ఉన్నత లక్ష్యాలను సాధించే తెగువే కాదు.. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే నైపుణ్యమూ తెలుసుండాలి! వాటిల్లో వంట మొదటిది! అందుకేనేమో ఇప్పుడు పదసంపదలోకి ఫుడ్ లిటరేట్స్ అనే పదం చేరింది! చదువు, ఆట, పాటలతో పాటు పాకం కూడా తప్పక నేర్చుకోవలసిన విద్య అయింది! అర్బన్ స్కూళ్లలో, న్యూక్లియర్ కుటుంబాల్లో కుకింగ్ అనేది జెండర్ – న్యూట్రల్ యాక్టివిటీ అయింది!
ఇదివరకు.. ఏ ఇంట్లో అయినా ఆడుకోవడానికి ఆడపిల్లలకైతే వంట పావులు.. మగపిల్లలకైతే కార్లు, బ్యాట్, బాల్ బొమ్మలుండేవి. ఇప్పుడు ఆ సీన్ అంతగా కనపడట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో.. కరోనా తర్వాత. కరోనా లాక్ డౌన్ అందరికీ అన్నీ వచ్చుండాలనే పాఠం నేర్పింది. ఎమ్‌సెట్ ఎంట్రెన్స్ కంటే ముందు కిచెన్‌లోకి ఎంటర్ కావాలని చెప్పింది.
అందుకే కరోనా తర్వాత చాలా కార్పొరేట్ స్కూళ్లు కుకింగ్‌నీ సిలబస్‌లో చేర్చాయి. అయితే లింగవివక్షను చెరిపేయడానికి చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ (విద్యారణ్యతోపాటు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు) వంటి నగరాల్లోని చాలా స్కూళ్లు ఎప్పటి నుంచో కుకింగ్ క్లాసెస్‌ను తమ కరిక్యులమ్‌లో భాగం చేశాయి. కరోనా కష్టంతో పట్టణాలు, మధ్యతరగతి కుటుంబాలూ ఈ విషయంలో అలెర్ట్ అయ్యాయి.
ఊహ తెలిసినప్పటి నుంచే పిల్లలకు వంట గదిని పరిచయం చేస్తున్నాయి. వంటసామాగ్రితో స్నేహం చేయిస్తున్నాయి. దీనివల్ల పిల్లల పదసంపద పెరుగుతుంది. ప్రయోగాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్తువులను గుర్తించే జ్ఞానం అలవడుతుంది. కొలతలు అర్థమవుతాయి. మోతాదు మించినా, తగ్గినా వచ్చే ఫలితాల పట్ల అవగాహన కుదురుతుంది. బాధ్యత, బ్యాలెన్స్‌లు తెలుస్తాయి. సర్దుబాటు అలవాటవుతుంది.
టీమ్ వర్క్, ఆ స్పిరిట్ బోధపడతాయి. ఎదుటివారికి సాయపడే గుణం అబ్బుతుంది. ఇతరులను జడ్జ్ చేయకూడదనే స్పృహా కలుగుతుంది. ఇలా కిచెన్ ఇటు అకడమిక్స్‌కు, అటు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను బోధిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాస్మోపాలిటన్, మెట్రో నగరాల్లో కొన్ని సంస్థలు పిల్లల కోసం కుకింగ్ వర్క్ షాప్స్‌ని కూడా నిర్వహిస్తున్నాయి. లిటిల్ షెఫ్స్‌తో టీవీ చానళ్లు కుకింగ్ షోస్‌నూ ప్రసారం చేస్తున్నాయి.
అల్లరి పిల్లల్ని సంభాళించడానికి కిచెన్‌ని మించిన ప్లేస్ లేదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఇల్లు పీకి పందిరేసే పిల్లలను పేరెంట్స్ తమ అసిస్టెంట్స్‌గా వంటగదిలోకి పట్టుకెళ్లి.. వారి ముందు క్యాబేజ్ లాంటి కూరగాయలను పెట్టి.. దాని ఆకులను వేరు చేయమని పురమాయించాలని చెబుతున్నారు. అలాగే ఒక టబ్‌లో వాళ్ల చేత నీళ్లు పోయించి, అందులో కాసింత ఉప్పు వేయించి.. వాళ్ల చేతికి కూరగాయలిచ్చి ఆ టబ్‌లో వేయించాలి.
వాళ్ల చిట్టి చిట్టి అరచేతులతో చిన్న చిన్న ఉల్లిపాయలను ప్రెస్ చేయించాలి. తడిపిన చపాతి పిండిని వాళ్ల ముందు పెట్టి.. చిన్న చిన్న లడ్డూలు చేయమనాలి. ఈ యాక్టివిటీస్‌తో వాళ్లు కుదురుగా ఉండటమే కాకుండా చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నపాటి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కూడా అవుతుందంటున్నారు నిపుణులు. అలా చిన్నప్పుడే వంటింట్లో గరిట పట్టుకుని, తమ వంటల ఘుమఘుమలతో ఇంట్లో వాళ్లనే కాదు ఇరుగు పొరుగునూ ఆశ్చర్యపరుస్తున్న ఆ బాలనలభీములను పరిచయం చేసుకుందాం..
వైభవి మెహ్రోత..
ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. కానీ తొమ్మిదేళ్ల వయసులోనే అమ్మ చేయి పట్టుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.. వంటలో అమ్మకు చేయందించేందుకు. పోపు దినుసుల దగ్గర్నుంచి పసుపు, ఉప్పు, కారం వంటివన్నీ ఎంత మోతాదులో పడితే వంటకు రుచి వస్తుందో పర్‌ఫెక్ట్‌గా తెలుసుకుంది.
ఇప్పుడు ఈ అమ్మాయి కూర ఉడుకుతుండగానే దాని వాసన చూసి చెప్పగలదు అందులో ఏం తక్కువైంది, ఏం ఎక్కువైందన్నది! బేకింగ్‌లో వైభవీని మించిన వారు లేరు. ‘లాక్‌డౌన్ టైమ్‌లోనే నాకీ పర్‌ఫెక్షన్ వచ్చింది. లాక్‌డౌన్‌లో మా చుట్టుపక్కల వాళ్లకు, చుట్టాలకు కేక్స్ చేసి పంపేదాన్ని సరదాగా! ఆ ప్రాక్టీస్‌తో కేక్స్ చేయడంలో పర్‌ఫెక్ట్ అయిపోయాను. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ చాక్లెట్ కేక్!’ అని చెబుతుంది వైభవీ. హోమ్ బేకరీ, తర్వాత ఒక కేఫ్‌నీ పెట్టాలనేది ఈ యంగ్ షెఫ్ ఆలోచన, లక్ష్యం! ’ 'vabhavi's bake diaries' పేరుతో ఆమెకో యూట్యూబ్ చానల్ కూడా ఉంది.
సునిధి మెహతా..
మహారాష్ట్ర, పుణేకి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ నాలుగేళ్ల వయసులోనే వంట మీద ఆసక్తి పెంచుకుంది. సునిధి వాళ్ల మేనత్త బ్రౌనీస్ చేస్తుంటే కళ్లింతింత చేసుకుని చూస్తుండేదట. ఆ పిల్ల ఇంట్రెస్ట్ గమనించిన మేనత్త ఆ అమ్మాయి చేయి పట్టుకుని అన్నీ చేయించేదట. ఇదంతా చూసి సునిధి వాళ్ల నాన్న .. కూతురికి అక్షరజ్ఞానం వచ్చాక వంటల పుస్తకాన్ని తెచ్చిచ్చాడట.
‘అదే నా ఫస్ట్ అండ్ ఫరెవర్ ఫేవరిట్ గిఫ్ట్’ అంటుంది బ్రౌనీలు, బిస్కట్స్, స్వీట్స్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన సునిధి. ‘బ్రౌన్ సుగర్, దాల్చిన నాకిష్టమైన ఇన్‌గ్రీడియెంట్స్. నా ఫేవరిట్ అండ్ కంఫర్ట్ ఫుడేమో పానీపూరీ. ఎప్పటికైనా కేక్ అండ్ కాఫీ స్టోర్ పెట్టాలన్నదే నా గోల్’ అని చెబుతుంది.
రణవీర్ కల్‌బాగ్..
మహారాష్ట్ర, పుణేకి చేందిన రణ్‌వీర్‌కిప్పుడు పద్నాలుగేళ్లు. కానీ అయిదేళ్ల వయసులోనే సాస్ తయారీకి ఏప్రాన్ వేసుకున్నాడు. రణ్‌వీర్ వాళ్ల నాన్న ప్రొఫెషనల్ చెఫ్. ప్రతి ఆదివారం ఇంట్లో వాళ్ల నాన్నే వంట చేస్తాడు. దాంతో రణ్‌వీర్ కూడా నాన్నకు సాయంగా వంటింట్లోకి దూరేవాడు. అలా వంట మీద ఇష్టం ఏర్పడింది ఆ అబ్బాయికి. ‘మాస్టర్ బేకింగ్ లేదా మిక్సాలజిస్ట్.. నా ఎయిమ్’ అని చెబుతాడు. స్వీట్స్ అంటే ప్రాణం పెడతాడు. ‘అందుకే బటర్ అండ్ సుగర్ అంటే చాలా ఇష్టం. అవి రెండు కలిసి చేసే మ్యాజిక్ అలాంటిది మరి!’ అంటాడు.
మేధా భట్..
కర్ణాటక, మంగళూరుకు దగ్గర్లోని ఆర్యపు అనే చిన్న పల్లెటూరికి చెందిన ఈ అమ్మాయికిప్పుడు పదిహేనేళ్లు. కానీ మూడవ తరగతిలో ఉన్నప్పుడే డిసైడ్ అయింది పెద్దయ్యాక రెస్టరటర్ అవ్వాలని. తను పెట్టబోయే హోటల్‌కి పేరు కూడా రెడీచేసి పెట్టుకుంది ‘తందురుస్తీ హోటల్’ అని. ఆమెకు స్ఫూర్తి వాళ్లమ్మ చూసే యూట్యూబ్ వంటల చానళ్లు. ఆ చానళ్లలో రకరకాల దినుసులన్నీటితో చక్కటి డిష్‌ని తయారుచేయడం చూసి ఆశ్చర్యపోయేదట మేధా.
‘చిటికెడు ఉప్పుతో వాళ్లు బాండిడు కూరకు రుచి తేవడం నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉండేది’ అంటూ ఇప్పటికీ సర్‌ప్రైజ్ అవుతుంది. మేధా తన ఎనిమిదో ఏట పోపుల పెట్టె పట్టుకుంది. ‘నిజానికి మేధా హైపర్ యాక్టివ్ కిడ్. వంట వల్లే తను నెమ్మది అయింది. ఇప్పటికీ మేధాను చూస్తుంటే నాకు వండరే! ఒక్క క్షణం కాలు నిలువని పిల్ల.. అంత ఓపిగ్గా వంట ఎలా చేయగలుతుంది అని!’ అంటుంది మేధా వాళ్లమ్మ. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేక్స్ చేస్తున్న మేధాకు చాక్లెట్, బంగాళదుంప అంటే ఇష్టం.
(చదవండి: ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!)
Comments
Please login to add a commentAdd a comment