పరస్తుతి, పరనింద, ఆత్మస్తుతి, ఆత్మనింద – ఈ నాలుగూ సజ్జనులు చేసే పనులు కావు అని మహాభారతంలో ఒక నీతి ఉంది. ‘అన్య కీర్తనంబు, అన్య నిందయు, తన్ను/ పరగ పొగడికోలు, ప్రబ్బికోలు,/ ఆపగా తనూజ! ఆర్యవృత్తములు కా/వనిరి వీని ఆద్యులైన మునులు...’ ఇక్కడ ‘ఆపగా తనూజుడు’ (నదీ పుత్రుడు) అంటే గాంగేయుడైన భీష్ముడు. ఆ ధర్మవేత్తకు ఈ నీతి బోధిస్తున్నది ఛేదిరాజు శిశుపాలుడు. ‘నువ్వు అదే పనిగా శ్రీకృష్ణుడినే పొగుడు తున్నావు. ఇది పెద్దలు చేయదగిన పనికాదు’ అని శిశుపాలుడి అభ్యంతరం. ఉటంకించింది శిశుపాలుడయినా, ఇది ‘ఆద్యులైన మునుల’ మాట కదా! పెద్దలిలా ఎందుకు చెప్పారో ఇంచుక చింతన చేసుకొంటే తప్పులేదు.
పరులను వాళ్ళ ఎదుటే ‘ముఖస్తుతి’ చేసే వాడు... పలచనైపోయి, ఆశ్రితుల స్థాయికి జారిపోతాడు. గౌరవం కోల్పోతాడు. పరులను వాళ్ళ పరోక్షంలో పొగిడినా, అలా పదేపదే చేస్తుంటే... దానివల్ల తనవాళ్ళకు నిరుత్సాహం కలగడమే కాక, వాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అలాగే పరనింద కూడా ప్రయోజన శూన్యం. అహంకారాన్ని ప్రకటించుకోవడమూ, శత్రుత్వాన్ని పెంచుకోవడమూ తప్ప నింద వల్ల సాధించేదేముంది? నిందను సకారాత్మకంగా స్వీకరించి, తమ ‘తప్పు’ గ్రహించి మారిపోయే ‘పరులు’ ఎక్కడయినా ఉంటారా?
చేతలే చెప్తాయి..
ఆత్మస్తుతి సరేసరి. అది సాధారణంగా అల్పత్వాన్నీ, ఆత్మ న్యూనతా భావాన్నీ సూచిస్తుంది. ధీరులూ, సమర్థులూ వాళ్ళ ఘనత వాళ్ళు చెప్పుకోరు. ఘనతను చేతలే చెప్తాయి. చేతలులోపించి నప్పుడే మాటలు. ‘నేను ఘనుడిని’ అని ఎంత చెప్పుకొన్నా దానికి విలువా, విశ్వసనీయతా ఉండవు. నమ్మేదెవరు? ఆత్మనింద కూడా ప్రమాదకరమే. ఆత్మవిమర్శతో తన తప్పులు గ్రహించుకొని, తొలగించుకొంటే మంచిదే కానీ ఊరకే తనను తాను నిందించుకొంటూ కూర్చొంటే, అది ఉన్న ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కూడా దెబ్బ తీసి, క్రమంగా మరింత పిరికితనానికీ, అసమర్థతకూ, కుంగుబాటుకూ దారి తీస్తుంది.
అయితే ఒకటి! మహాభారతమయితే ఇలా చెప్పింది కానీ ఈ రోజులలో, ఆత్మస్తుతీ, పరనిందా, దాంతోపాటు అవసరార్థం ‘తమంత వారు లేరు సుమా!’ అంటూ పరస్తుతీ, లోకం చేత ఓహో అనిపించుకొనేందుకు అప్పుడప్పుడూ ఆత్మనిందా మానేస్తే, సమా జంలో ఎక్కువగా మౌనమే రాజ్యం చేయాల్సివస్తుందేమో!
– ఎం. మారుతి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment