
పత్రాలు, ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
థానే: థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. థానే తెలుగు మహాసభ స్వర్ణోత్సవాలు (50 సంవత్సరాలు) జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఏర్పాట్లతోపాటు ఇటీవలే నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలకు సంబంధించి థానే లోకపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు విషయాలపై చర్చించారు. ఏప్రిల్ 6వ తేదీ వాగ్లే ఇస్టేట్ డిసూజా వాడిలోని సెయింట్ లారెన్స్ స్కూల్ హాల్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మొదటిసారిగా థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీసీతారామ కల్యాణోత్సవాల కోసం పంచలోహాల ఉత్సవ విగ్రహాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఉత్సవ విగ్రహాలను థానే తెలుగు మహాసభకు అందించేందుకు కేవీ రమణ దంపతులు ముందుకు రావడం విశేషం. మరోవైపు సీతమ్మవారికి బంగారు మంగళసూత్రం తయారుచేసి ఇచ్చేందుకు గుండా మాధురి శ్రీనివాస్ దంపతులు ముందుకురాగా పట్టువ్రస్తాలను జయశ్రీ రమేశ్ తూము దంపతులు అందించేందుకు ముందుకొచ్చారు. పానకం వడపప్పు ప్రసాదాన్ని విజయ బులుసు దంపతులు అందిచేందుకు ముందుకు వచ్చారు. తెలుగు బ్రాహ్మణ సంఘం శ్రీసీతారామ కల్యాణోత్సవాలలో వచ్చే వారందరికీ భోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇటీవలే శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడంలో కృషి చేసిన వారందరినీ అభినందించారు. 1974లో ఏర్పాటైన థానే తెలుగు మహాసభ గత కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ గుప్తా, కార్యదర్శి శివకుమార్‌ల టీమ్ నేతృత్వంలో మరోసారి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఇప్పటికే అత్యంత ఘనంగా శ్రీనివాస కల్యాణోత్సవాలు జరిపిన అనంతరం మరింత ఉత్సాహంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన సమావేశాల్లో థానే తెలుగు మహాసభ అధ్యక్షుడు ఏవీ గుప్తా, గౌరవ అధ్యక్షుడు బీవీహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎన్.జగదీశ్ రావు, కార్యదర్శి శివకుమార్, కోశాధికారి పద్మజ, మంజుల, ఎంఎస్ కిశోర్, జగన్నాథరావు, జయశ్రీ తూము, రమణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment