Philosophical
-
అవసరం : తాత్వికథ
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. ఆయన మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా చెప్పిన వ్యక్తి. ఓసారి ధనవంతుడొకడు ఆయనను చూడ్డానికి వచ్చాడు. ఆ గురువుకు దణ్ణంపెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు ఇచ్చాడు.గురువు ఆ సంచీని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు గురువు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది’’ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు స్వామీ!’’ చెప్పాడు ధనవంతుడు.‘సంతోషం’ అంటూనే ధనవంతుడి వంక చూసి‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ...’’ అని అడిగారు గురువు.‘‘అవునండీ ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాస్సేపు తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే కదండీ రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నానండీ’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బుసంచీని తిరిగి ధనవంతుడికే ఇచ్చేశారు. ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... ఇదిగో ఈ సంచీ మీ దగ్గరే ఉంచుకోండి‘‘ అన్నారు గురువు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. కనుక ఉన్న దానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది.– యామిజాల జగదీశ్ ఇదీ చదవండి : అహం బ్రహ్మాస్మి హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ఎన్ని చదివాం, ఎన్ని విన్నామనేది కాదు! అసలు..
మనం ఏ విషయాన్ని నిర్ణయించాల్సి వచ్చినా ‘‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ...’’ శాస్త్రమే ప్రమాణం. మనకు బుద్ధికి తోచిన దానితో నిర్ణయం చేయడం సనాతన ధర్మంలో భక్తి అనిపించుకోదు. మనం ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం... అని కాదు ఎన్ని ఏ మేరకు పాటిస్తాం అన్నది ప్రధానం. ఈ విషయాన్నే రామాయణంలో సీత ‘ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తనే / తథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జితా..’ అంటూ రావణాసురుడికి బోధ చేస్తుంది.అలా మనం ఏదయినా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు ప్రమాణం శాస్త్రం. పుట్టుకతో ప్రతివారికీ మూడు రుణాలుంటాయి.. అని శాస్త్రం అంటుంది. అవి రుషి రుణం, దేవరుణం, పితృరుణం. ‘నేనెప్పుడు చేశానండీ ఈ రుణాలు, నేనెలా రుణగ్రస్తుడనయ్యాను’ అన్న ప్రశ్న అన్వయం కాదు. శాస్త్రవాక్కు కనుక అందరికీ ఉంటుంది. వీటిలో ఒక రుణం విషయంలో మాత్రం దానిని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ అవసరం ఉండదు. అది రుషిరుణం. సనాతన ధర్మంలో మనందరం రుణపడి΄ోయింది రుషులకు. మంత్రానికి రుషి ద్రష్ట. వేదమంత్రాలను ధ్యానంతో దర్శించి, విని మనకు స్వరంతో అందించాడు. ఆయన కూడా మనలాగే జీవించినవాడే అయినా రుషి తర్పణం అని... రుషికి వేరు తర్పణం ఉంటుంది.రుషి మన నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆశించలేదు, ఏ సత్కారాన్నీ, ఏ బిరుదునూ కోరుకోలేదు. కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమని, మనందరికీ కటికచీకటిలో కాంతిరేఖ కనపడాలని, మన జీవితాలు సుసంపన్నం కావాలని, మార్గం చూపించాలని వేదాల ద్వారా అందించి ధర్మానుష్ఠానికి ప్రమాణాన్ని కల్పించాడు. అలాగే ఒకవేళ మనం ఇవన్నీ చదవగలమో లేదో, స్వరంతో మంత్రం చెప్పగలమో లేదో, మంత్రభాష్యాన్ని అర్థం చేసుకోగలమో లేదో, అసలు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అన్న అనుమానంతో రుషులు పురాణాలను ఇతిహాసాలుగా అందించారు.వ్యాసభగవానుడు 18 పురాణాలను అందించాడు. ‘‘నమో’స్తు తే వ్యాస విశాల–బుద్ధే/ఫుల్లరవిందయత –పత్ర–నేత్ర/యేన త్వయా భారత–తైల–పూర్ణః/ప్రజ్వలితో జ్ఞాన–మయః ప్రదీపః’’ అంటారు. అంతటితో ఆగకుండా ఆయన పరమ దయాళువై వేదాల సారాన్ని అందరూ చదువుకుని అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు. వేదం చదువుకుంటే ఏది తెలుస్తుందో మహాభారతం చదువుకున్నా అదే తెలుస్తుంది.సూర్యవంశాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ద్వారా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ‘‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే /వేదః ప్రచేతసదాచిత్ సాక్షాత్ రామాయణాత్మనాః’’ వేదములు ప్రతి΄ాదించిన బ్రహ్మము రామచంద్రమూర్తిగా వస్తే ఆ వేదమే రామాయణ కావ్యంగా వచ్చింది. వేదం ఏం చెప్పిందో తెలియనప్పుడు రామాయణం చదువుకుంటే చాలు. మనకు ఆ ప్రయోజనం నెరవేరుతుంది. రాముడు ఏ పరిస్థితుల్లో ఏం చేసాడో, మానవాళికి అదే వేదం విధించిన కర్తవ్యం కూడా. అందుకే ఎవరయినా అత్యంత విశ్వాసంతో ఒక విషయాన్ని తదేక దృష్టితో నమ్మి ఆచరించేవారయితే ‘రుషి సమానులు’ అంటారు. ఆయన ఒక ‘రుషి’ అంటారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కొత్త విభాగాల్లోకి తత్వ హెల్త్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న తత్వ హెల్త్ అండ్ వెల్నెస్ కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలే కేసరి బ్రాండ్ పేరుతో కుంకుమ పువ్వు అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ త్వరలో డ్రై ఫ్రూట్స్ విపణిలోకి ప్రవేశిస్తోంది. వివిధ దేశాల నుంచి నాణ్యమైన రకాలను సేకరించి ఇక్కడ విక్రయిస్తామని తత్వ హెల్త్ ఎండీ సచిన్ జైన్ తెలిపారు. సాఫ్రాన్ టీ, మిల్క్‌ను సైతం ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో కేసరి బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా నేషనల్ సేల్స్ మేనేజర్ కె.గురుప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంకుమ పువ్వు అత్యధికంగా పండే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాదిన కుంకుమ పువ్వును తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారని వివరించారు. భారత్‌లో సాఫ్రాన్ అమ్మకాల్లో 70-80 శాతం నకిలీదేనని అన్నారు. కశ్మీర్లో ఈ ఉత్పాదన సాగు పెంచేందుకు స్పైస్ బోర్డ్‌కు ప్రతిపాదన చేశామన్నారు. -
‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!!
పాటతత్వం ఓరోజు పూరీ జగన్నాథ్ నన్నో పాట రాయమని అన్నారు... ‘నేనింతే’ సినిమా కోసం. ఐటెమ్ సాంగ్. అంతకుముందు ‘పోకిరి’లో ‘ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే’ రాశాను. అయితే ఈసారి పాట అలా ఉండకూడదని, ఫిలసాఫికల్‌గా ఉండాలని అన్నారాయన. ఐటెమ్ సాంగ్ అంటే తన అందాల గురించే పాడాలా, మంచి ఫిలాసఫీ చెప్పకూడదా అన్నది ఆయన ఆలోచన. చాలా గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనకు రూపమివ్వడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు నా మనసులో మెదిలిన మొదటి ఫిలాసఫీ... కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు ఈ జీవితం. దాన్ని ఆధారంగా చేసుకుని నా కలం కదిలింది. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల’ అన్న పాట పుట్టుకొచ్చింది. ఫిలాసఫీ అనగానే పెద్ద పెద్ద పదాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మంచి విషయమైనా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ఇది సినిమా పాట కాబట్టి నేల టికెట్ తీసుకున్న మాస్ ప్రేక్షకుడి మనసులోకి పాట చొచ్చుకుపోగలగాలి. అందుకే ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పదాలు వేసుకుంటూ పోయాను. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల/ఏలాల ఏలాల... దునియానే ఏలాల... చకచకచక చెడుగుడు ఆడాల’ జీవితం చాలా చిన్నది. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. మధ్యలో ఉండే జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి సాధించాలి. ‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే/ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే’ చాలామంది అవకాశాలు రాలేదని బాధ పడిపోతూ ఉంటారు. అది నిజం కాదు. అవకాశాలు వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు గుర్తించం. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ‘చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే/నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా/నీకై మిగిలివుంది ఇక ఈరోజు/ టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ రిస్కే లేని లైఫులూ బోరు బోరే’ జీవితమన్నాక సంతోషంతో పాటు బాధ, కష్టాలు కూడా ఉంటాయి. వాటిని పాజిటివ్‌గా తీసుకుని ముందుకెళ్లిపోవాలి తప్ప తిట్టుకుంటూ కూర్చుంటే ముందుకుపోలేం. ‘నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా బోల్డంత సంపాదించినా ఒరే నాన్నా పొంగిపోకురా/ గెలుపెవ్వడి సొత్తు కాదురా అది నీతో మొదలవ లేదురా/అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా’ ఓడిపోతే కుంగిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీదే తొలి పరాజయం కాదు. అలాగే గెలిస్తే పొంగిపోకూడదు. ఎందుకంటే నీదే తొలి విజయం కాదు. గెలుపోటములన్నవి అనుకోకుండా వస్తాయి. అయితే గెలవొచ్చు. లేదంటే ఓడొచ్చు. దేనినైనా ఒకేలా స్వీకరించాలి. ‘నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే/పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే/ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే/పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం/దాన్నే మరచిపోవడం వింతేగా’ బస్టాండులో నిలబడితే బస్ వస్తుంది. ఎక్కుతాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే ఫ్లయిట్ వస్తుంది. ఎక్కుతాం. అలాగే జీవితంలో పైకి వెళ్లాలంటే ఏదో ఒక మార్గం ఎంచుకోవాలిగా! పడిపోయి అక్కడే ఉండిపోతే ఎక్కడికి వెళ్ల గలం? బాల్యంలో తప్పటడుగులు వేస్తూ పడి పోతాం. కానీ లేచి మళ్లీ అడుగులేస్తాం. నడక నేర్చుకుంటాం. కానీ పెద్దయ్యాక పడిపోతే మాత్రం ఎందుకు లేవం? పడినచోటే ఎందుకు ఉండిపోతాం? పొరపాట్లు చేయడం సహజం. కానీ విజయం సాధించిన తర్వాత అవి మరుగున పడిపోతాయి. ఏమీ చేయకుండా ఖాళీగా తిరిగి, అల్లర్లు చేసి, గొడవల్లో ఇరుక్కుని చెడ్డపేరు తెచ్చుకుంటాడో వ్యక్తి. అతడు ఉన్న ట్టుండి మారిపోయి, ఏ విదేశాలకో వెళ్లి సెటిలై పోయాడనుకోండి, తన తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడనుకోండి... అతడి పాత జీవితం ఎవరికైనా గుర్తుకొస్తుందా! ‘నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసేయ్ రోజుకొక్కటీ/ఇక ఆపై జడుపే రాదురా’ మనకు ఏదంటే భయమో దాన్ని చూసి పారిపోతుంటాం. అలా కాకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తే ఆ భయం పోతుంది. ఇలా స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటలు ఇందులో రాశాను. నిజానికి నేను పాటించే సూత్రాలే అవన్నీ. అందుకే ఆ మాటల్లోని నిజాయితీ పాటను నిలబెట్టింది. నేను ఎన్నోసార్లు పడిపోయాను. లేచాను. గెలిచాను. స్క్రీన్‌మీద నా పేరు చూసుకోవాలని వచ్చాను. నా పేరు తెర మీద చూసుకున్నాక వెళ్లిపోవచ్చు. కానీ వెళ్లలేదు. మొదటి ఏడు సినిమాలూ పరాజయాన్ని చవిచూసినా కుంగిపోలేదు. ఓ సమయంలో వెళ్లిపోదాం అనిపించినా మంచి పేరుతో వెళ్లిపోదాం అనుకున్నాను. పేరు వచ్చాక, దాన్ని నిలబెట్టుకోకుండా వదిలేయ కూడదు అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఓడిపోవడం తప్పు కాదు. కానీ గెలవడానికి ప్రయత్నించకపోవడం తప్పు. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ప్రయత్నమే చేయకుండా వెనకడుగు వేయడం చాలా తప్పు. ఈ వాస్తవాన్నే చెప్పింది నా పాట. ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి, ముమైత్‌ఖాన్ ఫిలాసఫీ చెప్తే ఎవరు వింటారు అన్నవాళ్లు ఉన్నారు. వాళ్లు అలా అంటారని ముందే ఊహించినా కావాలనే ఆ ప్రయోగం చేశారు పూరి. అలాంటి గట్స్ ఉన్న డెరైక్టర్ నాలాంటి రచయితకి తోడుగా ఉన్నంతకాలం ఇలాంటి మంచి పాటలు పుడుతూనే ఉంటాయి. - భాస్కరభట్ల, గీత రచయిత