రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది.
అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది.
అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య.
మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది.
Comments
Please login to add a commentAdd a comment