
శివగిరిపై 36 అడుగుల ఎత్తులో పంచముఖ మహాశివలింగం
12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు
40 అడుగుల ఎత్తున ఉన్న ఓంకార స్థూపం
హిమాలయాల్లోని హిందూ సాధు సంప్రదాయాల ప్రకారం పూజలు
36 అడుగుల పంచముఖ మహాశివలింగం
12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు,
40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం,
అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు.
అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు.

(ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?)
ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది.
పూజ చేస్తున్న ముస్లిం మహిళ
ఎలా వెళ్ళాలంటే...
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!)
అంతా శివయ్య మహిమే!
మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు
మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...
– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు
Comments
Please login to add a commentAdd a comment