
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ, ప్రత్యేకపూజలు, అభిషేకాలు
సాక్షి, ముంబై: ముంబైలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పశ్చిమ అంధేరితోపాటు నగరంలోని పలుప్రాంతాల్లో శివాలయాలన్నీ మహాదేవుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. అంధేరి వెస్ట్‌లోని ఆరంనగర్, వర్సోవా, ఇతర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, విశేష పూజలతో ఆధ్యత్మిక సౌరభాన్ని వెదజల్లాయి. భక్తులు శివ భజనలు, శివ తాండవ స్తోత్రాలు, ఇతర భక్తి గీతాలతో ఆది దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా జాగరణ చేశారు. గురు వారం తెల్లవారుజామున ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివి ధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాలను అందించారు.
వర్లీ, శివకృప క్రీడా మండల్ ఆధ్వర్యంలో...
వర్లీ, నెహ్రూనగర్‌లో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివ మహాపూజ, సత్యనారాయణ మహాపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇకపై ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని మండల్ నిర్వాహకులు తెలిపారు.
బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో...
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్ధ ‘ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ్’ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న పద్మావతి భవనం ఆవరణలో బుధవారం ఉదయం, సాయంత్రం వివిధ భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పలు ఆధ్యాత్మిక సేవా సంస్ధలు, తెలుగు సంఘాల ప్రముఖులు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముఖ్య అతిథి, ఆంధ్ర మహాసభ సాంస్కృతిక శాఖ మాజీ ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ శివరాత్రి ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారి సంస్ధ చేపడుతున్న వివిధ సేవా కార్యాక్రమాలను గురించి రాధా మోహన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన భక్తులందరినీ ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు బి.కే.శీతల్ బేన్, బి.కే.పుష్పబేన్, బి.కే.అరుణబేన్ ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలు పంపిణీ చేసి కానుకలు అందజేశారు.
అనంతరం సాయంత్రం జరిగిన ప్రవచన కార్యక్రమంలో యూబీటీ శివసేన ఎమ్మెల్సీ, రాష్ట్రపతి అవార్డు గ్రహిత సునీల్ శిందే, ప్రభాదేవి–దాదర్ నియోజక వర్గం ఎమ్మెల్యే మహేశ్ సావంత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్ధ ఆర్గనైజింగ్ ఇన్‌చార్జ్ డా.నాయిని రవి, తెలుగు డాక్టర్స్ అసోసియేషన్ (టీడీఎస్) అధ్యక్షుడు డా.ఎన్.ఎం.తాటి, మాజీ అధ్యక్షుడు డా.కే.ఆర్.దుస్సా, పదాధికారులు, సభ్యులు డా.స్వాతి, డా.వేముల గోదావరి, డా.పల్లాటి రాజు, డా. ఆడెపు, డా.ఎల్.ఎన్.గుడ్డేటి, డా.వేముల సుదర్శన్, డా.ఆర్.ఆర్.అల్లే, డా.శ్రీనివాస్, డా.వెంకటేశ్, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు, కార్యవర్గ పదాధికారులు ఏక్‌నాథ్ సంగం, వాసాల శ్రీహరి (వంశీ), నడిమెట్ల ఎల్లప్ప, వేముల మనోహర్, యాపురం వెంకటేశ్, షేర్ల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment