
భగవంతుడి సృష్టిలో ఏ భేదం లేదు. దేనికి ఏది ఎంత కావాలో అంత చక్కగా అమరి ఉంటుంది. చీమకి తగిన ఆహారం దానికి అందే ఏర్పాటు ఉంది. ఏనుగుకి తగినంత దానికీ అందుతుంది. ఆహారం మాత్రమే కాదు, ఉండటానికి, తిరగటానికి, ఇత్యాదులన్నిటికి లోటు లేదు. కానీ, తెలివితేటలు ఉన్న మనిషి మాత్రం సమానత్వాన్ని చూడ లేకపోవటం జరుగుతోంది. ఎందుకు? అంటే చూసే దృష్టిలో ఉన్న తేడా వల్ల. భేదం దృష్టిలోనే కాని, సృష్టిలో కాదు.
దీనికి మనస్తత్వ శాస్త్రంలో ఒక చిన్న ఉదాహరణ చెపుతారు. ఒక పాత్రలో సగానికి నీళ్ళు ఉంటే ఆశావాది పాత్ర సగం నిండింది అంటే, నిరాశావాది పాత్ర సగం కాళీ అయిపోయింది అన్నాడట. ఒకే సత్యాన్ని ఇద్దరూ చెరొక దృష్టి కోణంలోనూ చూశారు. మోడైన చెట్టు కనపడగానే ‘‘అయ్యో! చెట్టు ఎండి΄ోయింది. చచ్చి పోయింది.’’ అని ఒకరు వా΄ోతే,‘‘రాబోయే వసంతాన్ని తనలో ఇముడ్చుకున్న గర్భవతి లాగా ఉన్నది.’’ అన్నాడట మిత్రుడు. ‘‘ఇది మంచి కొయ్య.
ఎక్కడా ముడులు, వంకరలు లేవు, సింహద్వారానికి పనికి వస్తుంది దీని కలప’’ అని ముచ్చట పడ్డాడు ఒక వడ్రంగి. ‘‘ఇది మంచి జాతి. అమ్మవారి శిల్పాన్ని చెక్కటానికి తగినది.’’ అని మురిసి΄ోయాడు ఒక దారు శిల్పి. ‘‘కావలసినన్ని కట్టెలు కొట్టుకోవచ్చు’’ అని సంబరపడ్డాడు కట్టెల దుకాణదారు. ఉన్నది ఒక్కటే ఎన్ని రకాలుగా భావించారు ఒక్కొక్కరు? అది దృష్టిలో ఉన్న భేదం. ఉన్నది ఒకటే కదా! ఒకే ఒక పరబ్రహ్మ తత్త్వాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు ఆరాధించుకునే వెసులుబాటు సనాతన ధర్మంలో ఉంది.
దానినే ఇష్టదేవతారాధన అని అంటారు. ఒకే రూపంలో, ఒకే నామంతో ఆరాధించాలి అంటే, మిగిలిన రూపాలలో దైవప్రజ్ఞ లేనట్టేనా? మిగిలిన నామాలు దైవాన్ని సూచించవా? సర్వవ్యాపి అన్న మాట సార్థకం ఎట్లా అవుతుంది? నామరూపాతీతమైన భగవంతుణ్ణి ఏరూపంతో నైనా, ఏ నామంతో నైనా ఆరాధించ వచ్చు. శివుడి రూపం నచ్చితే ఆ రూపంలో, ఆ నామంతో, అదేవిధంగా విష్ణువు, జగదంబ, గణపతి, స్కందుడు, సూర్యుడు అనే నామ రూ΄ాలతో ఆరాధించ వచ్చు. అంతే కాదు ఒకే దైవాన్ని భిన్న రూపాలలో కూడా పూజించవచ్చు. ఉదాహరణకి కృష్ణుడు.
బాలకృష్ణుడు – అందులో మళ్ళీ పోరాడే కృష్ణుడు, వెన్నముద్ద కృష్ణుడు, గోపాల కృష్ణుడు, గోవర్ధనోద్ధారి, కాళీయమర్దనుడు, మురళీ కష్ణుడు ఇలా ఎన్నో! రాధాకృష్ణుడు, పార్థసారథి .. ఇంతమంది కృష్ణులు ఉన్నారా? ఒకే కృష్ణుడు ఇన్ని విధాలుగా సందర్భాన్ని పురస్కరించుకుని కనపడుతున్నాడన్నది సత్యమా? దృష్టి లోనూ, దర్శనం అనుగ్రహించటం లోనూ ఉన్న తేడా మాత్రమే అని సరిగ్గా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టిలో ఉన్న చైతన్యం అంతా ఒకటే అయినా చూడటానికి రకరకాలుగా కనపడుతుంది పెట్టుకున్న రంగు కళ్ళజోడుని బట్టి. అంతే!
ఏ భేదాలు వచ్చినా, కలతలు, కల్లోలాలు పుట్టినా అవన్నీ దృష్టి భేదం వల్ల మాత్రమే. దీనినే వేదాంతులు ‘‘ఏకం సత్, విప్రా బహుధా వదంతి’’ అని భగవంతుడి గురించి ఏక వాక్యంలో చెప్పారు. ఉన్న భగవత్ చైతన్యం ఒక్కటే. వేదవిదులైన పండితులు అనేక విధాలుగా చెపుతారు. సనాతన ధర్మంలో ఎంతోమంది దేవతలని పూజిస్తారు అని మాట్లాడే వారికి ఈ అసలు సంగతి తెలియదు. అదెట్లా? అంటే, ఒక కుటుంబంలో ఒకే పిల్లవాడు ఉంటే, వాడికి ఎవరికి నచ్చిన వేషం వారు వేసి, తయారు చేసి ఫోటోలు తీయించి పెడితే ఇంత మంది పిల్లలు ఉన్నారా? అని అడిగినట్టు ఉంటుంది.
– డా.ఎన్. అనంత లక్ష్మి
(చదవండి: ఉభయ దేవతా పుణ్యక్షేత్రం సింగరకొండ..!)
Comments
Please login to add a commentAdd a comment