రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాణిక్యాలరావు
హామీ నిలుపుకోని సర్కార్
నాలుగు నెలలైనా విడుదల కాని నిధులు
ప్రతిపాదనలకే పరిమితమైన అభివృద్ధి పనులు
రామతీర్ధం(నెల్లిమర్ల) : రాష్ట్రంలోనే అతిపెద్ద సీతారాముల ఆలయమైన రామతీర్థాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. దేవస్థానంలో ప్రతి ఏటా అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతేగాకుండా ఆలయంలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇదీ ఈ ఏడాది మార్చిలో రామతీర్థం దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు స్వయంగా ఇచ్చిన హామీ. అయితే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నాలుగు నెలలైనా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో దేవస్థానంలో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వివరాల్లోకి వెలితే..
రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించాలనే విషయమై కడప జిల్లాలోని అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట, జిల్లాలోనే అతి పెద్దదైన రామతీర్థం దేవస్థానాల మధ్య అప్పట్లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే చివరకు ఒంటిమిట్టలోనే ఉత్సవాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు, సాధువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్టతో పాటు రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అంతేగాకుండా అదే నెలలో జరిగిన ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఆ సమయంలో దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ 1.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒంటిమిట్టతో సమానంగా రామతీర్థం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీలు గుప్పించారు. ఆయన హామీ మేరకు ఆలయంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఏప్రిల్‌లో దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు.
ఆలయ ప్రధాన ద్వారంతో పాటు దక్షిణ గోపుర నిర్మాణం, తదితర పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మంత్రి హామీలిచ్చి నాలుగు నెలైనా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ సమయంలో భక్తులను శాంతింపజేయాలనే ఉద్ధేశంతోనే మంత్రి అలా ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఒంటిమిట్టలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంటే ఆ ఆలయంతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రామతీర్థాన్ని మాత్రం పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి రామతీర్థంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతా ఆర్భాటమే..
Published Mon, Aug 3 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement