హోలీ అంటే రంగుల పండుగేనా..? కాముని పూర్ణిమ అని ఎందుకంటారు..? | Holi 2025: The History Of Holi The Hindu Festival Of Colors Significance | Sakshi
Sakshi News home page

హోలీ అంటే రంగుల పండుగేనా..? కాముని పూర్ణిమ అని ఎందుకంటారు..?

Published Thu, Mar 13 2025 4:43 PM | Last Updated on Fri, Mar 14 2025 7:03 AM

Holi 2025: The History Of Holi The Hindu Festival Of Colors Significance

'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుంచే వాడుకలో ఉంది. “హోళీక” అను రాక్షస దేవత బ్రహ్మ సృష్టించిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులవుతారుని ప్రశస్తి. ఈ హాలీ పండుగ నేపథ్యంలో అందుకు సంబంధించి.. ప్రాచుర్యంలో ఉన్న పలు కథనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించారట. దాంతో వారికి సగం-సగం శరీరభాగాలతో శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి) ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..
ఈ హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 'హోలీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ', కామునిపున్నమి', 'డోలికో త్సవం' అని రకరకాలుగా పిలుస్తారు. 

హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో ఈ పండుగ అసలు ప్రాశస్త్యం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కొడుకు విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు.

కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడమని నచ్చచెప్పి చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్ధమని చెప్పి తండ్రిమాటను ఖతరు చేయడు. ఇక్కడ హిరణ్యకశిపుడు హరివైరి. 

కనుక హరిని సేవించే తన కుమారుడిని తనకు శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన సేవకులను పిలిచి పిల్లవాడిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం వంటి దారుణాలు చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారాయణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. దీంతో ప్రహ్లదుడికి విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు.

హోళికాదహనం ఎందుకంటే..
అది గమనించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలిపిలిపిస్తాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మంటలు ఆమెను అంటుకోవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు.

"అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్చుకుని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తాను మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది.

అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. 

ఆ రోజు హోళిక దహనం కావడంతో..ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందన్న సంతోషంలో జరుపుకొనే పండుగ ఇది.

కాముని పున్నమి అని ఎందుకంటారంటే..
మరొకగాథ ప్రకారం.. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది.. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.

విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుడుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా.. ఆయన కోపంలో మన్మథుడుని చూశాడు. ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి పట్టరాని కోపంతో తన మూడవకన్ను తెరుస్తాడు.

ఆ సమయంలో శివుని కంటి నుంచి సూర్యుని కిరణాలలో ఉన్న ఏడురంగుల కాంతితో మిళితమైన ఆ భగభగ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుడిని ప్రార్ధించగా కామదేవుడైన మన్మథుడుని తిరిగి బతికించాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు. ఆ ఏడురంగుల మంటలకు గుర్తుగా రంగుల పండుగలా ఈ హోలీని జరుపుకుంటారు.

రంగులు ఎందుకు పులుముకుంటారంటే..
శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది. బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీ పండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.

కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. "రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగ రోజున రంగులు పులుముకుంటారని పురాణ వచనం.

పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి, వీధులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.

కవుల మాట్లలో హోలీ ..

"విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"

కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. 

అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-"వెలగడిమి నాడి వెన్నెల అలవడునేగాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం. ఏదీఏమైనా మన భారతీయ పండుగలు గొప్ప ఆధ్యాత్మికత తోపాటు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు కదా..!.

(చదవండి: ఎపుడూ వైట్‌ డ్రెస్సేనా? కలర్‌ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement