ధనము - ధర్మము ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ | Interesting fact about Money and Dharma | Sakshi
Sakshi News home page

ధనము - ధర్మము ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Published Sat, Feb 22 2025 1:30 PM | Last Updated on Sat, Feb 22 2025 1:36 PM

Interesting fact about Money and Dharma

బృహస్పతి మతానుసారం... ఒక మనిషికి నాలుగు విధాలుగా సంపద సిద్ధిస్తుంది. వంశపారంపర్యంగా, దైవానుకూలత కల గడం వలన, సమయానికి చేయబడిన సత్ప్రయత్నం వలన, స్నేహితుల సహాయ సహకారాలు సమృద్ధిగా లభించడం కార ణంగా – అనేవి ఆ నాలుగు విధాలు. ధర్మయుక్తమైన ధనానికి, ధనంతో సంపన్నమైన ధర్మానికి మించినవి ఈ లోకంలో మరి లేవు. ఈ రెండూ మనిషికి అమృతంతో సమానమైనవిగా పరిణమిస్తాయి. 

సుఖము, దుఃఖము – ఈ రెండింటిలో ఏదిసంభవించినప్పటికీ మనస్సు వికారానికి లోను కాకుండా వ్యవహరించడాన్ని ‘ధృతి’ అంటారు. ధర్మార్థముల సాధన కోసం, మనిషి ఏ ఏ కష్టాలను సహిస్తాడో, ఆ సహనం అంతా ఆ వ్యక్తి యొక్క ‘తితిక్ష’గా పరిగణించబడుతుంది. తోటి వ్యక్తుల సమ క్షంలో సాత్వికుడిగా గుర్తించబడడానికి మనిషి చేసే ప్రయత్నం, ఆ సహనశీలత వల్లే సఫలమవుతుంది. సదా ధర్మాచరణం వలన మాత్రమే ఒక మనిషి ఆ స్థితికి చేరుకోగలడని విజ్ఞులు చెప్పారు. తాను కష్టం చేసి సంపాదించినవి, ధర్మబద్దంగా తనకు చెందినవి తప్ప, ఇతరులకు చెందిన వస్తువులను సొంతం చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఉండడం; ఎల్లప్పుడూ స్థిరచిత్తంతో ధీరుడై ఉండడం, భయాన్ని వీడడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడు కోవడం, సదా శాంతుడై ఉండడం – ఇవి  ‘దమము’ యొక్క లక్ష ణాలుగా పరిగణించబడ తాయి. కనుక ఇంద్రియాలు బుద్ధికి లోబడి ఉండే సంయమనాన్ని సాధించడాన్ని ‘దమము’అంటారు. ‘జ్ఞానంతోనే ఆ ఉన్నత స్థితిని మనిషి సాధించగలడు’ అని వ్యాసమహర్షి మాటలలో మహాభారతం, శాంతిపర్వం, 36వ అధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం నొక్కి చెప్పింది.  

అదత్తస్యానుపాదానం దానమధ్యయనం తపః
అహింసా సత్యమక్రోధఇజ్యా ధర్మస్య లక్షణమ్‌. 

ఎవరిచేతనైనా ఇవ్వబడని వస్తువులను తీసుకోకుండాఉండడం; దానము, అధ్యయనము, తపస్సులందు కోరిక కలిగి ఉండడము; మరో ప్రాణి సౌఖ్యానికి, మనుగడకు ముప్పు కలిగే పని చేయకుండా ఉండడము, ఎల్లవేళల నిజమునే మాట్లాడ డము, కోపం తెచ్చుకోవడం అనే లక్షణాన్ని పూర్తిగా వదిలి వేయడము – ఇవి ధర్మయుక్తమైన జీవితాన్ని గడిపి సద్గతిపొందాలని కోరుకునే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలని పై శ్లోకం ద్వారా అర్థమౌతుంది.

– భట్టు వెంకటరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement