మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..? | Why Is Buddha Purnima Celebrated On Vaishakha Purnima, Know Its Importance And History In Telugu | Sakshi
Sakshi News home page

Vaishakha Purnima 2024: మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?

Published Thu, May 23 2024 10:29 AM | Last Updated on Thu, May 23 2024 12:05 PM

Why Is Buddha Purnima Celebrated On Vaishakha Purnima

మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. 

ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. 

పూర్ణిమ విశిష్టత..
ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. 

బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. 
వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు.  గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. 

బోధి వృక్షానికి పూజలు..
బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. 

బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. 

తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. 

బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. 

మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.

(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement