ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది?
తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు.
తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం.
సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు.
బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది.
– స్వామి జగదాత్మానంద
(చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు)
Comments
Please login to add a commentAdd a comment