ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. ఆయన మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా చెప్పిన వ్యక్తి. ఓసారి ధనవంతుడొకడు ఆయనను చూడ్డానికి వచ్చాడు. ఆ గురువుకు దణ్ణంపెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు ఇచ్చాడు.
గురువు ఆ సంచీని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.
‘‘ఏమిటిది’’ అని అడిగారు గురువు.
‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది’’ అని అన్నాడు ధనవంతుడు.
‘‘ఇందులో ఏముంది’’ అన్నారు గురువు.
‘‘వెయ్యి బంగారు నాణాలు స్వామీ!’’ చెప్పాడు ధనవంతుడు.
‘సంతోషం’ అంటూనే ధనవంతుడి వంక చూసి‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ...’’ అని అడిగారు గురువు.
‘‘అవునండీ ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.
‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.
ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.
కాస్సేపు తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే కదండీ రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నానండీ’’ అన్నాడు ధనవంతుడు.
గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బుసంచీని తిరిగి ధనవంతుడికే ఇచ్చేశారు. ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... ఇదిగో ఈ సంచీ మీ దగ్గరే ఉంచుకోండి‘‘ అన్నారు గురువు.
మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. కనుక ఉన్న దానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది.
– యామిజాల జగదీశ్
ఇదీ చదవండి : అహం బ్రహ్మాస్మి
హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు
Comments
Please login to add a commentAdd a comment