spritual
-
మౌనం ఒక వరం...!
మౌనంగా ఉండటం చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కొందరు పూజలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మత గ్రంథాలు చదువుతూ ఒక పక్క మాట్లాడుతూ మరోప్రక్క అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఉదయమే చదివితే చాలు అనే ధ్యాసలో ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి పూజలు కాని మత గ్రంథాలు చదవటం కాని చేయరు. అనునిత్యం పైకి అనకుండా మనసులోనే తమ దైవాన్ని స్మరించుకుంటారు. వారు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎవరు ఏమైనా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ఉంటే మేలు. లేకపోతే మాటకు మాట పెరిగి వాగ్వివాదం పెరిగి చూసేవారికి అసహనం కలుగుతుంది. సమాధానం ఇవ్వకుండా ఉంటే మౌనంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కొందరికి అన్ని కావాలి. ఎవరు, ఏమిటీ అని ఆరా తీస్తారు. అది వారి పెద్దరికానికి తగదు. పూజలు చేస్తేనే పుణ్యం అనే భ్రమలోనుంచి వారు బయటకు రావాలి. చేత కానప్పుడు మదిలోనే భగవంతుని స్మరించవచ్చు. అంతేకాని వితండవాదం చేయకూడదు. మన మాట పిల్లలు విననప్పుడు మనం మారు మాటాడకూడదు. వారు ఏదయినా అడిగితేనే మనం సలహా ఇవ్వాలి. అయినా ఈ రోజులలో పెద్దల మాట ఎవరూ పట్టించుకోరు. మనం సాధ్యమైనంత వరకు మనసులోనే మౌనంగా మన ఇష్టదైవాన్ని తలచుకుంటే అదే పదివేలు. మౌనమే మనం అలవర్చుకోవాలి. మౌనాన్ని మించిన విద్య లేదు. మౌనం అన్నిటికి పరిష్కారం.– కనుమ ఎల్లారెడ్డి, విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు (చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..
కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివభక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామాలకెళ్లిన శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ దూరంలో సూగూరేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో వెలిశాయని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు వెలిశాడు. విజయనగర సామ్రాజ్యాధిపతులైన ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కొల్హాపుర దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభు కలలో కనిపించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభు గర్భగుడిని నిర్మించారు. పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం గట్టిగా నెలకొంది. దేవాలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసిన శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది. ప్రతి నిత్యం త్రికాల పూజలు స్వామి జాతర, రథోత్సవాలు రెండున్నాయి. దక్షిణ, తూర్పు, పడమరల్లో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా ఉంది. పడమరలో గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. ఉదయం 5, మధ్యాహ్నం 11, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరులో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు.అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం రెండు వందల మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి భోజనం ఏర్పాటు దేవాలయం కమిటీ నిర్దారించారు. పెళ్లి చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా కేటాయిస్తామని అధికారి సురేష్ వర్మ తెలిపారు.7న జోడు రథోత్సవాలు: శనివారం దేవసూగూరు సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని దేవాలయ కమిటీ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గజానన తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముంబై, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్ వివరించారు.(చదవండి: మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..? ఈ పండుగ విశిష్టత) -
మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..?
మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజుకే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదేవిధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును ‘శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి‘ గా వ్యవహరిస్తారు.ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. ఏం చేయాలంటే..? ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం (చదవండి: మహిమాన్వితం మార్గశిర లక్ష్మీవార వ్రతం) -
మహిమాన్వితం మార్గశిర లక్ష్మీవార వ్రతం
లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.వ్రత విధానం ముందుగా పొద్దున్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ‘ ‘ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ ‘అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి.అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. గురువారం నాడు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.నైవేద్యాలు : 1 వ గురువారం పులగం 2 వ గురువారం అట్లు, తిమ్మనం3 వ గురువారం అప్పాలు, పరమాన్నము4 వ గురువారం –చిత్రాన్నం, గారెలు , 5 వ గురువారం పూర్ణం బూరెలు నియమనిష్ఠలు కీలకంగురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.(చదవండి: అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్ ..!) -
తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది? తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం. సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది. – స్వామి జగదాత్మానంద (చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు) -
మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. పూర్ణిమ విశిష్టత..ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. బోధి వృక్షానికి పూజలు..బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?) -
సోమావతి అమావాస్య అంటే.. రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..! అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ। చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే.. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం. ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు. చేయకూడనవి.. ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. -
ఇవాళే సుబ్రమణ్య షష్ఠి! ఈ రోజున ఏం చేస్తారంటే..?
ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథిని గాక కేవలం ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రమణ్య షష్ఠి అంటారు ఎందుకు. అసలేం చేస్తారు ఈరోజున. దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకంతా ఈ పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు. పైగా ఆ రోజు పలు చోట్ల తీర్థం కూడా జరుగుతుంది. ఈ సుబ్రమణ్య షష్ఠిని పలు చోట్ల పలు విధాలుగా పిలుస్తారు ఎందుకని?. తదితరాల గురించే ఈ కథనం!. సుబ్రమణ్య షష్ఠి అనగా? శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి జననం.. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అనితరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. పలు పేర్లు ఎలా వచ్చాయంటే..? ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీస్వామివారిసహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానంచేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఈ పండగలో దాగున్న సామాజిక ప్రయోజనం.. జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోపకారం మిధం శరీరం" అని భావించి పేదవారికి కంబళ్ళు, దుప్పట్లు తోపాటు చలి నుంచి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతుంది. (చదవండి: ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!) -
దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి ఎంతో తెలుసా?
మానవుడు శక్తి హీనుడనని డీలా పడిపోతాడు. ధనం,అధికారం లేదు కాబట్టి తాను పనిరానివాడిగా భావిస్తాడు. ఇక ఇంతే జీవితమని నిరాశ నిస్ప్రుహలకు స్థానం ఇచ్చి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే కదా అని తన ఆఖరి ఘడియ కోసం నిర్లిప్తంగా ఎదురు చూస్తాడు. నిజానికి ప్రతి వ్యక్తికి దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. ధనం, అధికారం, ప్రతిష్టా, మంచి వంశం అనేవి పక్కన పెట్టండి. ప్రతి మనిషికి స్వతహగా ఎంతో శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించం, తెలుసుకుని ప్రయోజనం పొందే యోచన చెయ్యం. నిజానికి సైన్సు పరంగా మనిషిక ఎంత శక్తి ఉందో తెలిస్తే షాకవ్వడం ఖాయం!. అదేంటో సవివరంగా తెలుసుకుందాం!. మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణాలు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలి. ఇక హార్మోన్స్‌లో 45కేలరీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. శరీరం వద్దకు వస్తే ప్రతి మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళాలు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణాలు తయారవుతాయి. గుండె దగ్గరకు వస్తే. మానవుని హృదయము నిముషానికి 72 సార్లు చొప్పున రోజుకు ఇంచు మించు 1,00,000 (ఒక లక్ష) సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొట్టుంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తాయి. మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తాయి. మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోప్పడటానికి 43 కండరములు పనిచేస్తాయి. మనిషి చర్మంలో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును. మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి. మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు. మానవుని శరీరములో 206 ఎముకలు కలవు. మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కిలోగ్రాముల ఫుడ్‌ని తింటాడు. మనిషి నోటిలో రోజుకు 2 నుంచి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది . మనిషి జీవిత కాలములో గుండె 100 ఈత కోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి. మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది. మానవుని మెదడుకు నొప్పి తెలియదు. మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది. ఒక్క తుమ్ము ఏకంగా.. తుమ్ము గంటకు వంద మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది. చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి. స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది. స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు. రక్తం, నీరు కుడా వారికి 6 రెట్లు చిక్కగా ఉంటుంది. మానవుని మూత్రపిండములు నిముషానికి 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రమును విసర్జిస్తాం. స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది. మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన. ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది. రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది. మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేస్తుంది. మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును. మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి. మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి ఏడు రోజులకొకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడతాయి. కంటితో 2.4 మిలియన్ల.. మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది. ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది. మనిషి శరీరములో దాదాపు 75% నీరు ఉంటుంది. మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడగలడు. అది సుమారుగా 528 మెగా పిక్సల్ లెన్స్‌కి సమానం. ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండటమే గాక మన శరీరీ అవయవాల ప్రాముఖ్యతను గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుక ప్రయత్నించాలి. ఇదంతా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి మనకు ఏమి తక్కువగా ఉంది? . కాబట్టి అస్సలు నిరాశ , నిస్పృహను దరిచేరనీయొద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణించండి. ఇక్కడకి కేవలం వచ్చి పోవడానికి రాలేదు. వెళ్లేలోపు ఏదోఒకటి ఇచ్చి పోవడానికే వచ్చాము. బీ స్ట్రాంగ్.. ఏదైనా సాధించాలని పట్టుదలను పెంపొందించుకోండి. విజయం తథ్యం. (చదవండి: నమస్కారం అంటే..ఏదో యాంత్రికంగా చేసేది కాదు! ఎక్కడ? ఎలా? చేయాలో తెలుసుండాలి!) -
ఇవాళే కార్తీక పౌర్ణమి! జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు?
సమస్త పాపాలను దగ్ధం చేసే జ్వాలా తోరణం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. ఈ తోరణం గుండా వెళ్లకుండా ఉండాలంటే జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు. కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు ఎందుకు ? కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ.. "కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు..’’ అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే - ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు.అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం... కార్తీకపౌర్ణమి నాడు ఏం చేయాలి? " సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, " దామోదరమావాహయామి " అనిగాని, " త్రయంబకమావాహయామి " అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి... కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః జటేస్ధలే... ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః భవతింత్వ స్వపచాహి విప్రాః" ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక! నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు. దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావుగారి ప్రవచనం ఆధారంగా) --డీ. వీ ఆర్ భాస్కర్ (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం!
బ్రహ్మచారులు, సాధువుల కన్నా సంసార జీవితాన్ని గడిపే వారికే కొన్ని దాన ధర్మాలు నిర్వర్తించే అవకాశ ముంది. వాళ్లను సాయం అడిగే వారుంటారు. అలాంటి వారికి సాయం చేసి పుణ్యం గడించే వీలు వీరికే ఎక్కువ. సంసారి తన దగ్గర ఉన్నవాటిని ఎవరెవరికి ఏది అవసరమో వాటిని నిండు మనసుతో ఇవ్వాలి. ఏ మేరకు ఇవ్వగలరో ఆ మేరకు ఇస్తే చాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వాటిలో ముఖ్యమైనది. కడుపునిండా అన్నం పెట్టిన మనిషి ముఖాన్ని చూడండి. అతని ముఖంలో ఓ తృప్తీ, ఓ ఆనందం కనిపిస్తాయి. కానీ మిగిలిన దానాల విషయంలో ఈ తృప్తి అంతగా కనిపించదు. ఎవరైనా తినడానికి వస్తున్నారేమోనని చూసిన తర్వాత తినాలనేది భారతీయ సంప్రదాయం. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పెట్టక తానే తినడం, ఇతరు లకు తెలీకుండా దాచిపెట్టి తినడాన్ని పాపమనే భావనా ఉంది. అందుకే అంటారు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా దానం చేయడం ముఖ్యం. అందులోనూ ‘అన్నదానా’న్ని మించింది మరొకటి లేదు. ఓ ధనవంతుడు ఎన్నో పూజలు చేసి, భగవంతుడిని ఆరాధించి ఇక తానెవరికీ ఏదీ చెయ్యవలసిన అవసరం లేదని నిర్ణయించుకుని తన దగ్గరున్నది ఎవరికీ ఇవ్వక, ఎవరికీ పిడికెడు అన్నం కూడా పెట్టక ‘తానూ, తన కుటుంబం’ అనుకొని బతికాడు. తీరా ఆయన మరణిం చాక రాక్షసుడిగా మారి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే శవాలను పీక్కుతింటూ తన తప్పు తాను తెలుసుకుని తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు. దీంతో రాక్షస రూపం పోయి సద్గతి పొందినట్లు ఓ కథ ఉంది. ఇటువంటి కథల నుంచి గ్రహించాల్సిన నీతి ఒక్కటే: తాను తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి. – యామిజాల జగదీశ్ (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
కువైట్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!
కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్‌గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. (చదవండి: దుబాయ్‌లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం) -
జెంటిల్మెన్లా ఉండాలనుకుంటే..అవి అస్సలు చేయకూడదు!
పరస్తుతి, పరనింద, ఆత్మస్తుతి, ఆత్మనింద – ఈ నాలుగూ సజ్జనులు చేసే పనులు కావు అని మహాభారతంలో ఒక నీతి ఉంది. ‘అన్య కీర్తనంబు, అన్య నిందయు, తన్ను/ పరగ పొగడికోలు, ప్రబ్బికోలు,/ ఆపగా తనూజ! ఆర్యవృత్తములు కా/వనిరి వీని ఆద్యులైన మునులు...’ ఇక్కడ ‘ఆపగా తనూజుడు’ (నదీ పుత్రుడు) అంటే గాంగేయుడైన భీష్ముడు. ఆ ధర్మవేత్తకు ఈ నీతి బోధిస్తున్నది ఛేదిరాజు శిశుపాలుడు. ‘నువ్వు అదే పనిగా శ్రీకృష్ణుడినే పొగుడు తున్నావు. ఇది పెద్దలు చేయదగిన పనికాదు’ అని శిశుపాలుడి అభ్యంతరం. ఉటంకించింది శిశుపాలుడయినా, ఇది ‘ఆద్యులైన మునుల’ మాట కదా! పెద్దలిలా ఎందుకు చెప్పారో ఇంచుక చింతన చేసుకొంటే తప్పులేదు. పరులను వాళ్ళ ఎదుటే ‘ముఖస్తుతి’ చేసే వాడు... పలచనైపోయి, ఆశ్రితుల స్థాయికి జారిపోతాడు. గౌరవం కోల్పోతాడు. పరులను వాళ్ళ పరోక్షంలో పొగిడినా, అలా పదేపదే చేస్తుంటే... దానివల్ల తనవాళ్ళకు నిరుత్సాహం కలగడమే కాక, వాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అలాగే పరనింద కూడా ప్రయోజన శూన్యం. అహంకారాన్ని ప్రకటించుకోవడమూ, శత్రుత్వాన్ని పెంచుకోవడమూ తప్ప నింద వల్ల సాధించేదేముంది? నిందను సకారాత్మకంగా స్వీకరించి, తమ ‘తప్పు’ గ్రహించి మారిపోయే ‘పరులు’ ఎక్కడయినా ఉంటారా? చేతలే చెప్తాయి.. ఆత్మస్తుతి సరేసరి. అది సాధారణంగా అల్పత్వాన్నీ, ఆత్మ న్యూనతా భావాన్నీ సూచిస్తుంది. ధీరులూ, సమర్థులూ వాళ్ళ ఘనత వాళ్ళు చెప్పుకోరు. ఘనతను చేతలే చెప్తాయి. చేతలులోపించి నప్పుడే మాటలు. ‘నేను ఘనుడిని’ అని ఎంత చెప్పుకొన్నా దానికి విలువా, విశ్వసనీయతా ఉండవు. నమ్మేదెవరు? ఆత్మనింద కూడా ప్రమాదకరమే. ఆత్మవిమర్శతో తన తప్పులు గ్రహించుకొని, తొలగించుకొంటే మంచిదే కానీ ఊరకే తనను తాను నిందించుకొంటూ కూర్చొంటే, అది ఉన్న ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కూడా దెబ్బ తీసి, క్రమంగా మరింత పిరికితనానికీ, అసమర్థతకూ, కుంగుబాటుకూ దారి తీస్తుంది. అయితే ఒకటి! మహాభారతమయితే ఇలా చెప్పింది కానీ ఈ రోజులలో, ఆత్మస్తుతీ, పరనిందా, దాంతోపాటు అవసరార్థం ‘తమంత వారు లేరు సుమా!’ అంటూ పరస్తుతీ, లోకం చేత ఓహో అనిపించుకొనేందుకు అప్పుడప్పుడూ ఆత్మనిందా మానేస్తే, సమా జంలో ఎక్కువగా మౌనమే రాజ్యం చేయాల్సివస్తుందేమో! – ఎం. మారుతి శాస్త్రి (చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?) -
గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?
అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్! విచిత్రం! మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’ ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88) -
శివపార్వతుల్లో ఎవరు అధికులు?
ఒకరోజు శివపార్వతులిద్దరూ కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉన్నారు. పార్వతీదేవి ఉన్నట్టుండి ‘‘ప్రకృతి– పురుషులలో ఎవరు అధికులు?’’ అని శివుణ్ణి అడిగింది. శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు సమాధానమిచ్చాడు. దాంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చూస్తుండగానే వాదన కాస్తా ముదురు పాకాన పడింది. అమ్మవారు ప్రకృతి గొప్పదనం ఏమిటో తెలియజేయాలనుకుని తన శక్తిని ఉపసంహరించి అంతర్ధానం అయింది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుండటం చూసి తట్టుకోలేకపోయింది అమ్మ. దాంతో కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని ఆనందస్వరూపుడు శివుడు భిక్షాపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతి నుండి అన్నం స్వీకరించాడు. సాక్షాత్తూ తన పతిదేవుడే తన వద్దకు భిక్షాపాత్ర పట్టుకుని రావడం చూసిన అమ్మవారు తనదే పై చేయి అని ముందు సంతోషించినప్పటికీ, తర్వాత భర్తనే భిక్షకుడిగా చూసినందుకు బాధపడుతుంది. దాంతో పరమేశ్వరుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి, పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి పార్వతి చేయి పట్టుకుని మరల కైలాసానికి వెళ్ళిపోయాడు. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం ఇది. – డి.వి.ఆర్. (చదవండి: ధర్మం అంటే ఏంటో తెలిపేది..ఈ శంఖలిఖితుల కథ) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
నేడు నాగ పంచమి? లేక గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..
