ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేస్తే అమ్మ వారికి సేవలు చేసి కోలుకునేలా చేస్తుంది. మరి అమ్మకు సుస్తీ చేస్తే? వంట ఎవరు చేయాలి?బాక్స్ ఎవరు కట్టాలి? అంట్ల పరిస్థితి ఏమిటి? అనారోగ్యం వల్ల ఆమెకు చిరాకు కలిగితే
ఎలా వ్యవహరించాలి? ఎవరికి సుస్తీ చేసినా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఏమీ కాదు. కానీ అమ్మకు సుస్తీ చేస్తే ఇంటికే సుస్తీ అవుతుంది. మరి మనకు అమ్మ పనులు ఎన్ని వచ్చు?
ఒక్క అమ్మ అందరి పనులూ చేస్తుంది. అందరూ కలిసి అమ్మ పనులు చేయలేరా? ఇది చలికాలం. సుస్తీ చేసే కాలం. బద్దకం కాలం. ఏ త్రోట్ ఇన్ఫెక్షనో, జ్వరమో, ఒళ్లు నొప్పులో, నీరసమో, ఏమీ చేయాలనిపించని నిర్లిప్తతో, ముసుగు తన్ని విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో ఒక రోజంతా అమ్మను మంచం కదలనివ్వక పోతే అమ్మ ఎన్ని పనులు చేస్తుందో ఇంట్లోని సభ్యులకు అర్థమవుతుంది. ఆ పనులన్నీ అమ్మ కోసం ఇంటి సభ్యులు చేయగలరా? చేయాలి.
ఎవరికి చిరాకు?
సాధారణంగా అమ్మకు అనారోగ్యం వస్తే నాన్నకు చిరాకుగా అనిపిస్తుంది. మరి నాన్న ఆఫీసుకు వెళ్లాలి. ఏవేవో పనులుంటాయి. టైముకు అన్నీ జరిగి΄ోవాలి. అమ్మ మంచం మీద ఉంటే అవి జరగవు. అప్పుడు నాన్నకు చిరాకు వేస్తుంది. ‘లేచి పనుల్లో పడితే సుస్తీ అదే పోతుంది’ అని ఎఫ్.ఆర్.సి.ఎస్ లెవల్‌లో సూచన కూడా చేస్తాడు. అమ్మకు బాగా లేక΄ోతే పిల్లలు నాన్నకు చెప్పాల్సిన మొదటి సంగతి– లీవ్ పెట్టు నాన్నా... రోజూ వెళ్లే ఆఫీసేగా అని. తనకు బాగా లేకపోతే భర్త కన్సర్న్‌తో లీవ్ పెట్టాడు అనే భావన అమ్మకు సగం స్వస్థత ఇస్తుంది. ఆ తర్వాత నాన్న అమ్మతో చెప్పాల్సిన మాట ‘నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో’ అనే.
పనులు పంచుకోవాలి
కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఆపిల్ పండు తొక్క తీయడం కూడా నేర్పరు. అలాంటి ఇళ్లలో ఇంకా కష్టం కాని కొద్దో గొప్పో పనులు చేసే పిల్లలు ఉంటే తండ్రి, పిల్లలు కలిసి ఏ మాత్రం శషభిషలు లేకుండా పనులు పంచుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఏమిటి? బ్రెడ్‌తో లాగించవచ్చు. మధ్యాహ్నం ఏమిటి? అన్నం కుక్కర్‌లో పడేసి, ఏదైనా ఊరగాయ, బాయిల్డ్ ఎగ్ కట్టుకుని వెళ్లవచ్చా? ఇల్లు సర్దే బాధ్యత ఒకరిది. పనిమనిషి ఉంటే ఆమె చేత అంట్లు తోమించి, ఉతికిన బట్టలు వైనం చేసే బాధ్యత ఒకరిది. ఈ పనులన్నీ అమ్మ తప్ప ఇంట్లో అందరూ చేయక పోతే ఆ ఇంట్లో అనవసర కోపాలు వస్తాయి. అవి గృహశాంతిని పోగొడతాయి. అసలే ఆరోగ్యం బాగలేకుండా ఉన్న అమ్మను అవి మరీ బాధ పెడతాయి. ఆమే ఓపిక చేసుకుని లేచి పని చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించి లేని సమస్యలు వస్తాయి.
అమ్మ పేరున మందు చీటి
ఏ ఇంటిలోనైనా అతి తక్కువ మందు చీటీలు ఉండేది అమ్మ పేరుతోనే. ఎందుకంటే సగం అనారోగ్యాలు ఆమె బయటకు చెప్పదు. ఒకవేళ చెప్పినా మెడికల్ షాప్ నుంచి తెచ్చి ఇవ్వడమే తప్ప హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం తక్కువ. కాని అమ్మను కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డాక్టర్ సూచన ఆమెకు బలాన్ని ఇచ్చి లోపలి సందేహాలేవైనా ఉంటే పోగొడుతుంది. అమ్మ సరైన మందులతో తొందరగా కోలుకుంటుంది.
అమ్మతో సమయం
తనతో కాసింత సమయం గడపాలని అమ్మ కోరుకుంటుంది ఇలాంటప్పుడు. భర్త ఆమె దగ్గర కూచుని తీరిగ్గా కబుర్లు చెప్పవచ్చు. ఏవైనా జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు. మధ్య మధ్య ఆమెకు ఏదైనా సూప్ కాచి ఇచ్చి తోడుగా తనూ కాస్తంత తాగుతూ కూచుంటే అమ్మకు ఎందుకు బాగైపోదు..? పిల్లలు పాదాలు నొక్కుతూ కబుర్లు చెప్పవచ్చు. అమ్మ వర్కింగ్ విమన్ అయితే ఆఫీసుకు వెళ్లొద్దని ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని మారాం చేయొచ్చు. ఆ మారాం కూడా ఆమెకు మందే.
కొంత ఖర్చు చేయాలి
అమ్మకు అనారోగ్యం అయితే అమ్మ వద్దు వద్దంటున్నా కొంత ఖర్చు చేయాలి. మంచి పండ్లు తేవాలి. వంట చేయలేని పరిస్థితి ఉంటే మంచిచోట నుంచి భోజనం తెచ్చుకోవాలి. మంచి హాస్పిటల్‌లో చూపించాలి. మందులు పూర్తి కోర్సు కొని వాడేలా చూడాలి. డాక్టర్లు పరీక్షలు ఏవైనా రాస్తే ఏం అక్కర్లేదు అని ఎగ్గొట్టకూడదు. అమ్మ కోసం కుటుంబం మొత్తం ప్రేమగా, సహనంగా, ఒళ్లు వొంచి పని చేసే విధంగా ఏ ఇంట్లో ఉండగలరో ఆ ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా తిరుగుతుంది. తొందరగా కోలుకుంటుంది.
ఇదీ చదవండి : తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం
Comments
Please login to add a commentAdd a comment