గుపడ్డాడు పద్ధెనిమిదేళ్ళ ఫసీ. అన్ని వైపుల నుండి సరేననుకున్నాక ఒక ఆదివారం పూట నబీ సాబ్ కుటుంబాన్ని, మరో ఇద్దరు జమాత్ వాళ్లని ఇంటికి దావత్‌కు పిలిచాడు రఫీ. అన్నీ మాట్టాడుకొని సంబంధం ఖాయం చేసుకున్నారు. పిల్లల చదువులైపోయి, ఉద్యోగాలు వచ్చాక పెళ్ళి చేద్దామని ఇరువైపులా ఒప్పుకున్నారు. ఈ విషయమై పిల్లల దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని, వాళ్ళ చదువుకు ఆటంకం కలుగుతుందని ఆ రోజు పిల్లలిద్దర్నీ ఆ దావత్లో లేకుండా చూసుకున్నాడు రఫీ. వారం రోజుల్లో ఫసీని యూనివర్శిటీ క్యాంపస్‌లో చేర్చి కావలసినవన్నీ సమకూర్చి వచ్చారు రఫీ, నబీ సాబ్‌లు. ఫసీ, సాబిరా పోటాపోటీగా చదువుతున్నారు. టెన్త్‌లో సాబిరా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఫసీ కూడా ప్రతీ సెమిస్టర్లో టాపర్‌గా నిలుస్తున్నాడు. సాబిరా ఇంటర్ పస్టియర్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్ సౌమ్య ఒక రోజు సాబిరాను పక్కకు పిలిచింది. ‘సాబిరా! మీవోడు సిగరెట్ తాగుతున్నడు మొన్న దోస్తులతోని’ అంది. సాబిరా అక్కడ్నుంచి స్పీడ్‌గా సైకిల్ తొక్కుతూ రొప్పుతూ ఇంట్లోకి వచ్చింది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన రఫీ ‘ఏంది బేటా! ఎందుకంత తొందర. నిమ్మలంగ రావద్దా...’ సాబిరా నుదటి మీద చెమటను తన కర్చీఫ్‌తో తుడిచాడు. సాబిరా చాలా అసహనంగా ఉందని గమనించాడు. ‘ఏంది బేటా ఏమైందీ?’ ‘అబ్బాజాన్! నేను ఫసీని చేసుకోను. వాడు గల్లీల పోరగాండ్లతో సిగరెట్ తాగుతున్నాడు’ ‘నేను అడుగుతా బేటా’ ‘అడుగుడు లేదు ఏం లేద్ . నేను చేసుకోను’ తేల్చి చెప్పింది సాబిరా. గేటు వైపూ, లోపలికీ తల తిప్పి చూశాడు రఫీ. ఇంకా షాపు నుంచి కరీంబీ, స్కూల్ నుంచి జమీల రాలేదు. ‘బేటా! నువ్వు వద్దంటే వద్దు. ఏం చేసుకోవద్దు. అమ్మీకి, దాదీకి చెప్పకు. నీ ఈపు సాప్ జేస్తరు. టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటలే. ఇవ్వేవి మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో’ అన్నాడు. ‘నిజంగా’ ‘నిజ్జం బేటా’ ఆ తర్వాత ఎప్పుడూ ఫసీ ప్రస్తావన రాలేదు ఇంట్లో. చిన్నప్పటి నుంచి సాబిరా ఏం చేసినా రఫీకి నచ్చుతుంది. డిగ్రీ అయిపోయిన రెండేళ్ళలో సాబిరాకు రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. మూసగా ఉండే ఆ రెండు ఉద్యోగాలు నచ్చలేదు. ఆ ఉద్యోగాలకు వెళ్ళనని తెగేసి చెప్పింది. ప్రతి పని ప్లాన్ ప్రకారం చేసే జమీలకు, కరీంబీకి ఈ విషయం మింగుడు పడలేదు. ఇంట్లో పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇష్టంలేని పని ఏదైనా తప్పనిసరిగా చెయ్యాల్సి వచ్చినప్పుడు సాబిరా మొండికేసేది. ఎదురు తిరిగేది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అబ్బాజాన్ రఫీ సాబిరా పక్షానే నిలబడతాడు. జమీలకు, కరీంబీకి బాగా కోపం వచ్చేది. ‘జైసా బాప్... వైసీ బేటీ’ అని తిట్టిపోసేది జమీల. ఫసీ విషయంలో కూడా భార్యకు, తల్లికి ఏం చెప్పుకున్నాడో వాళ్లు అతని సంగతి సాబిరా ముందు ఎత్తలేదు. కాలక్రమంలో ఆ విషయమే మర్చిపోయింది సాబిరా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఫసీ కనిపించి సాబిరాకు అన్నీ మనసులో మెదిలాయి. సాయంత్రం పార్టీకి వెళ్లింది. పార్టీ జరుగుతున్న ప్రదేశమంతా కన్పించేలా కార్నర్ టేబుల్ ఎంచుకొని తన పేరు రాసిపెట్టి ఉన్న స్టాండ్‌ని ఆ టేబిల్ పైకి మార్చి, అక్కడే కూర్చుంది సాబిరా. నెమ్మదిగా ప్రదేశమంతా నిండింది. వచ్చిన డెలిగేట్స్ విజిటింగ్ కార్డ్స్ మార్చుకుంటూ నెట్ వర్కింగ్‌లో బిజీగా ఉన్నారు. పార్టీ ఏర్పాట్లు పర్యవేక్షించి సాబిరా టేబిల్ దగ్గరకి వచ్చాడు ఫసీఉద్దీన్. సాబిరా పలకరింపుగా నవ్వి, ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది. ‘ఇంతకీ నేను సిగరెట్ తాగానని చాడీ చెప్పిన సౌమ్య ఎక్కడ ఉంది?’ అడిగాడు. ‘మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్’ ‘నాకు అప్పుడే తెలిసి ఉంటే ఆ పిల్ల చెవి మెలేసి నిజం చెప్పించే వాడిని’ అన్నాడు ఫసీ. ‘అంటే అది నిజం కాదా?’ ‘ఏం చేస్తాంలెండి. కొన్నిసార్లు అంతే. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి గల్లీ చివర చెట్టు కింద చేరి సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదులుతున్నారు. సరదాగా నేను కూడా ట్రై చేశా. రింగులు రాకపోగా సౌమ్య కంట్లో పడ్డా. సిగరెట్ తాగడం అదే మొదలు అదే చివర. మా ఇంట్లో వరకే చెప్పి తిట్టిస్తుంది అనుకున్నా.. మీకు చెప్పిందని ఎప్పటికో తెలిసింది. అప్పటికే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది’ సాబిరా నవ్వాపుకుంటూ ‘నాకు తెలిసిందని మీకెవరు చెప్పారు?’ అంది. ‘ఓ రెండుమూడు ఏళ్ళకు మా అబ్బా కోపంతో ఊగిపోతూ నీ సిగరెట్ తగలబడిపోను. బంగారమసుంటి సంబంధాన్ని కాల్లతో తన్నుకున్నవని తిట్టే తిట్ల మధ్య తెలిసింది. మీతో మాట్లాడుదామనుకున్న. ధైర్యం చాలలేదు’ ‘మరి మా అబ్బాజాన్ మాట్లాడుతానన్నాడే ఆ రోజు. ఏం మాట్లాడలేదా?’ ‘రఫీ సార్ ఒకసారి నన్ను చూడటానికి క్యాంపస్‌కు వచ్చారు. మెస్ ఫీజు కట్టి ఇద్దరం హోటల్‌కి వెళ్ళి బిర్యానీ తిన్నాక నన్ను మళ్ళీ క్యాంపస్‌లో దింపి వెళ్తుంటే మాము.. సాబిరా ఎట్లుంది? అని మీ గురించి అడిగా. బాగుంది బేటా. కాని బేటా! చదువు మీద ఎక్కువ ద్యాసపెట్టు . మీరిద్దరు పెద్దయినంక కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే తప్పకుండ నిఖా జేస్తం. ఇద్దర్లో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వద్దు. ఇద్దరు బాగుండాలంటే ఇద్దరి ఇష్టం కూడా ముఖ్యం. ఆనాడు ఎట్ల రాసి పెట్టుంటే అట్ల జరుగుద్ది. సాబిరా గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు. కొంచెం భయం వేసింది. కానీ ప్రతినెలా వచ్చి చూసి ఫీజులు కట్టి వెళ్ళేవాళ్ళు. నాకు ఎప్పుడూ అనుమానం రాలేదు. ఎప్పటికో తెలిసింది ఈ విషయం. అప్పటికే మీరంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు మీ చదువుల కోసం. చాన్నళ్ళు బాధపడ్డా! సాబిరాకు తండ్రి గుర్తుకొచ్చాడు. రింగుల క్రాఫు, బక్క పలుచటి దేహం, లూజ్ ప్యాంట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్‌తో నవ్వుతూ ఉండే తండ్రి. ఎప్పుడూ తన తరఫున ఆలోచించే తండ్రి. ‘సంబంధం వద్దనుకున్నాక నా ఫీజులు కట్టడం మానేయొచ్చు రఫీ సార్. కాని ఒక మాస్టర్‌గా ఆయన స్టూడెంట్ గురించి ఆలోచించారు. అది పెద్ద గొప్పేం కాదు. మంచి టీచర్ ఎవరైనా అలాగే చేస్తారు. కాని ఆడపిల్ల అభిప్రాయానికి విలువ ఇచ్చి, అభిప్రాయాలు రుద్దకుండా మీ ఇష్టానికి మిమ్మల్ని ముందుకు సాగనిచ్చారు చూడండి. అది తండ్రిగా ఆయన అసలైన గొప్పతనం’ అన్నాడు ఫసీ. సాబిరా కళ్లు ఉద్వేగంతో తడి అయ్యాయి. ‘ఓ పదేళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతునే ఉన్నా. మీరు ఎదుగుతున్న కొద్దీ అయ్యో ... మిస్ అయ్యానే అన్పించేది. కానీ ఇవ్వాళో విషయం అర్థమైంది. ఒకవేళ మీరు నన్ను చేసుకొని ఉంటే జీవితంలో ఇంత ఎదిగేవారు కాదు. ఒక సివిల్ సర్వెంట్ భార్య హోదా మీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేది. రెక్కలు కత్తిరించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చిన రఫీ మాస్టర్ కూతురు కావడం వల్లే ఇదంతా మీకు సాధ్యమైంది. చూడండి... అవార్డు తీసుకునే వేదిక మీద మీరున్నారు. మీకు మర్యాదలు చేయాల్సిన హోదాలో నేను ఉన్నాను’ అన్నాడు ఫసీ నవ్వుతూ. ‘వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. రఫీ మాస్టర్‌కు నా సలాములు చెప్పండి’ అన్నాడు లేచి వెళుతూ. సాబిరా అతనికి చేయి ఊపి ఫోన్ చేతిలోకి తీసింది. ‘అబ్బాజాన్‌కు ఫోన్ చేయాలి’ అనుకుంది. ఇప్పుడు సాబిరా తండ్రికి వీడియో కాల్ చేస్తుంది. కృతజ్ఞతలు చెప్పదు. ఎందుకంటే తాను మరింత ఎదగడమే తండ్రి పట్ల తాను చూపదగ్గ కృతజ్ఞత అని సాబిరాకు తెలుసు. -రుబీనా పర్వీన్ -
కథ: ద షో మస్ట్ రన్... అన్నీ కలలే! వాడి మాటలు నా చెవిలో అమృతాన్ని నింపాయి!
ఎయిర్‌పోర్టు నుంచి కోయంబత్తూర్ టౌన్లోకి ఎంటర్ కాగానే మొదట నన్నాకర్షించింది ఊరు మొత్తం అంటించి వున్న జంబో సర్కస్ బొమ్మలు. నాకు కొత్త ఊర్లు, ప్రదేశాలు చూడటం, సర్కస్‌లు, పద్య నాటకాలు, పాత క్లాసిక్ సినిమాలన్నా.. పురాతన గుళ్లూగోపురాలూ, రాజుల కోటలూ అన్నా యిష్టం. కేశవ దిగిన పార్కు ఇన్ హాటల్‌కు వెళ్లాను. వాడు నాకోసం లాంజ్‌లో వెయిట్ చేస్తున్నాడు. నాబసను అక్కడే ఏర్పాటు చేశాడు. కుశల ప్రశ్నలయ్యాక కాఫీలు తాగాం. కాఫీ చాలా బావుంది. తమిళనాడులో ఎక్కడకు పోయినా ఫిల్టర్ కాఫీలు, వేడివేడి యిడ్లీ సాంబార్ నాకు ప్రత్యేక ఆకర్షణ. ‘వెళ్దామా?’ అన్నాను. ‘వరుణ్‌కి డ్యూటీ అయిపోయింది. హాస్టల్‌కు వెళ్లిపోయాడంట! రేపు మోర్నింగ్ పదింటికి కార్డియాలజీ వార్డులో మనల్ని కలవమన్నాడు’ చెప్పాడు కేశవ. ‘టైమ్ సిక్స్ అయ్యింది. మరిప్పుడేం చేద్దాం?’ అన్నాను హాల్లో గోడకున్న గడియారం చూస్తూ. ‘ఊర్లో జంబో సర్కస్ ఆడుతుందిరా. వచ్చేప్పుడు పోస్టర్లు చూశా. నీకూ నాలాగే సర్కస్ అంటే ఇష్టంగా! పోదామా? మంచి టైమ్ పాస్’ అన్నాడు కేశవ. వాడికి నా మైండ్ రీడింగ్ బాగావచ్చు. మనసు తెలిసి నడుచుకునే వాడేగా మంచి స్నేహితుడు. ‘పోదాం పదరా’ అన్నాను నవ్వుతూ. ‘అన్నపూర్ణ సర్కస్‌కి రానంది. రూమ్‌లో రెస్ట్ తీసుకుంటుందిలే!’ అన్నాడు. కారులో బయలుదేరాం. ∙∙ మేము సర్కస్ దగ్గరకు చేరేసరికి ఏడు దాటి పోయింది. గేట్ మూసేసి వుంది. లోపల షో జరుగుతోంది. ప్రత్యేకమైన మ్యూజిక్ వినిపిస్తోంది. ‘షో షురూ హోగయా సాబ్! డేఢ్ గంటా హోగయా!’ గేట్ కీపర్ చెప్పాడు. ‘ఏం చేద్దాంరా?’ అన్నట్టుగా నావంక చూశాడు కేశవ. ‘మీ మేనేజర్ ఎక్కడ?’ అనడిగితే.. దూరంగా టెంట్లో కూర్చున్న మనిషిని చూపించాడు గేట్ కీపర్. వెళ్లి పరిచయం చేసుకున్నాం. ‘మేరా నామ్ రంజిత్’ అన్నాడు షేక్హేండ్ యిస్తూ. మాకు సర్కస్ అంటే ఎంతిష్టమో ది గ్రేట్ ఒరియంటల్ సర్కస్ నుంచి జేమిని, గ్రేట్ బాంబే సర్కస్ దాకా నేను చూసిన సర్కస్‌లు, కేరళలో వున్న సర్కస్ స్కూల్స్.. వాటి చరిత్ర అంతా చెప్పేసరికి ఫిదా అయిపోయాడు. మమ్మల్ని టెంట్ లోపల రింగ్ దగ్గరకు తీసుకెళ్ళి కుర్చీల్లో కూర్చోపెట్టాడు. అతనూ వచ్చి మాపక్కనే కూర్చున్నాడు. అప్పుడు సైకిల్ షో నడుస్తోంది. టెంట్లో ఇరవై, ముప్పై పర్సెంట్ కూడా నిండలేదు. కుర్చీలు కొన్ని నిండినయి. గేలరీలో జనం ఆ మూలొకరు ఈ మూలొకరు కూర్చున్నారు. సైకిల్ షో అయిపోయింది. జోకర్లు వచ్చారు. కొంచెం వయసు మళ్ళిన వాళ్ళే జనాన్ని నవ్వించడానికి కిందా మీదా పడుతున్నారు. ఒక పక్కనుంచి కొంతమంది నెక్స్ట్ ఐటమ్ కోసం నెట్స్ కడుతున్నారు. ‘ఇప్పుడు ట్రపీజ్ ఆట మొదలవుతుంద’ని మైక్ లోంచి ఏనౌన్స్మెంట్ వినిపించింది. మాతో పాటు కూర్చున్న సర్కస్ మేనేజర్ లేవబోతూంటే.. ‘సర్కస్‌లో ట్రపీజ్ ఆర్టిస్టులు చాలా గ్రేట్ సార్. వాళ్ళంటే నాకు చాలా యిష్టం’ అన్నాను. అతని కళ్ళల్లో వెయ్యి కరెంట్ బల్బుల వెలుగు కనిపించింది. మళ్ళీ మైకులో నుంచి ఎనౌన్స్మెంట్ వినిపించింది ‘రంజిత్ యువర్ ఐటమ్’ అని. అతను ట్రపీజ్ ఆర్టిస్ట్ అని అప్పటిదాకా చెప్పనే లేదు. మేం ఆశ్చర్యంగా అతని వంక చూస్తుంటే కొంచెం కుంటుతూ నడుస్తూ టెంట్ లోపలికెళ్ళాడు. ఆకాశమంత ఎత్తులో ఉయ్యాల కట్టుంది. అప్పటికే నలుగురు ట్రపీజ్ ఆర్టిస్ట్స్ అక్కడ నిలబడి వున్నారు. లైటింగ్ మారింది. పైన చుక్కల ఆకాశం నీలిరంగులో అంతా వెన్నెల పరచుకున్నట్టుగా లైటింగ్ వుంది. చూసేవాళ్ళకు వాళ్ళు ఆకాశంలో ఉన్నట్టే వుంది. ఉయ్యాల షో మొదలయ్యింది. సన్నగా మధురమైన సంగీతం వినిపిస్తోంది. రంజిత్ ఉయ్యాల మీద వూగుతుంటే మా గుండెలు దడదడలాడినయి. ‘జీనా యహా! మర్నా యహా.. యిస్ కే సివా జానా కహా!’ అంటూ వయొలిన్ మీద సంగీతం వినిపిస్తోంది. అతను ఫీట్ చేస్తున్నంత సేపూ జనం భయంతో ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. షో జరిగినంతసేపు సంగీతం జనాల్ని మైమరిపిస్తూనే వుంది. ఫీట్ అయిపోగానే పెద్ద పెట్టున చప్పట్లు మోగినవి. షో అయిపోయింది. మేం హోటల్‌కు వచ్చే వరకు సర్కస్ మేనేజర్ కమ్ ట్రపీజ్ ఆర్టిస్ట్ రంజిత్ ధైర్యసాహసాల గురించి, సర్కస్ బతుకుల గురించే మాట్టాడుకున్నాం. ఆరాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. బాల్కనీలోకొచ్చి కూర్చున్నాను. నవంబర్ నెల. బయట చల్లగా వుంది. ఊరంతా వెన్నెలతో తడిసిపోతోంది. మధుమాలతి పూల వాసన అలుముకుంది. ‘జీనా యహా మర్నా యహా యిస్కే సివా జానా కహా!?... ’ పాట రేడియోలో దూరం నుంచి వినిపిస్తోంది. పోయి పడుకున్నాను. అన్నీ కలలే! సర్కస్ గురించే...! ∙∙ ఉదయాన్నే లేచి తయారయ్యి నేను, కేశవ, అన్నపూర్ణ.. ముగ్గురం కుప్పుసామి నాయుడు మెడికల్ కాలేజీకి వెళ్ళాం. అక్కడే వరుణ్ కార్డియాలజీలో పీజీ చేస్తున్నాడు. అప్పటికే ఏడాది కోర్స్ అయిపోయింది. అయినా దీనిమీద ఇంటరెస్ట్లేదనీ మానేస్తాననీ రోజూ ఫోన్‌చేసి అమ్మ నాన్నలను యిబ్బంది పెడుతున్నాడు. ఈ విషయం వరుణ్ ఫస్ట్ ఇయర్లో చేరిన దగ్గరనుంచీ నాకు చెపుతూనే వున్నాడు. నేనూ వాడికి నచ్చచెపుతూనే వున్నాను. ‘ఎడ్జస్ట్ అవుతాడు లేరా’ అని కేశవకూ ధైర్యం చెపుతున్నాను. అందరికీ జీవితంలో యిష్టమైన పని దొరకదు! దొరికిన పనిలోనే ఎడ్జస్ట్ కావాలి. చాలామంది యిష్టంలేని పనులే చేస్తూ జీవితంలో చాలా సాధించిన వారున్నారు. నచ్చినవి మెచ్చినవి అందరికీ దొరకవు. దీనికి పెళ్లికూడా మినహాయింపు కాదు. బాపు బొమ్మలాంటి భార్య కావాలని కోరుకోని కుర్రోడు వుంటాడా? సినిమా హీరోలాంటి అబ్బయి కావాలని కోరుకోని అమ్మాయిలు వుంటారా? జీవితంలో చాలా మంది దొరికిన వాటితోనే సర్దుకుపోతారు. జీవితమంటేనే ఎడ్జస్ట్మెంట్. నాకెప్పుడూ ఆత్రేయ రాసిన సినిమా పాట ఒకటి గుర్తుకు వస్తూ వుంటుంది. ‘అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవటమే మనిషి పని’ అంటూ జీవితసత్యాన్ని యెంత సింపుల్‌గా చెప్పాడు మనసు కవి! మొన్న సడెన్‌గా ఫోన్‌చేసి నన్ను అర్జెంట్‌గా కోయంబత్తూర్ రమ్మన్నాడు కేశవ. నేను రైటర్‌నని, కొంచెం ఖాళీ టైమ్ దొరికితే ఊర్లు, కొండలూ, గుట్టలు, అడవులు పట్టుకు తిరుగుతాననీ తనకూ అలా తిరగటం, కవితలు, కథలు రాయటం చాలా యిష్టమనీ చెప్పేవాడు వరుణ్ చిన్నప్పుడు. నవ్వేవాణ్ణి. జీవితంలో సెటిల్ అయ్యాకే నాకున్న ప్యాషన్స్ నెరవేర్చుకుంటున్నానని అతనితో చెప్పా. తన తండ్రికెప్పుడూ యిరవై నాలుగు గంటలూ పేషెంట్లతోనే సరిపోతోందని, పేషంట్స్ వల్ల తనూ ఎప్పుడూ బయటికెళ్లడని, పిల్లల్నీ తీసుకెళ్లడని.. కనీసం సినిమాలక్కూడా తీసుకుపోడని కేశవ మీద ఫిర్యాదు చేసేవాడు వరుణ్. పిల్లలు ఎప్పుడూ.. తల్లిదండ్రులు తమ దగ్గరే వుండాలని కోరుకుంటారు. ఆ వయసుకు అది సహజం. ఆ వయసు పిల్లలకు తల్లిదండ్రుల బరువు బాధ్యతలు తెలియవు. వరుణ్‌కు సాహిత్యం, సంగీతం అంటే యిష్టం. చిన్నప్పుడు తెలుగులో ఆశువుగా కవితలు అల్లేవాడు. కొంచెం పెద్దయ్యి టెన్త్ దాటాక ఇంగ్లిష్‌లో చిన్నచిన్న కవితలు రాసేవాడు. బాగుండేవి. వాడి టాలెంట్‌ని మెచ్చుకునేవాణ్ణి. ‘నేను మీ అంత రైటర్ని కావాలి అంకుల్’ అనేవాడు. ‘రే! కవితలు, సంగీతం కడుపు నింపవు. ముందు కష్టపడి బాగా చదువుకో. మీ డాడీలాగా గుండె డాక్టర్వి అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలి’ అనే వాణ్ణి. వరుణ్ మెడిసిన్ చదివేప్పుడు కాలేజీ మేగజైన్కి ఎడిటర్. ఆ ఏడాది మంచి మేగజైన్ తెచ్చాడు. వాడికి నేనంటే గౌరవం. నేను చెపితే వాడు వింటాడని కేశవ్ ఆశ. అందుకే నన్ను యిక్కడికి రమ్మన్నాడు. ∙∙ మా కోసం కార్డియాలజీ ముందు వెయిట్ చేస్తున్న వరుణ్.. మేం వెళ్లగానే.. మమ్మల్ని కేంటీన్‌కి తీసుకెళ్ళాడు. నలుగురం ఒక కార్నర్ సీట్లో కూర్చున్నాం. అది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ కేంటిన్. టీ టైమ్ కాబట్టి సందడిగా వుంది. ఏం తీసుకుంటారని అడిగాడు మమ్మల్ని. కాఫీ చాలు అన్నాం. మాకు కాఫీలు చెప్పాడు. తను పొంగల్‌కి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. రాత్రి ఎక్కడికెళ్ళారనీ అడిగాడు. జంబో సర్కస్కెళ్ళామని చెపుతూ.. ఆ సర్కస్‌లోని మేనేజర్ కమ్ ట్రపీజ్ ఆర్టిస్ట్ గురించి చెప్పా. తను పదేళ్ల కిందట ఉయ్యాల మీద ఫీట్ చేసేప్పుడు పైనుంచి కింద పడితే ఒకకాలు మొత్తం నుజ్జునుజ్జయి పనికిరాకుండా పోయిందనీ, దాన్ని తీసేసి ఆర్టిఫీషియల్ లెగ్ పెట్టారనీ.. యిప్పుడతను దాంతోనే వున్నాడనీ, ఒక్క కాలితోనే యిప్పటికీ ఉయ్యాల మీద ఫీట్లు చేస్తున్నాడనీ వివరిస్తూ రాత్రి ఎంతగొప్పగా ఫీట్ చేశాడో కూడా చెప్పాను. ‘యీ వయసులో కూడా ఒక్కకాలితో ఉయ్యాల మీద అంత ఎత్తులో ఆ ఫీట్స్ మీకెందుకండీ’ అని మేం అంటే.. అతనేం చెప్పాడో తెల్సా.. యానిమల్ క్రూయెల్టీ యాక్ట్ కింద ట్వంటీ యియర్స్ బ్యాక్ సర్కస్‌లో వైల్డ్ యానిమల్స్‌ని బ్యాన్ చేశారనీ, అప్పటి నుంచి జనం, పిల్లలు సర్కస్‌లకు రావటం బాగా తగ్గిపోయిందనీ, అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మెయింటెనెన్స్, స్టాఫ్ జీతాలు, యానిమల్స్‌కి ఫుడ్, వాళ్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులకూ.. సర్కస్ తప్ప మరేమీ తెలియని తామూ బతకాలంటే సర్కస్ నడవాల్సిందే! అందుకు అక్కడున్నందరూ ఏదో ఒకపని తప్పకుండా చెయ్యాల్సిందే! కాబట్టి ద షో మస్ట్ రన్ అన్నాడు ఎంతో నిబ్బరంగా అని చెబుతూ రాత్రి సెల్ఫోన్లో మేం తీసిన ఫొటోలను చూపించా. ఇంటరెస్ట్‌గా చూశాడు. ‘నాకూ చెపితే మీతో వచ్చేవాణ్ణిగా! సర్కస్ అంటే నాకూ యిష్టమే. చిన్నప్పుడు మా ఊరికి వచ్చిన సర్కస్లన్నీ చూపించేవాడు డాడీ’ అన్నాడు వరుణ్. అతను ఆర్డర్ యిచ్చిన పొంగల్ వచ్చింది. తీసుకున్నాడు. మేం కాఫీలు తాగుతూ.. ‘హార్ట్ స్పెషలిస్ట్ అయితే ఎంతమంది రోగుల ప్రాణాలు కాపాడవచ్చో, హాస్పిటల్ వుంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వుంటుందో నీకు తెలియదా? మీడాడీ హాస్పిటల్ పెట్టాక ఆ చుట్టుపక్కల గుండెజబ్బుల రోగులు ఎంతమంది బతికింది, రోగులకు యిరవైనాలుగు గంటలూ ఎలా సేవ చేస్తున్నదీ నువ్వు చుడాటంలా?’ అన్నాను. నేను చెప్పేది వింటూ రాత్రి సర్కస్‌లో తీసిన ఫొటోలు ఆసక్తిగా చూడసాగాడు. నేను కాఫీ కప్పు పక్కన పెట్టి ‘నువ్వు అలా మొండిగా వుంటే ఎలారా? మేం అరవైలోకొస్తున్నాం. ఓపిక తగ్గాక ఆ హాస్పిటల్ ఎవరు నడుపుతారు?’ అన్నాను కుర్చీలోంచి లేస్తూ. అన్నపూర్ణ, కేశవ మౌనంగా కూర్చున్నారు. వరుణ్ పొంగల్ తినటం అయిపోయింది. వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి ‘అంకుల్ మీరు యింతకు ముందు ఈషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ ఆశ్రమం చూశారా?’ అనడిగాడు. చూడలేదన్నట్టుగా తలలూపాం ముగ్గురం. ‘భలేవారే! ఇంతదూరం వచ్చి ఈషా ఫౌండేషన్ చూడకుండా పోతారా? పదండి పోదాం’ అన్నాడు. నలుగురం జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్ళాం. నల్ల గ్రానైట్‌తో చేసిన శంకరుడి విగ్రహం అద్భుతంగా వుంది. జగ్గీ వాసుదేవ్.. ఆశ్రమంలో లేరు. ఎక్కడో ప్రవచనాలు చెప్పడానికి పోయారంట! అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. కేశవ, అన్నపూర్ణ వూరెళ్ళి పోయారు. ఈవినింగ్ ఫ్లైట్‌కి నేనూ హైద్రాబాద్ వచ్చేశా. ∙∙ నేను వూరొచ్చాక కేశవ నుంచి ఫోన్ లేదు. ఫోన్ చేస్తే డల్‌గా మాట్లాడాడు. మూడురోజుల తర్వాత ఉదయాన్నే జిమ్కెళుతుంటే వరుణ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏం చెబుతాడోనని టెన్షన్‌గా వుంది. ‘రాత్రి జంబో సర్కస్కెళ్ళాను అంకుల్. డోంట్ వర్రీ ద షో విల్ రన్’ అన్నాడు. వాడి మాటలు నా చెవిలో అమృతాన్ని నింపాయి. -డాక్టర్ నక్కా విజయ రామరాజు చదవండి: ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే? -
కథ: అప్పువడ్డది సుమీ...
నాకు కరోనొచ్చి సావు మంచాలకెల్లి లేసొచ్చిన. కరోన కష్టకాలం నుంచి జనమంత బైటికొస్తుండ్రు యిప్పుడిప్పుడే. కరోన రువ్వడి సల్లబడ్డది. మా నలుగురక్కలు నన్ను సూడనీకొచ్చిండ్రు వూరి నుంచి. మా లచ్చక్క, రాజక్క, దుర్గక్క, సమ్మక్కలు సంచులు కిందవెట్టి, పక్కనున్న పంపుకాడ కాళ్లు కడుక్కొని నన్ను సూడంగనే మా పెద్దక్క సమ్మక్క మొకాన కొంగుబెట్టి సోకాలు బెట్టింది నన్ను బట్టుకొని. ‘నువ్వు డిల్లీకుల్లిగడ్డ సెల్లో... ఓ సెల్లా గిది వూరన్నగాకపాయె సెల్లో... ఓ సెల్లా... గిది వాడన్నగాకపాయె సెల్లో... ఓ సెల్లా... మేమే తొవ్వకద్దుము సెల్లో... ఓ సెల్లా... మాకు గావురాల సెల్లెవు సెల్లో... ఓ సెల్లా మా సిన్నా సెల్లెవూ సెల్లో... ఓ సెల్లా... గీ కరోన గాలిపోవు సెల్లో... ఓ సెల్లా... నీకెట్లా అచ్చే సెల్లో.. ఓ సెల్లా’ గిట్లా వల్లిచ్చుకుంట ఏడిస్తే... దుక్కమ్ రానోల్లగ్గూడ దుక్కమెగదన్నుతది. మా అక్కలందరు కండ్లు దారలు గట్టంగ ఎక్కెక్కిపడి ఏడుస్తుండ్రు. నేంగూడ నా దుక్కాన్ని కలుపుకున్న. మల్లా సదుమాయించుకొని.. ‘అరే పెద్దక్కా ఏడువకే నాకేమైంది? మంచిగనే వున్న’ అని ఆమెతోని అందరక్కల్ని వూకించిన. శోకాలు బెట్టిన పెద్దక్కను కుర్సిల కూసోబెట్టి నీల్లు తాగిపిచ్చి మొకమంత కొంగుతోని తూడ్సిన. అందరక్కలు నీల్లు తాగి నిమ్మలమైండ్రు. నా కాళ్లు సేతులు ఒత్తి సూసి మా లచ్చక్క ‘ఏంది సెల్లె గింత మెత్తగైనవు? కండ్లు, పండ్లెల్లి మనిషంత బొక్క బొక్కయినవు’ అన్నది. ‘గీ కరోన పాడువడ పల్లెలల్ల దాని రువ్వడి సూపియ్యలే’అన్నది దుర్గక్క. ‘దాని రువ్వడంత పట్నాల మీన్నే సూపిచ్చింది’ అన్నది రాజక్క. తర్వాత వూరి ముచ్చట్లు, సుట్టాల ముచ్చట్లు మాట్లాడుకుంట అన్నం కూర వండుకొని తిని సాపలేసుకొని గోడకొరిగి పుర్సత్గ కూసున్నము. మేము ఆరుగురక్క సెల్లెండ్లము. ఒక అక్క సచ్చిపోతే అయిదుగురం మిగిలినం. మా నలుగురక్కలకు పదేండ్ల లోపల్నే పెండ్లయింది.. ఎవ్వరు సదువుకొలే. సిన్న బిడ్డెనని నన్ను సదువుకు తోలిండ్రు మా తల్లిదండ్రులు. వాల్లను మా వూరు పక్క పక్కన పల్లెలకే యిచ్చి పెండ్లిజేసిండ్రు. నేనే సదువు, ఉద్యోగంతోటి దూరంగ హైద్రాబాదొచ్చిన. మా వూరికి ఎప్పుడోసారి బొయొస్త. కాని మా అక్కలు పక్క పక్కనే వున్నమని వూకూకె మంచికి సెడ్డకు, పండుగ పబ్బాలకు, కలుపుకోతల పనులకు కూలిగ్గూడ మా వూరికి పోతుంటరు. అట్లా వాల్లకు వూరందరితోని మంచి మాటుంటది. వూల్లె జరిగిన సంగతులన్ని ప్రత్యక్షంగనో, పరోక్షంగనో తెలుస్తుంటయి. కరోన లాక్డౌన్లతోని నేను రెండేండ్లాయె వూరి మొకం జూడక. మా వూరి నుంచి ఎవరొచ్చినా నాకు దెల్సిన వూరోల్ల గురించి పేరుపేరున అడుగుత. యిగ మా అక్కలైతే నా కండ్ల ముందు జరిగినట్లు సినిమా ఏసి సెప్తరు. ఎవరెవరు ఎట్లా బాగుపడ్డది ఎట్లా నష్టపోయింది, సావులు, బత్కులు, పుట్టుకలు, పంచాదులు సెడావులు, బూముల సంగతులు, గొడ్డు గోదా, పంట ఫలం, కుక్క నక్కల కాన్నుంచి సెట్టు సేమల దాకా సెప్తరు మా అక్కలు. మా రాజక్క చెప్తే నాకు సమ్మంగుంటది. మా రాజక్క ముచ్చట చెప్పితే... మూతి మూరెడు సాగదీసి యింటరు ఎవరైనా. ‘అక్కా... గా బూడిది దురుగవ్వ బాగున్నదా, గప్పుడెప్పుడో పాంగరిసిందన్నరు, గిప్పుడెట్లున్నది?’ ‘ఆ... మంచిగనే వున్నది.’ ‘గా వూరుగొండ సమ్మన్న ఎట్లున్నడక్కా...’ ‘ఆడా..? ఆనికేమైంది సెల్లె, సింతపిక్కె వున్నట్టున్నడు. ఆడు మన పెద్దన్న తోటోడట. ముగ్గురు పెండ్లాలను సేస్కున్నా ఎవ్వతి సంసారం జెయ్యకపాయె. గిప్పుడొక్కడే అండ్క తింటండు.’ ‘ఏందింటడోనే! గంత గట్టిగున్నడు సాకి బండున్నట్టు’ మా లచ్చక్క. ‘ఏందింటడు, కూట్లెకు వుప్పులేనోడు ఏందింటడు. గీల్ల సంగతేమోగని సెల్లే... నీకో ముచ్చట సెప్పాలె. మన వూల్లె ఆరోల్ల పూలక్క యెరికే గదా. గామె సావు ఏ పగోనికి రావద్దు. ఏం బత్కు, ఏం సావు. పుట్టి బుద్దెరిగినకాన్నుంచి గసోంటి సావు జూల్లే...’ ‘అవు, వొయిసుల యెట్లుండె. ఆగిందా!’ అన్నది సమ్మక్క. ‘ఏ... నన్ను సెప్పనీయుండ్రి, మద్దెల రాకుండ్రి. నేనప్పుడు వూల్లెనే వున్న. ఆరోల్ల పూలక్క సచ్చిపోయినప్పుడు మీరెవ్వల్లేరు వూల్లె. నన్ను సెప్పనియ్యుండ్రి’ అని మల్లా సెప్పుడు మొదలుబెట్టింది రాజక్క. ‘ఆరోల్ల పూలమ్మంటె ఎంత సక్కదనంగుండె. మెడనిండ సొమ్ములు, సెవునిండ సొమ్ములు బెట్టుకొని అంచు సీరె గోసిబెట్టి, కాళ్లకు పట్టగొలుసులు దానిమీద కడెమ్, ఆ కడెమ్ మీద తోడాలు గీటినే కాళ్లకు మూడు తెగలంటరు పల్లెల. గట్ల కాల్లకు మూడు తెగలు బెట్టుకొని గల్లర గల్లర నడ్సుకుంట పోతాంటే... నిల్సుండి సూసేది ఆడోల్లు, మొగోల్లు. గసోంటి పూలక్కకు పెండ్లిజేస్తె ఏమైందో ఏమో యిడుపు కాయితాలయి తల్లిగారింటి కాన్నే వుండే. అన్నదమ్ములు లేరు, నఅక్కసెల్లెండ్లు లేరు. ఒక్కతే పుట్టింది వొన్నలక్కోలె. ఆల్లకు యిల్లు, బూములు జాగలు గూడ మంచిగనే వున్నయి. గవ్వి కౌలుకిచ్చి తల్లిబిడ్డలు యే లోటు లేకుంట మంచిగనే బత్కిండ్రు. అయితే సెల్లే... గామె రూపురేకలు సూడలేక వూరు గాడ్దులు కుక్కలు బడ్డట్టు ఆమెన్క బడేది. తల్లి గూడ ఆ మద్దె సచ్చిపొయింది. వొక్కతే వుండేది. మనోల్లు కనవడితె దూరముండుండ్రి, దూరముండుండ్రి... అని దూరం గొట్టినా, మాటయితె మంచిగనే మాట్లాడేది. గసోంటామెకు ఏందో ఎయిడ్స్ బీమారట. ఏ మందులకు, మాకులకు తిరుగని రోగమట సెల్లే... ఔగోలిచ్చింది. పెట్టెడు పెట్టెడు సూదులు మందులు వాడినా తగ్గలే. ఎయిడ్స్ రోగమని తెలువంగనే యెప్పటికి మంది వుండే ఆమె యింటికి ఒక్క పురుగు గూడ పోవుడు బందైంది. ఆ బీమారి వూరికి గూడ అంటుతదని యిండ్లకు తాళమేసి పొయిండ్రు ఆమె యింటి పక్కలోల్లు, యెన్క పక్కలోల్లు. ఆమెతోని సుకపడ్డోల్లు ఆయిపడ్డోల్లు, ఆమె సొమ్ముదిన్నోల్లు, ఆమె సుట్టు దిరిగిన వూరోల్లంత ఆమెకు మొండి జబ్బని తెల్సి ఆమె అంటుకు బోవుడు సొంటుకు బోవుడు పురంగ బందువెట్టిండ్రు. గియన్ని గామెను ఎయిడ్స్ జబ్బుకన్న బగ్గ కుంగగొట్టినయి. ఆ జబ్బు పాడువడ బగ్గ తిరగబెట్టింది. ఆమె దాపున నీల్లిచ్చే దిక్కులేదు, నిలవడే దిక్కులేదు. మన అంబేద్కరు యూత్ పోరగాండ్లే అప్పుడో యిప్పుడో పొయి మందులు, గోలీలు, సరుకు సౌదలు పందిట్ల బెట్టొచ్చేటోల్లు ఛీ ఆమెకు అంటు ముట్టు బాగ పట్టింపు. గట్ల మంచంబట్టిన మనిషి యెన్నడు సచ్చిపొయిందో ఏమో యింట్లకెల్లి వాసనత్తే తెలిసింది. దూరమున్న రొండిరడ్లోల్లు దప్ప అందరు వూరోల్లంత తాలాలేసి యెల్లిపోయిండ్రు. గీ బీమార్ రాకముందు పూలక్క యింటికి సాకలోల్లు బట్టల కోసం బొయేది. బైట వూడ్సి సల్లనీకి మాదిగోల్లు బొయొచ్చేది. పూలక్క ఔసలి వెంకటయ్య యింటికి వూకె బొయేది. ఈ నగ, ఆ నగ, ఆ డిజైన్, ఈ డిజేన్ గిట్ల సేపిచ్చుకునేది. యిగబోతే సాలోల్లు తీరు, తీరు సీరెలు దెచ్చేది. గంగసరం సీరెలు, రాంబానం సీరెలు ఎయ్యి కొత్తగెల్లుతె అయి తీస్కపొయేది పూలక్క యింటికి. ఎప్పుడన్న దేవునికి జేసుకుంటె గౌండ్ల సారన్నోల్లు కల్లు దీస్కపొయేది. యిగ ఆమె తల సమరు బెట్టిచ్చుకునేదానికి మంగలి కొమ్రమ్మను పిల్సుకునేది. కాలునొచ్చినా, సెయినొచ్చినా కొమ్రమ్మే పూలక్కకు వైదిగం జేసేది. యిగ బైటి పైనం బోవాలంటె ఆటో దెప్పిచ్చుకొని పోయేది. పూలక్కకు ఎయిడ్స్ రోగమొచ్చిందని తెలువంగనే అందరు బందైండ్రు, వొక్క మాదిగోల్ల లసుమక్కదప్ప. లసుమక్క పూలక్క ఇంటి బైట వూడ్సి సల్లుడు బందు వెట్టలే. ఆల్లీల్లు ‘లసుమక్కా ఎందుకు బోతవు పిల్లల తల్లివి. నీకా బీమారంటితె ఎట్లా? బందువెట్టు’ అంటే... ‘అందరు బందయితెట్ల? పాపం! దిక్కులేని ఆడామె. రాణిలెక్కన బత్కిన మనిషి, గిప్పుడు గీ గతాయె. యెన్కనో ముందట్నో అందరం బొయేటోల్లమే’ అని అప్పుడప్పుడు పూలక్క యింటి ముందట వూడ్సి సల్లి పొయేది లసుమక్క. అయితే ఓనాడు ఆ పూలక్క యింట్ల నుంచి వాసనచ్చేటాలకు ఉపసర్పంచి, ఒకరిద్దరు వూరి పెద్దమనుసులు మన వాడకచ్చిండ్రు. ‘ఆరోల్ల పూలమ్మ సచ్చిపొయింది. మీరే వొచ్చి అర్జెంటుగ తీసెయ్యాలె మైసా’ అని పెద్దతనమున్న మన మైసు నాయినకు సెప్పిండ్రు. యిగ మన మైసు నాయిన యూత్ పోరగాండ్లను పిల్సి సెప్పిండు వూరు పెద్ద మనుసులు వచ్చిన సంగతి. ‘పెద్దయ్యా యిప్పుడు ఎవలింట్ల పశువు సచ్చినా వాల్లే పారేసుకోవాలె అనుకున్నమా, అయినా మనోల్లల్ల మెల్లగ ఎవలో తెల్వకుంట గా పనిని సేత్తనే వున్నరు. యిప్పుడు సచ్చిపొయినామె పశువుగాదు తీసేయనీకి. ఆమె మనల ఏందిరా, ఏందే అని మాట్లాడినా, దూరంగొట్టినా ఆమింటికి మన లసుమవ్వ పొయి వూడ్సి సల్ల బోయింది మానవత్వంతోని. యిప్పుడు వాళ్ళు మనిషి సచ్చిపొయిందని మమ్ముల తీసేయమంటుండ్రు గొడ్డును తీసేయమన్నట్లు. సచ్చిపోయినామె మనిషి. ఆమెకు మంచిగ సావు జెయ్యమని సెప్పు వాళ్ళ సూదరి కులపామే గదా! మన దగ్గెరికొచ్చి గట్లా తీసేయ మనుడేమ్మానవత్వమే? అసలు మనమే ఎందుకు తీసెయ్యాలె, ఏందీ శాపాలు మనకు?’ బాదగన్నడు యూత్ లీడర్ రాజేష్. ఇంతల ఆ పెద్ద మనుషులు మన పొరగాల్లతోని ‘ఆ పూలమ్మ మంచిగ సత్తే... వూల్లె సూదరోల్లము మేమే సేద్దుము. కానామె డేంజర్ రోగంతోని సచ్చిపొయింది. సర్పంచి పత్తకు లేడు. వూరోల్లు చానమంది తలుపులు తాళాలు బెట్టుకొని ఎటో పొయిండ్రు భయపడి. వూల్లె అందరు అదురు బిత్తులోల్లు అగుపడ్తలేరు. గిసోంటి పనులు మా కంటె అలువాటు లేదు. మీకలువాటే గదా! జెర వూరును కాపాడుండ్రి బిడ్డా’ అన్నడు వూరిపెద్ద బతిలాడినట్లు. ‘గిసోంటి సావులు జేస్తే మీకు దేవలోకం దొర్కుతది’ అన్నడు. ‘మీరు గూడ అలువాటు జేసుకొండ్రి. గా దేవలకమేందో మీరే పొందుకోవచ్చు గద సావుజేసి’ ఓ యూత్ పిలగాడు అందుకున్నడు. సూదరోల్ల యూత్ పిలగాండ్లు వూల్లే శాన తక్కువ మంది కనబడ్తరు. సదువులకు, కొలువులకు సిటీలల్ల వున్నరు. ఈ యూత్ పిల్లలే పది, పన్నెండుకాన్నె ఆగి పోయుంటరు. కొద్దిమంది అంబేద్కర్ సంగాలు బెట్టిండ్రు. కొద్దిమంది రాజకీయ పార్టీలల్ల తిరుగుతుండ్రు. కొంతమంది సుతారి పనికి, రంగులేసే పనులకు బొయొస్తుంటరు. వూర్ల కంటె వాడల యూత్ పిలగాండ్లు బాగ కనబడ్తరు. యిగ యీ పూలక్క సచ్చిపోయిందంటే... మొత్తమే యెల్లిపోయిండ్రు వూర్ల మనుషులు. ‘వూరి నుంచి పెద్ద మనుషులొచ్చిండ్రని గూడెమ్ యూత్ పోరగాండ్లు బాగనే కూడిండ్రు. బతికున్నపుడు మమ్ముల అంటుకోరు ముట్టుకోరు. సచ్చిపొయినంక ముట్టుకుంటె అంటుగాదా? గా ఎయిడ్స్ పీనుగను ముట్టుకుంటే... బొందకాడికి మోస్కపోతే... ఆ జబ్బు మాకంటదా? మేం జావమా? మీరంత మంచిగ సల్లగుండాలె. మేం జావాలె. మావోల్లు గిట్ల సత్తే... మానవత్వంగ వూరు మనుషులు మాకు సావుజేత్తరా! వూల్లె ఎవ్వల్లేనట్లు గొడ్డు సచ్చినా, గోదసచ్చినా మా గూడెమ్కే ఎందుకొస్తరు? మీక్కాల్లు లేవా, సేతుల్లేవా? మీరు, మేము తల్లి కడుపుల్నుంచి వచ్చినోల్లమే గదా! మీకో రివాజు, మాకో రివాజా యేందిది? ఏందీ శాపము’ అని యూత్ పిలగాండ్లు నపరో తీరుగ మాట్లాడిండ్రు. ఆ గుంపుల మన ఎల్లు పెద్దవ్వ ఇంక మన ఆడోల్లు గూడున్నరు. ఏదన్నా, ఏమన్నా వూరి పెద్దమనుషులు నొట్లే నాలికె లేకుంటనే వున్నరు. దండాలు పెట్టుకుంట ‘మీరులేని వూరున్నాదిరా బిడ్డా! దర్మాత్ములు, వూరు మీకు ఋణపడి వుంటది’ అని గోసారిండ్రు. యూత్ పిలగాండ్ల మాటలు యిని, ‘అరే పోరగాండ్లు గయన్ని నివద్దే. మీరన్నదాంట్లె ఏమి తప్పులేదు. సూదరిబిడ్డె, దిక్కులేని పచ్చి, వూరంత తాళాలేసుకొని పొయిండ్రు. వూల్లె ఏ ఆపతొచ్చిన మనమేనాయె. ఏంజేత్తమ్. వూరి పెద్దమనుషులు పబ్బతి బడ్తండ్రు. ఓ... యింతకన్నెక్కువ పురుగులు, గుట్టంత ఆసిన కోమటీరయ్యను యేడికాడికి తోల్లు వూడిపోతాంటె పురుగులు లుక్కలుక్క పార్తాంటె ముక్కులు పలిగిపోయే వాసనల బొందవెట్టి రాలేదారా! పాపం, కోంటీరయ్యకు పిల్లల్లేరు, జెల్లల్లేరు. గిట్లనే సచ్చిపోతే మన పోరగాండ్లే సావుజేసిండ్రు గద’ అని, ‘కోంటీరయ్య బతికున్నపుడు వూల్లె పావుల పైసలది రూపాయికి అమ్మి యేంగొంచబొయిండు? సత్తె బొందవెట్ట దిక్కులేకుంటె మనోల్లే యెత్కపొయిండ్రు యేంబాకో, ఏం ఋడమోరా బిడ్డా! బతికున్నపుడు మన నీడ గూడ తాకనియ్యరు. మనల్ని మన్సులోలె గూడ సూడరు. గానీ గీల్లు యెత్తువడి సత్తె, వాసనబడి సత్తె మన సేతులకెల్లి సావు జెయ్యాలె. యిసోంటియి గిట్లా శాననే జేసినంరా బిడ్డా! అయినా మనం గిట్లనే వున్నము. కోంటీరయ్యకు పురుగులు మండెలుంటే బరాయించుకొని సావు సెయ్యలేదా! సేసినందుకు ఏమిత్తరు యెట్టిసేత’ అని సమజు జేసింది ఎల్లవ్వ యూత్ పిలగాండ్లను. ‘సరె ఎల్లవ్వా యెవల పాపం వాల్లకే. ఎవ్వలు లేనామే, యిసోంటియి యెన్ని సావులు జేసిండ్రు మనోల్లు. సావు జేత్తె సత్తమా, సత్తె సత్తిమి తియ్’ అని రాజేషు గిట్ల పది మంది దాకా పోనీకి తయారైతూ ‘చత్ మనకే ఎందుకురా గీ బరువు, గీ దర్మము?’ అని గునుక్కుంట బైలు దేరిండ్రు. ‘అరే పొరగాండ్లు... గిట్లనేనా పోయేది పాత సినిగిన బట్టలేసుకొని తల్కాయకు ముక్కులకు గుడ్డలు జమాయించి కట్టుకొని పోండ్రి. పీనుగను బొందబెట్టినంక యేస్కున్న బట్టలన్ని గుంటదీసి తల్గవెట్టి ఆ గుంట కూడిపి, సెర్ల తానం జేసిరాండ్రి. యిదివరకు గిట్ల జెయ్యక యిండ్లల్లకొచ్చి వారం పది రోజులు జెరాలొచ్చి పన్నెరు’ అని ఎల్లవ్వ సెప్పంగనే అట్లనే బందవస్తుగ పొయిండ్రు వూల్లెకు. సగమూల్లెకు పోంగనే ముక్కులు పలిగే వాసన యిసిరిసిరి కొడ్తంది. వూరి పెద్దమనుషుల్ని నాలుగు సాపలు దేండ్రి పీనుగును సుట్టి యెడ్ల బండ్లేసి తీస్కపోతమని చెప్తే... యిద్దరెడ్లబండి తయారుజేసిండ్రు, యిద్దరు ముగ్గురు సాపలుదెచ్చి లోపటికి పోనీకి వశంగాకుంటే... బైటకురికొచ్చిండ్రు సాపలాడపారేసి. ‘గుడంబ తాగితేనే ఆ వాసన తెల్వది, పార తమ్మి’ అని కర్రె మల్లన్న యెగేసి తీస్కపొయిండు. కొద్దిమంది అంబేద్కర్ యూత్ పోరగాండ్లకు తాగుడలువాటు లేకుంటే... ‘అరే తమ్మి గిసోంటి పనులు జేసేకాడ ఒళ్లు తెలువకుంట తాగితేనేగాని సెయ్యలేమురా’ అని సమజుజేసిండు. నలుగురు బొంద దవ్వబొయిండ్రు. ఎప్పుడు తవ్వేంత తవ్వుతాంటె... ‘ఎయిడ్స్ బీమారి మనిషి గదా! డబల్ దవ్వాలట. లేకుంటె వూరికి, వాడకి డేంజరని చెప్పిండు మన పెద్ద మాదిగ’ అని తవ్వి బొందకాడ యిద్దరు కావలున్నరు. బొంద తవ్వినంక పీనుగొచ్చేదాక కావలుండాలె, తవ్వి యిడ్సిపెట్టి రావొద్దు అనంటరు మనోల్లు. ఎక్కన్నయినా బూమి వున్నోల్లను ఆల్ల బూమిల్నే బొందవెడ్తరు. లేనోల్లను సెరువుకుంట్ల వెడ్తరు. పూలక్కను ఆమె సెల్కల్నే బొందదవ్విండ్రు. బండ్లె పూలక్క పీనుగొచ్చేటప్పుడు గూడెం అంతా బైటికొచ్చి సూసినం. బతికున్నపుడు ఆమె యెట్లుండె అని బాగా యాజ్జేసుకొని కొద్దిమందిమి ఏడ్సినం. దిక్కుమొక్కులేని సావాయెనని దుక్కపడ్డం. కొందరాడోల్లము ఏదయితె అదయితదని బొందదాక పొయినం. బండి మీద తీస్కచ్చిన పీనుగను పైలంగ బొందలబెట్టి మట్టేసుకుంటా... ‘పూలవ్వా ఏమి సావునీది. బత్కి వున్నపుడు ఆమెడ తరిమితివి, దూరంగొడితివి. గిప్పుడు గాల్లే నిన్ను మోసి, సావు జేత్తండ్రు. నీ బొందల మట్టేత్తండ్రు. నీ ఆత్మ ఎంతేడుస్తందో! నీ వూరోల్లొక్కరు రాకపాయె. గీల్ల సావులు మన సావులకత్తన్నయి. గీల్లు మనకు తరాల తంతెల కాన్నుంచి బడ్డ రునము, బాకి.. యెన్నడు దీరుస్తరో!’ అనుకుంట వేదనపడి బొంద మొత్తం కూడిపి యేస్కున్న బట్టల్ని తలుగబెట్టి సెర్ల తానం జేసి సావుజేసినోల్లందరు యింటిమొకం బట్టిండ్రు. పాపం! శాన రోజులు యీ సావుజేసినోల్లు బువ్వతినక పొయిండ్రు. ఎంతయినా మనయి ఆర్తిగల్ల పుట్కలే. గీ మన ఆడోల్లు దొరోనితోని తన్నులవడ్డా – యిగ్గులవడ్డా... ఆడు సచ్చిపోతె ఇంకా మన ఆడోల్లు బొయి యేడ్సి అత్తరు’ ‘అర్లికల్ల దర్మంగల్లోల్లు మరి’ అని అందరం నారాజైనం. - జూపాక సుభద్ర -
కథ: ఔను.. అందరి దైవం అమ్మే!
‘మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఇబ్బందేమీ లేదు’ ఆ రోజు రాత్రి పక్కమీద చేరాక వేదవ్యాస్ రమణితో చెప్పిన మొదటి మాట.. ‘మీక్కాదు.. నాకు ఇబ్బంది. మా అమ్మ క్షణక్షణం తినేస్తోంది. మడి తడి అంటోంది. చెప్పిందే పదిసార్లు చెబుతోంది..’ అంది రమణి విసుగ్గా. ‘వయసు మీద పడింది కదా! ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు. ముసలైనాక నీకూ వస్తుందిలే!’ అన్న భర్త మాటకు అడ్డుపడుతూ.. ‘ఐనా మా తరం మరీ అంతలా బుర్ర తినేయం లెండి’ జవాబిచ్చింది రమణి. ‘వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి. ఉడిగాక మన కళ్ళముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా కనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం’ మళ్ళీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్. వారిద్దరి నడుమ సాగిన చర్చకు అసలు కారణం రమణి తల్లి.. నాగమ్మ! ఆమె భర్త నాంచారయ్య పదిహేనేళ్ళ క్రితం తనువు చాలించాడు. రమణికి ఒక్క అన్నదమ్ముడు వెంకటాచలం. అతగాడు ఒక్కోసారి తీసుకెళ్లి మూడునెలలపాటు ఉంచుకుని దిగబెట్టేస్తాడు. మిగతా తొమ్మిది నెలలు రమణే భరిస్తుంది. వేదవ్యాస్, రమణి దంపతులకు ఒక పాప సంహిత, బాబు రక్షిత్. కొంతకాలం రమణి ఒక చోట చిన్న ఉద్యోగం చేసింది. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్లకి ఏ లోటూ రాకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మే సంరక్షణ చేసింది. వేదవ్యాస్‌కి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వలన అసలు తీరికుండేది కాదు. ఐనప్పటికీ వంటవార్పులలో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది. అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్‌కి పోయి అన్నీ కొనుక్కొచ్చేది. ఇంత చేసినా తల్లి అంటే భార్య రమణికి ఈమధ్య కాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కాలేదు వేదవ్యాస్‌కి. ఒకరోజు బైటకెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్ లేకపోవడం చూసిన నాగమ్మ ‘అమ్మా! ఎక్కడైనా మరచిపోలేదు కదా? నీకు మతిమరపు మరీ ఎక్కువౌతోంది’ అని చీవాట్లేసింది. ‘అయ్యో! నువ్వలా తినీకు.. చెప్పులు విప్పుతూ బైట బల్లమీద మరచిపోయానమ్మా!’ అంది పళ్ళు నూరుతూ. ‘అందులో నీ ఆధార్ కార్డ్, లైసెన్స్, ఏటీఎమ్ కార్డ్ ఉంటాయి కదాని జాగ్రత్త చెప్పానంతే’ అంది బాధగా నాగమ్మ. ‘నువ్వు చెబితే కాని నాకు తెలీదా? ప్రతిదానికీ రియాక్ట్ ఐపోతున్నావ్?’ చిరాగ్గానే అన్నది రమణి. విషయం తెలుసుకుని వేదవ్యాస్ ‘చెబితే తప్పేముంది రమణీ! నీ అజాగ్రత్తకి చెప్పిందామె! వినటం నీ ధర్మం’ అన్నాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం, ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే! తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది. వీలైనప్పుడు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండకత్తెరలాగే తోస్తోంది. అందుకనే వెంకటాచలాన్ని రెండుమూడుసార్లు అభ్యర్థించింది ‘తమ్ముడూ! అమ్మని నువ్వు ఆరునెలల కాలం ఉంచుకోవచ్చుకదా! నీక్కావలిస్తే నేను డబ్బు పంపిస్తూంటాను’అని. ఐనా అతను అందుకు ఒప్పుకోలేదు. ‘నా దగ్గర ఉంటే మా ఆవిడకీ అమ్మకీ ఉప్పు..నిప్పులా ఉంటోంది. సమర్థించడం నా వల్ల కావడం లేదు. అదేదో నువ్వే చూసుకో. కేవలం మూడు నెలలే భరిస్తాను’ అని నిక్కచ్చిగా చెప్పేశాడు. తదాదిగా తల్లి బాధ్యత రమణిదే అయింది. ‘నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసుర్లు అనవసరం. ఎలాగోలా సర్దుకుని ఉండాలి. ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బందైతే ఒక పనిమనిషిని పెట్టుకో’అనేవాడు వేదవ్యాస్. అప్పుడే కుదిరింది పనిమనిషిగా సుబ్బులు. ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది. ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మనసు గింజుకోవడం లేదు. ఐతే పనిమనిషి సుబ్బులు కొద్దిగా వాగుడుకాయ. తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది. ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది. ‘సూడమ్మా! మనకు పెద్దోల్లు ఏవేవో సెబుతుంటారు. ఆట్ని మనం పెడసెవిన పెడుతుంటాం గానీ ఆటిలో ఎంత సారముంటాది? ఉన్నన్నాల్లు తెలీదమ్మా పెద్దోల్ల యిలువ! పెతి పనికీ అడ్డు తగులుతున్నట్లుంటాది గానీ, అది మనకే మంచిదమ్మా!’ అంటూ. ఇప్పుడింత అధాటుగా తనకు ఉద్బోధ చేస్తోందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణికి. ఒకవేళ తను లేని సమయంలో తల్లి.. పనిమనిషికి గత సంగతులన్నీ పూసగుచ్చలేదు కదా? లేకపోతే ఈ అప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తోంది? తన వైఖరిగాని పసిగట్టలేదు కదా? అలాగైతే చులకన అయిపోమూ? ‘అమ్మా! నువ్వు ఆ పనిమనిషి సుబ్బులుతో అన్ని విషయాలు వాగుతున్నావా? ఇరుగుపొరుగుకి అన్నీ చేరవేస్తుంది’ అంటూ ఒకరోజున హెచ్చరించింది రమణి. ‘నేనెందుకు చెబుతానమ్మా! దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తూంటాను. అంతేగానీ మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా?’అని కొట్టి పారేసింది నాగమ్మ. సుబ్బులుతో పెద్దగా మాట్లాడ్డమూ మానేసింది. అది పసిగట్టిన సుబ్బులు ‘ఏటమ్మా! ఏటైనాది? బంగారంనాటి మాటల్సెప్పేవోరు.. ఇప్పుడేటైనాదని నోరు మూసేసుకున్నారు? మీతో మాటాడితే మాయమ్మతో మాటాడినట్టుంటాది. మా అమ్మంటే ఎంతిట్టమో నాకు’అని నాగమ్మ వైపు దృష్టిసారిస్తూ చెప్పింది. ‘ఐనా ఆవిడతో నీకేమిటే మాటలు? నీ కష్టాలేమైనా ఆవిడ తీర్చగలదా? ఎందుకు లేనిపోని పోచుకోలు కబుర్లు?’ సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి. ‘వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు? మీ అమ్మంటే సుబ్బులుకిష్టం కాబోలు’ ఎప్పుడైనా అక్కడ ఉంటే ఒక మాటగా అనేవాడు వేదవ్యాస్. అది సహించలేకపోయేది రమణి. ఇలా ఉండగానే ఒకరోజున అధాటుగా దిగాడు వెంకటాచలం..‘అక్కా! అమ్మను నాతో తీసుకెళ్లడానికొచ్చాను. కొంతకాలం నా దగ్గర ఉంచుకొని పంపిస్తానులే! నీకూ కొంత హాయిగా ఉంటుంది’ అంటూ. ‘అదేంటి మొన్ననేగా నా దగ్గర దిగబెట్టావు. ఏమైందిట?’ అలా అన్నదేగాని తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరకు పంపడం రమణికి సంబరంగానే ఉంది. ‘అబ్బే!ఏం లేదులే! మామూలే! పిల్లలు తలుస్తున్నారు’ అన్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడ్కొని. ‘చాలా ఆశ్చర్యంగా ఉందే? మూడు నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా? ఇంత హఠాత్తుగా తీసుకెళ్లాడేమిటి మీ తమ్ముడు?’ అన్నాడు వేదవ్యాస్ సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక. ‘వెళ్ళనిద్దురూ! హాయిగా ఉంటుంది ప్రాణానికి’ అంటూ నిట్టూర్చింది రమణి. ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమాక గమనించి ‘అదేటమ్మగోరూ! అమ్మ కనబడ్నేదేటి?’ అన్నది విస్తుబోతూ. ‘మా తమ్ముడు తీసుకెళ్ళాడు’ ముక్తసరిగా చెప్పింది రమణి. ‘అదేటోనమ్మా! మీకెలాగుంటదో గానీ మాయమ్మ ఒక్క సెనం నాకాడ లేకపోతే నాకుండబట్టదు. ఒల్లమాలిన పేమ. నన్నొగ్గదు కూడా. దాని యిసయంలోనే మా అన్నకీ నాకూ గొడవలు. దాన్ని ఆల్ల ఇంటికి తీసుకుపోతానంటాడు.. అది నాకు సిర్రెత్తిపోద్ది’ అంటూంటే మనసులో నవ్వుకుంది రమణి. పిచ్చిదానిలా ఉంది. తనకే రోజు గడవడం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది. మరి తల్లి బాధ్యత పడడం అంత ఇష్టంగా చెప్పుకుంటోందేమిటి? అనుకుంటూ. సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరకు చేరి ‘అమ్మా! అమ్మమ్మ ఏదమ్మా? కనబడటం లేదు?’ ప్రశ్నించారు. ‘మీ మామయ్య తీసుకెళ్ళాడు. ఎంతసేపూ మీకు అమ్మమ్మ ధ్యాసేనా? హోమ్‌వర్క్ చేసుకుని పడుండలేరా?’ కసురుకుంది రమణి. ‘అమ్మమ్మ ఐతే ఎంచక్కా కథలు చెబుతుంది. మంచి మంచి పాటలు పాడుతుంది. సామెతలు చెబుతుంది. పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది’ ఆమెలేని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు. పిల్లలిద్దరికీ తన తల్లి మీదే మక్కువ ఎక్కువగా ఉంది. కొంతకాలానికి తననే మరచిపోయేట్లున్నారు. ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమౌతుంది. అందువల్ల కూడా తల్లిని తైనాతూ ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తోంది రమణికి. ఒక రెండురోజుల తరువాత ఆఫీసు నుంచి వస్తూనే వేదవ్యాస్ ‘మీ తమ్ముడు మహాఘటికుడు. అమ్మపైన అధాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే! అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్లిందట! పనిమనిషి కూడా మానేసి చాలాకాలమైందట. అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడట. వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే! అతడి వలన ఈ భోగట్టా అంతా తెలిసొచ్చింది’ చెప్పాడు. ‘అక్కడెలా ఏడ్చినా నాకనవసరం. వాడు తీసుకెళ్తానన్నాడు అంతే! అంతకు మించి నేనాలోచించలేదు. మళ్ళీ కొంతకాలమైనాక ఎలాగూ తప్పదు కదా? ఆవిడగారి రాక!’ నిమిత్తమాత్రంగా అన్నది రమణి. ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్‌కి. ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలీదు. తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్. తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాకటం తనకిప్పటికీ జ్ఞాపకమే! తన ఇద్దరు అక్కచెల్లెళ్ల పెళ్ళి తనొక్కతేధైర్యంగా నిలబడి చేసింది. తనను కూడా ఇంటి వాడిని చేసింది ఆమే! తల్లి బతికున్నంత కాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే! ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమే ముందుండేది. తన భర్త పింఛను కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది. కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది. ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలచుకుంటే కళవళపడుతుంది మనసు. మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు బావురుమన్నది. ‘ఏం జరిగింది? అంతలా ఏడుస్తున్నావ్?’ అడిగింది రమణి. ‘సెబుతున్నా పెడసెవినెట్టి మాయమ్మను ఆల్ల యింటికి లాక్కెల్లిపోయాడు. నలుగురినీ పంచాయతి ఎట్టయినా నాకాడికి తెచ్చుకుంటా. ఎదవ సచ్చినాడు. దాన్సేత ఏ ఎట్టిసాకిరి సేయిత్తాడోనని గుండె గుబేల్మంటోంది. అసలే దానికి అలికెక్కువ (ఆయాసం). డాకటేరు కాడిక్కూడా సూపించడు. ముదనట్టపోడు’ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మెటికలు విరిచింది సుబ్బులు. ‘నువ్వెందుకలా గింజుకుపోతున్నావో నాకు అర్థంకావడం లేదు. ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ! మీ అన్న దగ్గరే కదా ఉంది. పోషణంతా అతగాడే చూసుకుంటాడు కదా? ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు. మళ్ళీ మరో బరువు నీ మీదనేసుకుంటావు. కష్టం కాదా? ఎందుకలా?’ అంది మేధావిలా మాట్లాడుతూ రమణి. ‘కష్టమనుకుంటే ఎలాగమ్మా? మనం సిన్నబిడ్డలుగా ఉన్నపుడు ఆల్లు అడ్డాలలో పెట్టి మనల్ని చూసుకోనేదా? అప్పుడు మనం బారమనుకుని ఒగ్గీనేదు కదా? అందుకే ఆల్లు పెద్దయినపుడు మనం సూసుకోవాలి. మా అన్న తాగుబోతు నా కొడుకు. సమంగా సూత్తాడో నేదోనని నా బయం.. వత్తానమ్మా!’ అని ఇల్లు ఊడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు. ‘దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు. ఇల్లు సంభాళించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట’ తన మనసులోనున్న మాట ఆ రాత్రి వచ్చిన భర్త వేదవ్యాస్ దగ్గర అన్నది. ఐనా మౌనమే వహించాడు. ఒకరోజున సాయంత్రం వేదవ్యాస్ ఇంటికి వచ్చేసరికి విచార వదనంతో కనిపించింది రమణి.. ‘సంహితకి ఒళ్ళు కాలుతోందండీ’ అంటూ. బైట వాతావరణం ఏమీ బాగులేదు. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే వేదవ్యాస్ ‘ఎందుకైనా మంచిది డాక్టర్‌కి చూపించాలి. మన సొంత వైద్యాలొద్దు. మరి ఇంటి దగ్గర బాబును చూసుకోడానికి ఎవరుంటారు?’ అంటూ ఆలోచనలో పడ్డాడు. బైట వాన మొదలైంది భారీగానే. అంతలోనే వీధి తలుపు చప్పుడైంది. వెళ్లి తీశాడు. గొడుగులో వచ్చిన సుబ్బులు. పరిస్థితి తెలుసుకుని ‘మీరేం కంగారు పడకండమ్మా! ఆసుపత్రికి జాయిన్ సేయండి. మీరెల్లండి.. నేనీడ బాబుని సూసుకుంటా’అన్నది ధైర్యమిస్తూ. వేదవ్యాస్, రమణి ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరమని తేల్చారు. ఒక వారంరోజుల పాటు అక్కడే ఉండాలన్నారు. ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా గుండె దడ పట్టుకుంది ఇద్దరికీ. ఇంటి దగ్గర బాబుని చూసుకునే దిక్కు లేదు. ఇక్కడ ఆసుపత్రిలో సహాయం చేసేవాళ్లు కరువైనారు. ఏం చేయాలో ఓ పట్టాన బోధపడలేదు. డాక్టర్‌తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గది తీసుకుని అక్కడ నర్స్‌కి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వేదవ్యాస్. బాబుకి బిస్కట్లు తినిపిస్తూ కనిపించింది సుబ్బులు. అతన్ని చూసి దిగ్గున లేచి ‘ఏటన్నారు బాబూ! పాపకి ఏటైనాది?’ అని అడిగింది ఆత్రుతగా. వేదవ్యాస్ చెప్పి కలవరపడుతుంటే ‘ఇంటికాడ సంగతి నాకొగ్గేయండయ్యా! ఇల్లు సక్కంగా సూసుకుంటాను. బాబు గురించిన బెంగ మీకక్కర్లేదు. పనుంటే అక్కడికెళ్ళండి’ అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైంది. వేదవ్యాస్ వెళ్ళేసరికి పాపకి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడం కోసం అప్పటికే డాక్టర్ చికిత్స మొదలెట్టినట్లు చెప్పింది రమణి. మూసిన కన్ను తెరవలేదు సంహిత. బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు. ఒక ఐదురోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది. ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు డాక్టర్. మర్నాడుదయం ఇల్లు చేరారు. లోపలికెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముసలామె కనిపించేసరికి గాబరాపడి ‘ఏయ్! ఎవర్నువ్వు?’ అని గదమాయించేసరికి ఉలిక్కిపడి ‘బాబూ! నాను సుబ్బులు అమ్మను. అది నాలుగిల్లల్లో పనులు సేయడానికి ఎల్లింది. మీరొచ్చీసరికి వచ్చేత్తానంది’ అంటూండగానే సుబ్బులు బైట నుండి లోపలికి అడుగుపెడుతూ ‘ఔనయ్యా! మాయమ్మే! తైనాతూ నేనీడుండడానికి అవదని మా ఈదిలో పెద్దల్ని మా అన్న కాడికి పంపి మాయమ్మను రప్పించీసినాను. ఎంటనే యిక్కడి యిసయం తెలుసుకుని తోడుంటానని లగెత్తుకొచ్చింది. ఇందుకేనయ్యా మాయమ్మంటే నాకు సాలా ఇట్టం. నా పెనిమిటి కుదుర్నేక తిరుగాడుతున్నా మాయమ్మే నిచ్చెం నాతో కలిసుంటాది’ అని తెగ సంతోషపడుతూ సంహితను దగ్గరగా తీసుకుంది. ‘సుబ్బులూ! నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు వేదవ్యాస్. ‘ఎంతమాటయ్యా! ఎపుడే ఆపదొచ్చినా ఇట్టా కాకిసేత కబురెడితే సాలు అట్టా వాలతాను. కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా?’ అని తల్లి మరియమ్మతో సహా బైటకు నడిచింది సుబ్బులు. సుబ్బులు మాటలు వింటూంటే గుండె కలుక్కుమనసాగింది రమణికి. ‘చూశావా రమణీ! మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో? తల్లిపట్ల నీకుండే భావాలు వేరు. మీ అమ్మ నీ తమ్ముడి దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యోచనలో నువ్వుంటే సుబ్బులేమో తన తోడబుట్టిన వాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తన తోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది. పైగా మనక్కూడా ఉపయోగపడేలా చేసింది. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా సంప్రదింపుకైనా లేదా చిన్నచిన్న సహాయాలకైనా మనకే ఉపయోగపడతారు. వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితిలో మీ అమ్మే మన దగ్గరుంటే కొండంత అండగా నిలబడి ధైర్యం ఇచ్చేది. తల్లిని కోల్పోయిన నేను ఆరోజుల్లో ఎంత గుంజాటన పడ్డానో చెప్పలేను. నీకు తల్లి ఉండి కూడా ఆమెను చాదస్తమంటూ, ఎద్దేవా చేస్తున్నావ్. నువ్వు నీ తల్లిని దూరం చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకూ అదే అబ్బుతుంది. రేపు వాళ్లూ నిన్ను దూరం చేసినా తప్పు లేదనుకుంటారు. దెప్పుతున్నాననుకోకు.. తల్లి తోడు.. నీడ.. అన్నీను!’ అన్నాడు వేదవ్యాస్. భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి. ఆ వెంటనే మరో మాటకు తావులేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం. తల్లిని చూడ్డంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలికపడినట్లయింది రమణికి. పిల్లలిద్దరినీ చూసి తన అక్కున చేర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్ దంపతులు. ‘ఔను! ప్రపంచంలో అందరి దైవం అమ్మే!’అనుకుంది రమణి.. కళ్ళల్లో నీరు చిమ్ముతుండగా! -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?) -
కథ: తూరుపు పొద్దు... బీఎస్ నడక మారలేదు, నడత మారలేదు! తనంతే!
ఆకాశంలో చిక్కటి మేఘం ముద్ద పాల నురుగులా పొంగి వుంది. భూమ్మీద నుంచి మానవ ఆకారాలు పొడవాటి గోర్లున్న చేతి వేళ్లను గుచ్చి ఆ ముద్దను పీక్కొని జుర్రుకుంటున్నాయి. మనుషులు మరీ పొడుగ్గాలేరు, అట్టాని పొట్టిగానూ లేరు. ఒంటిమీద ఏ ఆచ్ఛాదనా లేనట్టు నల్లని నీడల్లా కదులుతున్నారు. దివి నుంచి కొన్ని అస్థిపంజరాలను పోలిన ఆకారాలు ఎర్ర మందారాలను పోలిన పూల బుట్టలను భూమ్మీద గుమ్మరిస్తున్నాయి. అవి నేల మీద పడగానే నిప్పు కణికల్లా మారి పొగలు ఎగజిమ్ముతున్నాయి. ఓ రెండడుగుల బుడతడు ఆ అగ్నిపూలను ఒక్కొక్కటిగా ఏరి భుజాన వేలాడుతున్న జోలెలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జోలెలో పడ్డ నిప్పు కణికలు మంచు ముద్దలుగా మారి, నీటి బిందువులుగా జారుతున్నాయి. నేల మీదపడి పిల్లకాలువలుగా ప్రవహిస్తున్నాయి. ‘ఊరికి బోవాలన్జెప్పి తెల్లారిందాంకా పడుకున్నెవేంది?’ మా ఆవిడ అరుపులతో నా వింత కల చెదిరింది. రవ్వంతసేపు ఆ అనుభూతితో మంచం మీదనే కూర్చొని వెళ్లాల్సిన పని గుర్తుకు తెచ్చుకొని నిద్దుర మత్తును విదిలించికొట్టి గబిల్లున మంచం దిగాను. బీఎస్‌ను కలవాలన్న తొందరలో ఆదర బాదరగా అన్ని పనులూ ముగించుకున్నాను. తొమ్మిది గంటల ప్రాంతంలో బస్టాండుకొచ్చి, అప్పుడే కదులుతున్న విజయవాడ బస్సెక్కాను. టికెట్ తంతు ముగించి ఓ పనైపోయిందనుకొని రిలాక్స్ అయ్యాను. బ్యాగులో నుంచి తిలక్ కథల పుస్తకం బయటకు తీసి చదివే ప్రయత్నం చేశాను. మనసు కుదురుకోలేదు. గజిబిజిగా ఎటెటో తిరుగుతోంది. రెండు రోజుల నుంచి బీఎస్ తలపులు వెంటాడుతున్నాయి. తనను కలవాలి, మాట్లాడాలి అన్న కాంక్ష నన్ను కుదురుగా ఉండనీయలేదు, ఒకచోట నిలువ నీయడంలేదు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చింది. ‘అబ్బీ నువ్వు పలానా గదా’ అంటూ కడప ఆర్టీసీ బస్టాండు టీకొట్టు దగ్గర పంచెకట్టు మనిషి పలకరించాడు. అతనివైపు పరిశీలనగా చూశాను, ఎక్కడో చూసినట్లుంది గానీ గుర్తుకు రావడంలేదు. ‘అవును’ అంటూనే ‘మీ దేవూరు’ అన్నాను. ‘మిద్దెల’ అన్నాడు. బీఎస్ అన్ననని చెప్పాడు. బీఎస్ పూర్తిపేరు బి. శివనారాయణ. అందరూ బీఎస్ అనే పిలిచేవాళ్లు. ‘అవునా!’ అంటూనే ‘బీఎస్ ఎలా ఉన్నాడ’ని అడిగాను. ‘ఈ మధ్య కరోనా వచ్చిందబ్బీ.. చావుదాంక వెళ్లాడు. భూమ్మీద నూకలుండి బతికి బయట పడ్డాడు. డాక్టర్లు కొద్ది రోజులు ఇంటిపట్టునుండి రెస్ట్ దీసుకోమని చెప్పినా విన్లేదు. ఊర్లు బట్టుకొని తిరుగుతానే ఉండాడు. యాలకు తిండా పాడా.. ఏందో వాని జీవితం..? తాడూ బొంగరం లేకుండా అయింది’ అంటూ ఏకరువు పెట్టాడు. మనసంతా అలజడి. ఆ తరువాత బీఎస్ కోసం ఆరా తీశాను. ఎలా ఉన్నాడో తెలియడం లేదని. ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో పెద్దగా కనిపించడం లేదని మిత్రులు చెప్పారు. తనను కలవాలని నిర్ణయించుకుని బయలుదేరాను. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు నా ఆలోచనలకు సడన్ బ్రేక్ పడింది. ‘ఏందా?’ అని చూశాను. చెకింగ్. బస్సెక్కి అందరి దగ్గర టికెట్లు పరిశీలిస్తున్నారు. రెండు సీట్ల అవతలికి పొయ్యేసరికి చెకింగ్ అతనికి, ప్రయాణికుడికి మధ్య గొడవ. పిల్లోడికి హాఫ్ టికెట్ తీసుకోలేదంటూ వాదన. మా వాడికి అయిదేండ్ల లోపే అంటాడు తండ్రి. తనకూ అదే చెప్పడంవల్ల టికెట్ కొట్టలేదంటాడు కండక్టర్. మాటామాటా పెరిగింది. గొడవ పెనుగాలి అయ్యింది. అసలే వేసవి ఎండ.. బొక్కెనలో నీళ్లలా గుబుళ్లున బయటకు దూకిన స్వేదం ఒంటి మీదనే బట్టలు నాన బెట్టింది. బస్సు దిగి వేడి గాలులతో చెమట నార్పుకొన్నాను. ప్రయాణికులు తలోమాటా వేయడంతో కొద్దిసేపటికి రభస సద్దుమణిగి చెకింగ్ తంతు ముగిసింది. బస్సెక్కి అన్యమనస్కంగానే ‘నల్లజెర్ల రోడ్డు’ కథ చదువుదామని పుస్తకం తెరిచాను. అహా..అక్షరాల మీద చూపులు నిలవడంలేదు. బలవంత పెట్టినా ససేమిరా అంటూ చెదిరి పోతున్నాయి. నేను కలవాల్సిన మనిషి ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ పరంపరలోనే బస్సు పోరుమామిళ్ల చేరింది. మధ్నాహ్నమైంది. బీఎస్ కోసం విచారించాను. నిన్న ‘మిద్దెల’లో ఉన్నాడన్నారు. మిద్దెల బీఎస్ సొంతగ్రామం. అతన్ని కలిసిన తరువాతనే ఊరికెళ్దామని నిర్ణయించుకొని బస్టాండుకొచ్చి వరికుంట్ల బస్సెక్కాను. సర్కార్‌కు నిధుల కొరతేమో? గతుకుల రోడ్డు. బస్సు ఓ గంట తరువాత మిద్దెలలో దింపింది. ఊరిగమిల్లోనే బీఎస్ ఇల్లు. వెళ్లి విచారించాను. నిన్న ఉదయమే గిద్దలూరు వెళ్లాడన్నారు. ఎక్కడున్నా వెళ్లాల్సిందే! తనను కలవాల్సిందే! గిద్దలూరు వెళ్దామని ఆటో ఎక్కాను. కిక్కిరిసిన షేర్ ఆటో నిండు గర్భిణిలా ఆపసోపాలు పడుతూ ఓబుళాపురం చేర్చింది. వేసవి ఎండ.. నాలిక పీకుతోంది. దప్పిక తీర్చుకునేందుకు అక్కడున్న అంగట్లో నీళ్ల బాటిల్ కొన్నాను. అంగడతను తెలిసిన వ్యక్తే. బీఎస్ కోసం ఆరా తీశాను, ‘నిన్న పొద్దున్నే రోడ్లో పడిపోయిన ఒకతన్ని పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లాడ’ని చెప్పాడు. అక్కడి నుంచి తిరిగి బస్సెక్కి పోరుమామిళ్లకు చేరుకున్నాను. బీఎస్ వాళ్ల గ్రామానికే చెందిన వ్యక్తి మెడిసిన్ చదివి ఆసుపత్రి పెట్టాడు. అక్కడికే తీసుకెళ్లి ఉంటాడని వెళ్లాను. ‘ఓ పేషెంటును తెచ్చి చేర్పించి పొద్దున వెళ్లినట్లున్నాడ’ని డాక్టర్ చెప్పాడు. పేషెంటు బెడ్ చూపించాడు. బీఎస్ అక్కడ లేడు. బెడ్ మీదున్న పెద్దాయన్ను అడిగాను. తనది తాడిపత్రి అనిచెప్పాడు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం చూసేందుకు వచ్చి రెండు రోజులు అక్కడే ఉన్నాడట. ఈ లోపు మోషన్స్ కావడంతో చూపించుకుందామని ఆటోలో ఓబుళాపురం వచ్చాడట. అప్పటికే విరోచనాలు ఎక్కువై నీరసంతో రోడ్డుమీదనే పడిపోయాడట. తాగి పడిపోయి ఉంటాడని ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే అక్కడికొచ్చిన బీఎస్ ఆయనను చూసి బట్టలు నీళ్లతో కడిగి ఆటోలో పోరుమామిళ్ల ఆసుపత్రికి తీసుకు వచ్చి వైద్యం చేయించాడట. రాత్రంతా కాపలా ఉండి పొద్దునకి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పడంతో పెద్దాయన కొడుకుకు ఫోన్ చేసి మధ్నాహ్నం తరువాత గిద్దలూరు పోతున్నానని చెప్పి వెళ్లి పోయాడట. అరగంట క్రితమే వెళ్లాడని చెప్పాడు. ‘తన పాలిట దేవుడ’ని చేతులు జోడించాడు. అప్పటికే పొద్దు పడమటి కొండల మీదకు దిగుతోంది. ఇప్పుడు బయలు దేరినా రాత్రికిగాని గిద్దలూరు చేరుకోలేను. పక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో మావూరు. అమ్మ అక్కడే వుంది. ఊరుకెళ్లి అమ్మను చూసి పొద్దున్నే బీఎస్ కోసం గిద్దలూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. బీఎస్ జ్ఞాపకాలను పదిలంగా పట్టుకొని ఆటోలో ఊరికి బయలు దేరాను. దారిలో చెన్నవరం ముందు సగిలేరు పలకరించింది. ఆటో ఆపాను. ఏటిగుండాల నిండా తెలుగు గంగ నీళ్లు. ఏపుగా పెరిగిన జంబు నీళ్లతో జతకట్టింది.« పచ్చిక మేసి వచ్చిన పశువులు నీటిలో మునకలేస్తూ సేద దీరుతున్నాయి. పోరుమామిళ్ల నుంచి వచ్చిన కొందరు గాలాలతో చేపల వేట సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఎండిపోయిన ఏరు ఇప్పుడు నీళ్లలో జలకాలాడుతోంది. ఏట్లోకి దిగి రెండు దోసిళ్లతో కడుపారా నీళ్లు తాగి ఆటో ఎక్కి బయలు దేరాను. నల్లని జెర్రిపోతు మాదిరి మెలికలు తిరిగిన తారురోడ్డు. చెన్నవరం, మాలోనిగట్టు, పెసలొంక, కళ్లమందçపట్టలు, గుజ్జాలోల్లకుంట, జ్యోతివాగు అన్నీ చూస్తూ వాటి జ్ఞాపకాలతో ఊరికి చేరుకున్నాను. ∙∙ ఈ రోజు ఎలాగైనా బీఎస్‌ను పట్టుకోవాలి. పొద్దున్నే నడక దారిలో ఓబుళాపురం బయలుదేరాను. నిండు ఎండలకాలం. దారిపొడవునా వేపచెట్లు సరికొత్త ఇగురుతో పండగనాడు కొత్త సొక్కా వేసుకున్న చిన్న పిల్లోడి మాదిరి మురిసి పోతున్నాయి. వాటి పొత్తిళ్లలో సేదదీరుతూ పక్షులు కిలకిలారావాలు. వాటిని ఆస్వాదిస్తూ గంటలో ఓబుళాపురం చేరుకున్నాను. కొద్ది సేపటికి వచ్చిన గిద్దలూరు బస్సెక్కాను. బీఎస్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అతని తాలూకు తలపుల పరంపర వీడని నీడలా వెంటాడుతోంది. రెండేళ్ల నాటికి ముందు అనుకుంటా... మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్నాను. బస్టాండు పక్కనే ఆఫీసు. బస్టాండు అవుట్ గేటు దాటుతూంటే తెల్లప్యాంటు, తెల్లషర్టు, ఆరడుగుల విగ్రహంతో నిటారుగా నడుచుకుంటూ బస్టాండులోకి వెళుతూ కనిపించాడు బీఎస్. అప్పటికే బస్టాండు ఆవరణలోకి ప్రవేశించాడు. బండి ఆపి ‘బీఎస్..’ అంటూ గట్టిగా కేక పెట్టాను. వెనుదిరిగి చూశాడు. నేను కనిపించేసరికి ముఖాన వెలుగు.. దాంతోపాటు చిరునవ్వు. నేను బండిని టీ కొట్టువద్ద పార్కు చేసేలోపు వచ్చాడు. చాలా రోజుల తరువాత కలిశాం. రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ‘ఎలా ఉన్నావు?’ అడిగాను. ‘మామూలే.. పాత దారే, అలాగే ముందుకు’ అంటూ నవ్వాడు. తన మాటలు నా మనసును ద్రవింప జేశాయి. కళ్లలో ఆరాధనా భావం. ‘సడెన్ గా కడపలో ఏంటి?’ అన్నాను. ఎవరికో కాలు ఆపరేషన్ అట, డబ్బుల్లేని పేదోడట. రిమ్స్‌కు పిల్చుకవచ్చి ఆపరేషన్ చేయించి వెళుతున్నానన్నాడు. ‘ఇంటికెళ్లి భోజనంచేసి వెళుదు పా’ అన్నాను. ‘ఇప్పుడు కాదులే! ఉప్పులూరు ఎస్సీ కాలనీ అమ్మాయి ఉద్యోగ విషయమై రాత్రికి హైదరాబాదు వెళ్లి సార్‌ను కలవాలి’ అన్నాడు. ‘ఈ బస్సుపోతే సాయంత్రం వరకూ బస్సులేదు. ఇంకొకసారి వస్తా! ఇంట్లో అందర్నీ అడిగానని చెప్పు’ అంటూ హడావుడిగా వెళ్లిపోయాడు. ఆతరువాత బీఎస్ నాకు కనిపించలేదు. రోడ్డు. కాస్త తారు, కంకర కలగలిపి గుంతల్లో గుమ్మరించినట్లుంది. నా ఆలోచనలకు తెరదించుతూ త్వరగానే బస్సు గిద్దలూరు చేరింది. తెలిసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బీఎస్ ఉంటున్న రూము వద్దకెళ్లి విచారించాను. రైల్వేస్టేషన్ సమీపంలోని పాఠశాల గదిలో పిల్లలకు క్లాసు చెప్పడానికి వెళ్లాడన్నారు. ఆటో ఎక్కి అక్కడికెళ్లాను. పది నుంచి పదకొండు గంటలవరకూ క్లాసట. అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి, ముప్పై ఏళ్ల లోపే ఉన్నారు. అప్పటికే కొందరు వెళ్లిపోగా మరికొందరు ఇంటిదారి పట్టారు. ‘ఏం క్లాసులు?’ అని ఆరా తీశాను. ‘వ్యక్తిత్వ వికాసం మీద అట. నాలెడ్జి పెంచుకోవడం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవడం.. ఆరోగ్యం, మానసిక దృఢత్వం, శక్తి,యుక్తి, ముక్తి, సమాజశ్రేయస్సు లాంటి అంశాల మీదట! ఒక్కో బ్యాచ్‌కు ఎనిమిది రోజుల శిక్షణ ఉంటుందట.. అదికూడా ఉచితంగానే ఇస్తారట’ చెప్పారు. సరికొత్త సమాజసేవకులను అందించే ఆలయంలా కనిపించింది. ‘సార్ ఇప్పుడే రూముకెళ్లాడ’న్నారు. నేను తనని వెతుక్కుంటూ వెళుతుంటే.. యాభై ఏళ్ల పైబడిన వయస్సులో కూడా బీఎస్ అలుపెరగని సేవా కార్యక్రమాలతో నాకందనంతగా ముందుకు పరుగెడుతున్నాడు. తిరిగి ఆటో ఎక్కాను. బీఎస్ నేను పదో తరగతి వరకూ కలసి చదువుకున్నాం. సేవాభావం నింపుకొని పుట్టాడేమో..! చిన్ననాటి నుంచే ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా అక్కడ వాలేవాడు. తనతో కలసి సేవా కార్యక్రమాలలో నేనూ పాల్గొనేవాన్ని. అలా మా ఇద్దరి స్నేహం బలపడింది. కాలగమనంలో మా దారులు వేరయ్యాయి. పెళ్లి చేసుకొని బంధాలు, బాధ్యతల బరువునెత్తుకొని నేను ఊరు వదలిపెట్టాను. బీఎస్ మాత్రం ఇల్లు, వాకిలి మరచాడు. జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లికి దూరమయ్యాడు. పదెకరాలున్న సేద్యగాడికే పిల్లనివ్వని రోజులు.. అన్నీ వదిలి ప్రజాసేవలో మునిగి తేలేవాడికి పిల్లనిస్తారా? అయినా అదేమీ పట్టించుకోక సేవాయుధంతో సమాజంపై అలుపెరగని యుద్ధం సాగిస్తున్నాడు. తనతో కలసి నడవలేక పోయానన్న వెలితి నన్ను వెంటాడి వేధిస్తోంది. ‘సర్.. మీరు చెప్పిన అడ్రస్ ఇదే’ అటోవాడి పిలుపుతో మిత్రుడి జ్ఞాపకాల నుంచి బయటపడి ఆటో దిగి రూములో చూశాను. అక్కడ లేడు. కిందున్న బడ్డీకొట్టతన్ని అడిగాను. ‘ఇప్పుడే వెళ్లాడు. అయిదు రూపాయల అన్నం క్యాంటీన్ దగ్గరుంటాడ’న్నాడు. ఫోన్ చేస్తే రింగ్ కావడంలేదు. అడ్రసు పట్టుకొని వెళ్లాను. అప్పటికే అన్నం తిని చేయి కడుక్కుంటున్నాడు. ఎప్పుడూ తెల్లని షర్ట్, ప్యాంటు, నలగని బట్టలతో ఉండే బీఎస్ మాసిన బట్టలతో కనిపించాడు. బాధనిపించింది. నన్ను చూసి ఒకింత ఆశ్చర్యం.. ఆనందం.. నవ్వుతూ వచ్చాడు. ‘అప్పుడే తిన్నావేంది? కలసి భోంచేద్దామని వచ్చాను’ అన్నాను. ‘అయిదు రూపాయల భోజనానికి బాగా డిమాండబ్బీ! రోజూ వందమందికే పెడతారు. అరగంట లేటయితే ఉండదు’ అన్నాడు. ‘ఇక్కడ అయిపోతే బయట వంద రూపాయలు పెడితే గానీ అన్నం దొరకదు. నా దగ్గర ముప్పై అయిదు రూపాయలే ఉన్నాయి. అయిదు అన్నానికి పోతే మిగిలిన ముప్పైకి రాత్రి రెండు చపాతీలు తినొచ్చు’ చెప్పాడు. మనస్సు చివుక్కుమంది. నన్నూ తినమన్నాడు. బీఎస్ చిన్నబుచ్చుకోకూడదని తిన్నాను. సాంబారు అన్నం, చివర్లో మజ్జిగ వేశారు. బాగానే వుంది. ఎవరో పుణ్యాత్ముడు చేతనైన మటుకు పేదల కడుపు నింపుతున్నాడు. పక్కనున్న కానుగ చెట్టు కింద అరుగుమీద కూర్చున్నాం. ‘ఏంటి పరిస్థితి?’ అడిగాను. ‘ఆర్థిక పరిస్థితి ఏం బాగా లేదబ్బీ! ఇక్కడ అయిదు రూపాయల భోజనంతో.. తక్కువ ఖర్చుతో ముప్పూటలా కడుపు నింపుకోవచ్చు. ఒక సర్వేయర్ రూములో ఫ్రీగానే తల దాచుకుంటున్నాను’ చెప్పాడు. తన సోదరులు, మేనమామలు మంచి స్థితి మంతులే. తిరగడం చాలించి ఇంటిపట్టునే ఉండమని ఎన్నిసార్లు చెప్పినా బీఎస్ వినడంలేదట. ‘అంత ఇబ్బందిగా ఉంటే ఇంటికి వెళ్లొచ్చుగా’ అన్నాను. ‘ఇప్పుడు కాదులే. ఓపికున్నన్నాళ్లూ చేద్దాం. తరువాత చూద్దాంలే’ అంటూ దాట వేశాడు. ‘ఊరికెళ్దాం రా’ అన్నాను. ‘ఏముందబ్బీ ఊర్లో..? వారంనాడే అమ్మానాయన్ను చూసొచ్చినా. ఇప్పుడు నిన్ను చూసినా.. సంతోషంగా ఉంది’ అన్నాడు. నా బ్యాగులో దాచిన డబ్బుకవరు తీసి జేబులో పెట్టి ఖర్చులకు ఉంచు అన్నాను. కొంతమాత్రమే తీసుకొని మిగిలిందంతా వెనక్కు ఇచ్చి ‘ఇది చాల్లేబ్బీ ఈ వారం పని జరుగుద్ది’ అన్నాడు. ‘నీకోసమే తెచ్చాను’ అన్నాను. ‘ఒంటరి బతుకు.. నాకెందుకబ్బీ.. ! సంసారం ఈదేటోడివి నీకే ఖర్చులుంటాయిలే తీసుకెళ్లు’ అన్నాడు. ఇంతలో మోటార్ బైకుపై రైతులా ఉన్న ఓ వ్యక్తి బీఎస్‌ను వెతుక్కుంటూ వచ్చాడు. ‘వెళ్లొస్తా బ్బీ.. అంబవరం వెళ్లి ప్రకృతి సేద్యంలో ఈయనకు చీనీచెట్లు నాటించాలి’ అంటూ నాకు చెయ్యి ఊపి రైతు మోటారు బైకు ఎక్కి వెళ్లిపోయాడు. సేవకు అవకాశం వచ్చేసరికి అన్ని కష్టాల్ని పక్కనబెట్టి మిత్రుడికి వీడ్కోలును కూడా పట్టించుకోక ఎంతో ఆనందంగా వెళ్లిపోయాడు. ఏపూటకాపూట గడిస్తే చాలు.. సేవ దొరికితే అదే పదివేలు. బీఎస్ నడక మారలేదు, నడత మారలేదు. తను వెళ్లిన దారివైపు చాలాసేపు చూస్తూండి పోయాను. నిలువెత్తు రూపంలో మానవత్వం నింపుకున్న మాధవుడిలా కనిపించాడు. ముఖం మీద ఏదో పారాడినట్లనిపించింది. చేయిపెట్టి చూశాను, చేతికి తడి తగిలింది. బరువెక్కిన హృదయంతో బస్టాండు వైపు అడుగులు వేశాను. -
కథ: కథలు పిల్లలందు... నరసయ్యను లోకానికి పరిచయం చేద్దాం!
‘నేటి తరం పిల్లలున్నారే.. గడుగ్గాయలు. గ్రహణశక్తి ఎక్కువ. ఇట్టే నేర్చేసుకుంటారు. పదునైన చురుకైన మెదడు వారి సొంతం. ఇదే అదను– వాళ్ల మెదళ్ల లోకి కథల్ని ఒంపాలి. కథలంటే ఇష్టం కలిగించి రాసే పని పట్ల దృష్టి కలిగించాలి’ గట్టిగా అన్నాడు సుందరం. సత్యం, నేను అంగీకారంగా తలలూపాం. ∙∙ రామకృష్ణ సేవాసమితి. వేట్లపాలెం. విశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టాం. వేసవి ఎండ పేట్రేగిపోతోంది. జోళ్లు బయట విడిచి వెళ్లినందున కాళ్లు చురుక్కుమంటున్నాయి. ఉదయం పదిన్నరకే వేడి దంచేస్తోంది. సుందరం తణుకు నుంచి అప్పటికే వచ్చేశారు. ఆయనిది సమయపాలన. హాలులోకి ప్రవేశించగానే ఏసీ చల్లదనం. హయిగా ఉంది. పిల్లలు బుద్ధిగా కూర్చున్నారు. సుందరం మాట్లాడుతున్నారు. మమ్మల్ని చూసి వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేశారు. ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ‘...అలా ఎందరో వీరుల త్యాగాలు, బలిదానాలతో మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఇది భారత స్వాతంత్య్ర అమృతోత్సవ ఘడియలు. అంటే ఇప్పటికి డెబ్బై అయిదేళ్లయ్యిందన్న మాట. ఆనాటి కాలంలోని గొప్ప సంఘటనల్ని ఈతరం విద్యార్థులైన మీరు తప్పక తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే మన దేశం పట్ల గౌరవం, భక్తి కలుగుతాయి. త్యాగనిరతి అంటే ఏమిటో తెలుస్తుంది. మీ స్పందనల్ని కథారూపంలో రాయాలి. రాయగలరు. రాస్తారు కదూ. మా రాకకు కారణం అదే. రేపటి దేశపౌరులు మీరు. ఉన్నత భావాలు, ఉత్తమ సంకల్పాలు మన దేశాభివృద్ధికి తోడ్పడతాయి. అందుకే కథారచన కార్యశాల ఏర్పాటు చేశాం. మంచి ఉద్దేశం మంచి ఫలితాల్ని ఇస్తాయని నమ్ముతాం. ముందుగా తెలుగు పండితుడిగా ఉద్యోగ విరమణ చేసిన సత్యంగారు మాట్లాడతారు. సావధానంగా వినండి’ అని మైకును అందించారు. పిల్లలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. వేదిక వెనుక విద్యుత్తు వెలుగుల్లో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, శారదాదేవి చిత్రాలు కాంతివంతంగా ఉన్నాయి. హాజరైన వారిలో ఆడపిల్లలే ఎక్కువ. చివర గోడ పక్కన కూర్చున్న కుర్రాడొకడు చేయి అడ్డం పెట్టుకుని చిన్నగా నవ్వుతున్నాడు. అక్కడే నిలుచుని ఉన్న టీచరు కాబోలు ముక్కు మీద వేలు పెట్టి ‘ఉస్’ అనడంతో నిశ్శబ్దం ఆవహించింది. సమాజ హితం కోసమే సాహిత్యమనే భావం గల ఒక సంస్కృత శ్లోకంతో సత్యం ఉపన్యాసం ప్రారంభించారు. ఆవు – పులి కథ, అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు కథ, మూడు చేపల పంచతంత్రం కథలు చెప్పారు. తెలుసున్న దానిలోంచి తెలియనిది బోధించడమే కదా అసలైన పాఠం. విమాన గమనానికి అన్వయించి కథకు సంబంధించిన ప్రారంభం, కథనం, ముగింపు గురించి చెప్పడంతో పిల్లలు శ్రద్ధగా విన్నారు. సత్యం ప్రసంగ పాఠంలోని ప్రధాన విషయాల్ని విడమరచి వివరించారు సుందరం. ‘శివంగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను’ సుందరం ప్రకటించడంతో మైకు అందుకున్నాను. వ్యక్తిగత అనుభవంలో కథ పట్ల ఆసక్తి కలిగించిన చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రేరణ కలిగించిన పుస్తకాల గురించి మాట్లాడాను. కాళ్లూ చేతులూ లేకపోయినా నికోలస్ జేమ్స్ వుయిచిచ్ సాధించిన విజయాల్ని స్ఫూర్తి కలిగించడం కోసం చెప్పాను. నోటితోనూ కాళ్లతోనూ పెయింటింగు గీసే చిత్రకారుల గురించి కూడా తెలియజేశాను. అంగవైకల్యాన్ని సైతం జయించి వివిధ రంగాల్లో రాణించిన వారి జీవితాలు ఆదర్శప్రాయమయ్యాయని తెలిపాను. మనలో అంతర్లీనమైన శక్తి దాగి ఉంటుందని దాన్ని వెలికితీస్తే కళల్లో అద్భుతాలు సాధించవచ్చని చెప్పాను. సుందరం పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో కథలు రాయాల్సిన స్వాతంత్య్ర పోరాటాల గురించి వివరించి దిశానిర్దేశం చేశారు. స్వాతంత్య్రోద్యమం తొలి తరం వీరుల జీవితాలకి కథారూపం ఇమ్మని కోరారు. లంచ్ విరామం. ∙∙ మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. ‘పాల్గొని రాయడం ప్రధానం.. మేలు కీడుల సంగతి తర్వాత చూసుకోవచ్చు’ అనడంతో పిల్లలు ఉత్సాహంగా కథలు రాయాలనే ఉత్సుకత చూపించారు. ఇరవై తొమ్మిది మంది హాజరై కథలు రాశారు. ఉద్వేగ సంచలనం. ఒడిలో ప్యాడ్లు పెట్టుకుని శ్రద్ధగా గువ్వల్లా ముడుచుకుని అక్షరాల్ని పండించారు. పదాల ఊహలకు మొగ్గ తొడిగారు. వాక్యాల్ని గుండెలకు హత్తుకున్నారు. పేరాల్ని కంటికి ఇంపుగా పేర్చారు. మొత్తమ్మీద కథనం ఆలోచనలకి పదును పెట్టింది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే రాశారు. నిజంగా కథలేనా అవి? మాలోనూ ఉత్కంఠ. తొందరగా వాటిని చూడాలనే ఆతురత. సృజన అనేది నేర్పితే వచ్చేదా? వారి అభిరుచుల చిట్టాలోకి రచనావ్యాసంగం చేర్చడం సాధ్యమేనా? ఎండ సిమెంటు చప్టాను పెనంలా మార్చింది. అడుగేస్తే పాదాలు కాలిపోతున్నాయి. మా కోసం ప్రత్యేకంగా పరచిన తివాసీలను దాటి ఆదమరుపున నడిచినందుకు నా కాళ్లు మండాయి. సాయంత్రమైనా వేడి తీవ్రత తగ్గలేదు. ముగ్గురం కథలు పంచుకున్నాం. అతిథిగృహం అని గుమ్మం పైభాగంలో రాసి ఉన్న గదికి చేరుకున్నాం. తలో మూల సర్దుకున్నాం. వాళ్లు రాసిన కథలన్నింటి గురించి చెప్పడం కుదరదు. వింతగానో విచిత్రంగానో విస్మయంగానో అనిపించిన వాటి గురించి తప్పక చెప్పి తీరాలి. జోస్యం చెప్పే చిలుక బొత్తి లోంచి మధ్యలో ఒక కార్డు తీసుకున్నట్టు కథల్లోంచి ఒక కాగితం లాగాను. చూశాను. ఆశ్చర్యపోయాను. రెండు చిన్నకొమ్మలు.. అటూ ఇటూ రెండు చిలకల బొమ్మలున్నాయి. మాట్లాడుతున్నట్లుగా ముక్కులు తెరచి ఉన్నాయి. వాటి కింద మొదటి చిలక, రెండో చిలక అని రాసి ఉంది. మొదటి చిలక అంటోంది ‘ఇక్కడకు ఎందుకు వచ్చావు?’ ‘మా అమ్మ వెళ్లమని బలవంతం పెట్టింది. వచ్చాను’ రెండో చిలక సమాధానం చెప్పింది. ‘అమ్మ ఎందుకు బలవంతం పెట్టింది?’ ‘ఇంట్లో అల్లరి చేస్తున్నావు. ఉబుసుపోవడం లేదు అంటున్నావు కదా.. వెళ్లు’ అంది. ‘ఎందుకు ఉబుసు పోవడంలేదు? చదువుకోవచ్చు. ఏదైనా కొత్తది నేర్చుకోవచ్చు. ఇక్కడికొస్తే కథలు చెబితే వినొచ్చు. ఆనక ఇంచక్కా కథ రాయొచ్చు కదా’ ‘అందుకే కదా వచ్చాను. ఏం ఇది కథ కాదా?’ నవ్వుతూ అంది రెండో చిలక. చివర సమాప్తం అనీ ప్రారంభంలో శ్రీరామ అనీ రాసింది. పేరు చూశాను. భారతి, పదోతరగతి... నవ్వుకుని మరో కాగితం అందుకున్నాను. ‘కథలు వింటాను. రాయను. చదవను’ వంకర వంకరగా పెద్ద అక్షరాలు. అంతే.. ఇంకేమీ లేదు. పేరు చూశాను. వీరయ్య, తొమ్మిదవ తరగతి. చటుక్కున గుర్తొచ్చాడు. వెనుకవైపు గోడ వార ఒకడు రాయడం మానేసి అట్ట ఒడిలో పెట్టుకుని దాని చుట్టూ చేతులేసి కూర్చున్నాడు. దిక్కులు చూడటం గమనించాను. ‘ఏమిటి సంగతి’ అని కంటితో సైగ చేశాను. పెన్ను తీసుకుని రాస్తున్నట్టు కనిపించాడు. కథలు వినడం ఇష్టం అంటున్నాడు కదా ఎన్ని కథలు విన్నాడో అడగాలి. పోనీ కథలేమైనా చెబుతాడేమోనని తెలుసుకోవాలి. పిల్లలు రాసిన కథలు చదవడం వింత అనుభవం. రాతలో కొన్ని ఇంగ్లిషు పదాలు దొర్లాయి. వాటికి ప్రత్యమ్నాయ తెలుగు పదాలు చెప్పాలి. ఆధునిక విజ్ఞానంతో కూడిన ఊహాశక్తి వాళ్లది. మార్కులేసి సుందరానికి అప్పగించి బయట వరండాలోకి వచ్చాను. వీరయ్య కనిపించాడు. దగ్గరకు రమ్మని చేయి ఊపాను. భయపడుతూ వచ్చాడు. నవ్వుతూ మాట్లాడుతూ భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకెళ్లాను. ‘మీ ఇల్లెక్కడా?’ ‘దగ్గర్లోనే... సారూ... మా ఇంటికి రారూ?’ అన్నాడు. సభకు ఇంకా సమయం ఉంది. సరే పదమని నెమ్మదిగా నడుచుకుంటూ వీరయ్య ఇంటికి చేరాను. పాతకాలం నాటి ఇల్లు. చిల్ల పెంకులు. ఒక పక్క కూలిపోయినట్లుంది. ఇంటిని ఆనుకుని గుంజకు కట్టి ఒక ఆవు ఉంది. చిన్న గడ్డిమేటు. పేడకళ్లు ఎత్తి దూరంగా పారేసి ఎండు గడ్డి ఆవు ముందు వేస్తున్నాడు ఒకాయన. ‘మా నాన్న’ అని పరిచయం చేశాడు. పక్కనే ఉన్నావిడను ‘అమ్మ’ అన్నాడు. కూలిపని నుంచి అపుడే వచ్చినట్టున్నారు అమ్మా నాన్నలు. ‘రండి... బాబూ’ ఇంటి లోపలకు రమ్మని పిలిచారు. వసారాలో కుర్చీ లేదు. చిన్న స్టూలు. దాని మీదే కూర్చుని కుశల ప్రశ్నలేశాను. బిడియంగా వినయంగా సమాధానాలు ఇచ్చారు. స్వాతంత్య్ర పోరాటం.. త్యాగధనులు.. డెబ్బై అయిదేళ్ల పండుగ.. పిల్లలకు అవగాహన కలిగించే ఉద్దేశం.. మాటల్లో చెప్పబోయాను. నిజానికి అంతంత పెద్ద విషయాలు చెప్పే సందర్భం కాదు. మనసులోంచి తన్నుకొచ్చిన ఉబలాటం ఆగనీయలేదు. వీరయ్య తండ్రి కిట్టయ్య ఆశ్చర్యకరంగా ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు. మౌనంగా ఉండిపోవడం నా వంతయ్యింది. ‘ఇలా రండి.. బాబుగారూ’ అంటూ ‘చిటికెలో వచ్చేస్తాను’ అని బయటకు పరుగెట్టి నిచ్చెనతో వచ్చాడు. నేల సిమెంటు గచ్చు. గరుకుగా ఉంది. గబగబా అటుకెక్కాడు. నెమ్మదిగా అపురూపంగా ఒక ట్రంక్పెట్టెను కిందికి దించాడు. గుమ్మం దగ్గరకు తీసుకొచ్చాడు. దాని చుట్టూ మైకా కాగితం చుట్టి ఉంది. ఆ పెట్టెకు ముమ్మారు చేతులు జోడించి దండం పెట్టాడు. భక్తిభావంతో కళ్లకు అద్దుకున్నాడు. చెమర్చిన కళ్లతో చూస్తూ తాళం తీశాడు. లోపల అనేక వస్తువులు. అన్నీ పాతకాలం నాటివి. వెలసిన ముఖమల్ తలపాగ.. చివికిన కాషాయరంగు పంచె.. వంకీలు తిరిగిన జోళ్లు.. సొట్టలు పడిన చిన్న కంచం.. ఇత్తడి మరచెంబు, ఇత్తడి గ్లాసు.. ముట్టుకుంటే చినిగిపోయే వార్తా కటింగులు.. పొందిగ్గా చక్కగా సర్ది ఉన్నాయి. అత్తారబత్తంగా ఒక్కో దాన్నీ బయట పెట్టాడు. పెళ్లాం పైటకొంగు ముఖానికి అడ్డం పెట్టుకుని దూరంగా నిలబడి ఉంది. తర్వాత తెలిసింది. మూగదంట. ఆ పిల్లకు దిక్కెవరని జాలిపడి పెళ్లి చేసుకున్నాడంట. వీరయ్య ముఖంనిండా నవ్వు పులుముకుని చూస్తున్నాడు. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నాడు? ఏం మాట్లాడబోతున్నాడు? అంతుపట్టడం లేదు. కిట్టయ్య కళ్లప్పగించి తనివితీరా చూసుకున్నాడు. అతనిలో అలౌకిక ఆనందం. ముఖంలో వెలుగులు. ‘ఏమనుకోకండి? నా మాటలు కాసేపు వినండి, బాబూ.. కూడుకు కరువైనా వీటిని చూసుకునే బతుకుతున్నాం. మా ముత్తాత ఆస్తులు కూడబెట్టలేదు. అమరుడై మాకొక గౌరవ వారసత్వ సంపదను అందించాడు. నేనూ చదువుకున్నవాడినే. ఇపుడు చదువునే మరచిపోయినవాడిని. కూలి పనులే జీవనాధారం. మీరు నమ్మరు.. బీఈడీ చదివాను. ఉద్యోగం లేదు. కొన్నాళ్లు ప్రయివేటు స్కూలులో పాఠాలు కూడా చెప్పాను. కరోనా మమ్మల్ని రోడ్డున పడేసింది. తర్వాత తాపీ పని చేశాను. ఇళ్లకు రంగులేశాను. ఏది పడితే అది చేశాను. సిగ్గు పడలేదు’ చెప్పడం ఆపాడు. ఆశ్చర్యపోయాను. కిట్టయ్య మాటల్ని అక్షరాల్లో యథాతథంగా చెప్పను. కిట్టయ్య చెప్పిన తన ముత్తాత నరసయ్య వీరోచిత గాథను కథనంగా చెబుతాను. చదవండి. అలాగే బావుంటుంది. చదువుతూ దృశ్యాన్ని ఊహించుకోండి. ∙∙ నరసయ్య ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అనుకుంటూ కండలు పెంచాడు. నరనరాన అమిత దేశభక్తి. పరాయి పాలనను అంతమొందించడానికి శారీరకశక్తి అవసరం అనుకున్నాడు. వస్తాదుగా మారాడు. శాసనోల్లంఘన కాలం. మహాత్మాగాంధీని అరెస్టు చేశారు. నిరసన జ్వాలలు చెలరేగాయి. ప్రజలు ఉద్యమించారు. వందేమాతరం నినాదం ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తోంది. జెండా ఎగరేయడం ఆత్మగౌరవ ప్రతీకగా మారింది. ఎందరో త్వాగమూర్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాద తుపాకులకు బలైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా ఎగరేసి తీరాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు నరసయ్య. తన నిర్ణయాన్ని ముందుగా అందరికీ తెలియజేశాడు. ఆ విషయం పరపాలకులకు తెలిసిపోయింది. ఆ చోటును పోలీసులతో నింపేశారు. నరసయ్య వెనకడుగు వేయలేదు. ఎవరెంత వారించినా వినలేదు. దేశం కోసం త్యాగం చేసే అదృష్టం తనది అనుకున్నాడు. చెప్పిన సమయానికి జెండా స్తంభం దగ్గరకు చేరుకున్నాడు. లాఠీలు నరసయ్య ఒంటి మీద విరుచుకు పడ్డాయి. చలించలేదు. పంటి బిగువున బాధను దిగమింగుకున్నాడు. జెండా చేబూని ముందుకే సాగాడు. దెబ్బలకు చేయి అడ్డం పెట్టుకుని కాచుకుంటూ నడిచాడు. స్తంభాన్ని కౌగిలించుకున్నాడు. శరీరం రక్తసిక్తమైంది. స్తంభం ఎక్కడం ప్రారంభించాడు. పోలీసులు తమ ప్రతాపం చూపించారు. లెక్క చేయలేదు. ఎట్టకేలకు జెండాను శిఖరాగ్రాన నిలిపాడు. దిక్కులుపిక్కటిల్లేలా ‘వందేమాతరం’ అని నినదించాడు. అంతే.. అంతెత్తు నుండి కింద పడిపోయాడు. స్పృహ తప్పింది. కాసేపటికి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ∙∙ ‘మా ముత్తాత పౌరుషం గురించి తాత చెప్పేవారు తర్వాత మా నాన్న చెప్పేవారు. అవి వింటూ పెరిగాను. ముత్తాత వాడిన వస్తువులే మా ఆస్తులు. భద్రంగా దాచుకుని కాపాడుకుంటున్నాం. మీ లాంటి వారికి చూపించుకుంటూ ఆనందిస్తున్నాం. దేశం కోసం ఆత్మార్పణం చేసిన త్యాగమూర్తి మా ముత్తాత. అమృతోత్సవం నాడైనా నరసయ్య గురించి కాసింత మాట్లాడండి. ఇప్పటి పిల్లలకు చెప్పండి, సార్’ కిట్టయ్య గర్వంగా చెబుతూ నా ముఖం కేసి చూశాడు. ‘తప్పకుండా. ఇప్పటి కార్యక్రమమే అది. ఆ పెట్టెను సభావేదిక దగ్గరకు తీసుకురండి. మీ వాడు కథ వినడమే తప్ప రాయనని చెప్పాడు. వాడి చేత మీ ముత్తాత కథను రాయిస్తాను. మీరే చూడండి’ అని వీరయ్యను దగ్గరకు రమ్మన్నాను. వీరయ్య వెంటనే ‘ఇవన్నీ మళ్లీ తిరిగిచ్చేస్తారు కదా’ అనుమానం వ్యక్తపరచాడు. ‘మేము బయటకు ఇవ్వం. ఏటా నరసయ్య గారి పుట్టినరోజున మేం వాటిని బయటకు తీసి పూజిస్తాం. మా నాన్న పాట కూడా పాడతాడు’ అన్నాడు. ‘మీ ఆస్తిని ఎవరూ దొంగిలించలేరు. భయపడకు. నరసయ్యను లోకానికి పరిచయం చేద్దాం’ సుందరానికి విషయం చెప్పి కథాకార్యశాలలో ముగింపు సభలో కిట్టయ్యను సత్కరించాం. పిల్లల్నీ నరసయ్య కథ రాయమన్నాం. రాసిన వారందరికీ బహుమతులు ఉంటాయని చెప్పాం. అది సరే. విశేషాల్ని పొందుపరుస్తూ నేనూ కథ రాశాను. అది ఇదే. ఇదొక పాఠంగా ఈ కథను పిల్లల చేత చదివింపచేస్తాను. -దాట్ల దేవదానం రాజు -
పిల్లల కథ: ఎవరికి విలువ?
ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది. ‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కథ: వీడిన దుర్గంధం.. నీలను ఈసడించుకున్నందుకు చంద్రకళ కళ్లల్లో నీళ్లు!
విశాఖపట్నం, మువ్వలవానిపాలెం.. బస్టాండ్‌లో ఉంది నీల. ఉదయం తొమ్మిది గంటలు.. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే సమయం. రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు ఆదరాబాదరాగా కనిపిస్తున్నారు. ఎండ అప్పటికే చురచురలాడుతోంది. చెమట్లు పోస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నీలవైపు చూస్తున్నారు. చూసినవారు అటువైపు వెళ్లకుండా నీలకు దూరంగా జరిగిపోతున్నారు. నీల కురూపి కాదు.. భిక్షగత్తె కాదు. రోగిష్టీ కాదు. పిచ్చిదీ కాదు. అయినా ఆమెకు దూరంగా వెళ్లిపోతున్నారు. నీల.. నల్ల ముద్దబంతిలా ఉంటుంది. మెరుపులాంటి ఆకర్షణ. ఆమె చెవులకు చిన్న బుట్టలు వేళ్ళాడుతుంటాయి. నుదుటిపై చిన్నరూపాయి బిళ్లంత బొట్టు. మెడలో పసుపుతాడు. తాడులో నల్లపూసల్లో పుస్తెలు. సన్నమూ కాకుండా మరీ లావు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. తను ఎక్కాల్సిన ఆటోకోసం ఎదురు చూస్తోంది. ఈరోజు ఆలస్యం అయిందనుకుంటోంది. ఓ నాలుగైదు ఈగలు తన చుట్టూరా తిరుగుతున్నాయి. సుమ్మగుడ్డతో వాటిని చికాగ్గా తరుముతోంది. ముసురుతున్న ఈగల్ని.. నీల దగ్గరున్న బుట్టని చూసి అటువైపుగా మనుషులు వెళ్లడం లేదు. నీలకి అది అలవాటే. ‘నీలక్కా ఆటో రాలేదా?’ నవ్వుతూ వచ్చి నీల పక్కగా నిలబడ్డాడు రామ్మూర్తి. నీల కూడా రామ్మూర్తిని నవ్వుతూ పలకరించింది ‘రాలేదు బాబూ’ అని.. సుమ్మ గుడ్డతో ఈగలు రొప్పుతూ బుట్ట సర్దుకుంటూ. అక్కడున్న అందరూ ఆ బుట్టవైపే చూస్తున్నారు. కొంతమంది ముక్కుపై రుమాలు పెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు పైటలు అడ్డు పెట్టుకుంటున్నారు ముక్కుకి. కొంతమంది సహజంగానే నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ పిల్లి ‘మ్యావ్.. మ్యావ్’ అంటూ బుట్టవైపు.. నీలవైపు మార్చి మార్చి చూడసాగింది. ఆ పిల్లికి అలవాటే నీల బుట్ట వాసన ఎంత దూరం నుండైనా కనిపెడుతుంది. ఓ హక్కులా వచ్చి నీల చుట్టూ తిరుగుతుంది. అప్పుడప్పుడూ హూంకరించినట్టు చూస్తుంది. ఆ పిల్లి సైకాలజీ నీలకూ తెలుసు. ‘యెల్లెళ్లు.. తిరిగొచ్చినాక నీ గొడవ సూత్తాను’ అని తన చేతిలోని గుడ్డతో విదిలించింది. దూరంగా ఉన్న ఓ కాకి ధైర్యంగా వచ్చి బుట్టపై నుండి ఎగిరింది. ‘అవి నీకొదలవు నీలక్కా’ అన్నాడు రామ్మూర్తి బుట్టలు చూస్తూ. ‘అవును బాబూ! పాపం.. వాటికి మిగిలిపోయిన బుర్రలు, తోకలు పడేస్తుంటాను’ అంది బుట్టలపై ఓ గుడ్డ కప్పుతూ. నీల బుట్టలు అంచెలంచెలుగా సర్దుంటాయి. కిందన సిల్వర్ డేక్సీ, దానిపైన పళ్లెం లాంటి సిల్వర్ ప్లేట్ మూతలా ఉంటుంది. దానిపైన ఓ వెదురు బద్దల దాగర, దానిపైన సన్ మైకా అంటించిన పల్చటి ప్లాంకులాంటి బల్ల చెక్క. దానిపైన మరో వెదురు బుట్ట.. దాంట్లో ఓ ప్లాస్టిక్ పీట, ఒక కత్తిపీట, మంచినీళ్ల సీసా! ఆ బుట్టలో నాలుగు క్యారీ బ్యాగుల్లో నాలుగు రకాల ఎండు చేపలను పెట్టుకుంటుంది. కింద సిల్వర్ డేక్సీలో తాజా పచ్చి చేపలు. నెత్తళ్లు, గులిబిందలు, వరిసరిపిలు, చందువాలు అయిసు ముక్కల్లో ఉంచుతుంది. రామ్మూర్తి, నీల ఒకే ఆటోకోసం ఎదురు చూస్తున్నారు. రోజూ వాళ్లిద్దరూ ఒకే ఆటోలో ఎంవీపీ కాలనీ నుండి కొత్తరోడ్డు వరకూ వెళ్తారు. ఆ ఇద్దరూ సహచర ప్రయాణికులు కావటంతో నీలక్కా అంటాడు రామ్మూర్తి. తను కూడా తమ్ముడులానే బాబూ అని పిలుస్తుంది. కష్టసుఖాలు కలపోసుకుంటుంటారు ఖాళీ టైమ్‌లో. నీల .. వీధుల్లో చేపలు అమ్ముతుంది. ఆమె బతుకుతెరువు అదే. హార్బర్లో చేపలు కొని వీధుల్లో తిరిగి అమ్ముతుంది. రోజుకు మూడు వేలు పెట్టుబడి పెడితే ఐదారు వందలు సంపాదిస్తుంది. కాళ్లలోనూ, గొంతులోనూ ఎక్కువ బిగువుండాలి. తల బలంగా నిలబడాలి. నెత్తిన పది పదిహేను కేజీల బరువుతో ‘చేపలమ్మా.. చేపలు.. నెత్తళ్లు.. రెయ్యిలు.. చేపలమ్మా చేపలు..’ అని వీధి చివరకంటూ వినిపించేలా అరవాలి. మేడల్లో తలుపులేసుకున్న ఇల్లు తలుపులు తట్టే కేకలు పెట్టాలి. బలమూ బిగీ ఉండాలంటుంది నీల. అంత కష్టపడితే ఐదారొందలు మిగలడం కష్టమంటుంది. ‘అరేయ్ బాబూ.. ఆటోరాజుకి ఫోన్ చెయ్యి. వాడు రాకపోతే వేరే ఆటోలో యెలిపోదుమ. లేటైతే ఖాతాలు పోతాయి బాబూ..’ అంది రామ్మూర్తి వైపు చూస్తూ. ‘అలాగే నీలక్కా’ అంటూ ఫోను ప్రయత్నించసాగాడు అతను. రామ్మూర్తి ఓ దేవాలయంలో పనిచేస్తాడు. లెక్కలు రాయటం, టికెట్లు అమ్మటం, పురోహితులకు సహకరించటం వంటివన్నీ చూసుకుంటాడు. నెలకు మూడు వేల రూపాయల జీతమిస్తుంది ట్రస్ట్. ఆపైన పూజార్లు కాయాకసురు పండూఫలము ఇస్తుంటారు. డిగ్రీ చదువుకున్నాడు. పోటీపరీక్షలు రాస్తున్నానని చెపుతుంటాడు కానీ ఒక్కటీ తగల్లేదు. చిన్నప్పుడు వేదం నేర్చుకున్నాడట. కానీ మధ్యలో కాలేజీ ప్రభావంతో అన్నీ పక్కన్నెట్టేశాడట. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాడట. ఉద్యోగం దొరికేవరకూ ఏదో ఒక ఉపాధి. దేవాలయానికి వెళ్లగానే ప్యాంటూ, షర్టు తీసేసి కండువా పంచెకట్టులోకి మారిపోతాడు. మెడలో రుద్రాక్షమాల వేస్తాడు. నుదుటిపై మూడు అడ్డునామాలు పెట్టేసి రామ్మూర్తి పంతులైపోతాడు. వాళ్ల నాన్న గుడిలో పూజారేనట. చనిపోయాడు. ‘వస్తున్నాడట నీలక్కా.. ట్రాఫిక్ జామైయిందట. ఆ రోడ్డులో మంత్రి గారి కాన్వాయి వెళ్లిందట. ఇప్పుడే క్లియర్ చేశారట’ అని రామ్మూర్తి చెప్తూండగానే వాళ్లు ఎక్కాల్సిన ఆటో రానే వచ్చింది. అప్పటికే అందులో ఓ ఇద్దరు ఆడవాళ్లు కూర్చోనున్నారు. ముందు సిల్క్ చీరలో నడివయస్సాడావిడ ఒకరు. నేత చీరలో కొంచెం పెద్దావిడ మరొకరు. ఆటో ఆగగానే వాళ్లిద్దరూ ముక్కులు మూసుకున్నారు. గాబరా గాబరాగా తన బుట్టలు ఆటో వెనుక పెట్టడానికి ఉపక్రమించింది నీల. ‘రండి.. రండి.. మీకు బాగా లేటైపోయింది’ అని ఆటో రాజు తన సీటులోంచి తలబైటకు పెట్టి కేక వేశాడు. రామ్మూర్తి వైపు సాయంకోసం చూసింది నీల. బరువుగా ఉన్న బుట్టను ఎత్తి ఆటోలో పెట్టాలంటే రోజూ రామ్మూర్తే సాయం పడుతుంటాడు. ఆటో వెనుక బుట్టలు పెట్టారు. ‘ ఏంటండీ ఇదీ! ఈ కంపు మేం భరించలేం’ అంది సీటులో కూర్చున్న నడివయస్సావిడ. ‘మాకూ పడదండీ’ మరో ఆవిడ కూడా. ‘అమ్మా.. ఇది నా బేరం. వాళ్లు రోజూ ఎక్కుతారు. వాళ్లతోపాటు మీకులాగే చాలామంది ఎక్కి దిగుతుంటారు. మీరు భరించలేకపోతే దిగిపోండి లేకుంటే ఓ పావుగంట ఓపిక పట్టండి మీ స్టాప్ వచ్చేస్తుంది’ అన్నాడు రాజు. ‘దిగిపోవాలంటే ఎంతసేపూ పట్టదండీ! కాకపోతే నేను అర్జెంటుగా అక్కయ్యపాలెం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లాలి. నాకు తప్పదులెండి. ఈ దరిద్రం అనుభవించాల్సిందే’ ఛీత్కారంగా మాట్లాడిందావిడ. రామ్మూర్తి.. వాళ్ళ చిరాకు పరాకులు వింటున్నాడు. ఈలోగా నీల లోపలకెక్కి కూర్చొంది. వెనుక సీటులో ముగ్గురూ సరిపోయారు. ఆ నడివయస్సావిడ పక్కన నీల కూర్చోటంతో ఆవిడకు ముళ్లపైన కూర్చున్నట్లుగా ఉంది. తన దగ్గరున్న ఓ సంచినీ మధ్యలో అడ్డుగా పెట్టుకుంది. ఈలోగా ఇంకోతను వచ్చి వాళ్ల ఎదురు చిన్న బల్ల సీటుపైన కూర్చొన్నాడు. ఆయన కాళ్లు వాళ్ల కాళ్ళకు తగులుతున్నాయి. నడివయస్సావిడ తన కాళ్లను కాస్త పక్కకు జరిపింది. దాంతో ఇటు అతణ్ణి.. బ్యాగ్ అడ్డుతో అటు నీలనూ తగలకుండా జాగ్రత్తపడుతూ పైటతో ముక్కు కప్పుకుని ‘తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదనే ఇంగితం ఉండాలి. వీధుల్లో తిరిగేవాళ్లు, చేపలు అమ్మకునేవాళ్లు వేరే ఆటో కట్టించుకోవాలి’ అంటూ మూతి, కంటినొసలు ముడుచుకొని ఊపిరి బిగపట్టేసి అత్తిపత్తిలా కూర్చొంది. ఆవిడ మాటలకి రామ్మూర్తికి చుర్రుమంది. కుర్రోడు కదా వెంటనే కౌంటరు వేసుకున్నాడు.. ‘ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు? కంపుల్లేకుండా ఇంపుగా కార్లో వెళ్లండి’ అంటూ గదమాయించిన స్వరంతో. ‘ఏం లేదు బాబూ.. ఈరోజు తెల్లారి లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో! అడ్డమైన వాళ్లతో కలసి వెళ్లాల్సి వస్తోంది’ బైటకు వినీవినిపించనట్టు అంది. ‘మాటలు జాగ్రత్తగా ఆడండి. ఇక్కడ అడ్డమైన వాళ్లు ఎవరూలేరు. మేమెప్పుడూ ఈ ఆటోలోనే వెళ్తాం, వస్తాం. నోరు పారేసుకోకండి’ గట్టిగానే బదులిచ్చాడు రామ్మూర్తి. ‘ఎందుకులే బాబూ.. తగువు?’ అంది నీల. ‘తగువు కాదక్కా.. తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడు! కష్టపడ్డమంటే ఏం తెలుసు వీళ్లకు? ఈ దేశంలో సగానికిపైగా కంపుల్లోనే పని చేస్తూ బతుకుతున్నారు. ఒకరి బతుకుని కించపర్చడం మంచిది కాదు.. ఎవరి బతుకులు వాళ్లవి’ ఆవేశంతో రామ్మూర్తి. వెనుదిరిగి మాట్లాడుతున్న రామ్మూర్తి.. గతుకులో ఆటో పడ్డంతో ముందుకు తూలి డ్రైవర్ మీద పడ్డాడు. వెనుకవాళ్లూ పట్టు తప్పారు. బిగదీసుకొని కూర్చున్నావిడ నీల మీద పడింది. ఎదురుగా కూర్చున్నాయన కూడా నడివయస్సావిడ మీద పడబోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు. మధ్యలో పెట్టిన సంచి కాళ్ల కింద పడింది. ‘అబ్బా.. రాజూ నడుములు విరిసేసినావు’ రామ్మూర్తి. ‘నేనేటి చేస్తానయ్యా..’ ‘బాబ్బాబూ.. నెమ్మదయ్యా.. నా గంపలు తుళ్లిపోతాయి’ అని వెనుకనున్న గంపలపై చెయ్యి వేసింది. ఆ చెయ్యి నడివయస్సావిడ చెయ్యిపై పడింది. ఆవిడ కూడా వెనుక సీటుకు సపోర్టు చేస్తూ తన చెయ్యి వెనక్కు వేసింది, ఆ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. నీల చేయిపడ్డంతో ఠక్కున తీసేసింది. ‘అమ్మా.. అక్కయ్యపాలెం.. దిగండి.. దిగండి..’ కేక వేశాడు డ్రైవర్.. ఆటో ఆపుతూ. దిగేవాళ్లకి తోవ ఇవ్వటానికి నీల దిగింది. గబగబా నడివయస్సావిడ దిగింది. డ్రైవర్‌కి డబ్బులిస్తూ ‘అబ్బ.. గొప్ప నరకం చూపించావులే’ అంటూ అందరినీ చురచురా చూసి చకచకా వెళ్లిపోయింది అక్కడి నుంచి. ఆటో ముందుకు కదిలింది. తరువాత స్టేజీలో ఇంకో ఆవిడ దిగింది. ఇంకో ఇద్దరు ఎక్కారు. తన స్టేజీ రావడంతో దిగిపోతూ రామ్మూర్తి.. ‘నీలక్కా రేపు కలుద్దాం’ అంటూ ‘బాయ్’ చెప్పాడు. నీల దిగే స్టేజీ వచ్చింది. ఆటో ఆగిన తరువాత డ్రైవర్ రాజు నీలకు సాయం చేశాడు బుట్టలు దింపడంలో. నీల ఓ గుడ్డను రింగులా సుమ్మ చుట్టి నెత్తిపైన పెట్టింది. పైట మాటిమాటికీ ఎగురకుండా గట్టిగా నడుంలోకి దూర్చింది. బుట్టలకు సాయం పట్టి నీల నెత్తిపైన పెట్టాడు రాజు. ‘సరిగ్గా, ఒంటి గంటకు వచ్చేస్తాను.. పావుగంట అటూ ఇటుగా’ అని చెప్పి ఆటో ఎక్కేశాడు రాజు. ∙∙ ‘చేపలోయ్..’ అని అరుస్తూ తన రోజువారీ ఖాతాదారుల వీధుల్లోకి ప్రవేశించింది నీల. ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది. వాచ్‌మేన్ సాయంతో బుట్ట దింపింది. బుట్టలో సామాన్లు ఒక్కొక్కటి కింద పెడుతోంది. తను కూర్చునే ప్లాస్టిక్ సీటు పైకి తీసింది. ఆశ్చర్యం! ఆపై బుట్టలో ఎండు చేపల కవర్ల మధ్యలో కత్తిపీట పక్కన ఒక మనీపర్సు కనిపించింది నీలకు. ఆత్రుతతో జిప్ తెరచింది. మరింత ఆశ్చర్యపోయింది. ‘అయ్య బాబోయ్.. డబ్బుల కట్టలు’ అనుకుంటూ కళ్లు పెద్దవి చేసింది. చేతులు చిన్నగా వణకసాగాయి. అలాంటి నోట్ల కట్టలను తనెప్పుడూ చూడ్లేదు. ఇదే ప్రథమం. రెండు వేల కట్టలు రెండు. ఐదొందల కట్ట ఒకటి. మూడు కట్టలూ కొత్తగా పిన్ను కొట్టి ఉన్నాయి. ఎవరో వచ్చిన సడి చూసి గబగబా జిప్ మూసేసి తెలివిగా పర్సును ఓ నల్ల క్యారీ బ్యాగ్ కవర్లో పెట్టింది. మూడు బేరాలు వచ్చాయి. వేగంగా చేపలు శుభ్రం చేసేసి కత్తిపీటతో తలలు, తోకలు, పొలుసు తీసేసింది. శుద్ధి చేసిన చేపలు కవర్లో పెట్టి వాళ్లని పంపించేసింది. రెండు మూడు వీధులు తిరిగింది. బుట్ట సగం కంటే ఎక్కువే ఖాళీ అయింది. బుట్ట ఖాళీ అవుతున్నా ఆలోచనలతో తల బరువెక్కుతోంది. రామ్మూర్తికి ఫో¯Œ చేసి చెప్పనా? ఆటో రాజుకు చెప్పనా? లేదంటే ఎవ్వరికీ చెప్పకుండా.. ఛ.. ఛ.. దరిద్రపు ఆలోచనలు అనుకొంది. అయినా ఒకరి కష్టం నాకెందుకు? నా రెక్కల కష్టం నాది. కష్టం విలువే కదా డబ్బు. నేను ఐదు గంటలు కష్టపడితే ఐదొందలొస్తాయి. ఈ లెక్కన ఆ నోట్లు.. ఎన్ని రోజుల కష్టానివో! మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది.. బుట్ట దించేటప్పుడు, ఎత్తుకునేటవ్వుడు జాగ్రత్తగా నల్ల క్యారీ బ్యాగ్‌ని చూనుకుంటోంది..‘డబ్బులేం చెయ్యాలీ’ అనే ఆలోచనలే ముసురుకుంటున్నాయి. తన చుట్టూ రోజూ చేరే ఈగల్లా! పర్సు పోయిన వాళ్లు పోలీసులకు చెబితే.. పోలీసులు ఆటోరాజును పిలిపిస్తే.. ఆటోరాజు నా గూర్చి, రామ్మూర్తి గూర్చి చెపితే, వాళ్లు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెడితే.. పరిపరి విధాల పోతోంది నీల మనసు. అసలకి అదేం డబ్బో? దొంగ డబ్బో? కష్టం డబ్బో? నేనే నేరుగా పోలీసులకు అప్పగించేస్తే?! మంచి పోలీసైతే ఆరా తీస్తారు. కాకపోతే కాజేస్తారు. వాళ్లతో ముందుకెళ్తే గొయ్యి.. వెనక్కెళ్తే నుయ్యి! ఆ ఆలోచనలతో నడుస్తూ ‘ చేపలూ..’ అంటూ అరవడం మానేసింది నీల. వీధి మలుపు దగ్గర ఒకతను ఆపాడు. తన దగ్గర ఉన్న చేపలన్నీ తీసుకుంటానన్నాడు. బేరసారాలకు చూడకుండా, నష్టం రాకుండా ఇచ్చేసింది. తనకారోజు వచ్చిన డబ్బులు లెక్క చూసుకుంది. తన వస్తువులన్నిటినీ శుభ్రం చేసుకుని.. బుట్టలన్నీ వరుస క్రమంలో పెట్టుకుంది. పర్సున్న నల్ల కవరు మళ్లీ మళ్లీ చూసుకుంది. రోడ్డు పక్కన చెట్టు నీడకు చేరింది. పర్సు సరిగా చూడలేదు. దానిలో ఇంకేమైనా ఉన్నాయా? ఆ పర్సు ఎవరిదని ఎలా గుర్తించటం.. ఆలోచనలతో పర్సు మళ్లీ చూసింది నీల. నోట్లకట్టలతోపాటు ఆధార్ కార్డు, ఒక విజిటింగ్ కార్డు కనిపించాయి. నీల పెద్దగా చదువుకోలేదు కానీ అక్షరజ్ఞానం ఉంది. ఆధార్కార్డలో అడ్రస్ చూసింది. ఇంటి నెంబరు చూసింది. విశాలాక్షినగర్, విశాఖపట్నం అని ఉంది. మరైతే మాకు దగ్గరే అనుకుంది. విజిటింగ్ కార్డు తకేమీ అర్థం కాలేదు కానీ అందులోని ఫోన్ నెంబరును మాత్రం గ్రహించింది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఆ డబ్బులు ఎవరివనేవి తెలిసిపోతుందనుకుంది. అయినా ఇంత డబ్బు వాళ్ళకు ఇవ్వాలంటే ఎవరినైనా తోడు పెట్టుకోవాలనుకుంది. రామ్మూర్తే మెదిలాడు మనసులో. అవును అతనే కచ్చితమైన మనిషి. ఆ అబ్బాయినే పిలుస్తాను. ఎక్కువ మందికి తెలిసినా ప్రమాదమే! రామ్మూర్తికి ముందే చెప్పాలి ఎవరికీ తెలీకూడదని అనుకుంటూనే రామ్మూర్తికి ఫోన్ చేసింది. తనుండే బస్టాపు దగ్గరలోని మర్రిచెట్టు దగ్గరకు రమ్మనిచెప్పి అతని కోసం ఎదురుచూడసాగింది. ఎప్పుడో తనోసారి తన సిక్కం పారేసుకుంది. ఆరోజున ఎంత బాధపడిందో జ్ఞాపకం తెచ్చుకుంది. తనవి పోయినవి రెండొందలే! కానీ ఇవో.. ‘అయ్య బాబోయ్’ అని గుండె బాదుకుంది. ఎవరిదో సైకిల్ తీసుకొని గాబరా గాబరాగా వచ్చాడు రామ్మూర్తి. జరిగిందంతా చెప్పింది నీల. ఆమె మనసుని అర్థం చేసుకున్నాడు. ‘సరే అక్కా ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు నీతో వచ్చినా మన డ్రైవర్‌కి అనుమానం రావచ్చును. మామూలుగా నీవెళ్లిపో.. నేను వేరే బస్సులో వచ్చేస్తా. అడ్రస్‌లోని ఇల్లు అక్కడకు దగ్గరే కాబట్టి. అక్కడకు నేను వచ్చిన తరువాత ఆ నెంబర్‌కు ఫోన్ చేద్దాం’ అన్నాడు. ‘సరే’ అంది నీల. రామ్మూర్తి వెళ్లిపోయిన ఐదు నిమిషాల్లో ఆటోరాజు వచ్చేశాడు. అప్పటికే బుట్టలు సర్దుకుని ఉన్న నీల.. గబగబా ఆటో వెనుక ఎక్కేందుకు ప్రయత్నించింది. ‘ఏటి నీలమ్మా... ముందుకొచ్చే. సీటు ఖాళీనే కదా’ అన్నాడు డైవర్. ‘యవురైనా ఎక్కుతారులే బాబూ’ అని వెనుకే కూర్చుంది. బుట్టలు కదలకుండా ఒక చేయి వాటిపై ఉంచి. ఆటో కదిలింది. మధ్యమధ్యలో ఒకరిద్దరు ఎక్కటం దిగటం జరుగుతావుంది. ఎండకి రోడ్డు వేడెక్కివుంది. వేడిగాలులు వీస్తున్నాయి. నీల దిగాల్సిన ఎంవీపీ కాలనీ వచ్చింది. నీల దిగి.. బుట్టల్నీ దించింది. ‘రేపు కలుద్దాం నీలమ్మా’ అంటూ రాజు ముందుకు పోనిచ్చాడు ఆటోని. మధ్యాహ్న సమయం కావడంతో బస్‌స్టాండ్‌లో ఎవ్వరూ లేరు. ఓ మూలన నీల అలా బుట్టలు పెట్టిందో లేదో ఇలా వచ్చేసింది పిల్లి ‘మ్యావ్’ అంటూ. అలవాటు ప్రకారం ‘వచ్చీసినావా తల్లీ!’ అంటూ తాను తెచ్చిన పచ్చి నెత్తళ్ల తలలు కవర్లోంచి తీసి కొంచెం దూరంలో ఓ క్రమంగా పడేసింది. పిల్లి నెమ్మదిగా అటు పరుగుతీసింది. అంతలోకే రామ్మూర్తీ బస్సు దిగాడు. ‘అమ్మయ్య.. వచ్చీసినావా!’ అంది అతన్ని భారం దించుకున్నట్టుగా. చుట్టూ చూశాడు రామ్మూర్తి. పిల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లి కూడా కళ్లు మూసుకుని దాని పని అది చేసుకుంటోంది. ‘నీలక్కా.. ముందుగా మనం ఈ ఫోన్ నెంబర్‌తో మాట్లాడి మీ ఆధార్ దొరికిందని చెపుదాం. అప్పుడు అది వాళ్లదో కాదో మనం తెలుసుకోవచ్చు. ఆధార్‌లోని పేరు వాళ్లు చెప్పిన పేరు ఒక్కటే అయితే ఈ పర్స్ వారిదే అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్లని రమ్మందాం’ అన్నాడు రామ్మూర్తి. ‘కచ్చితంగా వాళ్లే బాబూ.. ఆ వాసనకు మెలికలు తిరిగిపోయినావిడవే బాబూ..తరువాత ఎవ్వరూ అలాంటి బ్యాగులున్నోళ్లు ఎక్కనేదు’ అంది నీల. రామ్మూర్తి ఫోన్ చేశాడు. ఫోన్ కలిసింది. ‘హలో, హలో..’ అంటూ అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లాడు. మాట్లాడుకుంటూ వచ్చాడు. నీలకు ఆందోళనగా ఉంది. రామ్మూర్తి చెప్పాడు..‘నీలక్కా ఆధార్ కన్ఫర్మ్ అయింది. వాళ్లు వస్తారు’ అని. ‘ఆవిడేనా?’ ఆత్రంగా నీల. ‘వస్తే కదా తెలిసేది? ఆవిడ పేరు.. ఆధార్ పేరు ఒక్కటే.. చంద్రకళ’ చెప్పాడు రామ్మూర్తి. ‘పోన్లే బాబూ.. ఎవరి కష్టం వారికి చేర్చేస్తాం’ సంబర పడింది. చంద్రకళ రాకకోసం ఎదురు చూడసాగారు ఇద్దరూ. పర్సు బుట్టలోనే ఉంది. ఇచ్చేవరకు నీలకు భయమే! ∙∙ దూరంగా ఓ కారాగింది. కారులోంచి ఒకావిడ దిగి నీల, రామ్మూర్తి ఉన్న వైపు రాసాగింది. ఆవిడ వెనుకనే ఒకతను కూడా ఉన్నాడు. వాళ్ళు తాలూకా కావాలి. ‘వాళ్లే నీలక్కా.. అటు చూడు అవిడే కదా ఉదయం ఆటో ఎక్కింది?’ రామ్మూర్తి. ‘అవును బాబూ.. వాళ్లే... వాళ్లే..’ నీల.. కన్ఫర్మ్ చేసుకుంటూ. వాళ్లు దగ్గరకొస్తుండగానే ఓవైపు సంబరం.. బాధతో ఉక్కిరిబిక్కిరైపోయింది నీల. వెంటనే వాళ్ల పర్స్ వాళ్లకు ఇచ్చేయాలన్న తాపత్రయంలో వాళ్లేం మాట్లాడతారోనని కూడా చూడకుండా వాళ్లలా వచ్చీరావడంతోనే.. ‘అమ్మమ్మా.. ఎంత బాధ పడిపోనావో తల్లీ! డబ్బులు పోనాయి కదా నీకష్టం పోయిందని! ఇంద తల్లీ.. ఇంద.. ఇది నీ పరసే తల్లీ.. ఇదిగిదిగో నాకే దొరికింది’ అంటూ ఉద్వేగంతో బుట్టలో దాచిన పర్సును ఆవిడ చేతిలో పెట్టింది. ‘ఎంత గొప్ప మనసు! ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా? ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించే వాళ్లు! నీలక్కా.. నీకు పాదాభివందనాలు’ అని మనసులో దండం పెట్టుకుంటూ ఆ పర్సు చంద్రకళకు అందించే దృశ్యాన్ని చూసి చలించిపోయాడు రామ్మూర్తి. పర్సు తీసి చూసుకుంది చంద్రకళ. అన్నీ ఉన్నాయి. తను పోగొట్టుకున్నవన్నీ దొరికాయి. ఉదయం నీలను ఈసడించుకున్నందుకుగాను ఇప్పుడు చంద్రకళ కళ్లలో నీళ్లు తిరిగాయి. నీల కాళ్లపై పడబోయింది. వారించింది నీల. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది చంద్రకళ. నీల చమట వాసన, నీల చేపల వాసన ఏమీ తెలియలేదు చంద్రకళకి. నీల మనసులోని పరిమళ సుగంధాలు అక్కడ చుట్టూ అలముకున్నాయి. - బొడ్డ కుర్మారావు చదవండి: కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు -
కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు
నేను నాకిచ్చిన అడ్రస్‌కు చేరుకొని హారన్ మోగించాను. కాసేపు ఆగి మళ్లీ హారన్ వేశాను. నా షిఫ్టులో ఇది ఆఖరి బేరం కాబట్టి కాసేపు వేచి చూసి, ఇంటికి వెళ్లి పోవాలనుకున్నాను. కారును ఇంటి ముందు పార్క్ చేసి, ఆ ఇంటి వద్దకు వెళ్లి, తలుపు తట్టాను. ‘ఒక్క నిమిషం’ అంటూ లోపల నుండి పీలగా వున్న ఒక ముసలావిడ గొంతు వినిపించింది. ఇంటిలోపల ఏదో వస్తువును నేలపై తోసుకు వస్తున్న శబ్దం వినిపించింది. చాలాసేపటి తరువాత తలుపు తెరుచుకుంది. తొంభై ఏళ్లు పైబడ్డ ఒక పొట్టి వృద్ధురాలు నా ముందు నిలుచుంది. పాత మోడల్లో వున్న ఒక ప్రింటెడ్ గౌను, నర్సులు వేసుకొనే చిన్న టోపీతో వున్న ఆమె.. నాకు 1940ల బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో దర్శనమిచ్చే నటీమణులను జ్ఞప్తికి తెచ్చింది. ఆమె పక్కనే ఒక చిన్న నైలాన్ సూట్ కేసు వుంది. ఆ అపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి మనుషులు నివసిస్తున్నట్లు లేదు. కుర్చీలు, సోఫాలన్నింటిపై గుడ్డ కవర్లున్నాయి. గోడలపై గడియారాలు కానీ, టేబుళ్లపై పాత్రలు కానీ లేవు. ఒక మూలనున్న అట్టపెట్టెలో ఫొటోలు, గాజు సామాగ్రి వుంది. ‘నా పెట్టెను కారు వరకు తీసుకురాగలరా?’ అని నెమ్మదిగా అభ్యర్థించిందామె. నేను సూట్‌కేసును కారులో పెట్టి, తిరిగి ఆమె దగ్గరకు చేరాను. ఆమెను నడిపించుకొని చిన్నగా నా టాక్సీ దగ్గరకు వచ్చాను. ఆమె నా దయాహృదయాన్ని మెచ్చుకోసాగింది. ‘అదేమీ లేదు. మహిళా ప్రయాణికులందరినీ నా తల్లిలాగే చూస్తాను’ అన్నాను. ‘నువ్వు చాలా మంచివాడివి’ అని నాకు ఒక చిరునామా రాసి వున్న కాగితం ఇచ్చిందావిడ. ‘మెయిన్ బజార్ల ద్వారా నువ్వక్కడికి చేరుకోగలవా?’ అందామె సీట్లో కూర్చుంటూ. ‘అలా వెళ్తే చాలా దూరమవుతుంది’ అన్నాను నేను. ‘ఏమీ ఫర్వాలేదు, నాకేమీ తొందరలేదు. నేను ఒక విందుకు వెళ్తున్నానంతే’ అందావిడ. మిర్రర్లోంచి ఆమె కళ్లు చెమర్చడం నాకు కనిపించింది. ‘నా కుటుంబ సభ్యులెవరూ లేరు. చనిపోయారు. నేనూ ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు’ సన్నని గొంతుతో చెప్పిందావిడ. నేను టాక్సీ మీటర్‌ను చిన్నగా బంద్ చేశాను. ‘మీరు నన్ను ఏ రూట్లో వెళ్లమంటారో చెప్పండి’ అడిగాను. తరువాత రెండు గంటల పాటు, పట్టణంలో చాలా రోడ్లు తిరిగాం మేం. ఆమె ఒకప్పుడు లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసిన భవంతిని నాకు చూపించింది. పెళ్లయిన కొత్తలో, ఆమె భర్తతో కలసి జీవించిన ప్రాంతం గుండా ప్రయాణించాం. ఆమె నన్ను ఒక ఫర్నిచర్ దుకాణం ముందు ఆపమని చెప్పి, దానిని తేరిపార చూసి, ఒకప్పుడు అది ఒక బాల్రూమ్ అనీ, అక్కడ తాను చిన్నతనంలో డాన్స్ చేసేదాన్నని అనందంగా చెప్పింది. కొన్నిసార్లు ఆమె నన్ను ఒకానొక భవంతి ముందో, కూడలిలోనో ఆపమని చెప్పి, చీకటిలోకి చూస్తూ కూర్చునేది. పొద్దుగుంకే సమయంలో ఆమె హఠాత్తుగా ‘నేను అలసిపోయాను, డిన్నర్ జరిగే ప్రదేశానికి వెళ్దామిక’ అంది. నిశబ్దంగా, ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లాం. హాస్పిటల్‌లా వున్న ఒక చిన్న భవంతి చేరుకొని, ఆ ఇంటి ముందు కారు ఆపాను. కారు దిగగానే ఇంట్లో నుండి ఇద్దరు పనివాళ్లు వచ్చి, వృద్ధురాలి వంక గౌరవంగా చూశారు. వారు ఆమె రాక కోసం వేచి వున్నట్లుగా వుంది. నేను కారులోంచి సూట్‌కేసును ఆ ఇంటి గుమ్మం వైపు తీసుకెళ్లాను. అప్పటికే పనివారు వృద్ధురాలిని కారు నుండి దించి, ఒక వీల్ చెయిర్లో కూర్చోబెట్టారు. ‘నీకు ఎంత ఇవ్వాలి?’ సూట్ కేసును ఇంటిలోపల పెట్టి వచ్చిన నన్ను అడిగిందావిడ. ‘ఏమీ ఇవ్వనవసరం లేదు’ అన్నాను వినమ్రంగా. ‘నువ్వూ బతకాలి కదా! టాక్సీకి అయిన డబ్బులు నేను ఇవ్వాల్సిందే’ అంది పెద్దావిడ. ‘వేరే ప్రయాణికులున్నారు కదా, ఫర్వాలేదు’ అన్నాను. అనాలోచితంగా, కిందికి వంగి, ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆమె సంతోషంగా నా శిరస్సు తడిమింది. ‘నువ్వు ఒక వృద్ధురాలిని కాసేపు ఆనందంగా గడిపేలా చేశావ్. థాంక్ యూ, భగవంతుడు నిన్ను తప్పక దీవిస్తాడు’ అందామె ఆప్యాయంగా. నేను ఆమె చేయి ప్రేమగా నొక్కి, ఇంటి బయటకు నడిచాను. నా వెనుక ఒక తలుపు మూసుకొంది. ఒక జీవితం ముగిసినట్లు నాకనిపించింది. ‘ఒక వేళ ఆమెకు ఇంటికి వెళ్లే హడావిడిలో వున్న కోపిష్ఠి డ్రైవరు దొరికివుంటే ఏమయ్యేది? తప్పక తన సహనాన్ని కోల్పోయేవాడు’ అనుకున్నాను. ‘నేను మాత్రం, మొదట ఆమె ఇంటి ముందు కారు ఆపినపుడు, రెండు సార్లు హారన్ కొట్టి వెళ్లిపోయివుంటే..’ అని కూడా అనుకున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు .. ఈ రోజు నేను చేసిన ఈ మంచిపని కన్నా జీవితంలో మరింకే మంచి పని చేయలేదు అనిపించింది. మనం ఘనకార్యాలు సాధించడం జీవిత పరమార్థమని అనుకుంటాం. మన పెంపకం అటువంటిది. కానీ గొప్ప క్షణాలు జీవితంలో అనుకోకుండా వస్తాయి. ఇతరులు వాటికి ఏమీ విలువ ఇవ్వకపోవచ్చు. ప్రజలు మనం ఏమి చేశామని కానీ, వారితో ఏం మాట్లాడమని కానీ గుర్తుంచుకోరు. మనం వారిని ఎలా ఫీల్ అయ్యేలా చేశామని మాత్రం గుర్తుంచుకుంటారు. మీరు ఈ కథను చదివి పది మందికీ చెప్తారు కదూ, థాంక్ యూ. జీవితం రంగుల మయమైనది కాదు. కానీ వున్న జీవితాన్ని ఆనందంగా గడపడం మన చేతిలోనే వుంది. -మూలం : అజ్ఞాత రచయిత అనువాదం : రాచపూటి రమేశ్ చదవండి: ఈవారం కథ- అశ్వతి: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. చివరికి ఏమైంది? -
పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం
చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. ‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి. అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కథ: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. అశ్వతితో నాకున్నది ప్రేమ కాదు! ఐతే!
‘అశ్వతి హియర్’ అశ్వతి గొంతు వినటం అదే తొలిసారి నాకు. వెన్నెల కురిసినట్టు, మల్లెలు విరిసినట్టు, కోయిల కూసినట్టు.. అని కథల్లో రచయితలు ఏదేదో రాస్తుంటారు కానీ నాకేం అలా అనిపించలేదు. మామూలుగానే వినిపించింది. ఐతే నిదానంగా అర్థమవసాగింది ఆ గొంతులోని మాధుర్యం. జ్ఞానితో మాట్లాడేటప్పుడు మన జ్ఞానచక్షువులు ఎలా తెరుచుకుంటాయో, అశ్వతితో మాట్లాడేటప్పుడు నాలోని భావతరంగాలు అలానే ప్రకటితమయ్యేవి. అశ్వతిది కేరళ. ఓ రోజు అడిగాను. ‘అశ్వతి.. పేరు చాలా కొత్తగా వుంది. ఇంతకీ ఏమిటీ ఆ పేరుకర్థం?’ ‘తెలీదు సర్. ఇక్కడ ఆ పేరు చాలా కామన్’ అంది. తర్వాత నేనాలోచించాను. ‘అశ్వ’ అనేది సంస్కృత పదం. అది తెలుగైనా, మళయాళమైనా, హిందీ అయినా! ‘అశ్వతి’ అంటే గుర్రాలకు సంబంధించిందేదో అయ్యుంటుంది’ అన్నాను. తను చిన్నబుచ్చుకుంది. నేనన్నాను ‘పేరుకి అర్థం తెలీకుండా ఏదేదో పెట్టుకుంటే ఇలా చిన్నబుచ్చుకోవడాల్లాంటివే ఉంటాయి. అందుకే అర్థం తెలుసుకో. అశ్వతి అంటే మనిషిలో వుండే ఒకరమైన గ్రేస్ ఫుల్నెస్!’ తను ‘నిజమా’ అని ఆశ్చర్యపోయింది కానీ తేలిగ్గా తీసుకుంది. అశ్వతి చాలా మంచి పిల్ల. మాట్లాడేటప్పుడు మాటల్లోని నిజాయితీ, ఆ లాలిత్యము, మధ్య మధ్యలో సన్నగా, చిన్నగా నవ్వు.. ఒకమ్మాయితో ప్రేమలో పడటానికి ఒక అబ్బాయికి ఇంతకంటే మత్తు మందు అక్కరలేదనుకుంటా. ఐతే అశ్వతితో నాకున్నది ప్రేమ అంటే నే ఒప్పుకోను. అసలు అశ్వతితో నా పరిచయమే విచిత్రంగా జరిగింది. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు. వేసవి విడిది కోసం కేరళ వెళదామని నిశ్చయించుకుని, అక్కడ ఏయే ప్రదేశాలు చూడాలి, వాటి ప్రత్యేకతలు, తినటానికి ఉండటానికి సౌకర్యం.. వగైరాల గురించి ఆన్లైన్లో వెతుకుతుంటే వేరే నాలుగైదు ట్రావెల్ ఏజన్సీలతో పాటు ‘ప్యారడైజ్ హాలిడే’ కనపడింది. అన్నిటికీ ఫోన్ చేశాను విషయం కనుక్కుందామని. చివరగా ప్యారడైజ్ హాలిడేకి కూడా చేశాను. అప్పుడే నాకు వినిపించింది ‘అశ్వతి హియర్’ అని. విషయం తనకి చెప్పాక ఎన్ని రోజులు, ఎంత మంది, ఎంత బడ్జెట్.. లాంటి సాధారణ ప్రశ్నలయ్యాక నేనన్నాను ‘అశ్వతీ.. కేరళ గురించీ, అక్కడేం బాగుంటాయో, ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకేమీ తెలీదు. ఏమేం బాగుంటాయో, ఎలా ప్లాన్ చేసుకోవాలో నువ్వే చెప్పు’ తను నవ్వింది. వెన్నెల కురిసినట్టు, మల్లెలు విరిసినట్టు, కోయిల కూసినట్టు. అప్పుడే నా మది గదిలో గాయం అవ్వటం ప్రారంభమైంది. అంతకు ముందు ఆమెవరో నాకు తెలీదు. కానీ ఎంతో కాలం నించీ పరిచయమున్న దానిలా అనిపించింది. దానికి రీజనింగ్ ఉండకపోవచ్చు. కొంత మందితో మాట్లాడితే అలానే ఉంటుందేమో. కొంచెం సేపటి లెక్కల తర్వాత తను చెప్పింది ‘మీరు చెప్పే విషయాల్ని బట్టి, మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలను బట్టి మీ కుటుంబంతో కలిపి ఒక ఐదారు రోజులు ఉండాలంటే మొత్తం కలిపి యాభై వేలవుతుంది’ అని. ‘ఇంకేమి తగ్గదా?’ ‘మీకు తెలీనిదేముంది సర్! అన్నీ ఫైవ్ స్టార్ లేదా త్రీ స్టార్ హోటళ్లే. కారు, దానికి డీజిల్, డ్రైవర్ సర్వీస్ చార్జెస్.. అయినా ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను సర్!’ అన్నట్టుగానే ఫోన్ చేసింది. ‘సర్, ఒక రెండు వేలు తగ్గించుకోండి. అదే ఫైనల్ అని చెప్పమన్నారు డైరెక్టర్.’ ‘ఐదువేలు తగ్గించుకో అశ్వతీ’ అన్నాను. తను నవ్వింది మళ్ళీ. ‘ఐదువేలు తగ్గిస్తే మా శాలరీలోంచి అంతే తగ్గిస్తారు సర్.’ ఆ మాటకు నా మనసు చివుక్కుమంది. కస్టమర్‌కి రేటు తగ్గించటం అంటే ఎంప్లాయీ శాలరీ తగ్గించటం కాదుగా. అయినా ‘నీ శాలరీ ఎంత అశ్వతీ’అడిగాను. ‘ఇరవై వేలు సర్’ అంది. అందులో మొహమాటమేమీ లేనట్టుగా. నాకాశ్చర్యం వేసింది.. అశ్వతి మనస్తత్వం గురించి. సాధారణంగా ఒక మనిషి తన వయసు గురించి గానీ, జీతం గురించి గానీ, ఇష్టాయిష్టాల గురించి గానీ పరిచయం లేని అవతలి వ్యక్తికి చెప్పటానికి అంతగా ఇష్టపడరు. అధవా పడినా అబద్ధం చెబుతారు. లేదంటే ఇష్టంలేనప్పుడు చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ అశ్వతి అలాకాక వున్నదున్నట్టుగా చెప్పటం ఆమె మీద నాకు గౌరావాన్ని రెట్టింపు చేసింది. అదేమాట అడిగాను ‘అదేంటి.. ఎవరైనా ఇలాంటి విషయాలు దాచిపెట్టటానికో, అబద్ధం చెప్పటానికో ట్రై చేస్తారు. నువ్వేమిటి ఇంత ఫ్రాంక్‌గా ఏమీ దాచుకోకుండా చెప్పేస్తున్నావ్?’ తను నవ్వింది మళ్ళీ. గుండెను ఎవరో పట్టకారుతో మెలితిప్పినట్టు అనిపించింది. ‘నిజమే. చాలామంది.. అంతెందుకు నా స్నేహితురాళ్ళు కొంతమంది జీతం విషయంలో అబద్ధం చెప్పటం నేను చాలాసార్లు గమనించాను. అందులో అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి సర్? ఐనా నాకొచ్చే జీతం కంటే ఎక్కువ చెప్పుకోవటం వల్ల నాకేమైనా ఉపయోగం వుందా? మీరెవరో నాకు తెలీదు. మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమిటి? అదీగాక ఒకసారి అబద్ధం చెబితే నాకు అదే అలవాటైపోతుంది. నేనేమిటో నాకు తెలుసు. నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. అబద్ధపు పునాదుల మీద వ్యక్తిత్వాన్ని నిర్మించు కోవలసిన అవసరం నాకు లేదు’ దృఢంగా చెప్పింది. ఒక మనిషి పుట్టిపెరిగిన వాతావరణం, చుట్టూ పరిస్థితులు, మనుషుల మనస్తత్వాలు.. ఇవన్నీ కలిపి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పడేట్లు చేస్తాయేమో. అశ్వతి అంత దృఢంగా, కాన్ఫిడెంట్‌గా, నిర్భయంగా అలా చెప్పటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమాటే ఆమెతో అంటే మళ్ళీ నవ్వింది. బహుశా నవ్వు ఆమెకు దేవుడిచ్చిన వరమేమో! అదే నాపాలిట శాపం అయ్యేలా వుంది. ‘అది సరే అశ్వతీ. ఇంతకు ముందు నువ్వు ఏమి చేసేదానివి?’ ‘ఇండిగో ఎయిర్ లైన్స్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేసేదాన్ని సర్.’ నిర్ఘాంత పోవటం నా వంతయింది. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అశ్వతి.. జీవితం మీద అంత కమాండింగ్‌గా ఎలా ఉండగలుగుతుందో, అంత కాన్ఫిడెన్స్ ఆమెలో ఎలా ప్రారంభం అయిందో ఆమె చెబుతుంటే నేను వింటూనే వున్నా. ఐతే– అశ్వతి నేను అనుకున్నంత అమాయకపు పిల్లేమీ కాదు. తనేమిటో, బలాలేమిటో, బలహీనతలేమిటో తెలిసిన పిల్ల. ఇంకో మాటలో చెప్పాలంటే– అశ్వతి గడుసుపిల్ల. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన అమ్మాయి. విరి వికసించిన రోజే వాసన రాదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ పూవు తావి తెలుస్తుంటుంది. అశ్వతి పరిచయంలో రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె మనసు, మాట తీరు, ఆమె లక్షణాలు, లక్ష్యాలు.. అన్నీ వివరించసాగింది. బహుశా అది నామీద నమ్మకమేమో! అనుకున్నట్టే ఆ సంవత్సరం ఎండాకాలం సెలవులకి మేమంతా కేరళ వెళ్ళొచ్చాం. నిజం చెప్పాలంటే అదో అద్భుతమైన ప్రాంతం. మనసు ప్రతిచోటా ఉప్పొంగిపోగల వాతావరణం దాని సొంతం. పచ్చని చెట్లు, ఎవరో చిత్రకారుడు గీసిన గీతల మల్లె టీ ఎస్టేట్లు, జారే జలపాతాలు, ఎటు చూసినా కొండలు, వాటి అంచుల చివర్లో కట్టుకున్న ఇళ్ళు, నిద్రలేవగానే వినపడే సుప్రభాతాలు.. ప్రకృతి.. మనిషికి ఎంత విలువైన సంపద ఇచ్చిందో అక్కడికెళ్ళాక నాకర్థమైంది. సాధారణంగా ఎవరైనా టూర్‌కి వెళ్లి వచ్చాక దాదాపు పది పదిహేను లేదా నెలరోజులు తాము చూసిన ప్రదేశాలు, చెందిన అనుభూతులు, ఆస్వాదించిన క్షణాలు గుర్తుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అవన్నీ జ్ఞాపకాలుగా మారతాయి. నా కేరళ జ్ఞాపకాలు మాత్రం ఇంకా లేతగా ఇంకా చెప్పాలంటే నేను ఇంకా కేరళలోనే వున్నట్టే వున్నాయి. దానికి కారణం అశ్వతి. ఆ తర్వాత కూడా అశ్వతితో నా పరిచయం కొనసాగింది. నాతో మాట్లాడటం తను కంఫర్ట్‌గా ఫీలయిందేమో! ఆ పరంపరలో ఓ రోజు నేనడిగాను ‘అశ్వతీ! మీది ఏ వూరు? మీరెంతమంది? మీ పేరెంట్స్ ఎక్కడుంటారు?’ ‘కాలికట్ సర్. నాకు ఓ చెల్లి వుంది. నాన్న దుబాయ్‌లో ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. అమ్మ మిగిలిన బంధువులతో కలసి కాలికట్లోనే ఉంటోంది. నేను డిగ్రీ పూర్తయ్యాక ఏవియేషన్ మీద ఇంటరెస్ట్‌తో కోర్స్‌లో చేరి ట్రైనింగ్ తీసుకుని ఇండిగోలో జాయిన్ అయ్యా. ఆ లైఫ్ చాలా బాగుండేది సర్!’ ‘మరి ఈ వైపు ఎందుకొచ్చావు?’ ‘కరోనా టైమ్‌లో ఫ్లైట్లు లేవు కదా సర్! ఆ కాంట్రాక్ట్ వుద్యోగం పోయింది. అవసరానికి ఈ ట్రావెల్ ఏజెన్సీలో చేరాల్సివచ్చింది.’ ‘మీ చెల్లి ఏం చేస్తోంది?’ ‘డిగ్రీ చేస్తోంది. బాధ్యత అంతా నాదే. చెల్లికి నెలనెలా నేనే అమౌంట్ పంపిస్తుంటాను. అమ్మ కూడా నా జీతంలోంచి నెలనెలా కొంత ఇంట్లో ఇవ్వమంటుంది. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను.’ నా మనసు ఒక్కసారిగా చివుక్కుమన్నది. చాలీ చాలని సంపాదన, మధ్యతరగతి కష్టాలు, బరువులు బాధ్యతలు ఎలా వుంటాయో నాకు తెలుసు. దానిగురించి నేనిక రెట్టించదలచుకోలేదు. కానీ, అశ్వతి అంటే నాకు నిజాయితీతో కూడిన అభిప్రాయం ఏర్పడింది. వయసులో తను చిన్నది కావచ్చు కానీ తనమీద గౌరవం రెట్టింపయింది. నాకు నచ్చిన మనిషి.. మనసుకు దగ్గరైన మనిషి. ఆమె కోసం, ఆమె సంతోషంగా ఉండటం కోసం ఏదైనా చేయాలనిపిస్తోంది. ఏం చేయాలి? అసలెందుకు చేయాలి? నిజానికి ప్రతిమనిషికీ వుండే కష్టాలే ఆమెకూ వున్నాయి. అవన్నీ దాటిన తర్వాతే కదా మనిషి విజయం సాధించినట్టు. అసలు నేనెందుకు అశ్వతి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడటం సాధారణం. కానీ ఈ వయసులో కూడానా? అది నా బలహీనతా? లేక ఆమెలో అంత ఆకర్షణ ఉందా? ఎన్నో జీవితాలు చూసి, అనుభవాలు ఎదుర్కొని, జీవితపు ఒక్కో స్టేజ్‌ని దాటుకుంటూ ఇంత దూరం వచ్చికూడా ఇంకా ఎందుకీ బాధ! ప్రేమంటే బాధే కదా! ఎవరో వస్తారు. నాల్రోజులుండి వెళతారు. రాకముందు రాలేదనే బాధ. వచ్చాక వెళతారనే బాధ. ఇంత బాధను మనసు ఎందుకు పదేపదే కోరుకుంటుంది? తలకింద రెండుచేతులూ పెట్టుకుని ఆకాశం కేసి కన్నార్పకుండా పున్నమి చంద్రుడి వైపు చూస్తే ప్రేమించినవారు అక్కడ కనపడతారట. ఆ చంద్రబింబంలో ఒక ఆకారం క్రమక్రమంగా రూపుదిద్దుకోవటం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరిదీ ఆ రూపం? నాదా? మా అమ్మదా? నా భార్యాదా? పిల్లలదా? అశ్వతిదా? ∙∙ అశ్వతికి ఎయిర్ పోర్టులో మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చేరాలనేది కోరిక. తీరాలంటే చాలా పరిమితులు ఉంటాయి. దానికి నోటిఫికేషన్ పడాలి.. పరీక్షలో పాసై ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి.. అనుకున్నంత జీతం ఇవ్వాలి.. కోరుకున్నచోట వుద్యోగం పడాలి.. ఇవన్నీ ఒకవైపు. అప్లికేషన్ ఫీజు వేలల్లో కట్టాలి. ఇంటర్వ్యూ ఏ ముంబైలోనో, ఢిల్లీలోనో ఐతే అక్కడికి వెళ్ళాలి. ఖర్చులు తడిసిమోపెడు. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అశ్వతి ఇన్ని బంధాలు, బంధుత్వాలు, బరువుల మధ్య ఎంత సంపాదించగలదు? ఎంతని మిగల్చగలదు? ప్రతిమనిషీ తన సమస్యలన్నిటికీ కారణం కేవలం డబ్బులేకపోవటమేనని భావిస్తాడు. అశ్వతి సమస్యలు అశ్వతికి ఉంటే నా సమస్యలు నాకున్నాయి. కాకపోతే తేడా అల్లా సమస్య గాఢత, సాంద్రతల్లోనే. అయినా ఏ సంబంధమూ లేని అశ్వతికి కష్టం వస్తే నాకే వచ్చినట్టు ఎందుకనిపిస్తోంది? ఆమెను ఆదుకోవాలన్న తపన, ఆమె లక్ష్యంలో భాగం కావాలన్న కోరిక నాకెందుకు? అసలు ఆమె అంటే నాకెందుకింత ప్రత్యేకమైన అభిమానం? ఒకవేళ, అశ్వతి కాక అబ్బాయి ఎవరైనా ఇలా అడిగుంటే నేను ఆలోచించేవాడినా? అశ్వతిని ప్రేమిస్తున్నానా? కాబట్టే ఇంత చేస్తున్నానా? ఇన్నేళ్ల నా జీవితంలో నేను ఎక్కని శిఖరం లేదు. చూడని పాతాళం లేదు. పుట్టుక–చావు, తీపి–చేదు, సుఖం–దుఃఖం, భయం–నిర్భయం, వివాహాత్పూర్వ ప్రేమలు, వివాహానంతర పరిచయాలు.. అన్నీ అనుభవైకవేద్యమే కదా? మరి అశ్వతి ప్రేమలో ఇప్పుడు నేను కొత్తగా పొందబోయేదేమిటి? జీవితం అంటే.. జరిగే సంఘటనల సమాహారమే ఐతే అశ్వతితో ప్రేమ తర్వాత నా జీవితంలో జరగబోయే కొత్త సంఘటనలేముంటాయి? అశ్వతిలో నేను నా కూతుర్ని చూసుకుంటున్నానా? అందుకే ఆమె మీద ఇంత ప్రేమ కనబరుస్తున్నానా? ఈ ఆలోచన వచ్చేటప్పటికి మనసు కాస్త స్థిమిత పడింది. కానీ కొద్దిసేపే. మనసు ఒప్పుకోమంటున్నా, ప్రాక్టికల్‌గా ఆలోచించే బుద్ధి అందుకు నిరాకరిస్తోంది. సంధిగ్ధాసంధిగ్ధాల్లో పడి మనసు కొట్టుమిట్టాడుతోంది. ఏదైతే అదవుతుందని నేనామెకు ఫోన్ చేసి తనకు ఎంత కావాలో అడిగి అంత డబ్బూ తన అకౌంట్లో వేశాను. ∙∙ ఓ రోజు ఉదయాన్నే ఫోన్ మోగింది. చూస్తే అశ్వతి. ‘గుడ్ మార్నింగ్ సర్, నేను మళ్ళీ ఎయిర్ పోర్ట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాను. థాంక్ యు వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్. నా జీవితమంతా మీకు రుణపడి వుంటాను’ ఆమె గొంతులో నిజాయితీ, కృతజ్ఞత నాకు స్పష్టంగా వినిపించింది. అశ్వతి అంటే అంతే! ఏదయినా కమిట్మెంట్తో చేస్తుంది.. చెప్పే మాటైనా చేసే చేతైనా! నేను నవ్వాను.. ‘అదంతా నీ కృషి, పట్టుదలే అశ్వతీ. నేను చేసింది ఏమీలేదిందులో. కేవలం నీకు కాస్త చేయూతనివ్వడం తప్ప. దేవుడు నీకు మంచే చేశాడు!’ ‘ఆ దేవుడి సంగతేమోగానీ.. నా దేవుడు మాత్రం మీరే సర్!’ తను నవ్వింది. అదే.. వెన్నెల కురిసినట్టు.. మల్లెల్లు విరిసినట్టు.. కోయిల కూసినట్టు.. ‘ఏదేమైనా నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కింది. గాడ్ బ్లెస్ యు అశ్వతీ’ అన్నాను. ‘థాంక్ యు సర్! జీవితంలో ఎపుడో ఒకప్పుడు ఎక్కడో ఓచోట ఏదొక సమయంలో దేవుడు మనిద్దరినీ కలుపుతాడనుకుంటున్నా. వుంటాను సర్.’ ‘మంచిది’ నేను ఫోన్ పెట్టేశాను. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత.. నా వాట్సాప్‌కి తన సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్‌లో రెండు ఫొటోలు పంపింది. అదే మొట్టమొదటిసారి నేను అశ్వతిని చూడటం. దిగంతాల మందహాస మల్లీ నవలతాంతాల మాలికలల్లి, దయాశిశిర సుధాభరిత కటాక్షేక్షణముల జల్లి.. నారు పోసిన ముంగిట్లో.. గన్నేరు పూసిన వాకిట్లో.. పన్నీరు చల్లిన లోగిట్లో ఇంపై కృష్ణశాస్త్రి కలంలో ఇంకై.. సొంపై.. పులకరింపై.. ఆ పులకరింపు జలదరింపై.. ఒళ్ళంతా పాకింది. ఇన్ని రోజుల, నెలల మా పరిచయంలో మేం ఎదురుపడిందీ లేదు.. ఒకర్నొకరు చూసుకున్నదీ లేదు. కేవలం ఫోన్లో సంభాషణలే. కానీ మనసులు కలిశాయి. మదిలోని బాసలు తెలిశాయి. ఊహలు కలిశాయి. ఊసులూ కలిశాయి. బంధం బలపడింది.. అంతే. ఫొటోలోని అశ్వతి నా ఊహకు సరిగ్గా సరిపోయింది. అప్రయత్నంగా నా పెదాల మీద దిగులు చిరునవ్వు తొంగిచూసింది. కానీ మనసులో గాయం మాత్రం అలానే ఉండిపోయింది. ‘నీవు రావు. శీతల సమీరం కోసం శరన్మేఘం ఎదురు చూస్తూనే ఉంటుంది. దిగులు సాయంత్రాలు ఎర్రజీరలై కళ్ళలో నిలుస్తాయి. కనురెప్పల వాలిన వేదన నిద్రని దూరం చేస్తుంది. గ్రీష్మం నవ్వుతుంది. హేమంతం హేళన చేస్తుంది. ఆమని ఆగిపోతుంది. కనురెప్పల సందుల్లోంచి కాలం నీటి చుక్కలా రాలిపోతుంది. ఆకాశం మీద సముద్రం వర్షమై ఏడుస్తుంది. శరీరాన్ని వీడకుండా పరలోకాన్ని చేరటం సాధ్యమేమో కానీ, ప్రేమానుభవపు విషాద స్మృతి జీవితంలో ఒకటైనా లేకుండా మనిషి బతుకు కడతేరటం సాధ్యమా? ఎన్ని అనుభవాల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్‌బాక్స్ లాంటి మనసు, గతం నేర్పే అనుభవాలని ఎప్పటికి నేర్చుకుంటుంది? వాస్తవమనే భూమిని, అస్తిత్వం లేని ఆకాశం తాకే వృథా ప్రయాసే ‘ప్రేమ’ అన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుంది? ఎంత తొందరగా నా జీవితంలోకి వచ్చావో.. అంతే తొందరగా వెళ్లి పోయావు.. అశ్వతీ.. ఓ అశ్వతీ..!’ -సడ్డా సుబ్బారెడ్డి చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా! -
Story: ఆమె జ్యోతి.. తన ‘కథ’ తెలుసుకున్న రాణి తిరిగి వస్తుందా?
‘మేడంగారూ ఇవాళ మీ కథ చెప్తానన్నారు కదా?’ మేడంగారి పేరు జ్యోతిర్మయి. అందరూ జ్యోతిమేడం అంటారు. కథ అడిగినావిడ పేరు రాణి. ఇలా రాణి అడిగినప్పుడు అప్పుడే బెంగాల్ కాటన్ కనకాంబరం రంగు చీర కుచ్చిళ్ళు సవరిస్తూ గదిలో నుంచి వచ్చింది జ్యోతి. ‘మీరు చీర కట్టుకుంటే మేడంగారూ రెప్పేయబుద్ధి కాదంటే నమ్మండి.’ రాణి మాటకి జ్యోతి మేడం ముసి ముసిగా నవ్వుకుంది. ‘ఎంతైనా అందంలో మనోళ్ళని మించినాళ్ళు వుండర్లెండి.’ ఈ మాట అన్న రాణి వైపు కోపంగా చూసింది జ్యోతి. ఆమె ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పాతికేళ్ళుగా తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. భర్త జర్నలిస్టు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఏభైలో పడింది టీచర్. ఇంటి పనీ, బయటి పనీ ఆమె వల్ల కావడం లేదు. అందుకే రాణిని వంటకోసం పెట్టుకున్నారు. రాణి వయసూ టీచరమ్మ వయసూ ఇంచుమించూ ఒకటే అవ్వడం వల్ల ఆమెను రాణిగారూ అంటుంది ఈ టీచర్ గారు. రాణి పదోతరగతి దాకా చదువుకుంది. భర్త తాగుబోతు. కొడుకు ప్రయోజకుడై, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి విషయంలో కంటే వాడి ప్రయోజకత్వం పెళ్ళానికే ఎక్కువ పనిచేసినట్టుంది. అంత బతుకూ బతికి వంట పనిచేసుకుని పొట్ట పోసుకోవలసి వస్తోంది రాణికి. పాపం అందుకే జ్యోతికి రాణి అంటే సానుభూతి. ఎంతైనా స్త్రీ హృదయం కదా. కానీ రాణి దగ్గర నచ్చని విషయం ఏంటంటే మాటి మాటికీ మనాళ్ళూ మనాళ్ళూ అంటూ సాగదీస్తుంది. జ్యోతి ఒడ్డూ పొడుగూ పొందిక అన్నీ చూసి టీచరమ్మ తమ కులమే అని నిర్ధారించేసుకుంది. పనిలో చేరిన రెండో రోజునే ‘మేం ఫలానా అండి టీచర్ గారూ’ అంటూ గొప్పగా తమ ఇంటి పేరు చెప్పింది. మరి మీరో అన్నట్టుగా ఉంది ఆ మాట. మేం ‘బలపాల వారమండి రాణిగారూ’ అంది జ్యోతి . దీంతో టీచరమ్మ మా వాళ్ళమ్మాయే అని పూర్తి నమ్మకంతో అన్నీ ఓపెన్‌గా మాట్లాడేస్తుంది రాణి. ‘మీరు బలపాలవారా మరి చెప్పేరు కదేమండి టీచర్‌గారూ. మన వాళ్ళలో బలపాల వారు చాలా బలిసిన వారే ఉన్నారుగా. అదీ సంగతి. మిమ్మల్ని చూసిన మొదటి రోజే అనుకున్నాను.’ ఈ మాటలకు ఒళ్ళంతా కంపరం పుట్టింది జ్యోతికి. కులంతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతుందా, లేక అమాయకంగా మాట్లాడుతుందా అన్న తర్జనభర్జన చాలానే జరిగింది జ్యోతిలో. రాణి కుటుంబ నేపథ్యం, ఆమె పడిన అష్టకష్టాలు, బాధలు, ఆమె మనస్తత్వం అన్నీ బాగా స్టడీ చేశాక, ‘పాపం పిచ్చిది ఏదో అలా వాగేస్తుంది అంతే’ అని నిర్ధారించుకుంది. జీవితమంతా దేహానికి అంటుకున్న ముళ్ళను విదిల్చుకుంటూ మనిషితనంతో గుబాళించడమే తెలిసిన జ్యోతికి రాణి వాలకం పెద్ద బాధ కలిగించ లేదు. కానీ రాణికి తన కథ చెప్పి తీరాలన్న కోరిక జ్యోతి మనసులో ఒకానొక ఘడియలో చిన్నగా మొలకెత్తి రాను రాను అది వటవృక్షమై బయటపడాలని హడావుడి చేస్తోంది. అయితే అసలు విషయం తెలిస్తే రాణి ఎక్కడ పారిపోతుందో అని ఒక ఆందోళన. కానీ ఆమెకు తన కథ చెప్తే గానీ తనలో ఏభై ఏళ్ళుగా పేరుకుని గడ్డకట్టి బండబారి కొండలా మారిన నిజం, ముక్క ముక్కలై కరిగి కరిగి నీరై ఆవిరయ్యే అవకాశం లేదని టీచరమ్మ ఆలోచన. చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఊహ తెలిసినప్పటి నుంచి తన మనసులోనే పడిన ఘర్షణ ఒకటే. అదే తన కులం పేరు. తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు కావడం వల్ల సంఘంలో కొద్దో గొప్పో గౌరవం, మర్యాదా దొరికాయి. కానీ తన కులం పేరు చెప్తే ఆ గౌరవాలూ ఆ మర్యాదలూ ఎక్కడ పోతాయో అని జ్యోతి బడిలో దోస్తుల్ని ఎవరినీ చిన్నప్పుడు తమ వాడలోకి రానిచ్చేది కాదు. వస్తే వాడలో వాతావరణం చూసి తనతో స్నేహం చేయరేమో అని అనుమానం. కాలేజీ రోజుల్లో.. యూనివర్సిటీ రోజుల్లో.. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో బతుకంతా ఇదే బరువు. ఒకటే మోత. ఎవరికీ తెలియని అనంత భారం. ఇలా ఏభయ్యేళ్ళ పాటు కులం అనేది ఆమెను లోపల్లోపల తగలబెడుతూ వచ్చింది. ఆ బూడిదలోంచి తాను తిరిగి పుడుతూ వచ్చింది జ్యోతి. కానీ ఇంతకాలానికి తన కులం పేరు బ్రహ్మాండం బద్దలయ్యేట్లు చెప్పాలన్న కోరిక జ్యోతికి కలిగింది. ‘రాణిగారూ మీరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో తెలుసా’ అని అన్నప్పుడు రాణిగారి మొహంలో కులానికి ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులూ చూడాలని టీచరమ్మ ఉబలాటం. జ్యోతి స్కూలుకి వెళ్ళి సెలవు పెట్టి వచ్చింది. కేవలం తన కథ రాణిగారికి చెప్పాలనే. రాణిగారు కూడా కుతూహలంతో ఎదురు చూస్తోంది. జ్యోతి తీరుబడిగా కుర్చీలో కూర్చుంది. రాణి కింద ప్లాస్టిక్ పీట మీద కూర్చుని కూరగాయలు తరుగుతోంది. అలా చూసినప్పుడు భూమి పైకి లేచినట్టు, ఆకాశం కిందకి కూలినట్టు అనిపిస్తుంది జ్యోతికి. యుగాలుగా కింద కూర్చున్న జాతి పైకి, పైన కూర్చున్న జాతి కిందకీ తల్లకిందులైనట్టు అనిపించినప్పుడు జ్యోతిర్మయిలో యుగాలుగా మండుతున్న కసి ఏదో కొంచెం కొంచెం చల్లారుతున్న భావన గొప్ప ఉపశాంతినిచ్చింది. ఈ దృశ్యాన్ని ఏ చిత్రకారుడైనా చిత్రించాలని, దాన్ని పట్టుకుని తన బాల్యపు గతం నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టి వర్తమానం దాకా ఊరేగాలని ఆమెకు అప్పుడప్పుడూ అసాధ్యమైన ఊహలు కూడా కలుగుతాయి. అంతలోనే జ్యోతిలోని బౌద్ధ భిక్షుకి నిద్ర లేస్తుంది. ‘పాపం రాణి ఒక చిన్న పిల్లలాంటిది’ అంటూ. ‘కరుణామయులైన వారు తమను మాత్రమే గాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు.’ బుద్ధుని బోధనల్లో చాలా విలువైన ఈ పంక్తులను తాను మాటి మాటికీ స్మరించుకుంటుంది. అందుకే తనను దహించే అగ్నిని తానే చల్లార్చుకుని రాణిని ఎప్పటిలా ప్రేమిస్తుంది. చిన్న పిల్లల మీద ఎవరైనా కసి తీర్చుకోవాలనుకుంటారా? ఇదీ జ్యోతి అంతరంగం. ‘రాణిగారూ మీకు కులం గురించి ఏం తెలుసు?’ అమాయకంగా మొహం పెట్టిన రాణి వైపు చూసి జ్యోతి నవ్వుకుంది. మీకొక కథ చెప్పనా అని సమాధానం రాకుండానే చెప్పింది. ‘ గౌతముడు తన దగ్గరకు వచ్చిన సునీత అనే అంటరాని కులస్తుడిని తన సంఘంలో చేర్చుకున్నాడు. అతని వృత్తి వీధులు ఊడ్వడం. నువ్వు మా సంఘంలో ఏం చేస్తావు అని ఒక సాటి భిక్షువు అతడ్ని అడిగాడట. అప్పుడు సునీత అనే అతను ఏం చెప్పాడో తెలుసా? ‘ నేను ఇన్నాళ్ళూ వీధులు ఊడ్చాను. ఇప్పుడు మనుషుల మనో వీధులు శుభ్రం చేస్తాను’ అన్నాడట. ఎంత బాగా చెప్పాడో కదా?’ అంటూ రాణి మొహంలోకి చూసింది జ్యోతి. రాణి.. పాఠం అర్థం కాని పిల్లలా మొహం పెట్టింది. అప్పుడు మళ్ళీ ఇలా అంది.. ‘రాణిగారూ కులానికి ఏ విలువా లేదు. వ్యక్తి చేసే పనికే విలువ వుంటుంది. ఒకసారి అశోకుడితో ఆయన మంత్రి.. ప్రభూ మీరు అన్ని రకాల కులాలకు చెందిన భిక్షువులకు సాష్టాంగపడి, పాదాభివందనం చేయడం సబబుగా లేదు అన్నాడు. దానికి అశోక చక్రవర్తి ఏమన్నాడో తెలుసా రాణిగారూ?’ ‘ ఏమన్నారండీ?’ ‘ఉచితంగా ఇచ్చినా ఎవ్వరూ ఆశించని విలువ లేని వస్తువు ఈ నా శిరస్సు. దీనిని ఓ పవిత్రకార్యానికి వినియోగించే అవకాశమే నేను భిక్షువులకు చేసే పాదాభివందనం అని అశోకుడు బదులిచ్చాడు. ఎంత గొప్ప మాట ఇది రాణిగారూ! అర్థమైందా?’ ‘ఏమోనమ్మా. అన్నట్టు అశోకుడు మన వాడేనంటగా ఎవరో అంటే విన్నాను.’ ఈ మాటతో తల పట్టుకుంది టీచరమ్మ. ఈమెకు ఎలా వివరించి చెప్పాలబ్బా అని తనలో తనే తెగ ఘర్షణ పడింది. ఒక మనిషి గొప్పతనం పుట్టుకతో రాదని, రంగుతో రాదని, కులంతో రాదని, అతని ఆచరణతోనే వస్తుందని తాను చదివిన బౌద్ధ బోధనల్లోని సారాన్ని కథలు కథలుగా చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు ఎక్కడా ఎక్కలేదు. ‘మేడంగారూ మీ ఊరి కథ చెప్పండి బాబూ ఇవన్నీ నాకెందుకు’ అనేసింది. ‘ సరే చెప్తాను వినండి. మా ఊరి కథలోనే నా కథ కూడా వుందన్నాను కదా. అర్థం చేసుకోండి మరి. అసలు నిజానికి నూజివీడు అనేది ముందు నువ్వు చేల వీడు. ఒకసారి ఉయ్యూరు నుంచి దొరగారు వచ్చి ఆ నువ్వు చేల వనాన్ని చూశాడట. అక్కడ తోడేలు, మేకపోతూ భయంకరంగా కొట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేదో పౌరుషం గల నేలలా వుందే అనుకుని అక్కడ కోట కట్టించుకున్నాడట. ఆయనతో పాటు మరి కొందరు దొరలు కూడా వచ్చారు. అది క్రమంగా నువ్వుచేలవీడు, నూజేలవీడు అయ్యి.. చివరికి నూజివీడు అయ్యింది.’ ‘భలే కథండి టీచర్‌గారూ, ఇంతకీ మీ కథేంటో మరి..!’ ‘అక్కడికే వస్తున్నాను మరి. దొరలకు సేవకులు కూడా అవసరమే కదా.. బలాపాముల అనే ఊరి నుంచి ఇద్దరు బలమైన పొడవైన వ్యక్తుల్ని తమ కోటకు తెచ్చుకున్నారట. ఆ ఇద్దరు వ్యక్తుల సంతాన వారసత్వమే మేము.’ ‘అదేంటండీ మనోళ్ళు దొరలకు సేవ చేయడానికి వచ్చారా? అబ్బే నాకేం నచ్చలేదు ఈ కథ.’ తరుగుతున్న కూరగాయల్ని పక్కనే పెట్టి రాణి, గోడకి చేరబడి రెండు మోకాళ్ళూ మునగదీసుకుని రెండు చేతులతో వాటిని పట్టుకుని ‘సరే చెప్పండి తర్వాతేమైందో ’ అన్నది. ‘ఆగండి రాణి గారూ. అప్పుడే కంగారెందుకు? మీరు కంగారు పడాల్సిన విషయాలు చాలా వున్నాయి’ అంటూ తిరిగి కథ అందుకుంది. ‘మా తాతలు ఇద్దరు ఎంత పొడగరులంటే తాటి చెట్లను రెండు చేతులతో పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోగలరు’ జ్యోతి మాటలకి నోరు వెళ్ళబెట్టింది రాణి. ‘చెట్లనే కాదండీ, పశువుల కళేబరాలను కూడా ఒంటిచేత్తో ఈడ్చి పారేసేవారు.’ ఈ మాట విన్నది విన్నట్టే రాణి, గోడకు అతుక్కుపోయి నోరు తెరిచింది. వెంటనే తేరుకోని ‘అదేంటి మేడంగారూ కళేబరాలేంటి? మనోళ్ళకి అదేం ఖర్మ?’ అంది ‘అవును అది మా తాతల వృత్తి మరి.’ ఆ మాటతో గోడకు జారబడ్డ రాణి ఎవరో మంత్రించినట్టు ఉన్నట్టుండి శిలావిగ్రహంలా మారిపోయింది. ఏదో అనాలని నోరు తెరవబోయింది. జ్యోతి, ‘ఆగు. ఏం మాట్లాడకు. చెప్పేది విను’ అని హూంకరించింది. ఎప్పుడూ రాణిగారూ అనే మేడం ఒక్కసారిగా ఏకవచన సంబోధన చేసిన విషయం కూడా గమనించలేదు రాణి. జ్యోతి చెప్పుకుంటూ వెళ్లింది.. ‘అవును మా ముత్తాతలు ఆ పనే చేసేవారు. ఒకరు పెద రామయ్య, ఒకరు చినరామయ్య. దొరల సంతానం కోటలో పెరిగింది. మా తాతల సంతానం పేటలో పెరిగింది. గొడ్ల కోతలో, చెప్పుల చేతలో వారిని కొట్టే వారు రాజమహేంద్రం దాకా విస్తరించిన నూజివీడు జమీనులో ఒక్కడూ లేడంట. అంత గొప్పోళ్ళు మా తాతలు. జాగ్రత్తగా విను’ ఇక గారు అనడం మర్చిపోయింది జ్యోతి. ‘ వింటున్నావా..?’ ‘ ఆ.. ఆ.. ’ అని తడబడుతూ తలూపింది రాణి. ‘మా తాతల కళా నైపుణ్యం గురించి చాలా చెప్పాలి. గొడ్లను కోసి వాటి చర్మాలను ఇంటికి తెచ్చినప్పుడు ఏదో రాజ్యాన్ని జయించి భుజం మీద ఆ రాజ్యాన్ని మోసుకు వస్తున్నంత గర్వంగా కనపడేవారట అందరికీ. ఆ తర్వాత చాలా కాలం ఆ వృత్తి మా వాళ్ళు చేశారు. మా మేనమామ, ఆయన పిల్లలూ ఆ పని చేయడం నేను దగ్గరగా చూశాను. నాకు ఆ పనులన్నీ చూడ్డం ఇష్టమే కాని, వాటిని నా స్నేహితులు చూడ్డం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఎవరినీ రానిచ్చే దాన్ని కాదు మా ఇంటికి. చర్మాన్ని నేల మీద పరచి కత్తితో గీరి, ఉప్పు రాసి సున్నం నీటిలో తంగేడు చెక్క, కరక్కాయలు వేసి మూడు నాలుగు రోజులు నానబెట్టేవారు. అబ్బా ఆ కంపు భరించలేక చచ్చేవాళ్ళం’ఇలా అని రాణి వంక కసిగా చూసింది జ్యోతి. వాసనేదో వస్తున్నట్టే అనిపించినా ముక్కు మూసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా అలాగే కూర్చుని వింటోంది రాణి. జ్యోతిని చూడ్డానికి భయం కూడా వేస్తోంది ఆ సమయంలో. ‘నానబెట్టిన చర్మాన్ని తీసి, వెంట్రుకలన్నీ గీకి, దాన్ని నేల మీద గట్టిగా లాగి నాలుగు వైపులా మేకులు కొట్టి ఎండబెట్టేవారు. అప్పుడు వాళ్ళు ఆకాశాన్ని నేల మీద పరిచినంత సంబరపడిపోయేవారు. ఎండిన చర్మాన్ని గంజి రాసి రోల్ చేసి మడత పెట్టి, కొన్ని రోజుల తర్వాత ఆ చర్మాన్ని అనేకానేక రూపాల్లో కత్తిరించి చెప్పులు తయారు చేసేవారు. దొరల పాదాల కింద తరించడానికి తమ జీవితాలనే కత్తిరించుకున్నంత సంతృప్తి పడేవారు. ఇప్పుడు అర్థమైందా మా ఊరి కథ.. నా కథ..? అర్థమైందా నేనెవరో?’ గద్దించినట్టు జ్యోతి అనేటప్పటికి ఉలిక్కిపడింది రాణి. రాతి బొమ్మలో చలనం వచ్చినట్లయింది. జ్యోతి కూడా ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. తానెక్కడికో వెళ్ళిపోయింది. స్పృహలోకి వచ్చినట్టు ఒకసారి కలయజూసింది. రాణిగారూ రాణిగారూ అని కలవరించినట్టు అరిచింది సన్నగా. మేడంగారూ మేడంగారూ అని రాణి కూడా కలవరించింది. జ్యోతికి అంతలోనే రాణి మీద జాలి, కరుణ ప్రేమ తన్నుకొచ్చాయి. ‘సారీ అండీ రాణిగారూ. నాలో ఎవరో పూనినట్టున్నారు. నా గురించి నేను మనసారా చెప్పుకోవాలన్న జీవితకాలపు కోరికలో నన్ను నేనే మరిచిపోయి చాలా వికృతమైన ఆనందాన్ని పొందాను. సారీ. ఏమీ అనుకోకండి.’ ‘అయ్యో.. అంత మాటెందుకు మేడంగారూ. నా పిచ్చి మాటలతో వెన్నపూసలాంటి మిమ్మల్ని ఎంత కోతపెట్టానో పిచ్చి ముండని. పిచ్చి ముండని’ అనుకుంటూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ వంట ఏదో అయ్యిందనిపించి త్వరగా వెళ్ళిపోయింది రాణి. ఉదయమే వచ్చింది. వస్తూ వెంట ఎవరినో తీసుకొచ్చింది. ‘ మీకు వంటకి ఇబ్బంది కలక్కూడదని ఈమెను తీసుకు వచ్చా మేడంగారూ. నేను కాశీకి పోతున్నాను. గంగలో మునిగితేనే గానీ నా పాపానికి విరుగుడు లేదు. పాపిష్టి దాన్ని మీ మనసెంత నొప్పించానో. నా కడుపుకింత కూడు పెట్టిన మిమ్మల్ని కులం కులం అని ఎంత క్షోభ పెట్టానో. వస్తానమ్మా.. బతికి బాగుంటే మళ్ళీ మీ దగ్గరకే వస్తాను టీచర్‌గారూ. మీరు క్షమిస్తారు. మీ మనసు నాకు తెలుసు. ఆ గంగమ్మ క్షమిస్తుందో లేదో..’ కథలూ సీరియల్సూ చదివే అలవాటున్న రాణి తనకు తెలిసిన భాషలో ఏదో అనేసి విసురుగా వెళ్ళిపోయింది. జ్యోతినుంచి సమాధానం కూడా వినలేదు. జరిగిందంతా రాత్రికి సహచరుడు సురేష్‌కి చెప్పి కొంత ఉపశమనం పొందింది జ్యోతి. రాణి మనసు గాయపరచానేమో అని దిగులుపడిపోతోంది. ‘జీవితమంతా ఒక కొండను లోపల మోసుకుంటూ తిరిగావన్న మాట. నాక్కూడా ఎప్పుడూ చెప్పనే లేదు. పోన్లే ఇప్పటికైనా బరువు దించుకున్నావు. ఆమె గురించి ఆలోచించకు. తానేదో పాపం చేసిందని, ఆ పాపం కడుక్కోవడానికి కాశీకి వెళ్ళిందని ఆమె చెప్తే నువ్వు నమ్ముతున్నావు. కానీ ఆమె నీ దగ్గర పనిచేసి పాపపంకిలమైనందుకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వెళ్లిందని నేను అనుకుంటున్నాను. వదిలేయ్. పడుకో. ఇన్నేళ్ళూ నువ్వు కోల్పోయిన నిద్రను ఈ రాత్రికి సంపూర్ణంగా ఆస్వాదించు’ అని కళ్ళు మూసుకున్నాడు సురేష్. జ్యోతికేవేవో జ్ఞాపకాలు గుండెల్లో సుడులు తిరిగాయి. తనకు ప్రమేయం లేని తన పుట్టుక తన బతుకంతా ఒక కొండలా కాళ్ళకి ఎలా చుట్టుకుందో, ఎవరికీ కనపడని ఆ బరువును ఈడ్చుకుంటూ ఎలా నడిచిందో.. తలుచుకుంటూనే భయపడిపోయింది. ఎన్నో ఘటనలు.. ఎంతో కన్నీరు. ఒంటె తన అవసరానికి మంచి నీళ్లను దేహంలో దాచుకుంటుందట. జ్యోతి కన్నీళ్ళు దేహంలో దాచుకునే విద్యను చిన్నప్పుడే అభ్యసించింది. ‘ఏమో ఆమె తిరిగి వస్తుందనే నా నమ్మకం’ జ్యోతి తనలో తాను అనుకుంటూనే పైకి అనేసింది. ‘అది నీ పిచ్చి నమ్మకం జ్యోతీ..’ ‘కొన్నిసార్లు సిద్ధాంతంతో కూడిన సందేహం కంటే ప్రేమతో కూడిన నమ్మకమే గెలుస్తుంది సురేష్!’ ‘నేను మాత్రం రాణి తిరిగి వస్తుందంటే ససేమిరా నమ్మను. ఆమె కులం ఆమెను రానివ్వదు’అన్నాడు. ‘ఏమో సురేష్ , ఆమె వస్తుందనుకుంటే నా మనసుకు రిలీఫ్‌గా వుంది.’ ‘చూద్దాం అంటే చూద్దాం’ అని ఇద్దరూ చెరో వైపూ తిరిగి కళ్ళు మూసుకున్నారు. జ్యోతి కన్నుల మీద రాత్రంతా గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తూనే వుంది. ఆ అలల మీద ఒకే ప్రశ్న తేలియాడుతోంది. ‘ఇంతకీ ఆమె వస్తుందా..?’ చదవండి: కథ: కొత్త బట్టలు.. మా యమ్మ ఫోన్ సేసి అడిగినప్పుడ్నుంచి ఏడుచ్చా పనుకున్యా! -
పరాయి వస్తువులపై మోజు.. ఇన్ని ఇబ్బందులా!
వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి. వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది. తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది. తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్‌లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..) ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
పిల్లల కథ: ప్రతిభకు పట్టం
దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు. ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు. ‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. ‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత) ‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
కథ: కొత్త బట్టలు..
‘అంగీ గుడ్డలు, పంచలు, టువాళ్ళు, టౌజర్లమ్మో’అని అరుసుకుంటా సైకిలు మీంద వెంకటయ్య పోతాంటే బండకాడ కూచున్య మాయమ్మ కాడికి ఉరుకుతా పోయిన. మాయమ్మ కూరగాయల రమణమ్మతో ఊళ్ళో రాజకీయాలు మాట్టాడ్తంది. ‘మోవ్.. మోవ్..’అని పిలుచ్చున్యా ఇనపడకుంది మా యమ్మకు. వెంకటయ్య కాపొల్ల ఇంటికెళ్ళి అరుసుకుంటా పోయా. రవణమ్మకాడికి బాయికాడి ౠమ్మొచ్చి కూచుండ్య. మాయమ్మ ఆమె దిక్కు సూసి మొఖమంతా కారంసేసుకొని ‘సెప్పురా ఏం కొంపలు మునిగిపోయి సచ్చనాయి, సీత్వ కొట్టుకున్నట్టు కొట్టుకుంటనావు’ అని కొట్టుకునా నా కాడికొచ్చి. ఆ ౠమ్మమీదండే కోపం నా మీంద పడే. వాళ్ళిద్దరి సంగతి అలివికాదులే అనుకొని ‘మా... మా ... వెంకటయ్య తాత కాపోల్ల ఇంటికి దిక్కు పోయినాడుమా బట్టలేసుకొని’ అని అన్య. ‘ఆ పోతాడు వానికేమి మచ్చుగా పోతాడు పా’ అని ముందుకు దొబ్బే నన్ను. ‘ఎప్పుడూ ఉగాది పండక్కి బట్టలు కొనిచ్చావ్గా ఇప్పుడేం!’ అని మంకు పట్టు పట్టినా. ‘లెక్క ఉండి సావగూడదు ఊరికే వచ్చయా బట్టలు? ఈసారి ఏం లేవు పా, నీకు మీ నాయనకు తిన్నీకి ల్యాకున్య సోకులకేం కొదవలేదు’ అనేసరికి కళ్ళలో నీళ్ళు సేరె. పెద్ద దెయ్యం మాదిరి మా యమ్మ, ఇంటికెళ్ళి నడుసుకుంటా పోయా. ఉగాది పండక్కు నాలుగు రోజులు గూడ లేవ్, ఇప్పుడు కొనుక్కుని మద్దిలేటికి ఇయ్యకపోతే వానక్క.. వాడు పండగ రోజుగాని ఇయ్యడు. పండగ టైమ్‌లో వాంది పెద్ద బిల్డప్లే నా కొడుకుది అనుకుని యింటికెళ్ళి పోతాంటే మా సుధీర్ గాడు ఎదురొచ్చె. వాళ్ళమ్మ జమ్మలమడుక్కు రెడిమేడ్ బట్టలు తీసుకరానికి పొయ్యిందంటా అని సెప్పేసరికి కడుపులో మంట లేశా. ఉగాది రోజు కొత్త బట్టలు ఏసుకోకుంటే అది పండగ లెక్కేకాదు. మా ఊళ్ళో పండగంటే ఉగాది పండగేలే. ఆ రోజు మారెమ్మ దేళం ఉంటాది.. నా సామీరంగ ఊరంతా ఆన్నే ఉంటాది. ఊళ్ళో సున్నం తగలని ఇల్లు ఉండదు. సాయంత్రం ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు ఏట్లో కడుక్కొచ్చి, యాపమాను మండలు కట్టి, ఎర్రమన్ను పూసి, సున్నం బొట్లు పెట్టి మారెమ్మ దేళం సుట్టూరా కేకలు ఏసుకుంటా బల్లు తిప్పుతాంటే.. ఏం ఉంటాది పానం పోయిన లెక్కల్యాప్పడు. మాయబ్బ ఎద్దులు బో ఉరుకుతాయిలే ఆ పొద్దు. దాళ్ళ ముందర రెడ్డిగారి ముస్లి ట్రాక్టర్ కూడా సాల్దు. మంది లెక్కంతా కూడబెట్టి ఉగాదికి బట్టలు కొనుక్కుని మారెమ్మ దేళం కాడికి వచ్చారు. కబడ్డీ ఆటలు, కోకో దుమ్ములో మునిగిపోద్ది మారెమ్మ దేళం. రెండు కళ్ళు సాలవు ఆతల్లిని సూన్నీకి. అట్టాడ్ది ఆపొద్దు కొత్త బట్టలు వేసుకోకుంటే ఎట్టుంటాది! దానికన్నా సగం శనగ మాత్ర మింగిసచ్చే మేలు. సున్నం కొట్టే దాంతో ఉగాది పండగ వారం రోజులు ముందే ఊళ్ళోకి దిగుతాది. పది రోజులు నుంచి సూచ్చన.. బట్టలు ఊసే ఎత్తట్లేదు మాయమ్మ. ఇంగ కాదని నేనే రంగంలోకి దిగిన. మాయన్న నంగి నా కొడుకు నేను ఎట్టా అడుగుతానని మెల్లగాకుండా ఉంటాడు సెవిటి నాకొడుకు. ఇంట్లో మాయమ్మ సున్నం ఉడకేచ్చంది. కుత కుతమనని అరుచ్చంది కుండ. మా నాయన వార్తలు సూచ్చనాడు. మా యమ్మకు ఊర్లో యవ్వారాలు, మా నాయనకి దేశం యవ్వారాలు. మాయన్నగాడు ప్యాడకాసులు ఎత్తుతనాడు గాడిపాట్లో. వంకర మూతితో ‘మోవ్ మోవ్ బట్టలు మా, నాలుగురోజులు కూడా లేవు మా, వెంకటయ్య తాత పోతాడు మా’ అన్యా. ‘ఇట్నే అరుచ్చాంటే సున్నం కుండలో ౠడ్చ నాకొడక నిన్ను! పుట్టించినోడు ఆడ ఉండాడు సూడు.. పోయి అడుగుపో’ అని మా నాయన దిక్కు సూపిచ్చింది. మా నాయనను అడిగేదానికన్నా రగ్గుకప్పుకొని పనుకునేది మేలు. మాయన్న గాని దగ్గరికిపోయి ‘రేయి నువ్వు అడుగురా నాయనని’ అని అడిగితే.. ‘నాకు బట్టలు వద్దు ఆ మనిషి సేత్తో తల్లు వద్దు. నువ్వే అడుగుపో’ అని ప్యాడ గంప ఎత్తుకొని దిబ్బకుపోతన్య మాయన్నను ఎగిచ్చి తందామనుకున్య. వెంకటయ్య తాత బట్టలు బట్టలు అని అరుసుకుంటా హరివరం పోయినాడు. రాత్రంతా ఏడుపు మొఖంతోనే పనుకున్యా. బువ్వ గూడ తిన్ల్యా. తినకుంటామాన్లే లెక్క ల్యాకుంటే యానుంచి త్యావాల. ఆడ అప్పు పుచ్చిపోతుంది. శనగలన్నీ వాని దుంప తెంచుతున్నాం. గాడిద పని సేచ్చన్య ఇల్లు గడవకుంది అని కళ్ళు వొత్తుకునా మా యమ్మ. బట్టలు ఉండవని తెల్సి నా పానం గిలగిల తన్నుకుంది మంచంలో. పొద్దున బడికి పొతున్యప్పుడు మా యమ్మని సతాయిచ్చా కూచ్చున్య. మా నాయన బువ్వ తింటా కాలెత్తుకొని మీదకొచ్చినాడు ‘మర్యాదగా బడికిపో ల్యాకుంటే ఈపు పగుల్తాది. పిల్లోనివా ఏమన్నా ఏడోతరగతి సదవుతున్నావ్? ఇంగా బట్టలు అంటావే లేసిపో నాకొడకా’ అన్యాడు. సేసేది ఏం ల్యాక సునీల్గాని కోసం సైకిల్ పట్టుకొని బడికాడ నిలబన్య ఎంతసేపటికి రాకపోయా నా కొడుకు. బాబాగాడు వచ్య రొంచేపటికి. ‘రేయి వాడు రాడంట. బట్టలు కొనుక్కొనికి టౌన్కూ పోతానడంట మనం పోదాంపా’ అని లాక్కొనిపోయా నా మనసేమో సునీల్గాని బట్టల మాటల మద్య ఇరుక్కొనిపోయ. బళ్ళోంతా బట్టల మీదే ధ్యాస. ఉగాది పండగ కళ్ళు ముందర తిరుగుతాంది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మా ఇల్లు సున్నం పూతతో కొత్తగా ఉంది. పుంజు కోడికి జొన్నలు పెడ్తా నీళ్ళు అందుకోమనే మా నాయన. మా యమ్మ పొయ్యి కాడ కూచ్చోని ‘ఏమే.. రెండు కేజీలన్నా పడ్తాదా?’ అని అడిగా. దానికి ఈ మోగొడు ‘ఏంది రెండు కేజీలే తిక్కదాన, మూడు కేజీలు పైన పడ్తాది’ అని ఇకారాలు పోతాంటే కోపం మా యేరు పొంగుతున్నట్టు పొంగ్య నాలో. నీళ్ళు తీసుకొని ఇచ్చిన. ఏందో మా యమ్మ.. రొంచేపు నాయన్ను తిడ్తాది, రొంచేపు ఆ మనిషితో బా ఉంటాది ఈ ఎర్రిది అనుకున్యా. బడికానుంచి వచ్చినాక బయటికి కూడా పోల. సునీల్‌గాడు బట్టలు తెచ్చుకొంటాడు. మా యమ్మ సుట్టురే ముండ మొఖం ఏసుకొని తిరుగుతనే ఉన్యా. మా యమ్మను బొ తిట్టుకున్యాలే ఆ పొద్దు. రెండు రోజులు గడిచిపోయినాయి. ఉగాది పండగ ఆనుకొని వచ్చింది. బడికి పొతనా వచ్చనా అంతే, మాయమ్మతో మాట్లాడి రెండు రోజులు అయింది. బట్టలు కొంటేనే మాట్టాడ్తాని సెప్పిన. రెండుసార్లు మాట్టాడించింది. నేను మాటల్యా. నాది మాట అంటే మాటే. దాంట్లో మా కర్రెబ్బ కంటే మొండి నా కొడుకుని. ఎప్పుడూ మా యబ్బ పేరుతో తిడ్తాంటాది మాయమ్మ. రేపు ఆదివారం, వచ్చే సోమవారం పండగని, దీనంగా సూసిన దాని గుండెలో మాత్రం జాలి ఊట దిగలా. సచ్చే సావని అన్నట్టుంది. నా బట్టల ఆశ ఏటికాడ గోరిలలో కలిసిపోయింది. పండగ రోజు బయటికి పోగూడదని, సంకలో ఉల్లిగడ్డ పెట్టుకొని జెరం వచ్చిందని సేప్దామనుకున్యా అందరికీ ఇంగా. ∙∙ పొద్దున ఆరుగంటలకి నిద్రలేపింది మాయమ్మ. ‘బట్టలకు నేను, తిరుపాలమ్మక్క పొద్దుటూర్కూ పోతానం ఉప్పుపిండి సేసిన, మధ్యానం మీ నాయనకి ఉండిచ్చి తినండి’ అని నెత్తి మీద ముద్దు పెడితే మాయమ్మ మీద ఒట్టు కళ్ళలో గిర్రున తిరిగా నీళ్ళు. సాదా సీర కట్టుకుని మారెమ్మ పొతునట్టు కనిపించింది మాయమ్మ. ఆమె దిక్కు సూచ్చా మంచంలో కూచ్చున్యా. మా నాయన బరుగోళ్ళు తోలుకొని పోయినాడు. పొద్దుటూర్ బట్టలు ఏసుకుంటునా అని గుండె జెజ్జినక్కతొక్కుతుంది. అందరికి సెప్పనీకి తనకలాడ్తాంది. సుధీర్గానీ యింటికాడికి దొమ్మలు ఇడుసుకొని పోయిన. ఊరంతా తిరుగుతా ఏటికాడ సైటి మీంద పనుకొని, ఎట్టాటి బట్టలు తెచ్చాదో ఈ తిక్కది నన్ను గూడా పిలుసుకొని పోయింటే బాగుండని మా యమ్మను తలుసుకున్యా. నాలుగు సార్లన్నా మాయమ్మకి ఎక్కిళ్ళు వచ్చింటాయి నా దెబ్బకి. ఏటవతలుంచి బరగోళ్ళు ఇంటిదావ పట్టినాయి. మధ్యానం అయితాంది. సాయంత్రం కోసం ఎదురుసూచ్చన. బువ్వ కూడా కావట్లేదు నాకు ఆ పొద్దు, పొట్ట నిండా తిని తేపుకుంటా వచ్చా మా దచ్చగిరి మామ ‘రేయి సిన్నోడా.. మీ నాయన ఎతుకుతనాడ్రా మీకోసం. పెద్దోడు యాడుండాడు’ అని అడిగా. ‘వాడు క్రికెట్ ఆన్నీకి పోయినాడు. ఏమంటా మామ?’అని అరుగు దిగిన. ‘ఏమోరా శాంచేపు నుంచి ఎతుకుతనాడు పో’ అని టువాలు పరిచి పనుకున్యాడు దచ్చగిరి మామ. ఎండ వాంచుతుంది. ఇంటికి పోయేసరికి పొయ్యి కాడ అన్నం వండుతున్నాడు మా నాయన. నన్ను సూసి ‘వాడు యాడికి పోయినాడు’ అని అడిగా. ఇంట్లో ఉప్పుపిండి సర్వ కింద పడింది. బియ్యంనూకలు సెల్లాసెదురు అయినాయి. మా నాయన నా వెనకమాన్లే వచ్చి వాకిలేసి కొట్టా నా కొడకల్లారా ఇంట్లో ఉండకుండా యాడికి సచ్చినార్రా? వాకిలి వేయకుండా పోయినారు. కుక్క అంతా అల్లకొల్లలం సేసిందని సేతికి యాది దొరికితే దాంతో కొట్టినాడు. మా జేజి వచ్చి అడ్డుపన్యా ఆగల. కుక్కను కొట్టినట్టు కొట్టినాడు. మాయన్న గాడు తప్పించుకొని, మా జేజి కాడ దాపెట్టుకున్యాడు. ఓంకెలు పెట్టి ఏడుచున్య ఇసిపెట్టల మా నాయన. కుక్క మీద జాలేసింది. అప్పడుగాని అది దొరికింటే సచ్చేది మా నాయన సేతిలో, ఒళ్ళు హూనం అయిపొయింది. మంచం కింద దాసిపెట్టుకున్య. ఏడుచ్చా, అట్నే పనుకున్యా. మా అమ్మ వచ్చేదాకా తెలియదు రాత్రి అయిందని. వాతలు పడి పొంగింది నడ్డీపు. మంచం ఎత్తి దగ్గరకు తీసుకుంది మాయమ్మ. దెబ్బలకు పై అంతా కాల్తాంది. మాయన్న బరగోళ్ల సంబం కాడ ఆనుకొని సూచ్చనాడు. మసక మసక కనపడ్తనాడు. ‘నీ తలపండు పగల, యెయ్యాలప్పుడు పుట్టించుకుందే మీయమ్మ. నీ సేతులకు ధూమ్ తగల, ఇట్టనా పిల్లోని కొట్టేది పై సూడు ఎట్టా కాల్తాన్దో’ అని బొల బొలా ఎడ్సా మాయమ్మ. పానం అంతా సచ్చుగా ఉంది. మంచంలో పనుకోబెట్టింది. జెరం మాత్రం తీసుకొని వచ్చినాడు మా నాయన. శారన్నం తినిపించి మాత్ర ఏసింది మాయమ్మ. కళ్ళు మూసుకొని పోతనాయి. నా తలకాయ ఒళ్ళో పెట్టుకొని కూచుంది. మా యన్నను బట్టలు సూపించమని సెప్పింది. బట్టలసబ్బు రంగు అంగీ దాని మీదకి మిలట్రీ ప్యాంట్ తీసుకొని వచ్చింది నాకు. పానం బట్టల మీందకు పాకింది. సేత్తోతాకిన, ఎప్పుడెప్పుడు ఏసుకుందామా అంటాంది మనసు. ‘బట్టలు బట్టలు అని సచ్చండ్య ఇన్ని రోజులు ఇప్పుడేమో ఇట్టా సచ్చా’ అనా మాయమ్మ. బట్టలు పట్టుకొని అట్నే పనుకున్యా. అల్లుపోయినట్టుంది పానం. దెబ్బలకు మూలుగుతనే ఉన్యా రాత్రంతా. రాత్రి రెండు మూడు సార్లు మా నాయన సెయ్యి నుదురు మీద తాకింది సల్లగా. మాయమ్మ మూడు గంటలకే లేసి ఇల్లంతా తుడిసి స్నానం సేసి పండగ మొదలుపెట్టింది. బచ్యాల వాసన ఇల్లంతా పట్టింది. నా జెరం మాత్రం తగ్గలేదు. పాలు తాపించి ఇంగో జెరం మాత్రం ఏసినాడు మా నాయన. మారెమ్మ దేళం కాడికి బల్లు రెడీ ఐతనాయి. మాయబ్బ ఎద్దుల గజ్జెలు, మారెమ్మ దేళంకాడ తప్పెట్లు ఇనిపించి కళ్లలో నీళ్లు దిగినాయి. ఫ్యాన్ గాలికి కొత్తబట్టలు దేవుని మూలన కవర్లో సప్పిడి సెచ్చాంటే ఆ రోజంతా మంచంలో మూలాగుతనే ఉన్యా. బతుకుదెరువుకి ఊరు యిడ్సి ఇరవైఏళ్లు అయితాంది. మా యమ్మ ఫోన్ సేసిరేపు ఉగాది పండక్కు కొత్తబట్టలు కొనుకున్యావ నాయన అని అడిగినప్పుడ్నుంచి గుండె ఊరిమీందకు పీకి పండగ మతికొచ్చి పిల్లోని మాదిరి ఏడుచ్చా పనుకున్యా. -సురేంద్ర శీలం -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
కథ: దాడి.. ‘పులి ప్రాణాలు మాత్రమేనా, జింక ప్రాణాలు గొప్పవి కావా?
అడవి గుట్టలపై దాకా విస్తరించింది. ఆనుకొని కొన్ని ఊర్లు.. రాళ్లు కనబడనంత పచ్చదనంతో నిండినా గుట్టల వరుస, దూరం నుంచి పచ్చని బుట్టలుగా కనబడుతున్నాయి. ఆ బుట్టలోకి సూర్యుడు నెమ్మదిగా జారుకున్నాకా, ఎవరో కాల్చొదిలేసిన బీడీ ముక్కకి అడవిలో మెల్లగా మంటలు లేచాయి. గుట్ట పొడవునా తీగలా పాకిన ఎలగడ మంటలు. గాలులకు వేడి సెగలు తాకి ఆనుకొనున్న ఊర్ల మీదికి వీచాయి. ఓ ఊరి జనం తమ పొలాలకు మంటలు అంటుకోకుండా నీళ్లు తడుపుతూ జాగ్రత్తలు తీసుకుంటుంటే, అడవిలో నుంచి వినబడుతున్న రకరకాల జంతువుల అరుపులు, ఒక్కసారిగా ఓ గాండ్రింపు విని అన్నీ ఉన్న చోటే నిశబ్దమైయ్యాయని గమనించారు. పెద్ద పులి. ఆ ఊరి జనం ఎలగడ మంటల్లో కనబడిన పులిని చూసి ఒక్కసారిగా దడుసుకున్నారు. అగ్గి వెలుతురుకి దాని కళ్లు ఇంకా కాంతివంతంగా ఉంటే, దాని ఒళ్ళు హూందాగా, మెల్లగా అడుగులేస్తూ కదులుతోంది. తమ పశువులపై కన్ను పడిందని అర్థమై గొర్రెల్ని, బర్రెల్ని, ఆవుల్ని ఇంట్లోకి తీసుకెళ్లసాగారు. పులి అతి కొద్దిసేపటికే ఊరు మీదికి వచ్చేసింది. భయంతో ఎటు పడితే అటు పరిగెడుతున్న జనంలో, ఓ ఆవుపై పంజా విసిరింది. గట్టిగా దొరకబట్టి కొరికింది. చెట్ల పైకెక్కి కొందరు అరుస్తూ రాళ్లు, నిప్పు కట్టెల్ని విసురుతున్నా కూడా పులి మాత్రం ఆవుని చంపే దాకా వదల్లేదు. సగంగా చీల్చిన దేహాన్ని నోటితో లాగుతూ అడవిలోకి తీసికెళ్ళిపోయింది. అర్ధరాత్రి వరకు అడవిలోని మంటలు కాస్త చల్లారాయి. కానీ ఊరూరంతా వేడెక్కిపోయి కూర్చుంది.. ఓ చెట్టుకింద. ‘నీయవ్వ, ఆఫీసర్ల మీద గౌరంతో పులిని ఏమనకుండ కూసుంటే, శివరికి గిట్ల భయపడ్తూ బలవ్వుడే అయింది కదే. ఇగ గిట్లే సూస్కుంట కూసుంటే గాదు. నేనే ఏదోటి జేత్తా. పులిని సంపుడో లేదా దాని సేతుల సచ్చుడో, ఏదోటి తేలాలే ఇయాల’ లింగ.. పులి తన ఆవుని చంపిందని కోపం బాధతో. ‘రోజూ ‘పులి కగ్గితగలా పులి కగ్గితగలా’ అని కోరుకుంటాంటే, అడివికగ్గితగిల్నా కూడా అల్లకేలే దున్కవట్టే. దాని పీనుగెల్ల. రాన్రాను అడివిడిశిపెట్టి ఊర్లనే దర్జాగా తిరుగుతదేమో.. మన పీనుగుల్ని పీక్కుతింటానికి. ఓరి లింగా గీ ఆఫీసర్లను నమ్ముకోకురా, నీ బల్లేనికి పనిజెప్పుకో, అప్పుడే సక్కగైతది’ ఓ ముసలవ్వ. ‘ముసల్ది గట్లే అంటది. అడివిని ఈ నేలని నమ్ముకొని ఎన్నేండ్లనుంచో ఈడ్నే ఉంటున్నంగా, ఇప్పుడంటే పులులు అత్తున్నయ్ గానీ దానికంటే ముందు వేరే జంతువులేమైన తక్కువనా యేంది? కానీ ఇవేం కొత్త కాదుగా. మల్లోసారీ ఆఫీసర్లకు సెప్పిసూద్దాం, ఆల్లే సూస్కుంటరు’ తాత్పరంగా కూర్చుంటూ చెప్పాడు మరో పెద్దమనిషి. పక్కకున్న తన బల్లేన్ని అందుకొని, ‘హా! సూస్కున్నర్తి పులిని.. మనల్ని కాదు. అయినా నీదేంబోయిందోయ్.. ఎన్నైన సెప్పిసత్తవ్. సచ్చింది మా పసువులు. ఇన్ని రోజులంటే ఎదురుజూసినం, ఇప్పుడు ఎదురుతిర్గుడే. అందుకే ఎవలచ్చినా రాకున్న నేనే తేల్చుకుంటా. సెప్పిన కదా సచ్చుడో లేదా పులిని సంపుడో’ లింగ ఆవేశంగా. ‘నువ్వు ఊ అంటే బల్లెం ఎత్తుతానవేంద్రా.. దించు. నీ బాధ నాకు తెల్సురా. కానీ ఈ ఒక్కసారి నా మాటినుర్రి. ఆవేశంలో పులిని ఎదుర్కునుడు పెద్ద పని కాదనుకుంటున్నావ్. నీకు నీ బల్లేనికి గంత ధైర్యం లేదని తెల్సు. అందుకే ఆఫిసర్లకు జెప్తే ఆల్లే సూస్కుంటరు. ఆళ్లకు జెప్పకుంట జేస్తే మల్ల జాగలు ఖాళీ జేయమంటర్రా. ఎందుకచ్చిన లొల్లి, కొంచెం నిమ్మలంగాండ్రి ముందు’ పెద్దమనిషి. ‘ఎప్పుడు సూడు ఏదో నచ్చజెప్పుడే ఉంది నీది. సచ్చుడుకి సిద్ధమైన కాబట్టే ఈ ధైర్యం, మనందరి పానాల కంటే ఎక్కువనానే. సరే. నువ్వన్నట్టు ఆఫీసర్లనే అడుగుదాం. రేపే అందరం సద్దులు వట్టుకొనే ఆఫిసర్ల కాడికే పోదాం. ఇనే దాక ఆన్నె ఉందాం. ఎంటనే పులిని పట్టుకుంటామంటే సరి లేకుంటే మాత్రం ఏం జేయాల్నో గదే సేసుడు’ లింగా. అవును.. అతను అన్నది లెక్కేనని ఊరంతా అనుకున్నరు. అలా అనుకున్నారో లేదో పులి గాండ్రింపు గుట్ట మీది నుంచి గట్టిగా వినబడింది. ఒక్కసారిగా అందరూ అలర్టయి అటు వైపే చూశారు. ఎర్రటి చంద్రుడికి అడ్డంగా నిల్చున్న పులి ఆకారం స్పష్టంగా కనబడసాగింది. లింగా ఆవేశం ఆపుకుంటూ బల్లెం మీద పట్టు బిగించాడు. పులిని చూస్తూ కొందరి కళ్లల్లో చింత నిప్పులు, కొందరి కళ్లల్లో ఊటబాయిలు, ఇంకొందర్లో రెండూనూ. తెల్లారింది.. అటవీశాఖ కార్యాలయం తాళం తీయడానికి వచ్చిన అటెండరు, ఆఫీస్ ముందు కూర్చున్న నాలుగొందల మందిని చూసి ఒక్కసారిగా జడుసుకున్నాడు. అతని ఫోన్ లాక్కొని ఒకచోట కూర్చోబెట్టారు. అధికారులు రాగానే అందరూ గుమిగూడి ఆందోళనకు దిగారు. నచ్చచెప్పాలని ఎంత చూసినా అధికారుల మాటలు ఎవరూ వినేలాలేరు. జనాల ఆవేశం చూసి అధికారులకు చెమటలు పడ్తున్నాయి. ‘విషయం సీరియస్‌గా ఉందని చెప్తాం. తమ పై అధికార్లతో మాట్లాడడానికి కాస్త సమయం కావాలి’ అని అడగడంతో అధికారులను కార్యాలయం లోపలికి వెళ్ళనిచ్చారు. ఏసీ గదిలోకి రాగానే కాన్ఫరెన్స్ కాల్ కలుపుకొని చెమటలు తుడ్చుకోసాగారు అధికారులు. ‘ఆల్రెడీ చెప్పారు కదయ్యా, మళ్లీ ఏంటి? ట్రాంక్విలైజ్ (మత్తు మందు) చేయడానికి పర్మిషన్లు వద్దా? దానికి టైమ్ పడ్తదని తెలీదా? మత్తు మందు ఎత్తు నుంచి ఇవ్వడానికి ఏనుగుల్ని మధ్యప్రదేశ్ నుంచో తమిళనాడు నుంచో పంపొద్దూ! దానికి వైల్డ్ లైఫ్ టాస్క్ ఫోర్స్ పర్మిషన్ ఇవ్వొద్దూ? ఎందుకోయ్ తొందర?’ వీడియో కాన్ఫరెన్స్ కాల్లో పై అధికారి. ‘అది కాద్సర్.. బయట జనాలు గందరగోళం చేస్తున్నారు. పరిస్థితి కాస్త అదుపు తప్పేలా ఉంది. వారం రోజుల్లోనే పులి వల్ల దాదాపు 35 ప్రాణాలు బలయ్యాయి సార్. పులి సంగతి తేల్చే వరకు ఊరి జనం ఆఫీస్ ముందు నుంచి కదిలేలా లేరు’ ‘అవునయ్యా.. కానీ తొందరపడితే లాభం లేదుకదా! ఇలాగే పోయిన నెల సరైన ఎక్స్‌పీరియెన్స్ లేకే, పక్క రాష్ట్రం ఆఫీసర్ల పై దాడి జరిగి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. పులికి మీరు కూడా బలి అవుతారా ఏంటి? ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి’ ఫోన్‌కాల్ కట్ చేయబోతూంటే.. ‘సార్ సార్.. ఇదే విషయం బయట చెప్తే జనం ఇంకా సీరియస్ అవుతారు సార్. ఇప్పటికే మాటినట్లేదు.’ ‘అయితే నేనేం చేయాలయ్యా? పోలీసులకు ఫోన్ చెయ్. అడవి దగ్గర ఊర్లన్నీ ఎప్పుడో ఖాళీ చేయమని చెప్పాం కదా. వాళ్ళే ‘మా అడవి.. మా మట్టి‘ అని కూర్చున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. మన పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వమేమో, పులుల కొత్త అభయారణ్యం అనుమతుల కోసం టైగర్ రిజర్వ్‌కి లేఖలు రాస్తోంది. మనం, ఉన్న దాంట్లో కనీసం జనాన్ని ఖాళీ చేయలేకపోతున్నాం..’ ‘నిజానికి ఇప్పుడున్న ప్రాబ్లం ఆ రాష్ట్ర సరిహద్దు దగ్గరే మొదలైంది సార్. అంటే వాంకిడి, సిర్పూర్ లాంటి మండల శివారు ప్రాంతాల్లో పెన్ గంగ, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయ్ కదా సార్! ఆ నదికి అవతల వైపున్న మహారాష్ట్ర అడవిలోని పులులు, ఫోడ్సా అనే సరిహద్దు గ్రామంలోని అడవి దగ్గర నది నీళ్ళతో దాహం తీర్చుకుంటున్న వాటికి ఇవతల వైపున్న తెలంగాణ అడవిలోని జంతువులు.. మనుషులు కనబడడంతో దాడి చేయడం మొదలెట్టాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పులులు తిరుగుతూ తిరుగుతూ మన అడవికి, ఆనుకొనున్న ఊర్ల వరకూ వచ్చాయి సార్..’ ‘సర్లేవయ్యా, దానికి ఎవడు మాత్రం ఏం చేస్తరు? సరిహద్దులు మనుషులకే.. జంతువులకు కాదు. మీ విషయం వివరంగా చెప్పి ఆ పర్మిషన్లేవో కాస్త అత్యవసరం కింద తీసుకొస్తాన్లే. ఏదో ఒకటి చెప్పి ముందు వాళ్లని పంపించేస్కోండి’ ఫోన్‌కాల్ కట్ చేసేశాడు. అధికార్లకి మళ్ళీ చెమటలు పడ్తున్నాయి. బయటకొచ్చి చూసేసరికి ఇంకొన్ని ఊర్ల జనం కూడా తోడయి మొత్తం మూడువేల మంది జమయ్యారు. వాళ్లంతా పంజా విసిరే పులుల్లాగే ఉన్నారు. ‘పై ఆఫీసర్లు ఇంకాస్త సమయం పడ్తదన్నారు, కాస్త ఓపిక పట్టిండి’ సీనియర్ అధికారి నచ్చజెప్పబోతే, ‘ఎంత టైమ్’ అని నిలదీశారు. ‘కరెక్ట్‌గా ఇంత అని చెప్పలేం కానీ కొద్ది రోజుల్లోనే’, అనగానే, ‘ఈడికచ్చిన సగం మంది పులి దెబ్బకి సచ్చినాకనా?! ఈల్లు గిట్లే అంటరు గానీ మనం జేయాల్సింది జేసుడే, అప్పుడే తొందర వడ్తరు’ అని జనం అక్కడున్న అటవీ శాఖ అధికార్లందరినీ కార్యాలయంలోకి తోసి బయటికి గొళ్లెం పెట్టి తాళం వేసేశారు! విషయం తెలుసుకున్న పోలీసులు వెంటవెంటనే చేరుకున్నారు. జనం వాళ్ళకు ఎదురుతిరిగారు. లాఠీలకు పని చెప్పక తప్పలేదు. కార్యాలయంలో బంధించిన అధికార్లకు ఏ పొదల్లోంచి పులి వస్తదేమోనంత భయంగా ఉన్నారు. ఎందుకంటే జనం ఆవేశంతో ఏ పామునో అడవి పందినో లోపలికి పంపిస్తే పరిస్థితేంటని బయటికి చూస్తూ కూర్చున్నారు. పిల్లలు, ఆడవాళ్లని తేడా లేకుండా బయట పోలీసులు తరిమేయాలని చూస్తున్నా ఎవరూ వినకుండా ఎదురుతిరుగుతూనే ఉన్నారు. కొద్దిసేపటికి మీడియా రాకతో, న్యూస్ కాస్త వైరల్ అయ్యింది. నిరసనలు, లాఠీ చార్జ్, ఎదురుతిరగటాలు వీడియోలుగా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తుంటే, అటు టీవీ చానెల్స్‌లో ‘మనిషి–పులి’ చర్చ మొదలైంది. ‘భూమ్మీద ఎన్నో జీవరాశులు అంతరించిపోతున్నప్పటికీ, పెద్ద పులుల పైనే ఎందుకింత ఆసక్తి?! నేషనల్ యానిమల్ ఫ్యామిలీ అనా?’ ఒకరు. ‘అంతరించిపోయే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులకి లేదా? పులులు మనుషుల మధ్యకి రాలేదండి, మనుషులే అడవిని దున్నుకుంటూ వాళ్ళ మధ్యలోకి వెళ్లారు’ ఇంకొకరు. ‘పులినైనా.. మనిషినైనా.. కాపాడాల్సింది ప్రభుత్వమే’ మరొకరు. యాంకర్ వారి ముగ్గుర్నీ అదుపులో పెడ్తూండగానే వాళ్లు తిట్టుకోవడం మొదలెట్టారు. మరో దిక్కు వేరు వేరు సభలు నిర్వహిస్తూ అటు మానవ హక్కుల సంఘాలు, ప్రపంచ మేధావులు, ఇటు ప్రతిపక్షాలు అడవి బిడ్డల వైపే మద్దతు పలుకుతున్నామని ప్రకటించాయి. అయితే బయట ప్రపంచంలో జరుగుతున్న ఈ రాద్ధాంతం అటవీ అధికార్లను బంధించిన అడవి బిడ్డలకు ఏ మాత్రం తెలీదు! అడవిలో ఉన్న జంతువుల పట్ల కూడా తమకున్న ప్రేమ అపారమని, కాని తప్పని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నామని అడవి బిడ్డలు లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులకు చెప్పుకొచ్చారు. ఆ మాటలు జాలేశాయో లేక సిబ్బంది తక్కువగా ఉండడంతో జనాల్ని కంట్రోల్ చేయలేకో పోలీసు లాఠీచార్జ్ ఆపేశారు. కార్యాలయం బయటే వంటా వార్పూ మొదలైంది. ఈ లోపే పై అధికార్లతో ప్రభుత్వం చర్చలు పెట్టి చర్యలు తీస్కోడానికి సిద్ధమైంది. సాయంత్రానికి దిగొచ్చి ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అడవికి ఆనుకొని ఉన్న గ్రామంలోని ప్రజల్ని, వాళ్ల పాడి పశువుల్ని కాపాడుకోవడానికి, అంతరించిపోతున్న పులులను కాపాడుకునే బాధ్యతతో పులి ఆకలి తీర్చడానికి శామీర్‌పేట్ మహావీర్ హరిణ వనస్థలి జాతీయ వనం నుంచి వంద చుక్కల జింకల్ని, దుప్పుల్ని టైగర్ కారిడార్‌కి పంపుతున్నాం. వీటిని అడ్డంపెట్టుకుని పులిని ట్రాంక్విలైజ్ చేసి వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఒక ట్రాకర్‌ను కూడా అమర్చుతారు’ అని ఆ ప్రకటన భావం. పోలీసులు, అటవి అధికార్లు అక్కడున్న జనాలకు అర్థమయ్యేలా వివరంగా చెప్పి వాళ్ళను చల్లార్చారు. జనానికి నమ్మకం కలిగి, కార్యాలయం తాళాలు తీసి, అధికారులకు భోజనాలు పెట్టి వెళ్ళిపోయారు. లింగకి మాత్రం లోలోపల ఏవో ప్రశ్నలు రేగుతున్నాయి. ∙∙ అడవిలోనే పుట్టి పెరిగిన ఒక దుప్పి, ఎప్పటిలా ఒక ఉదయం ఎవరి కంటా పడకుండా మెల్లిగా చెట్ల మధ్య నుంచి తిరుగుతూ ఉంది.. దొరికిన వాటిని తింటూ! అప్పుడే హైదరాబాద్ జూపార్క్ నుంచి వచ్చిన రెండు వ్యాన్లను గమనించి ఆగింది. తీక్షణంగా ఆ వ్యాన్ల వైపు చూస్తూ ఉండిపోయింది. వాన్ వెనుక డోర్లు తీయగానే ఎదురుగా కనబడిన పచ్చని అడవి చూసి లోపలున్న జింకలు, దుప్పులు చెంగున బయటికి దూకాయి. చుట్టూ రకరకాల పక్షుల కూతలు, సెలయేళ్ల చప్పుళ్లు, కంటినిండా పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ జైలు నుంచి విడుదలైనట్టు సంబురంగా ఒక్కోటి ఒక్కో దిక్కు పరుగెత్తసాగాయి. వాటినన్నిటిని దూరం నుంచి కాస్త ఆశ్చర్యంగా చూస్తోంది అడవి దుప్పి. వ్యాన్ల నుంచి అన్నిటినీ దించకుండా జింక మాంసం కోసం కొన్నిటిని వేరే జీప్‌లోకి ఎక్కించి పంపించాడు డ్రైవర్. వ్యాన్ దిగిన ఓ పిల్ల జింక తల్లి కోసం వెదుకుతూ జీప్ వెనుకే పరుగెత్తింది, అందుకోలేక ఓ చోట ఆగిపోయింది. అధికారులు తమకు పంపిన ట్రాంక్వి గన్స్ చెక్ చేసుకొని సిద్ధమవుతున్నారు. కాసేపటికే పులి గట్టిగా గాండ్రించింది.. అడవి దద్దరిల్లింది. పక్షులు, జంతువులు ఉలిక్కిపడ్డాయి, ఉక్కిరిబిక్కిరయ్యాయి. కొన్నైతే గాండ్రింపు విన్న దిక్కు కాకుండా వ్యతిరేక దిశకు పరుగుతీశాయి. ఆ ‘అడవి దుప్పి’ తలతిప్పి చూసింది. పులి గాండ్రింపులు ఇంకా వినబడుతున్నా కొద్దీ, బెదురు కళ్ళతో ప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. తల్లి కోసం తిరుగుతున్న జింక పిల్ల పై పులి కన్ను పడి వెంట పడసాగింది. అది పరిగెడుతున్న వేగానికి సర్రున గాలి చీలినట్టు శబ్దం వస్తోంది. ఆ జింక పిల్ల ప్రాణ భయంతో దొరక్కుండా.. దారితెన్ను లేకుండా చెట్ల మధ్య నుంచి పారిపోతోంది. పులి తన శరీరాన్ని సాగదీస్తూ దాని వెంటపడి వేటాడుతోంది. జింక పిల్లయితే, దూది పింజలా ఎగురుతూ, భీతిల్లిపోయి పరిగెడుతోంది. దాని కళ్ళ నిండా భయం. రెండుమూడుసార్లు.. జింక దొరికినట్టే దొరికి పారిపోతోంది. పులి మరింత కోపంగా పంజా విప్పి గాండ్రించింది. అదెంత ఆకలి మీదుందో, దాని కళ్ళు, ఎండుకుపోయిన దాని డొక్కలు వూగుతున్నాయి.. ఆయాసంతో. ఈ వేటను దూరం నుంచి చూస్తున్న అడవి దుప్పికి కూడా పులి మీద భయంతో ఎటు పారిపోవాల్నో అర్థం కాలేదు. జాగ్రత్తపడి ఓ చోట నిల్చుంది. కొంతసేపటికి అడవి నిశ్శబ్దమైపోయింది.. దుప్పి నిశ్చలమై పోయింది. పులి పంజాకు చిక్కింది, జింక అరుపులు కొద్దిసేపు వినొచ్చాయి. పది నిమిషాలు అడవంతా నిశ్శబ్దం. జింకను సుష్టుగా తిన్న పులి.. నాలుకతో మీసాలు తుడుచుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ ఒక పొదలోకి వెళ్లి పడుకుంది. దుప్పి గుండె భయంతో కొట్టుమిట్టాడింది. పొదల్లో పులి నిద్రలోకి జారిపోయింది. దుప్పికి మెల్లమెల్లగా అర్థమైంది. మనుషులు తమను తాము కాపాడుకోడానికి అందాల జింక పిల్లని పులి పంజాకి చిక్కించేశారని. దాంతో పాటు కొన్ని జింకల్ని మనుషులే తినడానికి తీస్కెళ్ళారని కూడా అర్థమైంది. ఆ అడవి దుప్పికి ఆందోళన మొదలైంది, పులి కంటే మనుషుల మీదే అసహ్యం కలిగింది. తమ జాతి ప్రాణుల పట్ల జరుగుతున్న జంతుమేధానికి దుప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఓ చెట్టు పై అలికిడయ్యింది. ఉలిక్కిపడి తలెత్తి చూసింది దుప్పి. చెట్టు కొమ్మల్లో ఒక మనిషి పొడవైన ట్రాంక్వి గన్ పట్టుకొని పొదలో పడుకున్న పులి వైపు గురిపెట్టి చూస్తున్నాడు. దుప్పి ఒక్కసారిగా తన బలాన్ని కూడదీసుకొని.. ఆ చెట్టుని ఢీ కొట్టింది! మోడుబారిన చెట్టు కొమ్మల్లా ఉన్న దాని కొమ్ములు రెండు సగం విరిగాయి. తుపాకీతో సహా.. అతను దబ్బున కిందపడ్డాడు. దుప్పి వేగంగా వచ్చి.. సగం విరిగున్న కొమ్ములతో అతన్ని కుమ్మింది. ఆ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయెంత సమయం కూడా అతడికి లేదు. ‘అ..మ్...మ’ అని అడవి దద్దరిల్లేలా అరిచాడు. అతని భీకర అరుపుకి పులి నిద్రలేచినట్టే లేచి బద్ధకంగా ఒళ్ళు విరిచి మళ్ళీ పడుకుంది. దుప్పి కొంత దూరం వెనుకడుగేసి, వేగంగా మరోసారి వచ్చి కుమ్మింది! అతను అరుస్తూనే లేచి, పరిగెత్తసాగాడు. అప్పటికే దుప్పి కొమ్ములు దిగి అతడికి శరీరం రక్తసిక్తమైంది. అయినా మెల్లిగా తుపాకీ అందుకొని దుప్పికి గురిపెట్టాడు. ట్రిగ్గర్ మీదికి వేలుపోకముందే, దుప్పి మరోసారి అతడి ఛాతీ దగ్గర కుమ్మింది. తుపాకి దూరంగా ఎగిరిపడింది. ఈ సారి మళ్ళీ కసిదీరా కుమ్మింది. దుప్పి కొమ్ములనిండా చిక్కని రక్తం.. నెత్తుటి గాయాలతో అతను అరుస్తూనే, కాసేపటికి కనుమూశాడు. పులి నిద్రలేచింది. అతని శవం దగ్గరికి వచ్చింది, ఎదురుగా దుప్పిని చూసింది. రక్తం ఓడుతున్న కొమ్ములతో, ఆయాసంతో కాళ్ళు నిగ్గబెట్టి నిల్చుంది.. పులి కళ్ళల్లోకి చూస్తోంది దుప్పి. పులి పడి ఉన్న అతని శవం చుట్టూ రెండుసార్లు తిరిగి, వాసన చూసి నిశ్శబ్దంగా మళ్ళీ తన గుహలోకి వెళ్ళి పడుకుంది. ‘పులి ప్రాణాలు మాత్రమేనా, జింక ప్రాణాలు గొప్పవి కావా? వాటికే మాత్రం విలువ లేదా??’ అన్నట్టుగా దుప్పి అతని శవం వైపు చూస్తుండిపోయింది. దాని కొమ్ములకంటుకున్న రక్తం.. నేలపై ధారగ కారుతూనే ఉంది. రాత్రయ్యే సరికి ఈ సంఘటన మీదా ఊర్లో గుసగుసలు మొదలయ్యాయి. దుప్పి ధైర్యం కొందరి భయాలను పోగొట్టింది. మర్నాడు.. పేపర్లో ప్రముఖంగా ఒక వార్త.. ‘పులి దాడికి అటవి అధికారి మృతి’ అని. ప్రతిపక్షాలు ఘెల్లుమన్నాయి. ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంకొన్ని సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెంచింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఒక దృశ్యం కెమెరాలో కనిపిస్తోంది. మోడుబారిన కొమ్మలాంటి విరిగిన కొమ్ములతో, అక్కడక్కడా రక్తపు మరకలతో ఒక దుప్పి, ఏ జంకు గొంకు లేకుండా పులికి ఎదురుగా నిల్చుంది! దుప్పి ధైర్యానికి అధికారులు నోరెళ్లబెట్టడం ఆపి వెటర్నరీ డాక్టర్‌తో అక్కడికి పరిగెత్తారు. పులి నాలుగడుగులు వెనుకకువేసి గట్టిగా గాండ్రించి, విసురుగా వచ్చి పంజా ఎత్తింది. దుప్పి రవ్వంత కూడా భయపడలేదు. దుప్పి మెడను పులి నోట కరుచుకోబోతే తప్పించుకుంటుంది కానీ పారిపోవట్లేదు. పులి దుప్పి కొమ్ములను నోటితో కర్చుకొని పొదల్లోకి లాక్కెళ్ళిపోతుంటే.. దూరం నుంచి ట్రాంక్వీ గన్ పేలిన చప్పుడు. కానీ దానికి క్షణం ముందే ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న లింగా బల్లెం గాల్లోకి లేచింది. చదవండి: Dondapati Krishna-Funday Story: పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు ఉందని ఇంగితం లేదు! ఆ తండ్రి కష్టం తీరేనా? -
కథ: పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు ఉందని ఇంగితం లేదు! ఆ తండ్రి కష్టం తీరేనా?
సాయి కార్తీక్ ఎన్క్లేవ్ వైపు ఆటో వెళ్తోంది. ‘ఏంటి బావా, మొహం వెలిగిపోతోంది?’ నర్సయ్య అడిగాడు. ‘కాంట్రాక్ట్ ఒస్తే మనకు పండుగొచ్చినట్లే కదా బావా..’ నవ్వాడు బ్రహ్మయ్య. ‘ఎన్నో కాంట్రాక్టులు చేశాం. ఎప్పుడూ ఇంత సంతోషంగా లేవు. ఈసారి ఇంకేదో ఉంది. చెప్పు బావా..’ వదల్లేదు నర్సయ్య. పానకంలో పుడకలా వాళ్ళ మధ్య తాను ఎందుకని మాట్లాడకుండా, వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నాడు బ్రహ్మయ్య తమ్ముడు కొడుకు సోము. ‘అమ్మాయికి సంబంధం కుదిరేలా ఉంది బావా..’ బ్రహ్మయ్య మొహంలో ఓ బాధ్యత తీరిపోబోతున్న సంతోషం తొణికిసలాడింది. ‘కట్నం ఎంతడుగుతున్నారు?’ ‘ఆరు లక్షలు..’ ‘ఆరు లక్షలే.. మునిగిపోతావేమో బావా..’ ‘వృత్తిని నమ్ముకున్న వాళ్ళకు దేవుడు అన్యాయం చేయడు’ ‘చేసిందంతా చేశాడుగా.. అప్పుడు కరోనాగా వచ్చి నోటికాడ కూడు లాక్కెళ్ళాడు. ఇప్పుడు రెండో ప్రసవం కూడా పుట్టింట్లోనే చేయించుకోమని కూతుర్ని పుట్టింటికి పంపేలా చేశాడు’ ‘నీకు ఒకటే సంతానం కాబట్టి సరిపోయింది. నాకు ముగ్గురు. నా బాధ ఎవడితో చెప్పుకోవాలి?’ ‘కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసేశావ్. ఇప్పుడు కూతురిది కూడా చేసేస్తున్నావ్. ఇంకేంటి బావా?’ ‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది బావా’ కన్నీటి చెమ్మ ఊరింది బ్రహ్మయ్యలో. అది గమనించిన సోము ‘కాస్త ఆగుతావా మావా..’ అని నర్సయ్యను వారించాడు. కాసేపు.. మౌనం తన ప్రతాపాన్ని చూపించింది. విషయాన్ని దారి మళ్ళించడానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎస్.పి.బాలు పాటలు పెట్టాడు. రుద్రవీణ సినిమాలోని ‘తరలిరాదా తనే వసంతం, తనదరికి రాని వనాల కోసం’ పాట వినిపిస్తోంది. బ్రహ్మయ్యకు ఎందుకో ఆ పాట అతని నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అనిపించింది. అంతలో చిన్నకొడుకు నుంచి ఫోనొచ్చింది.. ‘పొద్దున అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? కోడలి సీమంతాన్ని ఫంక్షన్ హాల్లో చేస్తానని బంధువులకు, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. ఇప్పుడు చేయకపోతే పరువు పోతుంది. రెండు కాకపోయినా లక్షన్నరయినా సర్దు..’ ఓ రకమైన బెదిరింపు, ఓ రకమైన అర్థింపు కలగలిసిన గొంతుతో చిన్న కొడుకు. ‘నా మేనకోడల్ని నీకిచ్చి చేస్తానని మాటిచ్చాను. ఆ మాటను గంగలో కలిపేశావ్. ఇప్పుడు అంతకన్నా ఏం పోదులే. అయినా మీ అత్తామామలు చేయాల్సిన కార్యక్రమాన్ని నన్ను చేయమంటావేంటిరా?’ గట్టిగానే అన్నాడు బ్రహ్మయ్య. ఆ మాటలకు ఆటోలో ఉన్న నర్సయ్య.. ‘పోనీలే బావా! నా కూతుర్ని చేసుకోకపోయినా పర్లేదు. ఆడు సుఖంగా ఉండడమే కదా కావాల్సింది’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటను వినిపించుకునే పరిస్థితిలో లేడు బ్రహ్మయ్య. ‘నువ్వు కనుక డబ్బులివ్వకపోతే ఇంటిపై నుంచి దూకేస్తా..’ బెదిరించాడు కొడుకు అవతలి నుంచి. ‘చెల్లి పెళ్లి కన్నా మీ సుఖాలే కదా మీకు ముఖ్యం. దాని పెళ్లి చేయలేకపోతే నేనూ దూకడమే’ కోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు బ్రహ్మయ్య. అదేంటి బావా.. అట్లా అంటావ్! అన్నీ తెలిసినోడివి నువ్వే అలా ఇదైపోతే ఎట్టా..’ నొచ్చుకున్నాడునర్సయ్య. ఏం చేయను బావా! పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు ఉందని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్లకి. డబ్బు, డబ్బు అంటూ పీక్కు తింటున్నారు. మీ అక్కక్కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్ని ఇబ్బందుల్లో సీమంతాన్ని ఫంక్షన్ హాల్లో చేయడం అవసరమా, చెప్పు?’ ‘పోనీలే పెదనాన్నా.. ఈ కాంట్రాక్టులో నాకొచ్చే డబ్బులు అన్నయ్యకివ్వు..’ ఊతం అందివ్వడానికి సిద్ధపడ్డాడు సోము. ‘నీకున్న బాధ్యత ఆళ్ళకి లేదనేరా నా బాధ..’ నుదురు కొట్టుకున్నాడు బ్రహ్మయ్య. ‘పిల్లలు పుట్టాక బాధ్యత తెలుస్తుందిలే బావా! నువ్వలా ఇదవ్వకు. ఎలాగోలా డబ్బులు సర్దు’ ఓదార్చాడు నర్సయ్య. ‘ఈ కాంట్రాక్టులో మిగిలే డబ్బులు ఆడికిచ్చేస్తే పిల్ల నిశ్చితార్థానికి ఎక్కడ్నుంచి తేవాలి?’ పరిష్కారం అడిగాడు బ్రహ్మయ్య. ఏం చెప్పాలో.. ప్రస్తుతానికి గట్టెక్కించే మార్గం ఏమిటో పాలుపోక మరేం మాట్లాడలేదు నర్సయ్య. సాయి కార్తిక్ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ వచ్చింది. ముగ్గురూ ఆటో దిగారు. డెకోలం షీట్స్ కొన్ని, దూగోడ టూల్, ప్లైవుడ్ కటింగ్ మెషిన్ సామాగ్రినీ దించారు. ‘మీరు ఇక్కడే ఉండండి. పైకెళ్ళి ఓనర్‌ను కలిసొస్తాను’ అని చెప్పి లిఫ్ట్‌లో మూడో అంతస్తుకి వెళ్ళాడు బ్రహ్మయ్య. ‘ఒరేయ్ వీరేష్.. సాయంత్రం బావ ఫోన్ చేయగానే ఎక్కడున్నా వచ్చేయ్. ఆలస్యం చేయమాక. ఇంట్నావా? పోయినసారిలాగా చేశావనుకో మీ ఆవిడకు చెప్తా!’ ఆటో డ్రైవర్ వీరేష్‌కు సరదాలాంటి హెచ్చరిక చేశాడు నర్సయ్య. ‘ఆగు బాబాయ్.. ముందు పాట పాడాలి..’ అంటూ డ్రైనేజీ దగ్గరికెళ్ళాడు. ‘మా అక్కంటే అంత భయమా మామా?’ నవ్వుతూ అడిగాడు సోము. ‘భయమా... ఇదిగో.. అట్టాగే పోసుకుంటాడు..’ వీరేష్ వంక చూస్తూ నవ్వాడు నర్సయ్య. పెదనాన్న బ్రహ్మయ్య కోసం పైకి చూశాడు సోము. పావుగంట అయినా అతను కిందకు రాలేదు. విషయం కనుక్కుందామని సోము ఫోన్ చేశాడు. కట్ చేశాడు బ్రహ్మయ్య. నర్సయ్య చేస్తున్నా కట్ చేస్తున్నాడు. ఏమైందో చూద్దామనుకున్నారు. ‘ఒరేయ్ వీరేష్... అప్పుడే ఎల్లమాక. ఇప్పుడే వత్తాం ఉండు..’ డ్రైవర్‌కి చెప్పి పైకి వెళ్ళారిద్దరూ. అక్కడ బ్రహ్మయ్య ఓనర్‌ను బతిమాలడం చూసి నివ్వెరపోయారు. ‘ఏమైంది బావా?’ కంగారుగా అడిగాడు నర్సయ్య. ‘ ఈ కాంట్రాక్టు క్యాన్సిల్ అని చెప్తున్నా వినడం లేదు. జలగలాగా పట్టుకుని వేలాడుతున్నాడు చూడండి..’ ఓనర్ మాట గద్దింపులా ఉంది. ‘క్యాన్సిలా? ఎందుకు?’ ఆశ్చర్యపోయాడు సోము. ‘ఈ కాంట్రాక్టులు నాకు అచ్చి రావు. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాను. బాగా సతాయిస్తారు. ఇంకో కాంట్రాక్టు వస్తే మధ్యలోనే వదిలేసి వెళ్తారు. బతిమాలుకోలేక చావాలి. ఎప్పటికోగాని రారు. అవన్నీ పక్కన పెడితే, ఓ పెద్ద కంపెనీ మూడు లక్షలకే ఓకే అంది. రెడీమేడ్ ఫర్నిచర్. వాళ్ళే వచ్చి బిగించి పెడతారు. మీకిది చెప్పమని మా ఆవిడతో మొన్ననే చెప్పాను’ చావు కబురు చల్లగా చెప్పాడు ఓనర్. ‘మాకేం చెప్పలేదండి. లేదంటే ఎందుకొస్తాం? మేడంగారిని పిలవండి’ అంటూ తానే మేడం.. మేడం..’ అని లోపలికి చూస్తే కేకేశాడు నర్సయ్య. అతని అరుపులకు లోపలి నుంచి హడావుడిగా వచ్చింది ఆ ఇంటావిడ. ఏమిటన్నట్లు భర్తవంక చూసింది. ‘వర్క్ వద్దరిని వీళ్ళకు చెప్పమన్నాను కదా! చెప్పలేదా?’ అడిగాడు ఓనర్. ‘ఏదో హడావుడిలో పడి చెప్పడం మర్చిపోయానండి’ మన్నించమన్నట్లు భర్తకు చెప్పి, ‘ఆల్రెడీ కాంట్రాక్టు ఇచ్చేశాం. మీరు వెళ్ళండి’ అంటూ వాళ్ళను పంపించే ప్రయత్నం చేసింది. ‘అంత సింపుల్‌గా మర్చిపోయాం అంటే ఎలాగండీ? కొంత సామాను కొనుక్కొని కూడా వచ్చాం. తీరా ఇంటి దగ్గరకు వచ్చాక క్యాన్సిల్ అంటే ఎలా సార్? ఈ లోటు ఎవరు భర్తీ చేస్తారు?’ నర్సయ్యలో ఆవేశం చొరబడింది. ‘ముందిక్కడ్నుంచి బయల్దేరండి. గొడవ చేస్తే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది’ బెదిరించాడు ఓనర్. ‘పోలీసులకు ఫోన్ చేస్తారా? చేయండి. ఏం చెప్పాలో మాకూ తెలుసు’ వెనక్కి తగ్గలేదు సోము. ‘ఇట్టాంటి బేరం తగిలిందేమిటిరా స్వామీ! చూశావా... నువ్వు చెప్పడం మర్చిపోవడంతో ఎంత పెంట అవుతోందో?’ అంటూ భార్యను కోప్పడ్డాడు. వెంటనే బ్రహ్మయ్య వాళ్లవైపు తిరిగి ‘విషయం అర్థం చేసుకోక ఇలా రాద్ధాంతం చేసేవాళ్లకు ముందు ముందు ఎలాగయ్యా కాంట్రాక్టులిచ్చేది?’ వాళ్లను తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ‘మా డబ్బులు మాకివ్వండి. సామాను తీసుకుని మీకు నచ్చిన వాళ్ళతో పని చేయించుకోండి’ అరిచాడు నర్సయ్య. అప్పటిదాకా ఏదోలా ఒప్పిద్దాం అనుకున్న బ్రహ్మయ్యకు అవకాశం లేకుండా పోయింది. నిశ్చితార్థానికి డబ్బులెలా సర్దాలో పాలుపోలేదు. గడువు చూస్తే రెండు వారాలే ఉంది. ఈ కాంట్రాక్టు వారం రోజుల్లో పూర్తి చేసి మిగతా పనులు చూసుకోవచ్చని ధీమాగా ఉన్నవాడు కాస్త డీలా పడ్డాడు. బావా.. నువ్వాగు’ అంటూ నర్సయ్యను వారించి.. ‘పదండి వెళ్దాం..’ అంటూ ఓనర్‌కు చేతులెత్తి నమస్కారం పెట్టి అక్కడి నుంచి కదిలాడు బ్రహ్మయ్య. ఇంతలో పెద్ద కొడుకునుంచి ఫోన్ .. ‘నాన్నా.. చిన్నమ్మాయి మొదటి పుట్టినరోజుకి డబ్బులు అడిగాను కదా..’ అని గుర్తు చేస్తూ! ‘కాంట్రాక్టు చేజారిపోయిందని మేమేడుస్తుంటే మధ్యలో నీ గోలేంటిరా?’ విసుక్కున్నాడు బ్రహ్మయ్య. ‘ఆటి సంగతి నాకు తెల్వదుగానీ నా సంగతి చెప్పు..’ అవతలి నుంచి ఫోన్లో. ‘నువ్వు నీ కూతురు గురించి నన్నడుగుతున్నావ్. నేను నా కూతురు గురించి తిప్పలు పడుతున్నాను’ బ్రహ్మయ్య. ‘పెద్దదానికి గ్రాండ్‌గా చేశాం. ఇప్పుడు చిన్నదానికి చేయకపోతే బాగుంటుందా?’ పెద్దకొడుకు ఫోన్లో. ‘అప్పుడు కుదిరింది, చేశాం. ఇప్పుడు టైట్‌గా ఉంది. ఇంట్లోనే కానిచ్చేద్దాం..’ అంటూ ఫోన్ పెట్టేశాడు బ్రహ్మయ్య. ఇద్దరు కొడుకులూ.. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం, అది ఆ నోటా, ఈ నోటా పాకడంతో కూతురుకు సంబంధాలు రావడం గగనమై పోయింది. ఆరు లక్షల కట్నం ఇచ్చి, బండి పెడతామంటే ఒక సంబంధం ముందుకొచ్చింది. అందుకనే ఐదు లక్షలు విలువ చేసే కాంట్రాక్టును మూడున్నరకే ఒప్పుకున్నాడు. పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలు, ఆన్లైన్, రెడీమేడ్ ఫర్నిచర్ పుణ్యమా అని ఈ కాంట్రాక్టు క్యాన్సిల్ అయ్యింది. ఏం చేయాలోనని బుర్ర పట్టుకున్నాడు బ్రహ్మయ్య. ‘రెడీమేడ్ ఫర్నిచర్ వచ్చాక మనకసలు పనిచ్చేవాళ్ళే లేరు బావా. కరోనా తర్వాత రాకరాక ఒకటి వచ్చిందంటే ఇది కూడా పోయే. వాచ్‌మన్ ఉద్యోగం చేసుకున్నా పదేలు వస్తాయ్. ఆ ‘శారదా రెసిడెన్సీ’ వాళ్ళు అడుగుతున్నారు. వెళ్దామనుకుంటున్నాను బావా! ఆ అపార్ట్మెంట్లో ఎవరికైనా కార్పెంటర్ అవసరం పడితే మనమే చూసుకోవచ్చు’ కిందకు దిగుతూ తన కార్యాచరణను చెప్పాడు నర్సయ్య. ‘నువ్వూ నన్ను వదిలేసి వెళ్తావా బావా?’ బాధపడ్డాడు బ్రహ్మయ్య. ‘ఎన్నాళ్ళని కాంట్రాక్టుల కోసం పడిగాపులు కాస్తాం? కడుపులు మాడ్చుకుంటాం? నీక్కూడా చూస్తాను. వచ్చేయ్ బావా. ఆదాయం తగ్గినా మనశ్శాంతి ఉంటుంది’ అన్నాడు నర్సయ్య. తనని కూడా వచ్చేయమనడంతో బాధపడ్డాడు బ్రహ్మయ్య. ‘నిజమే పెదనాన్నా.. అందరూ ఏదో ఒక జాబ్ చూసుకుంటున్నారు. మనమే దీన్ని పట్టుకుని వేలాడుతున్నాం అనిపిస్తోంది. నాన్న జీవితం కూడా ఇందులోనే తెల్లారిపోయింది.పెద్దమనసుతో నన్ను చేరదీశావ్. నీకు భారంగా ఉండడం నాకిష్టం లేదు. నేను కూడా ఏదన్నా చూసుకుంటా..’ తన మనసులో మాట చెప్పాడు సోము. చేతికింద ఉంటారనుకున్న ఇద్దరు కార్పెంటర్లు తలో దిక్కు వెళ్ళిపోతామంటున్నారు. అనువైన మరో ఇద్దర్ని తెచ్చుకొని పని చేయించుకోవడం చాలా కష్టం. ‘ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నాను అనుకుంటాడు డాక్టరు. న్యాయాన్ని కాపాడుతున్నాను అనుకుంటాడు లాయరు. దేశానికి రక్షణనిస్తున్నాను అనుకుంటాడు సైనికుడు. ఆళ్ళకిలాగే ఈ కార్పెంటర్ కళను కూడా అలాగే భావించమన్నాడు మా నాన్న పెద బ్రహ్మయ్య. దాన్ని తప్పలేదు కాబట్టే ‘కార్పెంటర్ బ్రహ్మయ్య’గా పేరొచ్చింది. ఇప్పుడు ‘వాచ్‌మన్ బ్రహ్మయ్య’ అని ఎవరైనా పిలిస్తే నేను తట్టుకోలేను. నా పేరుకు ముందున్న కార్పెంటర్‌ను నేనెప్పుడూ వేరుగా చూడలేదు. అదే నా జీవితం. అందులోనే నా జీవనం’ ఉద్విగ్నమయ్యాడు బ్రహ్మయ్య. దేవుడి లీలలు ఎవరూ పసిగట్టలేరు. విచిత్రంగా అప్పుడే దేవుడు కరుణించాడు. ‘హలో! కార్పెంటర్ బ్రహ్మయ్యనా?’ అంటూ ఫోనొచ్చింది. ‘అవును సార్. మీరూ?’ అడిగాడు బ్రహ్మయ్య. ‘ఆర్నెల్ల కిందట నవీన్ నగర్లో ఒక కొటేషన్ ఇచ్చారు కదా! పాజిటివ్ రెసిడెన్సీ రాఘవరావును మాట్లాడుతున్నా..’ ‘ఆ.. ఆ.. నమస్తే సార్. బాగున్నారా.. ఇంటీరియర్ వర్క్ అయిపోయిందా సార్?’ ‘లేదండీ.. ఆ కాంట్రాక్టు మీకే ఇద్దామని చేశాను’ ‘అదేదో ఎమ్మేన్సీ కంపెనీ వాళ్ళొచ్చి చేసి పెడతారు అన్నారు కదా సార్..’ ‘ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి.. రెడీమేడ్ ఫర్నిచర్ అంతగా బాగోలేదు. డ్యూరబిలిటీ లేదు. మీ ప్రీవియస్ వర్క్స్ చూశాను. బాగా నచ్చాయి. పాతరోజుల్లో చేయించుకున్నట్లు దగ్గరుండి చేయించుకుందాం అని పట్టుబడుతోంది మా ఇంటావిడ. పీటలు, కుర్చీలు, మంచాలు, కప్ బోర్డులు చేయాలి. ఈ నెలాఖరుకు పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. అప్పటిలోగా అయిపోవాలి. చెప్పండి.. ఎంతవుతుంది?’ ‘మీకన్నీ తెలుసు కదా సార్. మీరే చూసి చెప్పండి’ ‘నాలుగు లక్షలు అడిగారు. మూడుకి చేసెయ్యండి. మా అపార్ట్మెంట్లో ఇంకా ముగ్గురు రెడీగా ఉన్నారు. మీకే కాంట్రాక్టు వచ్చేలా చేస్తాను’ ‘అలాగే కానియ్యండి సార్. ఇప్పుడొచ్చి కొలతలు తీసుకుంటాను’ అంటూ ఫోన్ పెట్టేసి ఇద్దరి వంకా చూశాడు బ్రహ్మయ్య. దించిన సామాగ్రిని ఆటోలోకి ఎత్తాడు సోము. సంతోషంతో యూట్యూబ్‌లో పాత పాటలు పెట్టాడు నర్సయ్య. ‘ఉందిలే మంచికాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా..’ అని వస్తోంది. ఆ పాట.. బ్రహ్మయ్యకు భవిష్యత్ పైన ఆశల్ని సజీవంగా ఉంచినట్లు అనిపించింది. -దొండపాటి కృష్ణ చదవండి: Crime Story: ఫోరెన్సిక్.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి! -
Crime Story: ఫోరెన్సిక్.. ఆదర్శ జంట అనుకున్నారు! అసలు విషయం తెలిసి!
‘కిరణ్మయి చనిపోవడం ఏమిటి?ఈ రోజు సాయంత్రం కూడా తనతో మాట్లాడాను. ఎంతో చలాకీగా ఉంది. ఇంతలోకే ఏమైంది?’ అంటూ కిరణ్మయి ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టింది పక్కింటి పావని. ‘నిజమేనమ్మాయ్. ఆరోగ్యంగా హుషారుగా తిరిగే పిల్ల ఇలా అర్ధాంతరంగా..’ అంటూ కన్నీళ్లొత్తుకుంది ఆ వీథిలోనే ఉంటున్న జానకమ్మ. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లేసరికి, అప్పటికే చాలా మంది జనం పోగయ్యారు. ‘కిరణ్మయి, రాజీవ్‌ల జంట భలే ఉండేది ఆదర్శ దాంపత్యానికి ఉదాహరణగా! కాలనీలో అందరితో సఖ్యంగా ఉండేవారు!’ అంటూ అక్కడి జనసందోహం సానుభూతి కనబర్చసాగారు. ‘ఇంతకూ ఏం జరిగింది?’ ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది గుమిగూడిన ఆ గుంపులో. ‘పది గంటలప్పుడు ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడట రాజీవ్. ఎంతకీ తలుపు తీయకపోయేసరికి భార్య నిద్రపోయి ఉంటుందని భావించి తన దగ్గరున్న తాళంతో తలుపు తీసి.. బెడ్ రూమ్‌లోకి వెళ్ళాడట. అక్కడ అపస్మారకస్థితిలో చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న కిరణ్మయిని చూసి బెంబేలెత్తిపోయాడట. పక్కింటి మహేంద్రకి ఫోన్‌చేసి సాయం కోరాడట. వాళ్ళిద్దరూ ఆమెకు సపర్యలు చేస్తుండగా వాంతి చేసుకుందట. శుభ్రం చేసేలోగానే ఆమె ప్రాణం పోయిందట. అప్పుడే సింగపూర్ నుంచి ఆమె తమ్ముడు వసంత్ వచ్చాడట’ అని ఎవరో చెబుతుంటే ఇంకెవరో అడ్డుపడి ‘ఆ అబ్బాయి అప్పుడే రావడం ఏమిటి?’ అని ప్రశ్నించారు మరొకరు. ‘రేపు కిరణ్మయి పుట్టిన రోజుట. సర్ప్రైజ్ చేద్దామని చెప్పాపెట్టకుండా వచ్చాడుట’ అని ఇంకెవరో వివరమిస్తుండగానే పోలీసు జీప్ వచ్చింది. గుంపులో కలకలం ‘పోలీసులు వచ్చారేంటి?’ అని. ఆ కలకలానికి బయటకు వచ్చిన వసంత్.. ‘రండి సార్.. కంప్లైంట్ ఇచ్చింది నేనే’ అంటూ ఎస్సై అంబరీష్‌కు ఎదురెళ్లాడు. అది విన్న అక్కడున్నందరికీ మతిపోయింది. ‘మీరు కిరణ్మయికి ఏమవుతారు? ఇది హత్యని మీకెందుకు అనుమానం వచ్చింది?’ ప్రశ్నించాడు ఎస్సై లోపలికి నడుస్తూ. ‘నా పేరు వసంత్. నేను కిరణ్మయికి సొంత తమ్ముడిని. మీ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చెప్తాను అన్నీ’ అంటూ ఎస్సైని అనుసరించాడు. సరే అన్నట్టుగా తలూపుతూ శవం ఉన్న గదిలోకి ప్రవేశించాడు ఎస్సై. అక్కడ రాజీవ్, మహేంద్రతోపాటు మరో ముగ్గురు ఉన్నారు. పోలీసులు ఎందుకొచ్చారో తెలియక తికమకపడుతున్నారు. పోలీస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్.. వాళ్ళ పనుల్లో మునిగిపోయింది. రాజీవ్, వసంత్‌లను తప్ప మిగిలినవాళ్ళను బయటకు పంపేశాడు ఎస్సై. బెడ్ మీద పడుకొని ఉన్న శవాన్ని పరిశీలనగా చూశాడు. ఏదో వాసన వస్తున్నట్లు గ్రహించి అటూ ఇటూ చూశాడు. అది గమనించిన రాజీవ్ ‘చనిపోయే ముందు వాంతి చేసుకుంది. శుభ్రం చేసినా ఇంకా వాసన వస్తోంది’ అన్నాడు. ‘హత్యేమోనని అనుమానంగా ఉంది. దేన్నీ టచ్ చేయొద్దు’ హెచ్చరించాడు ఎస్సై. రాజీవ్ ఏదో చెప్పబోతుంటే ‘ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మాట్లాడొచ్చు’ అంటూ ఇల్లంతా గాలించసాగాడు. ఏ క్లూ దొరక్కపోయేసరికి వసంత్ దగ్గరకు వచ్చి ‘ఇది హత్య అనడానికి ఏ ఆధారమూ కనబడ్డం లేదు. డాక్టర్ కూడా సహజ మరణమనే అంటున్నారు. మీకెందుకు డౌట్‌గా ఉంది?’ అడిగాడు ఎస్సై అంబరీష్. వసంత్ బదులు చెప్పబోతుండగా అతని మీద విరుచుకుపడ్డాడు రాజీవ్.. ‘అయితే పోలీసులను పిలిపించింది నువ్వన్నమాట. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఈ రోజే ఊడిపడ్డ నీకేం తెలుసని? ఈ ఇంట్లో హత్య జరగడమేంటి?’ అంటూ! అతణ్ణి అంబరీష్ అడ్డుకుంటేగానీ వసంత్ నోరువిప్పలేకపోయాడు. ‘సర్ నేను సింగపూర్‌లో ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌గా పని చేస్తున్నాను. ఎన్నో క్రైమ్ కేసుల విషయంలో అక్కడి పోలీసులకు హెల్ప్ చేస్తూంటాను’ అంటూ తన ఐడీ కార్డ్ చూపించాడు వసంత్. ఆ కార్డ్ తీసుకుంటూ ‘ఓ.. అలాగా? అయితే నేర పరిశోధనలో మీకు బ్రహ్మాండమైన అనుభవం ఉందన్న మాట. సరే. ఇప్పుడు చెప్పండి.. మీకెందుకు అనుమానం వచ్చింది ఇది హత్య అని?’ అడిగాడు ఎస్సై. రాజీవ్‌కి సైలెంట్‌గా ఉండక తప్పలేదు. ‘ఇలా రండి.. మా అక్క నోటిని పరీక్షగా చూడండి. మీకు క్లూ దొరకొచ్చు’ అన్నాడు మళ్లీ కిరణ్మయి డెడ్ బాడీ దగ్గరకు ఎస్సైని తీసుకెళుతూ. ఎస్సైతో పాటు ఫోరెన్సిక్ టీమ్ లీడర్ భాస్కర్ కూడా డెడ్‌బాడీ దగ్గరకు వచ్చి.. మళ్లీ పరీక్షగా చూసి, పెదవి విరిచారు. ‘పెద్ద క్లూ ఏమీ కనబడట్లేదు. కింది పెదవి చివర రెండు మెతుకులు కనిపిస్తున్నాయి. వాంతి అయిందని వాళ్ళు ముందే చెప్పారు కదా? అది తప్ప ఏముంది?’ అన్నాడు భాస్కర్. అతన్ని సమర్థిస్తున్నట్లు తలూపాడు అంబరీష్. ‘అయితే అక్క పంటిలో ఇరుక్కున్న గులాబి రంగు దారప్పోగు మిమ్మల్ని ఆకర్షించలేదన్నమాట?’ అడిగాడు వసంత్. ‘చూశాను. అయితే ఏమిటి?’ అడిగాడు ఎస్సై. ‘ఏదో కర్చీఫ్‌నో.. లేదా గుడ్డనో అక్క నోట్లో కుక్కి ఉంటారని అనుమానం కలగడం లేదూ?’ వసంత్. ఆ ఊహ తమకు తట్టనందుకు కాస్త సిగ్గుపడ్డారు అంబరీష్, భాస్కర్లు. ‘అది కర్చీఫ్ అని నేను నిర్ధారణ చేసుకున్నాను. రండి చూపిస్తాను. అది కార్ గ్యారేజ్‌లో ఉంది’ అంటూ అటు వైపు దారి తీశాడు వసంత్. గ్యారేజ్‌లోని కారుకి కాస్త దూరంలో పడున్న పింక్ కర్చీఫ్‌ను కర్రతో పైకి లేపి ‘ఇది ఎవరిది?’ అని రాజీవ్‌ని ప్రశ్నించాడు. ‘కిరణ్మయిది’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజీవ్. ‘కేవలం దీని ఆధారంతోనే హత్య అని తేల్చేస్తున్నారా?’ వసంత్‌ని అడిగాడు అంబరీష్. ‘అన్నీ వివరంగా చెప్తాను సర్. అందరినీ బయటకు పంపేయండి’ అన్నాడు వసంత్. ‘నేను కూడా ఉండకూడదా?’ కోపంగా అడిగాడు రాజీవ్. ‘మిస్టర్ రాజీవ్ ప్లీజ్ కోపరేట్’ అంటూ బయటకు దారి చూపించాడు అంబరీష్. విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజీవ్. ‘నా అనుమానాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్స్పెక్టర్.. ఒక రిక్వెస్ట్. అక్క రక్తం, సలైవాతోపాటు పెదవుల దగ్గర ఉన్న అన్నం మెతుకులను వీలయినంత తొందరగా టాక్సికాలజీ టెస్టులకు పంపండి’ అన్నాడు వసంత్. ‘టాక్సికాలజీ టెస్టులు అంటున్నారు. ఆమె పై విషప్రయోగం జరిగిందని అనుమానమా?’ అడిగాడు ఎస్సై. ‘అవును సర్. రుజువులు చూపిస్తాను రండి’ అంటూ మళ్లీ శవం దగ్గరకు తీసుకెళ్ళాడు. కిరణ్మయి బుగ్గలు, గోర్లను చూపిస్తూ ‘అస్పష్టంగా కనిపిస్తున్న ఈ చెర్రీ రంగు మచ్చలను చూడండి.. ఇవి విష ప్రయోగ సంకేతాలే. కానీ టెస్ట్‌ల ద్వారే ప్రూవ్ కావాలి. మా అక్క బాడీని క్షుణ్ణంగా పరీక్షించడానికి మీ అనుమతి కోరుతున్నాను’ అన్నాడు వసంత్. అంగీకరిస్తున్నట్లు తలూపాడు ఎస్సై. గ్లోవ్స్ వేసుకుని.. కిరణ్మయి చేతులను, కాళ్ళను చూపుతూ ‘ఈ గుర్తులను చూస్తే అర్థమవడం లేదా అక్క కాళ్లు, చేతులను కట్టేసి ఉంచినట్లు?’ అని వసంత్ చెపుతుంటే అంబరీష్ ఆశ్చర్యపోతూ ‘ఈ వసంత్ నేర పరిశోధనలో ఆరితేరిన వాడై ఉండాలి. అతని ముందు నేను గానీ, భాస్కర్ గానీ, శవాన్ని పరీక్షించిన డాక్టర్ గానీ దిగదుడుపే’ అనుకున్నాడు. ‘ఇది చాలా క్రిటికల్ కేసులా ఉంది. విషప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది గానీ, దాని కోసం నోట్లో గుడ్డలు కుక్కడం, కాళ్ళు, చేతులు కట్టేయడం ఎందుకో అర్థంకావడం లేదు. అటాప్సీ రిపోర్ట్ వస్తే గానీ, ఏ విషయమూ తేలదు. ఒకవేళ మీరు అన్నట్లు హత్యే అయితే గనుక ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు చేసి ఉంటారు? మీకు ఎవరి మీదనయినా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్సై. ‘నేనిప్పుడు ఏమీ చెప్పలేను సర్. టెస్ట్ రిజల్ట్స్, అటాప్సీ రిపోర్ట్ చూశాకే మాట్లాడతాను. అవి వచ్చిన వెంటనే కబురుపెట్టండి’ అన్నాడు వసంత్. ∙∙ పోలీస్ స్టేషన్లో ఒక టేబుల్ ముందు కూర్చుని రిపోర్ట్లు పరిశీలిస్తున్నాడు వసంత్. ఎస్సై అంబరీష్, సీఐ మహంకాళి.. అతను చెప్పేది వినడానికి కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాక, రెండు చేతులతో బల్లను చరిచి.. ‘యస్.. నా అనుమానం నిజమయింది’ అన్నాడు. ‘కంగ్రాట్స్.. వివరంగా చెప్పండి’ అన్నాడు సీఐ కాళి. ‘కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ జరిగింది. ఇదిగో ఈ రిపోర్ట్స్ చూడండి.. కార్బాక్సీ హీమోగ్లోబిన్ శాతం ముప్పై. అంటే చాలా ఎక్కువ. మన శరీరం మూడు శాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు పది శాతం వరకూ తట్టుకుంటారు. కానీ ముప్పై శాతం చేరుకుందంటే ప్రాణాపాయమే. మనం పీల్చుకునే ఆక్సిజన్, రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్‌తో కలుస్తుంది. అలారక్తం, శరీరంలోని అన్ని భాగాలకు, అన్ని కణాలకు చేరడం వల్ల, వాటికి ఆక్సిజన్ నిరంతరంగా అందుతుంది. అయితే కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ కన్నా తొందరగా, సులువుగా హీమోగ్లోబిన్‌తో కలసి కార్బాక్సీహీమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. అందువల్ల ఆక్సిజన్ రక్తంతో కలవడం ఆగిపోతుంది. ఫలితంగా శరీర భాగాలకు గానీ, కణాలకు గానీ ఆక్సిజన్ అందదు. ఆ విధంగా కార్బన్ మోనాక్సైడ్ ఒక విషంలా పనిచేస్తుంది. అలా ఏర్పడే ఆక్సిజన్ కొరత వల్ల ఊపిరి అందకపోవడం, అపస్మారకంలోకి పోవడం, కొన్ని సార్లు కోమాలోకి వెళ్ళడం, మరణం సంభవించడం, వికారంగా అనిపించడం, వాంతులు కావడం, శరీరంలోని కొన్ని భాగాలపై చెర్రీ రెడ్ రంగు మచ్చలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. మనం ఆ ఇంటికి వెళితే, ఈ విషప్రయోగం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు’ అన్నాడు వసంత్. ∙∙ నేరుగా కారు గ్యారేజ్‌లోకి దారి తీశాడు వసంత్ .. ఎస్సై అంబరీష్‌తో. గ్యారేజ్ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ గోడమీద ఉన్న ఓ మచ్చను చూపిస్తూ ‘ఇది చూశారా? కారు సైలెన్సర్కి ఎదురుగా ఉంది. సైలెన్సర్ నుంచి వచ్చిన వాయువుల తాకిడికి ఈ మచ్చ ఏర్పడింది. అయితే ఇది ఇంత స్పష్టంగా ఏర్పడిందంటే, కారు ఇంజన్‌ను కనీసం అరగంటయినా ఆన్‌లో ఉంచి ఉండాలి. అవునా?’ అడిగాడు వసంత్. ‘అవును. అయితే?’ అడిగాడు అంబరీష్. ‘హంతకుడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. మా అక్క కాళ్ళు, చేతులూ కట్టేసి అరవకుండా నోట్లో కర్చీఫ్ కుక్కి, ఇదిగో ఈ సైలెన్సర్ ఎదురుగా తన ముఖం ఉండేటట్లు బంధించి చాలాసేపు సెలెన్సర్ నుంచి వాయువును పీల్చుకునేలా చేశాడు. ఇది పాతకారు కాబట్టి ఆ వాయువుల్లో కార్బన్ మోనాక్సైడ్ శాతం ఎక్కువగా ఉండే ఉంటుంది. ఆ విధంగా ఆ విషప్రయోగం చేశాడు. దాంతో మా అక్క అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయుంటుంది. అప్పుడు ఆమెను బెడ్ రూమ్‌లోకి మార్చి ఉంటాడు. కట్టిన తాళ్ళను మాయం చేశాడు గానీ, కర్చీఫ్ అక్కడే పడిపోయినట్లు గుర్తించి ఉండడు ఆ గాభరాలో. అదే మనకు ఆధారం అయింది. పాపం ఇదేమీ తెలియని మా బావ ఇంట్లోకి వచ్చి చూసేసరికి, మా అక్క చావు బతుకుల్లో కనిపించింది. కళ్ళ ముందే భార్య చనిపోవడం చూసిన మా బావ ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో’ అన్నాడు బాధగా. ‘మీరంత బాధ పడిపోకండి. హంతకుడు మీ బావేనని మా సీఐ అనుమానం’ అనగానే, తెల్లమొహం వేశాడు వసంత్. ‘ఇది హత్య కావచ్చనే అనుమానం వచ్చిన వెంటనే, ఆయన తనదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా విషయాలు బయటపడ్డాయి. మీ బావ ఒక మేకవన్నె పులి. భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అదే అతన్ని హత్యకు ఉసిగొల్పి ఉండవచ్చునని భావించాం. హత్య వేరే వాళ్లెవరూ చేసినట్లు ఆధారాలు దొరకలేదు. మీరు ఎప్పుడయితే రంగంలోకి దిగారో అప్పటి నుంచి అతనికి బెంగ పట్టుకుంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని మా వాళ్ళు పసిగట్టారు. ఇప్పుడు హత్య ఎలా జరిగిందన్న విషయమూ స్పష్టమైంది. సాక్ష్యాలూ ఎదురుగా ఉన్నాయి. ఈ విషయం మా సీఐకి చెప్పాలి. వెంటనే రాజీవ్‌ను పట్టుకోవాలి’ అంటూ మొబైల్ ఫోన్ తీశాడు ఎస్సై అంబరీష్. చదవండి: Crime Story: మోస్ట్ వాంటెట్.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్! క్రైమ్ స్టోరీ: హంతకుడెవరు.. అసలు ట్విస్ట్ తెలిసిన తర్వాత! -
Crime Story: మోస్ట్ వాంటెట్.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్!
సాయంత్రం నుండి హోరున వర్షం కురుస్తూనే ఉంది. అక్కడికి ఎడమపక్కగా ఒక పోలీసుస్టేషన్. ఆ స్టేషన్లో ఆకాష్ గుప్తా, రజని దంపతులు.. సీఐ నచికేత ఎదురుగా కూర్చుని ఉన్నారు. తన చేతిలో ఉన్న కంప్లైంట్ ను దీక్షగా చదువుతున్నాడు నచికేత. కొద్దిసేపటి తరువాత వారిని చూస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది. మనం ఘోరా బాబా ఆశ్రమానికి వెళదాం. వారెంటుతో ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి మీరు అప్పటివరకు నిరీక్షించక తప్పదు’ అన్నాడు. ∙∙ ‘నేను దైవాంశసంభూతుడిని. నన్ను నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది. మీ సమస్యలు, కష్టాలు నాతో చెప్పుకోండి. నేను వాటిని తీర్చి మీకు ముక్తిని ప్రసాదిస్తాను’ ఎప్పటినుండో సాగుతున్న ఘోరాబాబా ప్రసంగం ముగిసింది. అది గమనించిన బాబా ప్రధానశిష్యులు నలుగురు మెరుపువేగంతో కదిలి ఘోరాబాబా చుట్టూ కవచంలా ఏర్పడ్డారు. రక్షకవలయం నడుమ ఘోరాబాబా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న భక్తులు దూరం నుండే ఘోరాబాబాకి జై అని నినాదాలు చేయసాగారు. వారిని అనుక్షణం బాబా శిష్యులు అప్రమత్తులై డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. చిన్న చీమ కూడా లోపలికి జొరబడకుండా ఆశ్రమం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నాయి. ఘోరాబాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చే పరిణీత.. గత కొంతకాలంగా ఆశ్రమంలోనే ఉంటూ అక్కడికి వచ్చే భక్తులను, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటోంది. ఘోరాబాబా మన్ననలు చూరగొని ప్రియమైన శిష్యురాలిగా మారిపోయింది. అది ఒక విశాలమైన హాలు. అక్కడున్న వేదిక మీది వెండి సింహాసనంపై ఘోరాబాబా ఆసీనుడయ్యాడు. ఘోరాబాబా చుట్టూ శిష్యులు కవచంలా నిలబడి ఉన్నారు. ఘోరాబాబా తల చుట్టూ తెల్లటి కాంతివలయం మెరిసిపోతూ ఉంది. అందరినీ చూస్తున్న ఘోరాబాబా ‘భక్తులారా.. మీ అందరిని ఉద్ధరించడానికే అవతరించాను. మీ మీ కష్టాలన్నీ నాతో విన్నవించుకోండి’ అని పలుకుతూ తన చేతిని గాలిలో తిప్పాడు. వెంటనే విభూది ప్రత్యక్షమైంది. ఆ విభూదిని అక్కడున్న భక్తులు అందరి మీదా పడేటట్టు ఊదాడు ఘోరాబాబా. ఆ విభూది అందరి మీద పడగానే వారందరూ తన్మయత్వంతో వివశులై మంత్రముగ్ధుల్లా మారిపోయారు. తర్వాత ఘోరాబాబా ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగాన్ని అక్కడున్నవారందరూ ఎంతో శ్రద్ధగా వినసాగారు. వెండి సింహాసనం నుండి దిగిన ఘోరాబాబా సింహాసనం వెనుక భాగం వైపు ఉన్న ఒక మీటను నొక్కాడు. అది నొక్కగానే సింహాసనం పక్కకి జరిగి వేదిక కిందకు మెట్లు కనిపించాయి. అక్కడే ఉన్న పరిణీతను భక్తులు ఇచ్చిన కానుకల పళ్ళేన్ని పట్టుకుని తన వెంట రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన పరిణీత ఆ వేదిక కింద ఉన్న మెట్లను చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో ఒక శిష్యుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.. ‘బాబా.. మీకోసం సీఐ వచ్చాడు’ అంటూ. అది వినగానే ఘోరాబాబా.. పరిణీతతో పాటు బయటకు వచ్చాడు. అక్కడ సీఐ నచికేతతో పాటు ఆకాష్ గుప్తా, రజని ఉన్నారు. వారిని చూసిన ఘోరాబాబా ఆశ్చర్యపోయాడు. వారందరినీ అక్కడ చూసిన పరిణీత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం ఆకాష్ గుప్తా, రజని.. ఆమె తల్లిదండ్రులు కావడమే. ఘోరాబాబా.. నచికేతను చూస్తూ ‘ సీఐ గారూ.. మా ఆశ్రమాన్ని సందర్శించడానికి కారణం?’ అని అడిగాడు. ‘నేను తమరి ఆశ్రమం సందర్శించడానికి రాలేదు. వారెంటుతో వచ్చాను. మీరు.. పరిణీత అనే అమ్మాయిని మీ ఆశ్రమం నుండి పంపించకుండా బంధించినట్టు మాకు కంప్లయింట్ వచ్చింది. అందుకుగాను మీ మీద, మీ ఆశ్రమం మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నాడు పీఐ నచికేత. ఆ మాటకు తెలియని కలవరపాటుకు గురైనా కనిపించకుండా సర్దుకున్న ఘోరాబాబా.. ‘పరిణీత ఇక్కడే ఉంది. నేను కానీ మా ఆశ్రమంలో ఇంకెవరు కానీ ఆమెను బంధించలేదు’ అన్నాడు. నచికేత.. పరిణీత వద్దకు వెళ్ళాడు. ‘పరిణీతగారూ.. మీరిలా మీ తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉండటం సమంజసం కాదు. మీరు వెంటనే మీ పేరెంట్స్‌తో వెళ్లడం మంచిది’ అని చెప్పాడు. ‘చూడండి సర్.. నేనెక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. అదీ కాక నేను మేజర్ని. మేజర్‌కి తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుందని మీకు బాగా తెలుసనుకుంటాను. దయచేసి మీరందరూ ఇక్కడనుండి వెళ్లిపోండి’ అంది పరిణీత. జరుగుతున్నదంతా నిర్వికారంగా ఘోరాబాబా, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ తో శిష్యులు, కన్నీటితో పరిణీత తల్లిదండ్రులు చూస్తున్నారు. ‘మీరు మేజర్ అవునో కాదో తెలుసుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?’ అడిగాడు నచికేత. తన చేతిలో ఉన్న ఒక ఫైలును నచికేతకు అందించింది పరిణీత ‘ఇది చూడండి’ అంటూ. అందులో ఉన్న సర్టిఫికెట్స్‌ను పరిశీలనగా చూస్తున్న నచికేతకు ఒక కాగితాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. అది పరిణీత జర్నలిజంలో మాస్టర్స్ చేసిన సర్టిఫికెట్. అప్పుడర్థమైంది నచికేతకు పరిణీత అక్కడ ఎందుకు ఉందో! ఆ సంఘటన జరిగిన నెల రోజులకు.. ఘోరాబాబా ఆశ్రమం అంతా గగ్గోలుగా ఉంది. ఆ ఆవరణంతా పోలీసులు.. మీడియాతో నిండి ఉంది. కొద్దిసేపటిలో సీఐ నచికేత.. ఘోరాబాబాను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ∙∙ ఆ వేళ.. కోర్టు హాలు అంతా కిక్కిరిసి ఉంది. ఫైల్ చేయబడిన ఘోరాబాబా కేసు తీర్పు ఇవ్వబోతున్నారు జడ్జిగారు. సీఐ నచికేత.. ప్రత్యేక భద్రత నడుమ పరిణీత తల్లిదండ్రులను కోర్టుకు రప్పించాడు. ఒకపక్క కోర్టుబోనులో పరిణీత.. మరోపక్క బోనులో కళ్ళనిండా క్రోధంతో ఘోరాబాబా.. జడ్జిగారు పర్మిషన్ ఇవ్వగానే పరిణీత చెప్పడం మొదలుపెట్టింది. ‘జడ్జిగారూ.. నా పేరు పరిణీత. నేను జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ఒకరోజు నా ఫ్రెండ్.. ఘోరాబాబా ఆశ్రమానికి వెళదామని నన్ను తీసుకువెళ్ళింది. ఘోరాబాబా చుట్టూ ఉన్న వారందరూ భక్తి పేరుతో హిప్నాటిజమ్కు గురైనట్టు అనిపించింది. ఆశ్రమంలో దృశ్యాలు కుతూహలం కలిగించాయి. తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించాయి. ఓ సామాన్యురాలిగా ఆశ్రమానికి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఘోరాబాబాకు ప్రియమైన శిష్యురాలిగా మారిపోయాను. అక్కడ భక్తి ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని గ్రహించాను. వాటిని అందరికి తెలియచేసి ఘోరాబాబా నిజస్వరూపం బయటపెట్టాలని నిశ్చయించుకున్నాను. నిజానికి అది ఓ సాహసమే. అయినా నేను వెనకాడలేదు. హిప్నాటిజం అనేది ఒక నమ్మకం. దాన్ని గారడిగా మర్చి.. మాస్ హిస్టీరియాను సృష్టిస్తూ.. చిన్న చిన్న ట్రిక్స్‌తో, తనకు తనే మహాయోగిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను టార్గెట్ చేస్తున్నాడు ఈ ఘోరాబాబా. ఆ ఘోరాలను నా కళ్లకు అమర్చిన ‘స్పై కెమెరా లెన్స్’ తో షూట్ చేశాను. ఘోరాబాబా చేసే ప్రతి గారడీ ప్రజలు చూడాలి. అందుకు అవకాశం ఇవ్వండి మిలార్డ్’ అంటూ తన దగ్గరున్న ఫుటేజీని జడ్జిగారికి అందించింది పరిణీత. ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడ్డారు అక్కడున్నవారంతా. ఆ ఫుటేజీని స్క్రీన్ మీద ప్లే చేయాల్సిందిగా జడ్జిగారు అనుమతినిచ్చారు. అనుమతి అందడమే ఆలస్యం ఘోరాబాబా లీలలన్నీ ఒక్కొక్కటిగా ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద కనిపించసాగాయి. ‘ఒక గదిలో ఘోరాబాబా తన శిష్యులను హిప్నటైజ్ చేస్తున్నాడు. వారందరూ ఏదో మత్తులో ఉన్నట్టు ఊగిపోతున్నారు. ఘోరాబాబాను వాళ్ళందరూ దేవుడని పొగుడుతూ కాళ్ళమీద పడి మొక్కుతున్నారు. తెల్లటి విభూదిని తీసుకొచ్చి అందులో ఏదో కలిపాడు ఘోరాబాబా. ఆ విభూదిని భక్తుల మీద చల్లడానికి ఉపయోగిస్తున్నారు. మరొకచోట అక్కడున్న అమ్మాయిలను కొంతమంది శిష్యులు ఘోరాబాబాకు లొంగిపొమ్మని లేదంటే మీ కుటుంబాలను అన్యాయం చేస్తామని బెదిరిస్తున్నారు. మరొకచోట పెద్ద ఎత్తున స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ ఘోరాబాబా ఆశ్రమం అండర్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఆశ్రమానికి అండర్ గ్రౌండ్ ఉందని ఎవరికీ తెలియదని ఘోరాబాబా.. పరిణీతకు చెప్పడం కూడా అందులో ఉంది. ప్రజల అమాయకత్వాన్ని.. భక్తివిశ్వాసాలను వ్యాపారంగా మార్చుకుంటున్న ఆ ఘోరమైన దృశ్యాలు ఘోరాబాబా వికృత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. అంతా చూసిన జడ్జిగారు.. ఆ వీడియోలను తక్షణమే ప్రజాతీర్పు కోసం టెలికాస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ∙∙ టీవీల్లో ఘోరాబాబా అకృత్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి. ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘోరాబాబా ఆశ్రమాలు, సంస్థలు భక్తుల ఆగ్రహానికి నేలమట్టమవసాగాయి. ∙∙ ప్రజా తీర్పు తర్వాత.. కోర్టు తీర్పూ వెలువడింది. ఏడుచువ్వల మధ్య.. కటిక నేల మీద పడుకుని సీలింగ్ వంక వెర్రిచూపులు చూస్తూ కాలక్షేపం చేయసాగాడు ఘోరాబాబా. చదవండి: కథ: ఋణం.. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా? -
కథ: తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా?
రేపటినుంచి నాన్న సంవత్సరీకాలు. సంవత్సరీకాలకు ముందు రోజు కనుక, నాన్న కచ్చితంగా వస్తారని అనుకుంటూనే వున్నాను. అనుకుంటున్నట్లుగానే నా పడక గది కిటికీ అవతల, చీకట్లో.. పొగాకు కంపు కొట్టే ఒక నీడగా, నాన్న నిలబడి వున్నారని గమనించాను. మరో ప్రపంచం నుంచి వచ్చే వ్యక్తావ్యక్త మాటలతో కిటికీ ఊచలకు దగ్గరగా వచ్చి నిలబడి వున్నారు నాన్న . ‘నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదూ?’ నాన్న అడిగారు. ‘వస్తారు.. వస్తారనే అనుకున్నాను’ చీకటితో చెప్పాను నేను. ‘మరేమీటీ ఇలా చేశావు? రాత్రి హాయిగా తినేశావు.. ఫలహారం తీసుకోకుండా?’ ‘ఈ రాత్రికి ఫలహారం తిని వుండాలని అనిపించలేదు’ ‘తద్దినం ముందు రోజు రాత్రి.. ఈ ఒక్క పూటే కదా! ఈ ఒక్క పూట కూడా భోజనం చేయకుండా .. ఫలహారం తిని ఉండాలని అనిపించలేదు కదూ! పొట్ట నిండా తినేశావు’ ‘తినాలని అనుకోలేదు నాన్నా..! మిత్రుడొక్కడు వచ్చాడు, అనుకోకుండా. నెలల తరువాత కలిశాం కదా! హోటల్‌కు వెళ్దాం రా.. అన్నాడు. వెళ్ళాను. వెళ్ళాక.. రెండు పెగ్గులు తాగాను. కొంత మటన్ కూడా తిన్నాను’ ‘బాగుంది.. చాలా బాగుంది. తద్దినం ముందు రోజు రాత్రి చేసిన భోజనం ఇదన్న మాట’ అర్థవంతంగా మూలిగారు నాన్న. ‘సంవత్సరానికోసారైనా నాన్నగురించి నీ చిన్న చిన్న సరదాలు కూడా వదులోకోలేవన్న మాట’ చీకట్లో నాన్న ముఖం కనబడలేదు. లేకపోయినా నాన్నకి ఇప్పుడు ముఖం అంటూ ఒకటుందా? ఇప్పుడు నాన్న పొగాకు తాలూకు చిక్కని కంపుతో కూడిన ఒక జ్ఞాపకం మాత్రం కదా! జిగురుగా వున్న చీకట్లో కొబ్బరి పీచుతో చేసిన తాడు నేలను రాసుకున్నప్పుడు వచ్చే సవ్వడితో కదిలే నీడ కదా! నాన్న అంటే అంతకు మించి ఏమిటి ఇప్పుడు? కాదు, కాదు మరొకటి కూడా వుంది. కొంతకాలంగా మమ్మల్ని వేధిస్తున్న ఒక సంతకం తాలూకు జ్ఞాపకం కూడా వుంది, నాన్న అంటే! కాసేపు ఇద్దరం మాట్లాడుకోలేదు. కాసేపు పోయాక నేనే ఊరకనే అడిగాను ..‘అక్కడ కుశలమేనా, మీకు?’ ‘కుశలమే’ నాన్న చిన్నగా నవ్వారని తోచింది నాకు. ‘ఇప్పుడు నేను స్వర్గంలో వున్నానా? నరకంలో వున్నానా? అని అనుకుంటూ వుంటారు కదూ మీరంతా! నాకు తెలుసు, మీకు తెలిసిన.. లేకపోతే మీరు విన్న, నా పనులన్నిటినీ ఏరి విడదీసి త్రాసులో తూకం చూసి లెక్కవేసి చూసి అనుకుంటారు మీరు.. నేను స్వర్గంలో వున్నానా.. నరకంలో వున్నానా అని. అలా తేల్చేస్తారు ఆ విషయం. నువ్వు చెప్తావు స్వర్గానికి వేళ్లారని. నీ తమ్ముడు చెప్తాడు నరకంలో వున్నారని. మీ అక్క ఏం చెప్తుందనేది నాకు కచ్చితంగా తెలుసు. స్వర్గానికన్నా ఉన్నతమైన చోటు ఏదైనా ఒకటి వుంటే, నాన్న అక్కడ ఉన్నారని చెప్తుంది అది’ ‘మేం అలా ఏం ఆలోచించడం లేదు నాన్నా!’ ‘అలా ఆలోచించకపోతే చాలా మంచిది. ఆ రోజుల్లో కాలానుగుణంగా నేను చేసినవి లెక్క వేసి బేరీజు వెయ్యకపోవడమే మంచిది. బతికి వున్నప్పుడు, ప్రతి ఒకడూ ఏదేదో చేస్తాడు. చెడ్డ పనులు చేస్తాడు. కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. ఇప్పుడు చనిపోయాక, ఇక్కడ వున్నప్పుడు ఆ మంచీచెడుల లెక్క చూడడం అనవసరం. ప్రతి ఒకడికి తనదైన దృక్పథం ఒకటి వుంటుంది కదా. అందువల్ల చూసేవీ.. తెలుసుకునేవీ భిన్నంగా వుంటాయి. లాంగ్ సైటు, షార్ట్ సైటు అనేది కేవలం వైద్యుల మాటే కాదూ. కేవలం కనులకు సంబంధించినదీ కాదు. కళ్లెదుట వున్నవి కూడా చూడలేకపోతున్నారు కొందరు. కానీ దూరంగా వున్నవాటి గురించి కచ్చితంగా చెప్పగలం అని అనుకుంటున్నారు. కళ్ళద్దాలు మార్చుకుంటే మార్చగలిగేది కాదు కదా, మనుషుల దృక్పథం’ ‘మేం మీ గురించి మాట్లాడుకుంటూ వుంటాం. మిమ్మల్ని తలచుకుంటూ వుంటాం’ మధ్యన దూరి అన్నాను నేను. ‘మంచిది. కానీ కేవలం జన్మనిచ్చిన ఒక వ్యక్తిగా వద్దు. నేను లేకపోయినా మీరు ముగ్గురూ పుట్టేవారు.. ఎక్కడెక్కడో. నాకు ఆ నమ్మకం వుంది. బహుశా ఈ పోలికలతో, ఈ రూపులతో ఇక్కడ పుట్టకపోయివుండవచ్చు. ఒక పువ్వుగా.. చెట్టుగా.. జంతువుగా అదీ కాకపోతే మనిషిగా కూడా పుట్టివుండవచ్చు. వీటి మధ్య అంతరాలేమిటీ? అన్నిటిలోనూ ఒక ప్రాణం కొట్టుకుంటుంది కదా. మానవజన్మ అనేది పుణ్యం చేసినవాళ్ళకు మాత్రం దక్కేదని నేను నమ్మటంలేదు బాబూ’ ‘మీ పిల్లలుగా పుట్టడం వల్ల మాకు మంచే జరిగింది. చెప్పుకోదగ్గ ఇబ్బందులేం ఎదుర్కొలేదు మేం’ నా గొంతులో పూర్తి నమ్మకం తొణకిసలాడిందని నాకే అనిపించలేదు. నాన్న నవ్వారు. నవ్వే అలవాటు లేదు అతనికి. అది తెచ్చిపెట్టుకున్న నవ్వేనని అనిపించింది. కిటికీ అవతల మందారాకులు కదిలాయి. జిగురు నిండిన చీకటి వాటికి అంటుకుంటున్నాయి. ‘తద్దినం ముందు రోజు రాత్రి భోజనమైనా త్యాగం చేయలేని నువ్వేనా బాబూ .. ఈ మాటలంటున్నది? వద్దులే. పిల్లలను ఏదైనా అడిగి పుచ్చుకోవటమూ, వాళ్ళ వద్దనుంచి ఏదైనా ఆశించటమూ సరికాదు. మీరు ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి నేను ఎవరినీ? చచ్చి మట్టిలో కలిశాక నేనెవరినీ?’ ఆ మాటలు పరుషంగా తోచాయి నాకు. సాధారణంగా నాన్న అంత పరుషంగా మాట్లాడరు. ‘కావాలని చేయలేదు నాన్నా..!’ నా గొంతు జీరబోయింది. ‘చాలా దూరం నుంచి వచ్చాడు వాడు. నా మిత్రుడు. ఒకసారి కలుద్దాం అంటే వెళ్ళాను. సంవత్సరాలు గడిచాక వచ్చాడు. కానీ వాడు వచ్చిన రోజు..’ ‘అందువల్లనేం కాదు బాబూ.. అది అలా రాసిపెట్టి వుంది అంతే. అందుకే అలా జరిగింది. ఇదంతా ఒకొక్కరి మనస్తత్వాన్ని బట్టి కదా . అయినా ఏడాదికోసారి రెండు రోజులు పెద్దల కోసం కొన్నిటితో రాజీ పడడం మంచిది. ఆ రెండు రోజులైనా చేయవలసినదేముంది? వారిని మనసులో తలచుకొని నాలుగు మెతుకులు సమర్పించడం. అంతే కదా!’ నేను మాట్లాడలేదు. నాన్న నన్ను దోషిగా నిలబెట్టే విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు. గాటుగా జవాబు చెప్పడం తెలియక కాదు. కానీ వద్దనుకున్నాను. ఇలా ఎప్పుడూ మాట్లాడేవారు కాదు నాన్న. ఈ రోజు.. ఈ రోజు గత సంవత్సర కాలంగా ఏరి సేకరించి కట్టిన మాటల మూట ఇప్పుడు ఇక్కడ విప్పుతున్నారు కాబోలు! ‘అనవసరమైన విషయాలు మాట్లాడి మీ సమయమంతా వృథా చేశాను కదూ?’ నాన్న చెప్పడం విన్నాను. ‘పోనీ అందరూ కులాసేనా?’ ‘ఓ, అలా అలా గడుపుతున్నాం’ ‘కొన్ని విషయాలు నాకూ తెలిశాయనుకో’ ఒక చిరునవ్వు నవ్వారు నాన్న. అంటే, నాన్నకి అది కూడా తెలిసిందనా ఉద్దేశం! కొంత కాలంగా మమ్మల్ని వేధిస్తున్న ఆ సంతకం గురించి కూడా తెలిసి వుండాలి. గట్టి నీలి రంగు కాగితం మీద వున్న ఆ సంతకం! ‘బాబూ.. నువ్వు నా పెద్ద కొడుకువి కనుక, ఈ మాట చెప్పడం లేదు. నువ్వు మంచివాడివి అనుకొని చెప్తున్నాను. బతకడం కోసం మీరు తీసే ఈ పరుగు చూస్తున్నప్పుడు నాకు, అప్పుడప్పుడు బాధ కలుగుతోంది. బల్లిలా పైకి పాకి ఇతరులను పడకొట్టి డబ్బు సంపాదించడం అంత అవసరమా? ఉన్నదాంట్లో సంతృప్తిగా గడుపుకోవచ్చుగా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపైనా ప్రశాంతంగా, అందరితో కలసి కూర్చోవటం కుదురుతోందా మీకు?’ ‘నాన్నా.. నువ్వు అలాగే మాట్లాడుతావు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఇవి పోటీ రోజులు. నాలుగు డబ్బులు, డబ్బులుగా చేతిలో లేకపోతే మనిషికి విలువ లేదు. అక్కడ కొంత, ఇక్కడ కొంత భూమి ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమీలేదు’ ‘భూమి తాలూకు ప్రయోజనం తెలిసేది భూమిలేని రోజుల్లోనే. జనాభా పెరిగిన కొద్ది వాటా వేసి వాటా వేసి ఒకరికి అడుగు మట్టి కూడా లేని స్థితికి వస్తే , భవిష్యత్తులో పిల్లలకు గుప్పెడు మట్టి కూడా వుండదు ఆడుకోవడానికి’ మాటలు అటు వైపు మళ్లడం నచ్చలేదు నాకు. నేను చెప్పేవి అర్థం చేసుకోలేరు నాన్న. నాన్న చెప్పేది నేను కూడా! ‘అమ్మ పెందరాడే పడుకుంది’ విషయం మార్చడం కోసం అన్నాను నేను. ‘చూశాను. కానీ ఈ రాత్రి అంత సుళువుగా నిద్రపోదు అది’ ‘అక్క, బావ, తమ్ముడు.. అందరూ అవతల వున్నారు’ ‘అదీ చూశాను’ ‘మీ కోసం ఎదురు చూస్తూ వున్నారు వాళ్ళు’ ‘ఏమిటీ! ఎదురు చూస్తున్నారా? ఎందుకు?’ ఒక క్షణం మాట్లాడలేక పోయాను. ఎలా మొదలుపెట్టాలో తెలియక .. చీకట్లోని నీడల కదలికలను చూస్తూ మెల్లగా చెప్పాను ‘ఒక సంతకం గురించి’ ‘సంతకమా? ఏ సంతకం?’ ‘నాన్నా.. మీరు బ్యాంకులో అప్పుతీసుకున్నారు కదా! మూడేళ్లు గడిచాయి కనుక ఋణపత్రం తిరిగి రాయించాలి. అలా చేయాలంటే హక్కుదారులైన మేమందరం సంతకం చేయాలని చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు’ ‘దానికేముంది? సంతకం చేయండి. సంతకం చేయకపోయినా.. ఆ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు కదా! తాకట్టు పెట్టిన వస్తువు సంగతి... ’ ‘అది తెలుసు. అయినా అలా గుడ్డిగా సంతకం పెట్టడమంటే.. నాకు అభ్యంతరం లేదనుకో’ ‘అయితే, అభ్యంతరం ఎవరికి?’ ‘బావగారికి’ చెప్పలేక చెప్పాను నేను.‘ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా ఒప్పుకోవడం లేదు అతను. అతను ఒప్పుకోనిదే అక్క సంతకం పెట్టదు కదా ’ ‘అలాగా?’ గట్టిగా ఒకసారి మూలిగారు నాన్న. మందారాకులు ఒకసారి కదిలాయి. పొగాకు కంపు వచ్చింది మరీ ఘాటుగా. కిటికీ ఊచల పై ముఖం ఆనించి నన్ను ఉరిమి ఉరిమి చూస్తూ నిలబడి వుండవచ్చు నాన్న. అపరిచితమైన ఒక వేడి నా ముఖానికి తగిలింది. ‘ఎందుకు ఆ అప్పు చేశానని నీకు తెలుసుగా’ ‘తెలుసు.. తమ్ముడి సీటు కోసం’ ‘ఆ తరువాత..’ ‘తీర్చలేకపోయారు’ ‘తీర్చవద్దని అనుకోలేదు కదా! ఎంత ప్రయత్నించినా తీర్చడం కుదరలేదు’ నాన్న అన్నారు . ‘నాకు తెలుసు నాన్నా. నేను రెడీయే సంతకం పెట్టడానికి. కానీ బావగారు ఒప్పుకోవటం లేదు. అక్క సంతకం పెట్టాలి కదా’ ‘తమ్ముడుకి ఇంజినీర్ ఉద్యోగం వస్తే, అప్పు తీర్చడానికి ఎంతోకాలం పట్టదుగా’ ‘అది సరే.. కానీ ఇప్పుడు సంతకం పెట్టాలి కదా అందరూ. లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు’ ‘అవును.. సంతకం పెట్టాలి. లేకపోతే ఎలాగా?’ ‘కానీ బావ..’ ‘ ఏం చేస్తాడట?’ ‘వస్తువు వాళ్ళను తీసుకొమంటున్నాడు’ ‘బాగుంది. వస్తువు అంటే ఈ ఇల్లూ.. ఈ జాగా కదా!’ తరతరాలు బతికిన మన తరవాడు (మాతృసామ్యవ్యవస్థలోని ఉమ్మడి కుటుంబ నివాసం) వేలం వేస్తే ఇతర కులస్తులు లాగేస్కోరూ..! అది అతనికి తెలియదా?’ ‘అలా చెప్పడంలేదు బావ. ఇది అతని పద్ధతట. ఎవరు చేసిన అప్పు వారే తీర్చాలట. అతను ఎవరినీ అప్పు అడగడు. ఎవరికీ అప్పు ఇవ్వడు కూడా. అందువల్ల ఇంకొకరి అప్పు తీర్చడం ఇష్టంలేదు అతనికి’ ‘అంటే..?’ ‘నాన్నా.. నీకు తెలుసుగా అతని స్వభావం. అతనికి మొండిపట్టుదల ఎక్కువ. ఎన్నో రకాలుగా చెప్పి చూశాను’ ‘అయితే..’ నాన్న నిట్టూర్చడం వినబడింది నాకు. ‘అయితే ఇక ఒకటే మార్గం. ఈ అప్పుకోసం నేను మరో జన్మ ఎత్తాలి. ఇప్పుడు మరో సంతకం పెట్టాలంటే నాకు వేళ్ళు లేవుగా. అంతే కాదు చనిపోయినవాళ్ళ సంతకాలు తీసుకోరు బ్యాంకువాళ్లు’ నేనేమీ అనలేదు. ‘ఈ అప్పుతాలూకు బాధ్యత ఒక శృంఖలంగా వుండిపోతుందని ఆ రోజు అనుకోలేదు. ఇప్పుడు తీర్చక తప్పించుకోలేను. దానికోసం ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో.. ఏమో! ఆ లోగా వడ్డీ పెరిగి పెరిగి మోయలేనంత అవుతుంది. బ్యాంకువాళ్ళు అనుకుంటే నా జన్మలను అలా అలా పొడిగించుకుంటూ పోవచ్చు’ ‘నాన్నా.. నేనిప్పుడు ఏం చేయాలి?’ నాన్నకు నా మాటలు వినబడలేదేమో! తన మాటలే కొనసాగించారు .. ‘మానవ జన్మలోని తీరని గొప్ప ఋణం పూర్వీకులదని పురాణాల్లో చెప్పారు కదా! సాధారణంగా ఆలోచిస్తే ఇది తల్లిదండ్రుల రుణమే. ఆ ఋణబాధ్యత నుంచి తప్పించుకోగలమని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ సంపద అయినా అప్పు అయినా ఒకేలాంటి బాధ్యతయే. అవి పంచుకొని బతకవలసిందే. దురదృష్టవంతులకు బహుశా అప్పు మాత్రమే బాధ్యతగా మిగులుతుందేమో! వాళ్ళని బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో కాదుగా, అప్పు చేసి తీర్చక పోవడం. చాలా ప్రయత్నించాను నేను. అప్పు తీర్చడానికి. కుదరలేదు. గొప్ప చదువు చెప్పించాను మీకు. అక్క పెళ్ళి గొప్పగా చేశాను. నాలాంటి బడి పంతులు ఇంతకన్నా ఏం చేయగలడు?’ ‘నేను మరోసారి చెప్పి చూస్తాను. మీరు చెప్పారని కూడా చెప్తాను. అయినా ప్రయోజనం వుండదేమో’ ఏదో గుర్తుకొచ్చి నిట్టూర్చారు నాన్న. ‘మీ నెత్తి మీద ఇంత పెద్ద బరువు ఒకటి వేసి పోయాను కదా! నేనిప్పుడు మీకు అప్పు పడ్డాను. ఆ అప్పు ఎలా తీర్చగలను? ఇప్పుడు పని చేసి నాలుగు డబ్బులు సంపాదించలేను కదా. నాకు తెలిసిన పని ఒకటే.. ట్యూషన్ చెప్పటం. నన్ను చూస్తే ఇప్పుడు పిల్లలు పరిగెత్తి పారిపోతారు కదరా’ కాసేపు మాట్లాడలేదు నాన్న. కిటికీ అవతల నుంచి గట్టిగా ఊపిరిపీల్చే సవ్వడి వినబడింది. నాన్న ముఖం కనబడకపోవడం మంచిదేనని అనుకున్నేను. బాధ కలిగినప్పుడు ఆ ముఖం పరుషంగా మారేది. అప్పుడు ఆ ముఖం చూస్తే భయం వేసేది. హఠాత్తుగా కోపం బుసకొడుతుంది. అప్పుడు నోటికి వచ్చినట్లు తిడుతారు. ఒక నిమిషంలో చల్లారి పోతుంది కోపం. ఆ తరువాత తిట్లు తిన్నవాళ్లను పిలిచి బుజ్జగిస్తారు ‘పెరట్లో పశ్చిమాన ఒక పనస చెట్టు వుండేది కదా నరికేశారా?’ నాన్న అడిగారు విషయం మార్చడం కోసం అన్నట్లు. ‘కాపు తగ్గిపోయింది. మంచి రేటు వచ్చింది. నరికేయమని పట్టుపట్టాడు తమ్ముడు’ చెప్పాను. ‘నేను వున్నప్పుడే అడిగారు ఎందరో! పనస చెట్టు విలువ, బంగారం విలువ కన్నా తక్కువ ఏం కాదు. అయినా ఇవ్వలేదు నేను. నరికిపారేయడం సుళువే. మీరంతట మీరు ఒక మొక్కైనా నాట లేదుకదా. ఉన్నవి నరికి పారేస్తారా?’ ‘ముందు నేనొప్పుకోలేదు నాన్నా.. అయినా ఖర్చులు..’ ‘పెరట్లో కొబ్బరిచెట్లకు పాదు తీయడం వగైరాలు ఆపేశావా? అక్కడ బోలెడు జాగా వుందిగా. కొత్త మొక్కలు నాటవచ్చుగా. ఎవరూ అటువైపు తొంగి చూడడం కూడా లేదు కాబోలు’ ‘అన్నిటికీ నేనొకడినే కదా’ మనసులో అనుకున్నాను.. ‘చెప్పడం సుళువే. ఆఫీసు పనులూ సొంత పనులూ చూసుకొని నెలకోసారి ఇక్కడకి పరిగెత్తుకురావడానికి పడే ఇబ్బంది నాకేగా తెలుసు! అమ్మ ఇక్కడ వుంది కనుకనే ఈ మాత్రమైనా’ కాసేపు మాట్లాడలేదు నాన్న. ఆ తరువాత గొంతు తగ్గించి అన్నారు.. ‘సంవత్సరానికి ఒకసారే కదా నా రాక. అది ఇలా యాంత్రికం కావడం నాకూ నచ్చడం లేదు. బాబూ.. మీకు ఇది కేవలం ఒక తతంగం మాత్రమే. కొంత నువ్వులూ నీరూ వదిలి పిండం పెట్టేస్తే అయిపోతుంది. కానీ నాకు ఇదొక గొప్ప వరం. ఒకసారి రావడం, కాసేపు ఇక్కడిక్కడే తచ్చాడడం.. మీ అందరినీ చూడడం.. మీరు పెట్టినది స్వీకరించడం అంతా ఒక గొప్ప అనుభూతి’ సంవత్సరానికి ఒకసారి రావడం..ఆ మాట విని హడలిపోయాను. సంవత్సరీకాలు తరువాత ఈ తతంగం కొనసాగించాలని అనుకోవడం లేదుగా. ఇక ప్రతి సంవత్సరం రావల్సిన అవసరం వుండదు . ఆ విషయం గురించి కచ్చితంగానే చెప్పింది అక్క. తద్దినం పేరు చెప్పుకొని ప్రతి సంవత్సరం రావడం కుదరదని ఎప్పుడో రాసింది. డబ్బు ఖర్చు మాత్రమే కాదు బావగారి సెలవు.. తన సెలవు.. పిల్లల పరీక్షలు.. అన్నీ సమస్యలే! అక్క, బావ బొంబాయిలో వుంటారు. వాళ్ళతో పోలిస్తే నేను దగ్గరలోనే ఉన్నాను. అయినా సెలవు దొరకటం నాకూ కష్టమే. తమ్ముడికి ఎక్కడ ఉద్యోగం వస్తుందో తెలియదుగా. సమస్య వినగానే పరిష్కార మార్గం చెప్పాడు మేనమామ ..‘ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తద్దినం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అంత తీరిక ఎవరికుంది? అందరూ ‘బిజీ’ కదా. అందువల్ల శాశ్వతంగా ఒక పని చేయవచ్చు. దానికి తగిన విధానాలు కూడా వున్నాయి కదా. వాటి వల్ల మీనాన్నకి మాత్రమే కాదు. మీ పూర్వీకులందరి ఆత్మలకు కూడా శాంతి లభిస్తుంది’ ‘ఏమిటి ఆలోచిస్తున్నావు బాబూ’ నాన్న గొంతు గట్టిగా వినబడినట్లు తోచింది నాకు. తుళ్లి పడ్డాను. నా మనసులోని ఆలోచన నాన్నతో పంచుకోవడానికి ధైర్యం చాలలేదు. మేనమామ చెప్పినట్లు చేస్తే అంతా ముగిసిపోతుంది. బంధాలన్నిటినీ నరికిపారేసి ఆత్మను మోక్షానికి పంపే పని అది! ‘ఈ రోజు గురించే నేను ఎదురు చూస్తూ వున్నాను బాబూ’ గంట మోగినట్లు వినబడింది నాన్న గొంతు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. కానీ ఈ రెండు రోజులైనా నాకు ఇక్కడ.. ఈ ఇంట్లో.. మీ గుండెల్లో నిండి వుండాలనే ఒక కోరిక.. ఆ తరువాత వచ్చినట్లే తిరిగి వెళ్లిపోతాను. ఎవరికీ ఇబ్బందిగా వుండను’ మొద్దుబారిపోయాను నేను. ‘బాబూ.. నీకు నిద్ర వస్తోంది కాబోలు. చాలా సేపు మాట్లాడాను కదా. అయినా సమయం గురించిన లెక్కలు ఇప్పుడు నన్ను వేధించడం లేదు. ఇప్పుడు అలా అలా ప్రవహించి వెళ్లిపోతోంది నా సమయం. తగిలీ తగలకుండా.. కొలవలేని విధంగా ఏ చలనమూ కలిగించకుండా అలా వెళ్లిపోతోంది. ఎవరికీ అందని ఆద్యంతాలు లేని సమయం. బాబూ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి పడుకో ’ మౌనంగా వుండిపోయాను నేను. ‘వెళ్ళు. రేపు పొద్దున నేనిక్కడే వుంటాను.. ఒక కాకిగా. కాకుల గుంపులో కొంత పొడుగాటి ముక్కుతో కూడిన ఒక కాకిగా. కొంత లావుగా వున్న కాకిగా. నన్ను సుళువుగానే పోల్చగలవు నువ్వు’ బయట ఒక చిరుగాలి కదులుతూ వుంది. మందారకొమ్మలు గట్టిగా ఊగాయి. చీకట్లో ఎక్కడనుంచో ఒక కుక్క మొరిగింది. ‘కిటికీ రెక్కలు వేసేయి’ నాన్న గొంతు వినబడింది. ‘వాన పడేలా వుంది’ కిటికీ తలుపులు మూయడానికి చేయి జాపాను. ఆలోగా అవే మూసుకున్నాయి. ఎవరో వేసినట్లు గులకరాళ్ళు పోసినట్లు ఇంటి పైకప్పు మీద వాన చినుకులు రాలే సవ్వడి వినబడింది. నిద్ర పట్టలేదు. తొలకరికి లేచిన వేడి వల్ల నిద్ర పట్టక అటూ ఇటూ తిరిగి పడుకున్నప్పుడు గుర్తుకొచ్చింది.. పిండం పెట్టినప్పుడు కాకిగా నాన్న వస్తారా? అంత తొందరగా లోంగే మనిషి కాదు నాన్న. మొండి. తెలతెల్ల వారుతుండగా మైకంలోకి జారుతున్నప్పుడు అనుకున్నాను.. రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా తద్దినం పెట్టాలి. అక్కకి తమ్ముడికీ కచ్చితంగా చెప్పాలి.. మామయ్య చెప్పినట్లు చేయకూడదని. మరీ ఆ సంతకం గురించి.. సంతకం పెట్టడమే. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా ? --మలయాళ మూలం : సేతు --తెలుగు సేత : ఎల్.ఆర్.స్వామి (రచనా కాలం –1992) -
క్రైమ్ స్టోరీ: హంతకుడెవరు.. ట్విస్ట్ అదిరిపోయింది!
పసలపూడిలోని ఓ పంటపొలంలోనున్న బావిలో ఓ అమ్మాయి శవం తేలిందన్న సమాచారం అందడంతో వెంటనే తన సిబ్బందితో ఆ ప్రాంతానికి బయలుదేరాడు సీఐ జయసింహ. పోలీసులను చూడగానే ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ‘సార్! నా పేరు దుర్గారావు. ఆ దుర్మార్గుడు నా బిడ్డను ఈ బావిలోకి తోసి చంపేశాడు సార్’ బావి వైపు చూపిస్తూ భోరుమన్నాడు. నూతిలోంచి మృతదేహాన్ని బయటకు తీయమని తన సిబ్బందికి పురమాయించి, ‘మీ అమ్మాయి పేరు?’ దుర్గారావును అడిగాడు సీఐ. ‘విశాల.. ఆ దరిద్రుడు గోపాల్ గాడు.. రెండేళ్లుగా మా అమ్మాయి వెంటపడి, ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి రమ్మని ఉంటాడు. తను కాదనడంతో ఇదిగో ఇలా తోసేసి..’ నూతిలోంచి తీస్తున్న కూతురు మృతదేహాన్ని చూస్తూ గుండెలు బాదుకున్నాడు దుర్గారావు. ‘ఆ గోపాలే తోసేశాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?’ అనుమానంగా అడిగాడు సీఐ. ‘సార్, వీడు మా తమ్ముడు గౌరీపతి. ఈ ఘోరం జరిగిన తరువాత ఆ గోపాల్ పారిపోవడం వీడు ప్రత్యక్షంగా చూశాడు’ అంటూ తమ్ముడి వైపు చూపిస్తూ.. కూతురి శవం దగ్గర కూలబడిపోయాడు దుర్గారావు. ‘గౌరీపతిగారూ! ఏం జరిగిందో వివరంగా చెప్పండి’ అంటూ అతన్ని సంఘటన స్థలం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్లాడు సీఐ జయసింహ. ‘సార్, మా అన్నయ్యకు ఈ విశాల ఒక్కతే కూతురు. ఎలా పడిందో తెలియదు కానీ మా విశాల ఆ గోపాల్ గాడి బుట్టలో పడింది. వాళ్లిద్దరూ కలసి తిరగడం చాలాసార్లు చూశాను. ఇద్దరినీ మందలించాను కూడా. అయితే ఈమధ్య ఎందుకో విశాల ముభావంగా ఉంటోంది. ఈరోజు నేను నా పొలం దగ్గరకు వస్తూండగా, విశాల కూడా మా పొలం వైపు వెళ్లడం గమనించాను. కాసేపటికి ఆ గోపాల్ కూడా వచ్చాడు. దూరం నుంచి నన్ను చూసిన గోపాల్ అక్కడ నుంచి పారిపోవడం చూశాను. ఓ పావుగంట తరువాత విశాల ఏమైంది అన్న అనుమానంతో ఇక్కడకొచ్చి, ఆమె కోసం ఈ చుట్టుపక్కల అంతా వెతికాను. కాసేపటి తరువాత ఏదో అనుమానం వచ్చి నూతి దగ్గరకు వచ్చి చూస్తే..’ ఏడుపు దిగమింగుకుంటూ చెప్పాడు గౌరీపతి. ∙∙ అదే రోజు రాత్రి దుర్గారావు ఇంటికి వెళ్లాడు సీఐ.. ‘దుర్గారావు గారూ! ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం భావ్యంకాదు కానీ, మా డ్యూటీ మేం చేయాలికదా? ఒకసారి మీ అమ్మాయి విశాల గది చూపిస్తారా?’ అడిగాడు ఆ పరిసరాలను ఓ కంట పరిశీలిస్తూనే. ‘అలాగే.. రండి సార్! ఇంతకీ ఆ గోపాల్ గాడు దొరికాడా సార్?’ కూతురు గది చూపిస్తూ, గాద్గదిక స్వరంతో అడిగాడు దుర్గారావు. ‘లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇల్లు వదలి పారిపోయాడుట. ఓ రెండు బృందాలు ఆ పని మీదే ఉన్నాయి. త్వరలో పట్టుకుంటాం’ అంటూనే ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. అక్కడ దొరికిన కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లిపోయాడు సీఐ. ∙∙ హత్య జరిగిన మూడవ రోజు రాత్రి.. విజయనగరంలో తమ దూరపు బంధువుల ఇంట్లో రహస్యంగా తలదాచుకున్న గోపాల్‌ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు. ‘గోపాల్! నువ్వు విశాలను నూతిలోకి తోసేస్తుంటే చూసినవాళ్లున్నారు. అందుచేత ఏం జరిగిందో చెప్పి తప్పు ఒప్పుకో. శిక్ష తగ్గించేలా చూస్తా’ ఇంటరాగేషన్‌లో భాగంగా ప్రశ్నించాడు సీఐ జయసింహ. ‘సార్! ఈ హత్యకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. విశాల.. నేనూ ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లకెలాంటి అభ్యంతరం లేదు. కానీ విశాల వాళ్ల నాన్న, చిన్నాన్నలకు మాత్రం మేం కలవడం ఇష్టం లేదు.. మేం వాళ్లకన్నా తక్కువ కులం వాళ్లమని! నన్ను మరచిపొమ్మని విశాలను హింసించేవారుట సార్. అంతే కాదు అవసరం అయితే నన్ను లేపేస్తామని కూడా బెదిరించారుట. తనే చెప్పింది ఈ విషయాలన్నీ’ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు ‘మరైతే ఆ రోజు సాయంత్రం దుర్గారావు పొలం దగ్గర నువ్వెందుకు ఉన్నావ్?’ అనుమానంగా సీఐ. ‘సార్, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నన్ను, వాళ్ల పొలం దగ్గర కలుసుకొమ్మని కబురు పంపింది విశాల. నేను అక్కడికి వెళ్లగానే నా దగ్గరకు వచ్చి .. వెంటనే నన్ను అక్కడ నుండి వెళ్లిపొమ్మంటూ ఏడ్చింది. లేకపోతే వాళ్ల బాబాయ్ నన్ను చంపేస్తాడని అక్కడే దూరంగా ఉన్న తన బాబాయ్‌ని చూపిస్తూ చెప్పింది సార్. నాకేం అర్థంకాక అయోమయంగా అక్కడ నుండి వెళ్లిపోయాను’ చెప్పాడు గోపాల్. ‘మరి ఊర్లోంచి ఎందుకు పారిపోయావ్?’ కొంచెం వెటకారంగా అడిగాడు సీఐ. ‘నేను ఇంటికి చేరిన కాసేపటికే విశాల చనిపోయినట్టు తెలిసింది. అది హత్యనీ.. ఆ హత్య నేనే చేశానని ఊర్లో పుకారు పుట్టడంతో వణికిపోయాను. విశాల ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారనీ.. అలాగని నన్ను ఒంటరిగా పంపిస్తే నేను ఏ అఘాయిత్యానికి ఒడిగడతానోనని భయపడి మావాళ్లు నాకు ఓ మనిషిని తోడిచ్చి అప్పటికప్పుడు విజయనగరం పంపేశారు సార్’ బెదురుతూ చెప్పాడు గోపాల్. గోపాల్ కళ్లల్లోకే సూటిగా చూస్తూ ‘గౌరీపతిని పిలిపించండి’ అంటూ కానిస్టేబుల్స్‌కు ఆర్డర్ వేశాడు సీఐ. ∙∙ ‘మిస్టర్ గౌరీపతీ! విశాలను నూతిలోకి తోసి చంపింది నువ్వేనని బలమైన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ బాణం వేశాడు సీఐ జయసింహ. ‘ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా పిల్లను నేను ఎందుకు చంపుతాను?’ ఆశ్చర్యపోయాడు గౌరీపతి. ‘ఎందుకంటే, ఆ గోపాల్‌ను విశాల పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావనీ.. ఆమె చనిపోతే మీ అన్నగారి ఆస్తికి నువ్వే వారసుడివి కావచ్చనీ’ అన్నాడు సీఐ క్రీగంట గౌరీపతి హావభావాలను కనిపెడుతూ. ‘సార్! మీరేమైనా అనుకోండి.. నేను చెప్పింది మాత్రం నిజం. ఆ రోజు వాళ్లిద్దరినీ చూశాను. గోపాల్ పారిపోయాడు. విశాల నూతిలో పడుంది’ జరిగిన విషయం మరోసారి చెప్పాడు గౌరీపతి. ‘పోనీ మీ అన్నగారు ఎవరైనా కిరాయి మనుషులతో..’ అడగబోతున్న సీఐతో ‘సార్, అవసరం అయితే ఆ గోపాల్ గాడిని లేపేస్తాం కానీ, సొంత బిడ్డను చంపుకుంటామా సార్? ఇదంతా ఆ గోపాల్ గాడు చేసిందే సార్’ కరాఖండీగా చెప్పాడు గౌరీపతి. ‘సరే.. నిజానిజాలను త్వరలోనే నిగ్గు తేలుస్తాం కానీ మీరు మాత్రం మాకు చెప్పకుండా ఈ పొలిమేర దాటకూడదు’ అంటూ స్టేషన్ బయటకు నడిచాడు సీఐ. ∙∙ తన గుమ్మంలో సీఐని చూసిన దుర్గారావు.. ‘సార్, నా కూతుర్ని చంపిన ఆ గోపాల్ గాడిని వదలకండి సార్’ అంటూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్ దుర్గారావ్. మీ విశాల.. గోపాల్‌ను ప్రేమించడం ఇష్టం లేని నువ్వు, ఆ అమ్మాయిని కిరాయి గూండాల చేత నూతిలోకి తోసేయించావని మీ తమ్ముడు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకే, హత్యా నేరం కింద నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాం’ చెప్పాడు సీఐ. ‘సార్! మా అమ్మాయిని నేను చంపుకోవడమేంటి సార్! ఆ గోపాల్ గాడే..’ చెప్పబోతున్న దుర్గారావుతో.. ‘స్టాపిట్, ఈ విషయాలన్నిటినీ విశాల ఓ లెటర్లో రాసింది. అది దొరికితే ప్రమాదమని ఆ ఉత్తరాన్ని దాచేశావ్’ అంటూ కానిస్టేబుళ్ల సహాయంతో దుర్గారావును స్టేషన్‌కు తీసుకెళ్లాడు సీఐ జయసింహ. ∙∙ ‘గుడ్ మిస్టర్ జయసింహ! ఆ విశాల మర్డర్ కేసు సాల్వ్ చేశావుట. ఇంతకీ హంతకుడు ఎవరు? గోపాలా లేక గౌరీపతా?’ అడిగారు స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ రంగనాథ్. ‘వాళ్లెవరూ కాదు సార్. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య’ కూల్‌గా చెప్పాడు సీఐ. ‘వ్వాట్.. ఎలా కనిపెట్టావ్?’ అనుమానంగా అడిగారు డీఎస్పీ. ‘సార్! ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ చూడగానే నాకు అనుమానం వచ్చింది ఇది హత్య కాకపోయుండొచ్చని. ఎందుకంటే నూతి దగ్గరున్న మట్టినేల మీద పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కానీ.. వేరే పాదముద్రలు కానీ లేవు. ఆమె ధరించిన జోళ్లు ఆ పాక దగ్గర నీట్‌గా పెట్టున్నాయి. అంతేకాదు నూతి గట్టు మీద విశాల పాదముద్రలున్నాయి. హత్య చేసినవాడు ఆమెను నూతిలోకి తోసేస్తాడు కానీ ఆమెను గట్టు మీద నిలబెట్టి తర్వాత నూతిలోకి తొయ్యడు కదా? విశాలే నూతి గట్టు మీద నిలబడి లోపలికి దూకి ఆత్మహత్య చేసుకుందని నా పరిశీలనలో తేలింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడం కోసమే ఈ ఇంటరాగేషన్ చేయవలసి వచ్చింది సార్’ అంటూ మొత్తం విచారణా వివరాలు డీఎస్పీకి వివరించసాగాడు సీఐ జయసింహ. ‘సార్, గోపాల్‌తో ప్రేమ వ్యవహారాలు మానేయమని, తమ కుటుంబం పరువు కాపాడమని లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూతురిని చాలాసార్లు బెదిరించాడు దుర్గారావు. కానీ విశాల.. గోపాల్‌కు దూరం కాలేకపోయింది. ఆమె చనిపోయే రోజు ఉదయం.. తన తండ్రి, బాబాయ్‌లు.. గోపాల్‌ను హత్యచేసే విషయం గురించి మాట్లాడుకున్న మాటలను ఆమె రహస్యంగా విన్నది. వెంటనే ఓ స్థిర నిర్ణయానికి వచ్చి ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది’ అంటూ టేబుల్ మీదున్న ఫైల్లోంచి ఓ లెటర్ తీసి డీఎస్పీకిచ్చాడు సీఐ జయసింహ. తను గోపాల్ లేకుండా బతకలేనని, అలాగని గోపాల్‌తో తను వెళ్లిపోతే తన తండ్రి, బాబాయ్‌లు పొందే అవమానాన్నీ తాను భరించలేనని, తన తండ్రి, బాబాయ్‌లు కలసి గోపాల్‌ను చంపాలని వేసుకున్న ప్లాన్‌ను తాను రహస్యంగా విన్నానని, గోపాల్ చాలా మంచివాడని, అతన్ని ఏం చేయొద్దని వేడుకుంటూ, ఈ సమస్యకు పరిష్కారం తన చావొక్కటేనని.. అందుకే నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాని.. విశాల రాసిన ఆ సూసైడ్ నోట్ సారాంశం. ‘ఆ ఉత్తరం దుర్గారావు కంటబడేటప్పటికే విశాల నూతిలో శవమై పడి ఉందని, గోపాల్ పారిపోయాడనీ తన తమ్ముడు పంపిన సమాచారం అందింది. ఉక్రోషంతో ఊగిపోయాడు దుర్గారావు. అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. తన కూతురు చావుకు కారణమైన ఆ గోపాల్ మీద కక్ష తీర్చుకోవడానికి అదే మంచి సమయమని భావించాడు. ఈ ఆత్మహత్యని గోపాల్ చేసిన హత్యగా చిత్రీకరించి అతడిని కటకటాల పాలు చెయ్యాలనుకున్నాడు. ఆలెటర్ ఎవరికీ కనబడకుండా దాచేశాడు. యామై కరెక్ట్ మిస్టర్ జయసింహ?’ అడిగారు డీఎస్పీ రంగనాథ్. ‘కరెక్ట్ సార్. ఇదే విషయం దుర్గారావు కూడా చెప్పాడు నా విచారణలో’ డీఎస్పీ కన్‌క్లూజన్‌కు ఆశ్చర్యపోతూ అన్నాడు సీఐ. ‘ఓకే బాగానే ఉంది కానీ అసలు విశాల ఆ లెటర్ రాసుంటుందని నీకు ఎలా తెలిసింది?’ అడిగాడు డీఎస్పీ కుతూహలంగా. ‘సార్, విశాలది ఆత్మహత్య అయి ఉండొచ్చన్న అనుమానం వచ్చిన వెంటనే.. అదే రోజు రాత్రి వాళ్లింటికి వెళ్లి విశాల గదిని పరిశీలించాను. టేబుల్ మీద పెట్టున్న స్క్రిబ్లింగ్ పాడ్, బాల్ పెన్నుల మీద నా కన్ను పడింది. అసలు అవి అక్కడ ఎందుకున్నాయన్న అనుమానం వచ్చి, ఆ పాడ్‌లోని మొదటి పేజీ చూడగానే, దాని ముందు పేజీ మీద బాల్‌పెన్‌తో గట్టిగా రాసిన అక్షరాల తాలూకు ఇంప్రెషన్స్ కనపడ్డాయి. నా అనుమానం నిజమయింది. అయితే ఆ లెటర్లో ఏముంది? ఆ లెటర్ ఎక్కడుంది? అసలు ఇది ఆత్మహత్య అని నిరూపించడం ఎలాగో రాబట్టడం కోసమే ఇంత టైమ్ పట్టింది సార్’ తన పరిశోధన వివరాలు చెప్పాడు సీఐ జయసింహ. ‘అయితే ఆ లెటర్ దుర్గారావు దగ్గరుందని నీకు తెలియదు, అలాగే గౌరీపతి అన్నీ చెప్పేశాడని అతడిని జస్ట్ భయపెట్టావ్ అంతేనా?’ అడిగారు డీఎస్పీ. ‘ఔను సార్’ నవ్వుతూ చెప్పాడు సీఐ జయసింహ. చదవండి: కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో! కథలో అయినా.. నిజ జీవితమైనా ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు.. తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కథ: అద్దం.. అప్పుడు అసహ్యంగా కనిపించింది.. ఇప్పుడేమో!
ఇవ్వాళ పదవీ విరమణ. పోలీసుశాఖలో ఉద్యోగం. అలవాటు కొద్దీ త్వరగా నిద్రలేచాను. నాలుగింటికే వచ్చే పేపరు బాయ్ ఇంకా రాలేదు. సీనియర్లు రిటైరైయినప్పుడు మా ఆఫీసులో పెద్ద అట్టహాసమే జరుగుతుంది. ఆలోచిస్తూ బ్రష్ చేసుకొని స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లా. యాథాలాపంగా చిన్నలైట్కు బదులు పెద్దలైట్ వేశాను. అద్దంలో నెరిసిన జుట్టు వెండిలా తెల్లగా మెరుస్తోంది. రిటైర్మెంట్ ఆలోచనల్లోనున్న నాకు, హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది. అదే.. నాకు అద్దమంటే చాలా భయం. అద్దం నాకు నచ్చదు. ఈరోజు నాకు విచిత్రంగా తోచింది. భయం పోయిందా? నిజమా! కలా? గిల్లి చూసుకున్నాను. ‘పేపర్..’ బయట పేపర్ బాయ్ అరుపు వినబడింది. ‘కల కాదు నిజమే!’ అద్దమంటే నాకున్న అయిష్టం, భయం ఇప్పటిది కాదు. నాన్న దూరమైనప్పటిది. చానాళ్ల తరువాత ఈరోజు అద్దాన్ని ఇలా ధైర్యంగా చూస్తున్నా. ‘అద్దం మసకగా కన్పిస్తోంది. నిజంగా మసకబారిందా? లేక నా కంటిచూపు మందగించిందా? తెలియలేదు. అద్దంలో మరకలున్నాయేమోనని శ్రద్ధగా టవల్ బెట్టి తుడిచాను. అయినా అవి పోలేదు. అవి నా మనసుపై పడిన మరకలు. రవి గుర్తుకొచ్చాడు. నాన్న గుర్తుకొచ్చినపుడల్లా రవి గుర్తుకొస్తాడు. అద్దంలాగే వాళ్ళు నిజానికి ప్రతిబింబాలు. వాళ్ళ జ్ఞాపకాలు నా మనసు మీద బలంగా నాటుకుపోయిన అద్దానికి సాక్ష్యాలు. వాళ్ళు గుర్తుకురాగానే నా ముఖం వివర్ణమైంది. క్రమంగా వికృతమైంది. ఇంతకు ముందయితే ఇలాంటప్పుడు అద్దం పగలగొట్టాలనే కోరిక బలంగా ఉండేది. ‘ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నట్టు’ సామెత గుర్తుకొచ్చింది. వైరాగ్యం ఆవహించింది. అద్దంలో నిజమే కన్పిస్తుందంటారు.. మరి ఇది నా ముఖం కాదుకదా. నా ముఖం ఎక్కడ? అద్దాన్ని మనసు ప్రశ్నిస్తూనే ఉంది. ఎంత అహంకారం. అది జవాబివ్వదు. నాకెప్పుడూ అద్దం అందంగా కనపడదు. అలాంటప్పుడు ఈ అద్దాన్ని నేనెందుకు చూడాలి? నాన్న, రవి ఆలోచనలతో మనసంతా సంతలో మనుషుల్లా గజిబిజిగా మారింది. ∙∙ ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగ జీవితంలో పోలీసు యూనిఫామ్ భాగమైంది. ఆఫీసరు హోదా, దర్జా ఎప్పుడూ నా వెంటే ఉండేవి. వాటికోసం నేను అద్దం ముందు నిలబడక తప్పేది కాదు. నిలబడ్డప్పుడు ప్రపంచం చూసే ముఖం అందంగా కన్పించేది. కాసేపట్లో గతం గుర్తుకొచ్చి అద్దంలో రంగులు మారేవి. అద్దానికి జీవగుణం ఉందనిపించేది. ఊసరవెల్లిలా దానికిన్ని రంగులు ఎలా అబ్బాయో? ఎంత ఆలోచించినా అర్థంకాదు. అద్దం అబద్ధం చెప్పదు అంటారు కదా. మరి నాకెందుకు అబద్ధం చెబుతోంది. నా నిజరూపాన్ని ఎందుకు చూపడం లేదు? చాలాసార్లు నిలదీశా! లక్ష్యపెట్టలేదు. దానిపని దానిది, నా పని నాదే అయింది. కాలం గడిచిపోయింది. నా సర్వీసు మొత్తం ఆ జ్ఞాపకాలను మోయలేక, వర్తమానాన్ని భరించలేక.. అదో అవస్థ. ∙∙ బొడ్డుతాడు ఊడిపడక ముందే బస్టాండులో వదిలేసిన రవిని పుణ్యాత్ములెవరో అనాథాశ్రమంలో చేర్చారు. గాంధీజయంతికి ఒకసారక్కడికి వెళ్లాను. అక్కడ నూటా యాభైమందికి పైగా పిల్లలున్నారు. ముందువరుసలో చురుగ్గానున్న ఆ పిల్లవాడు నన్ను ఆకర్షించాడు. గళ్లచొక్కా, పొట్టి నిక్కరు. చందమామవంటి మోము. పెద్ద కళ్ళు. నల్లటి ఉంగరాల జుత్తు. చక్కని కంఠం. దర్జా ఉట్టిపడేలా రూపురేఖలు. అతనే రవి. వేదికమీదున్న అందరి దృష్టి రవిపైనే. ప్రసంగాలు పూర్తయి బహుమతి ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఆటలు, పాటలు, చదువు అన్నింటిలోనూ రవే మొదటి బహుమతి విజేత. కార్యక్రమం చివరలో రవి కీబోర్డును వాయిస్తూ అమ్మానాన్నపై ఎంత అద్భుతంగా పాడాడు?! అందరూ ముచ్చటపడ్డారు. వచ్చిన అతిథులంతా తమకు తోచిన సాయం ప్రకటించారు. నేను మాత్రం బయటపడలేదు. నా మనసు నన్ను ప్రశ్నించింది. దాని గొంతును అధికారంతో నోక్కేశాను. వెళ్తూ వెళ్తూ రవిని దగ్గరికి పిలిచి ‘ఏం చదువుతున్నావ’ని అడిగాను. ‘పదోతరగతి సార్’ చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు. జీప్‌లో స్టేషనుకు బయల్దేరాను. ఆశ్రమం వదిలినా, మనసులో రవి టాలెంట్ చెదిరిపోలేదు. ∙∙ డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. ‘అంత టాలెంట్ నా పిల్లలలో కూడా లేదాయే’. రవి మీద అసూయ కలిగింది. రవి ఆలోచనలతో ఉన్న నేను అప్రయత్నంగా ఇంట్లోనున్న అద్దంలో నా మొఖాన్ని చూశాను. అద్దం దాని బుద్ధి చూపింది. ఛ.. అసహ్యంగా కన్పించింది. అద్దాన్ని తుడవమని నా శ్రీమతికి చెప్పాను. ఈ అద్దం నాకు నచ్చలేదు. అద్దం మార్చమనీ చెప్పాను. పడుకునేటప్పుడు ఆలోచించాను. కొంపదీసి అద్దం నన్ను పగబట్టిందా? ఆ ఊహకే నాకు నవ్వొచ్చింది. అద్దం నాకు శత్రువా? మిత్రువా? అద్దాన్ని చిన్నప్పుడు నా మిత్రుడిలా భావించాను. రహస్యాలు చెప్పుకున్నాను. నా భాధలు, ఆనందాలను పంచుకున్నాను. నా మాటలన్నీ అద్దానికే ముందు విన్పించే వాడిని. ఈ అద్దానికి విశ్వాసం లేదు. దానిదంతా మనిషిలాగే వక్రబుద్ధి. స్వార్థబుద్ధి్ద. అద్దం అబద్ధం. అద్దంతో నాకు ఏ బంధుత్వం లేదనిపించింది. అప్పుడప్పుడూ చూసే అద్దాన్ని ఇకపై మొత్తానికే చూడొద్దని తీర్మానించుకున్నాను. హాయిగా నిద్రపట్టింది. ∙∙ ఈలోగా కరెంటు పోయొచ్చింది. చీకటిలోనున్న గతంపైకి వెలుగొచ్చింది. అద్దం తేటగా ఉంది. రవి ఆలోచనల నుండి బయటకొచ్చాను. ఎందుకో అద్దం ఈరోజు బాత్రూమ్లో గురువులా కన్పిస్తోంది. నాతో ఏదో చెప్పాలని సిద్ధమైనట్టుంది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజు సినిమా రీలులా జ్ఞాపకానికి వచ్చింది. ఉద్యోగం సాధించడానికి ఎంత శ్రమ పడ్డాను. ఉద్యోగంలో చేరిన ఆరోజు అమ్మ ఎంతో సంతోషించింది. నాన్న గుర్తుకొచ్చాడు. నా భావాన్ని అర్థం చేసుకున్న అద్దం కన్నీరు కారుస్తోంది. కొంపదీసి అద్దానిది మొసలి కన్నీరు కాదుకదా? పోలీసోడిని. నీడను సైతం నమ్మరాదని శిక్షణలో ఉగ్గుపాలతో రంగరించి చెబుతారు. అద్దంపై జాలి కలిగింది. ఆర్తితో అద్దం కన్నీళ్లు తుడిచాను. తేటగయ్యింది. ఇప్పుడు ముఖం తేటగా కనపడుతోంది. అద్దానికి కూడా హృదయం ఉన్నట్టుంది. ఆలోచనలు నా మదిని నింపినట్టే.. వదిలిన ట్యాప్.. బకెట్‌ను నింపింది. నీళ్ళచప్పుడుకు ఈలోకంలోకి వచ్చాను. నీళ్ళు మగ్గులో తీసుకొని వంటిపై పోసుకున్నాను. కమ్మని మట్టిపరిమళం. ఆశ్చర్యపోయాను. అరె! కాంక్రీటు జంగిల్లో మట్టివాసనా? ఎక్కడినుండి వస్తుందని చుట్టూ వెదికాను. అది నా శరీరం నుండేనని కాసేపటికి తెలిసింది. తృప్తిగా పీల్చాను. మట్టివాసనతో నా ఆలోచనలు క్షణాల్లో ఊరికి పరిగెత్తాయి. ∙∙ నాది నకిరేకల్ దగ్గర ఒగోడు. మొదట పోలీసుశాఖలో నేను ఎస్.ఐగా జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా డీఎస్పీ స్థాయి వరకు పదోన్నతి పొందాను. మాది సాధారణ రైతు కుటుంబం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తాత అమరవీరుడు. నికార్సయిన నిజాం విముక్తి పోరాటానికి గెరిల్లా దళాన్ని చాకచక్యంగా నడిపిన తాత గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. చూడటానికి తాత, నాన్న అన్నదమ్ములవలె ఉండేవారట. తాత రూపు, భావాలకు నాన్న అద్దంలో ప్రతిబింబంలా ఉండేవాడు. తాత అభ్యుదయ భావాలను నాన్న జీవితాంతం బాధ్యతగా మోశారు. ఆరోజుల్లో నాన్న ఉర్దూ మీడియంలో నాలుగు వరకు చదువుకున్నాడు. మంచి వక్త. చైతన్యం కలిగిన వాడు మాత్రమే కాదు. మాటలను నిప్పురవ్వలా మార్చి చైతన్య కాగడాలను వెలిగించే మనిషి. దాంతో ఉన్నోళ్లకు శత్రువయ్యాడు. లేనోళ్లకు బంధువయ్యాడు. ‘దున్నేవానిదే భూమి’. ఈమాట నాన్న నోటినుండి ప్రతిరోజూ పాఠంలా వినేవాణ్ణి. అలాగని నాన్న హింసావాది కాదు. గాంధీని చాలా ఇష్టపడేవాడు. దేశానికి ‘గాంధేయ కమ్యూనిజం’ కావాలనేవాడు. ఆమాట విన్న కమ్యూనిస్టులు నాన్నను విచిత్రంగా చూసేవారు. నాన్న భావజాలం, ఆలోచనలు నా ఆలోచనా పరిధిని పెంచాయి. నాకు బడి ఎంతో, ఇల్లూ అంతే. రెండు చోట్లా బోధనే జరిగేది. అప్పుడు నేను ఆరోతరగతిలో ఉన్నాను. సాంఘికశాస్త్రం మాస్టారు ‘భూమి నిలకడగా ఉండదు. ఆకర్షణతో ఎల్లప్పుడూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది’ అని చెప్పారు. ఆశ్చర్యమేసి ‘భూమి.. సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది నాన్న?’ అని అడిగాను. నాన్న మాత్రం ‘భూమి ఎల్లప్పుడూ ఉన్నోడి చుట్టూ తిరుగుతుంది. పేదోని కష్టం చుట్టూ ఉన్నోళ్ళ ఆశలు తిరుగుతాయి’ అన్నాడు. ఆ రెండు విషయాలు నా మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. ఒకటి శాస్త్రీయత, రెండవది అనుభవం. ఏదేమైనా భూమి స్థిరంగా ఉండదని మాత్రం అర్థమయింది. నాకు చిన్నప్పుడు మాట్లాడడమంటే చాలా భయం. నాన్న అది గమనించి ‘ప్రశ్నించే వాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మనిషి’ అని చెప్పాడు. టౌనుకు పోయి పెద్ద నిలువుటద్దం తెచ్చాడు. ఆ అద్దం ముందు నిలబడి, నన్ను మాట్లాడమని ప్రోత్సహించాడు. క్రమంగా కొంతకాలానికి నాకున్న భయం పోయింది. ధైర్యంగా మాట్లాడసాగాను. ‘మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు’ అనే అమ్మ పొగడ్తలు ఉత్సాహాన్నిచ్చేవి. నన్ను అద్దం కూడా అలాగే చూసేది. ∙∙ అద్దం మీద కోపం వచ్చిన ఆరోజు.. నా జీవితంలో మర్చిపోలేను. ఆరోజు బడికి సెలవు. అద్దం ముందున్నాను. పంద్రాగస్టు ఉపన్యాసం కోసం సాధన చేస్తున్నాను. నాన్నకు విన్పించి మెప్పు పొందాలని ఉత్సాహంతో ఉన్నాను. చీకటి పడింది. ఇంకా నాన్న రాలేదు. పిడుగు పడ్డట్టు నాన్న చావు కబురొచ్చింది. శవాన్ని వెతుక్కుంటూ నన్ను, దీపాన్ని తీసుకొని అమ్మ ఊరవతలి అడవికి నడిచింది. చిమ్మచీకటి. అమ్మ వెక్కివెక్కి ఏడ్చింది. నడుస్తూ నడుస్తూ నేలమీద కుప్పకూలిపోయింది. చీరకొంగును నోట్లో కుక్కుకుని ఏడ్పును అదుముకుంది. చీకటంతా ఆ అడవిలోనే ఉన్నట్టుంది. అంతచీకటిని మొదటిసారి చూసేసరికి భయం వేసింది. భయంతో మెదడు గడ్డకట్టుకుంది. చాలాసేపటిదాక వెతికినా గుడ్డి దీపానికి నాన్న చిక్కలేదు. ఏ అర్ధరాత్రో మా వెదుకులాటకు కాలం తీరింది. వాగు దగ్గర రాళ్ళమధ్య చలనం లేకుండా పడున్నాడు నాన్న. ఒంటినిండా తూటాల గాయాలు. నెత్తుటి మడుగులో ఒంటిపై అడవిచీమలు పట్టి ఉన్నాయి. అమ్మ ధైర్యం పారే వాగులా కన్నీరయింది. ఆరాత్రి మా దుఃఖం చీకటినేమీ మార్చలేకపోయింది. పొద్దు పొడిచింది. జనం జాతరలా కదిలారు. నాన్నను పొద్దు ఇష్టపడింది కాబోలు. వెంటే తీసుకుపోయింది. నాన్నపోయాక ఇంటికి పోలీసులొచ్చేవారు. వాళ్ళను చూసి అమ్మ గజగజ వణికిపోయేది. తరువాత ఆ ఊరొదిలేశాం. ఇంత జరిగినా అద్దం ఏమీ పట్టనట్టుగా ఉన్నట్టనిపించింది. దాంతో అద్దం మీద కోపం, పోలీసుద్యోగం మీద ఇష్టం పెరిగింది. ∙∙ నాన్న ఆలోచనలతో స్నానం ముగించాను. బయటకు వచ్చి కాసేపు ధ్యానం చేశాను. తరువాత పేపరును పూర్తిగా చదివాను. ఈ పాతికేళ్ళు ఉద్యోగంలో ఎన్నో తప్పులు, ఒప్పులు, చీత్కారాలు, సత్కారాలు. మారుతున్న కాలాన్ని గమనించనేలేదు. నేను కాలాన్ని నడిపాననుకున్నాను. కానీ కాలమే నన్ను నడిపిందని ఈరోజు అర్థమైంది. హడావుడిగా కాలంతో పరుగెత్తే అలవాటున్న నేను ఈ రోజు మాత్రం నింపాదిగా ఉన్నాను. కాలం కూడా నాలాగే ముసలిదైపోయిందా? ఎందుకో కాలం నెమ్మదిగానే నడుస్తోంది మరి. శ్రీమతి టిఫిన్ తయారుచేసి టేబుల్ మీదకు పిలిచింది. టిఫిన్, కాఫీలయ్యాక ఒక లెటరు తెచ్చి నా చేతికిచ్చింది. క్వార్టర్ ఖాళీ చేయమని దాని సారాంశం. ఇన్నాళ్ళు పోలీసుశాఖలో పనిచేసిన నాకు సొంత ఇల్లు కూడా లేదు. ‘నిజాయితీ నీకు నిలువ నీడలేకుండా చేసిందిరా’ అని మిత్రులు సరదాగా అన్నా, అద్దం చెప్తున్నంత నిజంగా తోచింది. మనసు భారంగా మారింది. డ్రైవరొచ్చాడు. సెల్యూట్ చేశాడు. అందులో భయంకంటే గౌరవం ఎక్కువగా కనబడింది. అద్దంలో వచ్చిన మార్పు స్పష్టంగానే తెలుస్తోంది. ‘పదినిముషాలు వెయిట్ చేయమని’ చెప్పాను. యూనిఫాం వేసుకున్నాను. భయంభయంగానే అద్దం ముందుకు చేరుకున్నాను. నన్ను ఈవేళ నా శ్రీమతి కొత్తగా చూస్తోంది. ఆమెకు నా గురించి బాగా తెలుసు. అందుకే ఆసక్తిగా నన్నే గమనిస్తోంది. అద్దంలో ఏ భావమూ లేదు. అద్దం ఈ పోలీసును చూసి భయపడిందా? నిజానికి అది నిజమే చూపింది. అద్దానికి నాకు మిత్రత్వము, శత్రుత్వమూ లేదు. ఏ బంధమూ లేదు. తయారై గబాగబా బయటకు నడిచాను. డ్రైవరు కారు డోరు తీశాడు. ఎక్కి కూర్చున్నా. కారు కదిలింది. కారుపై ఎర్రబుగ్గ కాలంలా వేగంగా తిరుగుతూ జనాన్ని హెచ్చరిస్తోంది. కారు దర్జాను రోడ్డుపొడవునా పరచుకుంటూ రివ్వున వాయువేగంతో దూసుకుపోతోంది. అనాథాశ్రమం వేగంగా వెనక్కిపోయింది. రవి గుర్తుకొచ్చాడు. కారులోనున్న అద్దంలో రంగులు మారాయి. రవి ఆలోచనలతో బాటు, అద్దం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నాకు అద్దమంటే అంత భయం. వెనుక ఆలోచనలు తిరిగి ముసురుకున్నాయి. ∙∙ ఆశ్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రవి టాలెంట్ గురించి మరచిపోతున్న సమయమది. పై అధికారి పోలీస్టేషన్ పర్యవేక్షణకు వస్తున్నాడు. సిబ్బంది మొత్తం హడావుడిగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఫైళ్ళను తీసుకొని నా రూమ్‌కు వచ్చాడు. నాతో వాటి గురించి సీరియస్‌గా చర్చిస్తున్నాడు. ఈలోగా అక్కడికి అనాథాశ్రమం నిర్వహణాధికారి, వెంట రవిని తీసుకొని ఆఫీసుకు వచ్చాడు. కిటికీ అద్దంలో గమనించాను. ముఖ్యమైన పనికావడంతో దృష్టి్టని పనిపైకి మళ్ళించాను. అరగంట తరువాత ఫైళ్ళు పరిష్కారమయ్యాక విక్రం బయటకు వెళ్ళాడు. కానిస్టేబుల్ లోపలికి వచ్చి సెల్యూట్ చేస్తూ రవి వచ్చిన విషయం గుర్తుచేశాడు. లోపలికి పంపమని సైగ చేశాను. లోపలికి రాగానే ‘ఆ... ! చెప్పండి. ఏం కావాలి?’ అడిగాను. మా హడావుడి తెలుసుకొని, ‘రవి పైచదువులకు మీ సాయం కావాలి సార్’ క్లుప్తంగా చెప్పాడు ఆశ్రమ నిర్వాహకుడు. ‘సర్టిఫికేట్లను సిద్ధం చేసుకో రవి. ఖర్చులు నేను చూసుకుంటాను. రేపు మీ ఆశ్రమం వస్తానని’ చెప్పాను. చెప్పినట్టే మరునాడు ఆశ్రమం దగ్గర రవిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి పెద్దకాలేజీలో చేర్పించాను. హాస్టల్ ఖర్చులన్నీ కలిపి ఫీజును ముందుగానే కట్టేశాను. రవిని జాయిన్ చేసి, మళ్లోసారి వస్తానని చెప్పి కారు దగ్గరకు నడిచాను. మనసు దూదిపింజలా తేలిపోతోంది. రవి కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళలో మెరుస్తుంది. ఆ దృశ్యం కారు అద్దంలో ఎదురైంది. హమ్మయ్య! అద్దం నన్ను కనికరించింది. సంతోషాన్నిచ్చింది. రవిపై నాకున్న నమ్మకం వృథాకాలేదు. ఇంటర్లో మంచి మార్కులొచ్చాయి. తరువాత ఇంజనీరింగ్. నా సాయం కొనసాగుతూనే ఉంది. ఆఫీసులో నాకు ఆత్మీయుడుగానున్న విక్రమ్ కూడా ప్రమోషన్ మీద హైదరాబాదు వెళ్ళాడు. రవి బాగోగులు తానే చూసుకుంటున్నాడు. నాకు ప్రమోషన్ వచ్చినా స్థానబదిలీ జరగలేదు. ∙∙ ఈలోగా కారు ఆఫీసు ముందాగింది. వాస్తవంలోకి వచ్చాను. ఎర్రబుగ్గ సైరను ఆగిపోయింది. కారు దిగాక పూలమాలలతో మా పోలీసు సిబ్బంది ఆఫీసులోకి నన్ను ఆహ్వానించారు. అటెండెన్స్ రిజిస్టరులో చివరిరోజు సంతకంచేసి నా కుర్చీలో కూర్చున్నాను. ఉద్విగ్నంగా ఉంది. ‘పోలీసు ఆడిటోరియంలో పదవీవిరమణ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్’ విక్రమ్ సెల్యూట్ చేస్తూ చెప్పాడు. నేను ఊహించలేదు. విక్రం తానే చెప్పాడు. ట్రాన్స్ఫర్ మీద ఈరోజే ఇక్కడ జాయిన్ అయినట్టు. నా సీట్లో అతను రేపటి నుండి పనిచేస్తాడు. అతని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. కారణం విక్రమ్ అంటే నాకిష్టం లేదు. కారణం మళ్ళీ రవినే. నా ఆలోచనలను పసిగట్టాడు కాబోలు. ఈసారి తన సిబ్బందిని ముందుకు తోశాడు. జీపును పూలతో అలంకరించారు. పొడవాటి తాళ్ళు. వాటికి పూల అలంకరణ ఉంది. ఇవన్నీ విక్రమ్ ఏర్పాట్లు. తెలుస్తూనే ఉంది. విక్రమ్‌కు నేనంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. కానీ రవి విషయంలో విక్రమ్ చేసిన ద్రోహం మరువలేను. ఆడిటోరియం ఆఫీసు పక్కనే ఉంటుంది. జీపులో నన్ను కూర్చోబెట్టి తాళ్ళతో ముందుకులాగుతున్నారు. సిబ్బంది హడావుడి మద్య నా ఇబ్బంది చిన్నది. కెమెరాలు, ఫొటోలు, విలేఖరులు, స్టాఫ్ అట్టహాసం మద్య జీపు ముందుకుపోతుంటే విక్రమ్‌ను చూశాక నా ఆలోచనలు మాత్రం వెనక్కు మళ్ళాయి. ∙∙ రవి ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాక బాగోగులు చూసుకోమని విక్రమ్‌కు చెప్పాను. అవసరమైన ఆర్థికసహాయం చేస్తూనే ఉన్నాను. కాలేజీలో ఏవో గొడవలు. చిలికి చిలికి గాలివానైంది. మంత్రి కొడుకు ఆ గొడవకు కారణం. అతను ఆవేశంలో కొట్టిన దెబ్బలకు సహవిద్యార్ధి తలపగిలి చనిపోయాడు. ఆ కేసులో సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడ్డారు. విక్రమ్ రవిని బలవంతంగా ప్రత్యక్షసాక్షిగా చేర్చాడు. నిజం నిర్ధారణ కావడంతో శిక్ష ఖరారైంది. ఇదంతా నాకు తెలియకుండా విక్రమ్ జాగ్రత్తపడ్డాడు. తరువాత మంత్రి అధికారాన్ని ఉపయోగించి రవిని కనబడకుండా చేశాడు. అడవిలో సగంకాలిన రవి శవం దొరికిందని ఆశ్రమం ద్వారా కబురొచ్చింది. తరువాత నా ఎంక్వయిరీలో విక్రమ్ నిర్లక్ష్యం తెలిసి అసహ్యం కలిగింది. అందుకే అద్దం ముందుకు పోయినప్పుడల్లా నాన్న.. ఆ వెంటనే రవి జ్ఞాపకం వస్తారు. అద్దం కూడా వాళ్ళలాగే నిజం చెబుతుంది కాబోలు. అద్దం వేసే ప్రశ్నకు నా దగ్గర ఏ సమాధానం లేక భయం వేసేది. అందుకే ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాను. నేను పోలీసును. నాకు తెలుసు. అద్దంలో నా గతం ఉంది. అదెప్పుడూ ప్రశ్నిస్తుంది. నిజం నిగ్గుదేల్చమంటుంది. అద్దం పెట్టే యాతన భరించలేక ఇన్నాళ్ళు దూరం పెట్టాను. అప్పుడప్పుడూ చూడకతప్పేది కాదు. ∙∙ ఆడిటోరియం వచ్చింది. ఆలోచనలు ఆగిపోయాయి. హాలునిండా డిపార్ట్మెంట్ వాళ్ళున్నారు. ఆత్మీయులున్నారు. సహాయం పొందినవారూ ఉన్నారు. అప్పటికే నా శ్రీమతి అక్కడకు వచ్చింది. మమ్మల్ని వేదిక మీదకు ఆహ్వానించారు. సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీగారు ఇంకా రాలేదు. కొత్త ఎస్పీ చార్జ్ తీసుకోవాల్సిఉంది. నేరుగా ఇక్కడికే వస్తున్నారని విక్రమ్ వేదిక మీద అనౌన్స్ చేశాడు. ప్రసంగాలు నడుస్తున్నాయి. విక్రమ్ హడావుడి గమనిస్తూనే ఉన్నాను. కాని పట్టనట్టున్నాను. ఈలోగా ఎస్సై వేదికపైకి వచ్చాడు. అంతా లేచారు. నేనూ లేచి సెల్యూట్ పెట్టాను. విచిత్రం. అద్దంలో చూస్తున్నట్టు చూశాను. భ్రమ పడుతున్నానా? తర్కించుకున్నాను. కొత్త ఎస్సై హోదాతో రవి వచ్చాడు. మీడియా అంతా ఎస్సైగారి మీద ఫోకస్ బెట్టింది. రవి నేరుగా వచ్చి నా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ కళ్ళల్లో అదే కృతజ్ఞత. రవి బతికి ఉండడం సంతోషమైతే, పోలీసు అధికారిగా రావడం రెట్టింపు ఆనందాన్నిచ్చింది. సభ ముగిశాక రవితోబాటు విక్రమ్ నా వెనుకే హాలు బయటకు నడిచాడు. ఇంటికి చేరుకున్నాక విక్రం తన బ్యాచ్‌మేట్ సాయంతో రవిని కాపాడిన విషయం చెప్పాడు. రవి భద్రత కోసం ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇదే రోజు ఇక్కడ పోస్టింగ్ తీసుకుంటున్నాడని తెలిసి ఈ విషయం నాకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదన్నాడు. మనసులో భారం దిగిపోయింది. కాసేపు ఉండి కాఫీ తాగి వెళ్ళారు. ఇక అద్దం ముందు ధైర్యంగా నిలబడ్డాను. నాన్న గుర్తుకొచ్చాడు. వెంటనే రవి స్థానంలో అనాథాశ్రమానికొచ్చిన సగం కాలిన శవం గుర్తుకొచ్చింది. ఎవరిది ఆ అనాథ శవం? అద్దం మళ్ళీ నన్ను ప్రశ్నించింది. చదవండి: క్రైమ్ స్టోరీ: క్లూస్... కాల్చిపారేసిన చుట్టముక్క.. ఊహించని ట్విస్ట్! -
కథ: నీలం రంగు రాయి ఉంగరం.. ఇది ఇప్పుడు నాదే!
నా ఈ స్థితికి యేడాది. కారు ముందుకెళ్తోంది. రాత్రి ఏడవుతోంది కదా ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతోంది. మైండ్ ఏం బాగా లేదు. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. జీవితానికి అర్థమేంటో తెలియడం లేదు. అది అంత సులభంగా అర్థం కాదు. అర్థమైతే అది జీవితం కాదు. అతని కోసం వెతికాను. అలసిపోయాను. నాకు తెలియకుండానే నా పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. నా ఈ దరిద్రాలన్నింటికీ ఈ ఉంగరమే కారణం. అలా అని ఈ ఉంగరం అంటే నాకు కోపం లేదు. ప్రేమ ఉంది. ఆ ప్రేమ సుజీ మీద. ఈ ఉంగరం సుజీకి ఎంతో ఇష్టం. నాకు సుజీ అంటే ఇష్టం. ఇప్పుడామె లేదు. ఈ ఉంగరం ఉంది. ఆమె మీద ప్రేమే ఇప్పుడు ఈ ఉంగరం మీదికి మళ్లింది. అయితే ఈ ఉంగరం నేనిచ్చింది కాదు. తనకు ఇంకెవరో ఇచ్చారు. అతని పేరేంటో నాకు తెలియదు. నేను సుజీని అడగలేదు. ఆమె చెప్పలేదు. ఒకసారి మాత్రం చర్చ వచ్చింది. మా ఊరి నుంచి దూరపు బంధువు ఒకతను ఇంటికొచ్చాడు. అతను బంగారు పని చేస్తాడు. నేను కుశల ప్రశ్నలన్నీ వేసి, అతిథి మర్యాదలన్నీ అయ్యాక అతను బయల్దేర డానికి రెడీ అయ్యాడు. నేను ఒక్క నిమిషం ఆగమని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆభరణాలన్నింటినీ తెచ్చి అతని చేతిలో పెట్టాను. కరిగించి అవసరమైతే ఇంకొంత బంగారం వేసి పాపకు గాజులు చేయమని చెప్పాను. వాటిల్లో విరిగిన కమ్మలు, ముక్కెరలు, పాపకు చిన్నప్పుడు బంధువులు పెట్టిన చిన్న చిన్న నగలు, తెగి పాడైపోయిన నా చైను ఇలా ఏవేవో ఉన్నాయి. వాటితోపాటు ఆ ఉంగరం కూడా ఉంది. నేను గమనించలేదు. సుజీ ఎప్పుడు చూసిందో నేరుగా వచ్చి ఆ ఉంగరం అడిగి వెనక్కి తీసుకుంది. మిగతావన్నీ తీసుకెళ్లండి అంది. అప్పుడడిగాను ఆమెను ‘ఏంటి ఆ ఉంగరం స్పెషల్’ అని. ఆమె కొంటెగా ముఖం పెట్టి ఊరిస్తూ ‘ఒక స్పెషల్ పర్సన్ ఇచ్చాడు.. వెరీ స్పెషల్..’ అంది. గతుక్కుమన్నాను. నిజమే. పెళ్లప్పుడు వాళ్లమ్మా వాళ్లు పెట్టిన నగల్లో కూడా ఇది లేదు. ఇది సమ్‌థింగ్ స్పెషలే. ఏమాత్రం దాపరికం లేకుండా అలా చెప్పడం నాకు నచ్చింది. అయితే ఎంతైనా మగ మనసు కదా కొంత ఇబ్బంది పడ్డాను. పైకి అదేమీ కనిపించకుండా ‘ఓహో.. అలాగా..’ అని కవర్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడూ దాని ప్రస్తావన మా మధ్య రాలేదు. ఆ అవసరమూ కలగలేదు. భౌతికంగా, మానసికంగా ఏ లోటూ లేకుండా నన్నూ, పాపను చూసుకుంటోంది సుజీ. అలాంటప్పుడు ఆమె గతంతో నాకేం పని. మళ్లీ ఒకసారి పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. కారు ముందుకెళ్తోంది. నిజానికి నేను ఈపాటికి ఈ పరిసరాలు వదిలేసి పారిపోవాల్సిన వాణ్ని. పాడు రోగం కరోనా సుజీని తీసుకెళ్లిపోయాక నాకు జీవితం మీద కోరిక చచ్చిపోయింది. నిత్యం ఏవో ఆలోచనలు. దిగులుగా గడపడం చూసి అత్తామామలు ఎటైనా కొద్దిరోజులు వెళ్లేసి రమ్మన్నారు. నేనూ తయారయ్యాను. ఎనిమిదో తరగతి చదువుతున్న పాప బాధ్యత వాళ్లకే వదిలేశాను. వద్దు వద్దు అంటున్నా వినకుండా నా లాకర్ చాబీ వాళ్ల పేరుతో మార్పించాను. ఆస్తుల కాగితాలు చేతుల్లో పెట్టాను. లక్షరూపాయల వరకు బ్యాంకు బ్యాలెన్సు ఉన్న ఏటీఎమ్ కార్డు ఒక్కటే నాకు తోడుగా పెట్టుకున్నాను. బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దుకుంటుంటే.. అప్పుడు కనబడింది ఉంగరం. దాన్ని చూసి దుఃఖ పడ్డాను. పెళ్లయిన కొత్తలో అది ఎప్పుడూ సుజీ చేతికే ఉండేది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత వేలికి పట్టడం లేదేమో తీసి బీరువాలో పెట్టేసింది. సర్దుతున్న బ్యాగును అక్కడే వదిలేసి వచ్చి హాల్లో కూర్చున్నాను. చేతిలో ఉంగరాన్నే చూస్తూ కుంగిపోయాను. అది పదే పదే సుజీని గుర్తు చేస్తోంది. అదే సమయంలో అది సుజీకి ఇచ్చిన వ్యక్తినీ గుర్తు చేస్తోంది. ఇప్పుడేం చేయాలి దీన్ని? ఎక్కడ పాతిపెట్టాలి? ఇలా వదిలేసి వెళ్తే తర్వాత ఏమవుతుంది ఇది? దీని వెనుక ఒక సున్నితమైన నా సుజీ హృదయం ఉందని ఎవరు గుర్తిస్తారు? అసలు ఎవరైనా ఎందుకు గుర్తించాలి? దీని రూపం ఇకముందు కూడా ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఉంగరానికి ముందు ఈ లోహం రూపం ఏంటి? అంతకుముందు కూడా ఎవరైనా దీన్ని ఒక బహుమతిగా ఇచ్చి ఉంటారా? అసలు ఈ భూమ్మీద ఒకర్నొకరు బహుమతులుగా ఇచ్చుకున్న వస్తువులన్నీ వారి మరణానంతరం ఏమవుతున్నాయి? ఒక తాజ్‌మహల్‌ని గుర్తించినట్టు ప్రతి వస్తువునూ గుర్తించడం అందరికీ సాధ్యం కాదు కదా. ఈ భూమి కూడా ఇంకెవరికైనా బహుమతిగా ఇచ్చి ఉంటే ఏర్పడిందా? అసలు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మార్కెట్ సంస్కృతి అంటారు కదా కమ్యూనిస్టులు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? రకరకాల పిచ్చి ఆలోచనలు కాల్చుకు తింటుంటే చిక్కి సగమైపోయాను. ఎప్పుడో కానీ ముట్టని మందుకు పూర్తిగా అలవాటయ్యాను. ఇంటికే తెచ్చుకుని తాగుతూ గడుపుతున్నాను. అసలు నా బాధేంటో నాకే తెలియడం లేదు. జీవితంలోని ఒక అస్పష్టత ఏదో నన్ను వెంటాడుతోంది. అస్పష్టత కూడా ఒక బాధే అని ఇప్పుడే అర్థమవుతోంది. ఇవన్నీ కాదు.. ముందు ఈ ఉంగరానికి ఒక సమాధానం వెతకాలి. ఆ సమాధానం నాకు సంతృప్తినివ్వాలి. బాగా మథనపడ్డాక ఒక ఆలోచన తట్టింది. అసలు సుజీకి ఇది ఇచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని కలిస్తే ఎలా ఉంటుంది? బావుంటుంది... తప్పకుండా ఈ ఉంగరాన్ని అతనికిచ్చేయాలి. అతని సొమ్మును అతని దగ్గరికి చేర్చాలి. నువ్వు గుర్తుగా ఇచ్చిన ఈ ఉంగరంగల అమ్మాయి ఇప్పుడు ఈ భూమ్మీద లేదని చెప్పాలి. అప్పుడు వాడి కళ్లలో ఏమాత్రం బాధ మిగిలిందో నేను చూడాలి. అప్పుడది ఒక పిచ్చి ఆలోచన అని నాకు తెలియదు. అదే పరిష్కారం అని నమ్మాను. ఉంగరాన్ని జేబులో పెట్టుకున్నాను.అతని కోసం తిరగడం మొదలుపెట్టాను. ఎక్కడెక్కడో వెతికాను. నేరుగా సుజీ తల్లిదండ్రుల దగ్గరికెళ్లి అడిగాను. వాళ్లు నా వైపు అనుమానంగా చూశారు కానీ ఏ హింటూ ఇవ్వలేదు. లాభం లేదని వచ్చేశాను. సుజీ చిన్ననాటి స్నేహితులను కలిశాను. వాళ్లూ ఏమీ చెప్పలేదు. సుజీ సెల్‌ఫోన్ డేటా అంతా తీశాను. లాభం లేదు. ఫేస్బుక్ అకౌంటు ఉంది. కానీ దాన్ని ఆమె ఏరోజూ వాడలేదు. కనీసం అప్పుడప్పుడు కూడా ఆమె ఆ స్పెషల్ పర్సన్‌తో టచ్‌లో లేదని అర్థమైంది. అసలు టచ్‌లోనే లేకుండా పోయిన వ్యక్తితో ఇప్పుడు నాకేం పని? అతని భావోద్వేగాలతో నాకేంటి ఉపయోగం? అంతా గందరగోళం. మరింత అస్పష్టతలోకి కూరుకుపోయాను. అసలు అతను బతికే ఉంటాడని ఏంటి నమ్మకం? మొన్నటి కరోనాలో సుజీ మాదిరే ఏ ఆస్పత్రిలోనో చనిపోయి ఉంటాడా? మరెలా పట్టుకోవడం అతణ్ని? ఇక వెతకడం మానేశాను. బోర్కొట్టేస్తోంది. ఇల్లంతా శూన్యం. శవం కుళ్లిన వాసన. ఇంట్లో ఉండలేపోతున్నాను. ఒకసారి కళ్లు తిరిగి పడిపోతే ఎప్పుడో మరుసటి రోజు ఉదయం పనిమనిషి వచ్చి చూసి మా అత్తామామలకు చెప్పింది. వాళ్లు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘పర్వాలేదు. ఇప్పుడే అయితే పోడు కానీ పోయినంత పని చేస్తుంటాడు. కనిపెట్టుకుని ఉండాలి’ అని డాక్టర్ సూచించాడు. మా అమ్మానాన్నలు ఎక్కడో ఊళ్లో ఉంటారు. వాళ్లకు ఏ విషయం తెలియనివ్వను కాబట్టి వాళ్లు సుఖంగానే ఉన్నారని నా నమ్మకం. వారి సుఖాన్ని భంగం చేస్తానని ఒకసారి అత్తామామలు అంటే ఇంతెత్తు ఎగిరాను. తర్వాత వాళ్లు ఆ ప్రయత్నం ఆపేశారు. ‘నన్ను వదిలేయండి. నా బిడ్డను చూసుకోండి’ అంటూ ఏడ్చాను. నన్నూ వాళ్లు ఓ బిడ్డలా చూసుకోవడానికి రెడీ అయ్యారు. ఎక్కడికైనా కొంతకాలం వెళ్లడానికి సిద్ధమైన వాణ్ని ఎందుకు ఆగిపోయానో వారికి తెలియదు. నేను మళ్లీ ఒకసారి పై జేబును తడుముకున్నాను. భద్రంగా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం తగిలింది. కారు ముందుకెళ్తోంది.. చెప్పాను కదా. ఇంట్లో ఒక్కణ్నే మందు కొట్టి ఉండాలంటే రాను రాను భయంగా ఉంటోంది. అది భయం కాదు ఒంటరితనం అని తర్వాత అర్థమైంది. అందుకే ఎందుకో టక్కున నా చిన్ననాటి మిత్రుడు ప్రతాప్గాడికి ఫోన్ చేశాను. ‘అబ్బా.. కరెక్టు టైమ్‌కి చేశావురా. పంజాగుట్ట బార్లో ఉన్నాను వచ్చేయ్..’ అని లొకేషన్ షేర్ చేశాడు. ఇప్పుడు దాన్ని పట్టుకుని బయల్దేరాను. ప్రతాప్గాడితో మాట్లాడితే మనసు హాయిగా ఉంటుది. సుజీ లేకుండా పోయాక నేను బాగా డిస్టర్బ్ అయ్యానని తెలుసు వాడికి. కానీ అంతకన్నా ఎక్కువగా ఈ ఉంగరం వల్ల డిస్టర్బ్ అవుతున్నానని మాత్రం వాడికి తెలియదు. ఏదో సరదాగా నాలుగు జోకులు వేస్తాడు. నవ్విస్తాడు. వాడితో కంపెనీ లేక చాలా కాలం అయింది. అందుకే వాడ్నే ఊహించుకుంటూ నేరుగా కారును తీసుకెళ్లి పార్కింగ్‌లో పెట్టాను. బారు లోపల సందడిగా ఉంది. సిగరెట్ల పొగ నిండుకుని ఉంది. మనుషులు మసక మసగ్గా కనిపిస్తున్నారు. ఎదురుగా చూరుకు వేలాడుతున్న పెద్ద ఎల్ఈడీ టీవీలో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా లోగొంతుతో వస్తోంది. ప్రతాప్‌గాడి కోసం వెతికాను. వాడు ఎడమ వైపు కార్నర్ సీటులో కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే పోల్చుకుని చేయి ఊపాడు. నేనూ ఊపాను. వాడు సోఫావైపు కూర్చుని ఉన్నాడు. పక్కకు జరిగి నాకోసం స్థలం చూపించాడు. ‘ఏం రా.. అంత బక్కగా అయ్యావ్?’ అన్నాడు నన్ను చూస్తూనే. నేను నవ్వుతూ పక్కన కూర్చున్నాను. ఎదురుగా అతని స్నేహితుడు ఎవరో కూర్చుని ఉన్నాడు. బొద్దుగా ఉన్నాడు. చామన ఛాయ. లావు బుగ్గలు. షేవ్ చేసిన గడ్డం, నుదిటికి పైన పల్చబడ్డ జుట్టు. అతన్ని పరిశీలించేంతలోనే అతను చేయి చాపి ఏదో పేరు చెప్పాడు. నేనూ పేరు చెప్పి షేక్‌హ్యాండ్ ఇచ్చాను. ఇంతలో ప్రతాప్‌గాడు బేరర్ని పిలిచి బీర్ చెప్పాడు. నాకు బ్రాండ్ పట్టింపేమీ లేదని వాడికి తెలుసు. బేరర్ అలా వెళ్లి ఇలా గ్లాసు, బీరు బాటిల్‌తో వచ్చాడు. నంచుకోవడానికి టేబుల్ మీద చుడువా లాంటిదేదో ఉంది. ఎదురుగా ఉన్నతను సిగరెట్టు పొగ వదుల్తున్నాడు. ‘నువ్వేదో నీ ఫ్రెండుతో వస్తే నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టానేమో కదరా..’ అన్నాను మొహమాటంగా. ప్రతాప్‌గాడు నవ్వాడు. ‘భలేవాడివోయ్. నువ్వెంతో ఇతనూ అంతే నాకు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం. అలా ఎవరూ ఇబ్బంది పడరు. నువ్వూ ఇబ్బంది పడకు. ఫీల్ఫ్రీ’ అన్నాడు. బేరర్ బీర్‌ని పద్ధతిగా గ్లాసులోకి వొంపాడు. వెంటనే చీర్స్చెప్పి ఒక గుక్క సిప్ చేశాను. చల్లటి బీర్ గొంతులోకి దిగేసరికి మైండ్‌లో ఉన్న స్ట్రెస్ ఏదో తగ్గుతున్న ఫీలింగ్ కలిగింది. మౌనంగా ఉన్నాను. అప్పటికే వారి మధ్య ఏదో టాపిక్ నడుస్తున్నట్టుంది. ‘సో.. అలా అయింది. ఇదిగో వీడొచ్చినాడుగా వీడిక్కూడా తెలుసు’ అన్నాడు ప్రతాప్‌గాడు నా వైపు చేయి చూపిస్తూ. దేని గురించి చెబుతున్నాడో అర్థంకాక నేను ముఖం ముడిచాను. ‘అదేరా బావ కూతురు నా మరదలు గురించి..’ అన్నాడు వాడు. విషయం అర్థమై నేను ముఖాన్ని నార్మల్‌గా పెట్టాను. నాకు ఎక్కువ మాట్లాడాలనిపించడం లేదు. కేవలం వాళ్లేదన్నా మాట్లాడుకుంటుంటే వినాలనుంది. కానీ ఈ బావ కూతురు విషయం తీసేసరికి నా ఆలోచనలు అటు పరిగెత్తాయి. ప్రతాప్‌గాడు, నేను టెన్త్ కలిసే చదువుకున్నాం. వీడితో పాటు వీడి బావ కూతురు కూడా చదువుతూండింది. ఆ పిల్లంటే వీడికి అప్పటి నుంచే ఇష్టం. ఎప్పుడూ ఆ పిల్లకోసం ఏవేవో తినుబండారాలు తెచ్చి కంపాస్ బాక్సులో దాచుకునేవాడు. ఆ పిల్ల కూడా ఇంట్లో వండినవన్నీ తెచ్చి ‘అక్క ఇమ్మంది’ అంటూ ఇస్తుండేది. నిజానికి వాళ్లమ్మ వీడికేం సొంత అక్క కాదు. వాళ్లు రెడ్లు.. వీడూ రెడ్డే కాబట్టి ఏవేవో వాడికి వాడే వరుసలు కలుపుకుని చాలాసేపు లెక్కలు వేసి తర్వాత ఆ పిల్ల నాన్న తనకు బావ అవుతాడని చెప్పాడు ఒక రోజు. ఇక ఆ పొద్దునుంచి వాణ్ని మేము విపరీతంగా ఏడిపించడం మొదలుపెట్టాం. ‘ఓహో.. నీ బావ కూతురేది?’ అంటుండేవాళ్లం. అవసరమున్నా లేకపోయినా మాటకు ముందు.. మాటకు తర్వాత ‘బావ కూతురు.. బావ కూతురు’ అంటూ ఏడిపిస్తూ ఉండేవాళ్లం. వాడు చెబుతున్నదాన్ని బట్టి వీళ్దిద్దరి మధ్య ఏదో ప్రేమ టాపిక్ నడుస్తోందని అనుకున్నాను. అదే నిజమైంది. అతను కాల్చేసిన సిగరెట్టును యాష్‌ట్రేలో పడేసి ‘ఏం బాస్.. నీకు లేవా ప్రేమ కథలూ..’ అన్నాడు చిర్నవ్వు చిందిస్తూ. నేను తేరుకుని ‘అబ్బే లేవు’ అంటుంటే ప్రతాప్‌గాడు ఊరుకోలేదు. నాకు తెలుసు వాడు ఊరుకోడని. అదే క్లాసులో ఈడిగోళ్ల పిల్ల లక్ష్మీ ప్రియ ఉండేది. ఆ పిల్ల వెంటే ఊరికే తిరిగే వాణ్ని. అందరికీ గాళ్‌ఫ్రెండ్స్ ఉంటే నాకూ ఉండాలి కదా అని తిరిగేవాణ్ని. అందులో ఏమీ స్పెషాల్టీ లేదు. ఎంత చెప్పినా ప్రతాప్‌గాడి బ్యాచ్‌కి ఎక్కి చావదు. ఈ విషయంలో వాడికీ నాకూ ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఇప్పుడు కూడా వాడు అదేదో పెద్ద విషయం అన్నట్టు గుర్తు చేస్తుండేసరికి చిరాగ్గా చూశాను. వాడికి అర్థమైంది నా మూడ్ బాగాలేదని. ‘వాడేదో టెన్షన్ లో ఉన్నాడు.. నీ సంగతి తేల్చు’ అన్నాడు అతని వైపు చూస్తూ. బంతి అతని కోర్టులో పడేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను. అతను చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను, సుజాత ఇంటర్మీడియెట్‌లో ఉండగా కలిశాం.’ మొదటి మాటతోనే అటెన్షన్ లోకి వెళ్లాను. ‘ఇంటర్ తర్వాత సుజాత నర్సింగ్ కోసం హైదరాబాద్ చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేది. నన్ను మా నాన్న కడపలో డిగ్రీలో చేర్చాడు. నాకు అక్కడ డిగ్రీ నచ్చడం లేదు. చదువుకోవడం ఇష్టం లేదని ఉద్యోగం చేస్తానని చెప్పి ఆ కొద్ది పాటి క్వాలిఫికేషన్ తోనే హైదరాబాద్ వచ్చేశాను. షాపూర్లో మా అత్తామామలుంటే చదువుకుంటూ రోజూ సుజాతను కలిసేవాణ్ని’. నాకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. బీర్ పట్టుకున్న చేయి వణుకుతోంది. బీర్‌గ్లాస్ కింద పెట్టేశాను. జ్వరం కాస్తోంది. ఒళ్లు కాలుతున్న సంగతి నాకు తెలుస్తోంది. చెమట్లు పడుతున్నాయి. అతను చెబుతున్నదంతా సుజీ గురించే... అవును నా సుజీ గురించే. సుజీ నర్సింగ్ చేసింది. ఇంకా అతనేం చెబుతాడో అని బీర్ సంగతి మర్చిపోయి అతని ముఖం వైపే చూస్తున్నాను. ‘హాస్టల్లో ఆమెకు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వదిలేవాళ్లు కాదు. బయటికెళ్తే లోపలికి అనుమతించేవాళ్లు కాదు. అనేక సంజాయిషీలు ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత ఆమె నన్ను చూడకుండా ఉండలేకపోయేది. హాస్టల్లో అనేక గొడవలు. వాళ్లు సుజాత అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్లకు విషయమంతా తెలిసిపోయింది. ఇంటర్మీడియెట్‌లో ఉండగానే నాకు వాళ్లు ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లు అనుమానంతో మా ఇంటి దగ్గర విచారిస్తే పిల్లోడు హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారట. వాళ్ల అనుమానం బలపడింది. అంతే సుజాతను నర్సింగ్ మాన్పించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే ఒకటే సంతృప్తి. నేను సుజాతకు గుర్తుగా ఉంగరాన్ని ఇచ్చాను. ఆమె అప్పట్లోనే తాను దాచుకున్న డబ్బులతో ఇక్కడే పంజగుట్టలో నాకు ఒక టైటాన్ వాచీ ఇప్పించింది. అది మొన్నటి దాక నా దగ్గరే ఉండేది. తర్వాత పాడైపోతే పక్కన పడేశాను.’ అతను ఇంకా ఏదో చెబుతున్నాడు. నాకేమీ వినపడలేదు. సీట్లోంచి టక్కున లేచాను. సరాసరి అక్కడ్నుంచి వచ్చేశాను. వెనుక నుంచి ప్రతాప్‌గాడు ‘ఒరేయ్..ఒరేయ్’ అని అరుస్తున్నాడు. నేను బార్ బయటికొచ్చి కారు తీసి రయ్యిన టాంక్బండ్ వైపు ఉరికించాను. అక్కడ సైడుకు ఆపి సిమెంటు బెంచిపై కూర్చున్నాను. వాన పడేట్టుంది. మట్టివాసన ముక్కులకు తాకుతోంది. వాతావరణంలోని మార్పు నా మనోభారాన్ని ఏమాత్రం తగ్గించేలా లేదు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత మోసం? ఈ అత్తా మామలది ఎంత దుర్మార్గం? అంతా తెలిసి కూడా ఒక్క మాట నాకు చెప్పలేదు. కనీసం మొన్న అడిగినప్పుడు కూడా ఉలకలేదు పలకలేదు. వాళ్లను నమ్మి నా ఆస్తులు అప్పగించాను. నా బిడ్డను అప్పగించాను. సుజీ కళ్లలో తిరిగింది. గుండెల్లో ఇంత వ్యథను పెట్టుకుని కూడా సుజీ నన్నంతలా ఎలా ప్రేమించగలిగింది! ఇది ఒక్క తనకే సాధ్యమా? లేక ఆడవాళ్లంతా అంతేనా? ‘సుజీ ఐ లవ్యూ, నువ్వు నాకు పెళ్లానివి కాదు అమ్మవి..’ ఆలోచనలతో కళ్లు వరదలవుతుంటే చెంపలు తడిసిపోతున్నాయి. కాసేపటికి స్థిమితపడి ఇంటికి బయల్దేరడానికి లేచాను. రోడ్డుమీద ఎవరో ఎర్రగౌను పాప.. ట్రాఫిక్‌లో నాన్న నడుపుతున్న స్కూటీపై వెనక కూర్చుని ‘గాజుపెట్టెలోని తాజ్‌మహల్ బొమ్మ’ను జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని ఉంది. నేను నాకు తెలియకుండానే ఒకసారి పై జేబును తడుముకున్నాను. చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లో భద్రంగా ఉంచిన నీలం రంగు రాయి ఉంగరం చేతికి తగిలింది. ఇప్పుడు పెద్దగా ఆలోచన లేకుండానే నాకు సమాధానం తట్టింది. ఇప్పుడు ఈ ఉంగరం నాది. అవును అతనెవరో తన ప్రియురాలికి ఇది గుర్తుగా ఇచ్చి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు నా భార్య తనకెంతో ఇష్టమైన దీన్ని నాకు గుర్తుగా వదిలి వెళ్లింది. ఇప్పుడిది నాదే. ఎవరొచ్చినా ఇచ్చేది లేదు. ఇది నాదే. నా మనసు తీర్మానించుకుంది. మబ్బు వీడినట్టుంది దూరంగా ఆకాశంలో ఏదో తార తొంగిచూస్తోంది. కారు తీసి ఇంటి వైపు మళ్లించాను. కారు ముందుకు ఉరుకుతోంది. - వేంపల్లె షరీఫ్ -
పిల్లల కథ: ఆనందమాత
శంకర్ మంచి బొమ్మలు చేసే కళాకారుడు. ఎన్ని బొమ్మలు చేసినా అతని ఆదాయం అంతంత మాత్రమే! అతను చెక్కతో, మట్టితో, లోహంతో బొమ్మలు చేయగలడు. ఒకరోజు ఇంటి ఖర్చుల కోసం డబ్బు అప్పు అడగటానికి తన స్నేహితుడు మహీపతి దగ్గరకు వెళ్లాడు. ‘ఎందుకు అలా డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నావు? నీ చేతిలో కళ ఉంది. తెలివిగా ఉపయోగిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది కదా’ అన్నాడు మహీపతి. ‘కళ అయితే ఉంది అయినా దానిని ఆదరించే వారెవరు? నా బొమ్మలు ఎవరూ కొనడంలేదు’ దిగులుగా చెప్పాడు శంకర్. ‘ప్రస్తుతానికి నీ అవసరానికి డబ్బు ఇస్తానులే. అయితే ఓ రోజు మాపిల్య చెట్టు కొమ్మతో నువ్వు ఓ బొమ్మను తయారు చేయడం చూశాను. మాపిల్య చెట్టు కొంత అరుదైన చెట్టే. శ్రద్ధ తీసుకుని పెంచితే మన భూముల్లోనూ చక్కగా పెరుగుతుంది. నీ బాగు కోరే వాడిగా నేను నా ఎకరం పొలంలో మాపిల్య చెట్లు పెడతాను. అవి రెండేళ్ళలోనే పూర్తిగా పెరుగుతాయి. ఈలోపల అడవిలో దొరికే మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు తయారు చెయ్యి. ఎలాంటి బొమ్మలు చేయాలో, ఆ బొమ్మల్ని ఎలా అమ్ముకోవాలో నేను చెబుతాను’ అని సలహా ఇచ్చాడు మహీపతి. ‘ఏమిటో మహీపతి నువ్వు చెప్పేదంతా నాకు విచిత్రంగా కనబడుతోంది. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ చిరునవ్వుతో చెప్పాడు శంకర్. రెండురోజుల తరువాత మహీపతి.. మాపిల్య చెట్టు కొమ్మతో తన సృజనాత్మకతను ఉపయోగించి ఓ కొత్త దేవత బొమ్మను తయారు చేయమని శంకర్‌కు చెప్పాడు. మహీపతి చెప్పినట్టుగానే తన సృజనను ఉపయోగించి చక్కని కొత్త దేవత ప్రతిమను చెక్కాడు. చూసి అబ్బురపడ్డాడు మహీపతి. ఆ బొమ్మకు ‘ఆనంద మాత’ అని పేరు పెట్టాడు. శంకర్ ఆశ్చర్య పోయి ‘ఈ బొమ్మను ఏంచేస్తావు?’ అని అడిగాడు. ‘అచ్చం ఇటువంటివే పది బొమ్మలు మాపిల్య చెట్టు కొమ్మతో తయారు చేయి. ఏం చేయాలో చెబుతా’ అన్నాడు. మహీపతి చెప్పినట్టే అటువంటి పది బొమ్మలను తయారు చేశాడు శంకర్. ఆ బొమ్మలను మహీపతి తీసుకెళ్ళి తన అంగట్లో, తనకు తెలిసిన వాళ్ళ అంగళ్ళలో పెట్టి ‘ఈ దేవత ఆనంద దేవత.. ఈ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వారికి అన్నీ కలసి వస్తాయి’ అని చెప్పసాగాడు. అంతే ఆ విషయం ఊరంతా పాకింది. ప్రతి వ్యాపారస్తుడు, కొందరు గృహస్తులు ఆ బొమ్మలను కొనాలని ఎక్కడ దొరుకుతాయో అడగసాగారు. ఆవిధంగా శంకర్‌కు చేతినిండా పని, తద్వారా డబ్బూ లభించసాగాయి. కేవలం శంకర్ బాగుపడటమే కాక, చాలామంది రైతులూ లాభపడ్డం మొదలెట్టారు.. పొలం గట్ల మీద మాపిల్య చెట్లు పెంచి వాటి కొమ్మలను అమ్ముతూ. మహీపతి తెలివైన ఆలోచన స్నేహితుడు శంకర్‌ను బాగుపరచడమే కాకుండా రైతులకూ మేలు చేసింది! మరి కొంతమంది మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు చేయడం నేర్చుకోడానికి శంకర్ వద్ద శిష్యులుగా చేరారు. నిజానికి ఆ బొమ్మతో ఏ మేలు జరగక పోయినా ఆ బొమ్మ పెట్టుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం పెరిగి సమర్థవంతంగా వారి వ్యాపారాలు, పనులు నిర్వహించుకోసాగారు. (క్లిక్: మాష్టారి పాఠం.. పదును పెట్టకపోతే వృథా పోవలసిందే) -
పిల్లల కథ: మాష్టారి పాఠం
రామసాగరమనే ఊరిలో పిల్లలు చాలా ఆకతాయిలు. ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఉండడం వలన అక్కడ ఎక్కువ జాలరుల కుటుంబాలే నివసించేవి. అక్కడి పిల్లలకు ఆ సముద్రమే ప్రపంచం. రోజంతా ఆ సాగర తీరంలో ఆటలాడుతూ, ఈతలు కొడుతూ గడిపేసేవారు. ఆ పిల్లల తల్లితండ్రులకేమో ఆ పిల్లలకు బాగా చదువు చెప్పించి గొప్పవాళ్లను చేయాలని ఉండేది. పిల్లలు తెలివిగల వారే గాని చదువు మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాంతో బడికి పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయేది. ఆ ఊరి పాఠశాలకు గణపతి మాష్టారు కొత్తగా వచ్చారు. ఎప్పటిలాగే పిల్లలు బడికి వచ్చి కాసేపు ఉండి ఆటలకు వెళ్లిపోయారు. ఒక వారం పాటు గణపతి మాష్టారు అక్కడి పిల్లలను గమనించారు. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించి దారిలోకి తీసుకురావాలని ఆయనకు అర్థమయింది. బడిలో పిల్లలందరినీ చేరదీసి ఆటల రూపంలోనే ఆ రోజు పాఠం చెప్పేవారు. ఆటల మీద మక్కువతో పిల్లలు నెమ్మదిగా బడిలో ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ల తరువాత తరగతిగదిలో కూర్చోబెట్టి కథల రూపంలో పాఠాలు చెప్పేవారు. మాష్టారి కథలకు పిల్లలు చెవులప్పగించేవారు. నెల తిరిగేసరికి పిల్లలంతా ఉదయం నుండి సాయంకాలం వరకు బడిలో గడపడానికి అలవాటుపడ్డారు. ఒక రోజు మాష్టారు పాఠం చెప్తుండగా ఒక గడుగ్గాయి నిలబడి ‘మాష్టారూ! మొన్న మీరు చెప్పిన పాఠంలో.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బిపోయి అనారోగ్యం పాలవుతామని చెప్పారు కదా! మరి ఇంత ఎక్కువ చదువుతూ ఉంటే మెదడు కూడా ఉబ్బిపోయే ప్రమాదం ఉండదా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాష్టారు కూడా నవ్వుతూ ‘అవునవును.. సరైన ప్రశ్నే అడిగావు. మన కడుపుకి తగినంత తింటాం అలాగే మెదడులో స్థలం ఉన్నంతే నేర్చుకోవాలి. మనకి పొట్టలో ఎంత ఖాళీ ఉందో తెలుస్తుంది కనుక పట్టినంత తింటాం. మరి మెదడులో ఖాళీ ఎంతుందో తెలిస్తేనే కదా అంత చదువు చదువుకోగలం! తెలుసుకుందామా మరి!’ అని అడిగారు. పిల్లలంతా ‘తెలుసుకుందాం’ అన్నారు ముక్తకంఠంతో. ‘రేపటి నుండి రోజూ బడి తరువాత మీకు ఇష్టమైన సముద్రం వద్దకు వెళ్ళి సముద్రం నిండే వరకు నీళ్లు తీసుకెళ్లి పోయండి. ఎన్ని నీళ్లు పోస్తే అది నిండిందో నాకు చెప్పండి’ అన్నారు మాష్టారు. మరుసటి రోజు నుండి పిల్లలందరూ ఒకొక్కరు ఒకొక్క బిందెతో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోయసాగారు. వాళ్ళు పోసిన నీళ్లతో సముద్రం కొంచెం కూడా నిండినట్టు కనపడలేదు. ఒక రోజులో నిండటం సాధ్యం కాదులే అనుకుని ఒక వారం దాటాక చూద్దాం అనుకున్నారు. వారం దాటినా అదే పరిస్థితి కనిపించింది. వారు పొసే నీరు తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని గ్రహించి అందరి ఇళ్లల్లోని కుళాయిల నుండి నేరుగా గొట్టాల ద్వారా నీరు సముద్రంలోనికి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నుండి మర్నాటి ఉదయం తాము నిద్ర లేచేసరికల్లా సముద్రం నిండిపోతుందని ఊహించి ఆ రాత్రి పడుకున్నారు. మర్నాడు ఉదయమే లేచి సాగరతీరానికి చేరుకున్నారు. ఎప్పటిలాగే ఉన్న సముద్రాన్ని చూసేసరికి తమది వృథా ప్రయత్నమని వారికి అర్థమయ్యింది. పిల్లలంతా కలిసి మాష్టారు వద్దకు వెళ్లి సముద్రాన్ని నింపడం తమ వల్ల కావడంలేదని చెప్పారు. ‘సముద్రంలాగే మానవ మేధ కూడా అనంతమైనది. మీరు ఎంత నేర్చుకున్నా గ్రహించుకోగల శక్తి మీ మెదడుకి ఉంటుంది. అలాగే విద్య కూడా అనంతమైనది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది. సముద్రంలోని ఉప్పునీరు తాగటానికి పనికిరాదు. అలాగే విద్య లేని మేధస్సు కూడా వృథాయే! ఎంత గొప్పవారైనా నిరంతర విద్యార్థిగా ఉంటూ మేధకు పదును పెట్టకపోతే ఉప్పునీటిలా వృథా పోవలసిందే’ అని చెప్పారు మాష్టారు. ‘ఇక పై బాగా చదువుకుందాం’ అని పిల్లలు వారిలో వారు గుసగుసలాడుకోవడం విని సంతోషపడ్డారు మాష్టారు. (క్లిక్: తన వంతు సాయం.. గుప్తదానమే మహాదానం) -
పిల్లల కథ: తన వంతు సాయం
గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది. వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు. ‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు. ‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు. ‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు శశిధరుడు. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు చరితాత్ముడు. ‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు. ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు. శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!) -
Crime Story: కిలో 70 తులాల బంగారం.. బెడిసి కొట్టిన ప్లాన్.. ఆఖరికి!
‘సార్ బంగారం మీద లోను కావాలి’ అంటూ కో ఆపరేటివ్ బ్యాంకులోని ఫీల్డ్ ఆఫీసర్ ముందు ఒక బ్యాగ్ పెట్టాడు కస్టమర్. ‘బంగారం ఇమ్మంటే సంచీ పెట్టావేంటి?’ అడిగాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘అందులో బంగారమే ఉంది’ ఫీల్డ్ ఆఫీసర్ వైపు చూస్తూ అన్నాడు కస్టమర్. ‘ఇంత బంగారమా? మీరు నగల కొట్టుకు వెళ్ళాల్సింది పోయి బ్యాంకుకు వచ్చినట్టున్నారు’ ఆశ్చర్యపోతూ అన్నాడు ఆఫీసర్. ‘బంగారం అమ్మటానికి రాలేదు సార్.. తాకట్టు పెట్టడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఎంత కావాలి?’ మాట నొక్కుతూ అన్నాడు. ‘ముప్పై లక్షలు’ చెప్పాడు. ‘ముప్పై లక్షలా? అంత డబ్బు ఈ బ్యాంకులో ఇవ్వరు’ ముఖం అదోలా పెట్టి అన్నాడు. ‘ఆ మాటేదో మీ మేనేజరు చెప్పాలి’ మేనేజరు రూమ్ వైపు చూస్తూ అన్నాడు. ‘మేనేజరు చెప్పినా.. నేను చెప్పినా ఒకటే. ఈ బంగారం తీసుకుపొండి’ అంటూ కస్టమరుకి బ్యాగు ఇవ్వబోయాడు. ‘మీ మేనేజరుని అడిగొస్తాను’ అంటూ మేనేజర్ గదిలోకి వెళ్ళాడు కస్టమర్. ‘ఏం కావాలి? అడిగాడు మేనేజర్. ‘బంగారం మీద డబ్బు ఇమ్మంటే ఫీల్డ్ ఆఫీసర్ ఇవ్వట్లేదు’ చెప్పాడు. ఆ మాట వినగానే ఓసారి తన క్యాబిన్‌కు రమ్మని ఫీల్డ్ ఆఫీసర్‌కి ఫోన్ చేశాడు మేనేజర్. ఫీల్డ్ ఆఫీరసర్ వచ్చీరావడంతోనే ‘బంగరం మీద లోన్ ఇవ్వనన్నారట’ అడిగాడు మేనేజర్. ‘అవును సర్. అతను అడిగింది లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకంగా ముప్పై లక్షలు. అంత డబ్బు ఎలా ఇస్తాం సర్?’ తన మాట వినకుండా మేనేజర్ని కలిశాడని కస్టమర్ మీద అప్పటికే కొంత అసహనం ఉంది ఫీల్డ్ ఆఫీసర్‌కి. ‘మూర్తిగారూ.. ఇది మార్చి నెల. మన టార్గెట్స్ మనకుంటాయి. డిపాజిట్స్ సేకరించడమే కాదు. ఆ డబ్బు మళ్ళీ లోన్స్ రూపంలో కస్టమర్స్‌కి చేరినప్పుడే బ్యాంకు లాభాలతో నడిచేది. మీకు తెలుసు కదా.. మన బ్రాంచ్కున్న టార్గెట్స్ గురించి! బిజినెస్ విషయంలో మన బ్రాంచ్ ఇప్పటికే వెనకబడి ఉంది. ఈ లోనే కాదు. ముప్పై లక్షల లోపు గోల్డ్ లోన్స్ మరో రెండు మూడు ఇవ్వండి పర్లేదు’ అన్నాడు మేనేజర్. సరే అన్నట్టుగా తలూపుతూ కస్టమర్ వైపు అదోలా చూసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ మేనేజర్‌కి థ్యాంక్స్ చెప్పి కౌంటరు వైపు నడిచాడు కస్టమర్. అప్పటికే బంగారాన్ని రుద్ది మదింపు చేసి వెయిట్ చూశాడు గోల్డ్ అప్రయిజర్. ‘వంద తులాల నిఖార్సయిన బంగారం సార్’ ఫీల్డ్ ఆఫీసర్‌తో చెప్పాడు అప్రయిజర్. అరగంట తర్వాత ముప్పై లక్షలు కస్టమర్ చేతికిస్తూ ‘వడ్డీ నెల నెలా కట్టేయాలి. కట్టకపోతే సంవత్సరం చివర్లో బంగారం వేలం వేసేస్తాం’ చిరాగ్గా చెప్పాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘ఎప్పుడు ఏది కట్టాలో మాకు తెలుసండి. మీరు చెప్పేదాక తెచ్చుకోం’ అంటూ డబ్బు బ్యాగులో వేసుకుని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు కస్టమర్. ఆలోపే ఏజీఎం నుంచి ఫోన్ మేనేజర్‌కు.. ‘మీ టార్గెట్ ఇంకా కోటి రూపాయలు మిగిలే ఉంది. ఎలా పూర్తి చేస్తారో నాకు తెలీదు. నెలాఖరు లోపు టార్గెట్ పూర్తి చేయాలి’ అంటూ. ∙∙ ఇరవై రోజుల తర్వాత మరో కస్టమర్ బంగారం మీద లోన్ కావాలని బ్యాంక్ మేనేజర్ దగ్గర కొచ్చాడు. సమయానికి నాకోసమే వచ్చాడని మనసులో అనుకుంటూ ‘ఎంత కావాల’ని కస్టమర్‌ని అడిగాడు మేనేజర్. ‘ఇరవై లక్షలు’ అనగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు మేనేజర్. వెంటనే కస్టమర్‌ని ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు పంపించాడు మేనేజర్. కస్టమర్ తెచ్చిన డెబ్బై తులాల బంగారాన్ని అప్రయిజర్‌తో చెక్ చేయించి, ఫార్మాలిటీస్ పూర్తిచేసి కస్టమర్‌కు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘పచ్చ నోట్లు తళ తళ మెరిసిపోతున్నాయి అచ్చం బంగారంలాగే’ నవ్వుకుంటూ డబ్బు అందుకుని కళ్ళకద్దుకున్నాడు కస్టమర్. ‘వస్తాను సార్’ బ్యాంక్ మేనేజరుకూ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు కస్టమర్. ∙∙ సాయంత్రం ఆరయింది. స్టాఫ్ తప్ప బ్యాంకులో జనం లేరు. మేనేజర్ ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నాడు. ఫీల్డ్ ఆఫీసర్ కంప్యూటర్ ముందు బిజీగా ఉన్నాడు. గ్రిల్ గేటు లోపల సెక్యూరిటీ గార్డ్ నుంచుని ఉన్నాడు. బ్యాంకు ఉన్న ప్రాంతం బాగా బిజీ సెంటర్. జనంతో ఎప్పుడూ కిట కిటలాడుతుంటుంది. ఇంతలో ఓ కారొచ్చి బ్యాంకు ముందు ఆగింది. ఇద్దరు వ్యక్తులు కారులోంచి దిగి బ్యాంకు వైపు నడిచారు. ‘ఎవరు కావాలి?’ అంటూ వాళ్లను గ్రిల్ గేట్ దగ్గర ఆపాడు సెక్యూరిటీ గార్డ్. ‘మేనేజర్ని కలవాలి’ చెప్పాడు అందులో ఒకడు. ‘ఈటైమ్‌లో కలవడం కుదరదు. మేనేజర్ బిజీగా ఉన్నారు. ఇంతకీ అపాయింట్మెంట్ ఉందా?’ అడిగాడు. ‘అపాయింట్మెంట్ లేదు పాడు లేదు’ అంటూ పక్కకు తోసేసి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్ అంటించి కదలకుండా కాళ్ళు చేతులు కట్టేశారు. పనుల్లో పడిన బ్యాంకు స్టాఫ్ ఈ సంఘటన గమనించలేదు. మంకీ క్యాప్స్ ధరించి ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు ఆగంతుకులు. కత్తులు పట్టుకుని ఎదురుగా వస్తున్న ఆగంతుకుల్ని చూసిన మేనేజర్ విఠల్ ప్రసాద్ భయంతో ‘సెక్యూరిటీ ’ అంటూ కేకేశాడు. మేనేజర్ కేక విన్న ఫీల్డ్ ఆఫీసర్ తన గది నుండి లేచేలోపు ఒకరు మేనేజర్ గదిలోకి, మరొకరు ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి వెళ్ళి కత్తులతో వాళ్ళను బెదిరించారు. ‘ఎవరు మీరు?’ అనేలోపు ‘డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పండి’ అంటూ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ మెడల మీద కత్తులు దూయబోయారు. వాళ్ళ చర్యలకు భయపడి లాకర్లను ఓపెన్ చేశాడు ఫీల్డ్ ఆఫీసర్. లాకర్లలో ఉన్న డబ్బు, బంగారం చూసేసరికి ఆగంతుకుల కళ్ళు ఆనందంతో తళతళా మెరిసిపోయాయి. లాకర్లలో ఉన్న లక్షల కొద్ది డబ్బు, వందల తులాల బంగారం తమతో తెచ్చిన బ్యాగుల్లో సర్దుకున్నారు ఆగంతుకులు. అక్కడున్న ఫోన్ కనెక్షన్లు, వాళ్ళ దగ్గరున్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసున్నారు. వాళ్ళను అక్కడ వదిలి తలుపులు వేసేసి హడావుడిగా కార్లో వెళ్ళిపోయారు ఆ ఆగంతుకులు. వాళ్లు వెళ్ళిపోయాక గేటు దగ్గర పడున్న సెక్యూరిటీ గార్డు పరిస్థితి చూసిన ఫీల్డ్ ఆఫీసర్.. అతని కాళ్లు, చేతులకున్న కట్లన్నీ విప్పాడు. టేబుల్ సొరుగులో ఉన్న తన పర్సనల్ సెల్ ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసి బ్యాంకులో జరిగిన దోపిడీ గురించి చెప్పాడు మెనేజర్ విఠల్ ప్రసాద్. ‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. వెపన్డ్ సెక్యూరిటీని పెట్టకపోవడం ఒక విధంగా తప్పే. సెంటర్లో ఉన్న బ్యాంకులో ఇలా రాబరీ జరుగుతుందని ఎవ్వరం ఊహించం. తప్పు జరిగిపోయింది. ఇంతకీ దొంగలు దొరికితే సరే. లేదంటే బ్యాంకుకి కోలుకోలేని నష్టం’ ఫీల్డ్ ఆఫీసర్ ముందు వాపోయాడు బ్యాంకు మేనేజర్. మేనేజర్ నుండి ఫోన్ రాగానే హడావుడిగా క్లూస్ టీమ్‌తో బ్యాంకుకి చేరుకున్నారు పోలీసులు. బయట నుంచి పెట్టిన బోల్ట్తీసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు లోపల పరిసరాలన్నీ గమనించారు. ఖాళీగా ఉన్న లాకర్లు, పాడయిన సీసీ కెమెరాలు, కట్ చేసిన ఫోన్ కనెక్షన్లు అన్నీ నిశితంగా పరిశీలించారు. ‘దొంగలు రావడం ముందుగా ఎవరు చూశారు?’ బ్యాంక్ మేనేజర్ని అడిగాడు ఎస్సై రఘువీర్. ‘నేనే చూశాను సార్. అప్పటికే వాళ్ళు ముసుగులు ధరించి ఉన్నారు’ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ‘బ్యాంకులోకి వచ్చే ముందు వాళ్ళు నీతో ఏమని చెప్పారు?’ అడిగాడు. ‘మేనేజర్ని కలవాలని చెప్పారు. అపాయింట్మెంట్ ఉందా? అని అడిగాను. అంతే నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఓ మూలన పడేశారు సార్’ అక్కడ జరిగింది చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ‘తర్వాత నా గదిలోకి, ఫీల్డ్ ఆఫీసర్ గదిలోకి చెరొకరు వచ్చి కత్తులు చూపించి మమ్మల్ని బెదిరించి లాకర్లు ఓపెన్ చేయించి డబ్బు, బంగారం దోచుకుపోయారు’ మేనేజర్ విఠల్ ప్రసాద్ వివరంగా చెప్పాడు. ‘ఇంత బిజీ సెంటర్లో రాబరీ చేశారంటే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయ్యుంటుంది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు?’ అడిగాడు ఎస్సై. ‘తెలుగులోనే’ చెప్పాడు మేనేజర్. క్లూస్ టీమ్ ఫొటోలు.. లాకర్స్ మీదున్న వేలి ముద్రలు తీసుకున్నాక.. మేనేజర్ నుండి కంప్లయింటు తీసుకుని తన టీమ్‌తో అక్కడ నుండి జీపులో బయలుదేరాడు ఎస్సై రఘువీర్. మరునాడు ఉదయమే బ్యాంకుకి వచ్చాడు. బ్యాంకుకి ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించాడు. ముందురోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య సీసీ ఫుటేజ్ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆ సమయంలో బ్యాంకులోకి వెళ్తున్న దృశ్యం దగ్గర పాజ్ చేశాడు ఎస్సై. బ్యాంకు గేటు ముందుకు రాగానే వాళ్ళు ముసుగులు ధరించారు. ‘వాళ్ళే సర్ బ్యాంకులో దొంగతనం చేసింది’ సీసీ కెమెరా వైపు చూస్తూ అన్నాడు సెక్యూరిటీ గార్డ్. ‘కొన్నాళ్ళ క్రితం వీళ్ళిద్దరూ మా బ్యాంకులో బంగారం కూడా తాకట్టు పెట్టారు’ అంటూ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పాడు. ‘ఇదంతా చూస్తుంటే ఇదేదో పెద్ద పథకంలా ఉంది. డొంక లాగితే దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది’ అని ఎస్సై అనగానే ‘ఎస్సైగారూ.. నా సెల్ ఫోన్ మీ దగ్గర ఉండిపోయింది’ అంటూ గుర్తు చేశాడు మేనేజర్. ‘మా ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదలవందే! ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక అప్పుడు ఫోన్ మీ చేతికొస్తుంది’ అంటూ ఎస్సై రఘువీర్ అక్కడ నుండి బయలుదేరాడు. స్టేషన్లో ఉన్నప్పుడు మేనేజర్ సెల్ ఫోన్‌కి కాల్ రాగానే ఫోన్ ఆన్ చేశాడు ఎస్సై రఘువీర్. ‘మేనేజర్ గారు.. మన ప్లాన్ సూపర్ సక్సెస్. బ్యాంకు రాబరీ కేసు కింద పోలీసులు కేసు రాసుకుంటారు. మీ చేతికి మట్టి అంటకుండా భలే నాటకమాడారు. బంగారం, డబ్బు భద్రంగా నా దగ్గరే ఉన్నాయి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం’ అంటూ అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రఘువీర్‌కి విషయమంతా అర్థమైంది. ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి, బ్యాంక్ మేనేజర్ సెల్‌కి చాలా సార్లు ఫోన్ చేసినట్టు కాల్ హిస్టరీ చూపిస్తోంది. కాల్ సెంటర్ నుండి ఆ వ్యక్తి అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడు ఎస్సై. ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఎస్సై అనగానే అతన్ని తీసుకొచ్చి జీపులో పడేశాడు కానిస్టేబుల్. ‘నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్’ అడిగాడు అవతల వ్యక్తి. ‘బ్యాంకు రాబరీ కేసులో’ చెప్పాడు. ‘ఆ దొంగతనానికి నాకు ఏంటి సర్ సంబంధం?’ అమాయకంగా ప్రశ్నించాడు. ‘సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది’ బదులిస్తూ పొమ్మని జీప్ డ్రైవర్‌కు సైగ చేశాడు ఎస్సై. ‘ఆరోజు నీతోపాటు ఉన్న రెండో వ్యక్తి ఎక్కడ?’ అంటూ స్టేషన్‌కు రాగానే ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎస్సై. ఏదో అడ్రస్ చెప్పాడు ఆ వ్యక్తి. అతను చెప్పిన అడ్రస్‌కి వెళ్ళి రెండో వ్యక్తిని పోలీస్ స్టేషనుకి తీసుకొచ్చారు ఇద్దరు కానిస్టేబుళ్లు. వాళ్ళిద్దరి నుండి మొత్తం సమాచారంతో పాటు పోయిన బంగారం, డబ్బూ రాబట్టాడు ఎస్సై రఘువీర్. ∙∙ పోలీస్ జీప్ బ్యాంక్ ముందు ఆగింది. లోపలకు వస్తున్న ఎస్సైని చూసి ‘రండి.. రండి.. దొంగలు దొరికారా సార్?’ అంటూ పలకరిస్తూ ప్రశ్నించాడు బ్యాంక్ మేనేజర్. ‘దొరికారు. ఒకసారి స్టేషనుకి వస్తే విషయాలన్నీ మాట్లాడుకుందాం’ అని జవాబిస్తూ పక్కనే ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ని చూసి ‘మీరూ రావాలి’ చెప్పాడు ఎస్సై రఘువీర్. ఎస్సైతోపాటు అందరూ స్టేషనుకి బయలుదేరారు. ‘దొంగలెక్కడ?’ స్టేషనుకి చేరుకోగానే అటూ ఇటూ చూస్తూ ఆత్రంగా ఎస్సైని అడిగాడు బ్యాంకు మేనేజర్. ‘డ్రామాలు ఆపి ఇప్పుడు చెప్పండి. ఈ దొంగతనం మీరే కదా చేయించారు?’ మేనేజర్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఎస్సై. ఆ మాటలు విని ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. ‘అదేంటి అలా మాట్లాడుతున్నారు? దొంగతనం నేను చేయించడమేంటి?’ ఎదురు ప్రశ్న వేశాడు మేనేజర్. ఇంతలో పక్క గదిలోంచి ఇద్దరు దొంగలతోపాటు గోల్డ్ అప్రయిజర్ అక్కడకు రావడం చూసి కంగు తిన్నాడు మేనేజర్. ‘ఈపని మీరెందుకు చేశారు?’ దొంగల్ని అడిగాడు ఎస్సై. ‘దొంగ బంగారం మాకిచ్చి ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టమన్నదే కాక, బ్యాంకులో దొంగతనం కూడా చేయమన్నది మేనేజర్గారే సార్. అందుకు మా ఇద్దరికీ చెరో మూడేసి లక్షలు ఇచ్చారు’ చెప్పాడు అందులో ఒక దొంగ. ‘దొంగ బంగారాన్ని మంచి బంగారంగా విలువ కడితే నాకు లక్ష రూపాయలిస్తామని మేనేజర్‌గారు చెబితే ఈపని నేను చేశాను సార్’ అప్రయిజర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మేనేజర్ ఇంత దారుణానికి ఒడిగడతారని ఫీల్డ్ ఆఫీసర్ ఊహించలేదు. ‘అప్పటికీ మేనేజర్‌తో చెప్పాను సార్.. బంగారం మీద ముప్పై లక్షలు అప్పు ఎలా ఇస్తామని? ఇప్పుడు తెలిసింది మేనేజర్‌గారి ఆలోచన ఏమిటో’ అన్నాడు ఫీల్డ్ ఆఫీసర్. ‘ఈ రాబరీ ప్లాన్ ఎందుకు వేశారు?’ ఎస్సై ప్రశ్నకి బదులిచ్చాడు మేనేజర్. ‘దొంగ బంగారం పెట్టి లోన్ తీసుకుని మళ్ళీ లోన్ కట్టేద్దామనుకునే లోపు బ్యాంకు ఆడిట్ జరగబోతోందని తెలిసింది. ఆడిట్ జరిగితే ఎక్కడ బంగారం విషయం బయట పడుతుందోనని భయపడి ఈ ప్లాన్ చేశాను. తప్పంతా నాదే’ తన నేరాన్ని ఒప్పుకున్నాడు మేనేజర్. ‘గోల్డ్ లోన్ కింద తీసుకున్న డబ్బు ఏం చేశారు?’ ‘విజయవాడలో ల్యాండ్ కొన్నాను’ చెప్పాడు మేనేజర్. ‘బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకే కన్నం వేసే మీలాంటి వాళ్ళకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే’ అంటూ మేనేజర్‌తో పాటు ఇద్దరు దొంగల్ని, గోల్డ్ అప్రయిజర్ని సెల్లో వేశాడు ఎస్సై. - చొక్కర తాతారావు -
కథ: కొడుకు.. నిజంగా ఇలాంటి ‘కొడుకు’ ఉంటాడా?
‘వంకాయలు ఇందాకే వచ్చేయండీ మేడం గారో, ఒక అరకేజీ తుయ్యమంటారా?’ పచ్చి మిరపకాయలు సంచీలో పోస్తూ అడిగాడు జోగిబాబు. నాతో పాటు మరో నలుగురికి కూరలు తూస్తున్నాడు, పైగా అందరితోనూ ఎవరి కబుర్లు వాళ్ళకి చెప్తూ! ఇవాళొద్దు’ అన్నాను అల్లం ఏరుతూ. ‘యాండే, ఇది జోగిబాబు కొట్టు. ఇక్కడ మీకు ఏదీ ఎంచే అవసరం రాదండే’ పెంకులెగిరిపోయేలా నవ్వుతాడు. ‘ఇదిగో మేడం గారండో, వంకాయలు ఎప్పుడు కనపడ్డా కొనేయాల్తెలుసా? నిన్న అల్లం పచ్చి మిర్చి పెట్టి ఒండారనుకోండి.. ఇయాల జీడిపప్పేసి వొండండి చెప్తాను, సారు గారూ పిల్లలూ ఎగబడి తినక పోతే నన్నడగండి’ నన్నడక్కండానే లేతగా పొడుగ్గా మెరుస్తున్న వంకాయలని సంచీలో పోశాడు. జోగిబాబు కొట్టుకెళ్తే మన ఇష్టాలుండవు. అన్నీ తను చెప్పినట్టే తీసేసుకోవాలి. ‘కాబేజీ చూశారా, తెల్లగా చందమామలాగ ఎలా ఉందో? పెసరపప్పూ కొబ్బరీ వేసి చేశారనుకోండి.. అసలు కూరంతా ఒక్క వాయలో అయిపోద్ది ఆనక మీ ఇష్టం!’ ‘ పునాస మామిడి వొచ్చింది తీసేస్కోండి.. చూడండి ఎంత గట్టిగా ఉందో. పప్పులో వేశారనుకోండి. ఇంకో కూర సెయ్యక్కర్లేదు మరి. లేదంటే కాసిన్ని ముక్కల కింద తరిగి మెంతికాయ పడేయండి. ఎందుకు వూరదో సూద్దాం!’ ‘యాండేయ్, పండు మిరపకాయలొచ్చాయి పొద్దున్నే. గుంటూరు నించి తెప్పించా. అదిగో, ఇందాకే ఎర్ర గోంగూర కట్టలొచ్చినయ్యి. రెండూ కలేసి పచ్చడి చేస్తే ఉంటదీ.. కాస్త తెల్లన్నం ఉంటే చాలసలకి’ జోగిబాబు మాటలకే సగం కూరలు చెల్లి పోతాయి. బాగా పెద్ద కొట్టేమో, కన్నుల పండగగా కనపడుతుంది. కొట్టు వెనక ఒక పాక లాంటిది వేశాడు. మధ్యాన్నం భోజనాలకీ, కూరల బస్తాలు తిరగబోసి, చచ్చులూ పుచ్చులూ తీసేసి బుట్టల్లో సర్దటానికీ, అయిదేళ్ల పిల్ల నిద్ర పోవడానికి ఏర్పాట్లన్నీ అక్కడే. తండ్రి ఇచ్చిన డాబా మీద మరో అంతస్తేసి.. షోగ్గా పై అంతస్తుకి నల్లటి అద్దాల కిటికీలవీ పెట్టించేసి ‘జోగిబాబు బిల్డింగ్’ అని పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉండి పోవడంతో అందరూ తెలిసినోళ్ళే, అందరూ చుట్టాలే. వంద కబుర్లు చెప్పేసి, రెండు సంచీల కూరలు సర్దేస్తాడు. ‘ఇదిగో ఆ కాయ బాలేదు’ అని ఎవరైనా అంటే ‘యాండే, ఇది జోగిబాబు షాపండే, పుచ్చులకెంత దవిర్నం ఈ షాపులో అడుగెట్టేడానికి?’ అనేస్తాడు తప్ప ఆ పుచ్చు కాయ తియ్యడు. ధనలక్ష్మి మొగుడితో పాటు అంత పనీ చేస్తూంది. మెడలో రెండు పేటల బరువైన పుస్తెలతాడేసుకుని, పాదాలకు మాత్రం నాజూకు వెండి పట్టీలు పెట్టుకుని, బేరాల్లేని ఏ మధ్యాహ్నం పూటో గోళ్ళకి రంగేసుకుంటూ, రిమూవర్లో దూది ముంచి మరకల్లేకుండా తుడుస్తూ కనపడుతుంది. ఇల్లయినా కొట్టు వెనక పాకయినా అద్దంలా తళ తళలాడుతూ ఉండాల్సిందే ఎప్పుడూ! సాయంత్రం బ్యాంక్ నుంచి త్వరగా బయటపడి జోగిబాబు కొట్టు దగ్గర బైక్ ఆపాను. కొట్లో ఎవరూ లేరు. ధనలక్ష్మిని కేకేస్తే పాక లోంచి వచ్చింది. మొహం ఎర్రబడి, కాస్త వాచి ఉంది. మొహం చిటపటలాడించుకుంటూ, ‘ఏమీమంటారండే’ అంది బుట్ట తీసుకుని కావలసినవి ఏరుతూ ‘జోగిబాబేడీ’ అన్నాను మామూలుగా. ‘యావో, యాడ చచ్చాడో’ విసుగ్గా అని ‘ఆ ముండ కాడికే పోయి సచ్చుంటాడు. పొష్టు తారీకు వొచ్చిందిగా, సొమ్ములు సమర్పించుకోవాల పొయ్యి. పేరంటాలమ్మ తల్లిగ్గూడా ఇట్టా నెలకోపాలి మొక్కులు సెల్లించం’ పెద్దగానే గొణుగుతూ ఆకు కూరల మీద నీళ్ళు చల్లింది ‘గూగుల్ పే చేయనా? చిల్లర లేదు ధనలక్ష్మీ..’ ‘అదేదో నాకు తెలవదండే, సిల్లర లేపోతే రేపియ్యండి పర్లేదు’ పచ్చి మామిడి కాయలు ఒకదాని మీద ఒకటి సర్దింది. మర్నాడు లంచ్ టైములో డబ్బులిద్దామని కొట్టు దగ్గర ఆగినపుడు, కొట్టు వెనక పాకలోంచి పెద్దగా అరుపులు, తిట్లూ వినపడుతున్నాయి.. ‘నువ్వు దాని కాడికి పొయ్యావంటే నేను సచ్చినంత ఒట్టే. మా రెక్కల కస్టవంతా ఆ ముండకి దోచి పెడతన్నావు. నేనూ నా పిల్ల, మట్టిగొట్టుకు పోవాలనా?’ తిడుతోంది మొగుడిని. ‘నోర్ముయ్యెహె. నువ్వు అరిచి గీ పెట్టినా, ఆవదం చెట్టుకు ఉరేసుకు సచ్చినా సరే, నేను ఆడికిపోకుండా ఉండనూ, డబ్బులియ్యకుండా ఉండనూ. ఏ సేత్తావో సెయ్యి’ తెగేశాడు. ‘ఇట్టనే మాట్టాడు. ఏదో ఒక రోజు నిజంగానే ఉరి పోసుకు సత్తాను’ బెదిరింపు. ‘ఓయబ్బో, శానా సూశాం లే, ఇట్ట కబుర్లు సెప్పే వోళ్ళెవురూ సావరు. పక్కనోళ్ళని సంపే టైపు తల్లా నువ్వు. నువ్వెట్ట సత్తావ్?’ పాకలోంచి బయటికొస్తూ నన్ను చూసి ‘యాండే, మజ్జానాలొచ్చారు? నేతి బీరకాయలొచ్చాయి చూశారా? అట్టా నూన్లో ఎయ్యగానే ఇట్టా మగ్గిపోతై. లేత నవ్వలనుకోండి. పచ్చి మిరపకాయలూ, నువ్వులూ వేయించి నేతి బీర పచ్చడి చేస్తే సావిరంగా, కుండెడు బువ్వ వూడ్చేయమూ?’ డబ్బులిచ్చేసి వస్తుంటే ‘యాండే మేడం గారో, మీ ఆఫీసులో సబ్‌స్టాఫ్ వసంతని కాస్త మాయిటేల ఇంటికో, కొట్టుకాడికో రమ్మని సెప్పండి బాబా, మా బాబయ్య కూతురే లెండి, ఫోన్ పగిలి పోయిందంట, మా బావ నా కొడుకు ఉన్నయి వూడ్చేరకవే గానీ కొనిచ్చే రకం గాదు. నేనన్నా ఇయ్యక పోతే ఎట్టలే గానీ, పోనీ మెయిన్ రోడ్లో సింత సెట్టు పక్కనే ఉన్న షాపు కాడికి ఏడింటికి రమ్మని చెప్పండి’ తలూపి గబగబా బండి తీశాను. ‘మేడం గారో...’ మళ్ళీ కేకలు వెనక్కి చూశా. పరిగెత్తుకొచ్చాడు గొంతు తగ్గించి ‘మా యమ్మ ఉండే ఇల్లు తెలుసు గదండీ ఇందిరాగాందీ నగర్లో? మరీ రెండే గదులై పోయినై. పక్కన ఇంకో గది కట్టి, పైన గూడా ఇంగో రెండు గదులెయ్యాలండి. పెద్దదై పోయింది గాదండే, పక్కనెవురన్నా మడుసులుంటే మంచి సెబ్బరా సూస్తారు. కాస్త అద్దె తక్కువైనా మంచి మడుసుల్ని సూసి అద్దెకిచ్చుకుంటే..’ ‘ఏం చేద్దామంటావు?’ ‘కాస్త లోను కావాలండే. కాయితాలేవైనా కావాలంటే పెడతా తెచ్చి. పొలం కాయితాలు పెట్టుకొని ఇస్తారేటండే?’ జోగిబాబు తల్లి బంగారమ్మ ఇల్లు తెలుసు. అటువైపుగా వెళ్తుంటే పచ్చటి వాకిట్లో చిన్న గేటు లోపలి నుంచి పన్లు చేస్తూ కనిపిస్తుంది. ఆ వీధిలో అడుగడుగూ పచ్చని చెట్లతో పొదరిల్లులా ఉండే బంగారమ్మ ఇల్లు ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఇంటి పక్కనే ఉన్న కొద్ది ఖాళీ స్థలంలో, ఇంటి ముందు, డాబా మీదా, గేటు ముందు అన్నీ పూలే, పచ్చగా మెరిసే చెట్లే. ఒక్కతే ఇంత వండుకు తిని, చేతనైన పని చేస్తూ హాయిగా బతుకుతున్న బంగారమ్మకి మనుషులు తోడుండాలని కొడుకుగా జోగిబాబు కోరుకుంటున్నాడు గానీ, ఎప్పుడూ ఎవరితోనూ కబుర్లు చెప్తూ కనపడనే లేదా మనిషి. తన తోటేమో, తనేమో అన్నట్టుంటుంది. ‘అమ్మా, ఇయిగోండి పెట్టుకోండి’ అంటూ ఎప్పుడైనా రెండు మూరల జాజిపూలో, విరజాజులో ఇస్తుంది సాయంత్రాలు అటుగా ఇంటికి వెళ్తుంటే. ‘లోను కావాలంటే .. చూడాలి మరి ఎంతొస్తుందో, ఆ తోటంతా తీసెయ్యడానికి ఒప్పుకుంటుందా మీ అమ్మా? నువ్వు వూళ్ళోనే, అదీ దగ్గర్లోనే ఉన్నావు గదా, తోడంటావు?’ అన్నాను ఆ తోటని తల్చుకుంటూ. ‘అట్ట కాదులెండే..’ నసిగాడు ‘నేను డబ్బులియ్యటం కాదండే, ఆవె డబ్బులు ఆమెకుండాల. నా దగ్గరైనా సరే, సెయ్యి సాప కూడదండీ. పక్కనో రెండూ, పైనో రెండూ రూములేస్తే, ఆ ఏరియా తెలుసు గదండీ, అద్దెలు పేలిపోతాయండీ బాబా..! నెల తిరిగే సరికల్లా అమ్మ సేతిలో డబ్బులు పడాలండీ. మాకు కర్సులు పెరిగి నేనో పాలి డబ్బులియ్యక పోయినా, అమ్మ ఇబ్బంది పడకూడదండే..’ ఒక పక్క ధనలక్ష్మి ఎవరి దగ్గరకో వెళ్తే ఊరుకోనని గొడవ పడుతోంది, ఎవరో ఉన్నారన్నమాట.‘ రెండేసి ఇళ్ళు ఉంటే ఖర్చులు పెరగవా?’ మనసులో కోపగించుకున్నాను ధనలక్ష్మి మీద ఆపేక్షతో. కానీ అది జోగిబాబు పర్సనల్ కాబట్టి అడగలేక పోయాను. బ్యాంక్‌కి వెళుతూనే వసంత కనపడింది నా డెస్క్ మీద ప్రింటర్ తుడుస్తూ. జోగిబాబు చెల్లెలని పోలికలు చూసి కాదు, ఆ వాగుడు చూసి కనిపెట్టెయ్యొచ్చు. జోగిబాబు చెల్లెలని తెలిశాక పోలిక తెలుస్తోంది. ‘జోగిబాబు చెల్లెలివట కదా వసంతా నువ్వు? నిన్న చెప్పాడు’ ‘ఆయ్, అవునండే, అన్నాయ్ కొట్లోనే కొంటారాండీ కూరలు తవరూ?’ విశాలంగా నవ్వింది. బిగించి వేసిన జడ, స్టిక్కర్ బొట్టు కిందగా కుంకుమ, రెండు చేతులకీ డజనేసి మట్టి గాజులు, బలమైన మనిషి. ‘అవును. ఇదిగో ఈ ఫైల్స్ తీసుకెళ్ళి లోపల పెట్టెయ్. నీకు ఫోన్ కొంటాడట, సాయంత్రం ఏడింటికి చింత చెట్టుకింద ఫోన్ల షాపు దగ్గరికి రమ్మన్నాడు’ మొహం చాటంత చేసుకుని నవ్వింది. ‘ఆయ్, అట్నే ఎల్తా లెండి’ లంచ్ టైమ్‌లో వచ్చి మాట కలిపింది ‘మేడమ్ గారో, ఇల్లు కట్టడానికి లోన్ ఇప్పిస్తారా, వాళ్ళమ్మకి ఇల్లు కట్టియ్యాలని తెగ తపన పడతన్నాడండి మా అన్నియ్యా..’ ‘నాకు చెప్పాడులే పొద్దున్న, మేనేజర్ గారితో మాట్లాడాలి’ ‘వాళ్లమ్మ చాలా కష్టపడిందండీ మేడం గారూ, ఇప్పటికైనా కాస్త సల్లగా కూసోని ఒక ముద్ద తిని టీవీ సూసుకుంటా ఆయిగా బతికేయాలని మా యన్నకుందండీ’ ‘వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏంటి వసంతా? నీకు పెద్దమ్మ కాదూ?’ వసంత ఒక్క క్షణం ఆగి ‘ఆయ్, ఆవి.. జోగిబాబు సొంతమ్మ కాదండే, మా పెదనాన తెచ్చి పెట్టుకున్న మడిసి...’ ఒక్క క్షణం అర్థం కాలేదు. ‘ఏంటీ?’ అనబోయాను గానీ మెదడులో పడిన చిక్కు ముళ్ళు విడిపోతున్నట్టు అయి ఆగిపోయాను. వసంత అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని కంఠం తగ్గించి ‘అవునండీ మేడం గారూ, బంగారమ్మని మా పెదనాన తెచ్చి పెట్టుకున్నాడు ఉండ్రాజవరం నించీ. ముగ్గురు పిల్లల్ని వొదిలేసి లేచొచ్చేసింది’ వసంత గొంతులో ధ్వనించింది జాలా, చులకనా, ఆశ్చర్యమా అర్థం చేసుకోలేక పోయాను. ‘అవునా?’ ‘అవునండే, ఆవి మొగుడు ఇసక టాక్టర్ డైవరంట. ఈవిడేమో కూరగాయల వోల్సేల్ మార్కెట్లో షాపు నడిపేదంట. మా పెదనానతో వొచ్చేసింది. వొచ్చిన కాణ్ణించి, మా పెదనాన తప్ప లోకవే తెలీకుండా బతికిందమ్మా మా తల్లి..’ దణ్ణం పెట్టుకుంది పైకి చూసి, దేవుడికో, బంగారమ్మకో గానీ. ‘మేవు సిన్న పిల్లలం గదండీ, మాకు తెలవదు ఆమె యాణ్ణించి వొచ్చిందో, ఎవరోనూ. సుట్టవనుకునే వోళ్ళం. ఏరే ఇల్లు తీసుకోని అక్కడ పెట్టాడావెని. మా పెద్దమ్మ చాలా గొడవలు పడింది గానీ ఆయన ఇడిసి పెట్లా. డబ్బులన్నీ ఆవెకి పెడతన్నాడని బాగా తగాదలయ్యేవి కొంపలో. ఆవె ఈడ కూడా పెద్ద మార్కెట్లో షాపు పెట్టి రెండు సేతులా సంపాదించేది. ఆవే పెదనానోళ్ళకి పెట్టేది కానీ ఆయనేవీ కర్సు పెట్టలా ఆవిడికి. కాపరాన్ని ఇడిసి పెట్టి వొచ్చిందనీ అందరూ చాలా సులకన సేసి మాట్టాడేవోళ్ళు. అందరూ సరే, మా పెదనాన కూడా తాగొచ్చి కొట్టేవాడు. ‘పిల్లల్నే వొదిలి వొచ్చినావంటే నన్ను వొదిలి పోటానికెంత టైమ్ పడతదే నీకూ’ అనే వాడు. కానీ మా జోగిబాబన్నియ్య ఎంత మంచోడోనండే! అప్పుడు పదో క్లాసనుకుంటా సదువుతా ఉండేవోడు. వాళ్ళ నాన మీద తెగ తిరబడేవోడమ్మా.. బంగారమ్మని ఏవీ అననిచ్చేవోడు కాదండే. ‘పెద్దమ్మా, నువ్వు వొస్తే వొచ్చావు గానీ ఇట్టాంటోడితోనా వొచ్చేది. నువ్వంటే ఈడికసలు లెక్కుందా? ఇష్టముందా?’ అనేవోడు కోపంగా. ‘అట్టనమాక జోగిబాబూ, ఆయనకి నేనంటే ఎంతో అక్కర. ఎంత ప్రేవో సెప్పలేను’ అనేది బంగారమ్మ. ‘ఏం ప్రేవమ్మా తల్లా? ఆయన కోసం నువ్వు అందరినీ వొదిలేసి వొచ్చావా? మరి ఈయన అంత ప్రేవున్నోడైతే నీ కోసం అందరినీ వొదిలేసి రావాలగా? వొచ్చాడా? నువ్వు గమనించుకో మరి. ఆయన ఫామిలీ ఆయనకుంది. నీకే లేదు, అసలు నిన్ను ఎన్నేసి మాటలు అంటన్నాడో ఇంటన్నావా? పట్టిచ్చుకోవా?’ ఈ మాట అన్నియ్య అనేసరికి పాపం ఆవి మొహంలో నెత్తురు సుక్క ఉండేది కాదండే. ‘ఇదిగో బంగారమ్మో, మొగోడెప్పుడూ అంతే! ఆడి ఫామిలీని డబ్బుల్లేకో, ఇష్టం లేకో వొదులుకుంటాడు గానీ, ఏరే ఆడదాని కోసం మాత్రం వొదులుకోడు. ఆడోళ్ళు ఇట్టాటి నా కొడుకులు సూపిచ్చేది ప్రేమా దోవా అనుకోని అన్నిటినీ వొదులుకోని రాటం... థూ నీకసలు బుద్ది లేదు’ ఇట్టా పోట్టాడేవోడు బంగారమ్మ అంటే ఇష్టంతోనే. ఆమెని మా పెదనాన కొట్టినపుడల్లా ఈడు గొడవ సేసి, ఇదిగో ఆమెకి ఇట్టా బుద్ధి సెప్పి తిట్టేవోడు. మా పెదనానా పెద్దమ్మా పోయి పదేళ్ళు పైనే అయింది. ఆయన పోయినప్పుడు బంగారమ్మని శవం కాడికి కూడా రానీక పోతే జోగిబాబే అడ్డం పడి ఆవిణ్ణి తీసకొచ్చాడు ‘ఆవె కూడా మాయమ్మే’ అని. ఆ తర్వాత ఆవెని కనిపెట్టుకుని ఉన్నాడండీ మా అన్నియ్య. మా ఒదిని కూడా తెగ తిడతాదండి బాబూ. ప్రతి నెలా డబ్బులు ఇస్తాడని గొడవ పడతాది. కానీ మా జోగి బాబు ఇంటేనా? ఆడదాని కష్టం తెలిసిన మడిసండి ఆడు. మా ఆయన గోరు పేకాటనీ, కోడి పందాలని ఊళ్ళు పట్టుకు తిరుగుతారండీ. ఏమంటాం సెప్పండి మేడం గారూ.. మొగాడు కదా! పోట్లాడి పోట్లాడి ఇసుగేసి పోయిందండి బాబా! మా అన్నియ్య నెలకోసారి సుబ్బారాయుడు కొట్లో నెలవారీ సరుకులు పంపిత్తాడండి. మూడ్రోజులకోపాలి కూరలు గూడా..’ వసంత కళ్ళు గర్వంతోటో సంతోషంతోటో మెరుస్తున్నాయి, కొంచెం తడిగా. ∙∙ కళ్ళాపి చల్లిన పచ్చని వాకిట్లో తెల్లని పద్మాల ముగ్గు. దాని మీద మూడు గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు తురుముకుని! గొబ్బెమ్మల చుట్టూ బియ్యం, సజ్జలు చల్లి ఉన్నాయి. మూడు పిచ్చుకలు వాలి వాటిని ఏరుకు తింటున్నాయి. మందార చెట్టు నుంచి వాడిపోయిన ఆకులు తీసేస్తోంది బంగారమ్మ. వృద్ధాప్యంతో వడలి పోయిన చేతులకు రంగు వెలిసిన ఆర్టిఫీషియల్ గాజులు. లోపలి నుంచి రెండు టీ గ్లాసులతో వచ్చాడు జోగి బాబు .. ‘ఆ ఆనపకాయలు కోసెయ్యక పోయావా? బాగా లావుగానే దిగాయిగా. ముదిరితే ఎవరూ కొనరు. కొనే వోళ్ళంతా మహా ముదుర్లు. గిల్లి చూసి గోరు దిగకపోతే ముదురంటారు. మన కొట్లో సొరకాయల నిండా ఆళ్ళ గోరు గిచ్చుళ్ళే’ ‘నాకు తెల్సులేరా బాబా. అయి ఇంకా ఊరతాయి. అయ్యి ఐబ్రీడ్ కాయలు కాదు. కోపుగా లేవు సూసినావా? గుండ్రాటిగా ఉన్నాయి. ఇంకా గింజ కూడా పట్టలేదు. మొన్నొక రోజు కూరల్లేక ఒక కాయి కోసినాను పులుసెడదావని..’ ‘కూరల్లేక పోతే ఒక కేకెయ్యవా? నువ్విప్పుడు ఇంట్లో పంట పండించి గానీ తిన్నని పంతం పట్టినావా ఏంటి?’ గయ్యిన లేచాడు. ‘ఓ అని అరిసేయకు మరి. మంచి నేల. నాలుగు కూరగాయలు కాస్తే మనసుకు బాగుంటాది. ఆ పక్క సూడు, ఆ దొండకాయలు నేను కొయ్యలేక ఇసుగు పుట్టి కుమారిని కేకేసినాను, కోసుకు పొమ్మని. నీ కొట్లో నించి తెచ్చుకోడానికి నాకేవన్నా బెరుకా? ఇంట్లో కూరలు పండుతుంటే కొట్లో తెచ్చుకోమంటాడమ్మా పిల్లడు..’ ఒక కాలు కింద పెట్టి బండాపి ఆ తల్లీ కొడుకులిద్దరినీ చూస్తున్నాను.. సడన్‌గా నన్ను చూసిన జోగిబాబు ‘మేడం గారో, ఇదిగో మీరైనా సెప్పండి, మాయమ్మకి, ఆనపకాయలు కొనాలంటే గిచ్చి సూస్తారా సూడరా?’ బంగారమ్మ లోపలి నుంచి ఒక పెద్ద కవర్లో బంతి పూలు తెచ్చి ఇచ్చింది నవ్వు మొహంతో. ‘ఇంటికి లోను కావాలన్నావు కదా, మధ్యాహ్నం బ్యాంక్‌కి రా, మాట్లాడదాం’ బంతి పూల కవర్ బండి హాండిల్కి తగిలించి ముందుకు కదిలాను. మన మొహం చిరునవ్వుకి రోజూ ఎవరో ఒకరు కారణమవుతారు. నాకివ్వాళ జోగిబాబు. చదవండి: కథ: చావు నీడ.. ఏం మనిషివయ్యా? నేను గుర్తుకు రాలేదా? -
కథ: చావు నీడ.. ఏం మనిషివయ్యా? నేను గుర్తుకు రాలేదా?
కైలాసం మరణవార్త వినగానే గాబరాగా వెళ్ళడానికి సిద్ధమైన నారాయణ కొద్దిసేపు నడింట్లో బొమ్మలా నిలబడి, ఆ వెంటనే ఏదో పనున్నట్లు తొడుక్కున్న బట్టల్ని విడిచి కొక్కేనికి తగిలేసి లుంగీ చుట్టుకొని టాయిలెట్‌కి వెళ్ళాడు. అయిదు నిముషాలు ఓపిక పట్టిన సరస్వతి నోరు విప్పి ‘ఇదేరా మీ నాయన పరిస్థితి.. ఇన్నేళ్లు కలిసి బతికిన దగ్గరి ఫ్రెండ్స్‌లో ఎవరికి ఏమైనా.. ఇలాగే హైరానా పడిపోతూ.. తయారైనాక ఏదో అర్జెంటు పనున్నట్లు బాత్రూమ్లో దూరుతున్నాడు...’ అని కొడుక్కి ఫిర్యాదు చేసింది. ముందు రూములో టేబుల్మేట్ పై లాప్టాప్ పెట్టుకొని పని చేసుకుంటున్న గణేష్ ‘తోటివాళ్ళు చనిపోతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది గాదే’ అంటూ తల్లిని శాంతపరచాడు. ‘అంత భయపడితే ఎట్లారా.. వెనుక ముందు అందరూ పోయేటోళ్లే. అందరు డెబ్బైయేళ్లు దాటినోళ్లే! ఇంకా ఉంటరా...’ అంది సరస్వతి విసుగ్గా బాత్రూమ్ తలుపు వంక చూస్తూ. ‘మరీ అంత తీసేయకే అమ్మా.. ఒకే వాడలో పుట్టి పెరిగి చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా కష్టసుఖాల్లో కలుసుకుంటూ తోడబుట్టినోళ్ల కన్నా మంచిగా ఉంటారు నాన్న బ్యాచ్ వాళ్ళు. వాళ్ళ స్నేహానికే షష్టి పూర్తయిందేమో...’ అన్నాడు గణేష్. ‘ఆ.. అంతా మిలిటరీ సిస్టమ్ బ్యాచ్. వారానికి రెండు సార్లయినా తలా వంద వేసుకొని సిట్టింగులు వేస్తే గాని పొద్దు గడవదు. పిల్లలు ఎక్కడున్నా ఒక్కరూ ఊరు వదలరు.. ఎక్కడ చీర్స్ మిస్సవుతామోనని’ అని నవ్వింది సరస్వతి. ‘ఏదో టైమ్ పాస్.. మందు పార్టీ పేరు మీద నవ్వులు, ముచ్చట్లే ఎక్కువ’ అని సర్ది చెప్పాడు. మరో అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. ‘ఏమైంది.. ఇంతసేపు పోయినవ్?’ అని దీర్ఘం తీసింది సరస్వతి. తడబడుతున్నట్లు బెడ్రూములోకి నడుస్తూ ‘ఏమోనే.. ఇలాంటి వార్త తెలువగానే ప్రాణం గుబులు గుబులు అయితాంది. లుంగీలోనే పడుతుందా అన్నట్లు పేగులు జారిపోతాయ్. పోయి కూచుంటే కడుపు గట్టిగ పట్టేసినట్లు ముడుసుక పోతుంది. కూచొని కూచొని యాస్టకొచ్చి లేసి వచ్చిన..’ అంటూ నారాయణ బట్టలేసుకుని బయటపడ్డాడు. నారాయణ, కైలాసంల ఇళ్లు దూరమే అయినా మార్కెట్లో ఒకే దగ్గర వారి తండ్రులకు దుకాణాలుండేవి. కైలాసం తండ్రిది కిరాణా కొట్టు. అదే గద్దెపై నారాయణ తండ్రి పొగాకు అమ్మేవాడు. ఇద్దరినీ తండ్రులు ఏడో తరగతిలోనే చదువు మాన్పించేశారు. అది నిజాం జమానా. ఓ సాయబు పెద్దమనిషి వీళ్ళని చూసి ‘ఈ పొట్టెగాళ్లు ఇస్కూలు పోరేంది?’ అని అడిగాడు. ‘చదివేం చేస్తారు.. మాకు దుకాణాలే ఉండే ..’ అన్నారు ఇరు తండ్రులు. ‘అరె భాయ్.. అరబ్బీల ఇమ్తెహాన్ రాస్తే మదర్సాల పంతుల్లయితరు. నేను రాసుడు నేర్పుతా.. అంతా చూసి రాసుడే..’ అని ఆ సాయబు ఇద్దర్నీ తయారు చేయించాడు. రెండేండ్లు తండ్లాడి ఆ పరీక్ష పాసై ఇద్దరూ యుక్త వయసులోనే స్కూల్ టీచర్లు అయ్యారు. సైకిలు మీద వెళ్లి చుట్టూ పల్లెల్లో పనిచేస్తూ ఇంతకాలం కలిసి బతికిన వీళ్ళనిప్పుడు చావు విడదీసింది. మరణవార్త వినగానే నారాయణ ఒక్కసారిగా తన ఆప్తమిత్రుణ్ణి తీసికెళ్ళిన చావు తన కోసం కూడా వెతుకుతున్నట్లు బెదిరిపోయాడు. ఇంట్లోంచి బయటపడ్డ నారాయణకు జీవన్ ఎదురయ్యాడు తన పాత స్కూటర్ మీద. జీవన్.. నారాయణ కన్నా రెండేళ్లు పెద్ద. మందు, మాంసం ముట్టని కులంలో పుట్టాడు. మిత్రమండలికి పొద్దటి పూటకు హాజరవుతాడు కాని చీర్స్ సాయంత్రాలకు రాడు. వాళ్లందరూ కలవడానికి రాములు టైలర్ షాపు అడ్డా. అందులో రెండు కుట్టు మిషన్లు, పది పాత కుర్చీలుంటాయి. పేరుకే టైలర్ షాపు గాని అప్పుడప్పుడు ఆల్టరేషన్ గిరాకీ వస్తుంది. రాములు కొడుకులు ఉద్యోగాలు చేస్తూ తండ్రికి అవసరమున్నన్ని డబ్బులు పంపుతుంటారు. అసలు రాములు దుకాణం తెరిచేదే దోస్తుల కోసం. పొద్దున్న తొమ్మిదింటికో, పదికో వచ్చినవాళ్లు మధ్యాహ్నం రెండింటికి ఆకలవుతుంటే మెల్లగా ఇంటి దారి పడతారు. మళ్ళీ ఏదో మిస్సవుతున్నట్లు అయిదారింటికే పక్షుల్లా వాలిపోతారు. ఇలా ఏండ్లకేండ్లు దాటుతున్నా ఒక్కరికీ విసుగు విరామం లేదు. మధ్య మధ్యలో ఎవరింట్లోనో పిల్లల బర్త్‌డేలో, పెద్దల సంవత్సరీకాలో.. సందర్భమేదైతేనేం మిత్రులందరి సమ్మేళనమక్కడే. పెళ్ళికి వారం రోజులు, చావుకు పన్నెండు రోజులు టీమంతా బిజీ, బిజీ. పిల్లలు కూడా వీళ్ళని మర్యాదగా చూసుకుంటారు. ఇంతకాలం తమకన్నా పెద్దవాళ్ళు ఒక్కొక్కరు చనిపోతుంటే ‘అయ్యో పాపం పోయాడా..’ అనుకుంటూ వాళ్లతో ఉన్న పరిచయాల్ని గుర్తుచేసుకొని బాధపడేవారు. తమ అన్నలు, బావలు పోతున్నా ‘వారి కాలమొచ్చింది.. పోయారు’ అని నిట్టూర్చేవారు. వీరి బ్యాచ్‌లోనే తిరిగే సత్తయ్యకు రాత్రి పక్షవాతం వస్తే తెల్లారి నుండి మంచానికే అతుక్కుపోయాడు. అందరూ వెళ్లి చూసొచ్చారు. ఏడుస్తుంటే ఊరడించి ‘మళ్ళీ నడుస్తావు.. అంత బేజారుకాకు’ అని ధైర్యమిచ్చారు. కొన్ని నెలల తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చి సత్తయ్య చనిపోయాడు. అప్పటికే ఆయన దగ్గరికెళితే కంపు వాసన వచ్చేది. ఇంటివాళ్లే దగ్గరికెళ్ళేవారు కాదట. నారాయణకు ఆ వాసన ఇంకా ముక్కులో ఉన్నట్లే అనిపిస్తుంది. కైలాసం ఇంటి ముందు జీవన్ స్కూటర్ ఆపగానే దిగిన నారాయణ ఎవరినీ చూడకుండా కైలాసం శవం దగ్గరికెళ్లి బిగ్గరగా ఏడ్చాడు. జ్ఞాపకాలన్నీ మదిలో తిరిగి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఇదివరకైతే ఎవరి చావు దగ్గరికెళ్ళినా మొక్కుబడిగా వెళ్లినట్లు అయ్యో పాపం అని నిట్టూర్చి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చేవారు. ఇప్పుడు తమ తోడు ఈడు వాళ్ళు దారి పట్టేసరికి కొందరి మనసులో తెలియని భయం ముల్లులా గుచ్చుకుంది. నారాయణకు మాత్రం కాస్త లోతుగా దిగినట్లుంది. ఓ రోజు అడ్డా మీదికి రాధాకిషన్ రాకపోయేసరికి గోపాల్ ఫోన్ చేసి ‘ఏమాయెరా.. రాలేదు? ఏమన్నా పనుందా!’ అన్నాడు. ఫోన్ ఎత్తిన ఆయన భార్య మంగ ‘కళ్ళు మసక మసక కనిపిస్తున్నాయట. రంగులు సరిగ్గా తెలుస్తలేవు అంటున్నాడు. కొడుకును దింపిరారా అన్నాడు గని నాల్రోజులాగుమని నేనే వద్దన్నా’ అని పెట్టేసింది. ఫోన్ చేసిన గోపాల్ అందరితో ఆమె అన్నది చెప్పి ‘వాడు తెలివి తక్కువోడురా.. షుగర్ కంట్రోల్ల పెట్టుకోడాయే.. పద్ధతి పాడు లేకపోతె ఏమైతది’ అన్నాడు మాములు ధోరణిలో. నారాయణకు నోరు తడారిపోయి రాములును నీళ్లడిగాడు. తెల్లారి అందరూ రాధాకిషన్ ఇంటికెళ్లారు. మనుషుల అలికిడి విని ‘ఎవరు?’ అన్నాడు. ‘వార్నీ.. మేం రా.. కనిపిస్తలేమారా..’ అన్నాడు గంగారాం. ‘దూరముంటే తెలుస్తలేదు’ అన్నాడు రాధాకిషన్ కళ్ళు మూసుకొని నొసలు పట్టుకొని. లోపటి నుంచి వచ్చిన మంగ కళ్ళు తుడుచుకుంటూ ‘అంత నా కర్మకే వచ్చింది. చెప్పినట్లు వినడాయే.. నాకేమైతది అని ఊకుంటే ఇక్కడికచ్చింది’ అంది. ‘ ఏ.. ఊకోయే.. ముందు చాయ్ పెట్టుపో ’ అని పెళ్ళాన్ని కసిరి ‘ ఏం లేదురా.. డాక్టర్ మందులు రాసిచ్చిండు. వాడితే కంటి రక్తనాళాలు మంచిగై మల్ల ఎప్పటి తీరు కనబడతాయట’ అంటూ మిత్రులకు డాక్టర్ ఫైల్ చూపించాడు. ‘మందులు మంచిగా వాడు.. లేపోతే గుడ్డోనివైతవ్ సుమీ ..’ అని జాగ్రత్తలు చెప్పివచ్చారు. జీవన్.. రాధాకిషన్ ఇద్దరూ చిన్నప్పటి నుండి క్లాస్మేట్లే కాక ఇద్దరూ రెవెన్యూలో కలిసి పనిచేశారు. ఆ కొసరు ప్రేమతో అప్పుడప్పుడు స్కూటర్ మీద రాధాకిషన్‌ను అడ్డా మీదికి తీసుకొచ్చాడు. మందులు వాడినా చూపు మరింత చీకటే అయింది. అడిగేవారికి సమాధానం చెప్పలేక, మిత్రుల ఓదార్పును తట్టుకోలేక రాధాకిషన్ బయటికి రావడం మానేశాడు. కళ్ళు పోవడమే కాకుండా పుండు పడ్డ కాలును మోకాలిదాకా తీసేయాలని డాక్టర్ చెప్పిన రాత్రే రాధాకిషన్ ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఆ నరకం కన్నా చావే నయమని మిత్రులకు అనిపించింది. కానీ ఛాతీ విరుచుకొని నడిచిన రాధాకిషన్ ఉరి వేసుకోవడమే అందరినీ తొలిచివేస్తున్న బాధ. కనబడని గాలానికి చిక్కినట్లు నారాయణ విలవిల్లాడిపోయాడు. మిత్ర ఖేదం అంతటితో ఆగనట్లు ఓ రోజు గంగారామ్‌కు ఊపిరి భారంగా ఉంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని ఆక్సిజన్ కోసం మెషిన్ వాడాలని డాక్టర్ అన్నాడు. పక్కన చిన్న సూట్‌కేసంత మెషిన్, మీసం లాగా ముక్కు కింద ఎప్పుడు సన్న గొట్టం పైపు ఆయనకు తగిలించారు. మెషిన్లో నింపడానికి రకరకాల మందులు, వాటి కొలతలు, సమయపాలన అంతా ఓ కంపల్సరీ డ్యూటీలా ఆయన్ని, కుటుంబాన్ని చుట్టుకుంది. మిత్రులు కలవడానికి వెళితే ‘ఇదేందిరా.. బఱె మెడకు తనుగేసి కట్టేసినట్టు ఏం బతుకు..?’ అని ఓ విషాదభరిత నవ్వు నవ్వాడు. గంగారాం ముచ్చట్లలో దిట్ట. నవ్వితే ఆ చప్పుడుకు ఏమైందని నలుగురు తిరిగి చూసేవారు. ‘మెల్లగరా బై’ అని బిక్షపతి విసుక్కున్నా ఆ తెలివి కొద్దిసేపే. తానే చెప్పి తానే నవ్వే విదూషకుడు ఆయన. బ్యాచ్‌లో గలగల పోయింది. గంగారాం.. బిక్షపతి మునిసిపాలిటీలో ఉద్యోగులు. ఏం మాయ చేశారో గాని వాళ్ల సర్వీసంతా ఊర్లోనే గడిచింది. ఇళ్లు కూడా పక్కపక్కనే. గంగారాం ముచ్చట్లు.. నవ్వులు వినేందుకు తానే అప్పుడప్పుడు వెళ్లి పలకరించేవాడు. అయితే ఆ హుషారు ఆయనలో తగ్గింది. ఊ.. ఆ.. తప్ప ఎక్కువగా మాట్లాట్లేదు. ఆయన ముఖంలో విషాద ఛాయలు చూడలేక బిక్షపతి పోవడమే తగ్గించాడు. అందరిలో ఉత్సాహంగా స్కూటర్ పై రయ్యరయ్యన తిరిగే జీవన్‌కు ఇట్లవుతుందని ఎవరూ అనుకోలేదు. మూత్రం మంటగా వస్తుందని పరీక్షలు చేయిస్తే ప్రొస్టేట్ గ్లాండ్ పెరిగిందని తేలింది. కొడుకు హైదరాబాద్ తీసికెళ్ళి సర్జరీ చేయించాడు. గ్లాండ్‌ను తీసేయక తప్పలేదు. మనిషి పూర్తిగా పీక్కుపోయాడు. ఇంట్లోనే కర్ర సాయంతో నడుస్తున్నాడు. రాత్రిళ్ళు మంచంపై పడుకుంటే భూమి గిర్రని తిరిగినట్లు ప్రాణం తూలుతుందని నారాయణ భార్యకు చెబితే కొడుకు డాక్టరుకు చూపించాడు. కొన్ని టెస్టులు చేయించి బీపీ పెరిగిందని మందుల డోసు పెంచి నెల నెలా చెకప్ చేయించుకోవాలన్నాడు. బీపీ కంట్రోల్ కాకపోతే పక్షవాతం వచ్చే చాన్సు ఉందని చాటుగా కొడుకు, భార్య మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ చెప్పకున్నా కొడుకు మూడు కాళ్ళ ప్లాసిక్ వాకింగ్ స్టిక్ తీసుకొచ్చాడు. అది చేతిలో లేకుండా భార్య ఒక్క అడుగు వేయనీయడం లేదు. నారాయణ కాలు బయటపెట్టడం సంపూర్ణ నిషేధమైంది. బీపీ తగ్గడానికి ఎవరు ఏం చెప్పినా సరస్వతి ఆయనపై ఆ ప్రయోగాలు చేస్తోంది. టైలర్ రాములు చనిపోతే కొడుకు తోడుగా వెళ్ళాడు నారాయణ. రాములు శవంలా లేడు. కాలేయం చెడిపోయి చనిపోయినందున శరీరం ఆకుపచ్చగా గోండ్రు కప్పలా ఉబ్బింది. తండ్రి ముఖంలో బెదురు చూసి గణేష్ ‘వెళ్దాం పద..’ అంటూ తొందర పెట్టి బయటకు తీసుకొచ్చాడు. రోడ్డు మీదికి రాగానే నారాయణ వాంతి చేసుకొని పక్కన రాయిపై కూలబడ్డాడు. కార్లోంచి నీళ్లు తెచ్చి తండ్రికిచ్చి మెల్లగా ముందు సీట్లో కూచోబెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అదే రోజు నడిరాత్రి బాత్రూమ్కు వెళ్లేందుకు లేచిన సరస్వతి కాలు కిందపెట్టగానే పాదానికి ఏదో తడిగా తగిలింది. లేవబోతే జారబోయి మంచంలోనే కూలబడ్డది. ‘ఇక్కడ నూనె ఎవరు పారబోసిన్రు’ అనుకుంటూ ఆ వైపు నుంచి వెళ్లి లైటు వేసింది. కిందంతా రక్తం పారి గడ్డ కట్టింది. నారాయణ మణికట్టు అడ్డంగా కోతబడి ఒక్కొక్క బొట్టు నేలరాలుతోంది. ఆయన మరో చేతిలో పండ్లు కోసుకొనే కత్తి ఉంది. ‘అయ్యో .. ఎంత పని చేసిండు’ అంటూ కొడుకును లేపింది. హాస్పిటల్‌కు తీసికెళ్లారు. ఇంకా కొనఉపిరి ఉన్నందున బతికిపోయాడు. పూర్తిగా కోలుకున్నా రక్తం పోయినందువల్ల ఎడమచేయి బలహీనమైంది. రోజులు గడుస్తున్నా ఇంట్లో ఎవరి ముందు తల ఎత్తకుండా నారాయణ ముభావంగా ఉంటున్నాడు. ఓరోజు మంచంపై ఒరిగి కూచున్న తండ్రి దగ్గరికొచ్చి గణేష్ ఆయన గదవపై చెయ్యేసి తల పైకెత్తి ‘ఇది ఇలాగే పైకి ఉండని..’ అంటూ పక్కన కూచున్నాడు. కొంగుతో చేతులు తుడుచుకుంటూ సరస్వతి కూడా దగ్గరికొచ్చింది. ‘నాన్నా.. చావుకు భయపడుతూ దూరమున్న దాన్ని కోరి దగ్గరకు రమ్మంటున్నావేంది? ఏదో అవుతది అని ఊహించుకుని బెదిరిపోతున్నావ్. బతికినన్ని రోజులు బతకాలి.. చేతనయినట్లు బతకాలి. తల్లి.. బిడ్డకు జన్మనిచ్చేందుకు తొమ్మిది నెలలు మోసి కనేందుకు పడ్డ శ్రమలో చావు యాతన పిసరంత కూడా ఉండదు. ఆత్మహత్య అంటే తల్లి శ్రమని నిష్ఫలం చేయడమే, అవమానించడమే. చిన్నప్పటి దోస్తులు ఒక్కొక్కరు పోతుండడం బాధగానే ఉంటది. వారి వియోగంతో అంతా చీకటే అనుకోకు. అందులోంచి బయటికి రా. నీ వయసువారు, అంతకన్నా పెద్దవారు కోట్లాది మంది ఉన్న ప్రపంచమిది. నీదేమంత వయసు? డెబ్భై ఆరేండ్లు. అమితాబ్‌కు డెబ్భై తొమ్మిదేండ్లు, రంగనాయకమ్మగారికి ఎనభై రెండేండ్లు.. వయసు హుషారు కన్నా మానసిక ఉత్సాహంతో వాళ్ళు జీవితాన్ని ప్రేమిస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరిలాగే ఈ భూమ్మీద ఇంకెందరో ఉన్నారు. పోయాక మళ్ళీ ఎన్నడూ కానరాని ఈ మనుషులతో, నేలా.. ఆకాశం.. చెట్లు చేమతో గడిపేందుకు ఎంతో విలువైన క్షణాలివి. ధనరాశులు పోసి క్షణ కాలపు జీవితాన్ని కూడా కొనలేం. ఈ మానసిక రుగ్మతలోంచి బయటికి రా! మళ్ళీ నీ ఊపిరి దీపాన్ని నీ చేతులతోనే ఆర్పేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించకు. ఎనభై ఏళ్ల వయసులో ఒకాయన ఎవరెస్టు ఎక్కాడట.. ఇలాంటి వారి జీవితాలు తెలుసుకో.. మనసు తేలికపడి కొత్త ఉత్సాహమొస్తుంది.’ గణేష్ మాట ఇంకా అయిపోకముందే ఇన్నిరోజులు నోరు తెరవని సరస్వతి ఒక్కసారిగా నారాయణ పక్కకొచ్చి ‘ఏం మనిషివయ్యా.. కోసుకునేటప్పుడు నేను గుర్తుకు రాలేదా? నీకేం తక్కువజేసిన? పోతే ఇద్దరం పోదాం.. మల్ల అసుంటి బుద్ధి పుడితే ముందు నా చేయి కొయ్యి సరేనా..’ అంటూ నారాయణ ఛాతీపై తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులో మూసుకు పోయిన తలుపులన్నీ ఒక్కొక్కటి తెరచుకొని చల్లని గాలులు, వెచ్చని వెలుగులు ప్రసరించి సరికొత్త జీవితాన్ని నింపుతున్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నారాయణ. ఈ భూమ్మీద పుట్టే ప్రతి జీవి పోయేదే కదా.. తనకెందుకీ పిచ్చి తొందర..గాబరా.. అనుకున్నాడు. అప్పుడే ఆయన మనసులోని చావు పీడ తోక ముడిచింది. -బి.నర్సన్ -
క్రైం స్టోరీ: రాంగ్ ఇన్ఫర్మేషన్.. ట్విస్టు అదిరింది!
రాం నగర్‌కు ఫర్లాంగు దూరంలో కొత్తగా కట్టిన ఇల్లది. చుట్టుపక్కల వేరే ఇళ్లేం లేవు. చుట్టూ ప్రహరీ మధ్యలో రెండంతస్తుల భవనం అది. చుట్టూ పోలీసులు మోహరించారు. గుంపులు గుంపులుగా జనం. నేరుగా లోపలికి వెళితే మూడు శవాలు పడున్నాయి. ఒక వృద్ధురాలు.. భార్య భర్తల జంట. తలపై మోది కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీస్ టీమ్ సాక్ష్యాలు సేకరిస్తోంది. డాగ్ స్క్వాడ్ అక్కడే వెతుకుతున్నారు. రెండు బీరువాలు పగలగొట్టి నగదు, నగలు కలిపి దాదాపు యాభై లక్షల వరకు దోచుకున్నారు. బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. హత్యానంతరం చేతులు వాష్ చేసుకుని తీరిగ్గా అక్కడే భోంచేసివెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సిటీలో ఈ తరహా కేసులో ఇది మూడవది. హంతకుల ఆచూకీ కనుక్కోవడానికి పోలీస్ టీమ్ శత ప్రయత్నాలు చేస్తోంది. బాగా డబ్బున్న ఇళ్లను ఎంచుకుంటున్నారు.. సిటీకి దూరంగా విడిగా ఉన్న వాటిని టార్గెట్ చేసి.. రాత్రివేళ చొరబడి దొంగతనం చేస్తున్నారు. బహుశా హంతకులు ఇరవై ఐదు నుండి ముప్పై లోపు వయసు గల వారే అని పోలీసుల నమ్మకం. చనిపోతున్న వారందరూ ఉద్యోగులే కావడం గమనార్హంగా మారింది. శవాలను పోస్టుమార్టమ్‌కు పంపించేశారు. ‘ఈ వరుస హత్యల మిస్టరీ ఛేదించమని పై నుండి ఒకటే ఒత్తిడి. సరైన ఆధారాలు దొరకనందున ఆలస్యమౌతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అంటూ స్టేషన్ వసారాలో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఎస్సై రంగనాథం. ‘సార్ ! వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. కచ్చితంగా దొరికిపోతారు’ అన్నాడు అక్కడే ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ సుధాకర్. ‘నువ్వు సిటీలో తచ్చాడుతూ ఉండు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే మాకు ఫోన్ చెయ్’ చెప్పాడు ఎస్సై రంగనాథం. ‘ఓకే సార్ ’ అంటూ అక్కడి నుండి కదిలాడు సుధాకర్. అక్కడున్న సిబ్బందిని వెంటబెట్టుకుని బయటికి వెళ్లాడు రంగనాథం. టీ కొట్టు దగ్గర చిల్లర వ్యాపారుల స్థావరాల దగ్గర తన ఫ్రెండ్స్‌ని వెంటేసుకుని మామూలు వ్యక్తిగా తిరగడం మొదలు పెట్టాడు సుధాకర్. ∙∙ నగరంలో ఈ హత్యలు సంచలనంగా మారిపోయాయి. కొత్తవాళ్లను నమ్మడానికి భయపడుతున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్ళు తీయాలంటేనే బెదిరి పోతున్నారు. నగరంలోకి బయట నుండి ఎవరైనా కొత్తగా వచ్చారా అన్నదానిపై దృష్టి పెట్టిన ఎస్సై రంగనాథం సుమారు పదిహేను మందిని స్టేషన్‌కు పిలిపించాడు విచారించేందుకు. సుధాకర్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్లలో ఒకడు..‘సార్ ! నేను గాజుల వ్యాపారం చేస్తాను. నేను వచ్చి కూడా ఆరు సంవత్సరాలు దాటిపోయింది. రాజీవ్ నగర్లో చిన్న కొట్టు వేసుకున్నాను ‘ అని, ఇంకొకడు ‘ సార్! నేను బట్టల వ్యాపారం చేస్తాను.. నేను వచ్చి సంవత్సరం దాటింది’ అని ఇలా అందరూ తలో వ్యాపకం గురించి చెప్పుకొచ్చారు. ‘వీళ్ళందరూ బతుకుతెరువు కోసం వచ్చారు. కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి అలాంటి పని చేసి ఉంటారని నమ్మకం లేదు’ అన్నాడు సుధాకర్. వాళ్ళను అన్ని విధాలుగా పరిశీలించి వదిలేశాడు రంగనాథం. అంతలోపే ‘సార్! శివాజీ నగర్ శివారులో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తచ్చాడుతున్నారు’ అంటూ ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ఏరియాకు బయలుదేరి వెళ్లాడు ఎస్సై రంగనాథం. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్లీ అదే నంబర్‌కు కాల్ చేశాడు. పనిచేయడం లేదు. చీకటి పడుతోంది ‘ఈ రాత్రికి సిటీ ఉత్తర భాగాన ఉన్న ఇళ్ళ వైపు దృష్టి పెట్టాలి. చెక్ పోస్టులలో నాకాబందీ వేయాలి’ అన్నాడు రంగనాథం. ‘మీరు పొరబడుతున్నారు. అక్కడ తిష్టవేసి ప్రయోజనం లేదు. అది ఎలాగూ జనసంచారం గల ప్రాంతం. ఈసారికి సిటీలోనే ప్లాన్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే నగరం శివారులో గల ఇళ్ళల్లోనే దొంగతనాలు జరుగుతున్నాయని గ్రహించి.. పోలీసులు అక్కడే తిరుగుతుంటారని తెలుసు కాబట్టి ఈసారికి స్కెచ్ మార్చి ఉండొచ్చు. ఆలోచించండి సార్ ’ అన్నాడు సుధాకర్. ‘అవును.. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. టౌన్లోకి వెళ్దాం’ అంటూ అక్కడి నుండి నిఘా మార్పించాడు ఎస్సై రంగనాథం. ∙∙ సరిగ్గా అర్ధరాత్రి.. ఉత్తర భాగాన గల అమృత నగర్ నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పోలీసు పహారా కూడా పెద్దగా లేదు. అక్కడున్నది మొత్తం ఉద్యోగస్తుల ఇళ్లే. అవీ అక్కడొకటి.. ఇక్కడొకటిగా విసిరేసినట్టుగా ఉన్నాయి. చివరి ఇంటి ప్రహరీని ముసుగులు ధరించిన నలుగురు కుర్రాళ్ళు ఎక్కుతున్నారు. పట్టుకుంటే జారిపోవడానికి ఒళ్లంతా నూనె రాసుకున్నారు. చేతిలో ఆయుధాలు పట్టుకుని చాకచక్యంగా లోపలికి ప్రవేశించారు. పడుకున్న వాళ్లని లేపి చంపుతామని బెదిరించారు. ఆ బెదిరింపులకు ఆ ఇంటి వాళ్ళు బెదరకపోయేసరికి.. గట్టిగా అరుస్తారేమోననే భయంతో విచక్షణ రహితంగా వారిపై దాడి చేశారు. నోటిలో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేశారు. డబ్బు, బంగారం దోచుకుని పారిపోయారు. తెల్లవారేసరికి ఈ వార్త సిటీ అంతా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘నేను అప్పుడే చెప్పాను.. ఇది నగరానికి దూరంగా ఉన్న టీచర్స్ కాలనీ.. ఇక్కడ జరగవచ్చు అని! ఆ విషయమే నీతో అన్నాను కూడా! గత కొన్నేళ్లుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నావ్. నువ్వు చెప్పిన క్లూస్ గతంలో చాలా పాసయ్యాయి. ఆ నమ్మకంతో నీ మాట విని నిఘా మార్చా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో?’ అంటూ ఎస్సై రంగనాథం.. సుధాకర్ పై చిందులు తొక్కాడు. ‘సారీ సార్.. ఇలా జరుగుతుందని నేనూ ఊహించలేదు. ఈసారికి మన కళ్లుగప్పి సిటీలో ఉన్న పెద్దవాళ్ల ఇళ్లకు కన్నం వేస్తారనుకున్నా’ అన్నాడు తల గీరుకుంటూ సుధాకర్. ‘మన స్టేషన్లో స్టాఫ్ ఎక్కువ లేకపోవడం చేతనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథం. ఒక కేసు పూర్తిగా శోధించక ముందే మరో కేసు జరగడం.. ఎస్సైని నిద్రకు దూరం చేసింది. అదనపు పోలీసులు వస్తే తప్ప నగరాన్ని కాపాడలేం అనుకున్నాడు. ఎంత పహార కాసినా ఒక్కడు కూడా పట్టుబడలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో సుధాకర్ మీదే ఆధారపడ్డాడు మళ్లీ. ‘ఏవైనా ఆనవాళ్లు దొరికాయా?’ అని అడిగాడు అతన్ని. ‘నేను జనాల్లో తిరుగుతున్నాను. అందర్నీ అబ్జర్వ్చేస్తున్నాను. అనుమానం వచ్చేలా మాట్లాడుకోవడం గానీ.. ప్రవర్తించడం గానీ ఎవరూ చేయట్లేదు సార్. అయినా వదలట్లేదు. ప్రతి మనిషిని ఆరా తీస్తున్నాను’ చెప్పాడు సుధాకర్. ‘ఈ కేసులపై ఒక ఇంటెలిజెన్స్ పోలీసుని కూడా నియమించారు కానీ అతనికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పాత నేరస్తులందర్నీ పిలిపించి వేలిముద్రలు కూడా చెక్ చేశాం. ఎవరివీ మ్యాచ్ కాలేదు’ చెప్పాడు ఎస్సై రంగనాథం. ‘ఆ దొంగలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు సార్ ’ అన్నాడు సుధాకర్. ‘అవును కానీ నాకు ఒక డౌట్.. ఆ దొంగతనాలు చేస్తున్నది మన ప్రాంతం వాళ్లు కాదేమో అని! పొరుగు రాష్ట్రాల నుండి వచ్చినవారై ఉంటారు. ఒకసారి ఊరి చివరన గుడిసెలు వేసుకున్న వాళ్ళని పిలిపిస్తే సరిపోతుందేమో’ అన్నాడు రంగనాథం. ‘వాళ్లు పాపం అడుక్కునే వాళ్ళు. ఇంత పెద్ద స్కెచ్ వేసి హత్యలు చేసేంత ధైర్యం గాని ఐడియా గాని వాళ్లకు ఉండదని నా అభిప్రాయం. అడుక్కోవడం తప్ప వాళ్లకు మరో పని తెలియదు సార్..’ అన్నాడు సుధాకర్. ‘నువ్వు చెప్పేదీ నిజమే అనుకో! అయినా ఒకసారి పరిశీలిస్తే పోయేదేముందీ!’ ఎస్సై రంగనాథం. ‘సరే’ అన్నట్టుగా తలూపుతూ వాచీ వంక చూస్తుకున్నాడు సుధాకర్. ‘సర్.. ఇప్పుడెలాగూ లంచ్ టైమ్ అయింది. నేను ఇంటికెళ్లి భోజనం చేస్తాను. మీరు బయలుదేరే ముందు కాల్ చేయండి.. రెడీగా ఉంటాను. దార్లో పికప్ చేసుకుందురు’ అంటూ స్టేషన్ నుంచి బయటకు నడిచాడు సుధాకర్. ∙∙ సరిగ్గా మిట్టమధ్యాహ్నం.. స్టేషన్ నుండి పోలీస్ జీప్ బయలుదేరింది. సుధాకర్‌కు ఇన్ఫామ్ చేశాడు ఎస్సై రంగనాథం. ఊరి మధ్యలో కొట్టాల వీధిలో జీప్ ఎక్కాడు సుధాకర్. జీప్ నేరుగా ఊరి బయట గుడిసెలు ఉన్న ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక్క గుడిసె కూడా లేదు. ఎస్సై ఆశ్చర్యపోతూ ‘సుధాకర్! ఇక్కడ గుడిసెలు ఉండాలి కదా! మార్నింగ్ ఉన్న గుడిసెలు ఒక్కపూటలో ఎలా మాయమైనట్టు?’ అడిగాడు. ‘వాళ్లు అడుక్కునే వాళ్ళు కదా సార్! ఒక చోట స్థిరంగా ఉండరు. ఊర్లు మారుతా పోతారు’ చెప్పాడు సుధాకర్. ‘ఇంత ఉన్నపళంగా మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది?’ ఎస్సై అనుమానం. ‘వాళ్ళంతే సార్.. ఉదయం ఓ చోట ఉంటే మధ్యాహ్నం మరోచోటుకు వెళతారు. ఒకే చోట ఉంటే వాళ్లకు అన్నం పుట్టదు కదా అందుకోసం’ సుధాకర్. క్షణం ఆలోచించాడు ఎస్సై రంగనాథం. అంతలోనే డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చింది అర్జంట్‌గా స్టేషన్‌కు రమ్మంటూ. ‘మీరు వెళ్ళండి.. వీళ్ళు ఎక్కడున్నా వెదికి స్టేషన్‌కు తీసుకురండి’ అంటూ తన టీమ్‌కి చెప్పి సుధాకర్ వైపు తిరిగి ‘మీరు ఈ పరిసర ప్రాంతంలోనే ఉండి వారిపై ఓ కన్నేసి ఉంచండి’ అంటూ రంగనాథం వెళ్లిపోయాడు. పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోగానే సుధాకర్ ఒక్కడే నిలిచిపోయాడు. అక్కడున్న చిన్న దిమ్మెపై కూర్చుని ఆలోచించసాగాడు. సాయంకాలం అయిదు గంటలప్పుడు స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. బయలుదేరి స్టేషన్‌కు వెళ్ళాడు. స్టేషన్ ఆవరణలో నేల పై కూర్చుని ఉన్న నలుగురు యువకులు.. వాళ్ల ముందు టేబుల్‌ను ఆనుకుని నిలబడ్డ ఎస్సై రంగనాథం, అతని పక్కనే సీఐ రామకృష్ణ కనిపించారు సుధాకర్‌కు. సుధాకర్‌ను చూడగానే ఎస్సై విప్పారిన మొహంతో ‘దొంగలు దొరికిపోయారు సుధాకర్! చాలా తెలివైనవాళ్ళు’ అన్నాడు. అతని మాటల్లో ఏదో వెటకారం వినిపించింది సుధాకర్‌కు. దొరికిన దొంగల వైపు చూడగానే అతని మొహంలో రంగులూ మారాయి. ‘ చాలా చాకచక్యంగా దొంగల్ని పట్టేశారు సార్. ఇక నేను వెళ్ళొస్తాను’ అంటూ ఒకడుగు ముందుకేసిన సుధాకర్ కాలర్ పట్టుకున్నాడు ఎస్సై.. ‘ఆగు’ అంటూ. ‘అసలైన దొంగవి నువ్వు వెళ్ళిపోతే ఎలా? వాళ్లకు మార్గదర్శకుడివి! బాగానే స్కెచ్ వేశావు’ అంటూ సుధాకర్ చేతికి బేడీలు వేశాడు. అక్కడే నిజానిజాలు బయటపడ్డాయి. ఆ దొంగల ముఠాను నడిపిస్తున్నది సుధాకర్. వాళ్లకు నాలుగు తగిలించగానే అసలు విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు చేసే దొంగతనంలో సగం వాటా తను తీసుకుని మిగిలింది వాళ్లకు ఇచ్చేవాడు. అనుమానం రాకుండా వాళ్లను అడుక్కుతినే వాళ్ళలాగా నటింపచేస్తూ పగటిపూట స్కెచ్ వేసి రాత్రిపూట చోరీకి పంపించేవాడు. అలా వాళ్లకు దిశానిర్దేశం చేసేవాడు సుధాకర్. ఒకపక్క పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంటూనే పోలీసుల కదలికలను పసిగడుతూ వాళ్లకు సూచనలు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ దొంగల్ని ఊరి బయట గుడిసెల్లో పెట్టాడు. దొరికిపోతారనే భయంతో వాళ్లను అప్పటికప్పుడు ఖాళీ చేయించాడు. ఇవన్నీ గంటలో జరిగిపోయాయి. పోలీసులు ఎక్కడున్నా వాళ్లకు ఫోన్ చేసి దారి మళ్ళించేవాడు. అలా పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దొంగల్ని తప్పించేవాడు. ‘డిపార్ట్మెంట్ నిన్ను బాగా నమ్మింది. దాన్ని ఆసరాగా తీసుకునిమాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నువ్వు పబ్బం గడుపుకున్నావ్. డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనల కన్నా నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌నే ఎక్కువగా నమ్మాను. డిపార్ట్‌మెంట్‌కే ద్రోహం చేస్తావా? నీవల్ల ఎంత మంది ప్రాణాలు పోయాయో తెలుసా? నిన్ను క్షమించకూడదు’ అంటూ దొంగతనం చేసిన సొమ్మంతా సుధాకర్ దగ్గర రికవరీ చేశాడు ఎస్సై రంగనాథం. కేసు పెట్టి సుధాకర్ సహా అయిదుగురినీ జైల్లో పెట్టించాడు. - నరెద్దుల రాజారెడ్డి -
కథ: కర్తవ్యం.. కలెక్టర్ అనుపమ.. నాకు శక్తిస్వరూపిణిలా కనిపించారు!
ఆకాశం నిలువునా బద్దలైనట్టుగా హోరున భోరున కురుస్తోంది వర్షం. గత అయిదు రోజుల్నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి. గాలి ప్రచండ వేగంతో వీస్తూనే వుంది. తీర ప్రాంతంలోని మా జిల్లాని తుఫాను అతలాకుతలం చేసేస్తోంది. వాగులూ వంకలూ పొంగాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా పట్నాలు జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల జనం కంటిమీద కునుకు లేకుండా అరచేతుల్లో ప్రాణాలు బిగబట్టుకుంటున్నారు. తుఫాను బీభత్సం ఎంత ఘోరంగా ఉందంటే ఎప్పుడూ కిటకిటలాడే మా ఆఫీసర్స్ క్లబ్ వెలతెల బోతోంది. కంపెనీ కోసం ప్రాకులాడే నేనూ, మరో అరడజను మంది మాత్రమే ఉన్నామంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అద్దాల్లోంచి కనిపిస్తోన్న వర్షోధృతిని చూస్తూ తాపీగా మందు ఆస్వాదిస్తూ వెచ్చదనాన్ని తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ‘మున్సిపల్ కమిషనర్గారేదో ప్రత్యేక తపస్సులో ఉన్నట్టున్నారు’ సమీపిస్తూ మందహాసం చేశాడో మిత్రుడు. ‘టైముకి ఈ డ్యూటీ చేయకపోతే మన శరీరంలోని ఏ భాగమూ పని చేయదు’ నవ్వాను. ‘నగరం కకావికలమవుతున్నా మీరిలా నిమ్మకి నీరెత్తినట్టు ఎలా ఉండగలుగుతున్నారబ్బా!’ ‘మనం అన్ని పనులూ ఫిజికల్‌గా చెయ్యక్కర్లేదోయ్. ఒక్కో డిపార్ట్మెంట్కి బోలెడు మంది అధికార్లు ఉన్నారు. వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పైపైన సూపర్వైజ్ చేస్తే చాలు. అంతా వాళ్లు.. ఫీల్డ్‌స్టాఫ్ చూసుకుంటారు’ ‘ఈ అత్యవసర పరిస్థితిని వాళ్లు హ్యాండిల్ చేయగలరా?’ అతడి అమాయకత్వానికి జాలేసింది. ‘చక్కగా శ్రద్ధగా చేస్తారు. అసలు రెవెన్యూ వాళ్ళూ.. మేమూ ఎప్పుడూ కోరుకునేది విపత్తులూ ప్రకృతి వైపరీత్యాలూ తరచూ రావాలనే. ఇలాంటివి వచ్చిపడినప్పుడే మా అన్ని జేబులూ నిండేది. ఎంచేతంటే ఎంత ఖర్చు చేసినా అడిగే వాడుండడు ఆడిటింగూ ఉండదు. అంతా మా ఇష్టారాజ్యం!’ జ్ఞానిలా నవ్వాను. ‘కొత్త కలెక్టర్ అనుపమ చాలా స్ట్రిక్ట్ అంటున్నారు!’ ‘అనుకోవడం వేరు ఆచరించడం వేరు. సోషల్ నెట్వర్కింగ్ పెరిగాక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సొంత డబ్బా వాయించుకోడానికి పీఆర్వోలను పెట్టుకుంటున్నారు తెలుసా? అదీగాక ఈవిడ మీడియాతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తోంది. వాళ్లు ఆమె భజన చేస్తారు. వెరీ సింపుల్!’ ‘ఈవిడ ఆహార భద్రత కమిషనర్‌గా పని చేసినప్పుడు.. ఓ పెద్ద కంపెనీ సుగంధద్రవ్యాల్లో భారీగా కల్తీ చేస్తోందని ఆ కంపెనీనే మూయించేసిందట కదా!’ ‘అదో యాదృచ్ఛిక ఘటన. రైవల్ కంపెనీ వాళ్లు ఉప్పందించార్లే. అయినా అది జరిగిన మరుసటి రోజునే ట్రాన్స్ఫర్ వేటు పడిందిగా!’ ఇబ్బందిగా ఫీలవుతూనే అన్నాను. ‘ఆవిడ ఈ విపత్తుని సరిగ్గా హ్యాండిల్ చెయ్యగలదంటారా?’ ‘నో చాన్స్. జిల్లాకి వచ్చి మూడు నెలలే అయ్యింది. ఇంకా జిల్లా భౌగోళిక స్వరూపమే తెలిసుండదు. పైగా మహిళ. ఇలాంటి చాలెంజీల్ని ఎదుర్కోవడానికి ధైర్యమూ స్థైర్యమూ ఉన్న మగాళ్ళు కావాలి. మన జిల్లా సంగతి తెలిసి కూడా ఆవిడ్ని మన నెత్తిన కూర్చోబెట్టడం ఘోర తప్పిదం!’ అదోలా చూశాడతను. ఇంతలో నా సెల్ మోగింది. డిస్ప్లేలో జిల్లా కలెక్టర్ అనుపమ పేరు కనిపించగానే అలర్టయ్యాను.. ‘గుడ్ ఈవెనింగ్ మేడం’ ‘మీ సిటీ పరిస్థితి కంట్రోల్లోనే ఉంది కదా? సంబంధిత డిపార్ట్మెంట్లన్నీ యాక్షన్లోనే ఉన్నాయిగా?’ ‘ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ మేడమ్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేసేస్తాం మేడమ్’ గొప్పగా చెప్పాను. ‘మీరు కోఆర్డినేట్ చేస్తూ 24 గంటలూ వారికి అందుబాటులో ఉండండి. ముంపు ప్రదేశపు జనాన్ని ముందే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ఎక్కడా ప్రాణ నష్టం జరగటానికి వీల్లేదు. ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించాలి’ ‘యస్ మేడమ్. ఇప్పటికే చాలామందికి చాలాచోట్ల ఆశ్రయం కల్పించాం’ ‘గుడ్. కలెక్టరేట్లోని విపత్తు విభాగంతో టచ్‌లో ఉండండి. అవసరమైన రిలీఫ్ మెటీరియల్ అందరికీ అందేలా చూడండి. ఇది మన శక్తి సామర్థ్యాలకు పరీక్ష. మనమేంటో నిరూపించుకుందాం’ ఫోన్ ఆఫ్ చేసి నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాను. ‘ఆవిడేనా? గట్టిగానే దబాయిస్తోందే!’ మిత్రుడన్నాడు. ‘అధికార దర్పంలే. ఇంకా ఏదో నిరూపించుకోవాలంట. పాతికేళ్ల సర్వీసు పుటప్ చేసిన నేను కాదు, అయిదేళ్ళైనా సర్వీసు లేని ఆవిడ చేసుకోవాలి’ వ్యంగ్యంగా నవ్వాను. వెంటనే వివిధ విభాగాల అధికార్లకి ఫోన్లు చేసి కాషన్ చేశాను. ‘నా డ్యూటీ పూర్తయింది’ మళ్లీ గ్లాసు నింపుకుంటూ కళ్లు చికిలిస్తూ నవ్వాను. అతడూ మాట్లాడలేదు. మాట్లాడానికేమైనా వుంటేగా! ఇంటికెళ్ళడానికి లేస్తోంటే మళ్లీ ఫోన్. ఆవిడే. ‘యూ డెవిల్’ తిట్టుకుంటూ కాల్ తీసుకున్నాను. ‘మీ సిటీలో సహాయక చర్యలు సక్రమంగా జరగట్లేదుట. ఒక డిపార్టుమెంట్కీ ఇంకో దానికీ కో–ఆర్డినేషన్ లేదట. మీరేం చేస్తున్నారు?’ ‘అలా కూసిన అక్కు పక్షి ఎవడు? అన్నీ నేనుగాకపోతే వాడమ్మా మొగుడు ఎవడు చేస్తున్నాడు?’ కయ్ మనేసి ఆ వెంటనే నాలిక్కరుచుకుని, స్టడీగా నిలబడ్డాను.. ‘సారీ మేడమ్. టంగ్ స్లిప్ అయింది. దగ్గరుండి అన్నీ నేనే పురమాయిస్తున్నాను మేడమ్’ ‘ఇది చాలదు. ఇంకా స్పీడప్ చెయ్యాలి. శ్రీరామపేటలోని డ్రైనేజులు పొంగి పొరలుతున్నాయి. షావుకారు పేటలో రోడ్డు అడ్డంగా కోసుకుపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. టీచర్స్ కాలనీలో ఇళ్లల్లోకి నీళ్ళొచ్చేశాయి. ముందు వాళ్లని అక్కడ్నుంచి తరలించండి. బస్తీలో కొందరింకా ఇళ్లల్లో చిక్కుకుపోయి వున్నారట. వాళ్లకి బోట్లు పంపండి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీదు. రిలీఫ్ మెటీరియల్ పంపిస్తున్నాం. స్టోరేజ్కీ సప్లైకీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి. సహాయ శిబిరాల్లోని పరిస్థితిని స్వయంగా చూసి రిపోర్టు చేయండి’ మందు నిషా దిగిపోయింది. ‘ఈవిడ నా ప్రాణానికి సైతాన్‌లా దాపురించిందే’ తిట్టుకుంటూ బయటికి నడిచాను. వర్షం ఈడ్చి కొడుతోంది. గాలి విసిరి అవతల పారేస్తోంది. ఇటువంటి పరిస్థితిలో బయటికెళ్లడానికి నేనేమైనా ఫీల్డ్ స్టాఫ్నా? ఉన్నతాధికారిని! డ్రైవర్ కారు తెచ్చాడు. ‘జాగ్రత్తగా ఇంటికి పోనియ్’ అన్నాను. ∙∙ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పడుకున్నాను. ఉదయం లేస్తూనే బయటికి చూశాను. దెయ్యం పట్టిన్టటు వూగిపోతోంది ప్రకృతి. సెల్ ఫోన్ స్విచ్ఛాన్ చేశానో లేదో మోగింది. మళ్లీ డెవిల్! ‘అంబేద్కర్ నగర్ మునిగిపోయింది. జనం దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. మీరేం చేస్తున్నారు? అసలు మీరెక్కడ వున్నారు?’ కళ్లు మూసుకుని పడింది. ‘ఆ దగ్గర్లోనే వుండి పరిస్థితులు సమీక్షిస్తున్నాను మేడమ్’. ‘దగ్గర్లో అంటే ఎంత దగ్గర్లో వున్నారు?’ ‘పది.. ఇరవై అడుగుల దూరంలో..’ ‘ఏ పక్కనున్నారు? ఎవర్తో వున్నారు? నాకెక్కడా కన్పించట్లేదే! తక్షణం నా ముందుకు రండి’ నా గుండెల్లో బాంబు విస్ఫోటించింది. రాత్రికి రాత్రే ఆ మహాతల్లి ఇక్కడికొచ్చినట్టుంది ఖర్మ! తిన్నగా నిద్రపోవడానిక్కూడా లేదు కదా! రెయిన్ కోట్ తొడుక్కుంటూ బయటికి పరుగెత్తాను. యుద్ధ ప్రాతిపదిక మీద చకచకా ఏర్పాట్లు చేస్తూ కన్పించింది కలెక్టర్ అనుపమ. నా కళ్లకు సుశిక్షిత సైన్యాధికారిగా కనిపిస్తోంటే గుటకలు మింగాను. దగ్గరికెళ్లి విష్ చేసినా నా వంక చూళ్లేదు. నన్ను పట్టించుకోలేదసలు. నా సబార్టినేట్స్ ముందు నా తల కొట్టేసినట్టు ఫీలయ్యాను. ‘అలా స్తంభంలా నిలడ్డారేం? గో! బియ్యం పప్పులూ దుప్పట్లూ పాతదుస్తులూ వగైరా రిలీఫ్ మెటీరియల్ చాలా వచ్చింది. వాటిని సేఫ్ ప్లేస్‌లో పెట్టించండి’ ‘స్కూళ్లు, కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు జనంతో నిండిపోయాయి మేడమ్’ ‘మీకీ నగరంలో అవి స్టోర్ చేయడానికి అనువైన చోటే కన్పించట్లేదా?’ తీవ్రంగా చూసింది. బుర్రగోక్కున్నాను. ఆ దిశగా ముందుగానే సమాచారం సేకరించి వుండాల్సింది. ఈవిడ ముందు దోషిలా నిలబడాల్సొచ్చేది కాదు. ఏం చేస్తాం. అంతా నా బ్యాడ్ లక్! ‘ఎనీ సజెషన్స్’ చుట్టూ వున్న వారి వంక చూసింది. ‘సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో బార్ కౌన్సిల్ వారి హాలు చాలా పెద్దగా వుంటుంది మేడమ్’ ఒకరన్నారు. ‘గుడ్ ఐడియా. వాళ్లతో మాట్లాడి వెంటనే పెట్టించెయ్యండి. వానలో తడిస్తే ఇబ్బంది. ఎందరో దాతలూ స్వచ్ఛంద సంస్థలూ పంపిన సాయం కాపాడుకోలేకపోతే, సక్రమంగా వినియోగించుకోలేకపోతే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేం. మనం ఇంత మందిమి వుండి కూడా లేనట్టే అవుతుంది’ ఉరిమినట్టుగా అంది. ఆ సలహా ఇచ్చిన వాడిని వెంటేసుకుని వెళ్లాను. బార్ అసోషియేషన్ అధ్యక్షుడ్ని స్వయంగా వెళ్లి కలిశాను. ‘మాది పబ్లిక్ ప్లేస్ కాదు. ఇవ్వం’ ముఖాన్నే చెప్పేశాడు. ‘ప్లీజ్. పరిస్థితి అర్థం చేసుకుని కాస్త కో ఆపరేట్ చేయండి’. ఇదీ చేయకపోతే అనుపమ నన్ను నమలకుండా మింగేయటం ఖాయం. అందుకే ‘ఆవిడ హుకుం’ అని కూడా చెప్పాను. కానీ అతడో మొండి ఘటంలా వున్నాడు. ఇచ్చేది లేదు పొమ్మన్నాడు. ‘నీ సంగతి రేపు నాతో అవసరం పడినప్పుడు చెబుతాన్లే’ అతడి వంక కసిగా చూస్తూ అనుకున్నాను. జరిగింది కలెక్టర్‌కి ఫోన్ చేసి చెప్పాను. ‘ఆ హాల్ ప్రభుత్వానికి అత్యవసరమని, హ్యాండోవర్ చెయ్యమని నోటీసిచ్చి సైట్‌కి వెళ్లండి. ఈలోగా రిలీఫ్ మెటీరియల్ అక్కడికి తెచ్చేలా చూసి, దాన్ని లోపల పెట్టించండి’ అప్పటికప్పుడు నాలుగు ముక్కలు గీకి ఇచ్చాను. అయినా అతడు అంగీకరించలేదు. నిస్సహాయుడినై దేభ్యం మొహం పెట్టుకుని మళ్లీ ఫోన్ చేశాను. ‘అవసరమైతే ఫోర్సు ఉపయోగించు. గో ఎహెడ్ ’ గర్జించింది. ‘మాది ప్రైవేటు ప్రోపర్టీ. దానిలోకి మీరూ పోలీసులూ ఎలా చొచ్చుకొస్తారో మేమూ చూస్తాం. ట్రెస్ పాసింగ్ చేస్తే మీ అందరి మీదా క్రిమినల్ కేసు పెడతాం. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం’ రంకెలేశాడు. ‘పోలీస్‌ని తీసుకుని కోర్టు కాంప్లెక్స్ కెళ్తున్నాను. మీరొచ్చి మర్యాదగా తాళాలు తీసి హ్యాండోవర్ చేయండి’ హెచ్చరించాను. మేం అక్కడికెళ్లే సరికి జోరున కురుస్తున్న వానని లెక్క చేయకుండా నలువైపుల్నుంచీ అడ్వొకేట్లు వివిధ వాహనాల్లో బిలబిలమంటూ వచ్చేశారు. మీడియా సైతం గద్దలా వాలిపోయింది. చిలికి చిలికి గాలి వాన అవుతోందని అర్థమవుతోంటే, గొడవ వద్దంటూ మరోసారి రిక్వెస్ట్ చేశాను. వాళ్లు కౌన్సిల్ హాలు ముందరి వరండాలో దారికడ్డంగా బైఠాయించి కించిత్తు కదిలేది లేదని భీష్మించారు. నా తలరాతని తిట్టుకుంటూ ఫోన్ చేసి చెప్పాను. ‘వాళ్లు ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు మేడమ్. లాయర్లతో తలపడడమంటే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది మేడమ్’ ఆమె జవాబివ్వలేదుగాని మరి పదినిమిషాల్లో మా ముందు ప్రత్యక్షమైంది. ‘తాళం తీయండి’ అధికార స్వరంతో వారితో అంది అనుపమ. ‘తీయం. మీ దౌర్జన్యం సహించం’ అంటూ, ‘కలెక్టర్ దౌర్జన్యం నశించాలి’ అని నినాదాలిచ్చారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని పిలిచి, ‘తాళం బద్దలు కొట్టు’ ఉగ్రరూపిణై ఆదేశించింది. ‘మేం దారివ్వం. బలవంతంగా ఆక్రమించుకునే హక్కు మీకు లేదు. దౌర్జన్యం చేయొద్దు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు’ తీవ్ర స్వరంతో అన్నాడు బార్ అధ్యక్షుడు. ‘ఎన్డీఆరెఫ్ యాక్ట్ 2005 సెక్షన్ 34 హెచ్, జె, ఎమ్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక ప్రయోజనార్థం ప్రభుత్వ లేక ప్రైవేటు సౌకర్యాల్ని ఉపయోగించుకునే హక్కు, అధికారం ప్రభుత్వానికుంది. దాని ప్రకారం ఈ విపత్కాలంలో అత్యవసర ఆహారపదార్థాలు నిల్వ చేయడానికి మీ బార్ హాల్ని ఉపయోగించుకుంటున్నాం. అడ్డు తప్పుకోండి’ అక్షరాలా గర్జించింది. అడ్వొకేట్ల దిమ్మదిరిగిపోయింది. ఆ ఏక్ట్ ఏంటో ఆ సెక్షన్లేంటో గుర్తు రాక నిశ్చేష్టులయ్యారు. అప్రయత్నంగా పక్కకు తప్పుకున్నారు. లారీల్లోని బియ్యం వగైరా రిలీఫ్ సామాగ్రిని కలెక్టర్ అనుపమ లోపల పెట్టిస్తోంటే ఆమె నాకు శక్తి రూపంలా కన్పించింది. నాకు నేను మరుగుజ్జుగా కన్పిస్తోంటే తలెత్తి చూస్తూ చేతులు జోడించాను! -సింహ ప్రసాద్ చదవండి: Keerthi Jalli IAS Officer Success Story: నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి -
Crime Story: పనిష్మెంట్.. ‘బొమ్మ’ ఎంత పనిచేసింది? ఆఖరికి ఏమైంది?
న్యూఢిల్లీ ..సీబీఐ ఆఫీస్..నాలుగు అంతస్తుల ఆ భవనానికి కట్టుదిట్టమైన భద్రతతో .. అడుగడుగునా శక్తిమంతమైన సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. నాలుగవ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సీబీఐ డైరెక్టర్లు .. మిగిలినవారు ఎవరికోసమో ఉత్కంఠగా వేచి ఉన్నారు. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న కిరణ్ మిశ్రాను అభినందనలతో ముంచెత్తారు. వారి అభినందనలను స్వీకరిస్తూనే ఆలోచనల్లోకి జారిపోయాడు కిరణ్ మిశ్రా. ∙∙∙ ఒక ఉగ్రవాద ముఠా దేశంలోకి రహస్యంగా ప్రవేశించిందని .. దేశంలో పలుచోట్ల అల్లకల్లోలం సృష్టించడానికి పన్నాగంతోనే వారు వచ్చినట్టు సీబీఐ ఏజెంట్లు పసిగట్టారు. ఆ సమాచారం తెలియగానే సీబీఐ చీఫ్.. రాజీవ్ అగర్వాల్ వెంటనే కిరణ్ మిశ్రాతో రహస్య సమావేశమయ్యాడు. ‘మిస్టర్ మిశ్రా.. మనకు మన ఏజెంట్లు అందించిన సమాచారం మీకు తెలిసిందే కదా! ఆ ఉగ్రవాద ముఠాను సమూలంగా అంతమొందించాలి. ఈ పనికి మీరు మాత్రమే సమర్థులు. మీకు ‘షూట్ ఎట్ సైట్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఉగ్రవాదులను మీరు ప్రాణాలతో పట్టుకున్నా సరే .. లేకుంటే.. అంటూ ఆగిపోయాడు. అందుకు సమాధానంగా కిరణ్ మిశ్రా.. ‘సర్ ఆ ఉగ్రవాద ముఠాను మన దేశంలో లేకుండా చేస్తాను. అది ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత’ అంటూ పైకి లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ∙∙∙ కాన్ఫరెన్స్ హాల్లో అందరు వెళ్లిపోయారు. అక్కడ కిరణ్ మిశ్రా తప్ప ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి చీఫ్ రాజీవ్ అగర్వాల్ అడుగుపెట్టాడు. మిస్టర్ మిశ్రా అని అతడి భుజంపై చేయి వేశాడు. ఉలిక్కిపడి తేరుకున్న కిరణ్ మిశ్రా చీఫ్‌ను చూస్తూ విష్ చేశాడు. అతడిని చూస్తూ ఏదో జరిగిందని ఇట్టే గ్రహించాడు అగర్వాల్. ‘ఏం జరిగింది?’ అడుగుతూ అక్కడున్న కుర్చీని చూపిస్తూ తాను కూడా మరొక కుర్చీలో కూర్చున్నాడు చీఫ్ అగర్వాల్. ‘సర్.. నేను ఆ ఉగ్రవాద ముఠా జాడ కనిపెట్టి వారిని బంధించాలని చూశాను. కానీ వారి ప్రాణాలు బలి తీసుకొనక తప్పలేదు’ అంటూ ఆగిపోయాడు. అది వింటున్న సీబీఐ చీఫ్.. ‘అదంతా మన వృత్తిలో భాగమే కదా! అయినా మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు’ అంటున్న చీఫ్ మాటలకూ అడ్డు పడుతూ ..‘సర్ ఆ ముఠాలో ఇద్దరు చాలా తెలివిగా తప్పించుకున్నారు. వారి నుండి ప్రమాదం పొంచి ఉంది’ అని ఆందోళనగా చెప్తున్న కిరణ్ మిశ్రాను చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు రాజీవ్ అగర్వాల్. కొద్దిసేపటి తర్వాత ‘మీ ఇంటి వద్ద సెక్యూరిటీని మఫ్టీలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇంకా మీ అమ్మాయి వెళ్లే స్కూల్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను పెంచుతాను’ అని అక్కడున్న బజర్ మోగించాడు. సరిగ్గా అదే సమయంలో.. శిఖర్ స్కూల్.. సాయంత్రం స్కూల్ బెల్ మోగింది. పిల్లలందరితో పాటు దక్ష బయటకు వచ్చింది. ఇంతలో ఒక చెట్టు పక్క ఒక వ్యక్తి.. ఆ వ్యక్తి చేతిలో పట్టుకున్న బొమ్మలు దక్షను ఆకర్షించాయి. దక్ష తన వద్ద ఉన్న వంద రూపాయలను ఇచ్చి ఆ బొమ్మను తీసుకుంది. ∙∙∙ ఇంటికి వెళ్లిన దక్ష.. తాను తెచ్చుకున్న బొమ్మను బయటకు తీయకుండా తన స్కూల్ బాగ్‌లోనే దాచి పెట్టింది. దక్షకు తాను తెచ్చుకున్న బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆతృతగా ఉంది. ఇంతలో కిరణ్ మిశ్రా లోపలికి అడుగు పెట్టాడు. తండ్రితో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండిపోయిన దక్షకు ఉన్నట్టుండి తాను కొనుక్కున్న బొమ్మ గుర్తొచ్చింది. బొమ్మను తీసుకొచ్చి చూపిస్తూ ‘నాన్నా ఈ బొమ్మ చూడు.. దీని కళ్ళు ఎంత బాగా ఆర్పుతుందో చూడు’ అంటూ ఆ బొమ్మను తండ్రి చేతిలో పెట్టింది దక్ష. బొమ్మను అటు ఇటు తిప్పి చూస్తూ ఏదో అడగబోతున్న కిరణ్ మిశ్రాకు బయట నుండి ‘సర్’ అన్న పిలుపు వినిపించింది. బయట సీబీఐ చీఫ్ పంపించిన సెక్యూరిటీ వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు మిశ్రా. బొమ్మ సంగతి మరిచిపోయాడు. ∙∙∙ తర్వాత మిశ్రాకు ఒక కేసు పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఎయిర్ పోర్ట్ చేరుకున్న మిశ్రాకు తాను వెళ్లబోయే విమానం రెండుగంటలు ఆలస్యం అని తెలిసింది. టైమ్ చూసి ఇంకా దాదాపు గంటన్నర సమయం ఉందనుకుంటూ లాప్టాప్లో ఏదో పని చేసుకోసాగాడు మిశ్రా. అనుకోకుండా లాప్టాప్లో మరొక సైట్ ఓపెన్ అయ్యింది. ఆ సైట్లో ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ గురించిన సమాచారం చూస్తున్న మిశ్రాకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. ‘అచ్చం అలాంటి బొమ్మని కూతురు దక్ష వద్ద చూశాడు!’ అది గుర్తు రాగానే కంగారుగా పైకి లేచాడు. తానిప్పుడు వెళ్ళాల్సింది విమానంలోకి కాదు. వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి.. ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. కానీ ఏ ఒక్కరి ఫోన్ కూడా పని చెయ్యడం లేదు. వెంటనే ఏదో జరిగిందని మిశ్రాకు రూఢి అయ్యింది. అతని మెదడు శరవేగంగా ఆలోచించసాగింది. వెంటనే సీబీఐ ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. వారితో.. ‘మీరు వెంటనే వెళ్లి మా ఇంటిని చుట్టుముట్టండి. క్విక్.. తొందరగా.. ఏ మాత్రం సమయం లేదు’ చెప్పుకుపోతున్నాడు మిశ్రా. కేవలం పది నిమిషాల్లో సీబీఐ కమాండోలు మిశ్రా ఇంటి వద్దకు చేరుకున్నారు.అక్కడ.. సెక్యూరిటీ వాళ్ళు పడిపోయి ఉన్నారు. మిశ్రా ఇంటి తలుపులు వారగా వేసి ఉన్నాయి. లోపలకు వెళ్ళడానికి తుపాకులు ఎక్కుపెట్టి మెల్లిగా తలుపులను తోశారు. లోపల ఏదో పొగ లాంటిది కమ్ముకుని ఉంది. కమాండోలు ఆ పొగ తమను కమ్ముకోకుండా ప్రయత్నాలు చేస్తూ లోపలికి అడుగుపెట్టారు. ఇంతలో వారికి ఎదురుగా ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు శ్రుతిని, దక్షను తీసుకుని బయటకు వస్తున్నారు. వారిద్దరూ అప్పటికే స్పృహ తప్పి ఉన్నారు. వారిని చూసిన కమాండోలు వారిపై తుపాకీలు ఎక్కుపెట్టారు. కానీ ఆ ముసుగు వ్యక్తులు ఒకరు శ్రుతిని .. మరొకరు ఆమె కూతురు దక్షను అడ్డం పెట్టుకుని వస్తున్నారు. ఒకవేళ కమాండోలు వారిని షూట్ చేస్తే ఆ బుల్లెట్లు శ్రుతికో.. దక్షకో తప్పకుండా తగులుతాయి. కమాండోలు నిస్సహాయులై బయటకు నడిచారు. ముసుగు వ్యక్తులు బయటకు రాగానే ఆ ఇంటి ముందుకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. స్పృహ తప్పిన శ్రుతిని భుజాన వేసుకుని ఒక ముసుగు వ్యక్తి ... స్పృహలో లేని దక్షను ఎత్తుకున్న మరో ముసుగు వ్యక్తి ఆ వ్యాన్ ఎక్కబోయే ఆ సమయంలో ఆ ముసుగు వ్యక్తుల వెనుక.. తుపాకీ గుళ్ల వర్షం. ఆ బుల్లెట్ల దెబ్బలకి అక్కడే కుప్పకూలిపోయారు ఆ ముసుగు వ్యక్తులు. ఇంతలో మరికొన్ని బుల్లెట్లు ఆ వ్యాన్ చక్రాల మీద దిగాయి. కింద పడిపోయిన శ్రుతిని, దక్షను కమాండోలు లేవదీయబోతూ .. ఆ బుల్లెట్లు ఎక్కడనుండి వచ్చాయా అని వెనుతిరిగి చూశారు. అక్కడ.. సీబీఐ చీఫ్ రాజీవ్ అగర్వాల్. చీఫ్‌ను చూసిన కమండోలు సెల్యూట్ చేశారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న మిశ్రా మెల్లిగా పైకి లేస్తున్న దక్షను.. శ్రుతిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘సర్.. మీరిక్కడ’’.. అని అడగబోతున్న మిశ్రాను చూసిన చీఫ్ ‘‘నీ ఫోన్ వల్లే నేనిక్కడికి చేరుకున్నాను. కానీ మీ ఇంట్లో ఇలా జరుగుతుందని నీకెలా తెలుసు?’’ ప్రశ్నించాడు చీఫ్. ‘సర్ నేను ఎయిర్ పోర్ట్‌లో ఉన్నప్పుడు ఒక బొమ్మ చూశాను. అదే బొమ్మ నా కూతురు వద్ద ఉండటం నాకు గుర్తొచ్చింది. ఏదో జరగబోతుందని ఊహించాను. ఆ బొమ్మ పేరు...‘ మై ఫ్రెండ్ కేలా’. జర్మనీలో తయారైన ఈ బొమ్మలో అతి శక్తిమంతమైన బ్లూ టూత్ని అమర్చి ఆ బొమ్మ ఉన్న చుట్టుపక్కల మాట్లాడే మాటలు మొత్తం వింటారు. అంతే కాదు ఆ బొమ్మకు సంబందించిన వెబ్సైట్లోకి యాక్సిస్ అయితే చాలు.. ఆ బొమ్మ ఎక్కడ ఉన్నది దాని ద్వారా జరిగే పనులన్నిటినీ తెలుసుకోవచ్చు. శత్రువులు ఇలా ఈ ‘మై ఫ్రెండ్ కేలా’ బొమ్మ ద్వారా నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు’ అని వివరించాడు మిశ్రా. అంతా వింటున్న దక్ష ఇంటిలోపలికి పరిగెత్తుకు వెళ్లి తన బ్యాగ్‌లో ఉన్న బొమ్మను తెచ్చి బయటకు విసిరేసింది. వెంటనే అక్కడున్న కమండోలు ఆ బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ‘వెల్ డన్ మిస్టర్ మిశ్రా’.. అంటూ సీబీఐ చీఫ్ మిశ్రా భుజం తట్టి అక్కడ నుండి ముందుకు కదిలాడు. ‘నాన్నా’ అంటూ వచ్చిన దక్షను ఎత్తుకుని తన భార్య శ్రుతి చేయి పట్టుకుని ఇంటి లోపలికి నడిచాడు కిరణ్ మిశ్రా. -శ్రీసుధామయి ఇది కూడా చదవండి: క్రైం స్టోరీ: బ్లాక్‌మెయిలర్.. చచ్చిపోయాడంటూ బెదిరించి డబ్బు గుంజి.. ఆఖరికి -
కథ: నూటొక్క దర్శనాలు.. స్వామివారు కాంక్షించేది కూడా అదే ఇంద్రనీల్!
ఇంద్రనీల్ కళ్ళ నుండి నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా.. మనసుకు ఎంత సర్దిచెప్పినా కన్నీటి ధార ఆగటం లేదు. ఎంతో ఇష్టపడిన తిరుపతిని వదిలి హైదరాబాద్ కాంక్రీట్ అరణ్యానికి మూడు నెలల్లో వెళ్ళాల్సిందే. తిరుపతికి వచ్చిన లక్ష్యం నెరవేరనే లేదు. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడిచిపోయాయి. ఇంద్రనీల్‌ను చూసి.. ఏమాత్రం ఆశ్చర్యపోలేదు వైదేహి. స్వామివారు అంటే ఇంద్రనీల్‌కు ఎంత భక్తో ఆమెకు తెలుసు. తోటి ప్రయాణీకులు ఇంద్రనీల్‌ను గమనించకుండా కిటికీ వైపు కూర్చోబెట్టింది. అతనికి మనసు బరువెక్కుతున్నట్లు అనిపించింది. ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో బిగ్గరగా ఏడిస్తేగానీ ఉపశమనం లభించేటట్లు లేదు. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట తన చెల్లెలు పున్నమ్మ చనిపోయినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు బిగ్గరగా ఏడ్వడం వల్లనేమో గుండె ఇంత బరువెక్కిట్లుగా అనిపించలేదు. అప్పటికే బస్సు అలిపిరి తనిఖీ పాయింట్ దాటి గరుడాద్రి కొండ మీదుగా దూసుకుపోతోంది. మెడిసిన్‌లో సీట్ వచ్చినప్పుడు, డిగ్రీ అందుకొన్న తర్వాత స్వామి వారి దర్శనం కోసం రావటం ఆనవాయితీగా మారింది. స్వామివారు తను కోరుకున్నవన్నీ ఇచ్చారు కొంచెం ముందూ..వెనకలుగా. అందుకే అతనికి స్వామివారంటే ఎనలేని భక్తి! తొలినాళ్ళలో మొక్కు తీర్చటం కోసం మొక్కుబడిగా మెట్లెక్కిన పాదాలు తిరిగి వెళ్ళేటప్పుడు మెట్లు దిగమని మారాం చేయటం, తిరిగి వెళుతుంటే మనసు కలత చెందడం తనకింకా గుర్తు. హైదరాబాదు నుండి శనివారం సాయంత్రం నారాయణాద్రి రైలుకు బయలుదేరి, సోమవారం సాయంత్రం పద్మావతి రైలుకు తిరిగి వెళ్ళటం, నిమిషం పాటు గోవిందుడి దర్శనం, గంటలోనే తిరుమలగిరి వీడటం మనోవేదనకు గురిచేసేది. ఎలాగైనా జీవితంలో కొంతసమయం స్వామివారి చెంత గడపాలని, స్వామివారిని మనసారా దర్శించుకోవాలని, స్వామివారి అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనాలని ఇంద్రనీల్ దృఢంగా నిశ్చయించు కున్నాడు. దానికి తిరుపతిలో పీజీ చేయడమొక్కటే మార్గంగా తోచింది. అనుకున్నట్లుగానే తిరుపతి.. వైద్యకళాశాలలో సీట్ దొరికింది. ఆనందానికి హద్దుల్లేవు. మూడేళ్ళ కోర్స్‌లో లెక్క వేస్తే నూట నలభై నాలుగు ఆదివారాలు సెలవులుగా దొరకనున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురై నలభై పైచిలుకు మినహాయించుకున్నా నూరున్నొక్క మార్లు మలయప్ప స్వామి దర్శనం పొందవచ్చు. వీలును బట్టి నిజపాద, తిరుప్పాడ, అష్టదళ పాద పద్మారాధన, మొదలగు అన్ని సేవలూ ఈ మూడు నెలల్లో పూర్తి చేసుకోవాలన్నది ఇంద్రనీల్ అభిమతం. అయితే ఇంద్రనీల్ సంబరం ఎక్కువకాలం నిలవలేదు. దైవం వరమిచ్చినా పూజారి వరమియ్యలేదన్న చందాన ప్రొఫెసర్ సత్యారావు స్వామివారి దర్శనాలకు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ప్రొఫెసర్ సత్యారావు ప్రవర్తన స్థూలంగా శోధిస్తే అంతర్లీనంగా నాస్తికుడేమో అనిపించింది ఇంద్రనీల్‌కు. మంగళవారం నాడు ఎక్స్‌రే క్లాస్‌లు, గురువారం సెమినార్లు, శనివారం జర్నల్ క్లబ్ మీటింగ్స్. మిగతా రోజుల్లో రాత్రి పది వరకూ సాగే ప్రొఫెసర్ సత్యారావు ఈవెనింగ్ క్లినిక్స్‌తో వారం గడిచిపోయేది. ఇక్కడి వరకూ సరిపెట్టుకున్నా ఆదివారం రోజుల్లో సాయంత్రం వరకూ జరిగే పక్షవాత, మూర్ఛరోగుల క్యాంప్‌లతో.. ప్రొఫెసర్ సత్యారావు విద్యార్థుల వెన్ను విరిచేవాడు. మిగతా రోజులకూ ఆదివారానికి తేడా ఏమిటంటే, ఆదివారం నాడు మాత్రం సాయంత్రం ఆరు గంటలకే హాస్టల్ చేరుకునే వెసులుబాటు కల్పించాడు. 24 గంటల విధులు నిర్వర్తించేటప్పుడు మధ్యరాత్రి సెల్‌ఫోన్‌కు కాల్ చేసి విధుల్లో ఉన్నారో లేరో తెలుసుకునేది. సెల్ఫోన్లో వెంటిలేటర్ శబ్దాలు వినపడకపోతే ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి వార్డులో ఉన్నారో లేరో నిర్ధారించుకునేది. వార్డు రౌండ్స్కయితే పిండప్రదాన కాకి కోసం ఎదురుచూసినట్లుగా వుండేది. ఒకరోజు ఉదయం తొమ్మిదికే పూర్తయితే మరొకరోజు రాత్రి పదకొండు అయ్యేది. ఏమైనా రాత్రి పదకొండు తర్వాతే విరామం. హాస్టల్ నుండి ఆసుపత్రికెళ్ళేటప్పుడు పగలు గాలిగోపురం, రాత్రివేళల్లో తిరుమలకు వెళ్ళే బస్సుల హెడ్‌లైట్స్ కాంతులు హాస్టల్ కిటికీ నుండి చూసి మురిసిపోవటం తప్ప ఆసుపత్రి ప్రాంగణమే దాటింది లేదు ఇంద్రనీల్. ప్రొఫెసర్లు విషయ పరిజ్ఞానంలో ఎంత ఎత్తు ఎదిగినా కొద్దిమంది ప్రొఫెసర్లు మాత్రం స్త్రీలోలత్వం, కులం, మతం, ప్రాంతీయతత్వం జాడ్యాలతో మరుగుజ్జులవుతారనేది వాస్తవం. ప్రొఫెసర్ సత్యారావుకి వీటిల్లో ఏ బలహీనత వున్నా స్వామి వారి దర్శనానికి కొంత వెసులుబాటు వుండేదేమో అనిపించేది ఇంద్రనీల్‌కి. ప్రొఫెసర్ సత్యారావు అప్పుడప్పుడు సెమినార్లలో క్షీరాన్నం, కదంబం, శుద్ధాన్నం లాంటి సామాన్యులకు అందని ప్రసాదాన్ని పంచేవారు. అదే ఇంద్రనీల్‌కు మహాభాగ్యమనిపించేది. బస్సు వెంకటాద్రి కొండ మీదకు చేరినట్లుంది. చెట్లల్లో కోతులు, కొండముచ్చుల గెంతులు, కొండచరియల్లోంచి జాలువారే నీళ్ళు, మూలమలుపుల్లో గోవిందుడి నామాలు, అశ్వగంధ, శతావరి ఔషధ మొక్కలను తాకుతూ ఒంటిని స్పృశిస్తూ వెళ్తున్న స్వచ్ఛమైన గాలి, కనుచూపు మేర పచ్చదనం కనువిందు చేస్తుంటే ఇంద్రనీల్ మనసు మెల్లగా కుదుటపడసాగింది. లక్ష్యం నెరవేరనప్పుడు గమ్యం మార్చాల్సి వుంటుంది. గమ్యం కోసం గమనం మార్పు చేయాలనుకున్నాడు ఇంద్రనీల్. మొదటగా నూటొక్క దర్శనాలు అనుకున్నాడు. అది వీలు కానప్పుడు స్వామివారి మహాద్వారం దర్శనమయితే చాలు అని రాజీ పడ్డాడు. అదీ వీలు కాలేదు. కాబట్టి రేపటి ఎల్2 దర్శనంలో మొదటి ప్రాకారం నుండి స్వామి వారి దివ్యమంగళ దర్శనం వరకు ప్రతీ అంగుళాన్ని అనేకమార్లు చూసి మస్తిష్కంలో శాశ్వతంగా ముద్ర వేసుకొనేలా చేసుకోవాలి. రోజువారి పూజలో గోవింద నామాల పఠనం అనంతరం కళ్ళు మూసుకొని ఆలయం ప్రతిరోజూ అడుగిడుతున్నట్లు వజ్రమకుటధారిని దర్శించుకున్నట్లు భావించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బస్సు రామ్‌బగీచా ప్రయాణ ప్రాంగణం చేరుకున్నట్లు గమనించనే లేదు. ఇక బస్సు దిగండి అన్న వైదేహి పిలుపుతో స్వామివారి ఆలోచనల నుండి బయటపడి పద్మావతి గృహం చేరుకున్నారు ఇద్దరూ. ∙∙ ఉదయం ఆరుకావస్తోంది.. ఎల్2 వి.ఐ.పి. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ కవి ఆచార్య ఆత్రేయ చెప్పినట్లుగా కునుకు పడ్డాక మనసు పూర్తిగా కుదుటపడటమే కాకుండా గంటలో నారాయణుడి దర్శనం కోసం తీపి కలలు కంటున్నది. శరీరం పూర్తిగా తేలికయి గాల్లో తేలుతున్నట్లు ఎంత బలంగా ఆడుగేసినా పాదాలు నేలనే తాకనట్లు అనిపిస్తోంది ఇంద్రనీల్‌కు. తమ ఎల్2 టిక్కెట్టు, గుర్తింపుకార్డు ఆలయ సిబ్బందికి అందజేశారు భార్యభర్తలు. ఇంద్రనీల్ గుర్తింపుకార్డు చూడగానే ఆలయ సిబ్బంది ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకలా చూసుకుంటున్నారో అర్థంకాక ఇంద్రనీల్.. వైదేహి వైపు చూశాడు. సిబ్బందిలో ఒకరు ‘మీరు ప్రొఫెసర్ సత్యారావు స్టూడెంట్ కదా!’ అని అడిగాడు. అవును అని గర్వంతో ఇంద్రనీల్ సమాధానమిచ్చాడు. ‘క్షమించాలి, మీ దర్శనం రద్దయింది. మీ కోసం మీ స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. వైదేహిగారు మాత్రం దర్శనానికి వెళ్లొచ్చు’ అని చెప్పాడు. ఈ అనూహ్య పరిణామానికి ఇంద్రనీల్ స్థాణువైపోయాడు. గొంతు పూర్తిగా తడారిపోయింది. మంచినీళ్ళు తాగితేగానీ మాట్లాడే పరిస్థితి లేదు. గుండెవేగం హెచ్చయి, శ్వాస అందనట్లుగా అనిపించింది. వైదేహేమో.. తనకు 50వ దర్శనం పూర్తి కావస్తున్నందుకు స్వామివారి దర్శనానికి వెళ్ళాలో లేక ఇంద్రనీల్‌కు తోడుగా వుండిపోవాలో తెలియని త్రిశంకు స్వర్గంలో వుంది. అక్కడ ప్రొఫెసర్ సత్యారావు పీఏ కేశవ్, అంబులెన్స్ డ్రైవర్ వాసుదేవరెడ్డి ప్రత్యక్షం కావటంతో ఇంద్రనీల్ వారి కళ్ళల్లోకి సూటిగా చూడగానే వాళ్ళు వణికిపోయారు. కొంచెం మంచినీళ్ళు తాగి తమాయించుకొని వైదేహిని దర్శనం వైపు సాగమని సైగ చేశాడు ఇంద్రనీల్. ‘సర్.. తమిళనాడు, కృష్ణగిరి నుండి ఓ క్వారీ కార్మికుడిని మన ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అతను చావుబతుకుల్లో ఉన్నాడు. డ్యూటీ డాక్టర్ దుష్యంత్బాబుకేమో జ్వరం. కృష్ణగిరి నుంచి వస్తున్న పేషంట్కేమో వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సత్యారావు అయ్యగారు.. మిమ్మల్ని దర్శనం రద్దుచేసుకొని వెంటనే రమ్మాన్నారు సర్..’ అంటూ ఆగాడు కేశవ్. ‘సెల్ఫోన్లో మిమ్మల్ని సంప్రదించడానికి అయ్యగారు ప్రయత్నించారు. నిన్నటి నుండి స్విచ్ఛాఫ్ వస్తోంది మీ ఫోన్’ అనీ వివరించాడు. పూర్వజన్మ పాపమేదో తనను వెంటాడి స్వామివారి దర్శనం దూరం చేస్తున్నట్లు భావించసాగాడు ఇంద్రనీల్. నూటొక్క దర్శనాల లక్ష్యంలో ఎంత కష్టపడ్డా ఒక్కటంటే ఒక్కటేసారి స్వామివారిని దర్శించుకునే వీలయింది. ఎల్2 టికెట్ ప్రొఫెసర్ మంజూరు చేసినందున ఇక చేసేదేమీ లేక వారిని అనుసరించాడు ఇంద్రనీల్. అంబులెన్స్‌లో కొండ దిగుతుండగానే పేషంట్ ట్రీట్మెంట్ కోసం నర్సింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు ఇంద్రనీల్. ఆచార్యులపై గల కోపం, దర్శనం కాలేదన్న నిస్పృహ పేషంట్ పై గానీ, పేషంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గానీ చూపకూడదని ముందుగానే నిశ్చయించుకున్నాడు అతను. పేషంట్ పరిస్థితి విషమంగా వుంది. అపస్మారక స్థితిలో వుండి, నాడీ దొరక్కపోవటమే గాక బీపీ కూడా రికార్డు కావటం లేదు. ఐసీయూలో వుంచి చికిత్స చేశాడు. అవసరమైతే వెంటిలేటర్ మీద వుంచాల్సి వస్తుందని పేషంట్ బంధువులకు వివరించాడు. తర్వాత కొన్నిరోజులకు లైబ్రరీలో జర్నల్స్ చదువుతుండగా ప్రొఫెసర్ సహాయకుడు కేశవ్ వచ్చి ప్రొఫెసర్ సత్యారావు తన చాంబర్‌కు రమ్మన్నాడని చెప్పటంతో ఇంద్రనీల్ బయలుదేరాడు. గది ముందు పదిమంది దాకా జనం పోగైవున్నారు. ట్రీట్మెంట్లో ఏదో లోపంతో పేషంట్ చనిపోయి వుంటాడని, గొడవేదో జరగబోతున్నట్లు ఇంద్రనీల్ మనసు భయపడుతోంది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయింది. లోపలికి వెళ్ళగానే ప్రొఫెసర్ సత్యారావు ఇంద్రనీల్‌కు ఒక వ్యక్తిని చూపిస్తూ ‘ఇతన్ని గుర్తుపట్టారా?’ అని అడిగాడు. ఇంద్రనీల్ ‘గుర్తుపట్టలేదు సర్’ అని జవాబిచ్చాడు. ‘‘వీరిలో ఎవరినైనా గుర్తుపట్టగలరా’’ అని ఆయన కుటుంబ సభ్యులను చూపిస్తూ మళ్ళీ చిరునవ్వుతో అడిగాడు సత్యారావు. ‘నేనయ్యా వెంకటేశాన్ని’ అని ఆ వ్యక్తి ఇంద్రనీల్ కాళ్ళమీద పడి ఏడుస్తున్నాడు. అతనితో పాటు ఆయన భార్యాపిల్లలు ఇంద్రనీల్ కాళ్ళు మొక్కబోతుండగా వద్దని వారించాడు ఇంద్రనీల్. ‘ఆ రోజున మీరు సమయానికి రాకుంటే నేనేమయ్యేవాడినయ్యా..! ఆ రోజు పొద్దున్నే ఇంకా నిద్రలో ఉండగానే.. వున్నట్లుండి తలలో పిడుగుపడినట్లు నొప్పి మొదలైందయ్యా! ఆ వెంటనే కుడికాలు, చేయి కదల్లేదు. మా ఆవిడకు చెబుదామంటే నోట మాట పెగల్లేదు. అటు ఇటు కదిలి ఎలాగోలా మా ఆవిడను నిద్రలేపాను. ఏదో జరుగుతోందని, నేను బతికేలా లేననిపించింది. నేను చనిపోతే నా ముగ్గురు ఆడపిల్లలకు దిక్కెవరు? వాళ్ళను పెంచేదెవరు? పెళ్ళి చేసేదెవరు? అన్న దిగులు పట్టుకుంది. పిల్లల పెళ్ళిల్లయ్యేవరకు బతికించి ఆ మరుక్షణమే నన్ను తీసుకెళ్ళమని భగవంతుని మొక్కుకున్నా. నా అనారోగ్యం గురించి మా ఆవిడ మా క్వారీ యజమానికి చెప్పింది. అతను వెంటనే వచ్చి నన్ను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆడపిల్లలు వున్నారు, ఎలాగైనా ప్రాణం కాపాడమని సత్యారావు దొరకు పదే, పదే దారి పొడవునా ఫోన్ చేశాడు. వైద్యానికి ఎంతైనా భరిస్తానని భరోసా ఇచ్చాడు. సమయానికి మీరు వచ్చి వైద్యం చేశారయ్యా! నా వేలికున్న స్వామి వారి ఉంగరం చూసి, మీ వేలికున్న స్వామివారి ఉంగరాన్ని చూపించి స్వామి పంపితేనే నేను వచ్చానని మీరు చెప్పినప్పుడు నాకు ధైర్యం చెబుతున్నారే తప్ప నిజమనిపించలేదు. కానీ మీరు చెప్పిందే నిజమై ప్రాణాలతో బయటపడ్డా. మోకాళ్ళపై కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానయ్యా. కొండపై దేవుడ్ని చూశాక కొండ కింద దేవుడంతటి మీ దర్శనం కూడా చేసుకోవాలని వచ్చానయ్యా! మీకు ఏమిచ్చినా ఋణం తీరదు’ అంటూ స్వామివారి ప్రసాదం, చిత్రపటం ఇంద్రనీల్‌కు అందించాడు. ఇంద్రనీల్ కన్నీళ్ళు జాలువారి వెంకటేశం చేతుల మీద పడ్డాయి. ‘స్వామి పట్ల మీ అచంచల భక్తి.. స్వామిని పలుమార్లు చూడాలన్న దర్శనవాంఛ నాకు తెలుసు ఇంద్రనీల్’ అన్నాడు ప్రొఫెసర్ సత్యారావు. ఆ మాటకు ఇంద్రనీల్ ఆశ్చర్యపోయాడు. ‘భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పినట్లుగా మనం లేని కాలమే లేదు. అయితే వర్తమానంలో మనుషులను స్వస్థపరచే అత్యున్నతమైన వృత్తిలో ఉన్నాం. ఇంక ఇంతకంటే ఉన్నత స్థితి లేదు. తలచుకుంటే మీరు, నేను ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకొని ఆనందపడవచ్చు. మనం ఎన్నిమార్లు దర్శించుకోవటం కన్నా ఎంతమందికి వ్యాధులను నయం చేసి వాళ్లను స్వామివారి దర్శనానికి పంపి వాళ్ల కళ్లతో మనం స్వామిని దర్శించుకున్నామనేదే నా లెక్క. స్వామివారు కాంక్షించేది కూడా అదే. నేను మీకిచ్చిన ప్రసాదాలు నేను దర్శనానికి వెళ్ళి తెచ్చినవి కావు, ఇలాగే ఆరోగ్యం మెరుగైన వాళ్లు స్వామివారి దర్శనానికి వెళ్ళి తెచ్చినవి’ అని చెప్పాడు ప్రొఫెసర్ సత్యారావు. ఇన్నాళ్లు తను ప్రొఫెసర్‌ను అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డాడు ఇంద్రనీల్. కళ్ళల్లో నీటిపొర కమ్ముకోవడంతో ప్రొఫెసర్ సత్యారావు అస్పష్టంగా కనిపించసాగారు. రెండడుగులు ముందుకు వేసి ప్రొఫెసర్ పాదాలవైపు వంగేసరికి కన్నీటి చుక్కలు ప్రొఫెసర్ పాదాలపై జాలువారి స్పష్టంగా కనిపించిన అతని కాళ్లకు ప్రణమిల్లాడు. నూటొక్క మార్ల దర్శనం కన్నా నూటొక్క రోగులను బాగుచేసి స్వామి వారి దర్శనానికి పంపటమే తక్షణ కర్తవ్యంగా నిర్ణయించుకొని ఇంద్రనీల్ తిరిగి గ్రంథాలయం వైపు అడుగులేశాడు. -డా. వి.ఎన్. మాధవరావు చదవండి: ఈవారం కథ: తమ తమ నెలవులు.. లండన్ వెళ్లిన భర్త.. ఆమె పరిచయం ఎక్కడికి దారితీసింది? -
కథ: తమ తమ నెలవులు.. లండన్ వెళ్లిన భర్త.. ఆమె పరిచయంతో..
‘వెళ్లడం అవసరమా? అసలే చలికాలం. పైగా నీ చిన్న కూతురు నువ్వు లేకపోతే ముద్ద కూడా ముట్టుకోదు. దాన్ని దారిలోకి తీసుకురావడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందో!’ సూటుకేసులో బట్టల్ని మరోసారి లెక్క చూస్తూ నా వైపు జాలిగా చూసింది తను. ‘తెలిసి కూడా అడుగుతావేంటి? ఇది తప్పించుకోలేని బాధ్యత. వెళ్లక తప్పదు. ఆరు వారాలేగా?’ ‘మ్..’ ఆడవాళ్ళ ప్రతీ ‘మ్’ కి వంద అర్థాలు ఉంటాయి అనుకుంటా. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ‘పోనీ న్యూ ఇయర్‌కి నువ్వు కూడా అక్కడికి రావొచ్చు కదా? చాలా రోజులయింది మనం అలా ఎటైనా వెళ్లి. ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది వీసా’ . ‘వేరే చోటుకైతే వచ్చేదాన్నే. ఇది నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. నీ కోసం వెళ్ళాలి’ నవ్వింది. ‘నాన్నా.. మేమూ వస్తాం.. మేమూ వస్తాం..’ నేనేదో చెప్పేలోపు, ఏడుస్తూ వచ్చేసి నన్ను పట్టేసుకున్నారు పిల్లలిద్దరూ. ‘నాన్న ఎక్కడికీ వెళ్లట్లేదు గానీ పదండి ముందు. నేను వీళ్ళని పడుకోబెట్టి వస్తా. నువ్వు ఏమైనా మర్చిపోతే సర్దుకో ఈ లోపు’ అంటూ పిల్లల్ని నా నుంచి విడిపించి, తను తీసుకుని వెళ్ళిపోయింది. తను సర్దిన బ్యాగుల వంక చూశాను. చేతి రుమాలుతో సహా అన్నీ సరిగ్గా ఉన్నాయి. నవ్వొచ్చింది. ఈ ఆడవాళ్ళకి ఎలా తెలుస్తాయో మన చిన్నచిన్న అవసరాలు కూడా. తెల్లవారు జామున ఫ్లైటు. ఇంకా నాలుగు గంటల టైముంది. నిద్ర పట్టట్లేదు. అలవాటైన ప్రయాణాలే అయినా ప్రతిసారీ కొత్తే. బలవంతంగా కళ్ళు మూసేశాను. కళ్ళను మూసినంత వేగంగా ఆలోచనల్ని కూడా ఆపగలిగితే ఎంత బావుండేదో! ఒక అరగంట తర్వాత అనుకుంటా వెనక నుండి నన్ను చుట్టుకుని పడుకుంది తను. ‘పిల్లలు పడుకున్నారా?’ ‘మ్...’ ‘పోనీ ఎయిర్ పోర్టుకి వస్తావా?’.. తనేమీ సమాధానం చెప్పలేదు. మరింత గట్టిగా నన్ను పొదువుకుంది. తన మౌనానికి అర్థం నాకు తెలుసు. ∙∙∙ హీత్రో విమానాశ్రయం.. లండన్. డిసెంబర్ చలి సూదుల్లా గుచ్చుతోంది. ఇంకా సాయంత్రం అవ్వకుండానే చీకటి పడిపోయింది. విమానాశ్రయం దగ్గర టాక్సీ మాట్లాడుకుని హోటల్‌కి బయల్దేరాను. పంజాబీ టాక్సీ డ్రైవర్ నన్ను చూసిన ప్రాంతీయాభిమానం వల్లేమో ఆపకుండా హిందీలో మాట్లాడుతూనే ఉన్నాడు. గాలి కోసం కారు అద్దాలు కొద్దిగా తెరిచాను. మధ్యాహ్నం మంచు పడినట్టుంది. సన్నగా తుంపర మొదలైంది. ఇక్కడ వర్షం ఎప్పుడు ఎందుకు పడుతుందో అర్థం కాదు. కారు అద్దాలు మూసేశాను. చీకటి.. అద్దంలో నాకు నేను కనిపించాను. స్పష్టాస్పష్టంగా. ‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై.. ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై..’ లతా మంగేష్కర్ పాట రాగానే వాల్యూమ్ పెంచాడు డ్రైవర్. దేవానంద్ చేతిలోని కుండని విసిరేసి గడ్డిలో పొర్లుతూ పాడుతున్న వహీదా రెహమాన్ గుర్తొచ్చింది. తెలియకుండానే చాలా సేపటి తర్వాత నవ్వొచ్చేసింది. హోటల్ రూముకి చేరాక టైమ్ చూసుకున్నా. ఇండియాలో అర్ధరాత్రి దాటుంటుంది. చేరానని మెసేజ్ పెడదామనుకునే లోపు తనే వీడియో కాల్ చేసింది. ఇలా ఉన్నపళంగా వీడియో కాల్ చేసేస్తే నాకు చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఈ సంగతి తనకి కూడా తెలుసు. ఒక్క రోజులో ఏమైపోతాను? అయినా మొహం చూస్తూ ఎలా మాట్లాడతారో! విసుగుకి అలసట రంగు పులిమేసి, ఫోన్ ఎత్తేసరికి నా చిన్న కూతురు. వదిలేసి వచ్చానని నిద్రపోకుండా ఏడుస్తోంది. ∙∙∙ కొత్త ప్రాజెక్ట్ పనులూ, మీటింగులతో మూడు వారాలు తెలియకుండానే గడిచిపోయాయి. తెల్లారితే కొత్త సంవత్సరం. పనంతా పక్కన పడేసి మధ్యాహ్నం నుండే ఇళ్ళకి బయల్దేరారు అందరూ. నా టీమ్‌లో ఉన్న నలుగురూ యూరోప్ రావడం మొదటిసారి. వాళ్ళ ఉత్సాహం అడుగడుగునా తెలుస్తోంది. ‘ఇవ్వాళ రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు?’ బ్యాగ్ సర్దుకుని వెళ్ళబోతూ అడిగాడో కుర్రాడు. అక్కడున్నవాళ్లలో ఇతనొక్కడే తెలుగు వాడు. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎక్కడికీ లేదు. హోటల్లోనే’ నా కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ తలెత్తకుండానే చెప్పాను. ‘సరదాగా మాతో రావొచ్చు కదా?’ మిగతా ముగ్గురు కూడా ఆగి నా సమాధానం కోసం చూస్తున్నారు. ‘లండన్ నాకు కొత్త కాదు’ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాను. అయినా ఈ కుర్రాళ్ళకి ఇదేం సరదానో.. ఎక్కడికెళ్లినా అందరినీ లాక్కెళ్ళాలి అనుకుంటారు. ‘మాకు మాత్రం కొత్తే. తెలిసిన వాళ్ళుంటే బావుంటుంది అని అడిగాం. సరే హ్యాపీ న్యూ ఇయర్.. వస్తాం’ అంటూ బయల్దేరారు. నేను చెప్పిన సమాధానానికి నొచ్చుకున్నట్టున్నారు. ‘ఇంతకీ ఎక్కడికెళ్తున్నారు?’ అనుకోకుండా అడిగేశాను. ‘పికడిలీ సర్కస్. రావాలనుకుంటే ఫోన్ చెయ్యండి’ చెప్పేసి వెళ్లిపోయారు. లండన్‌లో చూడవలసిన, పనికట్టుకుని చూసే ప్రదేశాల్లో పికడిలీ సర్కస్ ఒకటి. ప్రత్యేకించి సర్కస్ లాంటివేమీ ఉండవు. అలా పిలిచి పిలిచి ఇక్కడి వాళ్లకు అలవాటైపోయింది. వాళ్ళు చెప్పినప్పటి నుండి పని ముందుకు సాగట్లేదు. నిశ్శబ్దం.. ఆఫీసంతా ఖాళీగా ఉంది. కొన్ని చోట్లు, కొందరు మనుషులు, వారు తెచ్చిన జ్ఞాపకాలు.. మనసులోంచి ఎంత బలవంతంగా తీసేద్దాం అనుకున్నా కుదరదు. కాఫీ తెచ్చుకుని ఆఫీసు కిటికీలోంచి చూశాను. ఊరంతా సందడిగా ఉంది. తేదీ మాత్రమే మారుతున్నా, రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతున్నట్టు ఎందుకో ఇంత ఉత్సాహం అందరికీ! దీన్నే రేపటి మీద ఆశ అంటారేమో! రంగుల వెలుగులు నన్నూ నా ఆలోచనల్ని ఒక పుష్కరం వెనక్కి లాక్కెళ్ళాయి... ∙∙∙ అడల్ట్ క్లబ్, పికడిలీ సర్కస్.. ఎరుపు, నీలం గులాబీ రంగుల మసక మసక లైట్ల మధ్య అక్కడక్కడా సోఫాలు వేసి ఉన్నాయి. ఒక పెద్ద స్టేజీ మీద అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. మొదటిసారి శృంగారం ఒలకబొయ్యడం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నాను. నాతో వచ్చిన ఇద్దరూ చెరో అమ్మాయితో మాటలు కలిపారు. ఎందుకో ఆ చోటు నాకు నచ్చలేదు. చుట్టూ చూసి వెళ్లిపోదాం అని ఆలోచిస్తూ.. పరధ్యానంగా స్టేజి మీద అమ్మాయిల్ని చూశాను. ‘చూడటానికి సిగ్గు పడుతున్నావా? సిగ్గు పడుతూ చూస్తున్నావా?’ పక్కన కూర్చుంటూ అడిగింది ఆమె. ‘అదేం లేదు’ కొద్దిగా దూరంగా జరిగాను. ‘లోపలకి వచ్చే వరకే ఈ సిగ్గులు.. అందరినీ చూశావా? ఎవరయినా నచ్చారా?’ ఆమె మాట్లాడే ఇంగ్లిష్ స్పష్టంగా ఉంది. మత్తుగా మాట్లాడాటానికి ప్రయత్నిస్తోంది ఆమె. ‘దేనికి?’ ముఖం చిట్లించాను. అర్థం చేసుకుందో, తన వంతు వచ్చిందో గానీ ఏమీ మాట్లాడకుండా స్టేజ్ మీదకి వెళ్లి డాన్స్ చెయ్యడం ప్రారంభించింది. పొడవాటి రాగి జుత్తు. రష్యన్ డాన్సర్ అని చెప్పాడు నా పక్కన కూర్చున్న పెద్దాయన. స్టేజ్ మధ్యలో ఉన్న ఒక పోల్ పైకి సునాయాసంగా పాకుతూ నృత్యం చేస్తున్న ఆమె మధ్య మధ్యలో నా వైపు చూస్తోంది. ఎందుకో.. ఆ రాత్రి అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించలేదు. కాసేపటికి.. ఒక మూల జనం లేని చోట, సోఫాలో నన్ను కూర్చోబెట్టి, నా చుట్టూ ఉన్న కర్టెన్‌ని మా ఇద్దరికీ చాటుగా లాగింది. ‘ఇక్కడా?’ డాన్స్ చేస్తూ నా ఒళ్ళో కూర్చోబోయిన ఆమెని ఆపి అడిగాను. ‘మరింకెక్కడ?’ నవ్వింది. ‘అందరూ చూస్తుండగా??’ కర్టెన్ కొద్దిగా పక్కకు జరిపి దూరంగా ఉన్న మనుషుల్ని చూస్తూ అన్నాను. ‘నువ్వనుకుంటున్న చోటు ఇది కాదు. ఇక్కడ మేము డాన్స్ మాత్రమే చేస్తాం’ పగలబడి నవ్వింది ఆమె నా ఆలోచనకి, ఆశకి. నవ్వుతూనే ఉంది. నాకెందుకో అవమానంగా అనిపించింది. వెంటనే లేచాను. ‘ఆగు..’ నా చేతి వాచీలో టైమ్ చూసింది. ఒక్క సెకను ఆలోచించుకుని ‘ఇప్పుడే వస్తాను’ అంటూ కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఏదో చెప్పి తన బ్యాగ్ తగిలించుకుని వచ్చేసింది. ∙∙∙ ‘ఇదేనా నువ్వుండే గది?’ అగ్గిపెట్టెలా ఉన్న ఆ గదిలో మంచం మీద కూర్చుంటూ అడిగాను. ‘హా’ నా కోటు తీసుకుని తలుపుకున్న కొక్కేనికి తగిలించింది. ‘ఇవన్నీ?’ చుట్టూ చూశాను. కొన్ని పెయింటింగ్స్ వాటి మీద ఏవో రాతలూ. ‘ఆ అర్థం లేని బొమ్మలు నేను గీసినవి..’ హీల్స్ తీసేసి ఒక మూలన పెట్టింది. ‘మరి ఇవి?’ గదిలో అక్కడక్కడా మగవారు వాడే వస్తువులు. గోడ మీద అతికించిన కొన్ని ఫొటోలు, చిన్న చిన్న ఉత్తరాలు. ‘ఇక్కడికి ఎప్పుడైనా వచ్చే వాళ్ళు ఇచ్చేవి, మర్చిపోయేవి, వదిలేసేవి!’ ‘వారి జ్ఞాపకాలా?’ ‘కాదు.. నా దగ్గర వదిలేసిన బరువులు! ఎప్పుడైనా మళ్ళీ కావాలనిపిస్తే వచ్చి తీసుకెళ్తుంటారు’ పక్క గది లోంచి అప్పుడే వచ్చిన పిల్లిని ముద్దాడి, దానికి చిన్న గిన్నెలో పాలు పోసింది. ‘ఈ పిల్లి ఇక్కడే ఉంటుందా?’ దానికి నేను నచ్చినట్టు లేను. వచ్చి వాసన చూసి వెళ్ళిపోయింది. ‘మ్.. నువ్వు క్లబ్‌కి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? నిన్ను మొదటిసారి చూస్తున్నాను’ ‘లేదు. ఇంకో రెండునెలల్లో నా పెళ్లి...’ ఆఖరు మాటను వినిపించీ వినిపించినట్టు చెప్పాను. ‘పెళ్లి చేసుకోబోయే అమ్మాయితోనే మొదలెట్టాల్సింది కదా?’ జుత్తు పైకి ముడి వేసుకుంటూ ఆట పట్టిస్తున్నట్టు అంది. మెడ వెనుక కమలం పువ్వు పచ్చ బొట్టు, అప్పటి వరకూ జుత్తు వెనక దాక్కుని కనిపించలేదు నాకు. ‘అనుభవాలు చేదు జ్ఞాపకాలు అవ్వకూడదని ముందు జాగ్రత్త’ కొట్టినట్టు చెప్పాను. ‘ఎంత వద్దనుకున్నా ఈ రోజు అనుభవాలే రేపు మనల్ని కట్టి పడేసే జ్ఞాపకాలు. నీతో వచ్చిన మీ ఫ్రెండ్స్‌కి చెప్పావా నువ్వు ఇలా వస్తున్నట్టు?’ అద్దం ముందు నుంచుని మేకప్ తొలగించుకుంటూ అడిగింది. నాకెందుకో ఆమె అనవసరంగా మాటల్తో టైమ్ వృథా చేస్తున్నట్టు అనిపించింది. ఆమె దగ్గరగా వెళ్లాను. నా కంటే కొంచెం ఎత్తుగా ఉంది. నన్ను చూసి కళ్ళెగరేసింది. దగ్గరికి తీసుకుని, మొహమాటంగా నవ్వి ముందుకి వంగాను. ‘పెదవుల మీద వద్దు’ నన్ను తోసేసి నవ్వింది. ‘అలాంటప్పుడు ఇంత వరకూ తీసుకురావడం ఎందుకు?’ ఆమె అడ్డు చెప్పడం నచ్చలేదు నాకు. ‘చెప్పాను కదా.. నేను డాన్సర్‌ను మాత్రమే. అక్కడ సిగ్గు పడుతున్నావని ఇలా!’ నవ్వి, నా ముక్కుని పట్టుకుని అటూ ఇటూ ఆడించింది. నన్ను చిన్న పిల్లాడిలా చూస్తున్నట్టు అనిపించింది. ‘డబ్బులిస్తున్నా కదా?’ ఈ మాట అంటున్నప్పుడు ఆమె వైపు సూటిగా చూడలేకపోయాను. ‘ఆ డబ్బులేవో నేనే ఇస్తానులే. కాసేపుండి వెళ్లిపో. ఎలాగూ ఇవ్వాళ డ్యూటీకి మళ్ళీ రానని క్లబ్లో చెప్పేశాను.’ ‘నేను వెళ్తాను’ నా కోట్ తీసుకోబోయాను. ‘ఇప్పుడు వెళ్ళలేవు’ బయట అప్పుడే మొదలైన వర్షాన్ని చూపిస్తూ నా కళ్ళలోకి చూసింది. లేత నీలం రంగు గాజుకళ్ళు. ఆకాశంలా ఉన్నాయి. ఆమె చూపుని తప్పించుకోడానికి ప్రయత్నించాను. ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి బట్టలు మార్చుకుని వచ్చి, గాజు కప్పుల్లో ఉన్న కొవ్వొత్తుల్ని వెలిగించింది. మంచి వాసన.. ‘సారీ. ఇందాక..’ తప్పు ఒప్పుకోవడం మంచిదనిపించి చెప్పాను. ‘ఫర్వాలేదు. చాలా నిజాలు ఎగతాళిగా మాట్లాడినప్పుడో, ఆవేశంగా ఉన్నప్పుడో బయటికొచ్చేస్తాయి. అదీగాక మా దగ్గర నుండి ఎవరైనా అంత కన్నా గొప్పగా ఏం ఆశిస్తారు? సరే.. రా..! చాలా ఆశ పెట్టుకుని వచ్చావు పాపం’ మంచం మీద కూర్చుంటూ పిలిచింది. ఇందాకటి నా ప్రవర్తనకి సిగ్గుపడ్డాను. ‘నీ పేరేంటి?’ మంచానికి ఇవతల పక్క కూర్చుంటూ అడిగాను. ‘ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు’ నా వెనకున్న కిటికీ పరదాల్ని మూయడానికి కొద్దిగా వంగింది. ఆడవాళ్లు వాడే పెర్ఫ్యూమ్ల గురించి పెద్దగా అవగాహన, తెలుసుకోవాలన్న ఆసక్తీ ఎప్పుడూ నాకు లేవు గానీ, ఒక మగవాడు వారి వశం అవ్వడంలో కళ్ళ తర్వాత ప్రధాన పాత్ర పోషించేది వారు వాడే పెర్ఫ్యూమ్ అనడంలో సందేహం లేదనిపించింది. ఆమె నాకు దగ్గరగా కూర్చుంది. ఏదేదో మాట్లాడుతోంది. చాలా మాటలు నా చెవులను కూడా చేరట్లేదు. జీవితంలో ఎప్పుడూ ఒక అమ్మాయి నాకు అంత దగ్గరగా రాలేదు. ‘నీ గురించి చెప్పు..’ ఆమె గురించి ఆమె మాటల్లో వినాలనిపించింది. ‘తెలుసుకుని ఏం చేస్తావు?’ నవ్వింది అదోలా. మళ్లీ తనే మాట్లాడుతూ ‘అసలు మనలో దాచుకున్న నిజాలు ఎవరికైనా చెప్తే వింటారా? అర్థం చేసుకుంటారా? మన జ్ఞాపకాల్ని, మన గాయాల్ని మోయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? ఎవరి కథలు వారివే. ఎవరి బరువు వారిదే. మన జీవిత కాలపు అనుభవాలు వారికి ఒక సాయంత్రపు సరదా కాలక్షేపం. తెల్లవారితే మరో కథ, మరో కొత్త సరదా. ఎవరి కథకి వారే ప్రధాన సూత్రధారులు.. వేరే వారి కథలో మాత్రం..’ అంటూ ఆపేసింది. ఆ రాత్రి మెల్లగా గడిస్తే బావుణ్ణు అనిపించింది. ‘నాకు నీ ఒంటి రంగు బాగా నచ్చింది’ ముఖం మీద పడుతున్న నా జుత్తులోకి ఆమె వేళ్ళని పోనిచ్చి ఆడుతూ అంది. మగవాళ్లకి తమ జుత్తు మీద ఎవరైనా చెయ్యి వేస్తే నచ్చదు. కానీ, ఇష్టమైన వాళ్ళకి అది మినహాయింపేమో. రెండు గంటల క్రితం ఒక అంగడి బొమ్మగా చూసి నేను అసహ్యించుకున్న ఆమె.. ఇంత తక్కువ సమయంలో ఇంత దగ్గరైపోవడం చూస్తే నేను ఇంత బలహీనుడినా లేక ఆమెలో నిజంగానే ఏదైనా మాయ ఉందా అర్థం కాలేదు. ఆ క్షణం మునుపెన్నడూ లేని కొత్త సంతోషం ఏదో నాలో. అప్పుడే దూరం కాకుండా ఉంటే బావుండు! ‘నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లండన్‌లోనే ఉంటుందా? ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు?’ ఉన్నట్టుండి మా మధ్యకి తన ప్రస్తావన తీసుకురావడం నాకు ఇబ్బందిగా అనిపించింది. ‘లేదు. ఇండియాలో ఉంటుంది. మా మావయ్య కూతురు. పెళ్లయ్యే వరకు మేం కలిసి ఉండకూడదు.. మా దేశంలో అంతే’ అంటూ నవ్వాను. ‘మంచిదే! మొత్తం ముందే తెలిసిపోతే తర్వాత ప్రయాణం విసుగ్గా ఉంటుంది. మా దేశంలో ఒక సామెత చెప్తారు. పెళ్లి చేసుకో.. ప్రేమ వెతుక్కుంటూ వెనకే వస్తుందని’ ఆమె చెప్పింది నిజమే అనిపించినా ఒప్పుకోవాలనిపించలేదు. నన్ను ఆమె నుండి దూరంగా నెట్టేస్తున్నట్టు తోచింది. ‘నాకు నువ్వు నచ్చావు!’ ‘నీకు తెలుసా? పికాడిల్ అంటే ఒక రకమైన ఫ్రిల్డ్ కాలర్. ఇక్కడుండే టైలర్ తను కుట్టే చొక్కాలకి పికాడిల్స్ను తయారుచేసి గొప్పోడు అయ్యాడంట. అప్పటి నుండే ఇది పికాడిలీ సర్కస్ అయింది’ నేను చెప్పిన మాటలని దాటేస్తోంది. ‘ఐ లైక్ యూ.. ’ ధైర్యమో, ఆమె దగ్గర నాకు చనువు ఉందనిపించిందో, ఉన్నట్టుండి అనేశాను. బదులేమీ ఇవ్వకుండా నా చేతి వేళ్ళ మధ్యకి ఆమె వేళ్ళని పోనిచ్చి మా ఇద్దరి చేతుల్నీ పోల్చింది. ‘నేను చెప్పింది విన్నావా?’ ‘ఇది నిశ్చితార్థం ఉంగరమా? చాలా బావుంది!’ కాదని చెప్పాను. నా ఉంగరం తీసి ఆమె వేలికి పెట్టుకుని చూసింది. సరిపోలేదు. ‘ఇది నా మెడకి సరిపోయేలా ఉంది’ నవ్వి, తిరిగి నా వేలికి పెట్టేసింది. ‘నువ్వు ఎవరినీ ప్రేమించలేదా?’ ఆమె జవాబు చెప్పలేదు. ‘కాసేపు నీ ఒళ్ళో పడుకోనా?’ పడుకుంటూనే అడిగింది. ‘నిన్ను చూస్తే చాలా దగ్గరై, బాగా దూరమై పోయిన ఎవరో గుర్తొచ్చారు. అందుకేనేమో అనుకోకుండానే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చేశాను. శృంగారం ఇక్కడ చాలా సర్వ సాధారణమైన విషయం. దానికి ప్రేమ అవసరం లేదు. కోరిక ఉంటే సరిపోతుంది. కానీ ముద్దు అలా కాదు. అది ప్రేమించిన వారికే ఇస్తాం. ప్రేమ ఉంటేనే ఇవ్వగలం. మనసులో భావాలు ఆజ్ఞ ఇస్తేనే పెదవులకి అనుమతి దొరికేది. ‘ముద్దుకి మొనాగమీ అంటావా?’ ఆమె మెడ వెనుక ఉన్న పచ్చ బొట్టుని వేలితో తాకాను. అలా మాట్లాడుతూనే చాలా సేపటికి నిద్ర పోయింది. నా ఉంగరం తీసి నిద్రపోతున్న ఆమె గొలుసులో లాకెట్‌లా వేశాను. అమ్మమ్మ గుర్తొచ్చి నవ్వొచ్చింది. తాతయ్య ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లోంచి కొంచెం కొంచెం దాచి, నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు చేయించి ఇచ్చిన ఉంగరం అది. చాలా విలువైంది అని చెపుతూంటుంది. మనకి ఇష్టమైన వారి ముందు, వారితో మనం పంచుకున్న క్షణాల ముందు వస్తువుల విలువ చాలా తక్కువేమో. ∙∙ ‘గుడ్ మార్నింగ్’ చెప్పింది, కళ్ళు తెరిచే సరికి ఎదురుగా సోఫాలో కూర్చుని నన్నే చూస్తున్న ఆమె. ఎప్పుడు కునుకు పట్టేసిందో కూడా తెలియలేదు. మనిషికి నిద్ర శాపమేమో అనిపించింది. ఆమె మెడలోని నా ఉంగరం మీద పడిన సూర్యుడి వెలుగు నా కళ్ళలో పడి ఆమెను స్పష్టంగా చూడనివ్వకుండా చేస్తోంది. పిల్లి నా కాళ్ళ దగ్గర ఒద్దికగా ముడుచుకుని పడుకుంది. ‘నాకు వెళ్లాలని లేదు’ వెలుగుకు చేతిని అడ్డుపెట్టుకుంటూ అన్నాను. రాత్రి కొక్కేనికి తగిలించిన నా కోటు వేసుకుని ఉంది ఆమె. ‘సరే చెప్పు.. ఏం చేద్దామో’ లేచి దగ్గరగా వచ్చి కూర్చుంది. ‘నన్ను పెళ్లి చేసుకో. నాతో పాటు వచ్చెయ్.’ ‘ఒక్క రాత్రిలోనే?’ పగలబడి నవ్వుతూ చెప్పింది. ‘నేను నీకు నచ్చలేదా?’ సూటిగా అడిగాను. ఆమె సమాధానం చెప్పకుండా నా కోటు తీసి నా చేతిలో పెట్టింది. ‘నిజంగా చెప్తున్నాను. నీలా ఎవరూ నాతో లేరు. మనం పెళ్లిచేసుకుందాం..ప్లీజ్!’ ‘ష్..’ నా పెదవుల మీద ఆమె వేలిని ఉంచింది. నేనింకేదో చెప్పబోయాను. ముందుకు వంగి తన పెదవులను నా పెదవులపై ఉంచింది. మధ్య అడ్డుగా ఉన్న ఆమె వేలు ఊపిరాడక తప్పుకుంది. ఇప్పటి వరకూ ఆమె పెట్టిన హద్దుల్ని ఆమే చెరిపేసింది. అలా ఎంత సేపున్నామో లెక్కపెట్టలేదు. క్లబ్ నుండి వచ్చిన ఆమె స్నేహితురాళ్ళు తలుపు కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చాం. ‘సాయంత్రం ఇంక క్లబ్‌కి వెళ్లొద్దు. నేనొచ్చి నిన్ను నాతో తీసుకెళ్తాను.’ ‘నువ్వు చాలా మంచోడివి’ నా జుత్తుని సరిచేసి, ‘సాయంత్రం ఆరు గంటల తర్వాత రా. ఇప్పుడు ఈ పక్క డోర్ నుండి బైటికి వెళ్ళు. మా వాళ్ళు చూస్తే అల్లరి చేస్తారు’ చెప్పేసి తలుపు తియ్యడానికి వెళ్తూ వెనుక నుండి గట్టిగా హత్తుకుని వదిలేసింది. ‘బాయ్’ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడాలనిపించింది. కానీ, అప్పటికే ఆమె తలుపు మూసిన చప్పుడు వినిపించింది. అదే ఆఖరుసారి ఆమెని చూడటం. ∙∙ ‘ఆదీ.. వస్తున్నారా? మేం వెళిపోమా?’ ఆ తెలుగు కుర్రాడి మెసేజ్ టోన్ నా ఆలోచనల్లోంచి నన్ను బైటికి విసిరి కొట్టింది. వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాను. అడల్ట్ క్లబ్, పికడిలీ సర్కస్.. చాలా వరకూ అలానే ఉంది. లోపల కొద్దిగా ఆధునీకరించినా కొత్త అమ్మాయిలు, మసక దీపాలు, నృత్యాలు ఏమీ మారలేదు. తరాలు మారినా కొన్ని మారకపోవడం నచ్చుతుంది నాకు. అర్ధరాత్రి వరకు హడావుడిగా సాగిన నూతన సంవత్సర వేడుకలు వెలుగు రాకుండానే చప్పబడి పోయాయి. ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఆమె ఉండే ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. నా లోపల కంగారు ఆత్రం ఆరాటం. ఆమె నాకు ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి? ఏ పేరు పెట్టాలో తెలీదు. ‘ఎస్..’ ఎవరో అమ్మాయి తలుపు తీసింది. ఇరవై ఏళ్ళుండొచ్చు. ‘నేను ఇక్కడికి...’ ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఆమె అక్కడుండే అవకాశం లేదని నాకు అనిపించింది. ‘క్రితంసారి వచ్చినపుడు ఏమైనా వదిలేశారా? లోపలకి రండి. ఫీల్ ఫ్రీ..’ పార్టీ జరుగుతున్నట్టుంది. గది బైట నన్నొదిలేసి వెళ్లిపోయింది. అదే గది.. గదిలో మరిన్ని వస్తువులు, కొత్త కొత్త మనుషుల ఫొటోలు.. ఆమె జ్ఞాపకాల జాడ కనిపించలేదు నాకు. ఆమె నాకొక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిందన్న చిన్న అసంతృప్తితో వెళ్తున్న నన్ను అద్దం దగ్గరున్న ఫొటో ఆకర్షించింది. వెనుకకి తిరిగి చేతులతో జుత్తుని పైకి పట్టుకుని ఎడమ పక్కకి చూస్తున్న అమ్మాయి.. ఆమె మెడ మీద నాకు బాగా పరిచయం ఉన్న కమలం.. ఆ కమలానికి పైన కొద్ది దూరంలో కొత్తగా సూర్యుడి పచ్చ బొట్టు. ఆమే! ఫొటో పక్కన మేకుకి తగిలించిన నా ఉంగరం. ఫొటోని తడిమాను. ఫొటో వెనుక ఇలా రాసుంది. ‘బహుశా మనం అందరం బురదలో పుట్టిన కమలం లాంటి వాళ్ళమే. జీవితంలోని అడ్డంకుల్ని, కష్టాల్ని, బాధల్ని తట్టుకుంటే మలినం అంటని కమలంలా స్వచ్ఛంగా పైకి వస్తాం. ప్రతి మేఘానికీ ఒక వెండి అంచు ఉన్నట్టే, కష్టాల మబ్బుల్ని తొలగించి, మనలోని జ్ఞానాన్ని వెలికి తీసే వెలుగు.. సూర్యుడి రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. అది అందుకుని వికసించాలే గానీ స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే అర్ధాంతరంగా మన కథ ముగిసిపోతుంది. ఎవరి కథకి వారే ప్రధాన సూత్రధారులు.. వేరే వారి కథలో మాత్రం సహాయ పాత్రధారులు కదా! –సాషా’ ‘సాషా...’ ఆమె పేరు పలుకుతున్నపుడు మునుపు ఎన్నడూ లేని ఒక సంతృప్తి. ఫొటో అక్కడే వదిలేసి, చేతి రుమాలుతో కళ్ళజోడు తుడుచుకుని పెట్టుకున్నాను. రుమాలు మీద ఎర్రని అక్షరాల్లో నా భార్య కుట్టిన నా పేరు. తను గుర్తొచ్చింది. ఇంతలోనే తన నుంచి మెసేజ్.. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెళ్ళిన పని అయిందా?’ అంటూ. ‘పని అయిపోయింది. ఒక వారం ముందుగానే వచ్చేస్తున్నా. నిన్ను చూడాలనిపిస్తోంది.’ మెసేజ్ టైప్ చేసి పంపకుండానే, వీడియో కాల్ చేశాను. ఎందుకో తనని చూడాలనిపించింది. దీన్నే మిస్ అవ్వడం అంటారేమో. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా తెలుస్తున్నట్టుంది. బావుంది ఈ అనుభూతి. బయటికొచ్చాను. తెల్లవారిపోయింది! -∙రవి మంత్రిప్రగడ -
క్రైం స్టోరీ: చచ్చిపోయాడంటూ బ్లాక్మెయిల్ చేసి.. డబ్బు గుంజి.. ఆఖరికి
చాయ్ మహల్లో సాయంత్రం ఆరుగంటలకు కస్టమర్ల రద్దీ ఎక్కువగా వుంది. అక్కడ దొరికే ఖడక్ చాయ్ లాంటి టీ స్టార్ హోటళ్లలో కూడా లభించకపోవడంతో సామాన్యజనంతో బాటూ ధనికులు కూడా అక్కడ ఆగి టీ తాగి వెళ్తుంటారు. ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని చంద్రశేఖర్ మిత్రులతో బాటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఖడక్ చాయ్ తాగుతున్నాడు. చెన్నైలో పేరుమోసిన లాయర్ అతను. వారానికి ఆరు రోజులు కోర్టులు, కేసులు, క్లయింట్లతో బిజీగా వుంటాడు. శనివారం కోర్టుకు సెలవు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు చాయ్ మహల్లో మిత్రులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి వెళ్లడం అలవాటతనికి. పిల్లిగడ్డం, కళ్లజోడుతో వున్న ఒక యాభై ఐదేళ్ల మనిషి చంద్రశేఖర్‌ను దూరం నుంచి పరీక్షగా చూసి దగ్గరకు వచ్చి, ‘బాగున్నారా?’ అని అడిగాడు. చంద్రశేఖర్‌కు ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. కానీ వెంటనే అతడినంతకు మునుపు తాను ఎక్కడ చూశాడో గుర్తుకు రాలేదు. పిల్లిగడ్డం వాడు చిన్నగా నవ్వి ‘ఫ్రెండ్స్‌తో బిజీగా వున్నట్లున్నారు. తరువాత ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అన్నాడు. చంద్రశేఖర్ అప్రయత్నంగా జేబులోంచి తన విజిటింగ్ కార్డు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడతను. ఎవరో కేసు గురించి తనను సంప్రదించాలని వచ్చి వుంటాడనుకొని చంద్రశేఖర్ మళ్లీ మిత్రులతో కబుర్లలో పడిపోయాడు. ∙∙ ఆ రోజు రాత్రి భోజనం చేసి పక్కమీదికి వాలుతుండగా హఠాత్తుగా చంద్రశేఖర్‌కు ఆ పిల్లిగడ్డం వాడిని తానింతకుముందు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది. వాడిపేరు కాళిదాసు. అతడిని తానింతకు మునుపు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చేసరికి చంద్రశేఖర్‌కు ఒళ్లు జలదరించినట్లనిపించింది. ∙∙ చంద్రశేఖర్ తండ్రి నెల్లూరులో పెద్దలాయరు. డిగ్రీ పూర్తికాగానే కొడుకును చెన్నైలోని ఒక లా కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నించాడతను. కానీ పుట్టిపెరిగిన వూరిని వదిలి వెళ్లనని మొండికేశాడు చంద్రశేఖర్. డబ్బులో పుట్టి పెరిగిన అతనికి ఫ్రెండ్స్‌తో తిరగడం, అప్పుడప్పుడు పార్టీలు, పబ్బులు సందర్శించడం అలవాటైంది. చెన్నై లా కాలేజీలో సీటు వచ్చినా అక్కడికి వెళ్లకుండా చంద్రశేఖర్ పదిరోజులు ఇంటిదగ్గరే వుండిపోయాడు. తండ్రి అతడిని బుజ్జగించి, చంద్రశేఖర్‌కు ఇష్టమైన బైక్ కొనుక్కోమని యాభైవేలు చేతికిచ్చాడు. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ ఫ్రెండ్స్‌తో మందుపార్టీ చేసుకొని మిత్రుడి బైక్ తోలుతూ వేగంగా విజయ మహల్ సెంటర్ వైపు వస్తున్నాడు. రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను చూసుకోకుండా ఢీకొట్టాడు. కిందపడిన మోపెడ్ అతన్ని తాగిన మత్తులో తిట్టసాగాడు చంద్రశేఖర్. మోపెడ్ రైడర్ కూడా తిట్లు లంకించుకున్నాడు. అతని పేరు సుందరం. మూడిళ్ల అవతలే అతని ఇల్లు. సుందరం తమ్ముడు రాజు, పక్కింటి కాళిదాసు గొడవ విని పరుగెత్తుకు వచ్చారు అక్కడికి. సుందరం తిట్లు ఆపకపోవడంతో అప్పటికే ఆవేశంలో, మత్తులో వున్న చంద్రశేఖర్ చేతికందిన రాయి తీసుకొని సుందరం తలపై కొట్టాడు. తల నుండి రక్తం ధారకట్టింది. అది చూసి రాజు, కాళిదాసు చంద్రశేఖర్ పై ఎగబడ్డారు. దూరంగా పడిన చంద్రశేఖర్‌ను అతడి ఫ్రెండ్ పైకిలేపి ‘గొడవలు వద్దు, ఇంటికి వెళ్లిపోదాం’ అన్నాడు భయంగా. ఫ్రెండ్ బైక్ స్టార్ట్ చేయగానే చంద్రశేఖర్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇంటికి చేరిన చంద్రశేఖర్‌కు మత్తు దిగగానే సుందరానికి ఏమైందో అన్న భయం పట్టుకొంది. రాత్రి కలత నిద్రపోయి చంద్రశేఖర్ పొద్దునే లేచి చూసుకొనే సరికి అతని పర్స్ కనబడలేదు. తండ్రి తిడతాడన్న భయంతో ఆయనకు ఆ విషయం చెప్పలేదు. సుందరానికి ఏమైంది అన్న ఆందోళన చంద్రశేఖర్‌ను వదలలేదు. తాను కొట్టిన దెబ్బకు వాడు చనిపోయివుంటే.. అన్న భయం పీడించసాగింది. చంద్రశేఖర్ స్నానం చేసి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్లాడు. బైక్ కొంచెం దూరంలో పార్క్ చేసి ప్రమాదం జరిగిన కరెంటు స్థంభం వద్ద పర్స్ కోసం వెతికాడు. అది కనబడకపోయేసరికి, మూడిళ్ల అవతలవున్న సుందరం ఇంటివైపు వెళ్లాడు. ఆ ఇల్లు తాళంవేసి వుంది. హఠాత్తుగా కాళిదాసు ఇంటి బయటకు వచ్చి చంద్రశేఖర్ చేయి పట్టుకొన్నాడు. ‘నీవల్ల సుందరం చనిపోయాడు. బాడీని తీసుకురావడానికి వాళ్లవాళ్లు హాస్పిటల్‌కు వెళ్లారు. నిన్ను పోలీసులకు అప్పజెప్పాలి’ అని కేకలు వేయసాగాడు. అతని చేయి విదిలించుకుని బైక్ స్టార్ట్‌చేసి వేగంగా ఇంటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. ఆరోజు మధ్యాహ్నమే చెన్నై లా కాలేజీలో చేరిపోయాడు. చాలా కాలంపాటు నెల్లూరుకు రాకుండా చెన్నైలోనే వుండిపోయాడతను. లా కోర్సు పూర్తయ్యాక చంద్రశేఖర్ చెన్నైలోనే లాయరుగా ప్రాక్టీసు చేస్తానని తండ్రికి చెప్పాడు. కొడుకు పట్టువీడక పోయేసరికి, అతని తండ్రి చెన్నైలో తనకు తెలిసిన సీనియర్ లాయర్ వద్ద అతన్ని జూనియర్‌గా చేర్పించాడు. చెన్నైలోనే ఒక పెద్దింటి అమ్మాయిని వివాహం చేసుకొని అనతి కాలంలోనే లీడింగ్ లాయర్‌గా పేరు సంపాదించుకున్నాడు చంద్రశేఖర్. ఇన్నేళ్లకు కాళిదాసు మళ్లీ ఇలా కనిపించడంతో చంద్రశేఖర్ పై ప్రాణాలు పైనే పోయాయి. ∙∙ మరుసటి రోజు వుదయం చంద్రశేఖర్ ఆఫీసులో క్లయింట్లతో మాట్లాడుతుండగా.. కాళిదాసు వచ్చాడు. అతడిని పక్కగదికి తీసుకువెళ్లి మాట్లాడాడు చంద్రశేఖర్. ‘నువ్వు రాయితో కొట్టిన దెబ్బకు సుందరం చనిపోయాడు. అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు. సుందరం షర్టుపైన నీ వేలిముద్రలు దొరికాయి పోలీసులకు. ఎలాగూ నేను, రాజు సాక్షులుగా వున్నాం. పోలీసు కేసు నమోదైంది. కానీ నీ వివరాలు పోలీసులకు తెలియలేదు. నెల్లూరు చుట్టుపక్కల ఎంత వెతికినా, నువ్వెక్కడున్నావో తెలియలేదు. అనుకోకుండా మద్రాసు వచ్చాను. నీ ఆచూకీ పోలీసులకు తెలపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు’ కఠినంగా అన్నాడు కాళిదాసు. భయంతో కాళ్లు, చేతులు ఆడలేదు చంద్రశేఖర్‌కు. ‘వద్దు, ఆపని చేయద్దు. ఏదో భార్య, పిల్లలతో పరువుగా బతుకుతున్నాను’ అంటూ బతిమాలాడు. కాళిదాసు చిన్నగా నవ్వి ‘నాకు ఖర్చులు ఎక్కువగా వున్నాయి. ఒక రెండు లక్షలు ఇవ్వు’ అన్నాడు. చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లి కాళిదాసుకు డబ్బు తెచ్చిచ్చాడు. కాళిదాసు వెళ్లిపోయాడు. ∙∙ మళ్లీ రెండురోజుల తరువాత కాళిదాసు నుండి కాల్ వచ్చింది చంద్రశేఖర్‌కు..‘చాలా అవసరంలో వున్నాను. రెండు రోజుల్లో ఒక పదిలక్షలు అందజెయ్యి’ అంటూ. ‘నెలరోజుల్లో నా కూతురి పెళ్లి వుంది. చాలా ఖర్చులున్నాయి. అంతడబ్బు సర్దలేను’ చెప్పాడు చంద్రశేఖర్. ‘అయితే నేను నేరుగా పోలీసుల వద్దకు వెళ్తాను. కూతురి పెళ్లికి ముందు నువ్వు అరెస్ట్ కావడం బాగుండదుకదా’ అన్నాడు కాళిదాసు. ‘వద్దు, వద్దు, ఎలాగోలా నీకు డబ్బు అడ్జస్ట్ చేస్తాను’ కంగారుగా చంద్రశేఖర్. ∙∙ చంద్రశేఖర్ చెప్పేదంతా సావకాశంగా విన్నాడు డిటెక్టివ్ వినోద్. ‘ఆ సుందరం నెల్లూరులో వున్న వీధి, ఇతర వివరాలు నాకు ఇవ్వండి. అలాగే అప్పటి మీ మిత్రుల వివరాలూ కావాలి’ అన్నాడు వినోద్. చంద్రశేఖర్ ఆ వివరాలన్నిటినీ వినోద్‌కు ఇస్తూ ‘సార్, ఈ దర్యాప్తు రహస్యంగా చేయండి. ఎలాగైనా నన్నీ సమస్య నుండి బయట పడేయండి’ అన్నాడు వేడుకోలుగా. ∙∙ సుందరం అప్పట్లో వున్న వీధికి వెళ్లాడు వినోద్. ఆ వీధిలో చాలామంది కొత్తగా వచ్చారు. వారికి సుందరం గురించి తెలియదు. వీధి చివర్లో పచారీకొట్టు నడుపుతున్న చలమయ్య ముప్పై ఏళ్ల నుండీ ఆ వీధిలోనే వున్నట్లు తెలిసింది వినోద్‌కు. ‘సుందరమా? అతనికి యాక్సిడెంటైంది. వాళ్ల వాళ్లు ఇల్లు ఖాళీచేసి టెక్కేమిట్ట ప్రాంతానికి వెళ్లిపోయారు’ చెప్పాడు చలమయ్య. అక్కడ వారెక్కడ వుండేదీ తనకు తెలియదన్నాడు. రాజు మాత్రం ట్రంక్ రోడ్లో ఏదో బట్టల కొట్టులో పనిచేసేవాడని వివరమందించాడు చలమయ్య. ట్రంక్ రోడ్లో పది, పన్నెండు బట్టల దుకాణాల్లో విచారిస్తే ఒక షాపు యజమాని రాజు పేరు గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘మా షాపు పక్కన మరో బట్టల కొట్టు వుండేది. రాజు అక్కడ పనిచేసేవాడు. ఆ షాపు మూతపడ్డాక అతను ఒకసారి కనిపించి ఏదో పెద్ద ఫర్నిచర్ మార్కెట్లో సేల్స్‌మన్‌గా చేరానన్నాడు’ అని చెప్పాడు. వినోద్ కొన్ని ఫర్నిచర్ షాప్స్ తిరిగాక రాజు దొరికాడు అతనికి. తనను తాను సుందరం బాల్యమిత్రుడిగా పరిచయం చేసుకున్నాడు వినోద్. ‘సుందరం అన్నయ్య ఏసీ మహల్ సెంటర్లో ఫ్యాన్సీ షాపులో పనిచేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. కాసేపు వుండండి, మనం వెళ్దాం’ అన్నాడు రాజు. వినోద్ ఆశ్చర్యపోయాడు. ‘ సుందరం బతికేవున్నాడా..!’ . మధ్యాహ్నం రాజుతో కలసి సుందరం ఇంటికి వెళ్లాడు. ‘చంద్రశేఖర్ వల్ల మాకు మేలే జరిగింది. అతని పర్స్ కరెంట్ స్థంభం దగ్గర నాకు దొరికింది. అందులో చాలా డబ్బుంది. నేను తలదెబ్బకు చికిత్స చేసుకున్న తరువాత మిగిలిన డబ్బుతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను. కాలం కలిసొచ్చి ఇంకో రెండు ఫ్యాన్సీ షాపులు నడుపుతున్నాను’ చెప్పాడు సుందరం. కాళిదాసు గురించి అడిగితే.. ‘వాడొక వెధవ. అందరి దగ్గరా అప్పులు చేసి తాగుడు, డ్రగ్స్‌కి తగలేశాడు. తంతారని భయపడి ఎక్కడికో పారిపోయాడు’ అని చెప్పాడు రాజు. తాను తెచ్చిన ఆపిల్స్‌ను సుందరానికి అందజేసి సెలవు తీసుకున్నాడు వినోద్. ∙∙ కాళిదాసు నుండి మళ్లీ ఫోన్ వచ్చింది చంద్రశేఖర్‌కు. ‘నువ్వు నా గురించి డిటెక్టివ్‌ను పంపావని నాకు తెలిసిపోయింది. మళ్లీ ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను’ అని ఫోన్ కట్ చేశాడతను. వినోద్ సలహా మీద చంద్రశేఖర్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. వారికి కాళిదాసు ఎక్కడ దొరుకుతాడో తెలియలేదు. ‘డ్రగ్స్ అలవాటున్న వాళ్లు కచ్చితంగా అవి అమ్మే ప్రదేశాలకు రెండు, మూడు రోజులకు ఒకసారైనా వస్తారు’ అన్నాడు వినోద్. వినోద్ సలహాపై పోలీసులు ఆ ప్రదేశాల్లో నిఘా వుంచారు. రెండు రోజుల్లో కాళిదాసు ఒక డీలర్ దగ్గర డ్రగ్స్ కొంటూ దొరికిపోయాడు పోలీసులకు. -∙రాచపూటి రమేశ్ -
క్రైమ్ స్టోరీ: తమ్ముడి హత్య.. అన్న టాక్సీలోనే నిందితులు.. ఊహించని ట్విస్ట్!
‘ఏరా తమ్ముడూ.. ఏంటి విషయం? పొద్దుటే ఫోన్ చేశావు?’ అంటూ హుషారుగా అడిగాడు రాజారావు. ‘సారీ అండి. నేను ఎస్సై అంబరీష్‌ని. కృష్ణ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అన్న సమాధానం వినపడగానే షాక్ అయ్యాడు. ‘ఎస్సై గారా? ఏమయింది మా తమ్ముడికి? వాడి ఫోన్ మీకెలా..?’ అని అడుగుతుండగానే..‘చాలా దారుణం జరిగిపోయింది. కృష్ణను ఎవరో హత్య చేశారు’ అని చెప్పాడు ఎస్సై అంబరీష్. అంతే నెత్తిన పిడుగు పడినట్లయింది రాజారావుకి. కాస్సేపటివరకూ అతని నోటమ్మట మాట రాలేదు. కష్టం మీద గొంతుపెగల్చుకొని నీరసంగా అడిగాడు ‘ఎక్కడ? ఎప్పుడు?’ అంటూ. ‘నిన్న రాత్రి. టోల్‌గేట్‌కి అగనంపూడికి మధ్యలో సైడ్ రూట్లో’ అని సమాధానం ఇచ్చాడు ఎస్సై. ‘నేను స్టీల్‌ప్లాంట్‌లో ఉన్నాను. అరగంటలో వస్తాను’ చెప్పాడు రాజారావు తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ. ∙∙ కత్తిపోటుకి గురైన కృష్ణ్ణ ఒళ్ళంతా నెత్తురుతో తడిసిపోయి ఉంది. చూస్తూనే బిగ్గరగా ఏడుస్తూ మృతదేహంపై పడబోతున్న రాజారావుని ఆపి ‘సారీ.. ఏమీ అనుకోకండి. పంచనామా పూర్తికాలేదు. ఈ లోగా ఎవరూ శవాన్ని ముట్టుకోకూడదు’ అంటూ అపాలజీ చెప్పాడు అంబరీష్. చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయాడు రాజారావు. అప్పటివరకూ ఓపిగ్గా వేచిఉన్న అంబరీష్, ‘సారీ.. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మీ తమ్ముడు ఎలాంటివాడు? అతనికి ఎవరయినా శత్రువులు ఉన్నారా?’ అంటూ రొటీన్ ప్రశ్నలు వేశాడు. ‘చాలా మంచివాడు సార్. చాలా చాలా నెమ్మదస్తుడు. నేనే కాస్త దూకుడుగా ఉంటాను. నాకు కోపం ఎక్కువ. అంత మంచి వాడిని ఇంత క్రూరంగా చంపడానికి, ఆ దుర్మార్గుడికి చేతులెలా వచ్చాయి?’ అని భోరున ఏడ్చాడు రాజారావు. అతనుచెప్పిన వివరాలను బట్టి, అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారని, చెరో టాక్సీ నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిసింది. అన్నదమ్ముల స్వభావాలు పూర్తిగా భిన్నమని వాళ్ళను.. వాళ్ళ టాక్సీలను చూస్తూనే తెలుస్తోంది. కృష్ణకి శుభ్రత ఎక్కువ. రోజుకి మూడు నాలుగు సార్లయినా టాక్సీని రుద్ది రుద్ది శుభ్రం చేసుకుంటాడు. రాజారావుకి శుభ్రత బాగా తక్కువ. కృష్ణ చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకుని నీట్‌గా తయారయితే, ఇతను మాత్రం మాసిన గెడ్డంతో, పెరిగిపోయిన చింపిరి జుట్టుతో, మాసిపోయిన చౌకబారు బట్టలు వేసుకొని ఉన్నాడు. అంబరీష్, రాజారావు మాట్లాడుకుంటుండగా సీఐ మహంకాళి అక్కడికి వచ్చాడు. ఎస్సై అతనికి సెల్యూట్ చేసి కేసు వివరాలు తెలియజేశాడు. ఆ తర్వాత కాళి తనదయిన శైలిలో దర్యాప్తు ప్రారంభించాడు. ఏదీ వదలకుండా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ఫోరెన్సిక్ టీమ్‌కి సహాయపడడం, శవాన్ని పోస్ట్ మార్టమ్‌కి పంపడం వగైరా బాధ్యతలను ఏఎస్సైకి అప్పజెప్పి స్టేషన్‌కి బయల్దేరారు కాళి, అంబరీష్‌లు. మధ్యాహ్నానికి గానీ కేసు ఒక కొలిక్కి రాలేదు. అప్పుడు చెప్పాడు సీఐ కాళి.. ‘నా అంచనా ప్రకారం సుమారు పదిగంటల ప్రాంతంలో ముగ్గురు పాసింజర్లను ఎక్కించుకొని, వైజాగ్ నుంచి బయల్దేరాడు కృష్ణ. ఒకడు డ్రైవర్ పక్కన సీట్లో, మిగిలిన ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. నేషనల్ హైవే మీదుగా కారు నడుపుతున్న కృష్ణను బెదిరించి, పక్కదారికి మళ్ళించి ఉంటారు. హత్య.. రాత్రి పదకొండున్నర తర్వాత జరిగింది. హత్యకు ముందు పెద్ద గొడవే జరిగింది. అయితే శాంత స్వభావుడు అయిన కృష్ణను వాళ్లు ఎందుకు చంపవలసి వచ్చింది? ఆవిషయం తేలవలసి ఉంది’ అంటూ అతను ఒక నిమిషం ఆగగానే అందుకున్నాడు అంబరీష్ ‘మరోసారి మీరు గ్రేట్ అని రుజువు చేశారు సార్. హత్యకు ముందు గొడవ జరిగిందన్న విషయం ఊహించగలిగాను. ఎందుకంటే కృష్ణ బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. శవం పక్కన అతని షర్ట్ బటన్స్ పడి ఉన్నాయి. అతని ఒంటి మీద గాయాలూ ఉన్నాయి. కానీ మిగతా వివరాలు ఎలా తెలుసుకున్నారో నాకు తట్టడం లేదు’ అన్నాడు. ‘దర్యాప్తు చేయడంలో నువ్వు మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఏ ఒక్క క్లూలనూ వదలకుండా తీవ్రంగా గాలించాలి. కృష్ణ.. టాక్సీ లోపల నాకు ఖాళీ గుట్కా పేకెట్, రెండు న్యూస్ పేపర్ ముక్కలు దొరికాయి. వాటిని నువ్వూ చూసే ఉంటావు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఆ పేకెట్ తమిళనాడులో తయారయ్యింది. మన రాష్ట్రంలో ఆ పేకెట్లు దొరకవని, మన వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఇక న్యూస్ పేపర్ ముక్కలు తమిళ పేపర్‌కి సంబంధించినవి. వాటిని వాసన చూస్తే కరక్కాయ పొడి కలిపిన మందేదో పొట్లం కట్టడానికి వాటిని వాడారని తెలుస్తోంది. అది దగ్గుకు సంబంధించిన మందు కావచ్చు. కేవలం గంట, గంటన్నర ప్రయాణంలో రెండు సార్లు ఆ మందు వేసుకున్నాడంటే ఆ మనిషికి దగ్గు ఎక్కువగా వస్తుందని భావించవచ్చు. అది అల్లోపతీ మందు కాదు, ఇక్కడ దొరక్కపోవచ్చు. కాబట్టి అది వాడుతున్న వాడు సొంత ఊరి నుంచే తెచ్చుకొని ఉండాలి. ఆ సొంత ఊరు తమిళనాడులోనే ఉండాలి. కారులో ఉన్న మేట్ మీద అస్పష్టంగా స్టోన్ క్రషర్ పౌడర్ కనిపిస్తోంది. వాళ్ళ చెప్పులకు అంటిన ఆ పౌడర్ అక్కడ రాలిందన్నమాట. ఆపౌడర్ ఉన్న చోట్లను బట్టి వాళ్ళెక్కడ కూర్చున్నారో ఊహించాను. రాజారావు చెప్పినదాన్ని బట్టి కృష్ణకు శుభ్రత ఎక్కువని తెలిసింది కదా? టాక్సీలో కనిపించిన గుట్కా పేకెట్, పేపర్ ముక్కలు, స్టోన్ క్రషర్ పౌడర్లకు కారణం పాత పాసింజర్లు కాదు. కచ్చితంగా ఆ ముగ్గురే వాటికి కారణం ’ అని చెప్పగానే కాళి సునిశిత పరిశీలనకు అబ్బురపడ్డాడు అంబరీష్. అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో కొనసాగించాడు కాళి.. ‘కృష్ణ, లీలామహల్ దగ్గరున్న టాక్సీ స్టాండ్‌లో ఉండేవాడని చెప్పావు కదా? తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు మనుషులు.. అక్కడికి దగ్గరలో ఉన్న ఏ లాడ్జ్లోనయినా దిగారేమో మనవాళ్ళను కనుక్కోమను. ఏదయినా లాడ్జ్ ముందున్న రోడ్డు మీద గుంతలను పూడ్చడానికి స్టోన్ క్రషర్ పౌడర్ వాడారేమో చూడమను. వాళ్ళను సులువుగా పట్టుకోవడానికి అదొక క్లూ. వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అది మరో క్లూ. పదకొండు ఇరవైకి కృష్ణ తన భార్యతో మూడు నిమిషాలు మాట్లాడాడని, అతని సెల్ఫోన్లో కాల్ హిస్టరీ చూస్తే తెలిసింది. అతని భార్యతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. దాన్ని బట్టే హత్య పదకొండున్నర తర్వాతే జరిగి ఉండాలని ఊహించాను. అయితే కృష్ణ హత్య అనుకోకుండా జరిగి ఉండొచ్చు. అతన్ని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదని, అతని చరిత్ర చెబుతోంది. అంతేకాక కేవలం అతన్ని హత్య చేయడం కోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని అనుకోను. వాళ్ళ ప్లాన్ వేరే ఏదో ఉంది. మరెవరినయినా హత్య చేయడానికో లేదా బ్యాంక్ కొల్లగొట్టడానికో వచ్చి ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు, ఎక్కడయినా నక్కి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం చూసుకునుంటారు. అప్పటివరకూ వైజాగ్‌లో గానీ, పరిసరాలలోగానీ దాక్కునుంటారు. మనం గట్టిగా ప్రయత్నిస్తే దొరక్కపోరు. తప్పని పరిస్థితిలో వాళ్ళు అనుకున్న నేరం చేయడాన్ని వాయిదా వేసుకొని ఉంటారు. దానికి కారణాలు రెండు. మొదటిది.. చేతిలో వాహనం లేకపోవడం. రెండవది.. అప్పుడే హత్య చేసి తప్పించుకోవడం. హత్య జరిగిన తర్వాత, వాళ్ళు రోడ్డెక్కేసరికి పన్నెండు దాటి ఉంటుంది. తిరిగి వైజాగ్ వెళ్ళడానికి ఆ సమయంలో బస్సులేవీ ఉండవు కనుక ఏ లారీయో పట్టుకొని ఉంటారు. టోల్గేట్ సీసీ ఫుటేజ్ చూస్తే కొన్ని క్లూలు దొరకొచ్చు. ఆ ఫుటేజ్ తెప్పించు’ అని ఆర్డర్ వేసి, ఆ కేసు గురించే ఆలోచిస్తూ వెనక్కి వాలాడు కాళి.. కాస్తరిలాక్స్ అవడానికి. అతను అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి బయల్దేరాడు అంబరీష్. ∙∙ అంబరీష్ తెచ్చిన సీసీ ఫుటేజ్ చూడగానే కాళి కళ్ళు మెరిశాయి.. ‘నా ఊహ నిజమయింది. ఇక్కడ చూడూ.. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రికార్డ్ అయిన సీన్ ఇది. దీని ప్రకారం ముగ్గురు కుర్రాళ్ళు లారీలో ఇరుక్కొని కూర్చున్నారు. వారిలో నల్లగా ఉన్న వాడొకడు నోటికి చేయి అడ్డుపెట్టుకొని దగ్గుతున్నాడు. రెండవ వాడు తెల్లగా ఉన్నాడు. జుట్టు పూర్తిగా ఊడిపోయి దాదాపు గుండులా తయారయ్యింది. మూడో వాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. అయితే ఈ ఫుటేజ్ సహాయంతో వాళ్ళను గుర్తుపట్టడం అంత సులువేమీ కాదు. మన ఆర్టిస్టుని పిలిపించి అన్ని ఏంగిల్స్‌లో వాళ్ళ ఊహా చిత్రాలను గీయమని చెప్పు. ఆ బొమ్మలను అన్ని స్టేషన్లకు పంపి, అందరినీ గాలించమని చెప్పు. వాళ్ళు ఎక్కిన లారీని ట్రేస్ చేయండి. ఆ డ్రైవర్‌ను పట్టుకుంటే వాళ్ళ పోలికలు తెలిసిపోతాయి. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొదలయినవి అర్థమైపోతాయి’ అన్నాడు హుషారుగా. అంబరీష్లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. కేసు త్వరగానే సాల్వ్ అయిపోతుందనే ఆశ కలిగింది. తొందరగానే లారీని ట్రేస్ చేశారు పోలీసులు. డ్రైవర్ ద్వారా ఆ ముగ్గురి వివరాలూ తెలిశాయి. వాళ్ళను వైజాగ్‌లో ఎక్కడ దించాడో కూడా తెలిసింది. ‘ఇంకేముంది? వాళ్ళు దొరికిపోయినట్లే. నేరస్తులను పట్టుకోవడానికి బోలెడు క్లూలు ఉన్నాయి’ అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. వాళ్ళను పట్టుకున్నారన్న వార్తను వినడానికి అసహనంగా వెయిట్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్లు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ప్రోగ్రెస్ కనబడటం లేదు. వాళ్ళు దిగిన లాడ్జ్‌ను కనిపెట్టారు గానీ, అప్పటికే వాళ్ళు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాజారావు రోజూ స్టేషన్‌కి వచ్చి కేసు విషయంలో ప్రోగ్రెస్ ఏమీ లేదని తెలుసుకొని బాధ పడుతూ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ∙∙ ఒకరోజు రాత్రి పదిగంటలు దాటిన తర్వాత రాజారావు నుంచి అంబరీష్‌కు ఫోన్ రావడంతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. ‘సర్.. ఆ ముగ్గురూ ఇప్పుడు నా టాక్సీలోనే ఉన్నారు. అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్ళాలని చెప్పి సులభ్ కాంప్లెక్స్‌కి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. అనకాపల్లి వెళ్లి రావడానికి ఐదువేలిస్తామని నాతో బేరం కుదుర్చుకున్నారు. ఇద్దరు తమిళంలోనే మాట్లాడు కుంటున్నారు. వాళ్ళలో ఒకడు దగ్గుతున్నాడు. మరొకడిది బట్టతల. బేరం ఆడినవాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. కచ్చితంగా వాళ్ళే సార్’ అని చెప్పాడు గబగబా. ‘వెరీ గుడ్. మనకి ఇలా కలిసి వచ్చిందన్న మాట. నీ ఫోన్‌ని ట్రాక్ చేస్తూ, వాళ్లకు అనుమానం రాకుండా మిమ్మల్ని ఫాలో అవుతాం. నువ్వేమీ భయపడకు’ అంటూ అభయాన్ని ఇచ్చి ఫోన్ కట్ చేశాడు అంబరీష్. ∙∙ ‘సర్.. నేనిప్పుడు అనకాపల్లిలో ఉన్నాను. లొకేషన్ షేర్ చేశాను. నన్ను ఇక్కడే ఉండమని వాళ్ళు ముందుకు నడిచి వెళ్తున్నారు. ఎడమ వైపు నాలుగవ వీధిలోకి తిరిగారు’ అని వివరం అందించాడు రాజారావు. ‘మేం దగ్గరలోనే ఉన్నాం. రెండు నిమిషాల్లో చేరుకుంటాం’ అని ఫోన్ పెట్టేశాడు అంబరీష్. అన్నట్టుగానే రెండు నిమిషాల్లో పోలీసు జీపు అక్కడికి వచ్చింది. అంబరీష్‌తో సాయుధులయిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఇద్దరు పోలీసులు నాలుగవ వీధి వైపు నడిచారు. రాజారావు అక్కడే ఉండిపోయి ఏం జరగబోతుందోనన్న ఉత్సుకతతో ఎదురుచూడసాగాడు. దాదాపు అరగంట దాటినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోయేసరికి రాజారావులో టెన్షన్ మొదలయింది. గాభరా పడుతూ అటువైపే చూడసాగాడు. అక్కడికి వెళ్లి చూడ్డానికి అతనికి ధైర్యం సరిపోవడం లేదు. కాస్సేపటికి పోలీసులు తిరిగిరావడం చూసి అతని మనసు కుదుటపడింది. వాళ్ళతో పాటు నడుస్తున్న ముగ్గురు నేరస్తులు, వాళ్ళ చేతికి తగిలించిన బేడీలు చూడగానే ఆనందం పట్టలేకపోయాడు రాజారావు. గబగబా అంబరీష్‌కు ఎదురెళ్ళి..‘ఏమయింది సార్? మా తమ్ముడిని ఎందుకు చంపారు ఈ దుర్మార్గులు?’ అంటూ ఆత్రుతగా ప్రశ్నిస్తున్న రాజారావు వైపు నవ్వుతూ చూస్తూ, ‘అన్ని వివరాలూ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాతే. అంతవరకూ సస్పెన్స్ అని చెప్పాడు అంబరీష్. చేసేదేమీలేక తల ఊపాడు రాజారావు. స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అంబరీష్ చెప్పడం మొదలుపెట్టాడు.. కాళితో సహా అందరూ శ్రద్ధగా వినసాగారు.. ‘సన్నగా పొడవుగా ఉన్నవాడి పేరు రాహుల్.. తెలుగువాడే. వాడే అసలు నేరస్తుడు. రాహుల్‌కి పన్నెండేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోతే, తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కలకత్తా వెళ్ళిపోతూ కొడుకును తన తండ్రి జానకిరామ్‌కు అప్పగించింది. అప్పటినుంచి ఆయనే వీడిని గొప్ప క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశాడు. అదే కొంప ముంచింది. తల్లితండ్రుల ప్రేమకు దూరమయిన రాహుల్.. తాతగారి స్ట్రిక్ట్ డిసిప్లిన్‌తో విసిగిపోయి, తాత అంటే అయిష్టాన్ని పెంచుకున్నాడు. అది కక్షగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదని తల్లికి తరచూ ఫిర్యాదు చేసేవాడు. ‘నీ మంచి కోసమే తాతగారు అలా చేస్తున్నారు’ అంటూ తల్లి.. జానకిరామ్‌ను సమర్థిస్తూ రావడంతో తాత మీద కక్ష ఇంకా పెరిగింది. ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్ అయిన రాహుల్‌ను చెన్నైలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేర్చారు భారీ డొనేషన్ కట్టి. అక్కడ మిగిలిన ఇద్దరు నేరస్తులు రామన్, రాఘవన్‌లు పరిచయం అయ్యారు. వాళ్ళ సహవాసంతో రాహుల్‌కు అన్ని వ్యసనాలు అబ్బాయి. ఇంటి దగ్గర నుంచి పంపే డబ్బు సరిపోక అప్పులు పెరిగిపోయి అతని పరిస్థితి దుర్భరం అయింది. తాత దగ్గర తల్లి నగలు, బోలెడంత డబ్బు ఉన్నట్లు రాహుల్ పసిగట్టాడు. తాతను చంపేసి డబ్బు, నగలు పట్టుకుపోవాలని ప్లాన్ వేసి ఇద్దరినీ తోడు తెచ్చుకున్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి కృష్ణ టాక్సీలో ఎక్కిన ఆ ముగ్గురు జానకిరామ్‌ను ఎలా చంపాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాము మాట్లాడేది తమిళం కాబట్టి వాళ్లు కృష్ణని పట్టించుకోలేదు. కానీ కృష్ణకు తమిళం వచ్చు. వాళ్ళ ప్లాన్ అర్థమైయిపోయింది అతనికి. కారు ఆపి వాళ్ళను దిగిపోమని, పోలీసులకు ఈ విషయం చెప్తానని బెదిరించాడు కృష్ణ. దాంతో రాఘవన్.. కృష్ణ మెడపై కత్తి పెట్టి, కారుని పక్కదారి పట్టించాడు. అక్కడ కారు ఆపించి కృష్ణను దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. రెండవ ప్రయత్నంలో వాళ్ళు రాజారావు కారు ఎక్కడం యాదృచ్ఛికం. అలాకలిసొచ్చి వాళ్లు దొరికి నిజాలు బయటపడ్డాయి’ అంటూ ముగించాడు అంబరీష్. (సుమారు నాలుగు దశాబ్దాల కిందట విశాఖ జిల్లాలో జరిగినయదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ) చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది? -
పిల్లల కథ: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!
Moral Stories for Kids: సాయంత్రం కుందేలు ద్వారా కోతిబావను పిలిపించి ‘కోతిగారు మీరు రేపు పండుగ సందర్బంగా కోయగూడెంలో జాతర జరగుతోంది. గుడి వద్ద నిప్పులపై భక్తులు నడచి మొక్కులు తీర్చుకుంటారు. తమరు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళు, వంకర వంకర జిలేబీల కొరకు గుడి పక్కకు వెళ్ళవద్దు. వెళ్ళి అనవసర సమస్యలు తెచ్చుకోవద్దు’ అని జాగ్రత్తలు చెప్పాడు సింహారాజు. వినయంగా చేతులు కట్టుకున్న కోతిబావ ‘చిత్తం మహారాజా అలాగే’ అన్నాడు. తెల్లవారక మునుపే తప్పెట్ల మోతలు జోరుగా వినిపించసాగాయి అడవికి చేరువలో ఉన్న కోయగూడెం నుండి. ‘ఆహా.. గూడెంలోని గుడిలో పండుగ పూజ అంటే తనకూ పండుగే! కొబ్బరి చిప్పలకు, అరటి పళ్ళకు,జిలేబి, మిఠయీలకు కొదవే ఉండదు అనుకుంటూ కోయగుడేనికి బయలుదేరాడు కోతిబావ. వెళ్ళే దారిలో కుక్కలు తరమసాగాయి. ఎక్కడా చెట్టు కనిపించకపోవడంతో, చెరువు గట్టున ఉన్న చాకిరేవు బానలోని నీళ్ళు, బట్టల మధ్య దాగాడు కోతి బావ. ఎత్తుగా ఉన్న చాకిరేవు బానపైకి ఎక్కలేని కుక్కలు అక్కడే తిష్టవేశాయి. ఉతికిన బట్టలు ఆరవేసి వచ్చిన రంగయ్య.. మసక వెలుతురులో బానలో చేయిపెట్టి జత బట్టలు బయటకు తీశాడు. బట్టలతోపాటు కోతిబావ తోకను కూడా కలిపి పట్టుకుని బట్టలు ఉతేకే బండపై రెండు బాదులు బాదాడు. ఆ దెబ్బలకు బాధతో కోతిబావ కిచకిచలాడాడు. రంగయ్య దాని తోక వదలడంతో పంచవర్ణాలూ కదిలాయి కోతిబావ కళ్ల ముందు. కుక్కలకు భయపడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపు అక్కడే ఉన్న కుక్కలు గుడి వైపు వెళ్ళిపోయాయి. గుడి వద్దకు చేరిన కోతిబావ కడుపు నిండుగా ప్రసాదం, అరటిపళ్ళు తిని చెట్టుపై హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం తప్పెట మోతకు మెలకువ వచ్చింది. మొక్కున్న భక్తులు నడవడానికి గుడి ముందు నిప్పుల గుండం సిద్ధమై ఉంది. అదేంటో చూద్దామని .. కొబ్బరి చిప్ప తింటూన్న కోతిబావ చెట్టు దిగి నిప్పుల గుండం చేరువగా ఉన్న ఎత్తన కర్రపైకి వెళ్ళి కూర్చుని చూడసాగాడు. అక్కడ కిందున్న చెక్కబల్ల మీద కిరోసిన్ డబ్బాలో తన తోక మూడు వంతులు మునిగి ఉండటం కోతిబావ గమనించలేదు. చిన్నపిల్ల తింటున్న మిఠాయి కోసం కిందికి దిగిన కోతిబావను కుక్కలు తరమసాగాయి. ఎటు పోదామన్నా జనం గుంపులు గుంపులుగా అడ్డురావడంతో వేరే దారి లేక నిప్పులగుండంపై నుండి పరుగుతీశాడు. కిరోసిన్‌లో తడిసి ఉన్న తోకకు మంట అంటుకుంది. భయంతో పదుగురు మగవాళ్ళ పంచలకు మండుతున్న తన తోక అంటించి చావుబతుకులతో పరుగుతీసి అడవికి చేరువలో ఉన్న చెరువులో దూకి మండుతున్న తనతోకను ఆర్పుకున్నాడు. ఆ తర్వాత ముక్కుతూ,మూలుగుతూ అడవిలోకి నడిచాడు. అది చూసిన కుందేలు.. ‘నీ క్షేమం కోరి సింహరాజుగారు చెప్పిన జాగ్రత్తలను పెడచెవిన పెడ్తివి. ఆపదలకు ఎదురు వెళ్తివి. పెద్దల మాట చద్ది మూట అన్న విషయం తెలుసుకో. పెద్దలు ఎప్పడూ మన క్షేమమే కోరి హితవు చెపుతారు. ఇదిగో నువ్వు ఇలాంటి పనేదో చేసి వస్తావని ఊహించే ఆకు పసరు సిద్ధం చేశాను గాయాలకు రాసుకో’అన్నది కుందేలు. బుద్ధిగా తలఊపి చేతులు జోడించాడు కోతిబావ. -డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది? -
కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది నాకు. టైమ్ చూద్దును కదా అర్ధరాత్రి ఒకటిన్నర. ఇది కాస్త అసహజమైన విషయమే. ఒకసారి పడుకున్నానూ అంటే మళ్లీ తెల్లారేవరకూ వొకపట్టాన లేచే రకం కాదు నేను. నా నిద్రని డిస్టర్బ్ చేయగలిగే శబ్దాలు కూడా ఏమీ బయట్నించీ లోపలికి రాలేదని బల్లగుద్ది చెప్పగలను. ఇలా మధ్యరాత్రిలో నిద్ర లేవడమన్నది ఊహ తెలిశాక ఎప్పుడూ జరగలేదు. ఒంటరిగా పడుకోవడం అలవాటు లేక మెలకువొచ్చిందని అనుకోడానికి కూడా లేదు. నాకంటూ అసలెవరున్నారని. ఆ ఫ్లాట్‌లో వుండేది నేనొక్కణ్నేగా. మరి నన్ను నిద్ర లేపింది ఏమైవుండొచ్చు? ఉన్నట్టుండి సడెన్‌గా వెలిగింది నాకు, ఆ గదిలో నేను వొంటరిగా లేను. ఇంకెవరో కూడా వున్నారు. నా పడకగదిలో కనీసం బెడ్‌లైట్ కూడా వేసి లేదు. కిటికీల్లోంచీ బయటి వెలుతురేమీ లోపలికి రావట్లేదు. ఎంత చీకటిగా వుందంటే, అసలు కళ్లు తెరవడానికీ మూయడానికీ తేడా ఏం తెలీడం లేదు. అయినా సరే అర్థమైపోయింది నాకు, ఆ రూములో ఎవరో వున్నారని. నేను భయపళ్లేదు. నాకు ఎలాంటి హానీ తలపెట్టే వుద్దేశం ఆ వ్యక్తికి లేదని నాకు తెలిసిపోతోంది. ఎలా తెలుస్తోందీ అని అడగొద్దు. చిమ్మచీకటిలో కూడా యింకొక మనిషి అక్కడున్నట్టు నాకెలా తెలిసిందో, యిదీ అలాగే. ఆఫీసుల్లో పెట్టినట్టు నా బెడ్రూమ్ బయట కూడా ఒక లాగ్ రిజిస్టర్ పెట్టాలి. ఇంట్లో నేనొక్కణ్నే వుండి, నిద్రలో మునిగిపోయి వున్నప్పుడు నా గదిలోకి రావాలనుకున్నవాళ్లు ‘పర్పస్ ఆఫ్ విజిట్’ ఏంటో అందులో రాసిన తర్వాత మాత్రమే లోపలికి రావాలి. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఆ వొచ్చిన మనిషికి నాకేదో చెప్పాలన్న వుద్దేశం లేదు. నన్నేదైనా అడిగే ఆలోచనా లేదు. కాస్త యెడంగా నిలబడి నేనేం చేస్తున్నానో పరిశీలించడమే అతను (ఆమె?) చేయదల్చుకున్న పని అని అనిపించింది నాకు. అసలైనా అంత చీకట్లో, అందునా నిద్రపోతున్న నన్ను గమనించడం ద్వారా నా గురించి ఏం తెలిసే అవకాశం వుంది? ఆ వచ్చిన మనిషి చనిపోయిన మా నాన్న గానీ, అమ్మ గానీ అయ్యుండే చాన్సుందా? వాళ్లు వదిలెళ్లిన పాత పెంకుటిల్లు బాగోగులు నేను చూస్కోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడానికి వచ్చారా? అయ్యుండకపోవచ్చు. మరి? నాలుగేళ్ల క్రితం చనిపోయిన నా బెస్టు ఫ్రెండు ఆత్మ అయ్యుండొచ్చా? ‘నాగ్గానీ ఏమైనా అయితే, మా ఫ్యామిలీ మేటర్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాల్రా’ అని చేతిలో చెయ్యేయించుకొని, మాట తీసుకొని మరీ కన్ను మూశాడు. నేను వాళ్లింటి ఛాయలకి పోయి ఎన్నాళ్లయ్యింది? తనకి నేనిచ్చిన ప్రామిస్‌ని గుర్తు చేయాలనుకుంటున్నాడా? ఆత్మలకి అన్నీ తెలిసిపోయే ప్రొవిజన్ వుంటే వాడికి (వాడి ఆత్మకి) నా మీద భ్రమలు తొలగిపోయి వుండాలి. మొత్తమ్మీద యీ కొత్తమనిషి ప్రెజెన్సు, దాని వెనక వుండగల కారణాలు యివన్నీ ఆలోచిస్తుంటే నాకు మిగతా విషయాలేవీ గుర్తుకు రావట్లేదు. లెక్క ప్రకారం, యిలా అనుకోకుండా మెలకువ వచ్చిన ఎవరైనా ఏం చేయాలీ? ఆ ముందురోజు జరిగిన లేదా తర్వాతిరోజు జరగాల్సిన ముఖ్యమైన పనేదో చప్పున మైండులోకి వచ్చి, దాని గురించే కదా ఆలోచించాలి! నాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన విషయం అంటే లావణ్య తప్ప మరింకేదీ కాదు. పిచ్చెక్కించే అందం, అసాధారణమైన తెలివితేటలు, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలాంటి అమ్మాయి పార్టనర్‌గా దొరకడాన్ని మించిన అదృష్టం ఏ మగాడికైనా వేరే వుంటుందా? లక్కీగా పెళ్లి అనే సిస్టమ్‌లో యిరుక్కుపోవడానికి లావణ్య కూడా సిద్ధంగా లేదు. ‘లైఫ్ అంతా వొక్కడితోనే అనే ఆలోచనే సఫొకేటింగా వుంటుంది’ అని పైకే అనేస్తుంది. ఎవరైనా వింటే ఏం అనుకుంటారో అనే భయం కూడా లేదు ఆ పిల్లకి. ‘సీరియస్ కమిట్మెంట్లు అవసరం లేని క్యాజువల్ రిలేషన్ షిప్ ఎవరితో అయినా ఓకే’ అన్నట్లుగా ఉంటుంది. లావణ్య అలా ఉండడంత మొదట్లో నాకు పెద్దగా నచ్చలేదు. ఆమె నమ్మే ఫిలాసఫీలో నాకు లాభించగల కోణం ఏంటీ అన్నది నాకు తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. ఒకవేళ ఆమె కూడా అందరిలాగానే పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ కావాలనుకుంటే ఏమైవుండేది? అసలు నన్ను దగ్గరకి రానిచ్చేదేనా? మిగతావాళ్ల సంగతేమో గానీ, నాతో ఫిజికల్‌గా ఎఫైర్ పెట్టుకోడానికి లావణ్యకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగని దానికి లివిన్ రిలేషన్ అని పేరు పెట్టడం కూడా ఆమెకి యిష్టం వుండదు. ఏదీ ఒక అరేంజ్మెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా వుండకూడదనేది తన ఫిలాసఫీ. సమాజం ఎప్పుడైనా మార్పుని వ్యతిరేకిస్తుంది. కొన్నాళ్లకి చచ్చినట్టు రాజీపడుతుంది. ఏ మార్పుతో అయితే అయిష్టంగా రాజీపడిందో దాని తాలూకూ ఫలితాన్ని యిన్ఫ్లూయెన్స్ చేయాలని కొన్నాళ్లకి దానిలో ఆరాటం మొదలవుతుంది. అప్పుడు ఆ మార్పుకి విలువ లేకుండా పోతుంది. మళ్లీ కొత్త మార్పు కోసం కొత్తగా ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ లావణ్య చెప్పిన మాటలే. తన ఐడియాలజీతో నాకొచ్చిన పేచీ ఏమీ లేదనే అనిపించింది నాకు. ∙∙ ‘దబ్’ అన్న సౌండుకి మళ్లీ మెలకువొచ్చింది నాకు. కిటికీలో నుండీ విసరబడిన న్యూస్ పేపర్ చప్పుడన్నమాట. పేపర్ బాయ్ మీద భలే కోపం వచ్చింది. అయితే, ఆ కోపం ఎంతోసేపు ఆగలేదు. మూడో అంతస్తులో వున్న కిటికీలోంచీ కచ్చితంగా నా రూములో కొచ్చి పడేలాగా గురిచూసి విసిరే వాడి టాలెంట్ గుర్తొచ్చి ముచ్చటేసింది. అవునూ, మూడు రోజుల్నుండీ నేను పేపర్ చదవనే లేదా? రబ్బర్‌బ్యాండ్ కూడా తీయకుండా పేపర్లు కిటికీ పక్కనే పడున్నాయేంటి? సరే నా సంగతి వదిలేద్దాం. మరి నా రూముకి కొత్తగా వచ్చిన గెస్టు సంగతేంటి? అతను (ఆమె?) కి పేపర్ చదవాలనీ, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ లేదా? ఎవరో నా పక్కన వున్నారని తెలిసి కూడా నాకు మళ్లీ నిద్ర ఎలా పట్టింది? తెల్లారింది కాబట్టీ, వెలుతుర్లో ఆ మనిషి ఎవరన్నదీ స్పష్టంగానే కనబడొచ్చు. కానీ, నాకెందుకో అలా తెలుసుకోబుద్ధి కాలేదు. అవతలి మనిషి వల్ల నాకెలాంటి యిబ్బందీ లేనప్పుడు ఆరాలు తీయడం పద్ధతి కాదని అనిపించింది నాకు. అలా చేయడం ఎదుటివాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం కాదూ?! తాళం వేసున్న గదిలో, ఊహించని విధంగా వొక అగంతకుడు ప్రత్యక్షం అవ్వడం, అప్పుడే నిద్రలేచి మత్తుగా ఆవులిస్తున్న హీరోపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ప్లాన్ ముందే పసిగట్టిన హీరో లాఘవంగా అవతలికి గెంతడం, కత్తితో పొడవబోయిన క్రిమినల్ తూలి ముందుకి పడిపోవడం, వాడి చేతిలో వున్న ఆయుధం జారిపోవడం.. సినిమాల్లో చూసిన యిలాంటి సీన్లన్నీ గుర్తుకొచ్చాయి నాకు కాసేపు. నిజానికి నా బుర్ర చేస్తున్న తప్పు క్షమార్హం కాదు. ఎందుకంటే అసలు నా చుట్టూ వున్న వాతావరణం ప్రాస్పెక్టివ్ క్రైౖ మ్ సీన్లా లేనే లేదు. ముందుగా జరిగిన వొప్పందం ప్రకారం యిద్దరు మనుషులు స్నేహపూర్వకంగా ఒక వెన్యూని షేర్ చేసుకుంటున్నట్టుంది. అయినా, వర్రీ కావాల్సిన సీరియస్ యిష్యూస్ వదిలేసి, యింత అల్పమైన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? పట్టించుకోవాలే గానీ ఎన్ని సమస్యలు లేవు నాకు! లావణ్య విషయంలో నాకు పోటీ వస్తున్న కొలీగ్ సుందర్ విషయంలో ఏం చేయాలో ఆలోచించాలి ముందు. సుందర్..! ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. లేదా, వయసు పెరక్కుండా అడాలసెన్స్లోనే ఆగిపోయినట్టున్నాడు. లావణ్య మనసు మార్చగలననీ, ఆమెకి పెళ్లి మీద నమ్మకం కుదిరేలా చేస్తాననీ వాదిస్తాడు. ‘జీవితాంతం యితని చేయి వదలకూడదు అనిపిచేంత నమ్మకం కలిగించే మగాడు తారసపడకపోవడం వల్లే లావణ్య అలా మాట్లాడుతోందీ’ అంటాడు. ‘ఎన్ని రోజులు ఎదురుచూసైనా సరే, ఎంత కష్టపడాల్సివచ్చినా సరే.. లావణ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితాశయం’ అంటాడు. ఒకప్పుడు తను కూడా సుందర్ లాగానే వుండేవాడు. అచ్చం అలానే ఆలోచించేవాడు, ‘విధి యిద్దరు మనుషుల్ని దగ్గరగా తీసుకురావడం, వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకోలేకపోవడం, ఆ వెలితి వాళ్లని జీవితాంతం వేధించడం’. కాలేజీ రోజుల్లో యిలాంటి కథలు ఎంత కిక్కెక్కించాయో.. తనకి కూడా! చాలామంది గ్రాడ్యువల్‌గా ఆ ట్రాన్స్ నుండి బయటకి వచ్చేస్తారు. సుందర్ మాత్రం బయట ప్రపంచం ఎలావుందో చూడడానికి రెడీగా లేడు. అతని ప్రవర్తన చైల్డిష్‌గా వుందని చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం లేదు సరి కదా, కోపం తెచ్చుకొని అసహనంతో రగిలిపోతున్నాడు. ∙∙ ‘కావాలంటే నువ్వూ లావణ్యని ప్రేమించు. తనని పెళ్లి చేసుకోవాలని నాకు మాదిరిగానే కలలు కను. నాకేం అభ్యంతరం లేదు. మనిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటే లావణ్య వాళ్లనే ప్రేమిస్తుంది. అసలు లావణ్య వరకూ ఎందుకు?! నాకన్నా నువ్వే తనని ఎక్కువ సంతోషంగా ఉంచగలవు అని నమ్మకం కుదిరితే నేనే హ్యాపీగా మీ యిద్దరి లైఫ్‌లో నుండీ వెళ్లిపోతాను. కానీ, అసలు ప్రేమా పెళ్లీ అనే ప్రస్తావన లేకుండా, వొక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే చాలు అనుకోవడం తప్పు’ అన్నాడు సుందర్. ‘చెప్పేది వినవే. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవొద్దు, తనతో సంబంధం పెట్టుకుంటే చాలు’ అని జనరలైజ్ చేయడం లేదు నేను. ఇక్కడ డిస్కషన్ కేవలం లావణ్య గురించే. ఆ అమ్మాయికి కావాల్సిందేదో తనకి యివ్వడమే కదా ఆమెని ప్రేమించేవాడు చేయాల్సిన పని?’ లాజిక్ తీశాన్నేను. ‘అసలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలీదు. ఏదో సరదాకి అలా మాట్లాడుతుందంతే. తన అమాయకత్వాన్నీ, వల్నరబిలిటీనీ క్యాష్ చేసుకోవడంలో తప్పు లేదని అంటున్నావ్ నువ్వు, అంతేగా?’, నన్ను విలన్ లాగా చూస్తూ అడిగాడు సుందర్. ‘లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్‌గా తెలియని అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకోవడం కూడా తప్పేగా మరి? కొన్నాళ్లయ్యాక ఆమె తన యిష్టాయిష్టాలేంటో తెలుసుకొని, అసలు పెళ్లెందుకు చేసుకున్నాన్రా దేవుడా అని వుసూరుమంటుందేమో?’ అన్నాను నేను. చెప్పొద్దూ, నన్ను చూసుకుంటే నాకే చాలా గర్వంగా అనిపించింది. ఈ దెబ్బకి సుందర్గాడి మాట పడిపోతుంది. ‘భవిష్యత్తులో లావణ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటే, అది లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నట్టు అవుతుందా? పెళ్లి చేసుకోవడం కంటే, దొరికినోడితో దొరికినట్టు ఉండడం బెటర్ అనే ఆలోచన తప్పు అని తెలుసుకోవడం కదా అల్టిమేట్ రియలైజేషన్ అంటే?!’ వీడంత తేలిగ్గా రాజీ పడే రకం కాదు. ‘సుందర్, నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను’ టెంపో మార్చి, సాఫ్ట్‌గా అన్నాను. ‘ఏంటి? అడుగు’ అనుమానంగా బదులిచ్చాడు. ‘పెళ్లి గురించి లావణ్య ఫిలాసఫీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకునేంత మెచూరిటీ వుందనే నమ్మకం లేదు. మరి, ఏం చూసి తనని ప్రేమించావు? ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు?’ నా నుండి ఈ ప్రశ్నని సుందర్ ఏమాత్రం వూహించలేదని తన ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సుందర్‌లో కాస్త నిజాయితీ లేకపోలేదు. అతని స్థానంలో ఎవరైనా వుంటే, నా ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఏదో వొక సమాధానం చెప్పివుండేవాళ్లు. కానీ సుందర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించాడు. నిజానికి సుందర్‌ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లావణ్యతో నేను సంబంధం పెట్టుకోడానికి అతని పర్మిషన్ తో పనేముంది? కానీ, ఎందుకోగానీ నేను చేసే పని రేషనల్గానే వుందని సుందర్‌ని నమ్మించాలని అనిపిస్తోంది. బహుశా, నేనూ వొకప్పుడు అతనిలాగానే ఆలోచించేవాడిని అని నాకు పదేపదే గుర్తుకు రావడం వల్ల అనుకుంటాను. వాదించడం ఆపేసి సుందర్ డిఫెన్సులో పడిపోవడం నాకు కాస్త వుత్సాహానిచ్చింది. సుందర్.. విషయం యిక్కడిదాకా వచ్చింది కాబట్టీ, నాకు ఏమనిపిస్తుందో చెపుతా విను. నీకూ నాకూ లావణ్య నుండీ కావాల్సింది వొక్కటే. మనిద్దరి అప్రోచ్ మాత్రమే వేరు. పెళ్లి అన్నమాట ఎత్తకుండా లావణ్యతో నేను ఎక్కడ తేలతానో, పెళ్లీ పెళ్లీ అని కలవరిస్తూ నువ్వు కూడా అక్కడే తేలతావ్. పచ్చిగా చెప్పాలంటే, లావణ్యతో ‘రిలేషన్షిప్’ కోసం నువ్వు పెళ్లి అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావ్, అంతే!’ మరీ యింత హార్ష్‌గా చెప్పకుండా వుండాల్సిందేమో. కానీ, యిక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈసారి కూడా సుందర్ ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి గదిలో అటూయిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేశాను. ఇక కొత్తగా జరగ్గలిగే డ్యామేజ్ అంటూ ఏం లేదు. సిగరెట్ పెట్టె, లైటర్ చేతిలోకి తీసుకొని, అప్పటిదాకా జరిగిన చర్చని కంక్లూడ్ చేస్తూ చెప్పాన్నేను.. ‘నా మాట విని నువ్వూ నా స్కూల్లోకొచ్చెయ్. ఇలా తర్జనభర్జన పడుతూ పోతే, చివరికి నువ్వూ నేనూ తప్ప అందరూ వాడతారు దాన్ని’ లావణ్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. కానీ ఆమెని వుద్దేశించి ‘దానిని’, ‘అది’ లాంటి పదాలు నేను వాడడం అదే మొదటిసారి. కుండబద్దలు కొట్టేసి, నా పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, మాటలకి మరీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు అని నా యిన్‌స్టింక్ట్ చెపుతోందన్నమాట. హాల్లోంచీ బాల్కనీలోకి వెళ్లే తలుపు బోల్ట్ తీస్తూ నేను పై మాటలు అంటున్న సమయానికి సుందర్ వేరేౖ వెపు తిరిగి వున్నాడు. అతని ఫేస్ నాకు కనబడుతూ వుండివుంటే కనీసం చివరి రెండు వాక్యాలైనా మాట్లాడకుండా నిగ్రహించుకొని వుండేవాణ్నేమో. సుందర్ ఆవేశంగా నా మీదకి రావడం అర్థమయ్యి చప్పున వెనక్కి తిరగబోయాను నేను. అప్పటికే అతను నా కాలర్ పట్టుకుని విసురుగా వెనక్కిలాగి, నా తలని పక్కనే వున్న గోడకేసి కొట్టాడు. అతని పట్టు నుండి విడిపించుకోడానికి నా శక్తికొద్దీ ప్రయత్నించాను. చూడ్డానికి అర్భకుడిలా వున్నాడనే కానీ గట్టిపిండమే. ∙∙ నా గదిలో ఎవరో వున్నారని నేను గ్రహించడం దగ్గర కదా ఈ కథ మొదలైంది. నేను పడుకోడానికి ముందు ఏం జరిగిందీ అన్నది గుర్తు చేసుకున్నాక నాకు యిప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. సుందర్‌ని నేను చంపేశానన్నమాట. నాకు నిద్రాభంగం అవడానికి కారణమైంది సుందర్ శవం కానీ లేదా అతని ఆత్మ కానీ అయ్యుండాలి. సెకండ్ ప్రాబబిలిటీ ప్రకారం, సుందర్ నన్ను చంపేసి వుంటే, ఆ గదిలో వున్న యిద్దరూ నేనే అవ్వడానికి కూడా అవకాశం వుంది. సుందర్‌కీ నాకూ మధ్య జరిగిన పెనుగులాటలో ఎవరు గెలిచారు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది నిజం ఏంటన్నది. అన్నట్టు మీకు యింకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుందర్ నన్ను చంపడానికి ప్రయత్నించడం, అంత కంగారులోనూ, నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. నన్ను ఆశ్చర్యపోయేలా చేసిందేంటంటే, సుందర్ మొహంలో కోపం కాకుండా భయం కనిపించడం. తన గురించి తాను తెలుసుకోవడంలో మనిషికి వుండే భయం. ప్రాణాలు వదలడానికి ముందు ఏబర్డీన్ లోయల్లో మాక్బెత్ని వేధించిన భయం. నిజం బారి నుండి పారిపోలేని నిస్సహాయత దెయ్యంగా మారి వెంటాడుతున్నప్పుడు కలిగే భయం. ఫైనల్‌గా సుందర్‌ని నేను కన్విన్స్ చేశానా? ఒకవేళ నా ప్రవర్తనని సమర్థించుకోడానికి నేను సుందర్ మొహంలో భయాన్ని కాకుండా ఆశ్చర్యాన్నే చూసినట్టు నటిస్తున్నానా? ఈ చివరి ఆలోచన రాగానే నా వొళ్లు వొక్కసారిగా జలదరించింది. తల పక్కకి తిప్పి, నా గదిలో వున్నదెవరో చూడాలంటే నాకిప్పుడు భయంగా వుంది. -
కథ: మనస్సులో దీపం వెలిగించిన వాడు
పేరుకు తగ్గట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రశాంత్‌నగర్ ఇప్పుడు చీటికీ మాటికీ అంబులెన్సుల సైరన్లతో మార్మోగిపోతోంది. ఆ సైరన్ విన్నప్పుడల్లా రఘురామయ్య గుండెల్లో అలజడి ప్రారంభమవుతూ ఉంటుంది. ‘ఎవరి ప్రాణం మీదికి వచ్చిందో, ఏమో! కరోనా పాడుగానూ, గుండెల్లో గుబులు దించుకుందామంటే, స్నేహితులెవరూ ఇల్లు వదిలి బయటకు రావడం లేదు’ అని దిగులుగా కుర్చీలో కూలబడ్డాడు. ఇంతకుముందు, తనలాగే రిటైరైన ఉద్యోగులు కొంతమంది కలిసి రోజూ సాయంకాలం వాకింగ్‌కి వెళ్లేవారు. ఆ విధంగా ఓ గంటపాటు బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడేవి. ఇప్పుడేముందీ అంతా గృహ నిర్బంధమే! న్యూస్ పేపర్ చదవడమూ, టీవీ చూడడమూ మానేసినా.. చుట్టాలూ, స్నేహితులూ కరోనాకి బలైపోయిన వార్తలు ఫోన్ ద్వారా అందుతూనే ఉన్నాయి. ఫోన్ మోగితే చాలు భయం భయంగా ఉంటోంది.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనని. రఘురామయ్య ఇంకా బ్యాంకింగ్ సర్వీసులో ఉండగానే, ఒక్కగాని ఒక్క కొడుకు నవీన్ అమెరికాలో స్థిరపడ్డాడు. అతనికి బుద్ధిపుట్టినపుడు తండ్రికి ఫోన్ చేస్తుంటాడు. ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడేసి, ఫోన్ పెట్టేస్తాడు. ‘సమస్యలంటూ ఏమైనా ఉంటే తనకుండాలి గానీ, రిటైరైన ఈ ముసలాయనకి ఏముంటాయి?’ అన్నట్లుంటుంది అతని వ్యవహారం! రఘురామయ్య ఎప్పుడు చేసినా అతను ఫోన్ ఎత్తడు. అదేమంటే, ‘నేనుండేది అమెరికాలో, అమలాపురంలో కాదు’ అంటాడు. నాలుగేళ్ల క్రితం భార్య కేన్సరుతో చనిపోవడంతో రఘురామయ్యకు వృద్ధాప్యంతోపాటు ఒంటరితనం తోడైంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువైజనం పిట్టల్లా రాలిపోతుంటే, రఘురామయ్యలో ఆందోళన పెరిగిపోయింది. అది పంచుకోవడానికి మరెవరూ లేక, కొడుక్కి చెప్పుకోక తప్పలేదు.. ‘నవీన్ ... ఈ వరస చావులు చూస్తుంటే, భయంగా ఉందిరా!’ అంటూ. కొడుకు నుండి వచ్చిన సమాధానానికి రఘురామయ్య హతాశుడయ్యాడు. ‘వయసులో ఉన్న కుర్రాళ్లే రాలిపోతుంటే, డెబ్బైఏళ్ల వయసు నిండిన మీరు భయపడ్డంలో అర్థమేమైనా ఉందా?’ అన్న కొడుకు మాట మరణభయం కంటే ఎక్కువగా బాధపెట్టింది. అదేం మాట! డెబ్బై కాదు, నూట డెబ్బై ఏళ్లు వచ్చినా చావు అనేది భయపెట్టకుండా ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు కూడా చనిపోతున్నంత మాత్రాన, పెద్ద వాళ్ల చావు సాధారణమెలా అవుతుంది? ఆలోచించే కొద్దీ రఘురామయ్యకు దుఃఖం ఎక్కువైంది. అంతలో మెయిన్ డోర్ మీద ‘టక్...టక్’ అంటూ చిన్నగా శబ్దం వినిపించింది. డోర్‌బెల్ కొట్టకుండా, ఇంత సున్నితంగా తలుపుపై కొట్టేవాడు వినయ్ మాత్రమే అని అతనికి తెలుసు. గడ్డం కింది నుండి మాస్క్‌ను ముక్కువరకూ లాక్కుని, నెమ్మదిగా లేచి తలుపు తెరిచేడు. డబుల్ మాస్క్ వేసుకుని, ఫేస్ షీల్డ్‌తో వినయ్ కనిపించేసరికి, రఘురామయ్యకు ఆనందంగా అనిపించింది. అతన్ని చూసినప్పుడల్లా, రఘురామయ్యకు కొడుకు గుర్తుకువస్తాడు. ఇద్దరిదీ సుమారుగా ఒకే వయసైనా, ప్రవర్తనలో ఎంతో వైరుధ్యం! ‘సర్.. నేను బజారుకు వెడుతున్నాను. మీకేమైనా మందులు కానీ, కూరగాయలు కానీ కావాలేమో చెప్పండి!’ అడిగాడు వినయ్. ‘ఏం వద్దుకానీ.. నీకు తీరికైనప్పుడు వచ్చి కూర్చోవయ్యా.. కొంతసేపు కబుర్లు చెప్పుకుందాం!’ ‘తప్పకుండా, సర్! పుస్తకాలు చదివీ చదివీ నాకూ బోర్ కొడుతోంది. త్వరగానే వచ్చేస్తాను. తలుపు తెరిచే ఉంచండి’ అంటూ వినయ్ బయల్దేరాడు. వినయ్ నర్సింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూనే, నర్సింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. రఘురామయ్యకు ఇంటికి అద్దెకివ్వాల్సిన అవసరం లేకపోయినా, వినయ్ చదువూ, వినయం చూసి ఒక పోర్షన్ అద్దెకిచ్చేడు. తనకేదైనా మెడికల్ ఎమర్జన్సీ అయితే, ప్రథమ చికిత్స అందించడానికైనా అతను ఉపయోగపడతాడన్న కించిత్తు స్వార్థం కూడా రఘురామయ్యకు లేకపోలేదు. కోవిడ్ కేసులు ముమ్మరం కావడంతో చాలా ఆసుపత్రులను కోవిడ్ సెంటర్లుగా మార్చేశారు. వినయ్ పనిచేసే ‘కార్డియాలజీ’ విభాగాన్ని కూడా మూసివేయడంతో గత నాలుగు నెలలుగా అతనికి ఉద్యోగం లేకుండా పోయింది. గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులు వినయ్‌ని ఇంటికి వచ్చేసి ఉండమంటున్నారు. అతనికి ఇరవై తొమ్మిదేళ్లు నిండడంతో, వెంటనే పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. తన ఆలోచనలకు సరిపడే, నర్సింగ్ చేసిన అమ్మాయి కోసం వినయ్ ఎదురు చూస్తున్నాడు. ఈ కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం ఇంత ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు, తనలాంటి వైద్యసిబ్బంది సమాజానికి సేవలు అందించాలి కానీ, ఇంట్లో కూర్చుంటే ఎలా అని, ఏదైనా కోవిడ్ సెంటరులో చేరాలని వినయ్ ప్రయత్నిస్తున్నాడు. అతని వలన తనకెక్కడ ఈ పాడురోగం సోకుతుందో నని రఘురామయ్య వినయ్‌ను కోవిడ్ సెంటర్లో చేరకుండా అడ్డుకుంటున్నాడు. రఘురామయ్య, వినయ్‌ల మధ్యనున్న భావసారూప్యత వలన స్నేహితులుగానే మెలగుతూ ఉంటారు. రఘరామయ్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలలో ఇది ఒకటి.. కరోనా వచ్చి తను హఠాత్తుగా చనిపోతే.. విమానాలు తిరగడం లేదు కాబట్టి, కొడుకు అమెరికా నుండి రాలేడు. వినయే తనకి తలకొరివి పెడతాడు అని. ఏ మాట కామాట చెప్పుకోవాలి తన సొంత కొడుకు కంటే, వినయే తనని ఎక్కువ బాధ్యతగా చూసుకుంటున్నాడు. కరోనా కేసులు ఎక్కువ కావడంతో, రఘురామయ్య వంటమనిషిని మానిపించేసేడు. అప్పటి నుండి, వినయే వంట బాధ్యతను తీసుకుని, తనకున్న వైద్య విజ్ఞానాన్నంతా జోడించి, నూనె, ఉప్పూ తగ్గించి వంటలు చేయడం ప్రారంభించేడు. వినయ్ గుర్తుకు రాగానే, అతనిలో ఈ మధ్య వస్తున్న మార్పులను చూసి రఘురామయ్య భయపడుతున్నాడు. గత కొద్దిరోజులుగా వినయ్ ‘సర్, నేను వేరే రూమ్‌కి షిప్ట్ అవ్వాలనుకుంటున్నాను. నేను వంటచేయడాన్ని మీరు రోజూ గమనిస్తున్నారు కాబట్టి, ఇకపై మీరే వంటచేసుకోవడం మొదలుపెట్టండి. మీకు ఇబ్బంది అనిపిస్తే, బయట నుండి మీకు భోజనం క్యారియర్ అందించే ఏర్పాటు చేస్తాను’ అంటున్నాడు. రఘురామయ్యకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వినయ్ ఎవరైనా అమ్మాయి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వెళ్ళిపోతున్నాడా? లేక తనలో చాదస్తాన్ని ఏమైనా చూశాడా? తలుపు పై ‘టక్...టక్...’ శబ్దం. ‘రా .. వినయ్’ అంటూ పిలిచాడు రఘురామయ్య. తలుపు నెమ్మదిగా తెరచుకొని వినయ్ లోపలికి వచ్చేడు. కుర్చీని దూరంగా జరిపి కూర్చున్నాడు. అది గమనించిన రఘురామయ్యకు ‘తనకి దూరంగా జరిగిపోతున్నాడా? లేక భౌతికదూరం పాటిస్తున్నాడా?’ అన్న అనుమానం వచ్చింది. ప్రతిచర్యగా రఘురామయ్య కూడా తన కుర్చీని ఎడంగా జరుపుకుని కూర్చుని ‘వినయ్, మరణానంతర జీవితం ఉంటుందని నువ్వు నమ్ముతావా?’ అని అడిగాడు హఠాత్తుగా. ‘మరణానంతర జీవితం మాట దేవుడెరుగు, మరణానికి ముందు జీవితం ఉంటుందని మీరు నమ్ముతారా?’ అన్నాడు వినయ్ వినయంగానే. రఘురామయ్య మనస్సు ఎక్కడో చివుక్కు మంది. ‘మాటల గారడీ కాదు, ప్రాక్టికల్‌గా మాట్లాడు’ అన్నాడు. ‘నేను ప్రాక్టికల్‌గానే మాట్లాడుతున్నాను, సర్! గత కొద్ది నెలలుగా మనం మరణం గురించి భయపడడం తప్ప, ఏమైనా జీవిస్తున్నామా?’ ‘ఇటువంటి విపత్కర పరిస్థితులలో అది సహజం’ ‘లేదు సర్, అందరూ అలా లేరు. కొందరైనా కానీ మరణం గురించి భయపడటం మానేసి, మరణావస్థలో ఉన్న వాళ్లకి సేవ చేస్తున్నారు’ ‘పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కానీ మరణం గురించి భయపడని వాళ్లు ఉంటారా?’ ‘మరణం గురించి మనం భయపడటానికి కారణం దాని గురించి ఎప్పుడూ తార్కికంగా ఆలోచించకపోవడమే అని నాకు అనిపిస్తూంటుంది. పుట్టుకా, చావూ ఒకే పార్సిల్లో వస్తాయి సర్. ఒక దాన్ని అంగీకరించి, రెండోదాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. మరణం అనేది చివరి మజిలీ కాదు, అది రోజూ కొద్దిగా కొద్దిగా జరుగుతూనే ఉంటుంది. శరీరంలో రోజూ అనేక కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. బాల్యంలోనూ, యవ్వనంలోనూ పుట్టే కణాలు ఎక్కువగా ఉంటాయి. అదే వృద్ధాప్యంలో అయితే, చనిపోయే కణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిమధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు శరీరంలో జీవచర్య ఆగిపోతుంది..’ రఘురామయ్య అసహనంగా కదులుతూ ‘తాగుడూ, జూదమే కాదు, పుస్తకాలు ఎక్కువగా చదివి కూడా మనిషి చెడిపోవచ్చని నిన్ను చూస్తే అర్థమవుతుందయ్యా!’ అన్నాడు. వినయ్ చిన్నగా నవ్వి ‘నేను చదివే పుస్తకాలు ఎక్కువగా మీ దగ్గర నుండి తీసికెళ్లేవే!’ అన్నాడు. ‘నువ్వు ఎన్నయినా చెప్పు.. మరణ భయం ఎవరికైనా సహజం’ అన్నాడు రఘురామయ్య. ‘మరణం కూడా అంతే సహజమైందని మనం అర్థం చేసుకుంటే, ఆ భయం తగ్గుతుంది. మరణం అనేదే లేకపోతే మజా ఏముంది సర్! మరణం అనేది జీవితంలో ఓ గొప్ప మిస్టరీ, ఆకర్షణ. పుట్టిన క్షణం నుండి, మరణం అనేది ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రతిక్షణం జీవితాన్ని ఓ ఉత్సవంలా జరుపుకోవాలి కదా! మరణం అనే టాపిక్‌ను చర్చించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. ఎంతకాలం అలా తప్పించుకుంటాం? జీవితంలో మరణం అనివార్యమైనప్పుడు, దాని గురించి స్పష్టంగా ఆలోచించి, ఓ అవగాహనకి రావాలి కదా! అప్పుడే మన జీవితానికి అర్థం ఏమిటని అన్వేషించగలుగుతాం! మన వలన కొందరి జీవితాల్లోనైనా వెలుగు నిండాలి కదా!’ రఘురామయ్య మొహం కోపంతో జేవురించింది. ‘ఇది ఎలా ఉందంటే.. నక్క పుట్టి నాలుగు రోజులు కాలేదు కానీ, ‘నా జీవితంలో ఇంత పెద్ద వాన చూడలేదు’ అందట!’ అన్నాడు. వినయ్ నవ్వు ఆపుకోలేకపోయేడు. ‘ఈ సామెత నేను మొదటిసారి వింటున్నాను, బావుంది సర్! నేను మీకంటే వయసులో చాలా చిన్నవాడినన్న ఒకే ఒక కారణంతో, నా వాదననంతా పక్కకి పెట్టేయకండి’ రఘురామయ్య మొహంలో సీరియస్‌నెస్ తగ్గలేదు. ‘నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి, మరణం అనే అధ్యాయం నీకు చాలా దూరంగా ఉంది కాబట్టి, అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నావు’ కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నంలో ఆయన మాటలు తడబడుతున్నాయి. వాదనను కొనసాగించడానికి ఇది సరైన సమయం కాదనిపించి, ‘మన మధ్య ఆ మాత్రం జనరేషన్ గేప్ ఉండటం సహజమే లెండి’ అంటూ నవ్వేసి ‘బయట వాతావరణం చాలా హాయిగా ఉంది. అలా నడిచి వద్దామా, సర్?’ అన్నాడు వినయ్. ప్రస్తుతం ఇంట్లో నెలకొన్న వాతావరణం చల్లబడాలంటే బయటి వాతావరణంలోకి వెళ్లడమే మంచిదని రఘురామయ్యకు కూడా అనిపించింది. లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేసినప్పటి నుండీ వాకింగ్ కోసం వినయ్ రోజుకొక కొత్త ప్రదేశాన్ని కనిపెట్టి, రఘురామయ్యను తీసుకెళ్లడం జరుగుతోంది. పచ్చని చెట్ల మధ్యలో నడిచి వస్తే, ఇద్దరికీ ఎంతో సేదతీరినట్లు అనిపిస్తోంది. కానీ.. ఈ రోజు మాత్రం నగరం మధ్యలో నడుచుకుంటూ చాలా దూరం వచ్చేశారు. కేసులు తగ్గుతున్నా, జనంలో భయం ఇంకా పోకపోవడం వలన, రోడ్డుపై వాహనాలు చాలా తక్కువగా తిరుగుతున్నాయి. మెయిన్ రోడ్డు పక్కనే, ఒక గేటు దగ్గర వినయ్ ఆగాడు. ఆ గేటుపైన ఉన్న ‘హిందూ శ్మశాన వాటిక’ అన్న బోర్డు చూసి రఘురామయ్య గతుక్కుమన్నాడు. వినయ్ లోపలికి నడవడం చూసి, రఘురామయ్య కంగారుగా ‘హేయ్.. అటెక్కడికి?’ అన్నాడు. వినయ్ నవ్వుతూ ‘అంత భయం దేనికి సర్? మనందరి చివరి మజిలీ ఇదే కదా!’ అంటూ మరింత ముందుకు నడిచేడు. రఘురామయ్యకు అతన్ని అనుసరించక తప్పలేదు. కొన్ని శవాలు తగలబడుతూ ఉన్నాయి. మరికొన్ని శవాలు క్యూలో ఉన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది, చనిపోయిన వారి బంధువులు కొద్దిమందీ అంతరిక్ష యాత్రికుల్లా పూర్తి బందోబస్తుతో ఉన్నారు. రఘురామయ్యకు ఒక్కసారి ఊపిరాడనంత పనైంది. అక్కడ పడి ఉన్న అనాథ ప్రేతాల్లో తనదీ ఒకటైనట్లు భావించుకుని ఉలిక్కిపడ్డాడు. ‘సర్.. ఇటు చూడండి!’ అంటూన్న వినయ్ మాటలతో రఘురామయ్య బాహ్యస్మృతిలోనికి వచ్చాడు. నాలుగు సమాధులు పక్కపక్కనే ఉన్నాయి. వాటిని చూపిస్తూ వినయ్ ‘ఈ సమాధులు నాలుగూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురి పిల్లలవి. వీళ్ల పుట్టిన తేదీలు, చనిపోయిన తేదీ చూశారా? వీళ్ల వయసు – అయిదేళ్ల నుండి పన్నెండేళ్ల మధ్యనే ఉంది. కార్ ఏక్సిడెంటులో డ్రైవర్‌తో పాటుగా ఈ నలుగురు పిల్లలూ చనిపోయేరు. వీళ్ల తండ్రి మా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. ఇప్పుడు చెప్పండి.. చావుకూ, వయసుకూ ఏమైనా సంబంధం ఉందా?’ అన్నాడు. రఘురామయ్య మనస్సంతా ఆర్ద్రమైంది. సమాధుల వంకా, రాతి పలకలపై రాసిన రాతల వంకా చూస్తూ ఉండిపోయేడు. వినయ్ రఘురామయ్య చేతిలోంచి మొబైల్ ఫోన్ తీసుకొని, అతని చెయ్యి పట్టుకుని ‘పదండి, సర్, వెడదాం’ అంటూ బయటకు దారి తీశాడు. వినయ్ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించేడు.. ‘సర్.. నేను వయసులో చిన్నవాడిని కాబట్టి, ఇప్పుడప్పుడే నాకు చావు రాదన్న గ్యారంటీ లేదు. నా వృత్తి కారణంగా, నేను ఇప్పటికే ఎన్నో మరణాలను దగ్గరగా చూశాను. నేను 2009లో నర్సింగ్ డిగ్రీలో చేరాను. అప్పటి నుండీ, అనేక వార్డులు రొటేషన్ మీద తిరగడం వలన, రకరకాల అవస్థలలో ఉన్న రోగులను చూశాను. రోగం నయమై సంతోషంగా వెళ్లిన వాళ్ల దగ్గర నుండి, రోగం ముదిరి చనిపోయిన వాళ్ల వరకూ చూశాను. ఒక రోగి చనిపోతే, నేను చాలా డిస్టర్బ్ అవుతాను, సర్. అందుకు నేను కూడా కారణమేమో అనిపిస్తుంటుంది. వాళ్ల కుటుంబ సభ్యుల బాధ చూస్తే, భోజనం సయించదు. మరణం మీద ఎంతో పరిశోధన చేసిన ఎలిజబెత్ క్లుబ్లర్ రాస్, డేవిడ్ కెస్లర్ రాసిన పుస్తకాలు చదివి, ఎవరైనా రోగి మరణానికి చేరువలో ఉన్నప్పుడు, వాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఆ విధంగా, వృత్తిపరంగా, నేను మరణంతో సహజీవనం చేయాల్సి వస్తోంది’ అంటూ ఆగాడు. రఘురామయ్య దీర్ఘంగా నిట్టూర్చి ‘వినయ్.. ఇంత చిన్న వయసు నుండే మరణం గురించి భయం లేకుండా ఆలోచించడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడు. ‘పుట్టుకా, చావూ జీవితమనే నాణెనికి బొమ్మా, బొరుసూ అనే నిజాన్ని అంగీకరిస్తే, ప్రశాంతంగా ఉండగలుగుతాం అనిపిస్తుంది, సర్!’ ఆలోచనలు ముసరడంతో రఘురామయ్య మౌనంగా నడుస్తూ ఉన్నాడు. వినయ్.. రఘురామయ్య మొబైల్‌ను తిరిగి అతనికి ఇస్తూ ‘సర్, మీరు ఎప్పుడు ఏమేం మాత్రలు వేసుకోవాలో రిమైండర్ పెట్టాను. అలారం మోగిన వెంటనే, బద్ధకించకుండా, అన్ని మందులూ వేసుకోండి. ‘లోడింగ్ డోస్’ మీ పుస్తకాల అర దగ్గర పెట్టాను. ఎప్పుడైనా గుండెనొప్పి అనిపిస్తే, ఆ డోస్ వేసుకోవడం మర్చిపోకండి’ చెప్పాడు. ‘నువ్వు వెళ్లక తప్పదంటావ్?’ అన్నాడు రఘురామయ్య దిగులుగా. ‘అవును సర్. ప్రశాంత్ యూత్ అసోసియేషన్ అనే పేరుతో కొంతమంది యువకులు ఉచిత కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కాలనీలో ఉండే ఒక స్కూలు యాజమాన్యం తమ భవనాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చడానికి అనుమతించడమే కాకుండా, ఆ యువకులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. కొంతమంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తమ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అంతే కాకుండా, మీలా ఒంటరిగా ఉండే సీనియర్ సిటిజన్లకూ, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికీ యూత్ అసోసియేషన్ సభ్యులు మందులూ, కూరగాయలూ ఇంటివద్దనే అందిస్తున్నారు. మీకేం అవసరమైనా ఈ సంస్థకు ఫోన్ చేయండి. వాళ్ల నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేశాను’ అన్నాడు వినయ్. రఘురామయ్యకి చాలా సంతోషమైంది. ‘వాళ్ల ఎకౌంట్ నెంబరు చెప్పు... నేనూ కొంత విరాళం పంపుతాను’ అన్నాడు. ‘చాలా సంతోషం, సర్. వాళ్ల అకౌంట్ వివరాలు మీకు వాట్సప్ చేస్తాను’ అన్నాడు వినయ్. ∙∙ రోజులు భారంగా గడుస్తున్నాయి, రఘరామయ్యకి. తన బంధువులూ, స్నేహితులూ కొంతమంది కరోనా వలన చనిపోవడంతో, ‘తరువాత ఎవరు?’ అనే భయం అతని గుండెల్లో కలుక్కుమంటున్నా, వినయ్‌ను గుర్తుకు చేసుకుని, ధైర్యం తెచ్చుకొంటున్నాడు. అప్పుడప్పుడూ వినయ్ ఫోన్ చేస్తూ రఘురామయ్య క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, తమ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ‘కరోనా కేర్’ అనే వాట్సప్ గ్రూపును క్రియేట్ చేసి, అందులో రఘురామయ్యను కూడా చేర్చేడు. హోటల్ మేనేజ్మెంట్ చేసిన యువకులు కొంతమంది ఆ అసోసియేషన్ తో చేరి, వంటలు చేయటం గురించి తెలుసుకుని రఘురామయ్య ఎంతో సంతోషపడ్డాడు. కోవిడ్ సెంటరులో సేవలు పొందిన వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్న వీడియోలు, వారి సేవలను మెచ్చుకుంటూ అనేకమంది విరాళాలు అందజేయటం.. ఇలాంటి అనేక విశేషాలు వాట్సప్ ద్వారా తెలుస్తున్నాయి. నర్స్‌గా వినయ్ సేవలందింస్తున్న ఫొటోలు కూడా అందులో షేర్ చేస్తున్నారు. అసోసియేషన్ కార్యక్రమాలు పెరగడం వలన కావచ్చు.. రఘురామయ్యకు ఫోన్ చేయడాన్ని బాగా తగ్గించేశాడు వినయ్. ఎప్పుడైనా ఫోన్ చేసినా, చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నాడు. గతవారం రోజుల నుండి వినయ్ నుండి వాట్సప్ సమాచారం కూడా రావడం లేదు. అతని నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ చేసి ఉంటుంది. ఏదో కీడు శంకించాడు రఘురామయ్య. యూత్ అసోసియేషన్ సభ్యుడు ఒకరికి.. రఘరామయ్య ఫోన్ చేసి, వినయ్ గురించి వివరాలు కనుక్కున్నాడు. రాత్రీపగలనకా రోగులకు ఎంతో సేవ చేయడం వల్ల వినయ్‌కు కోవిడ్ సోకిందనీ, వాళ్లు నిర్వహిస్తున్న ఐసోలేషన్ సెంటర్లోనే ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారనీ తెలిసింది. రఘురామయ్య ఆ ఐసోలేషన్ సెంటర్ అడ్రస్ కనుక్కుని, నోట్ చేసుకున్నాడు. కన్న కొడుక్కే ఆపద వచ్చినంతగా రఘురామయ్య విలవిల్లాడిపోయేడు. వినయ్ ఆరోగ్యం పట్ల భయంతో పాటు, అతను చేస్తున్న సేవల పట్ల గౌరవం కలిగేయి. వినయ్‌కు పుస్తకాలంటే ప్రేమ కాబట్టి, రఘురామయ్య తన షెల్ఫ్ నుండి కొన్ని పుస్తకాలను తీసుకుని కోవిడ్ సెంటర్‌కు బయలుదేరాడు. పెద్ద దూరం కాదు కాబట్టి నడుచుకుంటూ బయల్దేరాడు. రెండు వీధులు దాటేసరికి వెనక నుండి హారన్ మోగింది. రఘురామయ్య వెనక్కి తిరిగి చూశాడు. తెల్లటి పెయింటింగ్ వేసి ఉన్న వ్యాన్ పై ‘పార్థివ వాహనము– తెలంగాణ ప్రభుత్వం – ఉచిత సేవ’ అని రాసి ఉంది. ఒకప్పుడైతే రఘురామయ్య భయపడేవాడేమోగానీ ప్రస్తుతం మాత్రం ఆ వాహనం సేవనందిస్తున్న ఓ స్నేహితుడిలా అనిపించింది. ఆ వాహనపు డ్రయివర్ తన వ్యాన్ నుంచి తల బయటకు పెట్టి ‘సర్.. రామాలయానికి ఎటు వెళ్లాలీ?’ అని అడిగేడు. ‘ఇలానే ముందుకెళ్లి, సెకండ్ లెఫ్ట్ సందులోకి వెళ్లు బాబూ!’ అన్నాడు రఘురామయ్య. ‘అయ్యో.. ఆ ఇంటి వాళ్ళెవరోగానీ, ఎంత కష్టం వచ్చింది! వారి ఆత్మకు శాంతి కలుగుగాక!’ అని మనసులోనే అనుకున్నాడు. కోవిడ్ సెంటట్ అడ్రసు కనుక్కోవడం రఘురామయ్యకు పెద్ద కష్టమేమీ కాలేదు. రిసెప్టనిస్ట్ చెప్పిన సూచనలననుసరించి సేఫ్టీ యాప్రాన్ , గ్లోవ్స్ వేసుకుని, వినయ్ ఉన్న వార్డ్ వైపు వెళ్ళేడు. వార్డులో రోగులు చాలామంది టీవీ చూస్తున్నారు. ఇద్దరు నర్సులు పేషంట్లకు సేవలందిస్తూ ఉన్నారు. వినయ్ బెడ్‌మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్నాడు. అదేం పుస్తకమో అనుకుంటూ కళ్ళజోడు సరిచేసుకుని చూశాడు రఘురామ్య. ‘ఇస్మాయిల్.. కరుణ ముఖ్యం’ అని రాసి ఉంది. బెడ్ పక్కకు ఎవరో వచ్చినట్టు అనిపించడంతో వినయ్ పుస్తకాన్ని పక్కనపెట్టి చూశాడు. రఘురామయ్య కనిపించే సరికి హఠాత్తుగా లేచి ‘సార్.. మీరూ?’ అంటూ ఆశ్చర్యపోయేడు. ‘ ఎలా ఉందయ్యా నీ ఆరోగ్యం’ అంటూ అతని నుదుటిమీద చేయి వేశాడు రఘురామయ్య. ‘జలుబూ, దగ్గు తప్ప మరే సమస్యల్లేవు సర్. యాంటీ బయోటిక్స్ వాడుతున్నాను. కానీ.. మీరు రావలసింది కాదు, మీలాంటి పెద్దలకు రిస్క్ ఎక్కువ ఉంటుంది’ అన్నాడు వినయ్. వినయ్ తల నిమురుతూ రఘురామయ్య ‘ఏమవుతుందీ? నాక్కూడా కరోనా వస్తుంది, అంతే కదా! మీరంతా ఉన్నారు కదయ్యా, నాకు సేవచేయడానికీ’ అంటూ ‘ఈ సమయంలో కూడా పుస్తకాలను వదిలి పెట్టడం లేదా నువ్వు? ఏముందా పుస్తకంలో అంత శ్రద్ధగా చదువుతున్నావ్?’ అని అడిగాడు. ఇందులో ఇస్మాయిల్ గారంటారూ ‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే! అని’ ‘కవిత్వమే కాదు, మానవత్వంతో మీ యువకులంతా చేస్తున్నది అదే కదా!’ అన్నాడు రఘురామయ్య బెడ్ మీద వినయ్ పక్కన కూర్చుంటూ. ‘ మిమ్మల్ని చూశాకా నాక్కూడా ఉడతాభక్తిగా మీతో పాటు కలసి పని చేయాలని ఉంది’ అన్నాడు. వినయ్ సంతోషానికి అవధుల్లేవ్. ‘సర్.. మీరు బ్యాంక్ మేనేజర్‌గా చేసిన అనుభవం ఉంది కాబట్టి, మాకు వచ్చే విరాళాలు, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూడండి. మీలాంటి పెద్దలు కోవిడ్ సెంటర్‌కు రావడం సరైంది కాదు. ఖర్చులూ, విరాళాలకూ సంబంధించిన పేపర్లన్నీ మీ దగ్గరకు పంపిస్తూ ఉంటాం. మీరు ఇంటిదగ్గర ఉంటూనే ఆ లెక్కలన్నీ చూడవచ్చు’ అన్నాడు. ‘అయితే, నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను’ అన్నాడు రఘురామయ్య నవ్వుతూ. ఆ పూట సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు రఘురామయ్య. ‘నేను బతికుండగా నా మనస్సులో దీపం వెలిగించిన వినయ్, నేను చనిపోయాకా నా తల దగ్గర దీపం వెలిగించడా?’ అనుకుంటూ గుండెలపై చేయివేసుకుని, తృప్తిగా నిద్రపోయేడు. -యాళ్ల అచ్యుతరామయ్య -
కథ: పక్షపాతం.. మా అన్న మా ఇంటి యువరాజు
అవి వేసవి సెలవులు. స్కూల్లేదు కాబట్టి టైమ్ చూడాల్సిన పనేలేదు. ఇంటి ఆవరణ, వెనకాల దొడ్డి, ముందు వాముల దొడ్డి, దాని పక్కనున్న పొలాలు అంతా మేమే. మేమంటే మా పదకొండేండ్ల అన్న, ఏడేండ్ల అక్క, అయిదేళ్ల వయసున్న నేనే కాక అన్న వయసే ఉన్న మా మేనత్త కొడుకు, కొంచెం చిన్నదయిన మేనత్త కూతురు. అందరికీ మా అన్నే లీడర్. విల్లు, బాణాలు, గాలిపటాలు అన్న చేస్తుంటే, కావాల్సినయి అందించటమే మా పని. మా అన్నంటే ఆషామాషీ తమాషా అనుకునేరు. తాను మా ఇంటి యువరాజు. మా నానమ్మకు లేకలేక పుట్టిన కొడుక్కు మళ్ళీ లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. ఇంకా అర్థం కాలేదా! అయితే వైరాగ్యం తీసుకున్న మా నానమ్మ మాటలు వినండి. ‘మా నాయన, మా బంగారు. వాడు పుట్టబట్టి సరిపోయింది. ఇంట్లో ఉన్నది ఖాళీ చెయ్యటానికి మీరు పుట్టుకొచ్చారు ఇద్దరు ఆడ దయ్యాలు. ఆస్తిపాస్తులు, బంగారం మూట కట్టుకొనిపోతారు’. అలవాటుగా వినే నానమ్మ మాటలు పూర్తవకుండానే కొత్తగా పుట్టిన కోడె దూడ చెంగు చెంగున దూకుతుంటే, ముసిముసినవ్వులతో అమ్మ దాని వెనుక. ‘రాత్రేపుట్టిందిది’ అంది. ‘పాలుతాగిందా?’ ఆరా తీసింది నానమ్మ. ‘ఎక్కడ దానికి ఆటలే సరిపోతున్నాయి’. దాని అమ్మను ఆవుల పాకలో నుంచి తెచ్చి బయట ఇంటి ఆవరణలో కట్టేశారు. ‘పాలు సరిగా ఉన్నాయో లేదో ఆవుకు మంచి తిండి పెట్టండి’ అన్నది నానమ్మ. అసలే కోడెదూడను పెట్టిందయ్యే మరి! మా నానమ్మ దృష్టి మళ్లటంతో, ఇదే అదనని నేను కోడెదూడను పట్టుకోడానికి ఉరికాను. మా నానమ్మ మాటలు గాలిలో తేలివచ్చాయి ‘ఆడపిల్లవి, నిమ్మళం’ అంటూ. కాసేపటికి మా అక్క కూడా నాతో చేరి ముందు కాళ్ళు బారజాపి గేట్ దగ్గర నెమరేస్తున్న కోడెదూడను ముద్దు చేయటానికి వచ్చింది.. ‘ఎంత బాగుందో! దాని కళ్ళు చూడు ఎట్లా తిప్పుతుందో!’ . దాన్ని చూసి ఒళ్ళు మరిచిపోయి పెద్దగా నవ్వటం మొదలుపెట్టాం. వైరాగ్యం తీసుకున్న మా నానమ్మ ఇంట్లో ఎక్కడా ఉండదు కానీ ఆవరణలో ఏమూల ఉందో చెప్పటం కష్టం. ఆమె చుట్టుపక్కల లేదనుకుంటే ఆడపిల్లలం పప్పులో కాలేసినట్లే. ‘ఏమిటే కాకిగోల. మీ నాన్నగారొస్తున్నారు, కొంచెం గొంతులు తగ్గించండి’ ఏ మూల నుంచో నానమ్మగొంతు దూసుకు వచ్చింది. నాన్నగారికి కోపమొస్తుందో లేదో తెలియదు కానీ నానమ్మ మాటలు విని ఆయనంటే భయం మాత్రం పెరిగింది. నానమ్మకు దూరంగా వాముల దొడ్లో బాణాలు చేస్తున్న అన్నవైపు ఉరికాం. ∙∙ మధ్యాహ్నం నాలుగోఐదో గంటలవుతుందనుకుంటా. మా అన్న బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ‘పెద్ద చెరువుకి షికారు పోదాం. కట్ట ఎంతకట్టారో చూద్దాం. పక్కనే ఉన్న గట్టు కూడా ఎక్కొచ్చు’ అన్నాడు అన్న. ‘భలే చెప్పావురా! పదపోదాం’ అన్నాడు బావ. వదిన, అక్క, నేను వారి వెనుకే తయారు. అది మంచి అదను. నానమ్మ పుస్తకం చదువుతూ తన వయసువాళ్లతో ఉత్తరపు వాకిలి దగ్గర కూర్చొని వేదాంతం చెప్తోంది. అమ్మ ఇంటి వెనుక పనివాళ్ళతో హడావుడి పడుతోంది. నాన్నగారు మధ్యాహ్నం నుంచీ జాడేలేదు. ఏ పక్కూరో పోయుంటారు. ఇక మా అన్నదే రాజ్యం. మేము మా అన్నకు నమ్మిన బంటులం. మేము చల్లగా జారుకుని ఇంటి ముందున్న పొలాల్లో నుంచి అడ్డంపడి చెరువుగట్టు వైపు గంతులేసుకుంటూ జోరుగా పోయాం. గట్టుకు చుట్టాలతో షికారు పోవటం అలవాటే. కానీ పెద్దవాళ్ళు లేకుండా ఎప్పుడు పోలేదు. చెరువు కట్ట దగ్గరకొచ్చే సరికి పొద్దు వాలింది. కానీ మాకు ఒళ్ళు తెలిస్తేగా. కట్ట చాల ఎత్తే ఉంది. దూరంగా లారీలు ఎర్రదుమ్ము రేపుకుంటూ తిరుగుతున్నాయి. పనివాళ్ళు మట్టి మోస్తూ లీలగా కనిపించారు. కట్టెక్కగానే, అన్న పక్కనున్న కొండ వైపు తిరిగి, ‘ముందు గట్టెక్కుదాం. తిరిగొచ్చాక కట్టెంత పోశారో చూడొచ్చు’ అన్నాడు. మా బావ వెంటనే, ‘బావుందిరా, ఎక్కుదాం పద’ అని దారితీశాడు. వెనకే మేము. ముళ్ళ పొదలు, కంప కట్టెలలోను నుంచి దారి చూసుకొని కొండ పైకెక్కేసరికి మా కోసమేనన్నట్లు పడమటన ఎర్రగా ఇంత పెద్ద సూర్యుడు. కొయ్యల్లాగా నిలబడి ప్రొద్దుకుంగే దిశగా కళ్ళార్పకుండా చూస్తున్నామో లేదో పొద్దు పోనేపోయింది. అన్న అన్నాడు, ‘దిగండి, దిగండి. మళ్ళీ చీకటి పడుతుంది. ఇంకా కట్టచూడాలి.’ గబాగబా క్రిందకి దిగి కట్టమీదకు చేరాం. మసక వెలుతురులో ఇంకా ఒక లారీ ఆకారం దూరంగా కనిపించింది. కట్ట మీద సగందూరం నడిచేసరికి లారీ లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంతలో ఏదో చప్పుడు దగ్గర కొస్తున్నట్లనిపించింది. ఎలుగు బంటి, అడవి పంది గురించి విన్నవన్నీ గుర్తొచ్చి భయమేసింది. ‘ఆమ్మో ఎలుగుబంటేమో?’ అన్నా అక్కతో. ‘మాట్లాడబాకు’ అన్నది అక్క. నేను ఏడుపులంకించుకున్నాను. అన్న అన్నాడు.. ‘ఏయి, నీకేం కాదు ఏడుపాపు’ . నేను ఠక్కున నోరు మూశాను. ఏడుపు ఆగలా మరి. మళ్ళీ రాగం తీద్దామనుకునేసరికి, ఓ పెద్దాయన దగ్గర కొచ్చి అన్నను, మమ్మల్ని తిప్పి, తిప్పి చూసి, ‘మీరు నారాయణరావుగారి పిల్లలు కదూ?’ అన్నాడు. అన్న వెంటనే ‘అవును’ అన్నాడు. ‘ఇంతపొద్దుపోయి ఇక్కడేం జేస్తున్నారు. పురుగు, పుట్రా ఉంటాయి. నా లారీలో పంపిస్తాను. ఇక్కడే ఉండండి’ అని కట్టదిగి మాయమయ్యాడు. చీకట్లో మేము మెదలకుండా నుంచున్నామేమో.. ఏది కదిలినా భయం. కొండ మీద నుంచి వచ్చే గాలి ఈలతో నా గొంతులో ఏడుపు సుడులు తిరిగి వెక్కిళ్ళ కింద మొదలు పెట్టెసరికి, అక్క దగ్గరకొచ్చి గట్టిగా పట్టుకొంది. అక్కకు నాకంటే ఎక్కువే భయమని నా కప్పుడు తెలీదు. మా అన్నకు కూడా భయమేసిందో ఏమో, ఏమీ మాట్లాడ లేదు. కాసేపటికి లారీ రావటం కనిపించింది. లారీ ఆగటం, మమ్మల్నెక్కించుకోవటం చకచకా జరిగింది. అమ్మయ్య అనుకోని పళ్ళు బయట పెట్టి ఇకిలించబోయి మా అన్న మెదలకుండా గాలి తీసేసిన బూరలాగ మూలకు ఒదిగి కూచోడం చూసి, ఆగిపోయా. బావ, ఒదిన, అక్క మొహాలు కూడా ముడుచుకొనే ఉన్నాయి. ఏమిటబ్బా అని ఆలోచించుకునే లోపులో కుదుపుల మీద మా ఇల్లురానే వచ్చింది. అందర్నీ గేట్ దగ్గర దింపి లారీ దాని దారిన పోయింది. లోపలికి ఒక్క ఉరుకులో పోయి అమ్మను కావలించుకుందామనుకున్న. కానీ చెయ్యడ్డంగా పెట్టిన అన్న మొహంలోకి చూశా. ఇంటి ఆవరణలోకి తొంగిచూస్తూ అన్న ‘ఎవరూ కదలొద్దు’ అన్నాడు. లోపల ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రత్నం పశువుల మేత కోసం దంటుపుల్లలు నరుకుతున్నాడు. ధర్మా ఎడ్లను నిమురుకుంటూ దాణా తినిపిస్తున్నాడు. అమ్మ పాలు తీసుకొని ఇంట్లోకి పోయే పనిలో ఉంది. నాన్నగారు చుట్టు పక్కల లేరు. అన్న చెయ్యడ్డం తీసి, గుసగుసగా ‘మాట్లాడకుండా సందువైపు పొండి’ అన్నాడు. నాన్నగారు తలవాకిటిౖ వెపు ఉండొచ్చని అందరికీ అర్థమయ్యి, పిల్లుల్లాగా సందు వైపు నడిచాం. ‘ఎవర్రా అక్కడ?’ కొష్టం వైపు నుంచి నానమ్మ గొంతు చీకటిని చీల్చుకుంటూ వచ్చింది. ఎక్కడివాళ్లమక్కడే మేకేసినట్లునిలబడ్డాం. అన్న అంటే నానమ్మకు మహాప్రాణం. అది ఇప్పుడు ఆసరా కొచ్చింది. అన్న తెచ్చిపెట్టుకున్న ధీమాతో ‘మేమే నానమ్మా.. ఆట అయిపోయి ఇంటి కొస్తున్నాం’. ‘ఇంత పొద్దు పోయేదాకా ఆటలేంటిరా? చీకట్లో పురుగుపుట్రా ఉండవ్?’ ‘ఇంటికొచ్చాంగా మరి’ అని అన్న నడవటం మొదలుపెట్టిందాకా ఒక్కళ్ళు కూడా కాలు కదపలేదు. అమ్మను కావలించుకునే మాట వదిలేసి, అందరితో బుద్ధిగా కాళ్ళు కడుక్కొని హాల్లో కూర్చున్నా. నాన్నగారి అలికిడి లేదు. ఆత్రం దాచుకోలేని అన్న అటుగా వస్తున్న అమ్మను ఆపి ‘నాన్నగారింకా ఇంటికి రాలేదా?’ అమ్మ ఆరాగా మా వైపు తిరిగి ‘ఇంకా ఊరికి పోయి రాలేదు. ఎందుకురా.. నాన్నగారితో పనేమయినా ఉందా?’ తత్తరపాటును దాచుకొన్నాడన్న, ‘ఏంలేదు, ఏంలేదు, ఊరికే అడిగా’ . అమ్మ అటు తిరగగానే అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే నేను అంతే చేశాను. ఎవరి దారిన వాళ్ళం లేచిపోయేవాళ్ళమేమో కానీ, నాన్నగారి మాటలు బయట నుంచి వినిపించాయి. నానమ్మతోను, పనివాళ్ళతో అంటున్న మాటలవి. వింటూ చప్పుడు లేకుండా కూర్చున్నాం. చెవులు దోరగా పెట్టి నాన్నగారు అరుగుమెట్లెక్కడం, అమ్మ ఎదురెళ్లటం, మా గుండెచప్పుడ్లు వింటూ కూర్చున్నాం. నాన్నగారు అమ్మను చూడటం తడవు ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టడగటం మొదలు పెట్టారు.. ‘పిల్లలెక్కడా?’ అధాటుగా చూసి అయోమయంగా అమ్మ, ‘ఎందుకడుగుతున్నారు? వాళ్ళు హాల్లో ఉన్నారు’ ‘సాయంత్రమంతా ఎక్కడ తిరుగుతున్నారో నీకు తెలుసా?’ అమ్మ గొంతు చిన్నబోయింది ‘ఎక్కడకెళ్లారండీ?’ ‘నన్నడుగుతున్నావా? నువ్వు కాదు ఇంట్లో ఉంది? నా వైపు చూస్తావెందుకు? ఎక్కడెక్కడ తిరిగొచ్చారో వాళ్ళనే అడుగు?’ హాల్లో నుంచి కాళ్ళు కడుక్కోటానికి పోతూ కోపంగా చేయి మా వైపు విసిరారు నాన్నగారు. అమ్మ మా దగ్గరకు వచ్చి అన్న వైపు తిరిగి, ‘ఏమిట్రా నాన్న ఇదంతా?’ ఆమె గొంతు ఇంకా చిన్నగానే ఉంది. అమ్మ మీద కురిసిన వడగండ్ల వాన నుంచి ఇంకా తేరుకోని అన్న జవాబేమీ చెప్పలేదు. నాన్నగారు సందులోకి పోయి కాళ్ళు కడుక్కొని, మళ్ళీ హాల్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నా మాట్లాడటం మాత్రం ఆపలేదు. ‘నీకు చెప్తారా వాళ్ళు? భయంలేకే చెప్పకుండా తిరుగుతున్నది. ఆ కాంట్రాక్టర్ రాకపోతే నీ పిల్లలెక్కడుండే వాళ్ళో ఆలోచించు?’ అమ్మకు ఇదంతా గందరగోళంగా కనిపించింది. మా వైపు విచారంగా చూసి ఏంచెప్పాలో తెలీక అంతే అన్నట్లుగా తల ఊపింది. ఎవరి మాటలకు ఎదురుచూడని నాన్నగారు కోపం తగ్గేవరకు మాట్లాడి స్నానానికి పోయారు. తిరిగి వచ్చిన అమ్మ జవాబు కోసం మా ముందు నిలబడింది. అన్నకి ఇక చెప్పక తప్పలా. క్షమించమన్నాడనుకున్నారా? అయితే మీరు కూడా పప్పులో కాలేశారన్నమాటే. మా నాన్నగారి స్టైల్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. అంటే అమ్మ మీద అచ్చంగా నాన్నగారి లాగే అరవటం మొదలుపెట్టాడన్నమాట. మేము గుడ్లెళ్లబెట్టి చూస్తున్నాం. ‘ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలా? ఇవి అసలు సెలవలేనా? కొంచెం సరదాగా ఉంటుంది కదాని చెరువు గట్టును చూద్దామనుకున్నాం. అది కూడా తప్పేనా?’ రోషంతో అన్న ముక్కెర్రబడింది. అమ్మ నోటి మీద చేయివేసుకొని విన్నది. అయినా లేకలేక పుట్టిన కొడుకాయె మరి. అమ్మ మెత్తబడిపోయి ‘నాతో ఒకమాట చెప్పాలి కదా, నాన్నా?’ అన్నది. మా అన్న ధాటి తగ్గిందనుకుంటున్నారేమో. అసలు తగ్గలా. ‘చెప్తే ఏమనేదానివి? నాన్నగారిని అడగమనే దానివి, అంతేనా? నాన్నగారు మమ్మల్ని పోనిస్తారనే అనుకుంటున్నావా?’ నాన్నగారి ప్రశ్నలకు జవాబులేనట్లే, అన్న ప్రశ్నలకు కూడా అమ్మ దగ్గర జవాబేమీ లేదు. ఇంగితజ్ఞానమే అమ్మబలం. ‘అది సరే మరి. మీకు తిరిగి రావటం కష్టమయిందా? ఈ కాంట్రాక్టరెవరు?’ కష్టమయిందని ఒప్పుకోవటం అన్నకు ఇష్టంలేదు. అన్న మాట్లాడకబోయేసరికి అక్క అందుకొంది. ‘అమ్మా! మేము చీకట్లో తిరగటం చూసి నాన్నగారికి తెలిసినాయన లారీలో ఎక్కించి తీసుకొచ్చాడు’ . అమ్మ మళ్ళీ నోటి మీద చేయి వేసుకుంది.. ‘మన రాత బాగుంది, ఆయన సమయానికి వచ్చాడు. అది ఎంత పెద్ద చెరువు కట్టా, ఏం కథా? దగ్గరా, దాపా, అక్కడెక్కడో అడవిలో ఉండే. పెద్దవాళ్ళు లేకుండా పోవచ్చా? పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్లంటారు’ మా అన్న వెంటనే, ‘ఏం చేస్తారేంటి?’ అని తల ఎగరేశాడు. అన్న వైపు చూపు నిలిపి అమ్మ, ‘అసలే కొత్త చెరువు కట్టయ్యే. ఏ ఘోరమైన జరగొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవుడు చల్లగా చూశాడు. అంతే చాలు’ అమ్మ పైకి చూసి దండం పెట్టుకుంది. అంతకుముందే వచ్చిన నానమ్మ.. అమ్మ వెనుక మమ్మల్ని చూస్తూ నిలబడింది. అమ్మ మీద ఎగిరిపడ్డ అన్న.. నానమ్మ చూపులకు ఇబ్బందిగా మొహం పెట్టాడు. ముగ్గురు పెద్దపిల్లల వైపు కర్ర ఆడిస్తూ నానమ్మ ‘పొద్దు వాలేదాకా ఇక్కడే ఆడుకుంటిరి. ఈ చిన్నవాళ్లకయితే తెలియదు. అంత పొద్దుపోయిందని మీకింగితం ఉండాలా?’. అన్నతో పాటు, బావ, ఒదిన కూడా తలొంచుకున్నారు. నాన్నగారి పని చూడటానికి పోతున్న అమ్మనాపి నానమ్మ అంది.. ‘చిన్నది భయపడుంటది. రాత్రికి పక్కలో పడుకోబెట్టుకో’ . అమ్మ నావైపు ఆరాగా చూసి తలాడించింది. ఒక్క గంతులో పోయి అమ్మను కావలించుకున్నా. -శ్రీ పద్మ -
రజిత కొండసాని: రవ్వల ముద్దులు...కథ
పొద్దు బారడెక్కినాది చ్యాటలో బియ్యం వేసుకుని సెరుగుతా దొండ్లోకి తొంగిసూసినాను.. కూసానిక్కట్టేసిన గొర్రిపొట్లి నెమరేత్తాండాది. మా నాయన పట్టించిన పిల్లగొర్రెది బాగా మేసి బలిసినాది. దేవర్లకు,పండగలకి సానామంది రేటును కట్నారు ఐనా ఇయ్యలేదు. మా ఆయనేమో ‘లాభమొత్తాంటే అట్నే పెట్టుకుంటావేందే ఎర్రిదాన అమ్మితగలెట్టు’ అంటా ఈసడిత్తాన్నా నేను మాత్రం ఊకొట్లే..అమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాలని సిన్నప్పట్నుంచి కోరిక. ఒకతూరైనా ఎట్టకపోతానా అని పట్టుపట్నాను. ‘కూలోళ్ళు సేనికాడికిపొయ్యి పెదింత పొద్దయింది.. ఇంగా చ్యాట పట్టుకున్యావా.. పొయ్యిలో అగ్గెప్పుడేస్తావు కూడెప్పుడు సేస్తావు’ అంటా ఎనకమాలే మా ఆయన శీనయ్య గెంతులేస్తా వచ్చినాడు. బిరబిరా పొయ్యికాడికి పోయి నిప్పులెగేసి ఎసురు పెట్టేసినాను. పొద్దెలగా లెయ్యాల.. కసుఊడ్చాల.. గొడ్లు మార్సికట్టేసి ఉట్లగడ్డి కింద ఇదిలియ్యాల.. ఇయన్నీ నేనే సెయ్యాల.. మా ఆయన పగలంతా పనికిపొయ్యి రెక్కలిరగా కట్టపడి మాపట్యాళకు ఇంటికొత్తే కాళ్లు ముఖం కడిగి.. నాల్గు పిడచలు కడుపుకేసి తొంగుంటే.. పొద్దు బారడెక్కాక లేస్తాడు. పొయ్యిలో కట్లెగేస్తాంటే పక్కింటి సూరమ్మత్త సక్కా వచ్చినాది ‘సూడే లచ్చిమీ.. మనం యాళపొద్దు మీరేదంకా రెక్కలిరుసుకున్నా..రవ్వంత బంగారం ముఖం సూడకపోతిమి. పక్కింటి అక్కమ్మ సూడూ.. ఆళ్ళాయనతో పట్టుపట్టి రవ్వల దుద్దులు కొనించుకుందంట’ అంటానే ప్యాణం సివుక్కుమన్నాది. రాతిరి కల్లో కూడా దుద్దులే కానస్తాండాయి. గొర్రెపొట్లి పెద్దయ్యాక అమ్మేసి తెచ్చుకోవల్లా.. మనసు గట్టిగా నిలగట్టుకున్నాను. ఎట్లైనా సరే అనుకుంది సాదించాల.. అనుకుంటా గంపకు సద్దెట్టి సేన్లోకి ఎళ్ళబార్నాను. కూలోళ్ళు కలుపుతీస్తాండారు. గనెంపై గంప దించినాను. తింటానికొచ్చినారు కూలోళ్ళు. ఆళ్ళలో అచ్చమ్మక్క సెవులవంకే నా సూప్పోయినాది. దుద్దులు ధగధగా మెరుస్తాండాయి. రెప్పార్పకుండా సూస్తాండాను. ‘దుద్దులొంక అట్టా సూస్తావేంటే దిష్టి తగుల్తుంది’ అన్యాది అచ్చమ్మక్క. ‘దుద్దులెంతా’ అనడిగాన్నేను. ‘కూలిసేసిందంతా దీన్లకే ముదలార్చినాను. వయసు సందేళై వాలిపోతాంటే ఇయన్నీ దేనికే అంటా నెత్తి పొడిసి పొడిసి తీసిచ్చాళ్ళే మా సచ్చినోడు’ అంటా అచ్చమ్మక్క అంటాంటే పక్కుమన్యారందరూ. ‘సానా బాగుండాయి.. నిగనిగలాడ్తాండాయి. తెచ్చేసుకుందామని ఆపొద్దున్నుంచి యోచన సేస్తాండానే కానీ ఏసింది లేదు పోయింది లేదనుకో’ సింతాకంత ముఖం పెట్టి అన్యాను. అందరూ తిని నడుమొంచినంక సద్దిగంప ఎత్తుకుని గట్లంటి నడుస్తాన్నానన్న మాటేగానీ అచ్చమ్మక్క సెవికేలాడ్తున్న దుద్దులొంకే మనసు పీకుతుండాది. పుట్టింటోళ్ళిచ్చిన గొడ్డు గోదా అమ్మరాదని ఎవరో సెప్తే.. గుటకలు మింగినాను. రవ్వల దుద్దుల కోరిక తీరాలంటే అదొక్కటే దారి. ఊళ్ళో సున్నపురాళ్ళ సినెంగట్రాముడు మూనాళ్ళ నుంచి బంగపోతాండాడు గొర్రిపొట్లినియ్యమని. రేప్పొద్దున్నే రమ్మని సెప్పాల. యాదోఒగ రేటు కూసేస్తే ఆడికే కొలబెట్టాలనుకుని,తిని పడకేసినాను. ఆరుబయట పడుకుని జాముసుక్క ఎప్పుడు పొడుస్తాదాని సూస్తా మేల్కొన్నా.. నిద్ర ఇంచుక్కూడా రాలేదు. ఎట్లైనా పొట్లినమ్మేసి రవ్వల దుద్దులు కొనుక్కోవాల. ఏసుకుని బజారెంట పోతాంటే ఈది ఈదంతా నోట్లోకేలెట్టుకోవల్లా.. అబ్బురుపోవల్లా.. ఇలా ఆలోచిస్తాంటే సూరిమీద కోడి రెక్కలు పటపటా కొట్టి కూతేసినాది. బిరక్కన లేసి పాకలోకి పరిగెత్తినాను గొర్రిపొట్లి కనపల్లే. ‘ఇక్కర్రారయ్యో.. గొర్రిపొట్లి కనపల్లే’ అంటా కూతెట్టినాను. పరిగెత్తొచ్చినాడు మా ఆయన ఇసురు కట్టి చేత్తో ఎట్టుకుని పాక సుట్టూర సూసినాం.. యాడా కనపల్లే. దొంగలెత్తుకు పోయారేమో.. రవ్వల దుద్దులు కొనుక్కుందామంటే బండెడంత ఆశ బట్టబయలైపాయే! ∙∙ ఏడుస్తా కూకున్నాను కంట్లో నీళ్లు తుడిసే కొంగుకు లోకువైనట్లు తెల్లార్లు ముద్ద మింగకుండా కూచున్నాను. ‘నీ దుద్దులు మీద బండపడా. అట్లా ఏడుస్తా కూకోద్దే పంట ఇంటికొస్తే తీసిస్తాలే. పోయి కాసింత ఎంగిలి పడు’ అంటాండాడు మా ఆయన. ఈసారి గింజలింటికొస్తే రవ్వల దుద్దులు కొనుక్కోవాల.. బాగా కాళ్ళిరగా కట్టపడితే పంట బాగా ఇదిలిస్తాదని నేను కూడా సేన్లోకి ఉరికురికిపోయినాను. సెనక్కాయలసెట్లు మోకాలెత్తు పెరిగి, సీకు పొదల్లా సిక్కగా కాసింటే దిష్టిబొమ్మ నడిమి సేన్లో పెట్టినాము. హమ్మయ్య ఈతూరైనా రవ్వల దుద్దులు ఏసుకోచ్చనే ఆనందం అటకెక్కించినాను. దీపావళి పండగ సానా ఇదిగా చేసినాం. అమ్మవారికి నైవేద్యం పెట్టినాం. సీర కట్టినాం. నా దుద్దుల సంగతి మర్చిపోకని సెవిలో ఊదినా.. ఆయమ్మే నా ఆశ తీర్చాలా..! సెనగసెట్లు పీకి ఒదులేస్తాంటే కుచ్చులు కుచ్చులు కాసిన కాయిల్ని చూసి కండ్లు మెరుపులైనాయనుకో. బాగా ఎండనిచ్చి కుప్పేద్దామని రొండు దినాలుండినాం. రేప్పొద్దున్నే కుప్పెయ్యాల. ఆ రాతిరి సంతోసం సుక్కలంటి కన్రెప్పెయ్యనే లేదు. సరిగ్గా అర్ధరేత్రి పొద్దుకాడ తూరుపక్కన మెరిసినాది. ఒక్కొక్క సినుకు రాల్తాంటే గుండె సెరువైనాది. ‘అయ్యో.. భగవంతుడా.. సెట్టు నానిపోతే కాయలు బూజొస్తాయి.. రేటు పోవు’ అనుకుంటా ఎట్లసేయాలో పాలుపోలేదు. పొయ్యింట్లోకి బయటింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరగతాండాను. ఫెళఫెళమంటా ఉరుములొచ్చేసరికి ఆశల మీద మన్ను కప్పెట్టేసాను. వాన జోరుగా కురిసినాది. సెరువులు, కుంటలు ఏకమైపోయినాయి. నెత్తిన గుడ్డేసుకుని సేనుకాడికి పరిగెత్తినాము. ‘ఒసేయ్.. నువ్వింటికాడే పడుండు నేన్చూసొత్తా’ అని మా ఆయన అంటాన్నా నావల్ల కాలే ఎనకాల్నే సిన్నగా పోయినా. పంటంతా మునిగిపోయినాది. శాడకేసిన మడికెయ్యల్లాగా సెలకలన్నీ నీళ్ల సెలమలైపోయినాయి. రవ్వల దుద్దులు ఈ పంటకైనా తెచ్చుకుందామని ఉవిల్లూరినా.. అంతా నీళ్లపాలైనాది. సెట్టుకింద ఒక్కత్తే కూకుని ఆలోసిస్తాన్నా ఎట్లైనా సరే రవ్వల దుద్దులు ఏసుకోవల్ల. అచ్చమ్మక్క సూడు కూలినాలి పోయి తెచ్చుకున్నాది. నేను కూడా కూలి పోతా అనుకుని మాప్పొద్దున్నే వాళ్ళెనకంటి సాలమ్మత్త మడికెయ్యి కోసేకి ఎళ్ళబారినా. మా ఆయన సూసి.. ‘నీ రవ్వల దుద్దులు మోజు కూలికాడ దాకా తీసుకుపోతాంటే. .ఏందే ఇది వయసు యాళపొద్దు దాటేసింది, ఇంగా ఈ ముదనష్టపు కోరికేందే..’ అంటా ఆడిపోసినాడు. ఐనా ఇన్లే. రవ్వల దుద్దులు కోసమై ఆ పని ఈ పని అనకా అన్ని పన్లూ చేసినా. ఎట్లైనా తిరునాళ్ళ లోపు రవ్వల దుద్దులు నా సెవులకు ఏలాడ్తా మెరిసిపోవాల. దుడ్లు బాగా కూడబెట్నా. ‘కొడుకు సూరిగాడు సదువు సంకనెక్కి బేకార్‌గా తిరగతాండాడు. ఆడికి సేద్యంగీద్యం వచ్చిసావదు. యాపారం చేసే తలకాయున్నోడు కాకపాయే. ఆడి సంగతి కాట్లోకేసి ఇదేం పిచ్చే..’ అంటా మా ఆయన ఎగర్తాన్నా.. కొనసెవిల్లోక్కూడా ఎయ్యలా. సంకరాత్రికి తీయిచ్చిన సుక్కలసీర సింగారించి పెద్దమ్మని తోడ్కొని రవ్వల దుద్దులు తీసుకోటానికి పట్నం ఎళ్ళబారినాం. నా ఆనందం అంతా ఇంతా కాదనుకో. ఇంటి ఎనకాలే సీల్తోవలో పోతే పట్నం సానా దగ్గిర. ఇద్దరం నడుత్తా పోతాండాము. ‘ఏమే లచ్చీ.. సిన్నప్పట్నుంచి దుద్దులు దుద్దులంటాండావు.. ఒకతూరైనా తీసీలేదా మీ నాయనా’ అనంది పెద్దమ్మ. ‘దుడ్లుంటే కదా నాయనకాడ రవ్వల దుద్దులు తీసిచ్చేకి! రాత్రిపవళ్లు దుమ్ము నెత్తిన పోసుకున్నా దమ్మిడీ ఆదాయం లేదు. కూలికింత నాలికింతపోను గానిగెద్దులా గిరగిరా తిరిగి పన్జేసినా సింతాకంత మిగల్కపాయే’ అని అంటూ నడుత్తున్నాము దారెంటి. ‘సర్లే.. అనుకుంటే తీర్తాయా పోతాయా’ అనంది పెద్దమ్మ. దావమొత్తం పరిక్కంపలే. సూసి సూసి అడుగెయ్యాల. సింతోపు దాటి రెండడుగుల్నేసినాం అంతే.. నా కొడుకు సూరిగాడు పరిగెత్తుతా వస్తాన్నాడు.. ‘అమ్మా..అమ్మోయ్’ అంటా! బిరబిరా వచ్చి ‘నాయనకి నోట్లో బురుగొచ్చింది కొక్కరతేవులొచ్చిన కోడిలా తండ్లాడతాన్నాడు భయమేసి నీకాడకు పరెగెత్తుకొచ్చినా’ అనన్నాడు కొడుకు. ఓలమ్మో మల్లా అట్లనే ఐందా పెండ్లైనప్పట్నుంచి అట్టా ఏపొద్దూ కాలే. అంతకుముందు అయ్యేది, మాయవ్వ పసురు పెట్టి మేల్జేసినాది. మల్లా రోగం తిరగబెట్టిందా అనుకుంటా.. దుద్దుల సంగతి దేవుడెరుక.. పరిగెత్తుతా ఇంటికిపోయినా. మంచం మీద ఎల్లకిలా పడున్నాడు. శర్మం బాగా సెగ పుట్టినాది. నాటువైద్యుని దగ్గర్కి తీస్కుపోతే బాగా పసురు కలియబెట్టి తాపించి రెండేసి వేలు తీస్కున్నాడు. ఇంగిలీసు మందు మింగమంటే నాకొద్దంటాడు. రవ్వల దుద్దులకని దాపెట్టుకున్న పైసలు మా ఆయన రోగాన్కే ఎళ్ళిపాయే. తిరునాళ్ళింక సానా దినాల్లేదు దగ్గర పన్యాది. ఎట్ల సెయ్యాలో ఏందో దిక్కుతోచలే. ఎట్లైనా సరే రవ్వల దుద్దులు తిరునాళ్ళకు పెట్టాల, దేవుడు ఎన్నడు దావిత్తాడో ఏందో అనుకుంటా కూకున్నాను. ఇంట్లో కూసాన్కి ఆనుకొని. ఎవరో భుజం తట్టినట్లైతే తలెత్తి సూసినా. మా ఆయన ‘అట్టా దిగులెట్టి కూకోమాకే. పాపం నీ బాధ సూత్తాంటే ప్యాణం తరుక్కుపోతాంది. రవ్వల దుద్దులు పెట్టుకోవల్లనే ఆశ తీరకపోతాండాది. సంతోసంగా ఎళ్ళబారుతావ్ తీరా ఆశ తీర్తాదనంగా ఏందో ఒకటి అడ్డొచ్చి పడ్తాది. దేవుడున్నాడే పో.. పోయి అన్నంకడి తిను యాళపొద్దు దాటిపోతాండాది’ అనంటుంటే కండ్లలో నీళ్లు తిరిగినాయి. నాకే కాదు ఆయనక్కూడా! నేను రవ్వల దుద్దులెట్టుకుని తిరునాళ్ళకు పోతాంటే సూడాలనుంది అందుకే అంతలా బాధ పడ్తాన్నాడు. ∙∙ ఆపొద్దు పొద్దుగాలే లేసి పన్లన్నీ చేసేసి. బువ్వ చేసి మా ఆయన్కి, కొడుక్కి పెట్టి ఆళ్ళు తినినాక పుట్టింటికి పోయ్యెద్దామని బయల్దేరినాను. ‘వాళ్ళగ్గానీ ఎక్కనుంచి వత్తాయి లెక్కలు, రవ్వల దుద్దుల కోసం అంతదూరం పోవాల్నా.. నేనే ఏదోటి చేసి కొనిత్తాలే. శీనయ్య పెండ్లాం రవ్వల దుద్దులేసినాదంటే నాగ్గానీ పేర్రాదా సెప్పు’ మా ఆయన మాటకి ప్యాణం లేసొచ్చినాది కన్నుల్లో ఆనందం ఎగజిమ్మినాది. మా ఆయన సావుకారి బసప్పతాకి పోయి వడ్డీకి దుడ్లు తెచ్చినాడు. ‘ఇదిగో తీసుకో పోయి తెచ్చుకో’ అంటా దుడ్లు నా చేతికి ఇస్తాంటే ఇంగ నా కోరిక తీరిపోయినాదని దండిగా సంబరపన్యాను. పెద్దమ్మని తోడ్కొని పట్నం ఎళ్ళబారినాను. పట్నమంతా తిరిగి తిరిగి రవ్వల దుద్దుల కోసం పోయింతావల్లా తిప్పి తిప్పి సూసినాం. నచ్చక ఇంగోతాకి పోయినాం. సుమారు పది అంగళ్ళు తిరిగినాం. యాడా కుదర్లే. ‘పెద్దమ్మ.. నచ్చింది సిక్కేదే బొరువు. వద్దనుకునేవి దండిగా వుంటాయి ఏందో’ అనంటే ‘అవునే.. ఇన్నాళ్ళంతా దుద్దులు కొనుక్కోవల్లని నానాయాతన పన్యావు. ఇప్పుడైతే సరైన దుద్దులు సిక్కేదే కట్టమైనాది’ అనుకుంటా నడుత్తాండాము. బాగా తిరిగి నీళ్ళు దప్పిగ్గొని ఒకతావ నిలబన్యాము. చిరుతిండ్లమ్మె గుడిసెల్లో నీళ్ళడిగితే గుటకడు నీళ్ళు కావాలంటే ఏందైనా కొనుక్కోవాలంట.. ఏం కాలమొచ్చిందో ఏమో..అనుకుంటా పోయినాం. ఒక శేటు దగ్గిర రవ్వల దుద్దులు కుదిర్నాయి. రేటు కట్టి సరిపోతాయో లేదోనని ఏసి సూసి తీసేసినా. ‘రవ్వల దుద్దులు ఎట్టుకుంటే ఎంత బాగా కానత్తాండావే లచ్చీ మీ ఆయన సూడల్లా.. మురిసిపోతాడు’ పెద్దమ్మనగానే సిగ్గు సింతసెట్టెక్కినాదనుకో. బేరమాడి కొనుక్కొని ఇంటికి బయల్దేరినాం. మొదట మా ఆయనకే సూపించాల. మొదట మొదట్నే ఊళ్ళో వాళ్ళ కండ్లు పడ్తే దిష్టి తగుల్తాది. రేపే తిరునాళ్ళు. దేవుడు నా బాధ సూల్లేక.. కోరిక తీర్చినాడు. బిరిగ్గా రవ్వల దుద్దులు పెట్టుకుందామని బిరబిరా ఇంటికి పోయినాను. ఇంటి ముందర జనాలు గుంపుగా నించోనుండారు. ‘మా ఇంటికాడ ఇంతమంది గుమికూడ్నారెందుకు’ అనుకుంటా పోయి సూసినా. కొడుకు తాళ్ళమంచం కోళ్లు పట్టుకుని ఏడుస్తాన్నాడు. మా ఆయన మంచంపై పడుకున్నాడు. నన్ను సూడగానే కొడుకు ఎక్కిళ్లు పట్టి ఏడుస్తా పరిగెత్తుకొచ్చినాడు ‘అమ్మా... నాయనా సచ్చిపొయ్యాడు..’ ఈ మాట కొడుకంటానే కండ్లెంటి నీళ్లు కారిపోయినాయి. కొనుక్కొచ్చిన రవ్వల దుద్దులు ఆడనే జార్నిడ్చి మా ఆయనపైబడి బోరున మొత్తుకున్నాను. ‘పాపం రవ్వల దుద్దులు పెట్టుకోవల్లని ఎంత ఆశ పెట్టుకుందో పిచ్చిది. కడసారికి తీరకుండానే పాయే’ అంటా పెద్దమ్మ ఏడుత్తాంటే ఊరాళ్ళందరూ కండ్లలో నీళ్ళెట్టుకున్నారు. మొగుడే పొయ్యాకా రవ్వల దుద్దులు ఉంటేనేం ఊడితేనేం అనుకుంటా.. ఒకతూరి రవ్వల దుద్దులకేసి సూసినాను. మట్లో పడిపోయిన దుద్దులు నిగనిగా మెరుత్తాంటే కన్నులు తేలేసినాను. ‘పాపం.. రవ్వల దుద్దుల మోజు తీర్కపాయే. ఏసుకునే భాగ్యంల్యాకపాయే. అప్పులు తీర్తాదా మొగున్కి దినాల్సెత్తాదా ఒట్టి పిచ్చిది’ అన్యారెవరో.. - రజిత కొండసాని -
వి‘చిత్ర’ దొంగతనం
‘ది గ్రేట్ వెస్టెర్న్ రైల్వే కంపెనీ పరిధిలో డిడ్ కాట్ స్టేషన్ నుంచి బయలుదేరి, వించెస్టర్ ద్వారా ప్రయాణించి న్యూ బరీ చేరుకొన్న గూడ్స్ ట్రెయిన్‌కు తగిలించిన మొత్తం పదకొండు వ్యాగన్లలో ఒక వ్యాగన్ తప్పిపోయిందట!’ ఇన్వెస్టిగేటింగ్ కెమెరా మ్యాన్ అయిన హ్యేజెల్కు అతని మిత్రుడు అందించిన సమాచారమది. హ్యేజెల్ మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ‘బహుశా ఆ తప్పిపోయిన వ్యాగన్‌ను బ్రేక్ వ్యాన్ చివర తగిలించి ఉంటారు. కప్లింగ్స్ పగిలిపోవడం వల్ల వేరై ఉంటుంది. అలా జరిగున్న పక్షంలో తరువాత వచ్చే రైలు దాన్ని తీసుకురావచ్చు’ అన్నాడు హ్యేజెల్. ‘లేదు. ఆ వ్యాగన్‌ను ఆ గూడ్స్ ట్రెయిన్ మధ్యలోనే తగిలించారు’ చెప్పాడు హ్యేజెల్ మిత్రుడు. ‘ఆ! అలాగా? విచిత్రంగా ఉందే.. బహుశా ఏ స్టేషన్లోనైనా ఆగిపోయి ఉండొచ్చు’ ‘నో! నో! మై ఫ్రెండ్! ఆ లైనులో ఉన్న స్టేషన్లకన్నిటికీ టెలిగ్రాములిచ్చారట. ఏ స్టేషన్లోనూ లేదని ద్రువీకరించారు’ అన్నాడతను. ‘ఓహో! అసలు ఆ గూడ్స్ ట్రైన్ డిడ్ కాట్ నుండి బయలుదేరి ఉండకపోవచ్చు’ ఊహించాడు హ్యేజెల్. ‘అందులో అనుమానమే లేదు. డిడ్ కాట్ స్టేషన్ వదలి బయలుదేరిందని స్టేషన్ మాస్టర్ చెప్పాడు’ ‘ఈ కేసు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వ్యాగన్లో ఏదో విలువైన సామగ్రి ఉండి ఉంటుంది. మనం అక్కడికి పోదాం పద’ అన్నాడు హ్యేజెల్. ఇద్దరు మిత్రులు బయలుదేరి, స్టేషన్ మాస్టరును కలిశారు. ‘మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ డిటెక్షన్ గురించి చాలా విన్నాను. జరిగిన సంఘటన నాకు విచిత్రంగా తోస్తూ ఉంది. ఏమీ అర్థంకావడం లేదు’ అన్నాడు స్టేషన్ మాస్టర్. ‘తప్పిపోయిన వ్యాగనులో ఏముందో తెలుసా మీకు?’ అడిగాడు హ్యేజెల్. ‘అక్కడే వచ్చింది సార్ చిక్కు. ఏదేమైనా అందులో అత్యంత విలువైన సామగ్రి ఉందనుకుంటున్నాను. వచ్చేవారం వించెస్టర్ మ్యూజియంలో అత్యంత అపురూప పురాతన వర్ణచిత్రాల ప్రదర్శించబోతున్నారు. అందు నిమిత్తం అటువంటివి కొన్ని చిత్తరువులను ఈ వ్యాగన్ ద్వారానే లీమింగ్టన్కు తరలిస్తున్నారు. అందులో ప్రఖ్యాత చిత్రకారుడైన సర్ గిల్బర్ట్ ముర్రెల్ అద్భుతంగా చిత్రించిన మూడు విలువైన అపురూప చిత్రాలు భారీ పరిమాణంలో ఉండడం వల్ల వాటిని ఒక్కొక్కటిగా∙ప్రత్యేకంగా పెట్టెల్లో భద్రంగా పెట్టి బంగీలుగా కట్టారు’ చెప్పాడు స్టేషన్ మాస్టర్. ‘మ్మ్! ఇదేదో చాలా తమాషాగా తోస్తోంది. అన్నట్టు ఆ వ్యాగన్‌ను ట్రైనుకు తగిలించారో? లేదో?’ అనుమానం వ్యక్తం చేశాడు హ్యేజెల్. ‘సందేహమే లేదు. కావాలిస్తే, బ్రేక్ మ్యాన్ సింసన్ను మీరే అడగండి. అతన్ని పంపిస్తాను. అతని మాటల్లోనే వినండి’ అన్నాడు స్టేషన్ మాస్టర్. గూడ్స్ గార్డు వచ్చాడు. హ్యేజెల్ అతన్ని నిశితంగా గమనించాడు. అతని ముఖంలో నిజాయితీ తప్ప ఎలాంటి అనుమానాస్పదమైన ఛాయలు కనబడలేదు. ‘డిడ్ కాట్లో మేము స్టేషన్ వదలిన సమయంలో, రైలుకు వ్యాగన్ తగిలించి ఉందని నాకు బాగా తెలుసు. తరువాతి స్టేషన్ అప్టన్ వద్ద ఆగాం. అక్కడ కొన్ని వ్యాగన్లను స్టేషన్లో విడగొట్టాం. అప్పుడు ఆ వ్యాగన్– బ్రేక్ వ్యాన్ నుండి అయిదోస్థానంలోనో, ఆరోస్థానంలోనో ఉంది. ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. ఆ తరువాత ‘కాంప్టన్’లో ఆగి పశువుల ట్రక్కును రైలుకు తగిలించాం. నేనక్కడ దిగలేదు. అక్కడి నుండి ఎక్కడా ఏ స్టేషన్లలోనూ ఆగకుండా న్యూ బరీ స్టేషను వరకూ ప్రయాణం సాగించాం. అక్కడ తనిఖీ చేశాను. ఆ వ్యాగను కనిపించలేదు. నేను పొరపాటు పడ్డానేమోనని రెండవసారి జాగ్రత్తగా పరిశీలించాను. ఆ వ్యాగను లేదు. ఒకవేళ అది అప్టన్లోనో, కాంప్టన్లోనో పొరపాటున నిలిచిపోయి ఉంటుందని ఊహించాను. కానీ ఆ ఊహ తప్పని తేలింది. ఎందుకంటే అది ఆ రెండు స్టేషన్లలోనూ లేదని నిర్ధారణ అయింది. నాకు తెలిసిందదే సార్! అంతా తికమకగా, గందరగోళంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ గార్డు. ‘అవును. చాలా విచిత్రంగా ఉంది. కానీ నువ్వు పొరపాటు పడలేదు కదా?’ ‘లేదు సార్! నేను పొరపాటు పడలేదని నిశ్చయంగా చెప్పగలను’ ‘పోనీ డ్రైవరు ఏమైనా గమనించాడేమో?’ ‘లేదు సార్!’ ‘ఒక వ్యాగన్ అలా రైలు పెట్టెల మధ్య నుండి విడిపోవడం జరగదు. ఏ మాంత్రికుడో వచ్చి మాయం చేసుంటే తప్ప. మీరు ఏ సమయంలో డిడ్ కాట్ వదిలారు?’ హ్యేజెల్ అడిగాడు. ‘రాత్రి ఎనిమిది గంటలకు సార్!’ ‘చాలా చీకటిగా ఉంటుందప్పుడు. కాబట్టి లైను పక్కన ఏం జరిగేదీ మీకు తెలియకపోవచ్చు’ ‘అవును సార్! ఏమీ కనబడదు’ ‘మీరు ఎప్పుడూ బ్రేక్ వ్యాన్ లోపల్నే ఉంటారా?’ ‘రైలు కదులుతున్నంతసేపూ రైల్లోనే ఉంటాను సార్!’ ఆ సమయంలో పోర్టర్ అక్కడికి వచ్చి..‘ఇప్పుడే ఒక ప్యాసెంజర్ ట్రైన్ డిడ్ కాట్ నుంచొచ్చింది. ‘చర్న్’ దగ్గర సైడింగులో ఒక భర్తీ వ్యాగన్ బంగీలతో నిలిచి ఉందని డ్రైవరు ఫిర్యాదు చేశాడు’ అని చెప్పాడు. అది విని గార్డ్ ఆశ్చర్యపోయాడు. ‘మేమెప్పుడూ ‘చర్న్’ దగ్గర బండి ఆపం. ఏదో క్యాంపుల్లో తప్ప. ఎక్కడా ఆగకుండా చర్న్ మీదుగానే వచ్చాం’ ‘చర్న్ ఎక్కడుంది?’ అడిగాడు హ్యేజెల్. ‘అది అప్టన్కూ కాంప్టన్కూ మధ్యలో ఉంది. అక్కడ కేవలం ప్లాట్ఫార్మ్ ఉంటుంది. దాంతో పాటు సైడింగ్ కూడా ఉంది. వేసవిలో మాత్రం అక్కడ సైనికులు విడిది చేస్తారు. అయినా అది చాలా అరుదుగా జరుగుతుంది’ అన్నాడు గార్డ్. ‘నేను వెంటనే చూడాలా ప్రదేశాన్ని’ ఒక గంటలోపలే ఆ వైపు వెళ్ళే రైల్లో, ఇన్స్పెక్టర్ హిల్తో పాటు ‘చర్న్’ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అది ఏకాంతప్రదేశంలో ఉంది. విశాలమైన, సమతలప్రదేశానికి కొంచెం దిగువన వుంది. అక్కడ ఒకే ఒక చెట్టు ఉంది. అది నివాసప్రాంతం కాదు. అరమైలు దూరంలో గొర్రెల కాపరి గుడిసె మాత్రం ఉంది. ఆ స్టేషన్ మొత్తం ఒకే ఒక ప్లాట్ఫార్మ్గా ఉండి,సైడింగ్ లైన్ ఉంది. అక్కడితో పట్టాలు అంతమౌతాయి.ౖ రెల్వే పరిభాషలో అది డెడ్ ఎండ్. ఒకే ఒక్క ట్రాక్‌తో డిడ్ కాట్ స్టేషన్ మెయిన్ ట్రాక్‌కు అనుసంధానించి ఉంది. డెడ్ ఎండ్ వద్ద ఆ సైడింగ్ పట్టాల మీద తప్పిపోయిన వ్యాగన్ కనబడింది. వ్యాగన్ పెద్ద పెద్ద పార్సల్స్తో నిండి వుంది. వాటి మీద ‘లీమింగ్ టన్ నుండి వించెస్టర్ వయా న్యూ బరీ’ అని లేబుల్స్ అతికించున్నాయి. ఆగకుండా ప్రయాణించిన రైలు నుండి మిగతా వ్యాగన్ల మధ్య తగిలించిన వ్యాగన్ అక్కడికెలా వచ్చింది? అదొక మిçస్టరీగా ఉంది. ఎంత చురుకైన మెదడుక్కూడా అందని ఆ మిస్టరీ అందరి మెదళ్ళను తొలిచేస్తోంది.వ్యాగన్ వంక తదేకంగా చూసి ‘మనం ట్రాక్ మీది పాయింట్స్ ఒకసారి పరిశీలిద్దాం రండి’ అని ఇన్స్పెక్టర్ అనడంతో అందరూ అటు వెళ్ళారు. ఆ పాతకాలపు స్టేషన్లో కనీసం సిగ్నల్ బాక్స్ కూడా లేదు. రెండు లీవర్లతో పనిచేసేట్టుగా , నేలమీది చట్రం మీద లైనుకానుకొని పాయింట్ బిగించి ఉంది. అందులో ఒక లీవరు పనిచేస్తూ ఒకే పాయింట్స్‌లో ఉన్న లైన్‌ను మారుస్తోంది. లీవరును ఇంకోవైపుకి మార్చడం ద్వారా ట్రాక్‌ను య«థాస్థితికి తెస్తోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే నేలమీద చెక్కదిమ్మెలకు బిగించిన లీవరును అటు నుండి ఇటు, ఇటు నుండి అటు కదిలించడం వల్ల ట్రైన్లు ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్‌కు మారేలా చేస్తాయి. అదో సాంకేతిక అమరిక. ‘ఈ పాయింట్స్ సంగతేమిటీ? వీటిని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నందు వల్ల, మిగతా సమయమంతా పనిచేయకుండా ఉంచుతున్నారా?’ అడిగాడు హ్యేజెల్. ‘అవును. రెండు పట్టాల కింద నేలమీద చెక్క దిమ్మెలకు బోల్టులతో, మేకులతో బిగిస్తారు. ఓహ్! ఇటు చూడండి.. ఈ లీవర్లు ఇప్పటికీ ఉపయోగించినట్లు లేదు. లీవర్స్‌కు తాళం వేసుంది. ఇదుగో తాళం చెవి రంధ్రం. ఇటువంటి వింతను నేనెప్పుడూ చూసుండలేదు, మిస్టర్ హ్యేజెల్!’ అన్నాడు ఇన్స్పెక్టర్. హ్యేజెల్ అలాగే పాయింట్స్ వంకా, లీవర్ల వంక చూస్తూండి పోయాడు. పాయింట్లను, లీవర్లను పనిచేయిస్తే, రైల్ ట్రాక్ మారి సైడింగ్ ట్రాక్ పైకి ట్రైన్లను మళ్ళించవచ్చని అతనికి తెలుసు. కానీ, ఇక్కడ ఆ మళ్ళింపు ఎలా జరిగింది? అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది. అకస్మాత్తుగా అతని ముఖం వెలిగిపోయింది. చెక్కదిమ్మెకు అమర్చిన బోల్ట్‌ను వదులుచేయడానికి తాజాగా నూనె ఉపయోగించినట్లు స్పష్టంగా కనబడింది. తరువాత అతని చూపులు లీవర్ హ్యాండిల్ మీద నిలిచిపోయాయి. మందహాసరేఖ అతని పెదవుల మీద మెరిసి మాయమయ్యింది. ‘అటు చూడండి! ఆ లీవరును బయటికి లాగడం చాలా కష్టం’ అంటూ ఇన్స్పెక్టర్ ఒక లీవరును చేత్తో ముట్టుకోబోయాడు. వెంటనే హ్యేజెల్ అతని కాలరు పట్టుకొని వెనక్కి లాగాడు. ‘క్షమించండి! ఆ లీవర్లను నేను ఫోటో తీసుకుంటాను’ అంటూ వాటిని తన కెమెరాలో బంధించాడు హ్యేజెల్. ‘వాటిని ఉపయోగించినట్లు లేదు కదా సార్!’ అన్నాడు ఇన్స్పెక్టర్. హ్యేజెల్ మౌనంగా ఉండిపోయాడు– అతనంతటతనే తెలుసుకోనీలే అనుకుంటూ. ‘ఇన్స్‌స్పెక్టర్! ఆ పాయింట్స్ ఉపయోగించడం వల్ల వ్యాగన్ ఇలా దారి మళ్ళిందని చెప్పగలను. కానీ అదెలా జరిగిందనేదే అర్థంకాని సమస్య. అయితే ఒకటి మాత్రం నిజం. ఇంతటి కార్యానికి పాల్పడినవాడు పాతనేరస్తుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడని నిశ్చయంగా చెప్పగలను. పట్టుకొని తీరుతాం’ అన్నాడు హ్యేజెల్. ‘కానీ ఎలా?’ ఇన్స్‌స్పెక్టర్ అడిగాడు అశ్చర్యపోతూ. ‘అది ప్రస్తుతానికి చెప్పలేను. అన్నట్టు ఇన్స్‌స్పెక్టర్! వ్యాగను లోపలి వర్ణ చిత్రాలు యథాతథంగా ఉన్నాయి కదా?’ ‘మనం ఈ ట్రక్కును మనతో పాటు తీసుకుపోతున్నాం కాబట్టి, మనం త్వరలోనే తెలుసుకుంటాం’ ఇన్స్పెక్టర్ బోల్టులను స్పానర్‌తో వెనక్కి తిప్పి, లీవర్లను వదులు చేశాడు. ‘ఇవి నిరాటంకంగా పనిచేస్తున్నాయి’ అన్నాడు ఒక లీవర్ని గుంజుతూ. ‘అహా! ఎందుకు పనిచేయవు? వాటికి ఇటీవలనే చిక్కటి నూనెతో ఆయిలింగ్ చేశారు’ అన్నాడు హ్యేజెల్. తరువాతి ట్రైను ఆ లైనులో రావడానికింకా ఒక గంటకు పైగా ఉంది సమయం. న్యూబరీకి తిరిగిరాగానే హ్యేజెల్ చెసిన మొట్టమొదటి పని ఏమంటే, తాను తీసిన ఫొటోలను డెవలప్ చేసి ప్రింట్లను తీయడం. బాగా స్పష్టంగా వచ్చిన ఫొటోలను స్కాట్లాండ్ యార్డ్‌లో తనకు తెలిసిన అధికారికి పంపించాడు. తరువాతి సాయంకాలం అతనికి స్టేషన్ మాస్టర్ నుండి ఒక ఉత్తరమొచ్చింది. వ్యాగన్‌లోని చిత్తరువులన్నీ భద్రంగా ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ అపహరణకు గురికాలేదని ‘లోన్ ఎగ్జిబిషన్ కమిటీ’ సభ్యులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారణ చేసి, తమ సంపూర్ణ సంతృప్తిని వెలిబుచ్చారని, ఒక వ్యాగన్ సైడింగ్ ట్రాక్‌లోకి వెళ్ళిన సంఘటన కలిగించిన విభ్రాంతి నుండి తామింకా తేరుకోలేదని, ప్యాడింగ్టన్ నుండి ఉన్నతాధికారి ఒకరు విచారణకు వచ్చాడని, సరుకు భద్రంగా ఉంది కాబట్టి, సంఘటన జరిగినట్లు బయటకు పొక్కనీయకూడదంటూ వాళ్ళను అభ్యర్థించాడని, దీన్ని గోప్యంగా ఉంచవలసిందిగా హ్యేజెల్ని కూడా కోరుతున్నామని ఆ జాబు సారాంశం. ‘చాలా ఆశ్చర్యంగా ఉంది’ హ్యేజెల్ మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు స్కాట్లాండ్ యార్డ్ అధికారిని కలుసుకున్నాడు. ‘మేము మా రికార్డులన్నీ వెదికాం. దొంగను గుర్తించాం. అతని అసలు పేరు ఎడ్గర్ జెఫ్రీస్. అతనికి అనేక మారుపేర్లున్నాయి. ఇంతకు ముందు నాలుగు దోపిడీలూ, ఇళ్ళకు కన్నం వేసిన నేరాలకు శిక్ష అనుభవించాడు. అతడు చేసిన దోపిడీలో రైల్వే దొంగతనం కూడా ఒకటుంది. అతని గురించి ఏమైనా వివరాలు దొరికితే మీకు తెలియబరుస్తాం. ప్రస్తుతం అతను అలెన్ అనే పేరుతో నివసిస్తున్నాడు’ అంటూ అలెన్ చిరునామా కూడా ఇచ్చారు. హ్యేజెల్ దాన్నొక కాగితం మీద రాసుకున్నాడు. మర్నాటి న్యూస్ పేపర్లో..‘‘ప్రఖ్యాత చిత్రకారుడు సర్ మురెల్ గిల్బర్ట్, వించెస్టర్‌లో ఒక వారంలో జరగబోవు ఎగ్జిబిషన్ కమిటీ సభ్యుల మీద చేసిన తీవ్ర ఆరోపణ’’ అనే శీర్షిక హ్యేజెల్ దృష్టిని ఆకర్షించింది. ఆ అభియోగమేమంటే– ఆ పెయింటింగ్స్ అతను చిత్రించినవి కానేకావట. ఒరిజినల్ చిత్రాలను దాచిపెట్టి అలాంటివే నకళ్ళు తయారు చేయించి ఎగ్జిబిషన్ గోడలకు వేలాడదీసి మోసానికి పాల్పడ్డారట ఎగ్జిబిషన్ నిర్వాహక కమిటీ సభ్యులు. చాలా తెలివిగా ఫోర్జరీ చేయించారని అతని ఆరోపణ. తన ఒరిజినల్ పెయింటింగ్స్ అత్యంత విలువచేస్తాయని, తన పిక్చర్లు మార్చినందుకు నిర్వాహక కమిటీ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని నొక్కి వక్కాణించాడు. కానీ ఆ అభియోగాన్ని తిప్పి కొట్టింది నిర్వాహక కమిటీ. రైల్వే కంపెనీ నుండి నేరుగా ఎట్లున్న పెయింటింగ్స్ అట్లే వచ్చాయని సమర్థించుకుంది. ‘చర్న్’ సంఘటన పత్రికల వాళ్ళ దృష్టికి ఇంకా పోలేదని అర్థమైంది హ్యేజెల్కు. రైల్వే కంపెనీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అసలు నిజాన్ని దాచారు. హ్యేజెల్ ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. వీలైనంత త్వరగా విషయం రచ్చకెక్కకముందే మిస్టరీని ఛేదించాలని నిశ్చయించుకొన్నాడు. వెంటనే చిత్రకళ గురించి క్షుణ్ణంగా తెలిసిన తన స్నేహితుణ్ణి కలుసుకొన్నాడు. ‘నీక్కావాల్సిన సమాచారం చెబుతాను. నేను కూడా ఈ సాయంకాలం పత్రికకు ఒక ఆర్టికల్ రాయాల్సి ఉంది. ఇంతకముందు వెలాస్క్వెజ్ అనే చిత్రకారుని బొమ్మ విషయం.. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల సెయింట్ మోర్టిజ్ అనే పెద్దమనిషి దగ్గరున్న ‘మడోనా’ చిత్రం, వియన్నా గ్యాలరీలో ఉందని, అదే అసలైన చిత్రమని వారు యాజమాన్య హక్కుల దావా వేశారు. ఏదేమైనా, ప్రస్తుతం సర్ గిల్బర్ట్ ముర్రెల్ చిత్రించిన ‘ హోలీ ఫ్యామిలీ ’ అనే పెయింటింగ్ మాత్రం అతనిదే అని కొన్ని సంవత్సరాల క్రితం అతని పక్షంగా కోర్ట్ తీర్పునిచ్చింది. కాబట్టి గిల్బర్ట్ వద్ద ఉన్న చిత్రమే అసలైందని చెప్పడంలో సందేహం లేదు. దాని నకిలీ చిత్రమేమయిందో ఇరవై సంవత్సరాల నుంచి దాని ఆనవాళ్ళు ఇంతవరకూ బయటపడలేదు. నాకు తెలిసిందింతే. నాకు పనుంది. వస్తా’ అన్నాడు హ్యేజెల్ స్నేహితుడు. ‘ఒక్క నిమిషం. ఆ నకిలీ చిత్రం చివరిసారి ఎవరి దగ్గరుండింది?’అడిగాడు హ్యేజెల్. ‘చివరిసారి రింగ్ మియర్ అనే ఇంగ్లాండ్ ప్రాంతీయాధికారి దగ్గరుండేది. ఎప్పుడైతే అది నకిలీదని తెలిసిందో అతనికి దాని పైన ఆసక్తి పోయింది. ఎవరికో కారు చౌకగా అమ్మేశాడని ఎవరో చెప్పగా విన్నాను. అయినా కాటికి కాళ్ళు చాపుకున్న ఆ ప్రాంతీయాధికారికి పెయింటింగ్స్ మీద పిచ్చి వ్యామోహమెందుకో?’ అన్నాడా మిత్రుడు. ‘అతని వయసు?’ ‘ఎనభై ఏళ్ళు, అతడు పెయింటింగ్స్ అంటే పడిచస్తాడు’ చెప్పాడు మిత్రుడు. ‘అమ్మేశాడని ఎవరో చెప్పారంటే, కచ్చితంగా అమ్మేశాడని కాదుకదా దాని అర్థం? ఒక్కొక్కసారి ఈ ఔత్సాహికులంతా వింతగా ప్రవర్తిస్తారు. వాళ్ళల్లో నిజాయితీ ఉండదు. నాకు తెలిసిన ఒక పెద్దమనిషి అతని మిత్రుని ఇంట్లోనుండి కష్టపడి సేకరించిన స్టాంప్స్ దొంగిలించాడు. ఏం మనుషులు? ఏదేమైనా రైల్వే వ్యాగన్ ఎలా సైడింగ్ ట్రాక్‌లోకి మళ్ళిందో వెంటనే కనుక్కొని తీరాలి’ అని నిశ్చయించుకొన్నాడు హ్యేజెల్. స్కాట్లాండ్ వారిచ్చిన చిరునామాకు బయలుదేరాడు. అతని బ్యాగులో ఉన్న ఒక ఖాళీ కార్డ్ తీసుకొని దానిపై ‘సర్ రింగ్ మియర్ నుండి’ అని రాసుకొని దాన్ని ఒక కవరులో పెట్టాడు. అలెన్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అక్కడున్న సేవకురాలికిచ్చి కవరు అలెన్‌కు ఇమ్మన్నాడు. వెంటనే లోపలి నుండి అనుమతి లభించింది. ‘ఏం కావాలి నీకు?’ అడిగాడు అలెన్. ‘నేను సర్ రింగ్ మియర్ తరఫున వచ్చాను. చర్న్ సంఘటన గురించి మాట్లాడ్డానికి’ ధైర్యంగా చెప్పాడు హ్యేజెల్. ఊహించని రీతిలో ఆ గది తలుపు మూసి తాళం చెవిని జేబులో వేసుకొన్నాడు. ఆ వెంటనే పిస్టల్ తీసి అలెన్‌కి గురిపెట్టాడు.. ‘చర్న్ అనే ప్రదేశంలో నీవు ఆ రాత్రి ఒరిజినల్ వర్ణచిత్రాన్ని మార్చేశావు’ అంటూ. ‘నేనే మార్చానని ఎలా తెలుసు?’ అడిగాడు అలెన్. ‘నీవు పాయింట్లను పని చేయించే లీవర్ మీద, డబ్బాతో ఆయిల్ ఒంపుతున్నప్పుడు, నీ బొటనవేలికి కొంచెం నూనె అంటుకుంది. అదే చేతితో లీవర్ హ్యాండిల్‌ను పట్టుకొని ట్రాక్ మార్చావు. అప్పుడు లీవర్ హ్యేండిల్ మీద నీ వేలిముద్రలు పడ్డాయి. ఆ విధంగా నీవు చాలా తెలివి తక్కువ పని చేశావు. నేను వాటిని ఫొటో తీశాను. స్కాట్లాండ్ వారు అవి నీ వేలిముద్రలే అని నిర్ధారించారు. పాత నేరస్తుడువి కదా?’ చెప్పాడు హ్యేజెల్. లోలోపలే తనను తాను తిట్టుకుంటూ ‘ఆయన నన్ను చిత్తరువు తీసుకురావడం వరకే నియమించాడు. ఆయన పేరు బయటకు రావడం అతనికి ఇష్టం లేదు’ చెప్పాడు అలెన్. ‘ఆ చిత్రాన్నెలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఎవ్వరిపేరూ బహిర్గతమవకుండా, అసలు విషయం చడీచప్పుడు కాకుండా సమసిపోవాలంటే అదెక్కడుందో తెచ్చివ్వాలి. రింగ్ మియర్ దగ్గరుందా?’ అడిగాడు హ్యేజెల్. ‘ఇంకా అతని చేతికి చేరలేదు. అదెక్కడుందో అతనికీ నాకూ మాత్రమే తెలుసు’ ఒప్పుకున్నాడు అలెన్. ‘అలా అయితే కాగితం మీద స్టేట్మెంట్ రాసివ్వు. ఆ పెయింటింగ్ సర్ గిల్బర్ట్కు వాపసు చేస్తే సరి. అవసరమైతేనే నీ స్టేట్మెంట్ని ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను’ అన్నాడు హ్యేజెల్. కొంచెం సంభాషణ జరిగిన తరువాత అలెన్.. ‘ఇంగ్లాండ్‌లోని ఆ ప్రాంతీయాధికారి ఇదంతా చేశాడు. అతను నన్నెలా కలుసుకున్నాడనే విషయం అప్రస్తుతం. ఆ పిక్చరుకు సంబంధించి నకలును అధిక ధరకు కొని ఎవరికీ తెలియకుండా పాతసామానుల గదిలో దాచాడు. తాను కొన్న నకిలీ పెయింటింగ్ ఎవరికో అమ్మేశాడని ప్రజలు అనుకునేలా భ్రమ కలిగించాడు. దాని అసలు చిత్రం ఎప్పటికైనా దొరుకుతుందనీ, తన దగ్గరున్న నకిలీ పిక్చర్‌ని తొలగించి, అసలైన చిత్రాన్ని తన స్వంతం చేసుకోవాలనీ ఎంతో ఆశపడ్డాడు. అతనికి పెయింటింగ్సంటే విపరీతమైన పిచ్చి. అసలైన చిత్రాన్ని చోరీ చేసి అతనికివ్వడానికి నేను ఒప్పుకున్నాను. ఈ పనిలో ముగ్గురం ఉన్నాం. అసలు చిత్రం ఏ ట్రైనులో రవాణా కానుందో సులభంగా తెలుసుకున్నాం. ట్రైన్ ట్రాక్ గ్రౌండ్ ఫ్రేముని మారు తాళం చెవిని ఉపయోగించి తెరిచాం. ఇక బోల్టులు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. నేననుకున్నట్టుగా పని జరగడానికి వీలుగా పాయింట్స్‌కు బాగా ఆయిల్ పట్టించాను. ఒకడు సైడింగ్ వద్ద.. వ్యాగన్ ట్రాక్ మీద పరుగులిడుతున్నప్పుడు సంకేతాలివ్వడం కోసం పక్కన పొదలమాటున సిధ్ధంగా ఉన్నాడు. నేను పాయింట్స్‌ను అనుగుణంగా కదిలించడానికి తయారుగా ఉన్నాను. మరొకడు ఒక వ్యాగన్ లోపల రెండు గట్టి పొడవైన మోకు తాళ్ళతో టార్పాలిన్ కింద నక్కి ఉన్నాడు. రెండు తాళ్ళ చివరల ఇనుప కొక్కేలున్నాయి. ట్రైన్–అప్టన్ స్టేషన్ వదలగానే అతను పని మొదలు పెట్టాడు. గూడ్స్ ట్రైన్లు చాలా నిదానంగా ప్రయాణిస్తాయి. అందువలన కావాల్సినంత సమయముంటుంది. ట్రైన్ వెనుకనున్న బ్రేక్ వ్యాన్ నుండి లెక్కవేసుకొంటే మేము తప్పించబోయే వ్యాగన్ నంబరు 5. మొట్ట మొదట అతడు 4వ వ్యాగన్ నుండి 6వ వ్యాగన్ వరకు తాడు చివర్లకున్న కొక్కేలను వ్యాగన్ల రెండు పక్కల చివర్లకు బిగించాడు. ఇప్పుడు అతని చేతిలో మిగిలిన తాడు చుట్ట ఉంది. తరువాత అతను వ్యాగన్ నంబర్ 5 మీద కూర్చొని 4వ నంబరు వ్యాగన్ నుండి లింకును విడగొట్టాడు. అప్పటికే అతను రైల్వే కప్లింగ్ సిబ్బంది సహాయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి పని సులభమైంది. అప్పుడు చేతిలో మిగిలున్న తాడును వదిలాడు అది బిగువుగా అయ్యేదాకా. తరువాత రెండవతాడు చివరనున్న కొక్కేన్ని 5వ వ్యాగన్ మొదలు నుండి 6వ వ్యాగన్ చివర్న తగిలించి, రెండింటిమధ్యనున్న లింకు తొలగించి, 5వ దానిని 6వ వ్యాగన్ నుండి విడగొట్టాడు. మిగిలిన తాడు చుట్టను–బిర్రుగా బిగుసుకునే దాకా విడిచిపెట్టాడు. ఇప్పుడు చూడండి జరిగిన తమాషా. ట్రైను చివరి వ్యాగన్లు– 4 నుండి 6 దాకా పొడవైన తాడుసహాయంతో లాగబడుతుంటే.. వాటి నడుమ ఖాళీ జాగా వదులుతూ ఆ జాగాలో 5వ నంబరు వ్యాగన్– 6వ వ్యాగన్ నుండి చిన్న తాడు సహాయంతో లాగబడుతున్నది. అప్పుడతడు చేతిలో పదునైన కత్తిపట్టుకొని 6వ వ్యాగన్ మీద సిద్ధంగా ఉన్నాడు. మిగతా పని చాలా సులభం. నేను ట్రాక్‌కు దగ్గరగా నిలబడి లీవరును పట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ఇంజను ముందుకెళ్ళిపోయిన తక్షణం నేనింకా ముందుకొచ్చాను. 6వ నంబరు తరువాత జాగా ఏర్పడగానే, దాన్ని (లీవరును) వెనక్కి లాగాను. 5వ వ్యాగన్ సైడింగ్ ట్రాక్ మీదుగా పక్కకు మళ్ళింది. అదే సమయంలో నా అనుచరుడు తాడును అతివేగంగా తెగ్గోశాడు. ట్రైన్ అక్కడ చాలా నెమ్మదిగా వెళుతోంది. అలా వెళ్తుండగా నేను వెంటనే లీవరును వెనక్కెత్తి మళ్ళీ య«థాస్థితికి తెచ్చాను. ట్రైను ప్రధాన పట్టాలపై మామూలుగానే వెళ్ళిపోయింది. కాంప్టన్ స్టేషన్లోకి ప్రవేశించేముందు కొంచెం ట్రాక్ తగ్గులో ఉండడం వల్ల వెనకున్న నాలుగు వ్యాగన్లూ ప్రధాన ట్రైను దగ్గరగా రాసాగాయి. అప్పుడు నా అనుచరుడు, చేతిలోని తాడును బలంగా లాగి 4వ వ్యాగనుకు 6 వ వ్యాగన్‌ను అనుసంధానించాడు. కాంప్టన్ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు ట్రైను చాలా మందగమనంతో పోతున్నందువల్ల నా అనుచరుడు ట్రైను మీద నుండి కిందకు దూకేశాడు. అదీ జరిగింది’ అని చెప్పడంతో హ్యేజెల్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ‘ఇంతవరకూ ఇటువంటి సంఘటన రైల్వే చరిత్రలో జరగలేదు. చాలా తెలివైన ప్రణాళిక. నిర్వహణ అద్భుతంగా ఉంది. మరి అసలైన వర్ణచిత్రాన్నెక్కడ దాచావ్?’ అడిగాడు హ్యేజెల్. ‘జరిగిన విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ వెల్లడిచేయనని భరోసా ఇస్తే చెబుతాను’ అన్నాడు అలెన్. అందుకు హ్యేజెల్ ఒప్పుకున్నాడు. అతడు అన్ని వివరాలూ చెప్పాడు. అసలు వర్ణ చిత్రాన్ని సర్ గిల్బర్ట్ మురెల్కు అప్పగించారు. ప్రతిష్ఠపోతుందనే ఉద్దేశంతో రైల్వే వాళ్ళు ఆ సంఘటన బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు..‘ఎందుకైనా మంచిది. నకిలీ చిత్రాన్నే ఎగ్జిబిషన్లో ఉండనివ్వండి’ సలహా ఇచ్చి. ‘ఏదేమైనా ఇటువంటి తెలివైన నేరస్థుడు శిక్షించబడి ఉండాల్సింది’ అని తనలో తనే అనుకున్నాడు– హ్యేజెల్. ఆనందోత్సాహ సంద్రంలో మునిగిన సర్ గిల్బర్ట్ మురెల్.. హ్యేజెల్ను విందుకు ఆహ్వానించాడు. ‘చాలా సంతోషం. అయితే ఒక విన్నపం. భోజనానికి ఉపక్రమించే ముందు ఇక్కడ కొంచెం సేపు నేను వ్యాయామం చేసుకోవడానికి అనుమతించండి. తిన్నది అరిగించుకోవాలంటే అందుకు తగ్గ వ్యాయామం అవసరం అనే అంశాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి’ అన్నాడు హ్యేజెల్. ఆంగ్ల మూలం : విక్టర్ వైట్ చర్చ్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
కథ: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే!
‘ఏమప్పా, ఏమప్పా ..’ ఎవరో తన భుజాన్ని తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరచి చూస్తే సాయంత్రం రైలు ఎక్కేటపుడు వాకిలికి అడ్డంగా కూర్చొని.. ఏవో తత్వాలు పాడుకుంటున్న బైరాగి ‘ఏమప్పా .. నువ్వు మద్దికెర స్టేషన్లో దిగతానని నిన్న ఎవరితోనో చెప్తుంటే వింటినే. ఇపుడే బండి స్టేషన్ కూడా దాటిపోయెనే’ అని చెప్పగానే ఒక్కసారి నిద్రమత్తు పోయి బ్యాగ్ తీసుకోని మూసిన డోర్లాగి బయటకు చూస్తే, రైలు వేగం పుంజుకొని ఔటర్ సిగ్నల్ కూడా దాటేసింది. ఏమీ చేయలేని పరిస్థితి తనను తాను తిట్టుకుంటూ వచ్చి కూర్చొన్నాడు. మరి ఇపుడు ఎలా అని ప్రశ్నిస్తున్నట్టుంది బైరాగి మొహం. రెండు రోజుల కిందట తనకు అమ్మ చేసిన ఫోన్‌కాల్ గుర్తొచ్చింది. ‘పాండూ.. బాగున్నావురా?’ ‘బాగున్నానమ్మా.. నాన్న బాగున్నాడమ్మా? ‘ఆయనకేమి.. బాగున్నాడు! మీ చిన్నాయన కొడుకు పెండ్లి కదా బంధువులకు పత్రికలివ్వడానికి అనంతపురం పోయినాడులే’ ‘అవునా.. సరేలేమ్మా! నాకు ఆఫీస్‌కి టైమవుతుంది మరి..’ అన్నాడు పాండు ఫోన్ కట్‌చేసే మూడ్‌తో. ‘పాండూ.. నువ్వు పెళ్ళికి వస్తున్నావు కదరా! మీ చిన్నాయనకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా నీకు! వచ్చేటప్పుడు మీ చిన్నాయనకి, చిన్నమ్మకి మాంచి బట్టలు తీసుకోని రా. సంతోషపడతారు’ ‘సెలవు దొరకదే.. నేను రాలేనే అమ్మా’ ప్రాధేయపడుతున్నట్టుగా పాండు. ‘అదేం కుదరదు. ఎలాగో వీలు కల్పించుకొని రా అంతే. మన బంధువులందరూ అడుగుతారు రాలేదమని! అదీగాక నువ్వూరొచ్చి సంవత్సరం దాటుతుంది. ఎల్లుండే ముహూర్తం ఉదయం 6. 15 నిమిషాలకు’ అంటూ ఫోన్ పెట్టేసింది. ఎలాగోలా బాస్‌కి సర్ది చెప్పి.. చిన్నాన్న , చిన్నమ్మకి బట్టలు తీసుకోని ఉదయమే మద్దికెరలో ఉండాలని కిందటి సాయంత్రమే హైదరాబాద్ నుండి బయలు దేరాడు. ‘నిద్రపోకుండా ఉండాల్సింది. ఒకవేళ నెక్ట్స్ స్టేషన్ గుంతకల్‌లో దిగి రాత్రంతా అక్కడే ఉండి తెల్లారు జామునే బయలు దేరినా ఉదయం ఎనిమిది అయిపోతుంది టైమ్. మరి చిన్నమ్మ, చిన్నాయనకి బట్టలెపుడు ఇవ్వాలి?’ అనే ఆలోచనల్లోపడ్డాడు పాండు. ఇంతలోనే ట్రైన్ స్లో అవుతూ ఆగిపోయింది. డోర్ తీసి బయటకు చూస్తే నంచర్ల రైల్వే స్టేషన్. ‘ఇక్కడ ట్రైనెపుడూ ఆగదే? ఎందుకు ఆగిందో మరి? ఇక్కడ నుండి మద్దికెర ఏడు కిలోమీటర్లు. ట్రైన్ దిగి వెనక్కి నడుచుకుంటూ పొతే స్టేషన్ వరకు వెళ్లనవసరం లేదు పట్టాల వెంబడి నడచుకుంటూ పొతే మొదట రెడ్డి బావి వస్తుంది. దాని తరువాత మల్లప్ప గేట్ వస్తుంది. గేట్ వరకు వెళ్ళితే చాలు అటు నుండి ఊర్లోకి వెళ్ళచ్చు’ అనుకుంటూ పాండు ట్రైన్ దిగేశాడు. స్టేషన్ ఊరికి దూరంగా ఉన్నట్టుంది. మిణుకు, మిణుకు మంటున్న లైట్లు.. ఉండుండీ వీస్తున్న గాలి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గార్డ్ వేసిన విజిల్ శబ్దానికి భయపడి కాబోలు చెట్ల మీదున్న పక్షులలో అలజడి మొదలైంది. రైలు వెళ్లిన తర్వాత చుట్టూ ఒకసారి పరిశీలించి చూశాడు పాండు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత భయంకర నిశ్శబ్దం. అపుడు సమయం అర్ధరాత్రి 1.10 నిమిషాలు. అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న పాండు ‘ఇక్కడ దిగి తప్పు చేశానా?’ అనే ఆలోచనలోపడ్డాడు. ఏది ఏమైనా సరే తను వెళ్లాల్సిందేనని నిర్ణయించుకొని స్టేషన్ దాటి ముందుకెళ్ళి పోయాడు. ∙∙ పౌర్ణమేమో.. వెన్నెల పిండారబోసినట్టుంది. శరీరాన్ని తాకుతున్న చల్లని గాలి.. కిర్ కిర్ మంటూ కీచురాళ్ళ రొద.. అవేమీ పట్టనట్టు టకటక పట్టాలపై నడచి వెళ్తున్న పాండుకు ఎదురుగా ఉన్న పొద పక్కన ఎవరో కదిలినట్టు అనిపించి నిల్చున్న వాడల్లా ఠక్కున పట్టాల పై కూర్చున్నాడు. అపుడే ఒక తీతువు పిట్ట గట్టిగా అరుస్తూ తన పక్క నుంచే వెళ్లడంతో కొంచెం భయమనిపించి జేబులో నుంచి సిగరెట్, అగ్గిపెట్టె తీశాడు. అగ్గిపెట్టెలో ఒకటే పుల్ల ఉంది. ఎలాగోలా సిగరెట్ ముట్టించి.. సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేద్దాం అనుకుంటే అది రాత్రే చార్జింగ్ అయిపోయి ఆఫ్ అయింది. దీనికే భయపడితే ఎట్లా అదేంటో తెలుసుకుందామని లేచి ముందుకెళ్లి పొద పక్కకు చూస్తే అపుడపుడు వీస్తున్న గాలికి అటూ ఇటూ ఊగుతున్న తెల్ల జిల్లేడు చెట్టు. నవ్వొచ్చింది పాండుకి. నిజం కన్నా ఊహే ఎక్కువ భయపెడుతుంది మనిషిని. నడుస్తూ, నడుస్తూ రెడ్డివారి బావి దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి అటు వైపు చూస్తే తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. రాత్రిపూట అటు వైపు ఎవరూ వెళ్లరని దయ్యాలు తిరుగుతుంటాయని పెద్దలు చెప్పేవారు. ఎందుకో రామలక్ష్మి అక్క గుర్తొచ్చింది. అపుడు పాండుకి పదేళ్లు ఉంటాయేమో! ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో మగ సంతానం కోసం భర్త తన చెల్లెలినే పెళ్లి చేసుకొంటే.. భర్త ఆదరణ కరువై, ఆడపిల్లల తల్లిగా తనను అందరూ దూరం చేస్తుంటే తట్టుకోలేక ఆ రెడ్డివారి బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి చనిపోయిందని తెలుసుకొని ఆ పిల్లలు పడిన బాధ తాను ఎప్పటికీ మర్చిపోలేడు.. ఆ చేదు జ్ఞాపకాలతోనే మల్లప్ప గేట్ దగ్గరకు చేరుకున్నాడు. గేట్ మూసే ఉంది. ‘ఇపుడే ట్రైన్ వెళ్ళింది కదా. గేట్‌మన్ మేలుకునే ఉంటాడు ఇక్కడే ఒక సిగరెట్ తాగి మెల్లిగా ఇల్లు చేరుకోవచ్చు’ అనుకుంటూ అగ్గిపెట్టె కోసం గేట్‌మన్ రూమ్ తలుపు తట్టాడు. వాకిలి బార్లా తెరుచుకుంది. చీకటిగానే ఉంది. ఎవరూ కనపడలేదు. బయట ఉన్నాడేమో అనుకుంటూ వెనుకవైపు వెళ్ళాడు. పొగడపూల చెట్టు పక్కన అటువైపు తిరిగి ఊరుకేసి చూస్తూన్న ఓ ఆకారాన్ని చూసి ‘అన్నా.. అగ్గిపెట్టె ఉందా?’ అని అడిగాడు. వినపడలేదేమోనని మళ్లీ అడిగాడు. చల్లని గాలిహోరు.. దట్టమైన చింతచెట్టు కింద ఉండటంతో.. వెన్నెల వెలుతురులోనూ ఆ వ్యక్తి సరిగా కనపడటం లేదు. అంతలోకే ఆ ఆకారం అతనివైపు తిరిగింది. ఆడమనిషిలా కనిపించింది. అర్ధరాత్రి పూట.. ఆ ఆడమనిషికేం పని ఇక్కడ? అనుకున్నాడు పాండు. దూరంగా.. డగ్.. డగ్మంటూ ఏవో శబ్దాలు. భయంతో అతని గొంతు పిడచకట్టుకుపోయింది. కాళ్లల్లో సన్నని వణుకూ మొదలై పారిపోదాం అని అతను అనుకుంటూండగానే ఆ ఆడమనిషి.. అతనికెదురుగా వచ్చి నిలబడింది. ‘ఎ.. ఎ..ఎవరు?’ అని అడగాలనుకున్నాడు. గొంతు పెగల్లేదు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘ఎ.. ఎవరు నువ్వు? గేట్‌మన్ ఏమయ్యాడు?’ అని అతను అడుగుతుండగానే ఆ ఆడమనిషి మరింత దగ్గరగా వచ్చి ‘నేనా.. నేనా..? నేనెవరో తెలియదా? అర్ధరాత్రి ఎవరు కనపడతారో తెలియదా?’ అంటూ ‘అసలు నువ్వెవరు? ఇక్కడికెందుకు వచ్చావ్?’ అని ఎదురు ప్రశ్నించింది. ‘నేను ఈ ఊరి వాడినే. నా పేరు పాండురంగ. రేపు మా చిన్నాయన కొడుకు పెళ్లి. రైల్లో నిద్రపోవడంతో స్టేషన్లో దిగలేకపోయా. నంచర్లలో దిగి నడుచుకుంటూ వస్తున్నా. సిగరెట్ వెలిగించుకుందామని అగ్గిపెట్టె కోసం ఇక్కడికొచ్చా అంతే’ అని చెప్పాడు. ‘అంతేనా.. లేక ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారం చంపేసే వాడివా? అలాంటి వాడి రక్తం తాగాలని ఎదురుచూస్తున్నా’ అంటూ పక్కనే ఉన్న బండరాయి పై కూర్చొని ‘ఊ.. ఊ..’ అని ఊగిపోతూ ‘వెళ్ళు రూమ్‌లో ఎడమ పక్కన నీళ్లుంటాయి తాగు’ అని దబాయించింది ఆ ఆడ ఆకారం. బెరుకు బెరుకుగానే అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్లాడు పాండు. నిజంగానే అక్కడ వాటర్ బాటిల్ ఉంది. గటగటా నీళ్లు తాగి.. అక్కడే టేబుల్ మీద కనిపించిన అగ్గిపెట్టె తీసుకొని సిగరెట్ వెలిగించాడు పాండు. అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా? చీకట్లో కనపడటం లేదు. దయ్యమైతే ఇంత నిదానంగా ఉంటుందా? ఒకవేళ మనిషనుకుంటే రక్తం తాగుతా అంటుందా? ఏంటో ఏమో ఏవరైనా వస్తే బాగుండు..’ అనుకోసాగాడు. సిగరెట్ తాగిన తర్వాత కొంచెం వణుకు తగ్గినట్టయింది. ‘అయిపోతే రా.. ఇక్కడికి’ అంటూ ఊగిపోతూ.. మళ్లీ తలతిప్పి ఊరుకేసి చూస్తుంటే.. దూరంగా ఏదో ఆకారం వాళ్లవైపు వస్తూ కనిపించింది. అంతే భయంతో పరుగెత్తి చీకట్లో కలసిపోయాడు పాండు.. ‘ఆగు ఆగు .. ’ అంటూ ఆ ఆకారం వారిస్తున్నా వినకుండా.. ఆగకుండా! ∙∙ ‘రేయి.. లేవరా... లే... తొందరగా తయారవ్వు.. ఆరున్నరవుతోంది’ ‘ఏంటన్నయా.. అప్పుడేనా?’ అన్నాడు పాండు బద్ధకిస్తూ. ‘లెవ్వురా బాబూ.. అమ్మా, నాన్నా.. మన కోసం ఎదురు చూస్తుంటారు’ ‘అపుడే వెళ్లిపోయారా?’ అంటూ దిగ్గున లేచి కూర్చున్నాడు పాండు. ‘ఆ .. బట్టలు కూడా తీసుకెళ్లారు’ బద్ధకం వదిలించుకుని లేచి.. స్నానం చేసి పెళ్లింటికి బయలుదేరారు పాండు వాళ్లు. మధ్యలోనే చిన్నాయన ఎదురై ‘ఏమిరా.. పాండూ ఇంత లేటుగానా వచ్చేది? పో.. వాడిని పలకరించు’ అని అంటూండగానే ఎవరో అతణ్ణి పిలవడంతో ఆ వైపు వెళ్లాడు. పెళ్ళిలో తెలిసిన బంధువులను, మిత్రులను పలకరిస్తూ పెళ్లి మంటపానికి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు పాండు. అతని తండ్రి ‘ఇంత లేటా?’ అన్నట్టుగా కొరకొరా చూశాడు అతని వైపు. అపుడే కొంత మంది పెళ్లి చూసి తిరుగు ప్రయాణమై వెళ్తున్నారు కూడా! ‘ఏమప్పా పాండూ.. బాగున్నావా ఏందీ?’ అని అడుగున్న తన ఎదురింటి సుబ్బన్నను చూసి ‘బాగున్నా మామా! ఇంట్లో అందరూ కులాసాయేనా మామా?’ అని తిరిగి పలకరించాడు పాండు. ‘ఆ దేవుని దయ వలన అందరం బాగున్నాములే’ బదులిచ్చాడు సుబ్బన్న. ‘సరే.. మామా మళ్లీ కలుస్తా.. అమ్మ పిలుస్తూంది’ అంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆమె ఓ అమ్మాయితో మాట్లాడుతూ పాండును చూసి దగ్గరకు రమ్మని చేయి ఊపింది. ‘పాండూ.. బంధువులందరినీ పలకరించావా? లేదా?’ అడుగుతూండగానే ఆ అమ్మాయి ‘సరే అత్తమ్మా, నేను వెళ్తాను. అమ్మ ఎదురు చూస్తుంటుంది’ అని చెప్పి వెనుదిరగబోయింది. అంతలోకే పాండు వాళ్లమ్మ ఏదో గుర్తొచ్చినదానిలా ‘ఇదిగో మహేశ్వరీ.. అమ్మను, నాన్నను భోజనానికి పంపించు’ అని పురమాయించింది. అలాగే అంటూ వెళ్తున్న మహేశ్వరీని చూస్తూ ‘ఎవరమ్మా ఆ అమ్మాయి?’ అని అడిగాడు పాండు. ‘మన పక్క వీధిలో ఉంటారు లేరా?’ అని చెప్పింది ఆమె. ‘సరేనమ్మా.. రాత్రంతా సరిగ్గా నిద్దర్లేదు. ఇంటికెళ్లి కొద్దిసేపు పడుకుంటానే.. తలనొప్పిగా ఉంది’ అన్నాడు. ‘సరే పో.. కాస్త రెస్ట్ తీసుకొని రా’ ∙∙ ఇంటికెళ్ళి పడుకున్న పాండు సాయంత్రం వరకు లేవలేదు. సాయంకాలం ఫ్రెషప్ అయ్యి ఆలా ఊర్లోకి వెళ్లాడు.. ఫ్రెండ్స్‌ని పలకరించి వద్దామని. రాములోరి గుడి దాటుతుండగా గుడి మెట్ల దగ్గర మహేశ్వరి కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి ‘అర్ధరాత్రి మల్లప్ప గేట్ దగ్గర ఆడవాళ్ళను రేప్చేసే మనుషుల రక్తాన్ని తాగాలని ఎదురు చూస్తున్న మహేశ్వరికి వందనం’ అన్నాడు. చివ్వున తలతిప్పి అతని వైపు చూసింది మహేశ్వరి. ‘నువ్వు అమ్మతో మాట్లాడుతున్నపుడే నీ వాయిస్ గుర్తు పట్టేశా. అక్కడే అడిగితే బాగోదని ఆగిపొయా. అసలేం జరుగుతోంది? మల్లప్ప గేట్ దగ్గర దయ్యాల పేరు చెప్పుకొని అందరినీ భయపెట్టడం వెనుకున్న మతలబేంటో చెప్తావా? లేక అందరినీ పిలవనా?’ చిన్నగానే కానీ బెదిరిస్తున్నట్టుగా అడిగాడు పాండు. ‘పిలువు.. నాకేమన్నా భయమా?’ అంది మహేశ్వరి. అంతలోనే అక్కడకి పూజారి రావడం చూసి ‘అయ్యవార్లూ. మన మల్లప్ప గేట్ దగ్గర ఏప్పుడైనా దయ్యాలు కనిపించాయని ఎవరన్నా అనుకోవడం విన్నారా?’ అని అడిగింది. ‘లేదమ్మా.. ఎవరికైనా కనిపించాయా ఏమిటి?’ ఆత్రంగా అడిగాడు పూజారి. ‘ఈయనకి కనిపించించాయని చెప్తున్నాడు మరి’ పాండుకేసి చూపిస్తూ అంది. ‘అవునా?’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు పూజారి. ‘ రాత్రి మాత్రం అక్కడున్నది నువ్వే! డౌటే లేదు. నిజం చెప్పు?’ అడిగాడు పాండు. ‘అవును.. నేనే’ ‘అదే.. అలా ఎందుకు చేశావ్?’ అడిగాడు పాండు. అతనికి కాస్త దగ్గరగా వచ్చి అటూ ఇటూ చూస్తూ ‘నీకు తెలుసో.. లేదో మా నాన్న రైల్వేలో పని చేస్తాడు. నిన్న రాత్రి మల్లప్ప గేట్ దగ్గర గేట్‌మన్‌గా డ్యూటీ వేశారు. సాయంత్రం నుంచే నాన్నకు ఒంట్లో నలతగా వుండింది. వద్దులే అని వారించినా వినకుండా బయలుదేరిన నాన్నకు ఒంట్లో ఎలా ఉందోనని చూసి పోదామని గేట్ దగ్గరకు వచ్చాను. చల్లటిగాలికి బాగా దగ్గుతూన్న నాన్న.. ఇంట్లో ఉన్న మాత్రలు తెచ్చుకుంటానని ఇంటికెళ్లాడు. నాన్న కోసం ఎదురుచూస్తూంటే నువ్వొచ్చావ్. వచ్చిన నువ్వు ఎలాంటి వాడివో నాకెలా తెలుస్తుంది? ఏ తాగుబోతో, దొంగో అయితే నా పరిస్థితి ఏంటి? నన్ను చూసి భయపడుతున్న నిన్ను భయపెట్టి అక్కడ నుండి పారిపోయేలా చేయాలని అనుకున్నా. ఆ తర్వాత నీ పేరు పాండు అని, నువ్వు హైద్రాబాద్ నుండి వస్తున్నావని నువ్వు చెప్పడంతో తేలికపడ్డా. అందుకే వెళ్లి వాటర్ తాగమని చెప్పా. నాన్న వచ్చేనంత వరకు తోడుగా నువ్వుంటే భయం ఉండదని నా నాటకం కంటిన్యూ చేస్తుండగానే దూరంగా మా నాన్న రావడం చూసిన నువ్వు ఆగు ఆగు అని అరుస్తున్నా పరుగెత్తి పారిపోయావు. జరిగింది అదే. నమ్మితే నమ్ము లేకుంటే లేదు’ అని మెట్లుదిగి వెళ్ళిపోతూ మళ్లి వెనక్కి వచ్చి ‘నువ్వు మాత్రం ధైర్యవంతుడివే’ అంటూ పరుగెత్తిపోయింది మహేశ్వరి. ఆమె వైపే చూస్తుండిపోయాడు పాండు. ∙ కార్తిక్ గోపాల్ -
మరోకథ: పులి
యాభైయేళ్ల క్రితం అతను ప్రాణాలకు తెగించి సాహసంతో పులితో పోరాడాడు.. పులి అతని ధాటికి తట్టుకోలేక ఎక్కడికో పారిపోయింది. ఆ తరువాత ఆ పులి జాడలేదు. అలా ఒంటిచేత్తో పోరాడేవాళ్లు ఇప్పుడు ఒక్కరే నాకు తెలిసి..’ అని ఆగి ఒక్కసారి ‘ రాజమ్మ.. రాజన్న కొడుకు కూతురు. రాజన్న చనిపోయే ముందు ఆ విద్యను కొడుక్కి నేర్పుతానంటే నేర్చుకోలేదు. ‘ఇందుమూలంగా మన్యం ప్రజలకు చుట్టుపక్కల గూడెపు ప్రజలకు తెలియజేయునది ఏమనగా.. మనిషి రగతం రుచి మరిగిన పెద్దపులి మన్యంలోకి వచ్చింది. పొలంలో పనిచేసుకుంటున్న మడుసులను, మేకలను పశువులను దేన్నీ ఇడిసిపెట్టకుండా సంపుతుంది. సీకటిపడ్డాక బయటకు రాకూడదహో.. ఒంటరిగా తిరగొద్దని అడవి దొరలు చెబుతున్నారు.. పారాహుషార్ ’ అంటూ టముకు వేస్తూ వెళ్తున్నాడు వ్యక్తి. మన్యం ఉలిక్కిపడింది. పులి అటవీప్రాంతంలో నుంచి యథేచ్ఛగా మన్యంలోకి అడుగుపెట్టింది. మన్యం గ్రామాల్లో పులి సంచారం. మనుషుల రక్తం రుచి మరిగిన పులి పిచ్చిపట్టినట్టు తిరుగుతోంది. దాపులనే వున్న అడవి నుంచి ఎలా వచ్చిందో తెలియదు. ఒక్కసారిగా గ్రామాల మీద విరుచుకుపడుతోంది. పొలం పనులు చేసుకుంటున్న మహిళల మీద దాడిచేసింది. రాత్రివేళ పొలంలో కాపలాగా వున్నవాళ్లను పొట్టన పెట్టుకుంటోంది. ఎప్పుడు ఎలా వచ్చి దాడి చేస్తుందో తెలియడం లేదు. 13 మందిని చంపేసింది. పులికి ఎరగా మేకలు, గుర్రాలను చెట్లకు కట్టి కూడా అధికారులు ప్రయత్నాలు చేశారు. రెండు మేకలను తినేసి వెళ్లిపోయింది కానీ దొరకలేదు. ఫారెస్ట్ రేంజర్లు అడవిలో నాలుగు ప్రాంతాల్లో చెట్లపై మంచెలు ఏర్పాటు చేసుకుని టార్చిలు, వైర్లెస్ సెట్లు, వలలతో సిద్ధమై రాత్రీపగలు దాని జాడ కనిపెట్టేందుకు నిఘా పెట్టారు. పులుల సంరక్షక విభాగానికి చెందిన 30 మంది కమాండోలు.. అత్యాధునిక ఆయుధాలతో పోలీసులు నిత్యం అడవంతా గాలించసాగారు. పదిమంది ప్రైవేటు షార్ప్ షూటర్లనూ అధికారులు రప్పించడంతో ఆయుధాలతో వారూ పగలూరేయీ అడవిని జల్లెడ పడుతున్నారు. పులిని అడ్డగించడానికి ఏనుగులపై ఒక బృందం తిరుగుతోంది. ఇవి చాలవన్నట్లు లేటెస్ట్ టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఒక పవర్ గ్లైడర్, డ్రోన్ కూడా నిత్యం అడవిని పరిశీలించేందుకు అక్కడి గగన తలంలో తక్కువ ఎత్తులో తిరుగుతున్నాయి. ఇంతచేసినా పులి జాడ దొరకలేదు. ఈ విషయం నేషనల్ చానెల్స్‌లోకి వెళ్లింది. రక్తంతాగే పులి జనారణ్యాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతోందన్న వార్త సంచలనం అయ్యింది. మన్యం ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పులిని బంధించినా, చంపినా పదిలక్షల పారితోషికాన్ని ప్రకటించింది. పులివేటగాళ్లను రంగంలోకి దించింది. అయినా ఫలితం కనిపించలేదు. పులి కనిపిస్తే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ గన్ లతో వెటర్నరీ డాక్లర్ల బృందం కూడా ఈ వేటలో పాలుపంచుకుంటోంది. ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేసి రిటైరైన రామభద్రాన్ని పిలిపించి అతని సలహాను కోరారు సీనియర్ అధికారులు. డెబ్భైయేళ్లు దాటిన రామభద్రం అధికారుల వంక చూసి చెప్పాడు..‘కొన్ని పులులు మనుషుల రక్తం రుచి మరుగుతాయి. కేవలం ఆకలి కోసం మాత్రమే జంతువుల మీద దాడిచేసే పులులు వేరే. నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఒకపులి మన్యం ప్రజలమీద దాడిచేసింది. కంటిమీద కునుకు లేకుండా చేసింది. అప్పుడు మనుషుల రక్తం రుచి మరిగిన ఆ పులిని వేటాడి చంపడానికి పులులవేటలో మొనగాడైనా రాజన్నను రంగంలోకి దించాం. రాజన్న అంటే పులులతో ఆట ఆడుకునే మొనగాడు. అతను వస్తుంటే పులులు పక్కకు తప్పుకుంటాయి. పులుల వేటలో అతడు ఆనాటి యువకులకు తర్ఫీదు ఇచ్చేవాడు. వాళ్ళ పూర్వీకులు పులులను వేటాడడంలో అప్పటి సంస్థానాధీశులకు, అప్పటి బ్రిటిష్ పాలకులకు మెళకువలు చెప్పేవారట. రాజన్న మాత్రం అడవిలో దాడిచేసే పులుల నుంచి ఎలా రక్షించుకోవాలో చెప్పేవాడు. పులులను చంపకూడదని ఈ విద్య నేర్పించే ముందే ప్రమాణం చేయించుకునేవాడు. యాభైయేళ్ల క్రితం అతను ప్రాణాలకు తెగించి సాహసంతో పులితో పోరాడాడు.. పులి అతని ధాటికి తట్టుకోలేక ఎక్కడికో పారిపోయింది. ఆ తరువాత ఆ పులి జాడలేదు. అలా ఒంటిచేత్తో పోరాడేవాళ్లు ఇప్పుడు ఒక్కరే నాకు తెలిసి..’ అని ఆగి ఒక్కసారి ‘ రాజమ్మ.. రాజన్న కొడుకు కూతురు. రాజన్న చనిపోయే ముందు ఆ విద్యను కొడుక్కి నేర్పుతానంటే నేర్చుకోలేదు. కానీ అతని కూతురు, రాజన్న మనవరాలు రాజమ్మ నేర్చుకుంది. రాజన్న కొడుకు, కోడలు ఒక ప్రమాదంలో చనిపోయారు. మనవరాలిని పెంచిపెద్ద చేసి పెళ్లి చేశాడు. రాజన్న కూడా కాలం చేశాడు. రాజమ్మను విధి కూడా చిన్న చూపు చూసింది. ఆమె భర్త చిన్నవయసులోనే కన్ను మూశాడు. మూడేళ్ళ తన కూతురితో పక్కనే వున్న గూడెంలో బతుకు వెళ్లదీస్తోంది. ధైర్యంలో తాతను పోలిన వ్యక్తి’ అని చెప్పాడు రామభద్రం. ‘ఒక మహిళ, అదీ ఒక బిడ్డతల్లి మనుషుల రక్తం మరిగిన పులిని ఎదుర్కోగలదా?’ అనే సంశయాలున్నా పులిని ఎదుర్కోవడానికి వారికీ మరోమార్గం కనిపించలేదు. వందల వేల ఎకరాల మేర విస్తరించి వున్న ఈ మన్యం ప్రాంతం గురించి ఇక్కడే పుట్టిపెరిగిన రాజమ్మకే తెలుసు. పులి వేటగాడైన రాజన్న వారసురాలు రాజమ్మే సరైన ఎంపిక అనుకున్నారు. ∙∙ ముప్పయేళ్ల రాజమ్మ వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తోంది. చీకట్లు మన్యాన్ని చుట్టుముట్టాయి తన జీవితంలా! అయినా ఆమెలో ధైర్యం, పోరాడాలనే సాహసం చచ్చిపోలేదు. మూడేళ్ళ బిడ్డ మాయదారి రోగంతో పోరాడుతోంది. పుట్టుకతోనే వచ్చిన జబ్బు. గుండెకు రం్ర«ధం ఉందని.. ఆపరేషన్ చేయాలనీ కనీసం అయిదులక్షలు అయినా కావాలి అని డాక్టర్ చెప్పాడు. తన గూడేనికి తిరిగివస్తుంటే రాములు తాత ఎదురొచ్చాడు.. ‘బేగి ఎల్లిపో రాజమ్మా.. అసలే రోజులు బాగాలేవు మాయదారి పులి.. ఎప్పుడు ఎవరిమీద పడి పేణాలు తీత్తదో ’ అంటూ. నవ్వుకుంది రాజమ్మ. తనకు పులికన్నా పెద్ద సమస్య.. తన బిడ్డ రోగం.. ఆ సమస్యకు ఆ మన్యం దేవుడే పరిష్కారం చూపించాలి అనుకుంది. అప్పుడే అక్కడికి ఫారెస్ట్ రేంజర్ జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి రామభద్రం దిగాడు. రాజమ్మను పలకరించాడు. తనతో పాటు తీసుకువెళ్లాడు. ∙∙ ఫారెస్ట్ ఆఫీసర్, రామభద్రం, రాజమ్మ ముగ్గురే వున్నారు. రాజమ్మ ఒళ్ళో బిడ్డ నిద్రపోతోంది. ‘రాజమ్మా.. మీ తాత రాజన్న నాకు గురువులాంటోడు. ఈ మన్యాన్ని ఒకప్పుడు పులిబారి నుంచి కాపాడిన దేవుడు. ఇప్పుడు పులి సమస్య మళ్ళీ వచ్చింది. పులిని ఎలా వేటాడాలి, మట్టి కరిపించాలో ఆ పట్లు నీకు మీ తాత నేర్పించాడు. ఈ మన్యాన్ని కాపాడడానికి మీ తాత రూపంలో నువ్వే ముందుకు రావాలి. నీ పరిస్థితి తెలుసు. నీ బిడ్డ ఆపరేషన్ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. నీకు సాయంగా ఫారెస్ట్ గార్డులు వుంటారు. ఈ సాహసం చేయగలవా?’ అడిగాడు రామభద్రం.. రాజమ్మ వంక చూసి. రాజమ్మలో అతనికి రాజన్న రూపమే కనిపిస్తోంది. ఎక్కువసేపు ఆలోచించలేదు రాజమ్మ.. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునే అవకాశం, దానికి తోడు ఈ మన్యం ప్రజల ప్రాణాలు కాపాడే అదృష్టం వచ్చింది. తనకు పులిని వేటాడే విద్య నేర్పిస్తున్నప్పుడు తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.. ‘నీకోసం కాకుండా నిన్ను నమ్ముకున్న వాళ్ళకోసం నువ్వు చేసే సాహసమే నిజమైన సాహసం’ అని. రామభద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది రాజమ్మ. ‘ఈ రాత్రికే పులివేట మొదలవుతుంది. మనుషుల రుచి మరిగిన పులిని వేటాడుతా.. నా తాత మీద ఆన’ అంటూ గూడేనికి బయల్దేరింది రాజమ్మ . పులివేటకు మరోపులి సిద్ధమైంది. ∙∙ ట్రంకుపెట్టె తెరిచింది రాజమ్మ. తనకు పులిని వేటాడే విద్యను నేర్పించేప్పుడు తాను కట్టుకున్న చీర, ఒంపులు తిరిగున్న పిడిబాకు, తెల్లటి పట్టీలాంటి వస్త్రం.. పెట్టెలోంచి తీసింది. గోచీలా చీర కట్టింది. తెల్లటి దళసరి వస్త్రాన్ని పట్టీలా కుడికాలుకు కట్టుకుంది. పిడిబాకును ఆ పట్టీపొరల్లో పెట్టింది. తన గుడిసెలోని మట్టిగోడ మీదున్న తాత ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకుంది. ‘తాతా నువ్వు నేర్పిన విద్య ఈరోజు నా బిడ్డ ప్రాణం,ఈ మన్యం ప్రజల ప్రాణం కాపాడబోతుంది. నన్ను ఆశీర్వదించు’ అంటూ. మంచంలో పడుకున్న బిడ్డను ఎత్తుకొని తన వీపుకు చీరతో కట్టేసుకుంది. శత్రువులను ఎదిరించడానికి వెళ్తోన్న వీరనారిలా ఉంది. ∙∙ చీకటిపడింది.. రాజమ్మ చెవులు రిక్కించింది. పులి అడుగుల శబ్దాన్ని గుర్తించగలదు. ఒక్కసారిగా వేగంగా లంఘించగలదు.. అది తాత ద్వారా నేర్చుకున్న విద్య. నీటిలో పులి ఈదుతున్న శబ్దం. ఏడు కిలోమీటర్ల వెడల్పైన నదిని ఈదగలదు తను. పులిలా మారింది రాజమ్మ. తాతను మనసులో స్మరించుకుంది. ఆమె చేతులు ఆయుధాలుగా మారుతున్నాయి. చుట్టూ చెట్ల మీద ఆయుధాలతో ఫారెస్ట్ గార్డులూ ఎలర్ట్‌గా వున్నారు. పలచని వెన్నెల.. ఆ వెలుతురులో చెట్ల చాటున పులి నీడ.. రెండుకాళ్ళ మీద నిలబడితే మనిషి ఎత్తును మించే ఎత్తు. దాదాపు రెండువందల కిలోల బరువున్న పులి.. రాజమ్మ కళ్లు అటువైపు తిరిగాయి. పులి ఒకేసారి గాల్లోకి ఎగిరింది. మెరుపు వేగంతో పక్కకు దూకింది రాజమ్మ. ఫారెస్ట్ గార్డులు తుపాకులు గురిపెట్టేలోగా నాలుగుసార్లు రాజమ్మ మీదకు లంఘించింది పులి. ఇప్పుడు.. పులికి ఎదురుగా వుంది రాజమ్మ. తనే మాత్రం వెనక్కి తిరిగినా, తగ్గినా పులి పంజా తన బిడ్డ మీద పడుతుందని తెలుసు. పిడికిళ్లు బిగించి తెరిచింది. చేతులను చురకత్తుల్లా మార్చింది. పులి తనమీద పడేసమయంలో ఒడుపుగా పక్కకు జరిగింది.తన రెండు కాళ్లను చెట్టుకు ఆనించి గాలిలో నిలబడి పులి తలను గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ఒడుపుంది. పులి వేటగాడైన తాత నేర్పిన కిటుకుంది. ఒక చేత్తో పులి తలను చుబుకం నుంచి పైకి లేపింది. కుడిచేత్తో తన కాలికి చుట్టుకున్న పట్టీలో నుంచి పిడిబాకు తీసి పులి గొంతుక పక్కవైపు బలంగా దించింది. ఒక్కసారిగా పులి కిందకు జారింది. రాజమ్మ వైపు కోపంగా చూస్తూ పైకి లేచి లంఘించబోయింది. ఆ అవకాశం ఇవ్వలేదు రాజమ్మ. తానే సివంగిలా పులి మీదకి దూకింది. పులి బోర్లా పడిపోయింది. తన చేతిలోని పిడిబాకు పులి కళ్ళలోకి దింపబోయింది. ఒక్కక్షణం.. ఒకే ఒక్క క్షణం.. పులికళ్ళలో కన్నీళ్లు కనిపించాయో.. ఓటమిని అంగీకరించిన దైన్యాన్ని గ్రహించిందో.. అమ్మ మనసును చూసిందో కానీ ఆగిపోయింది రాజమ్మ. అప్పటికే చెట్టు మీదున్న ఫారెస్ట్ గార్డులు కిందకు దూకి పులిని బంధించేందకు సంసిద్ధంగా ఉన్నారు.. మన్యం ప్రజలూ ఆయుధాలు, కాగడాలతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. ‘ చంపెయ్ రాజమ్మా.. పులి కళ్ళను పొడిచెయ్’ అంటూ అరుస్తున్నారు. రాజమ్మ చురుకైన కళ్లు పులి కళ్ల వంకే చూస్తున్నాయి. తనకు పులిని వేటాడే విద్య నేర్పిస్తూ తాత చెప్పిన మాటలు గింగురుమంటున్నాయి.. ‘మనలాగే పులి కూడా ఒక జీవే. శరణు జొస్తే వదిలివేయడం వీరుల లక్షణం’ అంటూ. అలా తన తాత యాభైయేళ్ల కిందట వదిలేసిన పులి సంతతే ఈ పులి అనిపించింది ఆమెకు. రాజమ్మ పెదవులు పులి చెవుల దగ్గరికి వెళ్లాయి.. ‘ నీకు నా మాటలు వినిపిస్తాయో.. లేదో! నువ్వు వినగలవో లేదో తెలియదు. నేనొక అమ్మను. నా బిడ్డను, నా తలిదండ్రుల్లాంటి నా మన్యం ప్రజలను కాపాడుకోవడానికే నిన్ను చంపాలనుకున్నాను. కానీ చంపలేకపోతున్నాను. పులివైనా నువ్వు తల్లివే కదా! నీ బిడ్డలకు నిన్ను దూరం చేయలేను. వెళ్ళు.. పారిపో! ఈ రాజమ్మకు దొరకనంత దూరం వెళ్ళిపో’ అని చెప్పి లేచింది రాజమ్మ. మన్యం ప్రజలు భయంగా చూస్తున్నారు రాజమ్మ ఏం చేస్తుందో అర్థం కాక. ఆమె చేతులు పైకి లేపి మన్యం ప్రజలను వారించింది. పులి లేచింది. రాజమ్మ వైపు చూసింది. పులి కళ్లలో కృతజ్ఞతాభావం. తన బిడ్డలున్న అడవి వైపు పరుగెత్తింది. అభయారణ్యంలోకి వెళ్ళిన ఆ పులి తిరిగి ఎప్పుడూ జనారణ్యంలోకి రాలేదు. రాజమ్మ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో సగం తన బిడ్డ ఆపరేషన్ కు ఖర్చు చేసి, మిగితా సగం మన్యం ప్రజల బాగుకోసం ఇచ్చేసింది. రాజమ్మ మన్యంలో తిరుగుతుంటే పులి తిరుగుతున్నట్టే ఉంది. తమను కాపాడే పులి. మన దేశం గర్వించే జాతీయ చిహ్నంలా. - విజయార్కె చదవండి: ఈవారం కథ: సార్థకత -
ఈవారం కథ: సార్థకత
అప్పటికే అది పదోసారో పదిహేనో సారో! అనసూయ గోడ గడియారం కేసి చూడడం.. వెంటనే వాకిట్లోకి వచ్చి వీథి చివర కనిపించేంత వరకు చూడటం. మనవళ్లిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసి నిట్టూర్చింది. ‘ఇదే వేరే ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈపాటికి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికార్లు తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. పాపం వీళ్లు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటారు. తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ.. శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్లే’ అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ.. గేటు చప్పుడు అవ్వడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి చూసింది. తలవంచుకుని వస్తూ కనిపించింది కూతురు. ‘హమ్మయ్య! వచ్చేసింది’ అనుకుంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి ‘ఏమ్మా! అలా ఉన్నావు? ఈరోజు మళ్లీ ఏమైనా..’ అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దీవాన్ మీద బోర్లా పడి భోరుమని ఏడవసాగింది. అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్క మొహం వేసుకుని అమ్మమ్మకి చేరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకుని తల్లిని భయంభయంగా చూడసాగారు. అనసూయ పిల్లలిద్దరితో సుజాతకి దగ్గరగా వెళ్లి ‘ఏడవకు తల్లీ! నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడూ.. ఎలా భయపడుతున్నారో! ఏం చేయాలో ఆలోచిద్దాంలే గానీ.. లేచి స్నానం చేసిరా‘ అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది. దుఃఖభారం తీరి లేచికూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తనభర్త ఫొటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒకపక్క కూతురి స్థితి, మరొక పక్క పక్షవాతంతో మంచంలో ఉన్న భర్త... ఏంచేయలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తోంది అనసూయకు. ∙∙ బ్యాంకులో పనిపూర్తి చేసుకుని గబగబా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి. ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తోంది. కానీ కనిపించటం లేదు. ‘రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను’ అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాప్ వైపు నడక సాగించింది. ఆరోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్‌కి ఆఫీసు నుంచి నేరుగా వెళ్లాలని అనుకుంది. కానీ ఆఫీసులోనే ఆలస్యమైపోతుండడంతో ఇంటికే వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. కామేశ్వరి, సరస్వతి ఇద్దరూ హై స్కూల్ నుంచీ మంచి స్నేహితులు. డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంటు ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి. ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతోంది. సరస్వతి.. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయక అమ్మా, నాన్న చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తూ పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకే హార్ట్ ఎటాక్‌తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన మూడు సంవత్సరాల కొడుకు భవిష్యత్తు కోసం కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది. బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి.. నిలబడే ఓపికలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది. ఆ బస్టాపులోనే కొంచెం దూరంలో.. చీకట్లో.. ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. వాళ్ల గొంతులను బట్టి ఒకరు ఆడ, ఇంకొకరు మగ అని అర్థమైంది. వాళ్ళని పరీక్షగా చూసింది సరస్వతి. చలికాలం కావడంతో ఆ ఇద్దరూ స్వెట్టర్లు వేసుకుని ఉన్నారు. అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడంలేదు. అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతుపెంచి అరుచుకుంటున్నారు. వాళ్ల వాదనా స్థాయి క్రమంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు. సరస్వతి వచ్చి బస్టాప్‌లో కూర్చోవడం ఆ మసక వెలుతురులో వాళ్ళు గమనించినట్లు లేదు. అమ్మాయి అనుకుంటా.. ఏడుస్తూ బతిమాలుతోంది ‘ప్లీజ్! నన్ను వదిలేయ్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి’ అంటూ. ‘ఈ అమ్మాయిలు ఎందుకిలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు? అసలు ఈ ఇద్దరు ఎవరు? ఎందుకు పొట్లాడుకుంటున్నారు? తను మధ్యలో వెళ్లి ఏం ఆడగ్గలదు?’ అనుకుంటూ తన బస్సు సంగతి మరచిపోయి వాళ్లనే చూడసాగింది సరస్వతి. ఇంతలో ఆ అమ్మాయి అతనికేదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ నాలుగడుగులు వేసింది సరస్వతి ఉన్న వైపు. ఆమె వెనుకే వస్తూ అతను జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడిచేయబోయాడు. అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తనకు దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది. ఆ వెంటనే అతని చేయి పట్టుకుని ‘హెల్ప్ హెల్ప్..’ అంటూ అరవసాగింది. అతను సరస్వతి చేతులను విదిలించుకొని పారిపోతుంటే, రోడ్డు మీద బైక్స్‌పై వెళ్తున్న వారు ఆమె అరుపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్ దగ్గరికి తీసుకువచ్చారు. ఈలోగా అతని చేతిలో నుంచి కింద పడిన వస్తువు ఏమిటాని సెల్‌ఫోన్ లైట్ ఆన్‌చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికి పోయింది. అది చాలా పదునుగా ఉన్న చిన్నచాకు. ‘అమ్మ బాబోయ్! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది!’ అనుకుంది సరస్వతి. కిందపడిన అమ్మాయిని ఎవరో చేయిపట్టి పైకి లేపారు. ఏంజరిగిందో తెలియని అయోమయస్థితిలో ఉందా అమ్మాయి. ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి.. షీ టీమ్స్‌కి, తనకి పరిచయమున్న మరొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు ఫోన్‌చేసి సమాచారమిచ్చి వెంటనే రావలసిందిగా కోరింది. ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు. పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది. కారులోంచి దిగిన లేడీపోలీస్ సరస్వతిని చూసి ‘మేడం ఏం జరిగింది?’ అని ప్రశ్నించింది. ఆ పోలీస్‌ని విష్ చేసి జరిగినదంతా వివరించింది సరస్వతి. ∙∙ ‘మేడమ్! నమస్తే. ఈరోజు న్యూస్పేపర్లో చూశా. ఎంత పెద్ద ప్రమాదం తప్పించారు మేడమ్! భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. వాళ్ళమ్మ, నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు. నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసుండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో!’ అంటూ ఆగకుండా మాట్లేడుస్తున్న సుజాతకేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి. ‘ఒకేచోట పనిచేస్తున్నా.. ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడమ్’ అంది. ‘నాదేం లేదమ్మా. నిస్సహాయులైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించి ‘ఆలంబన’ అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చి దానిలో సభ్యత్వం తీసుకున్నా. వారితో కలసి ఆడవాళ్లకోసం పని చేస్తున్నాను. నిన్న జరిగినది కొంచెం పెద్దవిషయం కాబట్టి ఆ న్యూస్‌తో పాటు నా గురించీ రాశారు.. అంతేనమ్మా’ అంది సరస్వతి తేలిగ్గా. ‘లేదు మేడమ్.. మీరెంతమంది లైఫ్ సేవ్ చేశారో, కొందరిని మీరెలా ఆదుకుంటున్నారో చాలా వివరంగా రాశారు మేడమ్’ ‘ఆడవాళ్ళకింకా.. ఇప్పటికీ చాలా సమస్యలుంటున్నాయమ్మా! వాటిని పరిష్కరించుకోలేకపొతే వారితో పాటు వారి తర్వాతి తరమూ నష్టపోతుంది’ ‘మేడమ్ మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లోనే నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా.. ధైర్యం గానూ ఉందండీ’ సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది. ‘ఓకే మేడమ్. లంచ్‌టైమ్‌లో కలుస్తా మళ్లీ! నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది’ అంటూ తన సీటువైపు నడిచింది సుజాత. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తనపని తాను చేసుకుపోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది. క్యాష్ కేబిన్‌లోకి వెళ్లిన సుజాత తనసీట్లో కూర్చుందే గాని మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయుంది. రెండు నిమిషాల తరువాత భారంగా ఊపిరి తీసుకుని ‘ఈరోజు లంచ్ టైమ్‌లో నా సమస్యను మేడమ్‌కి చెప్పి.. పరిష్కారం అడగాలి. ఆవిడయితేనే ఆ సమస్యను పరిష్కరించగలరు’ అనుకుంది. అలా అనుకోవడంతోనే మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది. ∙∙ రోజూ వచ్చే టైమ్ కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది. పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు కూడా. అనసూయ కూతురుకి ఫోన్ చేస్తే ‘మళ్ళీ చేస్తాను’ అంటూ కట్ చేసింది. ఆఫీసులో పని అవలేదా? లేక ఆ వ్యక్తి వల్ల మళ్లీ ఏదైనా సమస్య వచ్చి పడిందా? అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది. ఒకపక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనల్లో పడిపోయింది.. ‘పెళ్లి అయిన నాటి నుంచీ సమస్యలే తనకు. భర్తది గవర్నమెంట్ ఉద్యోగమని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లిచేశారు. అతనికి లేని దురలవాటు లేదని తెలుసుకునేసరికి పిల్ల కడుపున పడింది. కూతురు పెంపకం ఒకపక్క భర్తను ఎలాగైనా మార్చుకోవాలి.. అనే తపన ఇంకోపక్క... మానసికంగా, శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితిని ముందుంచింది. వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురు పెళ్లి జరిపించింది. అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తుండే వాడు. చాలా బుద్ధిమంతుడు. ఇంక అన్నీ మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షవాతం రావడం, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్లీ జీవితాలన్నీ చీకట్లోకి వెళ్లిపోయాయి. సుజాతకు అల్లుడి ఉద్యోగం ఇవ్వడంతో మనసుని రాయి చేసుకుని చేరింది. ఈ సమస్యలు చాలవన్నట్లు తన ఆఫీసులోనే పని చేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు..’ మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ. గేటుతీసిన చప్పుడవ్వడంతో ఒక్క ఉదుటున గదిలోంచి హాల్లోకి వచ్చింది అనసూయ. సుజాతతో పాటు వేరే ఆవిడ ఎవరో లోపలికి వస్తూ కన్పించారు. ‘అమ్మా.. ఈవిడ సరస్వతిగారు. పొద్దున పేపర్లో చూపించాను కదా ’ అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే. ‘నమస్తే. రండి రండి కూర్చోండి’ అంది అనసూయ సోఫా చూపిస్తూ. ఎప్పుడు దిగులుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడడం ఆశ్చర్యమనిపించింది అనసూయకు. ‘ఆమ్మా.. టైమ్ లేదు. మేడమ్ గేట్ దగ్గరి నుంచే వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికిరమ్మన్నాను’ అంటూ ఒక్క క్షణం ఆగి ‘అమ్మా.. నా ప్రాబ్లెమ్ మేడమ్‌కి చెప్పాను. ఇప్పుడు అతనింటి నుంచే వస్తున్నామిద్దరం. మేడమ్ చాలాబాగా హేండిల్ చేశారు. దెబ్బకి భపడ్డాడు వాడు. పరువుపోతుందని చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చాడు. రేపటి నుంచి ఆఫీసుకి లీవ్ పెట్టేస్తానన్నాడు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతానన్నాడు. అమ్మా! మేడమ్ అండగా ఉన్నారు. ఇకే సమస్యనైనా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా..’ ఉద్వేగంతో చెప్పింది సుజాత. ‘చాలా థాంక్స్ సరస్వతిగారూ.. మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు’ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకుని అంది అనసూయ. ‘అయ్యో! అంతమాట అనకండి. మనిషికి మనిషి సాయం అంతే. సుజాత బాగా సెన్సిటివ్. తన వెనుక ఎవ్వరూ లేరనుకుని వేధించసాగాడు. నేను వెళ్లేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు’ అంది సరస్వతి. ‘మేడమ్.. కొంచెం కాఫీ తీసుకోండి’ అంది సుజాత. ‘అయ్యో! ఇప్పుడెందుకమ్మా.. ఇంటికి వెళ్లిపోతాను కదా!’ ‘పర్వాలేదు మేడమ్.. కాఫీయే కదా తీసుకోండి. డిన్నరే చేసేసి వెళ్తే బాగుండేది. కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తూంటాడని అన్నారని అడగట్లేదు. మరొకసారెప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు’ అంది సుజాత. ‘ఓ.. తప్పకుండా! ఇంక వెళ్తాను’ అంటూ లేచింది సరస్వతి. ‘మేడమ్! ఆగండి.. క్యాబ్ బుక్ చేస్తాను. ఆ..అలాగే మా నాన్నగారిక్కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి’ అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత. మంచంలో పడుకొనున్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది. కాలు, చేయి చచ్చు బడిపోయి, మూతి వంకరైపోయి శున్యంలోకి చూస్తున్నట్టు రూఫ్‌కేసి చూస్తూ పడుకున్న అతడిని జాలిగా చూసింది సరస్వతి. ‘నాన్నా..’ అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్లి ‘ఈవిడ సరస్వతిగారు. మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు. ఈరోజు నాకు చాలా సాయం చేశారు. నన్ను ఇంటిదగ్గర దింపి వెళదామని వచ్చారు’ అని చెప్పింది సుజాత. అయన పైకప్పు నుంచి తన చూపును అతికష్టం మీద సుజాత వైపు, తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సారించాడు. ‘మేడమ్.. మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు’ అన్నది సుజాత. ‘ఆహా! అలాగా’ అంటూ అతడికేసి ఎక్కువసేపు చూడలేక అక్కడి ఆల్మరాలో సర్దిన ఫొటోలకేసి చూడసాగింది సరస్వతి. సుజాత వాళ్ళ పెళ్లిఫొటో చూసి ‘ఎంత చక్కగా ఉందో జంట. భగవంతుడికెంత ఈర్ష్య పుట్టిందో.. ఏమో! వీళ్లనిలా విడదీసేశాడు’ అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫొటో చూసింది. అది కొంచెం పాత ఫొటో. సుజాత తల్లి, తండ్రి అయి ఉంటారు. సుజాత తల్లి అప్పుడెంత అందంగా ఉందో! ఆవిడే ఈవిడ అంటే నమ్మేలా లేదు’ అని మనసులో అనుకుంటూండగా సరస్వతి చూపులను గమనించిన సుజాత.. ‘అది .. అమ్మానాన్నది. అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానట’ అంది నవ్వుతూ. సరస్వతి కూడా సుజాతకేసి చూసి నవ్వి మళ్లీ ఆ ఫొటోవైపు చూసింది. ఈసారి ఆ ఫొటోలో ఉన్న మగ వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. ఇంకా పరీక్షగా చూసింది. ఫొటోకేసి మంచంలో ఉన్న వ్యక్తికేసి మార్చి మార్చి చూడసాగింది. అతడు నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు. అతడి కంటి చివర నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తుడవసాగింది. ఒక్కసారిగా ‘నేను వెళ్తానమ్మా’ అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి. ‘మేడమ్.. ఉండండీ.. క్యాబ్ బుక్ చేస్తాను’అని సుజాత అంటుండగానే ‘వద్దమ్మా.. నేను ఆటోలో వెళ్ళిపోతాను’ అని బదులిస్తూ ‘వెళ్ళొస్తానండి’ అంటూ అనసూయకూ చెప్పి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోను అపి ఎక్కేసింది సరస్వతి. ‘చాలా థాంక్స్ మేడమ్’ అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తూండగానే ఆటో బయలుదేరిపోయింది. సరస్వతికి చాలా అసహనంగా ఉంది. సుమారు ఇరవైఎనిమిది సంవత్సరాల కిందట.. ఒంటరైన తనని వేధించి మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి కూతురు గురించా తను ఆలోచించింది? భర్త పోయిన దుఃఖంలో తానుండి.. భుక్తి కోసం తనకిచ్చిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటుంటే వెకిలి మాటలతో వేధించాడు. ఆ చిన్న వయసులో ఇతడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది. తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయట పడింది. పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది. తనను పెట్టిన బాధకి ఈ రోజు అంతకంతా అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది. అమ్మాయి సమస్యలో ఉన్నాను అన్న వెంటనే పరుగెత్తింది. ఈ అమ్మాయి ఎవరో.. ఏమిటో తెలుసుకోకుండా! ‘మేడమ్ ఎటు వెళ్లాలో చెప్పండి’అన్న డ్రైవర్ మాటలకి ఆలోచనల నుంచి బయటపడి తన ఇంటి దారి చూపింది. ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటకు వచ్చాడు. ‘వచ్చావా? ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా’ అంటూ సరస్వతి వాలకాన్ని గమనించి ‘అన్ని పనులతో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నట్టున్నావమ్మా..’ అన్నాడు. ‘అదేం లేదురా! పద లోపలికి. తొందరగా వంట చేస్తాను. ఇప్పటికే లేట్ అయింది’ అంది లోపలికి నడుస్తూ సరస్వతి. ‘అమ్మా! అన్నీ సిద్ధం చేసేశాను. నువ్వు ఫ్రెషైరా.. ఈ లోపు భోజనం వడ్డించేస్తాను’ అన్నాడు రఘు. ఆ మాటలతో తేలికపడిన మనసుతో స్నానానికి వెళ్లింది సరస్వతి. అన్నట్టుగానే తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిపెట్టాడు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరూ. ‘అమ్మా.. నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలేవీ నీకు చెప్పనే లేదు’ అన్నాడు కూర కలుపుకుంటూ. ‘ఆ! అవును కదా.. చెప్పు ఎలా జరిగిందో’ అడిగింది నోట్లో ముద్దపెట్టుకుంటూ. ‘ఎంత బాగా మాట్లాడారో ఆంటీ! ఆవిడ చేసిన వర్క్‌లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరూ. లెక్కలు ఖచ్చితంగా చూస్తారట. ఆవిడ వర్క్ చేశారంటే పై ఆఫీసర్స్ కళ్ళు మూసుకుని ఫైల్ ప్రోసెస్ చేసేయొచ్చుట. అందరూ ఆవిడని తెగ పొగిడారు తెల్సా!’ ‘అవునురా.. చిన్నప్పుడూ అంతే. చాలా బాగా చదివేది. ఎప్పుడూ క్లాస్ ఫస్టే!’ సరస్వతి. ‘ఆహా! ఆవిడా మాట్లాడుతూ అదే చెప్పారు.. బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకునే వారట. కానీ ఇంటర్లో తొంభయ్ మార్కులు వస్తాయనుకున్న పేపర్లో తొమ్మిది మార్కులు వచ్చాయట. ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్‌కి అప్లై చేసుకో అన్నారట. కానీ డబ్బుల్లేక చేసుకోలేక పోయారట’ ‘అప్పట్లో ఆడపిల్లలం అందరం ఆర్ట్స్ గ్రూప్‌లోనే చేరేవాళ్లం. కానీ తను మాత్రం పట్టుబట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇంజనీరింగ్ చదవలేక పోయానని అప్పట్లో బాధపడేది’ ‘ఆ .. కానీ ఇప్పుడు ఆవిడ మంచికే ఆలా జరిగిందన్నారమ్మా అంతా! 90మార్కుల ప్లేస్‌లో తొమ్మిది మార్కులు పడడం వల్ల తనలా ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట. పైగా తాను ఇంజనీర్ కాలేకపోయినా ప్రాజెక్ట్స్ వర్క్స్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీర్స్‌కి అమౌంట్ రిలీజ్ చేసేవారట. 90 మార్కుల స్థానంలో 9 మార్కులు వేసే భగవంతుడు నేను చేయాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా! ఎంత పాజిటివ్‌గా ఆలోచించారో!’ రఘు మాటలకి తలూపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు ఆలా ఉండిపోయింది. భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావడంతో తన గదిలోకి వెళ్ళి పోయాడు . ‘నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆరోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు. ఈనాడు తను చేసే చిన్నిసాయంతో ఎంతమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను. నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది. పాపం! ఇందులో సుజాత తప్పేముంది? తనను అనవసరంగా తిట్టుకుంది.. సుజాతకి చేసిన సాయానికి! తనూ సాటి మహిళూ కదా! చాలా తప్పుగా ఆలోచించింది. అతను చేసిన పాపానికి మంచానపడి అనుభవిస్తూనే ఉన్నాడు. సుజాత తండ్రి ఫొటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమనుకుందో’ అనుకుంటూ ఫోన్ తీసుకుని సుజాతకి రింగ్ చేసింది. రెండో రింగ్ కే అవతల ఫోన్ ఎత్తినా చాలా గోలగా వినిపిస్తోంది. ఒక్కసారిగా భయంవేసింది సరస్వతికి. ‘తన ముందు తప్పై పోయిందని చెప్పిన అతను ఆ తరువాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేస్తున్నాడా? లాభంలేదు అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి’ అనుకుంటున్నంతలో ‘హలో మేడం!’ అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు. ‘ఏమ్మా!ఏం జరిగింది?’ ‘మేడమ్ మీరు వెళ్ళాక..’ ‘ఆ! ఏమైంది?’ ‘గోడమీది రెండుచేతులు జోడించి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న. మీరుండగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతికష్టం మీద మీరు వెళ్లిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేస్తూ ప్రాణాలు వదిలేశారు మేడమ్. నేను, అమ్మా నా సమస్య గురించి కూడా ఆయనకు ఏమీ చెప్పలేదు. మేమిప్పుడు మా ఊరు వెళ్లిపోతున్నాం మేడమ్’ దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత. ‘అయ్యయ్యో! ఎంతపని జరిగింది? అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే చెప్పమ్మా’ ‘తప్పకుండా మేడమ్. ఊర్లో మా పెద్దనాన్న గారు వాళ్ళున్నారు. అక్కడికి వెళ్లిపోతున్నాం ఇక్కడి మా బంధువులు కొందరు వచ్చారు. బ్యాంక్‌కి పదిహేను రోజులు సెలవు అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి మేనేజర్‌గారికి చెప్పండి. ఉంటాను మేడమ్’ సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్చింది ‘పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది’ అనుకుంటూ. - ఈశ్వరి చదవండి: మరోకథ: ఎండ గుర్తు చదవండి: ఈవారం కథ: ఎదురు చూపులు -
ఈవారం కథ: ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. మనసా
‘ప్రయాణీకులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 12728, హైదరాబాద్ నుండి ఖాజీపెట్, విజయవాడ మీదుగా విశాఖపట్టణం వెళ్ళవలసిన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒకటవ నంబరు ప్లాట్ ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది’ మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా బాధ్యత అన్నట్టు వరుసగా మూడు భాషల్లోనూ చెప్పింది ఆటోమేటెడ్ రైల్వే అనౌన్సర్. ‘త్వరగా నడువ్ మొద్దూ.. రైలు కదిలిపోతుంది’ ఆమెని లాక్కెళుతున్నట్టు పెద్దపెద్ద అంగలతో వేగంగా నడుస్తున్నాడు భర్త. ‘కొంచెం మెల్లగా నడవండీ..’ కాళ్లకి అడ్డుపడుతున్న చీరని పైకి లాక్కుంటూ అతని వెనక పరిగెడుతున్నట్టు నడుస్తోంది ఆమె. ‘ప్రయాణాల్లో కూడా ఈ వెధవ చీరలెందుకు? ఏ పంజాబీ డ్రెస్సో వేసుకుని చావక’ విసుక్కున్నాడు. ‘అత్తయ్యగారికి నచ్చదు కదండీ’ అంది పుస్తకాల కొట్టువైపు చూస్తూ.. కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనుకుని. ‘ఆ కాడికి మేమంటే ఏదో పెద్ద భయమున్నట్టు! బస్సులో వెళ్లి ఏడవమంటే వాంతులు అదీ ఇదీ అని వంకలు’ వచ్చే పోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న బోగీ కోసం వెతుకుతున్నాడు. ‘జనరల్ ఇటు పక్క అనుకుంటా అండీ..’ వెనకకు చూపించింది.. జారిపోతున్న బ్యాగ్‌ని భుజం మీదకి లాక్కుంటూ. ‘నాకు తెలీదా? చూశావా ఎంత జనమో? నువ్వెళ్ళి జనరల్‌లో కూచుంటే ఏ దొంగ వెధవో అర్ధరాత్రి వేళ ఆ మెళ్ళో ఉన్న సూత్రాలతాడు కాస్తా లాక్కెళ్లిపోతాడు. నీకసలే పడుకుంటే ఒళ్ళు తెలీదు.’ ‘ఈ బోగీ కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండీ’ ‘అందులో బొత్తిగా ఆడవాళ్లు లేరు. ఇదిగో ఇందులో ఎక్కు. త్వరగా’ ట్రైను తలుపు దగ్గర కంబీని పట్టుకుని, రిజర్వేషన్ బోగీలో ఆమెని ఎక్కించేశాడు. రైలు మెల్లగా కదిలింది. ‘ఏవండీ పిల్లలు జాగ్రత్త. చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండి’ చేతిని పట్టుకుంది. ‘ఎన్నిసార్లు చెప్తావ్? వెధవ నస. టీసీ వస్తే అత్యవరసరం ఉండి బయల్దేరాను, సీటు దొరకలేదని చెప్పు. ఫైన్ కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు. సీటు దొరికితే నిద్రపోకు. బండి ఎక్కడా ఎక్కువ సేపు ఆగదు’ కంబీని వదిలేస్తూ ఆమె చేతిని కూడా విడిపించుకున్నాడు. ‘ ఏవండీ.. టిక్కెట్టు మీ జేబులో ఉండిపోయింది ’ గట్టిగా అరిచింది. అప్పటికే రైలు ప్లాట్ఫారం దాటేసింది. నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయల్దేరిన రైలు సికింద్రాబాద్ వచ్చేసరికి ప్రయాణికుల యాత్రా బస్సులా నిండిపోయింది. ‘ఈ సీట్లో ఎవరైనా ఉన్నారాండీ?’ ఖాళీ సీటుకోసం వెతుక్కుంటూ వచ్చి అడిగింది ఆమె. బెర్త్‌పైకి వేలు చూపించాడు అతను. మొహం మీద తడి తువ్వాలు కప్పుకుని గురక పెట్టి పడుకున్నాడో మనిషి. ‘ఓహ్’ నిరుత్సాహంగా కిక్కిరిసిన కంపార్ట్మెంట్ అంతా వెతికింది చోటు కోసం. ‘ఆయన ఇప్పట్లో లేచేలా లేడు. మీరు కూర్చోండి’ మరోసారి పైకి చూసి నిర్ధారించుకున్నట్టు చెప్పాడు. ‘థాంక్స్’బ్యాగ్‌ని సీటు కింద పెట్టి కూర్చుంది. గ్రీష్మ తాపం ఇంకా చల్లారలేదు. కిటికీలోంచి బైటికి చూస్తోంది. అలసట వల్లో, ఆలోచనల బరువు వల్లో గానీ ముఖం వాడినట్టు తెలుస్తోంది. సంధ్య సూరీడు వెళ్ళడానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లని నిప్పులు కురిపిస్తున్నాడు. ఆమె కళ్ళలో సన్నని కన్నీటి పొర. చాలా సేపటి నుంచి గమనిస్తున్న అతను.. తను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకి అడ్డుపెట్టాడు. ఆమె గమనించే స్థితిలో లేదు. ‘వాటర్ బాటిల్.. అక్కా.. వాటర్ బాటిల్ కావాలా?’ మొహం మీద బాటిల్ పెట్టి అడిగాడు కుర్రాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైగ చేసింది. ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ తీసి చూసుకుంది. ఏడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కంగారుగా కాల్ చేసింది. ‘హలో.. ఫోన్ సైలెంట్లో ఉంది చూస్కోలేదండీ’ ‘...’ అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో గానీ గొంతు గట్టిగానే వినిపిస్తోంది. ‘మీరే కదండీ టికెట్ నా దగ్గరుంటే పడేస్తానని, రైలెక్కే ముందు గుర్తు చెయ్యమన్నారు?’ నెమ్మదిగా అంది ఫోన్ వాల్యూమ్ తక్కువగానే ఉందో లేదో అని మరోసారి చూసుకుంటూ. ఏదో అరిచి ఫోన్ పెట్టేసింది అవతలి గొంతు. నిట్టూర్చి ఫోన్‌ను బ్యాగ్‌లో పడేసింది స్విచ్ ఆఫ్ చేస్తూ. ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి. ఈసారి ఆ భారానికి భయం తోడైంది. బోగీ అంతా గోలగా ఉంది. ‘ఈ పుస్తకం మీరు చదివేస్తే ఇస్తారా?’ అడిగింది అతని చేతిలోని మ్యాగజైన్‌ని చూస్తూ. ఇచ్చాడు. ‘థాంక్యూ’ గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది ‘పెన్ను ఇస్తారా?’ సైగ చేసింది అతని జేబుని చూపిస్తూ. ఇచ్చాడు ఫోన్లో పాటలు వింటున్న అతను. ‘టీసీ వచ్చి టిక్కెట్టు చూపించమంటే ఏం చెప్తారు?’ కిటికీలోంచి బైటికి చూస్తూ అడిగాడు. ‘మీకెలా తెలుసు’ అన్నట్టు చురుక్కుమని చూసింది. ‘సారీ.. మీరు ట్రైన్ ఎక్కగానే ఎవరినో అడుగుతున్నారు కదా? నేను ఇటు వైపు తలుపు దగ్గర ఉన్నాను’ ‘మ్.. మా ఆయన.. టికెట్ ఇవ్వడం మర్చిపోయాడు’ ‘మరిప్పుడెలా? ఫైన్ కట్టేస్తారా?’ ‘సీటు ఇస్తా అంటే ఆలోచిస్తాను. అయినా ఏమైతే అదవుతుంది. చూద్దాం’ పజిల్ సగం సగం గడులు నింపేసి పెన్నుని అతనికి ఇచ్చేసింది. ‘మీకు ధైర్యం ఎక్కువే’ అన్నాడు పెన్ను జేబులో పెట్టుకుంటూ. ‘ధెర్యానికి డబ్బులు అక్కర్లేదు కదండీ’ మొదటిసారి నవ్వింది. రైలు ఖాజీపేట దాటింది. ‘కుదరదయ్యా. వచ్చే స్టేషన్లో దిగి జనరల్లోకి వెళ్లిపో. మళ్ళీ నిన్ను ఇక్కడ చూస్తే ఫైన్ రాసేస్తాను’ రుసరుసలాడి పోతున్నాడు టీసీ. అతని వెనక నలుగురైదుగురు కుర్రాళ్లు.. సీటు కోసం వెంటపడుతుంటే విసుక్కుంటూ టిక్కెట్లు చెక్ చేస్తున్నాడు. ‘సైడ్ లోయర్ అండీ’ .. టికెట్ చూపించాడు అతను. ‘అమ్మా మీది?’ అంటూ ఆమెను టికెట్ అడిగి ‘ బాబూ లేవండి టికెట్ చూపించండి’ అంటూ పైన పడుకున్న మనిషిని తట్టి లేపాడు. తనని కాదన్నట్టు బయటకు చూస్తున్న ఆమె ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు అతను. ‘అమ్మా’ గట్టిగా పిలిచాడు టీసీ. ఆమెలో చలనంలేదు. ‘ ఆవిడ’ ఏదో చెప్పబోయాడు అతను. ‘సార్.. మీ వైఫా? కళ్ళు తెరచి నిద్రపోతున్నట్టున్నారు. ఆరేసీయా? సీట్లు లేవు. మీరిద్దరూ సద్దుకుంటానంటే నాకేం అభ్యతరం లేదు’ చెప్పేసి వెళ్లిపోయాడు టీసీ. కాసేపు నిశ్శబ్దం. కొంగు నోటికి అడ్డుపెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకుటోంది ఆమె. ‘అలా ఎలా కూర్చున్నారు? మీకు భయం వెయ్యలేదా?’ టీసీ వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు. ‘వెయ్యలేదా? రైలు చప్పుడు కన్నా గట్టిగా కొట్టుకుంది నా గుండె’ ‘ఇందాక ధైర్యం, డబ్బులు అని ఏదో అన్నారు?’ ‘వాటన్నిటికన్నా చెడ్డది ఒకటి ఉంది. పరువు అనీ.. ఆ బరువునెందుకు మోస్తామో తెలీదు’ ‘పోన్లెండి..గండం గట్టెక్కింది’ ‘సారీ.. మరో దారి లేక’ ‘పరవాలేదు’ ‘మీ భోజనం?’ అడిగింది తను తెచ్చిన చపాతీల పొట్లం తెరుస్తూ. ‘విజయవాడలో చూస్తాను’ ‘నేను ఎక్కువ తెచ్చాను’ అంటూ అతనిచ్చిన పుస్తకం మధ్యపేజీ చించి రెండు చపాతీలు వేసింది. కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయి అవి. కూర డబ్బా తెరవగానే గుప్పుమంది వాసన. ‘థాంక్యూ’ అందుకోబోయాడు. ‘అయ్యో.. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసాను. కూర పాడైపోయింది. ఈ పూట నాక్కూడా పస్తే’ జాలిగా అతని వంక చూసింది. కళ్ళు పెద్దవి చేస్తూ భుజాలెగరేశాడు. తెచ్చిన భోజనం చెత్తకుప్పలో పడేసింది. ఫోన్ స్విచ్ ఆన్ చేసి రెండు నిముషాలు ఆలోచించి డయల్ చేసింది. ‘ఏవండీ.. పిల్లలేం చేస్తున్నారు? తిన్నారా?’ అని అడిగింది. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతలి గొంతు. ‘అత్తయ్య ఏమైనా ఫోన్ చేశారా? కాలు ఎలా ఉందిట? నేను చేస్తే తియ్యలేదు ఫోను’. పొడిపొడిగా వినిపిస్తున్నాయి అవతలి మాటలు. అర్ధరాత్రి దాటింది. హ్యాండ్ బాగ్ మీద తల వాల్చుకుని భుజాల మీదుగా పవిట కప్పుకుని పడుకోడానికి ప్రయత్నిస్తోంది ఆమె. అటూ ఇటూ కదలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు.. కిటికీ లోంచి వస్తున్న వెలుగుకి మెరుస్తున్నాయి. మసక మసకగా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెని గమనించాడు అతను. పొందిగ్గా కట్టుకున్న సాదా నేత చీర, ముఖం మీద పడుతున్న జుత్తు, మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు.. తనను చూస్తుందేమోనని భయపడ్డాడు. పక్కనుంచి వేగంగా వెళ్లిన రైలు చప్పుడుకి ఉలిక్కిపడి లేచింది ఆమె. ఎదురుగా అతను కనిపించలేదు.మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. పక్క బెర్త్‌లో పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గురక పెడుతున్నాడు.ఎదురుగా పైన ఎవరో కుర్ర జంట. ఊసులు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు.లేచి అతని కోసం వెతికింది. తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘వెళ్లే రైల్లో రాయడం అంటే ఇసుకలో పిచ్చి గీతలు గీసినట్టే. నా రాతలా వంకరటింకరగా ఉంటాయి’ ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా. ‘అయ్యో ఇక్కడ కూర్చున్నారేంటి?’ ఖాళీ జామపళ్ళ బుట్టలో ఉన్న పాత దిన పత్రికని అడిగి తీసుకుని ఆమెకిచ్చాడు. ‘నాకు తలుపు దగ్గర కూర్చోవడం ఇష్టం అండీ. కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. మీకు పెళ్లైందా?’ దినపత్రికని పరచి దానిపై కూర్చుంటూ అడిగింది. ‘హా..చేశారు’ అర్థం కానట్టు చూసింది. ‘నా మరదలే’ బైటికి చూస్తూ చెప్పాడు. ‘అదృష్టవంతులు. పెద్ద వాళ్ళు చేసిన పెళ్లిళ్లే ఉత్తమం.అందునా వరసైన వాళ్ళైతే గొడవే లేదు’ ‘ఆ గొడవలే ఇక చాలని, తెంచేసుకుని తిరిగి వెళుతున్నా’ పుస్తకం మూశాడు అప్పటి వరకూ తను రాసుకుంటున్న పేజీ చివరను మడత పెడుతూ. ‘మ్..’ ‘చిన్న చిన్న గొడవలండీ.. మేనల్లుడినని మా అత్తామామకి లోకువ. తనకేమో వాళ్ళ గారాబం. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ప్రత్యేకంగా ప్రేమ ఎలా చూపిస్తాను? రోజూ నరకం. ఒకళ్ళకొకళ్లం ఇష్టంలేని బంధమన్నట్టుంది’ ‘మీ తప్పేం లేదా?’ ఆమె ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు. ఊళ్ళని, చెట్లని పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు. తలుపు దగ్గర నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తోంది. చందమామను చూసి ఫక్కున నవ్వింది.. ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఏమీ లేదన్నట్టు నవ్వింది. ‘మీ వారు గుర్తొచ్చారా?’ అడిగాడు. ‘అలాంటిదే’ జుత్తుని చెవుల వెనక్కి తోసింది. ‘మీది ప్రేమ వివాహమా?’ అడిగాడు. ఏమీ మాట్లాడలేదు ఆమె. అనవసరంగా అడిగా అనుకున్నాడు అతను. ‘పదిహేడేళ్ళకి ప్రేమే అనిపించింది. ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్పనిపించింది’ ‘మరిప్పుడు?’ ‘నలుగురు మనుషులుండే మూడు గదుల ఇంట్లో.. వారం పది రోజులకి ఒకసారి ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి. తొలికోడి కూసేలోపు నశించిపోతుంది’ ‘సారీ.. మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది’ ‘అన్నీ బావున్నప్పుడు సరే గానీ, లేనప్పుడే ఎటు తిరిగి ఎటు వచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్లి నిల్చుంటాం. గతంలోని మనం వర్తమానంలోని జీవితానికి ఎప్పటికీ సమాధానంలేని ప్రశ్నలమే’ ‘ప్రేమ వివాహం అంటే ముందు నుంచీ అన్నీ తెలిసే చేసుకుంటారు కదా? ఏదైనా సమస్య ఉంటే మీరు, మీ వారు కూర్చుని మాట్లాడుకుంటే...’ ‘ మీ కాపురం గురించి ఏమైనా సలహా ఇచ్చానా? ఒక్కసారి మీ అత్తా మామలతో కాకుండా ఆమె మనసులో ఏం ఉందో కనుక్కోమని చెప్పానా? ఏదో సందర్భం వచ్చింది అని ఆపుకోలేక బయటకి చెప్పేశాను. ప్రతీవాడికీ తనకన్నా పక్కవాడి బతుకే బావుందనిపిస్తుంది. రైలు సాఫీగా నడవాలంటే పట్టాలకు ఆసరాగా ఉన్న రాళ్లెంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం.ఆ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునే వాడికి తెలుస్తుంది. తెంచుకుని వచ్చేసిన మీకేం తెలుస్తుంది?’ చురుక్కున చూశాడు ఆమె వంక. చాలాసేపటివరకూ ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడమనిషి తన పిల్లని పెట్టుకుని పడుకుంది. లేపాలనిపించలేదు ఆమెకు. తన పిల్లలు గుర్తొచ్చారు. ఫోన్‌తీసి టైం చూసుకుంది. ఇంకా మూడుగంటల ప్రయాణం. మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చింది. అతను అలా శూన్యంలోకి చూస్తున్నాడు. వచ్చి కూర్చుంది. కాళ్ళని మడిచి పెట్టుకుని మెట్టెలని వేలిచుట్టూ తిప్పుతూ కిందకి చూస్తోంది. ఆ అలికిడి ఆమె వైపు తిరిగాడు. ‘సారీ..’ ఒకేసారి చెప్పుకున్నారు ఇద్దరూ. నవ్వుకున్నారు. ‘మరోలా అనుకోవద్దు. మీరు నవ్వితే పడే సొట్టలు బావున్నాయి. మగవారికి అరుదుగా ఉంటాయి. సొట్టలు పడితే అదృష్టం అంటారు’ ‘మ్’ ‘ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తారు?’ ‘చిన్న వ్యాపారం. అప్పుడప్పుడు పత్రికలకి కథలు రాస్తుంటాను. మీరేం చేస్తుంటారు?’ ‘ఇద్దరు పిల్లల తల్లిని. దిగువ మధ్యతరగతి భార్యని. బహుశా నా ఉనికిని వెతుక్కుంటున్నానుకుంటా. ఉద్యోగం చెయ్యడం మా వారికి ఇష్టం లేదు..’ ‘నా మరదలికి ఉద్యోగం చెయ్యాలని ఆశ. నాకన్నా కూడా చాలా తెలివైంది తను. కానీ ఇప్పుడు..’ ‘ఆశలు పడటమే మనిషి చేయగలిగేది’ ‘మీ గొంతు, మీ మాటలు బాగున్నాయి. నేను కాదు మీరు రాయాలి కథలు..’ ‘కొద్దిగా సంగీత జ్ఞానం ఉంది లెండి. ప్రేమించుకునే రోజుల్లో నాతో సినిమాల్లో పాటలు పాడిస్తా అనేవాడు మా ఆయన. ఇప్పుడు జోల పాడినా విసుక్కుంటాడు’ అంది చీర కొంగుని దగ్గరగా చుట్టుకుంటూ. ‘ఈ విసుగుకీ ప్రేమకీ చాలా దగ్గర సమ్మంధం ఉందండోయ్. మెత్తగా ఉంటే చులకనైపోతా అని విసుగు నటిస్తా నేను’ అన్నాడు. ‘విసుగు మొహం చూస్తేనే దగ్గరకి వెళ్లాలనిపించదు నాకు. అందుకే కాస్త విసుక్కోగానే ఏడుపు వచ్చేస్తుంది’ ‘అసలు నాకు తెలియక అడుగుతాను.. ఏం చెప్పినా నీ కోసం, మన కోసం అని ఎందుకు ఆలోచించరు?’ ‘ప్రేమగా చెప్తే ఎందుకు వినను? బుజ్జగించాల్సిన అవసరం లేదు. కానీ నా అభిప్రాయాలకూ విలువిస్తున్నారని నాకు నమ్మకం కలగాలి కదా?’ ‘అందరిలా ప్రేమని పైకి చూపించలేను. అర్థం చేసుకునే మనసుంటే నా ప్రతిచేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది. అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేనిలాంటి వాడిని అని తెలుసుకోలేకపోతే ఇంక మన బంధానికి అర్థం ఏం ఉంది?’ ‘పెళ్ళికి ముందు నువ్వు, పెళ్లయ్యాక మీరుగా మారిపోయావు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చోపెట్టావు’ ‘మన మధ్యన ఉన్న దగ్గరితనం బయటి వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం ఏం ఉంది? బయట పని చెయ్యడం అంటే ఎన్నో ఒత్తిళ్ళని తట్టుకోవాలి. ఆ కష్టం నీకెందుకు అని! అయినా నా కన్నా నువ్వు తెలివైన దానివని సిగ్గు లేకుండా ఎన్నో సార్లు ఒప్పుకున్నాను’ ‘సరె.. ఇక నుంచి నువ్వు ఆ విసుగనే ముసుగు వేసుకోకుండా ఉండయితే నా కోసం’ ‘నువ్వు అన్నిటికీ ఆ ఏడుపు ముసుగు వేసుకోకు అయితే. ఇది నా కోసం..’ ఈ సారి ఆమె చూపులు అతని చూపులని కలిశాయి. ‘సార్.. ఇక్కడ కూర్చోకూడదు. వెళ్లి లోపల కూర్చోండి. పదండమ్మా’ వెనక నుంచి రైల్వే పోలీసు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పాడు. అందమైన కలల కొలనులో రాయి పడి చెదిరినట్టనిపించింది. కాసేపు ఏమీ మాట్లాడుకోలేదిద్దరూ. రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది.. ‘గోదావరా?’ అప్పటిదాకా ఎదురుగా కుదురుగా ఉన్న ఆమె వచ్చి పక్కన కూర్చుంది. అతను ఊహించలేదు. గాలి వారి ఇద్దరి మధ్యనుంచి కొంచెం కష్టపడి తప్పించుకు వెళ్తోంది. ‘జాగ్రత్త.. పడతారు’ తన చేతిని ఆమె కాళ్ళకి అడ్డుపెడుతూ కంబీని పట్టుకున్నాడు. ‘చిల్లరుంటే ఇస్తారూ? నా బ్యాగ్ అక్కడ వదిలేశాను’ ‘మ్..’ ‘గోదారమ్మని చూస్తే భయం ఎందుకండీ.. నా తల్లి..’ దణ్ణం పెట్టుకుని చిల్లర వేసింది. చల్లని గాలి మనసుని,ఆలోచనల్ని కూడా శుద్ధి చేస్తున్నట్లుంది. ‘ఇదిగో.. టీసీ అడిగితే ఈ టిక్కెట్టు చూపించండి. విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు ఇద్దామంటే’ ‘మొద్దు నిద్ర నాది. థాంక్యూ.. మీకు నేను నూట ముప్పై ఆరు రూపాయలు బాకీ. ఇందాకిచ్చిన చిల్లరతో కలిపి’ టిక్కెట్టు తీసుకుంటూ గమనించింది అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు. అతని భార్య పేరు కావొచ్చు. రాజమండ్రి దాటింది. మాటల్లో మునిగిపోయారు. చలం సాహిత్యం నుంచి రఫీ పాటల మీదుగా, కోఠీలో చవగ్గా దొరికే చిన్నా చితకా వస్తువులని దాటుకుని, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడిని పలకరించి భీమిలి బీచ్‌లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది. అలాగే కూర్చున్నారు ఇద్దరూ. అప్పుడప్పుడు ఆమె జుత్తు అతని ముఖం మీద పడుతోంది. ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది. ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం. రేపటికి ఏదో భరోసా దొరికిన భావన. మన తప్పొప్పుల్ని వివరించి చేప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్లుంది ఇద్దరికీ! ముఖం కడుక్కుంటూ అద్దంలో తనని తాను చూసుకున్నాడు. ఏదో కొత్తగా మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తోంది. అద్దంలో దూరంగా అతని వెనక ఆమె. వెళ్లాల్సిన చోటు దగ్గరవడంతో బ్యాగ్ సర్దుకుంటోంది. ఉన్నట్టుండి గుర్తొచ్చింది.. ఆమె పేరైనా అడగలేదు. బండి ఆగింది. దిగి నడుస్తోంది. వెనక్కి తిరిగి చూడలేదు ఆమె. వర్షపు నీటిగుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంది. ‘ ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. ఎంతో యేమో యెవరికి దెలుసునో?’ అన్నవరం స్టేషన్లో టీ కొట్లోంచి త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది. వింటున్న ఆమెలో తృప్తి్తతో కూడిన చిన్న చిరునవ్వు. అతను తన మరదలికి ఫోన్ చేశాడు. లేచినట్టు లేదు ఇంకా. పుస్తకం తెరిచాడు.. రెండు వంద నోట్లు. బాకీ తీర్చేసింది కాబోలు. ఆమె సగం పూర్తి చేసిన పజిల్ పూర్తి చెయ్యడం ప్రారంభించాడు అతను. రైలు కదిలేసరికి ఆఖరు గడి పూర్తయింది.. ‘సీత’ అన్న అక్షరాలతో. బహుశా అతని తర్వాత కథ కావచ్చు. మెల్లగా ఆమె కనుమరుగైంది!!!! -రవి మంత్రిప్రగడ -
ఈవారం కథ: వాసన
టీ ఇచ్చింది. నీలిరంగు పూలున్న కప్పులో గాఢంగా నిండి, తీరం చేరని అలలాగా పలుచటి మీగడ కట్టిన టీ. ‘ఊ.. పీల్చండి.. ఆలస్యం ఎందుకు?’ అంది. తలెత్తి చూశాడు. ఆమె వెళ్లాక ఎలాగూ చేస్తాడు. ముందే చేయమంటోంది. వాసన చూశాడు. టీ వాసన. ‘వచ్చిందా?’ ‘ఊ’ ‘అంతా బాగైపోయాము. వొడ్డున పడ్డాము. పద్నాలుగు రోజులైపోయి ఇవాళ్టికి మూడు వారాలు గడిచాయి. పదో రోజుకే మనకు వాసన తిరిగి రాలేదూ. నీకొచ్చిందా అంటే నీకొచ్చిందా అని అనుకోలేదూ. మీ కళ్లకు తుండు గట్టి పసుప్పొడి వాసన చూపిస్తే మీరు ముక్కుకు దగ్గరగా పట్టి పసుప్పొడి అని చెప్పలేదూ. ఇంకా ఏమిటండీ ఈ ఆరాటం మీకూ నాకూ. అదున్నప్పుడు బానే ఉన్నారు. దాన్ని తరిమిగొట్టారు. తీరా నెగెటివ్ అని రిపోర్టు ఇద్దరం చూసుకుని చీమ కుట్టినంత కష్టమైనా లేకుండా కనికరించావు దేవుడా అనుకుని తెరిపిన పడుతుంటే ఏం జబ్బు చేసింది మీకు? వాసన పోయినట్టుగా వాసన లేనట్టుగా వాసనే రానట్టుగా ఉలికులికిపడుతున్నారు. ప్రతిదాన్ని వాసన చూస్తున్నారు. ఉందా... ఉన్నట్టే ఉందా అని నన్ను పీక్కు తింటున్నారు. అయ్యో... ఎక్కడికైనా పారిపోదామంటే ఏ ఇంటికీ వెళ్లలేని ఈ పాపిష్టి రోజులు’... ఇక అక్కడితో విసురుగా వెళ్లాలి లెక్కప్రకారం. కాని టీ తాగేదాకా ఆగి కప్పు తీసుకెళ్లిపోయింది. పదిహేను రోజులు అఫీషియల్ సెలవులిస్తారు ఆఫీసులో పాజిటివ్ రిపోర్ట్ పంపితే. ఇంకో పదిహేను రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆ పదిహేను రోజులూ అయిపోయాయి. ఫటీగ్గా ఉంది ఇంకో పదిరోజులు ఇవ్వండి అని కోరాడు. అవీ ముగిసి రేపో మర్నాడో వెళ్లాలి. లేదంటే నీకూ మాకూ చెల్లు అన్నా అంటారు. చిన్న బెడ్రూమ్ నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులు అయిపోయాయన్న మాట. యూట్యూబ్‌లోకి దిగి ఉంటారు. పోయిన సంవత్సరం న్యూస్ మొదలై హటాత్తుగా లాక్డౌన్ వచ్చినప్పుడే తీసుకోదగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుందాం అని ఇద్దరూ అనుకున్నారు. లాక్డౌన్లు ముగిసి జనం మాస్క్‌లు కట్టుకుని, షాపులకు పాలిథిన్ షీట్లు వేళ్లాడేసి, తాళ్లు అడ్డం కట్టి బేరాలు మొదలెట్టాక... మాస్క్, మాస్క్ మీద షీల్డ్ పెట్టుకొని ఐకియాకు వెళ్లి రెండు చిల్డ్రన్స్ బెడ్స్ కొన్నారు. చిన్న బెడ్రూమ్లో ఇదివరకు ఫోర్ బై సిక్స్ బెడ్ ఉండేది. పెద్దదానికి నాలుగు బిస్కెట్లు ఇచ్చి నీకు రెండు తమ్ముడికి రెండు అనంటే గీత పెట్టి కొట్టినట్టుగా సమానంగా పంచుతుందిగాని ఒకే మంచం మీద ఇద్దర్నీ పడుకోమంటే మెల్లమెల్లగా కాలితో నెడుతూ వాణ్ణి తోసేస్తుంది. నలుగురూ మాస్టర్స్ బెడ్రూమ్లో పడుకునే రోజులు పోయాయి. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందోనని ఆ ఫోర్ బై సిక్స్‌ను... అతని వాళ్లకా ఆమె వాళ్లకా అనే చర్చ లేకుండా... ఆమె వాళ్లకే చెప్తే వచ్చి పట్టుకెళ్లారు. కొన్న రెండు బెడ్లు అక్కడ వేశారు. కామన్ బాత్రూమ్ ఆ చిన్న బెడ్రూమ్కు దగ్గరగా ఉంటుంది. అందులో నాలుగువేలు పెట్టి మినీ గీజర్ బిగించారు. ఒక అరలో ఉడ్వర్క్లో మిగిలిన కర్ర ముక్కలు, ప్లైవుడ్ తునకలు దాచి ఉంటే పారేసి పిల్లలవే కొన్ని బట్టలు, టవల్స్, రెండు స్టీల్ జగ్స్ పెట్టారు. అతనికీ ఆమెకీ ఒకరోజు తేడాలో టెంపరేచర్ మొదలైనప్పుడు ఈ సిద్ధం చేసిందంతా పనికొచ్చింది. పిల్లల్ని ఆ రూమ్‌లోకి పంపించేశారు. ఇక క్లాసులొద్దు ఏం వొద్దు మీ ఇష్టమొచ్చినవి కంప్యూటర్లో ఫోన్లో చూసుకోండి అని చెప్తే, వాళ్లూ తెలివైనవాళ్లకు మల్లే అస్సలు బెంగలేనట్టుగా ముఖాలు పెట్టి సరేనన్నారు. పెద్దది ఎనిమిదో క్లాసుకు, వాడు ఆరుకు వచ్చే సమయానికి ఇదంతా మొదలవడం తమ అదృష్టం అనే అనుకున్నారు. ఇంకా చిన్నపిల్లలై ఉంటే తమ సంగతి తమకు మాత్రమే తెలిసేది. ఏమంటే కొన్ని బాధలు ఎంత చెప్పినా ఎదుటివారికి ఏ తలకాయీ అర్థం కాదని అనుకున్నారు. క్షణాల్లో కోర్సు మొదలెట్టడం వల్లో, ఇద్దరివీ సముద్రం వొడ్డున ఉండే ఊళ్లు కనుక అన్యం లేనట్టుగా చేపలు తింటూ పెరగడం వల్లో, మరీ యాష్ట పడేంతగా శరీరాలను ముందు నుంచి చేటు చేయక చూసుకోవడం వల్లో వచ్చిన చుట్టం ప్రతాపం చూపకుండా ఆరో రోజుకు ముడుచుకు పడుకున్నాడు. వంట యధావిధిగా సాగేది. పిల్లల వాటా తలుపు దగ్గర పెట్టి తప్పుకునేవాళ్లు. రెండుసార్లు పెద్దది ఏడ్చింది. వాడు వీడియో కాల్లో ముఖం ఎర్రగా పెట్టి నాన్న మర్యాద కాపాడ్డానికి బింకం పోయాడు. పన్నెండు రోజులకే డాక్టర్ ‘పోండి... పోయి పిల్లల దగ్గర పడుకోండి’ అన్నా పద్నాలుగో రోజున తల స్నానాలు చేసి, ఇద్దరు పేదవాళ్లకి, అంటే ఆమె దృష్టిలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులకు, వెజిటెబుల్ బిర్యాని– ఎగ్ కర్రీ పెట్టి, అప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకుని పెద్దపెద్దగా ఏడ్చారు. అయితే అమేజాన్‌లో పెద్దది తెలివిగా ‘ది వార్ విత్ గ్రాండ్‌పా’ సినిమా పెట్టి అందర్నీ నవ్వించింది బాగా. ఇక అంతా అయిపోయినట్టే అనుకుంటూ ఉంటే ఈ ముక్కు బాధ మొదలైంది. వాసన ఉన్నట్టా.. వాసన లేనట్టా... వాసన ఉండీ లేనట్టా.... స్నానం చేస్తూ సబ్బు వాసన చూట్టం... నూనె రాసిన జుట్టును దువ్వుకున్నాక దువ్వెన వాసన చూడటం, హ్యాంగర్‌కు వేళాడుతున్న మురికిబట్టల వాసన చూడటం, కప్‌బోర్డుల్లో పడేసి ఉంచిన నేఫ్తలిన్ ఉండలు తీసి వాసన చూడటం... కొత్తల్లో ఆమె గమనించి ఏమిటోలే అనుకునేది. తర్వాత్తర్వాత భయపడుతోంది. టెంపర్ మనిషి. పిల్లల్ని తీసుకొని ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లినా వెళ్లగలదు. దీనిని ముగించాలి అనుకున్నాడు. ఆఫీస్ పని అయ్యేసరికి మధ్యాహ్నం నాలుగైంది. ఐదింటికి టీ తాగి, మాస్క్ పెట్టుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని బయటపడ్డాడు. ఆరు నుంచి కర్ఫ్యూ. ఇంకా గంట టైముంది. రోడ్డు మీదకు వచ్చాక ఎం.ఆద్రికి ఫోన్ చేశాడు. ఆద్రి డాక్టరు. హైస్కూల్లో అతడికి రెండేళ్లు సీనియర్. అసలు పేరు మాల్యాద్రి అయితే మార్చుకున్నాట్ట. ఆ ఆద్రిని అతడు వాడు అంటాడు. యు.కె వెళ్లి సైకియాట్రీ చదివి అక్కడే ప్రాక్టీసు చేసి ఆ అనుభవంతో ఇక్కడ ప్రాక్టీసు చేస్తున్నానని అతడితో ఆ వాడు చెప్పాడు కాని అతడికి వాడి మీద వాడి వైద్యం మీద ఏ మాత్రం నమ్మకం లేదు. పైగా కాల్ చేస్తే ‘తమ్ముడూ’ అంటాడు. ఈ వరసలు కలిపే వాళ్లంటే అతడికి మంట. కాని వేరే గతి లేదు. ‘ఆ.. తమ్ముడూ’ అన్నాడు వాడు. సంగతి చెప్పాడు. ‘ఆ... ఇంకేం సంగతులు... బోండాం శీను ఎలా ఉన్నాడు’ మళ్లీ సంగతి చెప్పాడు. ‘మొన్న ఊరి నుంచి మైసూర్‌పాక్ వస్తే తమ్ముడూ... నిన్నే తలుచుకున్నా’ ‘నాకు మోక్షం లేదా అన్నయ్యా’.. ‘ఎయ్... వదిలెయ్‌రా డౌట్‌ని. ముక్కేంటి మూతేంటి. సరిగ్గా నిద్ర పోతున్నావా? నిద్ర బిళ్ల వాట్సప్ చేస్తా ఒక వారం వేస్కో’ ‘ప్రతిదానికీ పడుకోబెట్టడమేనారా మీ సైకియాట్రిస్ట్‌ల పని’ ‘పడుకుంటే సగం దరిద్రం వదులుతుంది తమ్ముడూ’ ఆ వాడు ఏ మాత్ర రాశాడో అతడు ఏది మింగాడో ఇక నిద్రే నిద్ర. ఆఫీస్‌లో జాయినయ్యి రెండో రోజు మీటింగ్‌లో ఉన్నాననే అనుకున్నాడు. సెక్షన్ అంతా ఇళ్లకెళ్లాక బాయ్ వచ్చి లేపాడు లైట్లు లేకుండా చీకటిగా ఉన్న కాన్ఫరెన్స్ రూమ్‌లో. సీనియర్ ఉద్యోగి అని మర్యాద ఇచ్చినట్టున్నారు. మరుసటిరోజున బాస్ నుంచి ఇంకో వారం దాకా ఇంట్లోనే ఉండి పని చేయ్ అనే మెసేజ్ కూడా వచ్చింది. నిద్రపోయేవాడు వాసన చూడలేడు. అతడూ చూడలేదు. వారం తర్వాత తేన్పులొస్తున్నాయని మజ్జిగ తెచ్చి ఇస్తే గ్లాసు పట్టుకుని అరగంట సేపు వాసన చూస్తూనే కూచున్నాడు. చూసింది... చూసింది... వచ్చి గ్లాసు పెరుక్కొని ఎత్తి నేలకు కొట్టింది. మజ్జిగ ఎగిరి టీవీ మీదా, టీపాయ్ మీదున్న న్యూస్పేపర్ల మీద, అతని ముఖాన పడింది. ఆమె ఏడ్చింది. సాయంత్రం మాస్క్ తగిలించుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని రోడ్డు మీదకొచ్చి వాడికి కాల్ చేశాడు. ‘ఏమిట్రా ఇదీ తమ్ముడూ’ అన్నాడు వాడు. ‘అరె... నీ ముక్కు ఆల్రైట్గా ఉంది. నువ్వు ఆల్రైట్గా ఉన్నావు. ఎందుకురా నా పని చెడదొబ్బుతావు’ అన్నాడు మళ్లీ. ఏమీ మాట్లాడలేకపోయాడు. ‘అరె.. మనసు కష్టపెట్టుకుంటున్నావు కదా నువ్వు. ఏం మనూరోడివిరా నువ్వు. స్కూల్లో షేర్ నువ్వు... షేర్. ఈ మాత్రం దానికి’... అన్నాడు వాడు. గొంతు పెగల్లేదు. వాడూ ఒక నిమిషం ఊరికే ఉండి– ‘అరె.. ఒకటి చెప్పు. నీ మైండ్ సరిగా ఉండాలంటే దానికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ కాళ్లు చేతులు సరిగా పన్జెయ్యాలంటే వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ పొట్ట సరిగా పని చేయాలంటే నువ్వు మూడుపూట్లా తిని, అరాయించుకుని, తెల్లారి దానికి వెళ్లాలి కదా. నీ ముక్కుకు ఏం ఎక్సర్సైజ్ ఉందో చెప్పూ. ఏం ఇస్తున్నావు దానికి. ఎలా బతికిస్తున్నావు. చచ్చి పడున్నట్టుందిరా అది. ఏ వాసనలూ లేక ఎప్పుడో చచ్చినట్టుందది. నీకు ఇప్పుడు తెలిసింది. అరెయ్.. ముక్కున్నది నీ చచ్చుపుచ్చు బతుక్కి గాలి పీల్చి వదలడానికి కాదు. దయ తలువు దాన్ని. షో సమ్ మెర్సీ. ఏదో వర్డ్ ఉంది... ఆ... ఆఘ్రాణించు... ఆఘ్రాణించు ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. బతుకుతుంది. మళ్లీ ఇందుగ్గాను కాల్ చేయకు. మందేద్దాం అనుకుంటే మాత్రం రా’... పెట్టేశాడు. ఆరవుతున్నట్టుంది. మనుషుల్ని రోడ్ల మీద నుంచి వెళ్లగొట్టే చీకటి దాపురిస్తూ ఉంది. పోలీస్ వెహికల్ ఒకటి సైరన్ మోగిస్తూ కర్ఫ్యూ అవర్స్ మొదలవుతున్నాయని గుర్తు చేస్తూ తిరుగుతూ ఉంది. షార్ట్స్, టీ షర్ట్, స్లిప్పర్స్‌లో చేత ఫోన్ పట్టుకుని కొత్తగా వేసిన పేవ్మెంట్ పక్కన నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉండటం, రోడ్డును అలా తిరిగి చూడగలగడం, ఆకాశం కింద అలా ప్రాణాలతో మిగలగలగడం కొన్నాళ్ల క్రితం అతడు ఊహించలేదు. ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి. జీవమే. ఎవరో ముసలాయన, ముస్లిం టోపీ పెట్టుకుని– పోలీసుల భయంతో తోపుడు బండిని గబగబా తోసుకొని వెళుతున్నాడు దూరంగా. చూస్తున్నాడు ఆ బండివైపు. ఏం పండ్లున్నాయో దాని మీద. బత్తాయిలా... కమలాపండ్లా... సురేశ్ గాడు గుర్తొచ్చాడు. స్కూల్లో ‘మావా... మాటరా’ అని పక్కకు తీసుకెళ్లి, వెనుక మడుచుకుని ఉన్న చేతుల్లో నుంచి టకాలున నారింజ తొక్క తీసి కళ్లల్లోకి పిండేవాడు. అబ్బా రే... ఆ తర్వాత ఆ నారింజ తొక్కను లాక్కుని వాడి కంట్లో పిండేవాడు. ఆ పూటంతా చేతుల్లో నారింజ వాసన. కమ్మటి సువాసన. నవ్వొచ్చింది. ముక్కుకు నారింజ వాసన తగిలింది– అప్పటిది. గట్టిగా గుండెలోకి పీల్చాడు. అప్పటి రసం ఇప్పుడూ పడిందేమో కళ్లు నీళ్లు చిమ్మాయి. ఆ సురేశ్ గాడే వాళ్ల నాన్నది లూనా తెచ్చేవాడు టెన్త్ క్లాస్‌లో. ట్యాంక్ విప్పి ‘చూడ్రా... వాసన భలే ఉంటుంది’ అనేవాడు. లీటరులో సగం డబ్బులు నీవి అని– ఆ సగం ఏనాడూ ఇవ్వకపోయినా లూనా నేర్పించాడు. డబ్బు చేత్తో పట్టుకున్న సురేశ్ గాడి పక్కన పెట్రోల్ బంకులో నిల్చున్నట్టే ఉంది. తెరలు తెరలుగా వాసన తాకుతున్నట్టే ఉంది. ముక్కు ఎగపీల్చాడు. ఫోన్ మోగింది. ‘ఏమయ్యారు’ ‘వచ్చేస్తున్నా.’ ‘ఏమిటి హుషారుగా ఉన్నారు’ ‘ఏం లేదు. ముక్కు. బాగుందిలే’... ఇంటికెళదామా అనిపించింది. ఇల్లు. బాత్రూమ్లో ఫినాయిల్... డెట్టాల్... ఫ్లోర్ తుడిచేప్పుడు లైజాల్... రాత్రి కచ్వా... ఎప్పుడైనా ఆమె వెలిగిస్తే అగరుబత్తి వాసన. ఆ వాసన అతడికి పడదు. ఊళ్లో చిన్నప్పుడు మమత మాంసాహార హోటల్‌కు పెరుగు పార్శిల్‌కు వెళితే కౌంటర్ మీదున్న స్టీల్ స్టాండ్ నుంచి వచ్చే గంధం బత్తి వాసన యిష్టం. ఆ వాసన కోసం ఎన్నిసార్లు ఎన్నిరకాల గంధం బత్తీలు కొని వెతికాడో. ఆ వాసనే వాసన. ప్రయత్నించాడు. దగ్గరగానే ఉంది. గాలిలో తేలి ఆడుతూ మెల్ల మెల్లగా సమీపిస్తూ ఉంది. నాటి బాలుణ్ణి చేస్తూ నీ ముక్కుకు ఏమీ కాలేదులేవోయ్ అంటూ ఉందా అది? కూరకు వెళితే ‘ఇదిగో... ఈ అబ్బాయి మన ఫలానా ఆయన కొడుకు. కాస్త ఎక్కువ కట్టు’ అని హోటలు ఓనరు అంటే, ఇచ్చిన ప్యాకెట్ అందుకుని ఇంటికి వొచ్చాక ఏ అలంకారమూ లేని ఆ అతి మామూలు అరటికాయ కూరలో కూడా ఎంత ఆకలి రేపే సువాసనో! ‘ఏవిటి.. కనీసం కూర వాసన కూడా రాదు ఇంట్లో’ అంటాడు ఎప్పుడైనా. ‘రండి.. ఇలా రండి’ అని పిలుస్తుంది వెంటనే. ‘చూడండి.. ఇది కొత్తిమీరట. వాసన ఉందా? హవ్వ. పుదినాలో కూడా వాసన లేకపోతే నేనేం చేయను. ఇవి ఆలుగడ్డలట. అవి టమేటాలు అట. వాటిదీ ఆకారమే. మనదీ ఆకారమే. తిరగమోతలో వాసన వచ్చి ఎంత కాలమనీ. మినుములు వేయిస్తే గుమ్మెత్తిపోయేది. పాలు పొంగినప్పుడు వచ్చే వాసన నాకిష్టం. ఎక్కడ చూస్తున్నాను నా మొహం. ఒక్క నేతిచుక్క వేసుకుని వేడన్నంలో కలుపుకుని తింటే ఆ అన్నమంతా నెయ్యి వాసన, కడుకున్నాక చేతికి వాసన. ఆ రోజులా ఇవీ. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, దనియాలు వేయించి పక్కింట్లో రోట్లో దంచుతుంటే వాసన మా ఇంటి దాకా వచ్చేది. చారు కాస్తే నాలుగు పెళ్ళల అన్నం మింగేదాన్ని. ఇప్పుడు ఆశించగలమా ఇదంతా. మరువం, దవనాలే వాసనల్లేక వొట్టి పోతే మీరేమిటండీ వాసనలంటారూ’ అంటుంది. కాని ఆ యోగం అతనికి తెలియనిదా? పెదమ్మ ఆంటీ ఇంటికెళితే తెల్లసున్నం వేసిన వీధిగోడల మీద పగిలిపోయిన కుండలను బోర్లేసి మట్టి నింపి పెంచిన మరువం, దవనం దుబ్బుగా ఉండేవి. వాటి దగ్గర నిలబడి చాలాసేపు వాటి సువాసన పొందేది. అది చాలక ప్రతిసారీ పెదమ్మ ఆంటీ ‘ఆ తలేందిరా’ అని నూనె రాసేది. గానుగ నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలో రీటా వేసి, బావంచాలు పోసి, సుగంధవేర్లు జారవిడిచి అవన్నీ గాజు సీసాలో లేత ఎరుపులో కనిపిస్తూ ఒక దానికి ఒకటి సువాసన ఇచ్చుకుంటే ఆ నూనె తలకు రాసి, రాశాక ‘చూడు’.. అని రెండు అరిచేతులను ముఖానికి దగ్గరగా తెచ్చేది. అప్పుడు ముక్కు సొట్టలు పడేలా అతడు వాసన పీల్చేది. పెదమ్మ ఆంటీ చేతులు... ఇప్పుడూ దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ సెంటు నూనె వాసన ముక్కు దిగువన ఇప్పుడూ తారాడుతూ ఉంది. ‘చినమ్మ ఆంటీ ఇంటికెళ్తా.. పొయ్యిలో కాల్చి పనసగింజలు పెడుతుంది’ అనేవాడు. ‘ఆ పెడుతుందిలే సంబడం. నేనూ పెడతానుండు’ అని ఆరిపోయిన పొయ్యి ఎగదోసి చిలగడదుంపలు రెండు పడేసేది. చిలగడదుంపలు కాలే వాసన వాటిని తినడానికంటే రుచిగా ఉండేది. అవి తిన్నాక కదిలే పని ఉండదు. కడపు నిండి పెరడు బావి దగ్గర ఆడుకోవడమే. బైక్ వచ్చి ఆగింది. ముందు ఒక పోలీసు, వెనుక ఒక పోలీసు ఉన్నారు. ‘వెళ్లాలి సార్’ చూశాడు. ‘వెళ్తా. ఇక్కడే మా ఇల్లు’ వెళ్లిపోయారు. కాలేజీలో ఉండగా యూనియన్ వాళ్లు పెంచిన కాలేజీ ఫీజులు తగ్గించాలి, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి అని స్ట్రయిక్‌కి పిలుపు ఇస్తే కుర్రాళ్లు పది మంది స్కూళ్లు మూయించడానికి బయలు దేరితే తనూ వెళ్లాడు. ఒక్కో స్కూలు మూయిస్తూ వస్తుంటే ఒక హెడ్మాస్టరు మాత్రం హటం చేశాడు. ఎంత చెప్పినా వినడు. అన్ని క్లాసుల్లోని పిల్లలు గోలగోలగా కిటికీల్లోంచి చూస్తుంటే వెళ్లినవాళ్లు ఎదురు తిరిగి స్లోగన్స్ ఇస్తూ లాంగ్ బెల్ కొట్టేస్తూ ఉంటే పోలీసులు. కంపలకు అడ్డం పడి పరిగెత్తి పడ్డాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళితే, కొత్తనర్సు నేరుగా టింక్చర్ పెట్టబోతే, పెద్దనర్సు తిట్టి స్పిరిట్‌తో కడిగి ఆ తర్వాత టింక్చర్ పెట్టాలి అని స్వయంగా ఆ పని చేస్తూ ‘ఏం స్టూడెంట్సయ్యా మీరంతా’ అని అక్కరగా మందలిస్తూ ఉంటే అప్పుడు వచ్చినదీ ఇప్పుడు వస్తున్నదీ టింక్చర్ వాసనా... ఆమె రాసుకున్న క్యుటికుర వాసనా... ఇంటి వైపు అడుగులు వేశాడు. మాస్క్ కట్టకుండా ఎవరూ లేకపోయినా ఫ్లాట్స్‌లోని అందరూ ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టే అనుభవం ఈ సంవత్సర కాలంలో వచ్చేసింది. లిఫ్ట్ దగ్గర థర్డ్‌ఫ్లోర్ భాస్కర్ నాయుడు ఉన్నారు. డెబ్బై ఉంటాయి. కాని ఏ కర్ఫ్యూ ఆయన్ను ఈవెనింగ్ వాక్కు వెళ్లనీకుండా ఆపదు. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కారు. క్షేమమే కదా అని ఆయన చేత్తో సైగ చేశారు. క్షేమమే అని అతడు సైగ చేశాడు. థర్డ్ ఫ్లోర్లో ఆయన దిగిపోయారు. ఒకసారి ఇలాగే లిఫ్ట్ బయట కలిస్తే, బటన్ నొక్కి వెయిట్ చేస్తూ, మాటల్లో పడ్డారు. చాలా మంచి వాసన వస్తోంది. పోల్చుకోవడం ఎంతసేపూ. అది మట్టి వాసన. ‘ఏమిటి సార్. ఇంత ఎండగా ఉంది. ఎక్కడ వాన పడుతోంది... మట్టి వాసన’ అన్నాడు. ఆయన నవ్వి ‘వాన లేదయ్యా. నా దగ్గరే’ అన్నాడు. ‘మీ దగ్గరా?’ ‘అవును. పుట్టింది పల్లెటూళ్లో. టీచరుగా జీవితాంతం పని చేసి రిటైరైంది పల్లెటూళ్లో. బరెగొడ్లు, పేడ కళ్లాపిలు, గడ్డి మోపులు, నార్లు పైర్లు... వీటి మధ్య బతికా. ఒక్కగానొక్క కొడుకు అని పదేళ్లుగా వీడి దగ్గర ఉన్నా. అబ్బా కష్టమయ్యా ఇక్కడ ఉండటం. మందు వాసన మందుల వాసన తప్ప ఇంకో వాసన రాదు. ఇక తట్టుకోలేక ఈ అత్తరు కొనుక్కున్న. కన్నోజ్ అని ఉత్తరప్రదేశ్‌లో ఊరు. అత్తర్లకు ఫేమస్. వానలు పడే కాలాన ఆ ఊరి నది వొడ్డున సుతారంగా ఏరిన మట్టితో ఈ అత్తరు తయారు చేస్తారు. పాతబస్తీలో దొరుకుతుంది. కాస్ట్లీ. అప్పుడప్పుడు పూసుకుంటా’... ఆకాశం కనికరిస్తే, జల్లు దయగా దిగి నేలను నిమిరితే అణాకాణీ ఖర్చు లేకుండా అందరూ పొదువుకోవాల్సిన మృత్తికా సౌరభం. ఇప్పుడు అతి ఖరీదుగా ఒక లిప్త పాటు జాగృతమై లిఫ్ట్‌లో అతణ్ణి కంపించేలా చేసింది. ఇంట్లోకి వచ్చాడు. ఆమె పరిశీలనగా చూసి సంతృప్తి పడింది. పిల్లలకు కారం లేని ఒక కూర ముందే చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికీ వండుతుంది. ‘ఏం వొండను’ అడిగింది. ‘ఏదో ఒకటి. కాస్త ఎండు చేపలు వేయించరాదూ. రేగిపోవాలి’ నొచ్చుకున్నట్టు చూసింది. ‘మానేశాము కదండీ పిల్లలకు వాసన పడట్లేదని. పైగా అపార్ట్మెంట్లో ఆ కంపు రేపుతోంది మనమే. ఎందుకా అప్రదిష్ట. దాచిన కొన్ని ముక్కలుంటే పనమ్మాయికి ఇచ్చేశాను. ఊరికెళ్లినప్పుడు ఇక మీ అమ్మ దగ్గరే ఆ ముచ్చట’ శ్వాస– ఒక నిమిషం దిగ్బంధనం అయినట్టు అనిపించింది. అమ్మ గొంతు దాపున దూరాన వినిపించినట్టయ్యింది. అమ్మ గొంతు. దానిది కదా అసలైన వాసన. ‘ఒరేయ్ మేధావి’ అని పిలిచేది అమ్మ బుక్స్ చదువుకుంటూ ఉంటాడని. తిక్కపనులు చేస్తే ‘ఒరే మేతావి’ అని నవ్వేది. చిన్నప్పుడూ ఇప్పుడూ పలుచగా ఉంటుంది అమ్మ. చిన్నప్పుడూ ఇప్పుడూ మెత్తగా మాట్లాడుతుంది అమ్మ. ‘నాన్న జేబులో చిల్లరుంటుంది. తీసుకొని కొనుక్కోరా’ అనేది. ‘నాన్న జేబులో చేయి పెట్టను. రాలిన సిగరెట్ పొడి చేతికంటుకుంటుంది. వాసన’ అనేవాడు. ఆమే వచ్చి తీసి ఇచ్చేది. అమ్మ దగ్గరే ఉండేవాడు ఎప్పుడూ. ఆమె రవిక చంకల దగ్గర చెమట పట్టి– ఉండ్రా స్నానం చేయలేదు అన్నా పర్లేదులే అని పక్కన నులక మంచం మీద ఎగిరి కూచునేవాడు. ఆదివారాలు అన్నాలు తిన్నాక ఆడుకోవడానికి ఎవరూ రాని మధ్యాహ్న వేళలో ఆమె పక్కన పడుకుని కొంగు ముఖాన వేసుకుని ఏవో ఊహలు గొణుక్కునేవాడు. ‘పెద్దయ్యాక నీకేం కావాలన్నా కొనిస్తాను చూడు’ ‘నాకేం వద్దులేరా మేధావీ. నువ్వు పక్కనుండు చాలు’ ‘ఊహూ. కొనివ్వాల్సిందే’ అమ్మ ఎప్పుడూ నాన్నను ఏదీ అడిగేది కాదు. నాన్నే ఒకసారి ఆమెకని ప్రత్యేకం సింథాల్ సబ్బు తెచ్చి పెట్టాడు. నాలుగు భుజాల దీర్ఘ చతురస్రాకార ఎర్రఅట్ట సబ్బు. అమ్మ ఆ రోజు చాలాసేపు స్నానం చేసింది. చలువ చీర కట్టుకుని ‘రా’ అని నవ్వుతూ దగ్గర తీసుకుంది. చుబుకం కింద తల వొచ్చేలా పట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఇప్పుడూ పట్టుకున్నట్టయ్యి ఆ స్పర్శది కదా అసలైన వాసన అనిపించింది. ‘ఏమిటండీ అలా అయిపోయారు’ అంది. ‘ఏం లేదు.. ఏం లేదులే’ అని గదిలోకి వచ్చాడు. డోర్ వేసుకున్నాడు. పచార్లు చేశాడు. హటాత్తుగా ఏదో అర్థమైంది. హటాత్తుగా ఏం అర్థమైందో. ఫోన్ తీసి వాడికి వాట్సప్ చేశాడు. ‘ఊరెళుతున్నా అమ్మను చూడ్డానికి. వచ్చాక మందేద్దాం’.. రెండు నిమిషాలకు బ్లూటిక్ పడి రెస్పాండ్ అయ్యాడు. ‘ఓ.. అదీ సంగతి. ఈ సంవత్సరంగా లాక్డౌన్ల రభసతో ఆమెను మిస్సయ్యి నా ప్రాణాలు తీశావు.’ ‘లేదురా. నా పెళ్లయ్యినప్పటి నుంచి ఆమె ఊళ్లోనే ఉంది’ ‘ఓ... సిటీలో ఉండలేదని అక్కడ పెట్టుంటావ్’ ‘లేదురా. ఆమెకు నా దగ్గర ఉండటమే ఇష్టం’... బ్లూటిక్ పడింది. రెస్పాండ్ కాలేదు. నిమిషం తర్వాత– ‘నీ భార్య మంచి కత్తి కేండేటా’... టైమ్ తీసుకున్నాడు. ‘ఇద్దరూ చేసే తప్పుల్రా ఇవి. ఒక్కరు గట్టిగా నిలబడినా చెడు జరగదేమోగాని మంచి జరుగుతుంది’ బ్లూ టిక్ పడింది. వెయిట్ చేశాడు. వాడు ఇక మాట్లాడేలా లేడు. బయటకు వచ్చాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు. ఆమె వంట గదిలో కూర ఎక్కిస్తూ ఉంది. వెళ్లాడు. ‘ఉదయాన్నే అమ్మ దగ్గరకు వెళుతున్నా. కారులో. వచ్చేస్తా రెండు రోజుల్లో’ తిరిగి చూసింది. ఏమనుకుందో. ‘సరే’ ‘ఇంకో రెండ్రోజులు ఎక్కువున్నా విసిగించకు. తీసుకొస్తానేమో తెలియదు. ఇంకేం ఆలోచిస్తానో. మనం నిజంగా హ్యాపీగా ఉండటం మనకు అవసరమా కాదా’... అతని కళ్లల్లోకి ఆమె చూస్తోంది. అతనివి అలాంటి కళ్లు ఆమె ఎప్పుడూ చూళ్లేదు. ‘స్వామీ... ఇక వదిలిపెట్టండి’ ‘సరే’ రూమ్‌లోకి వచ్చాడు. బ్యాగ్ సర్దుకున్నాడు. త్వరగా భోం చేశాడు. ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు. దారిలో డజను సింథాల్ సబ్బులు – నాలుగు పలకల ఎర్ర అట్టవి– తప్పక కొనాలని నిశ్చయించుకున్నాడు. మంచం మీద తల వాల్చాడు. నిద్ర పడుతుంటే సబ్బు వాసన అతణ్ణి తాకుతున్నట్టు అనిపించింది. అమ్మ వాసన కూడా. బహుశా అతడి ముక్కు అతణ్ణి క్షమించేసింది. -మహమ్మద్ ఖదీర్‌బాబు -
ఈవారం కథ: కొమ్ముల బర్రె
‘నీ సోపతులల్ల మన్నువొయ్య. నడీడుకచ్చిండు.. నెత్తెంటికెలు తెల్లవడ్డయి. తనెత్తు పిల్లలైరి. గింత సోయి లేకపోతె ఎట్ల? ఎవడు పిలిస్తె వానెంబడివడి పోవుడేనాయె. కుత్కెలదాక తాగుడు, అద్మరాత్రిదాక తిరుగుడు. ఎల్లెంకల సాపుక పండుడు. ఇల్లు ఇరువాటం యాన్నన్నవోని.. నీసట్టంకు అగ్గిదల్గ.. నాగండాన దాపురమైండ్రు’ వాకిట్లో అంట్లు తోముతున్న రాధవ్వ గిన్నెల్ని కోపంతో విసిరి కొట్టింది. ‘అయ్యలు కూడవెట్టిన ఆస్తుల్లేకపాయె. తాతలు సంపాయించిన జాగలు లేకపాయె. గిట్లపట్టి లేకుంట జేత్తె ఎట్ల ముంగట వడ్తది సంసారం? వొక్కదాన్ని ఎంతకని ఏడ్వాలె ఈ లేకి కొంపల! పాలిచ్చెబర్రె.. ఆయింత మూతి మీద తన్నిపాయె. చెంబెడో.. గిలాసెడో ఇత్తె శెక్కరి శాపత్త మందమన్న ఎల్లేది. ఇగ రేపట్నుంచి బిచ్చమెత్తుకుందురు తియ్యి..’ స్వరం పెంచింది రాధవ్వ.. చాప మీద అటూ ఇటూ దొర్లుతున్న గోవర్ధన్‌ను చూస్తూ. ‘వోబోడ్సోత్దానా ఏమొర్రుతున్నవే పోరడు పొయ్యి పొయ్యొస్తే? ఎమో.. రపరప వెట్టినవు. వానికి తిక్కవుట్టిందంటె ఈపు శింతపండు జేత్తడు ఏమనుకుంటన్నవో? అన్నది అత్త రామవ్వ.. కోడల్ని దబాయిస్తూ. ‘అవ్వో! బాగనే పొడుసుకరావట్టెనో..! ఉద్దార్కంజేసిండని కొడుకును మాట అననియ్యది’ అన్నది రాధవ్వ వెటకారంగా అత్త వైపు చూస్తూ. ‘నీయక్క.. నోర్ముయ్యకపోతె దౌడపండ్లు రాలగొడ్త ఏమొర్రుతన్నవే? పీకితెపీకని తియ్యి. నీ అయ్య అర్ణం కొట్టిచ్చినాడే బర్రెను? తెల్లారెటల్లకు అసొంటియి పదిబర్లను కొన్కత్త. మూస్కొని పనిచూస్కొ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు గోవర్ధన్. ‘నెత్తిల పుండుకు సమరు లేదుగని ఎడ్ల కొట్టంల దీపం పెట్టొస్త అన్నడట ఎన్కటికెవడో నీ అసోంటోడు. గీ పొంకాలకేం తక్కువ లేదు’ అంటూ విసురుగా వంటింట్లోకి నడిచింది రాధవ్వ. తల్లి కోసం ఎదురు చూసి, చూసి అరుస్తున్న దుడ్డె గొంతు బొంగురు పోతోంది. ఒకవైపు దుడ్డె అరుపులు.. ఇంకో వైపు రాధవ్వ తిట్లతో గోవర్ధన్ తల గిర్రున తిరిగింది. ‘నితీషూ.. వోరి నితీషూ.. కొద్దిగాగినంక జెర బాయి మొకాన వొయ్యి బర్రెను ఇడ్శి పెట్టుబిడ్డా! మల్ల పగటాల్ల వరకు ఎనుకకు మర్రుత గని..’ అంటూ అంగీ గుండీలు పెట్టుకుంటూ చెప్పులు తొడుక్కున్నడు గోవర్ధన్. ‘నీయవ్వ నాకు అన్లైన్ క్లాసులున్నయి బాపూ.. నేను బర్రె కాడికి పోనే పోను. సార్ తిడుతడు క్లాసులు వినాలె’ అన్నడు నితీష్. ‘నా తోడు బిడ్డా జెల్ది వురికస్త. నర్సయ్య మామది చిన్న పంచాది వున్నది. జక్కపురం దాక పొయ్యస్త. పోకపోతె ఏమనుకుంటడురా.. దేనిౖకైనా పోను గొడతె వురికస్తడు. అన్నిటికి ఇంట్ల మనిషిలెక్క ఆసరయెటోడు. అట్ల పొయ్యి ఇట్లొస్త. టైంకు అమ్మ గూడ లేకపాయె! ఫోను తీస్కొనిపో! బర్రెను గుడ్డంలిడ్శిపెట్టు. అదే మేస్తది. నువ్వు క్లాసులు ఇనొచ్చు ’ అన్నాడు గోవర్ధన్ బయటకు నడుస్తూ. అయిష్టంగానే వొప్పుకున్నాడు నితీష్. బర్రెను విడిచిపెట్టి గుడ్డంల చింత చెట్టు కింద నీడకు చేరి క్లాసు విందామని ఫోన్lఅందుకున్నాడు. అందులో లీనమై బయట ప్రపంచాన్నే మరచి పోయాడు. ఓ గంటన్నరకు క్లాసులు అయిపోయాక పరిసరాల మీదకు దృష్టి మరల్చాడు. బర్రె కనిపించలేదు. ఎప్పుడు పోయిందో ఏమో! నితీష్‌కు భయం పట్టుకుంది. చుట్టు పక్కలంతా వెతికాడు. అక్కడున్న అందరినీ అడిగాడు. ఎవరూ జాడ చెప్పలేదు. చీకటిపడే వరకూ వెతికి ఇంటికి చేరి జాడ తప్పిన బర్రె విషయం తల్లికి చెప్పాడు. కూలికి పొయ్యొచ్చిన రాధవ్వ భర్త చేసిన పనికి కోపంతో తిట్ల దండకం మొదలుపెట్టింది. నడిజాము రాత్రి దాటినాక గోవర్ధన్‌కు మెలకువచ్చింది. జరిగిన సంఘటనలన్నీ వొక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ‘బర్రె మ్యాత ముట్టక తిక్కతిక్క జేస్తున్నప్పుడే జెర చూస్కుంటే అయిపోయేది. పెద్ద నాయిన గూడా చెప్పిండు. పని వొత్తిల్లల్ల పడి మర్శిపొయిండు. బర్రె ఎద కచ్చినప్పుడల్ల గిట్లనే చేస్తది. దావఖానకు కొట్టుకపొయ్యి సూది ఏపిచ్చినా అయిపోవు. లేకుంటె.. జంగిట్ల తోలితె అండ్ల ఇత్తునంపోతులుండె. రెండ్రోజులైతే అదే సైరకచ్చు. ఎంత పనాయె ఎటని తిర్గాలె!’ అనుకుంటూ చింతాక్రాంతడయ్యాడు గోవర్ధన్. కొమ్ముల బర్రె చిన్నప్పుడు పాలు మరవక ముందే దాని తల్లి ఏదో బీమారి సోకి చచ్చిపోయింది. ఇది పాలు లేక తెల్లందాక పొద్దుందాంక వొకటే వొర్రుడు. నువ్వులు దంచి మ్యాకపాలల్ల కలిపి, బల్మీటికి నోరు తెరిపిచ్చి గొట్టం పట్టి పోసేది. కొద్ది రోజులైనంక చేన్లల్ల తిరిగి ఎన్నాద్రిగడ్డలు తెచ్చిపెట్టేది. తర్వాత ల్యాతగడ్డి, పజ్జొన్నకర్రాకులు, మెల్లెగ గర్కపోసలు అలవాటు చేసి.. పసిపిల్లలెక్క కంటికి రెప్పలా చూసుకునేది. మ్యాతపట్టినంక కుదురుకుని పెయ్యి చేసింది. నల్లరంగు, దొప్పలోలె చెవులు, దుప్పిలెక్క పెద్ద పెద్ద కొమ్ములు, ముప్పావు గజం వెడల్పు వీపు.. పెయ్యినున్నగ మెరుస్తుండె. తోకనైతె భూమికి రాసుకుంట పొయ్యేంత పొడవు. ఆఖర్న జడకు అందేంత వొత్తుగా నల్లగ నిగనిగలాడే వెంట్రుకలు ..అటూ ఇటూ తోక వూపుతూ నడుస్తుంటే సూడ ముచ్చటయ్యేది.. తోక వెంట్రుకల్లో పల్లేరుగాయలు, కూశెంగాల ముళ్లు అంటుకుంటే అన్నీ ఏరేసి శుభ్రంగా వుంచేది. ఒక్క గోమారి కూడా పట్టకుంట పీకేసేది. రోజూ సాయంత్రం ఇంటి కొచ్చే ముందు బోరు పైపుతోని నీళ్ళు వట్టి శుభ్రంగ పెయ్యంత కడిగేది. గున్నేనుగు లెక్క తిరుగుతుంటే.. అందరి కండ్లు దాని మీదనే. దిష్టి తగులుతుందని రాధవ్వ కుర్మదారానికి జీడి గింజలు, గవ్వలు కుచ్చి మెడల కట్టింది. పెద్ద ఈడు కూడా కాదు. రెండు ఈతలది. పొద్దుమాపు అయిదు లీటర్ల పాలిచ్చేది. ఇంటి ఖర్చంతా ఎల్లదీసేది. ఇంతకు ముందు రెండుసార్లు తప్పిచ్చుకొని పొయినా తెల్లారెవరకు అదే తిరిగొచ్చింది. ఇప్పుడు గూడా రాకపోతదా’ అనుకున్నాడు గోవర్ధన్. ఏదోకమూల సన్నని ఆశ మిణుకు మిణుకు మంటూండగా ఆ ఆలోచనల్లోంచి అతను బయటకు వచ్చేసరికి తెలవారసాగింది. తువ్వాలు భుజం మీద వేసుకొని తలుపు దగ్గరేసి.. చేతికర్ర తీసుకొని బర్రెను వెతకడానికి బయలుదేరాడు. పొలం దగ్గరకు వెళ్లేసరికి తెట్టన తెల్లారింది. ఎదురైన వాళ్లంతా బర్రె గురించి అడుగుతున్నారు. ‘బట్టల బైరనిగడ్డ మీద సిద్ధిపేటరాజిరెడ్డిగాడు పజ్జొన్న చేను అలికిండు. పచ్చగా నవనవలాడుతుంది. నాలుగు బుక్కలు మేసినా.. నామచ్చి సత్తది. ఇల్లు మునుగుతదిరా గోవర్దనూ! ముందుగాల అటు చూసి రాకపొయినవురా.. ’ అంటూ రంగయ్య నాయిన చెప్పేసరికి గోవర్ధన్‌కు చెమటలు పట్టాయి. ఎవరో తరిమినట్టు పరుగుపరుగున అటు వైపు నడిచాడు. పచ్చ జోన్న చేనంతా తిరిగాడు. ‘ఎక్కడా మేశినట్టులేదు. చేన్ల అడుగులు గూడ కనవడ్త లెవ్వు అంటె ఇటు దిక్కు రాలేదన్న మాట’ అని అనుకోగానే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది గోవర్ధన్‌కు. పక్కనున్న వాళ్లను ఆరా తీశాడు. ‘నిన్న పొద్దుగుంజాముల బలపాల బోరు దిక్కు అయితే వొర్రుడు ఇనవడ్డది’ అని చెప్పారు కొంతమంది. చూసుకుంటూ చూసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. బండరాళ్ల మధ్య మోతుకు చెట్లను కొమ్ములతో కుమ్మినట్టు ఆకులన్నీ చినిగి కొన్ని కింద రాలి పడ్డాయి. గిట్టలతో మట్టిని గీరినట్టు అచ్చులు కనబడ్డాయి. మూత్రం పోసినట్టు మడుగు కట్టిన ఆనవాలుంది. పెద్ద పెండకడీ కనిపించింది గోవర్ధన్‌కు. ప్రాణం లేచొచ్చినట్టయింది. ‘కొమ్ముల బర్రె పంచాది పెట్టుకున్నట్టు.. ఎప్పుడూ ఏదో ఒకచెట్టును కొమ్ములతో ఇరగ్గొట్టేది. తాగినా గోళెం నిండ కుడితి తాగేది. మడుగు కట్టేదాక మూత్రం పోసేది. మోపెడు గడ్డిమేసి.. తట్టెడు పెండవెట్టేది.. గివన్నీ జూస్తే కచ్చితంగా బర్రె ఇటుదిక్కే ఎల్లిందన్నట్టు’ సీతను వెతుకుతూ వెళ్లిన రాముడికి చిన్న ఆనవాలు దొరికినట్టు గోవర్ధన్‌కు ఆశ చిగురించింది. దూరంగా పశువులు కనబడుతుంటే అటువైపు నడిచాడు గోవర్ధన్. పశువుల కాపరిని అడిగాడు.. ‘నిన్న సాయంత్రం బాపుదొర కంచెలకెళ్ళి బర్రె తిరిగినటు’గా చూచాయగా చెప్పిండు. చెట్టూపుట్టా చుట్టూ గాలిస్తూ.. వెళ్తున్న గోవర్ధన్‌కు వొర్రెలో దిగబడిన గిట్టల గుర్తులు కనిపించాయి. ‘ఇవి ఖచ్చితంగా కొమ్ముల బర్రెవే! వెడల్పుగా, కాగితం మీద ముద్ర గొట్టినట్టు స్పష్టంగా అగు పిస్తున్నయి. అంటే ఇటువైపే ఎల్లుంటది’ అనుకున్నాడు. అలా కొంత దూరం అడుగులు చూస్తూ వెళ్ళినప్పటికీ అవి మట్టితడిగా వున్నంత వరకే కనిపించాయి. వొర్రె దాటాక గోవర్ధన్ ఆశలు ఆవిరైపోయాయి. పొద్దు నెత్తి మీది కొచ్చింది. సూర్య కిరణాలు సూదుల్లాగ పొడుస్తున్నాయి. కళ్లకు చీకట్లొస్తున్నాయి. నడిచే వోపిక లేదు. మొఖం కూడా కడగ కుండా పక్కబట్టలోంచి లేచినవాడు లేచినట్టే బయలుదేరాడు. తెలియకుండానే పూట గడిచి పోయింది. కడుపులో ఏమన్నా పడితే తప్ప కాలు కదలని పరిస్థితి. ఆయాసపడుతూ బండ్ల బాటకొచ్చాడు. ఊర్లోకి వెళ్తున్న ఓ రైతును ఆపి బండి ఎక్కి ఇంటి మొహం పట్టాడు గోవర్ధన్. రాత్రి తిట్టనైతే తిట్టింది కానీ రాధవ్వ మనసు మనసులో లేదు. ఒక మబ్బున నోట్లో మంచి నీళ్లు కూడా పోయకుండా వెళ్లినవాడు.. మిట్ట మధ్యాహ్నం అయినా రాకపోయే సరికి ఆందోళన అలుముకుంది. ‘ఆకలికి అసలే వోర్సుకోడు. పాపపు నోటితోని తిట్టరాని తిట్లు తిడితి. నా నోరు పాడుగాను’ అనుకున్నది. ‘వాడెమన్న శిన్నపిలగాడాయే ? వాడే వత్తడు తియ్యి . నువ్వైతె బుక్కెడంత తినుపో.. ఎంత సేపుంటవు’ అంటూ రామవ్వ .. కోడలికి సర్దిచెబుతుందో లేదో.. ఇంట్లోకి అడుగుపెట్టాడు గోవర్ధన్. వచ్చీరాంగానే కాళ్లు, చేతులు కడుక్కొని కూర్చున్నాడు.. అలసట తీర్చుకుంటున్నట్టుగా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాధవ్వ పళ్లెంలో అన్నం పెట్టుకొచ్చి గోవర్ధన్ ముందు పెట్టింది. ఆకలి మీదున్న గోవర్ధన్ పెద్ద పెద్ద ముద్దలతో గబగబా తినసాగాడు. పది నిముషాల వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘ఏమన్న మతులావు దొరికిందా’ మెల్లగా కదిలిచ్చింది రాధవ్వ. ‘ఎవ్వన్నడిగినా ఇక్కడ చూసినం.. అక్కడ కనవడ్డది అంటండ్రుగని కండ్లనిండ చూసినోడు ఎవడు లేడు. విఠలపురం పొలిమెర దాక పొయ్యచ్చిన. అదెప్పుడో దాటిపొయినట్టున్నది ’ చెప్పాడు గోవర్ధన్ నిరాశగా. ‘నువ్వేం పికరు వడకు.. బెండ్లబాలక్క దగ్గర వల్లు పట్టిచ్చుకచ్చిన. అది తూర్పు మొకాన్నే తిరుగుతందట. తప్పక దొరుకుతదని చెప్పింది. మైసవ్వతల్లికి ముక్కుపుల్ల తీసి ముడుపు గట్టిన. మన సొమ్ము యాడికిపోదు. నువ్వు రందిల వడకు’ గోవర్ధన్‌కు ధైర్యం చెప్పింది రాధవ్వ. ‘సరే తియ్యి మనకు బాకి ఉంటె దొర్కుతది లేకపోతె లేదు. ఏంజేత్తం’ అంటూ భోజనం ముగించాడు గోవర్ధన్. రాధవ్వ చెప్పినట్టు తూర్పు దిక్కున మాచాపురం పొలిమెర దాక వెళ్లాడు గోవర్ధన్. మొక్కజొన్న చేనుల్లో కలుపు తీస్తున్న వాళ్ల దగ్గర వాకబు చేశాడు. ‘నిన్ననైతే ఎవల్దో బర్రె లింగారెడ్డి పటేలు తుకంల పండి పొర్రిందట.. నాలుగు సంచుల వడ్లమొలక కరాబైందట. దొర్కవట్టి బంజారు దొడ్లె కట్టేశిండ్రట. ఆగ్రమైన కోపం మీదున్నడు. పాయెమాలు కట్టెదాక ఇడ్శిపెట్టడు. అంతేగాదు, బర్రె ఎవన్దోగని వాడైతె దొర్కాలె.. వాని సంగతి చెప్తా అని ఎదురు చూస్తండు.. మైలపోలు తీస్తడుపో’ అని చెప్పింది ఒక రైతు కూలి. గోవర్ధన్‌కు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతకు ముందు కూడా లింగారెడ్డి గురించి విన్నాడు. ‘మొండోడు..వొట్టి కసిరెగాడు..ఎంతకైనా తెగిస్తడు. అయితేంది, పడితె రెండు దెబ్బలు పడితెవాయె..జర్మానా ఎంతైనా కడితెవాయె.. కాళ్ళో.. కడుపో పట్టుకొని బతిమిలాడ్తెవాయే.. నా బర్రె దొరికితె చాలు’ అనుకొని ఊరి వైపు నడిచాడు. కచ్చీరు దగ్గర జనం గుమిగూడారు. దారి తీసుకుంటూ ముందుకు వెళ్ళిన గోవర్ధన్ కుర్చీలో కూర్చున్న పెద్దమనిషికి తను వచ్చిన పని చెప్పాడు. గోవర్ధన్‌ను ఎగాదిగా చూసిన అతను ‘ఏమయ్యా.. గంత సోయిలేకుంట ఎట్లుంటరయ్యా.. కడుపుకు అన్నం తింటలేరయ్యా? నోర్లేని పసులను మంచిగ కట్టేసుకోవాలె. ఓకంట కనిపెట్టుకోవాలె. వాటికి ఏమెర్క..యాడ పచ్చగ కనవడ్తె అటే పోతయి. మనం మనుసులం గదా జ్ఞానం ఉండాలె. ముందుగాల్నైతె చూసుకపో నీ బర్రె వున్నదేమో!’ అంటూ మస్కూరిని పురమాయించాడు బంజారు దొడ్డి గేట్ తెరవమంటూ. అతని మాటలతో గోవర్ధన్‌కు అరికాలి మంట నెత్తికెక్కింది. తమాయించుకున్నాడు.. ‘ఏంజేత్తం! ఊరుగాని ఊరు వానికి స్థానబలముంటది. ఇది తాను పంచాది పెట్టుకునే సమయం కాదు.. వోపిక కూడా లేదు’ అనుకుంటూ. లింగారెడ్డి ఆ పక్కనే కూర్చున్నాడు. రెండు కళ్లల్లో ఎర్రటి నిప్పులు రగులుతున్నట్టు కనపడుతున్నాయి. దొరికితే గొంతు కొరుకుదామన్నంత కసిగా చూస్తున్నాడు గోవర్ధన్ వైపు. భయపడుతూనే బంజరు దొడ్డి వైపు నడిచాడు మస్కూరి వెనకాలే గోవర్ధన్. లోపల అతని కళ్లు కొమ్ముల బర్రె కోసం వెతక సాగాయి ఆత్రంగా. అప్పటికే అందులో చాలా బర్లున్నాయి. దారి తీసుకుంటూ వెళ్ళి మూలమూలనా గాలించిండు. పదినిముషాల తర్వాత నిరాశగా బయటకు వచ్చాడు. ప్రశ్నార్థకంగా చూస్తున్న పెద్దమనిషికి అడ్డంగా తలూపుతూ సమాధానం చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు గోవర్ధన్. వెదుక్కుంటూ వెదుక్కుంటూ సలేంద్రిదాక చేరుకున్నాడు. ఊరు బయట.. ఒక పండు ముసలాయన జీవాలను కాస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి ‘పెద్దయ్యా.. ఇటెక్కడన్న ఎనుపది కనవడ్డాదే’ అడిగాడు గోవర్ధన్. ‘ఎట్లుంటది బిడ్డా..’ తిరిగి అడిగాడు ఆ ముసలాయన ఎండపొడ నుంచి తప్పించుకునేందుకు ఎడమ చేతిని నొసటికి అడ్డం పెట్టుకుంటూ. కొమ్ముల బర్రె ఆనవాళ్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు గోవర్ధన్. ‘ఏమో..నిన్న ఎగిలివారంగనైతే ఒకSబర్రె ఊరవతల ట్రాన్స్ఫార్మర్ల కొమ్ములు ఇరికి షాక్ కొట్టి సచ్చిపొయిందట.. సూడుపో.. బిడ్డా! ఇంకా కరెంటోల్లు రాలేదట. అట్లనే వుంచిండ్రట’ చెప్పాడు ముసలాయన. గోవర్ధన్ ప్రాణం జల్లుమన్నది. కాళ్లుచేతులు చల్లబడ్డాయి. ‘నా బర్రె అయితె కాదుగదా! దీని కొమ్ములైతే పొడుగే వుండె. కొమ్ములతోని చిమ్ముడు అలవాటుండె. తన బర్రె అయితే కావొద్దని’ మనసులో కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకి చేరుకున్నాడు. అక్కడి దృశ్యం చూసి చలించిపోయిండు గోవర్ధన్. నాలుగు కాళ్ళు బార్లాచాపి పడుంది బర్రె. నిన్ననగా చనిపోవడం వల్లనేమో కడుపు వుబ్బి రెండుకాళ్ళు పైకిలేచి వున్నాయి. నాలుక బయటకు వచ్చి రెండు దవడల మధ్య ఇరుక్కొని పోయింది. ఆ భయానక దృశ్యాన్ని చూడలేక పోయాడు. చచ్చిపోయే ముందు ఎంత నరకం అనుభవించిందో.. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరించింది అతనికి. ‘పాపం ఎవరిదో బర్రె.. నాలాగే ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో యజమాని’ అని బాధపడుతూ ‘నా కొమ్ముల బర్రెకైతే ఇట్లాంటì æపరిస్థితి రాకూడదు’అనుకుంటూ వెనుదిరిగాడు గోవర్ధన్. అలాగే రెండో రోజుకూడా వెతుకులాట మొదలు పెట్టాడు. తిండిలేదు. నిద్రలేదు. పిచ్చి పట్టినట్టు ఒకటే తిరుగుడు. పోట్రవుతులు తాకి కాలివేళ్ళకు నెత్తురు కారుతోంది. ముండ్ల కంపలు చీరుకపొయ్యి కాళ్లుచేతులకు గీతలు పడ్డాయి. నిరాశ, నిస్పృహలు ఆవరిస్తున్నా కొమ్ముల బర్రె రూపం కండ్ల ముందు కదలాడుతుంటే వదులు కోవాలనిపించలేదు. ఇంటి వద్ద పాలకోసం అలమటిస్తున్న దుడ్డె మెదిలేసరికి చిన్నప్పటి కొమ్ములSబర్రె గుర్తొచ్చి గుండె బరువెక్కి గోవర్ధన్ కాలు ముందుకే కదిలింది. సలెంద్రి, కమ్మర్లపల్లె, అల్లిపురం ఇలా ఊర్లకూర్లు దాటి పోయాడు. మూడోరోజు సాయంత్రం అయినా ఆచూకీ లేదు. వెదకటం ఆపేద్దామని మొదటిసారి అనిపించింది గోవర్ధన్‌కు. మూడు రోజులుగా అలుపెరుగని ప్రాణం మెత్తబడ్డది. ‘పొద్దు గూట్లెవడ్డది. ఇప్పుడు వెనుకకకు మర్లినా ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదైతది’ అనుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. యెల్లాయపల్లె, కొచ్చెగుట్టపల్లె, రంగాయపల్లె.. ఊరూరూ ఆరా తీసుకుంటూ సొంతూరు చేరుకునే సరికి రాత్రి పది గంటలయింది. ఎప్పటిలానే ఇంటి ముందు నలుగురైదుగురు ముచ్చట పెడుతూ ఎదురుచూస్తున్నారు. తను వాకిట్లోకి రాగానేlరాధవ్వ ఇంట్లోకి నడిచింది. తెల్లవారు జాము నాలుగవుతుంది. ఇంటి వెనుక దిడ్డి దర్వాజ దగ్గర ఏదో అలికిడి అవుతున్నట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది గోవర్ధన్‌కు. కళ్ళు నులుముకుంటూ లేచి బయటి లైట్ వేశాడు. గొళ్ళెం తీసి తలుపు తెరిచిన అతను నిశ్చేష్టుడయ్యాడు. ‘నిజమా.. భ్రమా..’ అనుకుని చేయి ముందుకు చాచాడు. వెచ్చగా తగిలింది ఊపిరి. కొమ్ముల బర్రె చెవులూపుతూ తదేకంగా తనవైపే చూస్తోంది. సంతోషం పట్టలేక కొమ్ముల బర్రె మూతిని రెండు చేతుల్లోకి తీసుకుని ఆర్తిగా తడిమాడు. సన్నగా అరిచింది బర్రె. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు ఇంట్లోకి పరుగెత్తుకెళ్లాడు. గోళెంలోని కుడితిని బకెట్లో నింపుకొని తెచ్చి బర్రె ముందు పెట్టాడు. పూర్తిగా పీల్చే వరకు కుడితిలో ముంచిన మూతిని పైకెత్తలేదు బర్రె. అలా రెండు, మూడు బకెట్లు తాగింది. మూతికంటిన తవుడును నాలుకతో అద్దుకుంది. ప్రతిరోజూ సాయంత్రం అది కుడితి తాగింతర్వాతనే గుంజ దగ్గరికి నడుస్తుంది. బయటకొచ్చిన రాధవ్వ ఆ దృశ్యం చూసి ఆనందం పట్టలేక పరుగుపరుగున దేవుడి పటాల ముందుకెళ్లి కళ్లు మూసుకొని చేతులు జోడించి నిలబడింది. అప్పటికే తల్లి వాసన పసిగట్టిన దుడ్డె అరుస్తూ మొగురం చుట్టూ తిరుగసాగింది. గోవర్ధన్ వచ్చి తలుగు తప్ప దియ్యంగనే తల్లి దగ్గరకు ఉరికిపోయింది దుడ్డె. ‘నీ కడుపుగాల పోరన్ని ఎంత తిప్పలవెడితివే? పెసరిత్తు పట్టకుంట తిన్నది ఎవని శేను ముంచెనో? మల్ల ఏమెర్కలేని సొన్నారోలె సూత్తంది’ అంటూ చేతి కర్రతోని గడ్డిగుంజ దగ్గరికి జరిపింది రామవ్వ. ఆ మాటలన్నీ లీలగా వినపడుతుంటే కలా.. నిజమా.. అనుకుంటూ మెల్లగా దుప్పటి పక్కకు జరిపి వాకిట్లోకి చూశాడు నితీష్. -కొండి మల్లారెడ్డి -
ఈవారం కథ: కేటరింగ్ బోయ్
చింకిచాప, అతుకులబొంత మీద పడుకున్న ఈశ్వర్ బద్ధకంగా దొర్లుతున్నాడు. జీర్ణావస్థలో ఉన్న దిండులో దూది, చిరిగిన గలేబు మృత్యుశయ్య మీద మరణానికి ఎదురుచూస్తున్న ముసలిరోగుల్లా ఉన్నాయి. వాటిని వదల్లేని ఈశ్వర్ పేదరికం కొన ఊపిరిని కాపాడాలనుకునే వెంటిలేటర్లా వెంటపడుతోంది. ‘నిన్న రాత్రి యామిని ఇచ్చిన కాగితంలో ఏమి రాసిందిరా?’ చక్రపాణి అడగడంతో జేబు తడుముకున్నాడు ఈశ్వర్. ‘చూసి చెపుతానులే’ ప్రాధాన్యంలేని విషయమన్నట్లు సమాధానం దాటేశాడు. ‘అమ్మాయి ఉత్తరం ఇస్తే ఇంతసేపు చూడకుండా ఎలాగున్నావురా?’ ‘ఇచ్చింది ప్రేమలేఖ కాదు. కాగితం ముక్క’ ‘నిన్ను మార్చడం నా వల్ల కాదురా’ తల కొట్టుకున్న చక్రపాణి, మరోమాట చెప్పకుండా ఆఫీసుకెళ్లాడు. ఈశ్వర్‌కి మూడేళ్ళ క్రితం దూరమైన యామిని గుర్తొచ్చింది. చదువుకునేరోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. స్థాయీ అంతరం అంతరంగాల ప్రేమకి అడ్డం పడింది. కల కరిగిపోయి యామిని పెళ్లి జరిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు గుండెకైన గాయం రేగింది. తేనెపట్టులోంచి రాయిదెబ్బకు ఎగిరిన తేనెటీగలా ముందురోజు జరిగిన సంఘటన మెదడులో మెదిలింది. ‘ఈశ్వర్, నువ్వు లక్కీచాన్స్ కొట్టేశావ్. నాలుగ్గంటలు పనిచేస్తే ఐదువందలు ఇస్తారు. భోజనం బోనస్’ చక్రపాణి చెప్పాడు. ‘నాలుగ్గంటలకు ఐదువందలా?’ నోరు వెళ్లబెట్టాడతను. ‘తర్వాత ఆశ్చర్యపోదువుగానీ పార్టీటైమ్ అయిపోతోంది. మా హోటల్ కేటరింగ్ సర్వీసుకి రెగ్యులర్ కుర్రాళ్లురాలేదు. మేనేజర్ నాకు తెలుసున్న కుర్రాళ్లని తీసుకురమ్మనాడు’ ‘వద్దులేరా. నాకు వడ్డించడంలో ఓనమాలు తెలియవు. అన్నం లేకపోతే నీళ్లు తాగి, కాళ్ళు కడుపులో పెట్టుకునిç ³డుకుంటాను. తేడా జరిగితే తిట్లు తినాలి’ ‘ఆ సంగతి నాకు వదిలేయ్ నేన ుచూసుకుంటాగా’ చక్రపాణి ధైర్యం చెప్పడంతో యూనిఫాం వేసుకుని కేటరింగ్ బోయ్‌గా బండి ఎక్కాడు ఈశ్వర్. పెద్ద వాళ్ళింట్లో పార్టీ. గుబులుగానే గుంపుతో అడుగులేశాడు. వణుకుతున్న చేతులతో చెంచా పట్టుకుని వడ్డనకు సిద్ధపడ్డాడు. ధైర్యం కుదుటపడుతున్న సమయంలో తనకళ్ళని తానే నమ్మలేక పోయాడు ఈశ్వర్. యామిని.. మూడేళ్ళ తర్వాత .. కనిపిస్తోంది. భర్తతో పార్టీకొచ్చింది. ఆమె నడచి వస్తున్న నగల దుకాణంలా ఉంది. ఆమె వేసుకున్న నగల విలువ అంచనాకి అందని టెండర్లా ఉంది. వజ్రాలహారం మీద పడ్డ దీపాలకాంతి మొహం మీద పడుతూ దేవకన్యలా వెలిగిపోతున్న ఆమెను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది. తెలియని బెరుకు వెనక్కి లాగేస్తోంది. అక్కడున్న జనం మహారాణి ముందు భటుల్లా వంగివంగి దండాలు పెడుతున్నారు. ‘మీకేం కావాలో చెప్పండి మేడం.. తెప్పిస్తా’ పళ్ళెంతో వెళ్తున్న యామినిని ఆపే ప్రయత్నం చేశాడో పెద్దమనిషి. యామిని ఆగలేదు. ఎవరినీ పట్టించుకోకుండా ఈశ్వర్ వైపే వెళ్తోంది. ఐదువందలకు ఆశపడ్డ ఈశ్వర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా వుంది. ఆమె కంటపడకుండా చేసిన ప్రయత్నం ఫలించేలా లేదు. యామిని దగ్గరకు వచ్చేస్తోంది. అతనిలో ఉద్విగ్నత పున్నమిరాత్రిలో సముద్రపోటులా పెరుగుతోంది. అతని పట్ల యామిని చూపుల్లో చులకన భావం కనిపించింది. ఆమె ఆలోచనల్లో మార్పొచ్చినట్లు ఆమె చూపులను బట్టి అర్థమవుతోంది. వెళ్లిపోతున్న యామిని.. కాగితమొకటి ఈశ్వర్ వైపుగా విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. ఈశ్వర్æఆ కాగితాన్ని అసంకల్పితంగా జేబులో పెట్టాడు. గమనించిన చక్రి ‘యామిని ఏం విసిరిందిరా?’ అని అడిగాడు. సమాధానం చెప్పకుండా యూనిఫాం మార్చేసుకున్నాడు ఈశ్వర్. తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. వాళ్ళతోపాటుగా మౌనం, చీకటీ అడుగులేస్తున్నాయి. రోడ్డు మీద గుంతల్లో నిలిచిపోయిన వర్షం నీళ్ళలో చిక్కటి చీకటి నల్లగా ఆక్రమించింది. దూరంగా కీచురాళ్ళ మోత వినిపిస్తోంది. వీధిలో అలికిడికి కుక్కలు మొరుగుతున్నాయి. ఈశ్వర్ గుండె బరువు.. యామిని వేసుకున్న నగల బరువు కన్న ఎక్కువగానే ఉంది. నియంత్రణ లేని నిశ్శబ్దం.. ఓపలేని నిశ్శబ్దం.. గుండె చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం. మనిషి మోయలేనంత బరువుగా నిశ్శబ్దం. ఆ భయంకర నిశ్శబ్దంలోంచి అతనిలో ఊపిరి ఆగిఆగి తెరలుగాౖ బెటకొస్తోంది. ‘తప్పు చేశానురా చక్రీ.. ఈ అవమానం పడే కన్నా ఆకలిని భరించడమే హాయిగా ఉండేదేమో?’ ‘తప్పంతా నాదేరా! నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ కాగితం..’ ‘ఇప్పుడు వద్దురా. చూస్తే తట్టుకునే శక్తి..’ ఈశ్వర్ ఏదో చెప్పబోయాడు. మాట పెగలటం లేదు. గొంతుకి బాధ అడ్డం పడుతోంది. మాట్లాడుకోకుండానే రూమ్కెళ్లారు. బద్ధకాన్ని వదుల్చుకున్న ఈశ్వర్‌కు.. పార్టీలో గుచ్చుకున్న యామిని చూపులు గుర్తుకొచ్చాయి. జేబులో కాగితం కసిగా నలిపేసి విసిరేశాడు. కాగితంలో ఏం రాసుంటుందనే ఆలోచన మనసుని స్థిమితంగా ఉంచలేదు. విసిరేసిన కాగితాన్ని తెచ్చుకుని విప్పిచూశాడు. ‘రెండురోజుల తర్వాత ఇంటికిరా’ కింద మొబైల్ నంబర్, అడ్రస్ రాసుంది. ‘ఏం రాసిందిరా మాజీప్రియురాలు?’ ఆఫీస్ నుంచి వస్తూనే అడిగాడు చక్రి. ‘అసలు ఎందుకు రమ్మందంటావు?’ చక్రపాణి చేతికి కాగితమిస్తూ అనుమానం బైట పెట్టాడు ఈశ్వర్. ‘హీనస్థితి గుర్తుచేసి అవమానించాలని పిలిచిందా!’ మనసులో సందేహం బైట పెట్టాడు. ‘అవమానించడానికి పిలవక్కర్లేదు. పార్టీ విషయమైతే తప్పు నా వల్ల జరిగిందని చెప్పు’ ‘వెళితే తెలుస్తుందిగా. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే వేడిగా టీతాగుదాం..’ సంభాషణ పొడిగించడం ఇష్టంలేక బైటికి తీసుకెళ్లాడు ఈశ్వర్. ∙∙ ఈశ్వర్ పెద ్దభవంతి ముందు నిలబడ్డాడు. నల్లటి గ్రానైట్ రాయి మీద బంగారు రంగు అక్షరాలతో ‘యామిని నిలయం’ అని అందంగా చెక్కి ఉంది. ఇంటి ముందు ఒకే నెంబరున్న కార్లు బారులు తీరి క్రమశిక్షణగా ఉన్నాయి. ఇల్లులా అనిపించలేదు. రక్షణవలయం మధ్య దుర్భేద్యమైన కోటలా కనిపించింది. లోపలికి వెళ్తున్న ఈశ్వర్ వేషం, భాష చూసిన సెక్యూరిటీ ఆపేశాడు. ‘యామిని మేడమ్‌కి ఈశ్వర్ వచ్చాడని చెప్పండి’ అనడంతో సెక్యూరిటీ ఫోన్లో మాట్లాడి, ‘మేడం మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు సార్’ అన్నాడు వినయంగా. లోపలికి నడిచాడు. పాలరాతి మెట్లు పాదముద్రలకు మాసిపోతాయని భయంతో పదిలంగా అడుగులేస్తున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సినిమా సెట్టింగ్లాంటి విశాలమైన హాల్. సీలింగుకి ఖరీదైన షాండిలియర్ వేలాడుతోంది. సూర్యుడు మకాం వేసినట్లు ఇంట్లో దీపాల వెలుగుకి కళ్ళు జిగేల్మంటున్నాయి. ఇల్లు్లవజ్రాలు పొదిగిన హారంలా ధగధగ లాడిపోతోంది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇల్లంతా కలయ చూస్తున్నాడు. ఘల్లుఘల్లుమంటూ మెట్ల మీద నుంచి వస్తున్న మువ్వల చప్పుడుకి అటుగా చూశాడు. పూత పూసిన దర్పం నిలువెత్తు యామినై నడిచి వస్తున్నట్లుంది. ఆమెను చూసిన ఈశ్వర్ స్థాణువులా నిలబడి పోయాడు. ‘నిలబడ్డావేం? కూర్చో’ సోఫా చూపించింది. ఖరీదైన సోఫాలో కూర్చోడం ఈశ్వర్‌కి ఇబ్బందిగా అనిపించింది. ‘ఏం తీసుకుంటావ్.. కాఫీ,టీ, బోర్న్‌విటా , ఫ్రూట్ జ్యూస్?’ ‘ఒక గ్లాస్ మంచి నీళ్లు’ అంటూ ఈశ్వర్ చెప్పిన తీరుకి యామిని నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని మెరిసిన పన్ను పైన పన్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు. లిఫ్ట్‌లోంచి పనమ్మాయి రెండు నీళ్ల గ్లాసులున్న ట్రేతో వచ్చింది. ఇంట్లో లిఫ్ట్ ్టఉండడం ఈశ్వర్ ఊహకందని విషయం. ‘ఇల్లు చాలా బాగుంది’ మంచినీళ్ళు గుటకలేస్తూ అన్నాడు. ‘కాఫీ తీసుకురా’ పనమ్మాయికి ఆర్డర్ వేసింది యామిని. ‘మూడు అంతస్తుల్లో పద్దెనిమిది గదులు ఉన్నాయి. మావారు నా పుట్టిన రోజు కానుకగా ‘యామిని నిలయం’ కట్టించారు’ మనసులోని అహంకారం మాటల్లో ధ్వనించింది. ‘ఇంట్లో ఎంతమంది..’ ఈశ్వర్ మాట పూర్తికాకుండానే చెప్పింది ‘మేమిద్దరమే’ అంటూ. ‘ఏమిటి పద్దెనిమిది గదుల్లో ఇద్దరే ఉంటారా?’ఆశ్చర్యపోయాడు. ‘ప్రస్తుతం ఒక్కదాన్నే ఉన్నాను. ఆయన బిజినెస్ పని మీద లండన్ వెళ్లారు’ ట్రేలోని కెటిల్స్, కప్పులతో వచ్చిన పనమ్మాయిని వాటిని టీపాయి మీదపెట్టి వెళ్లిపొమ్మని సైగ చేసింది యామిని. శిరసా వహించింది పనమ్మాయి. అక్కడ ఉన్న ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం అధికారం చెలాయిస్తోంది. ఒక కెటిల్లోంచి కాఫీ డికాక్షన్, మరో కెటిల్లోంచి పాలు కప్పులో పోసింది. దాంట్లోషుగర్ క్యూబ్స్ వేసి చెంచాతో కలిపి కప్పుని సాసర్లో పెట్టి అందించింది. కప్పుల చప్పుడుకి నిశ్శబ్దం చెదిరి పోయింది. కప్పు అందుకుంటుంటే ఈశ్వర్ చేతులు వణికాయి. ‘చేతులెందుకు వణుకుతున్నాయి?’ ‘ఏంలేదు’ మాటలు కూడా తడబడ్డాయి. ‘నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు’ హఠాత్తుగా అనేసింది. ‘ఏ పని?’ అర్థంకానట్లు అడిగాడు. ‘ఆరోజు పార్టీలో..’ మొహంలో చికాకు స్పష్టంగా కనబడింది. ‘అవసరం చేయించింది’ ‘నీ అవసరం డబ్బేనా?’ పర్సులోంచి నోట్ల కట్టలు తీసి టీపాయి మీద విసిరింది. ‘ఇంకా కావాలా? అవసరమైతే అడుగు’ మాటల్లో డబ్బు పొగరు కనిపించింది. ఆ క్షణంలో ఈశ్వర్‌కు వచ్చిన కోపం విద్యుత్తీగలో కనబడకుండా కదిలిన కరెంటులా ఉంది. తనని తాను సంభాళించుకున్నాడు. మౌనంగా డబ్బు తీసి పక్కన పెట్టాడు. ముట్టుకుంటేనే నిప్పు కాలుతుంది. ఆకలి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. పైకిరాని మాటలు మనసులోనే కొట్టుకుంటున్నాయి. ఆత్మాభిమానానికున్న శక్తి గుండెల్ని బలంగా తట్టి లేపింది. ‘నీ పెళ్ళికి బహుమతి ఇవ్వలేదని బాధపడేవాడ్ని. ఇల్లు చూశాక ఇవ్వకపోవడమే మంచిదనిపించింది. ఈ ఇంటిలో నీకంటికి చిన్నదిగానే కనబడేది’ అతనన్న మాటకు ఆమె నవ్వింది. ఆ నవ్వులో అహంకారం కనిపించింది. ‘ నువ్వు మరచిపోలేని విలువైన బహుమతి ఇద్దామని ఉంది. చిన్నకోరిక తీరుస్తావా?’ లేచి నిలబడ్డాడు. ఊహించని ప్రశ్నకు యామిని కంగారు పడింది. ‘కంగారుపడకు. పెళ్ళైన స్త్రీని కోరుకునేంత బలహీనుడ్ని కాదు’ చెపుతోంటే స్వచ్ఛమైన సరస్సులో నిర్మలమైన పున్నమిచంద్రుడి ప్రతిబింబంలా ఉన్నాడు ఈశ్వర్. ‘ఏమిటో చెప్పు’ కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అడిగింది. ‘మనమిద్దరం కలసి భోజనం చేయాలి’ ‘ఓస్! ఇంతేనా? నీకేం కావాలో చెప్పు. గంటలో ఏర్పాటు చేస్తా’ అంటూ పక్కనున్న బెల్ కొట్ట బోయింది. ‘ఇక్కడ కాదు. బైటకెళ్లాలి’ ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు ఈశ్వర్ కొత్తగా కనిపించాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఆలోచిస్తోంది యామిని. అంగీకరించదనిపించి సోఫాలోంచి లేచి గుమ్మం వైపు కదిలాడు ఈశ్వర్. ‘అగు!’ అన్న ఆమె పిలుపుతో ఆగిపోయాడు ఈశ్వర్. ‘సరే! నీకోసం ఒప్పుకుంటున్నా. ఏ హోటల్‌కు వెళ్దాం?’ ‘నేను తీసుకెళ్ళేది స్టార్ హోటల్ కాదు. నా స్థాయి హోటల్. మనం వెళ్ళేది ఆటోలో’ ‘ఆటొలోనా? నా ఇంటి ముందున్న కార్లను చూసే చెప్తున్నావా? నేను గుమ్మం దాటితే ఏ కారు ఎక్కుతానో ఆఖరి క్షణం వరకు నాకే తెలియదు. అలాంటిది నాగుమ్మం ముందే ఆటో ఎక్కితే..’ ‘నాలాంటి పేదవాడికి ఆటోలో వెళ్లడమంటే విమానంలో ఎగిరినట్టే. ఖరీదైన కార్లు ఎక్కే అర్హత లేనివాడ్ని. ఆటోలో వస్తే పనివాళ్ళ ముందు చులకన కదా! నీకు ఇబ్బందనిపిస్తే వద్దులే’ ఆమెలో అహాన్ని మాటలతో రాజేశాడు. ‘ఆఫ్ట్రాల్, నా దగ్గర పనిచేసే వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోవడం ఏంటి? నాన్సె¯Œ ్స’ అంటూ బయలుదేరింది యామిని. ఇద్దరూ బయటకు నడిచారు. కారు లేకుండా తొలిసారిగా కాలి నడకన బయటకు వస్తున్న యామినిని చూసినవాళ్లు ఆశ్చర్య పోయారు. ఈశ్వర్ ఆటోని పిలిచేముందు జేబు తడుముకున్నాడు. కరెన్సీ నోటు స్పర్శ తగిలి ధీమాగా ఆటోఎక్కాడు. అతని దృష్టంతా తిరుగుతున్న ఆటో మీటర్ మీదే ఉంది. పైకి మాత్రం మొహమాటంగా నవ్వుతున్నాడు. ఆటో సిటీకి దూరంగా ఉన్న హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. తిరిగి ఇచ్చిన చిల్లర లెక్కపెట్టుకున్నాడు. హోటల్లోకి వెళ్ళాడు. జనంతో హోటల్ కిక్కిరిసి ఉంది. ‘టిఫిన్ తేవడానికి ఇంకా ఎంతసేపు?’ అంటూ హోటల్లోపల నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ‘యామినీ.. లోపల ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మరో చోటకెళదామా?’ బైటకొచ్చి చెప్పాడు. ‘ముందే సీట్లు రిజర్వ్ చేయవలసింది ’ ఆమెలో విసుగు మొహం మీద కనిపించింది. ‘ఈ హోటల్లో బుకింగ్స్ ఉండవు. అందరికీ సదా స్వాగతమే’ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ మరో హోటల్ వైపు నడిచారు. అక్కడ జనం కన్నా టేబుల్ మీద బొద్దింకలు, ఈగలే ఎక్కువగా ఉన్నాయి. చికాకుగా మొహంపెట్టి ‘ఇక్కడొద్దులే ఈశ్వర్. మరో చోటకు వెళదాం’ అంది. వేసవి ఎండ మండి పోతోంది. వడగాల్పులకు వదిలే శ్వాస వేడిగా వస్తోంది. నడవలేక యామిని ఆపసోపాలు పడుతోంది. నుదుటి మీద చెమటను రూమాలుతో తుడుచు కుంటోంది. దాహంతో గొంతు పిడచకట్టుకు పోతోంది. యామిని మొహంలో అలసట, కళ్ళలో నీరసం కనిపిస్తున్నాయి. ‘ఇక నావల్ల కావటంలేదు. ఆకలి చంపేస్తోంది. అర్జెంటుగా ఏదోకటి తినాలి’ అంటూ రోడ్డు పక్కన చెట్టు నీడలో నిలబడిపోయింది. ‘నా పరిస్థితీ అదే. మరో కిలోమీటర్ దూరం దాకా హోటల్స్ ఏం లేవు కానీ దొసెల బండి ఉంది. అక్కడ దోసెలు బాగుంటాయి తిందామా?’ అన్నాడు. ‘చెప్పానుగా ఎక్కడోక్కడ.. ఏదోకటి..! ఆకలితో కాలే కడుపుకి మండే బూడిద అంతే’ ‘బండి దగ్గర నిలబడి నువ్వు తినలేవులే. ఇక్కడే కూర్చో. నేనేతెస్తా’ అంటూ దోసెల బండి దగ్గరకు వెళ్లి దోసెలు తెచ్చాడు. అవురావురంటూ నాలుగు దోసెలు తినేసింది. ఎక్కిళ్ళు వస్తుంటే ఈశ్వర్ ఇచ్చిన కుండలో నీళ్లను గడగడా తాగేసింది. అప్పుడు యామినికి మినరల్ వాటర్ గుర్తుకు రాలేదు. ఆకలి తీరాక ఆయాసం తీర్చుకుంటోంది. వచ్చి నెమ్మదిగా పక్కనే కూర్చున్నాడు ఈశ్వర్. ‘ప్రపంచంలో విలువైనది, మనిషి బతకడానికి కావలసిందేమిటి?’ అని అడిగాడు. ఒక క్షణం ఆలోచించి ‘డబ్బు’ అంది. బిగ్గరగా నవ్వాడు ఈశ్వర్. ఆసహనంగా చూసింది యామిని. ‘డబ్బులో పుట్టిపెరిగిన నీకు అదే తెలుసు’ ‘దరిద్రం నుంచి వచ్చిన వాడివిగా నీకు తెలిసిందేమిటో చెప్పు’ కోపంతో ఆమె మాట అదుపు తప్పింది. ‘నిజమే.. నేను పేదరికంలో పుట్టాను. దరిద్రంలోనే బతుకుతున్నాను. నా బతుకు దరిద్రానికి కేరాఫ్ ఎడ్రస్. దరిద్రుడు అనేది నాలాంటి వాళ్ళకుండే బిరుదు’ ఈశ్వర్ శాంతంగా సమాధానం చెపుతోంటే యామిని తప్పు తెలుసుకుంది. ‘సారీ ఈశ్వర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను’ ‘ఫర్వాలేదు. చదివించిన తల్లితండ్రులకి చేదోడుగా ఉండి ఋణం తీర్చుకోలేని దౌర్భాగ్యుడిని. నన్ను ఆ మాటనడం సబబే. నన్ను మీ ఇంట్లో ఓ ప్రశ్న అడిగావు.. గుర్తుందా?’ ఏమిటన్నట్లుచూసింది. ‘పార్టీలో కేటరింగ్ సర్వీస్ ఎందుకు చేశావని’ గుర్తు చేశాడు. అవునన్నట్లు తలూపుంది యామిని ‘నన్ను అభిమానించే వ్యక్తిగా నీకు నా బతుకు పట్ల బాధ సహజం. కానీ మీ జీవితాల్లాగా మాలాంటోళ్ల బతుకు వడ్డించిన విస్తరి కాదు. మెతుక్కోసం వెతుక్కునే బతుకులు మావి. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసం ఏ పనైనా చేస్తాం. నేను అదే చేశాను. కడుపులో ఆకలి మంటని ఆర్పడం కోసం కేటరింగ్ బోయ్ పని చేశాను’ అని చెపుతోంటే ఈశ్వర్ గొంతు గాద్గదికమైంది. అక్కడున్న గ్లాస్‌లోని నీళ్లను గుటకేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్నో స్టార్ హోటల్స్ చూసిన నువ్వు రోడ్డు పక్క బండిలో దోసెలు తిన్నావు. మినరల్ వాటర్ తాగే నువ్వు ఎప్పటి నీళ్ళో తెలియకుండానే కుండలో నీళ్ళు తాగావు. అదే ఆకలికున్న శక్తి. ఆకలేస్తే తినేది అన్నం. కరెన్సీ నోట్లు కావు. కోట్ల విలువైన భూములు కొన్నివేల ఎకరాలుండచ్చు. ఎవరికైనా కావలసింది ఆరు అడుగులే. అలాగే జానెడు పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే. ఎవరైనా ఆకలికి బానిసే. ఎంతటి వారైనా ఆకలికి దాసులే. ఆకలి ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే సకల చరాచార సృష్టిలో విలువైనది ఆకలి. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే చెప్పచ్చు. ఆకలి విలువ అనుభవపూర్వకంగా నీకు తెలవాలని ఈ పని చేశాను. మన్నించు’ మనసులో కొట్టుకుంటున్న మాటలు చెప్పి బరువు దించుకున్నాడు. ‘నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆకలిని తీర్చుకోవచ్చు కదా!’ ‘కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో కాదు. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ముష్టితో బతికే బతుకు బతుకు కాదు. దొంగతనం చేసి సంపాదించవచ్చు. ఆ పని ఆత్మహత్యతో సమానం. మన సంపాదనలో నైతికత ఉండాలి. మనం చేసే పనివల్ల పరువు పోకూడదు. మన వల్ల పనికి గుర్తింపు రావాలి. పనిలో ఎక్కువ తక్కువలు చూడకూడదు. నిజాయితీతో ఆకలి తీరాలి. కుదిరితే నలుగురికి ఆకలి తీర్చాలి’ అంటూ పక్కనున్న గ్లాసులో మిగిలిన గుక్కెడు నీళ్లనూ గొంతులో పోసుకున్నాడు. యామినికి లిప్తపాటుకాలం ఆకలిని తట్టుకోలేక పోయిన నిజం గుర్తొకొచ్చింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈశ్వర్ మాటల్లో నిప్పులాంటి నిజం ఆమెలో అహాన్ని కాల్చేసిన వాసన అక్కడ మెల్లగా వ్యాపిస్తోంది. అనుభవ పాఠాల్లో ఆరితేరిన అతన్ని చూస్తోంది.. అటుగా వస్తోన్న ఆటోని ఆపడానికి లేచాడు. అతనిని అనుసరించింది ఆమె. - పెమ్మరాజువిజయరామచంద్ర -
ఈవారం కథ.. తరంగం
పన్నెండు దాటింది. నిద్ర రావడం లేదు. ఆలోచనల్లో మునిగిపోయున్నాను. పదిరోజుల్లో నా జీవితం ఇంతలా మార్పు చెందుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ∙∙ సోమవారం ఉదయాన్నే అలారం మోగింది. కళ్లు తెరిచాను. ఇంకా పడుకోవాలనిపించింది. కానీ బాస్ ఇచ్చిన పని గుర్తొచ్చింది. బద్ధకంగా ఉన్నా లేవాల్సి వచ్చింది. ఫార్మల్స్ వేసుకొని తయారయ్యాను. చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. వంట గదిలోంచి అమ్మ.. ‘అజ్జూ.. టిఫిన్ తిందువురా’ అంటూ పిలిచింది. ‘వస్తున్నా.. ’ అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చాను. టేబుల్ మీద వేడి వేడి ఉప్మా ఆకలిని పెంచింది. కూర్చి వెనక్కి లాక్కొని కూర్చున్నాను. స్పూన్‌తో తీసుకున్న ఉప్మా వేడిని నోటి ద్వారా ఊదుతూ చల్లారబెట్టుకుంటూండగా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది. ‘వెళ్లాల్సిందేనా నాన్నా.. ’ అని అడిగింది వెళ్లకుండా నేను తప్పించుకుంటే బాగుండు అన్న భావంతో. ‘తప్పదమ్మా.. చిన్న పనే కానీ చాలా ముఖ్యమైంది. వీలైనంత తొందరగా ముగించేసుకొని వచ్చేస్తా’ అని చెప్పా. ‘జాగ్రత్త.. త్వరగా వచ్చేసెయ్’ అంటూ లంచ్ బాక్స్ తెచ్చి నా బ్యాగ్‌లో సర్దింది. బ్యాగ్ తీసుకొని వెళ్లబోతూ ‘అవునూ.. కార్తీక్ ఎక్కడ?’ అని అడిగా. ‘వాడికి అంత తొందరగా తెల్లారుతుందా?’ నవ్వుతూ దీర్ఘం తీసింది అమ్మ. ‘ఔనౌను.. కుంభకర్ణుడి వారసుడు’ అంటూ నవ్వుతూ బండి స్టార్ట్‌చేశా.. గేట్ తోసుకొని వెళుతూ ‘ఓకే అమ్మా.. వెళ్లొస్తా... బై’ అని చెప్పేసి యాక్సిలేటర్ రైజ్ చేశా. ఒక్కసారిగా ఆఫీస్‌లో చాలామందిని చూసేసరికి మొహమ్మీది మాస్క్‌ను సరి చేసుకున్నా. ‘హలో అర్జున్.. ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది చూసి?’ అన్నాడు రవి. ‘హాయ్రా.. బానే ఉన్నా.. నువ్వెలా ఉన్నావ్?’ అడిగా. ‘నాకేంట్రా.. బానే ఉన్నా’ చెప్పాడు. ఈ ఆఫీస్‌లో చేరినప్పుడు మొదట పరిచయమైన వ్యక్తి రవే. ఫ్రెండ్లీ నేచర్ అతనిది. అందరితో సులువుగా కలిసిపోతాడు. ఎప్పుడూ సంతోషంగా.. అందరినీ నవ్విస్తూ ఉంటాడు. నాకు చాలా క్లోజ్ అతను. అలా ఇద్దరం మాట్లాడుకుంటూనే డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ‘అర్జున్ .. ఇవ్వాళ మన సంతోష్ పుట్టినరోజు .. వాడు చిన్న పార్టీ ఇస్తున్నాడు’ అన్నాడు రవి. ‘పార్టీనా?’ ‘అవును. వాడు ఫోన్ మార్చాడట.. అందుకే నీ ఫోన్ నెంబర్ మిస్ అయినట్టుంది. నిన్ను పార్టీకి తీసుకురమ్మని నాకు చెప్పాడులే. ఈ రోజు ఈవెనింగ్..! మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు.. నువ్వూ రావాలి.. వస్తావుగా!’ నేను మౌనంగా ఉండడం చూసి.. నవ్వుతూ నా భుజం మీద చెయ్వేసి ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటారులే.. భయపడకు’ అన్నాడు. చాలా రోజుల తర్వాత బయటకు రావడం.. వెళితే అందరినీ కలిసినట్టు ఉంటుందని వెళ్దామనే నిర్ణయించుకున్నా.. అయితే పార్టీలో మాస్క్ తీయకుండా.. ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్టైన్ చేయాలనీ డిసైడ్ అయ్యి ‘సరే.. వస్తాన్రా’ అని మాటిచ్చా రవికి. పిచ్చాపాటీ అయిపోయాక సీరియస్‌గా పనిలో నిమగ్నమయ్యా. లంచ్ టైమ్‌లో అందరం దూరం దూరంగానే కూర్చొని లంచ్ కానిచ్చాం. తర్వాత వెంటనే మాస్క్ వేసుకొని నా డెస్క్‌కి వచ్చేశా. ఆఫీస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లేసరికి సాయంకాలం నాలుగున్నరైంది. లంచ్ బాక్స్ నేనే కడిగి.. నా బ్యాగ్‌ను శానిటైజ్ చేసుకొని సరాసరి స్నానానికి వెళ్లా. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి అమ్మ, కార్తీక్ కూర్చొని ఉన్నారు. ‘అమ్మా.. ఈ రోజు నా కొలీగ్, ఫ్రెండ్ సంతోష్ లేడూ.. వాడి బర్త్‌డే.. నైట్ చిన్న పార్టీ ఇస్తున్నాడు. వెళ్లనా?’ అడిగా. ‘చాలా మంది వస్తారేమో.. సేఫ్ కాదేమోరా! సెకండ్ వేవ్ అంటున్నారు.. ఈ టైమ్‌లో రిస్క్ అవసరమా?’ అంది అమ్మ. ‘జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నారమ్మా..! అందరూ మాస్క్‌లు పెట్టుకొనే ఉంటారు. నేనూ తీయను. అయినా నువ్వు టీవీలో కరోనా వార్తలు చూడ్డం మానెయ్. వాళ్లు అలాగే భయపెడ్తారు. ఈరోజు ఆఫీస్‌కి వెళ్లినప్పుడు చూశాగా.. బయట అంతా నార్మల్‌గానే ఉంది. అందరూ మామూలుగానే తిరుగుతున్నారు. ఇన్నాళ్లూ ఇంట్లోంచి వర్క్ చేసీచేసీ బోర్ కొట్టిపోయింది. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లొస్తా.. ప్లీజ్ అమ్మా.. ’ అన్నాను బతిమాలుతున్నట్టుగా. ఒప్పుకుంది అమ్మ. నేనూహించిన దానికంటే ఎక్కువమందే వచ్చారు పార్టీకి. చాన్నాళ్ల తర్వాత కలుసుకున్నామేమో అందరం.. కబుర్లు, జ్ఞాపకాలు, సరదాలతో ఇట్టే గడిచిపోయింది టైమ్. కేక్ కట్ చేయడానికి ముందు అందరం గుంపుగా నిలబడి బర్త్ డే సాంగ్ పాడాము. మా బృందంలోంచి ఒకరు ‘అయ్యో.. క్లాప్స్ కొట్టొద్దా? అరేయ్ సంతూ.. నీకెన్నేళ్లురా ఇప్పుడు?’ అని అడిగాడు. ‘ఒక డెబ్బై ఉంటాయేమో..!’ అన్నాడు రవి సరదాగా. దాంతో అందరూ నవ్వారు. ‘అవున్రా.. ఉంటాయ్. మరి అన్ని చప్పట్లు కొడతావా?’ అన్నాడు సంతోష్. ‘వామ్మో.. కొట్టలేనురా బాబోయ్..’ అన్నాడు రవి నవ్వుతూ. గ్రూప్ ఫొటో తీసే టైమ్ వచ్చింది.. అందరూ మాస్క్ తీసేశారు. తీయని వారినీ తీయమని ఫోర్స్ చేశారు. సెకండ్స్లో పనే కదా... అని నేనూ తీసేశాను. కరెక్ట్‌గా అందరం నిలబడి ఫొటోకి పోజ్ ఇచ్చే సమయానికి కెమెరాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. మరో రెండు నిమిషాలు అలాగే నిలబడాల్సి వచ్చింది మాస్క్ లేకుండా. ఫొటో సెషన్, డిన్నర్ ముగించుకుని ఇంటికెళ్లే సరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. అమ్మా, కార్తీక్ నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాళ్లు, చేతులు కడుక్కొని వచ్చి వాళ్ల పక్కన చేరాను. ‘పార్టీ ఎలా అయింది?’ అడిగాడు కార్తీక్. ‘బాగానే అయిందిరా’ ‘నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా?’ ‘హా.. అందరూ వచ్చారు’ ‘అయితే బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావ్ కదూ..’ ‘అవునురా.. చాలా బాగనిపించింది’ కాసేపు వార్తలు చూసి.. నిద్రకుపక్రమించాం. కార్తీక్ నా గదిలోనే పడుకున్నాడు. కానీ మధ్యలోనే అమ్మ దగ్గరకి వెళ్లిపోయాడు నేను బాగా గురక పెడుతున్నానని. బుధవారం మధ్యాహ్నం... సంతోష్‌కు కోవిడ్ లక్షణాలు కనపడ్డాయని.. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందనీ ... పార్టీకి వెళ్లినవాళ్లలో దాదాపు అందరికీ కోవిడ్ సోకిందని తెలిసింది. చాలా భయపడ్డాను. నాకు ఎటువంటి లక్షణాలు లేవు కానీ అమ్మకు కొంచెం ఒళ్లునొప్పులు మొదలయ్యాయని చెప్పింది. ‘నాకు రాకుండా తనకెలా వస్తుంది?’ అనుకున్నాను. ‘పనిమనిషి రావడంలేదు కాబట్టి కొంచెం పనిఎక్కువై అలసటతో వస్తున్నాయేమోలే’ అంది అమ్మ. రెండు రోజుల గడిచాయి.. శుక్రవారం అమ్మకు, కార్తీక్‌కు హై ఫీవర్ వచ్చింది. నాకు కొంచెం తలనొప్పి ఉండింది.. కానీ ఆఫీస్ వర్క్ ప్రెజరేమో అనుకున్నా. అయినా సరే ముగ్గురం కోవిడ్ పరీక్ష చేయించుకున్నాం. ఒక రోజు తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. నాది తప్ప. నా రిపోర్ట్ రావడానికి ఇంకో రోజు పడుతుందన్నారు ఎందుకో! అమ్మ, కార్తీక్.. ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. అమ్మ చాలా భయపడింది. వాళ్లిద్దరూ ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. నేను వాళ్లకు దూరంగానే ఉన్నాను. ఆ రోజు రాత్రి.. కార్తీక్ టీవీ చూస్తున్నాడు. వాడి పక్కనే అమ్మ నిలబడి ఏదో పని చేస్తోంది. హఠాత్తుగా ‘అమ్మా’ అంటూ గట్టిగా అరిచాడు కార్తీక్. బెడ్రూమ్లో పనిచేసుకుంటున్న నేను వాడి కేకకు కంగారుగా హాల్లోకి çపరుగెత్తుకొచ్చి ‘ఏమైందిరా’ అని అడిగా. నేల మీద పడిపోయి.. ఆయాసపడుతున్న అమ్మను చూశా. ‘ఒరేయ్.. హాస్పిటల్ తీసుకెళ్దాంరా..’ అంటూ కార్తీక్ సహాయంతో అమ్మను కార్లో కూర్చోబెట్టా. ఆ రాత్రి నాకు ఇంకా గుర్తు.. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తిరిగి.. ఎంతో మందిని బతిమాలినా ఎక్కడా ఒక్క బెడ్ దొరకలేదు. ఇంట్లో కార్తీక్ ఒక్కడే. బయట కుండపోతగా వాన. జ్వరం, ఆయాసంతో మూలుగుతున్న అమ్మ. ఏం చేయాలో.. అర్థం కాలేదు. అంతా గందరగోళం.. అయోమయం. దుఃఖం తన్నుకురాసాగింది. మనసంతా దిగులు.. భయం.. ఆందోళన. ఆఖరికి రవికి కాల్ చేస్తే ఒక హాస్పిటల్ పేరు చెప్పాడు. అక్కడ బెడ్ దొరికింది. అమ్మకు ఆక్సిజన్ పెట్టారు డాక్టర్లు. కాసేపటికి అమ్మ కాస్త తేరుకుంది. ఆ రోజు రవి చేసిన సహాయం నేనెప్పటికీ మరిచిపోలేను. పీపీఈ కిట్ వేసుకొని అమ్మను కలవొచ్చు అని చెప్పారు డాక్టర్లు. వాళ్లు చెప్పినట్టే పీపీఈ కిట్ వేసుకొని అమ్మ దగ్గరకు వెళ్లా. ఏడుపు ఆగలేదు. నన్ను చూసి అమ్మ ‘నాకేం కాలేదురా.. చిన్నపిల్లాడిలా ఆ ఏడుపేంటిరా? నేను బాగానే ఉన్నా. ఇంటికొచ్చేస్తాలే. ఇల్లంటే గుర్తొచ్చింది.. కార్తీక్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో.. వెళ్లు.. వెళ్లి వాడిని చూసుకో. ఇక్కడ డాక్టర్లున్నారు కదా.. నన్ను వాళ్లు చూసుకుంటారులే! వెళ్లు.. ఇంటికెళ్లు’ అంది ఆయాసపడుతూనే. కళ్లు తుడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధ పడ్డా.. ‘నానీ.. నువ్వు జాగ్రత్తరా.. కార్తీక్‌ను బాగా చూస్కో’ అంది అమ్మ. ‘సరే’ అన్నట్టుగా తలూపి ఇంటికి బయలుదేరాను. ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున్నే వంట చేసి కార్తీక్‌కి పెట్టి.. హాస్పిటల్‌కు వెళ్లాను అమ్మ దగ్గరకు. ఆ రోజు ఆదివారం కావడం వల్లో.. కోవిyŠ పేషంట్స్‌ను ట్రీట్ చేస్తుండడం వల్లో ఏమో కానీ.. రిసెప్షన్ అంతా ఖాళీగా కనిపించింది. నేను అమ్మ ఉన్న గది వైపు వెళ్తుంటే రిసెప్షనిస్ట్ ఆపింది.. ‘మీరు కళావతి తాలూకా అండీ’ అని. ‘అవునండీ.. ఎందుకు? ఏమైందీ?’ అన్నాను గాభారాగా. ‘మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు కలవమన్నారు. మీకే ఫోన్ చేద్దామని ట్రై చేయబోతున్నా.. అంతలోకి మీరే కనిపించారు’ అంటూ డాక్టర్ కన్సల్టెంట్ రూమ్ నంబర్ చెప్పింది రిసెప్షనిస్ట్. గుండెదడతోనే డాక్టర్ని కలవడానికి వెళ్లాను. ‘సర్... ’ అన్నాను లోపలికి రావచ్చా అన్నట్టుగా తలుపు చిన్నగా తీసి. ‘అర్జున్?’ అడిగాడు డాక్టర్. అవునన్నట్టుగా తలూపాను. ఏ భావం లేకుండా చూశాడు నా వైపు. నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. ఆ చూపుతో అది బలపడింది. ‘ఐయామ్ వెరీ సారీ.. ఇందాకే మీ అమ్మగారు గుండెపోటుతో పోయారు’ అన్నాడు చిన్నగా. అంతే.. నా గుండె ఆగినంత పనైంది. అప్రయత్నంగానే కళ్లల్లో నీళ్లు. ‘అ.. అదే..ంటి.. నిన్న రా..రాత్రి బానే ఉంది కదా.. ’ మాటల కోసం కూడబలుక్కున్నాను. ‘అవును బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. చాలా ట్రై చేశాం.. బతికించలేకపోయాం.. రియల్లీ వెరీ సారీ’ అని డాక్టర్ చెబుతూనే ఉన్నాడు. కుమిలి కుమిలి ఏడ్చాను.. అమ్మలేని జీవితం ఊహించలేకపోయా.. నిలబడ్డవాడిని నిలబడ్డట్టే కుప్ప కూలిపోయా. కళ్లు తెరిచి చూస్తే.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా పక్కన పీపీఈ కిట్‌లో డాక్టర్. ‘ మా అమ్మను చూడాలి’ అంటూ లేవబోయా. నీరసంతో కళ్లు తిరిగినట్టయి.. మళ్లీ అలాగే బెడ్ మీద పడిపోయా. ‘ప్లీజ్.. కదలొద్దు. మీ కండిషన్ అస్సలు బాగోలేదు. బెడ్ మీద నుంచి అంగుళం కూడా కదలడానికి లేదు.. ఎక్కడికీ వెళ్లడానికి లేదు’ అన్నాడు డాక్టర్. ‘నాకేమైంది? నేను బానే ఉన్నా.. నాకేం కాలేదు’ అంటున్నా... కానీ ఆయాసం వల్ల మాట్లాడ్డం కష్టమైంది. ‘చూశారా.. ఎలా ఆయాసం వస్తోందో? మీకూ పాజిటివ్ వచ్చింది’ చెప్పాడు డాక్టర్. ‘లేదండీ.. నాకేం లేదు. నేను బాగానే ఉన్నాను.. మా అమ్మ దగ్గరకు వెళ్లాలి’ అంటున్నాను. ‘ఎక్కడికీ కదలకూడదని చెప్పాం కదా.. మీవల్ల ఇతరులకూ కోవిడ్ సోకుతుంది. మిమ్మల్ని మీరు చాలా శ్రమపెట్టుకున్నారు.. అందుకే ఇప్పుడు మీ కండిషన్ క్రిటికల్‌గా మారింది’ హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు డాక్టర్. నిశ్శబ్దంగా ఉండిపోయా.. శక్తిలేక.. ఆయాసంతో మాట రాక! ‘మీరు గానీ.. మీ తమ్ముడు గానీ ఇప్పుడు మీ అమ్మగారికి అంతిమసంస్కారాలు చేసే పరిస్థితిలో లేరు. అందుకే ఆ కార్యక్రమం మా సిబ్బందే చేస్తారు’ అన్నాడు డాక్టర్. అది విని నా మనసు మరింత బరువెక్కింది. చెప్పలేని ఆవేదన. ఇద్దరు పిల్లలు ఉండీ.. మా అమ్మ అనాథలా.. తెలియని వారితో అంతిమసంస్కారాలు చేయించుకుంటోంది. తను నాతో మాట్లాడిన ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.. దిండు మీద తలవాల్చి .. కళ్లు మూసుకున్నాను. మా అమ్మనాన్నది ప్రేమ వివాహం. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ల పెద్దలు ఇప్పటికీ మాట్లాడరు. అందుకే మాకు పెద్దగా బంధువుల్లేరు. నాన్న చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. అమ్మే మా ఇద్దరినీ పెంచి పెద్ద చేసింది. కంటికి రెప్పలా కాచుకుంది. నాన్న చనిపోయిన రోజు నాకింకా గుర్తు. ఇంట్లో నేను, కార్తీక్, అమ్మ ముగ్గురమే. అమ్మ ఒక మూలన కూర్చొని చాలా ఏడ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు మేమే సర్వస్వం. మా స్కూల్, కాలేజీ ఫీజులు కట్టడానికి తాను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ‘లేవండి’ అంటూ ఎవరో పిలిచారు. కళ్లు తెరిచి చూశాను. నర్స్... భోజనం ఇచ్చి వెళ్లింది. మనసేమీ బాగాలేదు. తినాలనిపించలేదు. ఏదో తిన్నాననిపించుకుని కార్తీక్‌కు కాల్ చేశా. బానే ఉన్నానని చెప్పాడు. వాడికి అమ్మ గురించి చెప్పే ధైర్యం లేదు నాకు. అయినా లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చెప్పాను. విషయం విన్నవెంటనే హతాశుడయ్యాడు. పెద్దగా ఏడ్చాడు. నాకూ దుఃఖం ఆగలేదు. ఎలాగోలా తమాయించుకొని వాడిని ఓదార్చాను. ఫోన్ పెట్టేశాక ఎన్నడూ లేని, రాని నీరసం, నిస్సత్తువ ఆవహించాయి నన్ను. అలా పడుకుండిపోయానంతే. మరుసటి రోజు ఐసీయూలో నా పక్కన ఉండే పేషంట్ చనిపోయాడు. వాళ్లవాళ్లు బయట నిలబడి ఏడుస్తున్నారు. నాకూ ఎంతో బాధయ్యింది. బయట పెరుగుతున్న కేసులు, లోపలి మరణాలు చూసి బాధతో కలిగిన భయానికి లోనయ్యాను. ‘అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదంతా ఎప్పటికి నార్మల్ అవుతుంది?’ అనిపించింది. బయట నార్మల్ అయినా మా ఇద్దరి జీవితాల్లో అమ్మలేని లోటు శాశ్వతం. ఏడ్చినప్పుడల్లా ఆయాసం వస్తోంది. బాగా గాలి పీల్చాలనిపిస్తోంది. రవికి కాల్ చేశాను. వాడు ఫోన్ ఎత్తలేదు. ‘ఏమైందో?’ అని భయపడ్డాను. బాధ, దుఃఖంతోనే ఆ పూట గడిచింది. రాత్రి నిద్ర పట్టలేదు. ఎటువైపు తిరిగినా నిద్ర రాలేదు. ఇటు అటు డొల్లుతూనే ఉన్నా. ఒంటిగంట దాటింది. కాసేపు లేచి అటు ఇటూ తిరిగాను. ఆయాసం వచ్చేసింది. మళ్లీ మంచం మీద వాలాను. మగతగా ఉంది. నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు.. మంగళవారం. అమ్మ.. ప్రతి మంగళవారం ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికెళ్లి దర్శనం చేసుకునేది. ప్రసాదాన్ని ఇంటికి తెచ్చేది.. ముగ్గురం కలిసి తినేవాళ్లం. అలా అమ్మను గుర్తు చేసుకుంటూండగా కార్తిక్ మాటలు వినిపించినట్టయి బయటకు వెళ్లాను. కనబడలేదు.. ఆ కారిడార్‌లో అటూ ఇటూ తిరిగాను. ఉహూ.. లేడు. అక్కడే ఉన్న నర్స్‌ను అడిగా ‘మా తమ్ముడు వచ్చాడా?’ అని. బదులేమీ చెప్పలేదు. అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. నా నుంచి కోవిడ్ సోకుతుందని భయపడిందో ఏమో మరి! సడెన్‌గా ఎవరో ఏడుస్తున్నట్టని పించింది. ఆ ఏడ్చే శబ్దం ఎటు నుంచి వస్తుందో అటు వెళ్లాను. కార్తీక్ కనిపించాడు.. లాబీలో ఒక మూల ఒంటరిగా కూర్చొని. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ‘వీడిక్కడేం చేస్తున్నాడు?’ అనుకుంటూ పరుగెత్తుకెళ్లాను వాడి దగ్గరకు. అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్నాడేమో అనుకుని వాడి భుజం మీద చేయి వేశా. వాడు తలతిప్పి కూడా చూడలేదు. కనీసం చిన్న కదలిక కూడా లేదు వాడిలో. అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు. ‘ఏడవకురా..! ఏదీ మన చేతుల్లో లేదు. మనం ఎంత ఏడ్చినా అమ్మ ఇంక తిరిగి రాదు. ఊర్కోరా’ అంటూ సముదాయించా. వాడు వినిపించుకోలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. నేనేమన్నా వాడు స్పందిచట్లేదు సరికదా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. వాడికేమైనా అయిందా ఏంటీ? అని భయపడ్డాను. ‘కార్తీక్.. కార్తీక్ ’ అంటూ వాడి భుజాలు పట్టుకొని కదిపా. ఒక్కసారిగా లేచాడు. కళ్లు తుడుచుకుంటూ.. నిర్మానుష్యంగా ఉన్న ఆ లాబీలో అలా నడుచుకుంటూ మార్చురీ వైపు వెళ్లాడు. -దేవరాజు మహాలక్ష్మి -
ఈ వారం కథ: రాముడు- భీముడు
చేతికర్రను దడికి ఆనించి లోపలికొచ్చాడు రాముడు. పక్కనే ఉన్న తొట్టిలో చెంబుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కున్నాడు. ఆ నీళ్ళు కాళ్ళ పైనే పడడంతో నిట్టూర్చుతూ ఇంటి దర్వాజ వైపు చూశాడు. తలుపు దగ్గరికి వేసి ఉంది. పక్కకి చూశాడు. బండపై బట్టలుతుకుతూ రెండో కోడలు కనిపించింది. ‘ఇట్రామ్మా... ఓ ముద్ద పడేయ్...’ సంశయిస్తూ పిలిచి, వసారాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ‘డెబ్బై యేళ్లొచ్చినా మూడు పూటలు తినకుండా ఉండలేవే! మాకేమో అరిగి చావదు. నువ్వు మాత్రం ముద్ద తక్కువైతే అల్లల్లాడిపోతావ్. ఏం పని వెలగబెడతావో... బట్టలు మురికి చేసి పెడతావ్. నీకేమన్నా పాలేర్లు ఉన్నారనుకున్నావా?’ అక్కసును కక్కుతూ పళ్ళెంలో అన్నం వేసుకొచ్చింది. ‘ఏంటోనమ్మా! ఏదో అంటన్నావ్. నాకేమో ఇనపడి చావదు. పిల్లోడు లేడా?’ ముద్ద కలుపుతూ అడిగాడు. ‘నీ చెవుడు మా చావుకొచ్చిందిలే. అరవలేక ఛస్తున్నాం. ఇగో... మంచినీళ్ళు! తిండం అయిపోతే పిలువ్. నేనెళ్లి బట్టలు ఉతుక్కోవాలి. మాకేం పాలేర్లు లేరిక్కడ!’ లోటాలో మంచినీళ్ళు పెట్టేసి విసవిసా వెళ్ళింది. అతను భోజనం చేశాక, స్నేహితుడు భీముడు చెంతకు వెళ్ళాడు. అతనెళ్ళగానే ఇల్లంతా మళ్ళీ కడుక్కుందామె. ∙∙ ఉగాది పండుగను పురస్కరించుకుని చైత్ర శుక్ల పాడ్యమి నాడు వేపపువ్వుతో తనువంతా అలంకరించుకున్న భీముడిని చూడగానే రెండో కోడలు తనపై కక్కిన అక్కసు ఆవిరైపోయింది. ఆప్యాయంగా భీముడిని నిమిరాడు రాముడు. తనువంతా కదిలించి ఆనందాన్ని తెలియజేశాడు భీముడు. అక్కడే చతికిలపడుతూ భీముడిని ఆర్తిగా చూశాడు రాముడు. ‘రెండో కోడలు ఎన్నెన్ని మాటలందిరా భీముడూ! నీ దగ్గర కూకుంటే కాత్తంత మట్టి అంటుతుంది. అది కూడా ఉతకలేరా? ఆల్లతో వాదించలేకే ఇట్టా చెవుటోడిగా ఉండిపోతున్నారా. ముద్ద పెట్టడానికీ ఏడుపే, బట్టలుతకడానికీ ఏడుపే!’ పెద్దవేరును తలగడగా మార్చుకుని పడుకున్నాడు రాముడు. అతనికి ఐదుగురు అన్నదమ్ములు. తండ్రినుంచి వచ్చిన ఇరవై సెంట్ల వాటా గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న ఇళ్ళ స్థలంగా మారిపోయింది. రోడ్డుపక్కనుంచి చిన్న కాలువ వేయడంతో రెండు సెంట్లు కరిగిపోయి పద్దెనిమిది సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళకు మట్టి కొట్టుకుపోకుండా అతని వాటాలో వేపమొక్క నాటాడు. నాటిన ఐదేళ్లకు బలమైన శాఖలతో విస్తరించిందది. పుష్టిగా ఎదగడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు రాముడు. భుజ బలంలోనూ, గదా యుద్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరుడిగా పేరొందిన భీమసేనుడు పేరు మీదుగా దానికి ‘భీముడు’ అని పెట్టుకున్నాడు. చెట్టు మొదట్లో ఎత్తుగా మట్టి పోసి కూర్చోవడానికి వీలుగా సరిచేసుకున్నాడు. దాంతో నలుగురు అక్కడకు రాసాగారు. జనం అలా ఒకచోటే చేరడంతో కల్లుగీత కార్మికుడైన మల్లన్న అక్కడే మకాం ఏర్పాటు చేసుకుని కల్లు కాంపౌండుగా వాడుకోసాగాడు. రాముడికి నలుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు! ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికిచ్చిన ఐదు సెంట్లలో పెద్ద ఇల్లు కట్టి పదిమంది సంతానాన్ని నెట్టుకొచ్చాడు. కొన్నాళ్ళకు అతని భార్య కాలం చేసింది. రోజూ మల్లన్న వెళ్ళగానే ఆ చెట్టు మొదట్లో పడుకుని భార్య జ్ఞాపకాల్ని నెమరువేసుకోడం, ఆరోజు జరిగినవన్నీ చెప్పడం అతని దినచర్య. రాముడు బాధపడుతున్నప్పుడు భీముడు హోరుగా వీస్తూ ఆకులు రాల్చేవాడు. అతను ఆనందపడినప్పుడు మంద్రమైన రాగాన్ని ఆలపిస్తున్నట్లు ఆకుల్ని కదిపేవాడు. అతను చెప్పే ప్రతి మాటకు భీముడు స్పందించడంతో సాంత్వన పొందేవాడు. రెండో కోడలింట్లో జరిగిన సంగతి చెప్తూ బాధ పడ్డాడు రాముడు. అతని బాధను చూడలేక మెల్లగా గాలి వీస్తూ రాముణ్ణి నిద్ర పుచ్చాడు భీముడు. అతని ఓదార్పుకు కరిగిపోతూ అతని ఒడిలో కునుకు తీశాడు రాముడు. ఎవరో భీముడి రెమ్మల్ని విరుస్తున్న శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. వేపపువ్వు కోసం ముగ్గురు పిల్లలు ఇబ్బంది పడుతూ కనిపించారు. వారికి వేపపువ్వు కోసిచ్చాడు. అవి పట్టుకుని ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళారు పిల్లలు. వాళ్ళ మోములో విరిసిన సంతోషాల్ని చూశాక అతని మనస్సు తేలిక పడింది. ‘పిల్లలకేనా... మాకూ ఇచ్చేదుందా...’ అప్పుడే అక్కడకొచ్చిన సూరయ్య అడిగాడు. ‘మా భీముడు ఎవర్నీ కాదనడు’ అంటూ అతని చేతిలో కూడా వేపపువ్వు పెట్టాడు. అది తీసుకుంటూ చుట్టూ చూశాడు సూరయ్య. అతనెందుకలా చూస్తున్నాడో అర్థంకాక ‘ఏంటి సూరయ్య, దేనికోసం ఎతుకుతున్నావ్?’ అడిగాడు రాముడు. ‘మల్లన్న ఎల్లిపోయాడా, లేదా అని...’ ‘ఎల్లిపోయాడులే. చెప్పు...’ ‘ఆ మల్లన్నను ఇక్కడెందుకు కల్లు అమ్ముకోనిస్తున్నావ్? కుర్రోల్లంతా తాగుడికి బానిసలైపోతున్నారంటే వినవేం...’ ‘ఆ మల్లన్న మీద నీకెందుకంత దుత్త! మనం ఏ పనైనా చేసుకుని బతగ్గలం! కానీ, ఆ మల్లన్న అదొక్క పనే చేయగలడు. అదెంత కట్టమో తెల్సా... తాటిచెట్టు ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో ఆడి నడుంకున్న తాడు తెగిందంటే ఆల్లావిడ మెడలో తాడు తెగినట్లే! అప్పుడా ఇల్లు రోడ్డున పడ్డట్టే! సిగరెట్లు, మందు తాగొద్దని ఎవరెన్ని చెప్తున్నా జనం ఇండం లేదు! ఆళ్ళకి లేని బాధ మనకెందుకు...’ ‘సరే! నీ ఇష్టం!’ నిర్వేదంగా అక్కడ్నుంచి నిష్క్రమించాడు సూరయ్య. మనుషుల తీరు ఒక పట్టాన అర్థం కాదు రాముడికి. ఎందుకిలా ఉంటారోనని ఆలోచనల్లో పడ్డ అతనికి ఎదురుగా తన నలుగురు కొడుకులు కనిపించారు. ఆస్తి పంపకాల్లో తనకి న్యాయం జరగలేదని చిన్నకొడుకు గొడవకు దిగాడు. అతను చేస్తున్న హంగామాకు చుట్టుపక్కల వాళ్ళు చేరి చోద్యం చూస్తున్నారు. ఎవరూ మధ్యలో కలగజేసుకునే బాధ్యతను తీసుకోలేదు. ‘నాకు న్యాయం జరగలేదు. పంపకాలు మళ్ళీ చేయాల్సిందే’ ఫిర్యాదు చేశాడు చిన్నకొడుకు. ‘పెద్దల్లో పెట్టే, అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం కదరా! ఇప్పుడేంటి ఈ తిరకాసు?’ అడిగాడు మూడోకొడుకు. ‘నీకిద్దరు కొడుకులు పుట్టేసరికి ఆస్తి మీద కన్ను కుట్టిందా?’ అన్నాడు రెండోకొడుకు. ‘కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందని ఇవన్నీ నీకెవరు నూరుపోశార్రా?’ అడిగాడు పెద్దకొడుకు. రాముడుకు తన తండ్రినుంచి సక్రమించిన పద్దెనిమిది సెంట్ల భూమిలో ముగ్గురు కొడుకులకు తలో ఆరు సెంట్లు పంచిచ్చాడు. ప్రభుత్వమిచ్చిన స్థలంలో కట్టిన ఇల్లును చిన్నోడికిచ్చాడు. కట్టినిల్లు చిన్నోడికి ఇచ్చాడని మిగతా ముగ్గురూ తండ్రిపై కోపంగా ఉన్నారు. మిగతా ముగ్గురికీ ఆరు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి తనకు మాత్రం ఐదు సెంట్లలో ఇల్లు ఇచ్చాడని చిన్నోడు కోపంగా ఉన్నాడు. మొదటి ముగ్గురూ కాయకష్టం ఎరిగినోళ్ళు కాబట్టి స్వయంగా ఇల్లు కట్టుకోగలరని, చిన్నోడు చదువుకున్నోడు కాబట్టి పని చేసుకోలేడని ముందుచూపుతో కట్టినిల్లు రాసిచ్చాడు రాముడు. అతని ముందుచూపు వాళ్లకు ముల్లులా గుచ్చుకుంది. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందాని లోలోన బాధపడ్డాడు. ‘చచ్చినోళ్ళను చితి కాలిస్తే బతికున్నోళ్ళను చింత కాలుస్తుందన్న సంగతి కూడా వాళ్లకి తెల్వట్లేదురా భీముడు!’ ‘ఇనపడదంటావ్. చురకలంటిస్తూనే ఉంటావ్. మాటలకేం కొదవ లేదు’ కోప్పడ్డాడు చిన్నకొడుకు. ‘వాళ్ళేం అంటున్నారో విన్నావంట్రా భీముడూ... పదిమంది సంతానాన్ని ఓ దారికి తెచ్చి, కూతుళ్ళ పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, పిల్లల ఆలనా పాలనా... ఎన్నని చెప్పన్రా నా బాధ! ముద్ద పెట్టడానికే ఏడుస్తున్నారంటే రేపు నన్ను తగలెయ్యడానికి కూడా ఏడ్చేలా ఉన్నార్రా. వాన రాకడ, ప్రాణం పోకడ తెలుస్తుందా? నాకెందుకురా ఆస్తులు! ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది. ఒకే కడుపున పుట్టిన వాళ్ళు ఒకరెక్కువ, ఒకరు తక్కువెలా అవుతార్రా?’ రాముడి బాధనర్థం చేసుకున్న భీముడు బలంగా వీస్తూ ఆకులు రాల్చాడు. అకస్మాత్తుగా చెలరేగిన దుమ్ము కళ్ళల్లోకి వెళ్ళకుండా అక్కడున్నవారు కండువాలు అడ్డం పెట్టుకున్నారు. భీముడు తనకు సంఘీభావం తెల్పడంతో అతనివంక ప్రేమగా చూశాడు రాముడు. తండ్రి గతం మొత్తం తవ్వుతుంటే బిత్తరచూపులు చూశారు అన్నదమ్ములు. అక్కడున్న వాళ్ళెవరూ వాళ్లకు మద్దతు తెలుపలేదు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళక్కడ్నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ‘నా బాధ నీకొక్కడికే అర్థమవుతుందిరా భీముడూ... ఆస్తి పంపకాల్లో భాగంగా నిన్ను కూడా అమ్మేసి డబ్బులు పంచమంటున్నారు. మనూరి గ్రామపెద్దకు పురమాయించారు కూడా! ఆయనకి నీమీద బాగా గురి! అందుకే ఎంత రేటైనా కొంటానని అడుగుతున్నాడ్రా. నిన్నెలా దూరం చేసుకుంటారా?’ భీముడు పొదిగిట్లో ఒదిగిపోయాడు రాముడు. భీముడు అందించిన ఆత్మీయ స్పర్శకు తల వంచాడతను. ఒక్కో ఆకు మెల్లగా రాల్చసాగాడు భీముడు. ఊహించినట్లే ఎవరూ కనిపెట్టని విధంగా వాతావరణంలో మార్పులు జరిగాయి. మూడు పూటలూ భోజనం చేయడానికి వాటాల ప్రకారం పద్దెనిమిదేళ్ళుగా నలుగురు కొడుకుల ఇంటికి తిరుగుతున్నా, రాత్రి పడుకోవడానికి మాత్రం చిన్నోడింటికి వచ్చేస్తాడు రాముడు. తన జీవిత భాగస్వామి ఆ ఇంట్లోనే కాలం చేసిందని, ఆమె జ్ఞాపకార్థం తాను కూడా ఆ ఇంట్లోనే కాలం చేయాలన్నది అతని కోరిక. పొద్దు పోయినా రాముడు ఇంటికి రాకపోయేసరికి గుమ్మంవైపు చూస్తూ కూర్చున్నాడు చిన్నకొడుకు. ఆపసోపాలు పడుతూ మల్లన్న అక్కడకు రావడంతో కంగారుపడ్డాడు. ‘ఏంటి మల్లన్నా... ఇలా వచ్చావ్?’ ‘అయ్యగార్ని ఎంత లేపుతున్నా లేవడం లేదు బాబు. నాకేదో భయంగా ఉంది. మీరోసారి రండి’ మల్లన్న చెప్పడంతో భీముడు దగ్గరికెళ్ళి పొదిగిట్లో నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపాడు. అదతని శాశ్వతనిద్ర అని తెలియడానికెంతో సమయం పట్టలేదు. అతని కోరిక తీరకుండానే, అతని సమస్యను ఓ కొలిక్కి తేకుండానే కాటికి దగ్గరయ్యిన తండ్రిని చూసి కుమిలిపోయాడు. ఇంటిముందు శవాన్ని పడుకోబెట్టి బంధువులకు సమాచారమిచ్చాడు. ఆ రాత్రి గడిచింది. దహన సంస్కారాల నిమిత్తం చేసే ఏర్పాట్లలో కదలిక లేదు. కారణాలు తెలీక బంధువులతోపాటు గ్రామస్తుల్లో కూడా అనుమానాలు చెలరేగాయి. సంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి కాబట్టి ఏర్పాట్లన్నీ చేసి తదుపరి కార్యక్రమాన్ని ముగించమని పెద్దలు సూచించారు. ‘సంప్రదాయమని నా మీదకు తోసేయ్యడం ఏం బాలేదు. మూడోవాడు ముసలోడి నుంచి రెండు గేదల్ని తీసుకుని, వాటినమ్ముకుని ఇల్లు కట్టుకోలేదా? రెండోవాడు పెళ్లవ్వగానే అసలేం పట్టించుకోకుండా వెళ్లిపోలేదా? అప్పులు చేసి చిన్నోడిని ఇంత చదువు చదివిస్తే హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదా? వీళ్ళందర్ని వదిలేసి నేనొక్కడినే చేయాలా?’ మొండివాడు రాజు కన్నా బలవంతుడన్నట్లు మూర్ఖంగా అందరివంకా చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు. ‘ముసలోడి ఫించన్ డబ్బులన్నీ ఏమవుతున్నాయ్? వేప చెట్లమ్మిన డబ్బులు ఏం చేశాడు? రెండు సెంట్ల భూమి కొట్టుకుపోయినప్పుడు గోవర్నమెంట్ వోళ్లు డబ్బులిచ్చారుగా, ఏమయ్యాయి?’ మేమేం తక్కువ కాదంటూ కోడళ్ళు. గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఆ వాదోపవాదాలకు గుండెల్లో గూడుకట్టుకున్న బాధలా ఆకాశంలో మబ్బులన్నీ ఒకేచోట చేరి వీక్షించసాగాయి. వాటి ఆవేదనను తెలియజేస్తున్నట్లు మెరుపులు మెరిశాయి. గాలులు వీచాయి. అనంతవాయువుల్లో కలిసిన రాముడి ఆత్మ అక్కడే తిరగసాగింది. వంతులేసుకోకుండా చితికి నిప్పంటించి తనకు మోక్షం కలగజేయమని ఘోషిస్తోంది. అతని కూతుళ్ళు తలోమాట అందుకున్నారు. ‘మీకసలు బుద్ధుందారా? తండ్రి శవం ముందు పెట్టుకుని సిగ్గు లేకుండా ఏంటా వాదులాటలు? అందరూ నవ్విపోతారు... నలుగురు కొడుకులుండీ కర్మకాండలు చేయలేందంటే ముసలోడి ఉసిరి తగులుతుంది... తలో చెయ్యి వేయండి...’ అంటూ మందలించారు. ‘ముసలోళ్ళు ఉండగా బోల్డంత తిన్నారుగా! అవేం గుర్తురావడం లేదా? మీరే వాటాలేసుకోండి. మీ ఆరుగురు అక్కాచెల్లెళ్లు తలో చెయ్యి వేస్తే తద్దినం కూడా ఘనంగా చేయొచ్చు. బావోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా...’ వాళ్ళన్న మాటకు కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లయ్యింది సోదరీమణుల పరిస్థితి. నచ్చజెప్దామనుకున్న గ్రామస్తులు వారి ప్రవర్తను చూసి ఆగిపోయారు. ఇంతలో భీముడు చనిపోయాడనే సంచలన వార్త అందింది. ఎంత పెద్ద తుఫానొచ్చినా, భీభత్సమైన గాలులు వీచినా తొణకని భీముడు ఇప్పుడు చిన్న ఈదురుగాలులకు నేలకొరగడం అందరికీ వింతగా తోచింది. నిజమో, కాదోనని నిర్థారించడానికి కొంతమంది వెళ్ళారు. విషయం తెలుసుకున్న రాముడి ఆత్మ భీముడి దగ్గరికి చేరుకుంది. నేలకొరిగిన భీముణ్ణి చూసి సంతోషిస్తూ, ‘నేనంటే నీకెంత ప్రేమరా భీముడు! నేను లేనని తెలిసి నువ్వే వచ్చేస్తున్నావా? నిజమేలే... నేను లేకపోతే నీకెవరు కబుర్లు చెప్తారు. నిన్నెవరు పట్టించుకుంటారు. వాళ్ళెలా వంతులేసుకుంటున్నారో చూడరా... కాటికి పోయిన పీనుగు, కట్టెల పాల్గాక ఇంటికొస్తుందా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు...’ ప్రేమగా తడుముతూ అంది రాముడి ఆత్మ. అవునన్నట్లు తలూపింది భీముడి ఆత్మ. ‘రాముడి గురించి అందరికీ తెలుసు. కొడుకులుండగా నేను ఖర్చులు పెట్టుకోవడం సంప్రదాయం కాదు కాబట్టి ఈ వేపచేట్టును నేను కొంటాను. ఐదువేలు ఖరీదు చేసే చెట్టుకు పదివేలిస్తాను. కాదనకండి! కనీసం ఈ డబ్బులతోనైనా కార్యం జరిపించండి’ అని గ్రామ పెద్ద ప్రతిపాదించడంతో, కొడుకులేం అంటారోనని వారివంక చూశాయి కలిసిన ఆత్మలు. తమకొచ్చిన నష్టమేమీ లేదని భావించిన కొడుకులు వారి సమ్మతిని తెలియజేశారు. పుత్రుల స్వార్జితంతో జరగాల్సిన తండ్రి కర్మకాండలు బయటవాళ్ళ దయాదాక్షిణ్యాలతో జరుగుతున్నాయని రాముడి కూతుళ్ళు బాధపడసాగారు. అంతలో మల్లన్న జనంనుంచి ముందుకొచ్చి ‘అయ్యగారి దయవల్ల, భీముడి దయవల్ల నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తున్నాయ్. ఆల్లిద్దరి అనుబంధం గొప్పది కాబట్టే ఇద్దరూ ఒకేరోజు ఇలా... దయచేసి ఆల్లిదర్నీ ఏరు చేయొద్దు. భీముణ్ణి అమ్మేసి ఆరి బంధానికి ఖరీదు కట్టొద్దు. అయ్యగారు నా తాన ఒక్క రూపాయి ముట్టలేదు. ఈ కార్యానికయ్యే ఆ డబ్బేదో నేనే ఇత్తా. ఇట్టైనా నా ఋణం తీర్చుకోనివ్వండి ’ అంటూ రెండు చేతులెత్తి వేడుకున్నాడు. మా చేతికేం అంటుకోకుండా ఎలా జరిగినా మాకిష్టమేనన్నట్లు ‘మాకేం అభ్యంతరం’ లేద’న్నారు కొడుకులు. కందకు లేని దురద కత్తికెందుకన్నట్లు మౌనం వహించారు కూతుళ్ళు. తన కోరుకున్నట్లు భీముడు తనకు దక్కనందుకు గ్రామపెద్ద మల్లన్నవైపు కోపంగా చూశాడు. ‘నాదో సిన్న కోరిక బాబు... భీముడి పుల్లలతోనే రాముడి చితికి నిప్పంటించండి. అప్పుడు ఆల్ల ఆత్మలు సాంతిస్తాయి...’ అన్న మల్లన్న కోరికను స్వాగతించారు గ్రామస్తులు. ‘భీముడూ... చూస్తున్నావా? మల్లన్న మనిద్దర్నీ కలుపుతున్నాడురా. మన ఋణం తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా... బతికుండగా ఓదార్పునిచ్చావ్, చచ్చిపోయాక నాతో నువ్వొస్తూ ధైర్యాన్నిస్తున్నావ్. నాకది చాలురా... మీ కుటుంబం చల్లగా ఉండాలి మల్లన్నా...’ అంటూ దీవించింది రాముడి ఆత్మ. మద్దతు తెలిపింది భీముడి ఆత్మ. ఊరిచివరనున్న శ్మశానంలో రాముడి దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. పెద్ద కొడుకు చితికి నిప్పంటించాడు. ఎగసిపడే అగ్నిపర్వతంలా చితి జ్వాలలు చెలరేగుతుండగా భీముడి రెమ్మల్ని దానిపై వేశారు. అవి పచ్చిగా ఉన్న కారణంగా రాముడుకి కపాల మోక్షం ఆలస్యంగా లభించింది. భీముడు ఆత్మకు మోక్షం లభించగానే చుట్టుపక్కల వాతావరణమంతా దాని వాసన పరుచుకుంది. రెండు ఆత్మలు ఏకమై అనంత సృష్టిలో ప్రయాణం చేయసాగాయి. చదవండి: World No Tobacco Day: పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి.. -
ఈవారం కథ: భార్య
మిసెస్ ఒమూరా వంట గదిలో వున్నగడియారం వైపు చూసింది. సరిగ్గా సాయంత్రం అయిదు గంటలైంది. కానీ అప్పుడే శరత్ కాలపు చీకట్లు టోక్యో నగరాన్ని ఆక్రమించు కొంటున్నాయి. ఇక పిల్లలు ఏ క్షణంలోనైనా ఇల్లు చేరుకుంటారు. కుమార్తె సేట్సూకు పన్నెండేళ్ళు. ఆమె ఈరోజుల ఆడపిల్లల మాదిరిగానే కలల్లో తేలియాడుతూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు పాశ్చ్యాత్య అలవాట్లకు లోనవుతున్నారు. మార్పుని ఆపడం సాధ్యమయ్యే పనికాదు. అంతలోనే తోటగేటు శబ్దం అయింది. కుమారుడి పిలుపూ వినపడింది. ‘అమ్మా! నేనొచ్చేసాను.’ ‘వస్తున్నా తోరూ!’ ఆమె వెళ్లి తలుపు తీసింది. పిల్లవాడు తన షూని ద్వారంవద్దనే పడేసి లోనికి దుమికాడు. ఈ ఇల్లు ఇంకా జపనీయుల సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది. ఆమె పిల్లల్ని షూతో లోనికి రానివ్వదు. ‘అదంతా సుద్దేనమ్మా! నాన్న వున్నాడా?’ ప్రతిరోజూ వాడీప్రశ్న వేస్తూనే ఉంటాడు. అది ములుకులా ఆమె గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. వాడికి తండ్రి సమక్షం కావాలి. ‘ఆ పుస్తకాల్ని అలా పడేసిరా. మీఅక్క సేట్సూ రాగానే మనం భోంచేద్దాం.’ అంతలోనే ‘అమ్మా..’ అంటూ సేట్సూ వచ్చింది. షూని తీసి బయటపడేసి నిశ్శబ్దంగా వంటగదిలోకి ప్రవేశించింది. ఆమె తన వయస్సు కన్నా బాగా పొడగరి. ‘సేట్సూ! ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు.’ ‘ట్రాఫిక్ చాలాఎక్కువగా ఉందమ్మా. మా బస్సు అడుగడుక్కీ ఆగిపోయింది.’ జపానీ యువతులు అమెరికన్లని అనుకరిస్తున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సేట్సూ మారాంచేస్తే ఒకరోజు రాక్ అండ్ రోల్ డ్యాన్సుకి ఆమెతోపాటు తల్లి కూడా వెళ్ళింది. అక్కడి దశ్యాలు ఆమెకు వెగటు కలిగించాయి. ఆతరువాత కుమార్తె నూ వెళ్లనివ్వలేదు. కానీ ఈ కొత్త టోక్యో నగరంలో ఏ స్త్రీ అయినా తన భర్త లేక తన పిల్లల నడవడికలోని మంచిచెడ్డల్ని నిర్ధారించుకోలేకపోతోంది. భర్త తన పట్ల విశ్వాసంగాలేడేమో అన్న అంశాన్ని కూడా పక్కన పెట్టక తప్పడంలేదు. ‘ఏస్త్రీ అయినా తన భర్తపట్ల ఊహలో కూడా విశ్వాస రాహిత్యం కలిగివుండకూడదు’ అని తన తల్లి పదేపదే చెబుతుండేది. సేట్సూ కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చింది. డైనింగ్ టేబిలు మీద ప్లేట్లనూ ఛాప్ స్టిక్ లనూ పేర్చసాగింది. ‘అమ్మా! నాన్నకోసం కూడా ఒక ప్లేట్ పెట్టనా?’ అన్నది. ‘మీ నాన్న ఇప్పట్లో రాడని నీకు తెలుసు.’ తల్లీ కుమార్తెల మధ్య నిశ్శబ్దం చోటు చేసుకొంది. కానీ సేట్సూ ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ‘ప్రతిరోజూ నాన్న బార్ వెళ్ళడానికి నువ్వెందుకు ఒప్పుకుంటున్నావో నాకైతే అర్ధం కావడం లేదమ్మా.’ మిసెస్ ఒమూరా కొంతసేపు మాట్లాడలేకపోయింది. ‘‘అతడ్ని నువ్వు ఎందుకు వెళ్ళనిస్తున్నావు?’ ‘గెయిషాల ఇళ్ళు లేవు కాబట్టి మగవాళ్ళు బార్లకు వెళ్తారు. మరి ఎక్కడికి వెళ్ళగలరు?’ ‘ఇంటి వద్దనే ఉండొచ్చు కదా?’ అన్నది సేట్సూ. ‘వ్యాపార వ్యవహారాలు కూడా ఉంటాయట.’ సేట్సూ వెటకారంగా అన్నది ‘వ్యాపారమా? బార్లలోనా? అదేం వ్యాపారం?’ అంటూ సేట్సూ తన మనసులోని మాటల్ని చిరాగ్గానే బయటకు అన్నది. ‘నాన్న వేకువన రెండు గంటలకు వస్తాడు. అతనికోసం నువ్వు చిరుననవ్వుతో ఎదురుచూస్తుంటావు. ఇంకా జాలిపడ్డం ఒకటి! అయ్యో! నువ్వు బాగా అలసిపోయావు. రోజంతా కుటుంబంకోసం శ్రమిస్తున్నావు. ఇదిగో వెచ్చని టీ తీసుకో. నీస్నానానికి వేడినీరు సిద్ధంగా వుంచాను. పిల్లలు బడికి వెళ్లినంతవరకూ నిద్రపో అంటుంటావు’ సేట్సూ తన తల్లిగొంతునీ హావభావాల్నీ అనుకరించింది. మిసెస్ ఒమూరా నివ్వెరపోయింది . అంటే రోజూ ఇదంతా సేట్సూ మేలుకొని వింటున్నదన్న మాట. ‘సేట్సూ ! నువ్వు చాలా పెంకి పిల్లవైపోతున్నావు’ అన్నది తల్లి. ‘సేట్సూ గది విడిచి వెళ్ళింది. మిసెస్ ఒమురా ఈ హఠాత్పరిణామానికి కొంతసేపు అవాక్కయింది. తరువాత కుమార్తెని పిలిచింది.. ‘సేట్సూ ఇలారా.’ అయిష్టంగానే ఆ అమ్మాయి వెనక్కు వచ్చింది. మిసెస్ ఒమురాకు తన కుమార్తె ఎంతో పెద్దదానిలాగా అపరిచయస్తురాలిలాగా కనపడింది. ‘నాస్థితిలో నువ్వుంటే ఏంచేస్తావు?’ ‘నేనూ అతనితో బార్‌కు వెళ్తాను.’ సేట్సూ ఆలోచించకుండానే సమాధానం చెప్పింది. సేట్సూ మళ్ళీ అన్నది ‘మేం పెద్దవాళ్లమైతే నీలాగా మా భర్తల్ని బార్లకు వెళ్లనివ్వం.’ మిసెస్ ఒమూరా గుండ్రని ముచ్చటైన తన కుమార్తె ముఖంలో, ఆనల్లని కళ్ళలో ఒక నిశ్చితత్వాన్ని కనుగొన్నది. ‘నువ్వు దుస్తులు మార్చుకొని తోరూని పిలువు. మనం భోంచేద్దాం. తరువాత మీరు హోంవర్క్ చేద్దురు గాని’ అన్నది. ఆసాయంత్రం సాధారణంగానే గడిచింది. ముగ్గురూ నిశ్శబ్దంగా భోజనం ముగించారు. ఏనాటినుండో ఆమె గుండెల్లో నిద్రాణంగా వున్న వ్రణానికి ఆచిన్నారి మాటలుములుకుల్లా గుచ్చుకొని మరింత లోతుగా కెలికాయి. పిల్లలిద్దరూ నిద్రపోయిన తరువాత సేట్సూ మాటల్ని గూర్చి ఆలోచిస్తూ ఆమె తన దుస్తులున్న బీరువా వైపు నడిచింది. ఒకనాడు అమెరికన్లని సంతృప్తిపరచడానికి, తన భర్త తనకోసం కొన్న పాశ్చాత్య దుస్తుల్ని తీసింది. జుట్టు దువ్వుకొని వెనుక ముడి పెట్టుకున్నది. మెడలో ముత్యాల హారం వేసుకున్నది. మరీ ముచ్చటగా కనపడ్డంలేదు గానీ అందవికారంగా కూడా లేదు. పిల్లలు నిద్రపోతున్నారు కనుక బయటినుండి ఇంటికి తాళం వేసింది. భర్త వెళ్తున్న బార్ పేరు ఆమెకు తెలుసు. గేటు తెరుచుకొని రోడ్డు మీదకు వచ్చి టాక్సీని ఆపింది. ‘గోల్డెన్ మూన్ బార్’ అన్నది. గతంలో ఆమె ఎప్పుడూ ఒంటరిగా టాక్సీ ఎక్కలేదు. బార్ చేరుకున్నది. ఎర్రని దుస్తులు ధరించిన ముగ్గురమ్మాయిలు క్యాబ్ వద్దకు వచ్చారు. దిగుతున్న మహిళను చూసి ఆగారు. టాక్సీవాలాకు డబ్బు చెల్లించి ఆ అమ్మాయిలవైపు చూసింది. ‘నేను నాభర్తని కలుసుకోవాలి.’ అన్నది. వారిలో పొడవైన అమ్మాయి అడిగింది ‘ఎవరాయన?’ ‘మిస్టర్ ఒమూరా, సకూరా కంపెనీ వైస్ ప్రెసిడెంట్.’ అమ్మాయిలు వెనక్కి అడుగు వేశారు. ‘ఓహ్! మిస్టర్ ఒమూరా! మాకాయన బాగా తెలుసు. చాలామంచివాడు.’ భర్త పేరు చెప్పగానే వారామెని మరింత గౌరవంగా చూసారు. ప్రవేశ గది వరకూ తోడుకొని వెళ్లారు. ‘మేడం! మిసెస్ ఒమూరా వచ్చారు’ అని అక్కడి లేడీ మేనేజర్‌తో చెప్పారు. ఆమె అచ్చంగా పాశ్చ్యాత్య రీతిలో వున్నది. మర్యాదపూర్వకంగా చేతులు చాచింది. ‘మిస్టర్ ఒమూరా బార్ లో వున్నారు. మీరు వస్తున్నారని ఆయనకు తెలుసా?’ నిజమే చెప్పింది. ‘నేనొస్తున్నానని ఆయనకు తెలీదు. ఊరికే చూసిపోదామని వచ్చాను.’ అక్కడి మేడమ్‌కు అర్థమయింది. ఆమె ఇటువంటి వారిని ఎందర్నో చూసింది. మేడమ్ ఒక చిన్న గదిని చూపింది. అక్కడ ఓకే టేబిలూ రెండు కుర్చీలూ వున్నవి. ‘ఇక్కడ కూర్చొండి. ఒకామె వచ్చి మీకు కొంత కాలక్షేపాన్ని ఇస్తుంది.’ కొద్ది నిముషాల్లోనే ఒక మహిళ లోపలికి వచ్చింది. స్త్రీయైన ఒమూరాకే కళ్ళు చెదిరాయి. ఆమె ఒక అద్భుత సౌందర్యరాశి! సుమారుగా ఇరవై ఎనిమిదేళ్లు ఉండొచ్చు. యవ్వనపు ఛాయలు ఇంకా పోలేదు. ‘మేడమ్ నన్ను మీతో కూర్చో మన్నది.’ ‘థేంక్యూ’ అన్నది మిసెస్ ఒమూరా. మిసెస్ ఒమూరాకు ఆక్షణంలో బిగ్గరగా ఏడవాలనిపించింది. ఆసౌందర్యరాశి ముఖకవళికల్లో స్నేహార్ద్రత ఉట్టిపడుతున్నది. తన గోడంతా ఆమెతో చెప్పుకోవాలనిపించింది. ‘మీరు ఊహించ లేరు’ అన్నది మిసెస్ ఒమూరా అస్పష్టంగా. ‘సంవత్సరాల తరబడి ఇంట్లో ఒంటరిగా కూర్చొని అతడు రాత్రి రెండు గంటలకు వచ్చేవరకూ కళ్ళు కాయలు కాచినట్టు వేచివుండటం చాలా కష్టంగా వుంది. అప్పుడు కూడా ఏమీ ప్రశ్నించకుండా బలవంతపు చిరునవ్వు అతికించుకొని అతడ్ని స్వాగతించడం ఇంకా కష్టంగావుంది. ఏమన్నా అడిగితే కోపగించుకొని అసలే ఇంటికి రాడని మరో భయం. ఇవన్నీ మీకు తెలీవు. అసలు ఊహించలేరేమో!’ సౌందర్యరాశి తల ఊపింది. ‘నాకు తెలుసు. మీవంటివారు చెప్పారు. ఇప్పుడు నేనేం చేయ్యాలి?’ అంటుండగానే మిసెస్ ఒమురాలో అనాదిగా అలవాటైన బాధా, గాయపడిన అనురాగబంధం, పురాతన సంప్రదాయంగా అణగారిన లోతయిన విషాదం, ఒక్కసారిగా పెల్లుబికాయి. సంవత్సరాలతరబడి ఘనీభవించిన తీవ్రమైన మనోవేదన కన్నీటిరూపంలో వెలికివచ్చింది. ఆమె నిట్టూరుస్తూ మాట్లాడింది. మాట్లాడుతూ నిట్టూర్చింది. వాక్యాలు కూడా ముక్కలు చెక్కల య్యాయి. ‘మీవంటి స్త్రీలు మాకోసం ఆలోచించాలి. మేం సాధారణ గృహిణులం. పిల్లల్ని కంటాం..వారిని సాకుతాం.. వంటచేస్తాం.. బండెడు చాకిరీ చేస్తాం..ఇంటిని నడుపుతాం.. శ్రమనీ వేదననీ దిగమింగుకుంటాం. మేం పనిమనుషులుగా పిలిపించుకోని పరిచారికలం. భర్తకోసం ఆరాటపడుతుంటాం. ఇంటివద్దనే వుండి వేయికళ్లతో అతని కోసం ఎదురు చూస్తుంటాం. మీరు అతడ్ని మానుండి దూరం చేస్తున్నారు. అతడి శోభాయమానమైన యవ్వనం, ఉజ్జ్వలమైన కాలం, అతడి ఆహ్లాదకరమైన ఆలోచనలూ, మనసుకి నచ్చిన మాటలూ, చిరునవ్వులూ, చిలిపితనాలూ అన్నీ మీరే గుంజుకొంటున్నారు. అతని జీవితాన్నే హరించి వేస్తున్నారు. అతడు శూన్యంగా..మౌనంగా ఖాళీ మనస్సుతో.. అలసిన శరీరంతో.. నిస్సత్తువతో అర్థరాత్రి దాటిన తరువాత ఇల్లుచేరుకొంటున్నాడు. అతడు ఇంటికి రాగానే నేను మరింత ఒంటరినైపోతున్నాను. ఏకాకినైపోతున్నాను’ ఇక ఆమెకు మాటలు పెగల్లేదు. ఎదురుగావున్న అందమైన ముఖం వివర్ణమైపోయింది. ఆశ్చర్యం నుండి కోలుకొని ఆత్మరక్షణలో పడిపోయింది. ‘ఇవన్నీ నేను ఆలోచించలేదు.. మిసెస్ ఒమూరా ! నా ఊహకే అందలేదు. నిజం చెప్పనా? అతడంటే నాకు అసహ్యం.’ మిసెస్ ఒమూరా మనస్సు చివుక్కుమంది. కాస్త చిరుకోపంతోనే అడిగింది.. ‘మీరెందుకని అతడ్ని ఏవగించుకుంటారు? అతడు మంచివాడు.’ ‘నా దృష్టిలో అతడొక మగవాడు. అంతే’’ ఆసౌందర్య రాశి అన్నది. ‘ఆమాటకొస్తే నేను మొత్తం పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తాను.‘ మిసెస్ ఒమూరా.. ఆమె నల్లని కళ్ళలోకి నిశితంగా చూసింది. ‘ఎందుకని?’ సౌందర్యరాశి తల ఊపింది. ‘మగవాళ్ళంతా ఒక్కటే!’ అని ఆగి మళ్ళీ అన్నది.. ‘అందరూ మూర్ఖులు, అహంకారులు. డబ్బు చెల్లించిన ప్రతీ మగవాడిపట్లా మేం ఒకేలా ప్రవర్తిస్తామని గ్రహించగలిగే కనీస వివేకం కూడా వారికి ఉండదు. నేనిక్కడికి నాపదహారేళ్ళ వయస్సులో వచ్చాను. ఆనాటినుండి నేటివరకూ ఒక పుష్కరకాలపు ముఖస్తుతులూ..లాలింపులూ.. బుజ్జగింపులూ..ఇవికాక కుళ్లిపోయిన హాస్యోక్తులకు పగలబడినవ్వాడాలూ.. పనికిమాలిన చచ్చు సరసోక్తులకు ఉబ్బితబ్బిబ్బయినట్లు నటించడాలూ..ఎందుకూ కొరగానివాడిని ఇంద్రుడవనీ చంద్రుడవనీ మెచ్చుకోవడాలూ..మనసు చంపుకొని మారాంచెయ్యడాలూ..ఛీ! జీవితం మీదనే విరక్తి పుడుతుంది. అందరూఒక్కటే . స్వార్ధపరులు. వ్యర్థులు.’ మిసెస్ ఒమూరా అడ్డుకున్నది ‘మీకు పిల్లల్లేరనుకుంటాను.’ ‘అదొక్కటే మా అదృష్టం. నేనూ మీలాగా స్వేచ్ఛగా ఉన్నట్లయితే ఒక చిన్న దుస్తుల దుకాణాన్ని పెట్టుకునే దాన్ని. మళ్ళీ మగవాడి ముఖం చూడను. ఎప్పటికీ చూడను.ఇది నిశ్చయం.’ ‘అయితే ఆపని చెయ్యండి. నాభర్తని విడిచిపెట్టండి. అతడు నాకూ పిల్లలకూ కావాలి.... వాస్తవానికి...’ ఆమె సిగ్గు పడింది. ‘అతడు మాక్కావాలి. ’ సౌందర్యరాశి నిట్టూర్చింది. ‘నేను బద్ధకిష్టినైపోయాను.. మిసెస్ ఒమూరా! ఈ ఉపాధి నాకు సుళువు అయిపొయింది . ఈ జీవనవిధానం మార్చుకోవడానికి బలమైన ప్రోద్బలం కావాలి. ఎవరైనా ఆసరా ఇస్తేగానీ గార్మెంట్‌షాపు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు.’ బార్ని విడిచి బయటకు వచ్చింది మిసెస్ ఒమూరా. సౌందర్యరాశి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పింది. ఒమూరా టాక్సీని పిలిచి వెనుకసీట్లో కూర్చున్నది. ఆమె మనస్సులో రెండుమాటలు స్పష్టంగా ధ్వనిస్తున్నాయి. ఒకటీ ఆ సౌందర్యరాశి పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తున్నది. రెండూ తనకో స్వంత జీవితాన్ని ఏర్పరచుకోవాలి. ఇంటికొచ్చిన తరువాత ఈమాట ఆమాట అయ్యాక భర్తతో అన్నది ఆమె ‘నేను కూడా కొంత సంపాదిస్తే మీరింత శ్రమ పడాల్సిన అవసరం గానీ, రాత్రుళ్లు కూడా బార్లలో వ్యాపారలావాదేవీలు చెయ్యాల్సిన పని గానీ ఉండదు.’ ఆసక్తి లేకుండానే అడిగాడతడు ‘నువ్వేంచేయ్యగలవు?’ ‘ఒక గార్మెంట్‌షాపు పెట్టాలనుకొంటున్నాను.’ ‘నీకు పెట్టుబడి ఎక్కడిది? అయినా ఇలాంటివి ముసలైపోయిన బార్ గర్ల్స్ పెట్టుకుంటారు. నీ వద్ద పొదుపు మొత్తం కూడా ఏమీ లేదు.’ ‘నిజమే నేను బార్ గర్ల్ అంత అదృష్టవంతురాల్ని కాను.’ కానీ ఆమెకు తనజీవితం తనకు ఉండాలనే తపన ఆగడం లేదు. మిస్టర్ ఒమూరా బార్‌కు వెళ్తున్నప్పుడు, పిల్లలు నిద్ర పోతున్నప్పుడూ ఆమె ఒంటరితనం భరిస్తూనే వుంది. బాధను దిగమిగుకుంటూనే వున్నది. రెండు నెలల తరువాత ఆమె మరోసారి బార్ కు వెళ్ళింది. ఆ సౌందర్యరాశిని కలుసుకున్నది. ఆమె కూడా మనస్ఫూర్తిగా స్వాగతించింది. ‘ఈరోజు మీరాక నాకెంతో సంతోషంగా వున్నది. నేను నాపొదుపు మొత్తాన్ని తీసి ఒక గార్మెంట్‌షాపు తీసుకున్నాను. చాలాచిన్నదే . కానీ మంచి రద్దీప్రాంతం. ఒంటరిగా ప్రారంభించడానికి ధైర్యం చాలడంలేదు. సహాయంకోసం ఎదురుచూస్తున్నాను.’ ఒక్క క్షణం ఆలోచించిన మిసెస్ ఒమూరా ‘సరే నేనే మీకు సహాయంచేస్తాను’ అన్నది. ఆ విధంగా అతి సాధారణంగానూ అతి త్వరగానూ మీసెస్ ఒమూరా జీవన శైలి మారిపోయింది. ఆమె పిల్లలు నిద్రపోయిన తరువాత గార్మెంట్షాపుకి వెళ్ళసాగింది. ఇలా కొద్ది వారాలు గడిచాయి. ఈలోగా ఆసౌందర్యరాశీ, మిసెస్ ఒమూరా అక్కచెల్లెళ్ళ వలె సన్నిహితులైపోయారు. ఒకరోజు సాయంత్రం మిస్టర్ ఒమూరా బార్ కు వెళ్ళలేదు. కానీ ఆరోజు ఆమెకు త్వరగా షాపు వైపు వెళ్లాలని వున్నది. అమెరికానుండి కొత్త డిజైన్ దుస్తులొచ్చాయి. మిస్టర్ ఒమూరా తీరిగ్గా పేపరు చదువుకొంటూ కూర్చున్నాడు. కాసేపు చూసి తెగించి అడిగింది . ‘మీరు ఈరోజు బార్‌కు వెళ్లడం లేదా?’ ‘వెళ్ళను’ ‘ఏమైంది?’ ‘సాయంత్రం నాయింట్లో నేను గడపకూడదా?’ అన్నాడు పేపరు పక్కనపెట్టి. ఇక ఆమె ధైర్యం తెచ్చుకున్నది. ‘మీరు ఇంటివద్దనే వున్నారుకదా! నేను బయటికి వెళ్లవచ్చునా?’ అతడు ఆమె కళ్లల్లోకి చూస్తూ ‘ఎక్కడికి?’ అన్నాడు. ‘ఒక స్నేహితురాల్ని చూడటానికి’ ‘నేను ఇంట్లో వున్న మొదటి సాయంత్రమిది. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు’ ‘ ........’ ‘సరే . వెళ్ళు’ అతడు తన సానుభూతి కోరుకొంటున్నాడని ఆమెకు అర్థమైంది. కానీ ఆసరికే ఆమె హృదయం కరడుగట్టిపోయింది. సంవత్సరాల తరబడి ఘనీభవించిన వేదనాభరితమైన వజ్ర కాఠిన్యం ఆమెది. ఎన్నో సాయంత్రాలు ఒంటరిగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వేచివుంది. ఎన్నోరాత్రులు దిగులుని దిగమింగుకొంటూ గడిపింది. అతనికి ‘థాంక్యూ’ చెప్పేసి బయటకు నడిచింది. షాప్‌లో ఈమొత్తం సంభాషణని సౌందర్యరాశితో చెప్పింది. ఆమె కూడా శ్రద్ధగా విన్నది. ‘వద్దు . మనం మగవాళ్ళగురించి మాట్లాడుతూ కాలం వృదా చెయ్యొద్దు’ అన్నది. ఇద్దరూ పనిలో పడిపోయారు. గార్మెంట్ డిజైనింగ్‌కు కళాత్మక నైపుణ్యం కావాలి. అందుకు ఏకాగ్రత అవసరం. ఆరోజు మిసెస్ ఒమూరా రెండు గంటలకన్నా ముందే ఇల్లు చేరుకున్నది. మిస్టర్ ఒమూరా కాస్త అసహనంగానే ఎదురు చూస్తున్నాడు. ‘నువ్వు ఒంటరిగా ఇంత రాత్రివేళ ప్రయాణించడం నాకు ఆందోళన కలిగించింది. ఇంకా యవ్వనంలోనూ అందంగానూ వున్న స్త్రీకి ఇది సురక్షితం కాదు.’ ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో అతడెప్పుడూ ఆమెని మెచ్చుకోలేదు. ఒక్క ప్రియమైన మాటకూడా ఆడలేదు. ఇప్పుడు అతడికి కృతజ్ఞతచెప్పాలని ఆమెకనిపించింది. ఇకషాపు సంగతి నిజం చెప్పెయ్యాలనే ఆమె నిశ్చయించుకొంది. ‘ఒకనాడు మనం డ్రెస్ షాపు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా?’ ‘వుంది. పెట్టుబడి లేదనికదా ఆగిపోయావు.’ ‘షాపు ఏర్పాటైంది’ అన్నదామె. అతడు చటుక్కున ఆమె వైపు తిరిగాడు. ‘అర్థరాత్రి రెండు గంటలవరకూ షాపులో నువ్వెలావుండగలవు?’ ‘నేను డ్రస్సులు డిజైన్ చేస్తున్నాను.. నాభాగస్వామితో.. ’ ‘భాగస్వామా?’అతడిలో పురుషాగ్రహం మేల్కొంది. చివాలున లేచాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ‘ఎవడువాడు?’ అని ఆగి, ‘నేను ముందే తెలుసుకోవాల్సింది. ఆడదాన్ని నమ్మడానికి వీల్లేదు . నువ్వు నాభార్యవి . రాత్రి రెండు గంటలకు ఇల్లు చేరుకున్నావు.’ ఆమె అతడి పట్టుని విదిలించుకుంది. ఒక జీవిత కాలపు క్రోధమూ ప్రతీకారమూ ఆమె జ్ఞాపకాల పొరల్లోంచి కట్టలు తెంచుకొని అగ్నిపర్వతంలాగా బద్దలవడానికి పక్వమైన సమయం ఆసన్నమయింది. ‘నువ్వు .. నువ్వు .. నామానాన నన్ను వదిలేసి వేకువన రెండుగంటల తరువాత ఇల్లుచేరిన నువ్వు .. పెళ్లయిన కొత్తలో కూడా గెయిషాల ఇళ్లకు పరుగులు తీసిన నువ్వు... ఆతరువాత బార్లకు ఎగబాకిన నువ్వు... ఇల్లూ పిల్లలూ వారి బాగోగులు పట్టించుకోని నువ్వు ... నీ ఆలోచనలూ,నీసంతోషమూ కుటుంబానికి చెందకుండా చేసిన నువ్వు .. నీ కాలమూ,నీ యవ్వనమూ పరాయి స్త్రీలకు ధారాదత్తం చేసిననువ్వు..’ ఇలాంటి మాటలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. కానీ ఆమె పెదవిప్పలేదు. ఆమె ఈ సభ్య ప్రపంచంలో ‘భార్య’కు నిర్వచనం. అంతలోనే వివేకపూరితమైన అంతర్దృష్టి మేల్కొంది. ‘ఈ అభాగ్యుడితో నిజమైన ప్రేమని పంచుకొనేది తాను కాక మరెవరు?ఎన్నో సంవత్సరాలపాటు ఎన్నోవందల రాత్రిళ్ళు గెయిషాల కొంపల్లో, బార్లలో అసలు ఎవరి ఇష్టాన్నీ నోచుకోని చోట, నిజానికి లోలోపలవారంతా ద్వేషించిన చోట, జీవితాన్ని వృధా చేసిన వాడికి భార్యగా ఇంకా తనుకాక దిక్కెవరు?’ ఆమె మృదువుగా, జాలిగా అన్నది ‘నా వ్యాపారభాగస్వామి ఒక స్త్రీ. పెట్టుబడి ఆమే సమకూర్చింది.’ ‘ఒక ఆడదానికి పెట్టుబడి ఎలావస్తుంది?’ మిస్టర్ ఒమూరా తీవ్రమైనగొంతుతో అడిగాడు. ‘ఆమె బార్‌గర్ల్‌గా పనిచేసింది.’ ఒక్కసారిగా మిస్టర్ ఒమూరా కళ్ల పొరలు తొలగి పోయాయి. బల్ల మీద కూలబడి, రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు. ‘ఆమె మిమ్మల్ని ఇష్టపడలేదనే విషయం నేను నమ్మలేక పోయాను. సంవత్సరాల తరబడి మీకు చేరువగావుంటూ మిమ్మల్ని ప్రేమించలేక పోవడం అంటే నా ఊహకే అందని విషయం’ అంటూ అలవాటుగా మోకరిల్లింది. స్త్రీ ఆభంగిమలోనే భర్తముందు వుండాలని ఆమె తల్లి పదే పదే చెప్పేది. ‘నువ్వు అలా భావిస్తున్నావా?’ అన్నాడు. అతని ముఖం అమాయకంగా దీనంగా, ఓడిపోయి గాయాలతో ఇంటికి చేరిన సైనికుడి వదనంలా ఆమెకు కనపడింది. ‘ఈ అర్భకుడు... తనకు జీవితాన్నిచ్చిన భర్త ... తనబిడ్డలకు తండ్రి ... ఇతడికి తను తప్ప ఇంకెవరున్నారు? ఈపురుషుడు వేరే స్త్రీలెవరికీ ఎటూ అవసరం లేదు.’ ఆమె జపనీయులు సంస్కృతిలో భాగమైన అనాది ‘భార్య’. గతం మరిచి క్షణాల్లో కరిగిపోయింది. ఆమె హృదయం అతడిపట్ల లోతైన జాలితో నిండిపోయింది. అతడు మాట్లాడకపోయేసరికి ఆమె తల పైకెత్తి చూసింది. చూపులు కలిసాయి. ఇద్దరూ మౌనంగా చిన్నగా నవ్వుకున్నారు. ఇద్దరి కన్నుల్లోనూ చెమ్మ తొంగిచూసింది. మనసులు తేలిక పడ్డాయి. ఆకాశంలో మబ్బులూ తొలగిపోయాయి. ‘ఇకముందు నాసమక్షంలో నువ్వు మోకరిల్లనవసరంలేదు. నవశకంలో అదింకా నాగరికత కాదు’ అంటూ ఆమె భుజాల్ని పట్టుకొని పైకెత్తాడు. ఆమె తన కాళ్ళమీద నిలబడేటట్టు తోడ్పడ్డాడు. -మూలం : పెర్ల్ ఎస్ . బక్ అనువాదం : టి. షణ్ముఖ రావు చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే -
పురిట్లోనే కన్నుమూసిన తల్లి, మళ్లీ పెళ్లి చేసుకున్న తండ్రి
మనవరాలు వసంత అన్న మాటకి నారాయణమ్మ మారు పలకలేకపోయింది. కాలుతున్న బొగ్గుల మీద నీళ్లు చల్లినట్లయింది. ‘‘చెప్పాను కదా. అతనికి వీలైనప్పుడు వస్తాడు. అట్టా గిలగిల్లాడతావేం?’’ అన్నది. ఈసడింపు! రక్త నమూనా తీసుకువెళ్లే మనిషి వచ్చి తీసుకుపోవాలి. అసలు ఐదుగంటలకి కాఫీ తాగే అలవాటు. దాన్ని ఆరు చేసింది. ‘‘నీకోసం నేను తెల్లవారుజామునే లేవలేను’’ అని నిక్కచ్చిగా చెప్పేసింది. గత్యంతరం లేక ఆ గంటసేపూ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, లేకపోతే రమణ మహర్షిని చదువుకోవటం–అలవాటు చేసుకున్నది. ఇదొక సాధన! ‘‘అతను ఆరింటికే వచ్చేవాడుగా?’’ తనను తానే ప్రశ్నించుకున్నట్లు పైకి అన్నది. హాల్లో దినపత్రిక చదువుకుంటున్న సుధాకర్ విన్నాడు. ‘‘ ఆ ల్యాబ్‌ని వసంత మార్చింది అమ్మమ్మగారూ. వాళ్లు బాగా రేట్లు పెంచారట’’ అన్నాడు. ‘‘అహా’’ అన్నది. మనసులో మాత్రం– నా పైసలేగా! అయినా దీనికి కాపీనం ఎక్కువైంది–అనుకున్నది. – ఆ కుర్రాడు వచ్చాడు. ‘వీన్ దొరకటం లేదండీ’ అని రెండు మూడు చోట్ల నొక్కాడు, పొడిచాడు, కుట్టాడు. చివరికి అయింది. ‘అందరూ రక్తం ఎరుపంటారు. కానీ, తన రక్తమేమిటో నల్లగా వుంది! సుగరూ, బీపీ, ఆస్తమా కలిస్తే ఇలా అవుతుందేమో!’ నవ్వుకుంది. అతను వెళ్లిపోయాడు. ‘‘వసంతా, కాఫీ ఇస్తావామ్మా’’ అడిగింది. ‘‘అదేగా చేస్తున్న ఉద్యోగం’’ అంటూ వచ్చింది. కప్పూ, గ్లాసూ టీపాయ్ మీద ఉంచి విసురుగా వెనక్కి తిరిగి వెళిపోయింది. వెళ్తూ వెళ్తూ ‘‘ నీ డ్యూటీ మీదే ఉంటాను తల్లీ. పదే పదే అరవక్కర్లేదు’’ అని ఓ గుండుసూది గుచ్చింది! కాఫీ అయింది. ‘డ్యూటీ..!’ నవ్వొచ్చింది నారాయణమ్మకి. ‘నేను ఎన్నెన్ని డ్యూటీలు చేస్తే ఇంతదయింది ఈ పిల్ల?’ అనిపించింది. చేత్తో కణతలు గట్టిగా నొక్కుకుంది. కళ్ల ముందు చిత్రవర్ణ దృశ్యాలు.. శేఖరంకి ఐఐటీలో బీటెక్ కాగానే, అమెరికా యూనివర్సిటీ ఆహ్వానం. కొడుకు ప్రతిభకూ, విజయానికీ పొంగిపోయారు తానూ, భర్త మౌళీ. ఆయనైతే–‘నేను ప్రైవేటు గుమాస్తానే గానీ, నా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్’ అని ఛాతీ పెంచుకున్నాడు. ఒకటే సంబరం. శేఖరం వెళ్లిపోయాడు. నెలలోపలే–ఒకరోజు! ప్రకాశంతో కలసి ఇంటికొచ్చింది కూతురు–వరలక్ష్మి! తనకూ మౌళికీ చలిపిడుగులాంటి సంభవం అది. మౌళి తట్టుకోలేకపోయాడు. కులాంతరమని కొంత ఆవేదనా, తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటమేమిటని ఆక్రోశం, ఉద్రేకం కొంతా–ఆయన గుండె కొట్టుకోవటాన్ని ఆపేసినై! శేఖరం రాలేని పరిస్థితి. అన్ని దుఃఖాల్నీ గరళంగా భరించింది తాను. టీచర్ ఉద్యోగ వ్యాపకం, సాహిత్యం చదువు–తనకు ఊరట. నడకని సాగించింది. ఏడాది గడిచిందో లేదో– ఓ అర్ధరాత్రి– ప్రకాశం ఫోను. అర్జంటుగా ఫలానా హాస్పిటల్‌కి రమ్మని. పరిగెత్తుకుపోయింది. బిడ్డను కని చావుబతుకుల్లో ఉన్నది వరలక్ష్మి. కడచూపులోనే–పశ్చాత్తాపమూ, బిడ్డ ఆలనాపాలనా నీ బాధ్యత అనే వేడికోలూ– కన్నుమూసింది. పసికందుని తనకప్పజెప్పి పోయి, మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ప్రకాశం. ఆ పసికందే– ఈ వసంత! తన దినచర్యంతా నిలువీతా, మునుగీతగానే అయింది. పనిమనిషి వెంకమ్మే ఇంట్లో వుండి తనకు పెద్దదిక్కయింది. అబ్బనాకారి వసంతతో ఎన్ని అవస్థలు పడింది తాను? ఎప్పుడూ ఏదో ఒక రోగమూ, రొష్టూ ఈ పిల్లకి. విజయవాడ దాటిపోకుండా, అధికారుల్ని వేడుకుని ట్రాన్స్ఫర్ల గండాన్ని తప్పించుకుంటూ ఉండేది. నాళ్లూ ఏళ్లూ గడచిపోతున్నై. శేఖరం అమెరికా వాసి అయిపోయాడు. నెలకోసారి ఫోన్లో పరామర్శ. అడపాదడపా–అడక్కుండానే డబ్బు పంపేవాడు. మధ్యలో ఒకసారి ఆ ‘వార్త’ని అందించాడు. తన కొల్లీగ్ కన్నడం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు! వసంతదంతా వానాకాలపు చదువే. బుర్రకి జ్ఞానం ఎక్కలేదుగానీ, శరీరానికి వయసొచ్చింది. తనకు తెలిసిన మాష్టారి కొడుకు– సుధాకర్ దొరికాడు. ఇన్సూరెన్స్ ఏజంటు. పెళ్లి చేసింది. కొందరు ఆడపిల్లలు పెళ్లికాగానే ఆరిందలవుతారు. రెండేళ్లు అత్తగారింట్లో ఉండి, మూడో ఏట అక్కడ వీరంగం చేసి ఇక్కడికొచ్చేసింది. సుధాకర్‌నీ తెచ్చింది. మూడుసార్లు గర్భస్రావాలు ఆమె దూకుడుకి మరిన్ని గంతులు నేర్పాయి. నోరు పెద్దదయింది. జీతం రాగానే, తన చేతికవివ్వాలి. ‘నీ ఖర్చులకు ఉంచుకో’ అని తన ‘వితరణ’ని అందుకోవాలి. సుధాకరమేమో ఒక సాధుజీవి. మితభాషి. తనపట్ల మాటామన్ననా వినయంగా ఉంటాడు. ‘అమ్మమ్మగారూ, అమ్మమ్మ గారూ’ అని నిండుగా, నిష్కల్మషంగా పిలుస్తాడు. –రిటైరయిన తర్వాత పెన్షన్ వ్యవహారాలన్నీ సుధాకరే చూశాడు. అంతా అయిన తర్వాత, ఏటీఎం కార్డు తెప్పించి, తన దగ్గర పెట్టుకుంది వసంత. శేఖరం పంపించే డబ్బు విషయాలూ చెప్పదు. తాను అడిగినా, ‘‘నీ సొమ్మేమీ తినన్లే తల్లీ’’ అని ఆ ప్రసక్తిని పక్కకి తోసేస్తుంది. –అమెరికా నుంచీ ఫోన్! ఆలోచన ఆపి ప్రస్తుతంలో కొచ్చింది నారాయణమ్మ. తల్లి ఆరోగ్యం గురించి వివరాలన్నీ అడిగాడు శేఖరం. ఆ తర్వాత అతని భార్య సుధ పలకరించింది. అప్పుడు మనవరాలు ప్రమీల గలగల మొదలైంది. నానమ్మతో తుళ్లుతూ, నవ్వుతూ మాట్లాడింది. అమెరికా ఉద్యోగాల గురించి కబుర్లు చెప్పింది. అంతా అయిన తర్వాత ‘‘నువ్ దిగులుపడకు నానమ్మా. ధైర్యంగా ఉంటే, ఏ అనారోగ్యమూ మనల్నేంచెయ్యలేదు’’ అని భరోసా పలుకు పలికింది. ముగ్గురూ–వసంతతో కూడా చనువుగానే మాట్లాడారు. సుధాకర్‌నీ పరామర్శించారు. చివర్లో–‘‘అటెండెంట్ వస్తున్నదా?’’ అని వసంతని అడిగింది ప్రమీల. ‘‘ఏం రావటమో ఏమో. ఒకరోజు వస్తే రెండు రోజులు సెలవంటుంది’’ అని ‘‘దూరంగా వున్న వాళ్లకేం తెలుస్తయ్లే–ఈ అవస్థలన్నీ’’ అని ఫోన్ కట్‌చేసింది వసంత. నారాయణమ్మకి బాధ కలిగింది. అటు తిరిగీ, ఇటు తిరిగీ ఏ ప్రస్తావననైనా–చివరికి తనకు సేవ చేయటం ఎంత కష్టంగా ఉన్నదో చెప్పి– దాన్ని కట్టె విరిచి పొయ్యిలో పెట్టటం పద్ధతిలోనే ముగిస్తుంది వసంత–అనిపించింది. మళ్లీ తలపులు ముసిరినై. అంతా తన దురదృష్టం. తన దినచర్య అంతా రోజూలాగానే అంతా సవ్యంగా జరుగుతోంది–ఆ రోజు కూడా. స్నానం, ధ్యానం, స్తోత్రపఠనం.. అయి, బయట తులసికోటలో నీళ్లు పోద్దామని వెళుతుంటే–కాలు జారి పడింది. తుంటి దగ్గర విరిగింది. ఆస్పత్రిలో నెల.. ఆ తర్వాత మంచం పాలయింది. లేవలేదు. కూర్చోలేదు. ఉన్నదుండగా ఉపాకర్మ అన్నట్లు, అది జరిగిన నాలుగు నెలలకే పక్షవాతం! అమెరికా నుంచీ అన్ని ఏర్పాట్లూ శేఖరమే చేశాడు, నెట్ ద్వారా. మాణిక్కెంనీ సహాయకురాలిగా తానే కుదిర్చాడు. వైద్యం విషయమూ, డాక్టర్‌తో సంప్రదింపులు– ప్రమీల చొరవగా, జాగ్రత్తగా చూస్తున్నది. పరోక్షంగా ఎన్ని జరిపినా, వసంత అన్నట్టు–ప్రత్యక్షంగా ఈ ‘సేవ’లు తప్పవు కదా! పది గంటలవుతుంటే గదిలోకొచ్చింది వసంత. అమ్మమ్మకి చీరె మార్చి, డైపర్ మార్చి ‘‘ఇవ్వాళ్టికి ఈ పక్క నిట్టా ఉండనీ. రేపా మాణిక్కెం వస్తే మార్పిస్తా. నిన్ను నేను లేపలేను’’ అని వెళ్లింది. ఆ తర్వాత అర్ధగంటకి టిఫెన్ పెట్టింది. కాఫీ ఇచ్చింది. ఎదురుగా కుర్చీలో కూచుంది. వసంతకి మనసులో చాలా ఆలోచనలు ఉన్నై. పేరుకి ఇన్సూరెన్స్ ఏజెంటేగానీ, సుధాకర్‌కి రాబడి తక్కువ. అమ్మమ్మ పెన్షన్‌లో మిగిలేవీ, శేఖరం మామయ్య పంపేవీ జాగ్రత్త చేసుకుంటూ ‘ముందుచూపు’తో వ్యవహరిస్తోంది. అమ్మమ్మ ఇల్లు ఆమె స్వార్జితం. దీన్ని తనపేర రాయమని కన్నీళ్లతో చాలాసార్లు అడిగింది. ఆమె నవ్వేసి ఊరుకుంటున్నది. ఇవ్వాళ ఆ సంగతి తేల్చుకోవాలనే, ఇప్పుడు స్థిమితంగా ఇలా వచ్చి కూచుంది. ‘‘ఎంతగా పైసలిచ్చి మచ్చిక చేసుకున్నా–ఈ పని మనుషులింతే’’ అంటూ మొదలెట్టింది సంభాషణని. ‘‘ఏవో అవస్థలుంటై వాళ్లకీనూ’’ ‘‘అవుననుకో. ఇక్కడ నీ పరిస్థితి చూడు. కదల్లేవు. అన్నీ మంచంలో నాయె. ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదూ. నన్ను కష్టపెడుతున్నాననే బాధా వుంటుంది కదా నీకు. అదో మనస్తాపం..’’ అమ్మమ్మ మీద ‘దయ’ మెల్లగా ప్రవహిస్తోంది! ‘‘ఏదో నేనుండబట్టి రోజులు గడుస్తున్నై’’ ‘‘అవునమ్మా.. నేనూ అదే అనుకుంటూ ఉండేది’’ ‘‘అవునూ.. ఇంటి సంగతి చెప్పనేలేదు నువ్. ఆ కాగితాలూ గట్రా చాలా తతంగముంటుంది కదా.. ఈయనా కనుక్కోమంటున్నారు..’’ పాపం, అమాయకుడు. అతనికిట్టాంటి ఆలోచనా ఉండదు; తొందరా ఉండదు; ఆరాటమూ ఉండదు... అనుకున్నది నారాయణమ్మ. ‘‘చూద్దాం కానీ..’’ అన్నది. ప్రసన్నంగా వసంతని చూసింది. వసంతకి ఆమె మాట ప్రసన్నంగా అనిపించలేదు! ‘‘నీ మనసులో మాట చెబితే మా ఏడుపేదో మేం ఏడ్చుకుంటాం కదా’’ అన్నది ఠక్కున. కంఠస్వరం వికటంగానే రొద చేసింది. క్షణంలో సగం సేపు ఆగి బయటపడింది–నారాయణమ్మ, ‘‘ఎప్పటికైనా ఇల్లు మాత్రం ప్రమీలకేనే’’ అని ‘‘నీకిచ్చేది ఎటూ నీకిస్తాను. అయినా ఎన్నడన్నా నిన్ను నా పెన్షన్ డబ్బు గురించి గానీ, మావయ్య పంపే డబ్బు గురించి గానీ అడిగానుటే?’’ అన్నది. నివ్వెరపోయింది వసంత. మొహం మాడ్చుకుంది. నేల చూపులు చూస్తూ కుర్చీని కిరకిరలాడించింది. ‘ఈ ముసల్ది ఘటికురాలు. కాలాంతకపు మనిషి’ అనుకుంది. ‘ఈవిడగారి ఉచ్చలూ పెంటలకయితే నేను కావాలి. ఆస్తి కట్టబెట్టటానికైతే అదెవరో కావాలి. ప్రమీల, ప్రమీల అని ప్రేమ కారిపోతోంది, కలవరిస్తోంది’ అని తిట్టుకుంది. మనసంతా వికలమైంది. ఠక్కున లేచి ‘‘సరే.. సరే.. కానీ.. నీ ఇష్టం’’ అని వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నై.. ఆమె ఆగ్రహం మనసులో చాలా వికృతపు ఆలోచనల్ని రేపింది. వాటి ప్రభావం బయటి ప్రవర్తనపై పడింది. మాటల్లో పనుల్లో ఎంతో మార్పునీ తెచ్చింది. ఏది అడిగినా– ‘నేనీ చావు చావలేను’ అని విసిరికొట్టటం, ఉదయపు పనుల్లో ‘ఎన్నాళ్లు పడాలో ఈ యాతన.. కంచి గరుడసేవ’ అని వేష్ట పడటం, పాటికి పదిసార్లు ముక్కు చీదుకోవటం, పళ్లు కొరుక్కోవటం... ఒకసారి శేఖరం ఫోన్ చేస్తే, నిష్ఠూరంగా ‘‘మావయ్యా–నువ్వేం డబ్బు పంపుతున్నావో మీ అమ్మకీ చెప్పు’’ అన్నది. ప్రమీల పరామర్శిస్తే–‘‘దూరంగా కూచుని ఎంతైనా ప్రేమని కురిపించొచ్చు. దగ్గర నిలబడి చేస్తేనే తెలిసొచ్చేది’’ అని ఒక విసురు విసిరింది. నానమ్మకి విడిగా ఫోన్ చేసింది ప్రమీల. ‘‘ఏవిటి నానమ్మా. వసంత వదిన బాగా ఏడుస్తోంది, ఏం జరిగింది?’’ అని అడిగింది. నారాయణమ్మ ఏమీ చెప్పకుండా ‘‘నన్నెక్కడన్నా ‘కేర్హోమ్’లో పడెయ్యవే–ప్రమీ– నీకు పుణ్యముంటుంది’’ అన్నది గద్గదికంగా. నానమ్మని చాలాసేపు ఊరడించి అన్నది ప్రమీల. ‘‘ప్రతి సమస్యకీ ఎక్కడో ఏదో పరిష్కారం ఉంటుంది నానమ్మా. నువ్వేం కలతపడకు. అంతా సర్దుకుంటుంది’’ అని ఉపశమింపచేసింది. వేసవికాలపు ఎండ చిరచిరలాడిస్తోంది. ఉదయం ఎనిమిదైంది. నారాయణమ్మ మంచంలో ఆపసోపాలు పడుతున్నది. హఠాత్తుగా ఇంటికొచ్చిన ప్రమీలని చూసి–దాదాపుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది వసంతకు. ప్రమీల పక్కన ప్రశాంత్. ఆమె భర్త! పరిచయాలు అయినై. వారిద్దరినీ చూసి చాలా తత్తరపడింది వసంత. గదిలోకి వెళ్లి నానమ్మని పలకరించింది ప్రమీల. కలో, నిజమో తెలీని సంభ్రమంలో– కన్నీళ్లొచ్చాయి నారాయణమ్మకు. మంచం పట్టెమీద కూచుని, ఆమె పైకి వంగి రెప్పలతడిని తుడిచింది ప్రమీల. భర్తని పిలిచి చూపింది. ‘‘ఈ వూరి వాళ్లే. మనకు దూరపు చుట్టరికం కూడా ఉన్నదిట. మేమిద్దరం ఒకే కంపెనీ’’ కాఫీలు వచ్చినై. వసంతకి కంగారుగా ఉంది. అకాలంలో జడివాన!! మాటలు సాగినై. ‘‘సవాలక్ష పనులు. ముందు వెనుకలు చూసుకుని చెయ్యాలి కదా. మాణిక్కెం రాలేదు. అందుకనే ఈవిడ పనికాలేదివ్వాళ’’ అంటూ గ్లాసులు తీసుకుని వెళ్లింది వసంత. ప్రశాంత్ హాల్లోకి నడిచాడు. ‘‘ఏం ఫర్వాలేదు. నేవచ్చానుగా..’’ అంటూ నిలబడి, పైట సర్దుకుని నడుముకు చెక్కుంది. సత్యభామ జడలాంటి జుట్టు సవరించుకుని ముడివేసుకుంది ప్రమీల. మనవరాలిని రెప్పలార్చకుండా చూసుకుంది నారాయణమ్మ. ‘పిల్ల బాగా ఎత్తరి. అమెరికాలో పుట్టినా జుట్టు కత్తిరించుకోలేదు. పైగా చక్కగా జడల్లుకుంది. కట్టూబొట్టూ, మాటతీరూ–అన్నీ మన పద్ధతుల్లో ఉన్నై. బంగారు బొమ్మ! ఆ మొగుడు పాత షావుకారు సినిమాలో రామారావులా ఉన్నాడు’ అనుకుని మురిసింది. అప్పటికప్పుడే నానమ్మని మంచంలో పైకి జరిపి, నిదానంగా కూచోబెట్టింది ప్రమీల. ‘‘ఇదేంటీ–నీకెందుకీ పన్లు? నే జూసుకుంటానుండు’’ అంటూ తత్తరలాడుతూ వచ్చింది వసంత. అనూహ్యంగా ప్రమీల రావటంతోనే అట్టిట్టవుతుంటే– ఆమె ఇలా సరాసరి ముసలావిడ పనుల్లోకీ దిగేసరికీ– కాళ్లూ చేతులూ వణుకుతున్నట్టయింది వసంతకు. ‘‘డోన్ట్‌వర్రీ వదినా! నేచూస్తాగా. మన పనులు మనం చేసుకోకపోతే ఎట్టా’’ అని ‘‘ ఈ పని నువ్ చూసుకో’’ అని పంపించిందామెను. గది తలుపు వేసి వెళ్లింది వసంత. నానమ్మకి ముందు డైపర్ మార్చింది ప్రమీల. జుట్టు చక్కజేసి, ఉన్న నాలుగు పోచల్నీ కలిపి, వేలిముడి వేసి, దానికో రబ్బరు బేండ్ వేసింది. ఒళ్లంతా తడిబట్టతో తుడిచి శుభ్రం చేసేసింది. ముసలామెని బెడ్‌లోనే జరిపి, పక్కకి వత్తిగిల చేసి, బెడ్షీట్నీ మార్చేసింది! వసంత వచ్చింది. చూసింది. అంతా పొందిగ్గా ఉంది. ‘ఇదేమిటీ–అమెరికా పిల్ల ఈ పనులన్నిటినీ ఇంత చకచకా, ఇంత తేలిగ్గా, క్షణాల్లో చేసేయగలిగింది’ అనుకుంటూ ప్రమీలని తేరిపారజూస్తూ నిలబడింది. ప్రమీల వెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి కూచుంది. ‘‘ఇప్పుడు చెప్పు విశేషాలు’’ అన్నది. వసంత వైపు చూస్తూ నెనరుగా నవ్వింది. అంతా అర్థమవుతూ ఏమీ అర్థం కానట్టు ఉన్నది వసంతకు. తన మామూలు ఘోషనే వినిపించింది. గొంతులో బరువూ, నిరాశా! ప్రశాంత్‌ని ‘‘మీరు రండి’’ అని పిల్చింది ప్రమీల. అతను వచ్చి కూచున్నాడు. ‘చక్కగా మొగుణ్ణి ‘మీరు’ అని పిలుస్తోంది. సంప్రదాయం తెలుసుకుంది’ అనుకుని లోలోపల మురిసిపోయింది నారాయణమ్మ. అతనితో పాత చుట్టరికాల్ని తిరగేసింది. వసంతకైతే ఇదంతా ఏమిటో, అక్కడేమవుతున్నదో అర్థం కాలేదు. ఉన్నట్టుండి, ‘‘నేను పాటలు బాగా పాడతానంటారు అమ్మా నాన్నా. పాడనా?’’ అని అడిగింది ప్రమీల– నానమ్మతో. ‘‘బలే.. బలే.. పాడు.. పాడు..’’ అన్నదామె చిన్న పిల్లలా ఉత్సాహంగా, సంబరపడుతూ. ముందుగా ‘పాటపాడుమా కృష్ణా..’ పాడింది. ‘‘ఎంత మధురంగా పాడావే ప్రమీ. కమ్మెచ్చున తీగె లాగినట్టుంది స్వరం’’ అని మెచ్చుకుంది నారాయణమ్మ. సుధాకరయితే చప్పట్లు కొట్టి ‘‘ఫైన్ ఫైన్’’ అన్నాడు. వసంతకీ ప్రమీల గొంతు నచ్చింది. చెప్పింది. ఆ తర్వాత–‘మరుగేలరా ఓ రాఘవా’ పాడింది. ఈసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ‘యూ ఆర్ గ్రేట్’ అన్నాడు ప్రశాంత్, భార్య వైపు కొంటెగా చూస్తూ! ‘ఐనో.. ఐ నో’ అని సరదాగా అన్నది. –వంటపనిలోనూ చొరవగా చేయి కలిపింది ప్రమీల. ఆమెని చూస్తూ బెరుకుబెరుకుగా మాట్లాడుతూ చాలా మానసిక సంఘర్షణని అనుభవిస్తోంది వసంత. గాలీ, పొగా కలసిన రసాయనిక క్రియ ఏదో లోపల్లోపల జరుగుతున్న భావనతో ఉద్విగ్నమైంది మనస్సు. ప్రమీలా ప్రశాంత్– పదిహేను రోజులు విజయవాడలోనే ఉన్నారు. అటు అత్తవారింట్లోనూ, ఇటు నానమ్మతోనూ చాలా సంతోషంగా గడిపింది ప్రమీల. ఆవేళ– అందరూ నారాయణమ్మ గదిలో ఉన్నారు. ‘‘నేనూ, మా వారూ కూడా వచ్చే వారం హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగాల్లో చేరాలి. ఇక్కడ ఒక కంపెనీలోనే దొరికాయి’’ చెప్పింది ప్రమీల. ‘‘అదేమిటీ–అమెరికా వెళ్లరా?’’ ఆశ్చర్యంతో అడిగింది వసంత. ‘‘వెళ్లటం లేదు. మేము ఇక్కడ స్థిరపడాలనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని వచ్చాం. నిజానికి హైదరాబాద్‌లో ఒక విల్లా కొనుక్కున్నాం. బుధవారమే మా ప్రయాణం–నానమ్మతో సహా’’ అన్నది ప్రమీల. అయోమయంగా దిక్కులు చూసింది వసంత. ఆమెకిది మరో అనూహ్య పరిణామం! బుధవారం. మధ్యాహ్నం– వసంతనీ, సుధాకర్‌నీ పిలిచింది నారాయణమ్మ. తన చేతిలోని కాగితాలు వసంతకిస్తూ– ‘ఇది నా వీలునామా. నా తర్వాత ఇల్లు మీదేనే. ప్రమీల ఇట్టా రాయమన్నది’ అని చెప్పింది. వసంతకి నోటమాట రాలేదు. వాటిని తీసుకుని, మెరుస్తున్న కళ్లతో ప్రమీలని చూసింది. అంబులెన్స్ వచ్చింది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు. ప్రమీలకు పసుపూకుంకుమా, పండూ తాంబూలం, చీరే జాకెట్ ఇస్తుంటే– కళ్లనీళ్లు తిరిగినై వసంతకి. ప్రమీల మృదువుగా ఆమె భుజం తట్టి, ‘నానమ్మకి నువ్ చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువే చేశావ్. నువ్వంటే నాకిష్టం’ అని ఆర్ద్రంగా దగ్గరకి తీసుకుంది. వెక్కుతూ గుండె బరువుని తేలిక చేసుకుంది వసంత! అందరూ ముసలామె కాళ్లకి నమస్కారం చేశారు. వాళ్లని ‘దీర్ఘాయురస్తు’ అని దీవించింది. వాళ్లని మార్చిమార్చి చూస్తూ సంతృప్తిగా నవ్వింది నారాయణమ్మ. మనుషుల్నీ, మనసుల్నీ ఆహ్లాదంగా స్పృశిస్తూ చల్లని తెమ్మెర వీచింది!! - విహారి -
ఈవారం కథ: ఆయన స్టైల్‌ను ఎవరూ తట్టుకోలేరు
కూనిరాగం తీస్తున్న సుబ్బారావు కొయ్యబారిపోయాడు... కారణం ఏమీ లేదు.. జస్ట్.. బ్రహ్మానందాన్ని చూశాడు.. అంతే. సుబ్బారావు బ్రహ్మానందాన్ని యథాలాపంగా చూసి ఎప్పటిలాగానే వెకిలిగా నవ్వబోయి చిన్నగా పిచ్చికేక వేశాడు. నోటమాట నోట్లోనే ఆగిపోయింది. ‘ఏందిది? ఈయన మన బ్రమ్మం పంతులేనా? ఇంత ఉషారుగా ఉన్నాడే.. ఎప్పుడూ ఈసురోమని ఏడుపు ముఖంతో తిరిగే బ్రమ్మం.. ఇయ్యాల.. అబ్బో.. కిర్రెక్కిపోతన్నాడే..’ అది గాయత్రీనగర్‌లో ఐదోవార్డు. బ్రమ్మం అనే కూచిపూడి వీరవెంకట లక్ష్మీ బ్రహ్మానందం అదే ప్రాంతంలో బతుకుతున్న ఓ ప్రాణి. ఐదోవార్డు మునిసిపాలిటీ పిల్లల బళ్ళో పంతులు. మానవుడే కాని పెద్దగా గుర్తింపుకు నోచుకోని ప్రాణి. డ్రైనేజీ మీద తిరిగే పురుగు. రోడ్డుపక్కన గజ్జి కుక్కపిల్ల. గాలికి దొర్లే ఎండుటాకు. ఇది ఊర్లో బ్రహ్మానందానికి ఉన్న హోదా.. నలభై ఏళ్ల బ్రహ్మం ఇంకో పదేళ్ళు మీదేసుకున్న శరీరుడు. అంత పొడుగూకాదు, పొట్టీ కాదు... అర్భకుడూ కాదూ దృఢకాయుడూ కాదు... అందగాడు కాదు, మరీ తీసిపారేసే రకమా..ఏమో! నవ్వకపోయినా పళ్లు బయటే ఉంటాయి. వాటి ఎత్తుపల్లాలు పళ్లమధ్య దూరాలు అందరికీ దర్శనభాగ్యం కలిగిస్తాయి. అప్పుడపుడు తల దువ్వుతాడు. ఎప్పుడన్నా పౌడర్రాస్తాడు. అప్పుడప్పుడు చొక్కాగుండీలు ఎగుడుదిగుడుగా పెట్టుకుంటాడు. ఎప్పుడన్నా ప్యాంట్ జిప్పు మర్చిపోతుంటాడు. ప్రశ్నవేస్తే కంగారు పడతాడు. జవాబు చెప్పలేడు. అప్పుడే ఏవిటో నత్తి వస్తుంది. నోట్లోంచి చొంగ కారిపోతుంది. అడిగినవాడు ఎందుకు అడిగాన్రా అని బాధపడతాడు. కూరగాయలవాడు బ్రహ్మంతో కామెడీ ఆడతాడు. రిక్షావాడు ఆయనతో బేరాలాట ఆడతాడు. కారణం? ఆ పర్సనాలిటీ, అ యాటిట్యూడ్ అలాంటిది! అలాంటి బ్రహ్మం ఇవ్వాళ అపరసూర్యుడిలా వెలిగిపోతున్నాడు. నిండుచందమామలా కాంతులీనుతున్నాడు. రజనీకాంత్‌లా ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాడు. చిరంజీవిలా షర్ట్ గుండీలు తీసి అడుగేస్తున్నాడు. కమల్ హాసన్‌లా మృదువుగా నవ్వులు రువ్వుతున్నాడు. ‘‘ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు’’ అన్నట్లు మూర్తీభవించిన తెలుగు తేజంలా తేజరిల్లుతున్నాడు. ఆ ఊపూ.. చూపు.. తట్టుకోలేనట్లుగా ఉంది. సుబ్బారావే కాదు, బడ్డీకొట్టు సుందర్రావ్, ఎస్టీడీ బూత్ రంగనాయకులు, టిఫిన్ సెంటర్ వెంకటరావు, మిల్క్ సెంటర్ ప్రభావతి.. ఇలా అందరూ ఆయన స్టైల్‌ను తట్టుకోలేక షాకింగ్‌గా చూస్తూ ఉండిపోయారు. ఇది ఊర్లో సన్నివేశమైతే, ఇంట్లో సన్నివేశం మరింత షాకింగ్‌గా ఉంది. బ్రహ్మం భార్య రాజ్యం.. పొద్దున్నే ట్రిమ్ముగా తయారైన భర్త కొత్త అవతారం చూసి పక్షవాతం వచ్చినట్లు గిలగిల కొట్టుకుంది. ఎన్టీఆర్‌లా పంచకట్టి కొంగు జేబులో దోపాడు. పౌడరే కాదు, సెంటు కూడా కొట్టాడు. తల దువ్వాడు. దువ్వుతూ కూనిరాగాలు తీశాడు. మురికి హవాయ్ చెప్పులు వొదిలేసి, షూ తీసి పాలిష్ చేసి తొడిగాడు. వెళుతూ వెళుతూ రాజ్యం బుగ్గమీద చిటికె వేశాడు. రొమాంటిక్‌గా నవ్వాడు. ఆవిడ తేరుకోడానికి మినిమం అరగంట పట్టింది. కాలేజీ నుంచి వచ్చిన కొడుకు ఫణి తల్లిని చూడగానే బిత్తరపోయాడు. ‘‘ఏంటమ్మా.. వొంట్లో బాలేదా.. విరోచనాలా..ఎన్ని?’’ అన్నాడు ఆమెనుచూసి. చెప్పేలోపే ఇంట్లోకొచ్చిన బ్రహ్మం ఆమె బుగ్గపై చిటికె వేసి లోపలికెళ్ళాడు. తల్లి చెప్పకుండానే తండ్రి చేసిన పనిచూసి బిర్ర బిగుసుకు పోయాడు ఫణి. ‘‘అమ్మా.. నాన్నేనా.. నేను చూస్తోంది నిజమేనా?’’.. ఆమె జవాబివ్వలేనట్లు వెర్రిచూపులు చూసింది. నిజానికి పెళ్లిచూపుల సమయానికి బ్రహ్మం నిజమైన బ్రహ్మానందంలా నిత్యం నవ్వులు చిందిస్తూ రొమాంటిక్‌గా కనపడ్డాడు రాజ్యానికి. ‘‘అబ్బాయి నచ్చాడామ్మా?’’ అని తండ్రి అడిగినప్పుడు నిజంగానే సిగ్గుపడిపోయింది. బుగ్గలు ఎరుపెక్కి పెదాలు వొణికాయి. ‘‘ఊ..సరే..ఆ..ఊ’’ అంది తియ్యతియ్యగా. పెళ్లినాటి ఆ హీరోయిజం బ్రహ్మంలో మధ్యాహ్న సూర్యకాంతిలా చాలాకాలం ప్రకాశించింది. రాజ్యాన్ని సంసారమనే ఆనంద లోకాలలో వోలలాడించింది. అప్పుడే ఫణి పుట్టాడు. తొలి కాన్పు కొడుకు పుట్టడం ఇద్దరికీ స్వర్గం చేతి కందినట్లయ్యింది. బ్రహ్మం ఉద్యోగం సజ్యోగం, డబ్బులు గిబ్బులు బయట గొడవలు రాజ్యానికి తెలియవు. పట్టవు. కాని బ్రహ్మం ఆమెకు ఏమీ చెప్పకపోయినా అన్నీ సమకూర్చేవాడు. ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. అలాంటివాడు రానురానూ తనలోతాను ముభావంగా.. అంతర్ముఖుడుగా.. మాటలు తగ్గి సణుగుడు ఎక్కువై.. దిక్కులు చూడటం.. తిండి ఏంటో..బట్టలేంటో.. పట్టించుకోనంతగా నత్త గుల్లలోకి ముడుచుకు పోయినట్లు ముడుచుకుపోయాడు. ఆమె సాధారణ ఇల్లాలు. దాంపత్యంలో వొకరు మెతక అయితే మరొకరు డామినేట్ చేస్తారు. అదే జరిగింది. ఆమె తనకు తెలియకుండానే కొంగు బిగించాల్సి వచ్చింది. కుటుంబ పగ్గాలు చేతికి తీసుకోవాల్సి వచ్చింది. ఏదో మొగుడనే వాడు ఉన్నాడు. రెండోతారీఖు జేబులో జీతం డబ్బులు ఉంటున్నాయి. అది చాలు.. ప్చ్.. అలా బ్రహ్మం రానురానూ ఇంటా బయటా బాగా చులకనైపోయాడు.. ఈ నేపథ్యంలో పుట్టిపెరిగిన ఫణి కూడా డిటోనే. ఫణికి ఊహ తెలిసేటప్పటికే మునగదీసుకుని సైలెంటుగా ఉండేవాడు బ్రహ్మం. అందుకని ఫణికి కూడా తండ్రిపై సదభిప్రాయం లేదు. ఇద్దరూ బ్రహ్మాన్ని చులకనగా సూటిపోటి మాటలతో ఆటపట్టించడం.. ఆడుకోవడం.. అలాంటిది ఇప్పుడు ఇలా బ్రహ్మంలో ఈ మార్పు వాళ్లకు ఊహాతీతం. హఠాత్తుగా తండ్రి పిలుపు విని అలా నిలబడిపోయాడు. ‘‘వొరేయ్.. ఫణి..’’ రెండు నిమిషాలు నిశ్శబ్దం.. మళ్లీ పిలిచాడు. ఈసారి గట్టిగా.. మరింత దృఢంగా.. ‘‘నిన్నేరా ఫణీ..’’ ఏవనాలో ఆలోచించేలోపే చెంప పేలిపోయింది. జరిగింది అర్థంకాలేదు వాడికి. తనను.. తండ్రి కొట్టాడు.. ఫణే కాదు రాజ్యనికి కూడా మతిపోయింది. ‘‘నాన్నా.. నే.. నేనే.. ఇక్కడే ఉన్నా.. చెప్పు నాన్నా’’ అన్నాడు వణుకుతూ.. ‘‘ముందు పిలవగానే పలకాలి.. నా ముందు నిలబడాలి.. ఓ కే..? ’’ భర్తలో రజనీకాంత్ కనిపించాడు రాజ్యానికి. సౌండు స్పష్టంగా ఉంది. ఇంతకు ముందు ఫణికి ఏ పనీ చెప్పలేక పోయేవాడు బ్రహ్మం. చెబితే వాడు కామెడీ విన్నట్లు విని ఊరుకునేవాడు. ఒక తల్లిగా ఆమెకు ఫణి ప్రవర్తన తప్పేనని తోచినా, బ్రహ్మం తీరు నచ్చక కొడుకును ఏమీ అనలేక పోయేది. ఇప్పుడు బ్రహ్మం అసలు సిసలు తండ్రిలా కొడుకుపై తన అధికారాన్ని ప్రదర్శించడం ఆమెకు లోలోన నచ్చేసింది. ‘ఇలా ఉంటే పిల్లాడు ఇక చెడిపోడు’ అనిపించి భర్తపై హఠాత్తుగా గౌరవం, అభిమానంలాంటి భావాలతోపాటు భర్త అనే తీయని భావన ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి మొలకెత్తింది. భర్తకు గ్లాసుతో మంచినీళ్లు స్వయంగా ఇచ్చింది. వచ్చేముందు చీర కుచ్చిళ్లు సవరించుకుంది. ఇచ్చేముందు తల, పైట సర్దుకుంది. ఇచ్చినవి నీళ్లే అయినా భర్తకు ఆమె ఇలా ఇచ్చింది ఎన్నో ఏళ్ల తర్వాత. భార్యలో కలిగిన ఈ మార్పును బ్రహ్మం చిరునవ్వుతో స్వీకరించి, థాంక్స్ చెప్పి ఆమె ముఖంలో నవ్వుల్నీ, బుగ్గల్లో లైట్‌గా ఎర్రెర్రని రొమాంటిక్ మందారాల్ని పూయించాడు. ఇక స్కూల్లో సన్నివేశం చూద్దాం.. ఐదోవార్డులోనే పుట్టిన బ్రహ్మం అదేస్కూల్లో చదివాడు. ఇప్పుడు అదే స్కూల్లో టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. తర్వాత పెళ్లి.. ఆ తర్వాత కొడుకు పుట్టడం... ఇక్కడి వరకు బ్రహ్మానికి అన్నీ జాతకంలో ఉన్నట్లు చకచకా జరిగాయి. ఆదర్శ టీచర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి సడన్‌గా ఆతనిలో పెద్ద మార్పు.. ఐదో తరగతి సోషల్ పాఠం రెండో తరగతిలో చెప్పాడు. ఇది స్కూల్ అంతా గంట మోగినట్లు మోగిపోయింది. మరో రెండు రోజుల తర్వాత తెలుగు క్లాసులో లెక్కలు చెప్పాడట. తర్వాత ఐదో తరగతి పిల్లలతో అ ఆ లు దిద్దించాడట. కొత్తబట్టలతో వచ్చి హ్యాపీ బర్త్‌డే చెప్పిన పిల్లాడిని యూనీఫాం వేసుకు రాలేదని చితక్కొట్టాడట. పిల్లాడి బంధువులు ఆయుధాలతో వచ్చేసరికి బ్రహ్మం ఇంటికెళ్ళిపోవడం.. బంధువులు హెడ్మాస్టర్ని వాళ్ళ శక్తి కొద్దీ పేపర్లో వార్త వచ్చే స్థాయిలో ఆడుకోవడం జరిగింది. ఇలాంటి మధుర స్మృతులు ఎన్నో! అలా బ్రహ్మం ఇంటా బయటా సెంటర్ పాయింట్ అయిపోయాడు. అలాంటి బ్రహ్మం తిరిగి బ్రహ్మానందంలా అఖండ తేజస్సుతో వెలిగిపోతూ అందరికీ షాకిస్తున్నాడు. ఆ ఉదయం స్కూలు చదువుల తల్లిని ప్రార్థించబోయే వేళ.. స్కూలు ఆవరణలోకి అడుగుపెట్టిన బ్రహ్మాన్ని చూసి స్కూలు స్కూలంతా స్తంభించిపోయింది. రోజూ బ్రహ్మం లోపలికొస్తే ఏదో ఆవో గేదో కుక్కపిల్లో దారితప్పి లోపలి కొచ్చినట్లు ప్రార్థన ఆపేవారు కాదు. ఇవ్వాళ మాత్రం ట్రిమ్ముగా తయారై అచ్చ తెలుగు పంతులులా ఎంటర్ అయిన బ్రహ్మానందం మాష్టారు ధీమాగా విలాసంగా ప్రార్థన జరిగే చోటుకు వచ్చాడు. అంతా.. హెడ్ మాస్టార్తో సహా నోరుతెరిచి చూస్తుండిపోయారు. బ్రహ్మం గొంతు సవరించుకుని, మైక్ ముందుకొచ్చాడు. ‘మా తెలుగు తల్లికీ.. మల్లెపూదండ..’ అంటూ శ్రావ్యంగా, గంభీరంగా గొంతెత్తి హాయిగా అందరూ థ్రిల్లయ్యేలా పాడాడు. అంతా పిచ్చెక్కినట్లు చప్పట్లే చప్పట్లు.. ఎవ్వరివంకా చూడకుండా స్టైల్‌గా క్లాసు వైపు నడిచాడు. ఆరోజు స్కూల్లో అంతా బ్రహ్మం గురించే చర్చ. ఇలా ఎలా సడన్‌గా చేంజ్ అయ్యాడో అర్థం కావడం లేదు. బ్రహ్మం.. ఇప్పుడు ఆ పేటలో హాట్ టాపిక్.. అతనిలో వచ్చిన సడన్ మార్పు చూసి ఇరుగు పొరుగు పాతమిత్రులు, స్కూలు సహచరులు, బంధువులు అందరిలోనూ గగుర్పాటు, సంభ్రమం... మంచిబాలుడు అనిపించుకున్న బ్రహ్మం మెంటల్ బ్రహ్మంగా ఎందుకు తయారయ్యాడో, మళ్ళీ అసలు సిసలు బ్రహ్మానందంగా ఎలా మారాడో అందరికీ మిష్టరీగా మారింది. అందరి సంగతి వేరు. భార్య, కొడుకు సంగతి వేరు. వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మంలో వచ్చిన ఈ మార్పులకు కారణం ఏమిటో అర్థంకాక ఆలోచించి ఆలోచించి గందరగోళపడి చివరికి శవాన్ని మోస్తున్న విక్రమాదిత్యుడి లాంటి బ్రహ్మాన్నే అడిగారు. ‘‘అసలు అలా ఎందుకు తయారయ్యావు నాన్నా.. మళ్ళీ ఎలా ఇలా మారిపోయావు.. చెప్పాలి’’ అన్నాడు కొడుకు ఫణి. ‘‘చెప్పి తీరాలి’’ అంది భార్య రాజ్యం. ఆహ్లాదంగా నవ్వాడు బ్రహ్మం. ‘‘చెప్పాల్సిందేనా?’’ అన్నాడు రిలాక్స్డ్గా. చూస్తున్న టీవీని రిమోట్‌తో ఆపాడు. అర్ధ నిమీలితంగా చూస్తూ మెల్లగా మొదలెట్టాడు. ‘‘రామదాసు తెలుసుగా.. వాడే నాకు ద్రోహం చేశాడు..’’ ఉపోద్ఘాతంగా అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘తెలీక పోవడం ఏంటి.. రామదాసు అన్నయ్యగారు మీ క్లోజు ఫ్రెండేగా’’ అంది రాజ్యం. ‘‘ఈమధ్య అంకుల్కేదో..’’ అంటున్న ఫణిని ఆపమన్నట్లు చెయ్యెత్తాడు.. ‘‘ఆమధ్య టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ లో రామదాసుగాడ్ని రాయితో తల మీద కొట్టాను’’.. రావణాసురుడ్ని చంపిన రాముడిలా, దుర్యోధనుడ్ని చంపిన భీముడిలా, జలియన్ వాలాబాగ్ లో జనాన్ని చంపిన డయ్యర్‌లా, కోర్టులో స్టేట్‌మెంట్‌లా చెప్పాడు. అర్థంకాలేదు ఇద్దరికీ. ‘‘వాడు నాకు ద్రోహం చేశాడు. చేశాడంటే వొక్కసారి చేశాడని కాదు. చేస్తూనే ఉన్నాడు.. నా చిన్న బతుకును చిదిమేశాడు. నాప్రాణాల్ని తనజేబులో పెట్టుకుని, వాడికి ఎప్పుడు సరదా అనిపిస్తే అప్పుడు నా పీకనొక్కుతూ ఆనందిస్తుండేవాడు. అందుకే ఆరోజు మీటింగ్‌లో రాయట్టుకుని పుచ్చె పగిలేలా కొట్టాను’’ ఆనందంగా కోరిక తీరినట్లు తృప్తిగా మెరిసేకళ్లతో చెప్పాడు. ఇద్దరికీ డౌట్స్ పెరిగాయేగాని, తగ్గలేదు. ‘వాడు ద్రోహంచేశాడు సరే, చాలాకాలంగా ఈయన బాధపడుతున్నాడు సరే.. అయితే చిన్న రాయితో కొట్టి అదేదో ఘనకార్యం చేసినట్లు ఈ బిల్డప్ ఏంటి?’ ‘‘వాడ్ని అసలు చంపేసెయ్యలని ఉంది. కాని నేను వాడ్ని ఏమీచెయ్యలేనని, మనకు అన్యాయం చేసే ప్రభుత్వాలను, మోసంచేసే మినిష్టర్లను, వొక్క కలంపోటుతో మన బతుకుల్ని ఛిద్రంచేసే ఆఫీసర్లని మనం ఏమీ చెయ్యలేక పోతున్నాం. అలాగే నేనూ వాడిని ఏమీ చెయ్యలేనని అర్థమై నాలోనేను ముడుచుకు పోయాను. కాని రాక రాక చిన్న అవకాశం వచ్చింది. నా కసి తీర్చుకున్నా’’ కసిగా చెప్పాడు బ్రహ్మం. ‘‘రామదాసుగాడూ నేనూ ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. బాల్య స్నేహితులం. చెడ్డీలులేని రోజుల నుంచే వాడు నాకు ద్రోహం చెయ్యడం ప్రారంభించాడు. మేమిద్దరం ఓ కుక్కపిల్లను పెంచాం. అదంటే నాకెంతో పిచ్చి. కాని వాడు దానికేం పెట్టేవాడుకాడు. నేనే తిండి మానేసి దానికి పెట్టేవాడ్ని. వొకసారి కుక్కపిల్ల కాలు వాడి సైకిల్ చక్రంలో పడి విరిగింది. అది కుయ్యో కుయ్యోమని ఏడవటం ఇప్పటికీ నాచెవుల్లో అలా ఉండిపోయింది. వాడు దాన్ని కాపాడతానని అందరికీ చెప్పి దొడ్లో ఓ మూల వొదిలేశాడు. నాకు నిద్రపట్టక దాన్ని చూద్దామని వాళ్లింటికి వెళ్లాను. అది వర్షంలో వణుకుతూ ఏడుస్తోంది. నేను విలవిల్లాడిపోయా. వాడ్నిలేపి ఇదేంట్రా అని అడిగా. వాడు నిద్రలేపిన కోపంతో ఆ కుక్కపిల్లను అప్పటికప్పుడు పెద్ద రాయితో కొట్టి కొట్టి చంపాడు. నా కళ్ళముందే అది గిలగిలకొట్టుకుని చచ్చిపోయింది. ఇదే వాడి నైజం. అప్పటికీ ఇప్పటికీ ఇదే వాడి ప్రవర్తన. అదెప్పుడో నా పదేళ్ల వయస్సులో జరిగింది. ఇప్పటికీ నా గుండెల్లో చెరగకుండా ఉండిపోయింది. రామదాసు విషప్పురుగు. పుట్టినప్పటి నుంచి నామీద ఎప్పుడూ వాడి విషపు పడగనీడ.. వాడు ఏనాడూ చదివి పాసవ్వలేదు. అన్నీ నా దాంట్లో చూసి రాసి పాసయ్యేవాడు. స్కూల్లో ఎలా మేనేజ్ చేసేవాడో.. ఎప్పుడూ నా వెనకే నెంబర్ వచ్చేది.. ఏడో తరగతిలో నన్ను డిబార్ చేశారు. వాడు చూసి రాసినందుకు కాదు, నేను చూపించినందుకట. హెడ్ మాస్టర్ మళ్లీ ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపేస్తానన్నాడు. అదిమొదలు నాకు చూపించకపోతే టీసీ ఇప్పించేస్తా అని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా టెన్త్ అయ్యాక మళ్లీ ఇంటర్‌లోనూ ఒకే కాలేజీ. మళ్లీ పరీక్షల్లో నా పక్కనే వాడి నెంబరు. ఫస్ట్ ఇయర్లో మళ్లీ నేనే డిబార్. నా ఆన్సర్ పేపర్ వాడి ఆన్సర్ పేపర్లతో కలసి కుట్టి ఉంది. రామదాసు అంటే మా నాన్నకు మహా గురి. ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేస్తాడని ఆయన నమ్మకం. ఆయన రిక్వెస్టుపై నా డిబార్ కాన్సిల్ చేయించి, మళ్లీ బ్లాక్ మెయిల్. అలా ఇంటర్ అయ్యింది. డిగ్రీ బందరులో చదవడం వల్ల క్లాసులో లేడు. వారం వారం ఇంటికొచ్చినప్పుడు వదిలేవాడు కాదు. ‘ఒరే బ్రమ్మీ.. నన్ను మర్చిపోయావ్బే..’ అంటూ వచ్చేవాడు. చుట్టూ పెద్ద బేచ్.. ‘నా చిన్ననాటి క్లోజ్ ఫ్రెండ్’ అని పరిచయం చేశాడు. నోరు తెరిస్తే బూతులు. వినకూడదనుకున్నా వినేటట్లు చెప్పేవాడు. అన్నీ గొడవలే.. ‘అదిగో పంపుదగ్గర నీళ్లు పట్టుకుంటోందే ఆ చిట్టిబాబుపెళ్లాం.. పెద్ద కేసు.. వంద ఇస్తే పక్కలోకి వచ్చేస్తుంది. మీ పక్కింటి సుందర్రావు.. వడ్డీకిచ్చి ఆడోళ్లని పక్కలోకి రమ్మంటాడు’.. వీళ్లందరితోనూ రామదాసుకి సంబంధాలు.. వాడి ఫ్రెండ్స్ అందరూ ఏవేవో అల్లర్లలో ఉంటారు.. అన్నీ సెటిల్మెంట్లు.. ఇరువైపులా డబ్బువసూళ్లు.. వొకరోజు నా గుండెల్లో బాంబు పేల్చాడు. ‘ఎంట్రోయ్ బ్రెమ్మీ.. చూస్తే డొక్కు పర్సనాలిటీగాని అమ్మాయిలు నీకే పడిపోతున్నార్రోయ్’ అన్నాడు. నేను అయోమయంగా చూశా. ‘గీత.. రామాచారి కూతురు.. నువ్వంటే ఫిదా.. తెల్సా’ అన్నాడు. మావూరి రామాలయం పూజారి కూతురు. చిన్నప్పటినుంచి ఇద్దరికీ తెల్సు. నేను ఉక్కిరిబిక్కిరయ్యా. గీత నన్ను ప్రేమిస్తోందా? గీత గీతలా నాజుగ్గా ఉంటుంది. ధ్వజస్తంభంలా పవిత్రంగా ఉంటుంది. ‘ఏంట్రా నీడౌటు.. తనే నాతో చెబితేనూ’.. నేను బాగా దెబ్బతినేశా. ‘నీతో చెప్పలేక నాతో అంది. నువ్వు మూలి వెధవ్వి.. చెప్పలేవ్.. లెటర్ రాసి నాకివ్వు.. నేజూసుకుంటా’... నాకూ గీతకుమధ్య వాడే పోస్టుమేన్. ఏదేదో కవిత్వం రాసేసేవాడిని తనూ ఏదేదో రాసేది. వందసార్లు అక్షరం అక్షరం చదువుకునేవాడిని. వోరోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. గీత కడుపు తీయించుకోవడానికి ఏదో తాగి చచ్చిపోయింది. నా లెటర్స్ దొరకడంవల్ల నేనే కారణం. అసలు కారణం రామదాసు. వాడు తప్పుకుని నన్ను సాక్ష్యాధారాలతో పట్టించాడు. ఆమె తల్లిదండ్రులు గుళ్లో ఉరివేసుకుని చనిపోయారు. నా నవనాడులూ కుంగిపోయాయి. ఇంత ద్రోహమా! మొదటిసారి పిచ్చివాడినయ్యా. మా నాన్న పొలం అమ్మి వాడి చేతిలో పెట్టి కన్నీటితో కాళ్లు కడిగాడు. వాడు కేసులోంచి బయట పడేశాడు. అర్థమయ్యిందా.. మళ్లీ బ్లాక్ మెయిల్.. ‘నోరెత్తావో ఉరికంబమే’.. నాన్న మిగిలిన పొలం అమ్మేశాక వాడు నాకు ఉద్యోగం వేయించాడు. అటు వాడు పెద్ద లీడర్‌గా ఎదిగిపోతున్నాడు.. తగువులు..సెటిల్మెంట్లు.. చిట్టిబాబు తన పెళ్లాన్ని చంపేశాడు. సుందర్రావ్ను జనం రోడ్డుమీద ఈడ్చిఈడ్చి కొట్టారు. కొన్నివడ్డీలు మాఫీచేసి రామదాసుగాడు కేసులు సెటిల్ చేశాడు. పోలీసొకడు.. వొక జర్నలిస్టు. వీడి బాచ్‌లో ప్రముఖ వ్యక్తులు. హమ్మయ్య.. నన్ను వొదిలేసి ఊరుమీద పడ్డాడు అనుకుని ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటే మళ్లీ పడగ విప్పాడు. ‘పదో తరగతి పాస్ చేయిస్తానని బ్రహ్మం మాష్టారు పాతికమంది దగ్గర డబ్బువసూలు’.. ఓరోజు పేపర్లో న్యూస్. నా మీద ఎంక్వైరీ. సస్పెన్షన్. వాడిబృందం అందరూ చేశారు. నామీద పెట్టారు. నాన్న ఇల్లు అమ్మాడు. నాకు మళ్లీ పోస్టింగ్. ఈసారి ఐదో వార్డు స్కూల్లోనే. ‘మన దగ్గరుంటే మరీ మంచిది. నువ్వేం భయపడకు బాబాయ్. నేనున్నాగా..’ నాన్నకు వాడిచ్చిన భరోసాతో ఆయన తృప్తిగా చనిపోయాడు. ఇదీ నా బతుకు. నాకేం దారిలేదు.. వాడి పడగనీడ నుంచి తప్పుకోలేను.. రోజురోజుకూ మరీ విషపు కోరలు దగ్గరగా నాతలపై తాండవమాడుతున్నట్లు ఫీలింగ్స్.. నాకు మరోదారి లేదు.. అలాఅలా నిస్పృహలో కూరుకుపోయాను. అలాంటి స్థితిలో నాకో సువర్ణావకాశం వచ్చింది. ఆరోజు ఎక్సై్సజ్ మంత్రి గిరిధర్గారికి టౌన్హాల్లో సన్మానం. ఆయన మరో మంత్రి శివశంకరాన్ని తప్పించి ఆ మినిస్ట్రీ సంపాదించాడు. దోచుకోడానికే మినిస్ట్రీ మారాడని పేపర్లు టీవీలు ఘోషించాయి. మరో పక్క అపోజిషన్ పార్టీ వాళ్లు ఇదే సమయమని ఎటాక్ బాగా పెంచేశారు. రోజూ పేపర్లో చూస్తున్నారుగా ఊర్లో అల్లర్లు.. రెండు పార్టీలు.. నాలుగు గ్రూపులు.. తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చంపుకునే స్థాయికి వెళ్లినట్లు ఊరంతా చెప్పుకుంటున్నారు. అనుకోకుండా హాల్లోకి వెళ్లా.. మీటింగు మొదలవ్వకముందే గొడవ.. అసలు అంతా కొట్టుకోవడానికే వచ్చారా అన్నట్లుంది ఆ వాతావరణం. నాయకులు ఒక్కొక్కరూ స్టేజిమీదకు వస్తున్నారు. చూస్తున్న నా కళ్లు బైర్లుకమ్మాయి. మనపాపి రామదాసుగాడు కూడా స్టేజి ఎక్కాడు. ఇదేంటి.. ఈడు ఆ పార్టీలో ఉన్నాడుగా.. ఈ పార్టీ మీటింగులో.. అంటే మళ్లీ పార్టీ మారుతున్నాడా.. వోరి ద్రోహీ.. ఆ పార్టీ వల్ల కౌన్సిలర్వయ్యావ్గా.. ఈ పార్టీలో దూరి చైర్మన్ అయిపోదామనుకుంటున్నావా.. ద్రోహి.. ఎంత మోసం.. నాలో కోపం ఉద్వేగం పెరిగిపోతున్నాయ్. క్షణ క్షణానికీ కోపంతో కసితో వొళ్ళంతా వణుకుతోంది.. ఎన్నో రోజులనుంచి వాణ్ణి చంపాలనుకున్న నా భావాలు.. ఏమీ చెయ్యలేని నా నిస్సహాయత.. నా చేతకానితనం.. పిచ్చివాడిగా మిగిలిన నా బతుకు.. చిన్ననాటి నుంచి వాడుచేసిన ద్రోహాలు.. కుక్కపిల్ల.. అమాయకంగా నమ్మి ఆత్మహత్య చేసుకున్న గీత.. ఉరి వేసుకున్న గుళ్లో పంతులు కుటుంబం.. సుందర్రావ్.. చిట్టిబాబు..ఇలా అందరూ నా కళ్లముందు.. నాలో క్రోధం.. బాధ.. వాడున్న ఆ హాల్లో వంద పాముల మధ్య నిలబడినట్లు.. వందగద్దలు నన్ను పొడుచుకు తింటున్నట్లు.. కుమిలిపోతున్నా.. ఏం చెయ్యాలి..లోలోన అల్లకల్లోలమైపోతున్నా.. అప్పుడు జరిగింది.. ఎలా జరిగిందో.. ఎక్కడ మొదలైందో.. ఓ కుర్చీ ఎగిరి స్టేజ్ వైపు వెళ్లి మినిస్టర్ ముందుపడింది.. ఎవరో అరిచారు.. మరొకరు బూతులు.. స్లోగన్లు.. ఇంకొకరు పక్కవాడ్ని ఈడ్చి తన్నాడు.. గాల్లో కుర్చీలు కర్రలు.. హాకీ స్టిక్కులు.. క్షణాల్లో యుద్ధభూమిగా మారిపోయింది.. రక్తం.. హాహాకారాలు.. స్టేజ్‌పై గెస్టులు ఎవ్వరూ లేరు.. ఏమయ్యారు.. ఈ పాపిగాడెక్కడ.. అంత గోలలోనూ నా చూపు వాడి కోసమే.. అంతా స్టేజి వెనక్కిపోయి దాక్కున్నారు.. వొంగొని వెనక్కి చూశాను.. ఓ కుర్చీ చాటుగా పెట్టుకుని చావు భయంతో నిక్కి నిక్కి చూస్తున్నాడు రామదాసుగాడు. నాబుర్రలో మెరుపు.. వేగంగా బయటకు పరిగెత్తి ఓ రాయిని.. చేతిలో అమిరే రాయిని తీసుకుని గిరుక్కున తిరిగొచ్చా.. నా గురి తెలుసుగా.. అటూఇటూ చూశా.. ఎవ్వరూ నన్ను చూడటంలేదు..స్టేజ్ వెనక్కువెళ్లా.. వాడు అక్కడే ఓ కుర్చీ వెనగ్గా.. క్షణంలో వెయ్యోవంతు.. నా చేతిలోని రాయి.. వాడి తలకు గురిపెట్టి విసిరా. ఫర్ఫెక్ట్గా తగిలింది. మరుక్షణం.. ఎర్రెర్రగా ఎగసిన రక్తం.. వాడి తలలోంచి.. నా లోలోపల మండుతున్న నిప్పు మీదకి చిమ్మినట్లు.. ఆ చిమ్మిన రక్తం.. నాలోని నిప్పును ఆర్పేసినట్లు.. నేను పారిపోలేదు రాజ్యం! అక్కడే నిలబడి ధైర్యంగా.. ఆనందంగా.. తృప్తిగా చూస్తున్నా.. వాడు.. ఆ పాపి రామదాసుగాడు నన్ను చూశాడు. నన్ను.. నా విజయగర్వాన్ని.. నా ముఖంలో తృప్తిని చూసాడ్రా ఫణి! వాడి ముఖంలో దిగ్భ్రమ.. ‘నువ్వా..బ్రహ్మీ..నువ్వు? నన్ను?’.. అంతే.. కుప్పకూలిపోయాడు.. చాలు.. నా వొళ్ళంతా జలదరించింది.. నన్నెవ్వరూ గుర్తుపట్టలేదు. అంతా గోల గోల.. ఎగురుతున్న కుర్చీలు.. పడిపోతున్న శరీరాలు.. ఎవరు చస్తున్నారో ఎవరు చంపుతున్నారో నాకు అనవసరం.. ఆ యుద్ధభూమిలో నా శత్రువును నేను కొట్టగలిగిన దెబ్బ.. నా కసి తీరేటట్లుకొట్టా.. చాలు.’’ నవ్వుతున్నాడు బ్రహ్మానందం.. లేచి నిలబడి జేబులో చేతులుపెట్టుకుని.. ఆనందంగా.. తృప్తిగా.. పగలబడి నవ్వుతున్నాడు.. రెండు క్షణాలు ఆయనవంక ఆశ్చర్యంగా.. సంభ్రమంగా చూశారు భార్య, కొడుకు. ‘‘ఐదోవార్డు కౌన్సిలర్ రామదాసు టౌన్హాల్లో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా దెబ్బతిని కోమాలో ఉన్నారు’’ అని టీవీలు ఊదరగొట్టిన సంగతి ఇద్దరికీ సుపరిచితమే.. వాళ్లిద్దరికీ పూర్తిగా అర్థమయ్యాక నవ్వొచ్చింది. ఆయనతో కలసి ముగ్గురూ నవ్వారు.. ఆ రాత్రంతా... గుండెలు నిండిన విశ్వాసంతో నవ్వుతూనే ఉన్నారు.,, జీవితమంతా... - మత్తి భానుమూర్తి -
చనిపోయిన యువతి పేరుతో రాంగ్ మెసేజ్
అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, లేత కిరణాలు ఒంటికి తాకితే ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది. నోట్లో వేసుకున్న టూత్ బ్రష్ వేసుకొని.. మరో చేత్తో సెల్‌ఫోన్ పట్టుకుని డాబాపై అటూ ఇటూ తిరుగుతున్నాను. మెసేజ్ వచ్చినట్టు అలర్ట్ టోన్ మోగితే చూసుకున్నాను. ఆశ్చర్యం వేసింది. మరో వైపు ఆనందం. చిన్నపాటి గొడవతో విడిపోయిన నళిని ‘ఎలా వున్నారు?’ అంటూ మెసేజ్ చేసింది. ఇక నా సంతోషం అవధులు దాటింది. ‘బాగున్నాను, నువ్వెలా వున్నావ్?’ అంటూ రిప్లై ఇచ్చాను. తిరిగి సమాధానం రాకపోయినా.. చాలా రోజుల తర్వాత నళిని నన్ను అర్థం చేసుకుందన్న సంబరంలో మునిగిపోయాను. ఈ విషయం వెంటనే స్నేహితుడు రాకేష్‌కి చెప్పాలి. ఎందుకంటే మేమిద్దరం దూరంగా వుంటూ ఒకరినొకరం ఇష్టపడుతుంటే మమ్మల్ని కలిపింది వాడే. ఏదో చిన్న మాటతో నోరు జారిన కారణంగా దూరంగా వుండిపోయింది నళిని. ఆ రోజు నుండి ఇద్దరం కలవడం లేదు. దీపావళి వచ్చినంత వెలుగొచ్చింది నా ముఖంలో. ఇక ఆలస్యం చేయలేదు చకచకా రెడీ ఐపోయి రాకేశ్ దగ్గరకు పరుగులు పెట్టాను. తోటలో చెట్లకు నీళ్ళు పడుతున్నాడు రాకేశ్. వాడి చేతిలోని నీటి పైపు లాగేసి, పక్కకు తీసుకువెళ్లి మెసేజ్ చూపించాను. వాడు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ‘ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారన్నమాట. సంతోషకరమైన వార్త తెచ్చావ్. నాకేమిస్తావ్?’ అని అడిగాడు రాకేశ్. ‘ఏం కావాలన్నా ఇస్తా.. అడుగు’ అన్నాను. ‘పార్టీ చేసుకుందాం.. చాలా రోజులైంది కదా! ఇన్నాళ్లూ బాధలో వున్నాం అది తీరిపోయింది. ఏమంటావ్?’ అన్నాడు రాకేశ్. ‘అంతేకదా..! నళిని మళ్ళీ నాతో మాట్లాడింది అంటే ఇంతకన్నా ఏం కావాలి? నీకు తెలుసుగా ఆమెను ఒక్కరోజు కూడా వదిలి వుండేవాణ్ణి కాదు. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. తను హఠాత్తుగా దూరం అయ్యేసరికి ఇన్నాళ్లూ మనసు మనసులో లేదు. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఫుల్ పార్టీ చేసుకుందాం’ రెట్టింపు ఆనందంతో అన్నాను. ‘ఓకే డన్’ అన్నాడు రాకేశ్. ఆరోజు ఒక మోస్తరుగా వర్షం పడుతోంది. లంచ్ పార్టీయే పెట్టుకుందామని రాకేశ్ అనేసరికి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. వాడిని డైరెక్ట్‌గా వెన్యూ దగ్గరకే రమ్మన్నాను. కాని వాడు ‘కలిసే వెళ్దాంలే.. రెడీగా ఉండు.. పికప్ చేసుకుంటా’ అన్నాడు. గొడుగు పట్టుకుని వసారాలోకి వచ్చి ఆగిపోయాను ‘ఇంత వర్షంలో ఎక్కడికిరా’ అన్న నాన్న మాటతో. ఆ ప్రశ్న నా కాళ్ళకు అడ్డం పడింది. అంతలోపే మళ్లీ మెసేజ్ టోన్... ఆత్రుతగా ఫోన్ తీసి చూసుకున్నాను. ‘ఈవాళ సాయంత్రం టెంపుల్ దగ్గరకు వస్తున్నాను అక్కడ కలుద్దాం బై’ అంటూ నళిని పెట్టిన మెసేజ్. అంతే... నాన్న మాటను పట్టించుకోకుండా చకచకా బయటికి వచ్చానో లేదో రాకేశ్ కారు ఆగింది మా ఇంటి ముందు. ఎక్కి కూర్చున్నాను. అంతకు ముందే వచ్చిన నళిని మెసేజ్ సంగతి చెప్పాను వాడితో. ‘ఓహో.. ఈరోజు డబుల్ ధమాకా అన్నమాట. ఇక్కడ పార్టీ అక్కడ మీటింగ్’ అన్నాడు. ‘నా బాధలో, సంతోషంలో భాగం పంచుకునే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీగా వుందిరా’ అప్రయత్నంగా నా కళ్లు చెమ్మగిల్లాయి. అది బెంగళూరు బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న హోటల్. పార్కింగ్లాట్లో కారు పార్క్ చేసి నేరుగా హోటల్ లోపలికెళ్ళి కూర్చున్నాం. నేను చికెన్, మందు రెండింటిని వద్దనుకొని.. రోటి స్పెషల్ ఆర్డర్ పెట్టాను. ‘ నువ్వు నాతో పాటు తిని తాగకపోతే.. నాకు కిక్కేముంటుంది చెప్పు’ అంటూ అసహనం వ్యక్తపరిచాడు రాకేశ్. ‘వద్దురా.. నళిని టెంపుల్‌కు రమ్మంది. చికెన్ తిని వెళ్లలేను. అసలే ఒక మిస్ అండర్‌స్టాండ్ తర్వాత కలవబోతున్నాను తనను.. తాగి కలవలేనురా...’ అంటూ వాడికి సర్ది చెప్పాను. మా సీటింగ్‌కి ఎదురుగా గోడ గడియారం ఉంది. అప్పుడప్పుడూ దానికేసి చూస్తూ కాలాన్ని లెక్కిస్తున్నాను. రెండు గంటలు దాటిపోయింది.. రాకేశ్ నింపాదిగా వున్నాడు. బిల్లు చెల్లించి బయటకు వచ్చేశాం. నళినిని కలవాల్సిన టైమ్‌కి ఇంకో గంట మాత్రమే ఉండటంతో కారు వేగంగా పోనిస్తున్నాడు రాకేశ్. నళిని చెప్పిన టెంపుల్ రానేవచ్చింది. అక్కడ నన్ను దింపేసి ‘ బెస్ట్ ఆఫ్ లక్ ‘ చెప్పి వెళ్ళిపోయాడు రాకేశ్, టెంపుల్ ఆవరణలో ఉన్న ఒక చిన్న అరుగు మీద కూర్చుని నళిని కోసం ఎదురు చూడసాగాను. నన్ను అయిదింటికల్లా రమ్మన్న నళిని అయిదుంపావు అయినా తాను రాలేదు. పొద్దున మెసేజ్ వచ్చిన నంబర్ కు కాల్ చేశాను స్విచ్ ఆఫ్ వస్తోంది. ‘ఎక్కడ వున్నావు నళినీ?’ అని మెసేజ్ పంపాను. ఉహూ.. రిప్లయ్ లేదు. ఆరు గంటలు దాటి చీకటి ఆవరిస్తోంది. చాలా సార్లు కాల్ చేసాను.. స్విచ్ ఆఫ్ అనే వస్తోంది తన ఫోన్. అరుగు మీద నుంచి లేచి ఇంటి ముఖం పట్టాను నిరాశగా. ఆరోజు బయట వసారాలో కూర్చున్నా.. నళిని ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘వస్తానని ఎందుకు రాలేదు.. నళిని ఎందుకిలా చేసింది?’ ఇద్దరం సఖ్యంగా ఉన్న రోజుల్లో... చెప్పిన సమయం కంటే పది నిమిషాలు ముందే వచ్చేది. నేను ఆలస్యమైతే గొడవ పడేది. మరి ఇప్పుడెందుకు నన్ను రమ్మని చెప్పి తను రాలేదు.. పైగా సెల్ ఫోన్ ఆఫ్ చేసింది?’ అని అనుకుంటూండగా తలపై ఎవరో తడిమినట్టు అనిపిస్తే తల ఎత్తి చూశాను. చేతిలో చిల్లర పట్టుకుని నన్నే గమనిస్తోన్న అమ్మ.. ‘ఈమధ్య నీ తల పూర్తిగా పాడైనట్టుంది పక్కన పిడుగు పడినా కదిలే పరిస్థితిలో లేవు ఏమైందిరా?’ అడిగింది. ‘నాకేం బాగానే వున్నాను’ అన్నాను చాలా క్యాజువల్‌గా. ‘సర్లే.. ఇదిగో ఈ చిల్లర పట్టుకెళ్ళి పాల పాకెట్ పట్టుకురా. తొందరగా వచ్చెయ్ మీ నాన్న ఆఫీసుకెళ్ళాలి’ అంటూ నన్ను తరిమింది. పాలడైరీ దగ్గరకు వెళుతుంటే మెసేజ్ రింగ్ టోన్ వినిపించే సరికి చప్పున ఆగిపోయి జేబులోంచి ఫోన్ తీసి చూసాను. ‘సారీ.. బంగారు మొన్న నేను రాలేకపోయాను. ఇప్పుడు కాలేజీ దగ్గరకు రాగలవా?’ నళిని మెసేజ్. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజ్ దగ్గరకు పరుగు పెట్టాను. అక్కడ నళిని కనిపించలేదు, గ్రౌండ్ మొత్తం వెతికా.. ప్రయోజనం లేదు. అదే నంబర్‌కు మళ్లీ కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్. నళిని ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదు, ఇంటి దగ్గర నుండి ఫోన్. గుండె గుభేలుమంది. పాలు తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళాను, అమ్మ గురాయించి చూసింది. పాలు ఆలస్యం అయినందుకు నాన్న ఆఫీసుకు వెళ్ళిపోయారట. ‘వస్తానంటుంది రాదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది. నళిని నాతో ఎందుకిలా ఆడుకుంటోందో అర్థం కావట్లేదురా’ రాకేశ్‌తో నా బాధను చెప్పుకున్నాను. ఏం చెప్పాలో వాడికీ అర్థం కానట్టుంది. అందుకే వాడు మౌనంగా వుండిపోయాడు. మరోసారి.. షాపింగ్ మాల్‌కు రమ్మని మెసేజ్ చేసింది.ఈసారి ఒక్కణ్ణే వెళ్ళకుండా రాకేష్‌ని కూడా వెంట తీసుకెళ్ళాను. షాపింగ్ మాల్ మొత్తం జల్లెడ పట్టాం నళిని కనిపించలేదు. ఇద్దరి సెల్ఫోన్ల నుంచి కాల్ చేశాం. ఫోన్ పని చేయడం లేదు, మెసేజ్ మాత్రం వస్తోంది. వెంటనే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ‘ఏంటీ మాయ?’ జుట్టు పీక్కున్నంత పనైంది మాకు. తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయాం. ఆ రాత్రి నిద్రపోలేదు.. సెల్ ఫోన్ పక్కనే పెట్టుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ‘నువ్వు చాలా ఫీలయ్యావని నాకు తెలుసు.. నిన్ను కలవాలని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది.. అమ్మకు ఆరోగ్యం నిలకడగా లేదు హాస్పిటల్లో వున్నాం. అర్జెంట్‌గా పదివేలు కావాలి. సర్దగలవా ప్లీజ్.. నా అకౌంట్ నంబర్ పంపిస్తా.. ప్లీజ్..’ అంటూ మెసేజ్ పెట్టింది. ‘ఏ హాస్పిటల్’ అని వెంటనే నేనూ మెసేజ్ పెట్టాను. తిరిగి జవాబు రాలేదు. ’ ఇప్పటికిప్పుడు పదివేలు అంటే ఎలా ?’ అనే ఆలోచనతోనే ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే తెలిసిన వాళ్ల నుంచి పదివేలు అప్పు తీసుకుని రాకేశ్ దగ్గరకు వెళ్లా.. విషయం చెప్పా. ‘అయ్యో పాపం! ఇలాంటప్పుడే ఆదుకోవాలిరా.. అప్పుడే నీది నిజమైన ప్రేమ అనిపించుకుంటుంది.. పదా వెళ్దాం’ అంటూ నన్ను బయలుదేరదీశాడు రాకేశ్. బ్యాంక్‌కి వెళ్ళి నళిని ఖాతాలో డబ్బు జమ చేశాను. అంతే మళ్లీ వారం దాకా ఆమె నుంచి మెజేస్ రాలేదు. తర్వాత ఎప్పుడో ఒకరోజు మెసేజ్ వచ్చింది.. ‘పార్క్‌లో నీకోసం వెయిటింగ్’ అంటూ. పరుగులు పెట్టి వెళితే పార్క్ గేట్‌కు తాళం కనిపించింది. నళిని కనిపించలేదు. విసిగిపోయి ఇంటికి వచ్చేశాను. మేమిద్దరం స్నేహంగా ఉన్న రోజుల్లో నళిని తన ఇంటి చిరునామా కార్డ్ ఇచ్చినట్టు గుర్తు. అప్పుడు వెళ్ళలేక పోయాను. ఇప్పుడు ఆ కార్డ్ ఎక్కడుందో? పాత పుస్తకాలన్నీ తిరగేసాను. దొరికింది. ఆలస్యం చేయకుండా బయలుదేరాను. ఆ ఇంటి ముందు ఒక పెద్దాయన వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెళ్ళి పలకరించాను. ‘ఎవరు కావాలి బాబూ?’ అడిగాడతను, ‘నళినిగారు వున్నారాండి?’ అడిగాను. ఆ మాటకు అతను కుర్చీలోంచి లేచి ఇంట్లోకి నడిచాడు. వెనకే నేను. ‘అదిగో బాబూ.. నా మనుమరాలు నళిని..’ అంటూ గోడ వైపు చూపించాడు. అంతే.. నా కాళ్ల కింద భూమి కంపించినట్టు.. ఆకాశం విరిగి నెత్తిన పడినట్టు స్థాణువైపోయా. పూలదండ వేలాడుతూ నళిని ఫొటో. ‘చాలా రోజులైంది బాబూ..’ కళ్ల నిండా నీళ్లు. గొంతు జీరబోతుండగా చెప్పాడు అతను. ఎవరో హత్య చేశారంట.. ఆనవాళ్ళు కూడా దొరక్కుండా. నాకు వస్తున్న మెసేజ్‌ల గురించి అతనితో చెప్పాను. బ్యాంకులో వేసిన డబ్బు సంగతి సహా. విస్తుపోయాడు అతను. మొత్తానికి ఏదో జరుగుతోంది. నళిని కుటుంబసభ్యులతో కలిసి ఎంక్వయిరీ దిశగా అడుగులు వేశాను. ఆమె అకౌంట్ డీటైల్స్ తీసుకున్నాం. గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన లావాదేవీలు నేను వేసిన పదివేలుతో మొదలైనట్టు తెలిసింది. అదే బ్యాంక్ ఏటీఎమ్‌లో డబ్బు అయినట్టూ తేలింది. విత్ డ్రా ఫాంలో వున్న సమయాన్ని బట్టి సీసీ కెమెరా ఫుటేజ్‌ను గమనిస్తే.. అరవై ఏళ్ళు నిండిన పెద్దాయన ఆ డబ్బు డ్రా చేసినట్టు కనిపిస్తోంది. నిద్రాహారాలు ఎగిరిపోయాయి నాకు. ఎవరు అతను? ఈ మిస్టరీని రాకేశ్‌తో షేర్ చేసుకుందామనుకుంటే సమయానికి వాడు అందుబాటులో లేడు. కొంత సస్పెన్స్ అనుభవించాక మొత్తానికి డబ్బు డ్రా చేసిన పెద్దాయన దొరికాడు. ‘అతనెవరో తెలీదు బాబు.. డబ్బు డ్రా చేసుకురా.. నీకు ఐదు వందలు ఇస్తానని, కార్డు, పిన్ నంబర్ ఇచ్చాడు. ఏటీఎంలో డబ్బు తీసి అతని చేతిలో పెట్టాను’ చెప్పాడు ఆ పెద్దాయన. ‘అతను ఎక్కడ వుంటాడో తెలుసా?’అడిగాను. ‘రండి .. చూపిస్తా’ అంటూ ఊరికి దూరంగా వున్న ఓ బంగ్లా వైపు తీసుకెళ్ళాడు అతను. అక్కడ కొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. ‘అదిగో ఆ గళ్ళ చొక్కా వేసుకున్నాడే.. అతనే’ అని చూపించాడు ఆ పెద్దాయన. కళ్లు తిరిగినంత పనైంది నాకు. ఎవరో కాదు వాడు రాకేశే... నమ్మలేక పోయా. పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో గుట్టు మొత్తం బయట పడింది. నళిని నన్ను ప్రేమించడాన్ని వాడు జీర్ణించుకోలేకపోయాడు. తన కోరిక తీర్చమని నళిని వెంట పడ్డాడు. ఆమె వినకపోవడంతో ఓ పథకం ప్రకారం.. సాక్ష్యం దొరకనివ్వకుండా నళినిని చంపేశాడు. కూతురే పోయాక .. పోలీసులు, కేసులు ఎందుకని మిన్నకున్నారు నళిని తల్లిదండ్రులు. వాళ్ల నిస్సహాయతను రాకేశ్ ఆసరాగా తీసుకొని నళిని సెల్‌ఫోన్ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకున్నాడు ఇన్నాళ్లూ. నా శ్రేయోభిలాషిగా నటిస్తూ నాకే ద్రోహం తలపెట్టాడు రాకేశ్. తట్టుకోలేకపోయా. వాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.. కాని వాడు నళిని తల్లిదండ్రులకు, నాకు మిగిల్చిన శోకం మాత్రం తీరేది కాదు. ‘ స్నేహం చేస్తే గుడ్డిగా నమ్మకూడద’ని మా అమ్మమ్మ అంటుండేది.. ఆ మాట నా కళ్లు తెరిపించింది. - నరెద్దుల రాజారెడ్డి -
వరుడు కావలెను
వెంటనే మీనాక్షమ్మకు పొరుగింటాయన ఈ మాదిరిగా ఉంటాడని ఒక నిశ్చితమైన అభిప్రాయమేర్పడ్డది. ఎక్కువ ఆలస్యము చేయకుండా చిన్న కొడుకును పంపి అతడి సైన్ బోర్డును చూచి రమ్మంది. మీనాక్షమ్మకు తమ పొరుగింటిలోకి ఎవరో కాపురానికి వచ్చారని అప్పుడే తెలిసింది. ఒక అరగంటలో పంపిన మనిషి తిరిగి వచ్చాడు– ‘‘ఒక్క అయ్యగారే ఉంటున్నారు. 27 లేక 28 సంవత్సరాల వయసు ఉంటుంది. మన అబ్బాయిగారి కంటె ఒక ఛాయ తెలుపు, కాస్త పొడుగు, తటాలున చూస్తే అబ్బాయిగారిలా ఉంటాడు. వెంబడి వంటమనిషి కాబోలు ఉన్నాడు’’ అన్న సమాచారముతో. ఈ వివరాలతో మీనాక్షమ్మ ఒక చక్కని రూపకల్పన చేసుకున్నది. మనసులో ఆ ఊహలు వాయువేగ మనోవేగములతో పరుగెత్తటము మొదలుపెట్టాయి. ‘అబ్బాయి కంటె ఒక ఛాయ ఉంటే అందగాడి క్రింద లెక్కే. తటాలున చూస్తే అబ్బాయిలా ఉన్నాడంటే ఏమర్థము? అబ్బాయి అమెరికా వెళ్లి మూడేళ్లు ఉండి వచ్చిన నాగరికుడు.’ వెంటనే ఆమెకు పొరుగింటాయన ఈ మాదిరిగా ఉంటాడని ఒక నిశ్చితమైన అభిప్రాయ మేర్పడ్డది. ఎక్కువ ఆలస్యము చేయకుండా చిన్న కొడుకును పంపి అతడి సైన్ బోర్డును చూచిరమ్మంది. రెండు నిమిషాలు కాకముందే దాని మీద ఉన్న విషయం ‘రఘువీర్– ఆబ్కారీ ఇన్స్పెక్టరు’ అన్న వార్త తెలిసింది. ఆ రోజు ఉదయం పదకొండు గంటల దగ్గరనుండి సాయంకాలము అయిదు గంటల వరకూ మీనాక్షమ్మ తహతహలాడి పోయిందంటే అందరూ నమ్మరు. ఆ రోజు జీడిపలుకులు వేసిన ఉప్మా రామశర్మ యింటికి రాగానే మీనాక్షమ్మ స్వయముగా అందించి, చిక్కటి కాఫీ పెద్ద గ్లాసుతో ఇచ్చింది. సిగరెట్టును నోటికందించుతూ ‘‘అట్లా చల్లగాలికి వెళ్లుదాము రారు?’’ అన్నది. ఎన్నడూ ఎరుగని ఈ గౌరవ మర్యాదలకు శర్మ విస్తుపోయాడు. మనసులో తట్టిన ఊహను అంత తొందరగా బైట పెట్టని స్వభావమే ఆమెతో కాపురము చేస్తున్న ఈ పాతికేళ్ల నుండీ రక్షిస్తున్నది అతడిని. వెంటనే తల ఊపి చెప్పులు వేసుకుని బయలుదేరాడు. ఆమె తృప్తికరముగా ముఖము పెట్టి అతడిని అనుసరించింది. వాళ్లిద్దరూ ఎటు వెళ్లాలనుకున్నారోగాని– మరో అయిదు నిమిషాలకు పొరుగింటి ముందర నిలబడి ఉన్నారు. గోడకు తగిలించిన సైన్ బోర్డును చూపిస్తూ మిగిలిన వివరాలన్నీ ఒక్క గుక్కలో చెప్పింది. మీట నొక్కితే గంట మ్రోగినట్లుగా– అతడు తలవంచుకొని నడుస్తూ ‘‘అవును అవును’’ అన్నాడు. మరునాడు అతడు కచేరి నుంచి వచ్చేసరికి మసాలా దోశ చేతికి వచ్చింది. అతడు ఖాళీ చేసిన ప్లేటును మీనాక్షమ్మ స్వయముగా అందుకొన్నది. అతడు కాఫీ త్రాగగానే– మాటల సందర్భంలో చెప్పినట్టుగా మీనాక్షమ్మ చెప్పింది. ‘‘ఆ ఇన్స్పెక్టర్ గారు దత్తపుత్రుడట. తోటలు దొడ్లు ఉన్నాయట. నగరములో రెండు పెద్ద ఇళ్లు ఉన్నాయట. చక్కగా చిన్నతనములోనే మంచి ఉద్యోగము కుదిరింది కదండీ!’’ ‘‘నిజమే నిజమే. మంచి ఉద్యోగమే. చిన్నతనము కూడాను’’ వెనుకటి ధోరణిలోనే అన్నాడు శర్మ. నాలుగు రోజులైన తర్వాత మీనాక్షమ్మ నౌకరును పొరుగింటికి పూలకొరకు పంపి ‘‘అమ్మాయిగార్లకు ఆ రంగు పూలంటే ఎంతో యిష్టము. పెరట్లో వున్నవి కోసకోవచ్చునా?’’ అని అడగమన్నది. వెళ్లినవాడు వెంటనే తిరిగి వచ్చాడు. ‘‘దత్తు గారి అమ్మాయిలు ఉదయం ఏడుగంటలకే వచ్చి కోసుకుపోయా’’రని. మీనాక్షమ్మ తెల్లబోయింది. ‘‘పొరుగింటి ఆయనను గురించి దత్తుగారింట్లో అంత తొందరగా ఎట్లా తెలిసింది?’’ సాయంకాలము రామశర్మ యింటికి రాగానే ఒక తీర్మానము ఆయన ముందర పెట్టింది. మరునాడు సాయంత్రము అయిదింటి వరకూ మీనాక్షమ్మ కూతుళ్లు ముగ్గురు నైలాన్ చీరెలు కట్టుకుని ముస్తాబై సిద్ధముగా ఉన్నారు. ఉపాహార విందుకు సర్వము సిద్ధముగా ఉన్నది. కూతుళ్లతో మీనాక్షమ్మ గడప దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నది అతిథి కొరకు. రామశర్మ ఆ నాలుగింటికే ఇంటికి రావలసింది. ఆయన రాకపోవటం కొంత కొరతగానే ఉన్నది. కాని ఆ కారణం చేత ఏ లోటు జరుగకూడదన్న పట్టుదల ఉండటం వల్ల ఉత్సాహాన్ని ఇనుమడింప చేసుకున్నది. సరిగ్గా సమయానికి వచ్చిన అతిథిని చూడగానే ముఖము ప్రఫుల్లమయింది. ఎదురుగావెళ్లి తీసుకొనివచ్చి కూర్చోబెట్టింది. తన కూతుళ్లను ముగ్గురినీ పిలిచి ఒక్కొక్కరినీ ఆయనకు పరిచయం చేసింది. ‘‘వారు ఎంతో సరదాపడి మిమ్మల్ని అల్పాహారవిందుకు పిలిచారు గాని పాపము రావటానికి ఏదో అననుకూలము వచ్చి ఉంటుంది. మీరు అన్యధా భావించకండి’’ అంటూ క్షమాపణ కోరింది. అతడు తగినట్లుగా సమాధానము ఇచ్చి, ముభావముగా స్వల్పముగా ఫలహారము తీసుకున్నాడు. ‘‘వీటి రుచి మీకు సరిపడలేదేమో!’’అన్నది కాస్త నొచ్చుకుంటూ. ‘‘లేదండీ. రాత్రి దత్తుగారింట్లో విందు భోజనము. ఇంకా నేను దాని నుంచి తేరుకోలేదు’’ అన్నాడు. మీనాక్షమ్మకు దేహములో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లయింది. ‘‘తాను అల్పాహార విందుకు ఆహ్వానించక ముందే వాళ్లు తనకంటే ఒక అడుగు ముందు వేస్తున్నారు మొదటినుంచీ’’ అనుకున్నది. అతిథి సెలవు తీసుకుంటూ ‘‘విద్యావంతులూ సంస్కారులూ అయిన మీ కూతుళ్ల పరిచయ భాగ్యము లభించినందులకు సంతోషంగా ఉన్నది. ఈ ఊరు నాకు నచ్చింది. అందులో ఇల్లు చక్కగా పొందికగా బాగా కుదిరింది. మంచి పొరుగు– ఒక గొప్ప విశేషము’’ అన్నాడు. మీనాక్షమ్మ మనసు పండు వెన్నెలయింది. అతడికి ప్రత్యేకముగా ఆ యిల్లు నచ్చటములో– నచ్చినదని తనకు చెప్పటంలోనూ ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. దత్తుగారి ఇల్లు కనబడుతూనే వున్నా అవతల వీధిలో ఉన్నది. అందులోనూ తన కూతుళ్లందరూ విద్యావంతులన్న ప్రశంస వచ్చింది. విద్య దేమిటి? ఎవరికయినా వస్తుంది. కాని సంస్కారము వంట పట్టాలంటే మాటలా? ఆ మాటే కదూ అతడు వెళ్లుతూ వెళ్లుతూ తన కూతుళ్ల వంక చూస్తూ అన్నది. ఒకరోజు సాయంత్రం మీనాక్షమ్మ కూతుళ్లను తీసుకొని క్లబ్బుకు వెళ్లింది. అక్కడ దత్తుగారి అమ్మాయిలే టేబిల్ టెన్నిస్ ఆడుతున్నారు. మీనాక్షమ్మ కూతుళ్లతో కాసేపు ఆడి, వాళ్లు బయలుదేరారు. ‘‘అంత తొందర పడతారేమిటి? ఉండండి మేము వస్తాము’’ అన్నది మీనాక్షమ్మ పెద్దకూతురు. ‘‘ఇక్కడికి కొత్తగా వచ్చారే రఘువీర్ ఇన్స్పెక్టర్ గారు– ఆయన ఈ సాయంత్రం మా యింటికి వస్తానన్నారు. సంగీతపు పోటీ పెట్టారు మా యింట్లో’’ అన్నది. మీనాక్షమ్మ పెద్దకూతురికి ఆవేశమెక్కువై ‘‘అందులో మన కర్ణాటక సంగీతమంటే బొత్తిగా లేదు. ఇంకా భరతనాట్యంలో బాగా అభిరుచి ఉన్నది’’ మొదట ఏమీ అనకూడదనుకున్నది గాని అణచుకోలేక అనేసింది. రోషములో అసూయ మేళవించగానే దత్తుగారి అమ్మాయి ముఖం కందగడ్డవలె అయింది. ‘‘నీకేం తెలుసు? ఆయన మా యింటికి వచ్చినప్పుడు భరతనాట్యాన్ని గురించి హేళన చేస్తూ అసహ్యముగా మాట్లాడాడు’’ అన్నది. ‘‘అసంభవం. మీకాయన సంగతి పూర్తిగా తెలియదు’’ అని మీనాక్షమ్మ కూతురు గద్దించింది. దత్తుగారమ్మాయి ‘‘మాకు ఆయన సంగతి తెలియదట గానీ– మీకేనా తెలిసింది’’ అని హేళన చేసింది. అప్పటివరకూ ఊరుకున్న మీనాక్షమ్మ ‘‘అమ్మాయి, ఏ మాట తొందరపడి అనకూడదు. మా అమ్మాయి– అతడు పరస్పరము అభిమానముతో మెలుగుతున్నారు. మేము వాళ్లకు నిశ్చితార్థము చేద్దామనుకుంటున్నాము. మరి ఆయన సంగతి దానికి తెలియకుండానే మాట్లాడిందంటావా?’’ అన్నది మందలింపుగా. ఆ అమ్మాయి తెల్లబోయి ‘‘ఈ సంగతి ఆయనకు తెలుసునా’’ అన్నది. ‘‘మేము అనుకున్నాం. ఒక మంచి రోజు చూసి ఆయనతో చెప్పాలనుకుంటున్నాను’’ అన్నది. దత్తుగారమ్మాయిలు చేతిలో ఉన్న బంతులు అక్కడ పడేసి ఇంటి తోవ పట్టారు. మీనాక్షమ్మ కూతుళ్లను తీసుకొని ఇంటికి వెళ్లుతూ ‘‘అయినా దత్తుగారి అమ్మాయిలకు బొత్తిగా మర్యాద తెలియదు. తమకే అన్నీ తెలుసునని విరగబడి పోతారు’’ అన్నది. శ్రావణమాసపు వర్షాలు నాలుగు రోజులపాటు ఎవరినీ ఒకరి యింటినుంచి మరొకరి యింటికి పోనివ్వలేదు. కాస్త తెరిపిగా ఉన్ననాటి సాయంత్రం ఇన్స్పెక్టరు గారి నౌకరు అందరి యిళ్లకూ ఒక్కొక్క బొమ్మ– చారెడు సున్నిపిండి చక్కిలాలు పంచాడు. ఏమిటంటే ‘‘అమ్మగారు అబ్బాయిగారిని ఎత్తుకొచ్చారు గదండీ’’ అన్నాడు. ఇల్లిందల సరస్వతీదేవి (ఇల్లిందల సరస్వతీదేవి కథ ‘శలభాలు’ ఇది. సౌజన్యం: ‘ఇల్లిందల సరస్వతీదేవి ఉత్తమ కథలు’(ఎన్బీటీ). సరస్వతీదేవి (15 జూన్ 1918– 31 జూలై 1998) పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. వివాహానంతరం ఖమ్మం జిల్లాలోని తెలగవరం వచ్చి, తెలంగాణ కోడలయ్యారు. భర్త ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత కూడా చదువు కొనసాగించారు. ఆలిండియా రేడియోకు ప్రసంగాలు, కథానికలతో రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. జర్నలిజం కోర్సు చేశారు. 1958–66 వరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. స్వర్ణ కమలాలు, తులసి దళాలు, రాజహంసలు ఆమె కథాసంపుటాలు. స్వర్ణకమలాలకు 1982లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. నీ బాంచను కాల్మొక్త, పెళ్లి కూతుళ్లు, అనుపమ ఆమె నవలలు. కళ్యాణవల్లి, వ్యాస తరంగిణి, జీవన సామరస్యం, నారీ జగత్తు, వెలుగు బాటలు ఆమె వ్యాస సంపుటాలు. తేజోమూర్తులు, జాతిరత్నాలు ఆమె ఇతర రచనలు.) -
అనగనగా ఒక ముద్దు కథ
ఈ బుద్ధి పుట్టివుంటే ఏ బాధ లేకపోను. పుట్టకపోబట్టే నేను కథ చెప్పడమూ, నీకు వినడమూ తటస్థించింది. ‘‘అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు..’’ ‘‘నాకు తెలుసులెండి ఆ కథ, మీరు చెప్పనక్కరలేదు.’’ రాత్రి భోజనము చేసి, ఆఫీసు కాగితాలు చూచుకొంటూ కూర్చున్నాను. నా భార్య తమలపాకులు చుట్టిస్తూ కథ చెప్పమన్నది. జరూరు కాగితాలు చూచుకొంటూ ఉండడము మూలాన మంచి కథ తోచకపోతే అమ్మమ్మ కథ ఒకటి మొదలు పెట్టినాను. మా అమ్మమ్మ బతికివున్న కాలములో ఎన్నో కథలు చెప్పింది. చాలా మరిచిపోయినాను. ఇప్పుడంతా కలెక్టరాఫీసు తప్ప మరే కథా లేదు. అయితే నా భార్య ఎప్పుడేది కోరితే అప్పుడది చెల్లించడము నా మతము. నా భార్యకు చిన్నతనము; ఆ కారణము చేత వేళాపాళా లేకుండా అది చెప్పమనీ, ఇది చెప్పమనీ యక్ష ప్రశ్నలు వేస్తుంటుంది. ఒకనాడు నా దగ్గికికి వచ్చి, ‘‘రైలుబండి పరిగెత్తుతుంది గదా, దానికి గుర్రాలు కడతారా, ఎద్దులు కడతారా లాగడానికి?’’ ‘‘గుర్రాలనూ కట్టరు, ఏనుగులనూ కట్టరు. ఆవిరి శక్తి వల్ల నడుస్తుంది.’’ ‘‘మీరు చెప్పక్కర లేదు. దానికి ముందర సింహాలనూ పెద్దపులులనూ కట్టుతారు.’’ ‘‘అయితే అవి లాగుతున్నట్టు కనపడవేమి?’’ ‘‘ఇంజనులో వుంటే ఎలా అవుపడతవి?’’ వట్టి వెర్రిపిల్ల! నేను చెప్పబోయే కథ గ్రహించి మీరు చెప్పక్కరలేదన్నది. అయినా కాదని బొంకి తప్పించుకొనవలెనని, ముందున్న కాగితములు దూరముగా పెట్టి, ‘‘కథ నీకు తెలుసునన్నావు గదా, ఏమిటో చెప్పు?’’ ‘‘చెప్పనా? అనగా అనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు...’’ ‘‘ఆగు, ఆగు. అదికాదు నేను చెప్పబోయేది.’’ ‘‘అదే. కావలిస్తే పందెం వెయ్యండి.’’ రూపాయల పందెము ఒకమాటూ, నగ చేయించే పందెము మరోమాటూ అయినవి. ఈమాటు కొత్తరకము పందెము వేయవలెననుకొని, ‘‘నేను గెలిస్తే ఏ మడిగితే అది నీవు నా కియ్యవలె. మరి తిరగకూడదు!’’ ‘‘సరే, చెప్పండి కథ.’’ తప్పనిసరి గదా అని అల్లడము ప్రారంభించాను. నేను పడ్డపాట్లు ఆ పరమాత్ముడికే ఎరుక! ∙∙ ‘‘అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు భార్యలు. చిన్నభార్య అంటే ఆయనకు ఇష్టము. ఎప్పుడూ చిన్న భార్య అంతఃపురములోనే వుండేవాడు. అన్నట్టు, ఏడుగురు భార్యలకూ ఏడు మేడలు కట్టించినాడు. చిన్న భార్యకు ఒంటిస్తంభము మేడ. మేడ చుట్టూ తోట, తోటలో పక్షులూ లేళ్లూ. పెద్ద సరస్సు తవ్వించినాడు. దానికి నాలుగు వైపులా రాతిమెట్లు. నీటినిండా ఎర్ర తామరలు, తెల్ల తామరలు, పచ్చ తామరలు.’’ ‘‘అదేమిటి? పచ్చతామరలుంటవా?’’ ‘‘కాశ్మీర దేశము నుంచి తెప్పించి వేశారట. అవి బంగారములాగు వుంటవి.’’ ‘‘అవన్నీ ఎందుకు? కథ చెప్పుదురు’’ ‘‘ఇది కథ కాదూ! చిన్న రాణి చెలికత్తెలతో జలక్రీడలూ, దండలు గుచ్చడమూ, ఈ విధముగా హాయిగా కాలము గడుపుతున్నది. ఒకనాడు ఒక బ్రాహ్మడు మేడలోకి వచ్చినాడు. ఆయన పెద్ద జ్యోతిష్కుడట. తన మీద రాజుగారికి ఎప్పుడు దయ కలుగుతుందో చెప్పమని చిన్నరాణీ దాసీ ద్వారా బ్రాహ్మడికి కబురు పంపింది.’’ ‘‘అదేమిటి? రాజుగారికి చిన్న భార్యమీద మమకారమని చెప్పినారు.’’ ‘‘అవును, అన్నట్టు మరిచిపోయినాను.’’ ‘‘కథ చెప్పమంటే ఏమిటో కల్పించి చెపుతున్నారు. ఇది నిజం కథ కాదు.’’ ‘‘నిద్రమత్తున ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పినాను. చిన్నభార్య మేడ గోడల మీద చెక్కినారుట రకరకాల బొమ్మలు. మాణిక్యాలతో! మిగిలిన ఆరుగురికీ కోపం వచ్చింది. పట్టపు రాణికి అసూయ కూడా. ఓరవలేనితనం అంటువ్యాధి. చెవిలో నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ పురుగు చెలికత్తెల మాటల ద్వారా మనస్సులో ప్రవేశించి తొలవడం ప్రారంభిస్తుంది.’’ ‘‘ఏమిటి, కథ మానివేసి జబ్బుల సంగతి చెపుతారు!’’ ‘‘పట్టపురాణికి క్రోధం పుట్టింది. కసి ఎలాగు తీర్చుకొనడము?’’ తరువాత తోచింది కాదు. కొంచెము గడుసుతనం చేసి, ‘‘కసి ఎలా తీర్చుకుంటుందో నీవు చెప్పు?’’ ‘‘చంపించవలెనని ప్రయత్నం చేసింది.’’ ‘‘కాదు, మళ్లీ చెప్పు.’’ ‘‘మీరు చెపుదురూ!’’ ‘‘కసి తీర్చుకోవడం తన వొక్కర్తె వల్ల కాదనుకుంది. కుట్ర చెయ్యడానికి ఇద్దరు మనుషులుండవలె. ఒకడు చెప్పినదానికి రెండోవాడు తల వూపితేనే గాని మొదటివాడికి వుషారీ పుట్టదు. ఒద్దరూ ఒక మోస్తరు మనుషులే కావలె. దొంగకు దొంగవాడే స్నేహితుడు. దుర్మార్గుడికి మంచివాడితో స్నేహము పొసగదు, పైగా విషమిస్తుంది.’’ ‘‘ఏమిటీ వేదాంతం, మీరు కథ నడపడం లేదు.’’ ‘‘వూరికే అన్నారు, ఆడవాళ్లకు చపలచిత్తమని! రవ్వంత సేపు ఓపిక పట్టలేవు కదా!’’ ‘‘ఔను, ఆడవాళ్లకి చపలచిత్తమే– మొగవాళ్ల మోస్తరే. మీరు వెళ్లే దారిని వెళ్లనియ్యకపోతే తిరగబడతారు. నాకు నిద్ర వస్తుంది. వెళ్లి పడుకుంటాను.’’ ‘‘పందెం వేశానన్న మాట మరిచిపోయినావు కాబోలు’’ ‘‘నిజం కథ అయితే పందెం.’’ ‘‘నిజమో, కల్పనో నీకెలా తెలిసింది? పెద్దరాణీ, దాసీది కుట్ర పన్నారు. రాజుగారు తీర్పులు చెబుతూ వుండే సమయానికి సభలోకి వెళ్లదలుచుకున్నారు.’’ ‘‘వెళ్లితే నలుగురూ ఏమయినా అనుకుంటారని వుండదూ?’’ ‘‘పట్టు వచ్చిందంటే ఆడవాళ్లు ఎంతపనైనా చేస్తారు. అయినా నలుగురికీ తెలిసేలాగు వెళ్లుతారా ఏమిటి? మారువేషం వేసుకొని...’’ ‘‘రాజు ఆనవాలు పట్టలేడు కామోసు.’’ ‘‘కాపుదానిలాగు వేషం వేసుకుంటే ఎలా గుర్తుపడతాడు?’’ ‘‘ఎప్పుడూ ఇలా సాధిస్తూవుంటారు. కథ కానియ్యండి’’ ‘‘వాళ్లిద్దరూ చిన్నరాణికి జాబు కూడా వ్రాద్దామనుకున్నారు. ఆ, దేవుడు వెంకటేశ్వర్లు పేరు పెట్టి.’’ ‘‘ఉత్తరం ఏమని?’’ ‘‘చెప్పుతున్నాను కాదూ? పట్టపురాణీ దాసి ఒకనాడు చిన్నరాణీ దాసీ యింటికి వెళ్లింది. పెద్దరాణీగారు నీ దగ్గరికి పంపించినారు, నీకు కాసులపేరు బహుమతి ఇమ్మన్నారు అన్నది.’’ ‘‘ఏదీ అక్కా! ఎంత బాగుంది!’’ ‘‘ఇదే, నీవు పుచ్చుకోవలె. ఇదిగో చూడు, ఈ ఉత్తరం చిన్నరాణీ గారి పరుపు మీద ఉంచాలి.’’ ‘‘అదెంతసేపు?’’ ‘‘తర్వాత పెద్దరాణీ, దాసీ కలిసి, అదివరకనుకొన్నట్టు సభలోకి వెళ్లినారు. రాజుగారితో మొరబెట్టుకున్నారు.’’ ‘‘ఇద్దరూ వకమాటే మొరబెట్టుకున్నారా?’’ ‘‘లేదు, పెద్దరాణీ మొరబెట్టుకుంది. దాసీ సాక్ష్యం పలికింది.’’ ‘‘ఏమని మొర?’’ ‘‘భర్త తన్ను ఒల్లడం లేదనిన్నీ, ఎవర్తెనో వలిచినాడనీ. ఎందుకు వల్లడం లేదని రాజుగారు అడిగినారు. తన తప్పు ఏమీ లేదనీ, ఇంకో చిన్న పెళ్లాము దొరకడమే కారణమనీ చెప్పింది. అప్పుడు రాజుగారు అన్నారు: ఇద్దరు భార్యలను పెండ్లాడటము బట్టీ ఇద్దరినీ వకవిధంగానే చూడవలసి వుంటుందనీ, పెద్దదాన్ని ఏలకపోవడం తప్పనీ, వాడిని దండిస్తాననీ. ‘బంగారానికే తుప్పు పట్టితే ఇనుము గతి ఏమి కావలసింది’ అని వాళ్లు వెళ్లిపోయినారు. రాజుకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది.’’ ‘‘నే చెప్పలేదూ, ఆనవాలు పడతాడని.’’ ‘‘చెప్పావు. అయితే ఎక్కడ చెప్పవలసింది అక్కడే చెప్పవలె. కాపువాడిని తాను దండిస్తా నన్నట్లే తన్ను దైవం దండిస్తాడేమో అనుకొన్నాడు రాజు.’’ ‘‘అదివరకు పుట్టింది కాదు కాబోలు ఈ బుద్ధి?’’ ‘‘పుట్టివుంటే ఏ బాధ లేకపోను. పుట్టకపోబట్టే నేను కథ చెప్పడమూ, నీకు వినడమూ తటస్థించింది. తరువాత చిన్నరాణీ పక్కమీద పడివున్న ఉత్తరం చదివింది. నా భక్తురాలైన చిన్నరాణీని తిరుపతి వెంకటేశ్వర్లు దీవించి వ్రాసేది యేమనగా. రాజు నీ మూలాన పెద్దరాణీని నిర్లక్ష్యము చేస్తూవున్నాడు. ఆవిడ ఉసురుకొట్టి నీవు చెడిపోతావు... ఉత్తరము చదివేటప్పటికి చిన్నరాణి పై ప్రాణాలు పైనే పోయినవి. వింటున్నావూ? కునికిపాట్లు పడుతున్నావు.’’ ‘‘కునికిపాట్లూ లేవు గినికిపాట్లూ లేవు. మా బాగాపన్నారు కుట్ర.’’ ‘‘ఆడవాళ్లు గట్టివాళ్లు కారూ మరి?’’ ‘‘కానిస్తురూ కథ. ఎప్పుడూ ఆడవాళ్లను దెప్పడమే మీ పని.’’ ‘‘అంతే. ఆ రోజు మొదలుకొని రాజు తన భార్యలందరినీ వక్క మోస్తరుగా’’ ‘‘అమ్మయ్యా, నిద్దర వస్తున్నది, వెళ్లి పడుకోవలె.’’ ‘‘పందెం గెలుచుకొన్నాను. నేనడిగింది యిచ్చి మరీ కదులు.’’ ‘‘ఎలా గెల్చారేమిటి?’’ ‘‘నీ వనుకొన్న కథనే చెప్పింది?’’ ‘‘కాకపోతే మాత్రం, నిజం కథా యేమిటి?’’ ‘‘నిజం కథ కాదూ, పుస్తకాల్లో కథలలాగు లేదూ?’’ ‘‘దీన్ని మీరు కల్పించారు. నే నోడినట్టు ఒప్పుకోను.’’ ‘‘ఒప్పుకోకపోతే సరా?’’ ‘‘బాగానే వుంది. నే నియ్యనంటూ వుంటే మీరెలా పుచ్చుకుంటారు?’’ ‘‘అదో పెద్ద బ్రహ్మాండమా! ఇదుగో నీవు ఇవ్వనంటున్నా నేను పుచ్చుకొంటున్న దేమిటో చూశావా...’’ (చింతా దీక్షితులు) చింతా దీక్షితులు కథ ‘ముద్దు’కు ఇది సంక్షిప్త రూపం. రచనా కాలం: 1920. సౌజన్యం: నవచేతన పబ్లిషింగ్ హౌజ్. చింతా దీక్షితులు (1891– 28 ఆగస్ట్ 1960) తూర్పు గోదావరి జిల్లా దంగేరులో జన్మించారు. తొలుత తన బంధువైన చింతా శంకరదీక్షితులతో కలిసి జంటకవిత్వం చెప్పారు. బాలల కోసం విశేషంగా గేయాలు రాసి, ‘బాలవాఙ్మయ బ్రహ్మ’ అనిపించుకున్నారు. కథలు, నాటకాలు రాశారు. అపరాధ పరిశోధక రచనలు చేశారు. ఏకాదశి కథలు, హాస్య కథలు, మిసెస్ వటీరావు కథలు, దాసరిపాట ఆయన కథాసంపుటాలు. చలంతో ఆయనకు బాగా స్నేహం. చింతా దీక్షితులు గారికి చలం రాసిన లేఖలు పుస్తక రూపంలో వచ్చాయి. -
సారీలో బడ్డాడు గార్డు
తెనుగువాళ్లకు ఇతర భాషలు అబ్బవు కాని, ఇతరులకు తెనుగు భాష సుళువుగా యబ్బేటట్టు కనబడుతుంది. అయినా తెనుగువాళ్లు పక్కా తెనుగు మాట్లాడ్డం గాని వ్రాయడం గాని యరుదు. ఏదో ఇతర భాషల సాంకర్యం వుండక తప్పదు. ∙∙ వానికి ‘‘ట్రేడ్‌లో బలే నేక్ వుంది’’ యన్నాడు బస్సులో కూర్చుని వొక కోమటి. చూడండి: ఇంగ్లీషు మాటలు రెండు ఆ కోమటి గొంతుగ్గుండా గాలిలోకి దొర్లింపబడ్డాయి. ఇలాగ్గానే హిందీ పదాలు. ప్రతీ నిత్యం కిస్మత్, ఔర, దున్యా ఇత్యాదులు గుండెలు చీల్చుకు వచ్చేస్తుంటాయి ఆంధ్రుని నోట. అరవం యరచేతిలోని ఉసిరిక ఆంధ్రులకు. ఎన్న, ఇల్లె, కత్తిరికాయ, ములహప్పొడి ఇత్యాదులు కొల్లలు ఉభయ గోదావరీ మండలాల్లోనూ. మఱి హిందూస్థానీ మాట్లాడ్డానికి తెనుగువాండ్లే మిన్నగాండ్లు. కబడ్డార్, ఖడేరావ్, ఇవన్నీ ఎప్పటికప్పుడు రోడ్డు దుమ్ములా ఎగిరి ఎదరవాణ్ణి దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి. కాని వొక్క భాషలోనూ యచ్చంగా స్వచ్ఛంగా జటిలంగా శాస్త్రకట్టుగా సంపూర్ణ ప్రజ్ఞ యలవరచుకొన్నది కానరాదు. అలవరుచుకోడు ఆంధ్రుడు. తన భాషే తనకు రానివాడు మరో భాషలో మాత్రం ప్రవీణుడు కాగలడా? కాలేడు సరిగదా ఎవర్నైనా కుదురైన జాను తెనుగు మాట్లాడేవాణ్ణి చూస్తే ఈసడింపు కూడాను, ఈ రోజుల్లో కూడా ఇంకా వెధవ తెనుగేనా అని. అంచేత ఈ కథయొక్క మకుటంలోనే రెండు ఇంగ్లీషు మాటలు వాడేశాను. ‘‘సారీ’’ అని, ‘‘గార్డు’’ అని. ‘‘గార్డు’’ యన్నది పూర్తిగా తెనుగుపదం అయిపోయింది యని యనుకోవచ్చు. లోగడ వదినె పాటల్లో ‘‘గార్డు దొర’’ శృంగార నాయకునిగా ప్రవర్తించిన జ్ఞాపకం. అయితే ‘‘క్విట్ ఇండియా’’వచ్చాక ‘‘దొర’’ శబ్దం పోక తప్పదు. కాబట్టి కథలో ‘‘గార్డు’’ అనే వాడాను. సింపిల్ గార్డు! దొర– గార్డు అయినా దొర–కాని– గార్డు అయినా ప్రతీ రైలు గార్డూ స్యూట్ మీద ట్రిమ్గా ఉండక తప్పదు. అందులోనూ మైయిల్ గాడీ గార్డు ఈ ‘‘వరల్డు’’ మనిషిలా కనబడడు. ప్లాట్‌ఫారమ్ సిమెంటుదైనా రబ్బర్ మీద నడిచినట్టుగా ఎగిరెగిరి పడుతూ నడుస్తాడు. బండి ఆగిన పది నిమిషాలు డైనింగు కార్ నుండి కోలింగు ప్లాంకు దాకా, కోలింగు ప్లాంకు నుండి డైనింగు కార్ దాకా! మధ్యే మధ్యే తేనీరుచ్చుకుంటాడు. మరిన్నీ స్టేషన్ మాస్టర్‌ను మన్నిస్తూ మన్నన లందుకుంటాడు. గడియారం ముళ్లూ కనురెప్పలూ ఏకమయ్యేటట్టు రిస్టువాచ్ గమనిస్తూ యుంటాడు. పచ్చజండా విప్పుతూ ఉంటాడు. చుడుతూ యుంటాడు. అంతా ఎక్కారో లేదో కంటూ వుంటాడు. బ్రేక్వాన్లో సామాను లెక్క చూచుకుంటాడు. సహవాసుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. వాళ్ల సౌకర్యాలను గురించి సెంట్ పెర్సెంట్ యోజిస్తాడు. ఒక్క ‘‘వర్డు’’లో మెయిల్ గాడీ గార్డు ఫుట్‌బాల్ గేమ్‌లోని ‘‘ఫార్వార్డు’’ అనుకోండి. ∙∙ గంట కొట్టారు. ఎంజిన్ వాటరు తాగి కోల్ తిని తయారీలో విసిల్ వేసింది. గార్డు పచ్చజండా ఊపడమే తరువాయి. అవితే గార్డు ఎవరికోసమో యన్నట్టు ఇటూ యటూ త్రచ్చాడుతూ పచ్చజండా ఊపడాయిరి. అంతా కిటికీల గుండా గుమ్మాల గుండా బండీ నుండి తొంగి చూస్తూ వున్నారు. ఒక ప్రయాణీకురాలు– చక్కని చీర కట్టుకు రెండో తరగతి లేడీస్ కంపార్టుమెంటు వద్ద ఎక్కకుండా నిలబడివుంది, ప్లాట్‌ఫారమ్ మీదనే– గార్డు తన హడావిడిలో ఆమెను చూచాడో లేదో, ఆమె చీర తగిలాడు. తగుల్తూ వెంటనే ‘‘సారీ’’ అన్నాడు. ప్రేక్షకుల్లో కొందఱు ‘‘మరి గార్డు ‘సారీ’లో బడ్డాడు. మెయిలు వెళ్లినట్లే!’’ అన్నారు. కొందరు ‘‘గార్డు లోబడ్డాక ‘సారీ’ ఏం? జోలీ గుడ్ కంపెనీ’’ అన్నారు. ఇంగ్లీషు ‘‘సారీ’’కి తెనుగులో రెండర్థాలు. ‘చీర’ అని వొకటి. విచారకరమని వొకటి. కాని ఆ భాషలో వర్ణక్రమం వేఱు– వ్రాయడమంటూ వస్తే. ఆమె– ఆ స్త్రీ– ‘‘నో మేటర్! ఇందులోనేనా కూర్చునేది’’ యని అడిగింది. గార్డు ‘‘మీ కోసమే చూస్తూ యున్నది’’ అని ఆమెను నఖ శిఖ పర్యంతం చూస్తూ ‘‘చీర కట్టేరే! పోల్చలేకపోయినాను! గెట్ ఇన్ ప్లీజ్! గెట్ ఇన్!’’ అన్నాడు. గట్టిగా ఈలేశాడు. పచ్చజండా రంయిని విప్పి వూపాడు. బండీ నడుస్తూయుంటేనే గార్డు తన రేక్లోకి, ఎగిరి ఎక్కినట్టు ఎక్కేశాడు. మహాచెడ్డ నవ్వు నవ్వేశాడు. ∙∙ అయితే వొక సందేహంలో పడ్డాడు. ‘‘ఆ దొరసాని చీరకట్టి తల్లో పువ్వులు కూడా పెట్టుకుందా? లేదా?’’ అని. అందుకోసం ఆమె తలకట్టెన్ని మాట్లు చూద్దామన్నా గార్డుతో ఆమె ముఖాముఖి మాట్లాడ్డమేగానీ తలకట్టు చూపింది కాదు. ‘‘చీర కట్టుకుంటే ఈ భారతీయులు మమ్మల్ని ఉండనిస్తారనుకుంటాను ఇండియాలో’’ యంది ఓ చోట గార్డుతో. ‘‘చీర కట్టుకుంటే చాలదు. పువ్వులు కూడా పెట్టుకోవాలి’’ అన్నాడు గార్డు. ఆమె ‘‘అవీ పెట్టుకున్నాను. అదిగో చూడు నా తలకట్టు’’ యని చూపించింది తల్లో పువ్వులు. ‘‘సారీ’’ అన్నాడు గార్డు. ‘‘ఏం?’’ అంది ఆమె. ‘‘ఫువ్వులు డాఫోడిల్సు లాగున్నాయి. డాఫోడిల్సు బిలాంగ్ టు ఇంగ్లండు’’ అన్నాడు గార్డు. ‘‘ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆఫ్టరాల్ వి ఆర్ ఏంగ్లో ఇండియన్సు. అవీ పెట్టుకుంటాం. ఇవీ పెట్టుకుంటాం. అన్నీ పెట్టుకుంటాం’’ యంది ఆమె. ‘‘సారీలో గౌను లేదు కదా?’’యని అడిగాడు గార్డు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘‘ఇండీడ్. ఎవెరీ సారీ ప్రోబ్లెమ్. దిస్ క్విట్ ఇండియా ప్రోబ్లెమ్. యు సీ. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. బట్ వాటర్ ఈస్ ఎస్సెన్షియల్ ఫర్ మై ఎంజిన్. ఐ కాంట్ లీవ్ దిస్ ఎంజిన్. ది ఇంగ్లీష్‌మన్ కాంట్ లీవ్ యు’’ యన్నాడు గార్డు. అంటూ ఆమె సారీకేసి మరోసారి చూచాడు. ఆమె ‘సారీ’ అంది. కవికొండల వెంకటరావు కథ ‘సారీలో బడ్డాడు గార్డు’ ఇది. కవికొండల (20 జూలై 1892 – 4జూలై 1969) రాజమండ్రి దగ్గరి శ్రీరంగపట్నంలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. కౌమారంలోనే సాహిత్యం పట్ల ఆసక్తివున్న కవికొండల మొదట్లో తన రచనలు ఆంగ్లంలో చేసేవారు. అయితే, ఆయన ప్రతిభను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపాల్ అయిన ఆంగ్లేయుడు ఒ.జె.కూల్డ్రె, మాతృభాషలో రాయమని సలహా ఇచ్చారట. అట్లా తెలుగులో రాయడం మొదలుపెట్టారు. కథలు, గేయాలు, వ్యాసాలు, నవలలు, ఖండ కావ్యాలు, నాటకాలు, శతకాలు, ఇలా విస్తారంగా రాశారు. కథలే మూడు వందల వరకూ ఉన్నాయి. ఈయన రచనలు 1929 నుంచీ పుస్తకాలుగా వచ్చాయి. ఇనుప కోట (నవల), విజన సదనము (నవల), కుమార కంఠము, నెలబాలుడు, చదువుల దుత్త, చిట్టి కైత (బాలల కోసం ఖండ కావ్యాలు), మాతృదేశ సంకీర్తనము (గేయాలు), జంటలు(వ్యాసాలు) ఆయన పుస్తకాల్లో కొన్ని. తనను ప్రభావితం చేసిన కవి కవికొండల అని శ్రీశ్రీ చెప్పుకున్నారు. కవికొండల వెంకటరావు -
భలే 'మామయ్య'
అనుకున్న పని వొక్కటీ కాలేదు. కాని యీ ఊరుకాని ఊళ్లో కాలక్షేపం ఎలా? ఇంత పెద్ద పట్టణంలో యెవరో ఒక స్నేహితుడు ఉండిఉండొచ్చు; కాని ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. సామాను హోటల్లో పడేశాను. ఊరు కొత్తదైనా– పట్టణమైనా ఇంతకన్నా గొప్ప పట్టణాల్నే చూసిన నాకు దీని ప్రత్యేకత యేమీ కనిపించలేదు. తిరిగిన బజారే తిరుగుతూ గడిపాను. కొంతసేపు రైల్వేస్టేషనులో కూర్చున్నాను. వొచ్చే జనమూ, పొయ్యే జనమూ ఆకర్షించలేదు: కొత్తదనమేది కనిపించకపోతే– కనిపించలేదే అనే మరో కొత్త బాధ. కనిపించాక దాన్ని భరించగలమో లేమో అది వేరే విషయం! సినిమా మంచిది కాదని తెలుసు. అంతకన్నా గత్యంతరం లేదు. వెళ్లి కొత్తగా తలకాయ నెప్పిని తెచ్చుకోవటమా, మానటమా అనే సమస్య తెగక, హాలు దగ్గరే తారాట్లాడసాగాను. ‘‘ఎప్పుడూ రావటం?’’ ఎంతో పరిచయాన్ని సూచించే కంఠస్వరం వెనుక నుంచి వినవొచ్చింది. మనిషిని ముసలివాడుగానే చెప్పవొచ్చు. ముఖకళలో ఎంతో ఆత్రుత, మాధుర్యం, తను పోగొట్టుకుని ఇక దొరకదని నిరాశ చేసుకున్న విలువైన వస్తువేదో హఠాత్తుగా కనిపించినప్పుడు కలిగే ఆనందం లాంటిదాన్ని నేను గుర్తించాను. బహుశా నేనెవర్నో తెలిసి ఉండితీరాలి. నాకు మాత్రం ముఖం ఎక్కడా చూసిన జ్ఞాపకం రావటం లేదు. నా చిన్నతనంలో నన్ను యెరిగివుంటాడు. మా కుటుంబంతో పరిచయం వుండివుండొచ్చు. నిజానికి మా బంధువు లందర్నీ నేను యెరుగను. కనుక ఆ అనుభవంతోటే సంభాషణను నడపగలిగే చాకచక్యం నాకు వున్నదని వేరే చెప్పాలా? అన్నాను: ‘‘వుదయానే వొచ్చాను.’’ ‘‘ఇంటికన్నా రాలేదే?’’ ఈయన యెవరో నిర్ధారణగానన్నా తెలియదు. ఈయన ఇంటి సంగతి నాకెలా తెలుస్తుంది? ‘‘ఏం లేదు... వేరే పనివుండి...’’ అని నీళ్లు నమిలాను. ‘‘మనసులో వుండాలి కాని, పనులు అడ్డం వొస్తయ్యా?... రా పోదాం.’’ నేనేమీ మాట్లాడకుండా ఆయన వెనకాలే నడవసాగాను. యీయన యెవరో తెలుసుకోవటం యెట్లాగా? ‘‘అందరూ కులాసా?’’ అన్నాడు. ‘‘ఆ’’ అన్నాను. ఆ ‘అందరూ’ అనే పదంలో యెందరు వున్నారో కూడా ఊహించకుండానే. సందుల్లోంచి తీసుకు వెళ్తున్నాడు– ఆ పెద్దమనిషి ముఖం చూస్తే అపకారాన్ని చేసే చిహ్నాలు కనిపించటం లేదు. ‘‘రండి’’ అన్నాడు ఇంట్లోకి జొరబడుతూ. మధ్య తరగతి ఇల్లు. శుభ్రంగా వుంది. నన్ను సావిట్లో కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత పదేళ్ల పిల్ల కాఫీ పట్టుకొచ్చింది. అందిస్తూ నా మొహంలోకి తేరిపార చూచింది– నేను అవునా కాదా అన్నట్టు. వెళ్తూ వెళ్తూ ‘బావగారే’ అనుకుంది తనలో– నాకు వినిపించేటంత మెల్లిగా! ముసలాయన వొచ్చాడు. గది గుమ్మంలోంచి రెండు స్త్రీ మొహాలు రహస్యంగా తొంగిచూస్తున్నవి. ఒక ముసలామె, యీ ముసలాడికి భార్య అయివుండొచ్చు; ఆమె వెనుకాల పద్దెనిమిదేళ్ల నవజవ్వని. వీళ్లెవరిగోలా నాకు పట్టలేదు. ఆ యువతి! నన్నా విధంగా చూసినందుకే నా గొప్పతనమంతా ఇప్పుడే బైటపడ్డట్టు ఉప్పొంగిపొయ్యాను. ‘‘ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాము. ఇలాటి శుభ గడియలు జీవితంలో ఉండవేమోననే నిరాశ కూడా ఒకప్పుడు కలగకపోలేదు...’’ అని ముసలాడు నా మొహంలోకి చూశాడు. నన్ను ఉద్దేశించిన మాటలే అయినా, నాకు అర్థం కానందువల్ల పరధ్యానంలో వున్నట్టు తల వొంచేశాను. ‘‘పిల్లా తల్లీ కూడా ఏకధారగా ఏడ్చారనుకో. ఏమనుకొని ఏం లాభం? ఎవరి తప్పని కూడా విచారించటం అనవసర మనిపించింది. తప్పు యెవరిదైనా దాని ఫలితం దానికి ఇచ్చుకున్న జరిమానా ఒక పండంటి కాపురం.’’ ఎలా అర్థం చేసుకునేది యీ మాటల్ని? ముసలాడు మళ్లీ సాగించాడు: ‘‘నిజానికి వెధవ గొలుసు... ఏం అది లేకపోతే? సంసారానికి అది అడ్డమా? యీమాత్రం ఆలోచన వుంటే అది నీతో పోట్లాడుతుందీ? పోనీ నువ్వు మాత్రం– ఏదో సరదా పడి అడిగింది కదా అని ముచ్చట తీర్చకూడదూ? మరీ తిండికీ గుడ్డకూ మొహం వాచినవాళ్లు కాదుగా? సంవత్సరం నుంచీ యెడమొగం పెడమొగం!’’ ముసలాడి లెక్చర్ పూర్తయి, మంచినీళ్ల కోసం ఆజ్ఞాపించాడు. ఇప్పుడు కాస్త తలకెక్కింది. ఈయన అల్లుడు ఈయన అమ్మాయితో పోట్లాడటం వల్ల సంవత్సరం నుంచీ పుట్టింట్లోనే ఉండిపోయింది. యీ పోట్లాటకు కారణం గొలుసు చేయించమని ఆమె అడగటం, అల్లుడు కాదనటమూను. పోతే ఆ అల్లుడు నాలాగే ఉంటాడు కాబోలు. కనుక, వెంటనే ఆయన పొరపాటును చెప్పి ఇక్కణ్నుంచి తప్పుకోవటం అత్యుత్తమం. మంచినీళ్ల గ్లాసుతో ఆ యువతి ప్రవేశించింది. నేను అక్కడే ఉన్నట్లు ఇప్పుడే చూసినట్టు నా ముఖంలోకి చూసి, ఎంతో సిగ్గుపడి ఆ గ్లాసుతో ముందుకు పోవటమా లేక వెనక్కు తగ్గటమా అని ఆలోచిస్తూన్నట్టు తోచింది. ‘‘సిగ్గేమిటే? మీ ఆయనేనే!’’ అన్నాడు ముసలాడు. ముసిముసి నవ్వుల్తో ముసలాడికి గ్లాసు అందించింది. ఇలాంటి అపురూపవతిని ఏ కఠిన హృదయుడు కష్టాలపాలు చేసివుంటాడు? యీ క్షణంలో ‘‘నేను మీరు అనుకునే వ్యక్తిని కాను’’ అని చెపితే యీమె కొయ్యబారవొచ్చు. ఇంతమందీ నన్ను ఇంటి అల్లుడుగానే నమ్మారు. ‘‘నేను నేనే’’ అని రుజూ చేసుకునేందుకు తాతలు దిగిరావాలి. నా పనల్లా అన్నిటికీ మౌనంగా కూర్చోవటమే. మిగతా పనులల్లా వాటంతటవే జరుగుతవి. అనుకున్నట్టే అల్లుడికి జరగాల్సిన మర్యాదల్లో ఏ లోటూ లేకుండానే జరిగింది. చచ్చి స్వర్గానికి పోయి పొందదగ్గ సౌఖ్యం ఏదన్నావుంటే– అదంతా చవిచూశాను. మాటల్నీ, లాలననూ పట్టి చూస్తే యెంత అమాయకురాలో ననిపించింది. ఆ దౌర్భాగ్యుడైన భర్త మీద నిజంగా జాలివేసింది. యెన్నాళ్లయినా ఇక్కడే ఉందామా అనిపించింది. మర్నాటి వుదయం నిద్ర లేచేప్పటికి కాఫీ వుప్మాలు సిద్ధంగా వున్నవి. స్వర్గంలో మాత్రం ఇంతకన్న ఎక్కువ వుండేడుస్తుందా? బైటికి వెళ్లబుద్ధి కాలేదు. ఇంట్లో బాధపడలేక బైటికి వెళ్లవలసిన అవసరం ఇంకా కలగలేదు. ఇలాగే ఐదు రోజులు గడిచిపోయినవి. కాలం సాగినకొద్దీ నాలో భయం ఎక్కువవసాగింది. వాళ్లు వెళ్లమనరు– కానీ యీ వ్యవహారం చాలాదూరం వెళ్లేట్టుగా వుంది. నేను వెళ్లేప్పుడు ఆమె కూడా నా వెంటపడితే? అసలు బండారమంతా అప్పుడు బైటపడక మానదాయె. మెల్లిగా కదలేశాను. ‘‘రేపు నేను వెళ్తాను’’ అన్నాను ఆమెతో.‘‘ఎక్కడికీ! నన్ను కూడా తీసుకు వెళ్లండి.’’‘‘నేను వెళ్లి ఉత్తరం రాస్తాను. మీ నాన్న తీసుకొచ్చి దిగపెడతాడులే!’’‘‘ఊహు. నన్ను తీసుకువెళ్లకపోతే చంపుకున్నట్టే!’’ ఎంత బతిమాలి చెప్పినా ఇదే వరస. ఇంకో వుపాయం ఆలోచించాను. సామాన్యంగా స్త్రీలను నగలతో మభ్యపెట్టవొచ్చు. ఇన్నాళ్లుగా ఆమెను బాధపెట్టిన ఆ గొలుసు కనక చేయించి ఇస్తే ఆమెకు ఎంతో తృప్తి కలుగుతుంది. పిల్లాడికి తినుబండారమేదో ఇచ్చి మాయపుచ్చినట్టు యీమె మనసును కూడా వేరే తోవలోకి నెట్టి నేను బైటపడదామనే నిశ్చయానికి వొచ్చాను. మర్నాడు గొలుసు సంగతి ఎత్తేప్పటికి బుంగమూతి పెట్టి ‘‘పోనీండి– మళ్లీ ఆ సంగతి దేనికి?’’ అంది. ‘‘అది కాదు... గొలుసు చేయించుకో. ఇదుగో పైకం’’ ఐదు వందల రూపాయల కాగితాలు ఇచ్చాను. ఇంత ధరా అనే అనుమానం నాకు కలగలేదు. ఆమె ముఖం వికసించటంతో నాకు ఎంతో రిలీఫ్ కలిగింది. ‘‘యీ మధ్యాహ్నం బండికి నేను వెళ్తాను. మళ్లీ ఐదారు రోజుల్లో వొచ్చి నిన్ను తీసుకెళ్తాను. అప్పటికి యీ బోసిమెడలో గొలుసు కూడా వుంటుందిగా!’’ అని ఊరడించి బైటపడ్డాను. స్నేహితుణ్ని వెతికాను. సాయంత్రం దాకా వాడితో ఉండి రాత్రిబండికి పోదామని నిశ్చయం. ఆ ముసలాడు ఎక్కడ యెదురౌతాడో నని భయంగానే వుంది. ఆ సాయంత్రం కాఫీ హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మావాడి స్నేహితులు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. హఠాత్తుగా ఒకడు ‘‘అడుగో మామయ్య అల్లుణ్ని తీసుకొని వెళ్తున్నాడు!’’ అన్నాడు. తిరిగి చూద్దును కదా– ముసలాడు! ‘‘ఎవరూ?’’ అన్నాను. ‘‘ఆ ముసలాడు అఖండుడు. కొత్త మొహం ఊళ్లో కనిపిస్తే– కాస్త జల్సారాయుడిగా ఉంటే చాలు తన అల్లుడని భ్రమించినట్టు యెత్తువేసి ఇంటికి తీసుకువెళ్తాడు.’’ ముసలాడు యువకుడితో మేము కూర్చున్న హోటల్‌కే వొచ్చాడు. నన్నెక్కడ చూస్తాడోనని భయపడి చస్తున్నాను. చూడనే చూశాడు– నన్నెప్పుడూ చూడనట్టే ఊరుకున్నాడు. ఇక జీవితంలో ఆ వూరు వెళ్లదల్చుకోలేదు. ధనికొండ హనుమంతరావు (1919–1989) కథ ‘మామయ్య’కు సంక్షిప్త రూపం ఇది. ఈ సరదా కథ సౌజన్యం: కథానిలయం. క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సుల స్థాపకుడు ధనికొండ. అభిసారిక పత్రిక వ్యవస్థాపకుడు. నవలలు, నాటకాలు, కథలు విస్తృతంగా రాశాడు. అనువాదాలు చేశాడు. ఇంద్రజిత్ కలంపేరుతోనూ రాశాడు. గుడ్డివాడు, మగువ మనసు, జగదేక సుందరి, క్లియోపాత్రా ఆయన రచనల్లో కొన్ని. - ధనికొండ హనుమంతరావు -
రెక్కల ప్రయాణం
ఇంటి కాడ పిల్లజెల్లా ఎట్ల ఉండ్రో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో.... చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకూ.... పాటను వాట్సప్‌లో వింటూండగా కాల్ వచ్చింది.. పాట ఆర్ద్రతతో మనసు చెమ్మగిల్లడం వల్ల రాజేందర్ కళ్లు మసకబారాయి... అందుకే ఆ కాల్ ఎవరిదో సరిగ్గా కనపడలేదు. మోచేయితో కళ్లు తుడుచుకొని చూశాడు. భార్య దగ్గర్నుంచి. వెంటనే లిఫ్ట్ చేశాడు. ‘ఆ.. హలో .. సంధ్యా..’ ‘ఏయ్.. ఇండియా ఓడలను పంపిస్తుందట కదా!’ ఆత్రంగా సంధ్య. ‘ఏందీ...’ అర్థంకాలేదు అతనికి. ‘గదే.. గల్ఫ్‌లో ఉన్న మనోళ్లందరినీ ఇండియా దీస్కపోతందుకు ఓడలను పంపిస్తుందట.. ఆడ స్టార్ట్ అయినయంట కూడా’ ఒకింత ఉత్సాహం, ఆనందం ఆమె స్వరంలో. ‘సంధ్యా... గా వాట్సప్‌ల చక్కర్లు గొట్టేది నమ్ముతవా?’ నిట్టురుస్తూ అతను. ‘యే.. వాట్సప్‌ల గాదు. వెబ్సైట్ న్యూస్‌ల చూసిన.. నిజమే’ ఆమె. ‘అయితే మనం మూటముల్లె సర్దుకొని రెడీగా ఉండమంటవ్ ఇండియావోతందుకు’ వెటకారంగా అతను. ‘నీకన్నీ పరాచకాలా? నా బాధ కనవడ్తలేదు.. ఇనవడ్తలేదు. కనీసం మనమేం బతుకు బతుకున్నమోనన్న సోయన్న ఉన్నదా లేదా? నువ్వు బహెరన్ల.. నేను ఈడ .. పిల్లలిద్దరు మనూర్ల... ఏం బతుకే ఇది? ఎవ్వరమన్నా సంతోషంగా ఉన్నమా? పిల్లలు రోజూ ఫోన్ల ఏడుస్తున్నరు.. అదన్నా వినవడుతుందా లేదా?’ దుఃఖం, బాధ, కోపం, అసహనం అన్నీ కలగలిశాయి ఆమె గొంతులో. ‘నన్నేం జేయమంటవ్ చెప్పు? నీకొక్కదానికే బాధుంటది కాని నాకుండదా? కరోనా కష్టం నాకు, నీకే కాదే.. లోకమంత ఉంది. విమానాలు నడుస్తున్నా.. పైసలు ఖర్చయితలేవని ఈడ కూసున్ననా?’ అని ఆగాడు.. ‘గట్లకాదు’ అని ఆమె ఏదో అనబోతుంటే.. ‘ఎట్ల కాదు.. నిన్ను దుబాయ్‌కి నేను పొమ్మన్ననా? నీకు జెప్పకుండా నేను బహెరన్ అచ్చిన్నా? గల్ఫ్‌ల ఉద్యోగం ఉంది అని చెప్తే నువ్వే కదా పో పో.. ఈడ ఎన్ని రోజులు చేసినా ఏమొస్తది? పిల్లగాండ్లను నేను జూసుకుంటా.. మీ అమ్మ సూత ఉంటది కదా.. భయమేంది నాకు అని నువ్వంటేనే నేనచ్చిన్నా.. నా అంతట నేను చెప్పకుండా పారిపోయి అచ్చిన్నా? ఆ...’ రెట్టించాడు అతను. ‘నేనే చెప్పిన.. అయితేందిప్పుడు’ ఉక్రోషం ఆమెలో. ‘ నేను కూడా సదివిన.. ల్యాబ్ టెక్నీషియన్‌కి ఈడ ఆరు వేలు కూడా ఇస్తలేరు.. నాక్కూడా ఆడనే చూడు అని నువ్వన్లేదా? మరి పిల్లలెట్లనే అంటే ఏమన్నవ్.. కొంచెం పెద్దగయిండ్రు కదా.. మీ అమ్మ, మా అమ్మ చూసుకుంటరు.. ఒక రెండుమూడేండ్లు కష్టపడి పైసలు కాపాయం చేసుకొని మల్లా ఇండియాకొద్దము అని నువ్వన్నవా లేదా? ’ గద్దించాడు. ‘నాకేం ఎరుక గిట్లయితదని.. ఒకల్లనొకల్లం చూసుకోకుండా గింత పరేషాన్ ఒస్తదని. నేను మన మంచికే చెప్పిన’ మనసులో దుఃఖం గొంతులోకొచ్చింది ఆమెకు. ‘గంతే.. ఇద్దరం మన కుటుంబం కోసమే ఆలోచించినమే. ఓల్లమనుకోలేదు గింత పాపపు గడియలు ఒస్తయ్.. కరోనాతో నా కొలువు వోతది..నువ్వు పంపే పైసల మీదనే పడి తినాల్సొస్తదని కలగన్ననా? గసుంటిది ముందే తెలుస్తే సముద్రంల వడి సచ్చిపోదు’ అని అతను అంటూండగా.. ‘ఏం మాట్లాడుతున్నవ్?’ అని కోపగించుకుంటూ ‘ నేనెప్పుడైనా అట్లన్ననా?’ అని ఏడ్వడం మొదలుపెట్టింది సంధ్య. ‘మరేందే? నేను మాత్రం సంతోషంగున్నట్టు. పిల్లలు కండ్లల్లకెంచి పోతలేరు. మా అమ్మ.. ఎట్లుందో.. అండ్ల షుగర్ పేషంట్.. మందులున్నయో లేవో... లేకపోయినా ఉన్నయనే చెప్తది. పిల్లలతో కూడా నిజం చెప్పనియ్యదు ఒట్టేస్తది. మా అమ్మ సంగతి నాకు బాగెరుక’ అంటూ అతనూ ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘ఇగో నువ్వు బాధపడకు చెప్తున్నా.. ఎట్లయితేగట్లయితది. అందరితో మనం...’ భర్తకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. ‘పిల్లగాండ్లు ఫోన్ చేస్తున్నరంటేనే భయమైతుంది. ఎప్పుడొస్తరు.. ఎప్పుడొస్తరు అని రికామ లేకుండా అడుగుతుంటే ఏం జెప్తం..’ అతను. ‘ఊ... గా ఓడల సంగతి అయితే తెల్సుకో...’ అన్నది. ‘సరే’అన్నాడు. ‘పైసలున్నయా?’ అడిగింది. ‘ఊ...’ చెప్పాడు. ‘మా తమ్ముడ్ని పొయ్యి మనోల్లను చూసిరమ్మందామన్నా అయేటట్టు లేదు. ఎక్కడోల్లు అక్కడ్నే ఉండాల్నట. ఏ ఊరి నుంచి ఏ ఊరికి రాకపోకల్లేవట మా వోడు జెప్తుండు. నాకేం మనసున వడ్తలేదు’ అంది. ‘సరే ఫికర్వెట్టుకోకు. గా ఓడల సంగతి తెల్సుకుంట కని.. పైలం. ఉంట మరి’ అని ఫోన్ పెట్టేశాడు. అలాగే గోడకు చేరగిల పడి కళ్లు మూసుకున్నాడు క్యాంప్‌లోని తన గదిలో. రెండు రోజులుగా సరిగ్గా తిండి లేదు. ఆకలి గుర్రుమని పేగుల్ని కదిలిస్తూ నిద్ర పట్టనివ్వట్లేదు. ‘రాజేందర్ అన్నా..’అని పిలిచిన పిలుపుకి కళ్లు తెరిచాడు. వగరుస్తూ ఎదురుగా మల్లేష్. ‘ఏమైంది మల్లేష్.. గట్ల ఆయసపడ్తున్నవేంది?’ అంటూ లేచి కూర్చున్నాడు రాజేందర్. ‘అన్నా.. మన తెలుగోళ్లు అన్నం వండుకొని అచ్చిండ్రు.. బియ్యం, పప్పు, ఉప్పు, నూనె కూడా పంచుతరట.. దా పోదాం’ అంటూ రాజేందర్ చేయి పట్టుకొని లేపాడు మల్లేష్. ∙∙ ‘ఈ రోజు కూడా మీ ఆయనకు చెప్పినట్టు లేదు విషయం’ అడిగింది కరుణ.. వాళ్లాయనతో మాట్లాడి ఫోన్‌కట్ చేసిన స్నేహితురాలిని చూస్తూ. లేదన్నట్టుగా తలూపింది సంధ్య. ‘తనకూ రెండుమూడు నెల్ల కిందటనే జాబ్ పోయిందని రాజేందర్‌కు తెలిస్తే తట్టుకుంటడా? గుండె ఆగి సచ్చిపోతడు ఆడ్నే. అనుకుంది మనసులో. ‘మరి ఎన్ని రోజులు ఇట్లా మేనేజ్ చేస్తావ్?’ సంధ్య భుజం నొక్కుతూ అనునయంగా అడిగింది కరుణ. అవును ఎన్ని రోజులు తమ్ముడి దగ్గర పైసలు తీస్కుని మొగుడికి పంపిస్తది? కరోనాతోని వాడి పరిస్థితి కూడా మంచిగలేదని చెప్పిండు తమ్ముడు. అంటే ఇక పైసలు ఇచ్చుడు కాదని కదా’ ఆమె కళ్లనిండా నీళ్లు. కనపడకుండా కళ్లు మూసుకుంది. ఆ ఒత్తిడికి చెంపలమీదకు జారాయి కన్నీళ్లు. ‘అమ్మా...నీకు, నాన్నకు రెక్కలుంటే మంచిగ ఉండు.. మేము అడిగినప్పుడల్లా మా దగ్గరకు రావస్తుండే’ కూతురి అమాయకత్వం గుర్తొచ్చి మరింత పొంగింది దుఃఖం ఆమె కళ్లల్లో. - సరస్వతి రమ -
యథా దృష్టి తథా సృష్టి
చుట్టూ చెట్ల మధ్యలో వశిష్ట్రాశమంలా ‘విశాఖపట్నం మున్సిపల్ హై స్కూల్’ ప్రశాంతంగా ఉంది. అప్పటికే సగం మంది టీచర్లు, పిల్లలు దసరా సెలవులకని ఊర్లకెళ్ళిపోవడంతో చాలా సెక్షన్లు కలిపేశారు. అలా జనరల్, కాంపోజిట్ మ్యాథ్స్ సెక్షన్లు కలిపేసిన ఓ క్లాస్‌లో మాస్టారు ‘‘పిల్లలూ, లెఖ్ఖల్లో ఈ జనరల్, కాంపోజిట్ సిస్టం ఈ ఏటితో ఆఖరు. మీదే లాస్ట్ బ్యాచ్. అంచేత అందరూ ఎలాగోలా కష్టపడి గట్టెక్కేయండి. ఈ లాస్ట్ పీరియడ్‌లో పాఠాలు లేవు కాబట్టి ఒక్కొక్కరూ లేచి పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఒరేయ్ శివా, నువ్వు కాంపోజిట్‌లో క్లాస్ ఫస్ట్ కాబట్టి నీతో మొదలు పెడదాం. పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావో చెప్పు?’’ అన్నారు. వెంటనే శివ లేచి దండకట్టుకుని ‘‘సర్, నేను టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ చదివి పెద్దయ్యాక రైల్వే డ్రైవర్ అవుదాం అనుకుంటున్నా’’ అన్నాడు. ‘‘వెరీ గుడ్. అలా అనుకోడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా?’’ అడిగారు టీచర్ కుతూహలంగా. చెప్పొచ్చో చెప్పకూడదో అన్నట్టు ఒక్క క్షణం ఆగి, మాస్టారు మరోసారి అడిగేసరికి శివ చెప్పడం మొదలు పెట్టాడు... ‘‘సర్, మా వూర్లో ఒకే ఒక్క ట్రైన్ అదీ ఒక్క నిమిషం మాత్రమే ఆగుతుంది. ఓ రోజు మా నాన్న ట్రైన్ కదిలిపోతున్న కంగారులో రిజర్వేషన్ లేకుండా ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో ఎక్కేసాడు. టి.సి వచ్చి బలవంతంగా మధ్య స్టేషన్లో దింపేసాడు. మళ్ళీ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేలోగా ట్రైన్ వెళ్లిపోవడంతో మా నాన్న ఆరోజు నలభై కిలోమీటర్లు నడిచాడట. జీవితంలో ఒక్కసారైనా ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలో దర్జాగా ప్రయాణం చెయ్యాలని మా నాన్న కోరిక. ఆ రైలు నేనే నడపాలని నా కోరిక. అందుకే నేను పెద్దయ్యాక రైల్వే డ్రైవర్ అవ్వాలనుకుంటున్నా’’ అన్నాడు ఎమోషనల్‌గా. ‘‘వెరీ గుడ్ . ఇప్పుడు జనరల్ మ్యాథ్స్ నించి. ఆ ఆఖరి బెంచిలో కూర్చుని కిటికీలోంచి దిక్కులు చూస్తున్నవాడెవడ్రా ..లేచి నించో ..నీ పేరేమిట్రా?’’ అడిగారు మాస్టారు. ‘‘సర్ నా పేరు వెంకటరమణ.’’ చెప్పాడా కుర్రాడు. ‘‘ఆ రమణా! చెప్పరా పెద్దయ్యాక నువ్వేమవుదాం అనుకుంటున్నావు?’’ అడిగింది తన మాస్టారు కాకపోవడంతో రమణ కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు. ‘‘సర్, నాకు చదువు మీద అస్సలు ఇంటరెస్ట్ లేదు. ఎలాగోలా టెన్త్ అవగొట్టరా, ఎవరో ఒకర్ని పట్టుకుని చిన్నో చితకో గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తాను ఆపైన నా వ్యాపారం చూసుకో చాలు అన్నాడు సర్ మా నాన్న. ఒక్క లెఖ్ఖల్లోనే కొంచెం వీక్ సర్ . అది కూడా పాస్ అయిపోతే నా చదువు అయిపోయినట్టే. జీవితం లో స్థిరపడిపోయినట్టే’’ అన్నాడు ఉత్సాహంగా. దానికి మాస్టారు ‘‘అదేమిట్రా..నీకంటూ ఏమీ లక్ష్యం లేదా ?’’ అడిగారు ఆశ్చర్యంగా. దానికి రమణ ‘‘సర్, ఇందాకలా శివ వాళ్ళ నాన్న కోసం రైల్వే డ్రైవర్ అవుతానంటే వెరీగుడ్ అన్నారు. నేను కూడా మా నాన్న కోరిక ప్రకారం టెన్త్ పాస్ అయితే చదువు ఆపేస్తానంటే తప్పంటున్నారు. ఇదెక్కడి న్యాయం సర్ ?’’ అనగానే క్లాస్ మొత్తం గొల్లుమన్నారు. మాస్టారు వెంటనే ‘‘సరే, సరే, అలాగే కానీ, నీకు లెఖ్ఖల్లో ఏమైనా అనుమానాలుంటే శివ దగ్గర నేర్చుకో’’ అంటూ ఉండగా బెల్లు మ్రోగింది. పిల్లలంతా ఇళ్ళకెళ్ళిపోయారు. ∙∙ చుట్టూ నోట్లకట్టలు, మధ్యలో మనీ ప్లాంట్లా లగ్జరీ అపార్ట్మెంట్ల మధ్యలో ఓ చిన్న పార్క్‌తో ఆ ఏరియా పోష్ గా ఉంది. సెల్లార్లో పాలరంగులో ఉన్న ఇన్నోవా కారుని పనసతొన రంగు పెట్రోల్ క్లాత్ నీళ్ళల్లో తడిపి నీట్‌గా తుడుస్తున్నాడు శివ. చిరిగిన కాలరు, అరిగిన చెప్పులు, మాసిన గెడ్డం, నైరాశ్యపు కళ్ళు, నవ్వుకు నోచుకోని పెదాలు, వెరసి కష్టాలకి కస్టోడియన్‌లా ఉన్నాడతను. తడిగుడ్డ పక్కన పెట్టి పొడిగుడ్డ తీస్తుండగా అతని ఫోన్ మోగింది. తన ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా అతను ఉలిక్కిపడతాడు. ఎందుకంటే అతనికొచ్చే ప్రతీ కాల్ అతని ఖాళీ జేబుని ఎత్తిచూపేవే. ఫోనెత్తితే స్కూల్ నించి టెన్త్ చదువుతున్న కొడుకు ‘‘ఫీజు కట్టలేదని క్లాస్ బయట ఎండలో నిలబెట్టారు నాన్నా, నువ్వు అర్జెంటుగా రా’’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తున్నాడు. అలవాటైన ఆపదే అవడంతో ఓ సారి నిట్టూర్చి, ‘‘నీకు తెలుసు కదరా, పోయిన్నెల నా కంటాపరేషన్ వల్ల కట్టలేకపోయాం. వాళ్ళకి చెప్పు నాన్నా, రెండు మూడు రోజుల్లో కట్టేస్తామని’’ అన్నాడు శివ. ‘‘ఎంత చెప్పినా వినట్లేదు నాన్నా. ఇప్పటికే నాలుగు టర్ములు పెండింగ్ ఉన్నాయట. కనీసం రెండైనా కట్టకపోతే వీల్లేదంటున్నారు’’ అన్నాడు కొడుకు. ఈలోపు అవతల్నించి ఫోన్ లాక్కుని ఎవరో చెపుతున్నారు.... ‘‘ఏవయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి. ఏదో ఐదేళ్లనించి ఇక్కడే చదివిస్తున్నారు కదా అని ఓపిక పడుతూ ఉంటే, మరీ నైన్త్ క్లాస్‌లో రెండు టరమ్స్ టెన్త్ లో రెండు టరమ్స్ డ్యూ ఉన్నాయి. ఈరోజు ఫీజు కట్టి మీ పిల్లాడ్ని తీసుకెళ్లండి’’ అంటూ విసురుగా ఫోన్ పెట్టేసాడు. ఇంతలో లిఫ్ట్‌లో వెంకట్ దిగాడు. గ్రే కలర్ సఫారీ సూట్, గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు, వేళ్ళకి తలా నాలుగేసి బంగారం, వెండి, ఉంగరాలు, ఎడమ చేతికి గోల్డ్ వాచ్, కుడి చేతికి బ్రేస్ లెట్–వెరసి పార్వతి దేవి సున్నిపిండితో వినాయకుణ్ణి తయారుచేసినట్టు లక్ష్మీదేవి స్వయానా సిరిసంపదలతో చేసిన ముద్దుబిడ్డలా ఉన్నాడు. గబ గబా అతని చేతిలో సూట్ కేస్ అందుకుని, కారు డోర్ తెరిచి పట్టుకుని, అతను ఎక్కాక, సూట్ కేసు ఫ్రంట్ సీట్లో పెట్టి, కార్ స్టార్ట్ చేసాడు శివ. కారులో ఉండగా వెంకట్ కొడుకు ఫోన్ చేసాడు. లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ ఎత్తి ‘‘చెప్పు నాన్నా ..’’ అన్నాడు మురిపెంగా. ‘‘డాడ్, ఈరోజు ఫ్రెండ్ షిప్ డే కదా, ఈవెనింగ్ స్కూల్ తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ ఉంది. గూగుల్ పే లో ఫైవ్ కె ట్రాన్స్ఫర్ చెయ్యండి ప్లీజ్’’ అన్నాడు అవతల్నించి కొడుకు. ‘‘ఓకే నాన్నా ఇప్పుడే చేస్తా. బై’’ అంటూ ఫోన్ పెడుతూనే కొడుక్కి పదివేలు పంపించి అవతల్నించి– ‘‘థాంక్యూ డాడ్’’ మెసేజ్ చూసి ఎందుకో చెమర్చిన కళ్ళు తుడుచుకుని శివ వైపు చూసి ‘‘ ఏరా శివా నీ కళ్ళల్లోంచి నీరెందుకు కారుతోంది, ఈ మధ్యేగా కంటాపరేషన్ అని సెలవు కూడా తీసుకున్నావు ?’’ అడిగాడు అనుమానంగా. ‘‘అబ్బే అదేం లేదు సర్, కంట్లో ఏదో పడిందంతే. ఆపరేషన్ చేయించాను సర్.’’ అన్నాడు శివ కళ్ళు తుడుచుకుంటూ. ∙∙ అది లోకల్ గవర్నమెంట్ ఆఫీస్. వెంకటరమణ అందులో రికార్డు అసిస్టెంట్. అదే ఊళ్ళో పుట్టి పెరగటం వల్ల అతనికి కొంచెం పలుకుబడి ఎక్కువ. ఆ ఆఫీస్‌కి సంబంధించిన పి.ఆర్, ప్రోటోకాల్ అంతా తనే చూస్తాడు. అందుకే అతనికి డెస్క్ పని ఏదీ అప్పజెప్పరు. రోజులో ఎక్కువ సమయం బయటే ఉంటాడు. పన్లో పనిగా అతనికున్న ఫైనాన్స్ వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. ఆఫీస్‌కి చేరగానే, వెంకట్ లోపలికి వెళ్లి అటెండన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి, బాస్‌కి ఓ నమస్కారం పెట్టి, మళ్ళీ బయటకొచ్చి కారెక్కి కలెక్షన్‌కి బయలుదేరాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి భోంచేసి ఓ గంట పడుకున్నాడు. ఇంతలో శివ తన క్యారేజ్ కారులోనే కూర్చుని తినేసి, మళ్ళీ డ్యూటీకి రెడీ అయ్యాడు. మూడయ్యాక వెంకట్ లేచి, మొహం కడుక్కుని, టీ తాగి, మళ్ళీ ఆఫీస్ కెళ్ళి సంతకం పెట్టి ముందురోజే చేసేసిన పనులు తాలూకు వివరాలు, పెండింగ్ పనుల ప్రోగ్రెస్ బాస్‌కి తెలియజేసి, ఐదవగానే గుడ్ నైట్ చెప్పి బయటపడి, మళ్ళీ కలెక్షన్ పని చూసుకుని, దార్లో ఆఫీస్ పనులు రెండు మూడు ఫోన్లోనే పూర్తిచేసి, ఏడయ్యాక క్లబ్‌కి వెళ్ళాడు. తొమ్మిదివరకు పేకాడి, పదివేలు పోగొట్టుకుని, మరో గంటలో మూడో పెగ్గు కూడా ముగించి, మళ్ళీ కారెక్కి, ఇంటిదగ్గర దిగేటప్పుడు శివకి ఓ వందిచ్చి, ‘‘రేప్పొద్దున్నే అన్నవరం వెళ్ళాలి, అయిదుకల్లా వచ్చేయ్’’ అని చెప్పి కారు దిగబోయి తూలాడు. వెంకట్‌ని, లక్షన్నర వరకూ కాష్ ఉన్న సూట్ కేస్‌ని ఇంటి వరకూ తీసుకొచ్చి, అతని భార్యకి భద్రంగా అప్పజెప్పి, ఇంటికెళ్లి చల్లారిపోయిన అన్నం తిని, అప్పటికే ఏడ్చి ఏడ్చి పడుకున్న కొడుకుని నిద్దట్లోనే ముద్దాడి, వంటింటి చప్పుళ్ల ద్వారా భార్య తెలిపే నిరసనల్ని ఎప్పట్లాగే భరించి, ఏ రెండుకో పడుకున్నాడు శివ. ∙∙ ఆ మర్నాడు ఉదయాన్నే అయిదుగంటలకల్లా కారు తాళం తీసుకుని శుభ్రం చేసి, ముందురోజే కొన్న పూలదండ కార్లో ఉన్న దేవుడిబొమ్మకి పెట్టి రెడీగా ఉన్నాడు శివ. ఆరుంపావుకి పట్టుపంచె, తెల్లటి చొక్కాలో వెంకట్, పట్టుచీరలో అతని భార్య పద్మజ దిగారు. ఇద్దరూ సర్దుకుని కూర్చున్నాక, జెంటిల్‌గా డోర్ మూసి, వచ్చి కూర్చుని సీటుబెల్ట్ పెట్టుకుని కారు స్టార్ట్ చేసాడు శివ. కారు పోర్ట్ రోడ్ మీదుగా గాజువాక దాటింది. వెంకట్ పేపర్ చదువుతున్నాడు. రాత్రి బాగా లేటవడంతో కళ్ళు మూతలుపడుతున్నాయి. ‘‘ఏం శివా? మీ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పింది మీ ఆవిడ. కట్టేవా?’’ అడిగింది పద్మజ. శివ భార్య పద్మజకి జాకెట్లు కుడుతూ ఉంటుంది. ‘‘ఇంకా లేదమ్మా. ఓ పదిరోజుల్లో ఏర్పాటవుతుంది. అంతవరకు ఇంటిదగ్గరే చదువుకుంటున్నాడు’’ అన్నాడు శివ రోడ్డు కేసి చూస్తూ. ‘‘అంతంత ఫీజులు కట్టలేనప్పుడు హాయిగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చుగా. ఇక్కడ మాత్రం ఏమంత గొప్పగా చెప్పేస్తున్నారు. పంతానికి తప్ప’’ అన్నాడు వెంకట్ పేపర్ చదువుతూ. శివ చేతులు స్టీరింగ్‌కి గట్టిగా బిగుసుకున్నాయి. అదిచూసి పద్మజ వెంకట్‌ని ఇంకాపమన్నట్టు చేత్తో తట్టింది. వెంకట్ పేపర్ మూసేసి, ‘‘ఇప్పుడు నేనేమంత తప్పుమాట అన్నాను. ఎవరికి ఎంత రాసుంటే అంతే. రేప్పొద్దున్న మన కొడుకు ఫారిన్లో చదువుతానంటే మనదగ్గర డబ్బుంటే చదివిస్తాం. లేదంటే ఇక్కడే చదువుకోరా అంటాం’’ అన్నాడు స్థిరంగా. అంతే, గాలెక్కువైన బెలూన్ పేలినట్టు, పులుపు తగిలిన పాలు విరిగినట్టు, శివ స్టీరింగ్ గట్టిగా పట్టుకుని డ్రైవ్ చేస్తూనే మొదటిసారి సమాధానం చెప్పాడు: ‘‘సర్, నిజమే ప్రైవేట్ స్కూల్ లో అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ మీబోటోళ్ళు అక్కడే జేర్పించి, మీ పిల్లలు రాజాలా తిరుగుతూ ఉంటే అది చూసి అక్కడ చదివితేనే బాగా వృద్ధిలోకొస్తారేమో అని ఆశతో మేము కూడా తినో తినకో అక్కడ చదివించడానికి తాపత్రయం పడుతున్నాము’’ అన్నాడు. దాంతో ఖంగుతిన్న వెంకట్, ‘‘మాకేం అవసరం? అయినా మేమేమీ ఎవరి సొమ్మూ అన్యాయంగా పడేసుకోలేదు. కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. పైగా కొంతమందికి ఉద్యోగాలిచ్చే అన్నం పెడుతున్నాం’’అన్నాడు ‘కొంతమంది‘ అన్న పదం నొక్కి పలుకుతూ. దానికి శివ ‘‘అయ్యా, వెంకటరమణ గారు, వంద వ్యాపకాల్లో మీరు గతం మర్చిపోవచ్చు. కానీ నాకున్న వంద సమస్యలకీ డబ్బే కారణమైనప్పుడల్లా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. నా చిన్నప్పుడు నేను క్లాస్ ఫస్ట్. రైల్వేలో డ్రైవర్ అవ్వాలన్నది నా కల. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కూడా నేనే టాపర్. సెకండ్ ఇయర్లో ఉండగా మా నాన్న మందెక్కువయ్యో, వయసైపోయో చావలేదు. దోమ కుట్టి సెరిబ్రల్ మలేరియా వచ్చి, సరైన సమయంలో వైద్యం అందక, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి డబ్బు లేక చచ్చిపోయాడు. నా కుటుంబ భారాన్ని మొయ్యడానికి నేను చదువు మానేసి ఇలా కారు డ్రైవర్‌గా చేరవలసి వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే దోమలు మా ఇంట్లోనే ఎందుకుంటాయి? అప్పటివరకు లెఖ్ఖల్లో నూటికి ఇరవైకి మించని మీకు పదో తరగతి ఫైనల్ పరీక్షలో ముప్పై మార్కులు ఎలా వచ్చాయి? మాస్టారు చెప్పారని నేను రోజూ స్కూల్ అయిపోయాక ఓ గంట కూర్చుని మీకు అర్ధం అయ్యేలా చెబితేనే కదా. ఆ సంవత్సరం ఐదు మార్కులు మోడరేషన్ ఇవ్వటం వల్ల కదా మీరు టెన్త్ పాసై గవర్నమెంట్ ఉద్యోగంలో చేరేరు. అదే ఉద్యోగం టెన్త్ డెబ్బై ఐదు శాతం మార్కులతో పాస్ అయిన నాకొచ్చిండుంటే మీ వ్యాపారంతో మీరు, మీ అంత కాకపోయినా, ఏదో నేను, నా కుటుంబం కూడా హాయిగా గడిపేవాళ్ళం కదా?’’ అంటూ ఉండగా...వెంకట్ మధ్యలో ‘‘అందుకే కదా, నీకు పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఊరంతా డ్రైవర్లకి నెలకి ఎనిమిది వేలకంటే ఎక్కువ ఇవ్వట్లేదు. నేను మాత్రం నీకు పదివేలిస్తున్నా. పైగా రోజూ ఎంతో కొంత బేటా ఇస్తున్నా. నా ఆస్తిలో వాటా రాసి ఇవ్వలేను, నీ అప్పులు, నీ బాధలు తీరుస్తూ పోలేను కదా.’’ అన్నాడు. శివ మౌనంగా ఉండిపోయాడు. దాంతో వెంకట్ ఇంకొంచెం కఠినంగా ‘‘ఎవరో అన్నట్టు నీ ఆకలి మాత్రమే తీరి అవసరాలు తీరకపోతేనే కదా నువ్వు రేపు పన్లోకోస్తావు. ఇందులో నా మీద పడి ఏడవటానికేముంది?’’ అన్నాడు. దానికి శివ ‘‘అయ్యా, ఒకడి కంచానికి మించినదేదైనా పక్కవాణ్ణి పస్తుంచేదే’’ అని కూడా అన్నారు. ‘‘అది మీకు తెలియదా?’’ అన్నాడు అంతే ఆవేశంగా. కారు స్టీల్ ప్లాంట్ లోంచి వీళ్ళ ఆర్గుమెంట్లా కాకుండా సాఫీగా పోతోంది. ప్రగతీ–పచ్చదనం సవతుల్లా కాకుండా అక్కాచెల్లెళ్లలా సఖ్యతగా కూడా ఉండొచ్చని స్టీల్ ప్లాంట్‌లో అటూ ఇటూ దట్టంగా పరుచుకున్న చెట్లు నిరూపిస్తున్నాయి. కాసేపు మౌనం తర్వాత శివ నెమ్మదిగా అన్నాడు. ‘‘అరిటాకు చిరగడానికి ముల్లే అవసరం లేదు. చుట్టూ ఉన్న గాలి చాలు. అలాగే మేం కిందా మీదా ఐపోడానికి కొండంత కష్టాలే రానఖ్ఖర్లేదు. నెలకొకరికి జ్వరం, మూణ్ణెల్లకో పండగ, ఏటా పెరిగే స్కూల్ ఫీజులు చాలు. మాలాంటివాళ్ళకి పదిరూపాయలకి తక్కువ వడ్డీకి ఎక్కడా అప్పు పుట్టదు. బ్యాంకుల్లో అడుగుదామంటే తాకట్టు పెట్టడానికి మా దగ్గర మెట్టెలు, మట్టుగిన్నెల కంటే విలువైనవేవీ ఉండవు. ఎవరికైనా వడ్డీ లేకుండా అప్పిస్తే అది సాయం. రూపాయి వడ్డీకి అప్పిస్తే అది న్యాయం. అదే పదిరూపాయల వడ్డీ కిస్తే అది....గాయం. అది ఎప్పటికీ మానదు, మమ్మల్ని మనఃశాంతిగా బతకనివ్వదు. ‘‘మీకు గుర్తుందో లేదో. మా మావయ్యకి రెండెకరాల పొలం ఉండేది. వచ్చిన పంటతో తన కుటుంబం గడిచిపోయేది. మేనల్లుడు–అల్లుడు అన్న అభిమానంతో ఏదో మాకూ ఇంత పంటబియ్యం ఇచ్చేవాడు. కరువొచ్చో, కట్నం చాల్లేదని రెండో కూతురు తిరిగొచ్చో, ఆ పొలాన్ని మీకు అమ్మేశాడు. మీరు దాన్ని ఓ ఏడాదిలో మూడు రెట్లకి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మేసారు. వాళ్ళు సెంట్లు లెక్కన కొన్న పంట భూమిని గజాల్లెఖ్ఖన లే అవుట్ వేసి అమ్మేసారు. ఇది జరిగి పదిహేనేళ్ళయ్యింది. ఇప్పటికీ ఆ లేఅవుట్ తుప్పలు, పొదలతో అలాగే ఉంది. మా మావగారిప్పుడు అందులో నెలకి ఆరువేల జీతానికి వాచ్‌మాన్‌గా పనిచేస్తున్నాడు. వ్యవసాయం చేస్తే ఏడాదికి రెండెకరాలమీద డెబ్భైరెండు వేలెక్కడొస్తోంది? ఇప్పుడే నయం కదా! అంటే మేమేం చెప్పాలి?’’ ‘‘సర్, వందనోటు మీద అందరికీ ఒకటే ప్రామిస్ ఉంటుంది. కానీ దాని విలువ ఉన్నవాడికి పది, లేనివాడికి పెన్నిధి. నిన్నటి రోజు అదే పదివేలు లేక నా కొడుకు ఎండలో కాళ్ళు కాలిపోతూ క్లాస్ బయట నించున్నాడు. మీ కొడుకు పార్టీ చేసుకున్నాడు. నేను రోజుకి పద్దెనిమిది గంటలు మీ సేవలోనే ఉంటున్నాను కానీ నా కొడుకుని కనీసం పద్దెనిమిదేళ్ళు వచ్చేవరకైనా చదివించలేకపోతున్నాను. మనిషన్న ప్రతీవాడూ మంచిరోజులు వస్తాయని ఆశపడతాడు. నా విషయంలో మాత్రం అవి కనీసం ఎండలో రోడ్డుమీద దూరంగా కనిపించే మరీచికలా కూడా కనబడ్డం లేదు. ఇందులో నా తప్పెంత ?’’ అన్నాడు శివ ఆవేశంగా. ‘‘నా తప్పు కూడా లేదు కదా శివా?’’ ఈసారి కొంచెం సాంతంగా అడిగాడు వెంకట్. కారు గోకివాడ –కొత్తూరు మధ్యలో ఉన్న బ్రిడ్జి చేరుకుంది. వర్షాలు బాగా పడ్డం వల్ల క్రింద ఏరు వాదనవల్ల ఎరుపెక్కిన వాళ్ళ మొహల్లా ఎర్రగా పారుతోంది. చుట్టూ పంట పొలాలు ఏదో ఆపాలన్నట్టు అడ్డంగా తలలూపుతున్నాయి. శివ ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకున్నాడు. ‘‘సర్, తలరాత వల్లో, తెలివితేటలవల్లో తారతమ్యాలు తప్పవనిపిస్తే, అది ‘బాగున్నవాడు–బాగానే ఉన్నవాడు’ లా ఉండాలి కానీ ‘బాగా ఉన్నవాడు–బాధల్లో ఉన్నవాడు’లా ఉంటే సమాజం సమతుల్యతకే ప్రమాదం’’ అంటూ పద్మజ కేసి తిరిగి ‘‘క్షమించండమ్మా’’ అని, తన డోర్ కొద్దిగా తెరిచి ఒక్కసారిగా కారు స్టీరింగ్ పూర్తిగా ఎడమవైపుకు తిప్పేసాడు. అంతే, కారు బ్రిడ్జికున్న పాత రైలింగ్ని గుద్దుకుని అదే వేగంతో గాల్లోకి లేచి నలభై అడుగుల ఎత్తునుండి చెరువులో పడింది. ముందుగా వెంకట్ తల కారు సీలింగ్‌కి గుద్దుకుని మెడ విరిగింది. ఆ తర్వాత గాల్లో ఉండగానే ఆ హఠాత్పరిణామానికి గుండె వేగం పెరిగింది. శివ అప్పటికే కారు డోర్ తీసుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరి పారిపోయాడు. వెంకట్‌కు ఊపిరి అందటం కష్టంగా ఉంది. ∙∙ ‘‘ఏవండీ..లేవండి..అన్నవరం వచ్చేసింది. ఏమిటా మొద్దు నిద్ర ..ఏవండీ మిమ్మల్నే ....’’ వెంకట్‌ని తట్టి లేపుతోంది పద్మజ. ఉలిక్కిపడి లేచాడు వెంకట్. జుట్టంతా చెదిరిపోయింది. కార్లో ఏ.సి ఉన్నా వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మెడ పట్టేసింది. నోట్లోంచి కారిన చొంగ కర్చీఫ్‌తో తుడుచుకుని, బాటిల్లో నీళ్ళు ఒంపి మొహం కడుక్కున్నాడు, దువ్వెన తీసి తల దువ్వుకున్నాడు. చెప్పులు కార్లోనే వదిలేసి ఇద్దరూ నెమ్మదిగా మెట్లెక్కి గుళ్ళోకెళ్లారు. శివ కొంచెం దూరంగా వాళ్ళని అనుసరించాడు. వెంకట్ గుళ్ళో ఉన్నంత సేపూ ఏమీ మాట్లాడలేదు. దర్శనం అయి, బయటికొచ్చాక ఇద్దరూ గట్టు మీద కూర్చుని గోధుమనూక ప్రసాదం తింటున్నారు. దూరంగా శివ కారు దగ్గర నించున్నాడు. వెంకట్ భార్యనడిగాడు. ‘‘పద్మా, కార్లో శివ ఏదైనా మాట్లాడాడా?’’ దానికి పద్మజ నవ్వి ‘‘శివ ఎప్పుడైనా మాట్లాడ్డం చూసారా? అతని గురించి మీకు తెలీదా? అయినా గుడికెళ్తూ మరీ అంత మొద్దు నిద్రేమిటండీ. కారు బయలుదేరగానే పడుకుని, లేపేవరకూ లేవకపోవడం మీకే చెల్లింది’’ అంటూ విసుక్కుంది. తనకొచ్చిన కలగురించి భార్యకి చెప్పాడు వెంకట్. ‘‘దేవుడి గుడికెళ్తూ ఉంటే ఇలాంటి కల ఎందుకొచ్చింది. మనకొచ్చే ప్రతీ కల వెనుక ఓ అర్ధం ఉంటుందంటారు. నా కలకర్ధమేంటి?’’ తనలో తను గొణుక్కుంటున్నాడు. పద్మజ అతని చేతిమీద చెయ్యేసి, ‘‘ఏమండీ, చంద్రుడిలో కుందేలూ ఉండదు, మచ్చా ఉండదు. మనం మనసులో ఏదనుకుని చూస్తే అదే కనబడుతుంది. ‘యథా దృష్టి –తథా సృష్టి’ అంటే ఇదే. మీకొచ్చిన కలని బట్టి మీరేదో అంతర్మథనానికి గురవుతున్నారనిపిస్తోంది. మీలో మెటీరియలిస్ట్ అతన్ని దూరం పెట్టమంటోంది. మీ మనసు మాత్రం అతని తరపున మీతో యుద్ధం చేస్తోంది. సొరంగం నుంచి సమాజానికి ఎదిగిన క్రమం మనిషిని ఇనప్పెట్టెలా కాపాడాలి తప్ప ఇన్సెక్యూరిటీ ఇవ్వకూడదు. అతనికి సాయం చెయ్యాలినీ ఉంది. అతను చెయ్యి చాచి అడగటం లేదని అహం అడ్డొస్తోంది. మీకు చెయ్యాలనిపిస్తే మనస్ఫూర్తిగా సాయం చెయ్యండి. లేదా, అతని గురించి పట్టించుకోకండి. అంతే కానీ ఇలా అదే ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి’’ అంది నవ్వుతూ. వెంకట్ మౌనంగా కూర్చున్నాడు. కొండమీదనించి చూస్తే పంపానది పరిపూర్ణతకి పర్యాయపదంలా ఉంది. ప్రపంచంలో ఏ రెండు వాచీలు ఒక టైం చూపని సాంకేతికతని సౌర గడియారం పరిహసిస్తోంది. రిటర్న్‌లో కారెక్కి శివ కేసి చూసాడు వెంకట్. అతను అభావంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరయ్యింది. పక్షులన్నీ గూటికెళ్లే హడావిడిలో ఉన్నాయి. పద్మజ కార్లోంచి బ్యాగ్ తీసి ఓ రెండు ప్రసాదం పొట్లాలు శివకిచ్చి థాంక్స్ చెప్పి లిఫ్ట్‌లో పైకెళ్లిపోయింది. శివ వెంకట్ ఆదేశాల కోసం నిలబడ్డాడు. వెంకట్ జేబులోంచి వంద తీసి మళ్ళీ లోపల పెట్టి, పర్స్ లోంచి అయిదొందలు తీసిచ్చి ‘‘శివా రేపట్నుంచి నువ్వు రానవసరం లేదు’’ అన్నాడు. ఎప్పటిలాగానే శివ అభావంగా తాళాలు అప్పజెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. ∙∙ ‘‘రా శివా రా రా. ఏంటి ఉదయాన్నే వచ్చావు’’ తలుపు తీస్తూ అడిగాడు వెంకట్. చేతిలో ఉన్న స్వీట్ ప్యాకెట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి నించున్నాడు శివ. ఇంతలో వంటింట్లోంచి పద్మజ వచ్చింది. వెంకట్ సోఫాలో కూర్చుని శివని కూర్చోమని సైగ చేసాడు. ఎదురుగా ఉన్న సోఫాలో బాగా ముందుకు కూర్చుని, నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు శివ. ‘‘సర్, ఆరోజు మీరు రేపట్నుంచి రావొద్దు అన్నప్పుడు ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. కానీ ఆ మర్నాడు నన్ను బ్యాంకుకి తీసుకెళ్ళి, షూరిటీ ఇచ్చి నా చేత టాక్సీ కొనిపించి నన్ను, నా కుటుంబాన్నీ నిలబెట్టారు. మీదయవల్ల, నా భార్య బిడ్డల అదృష్టం వల్ల, ఆ అప్పు తీరిపోయి ఇప్పుడు మొత్తం మూడు టాక్సీలు తిప్పుతున్నాను. మరో ఇద్దరు డ్రైవర్లకు ఏదో నావంతు సాయం చెయ్యగలుగుతున్నాను. ఇదంతా మీ పుణ్యమే సర్’’ అన్నాడు వినయంగా. ‘‘నాదేముంది శివా, నువ్వు నాకు తెలుసు అన్న ఓ చిన్న సంతకం అంతే. కష్టమంతా నీదే. అబ్బాయి ఏం చేస్తున్నాడు?’’ ‘‘వాడు ప్రస్తుతం ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సర్. ఎప్పుడు అవసరమైనా కాల్ చెయ్యండి. నేను కానీ మా అబ్బాయి కానీ ఎవరో ఒకరు వస్తాము. ఉంటాను సర్, ఉంటానమ్మా..’’ అంటూ లేచి వెళ్ళబోయాడు శివ. ఇంతలో బెడ్ రూమ్ లోంచి ఫోన్ మాట్లాడుతూ హాల్లోకొచ్చిన వెంకట్ కొడుకు ఫోన్లో ఎవరికో ‘‘హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే రా ..’’ అంటూ శివని ‘హాయ్ అంకుల్’ అని పలకరించి బాల్కనీ లోకి వెళ్ళిపోయాడు. వెంకటరమణ, శివ కూడా ఒకరికొకరు ‘హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే’ చెప్పుకుని, పద్మజ తెచ్చిన కాఫీ తాగుతూ, కాసేపు బాల్యంలోకి వెళ్లిపోయారు. - ఉమా మహేష్ ఆచాళ్ళ -
ఒకవేళ నువ్వు దొరికి నా పేరు చెబితే ?
ఆనంద్ పనిచేసే కంపెనీకి రెండే రెండు బ్రాంచీలున్నాయి.. ఒకటి హైదరాబాద్‌లో, ఇంకొకటి విజయవాడలో. సొంత ఊరికి దగ్గరని పట్టుబట్టి విజయవాడ బ్రాంచీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సొంత ఊరికి దగ్గరనే కాదు కానీ, నిజానికి హైదరాబాద్ అంటే ఆనంద్‌కు ఎందుకో పిచ్చి భయం. అది ఆనంద్‌కు సొంతంగా వచ్చింది కాదు. వాళ్ల నాన్న ఓసారి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రోడ్డుపైనే ఒక మర్డర్ చూశాడట. విజయవాడలో అలాంటివేం జరగక కాదు, కళ్లారా చూడటంతో ఎందుకో ఆయనకు హైదరాబాద్ అంటే భయం పట్టుకుంది. అందుకే ఏదో తప్పనిసరైతే తప్ప హైదరాబాద్‌కి వచ్చేవాడు కాదు. ఆనంద్‌ని పంపడమూ ఆయనకెప్పుడూ ఇష్టం లేదు. కానీ ఈసారి తప్పక వెళ్లాల్సిందేనని నాన్నతో చెప్పాడు ఆనంద్. చేసేదేంలేక పంపించాడు. మనవాడేమో ఒట్టి అమాయకుడు. హైదరాబాద్ బ్రాంచీకి వచ్చిన పని అయిపోయేసరికి రాత్రయ్యింది. ఇంత రాత్రి తిరిగి విజయవాడ వెళ్లడం సేఫా కాదా అని ఆలోచిస్తున్నాడు ఆనంద్. పైగా రాత్రుళ్లు ప్రయాణమంటే ఆనంద్కి చచ్చేంత భయం. చేతిలో ఆరు లక్షల రూపాయల డబ్బు ఉంది. ఎలా వెళ్లాలి? పోనీ హైదరాబాద్‌లోనే ఉండిపోతే? ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. పక్కనే ఉన్న హోటల్లో దూరి టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే నాన్న నుంచి ఫోనొచ్చింది – ‘‘ఏరా, బస్సెక్కావా?’’ అని. ‘‘లేదు నాన్నా. ఇక్కడ పని వల్ల లేటైంది. మీకు తెలుసుగా, రాత్రుళ్ళు ప్రయాణం అంటే నాకు పడదని. నేను ఉదయాన్నే వస్తాను’’ అన్నాడు మెల్లగా. ‘‘వెధవ, ఏం భయమ్రా నీకు? అక్కడ ఎవరి దగ్గర ఉంటావు? దొంగలు ఉంటారు. ఇప్పుడేం చేద్దామని?’’ ‘‘ఏదైనా హోటల్లో ఉంటా’’ ‘‘హోటాల్లోనా? వద్దురా నాయనా. పోలీసులు వస్తారంట’’ ‘‘నేను ఒక్కడినే ఉంటే పోలీసులు ఎందుకు వస్తారు నాన్నా? నన్నేం అంటారు?’’ ‘‘నీ దగ్గర ఆఫీస్ డబ్బు ఉంది. కాబట్టి ఏదైనా చేస్తారేమో’’ ‘‘అబ్బా నాన్నా. నేను ఏదో ఒకటి చేస్తా. కాసేపు ఆగి ఫోన్ చేస్తాలే’’ అని విసుగ్గా ఫోన్ పెట్టేశాడు ఆనంద్. ఎవరితో మాట్లాడదామన్నా అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. ఆనంద్కేమో హిందీ ఒక్క ముక్క అర్థం కాదు. ఎవరైనా ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. అలా అనుకుంటుండగానే ఫేస్బుక్ మెసెంజర్లో బసవ అనే ఫ్రెండ్ దగ్గర్నుంచి ‘హాయ్’ అనే మెసేజ్ వచ్చింది. ఆనంద్ రిప్లై ఇచ్చాడు. కాసేపట్లో ఆనంద్‌తో మాట కలిపి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు బసవ. ‘‘హాయ్రా బుద్దిమంతుడా.. ఏం పని మీద వచ్చావు?’’ అని గంభీరమైన గొంతుతో ఎగతాళి చేస్తూ అడిగాడు బసవ. ‘‘చిన్న పని ఉంటే వచ్చా. లేటైంది. ఉదయన్నే వెళ్లిపోవాలి. చేతిలో డబ్బు ఉంది. ఎక్కడ ఉండాలో తెలియట్లేదు’’ అని కాస్త కంగారుగా చెప్పాడు ఆనంద్. ‘‘ఓ ఇంతేనా. సరే నువ్వు ఉన్న లోకేషన్ పంపు నేను వస్తా. మా రూమ్‌లో పడుకుని ఉదయాన్నే వెళ్లిపోదువు’’ తప్పని పరిస్థితుల్లో ఆనంద్ సరే అన్నాడు. ఇంతలో ఆనంద్‌కు వాళ్ల నాన్న దగ్గర్నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. ‘‘ఏమైందిరా ? ఎట్లా వస్తావు ?’’ ‘‘అయ్యో నాన్నా, మీరు నన్ను కంగారు పెట్టకండి. నా టెన్త్ ఫ్రెండ్ బసవ ఇక్కడే ఉంటున్నాడంటా. వాడి రూమ్‌లో ఉండి ఉదయన్నే వస్తా’’ ‘‘నీకు మైండ్ పని చేస్తుందా? అసలే వాడు చిన్నప్పుడు పెద్ద దొంగ. ఓసారి మన తోటలో పండ్లు దొంగతనం చేశాడని తిడితే నన్ను రాయి తీసుకుని కొట్టాడు మర్చిపోయావా? నువ్వు పోయి పోయి వాడి దగ్గరే ఉంటున్నావా? వాడు చిన్నప్పుడే అలా ఉంటే ఇంక హైదరాబాద్‌లో ఎంత పెద్ద రౌడీ అయ్యి ఉంటాడు! వద్దురా బాబు, వాడి దగ్గర అస్సలు ఉండకు’’ ఆనంద్ తండ్రి భయం భయంగా చెప్పాడు. ఆనంద్కి వాళ్ల నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి చెమటలు పట్టాయి. ఇంతలో వెనకాల నుంచి ఓ బైక్ శబ్దం వినిపించింది. వచ్చింది బసవే. ఆనంద్ ఫోన్ కట్ చేశాడు. బసవ బైక్ దిగి ఆనంద్‌కు దగ్గరగా వచ్చి హత్తుకుని ‘‘ఎలా ఉన్నావురా?’’ అని అడిగాడు. ఆనంద్ తల ఊపుతూ ‘‘ఈ టైంలో నాకు ఎందుకు మెసేజ్ చేయాలనిపించింది?’’ అమాయకంగా అడిగాడు. ‘‘అరేయ్, ఫేస్బుక్ లో ‘నియర్ బై’ అని చూపించింది. అరె ఆనంద్గాడు హైదరాబాద్‌లో ఉన్నాడా అనుకొని మెసేజ్ చేశా. అయినా ఏమైంద్రా, చెమటలు పడుతున్నాయి. సరే ముందైతే రూమ్‌లో ఫ్రెషప్ అయి ఏదైనా తిని పడుకుందువు. ఆ బ్యాగ్ నాకు ఇవ్వు, ముందు పెట్టుకుంటాను’’ అని బసవ నెమ్మదిగా మాట్లాడాడు. ‘‘పర్లేదురా, నేను వేసుకుంటాను’’ అన్నాడు ఆనంద్ అయోమయంగానే. బసవ రూమ్ వచ్చింది. ఆనంద్ ఒంట్లో ఇంకా భయం తగ్గలేదు. ఉదయం నుంచి ఆఫీస్ పని మీదా ఆటు ఇటు తిరిగి బాగా అలిసిపోయాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. రూమంతా నీటుగా ఉంది. అలా సోఫాలో కూర్చున్నాడు ఆనంద్. ఇంతలో బసవకు ఫోన్ వచ్చింది. పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. ‘‘నువ్వు నన్ను చంపడం కాదే. నేను తల్చుకుంటే నిన్ను చంపిపడేస్తా. నా గురించి నీకు తెలియదు’’ అంటూ అరుస్తున్నాడు. ఈ ఆరుపులు వినేసరికి ఆనంద్‌కు భయం ఎక్కువైంది. వాళ్ల నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆనంద్ లిఫ్ట్ చేద్దాం అనుకునేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతలో బసవ వచ్చాడు. ‘‘ఏమైంది బసవా? ఎందుకు అలా అరుస్తున్నావు? చంపుతా అంటున్నావు?’’ అని భయంగా అడిగాడు ఆనంద్. బసవ తన గర్ల్ ఫ్రెండ్ షాలిని ఫోటో చూపిస్తూ ‘‘దీన్ని చంపాలన్నంత కోపం తెప్పిస్తోంది.ఏదో ఒక రోజు దాని సంగతి ఖతం అవుతుందిలే కానీ, నువ్వు ఫ్రెషప్ అయి ఉండు, ఏదైనా తినడానికి పట్టుకొస్తా’’ అని లేచాడు బసవ. ‘‘లేదులే, నాకు ఆకలిగా లేదు. నాకేం వద్దు ఇప్పుడు’’ అన్నాడు ఆనంద్ భయంగానే. ‘‘అర్రె, రూమ్‌కి వచ్చి తినకుండా ఎలా ఉంటావు? తీసుకొస్తానుండు. హైదరాబాద్‌లో ఏ టైంలో అయినా ఫుడ్ దొరుకుతుంది’’ ‘‘ఇంత నైట్ ఎందుకులే బసవ. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్ తింటా’’ ‘‘లేదు మామా నువ్విప్పుడు తినాల్సిందే. నేను వెంటనే వస్తా. నువ్వు కాసేపు అలా పడుకో, వచ్చి లేపుతా’’ అని బసవ బయటకు వెళ్లాడు. పారిపోదామని ఆనంద్ డోర్ దగ్గరకు వెళ్లాడు. కానీ బసవ బయట్నించి లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. ఆనంద్ కంగారుగా అటు ఇటు తిరిగాడు. ఫోన్ చార్జింగ్ పెట్టి..తల కింద డబ్బులు ఉన్న బ్యాగ్ పెట్టుకుని సోఫాలో నడుము ఒంపి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ∙∙ అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపించి ఆనంద్ వెంటనే లేచి చూశాడు. ఏదో భయంకరమైన ఏడుపు వినిపించింది. ముందు తన బ్యాగ్ ఉందా లేదా అని చూసుకున్నాడు. ఫోన్ దగ్గరకు వెళ్లాడు. చార్జింగ్ పెట్టాడు కానీ స్విచ్ వేయలేదు. ఫోన్ జెబులో పెట్టుకుని డోర్ దగ్గరకు వెళ్తుండగా పక్క రూమ్‌లో బసవ గట్టిగా ఏడుస్తూ కనిపించాడు. ఆనంద్ ఒళ్ళు వణికింది. నెమ్మదిగా ముందుకు వెళ్తూ.. ‘‘బసవ.. బసవ.. ఏమైంద్రా, ఎందుకు ఏడుస్తున్నావ్?’’ అని అడిగాడు. ‘‘తప్పు చేశాను మామా. చాలా పెద్ద తప్పు చేశాను’’ అంటూ ఆనంద్ వైపు తిరిగాడు బసవ. బసవ ముఖం చూడగానే ఆనంద్‌కు గుండె ఆగినంత పనైంది. వెన్నులో వణుకు పుట్టింది. కాళ్లు చేతులు గజగజ వణుకుతున్నాయి. ‘‘ఏమైంది బసవా? ముఖానికి ఆ రక్తం ఏంటి?’’ ‘‘షాలినిని చంపేశానురా’’ అని మళ్లీ ఏడ్చాడు. ఆనంద్‌కు బసవ ఏమంటున్నాడో అర్థం కాలేదు. గజగజ వణుకుతూ.. ‘‘ఎందుకు చంపావురా?’’ అని ఓ అడుగు వెనక్కి వేస్తూ అడిగాడు. కాస్త ముందుకు నడిచిన బసవ.. గోడకు తలను గట్టిగా కొట్టుకున్నాడు. జేబులో ఉన్న సిగరెట్ బయటకు తీశాడు. సిగరెట్ కాల్చుతూ.. ‘‘నీకు ఫుడ్ తీసుకొచ్చేందుకు వెళ్లాను కదా. అప్పుడు షాలిని ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మని పిలిచింది. ఏమైందో అని వెళ్లా. వెళ్లగానే బయటకు వచ్చి, ‘గొడవ పడ్డాను కదా, బాధగా అనిపించి నిన్ను చూడాలి అనిపించింది, అందుకే పిలిచా’ అని చెప్పింది. అసలే నీకు ఆకలి అవుతుంది. నీకోసం నేను చాలా చోట్ల వెతికితే ఓ దగ్గర ఫుడ్ దొరికింది. ‘సరేలే చూశావు కదా, ఇక నేను వెళ్తా’ అని చెప్పా షాలినికి. ‘కాసేపు ఉండు, కాసేపు ఉండు’ అని అర్ధగంట ఉంచింది. ‘‘ఫుడ్ చల్లారిపోతుంది. రూమ్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఆకలిగా ఉంది, వెళ్తా’’ అని చెప్పా. ‘ఏంటి, ఊరికే ఫ్రెండ్ ఫ్రెండ్ అని. ఒక్కరోజు తినకుంటే చస్తాడా’ అని నా చేతిలో ఉన్న ఫుడ్ విసిరికొట్టింది. నాకు బీపీ పెరిగి తలమీద ఒక్కటిచ్చా. సరిగ్గా పక్కనే ఉన్న రాయిపై బలంగా పడింది. తలకు గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది’ అని చెబుతూ గట్టిగా ఏడ్చాడు బసవ. బసవ చెప్పింది విన్నాక ‘ఎందుకు వచ్చానురా నాయనా, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, వచ్చి పెద్ద సమస్యలో ఇరుక్కున్నా’ అనుకుంటూ.. ‘‘ఇప్పుడు ఏం చేస్తావురా?’’ అని అదే సన్నటి గొంతుతో వణుకుతూ అడిగాడు ఆనంద్. ‘‘అదే, ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అన్నాడు బసవ. ‘‘మరి షాలిని శవం ఎక్కడ ఉంది?’’ ‘‘అక్కడ ఓ ఆటో అతను చూశాడు. అతని ఆటోలోనే తీసుకొచ్చి రూమ్ వెనకాల తొవ్వి అందులో పాతి పెట్టాను’’ ‘‘వామ్మో.. వామ్మో.. మా నాన్న ముందే చెప్పాడు. నీ దగ్గరికి వెళ్లొద్దని. నేనే అనవసరంగా వచ్చా. ఎందుకు చేశావురా నాకు మేసేజ్? నీను వెళ్లిపోతా.... దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్లిపోతా’’ అని ఆనంద్ భయం భయంగా ముందుకు కదిలాడు. ‘‘అర్రె, ఎక్కడికిరా వెళ్లేది? ఇదంతా చేసింది నీకోసమే’’ ‘‘ఏంటి నా కోసమా?’’ ‘‘నువ్వు రావడం వల్ల నేను ఫుడ్ కోసం బయటికి వెళ్లా. బయటికి వెళ్లా కాబట్టి షాలిని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నీకోసం తెస్తున్న ఫుడ్ తను కింద పడేసింది కాబట్టే షాలినిని కొట్టా. అదే నువ్వు రాకుండా ఉంటే నేను బయటకు వెళ్లేవాడినే కాదు. ఇదంతా జరిగేది కాదు. సో, ఇదంతా చేసింది నీకోసమే కదరా?’’ ‘‘నీకో దండంరా నాయనా. మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేడు. ప్లీజ్ నన్ను వదిలెయ్’’ ‘‘నిన్ను వదిలేసి రేపు పోలీసులు వస్తే నేను ఒక్కడినే జైలుకి పోవాలా?’’ ‘‘అంటే నేను కూడా జైలుకు వెళ్తానా?’’ ‘‘నీకోసమే చేశాను కాబట్టి నువ్వు కూడా వెళ్తావు’’ ‘‘నీకు దండం పెడుతా. నన్ను ఇందులో ఇరికించకు. నన్ను వదిలెయ్ ప్లీజ్’’ ‘‘సరే, ఇందులో ఇద్దరం ఇరుక్కోకుండా ఉండాలంటే నువ్వు ఓ చిన్న పని చేయాలి. నీ బ్యాగ్‌లో ఉన్న ఆరు లక్షలు ఆ ఆటో వాడికి ఇస్తే వాడు ఎక్కడా నోరు విప్పడు. సో... షాలిని గురించి సమస్య రాదు. ఇక తనకి ఎవ్వరూ లేరు. ఫ్రెండ్స్ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. ఓ వారం తర్వాత ఈ ఊరు వదిలి నేను వెళ్లిపోతా. నువ్వు ఎలాగూ మీ ఊరికి వెళ్లిపోతావు. తర్వాత ఇక పోలీసులు కనిపెట్టినా నేను వాళ్లకు దొరకను’’ అన్నాడు బసవ ధీమాగా. ‘‘ఒకవేళ నువ్వు దొరికి నా పేరు చెబితే ? అయినా ఈ డబ్బు ఆఫీస్‌ది, నేను ఇవ్వలేను’’ ‘‘దుబాయ్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడికి వెళ్లిపోతా. ఇక డబ్బు ఈ టైమ్‌లో నువ్వు ఇవ్వకుంటే నిన్ను కూడా చంపి ఆ డబ్బు తీసుకుంటా. సో, నువ్వు మర్యాదగా ఇస్తే మీ ఊరికి వెళ్లిపోతావు. లేదంటే నా చేతిలో చస్తావు. అది కూడా జరగకుంటే జైల్లో ఉంటావు. నాకు ఎలాగో ఈ గొడవలు, జైలు అలవాటే’’ అన్నాడు బసవ బెదిరిస్తున్నట్టే. ‘‘వామ్మో, లేదు లేదు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నన్ను వదిలెయ్’’ ‘‘సరే, ఉదయం ఆరుగంటలకు నిన్ను లేపుతా. నువ్వు వెళ్లిపో. ఇక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పకు. ఎవరికైనా చెప్పావో, అప్పుడు నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. జాగ్రత్త’’ గట్టిగా బెదిరించాడు బసవ. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ అలానే ఆ సోఫాలో ముడ్చుకుని పడుకున్నాడు ఆనంద్. ∙∙ ‘ప్రియురాలిని మర్డర్ చేసిన ప్రియుడు...అతనికి సాయం చేసిన స్నేహితుడు. వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు’ టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ శబ్దం ఆనంద్ చెవిలో పడింది. వెంటనే లేచి.. ‘షాలినిని చంపింది నేను కాదు, నేను కాదు. చంపింది బసవ. నా దగ్గర ఉన్న ఆరు లక్షలు కూడా తీసుకున్నాడు’ అని గట్టిగా అరిచాడు ఆనంద్. ఆనంద్ అరుపులకు వంట గది నుంచి బసవ, షాలిని బయటకు వచ్చారు. వాళ్ళను చూశాక ఆనంద్కి తల తిరిగింది. బ్యాగ్ ఉందో లేదో చూశాడు. ఉంది. డబ్బులు కూడా అలాగే ఉన్నాయి. ఆనంద్ భయపడుతూ.. ‘షాలిని, నువ్వు చనిపోలేదా?’ అనడిగాడు. ‘‘ఆనంద్, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు. షాలిని చనిపోవడం ఏంటి?’’ అని బసవ కాస్త నెమ్మదిగా ఆడిగాడు. కాసేపు ఆలోచించిన ఆనంద్..తాను కల కన్నానని మతికి తెచ్చుకుని నైట్ తన కల్లోకి వచ్చిందంతా బసవకు చెప్పాడు. అది విని బసవ, షాలిని తెగ నవ్వుకున్నారు. షాలిని అయితే కిందపడీ మరీ నవ్వేసింది. ‘‘అది కాదురా, నువ్వు చిన్నప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకా రౌడీ అయ్యి ఉంటావని మా నాన్న నా తల తిన్నాడు. నేను ఆ భయంతోనే పడుకున్నా. అందుకే ఇలాంటి కల వచ్చిందేమో’’ అన్నాడు ఆనంద్. ‘‘ఒరెయ్ చిన్నప్పుడు జరిగిన దాన్ని మనసులో పెట్టుకుంటే ఎలా? నేను ఇప్పుడు చాలా బుద్దిగా ఉంటున్నా. నైట్ పుడ్ దొరకలేదు. ఇక నిన్ను లేపడం ఎందుకని నేను అలానే పడుకున్నా. నీకు షాలినిని పరిచయం చేద్దామని ఉదయాన్నే పిలిపించా. నేనే నీకు షాక్ ఇద్దామంటే, నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు’’ అని మళ్లీ అందరూ గట్టిగా నవ్వుకున్నారు. -రమేశ్ రాపోలు -
మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష
మ్యాడిసన్ సర్కిల్లో ఒక బెంచీ మీద కూర్చున్న సోపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చలి కాలం దగ్గరపడుతోంది. అయితే ఈ ఎముకలు కొరికే చలి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. మూడునెలలు ద్వీపాంతరవాస జైల్లో ఉండే అవకాశం దొరకాలని అతను ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా చలికాలంలో ఆ ద్వీపమే అతనికి ఆశ్రయమిచ్చింది. చలికాలం వచ్చిందంటే న్యూయార్క్‌లోని ధనవంతులు పామ్ బీచ్‌కో, రివేరాకో టికెట్ కొనుక్కుంటారు. అదే విధంగా సోపి చలికాలం రాగానే ఆ ద్వీపానికి వెళ్ళడానికి తనదైన ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది. గతరాత్రి ఆ పురాతన సర్కిల్లోని ఫౌంటెన్ పక్కన తన మామూలు బెంచీ మీద అతను పడుకున్నాడు. కింద రెండు వార్తపత్రికలు పరుచుకున్నాడు. పైన రెండు పత్రికలు కప్పుకున్నాడు. అయినా చలికి తట్టుకోలేకపోయాడు. ఆ కారణంగా ఇప్పుడు సోపి మనస్సంతా ఆ ద్వీపమే బృహదాకారంలో ఆక్రమించుకుంది. నగరంలో ఆశ్రయం పొందేవారి కోసం మతధర్మాల పేరిట చేసే ఏర్పాట్ల పట్ల అతనికి వ్యతిరేకత ఉంది. సోపి అభిప్రాయం ప్రకారం ఈ లోకోపకార కార్యాలకన్నా చట్టమే అధిక కరుణామయి. ఆ ఊళ్ళో ఉన్న కార్పొరేషన్ వాళ్ళు, ధర్మసంస్థల వాళ్ళు నిర్మించిన ధర్మసత్రాలు ఉన్నాయి. అక్కడికి అతను వెళితే చాలు. ఉండటానికి చోటు దొరుకుతుంది. తినటానికి భోజనం దొరుకుతుంది. అక్కడ అతను జీవితాన్ని సాఫీగా గడపవచ్చు. అయితే ఇలా దానం కోసం చేయి చాపటానికి సోపి మనస్సు అంగీకరించేది కాదు. నిజానికి దాతలు సమకూర్చే సౌలభ్యాలకు అతను రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అయినా దాన్ని స్వీకరించే సమయంలో మనస్సులో ఏర్పడే దైన్యం? ఆ విషయాన్ని అతను ఊహించలేకపోయేవాడు. ఊహించి భరించలేకపోయాడు. దానికన్నా చట్టానికి అతిథి కావటమే ఉత్తమమని సోపి అనుకున్నాడు. అక్కడ అన్నీ వ్యవహారాలు నియమాలకు అనుగుణంగా నడుస్తున్నప్పటికీ, గత జీవితంలో అకారణంగా ఎవరూ తలదూర్చరు. ద్వీపానికి వెళ్ళాలని సోపి నిర్ణయం తీసుకుంటుండగానే దాన్ని సాధించటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సంతోషాన్ని కలిగించే మార్గం ఖరీదైన హోటలుకు వెళ్ళి పొట్టపగుల తినటం, తరువాత చేతులు పైకెత్తి డబ్బులు లేవని ఒప్పుకోవటం. వెంటనే వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా పోలీసులకు అప్పగిస్తారు. తన పని అనుకూలం చేయడానికి సిద్ధంగా ఉండే న్యాయాధికారి తను ఆశించిన పనిని పూర్తి చేస్తారు. సోపి తన బెంచీ మీది నుంచి పైకి లేచి సర్కిల్ దాటి ముందుకు సాగాడు. బ్రాడ్ వే, అయిదవ రోడ్డు కలిసే స్థలంలో కిక్కిరిసిన వాహనాల సందడి. అతను బ్రాడ్ వే వైపు తిరిగి ధగధగమని మెరుస్తున్న ఓ హోటల్ ముందు నుంచున్నాడు. సోపి చక్కటి వేస్ట్ కోట్ వేసుకున్నాడు. దాని కింది బొత్తం నుంచి పైవరకూ ఉన్న దుస్తుల పట్ల ఆత్మవిశ్వాసం ఉంది. గడ్డం నున్నగా గీసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా హోటల్లోకి ప్రవేశించి ఒక టేబుల్ పట్టుకుంటే చాలు. అతను గెలిచినట్టే. టేబుల్ పై భాగంలో కనిపించే అతన్ని చూస్తే వెయిటరుకు అనుమానం కలగటానికి అవకాశమే లేదు. బాగా కాల్చిన మల్లార్డ్ బాతును, ఒక బాటిల్ చబ్లీసును ఆర్డర్ చేయాలి. అటు తరువాత కేంబర్టుకు చెప్పి ఒక సిగార్ ఆర్డర్ చేయాలి. సిగార్ ఒక డాలర్ ఖరీదు చేయవచ్చు. మొత్తం బిల్లు దుబారా కాకపోవటం వల్ల హోటల్ వాళ్ళు ప్రతీకార మనోభావాన్ని ప్రదర్శించరు. ఎలాగూ బాతు మాంసం తిని కడుపు నిండిపోతుంది. సంతోషంతో చలికాలపు ఆశ్రయం కోసం ప్రయాణం సాగించవచ్చు. అయితే సోపి హోటల్ గుమ్మంలో కాలుపెడుతుండగా సూపర్వైజర్ కళ్ళు అతడి వదులు ట్రౌజర్, అధ్వాన్న స్థితిలో ఉన్న బూట్లమీద పడ్టాయి. వెంటనే బలిష్ఠమైన చేతులు అతడిని సద్దులేకుండా అవలీలగా వీధిలోకి విసిరేశాయి. ఇలా మల్లార్డ్ బాతు మాంసం తినే అవకాశం తప్పిపోయింది. సోపి బ్రాడ్ వే వదిలి ముందుకు పోయాడు. అతనికి ద్వీపానికి వెళ్ళే మార్గం అంత సులభంగా కనిపించలేదు. దాన్ని ప్రవేశించడానికి మరో ఉపాయం వెతకాలని అనుకున్నాడు. ఆరవ రోడ్డు మలుపులో ఒక దుకాణం కనిపించింది. విద్యుద్దీపాల అలంకరణతో ధగధగ మెరిసిపోతోంది. కిటికీ అద్దాల వెనుక నానా రకా సామాన్లు చక్కగా, అత్యంత ఆకర్షణీయంగా అమర్చి పెట్టారు. సోపి బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఒక రాయి తీసుకుని ఆ కిటికీ వైపు విసిరాడు. మరుక్షణం భళ్ళుమంటూ కిటికీ అద్దం పగిలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల జనం వచ్చి గుమిగూడారు. జనంతో పాటు ఒక పోలీస్ కూడా వచ్చాడు. సోపి తన జేబులో చేయి పెట్టుకుని చిన్నగా నవ్వుతూ మౌనంగా నుంచున్నాడు. ‘‘రాయి విసిరినవాడు ఎటువైపు వెళ్ళాడు?’’ అని పోలీస్ అడిగాడు. ‘‘ఎందుకు, నేనే అలా చేసివుండొచ్చని మీకు అనిపింలేదా?’’ అన్నాడు సోపి. అతని స్వరంలో వ్యంగ్యం లేదు. కేవలం అదృష్టదేవతను ఆహ్వానించే స్నేహపూర్వకమైన ధ్వని ఉంది. ఆ సంఘటన గురించి ఏదైనా క్లూ ఇవ్వగలిగే వ్యక్తి సోపి అని అంగీకరించడానికి కూడా పోలీస్ సిద్ధంగా లేడు. కిటికీని బ్రద్దలు కొట్టినవాడు పోలీసులతో హాస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించడు. వేగంగా అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో కొద్ది దూరంలో వెళుతున్న బస్సు ఎక్కబోతున్న ఓ వ్యక్తి పోలీస్ కంటపడ్డాడు. అతనే కిటికీ అద్దం పగులగొట్టినవాడు కావచ్చని వెంటనే లాఠీని ముందు చాపి పోలీస్ అటువైపు పరుగెత్తాడు. రెండవసారి తన ప్రయత్నంలో విఫలమైన సోపి హృదయం జుగుప్సతో నిండిపోయింది. అక్కడ ఉండలేక అడుగు ముందుకు వేశాడు. రోడ్డుకు అటుపక్కన ఒక సాధారణ హోటల్ కంటపడింది. ఆకలిగొన్న సాధారణ వ్యక్తులకు అక్కడ తక్కువ ఖరీదులో ఆహారం దొరికేది. అక్కడి పింగాణి పాత్రలు, బల్ల మీద పరిచిన తెల్లటి క్లాత్ సోపిని పిలిచినట్టు ఆనిపించింది. సోపి లోపలికి దూరాడు. అతని చిరిగిన బూట్లు, లూజు ట్రౌజర్ ఎవరి దృష్టికి రాలేదు. ఒక బల్ల దగ్గర కూర్చున్న సోపి బీఫ్ స్టీక్స్, ఫ్లాప్ జాక్స్, డోనట్ తిని పై తాగాడు. వెయిటర్ బిల్లు ఇచ్చాడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదని చేతులు పైకెత్తాడు. ‘‘తొందరగా పోలీసును పిలువు. నాలాంటి సభ్యుడైన నాగరికుడిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు’’ అన్నాడు సోపి. ‘‘నీలాంటివాడికి పోలీసు ఎందుకు?’’ అంటూ ఇద్దరు వెయిటర్లు అతడ్ని ఎడాపెడా వాయించి, ఒళ్ళు హూనం చేసి వీధిలోకి తోశారు. నేల మీద పడిన సోపి, వదులైన కీళ్ళను సరిచేసుకుంటూ మెల్లగా లేచి, బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకున్నాడు. తాను కోరుకుంటున్నట్టు అరెస్ట్ కావటం కేవలం పగటికల అనిపించింది. ద్వీపానికి వెళ్ళే ప్లాన్ చాలా దూరంలో ఉన్నట్టు అనిపించింది. రెండు అంగళ్ళ తరువాత ఒక మెడికల్ షాపు ముందు నిబడ్డ పోలీస్ ఎందుకో అతడిని చూసి నవ్వి ముందుకు పోయాడు. సోపి కుంటుతూ కొద్దిదూరం నడిచాడు. అరెస్ట్ కావడానికి మళ్ళీ ధైర్యం రాసాగింది. ఈసారి తనంతట తానే ఒక అవకాశం ఒదిగి వచ్చింది. ఒక గొప్పింటి స్త్రీలా కనిపిస్తున్న అందగత్తె ఒక షాపులో ప్రదర్శన కోసం పెట్టిన వస్తువులను చూస్తూ నుంచుని ఉంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక పోలీస్ గోడకు ఒరిగి నుంచుని ఉన్నాడు. ఆమెతో రోడ్ సైడ్ రోమియోలా ప్రవర్తించాలని ఆలోచించాడు సోపి. సభ్యతగా కనిపిస్తున్న ఆ యువతిని, నిజాయితీపరుడిలా కనిపిస్తున్న ఆ పోలీసును చూసినపుడు, తొందరగానే తాను సంకెళ్ళలో చిక్కుకుంటాడని భావించిన సోపి, అప్పుడే తనకు చలికాలపు ఆశ్రయం దొరికిపోయినట్టు సంతోషపడ్డాడు. సోపి తన టై సరిచేసుకొని, మడతలుపడ్డ తన కోటుచేతులను లాక్కుంటూ, హ్యాటును కాస్త ఓరగా చేసుకుని ఆ యువతివైపు నెమ్మదిగా అడుగు వేశాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చిన్నగా దగ్గి, చిరునవ్వు నవ్వాడు. తరువాత ఆమె వైపు చూస్తూ రోడ్ సైడ్ రోమియోలా అల్లరిగా సైగలు చేశాడు. తరువాత ఓరకంట పోలీసు వైపు చూశాడు. పోలీస్ తననే చురచుర చూస్తున్నాడని నిర్ధారించుకున్నాడు. ఆమె రెండు అడుగులు ముందుకు వేసి, మళ్ళీ ప్రదర్శనకు పెట్టిన వస్తువులను కిటికీలోంచి తదేకచిత్తంతో చూడసాగింది. సోపి ఆమె దగ్గరికి పోయి ధైర్యంగా పక్కన నుంచుని, తన హ్యాటును పైకెత్తి– ‘‘హలో బేబీ, నాతోపాటు డ్యాన్స్ చేయడానికి వస్తావా?’’ అన్నాడు. పోలీసు ఇంకా చూస్తూనే ఉన్నాడు. తన సైగకు నొచ్చుకున్న యువతి వచ్చి వేలుచూపించి ఒక్క మాట చెబితే చాలు. సోపి స్వర్గానికి సమానమైన ఆ ద్వీపానికి దారి పట్టేవాడు. అప్పటికే అతనికి పోలీస్ స్టేషన్ వెచ్చటి వాతావరణాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఆ యువతి అతని వైపు తిరిగి చేయిచాపి కోటు చేతిని పట్టుకుంది. తరువాత సంతోషంగా– ‘‘ఓహ్! కచ్చితంగా. నేను అప్పుడే పలకరిద్దామనుకున్నాను. అయితే ఆ పోలీసు మనల్నే చూస్తున్నాడు’’ అంది. ఆమె మామిడి చెట్టుకు అల్లుకున్న తీగలా అతన్ని కరుచుకుంది. సోపి పిచ్చివాడిలా ఆమెతోపాటు అడుగు వేస్తూ పోలీసును దాటి ముందుకు నడిచాడు. బహుశా జైల్లో వెచ్చగా కాకుండా స్వేచ్ఛగా బయటి ప్రపంచంలో ఉండటమే తన నుదుటి రాతలో ఉందని అనుకున్నాడు. ముందరి మలుపులో తన వెంట వచ్చిన ఆ యువతి చేతిని విదిల్చుకుని సోపి అక్కడి నుంచి పరుగుతీశాడు. కొద్దిసేపటి తరువాత అతను విలాసవంతమైన ఒక కాలనీలో నిలబడ్డాడు. అక్కడ ఫర్కోట్ ధరించిన ఆడవాళ్ళు, నిలువు కోటు ధరించి పురుషులు చలికాలపు చల్లటి గాలిలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఏదో భయంకరమైన మాంత్రిక శక్తి వల్ల అరెస్ట్ కావడం లేదని సోపికి హఠాత్తుగా దిగులువేసింది. ఈ ఆలోచనతో అతను భయపడ్డాడు. అదే సమయంలో సినిమాహాలు దగ్గర తిరుగుతున్న ఓ పోలీస్ కనిపించగానే మునుగుతున్నవాడికి గడ్డిపరక దొరికినట్టయ్యింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించి అతని దృష్టిని ఆకర్షించాలని అనుకున్నాడు. రోడ్డుపక్కనున్న కాలుదారిలో సోపి తాగినవాడిలా తూలుతూ మొరటు కంఠంతో అసందర్భంగా బిగ్గరగా అరవసాగాడు. అతను గంతువేస్తూ, ఎగిరి దూకుతూ ఊళ పెట్టాడు. పిచ్చిపిచ్చిగా ఏడ్చాడు. చుట్టుపక్కంతా గొడవ చేశాడు. పోలీస్ తన లాఠీని తిప్పుతూ సోపి వైపు చూడకుండా అటు తిరిగి దగ్గర్లో ఉన్న ఒక పౌరుడితో అన్నాడు– ‘‘ఎవడో పనికిమాలిన వెధవ. వొట్టి వాగుడుకాయ. అయితే ఏమీ ఇబ్బంది పెట్టడు. ఇలాంటివాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకూడదని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది’’. ఖిన్నుడైన సోపి తన కోతిచేష్టలను ఆపాడు. ఏ పోలీసు తనను అరెస్ట్ చేయడం లేదుకదా? ద్వీపానికి వెళ్ళటం సాధ్యం కాని లక్ష్యంలా అతనికి కనిపించింది. కొరికే చలిలో రక్షణ పొందడానికి అతను తన పల్చని కోటు బొత్తాలను పెట్టుకున్నాడు. అక్కడొక సిగార్ అంగడి కనిపించింది. మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వెలుగుతున్న దీపంతో సిగార్ వెలిగించుకుంటున్నాడు. తన సిల్క్ గొడుగును అంగడి తలుపు పక్కన ఆనించి పెట్టాడు. సోపి పోయి గొడుగును తీసుకుని నిమ్మళంగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. సిగార్ వెలిగించుకుంటున్న మనిషి హడావుడిగా సోపి వెనుకే వచ్చి– ‘‘ఏయ్, అది నా గొడుగు’’ అని గడుసుగా అన్నాడు. ‘‘ఓహో, అవునా?’’ అంటూ సోపి కోపంతో బుసకొట్టాడు. దొంగతనంతో పాటు అవహేళనను చేరుస్తూ ‘‘అలాగైతే ఎందుకు పోలీసును పిలవడం? నేను దాన్ని తీసుకున్నాను. నీ గొడుగు కదా? పోలీసును ఎందుకు పిలవటం లేదు? అదిగో అక్కడ మూలలో ఒక పోలీస్ నిలబడ్డాడు చూడు’’ గొడుగు యజమాని తన నడక వేగాన్ని తగ్గించాడు. అదృష్టం ఎక్కడ ముఖం చాటేస్తుందోననే ఆలోచనతో సోపి కూడా అలాగే చేశాడు. పోలీసు ఇద్దరివైపు కుతూహంగా చూశాడు. ‘‘ఓహ్! అదీ...మీకు తెలుసుకదా, ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయో...అది మీ గొడుగైవుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు ఉదయం నేను ఆ గొడుగును ఒక హోటల్లో కనిపిస్తే తీసుకొచ్చాను. అది మీదని మీరు గుర్తుపడితే...బహుశా మీరు...’’ అన్నాడు ఆ మనిషి. ‘‘అవును, ఇది నాదే’’ అన్నాడు సోపి దుష్టతనంతో. ఆ మనిషి వెనక్కు జరిగాడు. పోలీస్ ఓ పొడువైన అందగత్తెకు సహాయపడటానికి రోడ్డుదాటి అటువైపు వెళ్ళాడు. సోపి రోడ్డు మీద తూర్పుకు అభిముఖంగా నడవసాగాడు. తన ప్రయత్నాలు విఫలమైనందుకు అతనికి బాధగా ఉంది. రోడ్డు పక్కనున్న ఒక గుంతలో గొడుగును కోపంతో విసిరాడు. శిరస్త్రాణం ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడిచే జనం పట్ల కోపంతో గొణుక్కున్నాడు. వారి చేతికి తాను చిక్కుకోవాలని ప్రయత్నిస్తే, తాను ఏ తప్పు చేయని గొప్ప వ్యక్తి అన్నట్టు వాళ్ళు గౌరవంతో చూస్తున్నట్టు అనిపించింది. చివరికి సోపి తూర్పువైపున ఉన్న రోడ్డు మీదికి వచ్చాడు. ధగధగమని వెలిగే దీపాలుకానీ, కోలాహలం కానీ లేదు. అక్కడినుంచి మ్యాడిసన్ సర్కిల్ వైపు నడవసాగాడు. తోటలోని బెంచే తన ఇల్లయినప్పటికీ, ఇంటికి వెనుతిరిగి వెళ్ళాలనే భావన అతనిలో జాగృతమైంది. అయితే మరీ ప్రశాంతంగా ఉన్న ఒక మలుపులో సోపి గబుక్కున నిలబడ్డాడు. అక్కడొక పురాతన చర్చి ఉంది. అక్కడ ఒక వ్యక్తి నైపుణ్యంతో ప్రార్థన గీతాన్ని తన వాయిద్యంలో వాయిస్తున్నాడు. ఆ మధురమైన సంగీతం తోసుకుని వచ్చి సోపి చెవుల్లో దూరి అతన్ని అక్కడే పట్టి నిలిపివేసింది. చర్చి చుట్టూ వేసిన కంచె దగ్గర అతను నుంచున్నాడు. పైన చంద్రుడు ప్రకాశంగా, ప్రశాంతంగా వెలుగులు చిందిస్తున్నాడు. జనసంచారం తగ్గింది. వాహనాల సంచారం అంతగా లేదు. గువ్వపిట్టలు నిద్రకళ్ళతో కువకువలాడుతున్నాయి. కొద్దిసేపు ఆ దృశ్యం పల్లెటూరి చర్చీ ప్రాంగణంలా అనిపించింది. ఆ వ్యక్తి వాయిస్తున్న ప్రార్థనాగీతం సోపి మనస్సును ఆవరించింది. ఆ గీతం అతడిని ఇనుప కంచెను ఆనుకుని నిలుచునేలా చేసింది. తల్లి, గులాబీ, ఆకాంక్షలు, స్నేహితులు, ప్రామాణికమైన భావనలు...మొదలైనవన్నీ అతని జీవితాన్ని నింపుకున్నటువంటి కాలంలో అతనికి ఆ ప్రార్థనా గీతం బాగా తెలుసు. సోపి స్వీకార మనోధర్మం, పురాతన చర్చీ కలిగించిన ప్రభావం కలగలిసి ఉన్నట్టుండి అతని ఆత్మలో ఒక అద్భుతమైన పరివర్తన కలిగింది. తాను ఎలాంటి అధఃపాతాళంలో పడిపోయాడుకదా అని అతను దిగులు చెందాడు. తనను తాను పరిశీలించుకున్నాడు. అధఃపతనంలో గడిపిన ఆ రోజులు, యోగ్యం కానటువంటి ఆకాంక్షలూ, విఫలమైన కోరికలు, వ్యర్థమైన సామర్థ్యాలు, హీనమైన అభిప్రాయాలు ఇవే అతని అస్తిత్వంలో నిండివుండేవి. ఈ కొత్త మార్పుకు అతని హృదయం చప్పున సంతోషంతో ప్రతిస్పందించింది. ఆ క్షణంలో ఒక ప్రబలమైన వేగం, తన నిరాశాపూరితమైన అదృష్టంతో పోరాడటానికి అతన్ని ముందుకు తోసింది. ఆ ఊబి నుంచి అతను లేచి పైకి రావాల్సిందే. మరొకసారి అతను మనిషి కావాలి. అతడిని వశపరుచుకున్న సైతాన్ను గెలవాలి. ఇంకా కాలం మించిపోలేదు. ఇంకా అతను వయస్సులో చిన్నవాడు. అతనిలోని పాత ఆశలు, కోరికలను పునర్జీవింపజేయాలి. ఆ పవిత్రమైన, మధురమైన వాదనపు నాదం అతనిలో ఒక క్రాంతినే తెచ్చింది. రేపు రభసగా వ్యాపారం సాగే ముందరి పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. గొర్రె, మేక జుత్తును దిగుమతి చేసుకునే ఒక వ్యాపారి గతంలో ఒకసారి అతడికి వ్యాన్ డ్రైవర్ పని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. రేపు ఆ వ్యాపారిని కలుసుకుని ఉద్యోగం అడగాలి. ప్రపంచంలో తాను ఒక గొప్ప వ్యక్తి కావాలి. తాను ఒక... సోపి భుజం మీద బరువైన చేయొకటి పడింది. అతను చప్పున వెనుతిరిగి చూశాడు. పోలీసు వెడల్పు ముఖం అతని కంటపడింది. ‘‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ అడిగాడు పోలీస్. ‘‘ఏమీ లేదు’’ అన్నాడు సోపి. ‘‘అయితే నా వెంట రా’’ అన్నాడు పోలీస్. మరుసటి రోజు ఉదయంచీ– కోర్టులో జడ్జి, ‘‘నీకు మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష విధిస్తున్నాను’’ అన్నాడు. -ఆంగ్ల మూలం: ఓ.హెన్రీ అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
సాక్షి
రెండు ఝాముల పొద్దు తిరిగింది. వీధరుగు మీద పడక్కుర్చీలో మేను వాల్చిన మునసబుగారు వార్తాపత్రికను పడేసి కన్నులరమూసి చింతాలు ఖూనీ కేసు గురించి లీలగా ఆలోచిస్తూ సన్నగా గుర్రుపెడుతున్నారు. ∙∙ చుక్క వొగరుస్తూ తూలి పడబోతూ తిట్టుకుంటూ పరుగెడుతోంది. ‘‘నా దేవుడోయ్! నా కొంపదీశావురోయ్. సందేళకి నివ్వింక నేవురోయ్ నాయనోయ్’’ అంటోంది. మాట మాటకీ వొగరుస్తోంది. మగతనిద్రలో ఉన్న మునసబుగారికి చింతాలు కేసులో తలుపుల్నురిదీయబోతున్నట్టు కలొచ్చింది. సంకెళ్ల చప్పుడు గూడా వినబడినట్టయి గతుక్కుమని కళ్లు తెరిచారు. వీధిలో చుక్క పరుగెడుతోంది. శివాలెత్తినట్టు ఊగిపోతోంది. ‘‘ఏవిటే చుక్కా?’’ అన్నారు మునసబుగారు. ‘‘నాయనోయ్ నా కొంప ముంచాడయ్యోయ్’’ అంది చుక్క వెనక్కి తిరక్కుండానే పరుగు సాగించింది కాలవొడ్డువైపుకి. సుడిగాలి వెనకాల ఆకులలముల్లా వస్తున్నాడు చుక్క తమ్ముడు. చింపిరిజుట్టు, బాన బొజ్జా ఎగరేసుకుంటూ చిన్న చిన్న అంగలతో అడుగులేస్తూ– ‘‘ఈరిగా ఇల్రా. ఆగు. చుక్కేవిటిలా పరుగెడు...’’ ‘‘పకీర్నొగ్గేశారంటండీ పోలీసోళ్లు. ఆడు మూడు గంటల కారుకొచ్చెత్తన్నాడు. తలుపులు మావని సంపేత్తాడంటండి’’ అని ఏడుస్తూ పరుగెత్తాడు ఈరిగాడు అక్క చుక్క వెనుక. మునసబుగారు పూర్తిగా మేలుకున్నారు. ఫకీర్నెవరొగ్గేశారు? ఎలా ఒగ్గేశారు? కేసు పూర్తికాందే ఇది ఎలా జరిగింది? ఫకీరుగాడు ఊళ్లో వచ్చిపడితే ఈసారి ఊరు వల్లకాడవడం ఖాయం. అందరికన్నా ముందు తలుపుల్ని కాలికిందేసి నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు వాడు. రెండేళ్ల క్రితం సంకురాత్రి పండగలికి కోడిపందాల్లో ఓడినందుకు ఉక్కురోషం వేసుకొచ్చి చూస్తూ ఉండగా నరసయ్యని అట్టే పీక నులిమి చంపేశాడు. అంతా అట్టే గుడ్లప్పగించి నిలబడిపోయారు. ఒక్కడికీ అదేమనడానికి దమ్ములు చాలకపాయే. సాక్ష్యానికి మనుషుల్ని పోగేసుకు రాబోయేసరికి ప్రాణం సాలొచ్చింది. ఫకీరుగాడు పరమ కిరాతకుడు. ‘‘బాబోయ్ కొంపలు ముణిగినయ్యండి’’ అంటూ వచ్చాడు ముత్యాలు. ‘‘ఫకీర్నొగ్గేశారంటగా, తలుపులెదవ ఒణుకుతో సచ్చేట్టున్నాడండి. ఏందారి?’’ అన్నాడు. మునసబుగారు గయ్‌మన్నారు ఒక్కసారి. ‘‘ఏవుంది. ఒకటేదారి...అసలాణ్ణి సాక్షానికెళ్లమన్నదెవడంట. యదవలు. ఒక్కడు ముందర చెప్పినట్టినడు. ఆ మాత్రం మగసిరి ఇంకోడికి లేదనే బయల్దేరాడేం యదవ. ఇప్పుడేడిచేం లాభం?’’ అన్నారాయన. ముత్యాలు మాటాడలేదు. తలొంచుకు నిలబడ్డాడు. మునసబుగారు కండువా బుజానేసుకుని కరణంగారింటికి బయల్దేరారు. ‘‘నరిసిరెడ్డిని కేకేసుకురా. కరణం గారింటికాడుంటానన్జెప్పు’’ అన్నారు. ‘‘ఆరక్కడే ఉన్నారండి’’ అన్నాడు ముత్యాలు. ముత్యాలమ్మ గుడిమలుపులోనే శివాలు వినిపించాయి మునసబుగారికి. ఇంకో అడుగేసేవరకూ గుడి దగ్గర గణాచారి ఉగ్రంగా ఊగిపోతోంది. తలుపులు నేలబారుగా సాగిలబడి దండాలెడుతున్నాడు. చుక్క చతికిలబడి, నెత్తి కొట్టుకుంటూ శోకన్నాలెడుతోంది. తలుపులు పెద్దపెళ్లాం సావాలు ధైర్యం చిక్కబట్టుకు గణాచారిని ప్రశ్నడుగుతోంది. మునసబుగారు ఆగదల్చుకోలేదు కాని, అంతకితం వరకు గణాచారి గాబోలు బాగుచేస్తున్న కందుల్ని కాకులు దినిపోతుంటే, ‘‘హుష్ కాకీ!’’ అన్నాడు. సాగిలపడున్న తలుపులు తలిటు దిప్పి చూసి, బావురుమని ఏడుస్తూ మునసబుగారి కాళ్లు చుట్టేసుకున్నాడు. ‘‘నాన్నగారోయ్ నను సంపేత్తాడండోయ్. ఆడొచ్చేత్తన్నాడండోయ్’’ అని భోరున ఏడవసాగాడు. గణాచారి ప్రశ్న చెబుతూనే ఉంది. ∙∙ సావిట్లో అంతా సందడిగా ఉంది. కరణంగారూ, వారి పట్నపల్లుడూ, ప్రెసిడెంటు సర్సిరెడ్డి, ఇంకిద్దరు మెంబర్లు, జనాభా లెక్కలు రాసుకోడానికొచ్చిన ఓ దొరటోపీ మనిషీ రెండుభాషల్లో మూకుమ్మడిగా ఏకటాకీన ఖూనీ కథలూ బ్రెమ్మరాతా కర్మ సిద్ధాంతం, ఆ బాపతు వేదాంతం వాళ్ల చిన్ననాటి ముచ్చట్లు, నేతి బీరకాయలో నెయ్యి ఉండని వైనం, అమెరికాలో గాంగ్‌స్టర్లు ఖూనీలు చేసే శిల్పం, ఫకీరుగాడి పుట్టు పూర్వాలూ, తలుపులుగాడి రెండో పెళ్లాం చుక్కకీ మధుర శిల్పాలలో అచ్చరలకీ కొట్టొచ్చినట్టు కనబడే పోలికలు (ఎవరో తెలీదు) ఖూనీలు కామాపుజేసే వాళ్ల కథలూ చెప్పుకుంటూ, హఠాత్తుగా దయచెయ్యండి అన్న ఒకమాటని మాత్రం ఏకగ్రీవంగా అన్నారు. తర్వాత, జరిగిన కథను సమీక్షించి కర్తవ్యం గురించి నిశ్శబ్దం తీవ్రంగా ఉపన్యసించింది. కరణంగారు గొంతు సవరించుకున్నారు. ప్రెసిడెంటుగారు అనుకరించారు. ‘‘అసలు వాణ్ణెలా వదిలేశారూ అంట?’’ అన్నారు మునసబుగారు. ‘‘మరే కేసు పూర్తిగాందే...అసలూ?’’ అన్నారు కరణంగారు. ‘‘పారిపోయుండాల’’ అన్నారు ప్రెసిడెంటుగారు. ‘‘ఇంఫాసిబుల్’’ అన్నాడు దొర టోపీ ఆయన. కరణంగారి అల్లుడు సాహసించి కలగజేసుకున్నాడు. ‘‘వైనాట్. అమెరికాలో జైళ్లలాంటి వాటినే తప్పించుకుంటారు. అక్కడ...’’ ప్రెసిడెంటుగారి చూపు చూసి ఆగిపోయాడు కరణంగారల్లుడు. ‘‘నే సెలవు దీసుకుంటానండీ’’ అన్నాడు దొరటోపీ ఆయన. ‘‘తలుపులుగాడి పాణానికి ముప్పే’’ అన్నాడు ముత్యాలు. ‘‘వాడి పెళ్లాం ఒకటే ఏడుపు పాపం. కట్టుకుని ఆర్నెల్లు కూడా తిరగలేదింకా’’ అన్నాడు ఏదో పెద్ద ఆర్నెల్లు తిరిగితే ఫర్వాలేదన్నట్టు. ‘‘సార్ జనాభా లెక్కలో జనసంఖ్య ఎంత రాసుకున్నారో గాని, ఒకటి తగ్గించి ఖర్చు రాయొచ్చు’’ అన్నాడు అల్లుడుగారు విట్టీగా..అని చుట్టూ చూసి నవ్వబోయి కొయ్యబారిపోయాడు. ∙∙ ప్రెసిడెంటుగారు జనాభా లెక్కలాయన్తో మాటాడుతూ సాగనంపబోయారు. మిగతా వాళ్లు ఆలోచనలో పడిపోయారు. ఫకీరు మూడుగంటల మెయిలు కారుకి దిగుతాడన్న వార్త అందరికీ తెలుసు. ఐదు నిమిషాలయ్యే సరికి చుక్కా, తలుపులూ వచ్చారు. ‘‘నాన్నగారోయ్ నాకేం దారి చెప్పండ’’న్నాడు తలుపులు ఏడుస్తూ. ఏ నాన్నగారూ ఏ దారీ చెప్పలేదు. ‘‘అసలు నీకెందుకురా గోల, నువ్వెందుకు సాక్ష్యమిచ్చావు? ఫకీరుతో చెలగాటవేవిటి? అదీ ఖూనీ కేసులో! మాకా మాత్రం దమ్ముల్లేకనే!?’’ అన్నారు కరణంగారు. ‘‘సర్లెండి అదంతా ఎందుకిప్పుడు. ఆడి మొఖానలా రాసిపడేసుంది గావాల. కుదురుగా ఇంటికాడెలాగుండగల్డూ..’’ అన్నారు మునసబుగారు. ఊళ్లో ఇందరున్నారు జెమాజెట్టీల్లాంటి వాళ్లు. ఇందరు కలిసి పట్టపగలు ఒక్క ఫకీరుగాడికి అడ్డుపళ్లేరా అనిపించింది. ఎవరి మటుకు వాళ్లకి. ఆ మాటే చుక్క పైకి అనేసింది. ‘‘అవున్నాన్నగోరు. ఆడు రాగానే బెడిత్తిరగేసీ..’’ అన్నాడు తలుపులు. ‘‘ఛస్ నువ్వూర్కో. ఇలాటెదవాలోచన్లు జేసే ఇంతకి దెచ్చుకున్నావు’’ అన్నారు మునసబుగారు. మునసబుగారి మనసు ఆయనకన్నా ముత్యాలుకు బాగా తెలుసు. ఇలాటి సమయాల్లో అతనే టీకా తాత్పర్యాలు భాష్యాలు చెబుతాడు. ఇప్పుడూ నమ్మినబంటుగా ఆ పని చేశాడు. ఫకీరుది పాము పగ అని వెల్లడించాడు. ‘‘మరిపుడేటి చేదారి ఏటి దారీ?’’ అన్నాడు తలుపులు. ‘‘దారికేటుంది. ఎవిడిదారాడిదే. నన్నడిగితే ఆడలా మెయిలు కారు దిగేతలికి నువ్విట్నించిలా పొలాలకడ్డంబడి పో. లేదా పడవెక్కి పట్నానికెళ్లిపో. ఆనక మేవంతా ఆడికి నచ్చచెబుతాం. సల్లబడ్డాక మెల్లగా రావచ్చు’’ అన్నాడు ముత్యాలు. ‘‘వాడు శాంతించకపోతే అదే పాయని, పట్నంలోనే స్థిరపడిపోవచ్చున’’ని కూడా ఆశపెట్టారు. తలుపులికి మనసు కొద్దిగా స్థిమిత పడుతోంది. కొంచెం కుడి ఎడమా ఆలోచిస్తున్నాడు. ముత్యాల్లాంటి వాళ్లిద్దరు తనకెడాపెడా నిలబడి, కర్నం మునసబులూ పంచాయితీ ప్రెసిడెంటూ వెనక నిలబడితే చాలు. ఫకీరుగాడికి దర్జాగా ఎదురుపడవచ్చు. ‘‘ఎటేస్ పల్లకుండావు. ఎల్ల దల్చుకుంటే బేగీ లగెత్తు’’ అన్నాడు ముత్యాలు తమాషాగా చుక్క వంక చూసి నవ్వి. తలుపులు చుక్క వంక చూశాడు. తల కొట్టేసినట్టయింది. ‘‘బతికుంటే బలుసాకేరుకు దినొచ్చన్నా’’రు కరణంగారు. ‘‘అవును మావా’’ అంది చుక్క కళ్లు చెంగుతో వత్తుకుంటూ. తలుపులు చుట్టూ చూసి, ‘‘ఎదవ నాయాళ్లు. యదవ కళ్లెదవ నోళ్లు’’ అనుకున్నాడు. కరణంగారు, మునసబుగారు ఒక్క మారే బరువుగా నిట్టూర్చారు. అనిందికేముంది గనక, ఫకీరు పరమ దుర్మార్గుడు. అన్నిటికీ తెగించినవాడు. వాడికి అడ్డపడిందికి ఆలుబిడ్డలున్న వాడెవడూ ముందుకు రాడు. అంచేత తలుపులు, ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం వెళ్లిపోవడం మంచిదని వారభిప్రాయపడ్డారు. తలుపులు మరోసారి ఆలోచించుకున్నా ఊరొదిలి పోబుద్ధికాలేదు. ప్రాణభయం ఎంత పీకుతున్నా కొంపా గోడూ వదులుకుని పారిపోవడం వాడికి అవమానంగా తోచింది. ‘‘నా బాబు, నా బాబు బాబు ఈడనే పుట్టి ఈణ్ణే మట్టిలో గలిశారు. నేనెందుకు పోవాల నేనేం కూనీల్జేశానా?’’ అన్నాడు. కరణంగారు నవ్వారు. ‘‘ఇదెప్పట్నించిరోయ్ దేశభక్తి. ప్రాణమ్మీదికి ముంచుకొస్తూ ఉంటే ఈ వేదాంతం ఏమిటి? నీ బాబూ ఆడి బాబూ ఖూనీ కేసులో సాక్షాలిచ్చి పీకల మీదికి...’’ ‘‘ఎవరదీ?’’ అన్నారు మునసబుగారు వాకిట్లోకొచ్చిన మనిషిని చూసి. ‘‘నేనండి ఎర్రెంకన్నని. తలుపులుగాడింకా ఈణ్ణే ఉన్నాడండీ, అయిబాబో! ఫకీర్నొగ్గేశారండి. ఆడొచ్చి సంపేత్తాడండియ్యాల... ఊరంతా..’’ ‘‘అదేనోయ్, పారిపొమ్మంటే అవునుగాని నీకెవరు జెప్తారిది. వదల్డం నిజమేనా అని..’’ ‘‘ఎవరేటండి దాన్నడగండి. ఆ చుక్కకే తెల్సు. ఇందాక పన్నెండు గంటల కారుకి డైవోరు రెడ్నాయుడే సెప్పాడంటండి..’’ ‘‘అదే మేం ఊరొదిలి పొమ్మంటున్నాం. వాడు శాంతించాకా..’’ ‘‘ఇంకేడికి పోతాడండి. కబురపుడే అందరికీ తెల్సిపోయింది. ఆడి మనుసులు ఈడు ఊరొదిలిపోకుండా కాలవకాడ తోపుకాడ వుంతినకాడా కాపేశారంటండి. ఆడు మూడుగంటల కారుకొచ్చేత్తన్నాడంట..’’ ‘‘నాయనోయ్’’ అంటూ చుక్క ఏడుపు లంకించుకుంది. చూస్తుండగానే తలుపులికీ ముచ్చెమటలు పోసేశాయి. గజ గజ వణికిపోయాడు. రెండు చేతుల్లో తల పట్టుకు కూలబడిపోయాడు. కళ్లు తిరిగిపోయాయి. ‘‘నా తల్లి ముత్తేలమ్మో..’’ అంటూ చుక్క వొళ్లోకి ఒరిగిపోయాడు. ∙∙ ‘‘అయితే ఏం చేదాం?’’ అన్నారు కరణంగారు. మునసబుగారు మాటాడలేదు. ‘‘చేసేదేముంది, ఎవడి ఖర్మకెవరు కర్తలు. అటు కోరటు వాళ్లలా మంచీ చెడ్డా లేకుండా ఖూనీకోర్లని దేశం మీదకొదిలేస్తుంటే చేసేదేవుంది?’’ అన్నారాయనే మళ్లీ. మునసబుగారు గొంతు సవరించుకున్నారు. ‘‘చిన్నా పెద్దా మనమంతా కల్సి ఆడూళ్లో దిగ్గానే అడ్డం పడితే..?’’ అన్నారు. కరణంగారు తల తాటించారు. ‘‘మీరేమన్నా అనుకోండన్నగారూ, నాకా సాహసం లేదు. కొంప దుంపనాశనం చేసుకోదలిస్తే తప్ప...’’ మునసబుగారు ముత్యాలుకేసి చూశారు. ‘‘దారుణం, ఇది ఊరో అడివో నాకు తెలీటం లేదు. ఇందరం ఉండి ఒక్కడి ప్రాణానికి అడ్డు పళ్లేకున్నాం’’ అన్నారు మునసబుగారు లేస్తూ. ‘‘ఏం చేస్తాం...పోనీ పోలీసు ఠాణాకి కబురంపండి మనిషినిచ్చి..వస్తా. అల్లుడూ అమ్మాయి సినిమాకోయ్ అని గోలబెడుతున్నారు. మాయాబజారుట...మీరూ వస్తారా?’’ అన్నాడు కరణంగారు. ‘‘రాను...’’ అంటూ వెళ్లిపోయారు మునసబుగారు. కరణంగారు, చుక్కకి ధైర్యం చెప్పారు. తలుపులికి స్పృహే ఉన్నట్టు లేదు. ‘‘రాగానే మీ సవుతులిద్దరు వాడి కాళ్ల మీద పడండి. అంతకన్న మార్గం తోచట్లేదు’’ అన్నారాయన. ∙∙ చుక్క తలుపుల్ని లేవదీసి నెమ్మదిగా ఇంటికి బయల్దేరింది. నెత్తిన ఎండ పేలిపోతోంది. తలుపులికి ఒళ్లు మసిలిపోతోంది. కళ్లు మూసుకునే చుక్కనానుకు నడుస్తున్నాడు. అమ్మవారి గుడి దగ్గర ఆగి, ‘‘గండం గడిచి తెల్లారితే ఉపారాలెత్తుతాను తల్లీ పెట్ట నేయిత్తానమ్మా’’ అని దండమెట్టుకుంది. ఇల్లు చేరి గుమ్మంలో అడుగెడుతుండగా, ‘‘ఆడు తొడిగింది కరణంగారి కమీజంట గాదూ, ఎందుకన్నా మంచిది ఇప్పించేసేయ్’’ అని చెప్పి వెళ్లిపోయాడు కరణంగారింటి పాలేరు. ‘‘థూ...’’ అని ఉమ్మేసింది చుక్క. లోపల సవితి చామాలు పడుకుని ఉంది. అంపకం పాలతో జ్వరం వచ్చేసింది సావాలుకు. కలవరింతలు, కేకలు. చుక్కకి దుఃఖం పొంగి వచ్చేసింది. తలుపుల్ని మంచాన పడుకోబెట్టి దుప్పటి కప్పింది. సావాలు కణతలంటి చూసింది. ‘‘నా కొంప ముంచాడే నాయనో’’ అంటూ గొల్లుమంది సావాలు. ‘‘ఏం సేత్తాం అన్నిటికా సల్లన్తల్లుండాది. ఈ గండం గడిత్తే రేపు పారాలెత్తించి పెట్టనేద్దాం. నువ్వు కూడా మొక్కుకో’’ అంది చుక్క. ‘‘మల్లిద్దరవెందుకులే’’ అంది సావాలు. ‘‘నీ జిమ్మడ బుద్ధి పోనిచ్చుకున్నావు గాదు’’ అంది చుక్క. తలుపులికి గంజినీళ్లు పోసి, గుడిసివతలికొచ్చింది చుక్క. ‘‘మూడు గంటల కారొచ్చుండాలి. ఆడీ పాటికి దిగుండాలి. నా తల్లో! నివ్వే దిక్కు’’ అనుకుంటూ నించుంది. ఫకీరొస్తే ఎందుకేనా ఉంటుందని రెండు బడితెలూ ఓ పెద్దగెడా రెండు కొరకంచులూ తీసి ఓ పక్కన అట్టే పెట్టింది. చుక్క తమ్ముడు పరుగున వచ్చి, ‘‘అక్కా అక్కా కారొచ్చేసింది గాని ఆడురానేదు. నాను చూశా నాను చూశా, కిళ్లీ బడ్డీ రంగన్నక్కూడా ఒకిటే ఆచ్చిరం! ఫకీరుగాడు రానేదని’’ అన్నాడు. చుక్క ఒక్క లగువున లోపలికెళ్లింది. ‘‘ఆడు రానేదు మావో. ఆడు రానేదు. అంతా అబద్ధం’’ అంటూ తలుపుల్ని కావలించుకుంది. తలుపులు మెల్లిగా కళ్లు తెరిచి ‘‘ఆ..’’ అన్నాడు. ‘‘గండం గడిచింది మావా ఆడు రానేదు. మద్దినేళ డైవోరు పరాసికం ఆడుండాల యదవ సచ్చినోడు మల్లీపాల్రానీ సెప్తా..’’ అంది. తలుపులు అమాంతం చుక్కని గాఢంగా కౌగిలించుకున్నాడు. తలుపులు కళ్లంట బొటబొట కన్నీళ్లు కారాయి. జ్వరం దిగిపోయింది. ‘‘ఎందుకన్న మంచిదిగాని, మావా, ఇపుడే నావకెల్లి, పట్నంలో పోలీసోళ్లకి సెప్పరాదా సింతాలు ఖూనీ కేసులో ఫకీరుగాడికి జేలు కాయమయేదాకా ఈడ కాపలా ఉండాలనీ’’ అంది చుక్క. తలుపులు చుక్కని దగ్గరకి తీసుకుని వీపు తట్టాడు. జుట్టు సరిచేశాడు. ‘‘ఎర్రిమొకవా మనకోసం పోలీసోళ్లొత్తార్టే యెర్రిమొకవాని మొకం చూడు’’ అన్నాడు. అంటూనే చుక్క మొహం చూశాడు. ‘‘ఎంత సక్కని మొకం. కళ్లుబ్బిపోనాయి గాని, పాపం ఎంతేడిశావో నాకోసం’’ అన్నాడు. ‘‘సర్లే బాగుండాయి సరసాలు. కాత్తుంటే ఆడొచ్చి ఈప్మీన రేవెట్టుండేవోడే గందా’’ అంది సావాలు నీరసంగా నవ్వుతూ. చుక్క పకపక నవ్వింది. ‘‘బుద్ధి పోనిచ్చుగున్నావుగాదప్పా. ఫకీరుగాదు, యములాడొచ్చినా సరే మావిలాగే కాయిలించుకు సరసాలాడుతూనే సచ్చిపోతాం. నియ్యల్లే నాకు జెరం రాదు ఆపదలొత్తే’’ అంది. ‘‘అలాగే అలాగే ఊసులాడ్డానికేవి. మద్దినాల మతిసెడి శోకాన్నాలెట్టినాళ్లెవరో.. సూద్దారి, ఆడు మూడుగంట్ల కారుకి రాపోతే ఆ తరవాద్దానికి రాడని కరాటి? కాపీ నీల్లో కల్లునీల్లో దాగుతంటే కారు తిప్పుండచ్చుగా’’ అంది సావాలు. తలుపులు పట్టు దప్పినట్టయి తలెత్తి చూసింది చుక్క. మళ్లీ వెర్రిచూపు పడిపోయింది. ‘‘ఆ! ఏటేటీ ఎలాగెలాగా!?’’ అంటూ కొయ్యబారిపోయాడు తలుపులు.‘‘నీ జిమ్మడ. యదవనోరు నివ్వూను’’ అంటూ లేవబోయింది చుక్క. తలుపులే చుక్కని పక్కకి తోసేసి లేచి నిలబడ్డాడు. ‘‘ఆ మాట రైటే ఆ మాట రైటే’’ అంటూ గుడిశవతలకి వెళ్ళిపోయాడు. ‘‘యాడకయ్యోవ్ స్వామి!’’ అంటూ వెంటబడింది చుక్క. ‘‘మల్తొత్తా మల్తొత్తా’’ అంటూ గబగబా వెళ్ళిపోయాడు తలుపులు. ∙∙ పొద్దు వాటారింది. ముత్యాలమ్మ గుడి దగ్గర రావిచెట్టు కింద కూర్చున్నాడు తలుపులు చిత్తుగా తాగేసి. ‘‘నా సావిరంగా, రారా ఇయ్యాల నువ్వే నేనో తేలిపోవాలా. పుచ్చెలెగిరిపోవాల’’ అని గొణుక్కుంటున్నాడు. అరమైలు అసింటా అప్పుడే బస్సు దిగిన జమాజెట్టీ పకీరు కూడా అదేమాట అనుకున్నాడు కసిగా. దిగుతూనే ఎదర కిళ్ళీ బడ్డీ లోపలికెళ్ళి కూర్చున్నాడు. ‘‘కాసినీ సోడానీల్లియ్యవో’’ అన్నాడు పకీరు. బడ్డీవాడు ఖాళీసోడా కాయపట్టుకు లోపలికి వెళ్ళి ‘నీళ్ళు’నింపి ఇచ్చాడు. పకీరు గడగడ తాగేసి, ‘‘ఇంతకన్నా వుట్టినీల్లే ఇత్తే సరిపోయేదిగా యదవా’’ అన్నాడు. ఈవల ఒకటే జట్కా వుంది. అందులో ఇందాకటి ఇస్తోకులో రాణి కూర్చుని వుంది. రాజా బడ్డీ దగ్గరికొచ్చి సిగరెట్టు కొంటున్నాడు. పకీరు బండి దగ్గర కొచ్చి, ‘‘దిగండమ్మా, ఈ బండెల్లదు’’ అన్నాడు. రాజా విసురుగా వచ్చాడు ‘‘ఎవడ్రా నువ్వు ఆడవాళ్లని దబాయిస్తున్నావు బ్లడిఫూల్’’ అంటూ. పకీరు వెనక్కి తిరుగుతూనే ఎడం చేయి తిరగేసి వెనక్కి విసిరాడు. ‘‘అమ్మో’’ అని ఒక్క కేక పెట్టి చెంపని తడుముకున్నాడు రాజా. మళ్ళీ మాటడలేదు. అమ్మాయి మాట్లాడకుండా బండి దిగిపోయి తనే పెట్టి కిందకి దించేసింది. అతను చెంపని చెయ్యి తియ్యలేదు. కన్నార్పలేదు. పన్నెత్తి పలకలేదు. పకీరు బండిలోకెక్కి కూర్చున్నాడు. ‘‘రోడ్డు బావులేదు’’ అన్నాడు బండివాడు. ‘‘పోనీ’’ అన్నాడు పకీరు. బండి కదిలింది. తూము మలుపు దగ్గరేనే జట్కా ఆపేశాడు బండతను. రావిచెట్టు దగ్గిర బండకానుకుని వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు ఏసుకుని వెకిలి ధైర్యంతో ఏడుపులాంటి నవ్వుతో లొల్లాయి పాటలు పాడుతున్నాడు తలుపులు గట్టిగా. కరణంగారు సకుటుంబంగా సినిమాకెళ్ళిపోయారు. ఎందుకేనా మంచిదని ప్రెసిడెంటుగారూ వారికి తోడుగా వెళ్ళారు. ఎక్కడా సందడి లేదు. ఊరందరికీ ప్రాణం ఖంగారుగా వుంది. చుక్క రెండుమార్లొచ్చి తలుపుల్ని బతిమాలింది కొంపకి రమ్మని. ‘‘నా సామిరంగా ఇయ్యాల ఆడో నేనో తేలిపోవాల’’ అన్నాడు తలుపులు. మునసబుగారు పెందలాడే భోంచేసి అరుగు మీద కూర్చున్నారు చుట్ట ముట్టించి. ఆయనకి ప్రాణం కుతకుత ఉడికిపోతుంది. చూస్తూ చూస్తూ ఓ మనిషిని మరోడు ఖూనీ చేస్తు వుంటే దిక్కుమాలినట్టు ఊరుకోవడం ఆయనకి నచ్చలేదు. వొంటో ఓపిగున్న వాడికి లేని బెడదలు నాకేల అనుకున్నాడు కాని సావిట్లో కెళ్ళబోతూ ఉండగా చుక్క తమ్ముడు ఎక్కణ్ణించో తుర్రున వచ్చి ‘‘బాబూగోరూ పకీరుగోడు బండిదిగి వచ్చేత్తాన్నాడండీ. మా మావని సంపేత్తాడు’’ అనేసి పరుగెత్తాడు ఆయన జవాబు కూడా వినకుండా. మునసబుగారు ఓ నిమిషం మేనువాల్చారుగాని ఉండబట్టలేక చివాల్న లేచి చితికర్ర పట్టుకొని ఇవతలికొచ్చారు. పకీరు తలుపులు కొంపకెళ్ళాలంటే ముత్యాలమ్మ గుడి మీదుగానే దారి. గుడికి ఎడమవైపున పదిగజాల్లో అవతల వేపచెట్టుంది. మునసబుగారు నెమ్మదిగా వెళ్ళి చెట్టు మొదట్లో బండిచాటు చేసుకుని కుదురుగా నిలబడ్డారు. ∙∙ తలుపులు నానా గోలాచేస్తున్నాడు. వెల్లకిలా పడుకుని వెకిలిగా నానా కూతలు కూస్తున్నాడు. పాడుతున్నాడు. హఠాత్తుగా తలుపులు పాట ఆపేశాడు. మునసబుగారి గుండె ఝల్లుమందీ. కొంచెం ముందుకు వంగి తొంగి చూశాడు. అల్లంత దూరాన యముడిలా పకీరు. తలుపులికి వొళ్ళంతా చెమట పోసేసి, బిగించుకు పోయిన శరీరం పట్టు సడలింది. కెవ్వున అరవబోయాడుగాని అంతలో తిరిగి ఒళ్ళు బిగించుపోయింది. చేతులు నేలకి వాలి పిడికిళ్ళు బిగించుకుపోయాయి. గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లయింది. వెంట్రుకలతో దిట్టంగా ఉన్న చెయ్యి ఒకటి ముందుకు వచ్చి తలుపులు కమీజు కాలరు పట్టుకోంటోంది. గేదెకొమ్ములాటి మీసాలు, మీసాల్లాటి కనుబొమలూ ఉన్న మొహం, ఇవన్నీ చూస్తే సాక్ష్యం ఇవ్వాల్సివస్తుందనీ మళ్ళీ ఈ రాక్షసుడు ఏంచేస్తాడోననీ దూరం ఆలోచించి చంద్రుడు మొహం మబ్బు చాటు చేసుకున్నాడు. సినిమా కెళ్ళిన కరణంగారిలా, తప్పుకున్న ముత్యాలులా, ఊరుకున్న ప్రెసిడెంటులా, మునసబులా... తలుపులు తొడుక్కున్న కరణంగారి కమీజు కాలర్ని పిడికిలి బిగించి పట్టుకున్నాడు పకీరు. కొయ్యబారి నోరు తెరచి గుడ్లు తేలవేసి చూస్తున్న తలుపులు ఒక్కసారి ‘‘బాబోయ్’’ అని పెద్దగావు కేక పెట్టాడు. అతనిలో అణిగిపోయిన మగసిరి తిరగబడి మేలుకుంది. భయం మొండితనమైంది. అతని పక్కన నీరసంగా ఎండిన తోటకూర కాడలా పడున్న రెండు చేతులూ గుప్పెళ్ళలో దుమ్ము తీసుకుని, ముందుకు వాలిన పకీరు మొహంలోకి కొట్టాయి. పకీరు పట్టు వదిలి ‘ఛా’ అంటూ రెండు చేతులా మొహం మూసుకొని కళ్ళు వత్తుకోబోయాడు. విలాసముద్రలో ఉన్న తలుపులు కాళ్ళు రెండూ తెగిన స్ప్రింగ్‌లా తన్నుకుని విడిపడ్డాయి. ముడుచుకుని ముందుకురికి పకీరును పొత్తికడుపు మీద తన్నాయి. పకీరు వెనక్కి తూలి తమాయించుకొని పెద్దకేక వేయబోయాడు గాని తలుపులు శరీరం మట్టగిడసలా తన్నుకుని బంతిలా పైకెగిరింది. తలుపులు తల పొట్టేలు మల్లె ముందుకు వంగింది. సన్నగా రివటాల ఉండే తలుపులు తాలూకు శరీరం దాన్ని తీసుకువెళ్ళి సరాసరి తూలి తమాయించుకోబోతున్న పకీరు పొట్ట మీదకు గురిపెట్టి కొట్టింది. బాణంలా వెళ్ళి తగిలాడు తలుపులు. పకీరు వెనక్కి పడుతూనే రెండు చేతులా తలుపులు జెబ్బలు పట్టుకున్నాడు. పడీపడగానే పక్కగా ఒరిగి, ఒక జెబ్బ వదిలి ఆ చేత్తో తలుపులు రొమ్ము మీద గాఢంగా పొడిచాడు. తలుపులు కిక్కురుమనలేకపోయాడు గాని ఆ బాధలో అప్రయత్రంగా అతని అరచేతి కింది భాగం పకీరు కింది పెదిమకు కొట్టుకుంది. పెదిమ చితికి, హడావుడిగా పకీరు కుడిచేతిని ఓదార్పుకు పిలిచింది. ఎడమచెయ్యి అతని అనుమతి తీసుకోకుండానే, సగంలో వదిలేసిన కళ్లకు సేవ చేయబోయింది. ఈ విధంగా ఊపిరి తీసుకోవటానికి సదుపాయం సంపాదించిన తలుపులు ఆ పని పూర్తికాగానే ఇంకొ దొర్లు దొర్లి లేచి ఉట్ల సంబరాలకి అలవాటైన ఒడుపుతో ఎగిరి శక్తి కొద్దీ రెండు మడమలతోటీ పకీరు ఎదురురొమ్ము మీదకి దిగాడు తలుపులు కాళ్ళు పట్టుకులాగబోయే లోగా, తలుపులు ఒక కాలుతో పకీరు గడ్డం మీద తన్ని తూలి ముందుకుపడిపోయాడు. తలుపులు లేచి కూర్చొని వెనక్కి చూశాడు. పకీరు నోటివెంట ఎర్రటి రక్తం తెల్లటి వెన్నెలలో నల్లగా మిలమిల మెరుస్తూ చెంప మీదుగా నేలకి జారుతుంది. అమాంతం తలుపులికి బలం, ధైర్యం తొలిసారి ఆవేశించాయి. కూర్చున్న పళంగానే ముందుకు వంగి రెండు పిడికిళ్ళూ బిగించి పకీరు రెండు చెంపల మీదా ముక్కు మీదా మూడు గుద్దులు గుద్దాడు. ‘‘బాబోయ్!’’ అని పెద్ద కేక పెట్టాడు పకీరు. ఊరు మారు మోగిపోయింది. లోకంలో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ, బలవంతులు, బలహీనులూ, హింసాప్రియులు, అహింసాపరులూ ఎవరెవరెన్న భేదాలకు అతీతమైన అరిచిన బాధ అది. తలుపులు ఈసారి బలమంతా పూన్చిన పిడికిలితో నారి సారించినట్టు చెయ్యి వెనక్కిలాగి ఒక్క ఊపున పకీరు మెడనరం మీద పోటు పొడిచాడు. ‘‘బాబోయ్’’ అని మరో పొలికేక వేసి గిలగిల తనుకున్నాడు పకీరు. ఇంకో దెబ్బకి తలుపులు సన్నాహం చేస్తు ఉండగా పకీరు పిడికిట పొదిగి బిగించిన బొటనవేలుతో అతని డొక్కలో గాఢంగా పొడిచాడు. అర్బకుడు తలుపులు, జాతరలో కోడిపెట్టెలా తన్నుకుని లేచి చెట్టు దగ్గిరకు పరుగెత్తాడు. అక్కడ నక్కపిల్లి కర్ర ఉందన్న సంగతి అప్పుడు తట్టింది. కర్ర తీసుకొని గిరుక్కున వెనక్కి తిరిగాడు తలుపులు. ఆరడుగుల పకీరు గాయపడ్డ పులిలా తూచి, చూచి వొడుపుగా అడుగులేస్తున్నాడు తన వేపు. పకీరు చేతిలో నాలుగంగుళాల బాకుంది. దగ్గరకు వచ్చాడు పకీరు. ‘‘ద్దొంగ.’’. ‘‘పకీరూ’’ అని హఠాత్తుగా పెద్ద గర్జన వినబడింది. తుళ్ళిపడి కేక వేపు చూడబోయి ఇటు తిరిగేలోగా పకీరు నెత్తిన తలుపులు శక్తి వంచనలేని దెబ్బ కొట్టాడు చేవగల కర్రతో. ‘‘బోబోయ్’’ అని ముత్యం మూడోసారి కేకవేసి కూలిపోయాడు పకీరు. తలుపులు తీరికగా కుడివైపు చూశాడు. అందాక చెట్టు చాటున ఉన్న ముసబుగారు ఇవతలికి వచ్చి వెన్నెలలో నిల్చున్నారు చేతికర్ర పట్టుకొని గంభీరంగా. తలుపులు మళ్ళీ ఇటు తిరిగి కళ్ళు మూసుకుని కసీతీరా పకీరును బడితెతో బాదుతున్నాడు. ‘‘ఇక చాలు తులుపులూ’’ అన్నారు మునసబుగారు. ∙∙ పంచాయితీ ఆఫీసు అరుగు దగ్గిర జనం చాలామంది చేరారు. ఆఫీసువారి మూడు హరికేను దీపాలు ధర్మవిజయంలా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. పకీరు కాళ్ళూ చేతులూ కట్టేసి అరుగు మీద పడేశారు. ముత్యాలు అతని గాయాలు కడిగి మంచినీళ్ళు పడుతున్నాడు. చుక్క పసుపుకుంకాలనీ, తలుపులు తాకతునూ మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. చుక్క మర్నాడు తప్పకుండా అమ్మవారికి ఉపారాలెడతానంటోంది. తలుపులు నీరసంగా గోడకి జారబడి పడుకున్నాడు. మళ్ళీ జ్వరం వచ్చింది ఒంటిన తెలివిలేదు. ఇంకో ఘడియకి కారు అలికిడి వినబడింది. సందడి తగ్గి కొత్త గొంతుక వినబడడంతో మెల్లిగా కళ్ళు తెరిచాడు తలుపులు. ఎదురుగా పోలీసులు, జనం అంతా అమ్మయ్య అంటున్నారు. ‘‘పకీర్ని మీరెలా వదిలేశారండీ!?’’ అంటున్నారు మునసబుగారు ఆశ్చర్యంగా. ‘‘తలుపుల్ని పట్టుకోడానికి, చింతాలు కూనీ కేసులో వీడో సైడు హీరో. వాడూ వీడే కలిసే చంపుంటారు. వీడెలాగో పారిపోయి పైపెచ్చు కోర్టుకొచ్చి ప్రాసిక్యూషన్ తరఫున పకీరు మీద సాక్ష్యం ఇచ్చి వచ్చాడు. వీడి ప్రతిభ ఈ సంగతి మధ్యాన్నమే తెలిసింది. పకీరు ముందర చెబితే మేం నమ్మలేదు. అందుకని మేమొచ్చేలోగా పకీరు తొందరపడీ మాతో చెప్పకుండా వచ్చేశాడు’’ అన్నారు ఇన్స్పెక్టర్గారు. ‘‘కాని వీడెంత నాటకం ఆడాడు. మొగుణ్ణి గొట్టి మొగసాలకెక్కినట్టు, సర్లెండి దొంగని దొంగే పట్టుకోవాలి’’ అన్నారు మునసబుగారు. ‘‘బావుంది ఇపుడు మీరంతా కలిసి వాళ్ళని పట్టిచ్చారు మరీ మీరంతా దొంగలేనా?’’ ‘‘ఏమో దొరికాక ఒక్కొక్కడూ ఒక్కొక్క రకం దొంగ.... దొరికేదాక ఒకొక్కడూ ఒకొక్క దొర’’ అన్నారు మునసబుగారు. -ముళ్ళపూడి వెంకటరమణ -
అమ్మా.. ఎండెప్పుడొస్తుందమ్మా?
మన ఊరిచివర (కిందటేడు వ్యాపారం గురించి కలకత్తాకి వెళ్తూ వెళ్తూ దార్లో అకస్మాత్తుగా చచ్చిపోయిన) మనూరి పాత మొఖాసాదార్గారి తోటలో ట్రంకురోడ్డుకి పక్కగా. చీకటిమర్రి చెట్టుకింద ఒంటిగా నిల్చున్న పాడుపడ్డ గదిలో కాపరం ఉంటూ, ఊళ్ళో ఇంటింటికి తిరిగి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముకు బతికే శారదమ్మగారి ఆరేళ్ళ కూతురు–సుందరం–ఓ రోజు సాయంకాలం వాళ్ళమ్మని... ‘‘అమ్మా, అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది. సాయంకాలం చాలా చీకటిగా, చాలా భయంగా, మరో ఘడియలోనో క్షణంలోనో మనింటికి రాబోయే చావులా ఉంది. మూడ్రోజుల పాటు మన్నూ మిన్నూ ఏకమైపోయినట్టనిపించి ఇవాళ నాలుగోరోజు ఉదయానికి కాస్త తెరపిచ్చిందే కాని ఆకాశం మాత్రం రవ్వంత మేరయినా విడవకుండా మబ్బుతో దట్టంగా మూసుకుపోయే ఉంది. వర్షంతో పాటు ఈ మూడ్రోజులు చలిగాలి కూడా ప్రచండంగా వీచివీచి నానా భీభత్సం చేసింది. ఈరోజు మాత్రం గాలి బాగా సద్దుమణిగింది. శారదమ్మ గది వెనక నున్న పాతతోటలో చెట్లన్నీ కూడా పగవాడు తెరిపివ్వకుండా తీసిన పిడుగు దెబ్బకి తట్టుకోలేక చెల్లాచెదురైపోయి అలిసిపోయిన మరింక కదల్లేక శవాల్లా ఉండిపోయిన బీదవాళ్ళ కోటలోని పేదజనంలా ఉన్నాయి. ‘‘అమ్మా! ఎండెప్పుడొస్తుందమ్మా?’’ అని అడిగింది సుందరం. కూతురు వేసిన ప్రశ్న శారదమ్మ వినిపించుకోలేదు. ఆవిడ, ఆ కిటికీల్లేని చీకటిగది గుమ్మం ముందున్న సన్నపాటి నడవలో కూర్చొని పాత హరికెన్లాంతరు చిమ్నీ బీటలు విడిపోకుండా నెమ్మదిగా భద్రంగా తుడుస్తోంది. సుందరం తన ఆరేళ్ళ జీవితంలోనూ కూడా ఇంత గాలీవర్షం ఎన్నడూ ఎరగదు. మొదటిరోజున సరదా పడ్డది కాని రెండో రోజు రాత్రికల్లా ఆ పిల్లకి భయం పట్టుకుంది. మూడోరోజల్లా ఈ వర్షం మరింక తగ్గదు కాబోలు. ఎండ మరింక రాదు కాబోలు అనుకొని బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఈరోజు పొద్దున్నించీ కూడా వర్షం లేకపోవడంతో ఆమెక్కొంచెం ధైర్యం వచ్చింది. కాని, ఎండ తప్పక రేపొస్తుందని అమ్మ కూడా చెప్తే కాని ఆ పిల్లకి పూర్తిగా నమ్మకం కదురదు. ‘‘అమ్మా! ఎండమ్మా ఎండ! ఎండ ఎప్పుడొస్తుందమ్మా?’’ అని మళ్ళీ అడిగింది సుందరం. సుందరానికి ఎండంటే ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్న పైనింకా ఉన్నప్పుడు, రెండేళ్ళ కిందట, కార్తీక మాసంలో వాళ్ళ నాన్నతోనూ అందరితోనూ కలిసి సుందరం వనసంతర్పణకి వెళ్ళింది. నాన్నతో మిల్లులో పన్చేసే మిగతా పనివాళ్ళూ, వాళ్ళ ఆడవాళ్ళూ, పిల్లలు అంతా కూడా వచ్చేరారోజున. బంగారంలాంటి ఎండని ఆ ఒక్కరోజే చూసింది. అక్కడ కొండవార రాజుగారి పువ్వులతోటలో అంతా చీకటిలోనే వెళ్ళి దిగి అక్కడ వండుకొని తినుకొని, ఆడుకొని, పాడుకొని రోజు రోజుల్లా హాయిగా గడిపేరు. ఆవేళ పొద్దున్నే కొండ మీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండ నీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే నెమలిపింఛంలా మెరిసింది. పదిగంటలకి ఎండ వెచ్చగా వెచ్చగా ఉంటూ కమ్మగా వండిన వంటవాసనల్తో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా ఉంది. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళ మెరిసింది. ఎండంటే సుందరానికి ఎంతో ఇష్టం. కాని, ఎండని సరిగ్గా చూడ్డానికి ఆ పిల్లకి ఎప్పుడో కాని అవకాశం ఉండదు. శారదమ్మ ఊళ్ళోకి పోకపోతే ఆవిడకి దినం గడవదు. అంచేత, సుందరం ఇంటిపట్టునే ఉండితీరాలి. ఇంటి కాపలా ఉండి, చెల్లెల్ని చూసుకోవాలి. అన్నయ్య ఎక్కడికీ పారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళుండే గది వెనక కొండదాకా కొండదాకా ఉన్న పాతమామిడితోట ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. నాలుగైదేళ్ళయి ఆ తోట పూతా లేదు. కాపూ లేదు. ఎదరగా ఉన్న రోడ్డెక్కూడా రెండు వైపుల్నించీ ఎత్తుగా దట్టంగా కుమ్ముకున్న చెట్లతో అదో పొడవాటి గుహలా ఉంటుంది. సుందరం ఉండే పాతగదికి వీధి వైపుకి ఒక్క గుమ్మం తప్ప కిటికీల్లేవు. గదంతా చాలా చీకటిగా ఉంటుంది. గదికి ఎదురుగా కొంచెం పక్కగా ఉన్న పాతమర్రిచెట్టు. కదల్లేని ముసలిరాక్షసిలా చీకటిగా భయంకరంగా ఉంటుంది. కిందనున్న గదిలోకి ఒక్కచుక్కయినా రానీకుండా ఎండను అదే మింగేస్తుంది. ఇంట్లో ఎంతగా రాదో అంతగా రావాలి సుందరానికి. చుట్టుపక్కల మైలు దూరంలో ఎక్కడా ఇళ్ళులేవు. రోడ్డు మీద జనసంచారం కూడా అట్టే ఉండదు. అమ్మ లేనప్పుడు వీధి గుమ్మంలో చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకొని బితుకూ బితుకూ కూర్చుంటుంది సుందరం. ఆ పిల్ల ముఖంలో స్పష్టంగా కనిపించేవి కళ్ళే. మర్రిచెట్టుకి చాలా అవతల మిగిలిపోయిన ఎండ ఆ కళ్ళలో బలహీనంగా మెరుస్తుంది. ఆ పిల్లనోరు, చలిగాలికి ముడుచుకుపోయిన గులాబి మొగ్గలా చాలా చిన్నదిగా ఉంటుంది. గట్టిగా గెంతినా నవ్వినా ఆమెకు దగ్గొస్తుంటుంది. ప్రాణంతో ఉన్న సుందరానికి నీడగా పడిన సుందరంలా ఉంటుంది సుందరం. అందుకే ఆ పిల్లని చూస్తూ చూస్తూ ‘ఈ నీడ ఎప్పుడు మాయమైపోతుందో’నని శారదమ్మ అప్పుడప్పుడు భయపడుతూ ఉంటుంది. వర్షం పడిన మూడ్రోజులూ ఎక్కడికీ పోకుండా శారదమ్మ ఇంటిపట్టునే ఉండిపోయింది. సుందరానికి అది కొంచెం నయం అనిపించింది. ఇవాళ వర్షం పళ్ళేదు. రేపు ఎండ రాదా అనుకొంది సుందరం. ఆకాశంలోని మబ్బులు కొత్త బలాన్ని తెచ్చుకొంటున్నాయని ఆ పిల్ల గ్రహించుకోలేదు. కాని, ఆకాశం వైపు చూస్తే మాత్రం ఆమెకి బెంగ తగ్గడం లేదు. ‘‘అమ్మా! అమ్మా! ఎప్పుడొస్తుందమ్మా ఎండా?’’ అంటూ తల్లి భుజం పట్టుకు ఊపుతూ మళ్ళీ అడిగింది సుందరం. ‘‘రేపు రావచ్చు తల్లీ!’’ అంది శారదమ్మ చిమ్నీ నెమ్మదిగా తుడుస్తూనే. ‘‘ఎండొస్తుందమ్మా?’’ ‘‘ఎందుకు రాత్తల్లీ?’’ శారదమ్మ అలా అనగానే సుందరం ఎగిరి గంతేసి, తల్లి పక్కనే కూర్చున్న నాలుగేళ్ళ చెల్లెలు సరూతో, ‘‘చెల్లీ! చెల్లీ! రేపు ఎండొస్తుందిటే. ఎండ!! మరంచేత దేవుడికి దండం పెట్టమ్మా!’’ అంది. సరూ, అక్కమాట వినగానే ఆ పిల్ల వీధి వైపు తిరిగి ముద్దుగా ఓ దండం పెట్టింది. సుందరం చెల్లెల్ని ముద్దాడి, అక్కణ్నుంచి గదిలోకి పరిగెట్టింది. ఆ చీకట్లో గోడవార కర్రపెట్టె మీద కూర్చున్న అన్న దగ్గరికి వెళ్ళి, ‘‘అన్నా! ఒరే! ఎండరా ఎండ! ఎండ రేపొస్తుందిట!’’ అంటూ సంతోషంతో కేకలు వేసింది. అన్న–అంజిగాడు సుందరం కంటే రెండేళ్లు పెద్ద. వాడికి కాళ్లూ చేతులూ పెద్దవిగా ఉంటాయి. తల మాత్రం చెంబులా చిన్నదిగా ఉంటుంది. వాడు ఎండా, నీడా అంటే తెలుసుకోలేడు. అన్నం కలుపుకు తినలేడు. వాడికి మాటలు రావు. వాడు వెర్రివాడు. వాడెప్పుడూ ఆ కర్ర పెట్టె మీదే కూర్చుంటాడు. లేపోతే దాని మీదే పడుకుంటాడు. ఎప్పుడూ నోట్లో వేలు పెట్టుకు కనిపిస్తాడు. సుందరం గెంతుకుంటూ తడిపరికిణీ పరపరలాడించుకుంటూ సరూ దగ్గిర కొచ్చి, ‘‘లేవే సరూ! రేపు ఎండొచ్చేదాకా ఆటకుందాం రావే’’ అంటూ చెల్లెల్ని చెయ్యిపట్టుకు లేవదీసింది. ఇద్దరూ రంయిమంటూ నడవ మీంచి వాకిట్లోకి గెంతి, అక్కడ నిలవనీళ్లలో చప్పట్లు కొడుతూ ఆడ్డం మొదలుపెట్టేరు. ‘‘ఎండొస్తుందీ. రేపు ఎండొస్తుందీ! నెమిలికన్నులా. వెండిగిన్నెలా ఎండొస్తుందీ! ఎంతోచక్కని ఎండోస్తుందీ!’’ అంటూ సుందరం పాడే పాట శారదమ్మ చెవిలో పడుతోందేకాని, ఆవిడ అదేదీ సరిగా వినడం లేదు. శారదమ్మకి దేవుడి యెడల భక్తెక్కువ. ఎన్ని విషయాల్లో భగవంతున్ని ఎంత ఎడం పెట్టినా, ఆవిడ మాత్రం ఆయన ముగింట కదలకుండా మొండిగా కూర్చుంది. ఏడాది కిందట, ఆవిడ పెనిమిటి తను పనిచేసే మిల్లు తాలుకు లేబర్ వ్యవహారాల్లో కూలివాళ్ల తరపున తగువుల్లో ఇరుక్కొని దెబ్బలాటల్లో చిక్కుకొని, ఖూనీ కేసుల్లో అక్రమంగా ఈడవబడ్డ, యావజ్జీవ కారాగారవాసశిక్ష అనుభవించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు దేవుడంటే కొంచెం–అతి కొంచెం చిరుకోపం వచ్చింది. ‘‘మీ అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. పిల్లలకి తిండి పెట్టాలంటే ఇంట్లో చీకటి తప్ప ఇంకేంలేదు. మాయందు దయ ఉంచి ఒక్కసారి రా నాన్నా!’’ అంటూ ఎందరి చేత ఎన్ని కబుర్లు పంపినా, ఎన్ని అర్జంటు టెలిగ్రాములు కొట్టినా ఎంతకీ రానట్టి డబ్బుగల తండ్రి మీద పేదింటి కోడలైన ఆడకూతురికి కోపం వచ్చి అలిగినట్టు ఆమె ఆ రాత్రి భగవంతుడి మీద కోపం తెచ్చుకుని అలిగింది. కాని ఆ కోపంలో కాఠిన్యం లేదు. మర్నాటికల్లా ఆమె సర్దుకుంది. ∙∙ ఆవిడ రాత్రికి దీపం సంపాదించడంలో గొడవలో మునిపోయింది. లాంతరు వెలిగిద్దామంటే అగ్గిపెట్టి బాగా నానిపోయింది. పుల్లలు చూస్తే మూడే ఉన్నాయి. అందులో రెండప్పుడు వెలక్కుండా ఒట్టిపోయి విరిగిపోయేయి. మూడోది–దేవుడి దయుంటే వెలుగుతుంది. లేకపోతే లేదు. ఈరోజుకి దేవుడికి శారదమ్మ యెడల దయలేదు. ఈ రాత్రికి ఈ ఇల్లంతా చీకట్లో ఉండవలసిందనే అతని అభిప్రాయం. అంచేత, చీకటి మరీ ఎక్కువ కాకుండా పిల్లలకి అన్నాలు పెట్టేస్తే అందరూ వేగిరం కళ్లు మూసుకొని పడుకోవచ్చు. తెలివున్నంతసేపే కాని తెలివి తప్పిపోయేక దీపం ఉన్నా ఒకటే, లేపోయినా ఒకటే. పాత మొఖాసాదార్గారి భార్యకి తమ యెడల భగవంతుడి దయవల్ల–కరుణ కలగబట్టి ఇందులో ఈపాటి తలదాచుకోనిచ్చింది. వారానికి వంద అప్పడాలు పుచ్చుకోవడం తప్ప, అద్దిచ్చినా పుచ్చుకొంది కాదు. రెండుపూట్ల వంట చేసి పిల్లలకి కాస్త వేడన్నం రెండు పూట్లా పెడదామంటే ఈ వర్షం వల్ల ఎక్కడా ఓ కాణీ అయినా పుట్టకుండా ఉంది. వర్షాల వల్ల కూరా నార దొరకని ఈరోజుల్లో అప్పడాలూ, వడియాలూ పేరయ్య కొట్టు మీద వేడివేడి పకోడిల్లాగ జోరుజోరుగా చెల్లిపోను. కాని ఏంచేస్తాం? ఇంట్లో పిండి లేదు. ఎండ లేదు. ‘‘అమ్మ! కంచాలేసుకున్నాం అన్నం పెట్టమ్మా!’’ అంది సుందరం. మధ్నాహ్నం భోజనాలవగా మిగిలిన అన్నం వీధి వరండాలోకి గిన్నెతో పట్టుకొచ్చింది శారదమ్మ. ‘‘అటు చూడమ్మా! ఎంత చీకటిగా ఉందో!’’ అంది సుందరం. ఆకాశంకేసి చూసేసరికి శారదమ్మకి నిజంగా చాలా భయం వేసింది. ‘‘అమ్మా! అలా చూస్తున్నావేంటమ్మా? ఎండ రేపు రాదా?’’ అని అడిగింది సుందరం. ‘‘ఏమోనమ్మా? ముందు మీరంతా భోంచేసి వేగిరం పడుకోండి!’’ ‘‘ఎండరాదేంటమ్మా?’’ అని మళ్ళీ అడిగిన సుందరం కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అమ్మ ముఖంలో ఎండ రేపోచ్చే సూచన్లు కనిపించలేదాపిల్లకి. ‘‘ఎందుకమ్మా నీకా బెంగ? ఎండ తప్పక రేపొస్తుంది. ముందు భోంచెయ్యి. బెంగపెట్టుకోక!’’ అంది శారదమ్మ. ‘‘నేను భోంచేయనమ్మా!’’ ‘‘అల్లరి చేయకమ్మా. సుందరం!’’ ‘‘రేపు ఎండొస్తుందా?’’ ‘‘ఒస్తుంది. భోంచెయ్యి’’ ‘‘నాన్నొస్తాడన్నావు. రానేలేదు. నువ్విలాగే ఉత్తుత్తి మాటల్చెప్తావమ్మా’’ ‘‘మన చేతుల్లో ఏవుందమ్మా? దేవుడి దయకలగాలి. నాన్న రావాలి’’ ‘‘దేవుడికి దయెప్పుడు కలుగుతుందమ్మా?’’ ‘‘కలుగుతుంది తల్లీ! బెంగపడక భోంచెయ్యి!’’ అంది శారదమ్మ. అంతలో సరూ, ‘‘అమ్మా అగ్గి! ఆమ్మ! అగ్గి!’’ అని కేకలు వేసింది. చూస్తే అవి చీమలు. శారదమ్మకి ఏంచేయాలో పాలుపోక అలా చూస్తూ నిల్చుంది. వీధిలో సుమారు రెండువందల మంది ముష్టివాళ్ళు గోనెలూ, జోలెలూ, డొక్కులూ, కుండలు, కంపలు పట్టుకొని మోసుకొని తొందర తొందరగా ఊరి వైపు నడుచుకుంటూపోతున్నారు. వాళ్ళంతా శారదమ్మ కాపురం ఉండే గదికి కొంతదూరంలో ఉండే సాధూమఠంలో ఉంటూంటారు. ఇవాళ పొద్దున కాబోలు, మఠం గోడొకటి వర్షానికి నానిపోయి కూలి పోయిందన్నారు. రాత్రికి వర్షం తిరిగి వచ్చే సూచన్లు చూసి వాళ్ళంతా మరెక్కడైనా తలదాచుకొందికి పోతున్నట్టున్నారు. వాళ్ళనలా చూస్తూ శాదమ్మ మౌనంగా నిల్చుండి పోయింది. ‘‘అమ్మా! వాళ్ళెందుకు అలా పారిపోతున్నారు?’’ అని అడిగింది సుందరం. ‘‘భయం చేత అలా పారిపోతున్నారమ్మా’’ ‘‘ఎందుకమా వాళ్ళకి భయం?’’ ‘‘వాళ్ళ బతుకులకి ఎండ లేదమ్మా! అందుకు భయం!’’ ‘‘మరి, మనకి ఎండ ఉంటుందా అమ్మా!’’ ‘‘దేవుడికి దయుంటే అందరికీ ఉంటుంది తల్లీ!’’ ‘‘దేవుడికి మనందరి మీద కోపమా అమ్మా?’’ ‘‘లేత్తల్లీ!’’ అంది శారదమ్మ. శారదమ్మ మూడు కంచాల్లోనూ ఉన్న అన్నం మళ్ళీ గిన్నెలోకి ఎత్తి, మూడుసార్లు నీళ్ళతో కడగ్గా చీమలన్నీ తేలిపోయాయి. పిల్లలకి అన్నం పెట్టడం కోసం చీమల కడుపులు కొట్టవలసొచ్చిందనేసరికి ఆమెకెందుకో కాని కడుపులో దేవేసినట్టయింది. తడి అన్నంలో మజ్జిగనీళ్ళు వేసి ముగ్గురు పిల్లల చేతా శారదమ్మ భోజనాలు చేయిస్తుండగా వర్షం యథాప్రకారం నిన్నా మొన్నా అటు మొన్నట్లాగే పట్టుకొంది. పిల్లల భోజనాలయాక, శారదమ్మ గిన్నె కంచాలు కడిగేసి గదిలోకి వెళ్ళిపోయిన పిల్లల్ని బుద్దిగా పడుకోమన్చెప్పి కేక వేసింది. వర్షం జోరుగా తెగ జోరుగా పడుతోంది. వర్షం చేసేచప్పుడికి, కేకలు వేస్తేగాని నడవలో మాట గదిలోకి వినిపించడం లేదు. వెర్రిపిల్లడు నోట్లో వేలు పెట్టుకుని గోడవార కర్రపెట్టె మీద ముణుచుకు పడుక్కున్నాడు. ఆ పిల్లాడి మీద తడి పూర్తిగా ఆరని పాతచీరె మడతలు పెట్టి కప్పింది శారదమ్మ. మరోవార పొట్టి మడతమంచం మీద సరూ, సుందరాలు తడారని పాతబొంత కప్పుకు పడుకున్నారు. గదంతా యథాప్రకారం కురవడం ప్రారంభించింది. బాగా చీకటిపడి గంటే అయిందో, రెండు గంటలే అయిందో, నడవ పక్క వీధి గుమ్మానికి చేర్లబడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది శారదమ్మ. ఆమెకు నిద్ర రావడం లేదు. వర్షంలోకి అలా రెప్ప వెయ్యలేకుండా అదేపనిగా చూస్తూ ఆలోచిస్తోంది. చీకట్లో వర్షధారలు చాలా అస్పష్టంగా కనిపించడంచేత ఆకాశానికి, భూమికి మధ్య నీరు తప్ప మరేం ఉన్నట్టు అనిపించడం లేదు. శారదమ్మ కళ్ళంట నీరు తిరగడం ఆ చీకట్లో కనిపించడం లేదు. తన మట్టుకు తనకి, శారదమ్మకి, తనెక్కడో ఏదో లోతు దొరకని సముద్రం లోపల గులకరాళ్ళు గుహలో తేలలేక కూలబడి కూర్చున్న రీతిగానే తోస్తోంది. ఎంతటి ప్రకాశవంతమైన సూర్యరశ్మయినా ఇంత లోతు నీటిలోకి ఇంత లోతుకి దిగదు. దిగజాలదు. ఈ మహాసముద్రపు విషపు నీటి అట్టడుక్కి ఏ యెండా, ఏ వెలుగు ఎన్నటికీ రాదు. రాజాలదు. ఈ వాదమ్మ మరింక భూమ్మిదికి తేలడానికి ఏ అవకాశం అయినా సరే ఎక్కడా లేదు. ఉండదు. ఉండబోదు. ఆ సమయంలో శాదమ్మకి–ఎండ లేని తన బాల్యం, చలి కాలపు సాయంకాలపు ఎండలాంటి తన యవ్వనం, నీరెండయినా చోరని రాతిగోడల మధ్య ఇరుక్కున్న తన పెనిమిటి రూపం, మెదడంతా చీకటితో నిండిన తన వెర్రికొడుకు జీవితం, ఎండ కోసం పాకులాడుతూ తనతో పాటు ఈ సముద్రపు అట్టడుగున, సముద్రమంత బరువు కిందా, ఈ చీకటి నీట్లో ఈదలేక, తేలలేక, చావలేక ఉక్కిరి బిక్కిరయి కొట్టుమిట్టాడే తన అతిచిన్న ఆడపిల్లల ఘోర పరితాపం అన్నీ గుర్తుకొచ్చి ఆమెని కుంగతీసి కలచివేయగా ఆమె కళ్ళంట జారిన కన్నీళ్ళు నడవలో రాతిగచ్చు మీద పడి, అక్కడ కురుస్తున్న నీటితో కలిసి వాకిట్లోకి కుంటుకొంటూ పోయి, అక్కణ్ణుంచి రోడ్డు మీదికి తేలి, అక్కణ్నించి కాలవలోకి దూకి ఆ రాత్రి ఆ చీకట్లో ఆ వర్షంలో ఎక్కడో ఏ చీకటి సముద్రంలోకో కాని కొట్టుకుపోయి కలిసిపోయేయి. వెర్రిపిల్లడు కర్రపెట్టె మీద వింత జంతువులా పడుకున్నాడు. ‘‘ఎండంతా చచ్చిపోయిందంటే అక్కా? నిజం చెప్పవే!’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సరూ చివరికి నిద్దరనే చీకట్లో మెల్లి మెల్లిగా కలిసిపోయింది. పిల్లల ఏడుపు వినిపిస్తే రాక్షసులొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతారని సుందరాన్ని ఎప్పుడో ఎవరో జడిపించేరు. ఆ జడుపు ఇప్పటికీ ఆమెని వదల్లేదు. అందుచేత, రాక్షసులెవరికీ వినిపించకుండా, బెంగతో, బాధతో చెప్పజాలని ఆవేదనతో ఆ రాత్రి అతి రహస్యంగా ఏడ్చి ఏడ్చి అలిసలిసిపోయిన సుందరాన్ని చూసిచూసి మరింక చూడలేక దయదాల్చిన చావులాంటి నిద్ర, ఆ పిల్ల కప్పుకున్న తడిబొంతలా. ఆఖరి కెలాగైతేనేం ఆమెని అతిచల్లగా కప్పింది. చీకట్లో తెరిపి లేకుండా పడే వర్షం, కళ్ళు లేని గుండెలేని కారు నల్లని గీతల గీతల భూతంలా ఉంది. - రాచకొండ విశ్వనాథశాస్త్రి -
నేను దొంగిలించలేదు
చాలా ఇరుకుగా వుంటుంది ఆ దొడ్డి. ఎప్పుడూ చీకటిగానూ వుంటుంది. చెమ్మతో చల్లగా వుండే నాలుగయిదు మెట్లు ఎలాగో తడుముకుంటూ దిగి వెళితే ఎదురుగా చిన్నద్వారం వున్న ఇల్లు కనిపిస్తుంది. గోడ మీద చిరిగిపోయిన అట్టముక్క మీద ‘స్టీబకే: జోళ్ళు తయారుచేసేవాడు’ అని రాసి వుంటుంది. మధ్యాహ్నమయింది. ఆ దొడ్డిలో కాపురం వున్న దురదృష్టవంతులు అప్పుడే తిళ్ళూ అవీ ముగించుకుని తీరికగా వున్నారు. ఒకామె పెద్దగొంతుకతో ఏదో వీధిపాట మొదలుపెట్టింది. దొడ్డి అవతల వరసనించి పెద్దగొంతుకతో ఎవరో అరిచారు ‘‘కొంచెం నోరు కట్టిపెట్టవమ్మా, నీలాగే అందరూ అరిస్తే ఇక్కడ వుండడమే రోత అయిపోతుంది’’ ఒక కిటికీ దభీమని మూతపడింది. కిటికీతో పాటూ పాటా బందయిపోయింది. నిశ్శబ్దంగా వుంది. బైట రోడ్ల మీద, రాళ్ళు పగుల్తున్నట్లుగా వుంది ఎండ. వేసవి నడియవ్వనంలో వుంది. దొడ్డిలోని వాళ్ళు మధ్యాహ్న భోజనాలయాక, చిన్న కునుకు తీస్తున్నారు. ఒక కిటికీ తెరుచుకుంది. ఏదో దొడ్డి ముందు వచ్చిపడింది. దుమ్ముముక్క. ఎండ వెలుగులో అది మెరుస్తోంది! ఆ మూల వొక ముసిలికుక్క కూచునివుంది. బాగా బక్కచిక్కిపోయివుందది. దుమ్ముముక్క చూడగానే దాని కళ్ళు మెరిశాయి. ఒక కాలు మెల్లిగా చాచింది కుక్క. మెల్లిమెల్లిగా మరోకాలూ చాచింది. లేచిందది. ముందుకువచ్చింది. ఆకలితో అలిసిపోయిన దాని శరీరం వూగుతోంది. అరుగు చివరిదాకా ఎలాగో ఈడ్చుకుంటూ వచ్చింది. మెడ చాచింది. నాలిక పైకి తీసింది. దాని మెడకి కట్టిన గొలుసు పొట్టిగా వుంది. దుమ్ముముక్క దాకా అంది రాలేదది. బాధతో గుర్రుమని మూలిగింది కుక్క. కాంక్ష సూచిస్తున్న కుక్క కళ్ళల్లో మరోసారి బాధతో కూడిన వొక తళుకు మెరిసింది. ఆఖరిసారి మళ్ళీ అటుచూసింది. పక్కనే వున్న చిప్పలో మూతి పెట్టింది. చిప్పలో నీళ్ళు లేవు. ఖాళీగానే వుందది. ఒక్క చుక్కయినా తడిలేదు. నాలిక పైకి చాచి మళ్ళీ పడుకుంది కుక్క. దొడ్డి ద్వారం చప్పుడైంది. రెండు చిన్న చేతులు కుక్కని కౌగిలించుకున్నాయి. ఒక కుర్రాడు దాని దగ్గిర నేల మీద చతికిలబడ్డాడు. ‘‘ప్లూటో, ప్లూటో నా ముసిలి ఫ్లూటో!’’ ఆ పిలుపులో ప్రేమ వొలికిపోతూ వుంది. తోక ఆడించింది కుక్క. కుర్రాడి బక్క గుండెల మీద మోర మోపింది. అతడి చేతులూ, మొహమూ నాకింది. అయితే దాని ఆనందంలో ఉత్సాహం లేదు. వేదన కనిపిస్తూనే వుంది. గ్రహించాడతడు. ‘‘అయ్యో, ప్లూటో, నీ దగ్గిర నీళ్ళూ లేవా? ఉండు’’ అంటూ లేచాడతడు. విరిగిన మట్టిచిప్పతో పైపు దగ్గిర నించి నీళ్ళు తెచ్చాడు. కుక్క చూపు కనిపెట్టి, దుమ్ము ముక్క తెచ్చి వేశాడు. పెద్దపెద్ద కోరలతో దాన్ని కొరకడం మొదలెట్టింది కుక్క. ‘‘నా దగ్గిర ఏమీలేదు. కొంచెం వోపిక పట్టు ప్లూటో, నా చేతికి కొంచెం డబ్బు రానీ, నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు భలే మాంసం ముక్క తెచ్చిపెడతాను. నిజం. నా మాట నమ్ము’’ అన్నాడతడు. చెప్పడం తేలికే హాస్స్టీబకేకి. తన చేతిలో దమ్మిడీ లేదు. తన దగ్గిర వుండేదల్లా తన రొట్టిలోంచి మిగిల్చిన నాను రొట్టిముక్క మాత్రమే. అదే తన నేస్తానికి పొద్దుటా, సాయంకాలం తాను ఇవ్వగిలిగింది. హాస్ స్టీబకే కుర్రాడు. పట్నం ఉత్తరభాగంలో పాలు అమ్మడం అతడి పని. అతడి పెరగడం ఆగిపోయింది. అతడి జబ్బు కళ్ళూ, చప్పిడి ముక్కు, వాడిపోయిన చూపులు చూసినవాడు ఎవడూ అతడికి పన్నెండేళ్ళే అయాయని అనుకోడు. ప్లూటోని తట్టాడు హాస్. చీడీల మీంచి టకటకా నడుస్తూ కింది ఇంటిదిక్కు నడిచాడతడు. ఒక ఇంటిగుమ్మం ముందు నుంచున్నాడతడు. అతడి కళ్ళలో వైరాగ్యం, జబ్బూ కనిపిస్తున్నాయి. మెల్లిమెల్లిగా ముందుకి అడుగులు వేశాడు. మెట్ల మీద నుంచి కిందికి దిగాడు. ద్వారం దగ్గిర అట్ట మీద ‘స్టీబకే: జోళ్ళు తయారుచేసేవాడు.’ అని రాసి వుంది. లోపల ఏదో చప్పుడైంది. వెంటనే ఎవరో ఆవులించినట్టూ వినిపించింది. కుర్రాడి ముఖంలో భయం కనబడింది. అతడి తండ్రి ఇంట్లో వున్నాడు. జంకుతూ జాగ్రత్తగా తలుపు తోశాడు. ‘‘నువ్వు సరైన వేళకే వచ్చావు. చప్పున పరిగెత్తుకు వెళ్ళు. కులేకు దుకాణం నుంచి మూడణాల సారా పట్టుకురా. డబ్బులు లేవు. ఇస్తానని చెప్పు...’’ కుర్రాడు ఏడుపు గొంతుకతో జవాబు చెప్పాడు: ‘‘డబ్బులివ్వకపోతే వాడు నాకు ఇవ్వడు నాన్నా! నిన్నే సీసా విసిరేశాడు. కొట్టడానికి వచ్చాడు. నాకు భయమేస్తోంది’’ అన్నాడు. ‘‘చాప్, వెధవా. వెళతావా తన్నమన్నావా’’ బెంచీ మీద పడుకున్న ఆ పెద్ద ముఖం మనిషి అరిచాడు. ‘‘స్టీబకే’’–పొయ్యి దగ్గిరినించి తల్లి, వొక పిల్లాణ్ణి గుండెల మీద వేసుకునీ, వొకణ్ణి వేలుచ్చుకు నడిపించుకునీ వచ్చింది. భర్తకీ, కొడుక్కీ మధ్యగా నుంచుంది. బతిమిలాడుతూ అంది ఆమె: ‘‘స్టీబకే కొంచెం ఆగు. కాస్త రొట్టి ముక్క తిననీ వాడు. తేరుకుంటాడు. ‘‘బాబూ, చూడమ్మా, తిండి తినేసి నాన్న కోసం సారా తెచ్చి పెట్టేం!’’ ‘‘ఉహూ’’ అంటూ తలవూపి గొణికాడు హాస్. ‘‘నాకు భయమేస్తోంది. వాడు నన్ను కొడతాడు. సారా తాగాడంటే నాన్నా బజాయిస్తాడు. ఉహు, నేను వెళ్ళను...వెళ్ళను.’’ ‘‘ఒరేయ్!’’ బెంచీ మీద పడుకున్న మనిషి జోరుగా కొడుతూ అరిచాడు. కుర్రాడు సీసా తీశాడు. క్షణంలో ద్వారం అవతలికి వెళ్ళిపోయాడు. వెనకాల వినబడుతూనే వుంది తండ్రి నువ్వు. ‘‘పాలమ్మే కుర్రాళ్ళలో ఎవడో మహాచెడ్డవాడున్నాడు. దొంగ, పచ్చిదొంగ వాడు’’ తుఫానులాగా ఈ వార్త వూళ్ళో అల్లుకుపోయింది. వాణ్ణి పట్టుకున్నారు. నీలిచొక్కా తొడుక్కున్నాడు వాడు. పారిపోకుండా కింద కూచోబెట్టారు. రెండూ రెండూ కలిపితే ఎంతవుతుందో తెలియనివాడు హాస్ స్టీబకే. రోడ్డు మీద డబ్బులు పడివుంటే తియ్యడు సరికదా, పక్కనించి తప్పించుకుపోతాడు. వాడా అర్ధరూపాయి దొంగిలించింది! ఇంత తెలివి తక్కువా? బాకీ డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు దొంగిలిస్తే డ్రైవర్ కనిపెట్టేశాడట! అసలు కథ ఏమిటంటే, హాన్స్టీబకే దొంగిలించడం నిజం. అతడే వొప్పేసుకున్నాడు కూడా. వొణికిపోతూ, బిక్కచచ్చిన ముఖంతో తనంతట తానే డ్రైవర్‌కి లొంగిపోయాడు. ఇన్స్పెక్టర్ దగ్గిరికి వచ్చేక నోరు విప్పలేదు. బిక్కముఖం వేసి తలవొంచకున్నాడు. ఎంతో అంత తర్జనభర్జన జరిగింది. ‘‘ఎక్కడ దాచావు అర్ధరూపాయి?’’ ‘‘కేకులు కొనుక్కు తిన్నావా?’’ దేనికి జవాబు లేదు. ‘‘ఏం రా, దొంగతనం తప్పని తెలియదూ? తెలిసిన్నీ డబ్బులు దొంగిలించావూ? సిగ్గు వేయ్యలేదూ నీకు? ఊరిపోసుకు చావలేకపోయావూ?’’ కళ్లజోడు సర్దుకున్నాడు ఇన్స్పెక్టర్. కుర్రాడి ముఖం తీవ్రంగా చూశాడు. ‘‘నీ నౌకరీ పీకెయ్యడం నా చేతిలో వుందని నీకు తెలుసుకదా! దొంగలకి మా దగ్గిర జాగా లేదు’’ ఈనెపుల్లలా వున్న హాస్ శరీరంలో మెరుపు పరిగెత్తినట్టయింది. క్షమాపణ చెప్పుకోవడానికి చేతులు జోడించాడతడు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ‘‘నా నౌకరీ తీసెయ్యకండి బాబయ్యా, దయచూడండి. చంపేస్తాడు మా బాబు. మరెప్పుడూ ఇలా చెయ్యను. నౌకరీ తీసెయ్యకండి.’’ అతడి నోరు తొట్రుకుంటూవుంది. కళ్ళలోంచి నీళ్ళు బొటబొటా కారుతున్నాయి. ‘‘మరి డబ్బులెందుకు కాజేశావ్?’’ హాస్ మళ్లీ మూగనోము పట్టాడు. అతడి కాళ్ళు వణుకుతున్నాయి. ‘‘పంతగొట్టులా వున్నాడు’’ పక్కమనిషితో అన్నాడు ఇన్స్పెక్టర్. హాస్ని మళ్లీ గద్దిస్తూ అన్నాడు... ‘‘సరే, నువ్వు ఇంటికి వెళ్లవచ్చు. నీ బాబుని సాయంకాలం ఇక్కడికి రమ్మను మాట్లాడాలి. ఏడిస్తే వచ్చేదేమిటి? తిన్నగా ఇంటికి పో.’’ నీడ కదులుతున్నట్టు రోడ్ల మీద వెళుతూ కనిపించాడు హాస్. ఇల్లు దగ్గిరపడుతున్నకొద్దీ అతడి అడుగులు మందమవుతున్నాయి. తుదకి అతడు పాకుతున్నాడా అన్నట్టు వెళుతున్నాడు. కసాయి దుకాణం దగ్గిరకి వచ్చాడు. నిన్న ఇక్కడే ఆ సంఘటన జరిగింది. కిటికీ దగ్గిర వేలాడుతున్న మేకమాంసాన్ని లాలసత్వంతో చూస్తూ నుంచున్నాడు. గుటకలు మింగుతూ నుంచుకున్నాడు. నిజమే, కాని ఆ గుటకలు తన కోసం కాదు. కుక్క కోసం. దానికి ఇంత తిండి వేసేవాడే లేడు. దాని యజమాని లెహమాన్న్ లుబ్ధాగ్రేసర చక్రవర్తి. పగలనక, రాత్రనక దాని చేత రోడ్ల మీద బండి లాగిస్తూ వుంటాడు. అదే సమయానికి లేహమాన్న్ బండి తోలుకువచ్చాడు. సంచులు దొంతులుగా బండి మీద వున్నాయి. కుక్క ప్లూటో బండిలాగుతోంది. అది మరి నడవలేకపోతూవుంది. బండి కదల్లేదు. ఒకటి ఛళ్లున తగిలించాడు లెహమాన్న్. ప్లూటో వొణికింది. బలమంతా కుదించింది. ముందుకి ప్రయత్నించింది, బండి కొంచెం కదిలింది. కాని, మళ్లీ ఆగిపోయింది. కుక్క కిందపడుకుండి పోయింది. ‘‘స్కౌండ్రల్’’ అంటూ అరిచాడు లెహమాన్న్. కాలెత్తి కుక్కని తన్నడం మొదలెట్టాడు. కుక్క దుఃఖంతో అరుస్తోంది. దుకాణం కిటికీ దగ్గిర నుంచి మెరుపులా పరుగెత్తుకువచ్చాడు హాస్. కుక్కకీ దాని యజమానికీ మధ్య నుంచున్నాడు. ‘‘నీకు పుణ్యముంటుంది, దీన్ని కొట్టకు. పాపం, దీన్ని కనికరించు’’ అంటూ దీనంగా బతిమాలాడు. కుర్రాడి కమీజు నులిపిపట్టుకున్నాడు లెహమాన్న్. వాడి చెవులు నులిపినంత పనిచేశాడు. ‘‘చచ్చుదద్దమ్మా, పో. నీ పనేదో నువ్వు చూసుకుని ఏడు’’ గుండెల నిండా బాధా బరువుగా వుంది హాస్కి. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కసాయి దుకాణంలో వేలాడుతున్న మాంసం ముక్క, కళ్ళ ముందు కట్టినట్టుంది. ఊగుతోందది. రమ్మని పిలుస్తున్నట్టుంది. ఆహా! ప్లూటో! ప్లూటోకి ఆ ముక్క దొరికితేనా! ఇది నిన్నటి మాట. ఇవాళ డబ్బులు దొంగిలించాడు హాస్. అతడు డబ్బులు పట్టుకు వెళుతూ వుంటే తక్కిన కుర్రాళ్ళు అతణ్ణి వేలెత్తి చూపుతున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఏవో గుసగుసలాడుతున్నారు. ‘‘దొంగ, దొంగ’’ తన తండ్రితో సంగతంతా ఇన్స్పెక్టర్ చెపుతాడు. ఇదంతా అతడి తలలో గిర్రుమంటూవుంది. అయినా అతడి ముఖంలో విజయసూచకమైన ఒక తళుకు కనిపిస్తూనేవుంది. జంకుతూ జంకుతూ నాలుగు దిక్కులూ చూశాడు. నోట్లోంచి షిల్లింగు బైటికి లాగాడు. పిడికిట్లో బిగించి పట్టుకున్నాడు. చప్పున దుకాణంలోకి దూరాడు. రెండు నిమిషాల్లో చిన్న పొట్లం జేబులో పెట్టుకొని పైకి వచ్చాడు. ఒక్క వూపున–ఎవరో వెంటతరుముతున్నట్లు ఇంటిదిక్కు పరిగెత్తాడు. దొడ్డిలో మూల కుక్క దగ్గిర ముడుకులు మోపి కూచున్నాడు. కుక్క మట్టిరంగు తల దడదడలాడుతున్న తన గుండెల మీదికి లాక్కున్నాడు. ‘‘ప్లూటో, నా నేస్తం, ఇదిగో నీకోసం తెచ్చాను.’’ కుక్క తల మీద దెబ్బ. చర్మం పగిలి లోపలి మాంసం పైకి కనిపిస్తూవుంది. గుడ్లనీళ్ళు తిరిగాయి హాస్కి. ‘‘మళ్ళీ కొట్టాడా? ముసిలి ప్లూటో, నా నేస్తం, ఏడ్చావా? వద్దు–ఇదిగో నీ కోసం మాంసం తెచ్చాను.’’ కుక్క వాసన చూసింది. చూసీచూడడంతోనే దాని కళ్ళు మెరిశాయి. నోరు విప్పింది. హాస్ సంతోషంగా మాంసం కోసి, ముక్క తరువాత ముక్క కుక్క నోట్లో వేయడం మొదలుపెట్టాడు. మాంసం క్రమంగా తరుగుతూ వచ్చింది. అయినా ప్లూటో నోరు ఇంకా చూస్తూనే వుంది. ‘‘అయిపోయింది. ఇంతే. దుకాణం వాడు షిల్లింగు పుచ్చుకుని ఇచ్చాడు. అంతా నీ కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు నన్ను పట్టుకు తీసుకుపోనీ. భయం లేదు’’ హాస్ తండ్రి ఇన్స్పెక్టర్ దగ్గరి నుంచి వచ్చాక హాస్కి దెబ్బలు తప్పలేదు. నోటికి వచ్చినట్లు తిట్టాడు తండ్రి. ‘‘లుచ్ఛా, దొంగా!’’ కిందపడవేసి చేతులు తీటతీరేట్టు కొట్టాడు హాస్ని. చేతులు పీకేక కాళ్ళతో లంకించుకున్నాడు. ‘‘డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు! ఆ షిల్లింగు నువ్వు ఏంచేశావో చెప్పు. నిన్ను చంపేసి మరీ వొదిలి పెడతాను.’’ ‘‘స్టీబకే, నీకు పుణ్యముంటుంది...’’ హాస్ తల్లి పిచ్చిత్తినట్టున్న తండ్రి చెయ్యి పట్టుకుంది. ‘‘నిజంగా చచ్చిపోతాడు వాడు. కాలో చెయ్యో విరిగిపోతుంది. తరువాత చేసేదుండదు. స్టీబకే, నీకు పుణ్యముంటుంది.’’ నోటికొద్దీ అరుస్తుందామె. తక్కిన పిల్లలు మొర్రో మొర్రో అంటున్నారు. ‘‘కేకలు మాంతావా లేదా? నోరు ముయ్యి ముందు. నింద ఎవడిదనుకున్నావ్! ఏం, ఇదేనా నిన్ను పెళ్ళి చేసుకున్న తప్పుకి ఫలం? నా ముందు వీడి విలువేమిటంటా? వీణ్ణి చంపితే కాని, వొదిలిపెట్టను’’ ‘‘స్టీబకే!’’ ‘‘నోరుముయ్యి!’’ గా–ట్ఠి దెబ్బ తగిలిన శబ్దమయింది. ‘‘అమ్మో!’’ అని పెద్ద కేక. ఆమె అంతదూరంలో వెళ్ళిపడింది. ఓమూల కూలబడి పోయిందామె. కొడుకు ఏడుపు వినలేక, రెండు చేతులతోనూ చెవులు మూసుకుంది. ఆఖరికి వాడి కోపం తగ్గింది. కుర్చీ మీద వెళ్ళి చదికిలబడ్డాడు. గొణగడం మొదలుపెట్టాడు. ‘‘ఎంతో నమ్మకమైన వాణ్ణి నేను....గాడిద. దొంగవెధవ. ఇన్స్పెక్టర్ నన్ను చూడగానే అన్నాడు స్టీబకే, నమ్మకమైనవాడివి నువ్వు. నీ ముఖం చూసి, నీ కొడుక్కి మరో అవకాశం ఇస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే మాత్రం వాణ్ణి నౌకరీ నుంచి తీసేస్తాను అని. ఒరేయ్ హాస్, మళ్ళీ ఇలా చేశావంటే నిన్ను మహమ్మాయి వొండేస్తాను. బతుకంతా నేను చెమటోడ్చి, చస్తూ వుంటే ఈ వెధవ ఇలా సర్వనాశనం చేస్తాడూ!’’ చివరి మాటలు సరిగా వినబడలేదు. అంతలోనే అతడు గుర్రు మొదలుపెట్టాడు. ఆకాశం మీద చుక్కలు మెరుస్తున్నాయి. డేకుతూ హాస్ బయటికి వచ్చేసరికి అందులో వొకటి సరిగ్గా దొడ్డి మీద మెరుస్తూవుంది. అతడు నడవలేకపోతున్నాడు. ఎలాగో ఈడ్చుకుంటూ మెట్ల దగ్గిరికి వెళ్ళాడు. దొడ్డిలో తడుముకుంటూ వెళ్ళి కుక్క పడివున్న మూల చేరాడు. కుక్క దగ్గిర చాపచుట్టగా పడిపోయి బెక్కడం మొదలుపెట్టాడు. మెల్లిగా మొరుగుతూ ప్లూటో అతడి ముఖం నాకింది. తుదకు పాదాల మీద శరీరం వాల్చింది. ప్లూటో, హాస్...ఇద్దరూ అక్కడ అలిసిపోయి, మూలుగుతో బాధతో పడివున్నారు. వాళ్ల మీద బంగారునక్షత్రం మెరుస్తూ వుంది. అయితే, వాళ్ళు మాత్రం దాన్ని చూడలేదు. కొన్నాళ్ళయాక– ‘‘ఒరే, పెన్నీలు రెండూ ఏవిరా? ఎక్కడున్నాయి? ఏం, నువ్వే కొట్టేశావా?’’ హాస్ భుజాలు పట్టుకుని వూపుతూ అడిగాడు డ్రైవర్. ‘‘అయ్యో! నేను తియ్యలేదు’’ ఉత్తి చేతులు చూపిస్తూ అన్నాడు హాస్. ‘‘మిస్టర్ సూల్జే, నా మీద ఫిర్యాదు చెయ్యకు. నేను తియ్యలేదు...తియ్యలేదు’’ మతిపోయినట్టు మాటిమాటికీ ఇదే అంటున్నాడు హాస్. ‘‘నాతో కచేరికి పద. నేను ఫిర్యాదు చేయక తప్పదు.’’ కుర్రాడి కాలరు పట్టుకున్నాడు డ్రైవర్. అయితే చివరికి రెండు పెన్నీలూ ఏమయినట్టు? ఎక్కడన్నా పడిపోయాయా? లేదా చిల్లరవాపసు చేసేటప్పుడు పొరపాటున ఎవరికయినా ఎక్కువ వెళ్ళిపోయిందా? ఏదైనా అవి పోవడం నిజం. హాస్ వొకసారి దొంగతనం చేసి దొరికిపోయాడు. ఇప్పుడు మాత్రం అతడు కాదని ఎలా తప్పుతాడు? ‘‘నౌకరీ తీసెయ్యవలసిందే ఇక. నీ బాబుతో చెబుతాను’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ఊగుతూ, తూలుతూ కల్లు తాగినవాడిలా తన పరిచితమయిన సందుల్లో నడవడం మొదలుపెట్టాడు హాస్. వాళ్ళు అతణ్ణి నమ్మలేదు. భయం దెయ్యంలా అతడి నెత్తి మీద కూచుంది. వేసవిలో తన దుర్బల శరీరం మీద కురిసిన దెబ్బలు జ్ఞాపకం వస్తున్నాయి. చలికాలం వచ్చింది. అయినా ఆ నొప్పులు వొదలలేదు. తాను వేసిన కేకలూ, మూలుగులూ అన్నీ ఇప్పుడూ అతడికి వినిపిస్తున్నాయి. తల తిరిగినట్టయింది, కళ్ళు మూసుకున్నాడతడు. ఎక్కడికి వెళ్ళడం? అడవికి వెళ్ళిపోతేనో? పట్టి తీసుకువచ్చేస్తారు. ఏంచెయ్యాలి? ఈ విశాలప్రపంచంలో రోడ్ల మీద తిరుగుతూ వుండాలా? అక్కడయినా, ఎక్కడయినా పట్టుకుంటారు. నెత్తురుచుక్క లేని ముఖంతో ఇంటికి వచ్చాడు హాస్. ‘‘ఏం బాబూ, వొంట్లో బావుండలేదా?’’ అతడి జుత్తు నిమురుతూ అడిగింది తల్లి. మెల్లిగా తల వూపి జవాబు చెప్పాడు హాస్. తిన్నగా పడుకునే చోటికి వెళ్ళాడు. రోజూ తక్కిన పిల్లలతో రాత్రిళ్ళు పడుకునే చిన్న మంచం మీద పడుకున్నాడు. ముఖం గోడ దిక్కు తిప్పుకున్నాడు. చెమటలో ముద్దయిపోతోంది శరీరం. చేతులు బొంత కింద పెట్టుకున్నాడు. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చాడు. మంచి హుషారైన నిషా మీద వున్నాడతడు. ‘‘కుర్రవెధవ ఎక్కడున్నాడు?’’ హాస్ వొణకడం ప్రారంభించాడు. కాళ్ళ నుండి తలదాకా కప్పేసుకున్నాడు బొంత. ఊపిరి తియ్యడానికయినా అతడికి ధైర్యం లేదు. ‘‘వాడికి జబ్బుగా వుంది’’ తల్లి చెప్పింది. ‘‘గంగలో పడనీ దొంగవెధవ. రేపటి దాకా ఆగు. తెల్లవారాక–నేను’’ పక్క మీద వాలాడతడు. ‘‘రేపు? తెలిసిపోయిందా ఏమిటి చెప్మా?–తెలియదా?’’ జలుబు,జ్వరంతో కుర్రాడు వణికిపోతున్నాడు. మండుతూవున్న కళ్ళు చీకట్లో అంతలేసి చేసుకుచూస్తున్నాడు. అతడి మనస్సులో ఏదో తీవ్రమయిన ఆలోచన వేస్తోంది. భయం కంటే తీవ్రంగా వుందది. ఎక్కడికైనా పోవాలని, పగిలిపోతున్న తలకాయను కాపాడుకోవాలని కోరికగా వుంది. ప్లూటో!–హఠాత్తుగా మందహాసం చేశాడు కుర్రాడు. అవును. అదే సరయింది. తెల్లవారగానే అతడు ప్లూటో దగ్గిర చేరతాడు. హాస్ మనసులో ఆలోచనల కెరటాలు. ఒక ఆలోచన లేస్తుంది. వెళిపోతుంది. కానైతే, అన్నిటిలోనూ ప్లూటో వుంటుంది. చివరికి నిద్ర వచ్చేసింది. అతడి చేతులు బొంత మీద వున్నాయి. నోరు తెరిచి వుంది. అతడి వూపిరి చప్పుడుకే అతడి నిద్ర తేలిపోయింది. అంతసేపూ గాఢంగా పట్టింది నిద్ర. పాలిపోయిన అర్ధచంద్రుడు కనిపిస్తూనే వున్నాడు. ఇంకా తెల్లవారలేదు. ఊపిరి బిగపట్టి మెల్లిగా అడుగులు వేస్తూ లేచాడు హాస్. కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు. తల చక్కగా దువ్వుకున్నాడు. నీలికమీజు వేసుకున్నాడు. పచ్చగీత టోపీ పెట్టుకున్నాడు. చప్పుడు చెయ్యకుండా తల్లిమంచం దగ్గిరకి వెళ్ళాడు. ఒక్క క్షణం ఆమెని చూస్తూ నుంచున్నాడు. తరువాత తలుపు తీసి బైటికి జారిపోయాడు. స్టీబకే–జోళ్ళుకుట్టే స్టీబకే అర్ధరాత్రిలాగే ఇప్పుడు గట్టిగా గుర్రు కొడుతున్నాడు. కాని, అతడి భార్య గట్టిగా ఎవరో పిలవడం విని లేచింది. పిలుపు దొడ్డిలోంచే వచ్చింది. ‘‘స్టీబకే! ఏమమ్మో, స్టీబకే! స్టీ–బ–కే’’ ఏదైనా గందరగోళం జరిగిందా? మంచం మీది నుంచి పిల్లలు లేచారు. అరవడం మొదలెట్టారు. ఆమె ఉలిక్కిపడి లేచింది, పడుతూ లేస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళింది. బైటి నుంచి కిటికీ కొడుతున్నారు. ‘‘స్టీబకే! ఏమమ్మో స్టీబకే!’’ ‘‘ఏమిటి? ఏమయింది!’’ ఆమె వణకడం ప్రారంభించింది. ఏడుపుధ్వని బాధగా వుంది. ‘‘అయ్యో! నీ కొడుకు! ఏదో అయిపోయింది వాడికి!!’’ ‘‘ఏదో అయిపోయిందా? ఏమైందమ్మా’’ తల్లి శరీరంలో భయం కెరటాల్లా పరిగెత్తింది. భర్తని లేపేసింది. ‘‘స్టీబకే!’’ స్టీబకే ఇటునించి అటు వొత్తిగిల్లాడు. బైట గోల మరింత హెచ్చిపోయింది. మనుష్యుల కేకల్లో మధ్యమధ్య కుక్క మొరగడమూ వినిపిస్తోంది. హాస్ తల్లి బైటికి రావడమే తడువు– అంతమందీ వొకటేగోల. కుక్క కట్టివున్న మూల అందరూ మూగివున్నారు. ‘‘ఆ, ఏమయింది? ఏమిటయిందీ?’’ ‘‘ఘోరం! స్టీబకే కొడుకు! రామరామ!!’’ జనం పక్కకి తప్పుకున్నారు. తల్లి బలవంతంగా లోపల దూరింది. దూరీ దూరడం తోటే ఆమె వొక్క అరుపు అరిచింది. దొడ్డి దొడ్డంతా ప్రతిధ్వనించింది అరుపు. దానికి ప్రతిధ్వనిలా వుంది కుక్క అరుపు. కుక్క కట్టివున్న దగ్గిర, మీద గొడకి వొక ఇనప నాగవాసం వుంది. దానికో తాడూ–తాడుతో వొక కుర్రాడి దేహమూ వేలాడుతున్నాయి. పచ్చటి గీతల టోపీ కింద పడివుంది. ప్రాతఃకాలం గాలికి కుర్రాడి ముంగుర్లు కదలాడుతున్నాయి. నోరు తెరిచి వుంది, కళ్ళు పైకి వచ్చేసి మెరుస్తున్నాయి. వేలాడుతున్న కుర్రాడి దగ్గరికి వెళ్ళాలని, పిచ్చెత్తినట్టు కుక్క వురుకుతూ వుంది. కాని వెళ్ళలేకపోతోంది. కింద సాగిలబడుతోందది. మీదికి నోరెత్తి అరుస్తోంది. ఎవ్వరినీ దగ్గరికి రానివ్వకుండా వుంది. కుక్క దగ్గిర నల్లటి గోడ మీద, చదవడానికి వీలుగా, కుర్రాడు చేత్తో రాసిన పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి. ‘రెండు పెన్నీలు నేను దొంగిలించలేదు. ప్లూటోని బాగా చూడండి. హాస్ స్టీబకే’ మూలం : క్లారాఫ్రీబిగ్ తెలుగు: పురిపండా అప్పలస్వామి -
మిత్తా మాయమై పోనావా...!
కోడి కూసింది. చెంబు పట్టుకొని ఊరి గోర్జివైపు వెళ్లిన సొండి రామ్మూర్తి పెద్ద కేకేశాడు..అవురా ఇంటికేసిన తాళం అలానే ఉంది... సవరోళ్లు మాయమై పోనారని. ఇంకేం అది ఆళ్లపనే ఆళ్లకు మంత్రాలొచ్చురా..నాను మొన్ననే అనుకున్నానెస్..తొత్తుకొడుకులు మా ఆవుపడ్డకేసి ఒకటే సూపు సూసినాడా..అది అనంగ ఇరగబడి పోయిందెస్..అని వెనకనే ఉన్న పాలేసు తన అనుభవం చెప్పేశాడు. ఊరంతా మళ్లీ కలకలం..ఆ గందరగోళంలోనే కళ్లంనుంచి ఇంటికొచ్చిన ఈశ్వరుడికి వెక్కిరిస్తూ కనిపించాయి మిత్తలు తెచ్చిన పట్టుతేనె, వెదురు బియ్యం,అరటి గెలలు..రాత్రేమయ్యిందో తెలీదు..ఇల్లనుకొని వచ్చిన సవరలు ఎందుకెళ్లిపోయారో తెలీదు..తన తాతల నుంచి సాగిన స్నేహబంధాన్ని ఎవరు తెంపేశారో అర్థం కాలేదు..అయితే ఏదో అనుకోనిది జరిగిందన్నది అర్థమైంది. కంట తడిపెట్టుకున్నాడు..‘ఓరయ్యా పల్లకోరా ఏటి సిన్నపిల్లడినాగా ’అని కొడుకులు కసురుకుంటున్నా మిత్తల అమాయక మొహాలే తనను నిలదీస్తున్నట్లు ..నువ్వేం పెద్ద మనిషివయ్యా..అని చీదరించుకుంటున్నట్లు భావన గుండెను పిండేస్తోంది. తూర్పు గాలి వీస్తోంది.రాత్రి ఎనిమిది దాటుతోంది. ఊరంతా భోజనాలు ముగించి వాకిళ్లలో కూర్చున్నారు.పిల్లలంతా ఈత చాపలు, దుప్పట్లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు.అంతా ఒకటే హడావుడి. బుడబుడకల సూరిగాడి పాటట..‘ఓహ్ తుంగాం సూరిగాడి ఏసం కట్టి పాటెత్తుకుంటేనే ఓలప్పా సరస్వతి చెపుతోంది..అంకమ్మతో. కమ్మగా ఉంతాదే. రెక్కల రంభ కథ ఎప్పుడైనా ఇన్నావే. ఆడి మాటకేంగానీ పక్కన అంజిగాడు బుడబుడకల కుండతోటి రక్తి కట్టిత్తాడే. గతేడాది కార్తీక నోములప్పుడు భీయమ్య మామోళ్ల ఇంటికాడ ఆడించినారు కదా..నీకు ఎరికి నేదేటి అని పక్కనే ఉన్న గుణ్నమ్మ గుర్తుచేసింది.’’ ఇలా ఆడా,మగా సూరిగాడి కథకోసం వీధి అరుగుల మీద కూర్చున్నారు. ఆ రోజు అంగ ఈశ్వరుడింటికి వచ్చిన మిత్త మంగయ్య ‘ఏమిటి బావ్.. కథా..’ అని ఉడుకు అంబలి బువ్వలో..కాల్చిన ఎండు చేపలు, తోట కూర పులుసుతో తింటూ తనతో పాటే తింటున్న ఈశ్వరుడు కొడుకు రామ్మూర్తిని అడుగుతున్నాడు. మంగయ్యది ఒడిశాలోని పర్లాఖిమిడికి ఓ 40 కిలోమీటర్ల దూరంలో ఉండే దారకొండల్లోని మిర్చిగూడ. కాపుగోదేవలసకు ఏటా కొడుకులు, ఇతర బంధువులతో వస్తుంటాడు.ఈ బంధం ఓ మూడు తరాలనుంచీ సాగుతోంది. కొండకోనల్లో బతుకులీడ్చే అమాయకపు సవర గిరిజనుల గుండెల్లో నిండా ఉండేది పచ్చని అనురాగం. అల్లుకున్న ఆత్మీయత. కొండ లోతుల్లో ఉండే వారు సమీప గ్రామాల్లోని సంతలకు వచ్చినప్పుడు మైదానం ప్రాంత రైతులను కలుస్తుంటారు. అడవి తల్లి ఇచ్చే చింతపండు, ఇప్పపువ్వు, పోడు సాగుద్వారా వచ్చే కందులు, అరటి, పుట్ట తేనె, వంటి వాటిని కావిళ్లతో సంతలకు తెచ్చి అమ్ముతుంటారు. ఆ సంతల్లోనే రైతులతో మాటామాట కలుస్తుంది. వాటిని మమతలుగా అల్లుకొని ఎవరైనా నచ్చిన రైతు కనిపిస్తే మిత్తకడదామా (స్నేహం చేయడం) అని అడుగుతారు. అదేదో ఒక్క నిమిషంలో అయిపోయే తంతు కాదు. ప్రతిపాదితుల మధ్య ఏళ్లపాటు.. కాదు.. కాదు కొన్ని జీవితాల పాటు సాగే స్నేహ బంధం . అందులో స్వార్థం ఉండదు. నువ్వూ, నేను అనే బేధం ఉండదు.అగ్ని సాక్షిగా ఆ బంధాన్ని శాశ్వత పరచుకుంటారు. ఇందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం గూడెంలో ఏర్పాటవుతుంది. ఆ గూడెం పెద్ద ఓ చిన్న క్రతువు జరిపిస్తాడు. మిత్తకోరుకునే వారిని ఊరి మధ్యలోకి పిలుస్తాడు. చిన్న హోమం ఏర్పాటు చేసి తనకు వచ్చిన మంత్రాలను చదువుతాడు. వారి స్నేహం స్వచ్ఛంగా, అడవంత పచ్చగా,తేనంతటి తియ్యగా సాగాలని కొండ దేవతకు మొక్కుతాడు.తాము నిత్యం ఆరాధించే ప్రకృతి దేవతలను ఆవాహనం చేసి సాక్షులుగా పిలుస్తాడు. దీంట్లో మిత్త (గిరిజన స్నేహితుడు), మైదాన ప్రాంతానికి చెందిన రైతు, వారి కుటుంబీకులు పాల్గొంటారు. ఇరువురూ అందరి సమక్షంలో బాసలు చేస్తారు. ఓ చీపురు పుల్లను తీసుకొని రెండుగా చీల్చి చెరో పక్కకు వ్యతిరేక దిశలో విసిరి వారిని ఎవ్వరూ వేరు చేయకుండా ఉండాలని దోష నివారణ సంకేతాన్ని చూపి వారి చేతులు కలుపుతాడు. ఇలా వారు అప్పటినుంచి ఆత్మీయంగా మిత్తా అని పిలుచుకుంటారు. వారి భార్యలను మిత్తమ్మా అంటారు. ఈ క్రతువు ఇంచుమించుగా రామాయణంలో రాముడు, సుగ్రీవుడు చేసుకున్న స్నేహ ఒడంబడిక లాంటిదన్న మాట.ఈ సందర్భంగా రైతు తన సవర మిత్రునికి పంచెల చాపు, పౌడరు డబ్బా,తాను పండించిన ఉత్పత్తులను బహుమానంగా ఇస్తే, గిరిజన నేస్తం ప్రతిగా తాను స్వయంగా సేకరించిన ఇప్పపువ్వు, తేనె, వెదురు బియ్యం ఇస్తాడు. కాస్త సారా లాగించాక వారంతా అడవిలో ఓ రెండు రోజులు ఆనందంగా గడుపుతారు. అంతే కాదు..మిత్రుడ్ని సాగనంపినప్పుడు కావుళ్లతో అటవీ ఉత్పత్తులు, మామిడి బద్దలు బహుమానంగా ఇచ్చి పంపుతాడు. ఇక అక్కడినుంచి ఏటా సంక్రాంతి సమయంలో రైతు నేస్తం ఇంటికి వస్తాడు. అలా మిత్తలు వచ్చారంటే పల్లెల్లో సందడే సందడి. గిరిజన ఆహార్యంలోనే మిత్తలు తమ ఇళ్లకు వచ్చి వచ్చీ రాని తెలుగులో తన నేస్తానికి కుశల ప్రశ్నలు వేస్తుంటే ఆ సన్నివేశం చూసేందుకు ఊరంతా గుమిగూడుతుంది. వారున్నన్ని రోజులూ రైతులూ ఆప్యాయంగా చూసుకుంటారు. పిల్లలకూ, ఊరి పెద్దలకూ వారిని పరిచయం చేస్తుంటారు. వారూ తమ నేస్తాలతో కలసి సరదాగా సేద్యం పనుల్లో సాయం చేస్తుంటారు. ఇలా మంగయ్య అంగ ఈశ్వరుడి ఇంటికి కొడుకులతో వచ్చాడు. అదే రోజు ఊరిలో బుడబుడకల సూరిగాడి పాట ఉండడంతో మంగయ్యా ఆ కథ వినాలని సంబరపడ్డాడు.. దీన్ని పసిగట్టిన ఈశ్వరుడు..కొడుకు కృష్ణమూర్తిని పిలచి..‘ఓరె కుష్టా..మిత్తలకి అప్పోళ్ల ఇంటి అరుగు మీద చాపేసి కూకో పెట్రా, అక్కడైతే కథ కమ్మగా ఇంతారు.’ అని చెప్పి తాను ఊరి చివరన ఉన్న కళ్లంలో పడుకునేందుకు వెళ్లి పోయాడు. అప్పుడు రాత్రి 9 గంటలు..సూరిగాడు పాటకోసం గొంతు సవరించుకుంటున్నాడు. ఆచారం ప్రకారం ఆడ వేషం కట్టాడు...అంజి బుడబుడకల కుండను ‘టిర్రిం..టిర్రిం..డుబుక్..డుబుక్’ అని నాలుగు దరువులు వేసి కథకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఊరంతా...పాటకోసం నిశ్శబ్దం..ముందుగా గణపతి ప్రార్థన అయ్యింది. సూరిగాడి లయలో తేడా గమనించిన అంజిగాడు అవునవునూ..అంటూ సమయస్ఫూర్తిగా సవరించే ప్రయత్నం చేశాడు. మళ్లీ హాస్యం పేరిట నాలుగు గెంతులు ..గ్రామ పెద్దలనూ, గ్రామ అమ్మవారిని పొగిడాడు. ఈ దృశ్యాన్ని మంగయ్య కొడుకులతో సహా ఆశ్చర్యంగా చూపుతిప్పుకోకుండా చూస్తున్నాడు. తమ గూడల్లో ఆడతారు, పాడతారు గానీ ఇదంతా కొత్తగా ఉంది. అందుకే అరుగు దిగీ మరీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. మళ్లీ సూరిగాడిని సరిచేసే దిశగా అంజిగాడు ఓ మోటు హాస్యం రువ్వి..‘ఆయమ్మ రెక్కల రంభ..ఓయమ్మో సజ్జవుతోంది గావాలప్పా..అందుకే పాపకు నోరు పెగల లేదు..మాట్లాడవే.. రంభా..అంటూ సూరిగాడికి పాత్రను గుర్తుచేశాడు. ఇక తప్పదనుకున్న సూరిగాడు..ఆ యొక్క రెక్కల రంభ.. అందాల సుందర రాశి..అంటూ తడబడుతూనే కథను ప్రారంభించాడు. గొంతును సవరించుకుంటున్నా ..నాలిక తిమ్మిరెక్కి పోతోంది. ఓ గెంతు గెంతి పాటకు ఊపుతెద్దామనకున్నోడు కాస్తా విరుచుకు పడ్డాడు. అదీ సరిగ్గా..మంగయ్య చూస్తున్న వైపే.. ఇదేదీ అర్థం కాని మంగయ్య అదీ కథలో భాగమనుకుంటున్నాడు. ఊర్లో అలజడి..ఓరె ఏమైందెస్..శేషయ్య కేకేశాడు.సూరిగాడు.. ఏదో చెప్తున్నాడు. ఎవరికీ అర్థం కావడం లేదు. అంజిగాడికీ ఏమీ పాలుపోవడం లేదు. ఇదేంటీ ఈడినాగా అనుకుంటూ ..తనకు సందేహం వచ్చినా బయట పడితే బడితె పూజ అవుతుందని భయపడి..మెల్లిగా అన్నాడు..ఇది గాలిపని అయ్యుంటాదయ్యా అని. ఇంతలో సూరిగాడు సవరమంగయ్య వైపు చెయ్యచూపుతూ ..ఏదో చెప్తున్నాడు.అంతా కేకలు..అరుపులు..ఇంతలో ఎవరో చెప్తే సొండి రామ్మూర్తి వచ్చాడు. మరోవైపు శాంతారావు కేకలేశాడు. ..ఒరే అది సవర దెయ్యమటరా..అని అంటే..అందరూ ఓలమ్మా సిల్లెంగెట్టేసుంటారర్రా... సూరిగాడు ఆడేసికం ఏత్తే ఆడోళ్లే సూపు తిప్పుకోనేరు..అంటూ ఇది చేతపడి పనే అని ఎప్పుడూ శివాలేసే రెయ్య గణ్ణెమ్మ తేల్చిపడేసింది. ఇంకేటెస్ ..అంగోళ్లు ఇంటికి వచ్చిన సవరోళ్ల పనేనే అని పారమ్మ మద్ధతు పలికింది. ‘నాను సూసినానే ఆడు పెందిలికాడినుంచి అందరు దుక్కూ మిటుకూ..మిటుకూ మని సూత్తన్నాడే ’ అని సాక్ష్యం చెప్పేసింది. ఇంకేం ఊరంతా ఇది ఆళ్లపనే అని తేల్చి పారేశారు. అప్పటికి పరిస్థితి అర్థమైన మంగయ్య, కొడుకులూ వణికి పోతున్నారు.‘ బావ్..మేం మిత్తకోసం వచ్చినం..మాకేంటీ బాధ...’ అని ఏడుపు గొంతులతో అంటున్నా పట్టించుకునే వారే లేరు. ఎవరు ఎవరికి చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆఖరికి అంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆళ్ల ముగ్గుర్నీ ఊరి చివర ఉన్న ఓ ఇంట్లో కట్టేసి రేపు పంచాయతీ పెట్టాల అని. ఈ లోపు కొందరు సూరిగాడ్ని మోసుకెళ్లి ఓ అరుగుమీద పడేశారు. ఏం మాట్లాడితే ఏమొస్తాదో అని అంజిగాడు నోరు కుట్టేసుకున్నాడు. దీనిమీద రాత్రంతా రకరకాల కథలు..పరస్పరం నడిచాక అందరూ నిద్రలోకి జారుకున్నారు. గదిలో బందీలైన మంగయ్య కొడుకులతోనూ చాలాసేపు మాట్లాడలేక పోయాడు. ఇప్పటికి మూడు తరాలుగా ఆ ఊరు వస్తున్నా ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ప్రేమతో వస్తే ఇలా ప్రాణాలమీదకు వచ్చిందేమిటా అని తనకు తెల్సిన దేవతలందరికీ మొక్కాడు. అడవి చీకటికి అలవాటైన ఆ కళ్లు ఇప్పుడు తప్పించుకునే మార్గాలకోసం అన్వేషిస్తున్నాయి. పులులనే ఎదిరించే తమ ధీరత్వం ఇలా బందీలై పోయిందేమిటా అని తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. కొడుకులూ అయోమయంలో ఉండడంతో వారికి సైగలతోనే ధైర్యం చెప్పాడు. ఇంతలోనే తనకు సంకేతాలందిస్తున్నట్లుగా ఓ బల్లి చూరుపైనుంచి శబ్దం చేస్తోంది. కర్తవ్యం బోధపడింది. వేట గాడి ఎత్తుగడలా వ్యూహం పన్నాడు. సొండి రామ్మూర్తి దెబ్బకు ఊరి చివరకు జనం అంతా పరుగెత్తారు. అందరిలోనూ ఒకటే ప్రశ్న. సవరోళ్లు ఏమైనారని ఎలా మాయమయ్యారనీ...ఈ సందడిలోనే తెలివి తెచ్చుకున్న సూరిగాడు,తోడున్న అంజి తూర్పువైపు జారుకున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.రాత్రి సంతబొమ్మాళి వెళ్లి తెల్లవారే వస్తున్న తామాడ రామారావుకు గట్టుచాటున వెళ్తూ..మాట్లాడుకుంటున్న అంజి,సూరిల మాటలు చెవిట్లో పడ్డాయి...‘ఓరయ్యా నువ్వు పీకలమొయ్య తాగేసి పడిపోనావని ఊళ్లో తెలిస్తే మక్కలిరగతన్నేసోళ్లు. ఆ సమయానికి సవరోళ్లు మీదకు నెపం నెట్టేసినావు గాని..నా గుండ్లో రాయిపడి పోనాది. ’ అని అంజి చెప్తుంటే అవేవీ చెవిట్లో వేసుకోని సూరి పరుగులాంటి నడకతో పొలాలకు అడ్డంబడి వెళ్తున్నాడు. ఊర్లోకొచ్చాక రామారావు ఆ గుట్టు విప్పడంతో అంతా నోరెళ్ల బెట్టారు. మరో వైపు సవరోళ్లు తప్పించుకున్న ఇంటి చూరు వారిని వెక్కిరించింది. వర్తమానంలోకి వచ్చిన ఈశ్వరుడు.. తమ మిత్తల స్నేహాన్ని చిదిమేసిన మూర్ఖత్వాలను ఎలా ప్రశ్నించాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించాడు.ఇంతలోనే గుడ్ల కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ వచ్చి ‘పెద్దయ్యా సవరోళ్లు సైనోల్లు ఇంటి పెనక ఇప్పుకొని ఎళ్లిపోనార్రా’ అని చెప్పడంతో తమ స్నేహం కాదు..కాదు పల్లెకు..అడవికీ ఉన్న తరతరాల బంధం ఎవరో తెంచేశారని కుమిలి పోయాడు..గుండె పగిలేలా రోదించాడు....ఆత్మీయత లోతులను తడుముకున్నాడు.. తమ వారి మూర్ఖత్వాన్ని ప్రశ్నించ లేక పోతున్న తన దైన్యానికి తనను తానే తిట్టుకున్నాడు. - పట్నాయకుని వెంకటేశ్వరరావు -
పేదరాశి పెద్దమ్మ కథ
ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు. ఒకసారి ఈ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. డబ్బు, నగలు పంచుకున్నారు. వాటితో పాటు ఒక రత్నం కూడా ఉన్నది. ఆ రత్నం ఎలా పంచుకోవాలో బోధపడలేదు. ‘‘నాకు కావాలి అంటే నాకు కావాలి’’ అని నలుగురూ వాదులాడుకున్నారు. ‘‘ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు గడుపుదాం. డబ్బు అవసరమైన ప్పుడు చూసుకోవచ్చు. అందాక ఈ రత్నాన్ని ఎవరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెడదాం’’ అని ఒకడు ఉపాయం చెప్పాడు. పేదరాశి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్లారు. నలుగురు రాగానే పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది. ‘‘పెద్దమ్మా! మేము పొరుగూరు వెళుతున్నాం. ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా!’’ అని అడిగారు దొంగలు. ‘‘అలాగే బాబు’’ అంది ఆమె. ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి, వెళ్లిపోయేటప్పుడు ఆమె చేతికి రత్నాన్ని దాచిన సంచి ఇచ్చి ‘‘పెద్దమ్మా! మేము తిరుగుప్రయాణంలో వచ్చి తీసుకుంటాము. అందాకా ఈ సంచి నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు. మేము నలుగురూ కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు’’ అని చెప్పారు. ‘‘అలాగే బాబూ! మీరు నిశ్చింతగా వెళ్లిరండి’’ అని పెద్దమ్మ ఆ సంచిని భోషాణంలో దాచింది. దొంగలు వెళ్లిపోయారు. ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా ఆ రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు అన్వేషించసాగాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్లి, దాచిన రత్నాన్ని తెచ్చుకుని అమ్ముకుందామని అనుకున్నారు. పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. నడిచీ నడిచీ బడలికతో ఇంటి ముందు కూలబడ్డారు. ‘‘ఒరే! నువ్వు ఇంట్లోకి వెళ్లి సంచి తీసుకురా’’ అన్నారు అలసటగా. రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది. ‘‘మీరు విశ్రాంతి తీసుకోండి. నేను తీసుకువస్తాను’’ అని లోపలికి వెళ్లి పేదరాశి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు. ‘‘ఏం బాబులూ! సంచి ఇవ్వమంటారా?’’ పెద్దమ్మ లోపలి నుంచి కేకేసింది. ‘‘ఇవ్వు పెద్దమ్మా’’ అన్నారు వాళ్లు. పెద్దమ్మ సరేనని భోషాణంలో దాచి ఉంచిన సంచి నాలుగవ వాడికి ఇచ్చింది. వాడు ఆ సంచిని తీసుకొని ఇంకో ద్వారం గుండా ఉడాయించాడు. ఎంతసేపు ఎదురుచూసినా లోపలి నుంచి నాలుగవవాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చున్న ముగ్గురూ ఇంట్లోకి వచ్చి పెద్దమ్మను అడిగారు. ‘‘అందులో విలువైన రత్నం ఉంది. నువ్వు పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి’’ పెద్దమ్మతో అన్నారు ముగ్గురు. ‘‘భగవంతుడి సాక్షిగా అందులో ఏముందో చూడలేదు. ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను’’ పెద్దమ్మ లబోదిబో అంది. ‘‘అదేమీ కుదరదు. రాజుగారి దగ్గరకు పద!’’ అంటూ ముగ్గురూ పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. ‘‘ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి. కానీ ఒక్కడే వస్తే ఇచ్చావు. వాడు, నీవు లాలూచీ పడ్డారేమో! కాబట్టి...ఇది నీ తప్పే, నువ్వు రత్నం ఇవ్వాల్సిందే!’’ అన్నాడు రాజు పెద్దమ్మతో. ‘‘మహారాజా! బాటసారులకు ఇంత ఉడకేసి పెట్టి వారు ఇచ్చిన దానితో పొట్టపోసుకుంటున్నాను. అంత విలువైనది నేనెక్కడి నుంచి తీసుకురాను!’’ అంటూ కాళ్లావేళ్లా పడింది పెద్దమ్మ. ‘‘నాలుగు రోజులు వ్యవధి ఇస్తున్నాను. తెచ్చివ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు’’ అని హెచ్చరించాడు రాజు. చేసేదేమి లేక ఏడుస్తూ ఇంటిదారి పట్టింది పెద్దమ్మ. రెండు రోజుల తరువాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. ‘‘పెద్దమ్మా...ఎందుకు అలా విచారంగా ఉన్నావు?’’ అని అడిగాడు. జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ. ‘‘రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్లు. నీ మనవడినని పరిచయం చెయ్యి!’’ అన్నాడు యువకుడు. ఆ మరునాడు ‘‘రత్నం తీసుకొచ్చావా?’’ అని అడిగాడు రాజు. ‘‘చిత్తం మహారాజా! తీసుకు వచ్చాను’’ అని దొంగల వైపు తిరిగి ‘‘మీ రత్నం మీకు ఇవ్వడం న్యాయం. ఎప్పుడూ? నలుగురూ కలసి వచ్చినప్పుడు. నలుగురు కలిసి రండి, అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాం’’ అన్నాడు యువకుడు. సభలోని వారందరూ కరతాళధ్వనులు చేశారు. ‘‘నిజమే! నలుగురూ కలిసి రండి. వెళ్లండి’’ అజ్ఞాపించాడు రాజు. దొంగల ముఖాలు వెలవెలా పోయాయి. తల వంచుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. ‘‘మంచిపని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరూ ముందుకురారు. నా తప్పు తెలుసుకున్నాను. నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను. సమస్యను యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను’’ అన్నాడు రాజు. - గోనుగుంట మురళీకృష్ణ -
సామూహిక అత్యాచారం: అసలు ఆమె అమ్మాయేనా?
పొడవాటి జడ, పెద్ద పెద్ద ఝుంకీలు, ఆకట్టుకునే కళ్లు, ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. గులాబీ రంగు పొడవాటి కుర్తా మీద బంగారపు రంగు దుపట్టా గుండెల నిండుగా కప్పుకుని.. హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వచ్చింది ఆమె. ‘ఏంటమ్మా.. ఏం కావాలి?’ అడిగాడు గట్టిగా రాఘవయ్య ఆమెని చూసి. ‘రూమ్.. కావాలి’ అని గేట్‌కి ఉన్న టులెట్ బోర్డ్ చూపిస్తూ సైగ చేసింది. ‘ఓ.. మాటలు రావా? రూమ్ ఆ పక్కనే గోడ దాటి వెళ్లాలి.. చూస్తావా?’ అన్నాడు రాఘవయ్య అదే స్వరంతో. ‘ఊ..’ అన్నట్లుగా తల ఆడించింది ఆమె. వయసు 23 ఏళ్లు ఉండొచ్చు. ‘నాకు కొంచెం చెవుడుందిలేమ్మా.. అందుకే గట్టిగా అరుస్తున్నా.. పద చూపిస్తా’ అంటూ నెమ్మదిగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాడు. అతడి వెనుకే ఆమె నిదానంగా, పొందిగ్గా నడిచింది. ‘ఏం తాతా? అద్దెకా?’ అని రాఘవయ్యని పలకరిస్తూనే.. ‘ఏ ఊరమ్మాయ్?’ అంటూ మాట కలిపింది పక్కింటి రాధమ్మ. ‘ఆ.. అద్దెకే.. ఈ పిల్లకి మాటలు రావట’ అంటూ తలుపు తాళం తీసి లోపల లైట్ వేసి.. ‘రా అమ్మాయి లోపలికి..’ అన్నాడు రాఘవయ్య. చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్లింది. ‘అద్దె మూడువేలు.. ఈ దేవ్ నగర్ కాలనీలో ఇంతకంటే తక్కువకు రాదమ్మా. తెలిసే ఉంటుందిలే. ఎంతమంది ఉంటారు?’ అని అడిగాడు రాఘవయ్య. ‘నేను ఒక్కర్తినే’ అంటూ సైగ చేసింది మళ్లీ నవ్వుతూ.. ‘అవునా.. అయితే ఈ రూమ్ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే బాత్ రూమ్ వెనుక వైపు ఉంది, ఈ తలుపు కాస్త గట్టిగా నొక్కి వేసుకోవాలి. సెక్యూరిటీ అంటావా? ఇక్కడ అన్ని ఇళ్లు దగ్గర దగ్గరగానే ఉంటాయి కదా.. అంత సాహసం ఎవ్వరూ చెయ్యరు. అడ్జెస్ట్ అవుతావా?’ అడిగాడు చిన్న స్వరం చేసుకుని. మళ్లీ తల ఆడించింది నవ్వుతూ.. ఆమె వినయానికి ముగ్ధుడైపోయాడు ఆ ముసలాయన. ‘ఇదిగో అమ్మాయ్.. చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తున్నావ్. అందుకే చెబుతున్నా, నీళ్లు తక్కువగా వాడాలి. రెంట్ ఏ నెలకానెల ఇచ్చెయ్యాలి. ఇంతకీ ఈ ఊరిలో నీకు పనేంటీ?’ అడిగాడు ఆసక్తిగా. ఆమె సైగలు అర్థం చేసుకోలేక.. ‘సరే సరేలే.. ఒక నెల అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి. రేపు వచ్చేస్తావా?’ అన్నాడు. సరే అంది ఆమె. ‘అవునమ్మాయ్ ఇంతకీ నీ పేరేంటీ?’ అడిగాడు రాఘవయ్య. చేతి మీద పచ్చబొట్టు చూపించింది ఆమె నవ్వుతూ.. తెల్లటి చేతి మీద ‘ఉద్భవి’ అని పెద్దపెద్దగా ఉన్న తెలుగు అక్షరాలు ఆమెలానే చాలా అందంగా ఉన్నాయి. ‘ఉద్భవీ.. ఉద్భవీ.. మీ బాబాయ్ చికెన్ కూర తెచ్చుకున్నారు. నీకు ఈ రోజు ఆదివారమే కదమ్మా.. వచ్చి కాస్త హెల్ప్ చేస్తావా?’ అడిగింది రాధమ్మ. ఇంటి పని, వంట పని అన్నింటిలోనూ సాయం చేసే ఉద్భవి.. అద్దెకు దిగి ఏడాదికాక మునుపే.. ఆ కాలనీలో అందరికీ చాలా దగ్గరైపోయింది. పండగొస్తే ఇంటి ముందు ముగ్గులు వేయడానికి, చుట్టాలొస్తే పిండి వంటలు చెయ్యడానికి ఉద్భవే గుర్తొస్తుంది ఆ చుట్టుపక్కల ఆడవాళ్లకి. ‘ఏం ఉద్భవీ.. పెళ్లెప్పుడు చేసుకుంటావ్? ముందు వెనుకా ఎవరూ లేరని చెప్పావ్.. అనాథాశ్రమంలో పెరిగానన్నావ్.. అయినా ఫర్వాలేదు. నువ్వు ‘ఊ’ అను. మా చుట్టాల్లో మంచి పిల్లోడ్నే చూస్తా. పిల్లవేమో అందగత్తెవి, చక్కగా ఆ డెఫ్ అండ్ డంబ్ స్కూల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావ్.. ఎవరికైనా అంతకన్నా ఏం కావాలి చెప్పు?’ అంది ఉద్భవితో వంట పనులకు సాయం తీసుకెళ్లిన పద్మక్క. ఎవరేమన్నా చిన్న నవ్వు నవ్వి ఊరుకునేది ఉద్భవి. పెళ్లి గురించి మరీ గట్టిగా అడిగితే.. ‘వివాహబంధం మీద నమ్మకం లేదు’ అంటూ సైగల్లో చెప్పేది. కానీ ఆ సైగలు ఎవరికి అర్థం కావాలి? ‘ఉద్భవిగారూ..! మన కాలనీ కుర్రాళ్లనీ తీసుకొచ్చాను. ఇవన్నీ ఆటోలో పెట్టించెయ్యాలా?’ అని అడిగాడు స్వరాజ్. ‘ఊ’ అన్నట్లుగా సైగ చేసింది ఉద్భవి. ‘రేయ్.. అవన్నీ అందులో వేసుకుని ఆశ్రమానికి వచ్చేయండి. జాగ్రత్త ఏవీ ఒలికిపోకూడదు. లాస్ట్ టైమ్ సాంబారు సగం జారేశారు. ఈసారి అలా జరగకూడదు సరేనా..’ అని గట్టిగా వార్నింగ్ ఇస్తూనే.. బైక్ స్టార్ట్ చేశాడు స్వరాజ్. వెనుక ఓ వైపుకి ఎక్కి కూర్చుంది ఉద్భవి. హీరోయిన్ ఎక్కిన తర్వాత హీరో గమ్మునుంటాడా? ఓ చెయ్యి కాలర్ ఎగరేస్తుంటే.. మరో చెయ్యి బైక్ ఎక్సలేటర్ రెయిజ్ చేస్తోంది. పరిచయం కాగానే ఉద్భవి.. స్వరాజ్‌కి ఓ క్లారిటీ ఇచ్చింది. ‘నా నుంచి స్నేహాన్ని తప్ప మరేం ఆశించినా దొరకదని’. ప్రేమించాడు కదా ఆ మాత్రం చాలనుకున్నాడు. అప్పుడే స్వరాజ్ కూడా ఉద్భవికి ఓ మాట ఇచ్చాడు. ‘బంధాన్ని బలపరిచే మాట చాలు. భావాన్ని బలపరిచే స్పర్శని అనుమతి లేకుండా నేను ఎప్పటికీ కోరను’ అని. దేవ్ నగర్ కాలనీ.. టౌన్‌కి కాస్త దూరం. కొన్నేళ్ల క్రితం ఉద్భవి ఇంటి ఓనర్ రాఘవయ్య, స్వరాజ్ తాత, మరికొందరు కలిసి ఊరికి దూరంగా ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు. కాలక్రమేణా అక్కడ జనాలు, ఇళ్లు పెరిగి అదో కాలనీగా మారిపోయింది. లేవగానే యోగా, ధ్యానం తప్పకుండా చేసేది ఉద్భవి. తనకి కుట్లు, అల్లికలు అంటే మహా ఇష్టం. సెలవు వస్తే.. అందరికీ జాకెట్ల మీద వర్క్ చేసి ఇవ్వడం, దారంతో అందంగా పేర్లు రాయడం.. ఇలా ఖాళీ దొరికిన ప్రతిసారీ ఏదొక చేతి పని చేస్తూనే ఉండేది. బాగా దగ్గరైన వాళ్లకు ఫ్రీగా, ఇతరులకు డబ్బులు తీసుకుని కుట్టేది. స్వరాజ్‌కి అది అమ్మమ్మ ఊరు. తల్లీదండ్రీ చనిపోతే.. తాత దగ్గరే పెరిగాడు. కొన్నాళ్లకు తాత కూడా చనిపోయాడు. ఆస్తి అయితే బాగానే ఉంది. టౌన్లో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. చిన్న వయసులోనే అన్ని బంధాలకు దూరమైన స్వరాజ్.. మనసుతో ముడిపడే బంధాలకు చాలా విలువిచ్చేవాడు. అందుకే కాబోలు ఉద్భవి ‘కేవలం స్నేహమే’ అన్నా.. ఆమే ప్రాణంగా బతకడం మొదలుపెట్టాడు. ‘నా బంగారు తల్లి.. ప్రతివారం మా కోసం ఇలా అన్ని స్వయంగా వండి తీసుకొస్తావ్. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి’ అంటూ ఆ ఆశ్రమంలో కొందరు ఆశీర్వదిస్తుంటే.. ‘పెళ్లి చేసుకో తల్లి’ అని సలహా ఇచ్చేవాళ్లు మరికొందరు. ‘స్వరాజ్‌నే పెళ్లి చేసుకో’మని ప్రేమగా చెప్పేవాళ్లు ఇంకొందరు. అందరికీ ఆమె చిరునవ్వే సమాధానం. రోజులు, నెలలూ గడుస్తున్నాయి. కాలనీ వాళ్లకే కాదు ఉద్భవి తెలిసిన వాళ్లందరికీ.. ఉద్భవితో మంచి స్నేహం కుదురుతోంది. స్వార్థం లేని ఆమె నవ్వు అందరినీ కట్టిపడేస్తోంది. ఉద్భవి సైగలను గమనించిన స్వరాజ్.. ‘అర్థమైందండీ.. పక్క ఊరిలో ఉండే.. కూరగాయల ముసలమ్మ దగ్గరకు తీసుకుని వెళ్లాలి.. అంతేగా?’ అన్నాడు. ‘అవును’ అన్నట్లుగా తల ఊపుతూ బైక్ ఎక్కబోయింది ఉద్భవి. ‘అవునూ.. ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను.. ఆమె మీకు ఎప్పటి నుంచి తెలుసు? ప్రతినెలా ఆమెని కలిసి నెలకు సరిపడా డబ్బులు ఇచ్చివస్తుంటారు ఎందుకు? వాళ్లేమో ముస్లింలనుకుంటా? మీకు ఎలా పరిచయం? ఆమెకు పిల్లలు లేరా?’ అంటూ ఆరా తీశాడు స్వరాజ్. ‘నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆమె మా ఆయా.. భర్త మంచానపడ్డాడు. ఆమెకి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు చనిపోయాడు, మరో కొడుకు పెళ్లి చేసుకుని దూరంగా ఉంటున్నాడు’ అని సైగలతో చెప్పింది. ‘మరి.. ఎక్కడికైనా నన్ను వెంట తీసుకెళ్లే మీరు.. ఆమె దగ్గరకు ఎందుకు తీసుకుని వెళ్లరు? కాస్త దూరంలోనే బైక్ దిగి మీరు మాత్రమే వెళ్లి కలుస్తారెందుకు?’ అని అడిగాడు అనుమానంగా.. ‘ఆమెకు నీ వయసు మగపిల్లల్ని చూస్తే.. తన కొడుకులు గుర్తుకొచ్చి బాగా ఏడుస్తుంది. అందుకే నిన్ను తీసుకుని వెళ్లను’ చెప్పింది ఉద్భవి సైగలతో.. ‘ఏం ఉద్భవి.. నువ్వు రావట్లేదా పెళ్లికి? నీకు తెలుసో తెలియదో కానీ నైట్ పెళ్లిళ్లు చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కాలనీ వాళ్లమంతా పోతున్నాం.. నువ్వు ఒక్కదానివే ఎట్లుంటావ్? పెళ్లి కొడుకు వాళ్లు బాగా సౌండ్ అట. అరవై రకాల ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారట, రెండు లగ్జరీ బస్సులు పెట్టారు. మన చెవిటి రాఘవయ్య కూడా వస్తున్నాడు. నువ్వు రావటానికేంటీ? ఈ విషయం అసలు పద్మక్కకి చెప్పావా? కూతురు పెళ్లికి నువ్వు రాలేదంటే అస్సలు ఊరుకోదు. మేకప్ అదీ నువ్వే చెయ్యాలిగా?’ అడిగింది రాధమ్మ. ‘చెప్పాను పిన్నీ.. మేకప్ కోసం ఓ పార్లర్ ఆమె వస్తుందట. పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి తెల్లారిపోతుంది. మళ్లీ ఉదయాన్నే నేను స్కూల్‌కి వెళ్లడం కష్టం అవుతుంది. మీరు వెళ్లిరండి’ అంటూ సైగ చేసింది ఉద్భవి. మరునాడు ఉదయాన్నే పెళ్లినుంచి తిరిగి వచ్చిన వాళ్లంతా అలసిపోయి, మధ్యాహ్నం వరకూ మంచం దిగలేదు. ఉద్భవి స్కూల్‌కి వెళ్లి ఉంటుందిలే, సాయంత్రం వస్తుందిలే అనుకున్నారు కొందరు. కానీ ఉద్భవి ఆ రోజు రాత్రికి కూడా రాలేదు. పోలీసులు అందించిన సమాచారంతో ఆ మరునాడు ఉదయాన్నే.. ఉద్భవి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉందని తెలిసి కాలనీ వాళ్లంతా పరుగుతీశారు. ‘ఎవరో గ్యాంగ్ రేప్ చేసి పక్కూరు పైడితల్లి గుడివెనుక తుప్పల్లో పడేశారట. నిన్న పొద్దున్నే ఓ కూరగాయల ముసలమ్మ మన ఉద్భవినీ గుర్తుపట్టిందట’ చెప్పింది రాధమ్మ పక్కనే ఉన్నామెతో.. ‘అయ్యో నోరులేని పిల్ల.. పాపం.. చాలా అన్యాయం చేశారు. పిల్లకి న్యాయం జరిగేవరకూ ఇక్కడ నుంచి కదిలేదే లేదు’ అంటూ ఆ కాలనీ వాళ్లంతా అక్కడే నినాదాలు మొదలుపెట్టారు. అమ్మాయి అందంగా ఉండేసరికి.. మీడియా బ్రేకింగ్స్ కూడా వేయడం మొదలుపెట్టింది. ‘ఆడదానికి ఏదీ రక్షణా?’ అంటూ చర్చాగోష్టి, ర్యాలీలు ఊపందుకున్నాయి. రచ్చ మీడియాకి ఎక్కడంతో.. పోలీసులు హుటాహుటిన నేరస్తుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఘడియ ఘడియకు సీసీ పుటేజ్‌లు, సీన్ టూ సీన్ లైవ్‌లతో మీడియా హోరెత్తిస్తుంటే.. రెండు రోజులకు మరో బ్రేకింగ్ పెద్ద దుమారమే రేపింది. ‘డాక్టర్స్ రిపోర్ట్‌లో బయటపడ్డ నిజం. ఉద్భవికి మాటలొచ్చా? కావాలనే మాట్లాడకుండా అందరినీ మోసం చేసిందా?’ నాలుగు రోజులకు ఇంకో బ్రేకింగ్. ‘ఉద్భవి ప్రాణాలకు ప్రమాదం లేదన్న వైద్యులు, అనుమానితుల అరెస్ట్..’ ఈ అన్యాయగాథలో బాధితురాలు మూగ దానిలా నటించిందనే సరికి జనాల్లో ఆసక్తి పెరిగింది. మరో 4 రోజులకు ‘మీడియా ముందుకు ఐదుగురు నిందితులు’. ‘అసలు ఉద్భవి అమ్మాయే కాదు.. తను ఓ హిజ్రా’ అంటూ ఆవేశంగా ప్రకటించాడు ఓ నిందితుడు. అది విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. అమ్మాయి కాదంటే పోరాటం చేసేవాళ్లు లైట్ తీసుకుంటారని, దానితో.. న్యూస్‌లో పస పోతుందనే కారణంతో అప్పటిదాకా నిజాన్ని దాచిన మీడియా కూడా మరో బ్రేకింగ్ వేసింది. ‘ఉద్భవి అమ్మాయా? హిజ్రానా?’ అని. ‘నీకు ఈ లోకంతో పనా? ఈ లోకానికి నీతో పనా? అవసరాలతో పూట వెళ్లదీసే ఈ సమూహానికి నీ మనోగతంతో పనా?’ అంటూ తనలో తనే పాటలాంటి మాటలను వల్లెవేస్తూ.. వచ్చి పక్కనే కూర్చున్నాడో పెద్దాయన. ఎరుపెక్కిన కళ్లతో.. ముక్కు పుటాలను గట్టిగా తుడుచుకుంటూ తలపైకెత్తి అతడిని చూసింది తను. మెడలో రుద్రాక్షలు, నుదిటి మీద నిలువు విభూది బొట్లు.. చేతికి కాశీతాళ్లు, జైదుర్గా అనే నామస్మరణలు.. భలే విచిత్రంగా ఉన్నాడా మనిషి. 60 ఏళ్లు పైబడి ఉంటాయి. కూర్చోవడమే తనని చూస్తూ.. ‘ఏమైంది తల్లీ.. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావ్?’ అంటూ ఆరా తీశాడు. ‘నీకు ఈ బతుకు అవసరమా చచ్చిపో? అంది మా అమ్మ. అందుకే చచ్చిపోదామని వచ్చేశానండీ. కానీ భయమేస్తోంది..’ గుండె లోతుల్లోని దు:ఖాన్ని అణచివేసుకుంటూ వణుకుతూ వచ్చిన మగ స్వరాన్ని విని విషయాన్ని అర్థం చేసుకున్నాడు అతడు. మోకాళ్ల కిందకి గౌను వేసుకుంది తను. ఒత్తైన, పొడవైన జుట్టులోని ముందరి వెంట్రుకలు గాలికి కళ్ల మీదుగా అటూ ఇటూ ఊగుతుంటే.. వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత వచ్చే అలసటతో నిట్టూరుస్తూ.. చూపుకు అడ్డుపడ్డ వెంట్రుకలను చెవులకు చుట్టింది. ఏడ్చిన తర్వాత వచ్చే దగ్గు మాత్రం మగపిల్లాడ్ని గుర్తుచేస్తుంది. ‘నాకు నీ సమస్య అర్థమైంది. నీ వయసెంత?’ అని అడిగాడు ముసలాయన. ‘పదేళ్లు..’ అంది తను ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘నిన్ను నువ్వే అర్థం చేసుకోలేని వయసు నీది. కానీ ఈ సమాజం తనని అర్థం చేసుకోమంటోంది. నీ పుట్టుకలోని లోపం దేవుడి సృష్టి. నువ్వు దేవుడ్ని నమ్ముతావా?’ అడిగాడాయన. ‘ఊ’ అంది నిస్తేజంగా మారిన నిస్సహాయపు చూపులతో మరోసారి కళ్లు పైకెత్తి. ‘ఎందుకు నమ్ముతావ్?’ అని అడిగాడు. ‘ఏది కోరుకున్నా తీరుతుందని ఒకసారి మా అమ్మ చెప్పింది’ అంది తను. ‘దేవుడు మన కోరికలు తీర్చడమే కాదు.. అప్పుడప్పుడు మన శక్తిని పరీక్షిస్తూ ఉంటాడు. నీకు ఒక సమస్య వచ్చిందంటే.. నీ శక్తి మీద ఆ దేవుడికి అపారమైన నమ్మకం ఉందని అర్థం. నువ్వు ఎలాగైనా ఆ సమస్యని ఎదుర్కొని జీవిస్తావని దేవుడి నమ్మకం. నీ లోపాన్ని ఎత్తిచూపిస్తూ.. నీతో ఏ అవసరం లేదని ఈ సమాజం నిన్ను ఒంటరిదాన్ని చేసింది కదూ? కానీ.. నువ్వు బతకాలంటే ఈ సమాజం కచ్చితంగా కావాలి. నేను నీకు తోడుగా ఉండే ఓ సమూహాన్ని పరిచయం చేస్తాను. మరి నేను చెప్పినట్లే చేస్తావా?’ అడిగాడు ఆయన. ఏడ్చీ ఏడ్చీ బొంగుర పోయిన స్వరాన్ని సరిచేసుకుంటూ ‘ఊ’ అని అంగీకారంగా తల ఆడించింది తను. ‘పద నాతో..’ అంటూ చెయ్యి పట్టుకుని ఓ మధ్యవయస్కుడి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. చేతిలో ఉన్న చిట్టి చేతిని అతడికి చూపిస్తూ.. ‘ఇక్కడ ఉద్భవి అని అందమైన తెలుగు అక్షరాలను పచ్చబొట్టుగా వెయ్యి’ అన్నాడు ఆ ముసలాయన. ‘సరే బాబు’ అంటూ అంతా సిద్ధం చేస్తుంటాడు ఆ వ్యక్తి. ఇంతలో ఆ ముసలాయన తనను కాస్త దూరంగా తీసుకుని వెళ్లి.. ‘ఇప్పుడు ఆ మనిషికి నీ గురించి ఏమీ తెలియదు. నీకు నీ స్నేహితుల హేళనలు బాగా గుర్తున్నాయి కదా?’ అడిగాడు. అర్థమైనట్లే మౌనంగా ఉంది తను. పది నిమిషాల తర్వాత ‘ మీ మనవరాలు భలే అమ్మాయండీ. ఏడవకుండా, అరవకుండా భలే ఓపిగ్గా పచ్చబొట్టు వేయించుకుంది. ఇంత ధైర్యవంతమైన ఆడపిల్లని నేనింత వరకూ చూడలేదు’ అన్నాడు ఉద్భవిని చూసి నవ్వుతూ పచ్చబొట్టు వేసిన వ్యక్తి. ‘పేరు ఉద్భవి.. వయసు పదేళ్లు, నా అనే వాళ్లెవరూ లేరు, తనకి మాటలు రావు. దారిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే.. ఈ ఆడపిల్లల ఆశ్రమానికి తీసుకొచ్చాను’ అన్న ఆ ముసలాయన మాటలు వింటూ ఓ పక్కకు పొందిగ్గా నిలబడింది పదేళ్ల ఉద్భవి. అప్పటి నుంచీ తనకి ఆ ముసలాయన చెప్పిన మాటలు పదేపదే వినిపించేవి. ‘ఉద్భవీ.. ఇక నుంచి ప్రతిరోజూ ఒక సాధన చెయ్యి, ఎవరితోనూ నోరు తెరిచి మాట్లాడను అని. ఒక లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో లోపాన్ని అంటగడుతున్నాడేంటీ అనుకోకు. సమాజం పోకడ తెలిసినవాడిగా నీకీ సలహా ఇస్తున్నాను. ఇది నీకు ఎంత సహకరిస్తుందో.. పోనుపోనూ నీకే అర్థమవుతుంది. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే.. ఇక్కడున్న వాళ్లందరికీ నీ లోపం తెలుస్తుంది. దానితో హేళనలు, అవమానాలు వేటినీ నువ్వు ఆపలేవు. ఎందుకంటే సమూహానికి వ్యక్తి మనసుతో పని లేదు. తప్పించుకోలేవు. పైగా కొత్తగా నువ్వు ఏర్పరచుకున్న బంధాలు కూడా నీకు దూరమయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఆ భయంతోనైనా నువ్వు నోరు తెరవలేవన్న నమ్మకం నాకుంది. ఒక్కటి మాత్రం నిజం. ఈ లోకానికి నీతో పని లేకపోయినా నీకు ఈ లోకంతో పని ఉంది. ఎందుకంటే.. ఏ మనిషికైనా బతకడానికి నలుగురు మనుషుల తోడుకావాలి. పొట్లాడటానికైనా, పోరు సాగించడానికైనా, తన మంచితనాన్ని పంచడానికైనా.. మనల్ని, మన విధానాలను సమ్మతించే నలుగురు మనుషులు తోడుగా ఉండాలి. నీ వయసుకి నేను ఇప్పుడేం చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. కాలం నీకు చాలా నేర్పిస్తుంది. జాగ్రత్త, చావు అనే పదాన్ని ఇంకెప్పుడూ నీ మనసులోకి రానివ్వకు. ఆ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న విషయం మరిచిపోకు’ హాస్పిటల్ బెడ్ మీద నిసత్తువగా పడి ఉన్న ఉద్భవికి ఆ ముసలాయన చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. కాసేపు నిశ్శబ్దం. ‘రేయ్ ఇది అమ్మాయి కాదురా..?’, ‘ఏదైతే ఏంట్రా..’ అన్న కీచకుల మాటలు అస్పష్టంగా పదేపదే వినిపిస్తుంటే.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఉద్భవి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. కానీ బెడ్ మీద నుంచి పైకి లేవలేకపోయింది. అంతకు 2 నిమిషాల ముందే ఉద్భవి కోలుకోవాలని గుడికి వెళ్లి వచ్చిన స్వరాజ్.. ఉద్భవి నుదిట మీద బొట్టు పెట్టి వెళ్లాడు. ‘అమ్మా.. మీరు చెప్పండి. ఉద్భవి మీతో ఎలా ఉండేది? తను అమ్మాయి కాదనే విషయాన్ని మీరు కనిపెట్టలేక పోయారా?’ అనే రిపోర్టర్ ప్రశ్నకు.. ‘ఇదిగో బాబూ.. తన గురించి మమ్మల్ని అడగకండి, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకి పెళ్లిళ్లు కావాలి. తను మా ఇంటి ముందు ఉందన్న మాటే కానీ.. మాకు అంతగా తన గురించి తెలియనే తెలియదు. అయినా ఆడో, మగో కనిపెట్టడానికి ఏముందయ్యా? మాట రాదండి. బట్టలు ఊూూూ చూడలేం కదా’ అంది రాధమ్మ కోపంగా.. ఐదుగురు నిందితుల్లో నలుగురు కాలనీకి చెందిన కుర్రాళ్లే కావడంతో.. కాలనీ వాళ్లు వెనక్కి తగ్గారు. ‘తను అమ్మాయే కాదట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. కావాలనే మా పిల్లల్ని రెచ్చగొట్టి ఉంటుంది. లేకపోతే వీళ్లెందుకు ఆ పని చేస్తారు?’ అనే నిందితుల తల్లిదండ్రుల వాదనను చాలామంది బలపరిచారు. ‘అసలు ఆమె అమ్మాయే కాదు. ఒకేసారి ఐదుగురిని చూసేసరికి ఆమెలో ఎలాంటి భావాలు కలిగాయో మనం చెప్పలేం.. నిందితులని ఆమే బాగా రెచ్చగొట్టింది. చూడటానికి అందంగా ఉండటం, అప్పటికే వీళ్లంతా తప్ప తాగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది’ అంటూ కేసు తీవ్రతని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టాడు నిందితుల తరఫు లాయర్. అతడి వాదనని చాలామంది సమర్థించారు. ‘నిజమే అయ్యుంటుంది.. లేకపోతే అమ్మాయిలే లేనట్లుగా హిజ్రాని ఎందుకు రేప్ చేస్తారు?’ అంటూ నోరు జారి మహిళా సంఘాలకు కోపం తెప్పించినవాళ్లు కొందరైతే.. ‘ఓరీడమ్మా బడవా.. ఇది నేను చూడ్లా.. ఇదేం గోలరా నాయనా?’ అంటూ కామెడీగా ఈ సమాజంలో మేము సైతం అన్నారు మరికొందరు. ఉద్భవి అమ్మాయి కాదని తెలిశాక చాలామంది న్యాయ పోరాటం నుంచి తప్పుకున్నారు. మెల్లగా మీడియా కూడా మరో బ్రేకింగ్ కోసం వెంపర్లాడటంతో.. ఉద్భవి కేసు మరుగున పడింది. కొన్ని వారాలకు ఆసుపత్రిలోనే పూర్తిగా కోలుకున్న ఉద్భవిని.. పోలీసుల పరిరక్షణలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆ సమయంలో స్వరాజ్ తనని కలవడానికి వచ్చినా ఉద్భవి అందుకు ఇష్టపడలేదు. చివరికి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఉద్భవికి ఇవ్వమన్నాడు స్వరాజ్. అందులో ఉద్భవికి సంబంధించిన సర్టిఫికెట్స్, కొన్ని బట్టలు, డైరీలు, పుస్తకాలు, సెల్ ఫోన్.. ఇలా అవసరమైనవి చాలానే ఉన్నాయి. ఒకరోజు సెల్ఫోన్లో తన మీద వచ్చిన కథనాల గురించి యూట్యూబ్స్, సోషల్ మీడియాల్లో వచ్చిన వీడియోలు, ట్రోల్స్ అన్నీ చూసి గుండెలవిసేలా రోదించింది. ఒంటరిగా భవనంపైకి వెళ్లి.. ఎన్నో ఏళ్లుగా మూగబోయిన ఆ గొంతు తెరిచి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ.. ఏడ్చింది. కాస్త దూరంగా.. ‘అల్లా....’ అంటూ నమాజ్ స్పీకర్లో వినిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న డైరీలోని పేపర్స్ ముందుకు కదిలాయి. పైనుంచి కిందదాకా నల్లటి వస్త్రాన్ని వేసుకున్న ఉద్భవి.. డైరీ రాయడం మొదలుపెట్టింది. ‘నేను మనిషిని. సమాజం నన్ను మనిషిగా గుర్తించాలని కోరుకునే పిచ్చి మనిషిని. గౌరవంగా బతకడానికి సమాజాన్ని మోసం చేశాను. నిజానికి ఇది మోసం కాదు, సమాజం ముందు నేనో నిజాన్ని దాచాను. ఎవరికీ అపాయం కానీ, అవసరం లేని ఒకే ఒక్క నిజాన్ని దాచాను. నన్ను నన్నుగా ఎవరూ అంగీకరించడం లేదు కాబట్టి మూగదానినని అబద్ధమాడాను. ఈ అబద్ధంతో నేను ఎవరినీ బాధపెట్టలేదు. ఇప్పుడు ఎవరినీ తప్పు బట్టడం లేదు. ఎందుకంటే.. నాలానే ప్రతి మనిషి ఒంటరిగా బతకడానికి భయపడతాడు. సమాజం తోడు కావాలని కోరుకుంటాడు. అందుకే కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో వర్గాలుగా విడిపోయి.. ఆయా సమూహాల్లో తనూ ఒకడిగా బతుకుతుంటాడు. ఏదో ఒక వర్గానికి పరిమితమై జీవనాన్ని గడపుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ సమూహం నుంచి బయటపడితే.. ‘ఒంటరిగా బతకడం ఎలా? ప్రాణం మీదకి వస్తే పరిస్థితి ఏంటి? ప్రాణాలు పోయాక మోసేదెవరు?’’ అంటూ లెక్కలేసుకుంటాడు. అందుకే సాహసించి ఆ సమూహాన్ని దాటలేడు. తన సమూహంలోకి మరో వర్గానికి చెందిన మనిషిని ఏకపక్షంగా ఆహ్వానించనూలేడు. అందుకే.. నా తరఫున ఎవరూ నిలబడలేదని వేదన చెందను. నేను చేసేది తప్పేమోనని నాలో నేనే చాలాసార్లు మథనపడ్డాను. అలా మథనపడిన ్రçపతిసారీ నాకు తోచిన సమాధానం ఒక్కటే. ఇది నా వ్యక్తిగతం అని. ప్రతి మనిషికీ ఈ లోకంలో ‘సమాజంతో నేను, నాతో నేను’ అనే రెండు పాత్రలుంటాయి. వ్యక్తిగతంగా పెళ్లి, పిల్లలు అవసరం లేదనుకున్నప్పుడు.. ఈ సమాజానికి నేను తప్పుడు ఆదర్శం కానప్పుడు.. నా వ్యక్తిగతంతో ఈ సమాజానికి పనేముంది? అనుకున్నాను. ఇప్పటిదాకా నా స్వరాన్ని ఆ దేవుడు దాచుకునేలా చేస్తే.. ఇక నుంచి నా ముఖాన్ని ఈ సమాజం దాచుకునేలా చేసింది. ఇంకా ఆ దేవుడు నా శక్తిని పరీక్షిస్తూనే ఉన్నట్లున్నాడు. ఇప్పుడు కూడా చావు గురించి ఆలోచించాలనిపించడం లేదు. చావు దానంతట అదే వచ్చేదాకా చావు గురించి ఆలోచించాలని లేదు’ అని ముగించి పెన్ పక్కన పెట్టి, కుర్చీపైన ఉన్న నల్లటి దుపట్టాని ముఖానికి కట్టుకుంది. మనియార్డర్ పోస్ట్ మీద కూరగాయల ముసలమ్మ అడ్రస్ రాసి.. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని, తను కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్‌కి బయలుదేరింది. రెండేళ్లు గడిచాయి. ‘ఏమయ్యా స్వరాజ్? పక్కనే సొంత ఇళ్లు పెట్టుకుని.. ఎన్నాళ్లు ఆ ఉద్భవీ ఉన్న పిచ్చి అద్దె కొంపలో ఉంటావ్? మంచిగా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా?’ అంటూ సలహా ఇచ్చింది రాధమ్మ కరెంట్ ఫ్యూజ్ మార్చి సాయం చెయ్యడానికి వెళ్లిన స్వరాజ్‌తో.. (అచ్చం అప్పట్లో ఉద్భవికి చెప్పినట్లే). స్వరాజ్ నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి ఇంటికి వెళ్లి పైనున్న ఓ సూట్‌కేస్ మెల్లగా దించి ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో అన్నీ ఉద్భవి డ్రెస్‌లే. ఒక డైరీ కూడా ఉంది. అది ఉద్భవికి స్వరాజ్ పరిచయం అయిన తర్వాత రాసిన డైరీ. (అందులో చాలా విషయాలు ఉన్నాయి. కూరగాయల ముసలమ్మ ఆయా కాదని, తన కన్నతల్లి అని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పలేదని, స్వరాజ్‌ని తను ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఇలా చాలానే ఉన్నాయి). సూట్‌కేస్‌లో.. బంగారు రంగు చున్నీ తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. దానికి ఓ చివర ఉన్న ‘స్వరాజ్’ అనే ఎర్రటి దారపు కుట్టుని చూసుకుని మురిసిపోతూ.. మరోసారి గుండెలకు హత్తుకున్నాడు. ‘ఒక మనిషి క్షేమాన్ని గుండెల నిండా కోరుకోవడమే కదా ప్రేమంటే.. అలాంటి ప్రేమే నాది కూడా. లవ్యూ స్వరాజ్..’ అని రాసి ఉన్న డైరీలోని మధ్యపేజీల్లో చివరి వాక్యాలను స్వరాజ్ ప్రేమగా నిమిరాడు 151వ సారి. - సంహిత నిమ్మన -
కోకిల గొంతు పడిపోయింది!
ఐసీయూలో ఉన్న కోకిల మెల్లగా కళ్లు తెరిచింది. చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తూ పైకి లేవబోతుంటే లేవకుండా నోటికి ముక్కుకి తగిలించిన పైపులు అడ్డం పడ్డాయి. ‘తనెక్కడుంది...తను ఇక్కడెందుకుంది?’ సమాధానం తెలియని ప్రశ్నలతో వున్న కోకిల హఠాత్తుగా ఒక విషయం గమనించింది. గుండె గొంతుకలో ఏదో అపశ్రుతి. తన జీవితాన్ని మృతప్రాయంగా మార్చినట్టు...ఏదో అడ్డం పడినట్టు మాట బయటకు రావడం లేదు. మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా మాట గొంతు దాటి బయటకు రానంటూ భీష్మించుకుంది. అప్రయత్నంగా తన ప్రమేయం లేకుండా మాటకు బదులు కళ్లలోని కన్నీరు ఉబికి వస్తోంది. పిలుస్తున్నాననుకుంటూ కోకిల ఐసీయూ బయట ఉన్న తండ్రిని పిలిచింది. పిలిచానని అనుకుంది. మాట కదలలేదు. కోకిల కదులుతుండటం చూసిన తండ్రి ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. తన తండ్రిని ఏదో అడగాలని ఆరాటంగా ప్రయత్ని స్తోంది కోకిల. కానీ సైగలు తప్ప మాటలు బయటకు రాలేమంటున్నాయి. అప్పుడు అర్థమైంది. తను...మా...ట్లా... డ...లే...క...పో...తోం...ది. తన గొంతు మూగబోయింది. ‘ఎప్పుడూ మనూరి సముద్రంలా గలగలా వినిపించే నీ మాటలు ఇక సముద్రానికి వినిపించవమ్మా ...ఉదయమే వీధి వీధంతా వినిపించే నీ కంఠం, కోకిలమ్మ పాడితే దేవుడిగుడిలో గంటలా వినిపిస్తదని చెప్పే నీ కంఠం మూగపోయింది తల్లీ’ అని చెప్పే భావాలూ కూడా పలకలేని నిరాసక్తుడు...తనకు తెలిసిన మాటల్లోనే చెప్పాడు. ‘నీ గొంతు పడిపోయింది తల్లీ’ అని. కూతురు కంఠం పోయిన బాధలో అతని ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఒక నిశ్శబ్దం వేనవేల విషాదాలను తనలో కలుపుకుంది. గతం ఆమె ప్రపంచాన్ని చివరిసారి చూపించింది. కోకిల పుడుతూనే రాగాన్ని ఆలపించింది. ఆ వూళ్ళో వున్న సంగీతం మాస్టారూ చెప్పినప్పుడు ఆ గిరిజన గూడేనికి అర్థం కాలేదు. కానీ ఆ గూడెంలో గాలికి ధూళికి చెట్టుకు,చేమకు, పచ్చని పైరులకు అర్థం అయ్యింది. కోకిల పాడితే చెట్టు మీద కోయిలలు గుంపుగా చేరేంత శ్రావ్యంగా ఉంటుంది. దేవుడి పాటలు, పల్లెపదాలు, అమ్మోరిని స్తుతించే పద్యాలూ అలా అలవోకగా పాడేస్తుంది. ఒక్కసారి వింటే గుర్తుంచుకుంటుంది. సంగీతం తెలియదు. సంగతులు తెలియదు అది ఏ రాగమో కూడా తెలియవు. విన్నది విన్నట్టుగా, వున్నది వున్నట్టుగా పాడుతుంది. గమకాలు పలుకుతుంది. సరిగమలు పలికిస్తుంది. నిరక్షరాస్యత పీడించే ఆ గూడెంలో అక్షరమ్ముక్క రాని కోకిలకు కోయిలలు సుస్వరాలు చెప్పేవేమో! కోకిల ఆ గూడేనికి ఆ పర్వతప్రాంతాలకు వచ్చే టూరిస్టులకు గైడ్‌గా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతం కోకిలకు కొట్టినపిండి. తన మాటలనే పాటలుగా మలుస్తుంది. రాగయుక్తంగా చెబుతుంది. ఆ అడవిలో పులులు సంచరిస్తాయి. కోకిల పాట పాడితే పులులు కూడా ఏ హానీ చేయకుండా వెళ్తాయని అంటుంటారు! కోకిలకు చిన్ననాటి స్నేహితురాలైన కమ్లి తన కుటుంబంతో కోకిల వాళ్లింటి పక్కనే ఉండేది. కమ్లికి కోకిల పాడే పాటలంటే ఎంతో ఇష్టం. కోకిల పాటలకు ఆ గిరిజనగూడెపు జనులందరూ మైమరిచిపోయేవారు. ఆ గూడెంలో కమ్లి ఒక్కర్తే కొద్దిగా చదువుకుంది. కమ్లి కోకిలకు అక్షరాలు నేర్పిస్తానంటే, చదువు చెబుతానంటే ‘వద్దు బాగా చదువుకుంటే నాకు మొగుడెలా దొరుకుతాడు’ అమాయకంగా అనేది కోకిల. ఒకరోజు ఒక ఫారినర్ ఆ గూడేనికి వచ్చింది. అక్కడ ఆ గూడేన్ని చూపించడానికి టూరిస్ట్ గైడ్ లా పనిచేసింది కోకిల. పర్వతాలు, అడవులు, గూడెం కొట్టినపిండి కోకిలకు. అలా అన్నీ చూపిస్తూ ఎప్పుడూ ఏదో ఒక పాట పాడుతూ వుండే కోకిల గొంతులోని మాధుర్యానికి భాష తెలియకపోయిన ఆ ఫారినర్ ముగ్దురాలైంది. కోకిల పాటను రికార్డు చేసింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టింది. అంతే ఒకేరాత్రి కోకిల పాట వైరల్ అయ్యింది. కోకిల పాడిన పాటలు అన్నీ రికార్డు చేసింది ఆ ఫారినర్. చెటు ్టమీద చేమ మీద, కొండ మీద ఇలా తన మనసుకు నచ్చిన, తనకు వచ్చిన పదాలతో పాడిన పల్లెపదాల జావళి అమృతవాహిని అయ్యింది. ఆ గొంతు ఎల్లలు దాటింది. సంగీతానికి భాషాభేదాలు లేవు. కులమతాలు లేవు. వేల షేర్స్, లెక్స్ లక్షల్లో... ఆ గొంతును విని మనఃస్ఫూర్తిగా అభినందించేవారు కొందరైతే, ఆ గొంతుకు వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకునేవాళ్ళు ఇంకెందరో! వ్యాపార ప్రపంచంలో కోకిల కంఠం వినియోగ వస్తువు అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్లు గూడేనికి క్యూ కట్టారు. టీవీ ఛానెల్స్ లైవ్‌లు ఇచ్చాయి. బ్లాంక్ చెక్స్ కోకిల చేతిలోకి వచ్చాయి. కోకిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమె ఆనందం అంబరమైంది. తనకొచ్చిన పాపులారిటీ చూసి కాదు. తన గొంతు ప్రపంచమంతా వినిపిస్తూ ఉండడం చూసి. తన స్వరం గాలిలో విహరిస్తోంది ఆమె మనసులా! తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఫారినర్‌కు చేతులెత్తి దండం పెట్టుకుంది. ఇంటర్వ్యూస్ అభినందనలు... తెల్లవారితే తన పాట గాలిలో కలిసి ప్రపంచాన్ని పలకరిస్తుంది. తమ గూడెంలో వున్న ఒకే ఒక పెద్ద కరెంట్ రేడియోలో ఆ పాట వినొచ్చు అనుకుని మురిసిపోయింది కానీ ఆ కరెంట్ ఆమె పాలిట శత్రువు అయ్యింది. వర్షానికి ట్రాన్స్ఫార్మర్ పేలింది. గూడేనికి నిప్పంటుకుంది. కోకిల ఆ మంటల్లో ఎక్కువశాతం కాలిన శరీరంతో హాస్పిటల్లో చేరింది. కానీ..విధిరాతను మార్చడం విధాత తలపులను తెలుసుకోవడం ఎవరితరం? ఒక్కరాత్రిలో తన ప్రపంచం చీకటిలో కలిసిపోయింది. ఆమె గొంతు మూగబోయింది. ఆ వార్త సినిమా ప్రపంచంలో గుప్పుమంది. కోకిల పాట తమ సినిమాకు ఇక వ్యాపారంగా, ప్రచారంగా పనికిరాదు...అని తెల్సిన మరుక్షణమే మొహం చాటేసింది. కోకిల జీవితానికి విషాదం ముసుగేసింది. రారే హితుల్...సుతుల్ సన్నిహతుల్...స్మశాన నిశ్శబ్దం... హస్పిటల్ బిల్లు కట్టడం కూడా కనాకష్టమైంది. చెక్కులు స్టాప్ పేమెంట్‌తో చిత్తు కాగితాలు అయ్యాయి. గూడెంలో కోకిలకు వున్న గూడు హాస్పిటల్ బిల్లులకు సరిపోయింది. చిన్న గుడిసెలో ఓ చెట్టు కింద ఉంటుంది. కోకిలకు మంచి అవకాశాలు వచ్చాయన్న వార్త తరువాత మళ్లీ ఎటువంటి వార్తలు రాకపోవడంతో ఆ ఫారినర్ కమ్లిని సంప్రదించింది. జరిగిన విషయం చెప్పింది కమ్లి. ఫారినర్ బాధ పడింది. వెంటనే స్పందించింది. హుటాహుటిన ఇండియాకు వచ్చింది. గూడేనికి వెళ్ళింది. నిస్త్రాణంగా చెట్టుకింద పడుకుని వున్న కోకిలను చూసి ఆ ఫారినర్ మనసు ద్రవించింది. కోకిలకు మెరుగైన చికిత్స చేయిస్తానని అంది. సైగలతోనే వద్దని వారించింది కోకిల. మానవత్వమే మూగబోయినవేళ...తన గొంతు ఎవరికీ అవసరం లేదు అన్నది. ఫారినర్ కోకిల తల మీద చేయి వేసింది. చెట్టు మీద వున్న కోయిలలను చూపించింది. ‘అవి ఎందుకు తమ స్వరాలను వినిపిస్తున్నాయి. పక్షుల కువకువలు ఏం ఆశిస్తున్నాయి? ఈ గొంతు ప్రపంచం వినాలి. మాటలొచ్చిన కోయిలను ఈ ప్రపంచం పాట ద్వారా చూడాలి.’ అని చెప్పింది. కోమాలోకి వెళ్లిన ఆమెలోని ఆశ మళ్ళీ ఊపిరిపోసుకుంది. తన కోసం కాదు...‘తాను పాడితే వినాలని, తన గొంతును పరిచయం చేయాలనీ దూరతీరాల నుంచి వచ్చిన ఆ ఫారినర్ కోరిక తీర్చాలి. తాను పాడాలి. కానీ సినిమా కోసం కాదు. ప్రపంచంలో నిద్రపోతున్న మానవత్వానికే మేలుకొలుపుగా వినిపించే పల్లెపదాలు, జానపదాలు మనుష్యుల్లోని ఆర్ద్రతను ప్రపంచానికి తెలిసేలా పాడాలి...ఓ ప్రక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. మరోప్రక్క సాధన. ఆ చెట్టు మీద వున్న కోకిలే తన డాక్టర్, తన గురువు. తన మౌనాన్ని ఏ క్షణమైనా శ్రావ్యంగా మారుస్తుందన్న ఆశ. డాక్టర్లు పెదవి విరిచారు. కమ్లి అప్పుడప్పుడు స్నేహితురాలిని పరామర్శించి పోతుంది. ఫారినర్ తనను అంటిపెట్టుకునే వుంది. సాధన...సాధన...సాధన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగునీటిలో గొంతువరకు మునిగి... ‘బ్రహ్మదేవుడా! ఈ బొమ్మకు ప్రాణం వద్దు...స్వరం ఇవ్వు’ అని వేడుకుంది. సాధనమున సమకూరు... సంగీతానికి రాళ్ళూ కరుగుతాయో లేదో కానీ కోకిల కన్నీటి వేదనకు దేవుడు కరిగిపోయాడో...స్వరం చలించిపోయిందో...మెల్లిమెల్లిగా గమకాలు పలుకుతోంది! ఫారినర్‌తో పాటు గూడెం అంతా కలియతిరిగింది. కోకిలలను పిలిచింది. గాలిని పిల్చింది. వర్షాన్ని పిలిచింది. మేఘాలను పిలిచింది. సృష్టిలోని సమస్తాన్ని ఆవాహన చేసుకుంది ఆమె కంఠస్వరం. ఆ రాత్రి కోకిల ఆ ఫారినర్ ఒడిలో తలపెట్టి పడుకుంది. దేశం కాని దేశం నుంచి వచ్చిన ఫారినర్ ఆమె కళ్ళకు స్వరాలమ్మలా, తన అమ్మలా కనిపించింది. ఆ రాత్రంతా పాడుతూనే ఉంది. ఫారినర్ రికార్డు చేస్తూనే వుంది. ప్రపంచాన్ని నిద్రలేపే పాటలు. మానవత్వాన్ని తట్టిలేపే పాటలు. సృష్టిని అపురూపంగా ఆవిష్కరించే పాటలు. స్వరాలు తెలియదు. గమకాలు తెలియదు. సంగతులు తెలియదు. తెలిసిందల్లా మనసులోని పాటను గొంతులో నుంచి ప్రపంచానికి పంచడమే. వ్యాపార విలువలను ప్రశ్నిస్తూ, మానవతాధర్మాన్ని చెబుతూ, మనిషి విలువను తెలియచెప్పే పాటలు. తెల్లవారు జామున చివరి పాట వరకూ పాడుతూనే వుంది. ‘కోకిలా ఇక చాలు రాత్రి అంతా పాడి పాడి అలిసిపోయావు’ అంటోంది ఫారినర్. కానీ ఆమె ప్రశ్నకు కోకిల బదులివ్వలేదు. ఆమె చివరిశ్వాస వీడ్కోలు స్వరం పలికించింది. చెట్టుమీద కోకిలలు మౌనం పాటించాయి. పక్షులు తమ రెక్కలు తెగినట్టు విలవిలలాడాయి. తన చివరికోరికగా ఆ పాటలను ఫారినర్‌కు అంకితం చేసి, ఆ గూడెంలో కోకిల స్వరాలయం ప్రారంభించమని చెప్పింది. - శ్రీ సుధామయి -
రెండు గంగలు
‘‘కథ చెప్పు తాతయ్య’’ అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనమలు చుట్టూ చేరి. ‘‘ఏం కథ చెప్పనురా?’’ అని ఆలోచిస్తున్నట్టు బోసినోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు. ‘‘ఏదో వొహటి’’ అంటూ నిద్రకి ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టుకు గుంజుతున్నారు పిల్లలు. ‘‘సరే’’ అంటూ... మొదలుపెట్టాడు శాస్త్రిగారు. ‘‘ఒక రోజున’’ ఊ కొడ్తున్న చిన్న పిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. ‘‘చాలా సంవత్సరాల క్రితం.. నాకు పెళ్లయిన కొత్తలో..’’ ‘‘అంటే నేను పుట్టిన తర్వాతేనా?’’ అన్నాడు ఆఖరి మనవడు. ‘‘ఇహ్’’ అని నోరంతా విప్పి నవ్వి వాణ్ని వొళ్లోకి తీసుకుని మళ్లీ మొదలెట్టాడు శాస్త్రిగారు. ‘‘పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్లి వస్తున్నాను. అటూ ఇటూ పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబళీ పరిచినట్టుంది. నేలతల్లి చిలకాకుపచ్చ చీర వొళ్లంతా చుట్టుకున్నట్టు పొలాలు. పొలం చుట్టూ తిరిగి, గట్ల పక్కన కుంటలో కాసిన్నీళ్లు తాగి అట్లా డొంకలో కొచ్చాను. మావిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరుగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలే. నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు, తూర్పు వైకుంఠపురం కొండమీద ఓ గర్జింపు వాన పెద్దదైంది. వలవల కురుస్తోంది వాన! జలజల కురుస్తోంది వాన! నేను గొడుగు తెచ్చుకోకపోతిని. పూర్తిగా తడిసిపోయాను. అయినా గొడుగులూ గోనె గుడ్డలూ ఏవిటి? అల్లంత ఆకాశగంగ పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగలించుకుంటుంటే - ఈ మనిషన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోటానికి? ఉన్నట్టుండి మబ్బులు పెద్దపెట్టున ఉరిమాయి. వర్షరాణి తీవ్రవేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరుగెత్తే రథ చక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతూంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూన్చిన గుర్రం సకిలింపులా ఉంది. అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాణి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్లు మిరుమిట్లు గొల్పితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్లు మూసుకుపోతుంటే ఇంక ఆకారాలెలా కన్పిస్తాయి? డొంకలో బురద బురదయిపోయి కాలు సాగటంలేదు. చెప్పులు విడిచి చేతపట్టాను’’. ‘‘వరెవరె! అప్పుడనిపించిందిరా! గంగమ్మ ఈ భూమినంతటినీ చల్లబరుస్తుంటే, నేనూ చల్లబడక ఈ పాత చెప్పులడ్డం పెట్టుకున్నానా’’ అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది. నాలోంచి కురుస్తోంది. జల్లు జల్లుగా కురుస్తోంది. భళ్లుభళ్లున కురుస్తోంది. వర్షపు చల్లదనం శిరసు నుంచి పాదాలదాక పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది. ఆ చల్లదనం నరనరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాలపెట్టు! ఎన్ని మునకలు దానికి దీటు! వర్షమంతా నా మీదే పడాలనిపించింది. నన్ను ముంచెయ్యాలనిపించింది. ఆ సమయంలో నేను నడవటం మానేసి, వొరేయ్! ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నారా! అటుపక్క చూస్తే పొలాల మీద వాన. మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా వూగుతోంది. దనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమెర వాసన, వాన సుగంధం కలిసిపోయిన గాలి. వానకి జొన్నచేను నృత్యం చేస్తోంది. మొక్కజొన్న కండెలుబ్బి పోతున్నాయి. సజ్జ కంకులు పొంగుతున్నాయి. వరి ఉన్నట్టుండి పెరుగుతోంది. కందికాయలు, పిల్లి పెసర్లు కువకువలాడ్తున్నాయి. వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లలోకి దింపుకుంటోంది వర్షధారల్ని. అలా నేల నేలంతా, పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకలెత్తుతోంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి, కృష్ణ వొడ్డుకు బయల్దేరాను. అలా ఎందుకనిపించిందీ అని అడక్కు. రంగావఝులవారి చేనుదాటి అలా కృష్ణ వొడ్డుకి వస్తినిగదా - వరె వరె వరె! అదీ వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వానపడిపోతోంది. నీళ్లలో నీళ్లు! ధారలో ధార! ప్రవాహంలో ప్రవాహం! వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్లు జలదరించినట్టు, ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు, ఓ పులకరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గమీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్నగుంట. అంతలో ఆ గుంట మాయం. మళ్లీ చినుకు, మళ్లీ గుంట. మళ్లీ మళ్లీ చినుకులు. అంతలో మాయమయి మళ్లీ మళ్లీ గుంటలు. కృష్ణంతా చినుకులు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. రేణు రేణువుకీ చినుకులు. విసవిస, సరసర చినుకులు. రివ్వుమని, రయ్యిమని చినుకులు, ఊపులా చినుకులు. తాపులా చినుకులు. ఛళ్లుమని, ఫెళ్లుమని, దభిల్లుమని, పెఠిల్లుమని చినుకులు - చినుకులు - కృష్ణనిండా, నేలనిండా - చినుకులు చినుకులు - రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగీ నేలా ఒకటే అన్నట్టు. ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు, అన్నిటికీ నీళ్లే ఆధారమన్నట్టు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో. అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నుంచున్నానా - పడవ్వాళ్లు నలుగురైదుగురు వచ్చి ‘‘శాస్తుల్లుగారు ఈడున్నారేటి?’’ అన్నారు. అప్పుడీ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ‘‘ఇదేవన్నా మతి భ్రమణవేమో’’ అనుకుంటారేమోనని వాళ్ల వెంట వూళ్లో కొచ్చాను. ‘‘వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా’’ అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు. ‘‘లేదురా ఇంకా కురుస్తోంది. ఆగకుండా కురుస్తోంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారెక్కువయింది. మీ నాయనమ్మా, కొత్తగా కాపరానికొచ్చిన చిన్నపిల్లయ్యె! అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కూడ గొట్టుకుంటుందో అని గబగబ నడిచాను. ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు. మధ్య గదిలో లేదు. వంటింట్లో లేదు. ‘‘ ఓహోయ్!’’ అని కేకేస్తే బదులు లేదు. గబగబా దొడ్లోకొస్తే దొడ్డి చివర ఆరుబయట కృష్ణవైపు తిరిగి నుంచుని కన్పించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి, చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తోంది’’. (‘అమరావతి కథలు’ నుంచి) కృష్ణా నది నుంచి వచ్చే మూడు కాలువలు తెనాలి నుంచి ప్రవహిస్తాయి. మూడును హిందీలో ‘తీన్’ అని, కాలువను ‘నాల్’ అని అంటారు. మూడు కాలువలు ఉన్నాయి కాబట్టి తీన్ నాల్ (తీన్నాల్) అయింది. ఆ తరువాత ఇది తెనాలిగా మారిందంటారు. కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రముఖమైనది. ఈ బహుళార్థసాధక ప్రాజెక్ట్‌ను మొదట ‘నందికొండ ప్రాజెక్ట్’ అని పిలిచేవారు. అయితే ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత వలన ‘నాగార్జుసాగర్ ప్రాజెక్ట్’ అని పేరు పెట్టారు. -
కథా నిలయానికి దక్కాల్సిన యజ్ఞ ఫలం
తెలుగు కథ పుట్టిన శతాబ్దం లోపలే, ఒక ప్రపంచ స్థాయి హోదా వేపు నడవడం మొదలు పెట్టింది. దేశంలో హిందీ తర్వాత, అత్యధిక ప్రజలు మాట్లాడే రెండో భాషగా ఎన్నదగిన స్థానం ఉన్న తెలుగు, ఒక సాహిత్య ప్రక్రియకు సంబంధించి ఇటు జాతీయ స్థాయిలోనూ, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ లేనటువంటి, విస్తృత వనరుగా ఎదిగేందుకు సంకల్పాన్ని చెప్పుకుని, 1997లో కథానిలయాన్ని ప్రారంభించింది. వేల సంఖ్యలో కథకుల వివరాలు సేకరించారు, వేనవేల కథల కుప్పలు ఏర్పడ్డాయి. కాళీపట్నం రామారావు అనే వ్యక్తి తలపెట్టినా, ఒక బృందం నడిపించినా, ఈ కథానిధి జాతి సంపద. ఉత్తరోత్తరా దీని అభివృద్ధి తెలుగు సాంస్కృతిక సమాజపు బాధ్యత. ఇప్పుడు వేగంగా కథానిలయం వెబ్సైట్ రూపొందుతోంది. 1,500 కథకుల, దాదాపు 86,000 కథల ప్రాథమిక సమాచారం వెబ్ పల్లకి ఎక్కిస్తూ, ఈ కృషిలో భాగంగా ఇప్పటికి 12,000 తెలుగు కథల పీడీఎఫ్ ప్రతులను సైటులో లభ్యపరిచారు. ఇరవయ్యో శతాబ్దపు ప్రపంచసాహిత్యంలోనే ఇదొక మైలురాయి. ఈ స్థాయిలో, ‘ఇంతింతై కథ ఇంతై’ అని ఎదిగే దశలో, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ- శ్రీకాకుళం మునిసిపల్ పరిధిలో ఒక వెయ్యి గజాల స్థలం కేటాయించి, మూడు అంతస్తుల భవన నిర్మాణం చేసి, ఈ సాహిత్య పురోగతిని నిలబెట్టాలి. ఇది వేగంగా జరిగేలా, రచయితలు, సాహిత్యాభిమానులు, సంస్థలు, ఏక మాటగా సానుకూల వాతావరణాన్ని, ఏర్పరుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మంచి పని చేసేలా ప్రోద్బలం చేయాలి. ఈ ప్రాజెక్ట్ ఎదిగే దశలో, యాభై మందికి మించి సౌకర్యవంతంగా సమావేశం కాలేని ఒక చిన్న ఇంటి ప్రదేశం, తప్పక ప్రతిబంధకం అవుతుంది. కొత్త భవనంలో, ఒక లైబ్రరీ, మొదటి అంతస్తులో కథలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్, రిఫరెన్స్, రిసోర్స్ కేంద్రంగా పనిపాటలు, రెండవ అంతస్తులో సమావేశమందిరం ఏర్పాటు చేయడం, తెలుగు జాతి సాంస్కృతిక సాహిత్య వికాసానికి ఎన్నో వాగ్దానాలు చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వపు విధాయకమైన కనీస సాంస్కృతిక కర్తవ్యం. ఇక కథానిలయం, కేవలం ఒక ప్రాంతీయ భాష కథల వనరుగానే పరిమితం కాకుండా, తెలుగు అనువాదంలో ఉన్న జాతీయ భాషల కథలు, హిందీ, ఇంగ్లిష్ కథల ఏకకాల ఉపలభ్యతకు దారులు వేస్తే గనక, ముందరి తరాల కథాధ్యయనవేత్తలు, కథకులు, పరిశోధకులకు ఒక సమగ్ర రెఫరెన్స్ సెంటర్‌గా ఎదుగుతుంది. - రామతీర్థ కాళీపట్నం రామారావు 9849200385 మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. రచనలు పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఫోన్: 040-23256000 మెయిల్: sakshisahityam@gmail.com -
19 ఏళ్ల కథ..!
శ్రీకాకుళం కల్చరల్: 1997 ఏప్రిల్ ప్రాంతం... ఎండలు ముదిరే సమయంలో కొంత మంది సాహిత్యకారులు కలిసి తెలుగు కథలకు కాసింత నీడనివ్వాలని సంకల్పించారు. తెలుగు కథ చాలా పాతది. అందుకే ఓ పరిధిని పెట్టుకుని 1910 నుంచి వెలువడిన మొత్తం తెలుగు కథానికలను, అనుబంధ సాహిత్యాన్ని సేకరించారు. దీంతో పాటుగా వర్తమాన రచయితల కంఠస్వరాలను, ఎలక్ట్రానిక్ మీడియా సాంకేతిక పరిజ్ఞానంతో పదిలపర్చడం, రచయితల రాత ప్రతులను సేకరించి పదిలపర్చడం వంటి లక్ష్యాలను పెట్టుకున్నారు. మొదటగా 800 పుస్తకాలను సేకరించారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి సేకరణా పెరిగింది. 19 ఏళ్ల తర్వాత ఆ కథా నిలయంలో పుస్తకాలు 16వేలు చేరాయి. పత్రికలు 24 వేలు ఉన్నాయి. సంకలనాలు, కథా సంపుటాలు కలిపి 5వేలు ఉన్నాయి. 100 ఫీచర్ రచనలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధనాపత్రాలు, 95 జీవిత చరిత్రలు, 130 సాహిత్య సర్వసాలు, 53 ఉపయుక్త గ్రంథాల సూచికలు, 45ఇతర భాషల్లో వచ్చిన తెలుగు పుస్తకాలు, 8200 ఇతర పుస్తకాలు సేకరించారు. 15వేల కథా రచయితలకు చెందిన వివరాలు సేకరించారు. 285కు పైగా రచయితల ఫొటోలు సేకరించారు. సుమారు 40మంది రచయితల గొంతులను రికార్డు చేశారు. అందుకు ఆల్ఇండియా రేడియో సహకారం ఉంది. ఇంత శ్రమ వెనుక ఉన్న ఒకే ఒక ఆలోచన ‘కథా నిలయం’. ఆ నిలయం సాహిత్యాభిమానులకు శాశ్వత వేదిక కావాలన్న ఆలోచన. 1997 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో సుర్యానగర్ రెండంతస్తుల భవనంలో ప్రారంభమైన కథా నిలయం నేడు అందరికీ చేరువైంది. అందుకు ఆధునిక పరిజ్ఞానం కూడా సాయం చేసింది. దీన్ని పరిరక్షించడానికి 1998 ఏప్రిల్‌లో 10మంది సభ్యులతోకూడిన ట్రస్టు ఏర్పడింది. అయితే గత ఏడాది డిసెంబరులో నూతన ట్రస్టు ఏర్పాటు చేశారు. నూతన అధక్షులుగా డాక్టర్ బీవీఏ రామారావు నాయుడు ఉపాధ్యక్షులుగా ఎన్.రమణమూర్తి, కార్యదర్శిగా డి.రామచంద్రరావు, సంయుక్త కార్యదర్శిగా కె.వి.ఎస్. ప్రసాద్, ట్రజరర్‌గా కాళీపట్నం సుబ్బారావు, ట్రస్టు సభ్యులుగా కవనమూర్తి, వివిన మూర్తి, అట్టాడ అప్పలనాయుడులు ఉండగా, నూతనంగా కనుగుల వేంకటరావు, విశ్వనాథ నాగేశ్వరరావు, దాసరి అమరేంద్ర, డి.విజయభాస్కర్, సి. ప్రసాద్‌వర్మలు చేరారు. కాలానికి అనుగుణంగా కథా నిలయం తన స్వరూపాన్ని కూడా మార్చుకుంటోంది. ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ పుస్తకాలను పాఠకులకు అందిస్తోది. ‘కథానిలయం.డాట్‌కామ్’లో దాదాపు 88 వేల కథలు ఉండడమే దీనికి నిదర్శనం. పంతొమ్మిదేళ్ల ఈ జ్ఞాపకం ఇప్పటి పాఠకులకు కూడా మధురానుభూతులు పంచుతోంది. ఇప్పటికీ కథలపై పరిశోధనలు చేస్తున్న వారికి తన వంతు సాయం చేస్తోంది. 13,14 తేదీల్లో వార్షికోత్సవ సభలు... కథా నిలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం 2.30గంటలకు కథానిలయంలో నెల్లూరుకు చెందిన ఈదురు సుబ్బయ్య సాహితీ పీఠం వారిచే కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు మాస్టారుకు సత్కారం, స్వీయ పరిచయాలు, పుస్తకావిష్కరణలు, అతిథులతో ఇష్టాగోష్టి అట్టాడ అప్పలనాయుడు నిర్వహణలో జరుగనున్నాయి. 14న వార్షికోత్సవ సభ మహిళా కళాశాలలోని ఆడిటోరియంలో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. యవ్వన దశలో ఉంది... కథా నిలయం యవ్వన దశలో ఉంది. దీని నిర్వహణ మెరుగుకు మూలధనం అభివృద్ధి చేయాల్సిఉంది.రూ.25లక్షలకు పెంపుకు కృషి చేస్తామన్నారు. గతంలో నిధుల సేకరణపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. అయితే దీని నిర్వహణ కోసమైనా సేకరణ చేయాల్సి ఉంది. ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చు. - బీవీఏ రామారావు నాయుడు, ట్రస్టు అధ్యక్షుడు -
గాలివానకు ముందు తర్వాత....
కథలు పుట్టించే కథలు తెలుగు కథకు ఖ్యాతి తెచ్చి పెట్టిందని భావిస్తున్న ‘గాలివాన’కు మాతృక వంటి కథలు ఇంతకు ముందు ఉన్నాయి. వాటి ప్రభావం గాలివాన మీద ఉంది. అంత మాత్రం చేత గాలివాన ఘనతకు వచ్చిన లోటేమీ లేదు. పట్టాల మీద రైలు వెళుతున్నప్పుడు మనింట్లో కిటికీ ఊగినట్టు ఒక మంచి కథ చదివినప్పుడు కలిగే అనునాదంతో గొప్పగొప్ప కథలు రాసినవాళ్లు చాలామంది ఉన్నారు. నిజానికి మూలకథ కంటే మెరుగైన కథలు రాసినవాళ్లు ఉన్నారు. గాలివాన! దీనికి మొదట బీజం వేసినవాడు గుస్తావ్ ఫ్లోబేర్. ‘మదాం బావరి’ ఫేమ్. ఆయన కూడా సొంతంగా రాయలేదు. అసలు అంత ఉన్నతమైన మానవ ఘటనను ఎవరూ ఊహించలేరు. ఎవరి జీవితంలో అయినా జరిగితే ఆ నోటా ఈ నోటా విని కథనం చేయడం తప్ప. ఇంతకూ ఆ కథ ఏమిటి? ఒకడు హంతకుడు. ఆ తర్వాత మారాలనుకుంటాడు. మంచి పనులు చేసి ‘సెయింట్’ కావాలనుకుంటాడు. కాని మంచి పని అంటే ఏమిటి? ఆచి తూచి చేసేది మంచి పనా? అప్రయత్నంగా చేయగలగాలి. అప్పుడే అది దైవానికి దగ్గరగా ఉంటుంది. అలాంటి పని ఇతడు ఏమి చేశాడు గనుక. ఇలాంటి సమయంలోనే భయంకరమైన శీతాకాలం వచ్చింది. మంచు- పేనినతాళ్ల వలే కురుస్తోంది. ఉష్ణం కావాలి ప్రతిఒక్కరికి ఉష్ణం. అది లేకపోతే చచ్చిపోతారు. అలాంటి శీతలంలోనే దారిన సెయింట్ పోతుంటే ఒక దిమ్మరి తారసపడ్డాడు. గోడ దగ్గర పడి ఉండి, ముణగ దీసుకొని, చలి... చలి అని వణుకుతున్నాడు. కాపాడండి... కాపాడండి.. రోదిస్తున్నాడు. సెయింట్ చూశాడు. క్షణం కూడా ఆలోచించలేదు. కోటు విప్పి ఇచ్చాడు. చాల్లేదు. ఇంకేదో బట్ట తెచ్చి కప్పాడు. సరిపోలేదు. దిమ్మరి పెనుబాధతో అరుస్తున్నాడు. ‘దేవుడా... నా ఎముకల్లో చలి దూరిపోయింది... కాపాడు తండ్రీ’... సెయింట్ మరేమీ ఆలోచించలేదు. తన బట్టలన్నీ విప్పి నగ్నంగా మారి ఆ దిమ్మరిని కావలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే తన శరీరంలోని ఉష్ణమంతా అతడిలోకి ప్రవహించాలి. కాని అప్పుడు తెలిసింది. అతడు దిమ్మరి కాదు. కుష్టువాడు. దేహమంతా కృశించి... వ్రణాలతో స్రవించి... సెయింట్ ఆగలేదు. మరింత కౌగలించుకున్నాడు. తన పాపాలకు ఇదే నిష్కృతి ఏమో అన్నట్టుగా మరింత గట్టిగా కావలించుకున్నాడు. దైవం ఎలాగైతే కావలించుకుంటుందో అలా కావలించుకున్నాడు. వాస్తవంలో జరిగిన ఈ ఘటనను..... ఖీజ్ఛి ఔ్ఛజ్ఛఛీ ౌజ ్చజ్టీ ఒఠజ్చీ ఖీజ్ఛి ఏౌటఞజ్ట్చ్చీట పేరుతో ఫ్లోబేర్ రాశాడు. అచ్చయ్యింది. లక్షల మంది చదివారు. కాని ఒకడు జవాబు పలికాడు. ఫ్లోబేర్తో సమానంగా కంపించాడు. గోర్కి! ఈ కథకు అతడి ప్రతిస్పందనే ‘మరపురాని రాత్రి’ కథ . ఏమిటా కథ? దివాలా తీసిన ఒక నగరంలో ఒక దిక్కుమాలిన చలికాలం. రాత్రి... పైగా వానా... ఆకలితో నకనకలాడుతున్న కుర్రాడొకడు ఒక బిచ్చెగత్తెకు తారసపడ్డాడు. ఇద్దరి దగ్గరా కాణీ లేదు. రాత్రి గడిపే దారీ లేదు. బిచ్చగత్తె దొంగ. ఆమె అతడితో కలిసి ఒక బంకును పెళ్లగిస్తుంది. కొంచెం రొట్టె ముక్కలాంటిది దొరుకుతుంది. రాత్రి మరింత చిక్కబడుతుంది. చలి- దాపున ఉన్న పులిలా గాండ్రిస్తూ ఉంటుంది. ఇద్దరూ సముద్రం ఒడ్డున బోర్లించిన పడవలోకి చేరారు. ఏమిటిది? ఈ రాత్రి.. ఈ బీభత్సం.. ఈ నైరాశ్యం... కుర్రవాడికి లోకం కొట్టే దెబ్బలు ఇంకా తెలియలేదు. ఇప్పుడిప్పుడే తెలిసి వణుకుతున్నాడు. చలికి కూడా. అయితే ఇలాంటి ప్రతి సందర్భాన్ని ఒక మనిషి సాటిమనిషి సాయంతో దాటిపోయాడు. ఆ కుర్రవాడికి కూడా ఈ క్షణంలో ఒక భరోసా కావాలి. బిచ్చగత్తె అది గమనించింది. మెల్లగా అతడిని దగ్గరకు తీసుకుంది. కావలించుకుంది. వెచ్చదనం. చలి నుంచి- వర్షపు చినుకుల నుంచి- ఆకలి నుంచి- సకల భవిష్యత్ భయాల నుంచి కాసింత వెచ్చదనం. అంతే. పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ వెనుక ఈ నేపథ్యమంతా ఉంది. ముఖ్యంగా ‘మరపురాని రాత్రి’కీ ‘గాలివాన’కూ దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మరపురాని రాత్రిలో కుర్రవాడికి వ్యవస్థ మీద నమ్మకం కూలిపోయింది. గాలివానలో రావుగారికి తన కల్పిత తాత్త్విక విశ్వాసాల మీద ఉన్న భేషజం కూలిపోయింది. రెండు కథల్లోనూ అట్టడుగున మిగిలేది ఉన్నత మానవ స్పందనలే. గోర్కి కుష్టువాడికి బదులు బిచ్చగత్తెను తీసుకున్నాడు. పద్మరాజుగారు అదే బిచ్చగత్తెకు విరాట్ రూపం ఇచ్చి తీర్చి దిద్దారు. ఇరువురి కథల్లోనూ ఆమె దొంగే. అయితే మన నేపథ్యానికి చలి కుదర్దు. మనది అంత చలి ఉండే ప్రాంతమూ లేదు. కనుక గాలివాన అవసరమైంది. వానకు తడిస్తే, తడిసి ముద్దయితే మరి చలి తప్పదు. రాయడమే కష్టం అనుకుంటే దాని కంటే బాగా రాయాలనుకోవడం ఎంత కష్టం. మూలం కంటే గోర్కి, గోర్కి కంటే పద్మరాజు ఆ కథకు అమరత్వం తీసుకువచ్చారు. అవి వారి సొంత కథలే. మూలం ఒక మిష. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. ఇదే కథ మన భారతీయాంగ్ల సాహిత్యంలో ఇంకోలా అనునాదం చెందింది. ఏమిటా కథ? ఢిల్లీ. గడ్డ కట్టే చలికాలం. భయంకరమైన శీతగాలులు. అలాంటి సమయంలో బాగా స్థితిమంతుడైన కుర్రాడొకడు తండ్రితో మాట పొసగక మీరట్‌లోని తన ఇంటి నుంచి బయటపడి ఢిల్లీ చేరుకున్నాడు. సాయంత్రమైంది. వాళ్లింటికీ వీళ్లింటికీ వెళ్లాడు. కాని ఆదుకుంటారన్న నమ్మకముంచిన ప్రతి ఒక్కరూ ముంచారు. తండ్రి సంపదను వదిలి వచ్చిన పనికిమాలినవాడితో పనేంటి? రాత్రయ్యింది. ఒకవైపు చలి. మరోవైపు ఆకలి. ఇంకోవైపు జ్వరం. నిలువ నీడలేదు. చలి పెరిగింది. ఎముకల్లో దూరిపోతోంది. ఒళ్లు ఎగిరెగిరి పడుతోంది. చచ్చిపోతాడా ఏం? కాని- ఇంతలో- మినుకుమినుకుమంటూ సూది మొనంత వెలుగు కనిపించింది. బీడీ రవ్వ. ఒక బిచ్చగత్తె. ఇతణ్ణి చూసింది. ఎవరతడు? బంధువు కాదు. పెనిమిటి కాదు. తోబుట్టువూ కాదు. సాటి మనిషి! చలికి ఒణుకుతున్నాడు. చచ్చిపోయేలా ఉన్నాడు. బిచ్చగత్తె ఆలోచించలేదు. తల్లిలాగా కదిలింది. రండి బాబూ రండి... దగ్గర కూచోబెట్టుకుంది. ఒణికిపోతున్నాడు. అయ్యో... దగ్గరకు తీసుకొంది. గట్టిగా కౌగలించుకుంది. ఇంకా గట్టిగా. ఆ క్షణంలో అక్కడ ఒక మనిషి నుంచి మరో మనిషిలోకి ప్రవహిస్తున్నది వేడి కాదు. నమ్మకం. మనుషుల మీద నమ్మకం. అతడిలో నాగరీకులందరూ పోగొట్టిన ఆ నమ్మకాన్ని ఒక ఛీకొట్టాల్సిన మనిషి- దిక్కుమాలిన మనిషి- బిచ్చగత్తె- ఆ శీతవేళ నిలబెట్టింది. దీనిని కె.ఎ.అబ్బాస్ రాశాడు. శ్రీ 420 రైటర్. ‘బ్లిట్జ్’ జర్నలిస్ట్. అబ్బాస్ బతికినంత కాలం ముంబైలో ఉన్నాడు. కాని ముంబైలో ఇంత చలి ఉండదు. అందుకే కథను ఢిల్లీకి మార్చాడు. అయినా సరే కథ శవాన్ని పరుండబెట్టే ఐస్‌లా ఉండదు. కొండ చరియను సహజంగా పెనవేసే హిమధారలా ఉంటుంది. అబ్బాస్ చాలా కథలు రాశాడు. ఇది మణిమకుటం. ఎవరూ దీనిని తప్పించుకోలేరు. మహామహులైనా సరే తప్పించుకోవాల్సిన అవసరమూ లేదు. ఓ.హెన్రీ- గిఫ్ట్ ఆఫ్ మేగీ స్పర్శ చా.సో- వాయులీనంలో కనిపించలేదా? హెమింగ్వే- ‘ఓల్డ్ మేన్ అండ్ సీ’ కేశవరెడ్డి- అతడు అడవిని జయించాడుగా రూపాంతరం చెందలేదా? మనందరం ఆరాధించే త్రిపుర- జేమ్స్ థర్బర్ రాసిన ‘ది సీక్రెట్ ఆఫ్ వాల్టర్ మిట్టీ’ కథను ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’ పేరుతో సృజించలేదా? నిన్న మొన్న- ప్రేమ్‌చంద్ ‘షత్రంజ్ కే ఖిలాడీ’ కథ స్ట్రక్చర్‌లో వాడ్రేవు చినవీరభద్రుడు ‘పాఠాంతరం’ అనే మంచి కథను రాయలేదా? కంపనం తాకేంత వరకే జడత్వం. తాకిన వెంటనే కథ. ప్లాస్టిక్ బిడ్డకు నొప్పులక్కర్లేదు. కాని ప్రాణమున్న బిడ్డకు అంత కష్టమూ పడాల్సిందే. ప్రభావాల చేత అయినా సరే అలాంటి ప్రాణమున్న కథలు రాసిన వారికి వందనాలు. వేయి లైకులు. - ఖదీర్. -
తెలుగు కథకు తానా బహుమతి
తెలుగు కథకు తానా అందిస్తున్న అండదండలు విస్మరణీయం కాదు. ముఖ్యంగా గత పది, పదిహేను సంవత్సరాలుగా తెలుగు కథ వికాసంలో తానా ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటున్నది. ఇందుకు ‘కథా సిరీస్’ ఒక ప్రబల ఉదాహరణ. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ప్రతి ఏటా వెలువరిస్తున్న ‘కథ’ వార్షిక సంకలనాలు సాంకేతికంగా ‘కథాసాహితి’ ప్రచురణలే అయినా మానసికంగా తానా ప్రచురణలు. వీటి కోసం తానా స్వయంగా శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక పరిపుష్టి అందించడమేగాక, ఈ మంచి పని కోసం అమెరికాలో విరాళాలు ఆకాంక్షించడం, నలుమూలల ఉన్న అమెరికా పాఠకులకు చేర్చేందుకు ప్రతులను విక్రయించడం, ప్రచారం చేయడం... తన పనులుగా భావించి చేస్తున్నది. ఇది తక్కువ సేవ కాదు. ఆ విధంగా ‘కథ’లో ప్రకటితమైన కథకులెందరో తానాకు, అమెరికాకు రుణపడి ఉన్నారు. అలాగే తెలుగు కథను ఉత్సాహపరచడానికి తానా నిర్వహించిన పోటీలు గుర్తు చేసుకోవాలి. రూ.మూడు వేలు, రూ.ఐదు వేలు పెద్ద మొత్తాలుగా ఉన్న 2001-05 సం.ల కాలంలో తెలుగు కథకు బహుమతిని ఏకంగా రూ.25,000గా ప్రకటించి కుతూహలం రేపింది తానా. అయితే కథల నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని నిరాశ పడి బహుమతి మొత్తాన్ని పలువురికి విభజించి పంచడం మినహా ‘టైటానిక్’ (సురేష్), ‘అస్తిత్వానికి అటూ ఇటూ’ (మధురాంతకం నరేంద్ర), ‘మిత్తవ’ (మంచికంటి) వంటి మంచి కథలు ఆ పోటీల వల్లే తెలుగు కథకు జతపడ్డాయి. తెలుగు కథలోనూ, రచనలోనూ నిమగ్నమైన కాట్రగడ్డ దయానంద్, ఓల్గా, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, శ్రీరమణ తదితరులను ఆమెరికా ఆహ్వానించి వారిని తన వంతుగా గౌరవించు కోవడం తానా చేసిన మరో మంచి పని. ఆ పరంపరలో భాగంగా తానా ఇటీవలే ‘తెలుగు కథ- నేపథ్యాలు’ పేరుతో రెండు విలువైన సంకలనాలు వెలువరించింది. ఇప్పుడు మరో బహుమతిగా ఈ పుస్తకం. గురజాడ ‘దిద్దుబాటు’ కంటే ముందు తెలుగులో వెలువడిన 92 కథల సంకలనమే ‘దిద్దుబాటలు’. తెలుగులో మొదటి కథ ‘తేదీ ప్రకారం ఏది?’ అని కాకుండా ‘పరిణతి ప్రకారం ఏది?’ అనే విషయంలో పండితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. 1910లో గురజాడ ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’ కథలు రాశారు. వస్తువు రీత్యా, శిల్పం రీత్యా, భాష రీత్యా, స్థానికత రీత్యా ఇవి ప్రపంచస్థాయి కథలు. ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించిన అంతకుముందరి కథలు ఎన్ని ఉన్నా వీటి ముద్ర చెరిగిపోదు. రాయసం వెంకట శివుడు, భండారు అచ్చమాంబ, ఆచంట సాంఖ్యాయన శర్మ, విన్నకోట లక్ష్మీ జోగమ్మ వంటి తొలి కథకుల కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. కొన్ని గ్రాంథికం, కొన్ని వ్యావహారికం, కొన్ని మిశ్రమంగా, కొన్ని సంభాషణ రూపంలో, కొన్ని ప్రాథమిక శైలిలో.... పలుకు నేర్చుకుంటున్న పాపాయి అందం వీటి నిండా ఉంది. వీటిని చూస్తే ఇంత కృషి జరిగిందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. గర్వం కూడా. 20వ శతాబ్దపు తొలి రోజుల వచనం, వస్తువు, సామాజిక జీవనం తెలియాలంటే ఇంతకు మించిన విలువైన సాధనం మరొకటి ఉంటుందా? ఈ కథలను సేకరించడం, ఆనాటి భాషను తప్పుల్లేకుండా కంపోజ్ చేయడం, ప్రూఫ్ చూడటం, అందంగా పుస్తక రూపం ఇవ్వడం... ఈ పనుల కన్నా వీపున వంద మూటలు మోయడం సులువు. కాని సంపాదకులు వివినమూర్తి, మిత్రులు వాసిరెడ్డి నవీన్, ఎ.వి.రమణమూర్తి, చంద్ర, అక్షర సీత ఈ పని సమర్థంగా చేయగలిగారు. తెలంగాణ తొలితరం కథలను తెలంగాణవారు ప్రచురించుకున్నట్టు ఈ విలువైన సంపదను ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రచురించుకుని ఉంటే బాగుండేది కానీ మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవడానికి తపన పడే తానాకు అవకాశం దక్కడం సంతోషించదగ్గ అంశం. దీని వల్ల తానా తెలుగు కథకు విలువైన చేర్పును సమకూర్చడమే గాక తన వదాన్యతతో పూర్వ కథకులందరినీ రుణగ్రస్తులను చేసుకోగలిగింది. కాళీపట్నం రామారావు 90వ జన్మదినం సందర్భంగా వెలువడిన ఈ సంకలనం ఆయనకు ఒక అనిర్వచ నీయమైన అమెరికా కానుక. ఇలాంటి పనులు ఎన్ని జరిగితే అంత మేలు. - నెటిజన్ కిశోర్ దిద్దుబాటలు (దిద్దుబాటుకు ముందు కథలు 92) తానా ప్రచురణ; సంపాదకులు- వివినమూర్తి, వెల: రూ.300; అమెరికాలో: 25 డాలర్లు, ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు లేదా 040 - 23244088 తానా 2015 ఉత్సవాల్లో కథావేడుక.... ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తానా ఉత్సవాల్లో భాగంగా 2015 జూలై 2-4 తేదీల్లో అమెరికా డెట్రాయిట్లో జరగనున్న వేడుకలలో తెలుగు కథకు పెద్ద గౌరవం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుప్రసిద్ధ కథకులు పి.సత్యవతి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, డా.వి.చంద్రశేఖరరావు, స.వెం.రమేశ్, వాసిరెడ్డి నవీన్ ఉన్నట్టు తానా తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంతమంది కథకులు తానాకు హాజరు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఫలితంగా అక్కడ విస్తృతంగా జరిగే కథాసదస్సులలో తెలుగు కథ రెపరెపలాడనుంది. ఇది కథాభిమానులను ఆనందపరిచే సంగతి. పి.సత్యవతి (మంత్రనగరి), నామిని (మూలింటామె), డా.వి.చంద్రశేఖరరావు (లెనిన్ ప్లేస్), స.వెం.రమేశ్ (ప్రళయకావేరి కతలు) రచనలు పాఠకులకు పరిచితాలు. వాసిరెడ్డి నవీన్ ‘కథ’ సంకలనాలు బహుళ గుర్తింపును పొందాయి. కాగా తెలంగాణ రాష్ట్రం నుంచి కవి దర్భశయనం శ్రీనివాసాచార్య (వేళ్లు మాట్లాడేవేళ) వేడుకలలో పాల్గొననున్నారు. -
అరుదైన రాయలసీమ తొలితరం కథలు....
తెలుగు కథ పుట్టుక గురించి పరిశోధన ఊపు మీద ఉందనే చెప్పాలి. గురజాడ ‘దిద్దుబాటు’ను తొలికథగా గుర్తించి తొలి కథ పుట్టుక సంవత్సరాన్ని 1910గా స్వీకరించి చాలా కాలమైంది. ఆ తర్వాత అంతకంటే ముందు భండారు అచ్చమాంబ రాసిన కథలు వెలుగుకు వచ్చాయి. ఆ పైన కూడా 1910 కంటే ముందు వచ్చిన అనేక కథలతో ఇటీవలే వివినమూర్తి సంపాదకత్వంతో ఒక సంకలనం వెలువడింది. ఎవరు ఎన్ని కథలు రాసినా శిల్పం రీత్యా వస్తువు రీత్యా 1910లో వెలువడిన ‘దిద్దుబాటు’ లేదా ‘మీ పేరేమిటి?’ సంపూర్ణాకృతి దాల్చిన తెలుగువారి తొలికథగా పండితులు గుర్తిస్తారు. అయితే అంత మాత్రం చేత అంతముందు ఆ తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో వెలువడిన కథలను విస్మరించడం చాలా పెద్ద లోటు అవుతుంది. ఆ పని ఎన్ని వైపుల నుంచి ఎన్ని విధాలుగా జరిగితే అంత మంచిది. రాయలసీమ తొలితరం కథకుల మీద పరిశోధన కానీ ప్రచారం కానీ ఆశించినంతగా జరగలేదు. నేల అందిన మేరకు వెనుకకు నాదమునిరాజు (కడప), కె.సభా (చిత్తూరు), జి.రామకృష్ణ (అనంతపురం) వరకు నడవగలిగారు. వీరే ఇటీవలి వరకూ రాయలసీమ తొలితరం కథకులు. అయితే కడపజిల్లాకు చెందిన అయ్యగారి నరసింహమూర్తి అంతకంటే ముందు అంటే దాదాపు 1926 కాలంలోనే రాసిన కథలు పరిశోధక విద్యార్థి తవ్వా వెంకటయ్య పరిశోధనలో దొరికాయి. ఒక్క నరసింహమూర్తే గాక మరో ఇరవై మంది రాయలసీమ తొలితరం కథకుల్ని వారు రాసిన కథల్నీ సేకరించగలిగారు. ఈ కథలు రాయలసీమవాసులకేగాక తెలుగు కథాభిమానులందరికీ చాలా విలువైన ఆస్తి. ఫ్యూడల్ స్వభావం వల్ల కావచ్చు, ఇంగ్లిష్ విద్యను (సాహిత్యాన్ని) అందుకోవాలనే కుతూహలానికి మెజారిటీ సీమవాసులు దూరంగా ఉండటం వల్ల కావచ్చు లేదా పద్యవ్యామోహం విపరీతంగా ఉండటం వల్ల కావచ్చు సీమ వచనం చాలా ఆలస్యంగా ఊపిరిపోసుకుంది. కళింగాంధ్ర, తెలంగాణ, సర్కారు ప్రాంతాల్లో వాడుక భాషా ఛాయలు కొత్తగా విస్తరించినా సీమలో వచనం గ్రాంధిక ధోరణిని వదిలించుకోవడానికి సమయం పట్టింది. అయినప్పటికీ కథల్లోని వస్తువు, మానవాంశ, స్థానిక పరిస్థితులు, జీవన విధానాలు... వీటిని వ్యక్తం చేయడంలో సీమ తొలితరం కథకులు ఏమాత్రం వెనక లేరు. ఆ విషయాన్నే ఈ సంకలనం- రాయలసీమ తొలితరం కథలు- రుజువు చేస్తోంది. తన పరిశోధనలో సేకరించిన విలువైన కథల్లో 25 కథలను ఎంచి వెంకటయ్య వెలువరించిన ఈ పుస్తకం చాలా విలువైనది. ఎవరికీ పట్టని బిడ్డను ఎత్తుకోవడం లాంటిది. ఇంత శ్రమ చేసి సేకరించిన ఈ కథలను ఎంతో గొప్పగా ఘనంగా అచ్చువేసుకోవాల్సింది పోయి కొద్ది పాటి ఆర్థిక సర్దుబాటు కోసం దిక్కులు చూడవలసి రావడం విషాదం. ఇది ఎవరో ఒకరో ఇద్దరో డబ్బు సర్దుబాటు చేస్తే రావలసిన పుస్తకం కాదు. సీమ పెద్దలు తలచుకుంటే అన్ని కథలూ నాణ్యమైన ముద్రణతో ఒక బృహత్గ్రంథంగా వెలువడాలి. అది ప్రతి పరిశోధనాలయానికి చేరాలి. అప్పుడే ఈ పరిశోధనకు తగ్గ విలువ. రాయలసీమ తొలితరం కథలు, సేకరణ: తవ్వా వెంటకటయ్య, వెల: రూ.120 ప్రతులకు: 9703912727 -
అలా ఆ కథలు రాశాను...
జ్ఞాపకం 1988 నాటి మాట. అప్పుడు నేను రాసిన ‘అగ్ని సరస్సు’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వచ్చారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఉన్న ఆ సభలో వాళ్లిద్దరూ నాకో సూచన చేశారు. ‘తెలుగు కథ ఆవిర్భవించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావొస్తోంది. కానీ ఇంత వరకు మన పక్కనే మనతో పాటే కలసిమెలసి బతుకుతున్న ముస్లిముల జీవన స్థితిగతుల మీద మాత్రం ఎవరూ రాయలేదు. ఆ పని సత్యాగ్ని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇక మీదట ఆయన రాసే కథలు ఆ లోటును పూరిస్తాయి’ అని ప్రకటించారు. అప్పుడే నాలో ముస్లిం కథలు రాయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి తెలుగు కథాసాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన రచయితలు అనేకమంది ఉన్నారు కానీ ఎవరూ ముస్లిం కథ రాయడానికి పూనుకోలేదు. వారికి ముస్లిములతో పైపై పరిచయాలు తప్ప వారి జీవితాలపై లోతైన అవగాహన లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇస్లాం మతసిద్ధాంతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వాళ్ల జీవితాల గురించి రాస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం కూడా కారణం కావచ్చు. అందుకే అప్పటి వరకు అది ఒక చీకటి కోణంగానే మిగిలి పోయిందనేది నా భావన. ఆ లోటు భర్తీ కోసం నేను నా జీవితంలో జరిగిన, నేను అత్యంత సన్నిహితంగా చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ముస్లిం కథలు రాయడానికి ఉపక్రమించాను. 1989లో నేను రాసిన (తొలి ముస్లిం) కథ ‘పాచికలు’ ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత రాసిన కొన్ని కథలు ‘గీటురాయి’ పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇస్లాం మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం లేక విమర్శించడమో పనిగా కాకుండా వాటిని ఆసరా చేసుకొని కొనసాగుతున్న ముస్లిం స్త్రీల బాధల గాథలకు అక్షర రూపమివ్వడమే నా కథల ప్రధాన ఉద్దేశ్యము. అయితే నా కథలకు కొనసాగింపుగా నా తరువాతి రచయితలెవరూ అంత తొందరగా దీన్ని అందుకోలేదు. మూడు సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంతో కొందరు యువ రచయితల హృదయాల్లో అణగారి ఉన్న ఆవేదన, ఆవేశము ఒక్క పెట్టున బహిర్గతమై ముస్లిం సమాజ స్థితిగతుల మీద కథలు రాయడం మొదలుపెట్టారు. అది పెరిగి పెద్దదై ముస్లిం వాదంగా స్థిరపడి ఇప్పటికీ కొనసాగుతోంది. - షేక్ హుసేన్ సత్యాగ్ని (తెలుగులో తొలి ముస్లిం కథలు ‘పాచికలు’ రచయిత) -
చిన్న కథల పెద్దాయన
చాసో శతజయంతి ముగింపు- జనవరి 17 తెలుగు కథ వల్ల కొంత మంది వెలిగారు. తెలుగు కథను కొంతమంది వెలిగించారు. చాసో రెండో కోవకు చెందిన సృజనకారుడు. ఆయన వల్ల కథ వెలిగింది కానీ కథ ద్వారా ఆయన వెలగలేదు. వస్తువు, శైలి, శిల్పం, స్థానికత వీటన్నింటి గురించి శ్రద్ధ పెట్టిన కథకుడు ఆయన. ఏ విధంగా చూసినా చాసో తన జీవితంతోనూ రచనా జీవితంతోనూ భావితరాలకు ఒక మార్గం వేశారు. ఆ మార్గంలో నడవడంలోనే భవిష్యత్తు ఉంది. ‘తొమ్మిదేళ్లవాడు. సామ్యం చెప్పినట్టొచ్చింది నీ మూడుమూర్తులు. వచ్చాక చూద్దువుగాని. ఎలాగో నన్నుద్ధరించేవు. నీ వరప్రసాదం ఉండబట్టి ఆయన గణించిన డబ్బు, పిత్రార్జితం దఖలు పడ్డాయి. లేకపోతే నా మరుదులు ముండను చేసి మూల కూర్చో బెడుదురు’... ‘పోనీయ్యండి. నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలుండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లి తల్లిగుణాన్ని చూపించుకుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్లిపోతూ నాకో చీర రవికెల గుడ్డా పెట్టింది’... ‘నాయుడు పెట్టిన డబ్బుతో చదువుకున్నావు. అందుకే ఆ వెధవ ఉద్యోగమైనా చేస్తున్నావు. అతని అన్నమే తిని, అతని బట్టే కడుతున్నావు. నేనేం ద్రోహం నీకు చేశాను? వాణ్ణి దోచి నీకు పెడుతున్నాను, పుస్తె ముడి వేసిన మొగుడివి కదా అని. నాకే ద్రోహబుద్ధి ఉంటే వాడితో లేచి పోనూ? ’.... గుర్తొచ్చాయా పై మూడు మాటలు ఏ కథల్లోవో? నాలుగు ముక్కల్లో లోకరీతిని మన ముందుంచిన ఈ మాటలు చాసోగా మనం పిలుచుకునే చాగంటి సోమయాజులు రాసిన వివిధ కథల్లోవి. ఈ జనవరి 17 నాటికి చాసో పుట్టి వందేళ్లు అవుతుంది. కొత్తల్లో చాసో ఇంగ్లిష్‌లో కవిత్వం రాశారు. చక్కటి మీటరు, వర్డ్స్‌వర్త్ డిక్షన్‌లా ఉన్న చాసోగారి కవిత్వానికి ఇంగ్లిష్, ఫ్రెంచ్ పండితుడు, ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1930ల్లో పడిపోయారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారి చాసోగారి మేడగదికి తీసుకువెళ్లింది. తోడు కవి నారాయణబాబు. అడపా దడపా శ్రీశ్రీ. మధ్యలో మరీ కుర్రకవి ఆరుద్ర. ఇక సాహిత్యం, ప్రపంచ సాహిత్యం, సర్రియలిజం లాంటి కొత్తరీతులు... అవే తిండి, తాగుడు, ఊపిరి, ప్రాణం. వీటికి తోడు అరసంతో అనుబంధం. ఈ అనుభవాలన్నీ చాసోని గొప్ప ప్రపంచస్థాయి కథకుణ్ణి చేశాయి. అన్ని రకాల మనుషుల్ని దగ్గరగా చూడటం, వారి రీతుల్ని, పోకడలని, భాషని, భావాల్ని అవగాహన చేసుకుని కథలుగా మలిచారు. కథలు కల్పితాలు కావచ్చు. కాని కథల్లోని పాత్రలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సజీవాలే. చాసో తాను రాసిన కథల్లో తనకు నచ్చిన కథలు ఇవీ అని ఎంచుకున్నవి నలభై. అందులో మనల్ని కట్టి పడేసేవి ఓ ముప్పై. కవిత్వంలో హైకూల్లా ఆయన కథలు చిన్నగా ఉండి, జీవిత సారాన్ని నాలుగు ముక్కల్లో మన ముందు ఉంచుతాయి. ఏ కథలోనైనా ఈ వాక్యం, ఈ పదం, ఈ వర్ణన అనవసరం అనే ఉదాహరణ లేదు. ఆయన కథలు ‘ఇదీ సంగతి’ అని విషయాన్ని మన ముందుంచుతాయి. అంతేకాని రచయిత పాత్రలో దూరిపోయి ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పటం చెయ్యడు. చాసో కింది వర్గాల గురించి రాసిన కథల్లో ‘కుంకుడాకు’ ఒక చక్కటి కథ. కటిక బీదరికం. రాలిన కుంకుడాకులు ఏరుకుని వెళితేగాని పొయ్యి వెలగదు. పొయ్యి మీదికి వాళ్ల అయ్య ఏదైనా తెస్తేనే ఆ రోజుకి తిండి. కుంకుడాకులతో పాటు చింత తోపులలో దొరికిన ఎండుపుల్లల్ని కూడా ఏరుకుంటుంది గౌరి. దొంగతనం అంటగట్టి చావగొడతాడు చింతతోపు యజమాని. గౌరి ఆత్మాభిమానంతో పుల్లల్ని అక్కడే పడేసి కుంకుడాకులు మాత్రం తీసుకెళ్తుంది. ఈ కథ ఇంగ్లిష్‌లో అనువదింపబడి చాలా పేరు తెచ్చుకుంది. పస్తులున్న పిల్లల కోసం పర్మిట్ లేకుండా బియ్యం పట్టుకెళుతోందని ముసలిదాని వెంటపడతాడు రైల్లో టి.సి. ‘కుక్కుటేశ్వరం’ కథలో. రాసేటప్పుడు శిల్పం ఎలా ఉండాలి అని తెల్సుకోవాలంటే ఈ కథని ఒక పాఠంలా చదవాల్సిందే. ‘కుంటాణ్ణి’ కట్టుకుంటే ఏముంది? ‘గుడ్డాడు’ అయితే నలుగురూ జాలిపడి ఇంత పడేస్తారు. వాడు గుడ్డాడు కాబట్టి ‘ఎర్రి’ తన ముచ్చట్లు తీర్చుకోవచ్చు. ఇంతటి జీవన సత్యాన్ని చెప్పిన కథ ‘ఎంపు’. మధ్యతరగతి జీవితాన్ని తడిమే కథల్లో ‘ఏలూరెళ్లాలి’ ఎప్పటికీ మర్చిపోలేని కథ. ఆ అభాగ్యురాలికి అంత లోకజ్ఞానం ఉండబట్టే బట్టకట్టి నిలబడగలిగింది. లేకపోతే విధవరాళ్ల విషాదగాథల్లో చేరుపోను. ‘వాయులీనం’ కథలో చాలీచాలని జీతపురాళ్లతో కాలం వెళ్లదీసే భర్త, భార్యకు రోగం వస్తే ఆవిడ ప్రాణంగా దాచుకున్న ఫిడేల్ని స్నేహితుని సలహాతో అమ్మేసి ఆ డబ్బులతో ఆవిడ ప్రాణం కాపాడుకున్న తీరు మనల్ని కన్నీటి పొరలలో ముంచుతుంది. కొడుకు చదువు కోసం చుట్టలు తాగడం మానేసిన తండ్రి కథ ‘ఎందుకు పారేస్తాను నాన్నా’.. మనల్ని ఎంతో గాయపరుస్తుంది. చెప్పేదేమంటే ఆయన కథలు సమయాన్ని బట్టి ‘కోట్’ చేయాల్సిందే. దశాబ్దాలు గడిచినా ఇది తప్పదు. ఇవేనా- స్కూలు రోజుల్లో అల్లరి పనుల్ని గుర్తు తెచ్చే ‘బ్బబ్బబ్బా’, కుమిలిఘాట్కి వెన్నెల్లో సౌందర్యాధన కోసం వెళ్లి భయంతో రాత్రిని చీకటి చేసుకున్న మిత్రబృందం కథ ‘దుమ్ముల గొండి’, కూలికి కుదిరి మల్లెపొదలకి డబ్బులు పండించినా జబ్బు పడి తినడానికి తిండి లేక చచ్చిపోయిన ముసలాడి కథ ‘బొండు మల్లెలు’. బండలు కొట్టే కూలీ ప్రమాదంలో పోతే డబ్బుతో చావు సర్దుబాటు చేసి పంచుకున్న కథ ‘బండపాటు’. కొడుకుని బట్టల షావుకారికి పెంచుకోవడానికి ఇచ్చి, ఆఖరి చూపు కోసం వచ్చి షాపు మెట్ల మీదే చనిపోయిన గుడిశేటి గున్నమ్మ కథ ‘పోనీ తిను’.. ఇలా మరిన్ని కథలు. దేని గొప్పతనం దానిదే. తెలుగు కథకు ఒంపుసొంపుల్ని దిద్ది కథ అంటే ఇలా ఉండాలి అని నిర్వచించిన చాసో చిన్న కథల పెద్దాయన. మన భాష ప్రాంతీయభాష కావచ్చు. కాని మన కథలు అంతర్జాతీయ స్థాయివి అని నిరూపించిన వ్యక్తి. మీ దగ్గర ఎప్పుడో కొన్న చాసో కథల పుస్తకం ఉంటే తీసి మళ్లీ చదవండి. కాకపోతే కొత్తగా వచ్చిన ఎడిషన్‌లో పెద్ద అక్షరాలతో ఉన్న ఆ కథల్ని మరోసారి చదివి భుజానికెత్తు ్తకోండి. మన ‘మపాసా’, ‘మన చెహోవ్’ అని కొత్త తరాల వారికి అరచి మీరే చెప్పండి. మిమ్మల్ని మీరే గౌరవించుకోండి. - కృష్ణమోహన్‌బాబు 9848023384