
మన పురాణాలలో స్త్రీని శక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు. ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా ఉంటూ చుట్టూ అందరి చేత గౌరవింప బడితే అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. అయితే ఆమె శక్తి ఏమిటి? ఆ శక్తికి ఏమైనా కొలమానం ఉందా? అది ఏ విధమైన శక్తి? ఎలా పని చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ మాతాజీ నిర్మలా దేవి బోధనలలో మనకు సరైన సమాధానం లభిస్తుంది.
మన ఇతిహాసాలలో శ్రీ రాముని శక్తి సీత. శివుని శక్తి పార్వతి. శ్రీ కృష్ణుడి శక్తి రాధ. ఈ శక్తులు రాక్షస సంహారం కోసం కానీ యుద్ధం చేయడానికి కానీ రణరంగానికి వెళ్ళలేదు. శ్రీ కృష్ణుడు లేదా శ్రీ రాముడే యుద్ధం చేశారు. కానీ వారి శక్తి ప్రభావం వారి చేత యుద్ధం చేయించింది.
దీని గురించి మాతాజీ నిర్మలా దేవి ఎలా వివరిస్తారు అంటే పురుషులది గతి శక్తి... స్త్రీలది స్థితి శక్తి. ఉదాహరణకు స్విచ్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. మనకు బయటకు చూడడానికి ఫ్యాన్ తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజానికి దానిని తిప్పుతున్నది దాని లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తి. అదే విధంగా పురుషులు బయటకు పనులు చేస్తున్నట్లు కనిపించినా వారి చేత ఆ పనులు చేయించే శక్తి మాత్రం స్త్రీల శక్తియే. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే జీవశాస్త్రం ప్రకారం కణంలో ఉండే శక్తి కేంద్రాన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియా మానవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించేటప్పుడు తల్లి నుండే లభిస్తుంది. అంటే ప్రతీ మానవునికి శక్తి తల్లి నుండే లభిస్తుంది. కావున సైన్సు ప్రకారం కూడా శక్తికి మూలం స్త్రీ యే. ఈ తల్లులందరికీ మూలమైన తల్లిని హిందూ ధర్మంలో ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమెనే గ్రీకులు అథెనా అనే దేవతగా కొలుస్తారు.
శక్తి అంటే మొత్తం అన్ని శక్తులు అని, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అని కాదు. ఈ శక్తులన్నీ మన సూక్ష్మ శరీరంలో షట్చక్రాలన్నింటిపై ఉంటాయి. ఈ శక్తులు లేకుండా దేవతల ఏ పనీ జరగదు. ఉదాహరణకు శ్రీ కృష్ణుడి శక్తి శ్రీ రాధ, శ్రీ రాముడి శక్తి శ్రీ సీత; శ్రీ మహా విష్ణువు శక్తి శ్రీ లక్ష్మి. అదేవిధంగా శక్తులన్నింటి నివాసం దేవతలతో ఉంటుంది. శక్తి లేకుండా దేవతలు ఏమీ చేయలేరు. ఆ మొత్తం శక్తి అంతా శ్రీ జగదాంబగా మన మధ్య హృదయ చక్రంలో ఉంటుంది. ఈ జగదాంబ శక్తి చాలా ప్రబలమైనది. శక్తి ఆరాధన అంటే అందరు దేవతల అన్ని శక్తులకు పూజ జరుగుతుంది.
ఈ శక్తులు చెడి΄ోవడం వలన మన చక్రాలు దెబ్బతింటాయి. అందువల్ల మనకు శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఈ శక్తులను ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకే దేవిని ప్రసన్నం చేసుకోవాలని అంటుంటారు. సహజ యోగ సాధన ద్వారా మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి ని మేల్కొలపడం వలన ఈ శక్తి మరొక శక్తిని పొందుతుంది. ఈ శక్తులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఆది శక్తి యొక్క సర్వవ్యాప్త శక్తి అయిన పరమ చైతన్యంతో ఏకమవుతాయి. ఆ విధంగా ఏకమవ్వడం వలన ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది.
ఈ చిన్న చిన్న శక్తులన్నీ ఆ శక్తితో కలిసిపోతాయి. ఉదాహరణకు, మీ హృదయ శక్తి బలహీనంగా ఉంటే, అది పరమ చైతన్యంతో అనుసంధానించబడినప్పుడు, ఈ బలహీనమైన శక్తి తిరిగి బలాన్ని పొందుతుంది. ఆ సందేశం అన్ని శక్తులకు చేరుతుంది, ఇప్పుడు ఈ శక్తి బలాన్ని పొందింది కాబట్టి చింతించాల్సిన పనిలేదు అని. శక్తి స్వభావం స్త్రీ స్వభావం కాబట్టి స్త్రీని గౌరవించడం, గృహిణిని గృహలక్ష్మిగా చూడడమనేది పురుషులు నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.
స్త్రీలు తమ భర్తను, పిల్లలను గృహ సంబంధ కార్యాలను చూసుకోవాలి. కానీ భర్తకు బయటి కార్యాలకు సంబంధించి, సంపాదన, ఆర్థిక వ్యవహారాలు లాంటి అనేక పనులు ఉంటాయి కాబట్టి. అదే విధంగా పురుషులు కూడా భార్యను బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. భార్యను ఒక దేవిలా, తన గృహశక్తిలా చూడడం భర్త బాధ్యత. భార్యతో అతని అనుబంధం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది.
– డా. పి. రాకేష్
(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి
ప్రవచనాల ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment