నెల నెలా వచ్చే చందమామ లేదు. బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు లేవు. ఇంట్లో కథలు వినిపించే వారు లేరు. స్కూళ్లలో బుక్ రీడింగ్ అవర్ కనిపించడం లేదు. పిల్లల ఊహను పెంచి ఆలోచనను పంచే బాలసాహిత్యం వారికి అందకపోతే బూస్టు, హార్లిక్సు, ఆర్గానిక్ ఆహారం ఇవి ఏమిచ్చినా ఉపయోగం లేదు. శరీరం ఎదిగే ఆహారంతోపాటు బుద్ధి వికసించే ఆహారం ఇవ్వాలి. అది కథల్లో దొరుకుతుంది. కనీసం డిజిటల్ మీడియాలోని కథలైనా వారికి చేరువ చేయాలి.
ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వీటిని ‘ప్రశ్నాపంచకం’ అంటారు. ఏ మనిషి జిజ్ఞాస అయిన అడుగంటి΄ోకుండా ఉండాలంటే ఈ ఐదు ప్రశ్నల్ని సజీవంగా ఉంచుకోవాలి. పిల్లలు అనుక్షణం ఈ పంచ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. గతంలో ప్రశ్నలు అడిగే పిల్లలను తెలివైన వారుగా భావించి మెచ్చుకునేవారు. నేడు ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారు. కథ చెప్పమంటే తీరిక లేదంటున్నారు. మారాం చేస్తే సెల్ చేతికిస్తున్నారు. మరీ గొడవ చేస్తే సినిమాకు పంపిస్తున్నారు. కాని వారి చేత కథ చదివించడం లేదు. దాని వల్ల పిల్లల్లో ప్రశ్నించే కుతూహలం చచ్చి΄ోతుంది. కుతూహలం లేని బాలబాలికలు బాధ్యతాయుతులైన పౌరులుగా వికసించలేరు. కనుక ఇది అంతిమంగా సమాజానికే నష్టం.
అసలు మన సమాజంలో పిల్లలను గౌరవించడం ఉందా? వారి ఎదుగుదల గురించి చింత ఉందా?వారికి ఎలాంటి జ్ఞానం అందుతోందన్న ఆలోచన ఉందా? ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం ఇవన్నీ పిల్లలు నిరంతరం చేయాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. అయితే మన దగ్గర బాలసాహిత్యంగా చలామణి అయ్యేది పూర్తిగా బాల సాహిత్యం కాదు.
పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా శాస్త్రీయంగా ఫలానా వయసు వారు ఫలానా స్థాయి పుస్తకాలు చదవాలని వాటిని రాసి, ప్రచురించరు. ఉన్నవల్లా ఏవో కొన్ని కథలే. అయితే అవన్నా వారు చదవకుండా బాలల పత్రికలన్నీ మూతపడటం విషాదం. ఇళ్లల్లో పెద్దలు కథలు వినిపించే ఆనవాయితీ ΄ోవడం మరో విషాదం. అందుకే కనీసం పిల్లలు అలవాటు పడ్డ సెల్‌ఫోన్ ద్వారా అయినా వారికి కథలు అలవాటు చేయాలి.
ఇంటర్నెట్‌లో పిల్లల కోసం సైట్‌లు, యాప్‌లు, యూట్యూబ్ చానెళ్లు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల కోసం నిర్వహించేవి, పిల్లలకే ప్రధాన భూమికను పోషించేవిగా ఉన్నాయి. వాటిలో https://manchipustakam.inని చూడటం పిల్లలకు అలవాటు చేయాలి. ఇక్కడ మంచి బాలల పుస్తకాలు ఉంటాయి. అలాగే ttps://storyweaver.org.in/పిల్లల ఉచిత ఆన్‌లైన్ పుస్తకాలతోపాటు రాయడం, చదవడం, అనువదించడం పట్ల ఆసక్తి వున్న వారికి సహకరించే వేదిక.
యూట్యూబ్‌లో పిల్లల కథల వీడియోలు చాలానే వున్నాయి. Geethanjali Kids&Telugu అనే యూట్యూబ్ చానల్‌లో 375 వీడియోలు వున్నాయి. MintuTelugu Rhymes అనే యూట్యూబ్ చానల్‌లో 178 కథల వీడియోలు దొరుకుతాయి. ‘పిల్లల కంటెంట్’ అనే ప్రత్యేకమైన ఆప్షన్ కూడా యూట్యూబ్ లో వుంది. పిల్లలు తమ తమ ఊహలకు కొంత సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన కథల వీడియోలతో వారే ఒక చానెల్ నిర్వహించవచ్చు.
ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా అందుబాటులోకి రావడంతో రకరకాల యానిమేషన్ థీమ్స్‌తో కథలను క్రియేట్ చేసేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చాలానే వున్నాయి. వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో తెలిపే ట్యుటోరియల్స్ కూడా వున్నాయి. ఎవరు ఏ అంశంపై వీడియోలు చేయాలన్నా, వినాలన్నా, నేర్చుకోవాలన్నాం.
యూట్యూబ్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా వాటిని పొందవచ్చు.
పల్లెలకు చేరుతున్న కథలు
సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయ్యాక నేను బాలల కథల వ్యాప్తికి దానినే సాధనంగా మలచుకున్నాను. మొదట అడుగు పెట్టింది ఫేస్‌బుక్‌లో. ఆ తరువాత వాట్సప్, ప్రతి లిపి, కహానియా.కాం, టెలిగ్రాం, ఇన్‌స్టాగ్రాం, డైలీహంట్, షేర్ చాట్, కూ, బ్లూపాడ్, స్టోరీ మిర్రర్.. ఇలా ప్రతిదానిలో బాలసాహిత్యాన్ని వాటి నిబంధనల మేరకు పోస్ట్ చేస్తుంటాను. ఈ మధ్య కోరాలో కొత్తగా అడుగుపెట్టాను. అంతేగాక కథలు, గేయాలు, బొమ్మలతో సామెతలు, పొడుపు కథలు సింగల్ పేజీలుగా మార్చి అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేస్తుంటాను. వీటిని ఆర్కైవ్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను.
కథలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని పాఠకులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. అందుకే రోజూ కొంత సమయం వీటికోసం కేటాయిస్తా. మారుతున్న కాలానికి తగినట్లుగా మనమూ మారక తప్పదు. నిజానికి సామాజిక మాధ్యమాల వల్లనే కొత్త పాఠకులు విపరీతంగా పెరిగారు. నగరాలను దాటి పల్లెలకు కూడా సాహిత్యాన్ని చేర్చగలుగుతున్నా.
పుస్తకాల అమ్మకాలు కూడా వీటివల్ల విపరీతంగా పెరిగాయి. అడిగి మరీ కొంటున్నారు. ‘హరి కథలు కర్నూల్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కథలను అక్కడ స్వయంగా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ‘వంద రోజులు – వంద కథలు’ వాట్సాప్ గ్రూప్‌లో కథలు పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఇందులో 38 వేల మంది సభ్యులు ఉన్నారు.
– డా. ఎం.హరికిషన్, బాలల రచయిత
(చదవండి: బాలల దినోత్సవం స్పెషల్: నెహ్రూ హైదరాబాద్‌లో ఎక్కడ అల్పాహారం తినేవారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment