కార్తీక మాస సాయంత్రం. రాగి రంగులో శేషాచలం కొండ మెరుస్తూఉంది. కొందరు భక్తులు కపిల తీర్థం జలధార కింద స్నానం చేస్తున్నారు. మరికొందరు కోనేరు దగ్గర మట్టి ప్రమిదలలో నేతిదీపాలు వెలిగిస్తున్నారు. అక్కడే మెట్ల మీద కూర్చున్న ఓ పండితుడు తన శిష్యుడితో కార్తీకమాసం విశిష్టత గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆకాశంలోకి చందమామ తొంగి చూడటం ప్రారంభించాడు. వెండి వెలుగులో ఉన్న అక్కడి వారంతా వెన్నెల స్నానం చేస్తున్నట్లుగా ఉంది. ఆ చల్లటి వెన్నెలకు పరవశించిన పండితుడు, తన శిష్యుడితో ‘‘చంద్రుడి వెలుగుకు మించి ఈ ప్రపంచంలో ఏదీ లేదు’’ అన్నాడు.
అక్కడే దీపం వెలిగిస్తున్న ఓ మహిళ, పండితుడి మాటలు విని సరుక్కున తల తిప్పి చూసింది. ‘‘అదేం మాట?’’ అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది. పండితుడు లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ‘‘వెన్నెల మెరుపును మించింది ఏమైనా ఉంటే చెప్పమ్మా?’’ అని ప్రశ్నించాడు. ఇంట్లో చాలా పనులున్నాయని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను అక్కడినుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరుసటిరోజు కూడా ఆ పండితుడు తన శిష్యుడితోటి కపిలతీర్థం జలధార చూడటానికి వచ్చి అక్కడే కూర్చున్నాడు. పాలమీగడ పాయలుపాయలుగా వర్షిస్తున్నట్లుగా ఉంది జలధార. ఆరోజు కూడా ఆ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చంకలో నెలల బిడ్డ ఉన్నాడు. భక్తిగా దేవుడికి మొక్కి దీపారాధన చేస్తోంది.
ఆమె పూజ అయ్యేంతవరకు ఆగిన పండితుడు ‘‘ఏవమ్మా, నిన్న నేను చంద్రుడి వెలుగుకు మింంచి లేదని చెబితే నువ్వు ఒప్పుకోలేదు. కారణం తెలియలేదు. నేను ఎన్నో గ్రంథాలు చదివాను. పెద్దల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా విన్నాను. నేనెక్కడా చంద్రుడికి మించిన వెలుగు, అంతటి మెరుపు ఉంటాయని చదువలేదు, వినలేదు. నువ్వు చెబితే తెలుసుకుందామని ఉంది’’ అని అడిగాడు. ఆ మహిళ చిరునవ్వు నవ్వుతూ తన చేతిలోని బిడ్డకు కోనేరులోని చందమామను చూపింది. ఆ పిల్లవాడు ముసిముసినవ్వులు నవ్వినాడు. ఆ పిల్లవాడి చేతితో, నీటిలో కనిపించే చందమామను తాకించింది.
అలలు అలలుగా చందమామ పక్కకి వెళ్ళిపోయాడు. చందమామను పట్టుకోవాలని ఆ పిల్లవాడు నీళ్ళమీద ధబీధబీమని కొట్టినాడు. చందమామ దొరకలేదు. ‘‘అదుగో... పైకి పాయె చందమామ’’ అంటూ ఆకాశంలోని చందమామను చూపింది. ఆ బిడ్డ బోసినవ్వుతో కేరింతలు కొట్టినాడు. బిడ్డ కాలి వెండి గొలుసులు చిన్నగా మోగాయి. అప్పుడు ఆ మహిళ తన బిడ్డ నవ్వును పండితుడికి చూపిస్తూ ‘‘ఈ ప్రపంచంలో నా బిడ్డ మెరుపు ఎవరికైనా వస్తుందా?’’ అని అడిగింది.
ఆమె మాటలకు ఆశ్చర్య పోయాడు ఆ పండితుడు. ‘‘నిజమే... తల్లి ప్రేమ అలాంటిది. ఏ తల్లికైనా తన బిడ్డ ముఖంలోని మెరుపు, వెలుగుతో సమానమైనవి ఏవీ ఉండవు కదా...’ అనుకుని చిన్నగా అక్కడి నుం తన శిష్యుడిని వెంటబెట్టుకుని కదిలాడు. వెనుకనే ఆ మహిళ బిడ్డనెత్తుకుని ఆకాశం వైపు చూపిస్త ‘‘చందవమ రావే... జాబిల్లి రావే...’’ అని పాడే పాట తెరలు తెరలుగా వినిపిస్తోంది.
– ఆర్.సి.కృష్ణ స్వామి రాజు
(చదవండి: గెలుపు.. గమనం.. మలుపు)
Comments
Please login to add a commentAdd a comment