What Is Aachamanam, Know Its Meaning, Significance, Mantra, And Procedure In Telugu - Sakshi
Sakshi News home page

Aachamanam In Telugu: అసలు 'ఆచమనం' ఎందుకు చేయాలి? మూడుసార్లే ఎందుకు తాగాలి..

Published Mon, Jul 24 2023 9:58 AM | Last Updated on Mon, Jul 24 2023 11:12 AM

What Is Achamanam Meaning Significance Mantra Procedure - Sakshi

పూజలు, వ్రతాల్లో 'ఆచమనం' అనేమాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం.. అసలు అలా ఎందుకు చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే 'ఆచమనం' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో చూద్ధాం. "ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి.

ఎన్నిసార్లు అయినా చేయొచ్చు
ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు.

అంతా బాగానే ఉంది మరీ అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?. అలానే ఎందుకు తాగాలి?. ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?. మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది. “కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఎన్నో లెక్కకు మించి సందేహాలు మీమదిలో వచ్చే ఉంటాయి. పైగా దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా.

అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి.

ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.

ఒక రకంగా వ్యాయామం..
ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. 'కేశవాయ స్వాహా' అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది.

'నారాయనాయ స్వాహా' అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా 'మాధవాయ స్వాహా' అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉండటమేగాక శాస్త్రీయత కూడా ఉంది.

(చదవండి: నేటి నుంచి అధిక శ్రావణమాటాసం? అంటే ఇది డూప్లికేటా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement