పురిట్లోనే కన్నుమూసిన తల్లి, మళ్లీ పెళ్లి చేసుకున్న తండ్రి | Human Interested Telugu Story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: జంట కొమ్మలు

Published Sun, May 2 2021 11:14 AM | Last Updated on Sun, May 2 2021 11:19 AM

Human Interested Telugu Story - Sakshi

మనవరాలు వసంత అన్న మాటకి నారాయణమ్మ మారు పలకలేకపోయింది. కాలుతున్న బొగ్గుల మీద నీళ్లు చల్లినట్లయింది. 
‘‘చెప్పాను కదా. అతనికి వీలైనప్పుడు వస్తాడు. అట్టా గిలగిల్లాడతావేం?’’ అన్నది. ఈసడింపు! రక్త నమూనా తీసుకువెళ్లే మనిషి వచ్చి తీసుకుపోవాలి. అసలు ఐదుగంటలకి కాఫీ తాగే అలవాటు. దాన్ని ఆరు చేసింది. ‘‘నీకోసం నేను తెల్లవారుజామునే లేవలేను’’ అని నిక్కచ్చిగా చెప్పేసింది. గత్యంతరం లేక ఆ గంటసేపూ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, లేకపోతే రమణ మహర్షిని చదువుకోవటం–అలవాటు చేసుకున్నది. ఇదొక సాధన!

‘‘అతను ఆరింటికే వచ్చేవాడుగా?’’ తనను తానే ప్రశ్నించుకున్నట్లు పైకి అన్నది. హాల్లో దినపత్రిక చదువుకుంటున్న సుధాకర్‌ విన్నాడు. ‘‘ ఆ ల్యాబ్‌ని వసంత మార్చింది అమ్మమ్మగారూ. వాళ్లు బాగా రేట్లు పెంచారట’’ అన్నాడు. ‘‘అహా’’ అన్నది. మనసులో మాత్రం– నా పైసలేగా! అయినా దీనికి కాపీనం ఎక్కువైంది–అనుకున్నది. 
– ఆ కుర్రాడు వచ్చాడు. ‘వీన్‌ దొరకటం లేదండీ’ అని రెండు మూడు చోట్ల నొక్కాడు, పొడిచాడు, కుట్టాడు. చివరికి అయింది. ‘అందరూ రక్తం ఎరుపంటారు. కానీ, తన రక్తమేమిటో నల్లగా వుంది! సుగరూ, బీపీ, ఆస్తమా కలిస్తే ఇలా అవుతుందేమో!’ నవ్వుకుంది. అతను వెళ్లిపోయాడు. 
‘‘వసంతా, కాఫీ ఇస్తావామ్మా’’ అడిగింది. 

‘‘అదేగా చేస్తున్న ఉద్యోగం’’ అంటూ వచ్చింది. కప్పూ, గ్లాసూ టీపాయ్‌ మీద ఉంచి విసురుగా వెనక్కి తిరిగి వెళిపోయింది. వెళ్తూ వెళ్తూ ‘‘ నీ డ్యూటీ మీదే ఉంటాను తల్లీ. పదే పదే అరవక్కర్లేదు’’ అని ఓ గుండుసూది గుచ్చింది! కాఫీ అయింది. 
‘డ్యూటీ..!’ నవ్వొచ్చింది నారాయణమ్మకి. ‘నేను ఎన్నెన్ని డ్యూటీలు చేస్తే ఇంతదయింది ఈ పిల్ల?’ అనిపించింది. చేత్తో కణతలు గట్టిగా నొక్కుకుంది. కళ్ల ముందు చిత్రవర్ణ దృశ్యాలు..
శేఖరంకి ఐఐటీలో బీటెక్‌ కాగానే, అమెరికా యూనివర్సిటీ ఆహ్వానం. కొడుకు ప్రతిభకూ, విజయానికీ పొంగిపోయారు తానూ, భర్త మౌళీ. ఆయనైతే–‘నేను ప్రైవేటు గుమాస్తానే గానీ, నా కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌’ అని ఛాతీ పెంచుకున్నాడు. ఒకటే సంబరం. శేఖరం వెళ్లిపోయాడు. 
నెలలోపలే–ఒకరోజు! ప్రకాశంతో కలసి ఇంటికొచ్చింది కూతురు–వరలక్ష్మి! తనకూ మౌళికీ చలిపిడుగులాంటి సంభవం అది. మౌళి తట్టుకోలేకపోయాడు. కులాంతరమని కొంత ఆవేదనా, తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటమేమిటని ఆక్రోశం, ఉద్రేకం కొంతా–ఆయన గుండె కొట్టుకోవటాన్ని ఆపేసినై! శేఖరం రాలేని పరిస్థితి. అన్ని దుఃఖాల్నీ గరళంగా భరించింది తాను. టీచర్‌ ఉద్యోగ వ్యాపకం, సాహిత్యం చదువు–తనకు ఊరట. నడకని సాగించింది. 

ఏడాది గడిచిందో లేదో– ఓ అర్ధరాత్రి–
ప్రకాశం ఫోను. అర్జంటుగా ఫలానా హాస్పిటల్‌కి రమ్మని. పరిగెత్తుకుపోయింది. బిడ్డను కని చావుబతుకుల్లో ఉన్నది వరలక్ష్మి. కడచూపులోనే–పశ్చాత్తాపమూ, బిడ్డ ఆలనాపాలనా నీ బాధ్యత అనే వేడికోలూ– కన్నుమూసింది. 
పసికందుని తనకప్పజెప్పి పోయి, మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ప్రకాశం. ఆ పసికందే– ఈ వసంత!
తన దినచర్యంతా నిలువీతా, మునుగీతగానే అయింది. పనిమనిషి వెంకమ్మే ఇంట్లో వుండి తనకు పెద్దదిక్కయింది. 
అబ్బనాకారి వసంతతో ఎన్ని అవస్థలు పడింది తాను? ఎప్పుడూ ఏదో ఒక రోగమూ, రొష్టూ ఈ పిల్లకి. విజయవాడ దాటిపోకుండా, అధికారుల్ని వేడుకుని ట్రాన్స్‌ఫర్‌ల గండాన్ని తప్పించుకుంటూ ఉండేది. 
నాళ్లూ ఏళ్లూ గడచిపోతున్నై. శేఖరం అమెరికా వాసి అయిపోయాడు. నెలకోసారి ఫోన్‌లో పరామర్శ. అడపాదడపా–అడక్కుండానే డబ్బు పంపేవాడు. మధ్యలో ఒకసారి ఆ ‘వార్త’ని అందించాడు. తన కొల్లీగ్‌ కన్నడం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు!
వసంతదంతా వానాకాలపు చదువే. బుర్రకి జ్ఞానం ఎక్కలేదుగానీ, శరీరానికి వయసొచ్చింది. తనకు తెలిసిన మాష్టారి కొడుకు– సుధాకర్‌ దొరికాడు. ఇన్సూరెన్స్‌ ఏజంటు. 
పెళ్లి చేసింది. 

కొందరు ఆడపిల్లలు పెళ్లికాగానే ఆరిందలవుతారు. రెండేళ్లు అత్తగారింట్లో ఉండి, మూడో ఏట అక్కడ వీరంగం చేసి ఇక్కడికొచ్చేసింది. సుధాకర్‌నీ తెచ్చింది. మూడుసార్లు గర్భస్రావాలు ఆమె దూకుడుకి మరిన్ని గంతులు నేర్పాయి. నోరు పెద్దదయింది. జీతం రాగానే, తన చేతికవివ్వాలి. ‘నీ ఖర్చులకు ఉంచుకో’ అని తన ‘వితరణ’ని అందుకోవాలి. సుధాకరమేమో ఒక సాధుజీవి. మితభాషి. తనపట్ల మాటామన్ననా వినయంగా ఉంటాడు. ‘అమ్మమ్మగారూ, అమ్మమ్మ గారూ’ అని నిండుగా, నిష్కల్మషంగా పిలుస్తాడు. 
–రిటైరయిన తర్వాత పెన్షన్‌ వ్యవహారాలన్నీ సుధాకరే చూశాడు. అంతా అయిన తర్వాత, ఏటీఎం కార్డు తెప్పించి, తన దగ్గర పెట్టుకుంది వసంత. శేఖరం పంపించే డబ్బు విషయాలూ చెప్పదు. తాను అడిగినా, ‘‘నీ సొమ్మేమీ తినన్లే తల్లీ’’ అని ఆ ప్రసక్తిని పక్కకి తోసేస్తుంది. 
–అమెరికా నుంచీ ఫోన్‌! ఆలోచన ఆపి ప్రస్తుతంలో కొచ్చింది నారాయణమ్మ.

తల్లి ఆరోగ్యం గురించి వివరాలన్నీ అడిగాడు శేఖరం. ఆ తర్వాత అతని భార్య సుధ పలకరించింది. అప్పుడు మనవరాలు ప్రమీల గలగల మొదలైంది. నానమ్మతో తుళ్లుతూ, నవ్వుతూ మాట్లాడింది. అమెరికా ఉద్యోగాల గురించి కబుర్లు చెప్పింది. అంతా అయిన తర్వాత ‘‘నువ్‌ దిగులుపడకు నానమ్మా. ధైర్యంగా ఉంటే, ఏ అనారోగ్యమూ మనల్నేంచెయ్యలేదు’’ అని భరోసా పలుకు పలికింది. 
ముగ్గురూ–వసంతతో కూడా చనువుగానే మాట్లాడారు. సుధాకర్‌నీ పరామర్శించారు. చివర్లో–‘‘అటెండెంట్‌ వస్తున్నదా?’’ అని వసంతని అడిగింది ప్రమీల. ‘‘ఏం రావటమో ఏమో. ఒకరోజు వస్తే రెండు రోజులు సెలవంటుంది’’ అని ‘‘దూరంగా వున్న వాళ్లకేం తెలుస్తయ్‌లే–ఈ అవస్థలన్నీ’’ అని ఫోన్‌ కట్‌చేసింది వసంత. 
నారాయణమ్మకి బాధ కలిగింది. అటు తిరిగీ, ఇటు తిరిగీ ఏ ప్రస్తావననైనా–చివరికి తనకు సేవ చేయటం ఎంత కష్టంగా ఉన్నదో చెప్పి– దాన్ని కట్టె విరిచి పొయ్యిలో పెట్టటం పద్ధతిలోనే ముగిస్తుంది వసంత–అనిపించింది. మళ్లీ తలపులు ముసిరినై.

అంతా తన దురదృష్టం. తన దినచర్య అంతా రోజూలాగానే అంతా సవ్యంగా జరుగుతోంది–ఆ రోజు కూడా. స్నానం, ధ్యానం, స్తోత్రపఠనం.. అయి, బయట తులసికోటలో నీళ్లు పోద్దామని వెళుతుంటే–కాలు జారి పడింది. తుంటి దగ్గర విరిగింది. ఆస్పత్రిలో నెల.. ఆ తర్వాత మంచం పాలయింది. లేవలేదు. కూర్చోలేదు. ఉన్నదుండగా ఉపాకర్మ అన్నట్లు, అది జరిగిన నాలుగు నెలలకే పక్షవాతం!
అమెరికా నుంచీ అన్ని ఏర్పాట్లూ శేఖరమే చేశాడు, నెట్‌ ద్వారా. మాణిక్కెంనీ సహాయకురాలిగా తానే కుదిర్చాడు. వైద్యం విషయమూ, డాక్టర్‌తో సంప్రదింపులు– ప్రమీల చొరవగా, జాగ్రత్తగా చూస్తున్నది. పరోక్షంగా ఎన్ని జరిపినా, వసంత అన్నట్టు–ప్రత్యక్షంగా ఈ ‘సేవ’లు తప్పవు కదా!
పది గంటలవుతుంటే గదిలోకొచ్చింది వసంత. అమ్మమ్మకి చీరె మార్చి, డైపర్‌ మార్చి ‘‘ఇవ్వాళ్టికి ఈ పక్క నిట్టా ఉండనీ. రేపా మాణిక్కెం వస్తే మార్పిస్తా. నిన్ను నేను లేపలేను’’ అని వెళ్లింది. 

ఆ తర్వాత అర్ధగంటకి టిఫెన్‌ పెట్టింది. కాఫీ ఇచ్చింది. ఎదురుగా కుర్చీలో కూచుంది. 
వసంతకి మనసులో చాలా ఆలోచనలు ఉన్నై. పేరుకి ఇన్సూరెన్స్‌ ఏజెంటేగానీ, సుధాకర్‌కి రాబడి తక్కువ. అమ్మమ్మ పెన్షన్‌లో మిగిలేవీ, శేఖరం మామయ్య పంపేవీ జాగ్రత్త చేసుకుంటూ ‘ముందుచూపు’తో వ్యవహరిస్తోంది. అమ్మమ్మ ఇల్లు ఆమె స్వార్జితం. దీన్ని తనపేర రాయమని కన్నీళ్లతో చాలాసార్లు అడిగింది. ఆమె నవ్వేసి ఊరుకుంటున్నది. ఇవ్వాళ ఆ సంగతి తేల్చుకోవాలనే, ఇప్పుడు స్థిమితంగా ఇలా వచ్చి కూచుంది. 
‘‘ఎంతగా పైసలిచ్చి మచ్చిక చేసుకున్నా–ఈ పని మనుషులింతే’’ అంటూ మొదలెట్టింది సంభాషణని.
‘‘ఏవో అవస్థలుంటై వాళ్లకీనూ’’
‘‘అవుననుకో. ఇక్కడ నీ పరిస్థితి చూడు. కదల్లేవు. అన్నీ మంచంలో నాయె. ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదూ. నన్ను కష్టపెడుతున్నాననే బాధా వుంటుంది కదా నీకు. అదో మనస్తాపం..’’ 
అమ్మమ్మ మీద ‘దయ’ మెల్లగా ప్రవహిస్తోంది!
‘‘ఏదో నేనుండబట్టి రోజులు గడుస్తున్నై’’
‘‘అవునమ్మా.. నేనూ అదే అనుకుంటూ ఉండేది’’

‘‘అవునూ.. ఇంటి సంగతి చెప్పనేలేదు నువ్‌. ఆ కాగితాలూ గట్రా చాలా తతంగముంటుంది కదా.. ఈయనా కనుక్కోమంటున్నారు..’’
పాపం, అమాయకుడు. అతనికిట్టాంటి ఆలోచనా ఉండదు; తొందరా ఉండదు; ఆరాటమూ ఉండదు... అనుకున్నది నారాయణమ్మ. ‘‘చూద్దాం కానీ..’’ అన్నది. ప్రసన్నంగా వసంతని చూసింది. 
వసంతకి ఆమె మాట ప్రసన్నంగా అనిపించలేదు!
‘‘నీ మనసులో మాట చెబితే మా ఏడుపేదో మేం ఏడ్చుకుంటాం కదా’’ అన్నది ఠక్కున. కంఠస్వరం వికటంగానే రొద చేసింది. 
క్షణంలో సగం సేపు ఆగి బయటపడింది–నారాయణమ్మ, ‘‘ఎప్పటికైనా ఇల్లు మాత్రం ప్రమీలకేనే’’ అని ‘‘నీకిచ్చేది ఎటూ నీకిస్తాను. అయినా ఎన్నడన్నా నిన్ను నా పెన్షన్‌ డబ్బు గురించి గానీ, మావయ్య పంపే డబ్బు గురించి గానీ అడిగానుటే?’’ అన్నది. 
నివ్వెరపోయింది వసంత. మొహం మాడ్చుకుంది. నేల చూపులు చూస్తూ కుర్చీని కిరకిరలాడించింది. ‘ఈ ముసల్ది ఘటికురాలు. కాలాంతకపు మనిషి’ అనుకుంది. ‘ఈవిడగారి ఉచ్చలూ పెంటలకయితే నేను కావాలి. ఆస్తి కట్టబెట్టటానికైతే అదెవరో కావాలి. ప్రమీల, ప్రమీల అని ప్రేమ కారిపోతోంది, కలవరిస్తోంది’ అని తిట్టుకుంది. మనసంతా వికలమైంది. ఠక్కున లేచి ‘‘సరే.. సరే.. కానీ.. నీ ఇష్టం’’ అని వెళ్లిపోయింది. 

రోజులు గడుస్తున్నై..
ఆమె ఆగ్రహం మనసులో చాలా వికృతపు ఆలోచనల్ని రేపింది. వాటి ప్రభావం బయటి ప్రవర్తనపై పడింది. మాటల్లో పనుల్లో ఎంతో మార్పునీ తెచ్చింది. ఏది అడిగినా– ‘నేనీ చావు చావలేను’ అని విసిరికొట్టటం, ఉదయపు పనుల్లో ‘ఎన్నాళ్లు పడాలో ఈ యాతన.. కంచి గరుడసేవ’ అని వేష్ట పడటం, పాటికి పదిసార్లు ముక్కు చీదుకోవటం, పళ్లు కొరుక్కోవటం...
ఒకసారి శేఖరం ఫోన్‌ చేస్తే, నిష్ఠూరంగా ‘‘మావయ్యా–నువ్వేం డబ్బు పంపుతున్నావో మీ అమ్మకీ చెప్పు’’ అన్నది. ప్రమీల పరామర్శిస్తే–‘‘దూరంగా కూచుని ఎంతైనా ప్రేమని కురిపించొచ్చు. దగ్గర నిలబడి చేస్తేనే తెలిసొచ్చేది’’ అని ఒక విసురు విసిరింది. 
నానమ్మకి విడిగా ఫోన్‌ చేసింది ప్రమీల. ‘‘ఏవిటి నానమ్మా. వసంత వదిన బాగా ఏడుస్తోంది, ఏం జరిగింది?’’ అని అడిగింది. నారాయణమ్మ ఏమీ చెప్పకుండా ‘‘నన్నెక్కడన్నా ‘కేర్‌హోమ్‌’లో పడెయ్యవే–ప్రమీ– నీకు పుణ్యముంటుంది’’ అన్నది గద్గదికంగా.
నానమ్మని చాలాసేపు ఊరడించి అన్నది ప్రమీల. ‘‘ప్రతి సమస్యకీ ఎక్కడో ఏదో పరిష్కారం ఉంటుంది నానమ్మా. నువ్వేం కలతపడకు. అంతా సర్దుకుంటుంది’’ అని ఉపశమింపచేసింది. 

వేసవికాలపు ఎండ చిరచిరలాడిస్తోంది. ఉదయం ఎనిమిదైంది. నారాయణమ్మ మంచంలో ఆపసోపాలు పడుతున్నది. 
హఠాత్తుగా ఇంటికొచ్చిన ప్రమీలని చూసి–దాదాపుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది వసంతకు. ప్రమీల పక్కన ప్రశాంత్‌. ఆమె భర్త! పరిచయాలు అయినై. వారిద్దరినీ చూసి చాలా తత్తరపడింది వసంత. 
గదిలోకి వెళ్లి నానమ్మని పలకరించింది ప్రమీల. కలో, నిజమో తెలీని సంభ్రమంలో– కన్నీళ్లొచ్చాయి నారాయణమ్మకు. మంచం పట్టెమీద కూచుని, ఆమె పైకి వంగి రెప్పలతడిని తుడిచింది ప్రమీల. భర్తని పిలిచి చూపింది. ‘‘ఈ వూరి వాళ్లే. మనకు దూరపు చుట్టరికం కూడా ఉన్నదిట. మేమిద్దరం ఒకే కంపెనీ’’
కాఫీలు వచ్చినై. వసంతకి కంగారుగా ఉంది. అకాలంలో జడివాన!! మాటలు సాగినై.
‘‘సవాలక్ష పనులు. ముందు వెనుకలు చూసుకుని చెయ్యాలి కదా. మాణిక్కెం రాలేదు. అందుకనే ఈవిడ పనికాలేదివ్వాళ’’ అంటూ గ్లాసులు తీసుకుని వెళ్లింది వసంత. ప్రశాంత్‌ హాల్లోకి నడిచాడు. 
‘‘ఏం  ఫర్వాలేదు. నేవచ్చానుగా..’’ అంటూ నిలబడి, పైట సర్దుకుని నడుముకు చెక్కుంది. సత్యభామ జడలాంటి జుట్టు సవరించుకుని ముడివేసుకుంది ప్రమీల. 
మనవరాలిని రెప్పలార్చకుండా చూసుకుంది నారాయణమ్మ. ‘పిల్ల బాగా ఎత్తరి. అమెరికాలో పుట్టినా జుట్టు కత్తిరించుకోలేదు. పైగా చక్కగా జడల్లుకుంది. కట్టూబొట్టూ, మాటతీరూ–అన్నీ మన పద్ధతుల్లో ఉన్నై. బంగారు బొమ్మ! ఆ మొగుడు పాత షావుకారు సినిమాలో రామారావులా ఉన్నాడు’ అనుకుని మురిసింది. 
అప్పటికప్పుడే నానమ్మని మంచంలో పైకి జరిపి, నిదానంగా కూచోబెట్టింది ప్రమీల.

‘‘ఇదేంటీ–నీకెందుకీ పన్లు? నే జూసుకుంటానుండు’’ అంటూ తత్తరలాడుతూ వచ్చింది వసంత. అనూహ్యంగా ప్రమీల రావటంతోనే అట్టిట్టవుతుంటే– ఆమె ఇలా సరాసరి ముసలావిడ పనుల్లోకీ దిగేసరికీ– కాళ్లూ చేతులూ వణుకుతున్నట్టయింది వసంతకు. 
‘‘డోన్ట్‌వర్రీ వదినా! నేచూస్తాగా. మన పనులు మనం చేసుకోకపోతే ఎట్టా’’ అని ‘‘ ఈ పని నువ్‌ చూసుకో’’ అని పంపించిందామెను. గది తలుపు వేసి వెళ్లింది వసంత. 
నానమ్మకి ముందు డైపర్‌ మార్చింది ప్రమీల. జుట్టు చక్కజేసి, ఉన్న నాలుగు పోచల్నీ కలిపి, వేలిముడి వేసి, దానికో రబ్బరు బేండ్‌ వేసింది. ఒళ్లంతా తడిబట్టతో తుడిచి శుభ్రం చేసేసింది. ముసలామెని బెడ్‌లోనే జరిపి, పక్కకి వత్తిగిల చేసి, బెడ్‌షీట్‌నీ మార్చేసింది!
వసంత వచ్చింది. చూసింది. అంతా పొందిగ్గా ఉంది. ‘ఇదేమిటీ–అమెరికా పిల్ల ఈ పనులన్నిటినీ ఇంత చకచకా, ఇంత తేలిగ్గా, క్షణాల్లో చేసేయగలిగింది’ అనుకుంటూ ప్రమీలని తేరిపారజూస్తూ నిలబడింది. 
ప్రమీల వెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి కూచుంది. ‘‘ఇప్పుడు చెప్పు విశేషాలు’’ అన్నది. వసంత వైపు చూస్తూ నెనరుగా నవ్వింది. అంతా అర్థమవుతూ ఏమీ అర్థం కానట్టు ఉన్నది వసంతకు. తన మామూలు ఘోషనే వినిపించింది. గొంతులో బరువూ, నిరాశా!
ప్రశాంత్‌ని ‘‘మీరు రండి’’ అని పిల్చింది ప్రమీల. అతను వచ్చి కూచున్నాడు. ‘చక్కగా మొగుణ్ణి ‘మీరు’ అని పిలుస్తోంది. సంప్రదాయం తెలుసుకుంది’ అనుకుని లోలోపల మురిసిపోయింది నారాయణమ్మ. అతనితో పాత చుట్టరికాల్ని తిరగేసింది. వసంతకైతే ఇదంతా ఏమిటో, అక్కడేమవుతున్నదో అర్థం కాలేదు. 

ఉన్నట్టుండి, ‘‘నేను పాటలు బాగా పాడతానంటారు అమ్మా నాన్నా. పాడనా?’’ అని అడిగింది ప్రమీల– నానమ్మతో. ‘‘బలే.. బలే.. పాడు.. పాడు..’’ అన్నదామె చిన్న పిల్లలా ఉత్సాహంగా, సంబరపడుతూ. 
ముందుగా ‘పాటపాడుమా కృష్ణా..’ పాడింది. ‘‘ఎంత మధురంగా పాడావే ప్రమీ. కమ్మెచ్చున తీగె లాగినట్టుంది స్వరం’’ అని మెచ్చుకుంది నారాయణమ్మ. సుధాకరయితే చప్పట్లు కొట్టి ‘‘ఫైన్‌ ఫైన్‌’’ అన్నాడు. వసంతకీ ప్రమీల గొంతు నచ్చింది. చెప్పింది. ఆ తర్వాత–‘మరుగేలరా ఓ రాఘవా’ పాడింది. ఈసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. 
‘యూ ఆర్‌ గ్రేట్‌’ అన్నాడు ప్రశాంత్, భార్య వైపు కొంటెగా చూస్తూ! ‘ఐనో.. ఐ నో’ అని సరదాగా అన్నది. 
–వంటపనిలోనూ చొరవగా చేయి కలిపింది ప్రమీల. ఆమెని చూస్తూ బెరుకుబెరుకుగా మాట్లాడుతూ చాలా మానసిక సంఘర్షణని అనుభవిస్తోంది వసంత. గాలీ, పొగా కలసిన రసాయనిక క్రియ ఏదో లోపల్లోపల జరుగుతున్న భావనతో ఉద్విగ్నమైంది మనస్సు. 
ప్రమీలా ప్రశాంత్‌– పదిహేను రోజులు విజయవాడలోనే ఉన్నారు. అటు అత్తవారింట్లోనూ, ఇటు నానమ్మతోనూ చాలా సంతోషంగా గడిపింది ప్రమీల. 
ఆవేళ– అందరూ నారాయణమ్మ గదిలో ఉన్నారు. 
‘‘నేనూ, మా వారూ కూడా వచ్చే వారం హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగాల్లో చేరాలి. ఇక్కడ ఒక కంపెనీలోనే దొరికాయి’’ చెప్పింది ప్రమీల. ‘‘అదేమిటీ–అమెరికా వెళ్లరా?’’ ఆశ్చర్యంతో అడిగింది వసంత. 
‘‘వెళ్లటం లేదు. మేము ఇక్కడ స్థిరపడాలనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని వచ్చాం. నిజానికి హైదరాబాద్‌లో ఒక విల్లా కొనుక్కున్నాం. బుధవారమే మా ప్రయాణం–నానమ్మతో సహా’’ అన్నది ప్రమీల. 
అయోమయంగా దిక్కులు చూసింది వసంత. ఆమెకిది మరో అనూహ్య పరిణామం!

బుధవారం. మధ్యాహ్నం–
వసంతనీ, సుధాకర్‌నీ పిలిచింది నారాయణమ్మ. తన చేతిలోని కాగితాలు వసంతకిస్తూ– ‘ఇది నా వీలునామా. నా తర్వాత ఇల్లు మీదేనే. ప్రమీల ఇట్టా రాయమన్నది’ అని చెప్పింది. వసంతకి నోటమాట రాలేదు. వాటిని తీసుకుని, మెరుస్తున్న కళ్లతో ప్రమీలని చూసింది. 
అంబులెన్స్‌ వచ్చింది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు. ప్రమీలకు పసుపూకుంకుమా, పండూ తాంబూలం, చీరే జాకెట్‌ ఇస్తుంటే– కళ్లనీళ్లు తిరిగినై వసంతకి. ప్రమీల మృదువుగా ఆమె భుజం తట్టి, ‘నానమ్మకి నువ్‌ చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువే చేశావ్‌. నువ్వంటే నాకిష్టం’ అని ఆర్ద్రంగా దగ్గరకి తీసుకుంది. వెక్కుతూ గుండె బరువుని తేలిక చేసుకుంది వసంత! అందరూ ముసలామె కాళ్లకి నమస్కారం చేశారు. వాళ్లని ‘దీర్ఘాయురస్తు’ అని దీవించింది. వాళ్లని మార్చిమార్చి చూస్తూ సంతృప్తిగా నవ్వింది నారాయణమ్మ. మనుషుల్నీ, మనసుల్నీ ఆహ్లాదంగా స్పృశిస్తూ చల్లని తెమ్మెర వీచింది!!
- విహారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement