
దైవాన్ని స్తుతించడం, క్రతువులు చేయడం, సంప్రదాయాలు పాటించడం లాంటి పనులే దైవసంబంధమైన పనులు అనుకోవద్దు. ఈ పనులు చేస్తూ ఉంటేనే ఆధ్యాత్మికంగా ఉన్నట్టు అని అనుకోవద్దు. వీటివలన దైవానికి సంతోషం కలుగదు, పైగా దైవంతో ఐక్యం కాలేవు. అసలు దైవమంటే నీకు భిన్నం కానే కాదు.
నీ ఆత్మే దైవం. ఆత్మ దర్శనమే దైవదర్శనమంటే. ఆత్మదర్శనం కోసం చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. అత్మశోధనే ఆధ్యాత్మికత. కానీ సమాజంలో ప్రస్తుతం ఉన్న వందలకొద్దీ మతాలు ఆత్మచైతన్యం వైపు తీసుకెళ్ళడం లేదు.. మనస్సుకు సంబంధించిన విషయాలనే బోధిస్తున్నాయి. మనస్సుకు అతీతమైన ఆత్మచైతన్యాన్ని కనుగొనే దిశగా ప్రోత్సహించడం లేదు.
నిజానికి వాటి ఉద్దేశ్యం శాంతి, పవిత్రత, ప్రేమ, కానీ సమాజంలో కనిసిస్తున్నది ద్వేషం, కల్మషం, యుద్ధం. నీవు నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నట్టయితే అది నీలో పరివర్తనను కల్గిస్తుంది. నీలోని ద్వేషం, కల్మషం నశించి ప్రేమ, శాంతి జనిస్తాయి. నీవే దైవమౌతావు, సత్యాన్ని తెలుసుకుంటావు. అంటే ఆధ్యాత్మికత అనేది ఒక ప్రయాణం. దైవత్వం అనేది నీ నిజతత్వం.
కానీ ఇప్పుడు దైవమంటే ఒక వ్యక్తి అనే భావనే కనిపిస్తోంది సమాజంలో దైవత్వ నిజమైన భావాన్ని తెలుసుకోకుండా దైవాన్ని కూడా విషయ సంబంధంగా చూస్తున్నారు. విషయాలకు అతీతమైనదే దైవం. మహాశూన్యమే దైవం. ఈ క్షణంలో కాలానికీ, స్థలానికీ అతీతమై ఉన్నదే దైవం. అదే నీ నిజస్థితి. ఆ స్థితిలో ఆలోచనలే లేవు. అత్మసాక్షాత్కార స్థితిలో నమ్మకాలు, ప్రార్థనలు లాంటివి ఏవీ ఉండవు.
కేవలం శుద్ధచైతన్యమే ఉంటుంది. నీవు జన్మించిన ఉద్దేశ్యమే నిన్ను నీవు తెలుసుకోవడం, నీ నిజస్థితి ఐన ఆత్మస్థితిలో ఉండడం. నీతినియమాలు, ఆదర్శాలు అనేవి నీ మనస్సు నమ్మకాల నుంచి రావడం కాదు. నీలోని ఆత్మ చైతన్యవంతమైనపుడు నీ ప్రవర్తన సహజంగానే ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రేమ, క్షమ, కరుణ వంటి గుణాలు సహజంగానే నీలో ప్రవహిస్తాయి. సంపూర్ణ చైతన్యం నుండి వస్తాయి. అలా కాకుండా యాంత్రికంగా పాటించే నియమాలతో దైవత్వాన్ని చేరలేవు.
ఉదాహరణకు దేవాలయం కనిపించగానే అలవాటుగా లెంపలేసుకుని నమస్కరించడంలో దైవత్వం ఉండదు. అక్కడ పనిచేసేది నీ మనస్సు, నీ నమ్మకాలు మాత్రమే. దైవత్వం మనస్సుకు అతీతం. అనుక్షణం ఆత్మ చైతన్యంతో ఉండడమే నిజమైన దైవత్వం. దైవం బయట వెదికే విషయమే కాదు. సమాజంలోని నియమాలతో, నమ్మకాలతో పద్ధతులతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్న ఆధ్యాత్మికత అంతా సమాజానికి చూపించుకోవడానికి, నలుగురిలో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు.
నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం నీలోనికి నీవుచేసే ప్రయాణం. గర్భగుడిలోనికి ఒక్కరినే అనుమతించడంలోని అంతరార్థం ఇదే. సత్యాన్ని తెలుసుకోవడానికి బయటి వ్యక్తులు, మధ్యవర్తుల ప్రమేయమే అవసరం లేదు. సత్యం ఒకరు చెబితే అర్థమయ్యే విషయం కాదు. నీకు నీవుగానే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ నమ్మకాల నుండి, అహం నుండి పూర్తిగా బయటపడాలి. నేను శరీరం మనస్సు కాదు. వీటికి సాక్షిగా ఉన్న దివ్య చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యవంతమవ్వడమే ధ్యానం.
– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు
Comments
Please login to add a commentAdd a comment