అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు! | What Are The Good And Bad Eating Habits That Will Affect Your Health, Know About Them Inside | Sakshi
Sakshi News home page

అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!

Published Tue, Jan 21 2025 10:35 AM | Last Updated on Tue, Jan 21 2025 12:22 PM

What Are The Good And Eating Habits And Affect Your Health

‘రుచికరంగా హాయిగా తినేసి పెందళాడే కన్నుమూస్తే మటుకు దేశానికి వచ్చిన నష్టమేంటి? భూమికి భారం తగ్గుతుంది కదా’ అంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు. ఇక్కడ సమస్య త్వరగా కన్నుమూయడమా లేక చాలాకాలం పాటు జీవించడమా అని కాదు. ఉన్నన్నాళ్లూ ఎవరికీ భారం కాకుండా హాయిగా ఉండటం. ఆరోగ్యం బాగాలేక సుదీర్ఘకాలం మంచం పట్టి ఉండటమూ కోరుకునే అంశం కాదు, అలాగే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నవాళ్లు త్వరగా పోవడమూ అభిలాషణీయం కాదు. అందుకే ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా, ఎవరికీ భారం కాకుండా, చురుగ్గా హాయిగా ఉండటం అన్నదే ఎవరికైనా కావాల్సింది. అందుకు మంచి ఆహారపు అలవాట్లు బాగా ఉపయోగపడతాయి. అదే చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతిని మరణం రాకపోయినా మంచాన పడి నిరర్థకంగా ఉండాల్సి రావచ్చు. అందుకే మంచి ఆహారపు అలవాట్లు ఎల్లవేళలా మంచివే. చెడు ఈటింగ్‌ హ్యాబిట్స్‌ ఎప్పుడూ దూరంగా ఉండాల్సినవే. ఈ నేపథ్యంలో మంచి, చెడు ఆహారపు అలవాట్లపై కాస్తంత అవగాహన కోసం ఈ కథనం...

మంచి ఆరోగ్యానికి 
మంచి ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటివల్ల మంచి వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. దాంతో అద్భుతమైన వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దీని వల్ల కలిగే ఉపయోగాలు తక్షణం బయటకు కనిపించక΄ోవచ్చుగానీ... మంచి ఇమ్యూనిటీ వల్ల తప్పక మంచి  జరుగుతుంది. గతంలో కోవిడ్‌ సమయంలో వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నవారే బతికి బయటపడ్డారు. 

బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేసుకోకపోవడం
ఒకవేళ ఆహారపు అలవాట్లు బాగా లేకపోతే ఆ ప్రతికూల ప్రభావాలు వెంటనే కనిపిస్తాయి. ఇటీవల చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే కడుపు ఉబ్బి΄ోయి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం తరచూ చాలామందిలో కనిపించేదే. 

ఇవి ఆహారపు అలవాట్లలో తేడా వల్ల కనిపించే తొలి లక్షణాలు. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మేళ్లతో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుంటే చాలాకాలం పాటు పూర్తి ఆరోగ్యంతో, మంచి ఫిట్‌నెస్‌తో జీవించవచ్చు. ఈ సందర్భంగా ఆరోగ్యకరంగా జీవించడానికి మంచి ఆలవాట్లు ఏమిటో, అనారోగ్యం తెచ్చుకోవడానికి చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం...

చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం
తినే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో  ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. అంటే ఉదయపు టిఫిన్‌ (బ్రేక్‌ ఫాస్ట్‌), మధ్యాహ్న భోజనం (లంచ్‌),సాయంత్రపు పలహారం (ఈవినింగ్‌ శ్నాక్స్‌), రాత్రి భోజనం (సప్పర్‌/డిన్నర్‌) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార.్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అంతగా భారం పడదు. పైగా ఇలా తినడం వల్ల దేహానికి అవసరమైన శక్తి (ఎనర్జీ) ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. 

కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని పూర్తవుతుందనే భావన వల్లనో రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా మారడం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే పొట్ట ఉబ్బి΄ోయి ఎంతగానో అసౌకర్యంగా అనిపించడం (దీన్నే భుక్తాయాసం అని కూడా చెబుతుంటారు), తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉన్నట్లు అనిపించడం లాంటి ఫీలింగ్, ఛాతీలో మంట, కడుపులో ఒకలాంటి నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం మామూలే. 

ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇంటికి ఒక్కరైన ఉండటం ఈ రోజుల్లో చాలా సాధారణం. ఇక ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం, అలాగే రాత్రి భోజనాన్ని చాలా త్వరగా తినేయడంతోపాటు ఒకసారి రాత్రి భోజనం అయ్యాక మెలకువగా ఉన్న సమయంలో మళ్లీ మరేమీ తినకుండా జాగ్రత్త పడటం అవసరం. అలా కాకుండా రాత్రి భోజనం తర్వాత మెలకువగా ఉన్నప్పుడు తినడం వల్ల పొట్ట పెరిగి, అది రోగాల పుట్టగా పరిణమించడంతోపాటు కాస్మెటిక్‌గానూ బాగా కనిపించక΄ోవచ్చు. 

అన్ని పోషకాలూ లభ్యమయ్యే సమతుల ఆహారం
తీసుకునే ఆహారంలో  అన్ని రకాల ΄ోషకాలు ఉండాలన్నది ప్రధానం. అవేమీ లేని భోజనం చాలా పరిమాణంలో తిన్నా అది వృథాయే. అందుకే తక్షణ శక్తినిచ్చే పిండిపదార్థాలూ  (కార్బోహైడ్రేట్లు), కణాలూ, కణజాలాలలను రిపేర్‌ చేసి, వాటిని పునర్నిర్మించే  ్ర΄ోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతో΄ాటు, ఖనిజలవణాలూ, విటమిన్లు, మళ్లీ ఈ ΄ోషకాల్లోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు... ఇవన్నీ సమృద్ధిగా ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమ΄ాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్‌డ్‌) అంటారు. ఇవన్నీ ఉండాలంటే  భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ్ర΄ోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతోపాటు ఆకుకూర.లు, కూర.గాయలు; విటమిన్లను సమకూరుస్తాయి తాజాపండ్లు తీసుకోవాలి. అయితే ఇక్కడ కొవ్వుల కోసం నూనెలు తీసుకునేప్పుడు వాటిని రుచి కోసం కాక దేహ అవసరాల కోసం మాత్రమే... అంటే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ల కోసం మాంసాహారం మీద ఆధారపడేవారు అంతగా ఆరోగ్యకరం కాని రెడ్‌ మీట్‌ (వేట మాసం) కంటే ఆరోగ్యకరమైన వైట్‌ మీట్‌ (చికెన్, చేపల వంటివి) తీసుకోవాలి. 

నీళ్లు ఎక్కువగా తాగడం
మానవ శరీరరంలో 75 శాతం నీళ్లే ఉంటాయి. శరీరం ద్రవాలను కోల్పోవడాన్ని  ‘డీ–హైడ్రేషన్‌’గా చెబుతారు.  వేసవికాలంలో వడదెబ్బ వల్ల ఇలా దేహం ద్రవాలను కోల్పవడం జరిగి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇలాంటి అనర్థం జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అవసరం. ఇక మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలన్నీ లవణాల వల్లనే జరుగుతుంది. ఆ లవణాలు అలా చేరవేయడానికి వీలుగా మారడానికి నీళ్లలో కరగడం వల్లనే జరుగుతుంది. 

అందుకే నీళ్లూ, లవణాలను కోల్పోకుండా ఉంటేనే మెదడునుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందుతూ దేహం సక్రమంగా పనిచేస్తుంటుంది. అందుకే దేహం తాలూకు జీవక్రియలన్నింటికీ అవసరమైనన్ని నీళ్లు తాగుతుండటం అవసరం. మానవులు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి ఓ కొండగుర్తు ఏమిటంటే... మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం పచ్చగా, బాగా గాఢంగా లేకుండా వీలైనంతగా నీళ్లలా ఉండాలి. మూత్రం అలా పచ్చగా, గాఢంగా ఉందంటే దేహంలో నీళ్లు తగ్గాయనడానికి నిదర్శనం. మూత్రం అలా ఉందంటే అలాంటప్పుడు తక్షణం శరీరానికి అవసరమైన నీళ్లు తాగాలని, అలా తాగడం ద్వారా దేహానికి అవసరమైనన్ని నీళ్లు (హైడ్రేషన్‌) సమకూర్చాలని అర్థం. 

బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోవడం
చాలామందిలో ఒక దురలవాటు ఉంటుంది. ఆహారం తీసుకునే సమయాన్ని ఆదా చేయడం కోసం ఉదయం తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేసి నేరుగా మధ్యాహ్న భోజనం తీసుకుంటుంటారు. రోజువారీ వ్యవహారాలకు అవసర.మైన శక్తి అందడానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మంచి అలవాటు అన్నది తెలిసిందే. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేయకూడదు.
 

ఎక్కువ పరిమాణాన్ని తక్కువ సార్లు తినడం
ఎక్కువ పరిమాణంలో తక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై  ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలా ఎక్కువ మోతాదుల్లో  తక్కువ సార్లు తినడం వల్ల... కడుపులో ఆహారం లేని సమయంలోనూ  ఆహారాన్ని అరిగించే ఆమ్లాలు జీర్ణవ్యవస్థ గోడలపైనా, పేగులపైన పనిచేయడంతో  ఒక్కోసారి అది అల్సర్స్‌కు కారణం కావచ్చు. అటు తర్వాత ఆ అల్సర్స్‌ కారణంగా పేగులకు రంధ్రం పడటం వల్ల జీర్ణవ్యవస్థ / కడుపు / పేగుల్లోనే ఉండాల్సిన ఆహారం, జీర్ణ స్రావాలూ దేహ కుహరంలోకి ప్రవేశించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. 

తగినన్ని మంచినీళ్లు తాగకపోవడం
చాలామంది పనుల్లో పడిపోయి తాగాల్సినన్ని  మంచినీళ్లు తాగరు. మరికొందరు ఆఫీసుల్లోని ఏసీ కారణంగా ఆ చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల దాహం వేయక తగినన్ని నీళ్లు తాగరు. ఈ రెండు పరిణామాల్లోనూ ఆరోగ్యానికి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు దేహానికి అవసరమైన నీళ్లు, లవణాలు అందక పిక్కలు పట్టేయడం (మజిల్‌ క్రాంప్స్‌)తో పాటు కిడ్నీలో రాళ్లు రావడం వంటి అనర్థాలు చోటు చేసుకునే అవకాశముంది. అందుకే ప్రతిరోజూ ప్రతిఒక్కరూ దేహానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. 

ఫాస్ట్‌ ఫుడ్‌ / జంక్‌ఫుడ్‌ తినడం
ఆధునిక జీవనశైలిలో పనివేళలూ, పనిగంటలూ పెరగడం, కొత్త తరహా పనులు, వృత్తుల వల్ల జీవితం ఉరుకులు పరుగులతో సాగడం వల్ల సమయం దొరకడం కష్టంగా మారింది. దాంతో మార్కెట్‌లో తేలికగా దొరకడంతో ΄ాటు అప్పటికప్పుడు తినగలిగే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్‌ తీసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. నిజానికి చెడు అలవాట్లలో ఈ ఫాస్ట్‌ఫుడ్‌ / జంక్‌ఫుడ్‌  ముఖ్యమైనది. ఈ తరహా ఆహారంలో ఉండే రిఫైన్‌డ్‌∙పిండిపదార్థాల వల్ల డయాబెటిస్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... వీటికి తోడు చాలాకాలం నిల్వ ఉండటానికి వీలుగా (షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి) వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన నూనెలు, అలాగే ఆహారపదార్థాల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం కోసం వాడే రంగుల వల్ల ఇలాంటి జంక్‌ఫుడ్స్‌ అనేక రకాల క్యాన్సర్లకు కారణంగా మారుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే వీలైనంతవరకు జంక్‌ఫుడ్‌ను తీసుకోక΄ోవడమే మంచిది. మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి అదికూడా చాలా పరిమితంగా వాటిని తీసుకోవాలి.  
 

మితిమీరి తీపిపదార్థాలు తినడం
చాలామంది తీపిపదార్థాలనూ, మిఠాయిలను ఇష్టపడతారు. అయితే  వీటిని మరీ మితిమీరి తినడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. తీపితో వచ్చే నష్టాలు తొలుత నోటిలో నుంచే మొదలవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెర.గడం, వాటితో పళ్లు దెబ్బతినేలా లేదా పుచ్చి΄ోలాయే దంతక్షయం వంటి నష్టాలు సంభవిస్తాయి.  మితిమీరి తీపిపదార్థాలు తినడం క్యాన్సర్‌కు ఒక కారణమంటూ చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. 

ఇక కొంతమంది తమ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా టీ, కాఫీలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి కాఫీ, టీలు తాగడం తాగడం ఒకరకమైన నష్టాన్ని తెస్తే... అందులోని తీపి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చేటుగా పరిణమిస్తుంది. తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న అరగంట తర్వాత గానీ టీ తాగకూడదు. అలా  టీ / కాఫీలు తాగితే తిన్న ఆహారంలోని ఐరన్‌ ఒంటికి పట్టదు. 

కూల్‌ బీవరేజెస్‌
చాలామందికి కూల్‌డ్రింకులు, కోలా డ్రింకులు, శీతల ΄ానియాల వంటివి తాగుతుండటం అలవాటు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.  ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయక΄ోగా, కొన్ని అనర్థాలు కూడా తెచ్చిపెట్టే అవకాశముంది. పైగా వీటిలోని కెఫిన్‌ రాత్రి నిద్రపట్టకుండా చేసే అవకాశమున్నందున వీటిని రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. వీటివల్ల అసిడిటీ వంటి సమస్యలూ వచ్చే అవకాశముంది. వీటిలోని మితిమీరిన చక్కెరల వల్ల... డయాబెటిస్‌ మొదలుకొని అనేక సమస్యలు రావచ్చు. 

ఆల్కహాల్‌ అలవాటుతో అనర్థం
ఆల్కహాల్‌ ఆరోగ్యానికి చేటు తెచ్చే ప్రమాదకరమైన అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకుంటారు. దీంతో రెట్టింపు దుష్ఫలితాలు కలుగుతాయి.  ఆల్కహాల్‌ వల్ల కడుపులోని లైనింగ్స్‌ దెబ్బతినడంతో పాటు అసిడిటీ, అల్సర్లు వస్తాయి. మద్యం అలవాటు లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే దెబ్బతీస్తుంది. ఇక ఆల్కహాల్‌ తాగే సమయంలో చాలామంది వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వాస్తవానికి వేపుళ్లు అంత మంచి ఆహారపు అలవాటు కానే కాదు. ఇలా ఎన్నో ఆరోగ్య అనర్థాలకు దారితీసే ఆల్కహాల్‌ అలవాటును పూర్తిగా వదిలేయాలి. 

చెడు ఆహారపు అలవాట్లివి... 
అంటే మంచి ఆహారపు అలవాట్లను అనుసరించక΄ోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినక΄ోవడం, తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం, తాజాపండ్లు తీసుకోక΄ోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే ఇవ్వాళ్టి మానవ జీవనశైలిలో ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లు కాస్తంత ఎక్కువే. పైగా అవన్నీ ఇవ్వాళ్టి ఆహారపు ఫ్యాషన్లుగా కూడా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కొన్ని చెడు ఆహారపు అలవాట్లేమిటో చూద్దాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement