
రమజాన్ మాసం విశ్వాస కుసుమాలను వికసింపజేసే వరాల వసంతం. దైవ ప్రసన్నత, దైవభీతి పరాయణతల సాధనకు అనుకూలమైన రుతువు. దేవుని కారుణ్య కడలిని.ఆ యన మన్నింపు కెరటాలను ఉప్పొంగజేసే మహోజ్వలమైన మాసం. రమజాన్ ఆరంభం నుండి అంతం వరకు అపార దైవానుగ్రహాలను వర్షింపజేసే శుభాల సీజన్.
ఈ శుభ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ, తరావీహ్ నమాజులు చేస్తూ, ఖురాన్ పారాయణం చేస్తూ, బీదసాదలకు సహాయం చేస్తూ పూర్తి జీవితాన్ని దేవుని విధేయత పరిధిలో గడిపేవారు ఎంతో అదష్టవంతులు. అయితే కేవలం ఆరాధనలు చేసినంత మాత్రాన మనం రమజాన్ శుభాలను పొందలేం. రమజాన్ శుభాలకు అర్హులు కావాలంటే, అంతరంగాల్లో దైవభీతి దృఢంగా నాటుకోవాలి.
దాని ప్రభావం మన దైనందిన జీవితంలోనూ కనిపించాలి. అంటే, అన్ని విధాల చెడులను వదలిపెట్టి పరిశుద్ధమైన జీవితం గడపాలి. ‘ఎవరైనా ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు చెప్పడం, వాటిని అమలు చేయడం వదలుకోకపోతే ఆ వ్యక్తి అన్నపానీయాల్ని వదలిపెట్టడం పట్ల దేవునికి ఎలాంటి ఆసక్తి ఉండదు‘ అని ప్రవక్త(సల్లం) ప్రవచించారు.
ఉపవాసాలు పాటిస్తూ, నమాజులు చేస్తూ కూడా అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని ఆచరించడం మానుకోని వ్యక్తి కష్టపడినా ఫలితం దక్కని రైతులాంటివాడు. ఆ రైతు తీవ్రమైన ఎండలో చెమటలు చిందిస్తూ నాగలితో పొలం దున్ని విత్తనాలు చల్లుతాడు. అవి మొలకెత్తిన తర్వాత పెరగటానికి కావలసిన సదుపాయాలన్నీ కలగజేస్తాడు. రాత్రిళ్ళు మేల్కొని పొలానికి కాపలా కూడా కాస్తాడు.
కానీ పంట పండి కొన్ని రోజుల్లో చేతికి వస్తుందనగా దాన్ని వదిలేస్తాడు. దాంతో ఆ పొలం ఒక వైపు కలుపు మొక్కలు, చీడ పురుగులతో, మరోవైపు పక్షులు, పశువులు అడపాదడపా మేయడంతో పంట చేతికి రాకముందే పూర్తిగా నాశనం అవుతుంది. ఈ విషయాన్నే దైవప్రవక్త(సల్లం) ఇలా తెలిపారు:
‘ఎందరో ఉపవాసం పాటించే వారికి తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పులు తప్ప మరేమీ లభించదు. అలాగే ఎందరో తరావీహ్ నమాజ్ చేసే వారికి తమ తరావీహ్ నమాజ్ ద్వారా జాగరణ తప్ప మరేమీ ప్రాప్తం కాదు.‘
దైవభీతి పరాయణత మస్జీద్ లోనే కాదు, మస్జిద్ వెలుపల బజారుల్లో, ఇండ్లల్లో, దుకాణాల్లో, కార్యాలయాల్లో, కార్ఖానాల్లో కూడా కనిపించాలి. ఏదైనా వ్యవహారంలో తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భావన కలగాలి. మనిషిని చెడులకు దూరంగా ఉంచగలిగేది కేవలం దైవభయమే. హృదయంలో చెడు పట్ల వెగటు, మంచి పట్ల అభిమానం జనించాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, బయటి ఒత్తిళ్ళకు లొంగకుండా కేవలం దైవ ప్రసన్నత కోసం చెడులను మాని మంచిని అవలంబించాలన్న కోరిక కలగాలి. అధర్మ విషయాలను పూర్తిగా వదిలేసి దైవధర్మం మోపిన బాధ్యతలను తు.చ తప్పకుండా నిర్వహిస్తూ ఉండాలి.
ఈ విధేయతా భావం రమజాన్ నెల గడిచిపోగానే అంతరించకుండా సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలలు కూడా సజీవంగా ఉండేలా రమజాను ఉపవాసాలు శాశ్వత శిక్షణ ఇస్తాయి. హృదయంలో దైవభీతి పరాయణత, జీవిత వ్యవహారాలపై దాని ప్రభావం తాత్కాలికంగా కాకుండా జీవితాంతం ఉండినప్పుడే రమజాన్ అసలైన ఆశయం నెరవేరుతుంది.
– తహ్సీన్ హుమైర్వీ
Comments
Please login to add a commentAdd a comment