sriramanavami celebrations
-
నాడు పొగడ చెట్టు నీడలో..రామయ్య పెళ్లి పెద్దలు వీరే! సీతమ్మవారి మూడు సూత్రాల ముచ్చట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడన సీతారాముల కల్యాణం నిర్వహించేవారని అర్చకులు చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో భక్తుల సంఖ్య పెరగడంతో పెళ్లి వేదికను చిత్రకూట మండపంలోకి మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. చిత్రకూట మండపంలో అంతమంది పెళ్లి చూడటం కష్టం కావడంతో కల్యాణ వేడుకను బయట జరిపించాలని నిర్ణయించారు. దీంతో 1964లో ఉత్తర ద్వారానికి ఎదురుగా ప్రత్యేకంగా కల్యాణ మండపం నిర్మించారు. 1998లో ఎన్టీఆర్ హయాంలో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా గ్యాలరీ నిర్మించారు. అప్పటి నుంచి కల్యాణ వేడుక జరిగే ప్రదేశాన్ని మిథిలా స్టేడియంగా పిలుస్తున్నారు. ఆ తర్వాత స్టేడియంలో గ్యాలరీపై ఎండా, వానల నుంచి రక్షణ కోసం షెడ్డు నిర్మించారు. పెళ్లి పెద్దలు వీరే.. శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి కుటంబాలకు చెందిన అర్చకులను నియమించారు. వంశపారంపర్యంగా వీళ్లే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇందులో నవమి వేడుకల బాధ్యతలను వంతుల వారీగా ఈ కుటుంబాలు నిర్వహిస్తుంటారు. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల్లో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలు అందించే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికీ సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్విక్‌లు ఉంటారు. వీరికి పూజా సామగ్రి అందించేందుకు ఇద్దరు చొప్పున నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధ్వర్యులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరినీ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తూ, కల్యాణతంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా పూర్తి చేసేలా స్థానాచార్యులు స్థలశాయి ‘పెద్ద పాత్ర’ను నిర్వర్తిస్తారు. సీతమ్మ వారి మంగళసూత్రాలు ప్రత్యేకం.. మూడు సూత్రాల ముచ్చట భద్రాచలం దివ్యక్షేత్రంలో సీతమ్మ వారి మంగళసూత్రాలకు ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉన్నాయి. నూతన వధువుకు మాంగళ్యధారణ సమయంలో రెండు మంగళసూత్రాలు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటి వారు, రెండోది మెట్టింటి వారు చేయిస్తారు. అయితే, భద్రాచలంలో సీతమ్మ వారికి రామచంద్ర స్వామి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ చేస్తారు. సీతమ్మ వారికి పుట్టింటి, మెట్టింటి వారితో పాటు భక్త రామదాసు కూడా సీతమ్మ తల్లిని కుమార్తెగా భావించి మరో సూత్రాన్ని చేయించాడు. ఈ మంగళసూత్రాన్ని పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి ముందుంచి ప్రత్యేక పూజలు చేస్తారు, ఒక్క సీతమ్మ వారికే ఇలా మూడు సూత్రాలతో మంగళధారణ జరిగే శుభ సన్నివేశాన్ని చూసిన భక్తులు పునీతులవుతారు. -
రాజాధిరాజుగా రామయ్య..
కల్యాణ రాముడు పట్టాభి రాముడయ్యాడు. వేద పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో రజత సింహాసనాన్నిఅధిష్టించారు. భక్తుల కరతాళధ్వనుల మధ్య.. రామనామ స్మరణ నడుమ.. రాజాధిరాజుగామురిసిపోయారు. వేడుకలను తిలకించేందుకువేలాదిగా వచ్చిన భక్తులు ఆ అపురూప ఘట్టాన్ని చూసి ధన్యులయ్యారు. చర్ల(భద్రాచలం): భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషిక్తుడయ్యారు. శిల్పకళా శోభితమైన మిథిలా స్టేడియం కల్యాణ మండపంలో సోమవారం కనుల పండువగా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణం జరిగిన మరుసటిరోజు శ్రీరామ పట్టాభిషేం నిర్వహించడం ఆనవాయితీ. ముక్కోటి దేవుళ్లలో ఎవరికీ లేని ఆ భాగ్యం ఒక్క శ్రీరామచంద్రుడికే ఉందని, పట్టాభిషేకం జరిగితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు తెలిపారు. అర్చక స్వాముల మంత్రోచ్ఛరణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ.. జై శ్రీ రాం.. జైజై శ్రీరాం.. అనే భక్తుల రామనామస్మరణతో మిథిలాస్టేడియం మార్మోగింది. తొలుత గర్భగుడిలో ప్రత్యేక పూజలందుకున్న తర్వాత భద్రగిరీశుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఆశీనులను చేసి గిరి ప్రదక్షణ చేయించారు. అనంతరం రామభక్తుల జయజయ ద్వానాల నడు మ మాఢ వీధుల్లో ఊరేగించారు. పట్టాభిషేక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన గవర్నర్ నరసింహన్ దంపతులు దంపతులు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకొని ఆలయం నుంచి స్వామి వారి ఊరేగింపులో పాల్గొని మిథిలా స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పకళా శోభితమైన మండపంపై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చక స్వా ములు పట్టాభిషేక కార్యక్రమానికి నాంది పలికారు. పట్టాభిషేకం... రామయ్యకే సొంతం ... ముక్కోటి దేవుళ్లలో ఒక్క శ్రీరాముడికి తప్ప మరెవ్వరికీ పట్టాభిషేక యోగం లేదని అర్చక స్వాములు తెలిపారు. తొలుత విశ్వక్సేన పూజ, వేడుకకు వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యాహవచనం చేశారు. పట్టాభిషేకానికి హాజరైన భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలంటూ పుండరీకాక్ష నామస్మరణ చేసి భక్తులకు సంప్రోక్షణ చేశారు. శ్రీరామనవమి మరుసటి రోజైన దశమిని దర్మరాజు దశమి అంటారని, ఈ రోజు మహాపట్టాభిషేకం జరిగితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు వివరించారు. పవిత్ర గోదావరి నదీ జలాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర, సహస్ర నామార్చన, సువర్ణ పుష్పాలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించారు. మండపంలో పంచ కుండాత్మక పంచేష్టి సహిత చతుర్వేద హవన పురస్కృతంగా క్రతువును జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన రజత సింహాసనంపై శ్రీ సీతారాముల వారిని పట్టాభిషిక్తుడిని చేశారు. ఒక్కో ఆభరణాన్ని ధరింపజేస్తూ... పట్టాభిషేకం సందర్భంగా భక్తరామదాసు శ్రీ సీతారామచంద్రమూర్తులకు చేయించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా భక్తులకు చూపిస్తూ వాటి విశిష్టతను వివరిస్తూ స్వామి వారికి ధరింపజేశారు. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, బంగారు కిరీటాలను అలంకరింపజేశారు. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన చైత్ర పుష్యమి ముహూర్తంలోనే భద్రాచలంలో కూడా పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీ అని వేదపండితులు వివరించారు. 60 ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ప్రయుక్త సామ్రాజ్య పట్టాభిషేకం, ప్రతీ ఏటా కల్యాణం జరిగిన మరుసటి రోజు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోందని, భక్త రామదాసు కాలం నుంచీ ఇదే సంప్రదాయం కొనసాగుతోందని తెలియజేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించిన వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పారు. వేడుక పూర్తయిన తరువాత స్వామి వారి అభిషేకంలో ఉపయోగించిన పుణ్య జలాలను భక్తులపై చల్లారు. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు... పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్యకు గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్న ఆయన తొలుత రామాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు పూజలు చేశారు. హాజరైన ప్రముఖులు వీరే ... మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి మహాపట్టాభిషేక కార్యాక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీ గౌతమ్ తదితరులు హాజరయ్యారు. నేడు రామయ్యకు మహదాశీర్వచనం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీసీతారాముల కల్యాణం జరిగిన రెండో రోజున రామయ్యకు దేశంలోని 508 మంది వేదపండితులచే మహదాశీర్వచనం చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, బాలభోగ నివేదన, హవనం, సేవాకాలం, బలిహరణం, మంగళాశాసనం నిర్వహిస్తారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు భద్రుని మండపంలో అభిషేకం, 12.30 నుంచి 1 గంట వరకు ఆరాధన, రాజభోగం జరుపుతారు. 3.30 నుంచి 6 గంటల వరకు వేదస్వస్తి, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహదాశ్వీరచనం, వేద సాహిత్య సదస్సు, హంస వాహన సేవ నిర్వహిస్తారు. -
'శోభా'యమానం
అబిడ్స్/జియాగూడ: శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీధుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. యాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సమితి నాయకుడు డాక్టర్ భగవంతరావు ఆధ్వర్యంలో శోభాయాత్రను కనుల పండువగానిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఆధ్వర్యంలో ధూల్‌పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేక బ్యాండ్ మేళాలు, డీజేలు, యువత ఆటాపాటలతో శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. సీతారాంబాగ్, గంగాబౌలి నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులో కలిశాయి. జాలిహనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్‌బజార్, చుడీబజార్, బేగంబజార్, ఛత్రి, సిద్ధిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్ మీదుగా హనుమాన్ వ్యాయమశాల వరకు శోభాయత్ర కొనసాగింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక నేతలు భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కార్పొరేటర్ శంకర్‌యాదవ్, బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు బంగారు సుధీర్‌కుమార్, మహేందర్ వ్యాస్, యమన్‌సింగ్, టీఆర్ఎస్ నేత గోవింద్‌రాఠి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బీజేపీ గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు బండారి రాధిక తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ.. భారీ బందోబస్తు శోభాయాత్ర మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బేగంబజార్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్ ప్రాంతాల్లోని వీధుల్లో రద్దీ నెలకొంది. కాషాయ జెండాలు చేతబూని యువత సందడి చేశారు. శోభాయాత్రలో ప్రదర్శించిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతమాత, చత్రపతి శివాజీ మహరాజ్, వానరసేన, శ్రీరామ్ మహావిగ్రహం (కన్నులు మూస్తూ తెరుస్తూ ఉండడం విశేషం), సీతారాముల పల్లకి సేవ, రాధాకృష్ణులు, రాణి అవంతిబాయి, హనుమాన్‌పై శ్రీరామ్ రామబాణం తదితర విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు రణవీర్రెడ్డి, చాంద్‌పాషా, శంకర్ బందోబస్తును పర్యవేక్షించారు. జై అనాల్సిందే.. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతమాతకు జై అనాలని, లేని పక్షంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా అన్నారు. శోభాయాత్రలో భాగంగా బేగంబజార్‌లో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భారత్‌మాతాకీ జై’ అంటూ యువత నినదించాలన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. హిందూ మనోభావాలను పెంపొందించేందుకు తన జీవితాంతం కృషి చేస్తానన్నారు. ఐక్యంగా మెలగాలి.. హిందువులు ఐక్యంగా ఉంటూ హిందూ ధర్మాన్ని దశదిశలా చాటాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జితేంద్రా ఆనంద్ సరస్వతి పిలుపునిచ్చారు. బేగంబజార్‌లో ఆయన మాట్లాడుతూ... హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల పట్ల చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం..
శ్రీరామనవమి వేడుకలు ఆదివారం జిల్లాలో కనులపండువగా సాగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ కల్చరల్ : రెండో భద్రాచలంగా పేరుగాంచిన జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ కమనీయంలా సాగింది. మందుగా సేవపై స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీటలపై ప్రతిష్టింపజేశారు. ముందుగా విశ్వక్సేనారాధన నిర్వహించి కల్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింపజేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు రక్షాబంధనాలను సీతా అమ్మవారి, రాముల వారి ముంజేతికి అలంకరింపజేశారు. సుముహూర్తం ప్రారంభం కాగానే అర్చకులుల అమ్మవారి, స్వామివారి తలలపై జీలకర్రబెల్లం అలంకరించారు. మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి రాములవారి చేతులకు తాకించి సీతాదేవి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు జయజయధ్వానాలు పలికారు. చివరగా తలంబ్రాలను సీతారాముల తలలపై ఉంచి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ముగింపజేశారు. అంతకుముందు ఉదయం అమ్మవారికి, స్వామివారికి కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నివాసం, నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసావాల నుంచి పట్టువస్త్రాలను మంగళవాద్యాలతో తోడ్కొని వచ్చి అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి–రమాదేవి దంపతులు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఆలయ ఈఓ ముకిరాల రాజేశ్వరశర్మ, ఆలయ స్థానాచార్యులు శ్రీరంగాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాల్‌రావు, సంధ్యారాణి, అక్కెనెపల్లి పద్మ, బుక్కా ఈశ్వరయ్య, మునాస వెంకన్న, జీనుగు జ్యోతి, ప్రధాన అర్చకులు సముద్రాల యాదగిరియాచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందన భట్టాచార్ పాల్గొనగా కార్యక్రమాన్ని భక్తులకు తన వ్యాఖ్యానంతో కన్నులకు కట్టినట్లు శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడి ఆలయం స్థానాచార్యులు పరాశర లక్ష్మీనర్సింహాచార్యులు వివరించారు. భక్తులకు మంచినీటి సౌకర్యం.. కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులు నల్ల గొండ గీతా విజ్ఞాన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. రామాలయం వలంటీర్లు భక్తుల వద్దకు వెళ్లి గోత్ర నామాలను రాసుకుని, వారందించే కట్నకానుకలను నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు ఓఆర్‌హెచ్ ప్యాకెట్లను, జ్వరం మాత్రలను, ఇతర మందులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశా వర్కర్ విజయలక్ష్మి తదితరలు పాల్గొన్నారు. -
అంతా ఆర్భాటమే..
రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాణిక్యాలరావు హామీ నిలుపుకోని సర్కార్ నాలుగు నెలలైనా విడుదల కాని నిధులు ప్రతిపాదనలకే పరిమితమైన అభివృద్ధి పనులు రామతీర్ధం(నెల్లిమర్ల) : రాష్ట్రంలోనే అతిపెద్ద సీతారాముల ఆలయమైన రామతీర్థాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. దేవస్థానంలో ప్రతి ఏటా అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతేగాకుండా ఆలయంలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇదీ ఈ ఏడాది మార్చిలో రామతీర్థం దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు స్వయంగా ఇచ్చిన హామీ. అయితే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో దేవస్థానంలో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వివరాల్లోకి వెలితే.. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించాలనే విషయమై కడప జిల్లాలోని అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట, జిల్లాలోనే అతి పెద్దదైన రామతీర్థం దేవస్థానాల మధ్య అప్పట్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చివరకు ఒంటిమిట్టలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు, సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్టతో పాటు రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా అదే నెలలో జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఆ సమయంలో దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒంటిమిట్టతో సమానంగా రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. ఆయన హామీ మేరకు ఆలయంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఏప్రిల్‌లో దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు దక్షిణ గోపుర నిర్మాణం, తదితర పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి హామీలిచ్చి నాలుగు నెలైనా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ సమయంలో భక్తులను శాంతింపజేయాలనే ఉద్ధేశంతోనే మంత్రి అలా ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఒంటిమిట్టలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంటే ఆ ఆలయంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రామతీర్థాన్ని మాత్రం పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి రామతీర్థంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు
ఖమ్మం: శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో నేడు శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వామి వారిని దర్శించుకొని ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అంతేకాకుండా శ్రీరాముని పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానుండటం విశేషం. -
రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రాముడి పెళ్లికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన భక్తులు గోటితో వలిచిన ఈ తలంబ్రాలను మంగళవారం ఆల యంలో సమర్పించారు. ఉభయగోదావరి, వైజాగ్ జిల్లాల నుంచి భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా రామాలయానికి వచ్చారు. తలంబ్రాలను అంతరాలయంలోని మూలమూర్తుల పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ‘బ్రహ్మోత్సవా’లకు అంకురారోపణం వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురారోపణం చేశారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాన్ని తీసుకొచ్చారు. అనంతరం మూలమూర్తుల వద్ద బ్రహ్మోత్సవాలకు అర్చకులు అనుజ్ఞ తీసుకున్నారు. -
శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం
ఖమ్మం: భద్రాచలంలో సీతారామస్వామి ఆలయంలో రామయ్య పెళ్లి పనులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వేద పండితుల స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని తిలకించారు