నిజానికి పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ్రేంద్రుడుని పూజించడం వంటివి చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం 'గరుడ పంచమి' అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గ్రద) రెండు పరమ వైరి జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా లేక గరుడు పంచమి అనాల? ఎందికిలా రెండు రకాలుగా పిలుస్తున్నాం. దీనికున్న ప్రాశస్యం తదితరాల గురించే ఈ కథనం!. ఎందుకిలా రెండు రకాలుగ పిలుస్తున్నారంటే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచిమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎందుకింత మహిమాన్వితమైంది అంటే.. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా , వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు , గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని , గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం , తల్లి ఋణం తీర్చుకోవాలని , ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని , పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా , జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారని జయించడం కష్టం. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా, తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి.. ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.. అనుసరించాలి. నిర్మలమైన మనస్సు , తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి , బియ్యంపోసి , వారి శక్తి మేర బంగారు , వెండి నాగపడిగను ప్రతిష్టించి , పూజచేసి , పాయసం నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా, సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచిమి లేదా గరుడ పంచిమి రోజున ఆ ఇరువురిని కొలచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి. (చదవండి: శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..) -
వెన్నెల మెరుపుకి మించినది ..అంతకుమించి మరోకటి ఏముందంటే..
కార్తీక మాస సాయంత్రం. రాగి రంగులో శేషాచలం కొండ మెరుస్తూఉంది. కొందరు భక్తులు కపిల తీర్థం జలధార కింద స్నానం చేస్తున్నారు. మరికొందరు కోనేరు దగ్గర మట్టి ప్రమిదలలో నేతిదీపాలు వెలిగిస్తున్నారు. అక్కడే మెట్ల మీద కూర్చున్న ఓ పండితుడు తన శిష్యుడితో కార్తీకమాసం విశిష్టత గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆకాశంలోకి చందమామ తొంగి చూడటం ప్రారంభించాడు. వెండి వెలుగులో ఉన్న అక్కడి వారంతా వెన్నెల స్నానం చేస్తున్నట్లుగా ఉంది. ఆ చల్లటి వెన్నెలకు పరవశించిన పండితుడు, తన శిష్యుడితో ‘‘చంద్రుడి వెలుగుకు మించి ఈ ప్రపంచంలో ఏదీ లేదు’’ అన్నాడు. అక్కడే దీపం వెలిగిస్తున్న ఓ మహిళ, పండితుడి మాటలు విని సరుక్కున తల తిప్పి చూసింది. ‘‘అదేం మాట?’’ అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది. పండితుడు లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ‘‘వెన్నెల మెరుపును మించింది ఏమైనా ఉంటే చెప్పమ్మా?’’ అని ప్రశ్నించాడు. ఇంట్లో చాలా పనులున్నాయని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను అక్కడినుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరుసటిరోజు కూడా ఆ పండితుడు తన శిష్యుడితోటి కపిలతీర్థం జలధార చూడటానికి వచ్చి అక్కడే కూర్చున్నాడు. పాలమీగడ పాయలుపాయలుగా వర్షిస్తున్నట్లుగా ఉంది జలధార. ఆరోజు కూడా ఆ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చంకలో నెలల బిడ్డ ఉన్నాడు. భక్తిగా దేవుడికి మొక్కి దీపారాధన చేస్తోంది. ఆమె పూజ అయ్యేంతవరకు ఆగిన పండితుడు ‘‘ఏవమ్మా, నిన్న నేను చంద్రుడి వెలుగుకు మింంచి లేదని చెబితే నువ్వు ఒప్పుకోలేదు. కారణం తెలియలేదు. నేను ఎన్నో గ్రంథాలు చదివాను. పెద్దల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా విన్నాను. నేనెక్కడా చంద్రుడికి మించిన వెలుగు, అంతటి మెరుపు ఉంటాయని చదువలేదు, వినలేదు. నువ్వు చెబితే తెలుసుకుందామని ఉంది’’ అని అడిగాడు. ఆ మహిళ చిరునవ్వు నవ్వుతూ తన చేతిలోని బిడ్డకు కోనేరులోని చందమామను చూపింది. ఆ పిల్లవాడు ముసిముసినవ్వులు నవ్వినాడు. ఆ పిల్లవాడి చేతితో, నీటిలో కనిపించే చందమామను తాకించింది. అలలు అలలుగా చందమామ పక్కకి వెళ్ళిపోయాడు. చందమామను పట్టుకోవాలని ఆ పిల్లవాడు నీళ్ళమీద ధబీధబీమని కొట్టినాడు. చందమామ దొరకలేదు. ‘‘అదుగో... పైకి పాయె చందమామ’’ అంటూ ఆకాశంలోని చందమామను చూపింది. ఆ బిడ్డ బోసినవ్వుతో కేరింతలు కొట్టినాడు. బిడ్డ కాలి వెండి గొలుసులు చిన్నగా మోగాయి. అప్పుడు ఆ మహిళ తన బిడ్డ నవ్వును పండితుడికి చూపిస్తూ ‘‘ఈ ప్రపంచంలో నా బిడ్డ మెరుపు ఎవరికైనా వస్తుందా?’’ అని అడిగింది. ఆమె మాటలకు ఆశ్చర్య పోయాడు ఆ పండితుడు. ‘‘నిజమే... తల్లి ప్రేమ అలాంటిది. ఏ తల్లికైనా తన బిడ్డ ముఖంలోని మెరుపు, వెలుగుతో సమానమైనవి ఏవీ ఉండవు కదా...’ అనుకుని చిన్నగా అక్కడి నుం తన శిష్యుడిని వెంటబెట్టుకుని కదిలాడు. వెనుకనే ఆ మహిళ బిడ్డనెత్తుకుని ఆకాశం వైపు చూపిస్త ‘‘చందవమ రావే... జాబిల్లి రావే...’’ అని పాడే పాట తెరలు తెరలుగా వినిపిస్తోంది. – ఆర్.సి.కృష్ణ స్వామి రాజు (చదవండి: గెలుపు.. గమనం.. మలుపు) -
అసలు 'ఆచమనం' ఎందుకు చేయాలి? మూడుసార్లే ఎందుకు తాగాలి..
పూజలు, వ్రతాల్లో 'ఆచమనం' అనేమాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం.. అసలు అలా ఎందుకు చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే 'ఆచమనం' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో చూద్ధాం. "ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అంతా బాగానే ఉంది మరీ అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?. అలానే ఎందుకు తాగాలి?. ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?. మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది. “కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఎన్నో లెక్కకు మించి సందేహాలు మీమదిలో వచ్చే ఉంటాయి. పైగా దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఒక రకంగా వ్యాయామం.. ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. 'కేశవాయ స్వాహా' అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. 'నారాయనాయ స్వాహా' అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా 'మాధవాయ స్వాహా' అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉండటమేగాక శాస్త్రీయత కూడా ఉంది. (చదవండి: నేటి నుంచి అధిక శ్రావణమాటాసం? అంటే ఇది డూప్లికేటా?) -
కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాదు! కొండే అడ్డు రానీ..
ఆచరణల ప్రసంగం, ఆశల ప్రణాళిక, నమ్మకాల ప్రదర్శన, అభిప్రాయాల ప్రకటన, గుణాల ప్రతాపం, భావాల ప్రవాహం, ఆలోచనల ప్రస్థానం మనిషి జీవనం, జీవితం. జీవనం, జీవితం వీటిని మనిషి ఏ మేరకు ఫలవంతం చేసుకుంటున్నాడు? ఎంత సారవంతం చేసుకుంటున్నాడు? తన జీవనం, జీవితం వీటివల్ల మనిషి ఏ మేరకు ఫలవంతం ఔతున్నాడు? ఎంత సారవంతం ఔతున్నాడు? ఈ ప్రశ్నలకు సంతప్తికరమైన జవాబులు మాత్రమే రావాలి లేదా సాధించుకోవాలి. అందుకనే మనిషికి జీవనం, జీవితం ఉన్నాయి; అందుకనే జీవనం, జీవితం వీటితో మనిషి ఉన్నాడు. మనిషికి జీవనం లేకపోతే జీవితం లేదు; జీవితం లేకపోతే జీవనం లేదు. జీవనం, జీవితం ఈ రెండూ లేకపోతే మనిషి లేడు. ఉన్న మనిషికి ఉండే జీవనం, జీవితం మనిషి సఫలం అయ్యేందుకే కాని విఫలమూ, విధ్వంసమూ అయ్యేందుకు కాదు; విఫలమూ, విధ్వంసమూ చేసేందుకు కాదు. మనిషి మస్తిష్కం ఆకాశం ఐతే అక్కడ నుంచి నాణ్యమైన, సరైన భావనల వానపడితే ఆ వానకు మనసు తడిస్తే జీవనం పూస్తుంది; జీవితం రూపొందుతుంది. జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ అవాలంటే మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ ఉండాలి లేదా నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉండాలి. మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉంటే జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఔత మనిషికి మాన్యత వస్తుంది. పుట్టేశాం కదా అని కాలాన్ని తోసెయ్యడం జీవనం కాదు; కాలంవల్ల తోసెయ్యబడడం జీవితం కాకూడదు. అభిప్రాయాల్నీ, మనోభావాల్నీ పేర్చుకుంటూపోవడం జీవనం కాదు; వాటినే మోసుకుంటూ వాటి బరువుకు కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాకూడదు. వాగులో కొట్టుకుపోవడం కొనసాగడం ఔతుందా? ప్రవాహంలో ముందుకు ఈదడమూ, అవసరానికి ఆనుగుణంగా ప్రవాహానికి ఎదురు ఈదడమూ జీవనం అవుతుంది; నదిలో కొట్టుకుపోవడమా? కాదు, కాదు నదిలా ప్రవహించడం జీవితం ఔతుంది. రాని పిలుపును విని వడివడిగా వెళ్లడం జీవనం కాదు; లేని చోటును వెతుక్కుంటూ వెళ్లడం జీవితం కాదు. ఉన్న దారిలో లేని తలుపులు మూసుకుని ఉన్నాయి అని అనుకుని ఊరికే పడి ఉండడం జీవనం కాదు; కొండే అడ్డుగా ఉన్నా దారీ, తీరూ మార్చుకుని నీరులా ముందుకు సాగడమే జీవితం. మనిషికీ జీవితం ఒక గుంటగానూ, ఆ గుంటలో పడిపోయి పరుగెత్తుతూ ఉండడం జీవనంగానూ అవకూడదు. తనను తాను కోల్పోవడం మనిషికి జీవితం అవుతుందా? అవదు, అవదు; తన నుంచి తాను కోలుకోవడం ఏం ఔతుంది? అదే జీవితం ఔతుంది! పోగొట్టుకోవడం జీవనం అవదు అన్న తెలివిడి వస్తే పొందడం అన్నది జీవితం అవుతుంది అని తెలియవస్తుంది మనిషికి. మనిషి తననుంచి తాను విడివడడం అన్న కళను అభ్యసించి నేర్చుకోవాలి. జన్మతః మనిషికి మానసికంగానూ, చింతనపరంగానూ లోపాలు, దోషాల ఉంటాయి. లోపాలు, దోషాల లేని మనిషి ఉండడం ఉండదు. తన లోపాల్నీ, దోషాల్నీ వదులుకోవడం కోసం మనిషి తన నుంచి తాను విడివడాలి లేదా విడుదలవ్వాలి. అలా జరిగితే అప్పుడు అది జీవనం ఔతుంది. తనను తాను మాటిమాటికీ సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ తనలోకి తాను చేరుతూ ఉంటే అప్పుడు అది జీవితం ఔతుంది. జీవితం తనతో ఉన్నప్పుడు మనిషి దాన్ని ఉపయోగించుకోవడం జీవనం; జీవనం ఉపయోగపడడంవల్ల ఉన్నతిని పొందడం జీవితం. జీవనానికి జీవితం ఉండాలి; జీవితానికి జీవనం పండాలి; మహిలో మనిషి మెరవాలి. జీవనమూ, జీవితమూ ఉన్నాయి కాబట్టి మరణించాక కూడా మనిషి పరిమళించాలి. ఇక చివరిగా ఏది మనిషికి విజయం తన జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఐనా జీవనం, జీవితానికి విజయం, ఫలవంతమూ సారవంతమూ ఐతే జీవితానికి జీవనం విజయం. – రోచిష్మాన్ (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో తెలుసా!
ఓ సూఫీ జ్ఞాని చెప్తున్నారు...మనిషి ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది. అది చివరకు భగవంతుడినే చేరుతుంది. అది అంతిమంగా భగవంతుడిని ఎప్పుడు చేరుతుందో అప్పుడే దాని ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే అదొక వలయం. అనేక పుట్టుకలు, అనేక మార్గాలు ఇలా ఎలాగైనా అనుకోవచ్చు. చెప్పాలంటే జీవితంలో ఏదో ఒక అన్వేషణ అంటూ ఉంటూనే ఉంటుంది. మనసు ఏదో ఒకటి కోరుతూ ఆ దిశలో పయనిస్తుంది. కానీ అది ఏది కోరుకుంటుందోఎక్కడ తృప్తి చెందుతుందో స్పష్టత ఉండదు. దీనినే ఆ జ్ఞాని ఆత్మాన్వేషణ ప్రయాణం అని చెప్పారు. ఇదంతా వింటున్న ఓ శిష్యుడికి ఓ సందేహం కలిగింది. ‘‘గురువుగారూ, ఆత్మ అంతిమంగా భగవంతుడిని చేరుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుందన్నారు కదా... అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరుకోవడమే అవుతుందిగా’’ అని అడిగాడు. ‘‘అవును... అందులో సందేహమేముంది? కాస్తంత ముందు వెనుకలు అంతే..అంతకన్నా మరొకటి కాదు... అందరూ చివరికి భగవంతుడిని చేరుకోవలసిందే’’ అన్నారు జ్ఞాని. ‘‘మరి మత పెద్దలు కొందరు మాత్రమే భగవంతుడిని చేరుకుంటున్నారని చెప్పారుగా?’’ అన్నాడు శిష్యుడు. అప్పుడు జ్ఞాని ‘‘నువ్వో పని చెయ్యి. ఊళ్ళోకి వెళ్ళి, వీలున్నంతమందిని కలిసి వారి కోరికేమిటో తెలుసుకుని రా’’ అని సూచించారు. సరేనని శిష్యుడు కొన్ని కాగితాలు, కలం తీసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు.అనేకమందిని కలిశాడు. వారు ఏం కావాలనుకుంటున్నారో, వారి లక్ష్యమేమిటో అడిగాడు. వారి మనసు ఏది పొందితే తృప్తి పడుతుందో చెప్పమన్నాడు. వారు చెప్పినవన్నీ రాసుకున్నాడు. జ్ఞాని వద్దకు వచ్చాడు. ‘‘అయ్యా, ఊళ్ళో రాజు మొదలుకుని కూలీవరకూ ఎందరినో కలిసాను. వారు చెప్పినదంతా చదువుతాను వినండి’’ అంటూ మొదలుపెట్టాడు... ‘‘రాజేమో మరిన్ని దేశాలను గెలవాలనుకున్నాడు. యువరాజేమో తెలివైన యువరాణిని పెళ్ళాడాలనుకున్నాడు... ధనవంతుడేమో మరింత డబ్బు గడించాలనుకుంటున్నాడు... ఇలా ఒక్కొక్కరూ ఆశ పడుతున్నారు...’’ చెప్తుండగానే జ్ఞాని చదవడం ఆపమన్నారు. ‘‘అదంతా పోనివ్వు... వారిలో ఎంతమంది భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మొదట చదువు’’ అన్నారు జ్ఞాని. ఒక్కరు కూడా లేరన్నాడు శిష్యుడు. ‘‘అంటే నువ్వు కూడా లేవా ఆ జాబితాలో?’’ అని అతనివంక నవ్వుతూ చూశారు జ్ఞాని. శిష్యుడు తల దించుకున్నాడు. – జగద్రేణు (చదవండి: మంగళకరం) -
Goda Stuti: మార్మిక వధూగీతం గోదాస్తుతి
పదమూడవ శతాబ్దంలో, ఒకనాటి సాయంత్రం, శ్రీవైష్ణవ కవి, తాత్త్వికులు వేదాంత దేశికులు తమిళనాడులో అడవుల మధ్య ఉన్న శ్రీవిల్లిపుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. ఆనాడు త్రయోదశి, మహాప్రదోష సమయం. సంప్రదాయపరులైన శ్రీవైష్ణవులు నరసింహస్వామి ధ్యానంలో మౌనవ్రతాన్ని పాటించే రోజు. అందువల్ల దేశికులు నిశ్శబ్దంగా తమ విడిదిలోకి నిష్క్రమించారు. అప్పుడే ఆ వీధి నుండి పూర్వ శతాబ్దాలకు చెందిన కవయిత్రి, మార్మిక వధువు అయిన శ్రీ ఆండాళ్ ఉత్సవ విగ్రహపు ఊరేగింపు సాగింది. కనుల పండువగా, వైభవోపేతంగా పల్లకీలో సాగే ఆ ఊరేగింపు, ఆ ఊరి వేల్పు వటపత్ర శాయి ఆలయానికి సాగుతోంది. ఆ అద్భుత దృశ్యం దేశికుల మౌనవ్రతాన్ని హఠాత్తుగా భగ్నం చేసింది. వారి నోటి వెంట ఆశువుగా గోదాస్తుతి వెలువడింది. వారు రచించిన 28 స్తోత్రాలలోకి ఇది గొప్ప రచనగా పండితులు భావిస్తారు. నియమ బద్ధమైన మౌనాన్ని ఛేదిస్తూ ఆశుధారగా వెలువడిన ఆ స్తోత్రం శ్రీవైష్ణవ సాహిత్యం లోకెల్లా గంభీరమైన స్తోత్రంగా సంస్కృత పండితులే కాక వేదాంతులు కూడా భావిస్తారు. గోదాస్తుతికి గల గంభీర లక్షణాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రీ వైష్ణవ సిద్ధాంతాల పట్ల లోతైన అవగాహన, శ్రీ ఆండాళ్ కృతులలో, ఆమె పవిత్ర జీవిత గాథలో ప్రతీకాత్మకంగా చెప్పిన విషయాలను అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. 1. భగవంతుని వారసులుగా తప్ప జీవాత్మలకు ఏ విధమైన గుర్తింపూ లేదు. 2. ఇహలోక యాత్రలో తమ ప్రాణేశ్వరుడైన పరమాత్మను అన్వేషించటం కంటే, అతనితో తమ జీవనాన్ని పెనవేసుకోవటం కంటే మరో ముఖ్యమైన కార్యక్రమం జీవాత్మలకు లేదు. 3. విశ్వజనీన వరుడు పరమాత్మతో కలయికకు ఎదురుచూడని జీవాత్మల గాథలు వ్యర్థాలు. శ్రీవైష్ణవ మతానుసారం, భగవానుని సంయోగం కోసం ఎదురుచూడని జీవుని జన్మ వృథా! అందువల్ల జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ కోసం అన్వేషించి, తపించి, కనుగొని అతనిలో విశ్రమించాలి. ‘వధూమార్మికత’ అనే దృక్కోణంపై గోదాదేవి జీవితగాథ, ఆమె కవిత్వ మహత్తర సౌధం నిర్మితమైంది. ఆండాళ్ ‘నాచ్చియార్ తిరుమొళి’లో తొణికిసలాడుతున్న వధూమార్మికత లేదా ప్రణయభక్తి, పరమాత్మ కొరకు జీవుని వేదన... అప్పటి శ్రీ వైష్ణవ ఆలోచనాధారను ప్రభావితం చేశాయి. శ్రీవైష్ణవ సిద్ధాంతాలకు ఆనందప్రదమైన నిరూపణగా నిలిచిపోయాయి. ఈ విషయాన్నే దేశికులు గోదాస్తుతిలోని ఎనిమిదవ చరణంలో చెప్పారు. ఆమె తండ్రి అయిన పెరియాళ్వారుతో సహా వైదిక విశ్వాసం గల పెద్దలు కూడా తమ సంప్రదాయాలను వదలి, తమ ఆధ్యాత్మిక అన్వేషణలో గోదాదేవి చూపిన ప్రణయ భక్తి మార్గాన్ని అనుసరించారు. గోదాదేవి దాల్చి ఇచ్చిన మాలను ధరించి సంతోషించిన రంగనాథుడు, ఆమె పాశురాలకు పరవశించిన స్వామి, ఆమె జీవులను రక్షించటానికి ఏమి చేయమంటే అది చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని శ్రీవైష్ణవుల విశ్వాసం. (క్లిక్ చేయండి: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం) – శ్రీదేవి మురళీధర్ -
Christmas 2022: రక్షణోదయం క్రిస్మస్
యేసు అంటే రక్షణ. యేసు జననమే రక్షణోదయం. అదే క్రిస్మస్. రక్షణకు పుట్టిన రోజు. ఆ రక్షణా కార్యానికి దేవునిచే నియుక్తుడై, అభిషిక్తుడైన ఆ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. లోకాన్ని బాధించి వేధించే చీకటి కుట్రల సమస్యల నుండీ, మానసిక సమస్యల నుండీ తప్పించి శాంతిని ప్రసాదించేదే ఈ క్రిస్మస్! మానవుల్ని రక్షించడం కోసం నియమితుడైన క్రీస్తును ఆస్వాదించడం, ఆ రక్షణలో ఆనందించడం, అందు మమేకం కావడం, అదే ఆరాధించడం అంటే! ఇంతకూ ఆ రక్షణలో ఏముంది? ఆ రక్షణలో వెలుగుంది. పెడ దారిన పడనీయకుండా నడిపే ఆ వెలుగు, ఒక మంచి మార్గం చూపిస్తుంది. ఎక్కడో కొండల్లో, కోనల్లో లోయల్లో గొర్రెల కాపరుల్ని అర్ధ రాత్రి తోక చుక్క రూపంలో నడిపించింది, బెత్లెహేం పురానికి చేర్చింది. పశుల శాలలో శిశువు రూపాన ఉన్న చిన్ని దేవుడ్ని చూపించింది. ఆ మహాప్రకాశాన్ని ఆరాధించేట్టు చేసింది. క్రిస్మస్ అంటే వెలుగును ఆరాధించడం. దేవ శబ్దానికి కాంతి అనీ, కాంతితో పాటు అన్నీ ఇచ్చు వాడనేది మన భారతీయ ఆధ్యాత్మిక తాత్త్విక నైఘంటి కార్థం. ఆ యేసు రక్షణ కాంతితో పాటు ఇంకేమేమి ఇస్తున్నట్టు? లోకం నేడు కల్ల బొల్లి మాటల గారడీల్లో చిక్కుకు పోయింది. కుట్రలకు మోసాలకూ లోనైంది. మూఢ ఆచారాలకు, సాంఘిక దురాచారాలకు బానిసయై పోయింది. వీటినుండి రక్షింప బడడానికై అసలైన సిసలైన సత్య కాంతి అవసరం. అది ఈ బాల దేవుని దగ్గర వాక్య రూపేణా పుష్కళంగా లభిస్తుంది. మన శ్శాంతి దొరుకుతుంది. అందుకే దాన్ని అందుకోవాలనే అందరూ ఆరాధించారు. లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు తన ఏకైక ప్రియ కుమారుడ్ని తన ప్రేమ చిహ్నంగా భూమండలానికి పంపించాడు. ప్రాణానికి ప్రాణమైన ఆ తీపిప్రాణం మన మానవ కోటి రక్షణార్థంగా బలై పోయింది. ఆ ప్రభుని ప్రేమనూ, త్యాగాలనూ తమలోకి ఆహ్వానించుకోవడం, ఆయన చూపిన ప్రేమను సాటి వ్యక్తులక్కూడా అందించడమే క్రిస్మస్! – డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు (క్రిస్మస్ సందర్భంగా) -
పర్యాటకులను ఆకట్టుకునేలా సరికొత్త నినాదం... మీకిదే.. మా ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: ‘రండి.. హైదరాబాద్‌ను సందర్శించండి’ నగరం కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ టూర్లను నిర్వహిస్తున్న పర్యాటక సంస్థలు సరికొత్త నినాదంతో పర్యాటక ప్రియులను ఆకట్టుకొనేందుకు ప్రణాళికలను రూపొందించాయి. వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాలను సందర్శించేందు కు అనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు.. రెండేళ్లపాటు కోవిడ్ కారణంగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ రాకపోకలను మార్చి నుంచి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివిధ సంస్థలు, నగరానికి చెందిన పలువురు టూర్ ఆపరేటర్లు, నిర్వాహక సంస్థలు, ఇంటాక్ తదితర సంస్థలతో జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో పర్యాటకుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముచ్చింతల్‌లో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహం, యాదాద్రి, రామప్ప ఆలయం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు జాతీయ స్థాయి పర్యాటకులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో నగరానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు హైదరాబాద్ నుంచి అడ్వెంచర్ టూర్లు, హైదరాబాద్ విహంగ వీక్షణం కోసం బర్డ్ ఐ టూర్ వంటివి నిర్వహించాలని ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్రాల పర్యాటక సంస్థలను కోరారు. నేరుగా విమానాలు నడపండి.. జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతాధికారి ప్రదీప్ పాణికర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి రోజుకు 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. వారిలో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే విమానాలు పరిమితంగా ఉన్నాయి. గతంలో చికాగోకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించారు. కానీ కోవిడ్ కారణంగా ఆ సర్వీసు నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే వాటిలో చాలా వరకు కనెక్టింగ్ ఫ్లైట్లే ఎక్కువ. ఈ క్రమంలో ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పైస్‌జైట్, ఇండిగో, ఏఐఆర్, తదితర అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలతో త్వరలో ‘హైదరాబాద్ ఏవియేషన్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. (చదవండి: ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి) -
మహాపిరమిడ్ పిలుస్తోంది!
సాక్షి, కడ్తాల్(రంగారెడ్డి): మహేశ్వర మహాపిరమిడ్ .. మహిళా ధ్యాన మహాచక్రాలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం మహా పిరమిడ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడ్తాల్ –ఆన్మాస్పల్లి గ్రామాల సమీపంలో ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిర్మితమైన అద్భుత కట్టడం ఇది. ధ్యాన జనులకు స్వర్గ ధామంగా పిలవబడుతున్న మహా పిరమిడ్‌లో ఈసారి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహా చక్రాలను నిర్వహిస్తున్నారు. ఈ మహా పిరమిడ్‌లో ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ధ్యాన చక్రాలను నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం దేశ విదేశాల్లోని ధ్యానులు అంతా కలిసి ఒకే చోట ధ్యానం నిర్వహించే కార్యక్రమమే ధ్యాన మహాచక్రాలు అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది జనుల మధ్య వైభవంగా ధ్యాన సంబరాలు నిర్వహిసుంటారు. ఈ సంవత్సరం ది ఇండియన్ పిరమిడ్ స్ప్రిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు మహాపిరమిడ్‌లో మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక వసతి, వైద్యం, రవాణా సౌకర్యం, ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం.. 32,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 113.6 మీటర్ల ఎత్తుగా, 6 వేలకు పైగా ధ్యానులు ఒకే సారి ధ్యానం చేసేందుకు వీలుగా బండరాళ్లు, ఇనుముతో నిర్మించారు. పిరమిడ్ నలువైపులా పచ్చని చెట్లతో అందంగా ముస్తాబైంది. ఈ నిర్మాణం ఒక అద్భుతమని ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్ వారు గతంలోనే గుర్తించి రికార్డును అందజేశారు. ఆదే విధంగా పిరమిడ్ మధ్యలో కింగ్ చాంబర్ పాటు క్వీన్ చాంబర్ ఉన్నాయి. కింగ్ చాంబర్‌పై 500 మంది వరకు, క్వీన్ చాంబర్‌పై 250 మంది వరకు ధ్యానం చేయవచ్చు. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే ప్రాణ శక్తి మూడురెట్లు అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ధ్యానులు నమ్మకం. వలంటీర్ల నియామకం ధ్యానులకు సేవలందించేందుకు వలంటీర్లను నియమించారు. పిరమిడ్ పరిసరాలలో వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం బాలకేంద్రంతో పాటు అఖంఢ ధ్యాన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు వసతి గృహాలు, కుటీరాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల మంది ధ్యానం చేసేందుకు వీలుగా భారి ప్రాంగాణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక తయారు చేశారు. సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల రాక.. ధ్యాన మహా చక్రాలకు విశాఖ శారదా పీఠాధి పతి, స్వరూపానంద సరస్వతీ, సత్యసాయి ధ్యాన మండలి గురూజీ భిక్షమయ్య, కుండలిని యోగి శేష్బట్టర్, సుదర్శనాచార్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద్, సిద్ధయోగి అంతర్ముఖానందా, స్వరయోగి మహామాతాజీ రుషికేశ్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజూ జరిగే కార్యక్రమాలివే.. రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణుగాన సంగీతం, అనంతరం సాముహిక ధ్యానం, సందేశం, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పాటు, ధ్యాన గురువుల, ఆధ్యాత్మిక, ధ్యాన సందేశాలు 11 రోజులపాటు జరుగుతాయి. ముమ్మర ఏర్పాట్లు మహిళా ధ్యాన మహాచక్రాల కోసం మహేశ్వర పిరమిడ్ వద్ద ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. దేశం నలువైపులా నుంచే కాక విదేశాల నుంచి ధ్యానులు రానుండటంతో, వారికి కావలసిన వసతులు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజూ వేలాదిగా ధ్యానులు పాల్గొననుండటంతో వారికి ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.