
లోకంలో భార్యను ప్రేమించే వారు చాలామంది ఉండొచ్చు. అయితే శివుడు తన భార్యను ప్రేమించినంతగా మరొకరెవరూ ప్రేమించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి పార్వతి మీద ప్రేమ ఎంతటి గొప్పదంటే ఆమెకు తన శరీరంలో సగభాగాన్ని పంచి ఇచ్చేటంత!
శివుడి అర్ధనారీశ్వర తత్వాన్ని, శివుడిలో శక్తిగా వెలిగే అమ్మవారిని దర్శించడానికి సౌందర్యలహరిలో అనేక ఉదాహరణ లున్నాయి కానీ... మచ్చుకు మొదటి రెండు శ్లోకాలు పట్టుకుంటే చాలు.
‘శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి
అత స్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి‘
శివుడు శక్తితో కలిసినప్పుడే శక్తిమంతుడై సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు. శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు. అలాంటి నీగురించి చెప్పాలంటే గతజన్మల్లో పుణ్యం లేకపోతే...బ్రహ్మ–విష్ణు–రుద్రులకైనా సాధ్య మవుతుందా? అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట ‘శివ‘ అని అయ్యవారితో మొదలుపెట్టడంలో శంకరుడి హృదయాన్ని పట్టుకోవాలి.
‘కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్‘
శివపార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు. ఒకరు ఎక్కువా కాదు. ఒకరు తక్కువా కాదు. ఆది దంపతులు ఇద్దరూ సమానం. అమ్మవారి సౌందర్యానికి తగిన శబ్దసౌందర్యంతో సాగిన రచన ఇది. శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థగాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రక రకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం... ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టక΄ోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు.
చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు అవసరమైన శివుడి అర్ధనారీశ్వర రూపంలో ఇంకా అనేక ఆధ్యాత్మిక, యోగ సాధనా రహస్యాలు దాగున్నాయి. కాళిదాసు రఘువంశ ప్రార్థన శ్లోకాల్లో చెప్పినట్లు–
‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ‘
అని శివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి; పార్వతిలో భాగమైన శివుడికి; వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఆదిదంపతులిద్దరికీ నమస్కారం పెట్టి... లోకంలో దంపతులు కూడా అలా వేరు చేయడానికి వీల్లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం.
– పమిడికాల్వ మధుసూదన్
Comments
Please login to add a commentAdd a comment