
ఒక యువకుడు జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఎంత ఖర్చు అయినా భరించాలనుకున్నాడు. అనేక దూర్ర ప్రాంతాలకు వెళ్ళి పెద్దపెద్ద గ్రంథాలయాల్లోని పుస్తకాలు తిరగేశాడు. మేధావులుగా గుర్తింపబడిన పెద్దలను కలిశాడు. చర్చల్లో పాల్గొన్నాడు. ఎన్నో సమావేశాలకు హాజరయ్యాడు. ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. ఏ గురువునైనా ఆశ్రయిస్తే సమాధానం దొరుకుతుందని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. ఎక్కడైనా మంచి గురువు దొరుకుతాడేమోనని వెదుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. వెదకగా వెదకగా నదీ తీరాన ఒక ఆధ్యాత్మిక గురువు కూర్చుని ఉండటం కనిపించింది. ఆ గురువు ముఖంలో తేజస్సు కనిపించింది. తనకి సరైన సమాధానం ఆ గురువు వద్ద దొరుకుతుందని చాలా సంతోషపడ్డాడు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన మనసులోని భావం చెప్పాడు. తనను శిష్యుడిగా గుర్తించమన్నాడు. దానికోసం ఎంత మూల్యమైనా చెల్లిస్తానని చెప్పాడు.
చదవండి: అమర్‌నాథ్ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!
చిరునవ్వుతో గురువు ‘‘మొదట నేను చెప్పినట్లు చేయి. తర్వాత ఆలోచిద్దాం’’ అన్నాడు. చిన్న బిందెను చేత పట్టుకున్న గురువు ఆ యువకుడిని నది దగ్గరకు తీసుకెళ్ళాడు. నదిలోని నీళ్ళను బిందెతో తీసుకుని యువకుడికి ఇస్తూ ‘‘ ఈ నీళ్ళకు నువ్వు డబ్బు చెల్లించాలి’’ అన్నాడు. ఆ యువకుడు వింతగా చూస్తూ ‘‘నది ఎవ్వరికీ స్వంతం కాదు కదా. అది ప్రకతిలో ఒక భాగం కదా, దానికి డబ్బులు ఇవ్వమంటున్నారేమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు.
గురువు ఆ యువకుడిని దగ్గరికి పిలిచి ‘‘నదిలోని నీళ్ళు నేనైనా నువ్వైనా... ఎవ్వరైనా తీసుకోవచ్చు. అది అందరికీ స్వంతం. ఓపికగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించు. జీవిత పరమార్థం తెలుసుకోవడానికి మాత్రం నా అవసరం ఏముంది? అది నీకు నీవుగా లోతుకు వెళ్ళి తెలుసుకునేది. అది ఒకరు ఇచ్చేదీ కాదు, మరొకరు తీసుకునేదీ కాదు. ఎవరికి వారు అనుభూతి చెందేది. దాని ఖరీదు అమూల్యం’’ అన్నాడు. ‘నిజమే... అది ఎక్కడో దొరికేది కాదు. డబ్బు ఖర్చు చేస్తే వచ్చేది కాదు. శోధించడం ద్వారా మనకు మనం తెలుసుకొనేది’ అని అవగాహన చేసుకున్న ఆ యువకుడు అక్కడినుంచి కదిలాడు.
– ఆర్.సి. కృష్ణ్ణస్వామి రాజు