philosophical thought
-
అవసరం : తాత్వికథ
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. ఆయన మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా చెప్పిన వ్యక్తి. ఓసారి ధనవంతుడొకడు ఆయనను చూడ్డానికి వచ్చాడు. ఆ గురువుకు దణ్ణంపెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు ఇచ్చాడు.గురువు ఆ సంచీని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు గురువు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది’’ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు స్వామీ!’’ చెప్పాడు ధనవంతుడు.‘సంతోషం’ అంటూనే ధనవంతుడి వంక చూసి‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ...’’ అని అడిగారు గురువు.‘‘అవునండీ ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాస్సేపు తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే కదండీ రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నానండీ’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బుసంచీని తిరిగి ధనవంతుడికే ఇచ్చేశారు. ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... ఇదిగో ఈ సంచీ మీ దగ్గరే ఉంచుకోండి‘‘ అన్నారు గురువు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. కనుక ఉన్న దానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది.– యామిజాల జగదీశ్ ఇదీ చదవండి : అహం బ్రహ్మాస్మి హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు -
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్య సంకేతాలు..
ప్రజాపతి దగ్గర సురలు, అసురులు, మానవులు తమ బ్రహ్మవిద్యాశిక్షణ పూర్తయిన తరువాత ప్రజాపతిని కలసి సందేశాత్మక ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ప్రజాపతిని కలసి గురుదేవా ‘‘మీ నుంచి మేం నేర్చుకున్నది మా జీవితాల్లో అలవరుచుకుంటూనే విధులు, బాధ్యతలు నిర్వహించదలచాము’’ అన్నారు. ప్రజాపతి ధర్మపథంలో నడవమని ఆదేశించారు. దేవతలు ముందుకొచ్చి, ‘‘మీ ఆదేశానుసారం మేము విధులను ధర్మపథంలో నిర్వహిస్తాం. మీ ఆశీస్సులతో పాటు మంచి సందేశమివ్వమని కోరారు.అప్పుడు ఒక మెరుపు ఆకాశంలో మెరుస్తూ ‘ద’ అనే శబ్ద సంకేతాన్నిచ్చింది. అప్పుడు ప్రజాపతి మీకు ఆ మెరుపు సంకేతం ఏమి అర్థమయిందని? దేవతలన్నారు మేము ‘ద’ ని దమ్యత అంటే స్వయంనిగ్రహంగా అర్థం చేసుకున్నాం. మా మనస్సాక్షి చెబుతున్నదేమంటే సుఖ, సౌఖ్య జీవనాన్ని అనుభవించేటపుడు లేదా ఆ వాంఛలు కలిగినపుడు స్వయంనిగ్రహం కావాలని. ప్రజాపతి సంతసించి బాగా అర్థం చేసుకున్నారు అన్నారు.తదుపరి ఇది చూసి మనుష్యులు కూడా ప్రజాపతిని దివ్య ఆశీస్సులతో కూడిన వీడ్కోలు సందేశాన్ని కోరారు. అప్పుడు మళ్ళీ ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో కనిపించింది. దాని సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగ్గా మనుషులన్నారు ‘‘మేము ‘ద’ ని దత్త గా అర్ధం చేసుకున్నాము. దత్త అంటే ఇవ్వు లేదా దానంచెయ్యి అని అర్థం. మేము స్వార్థ పరులం. మేము మా గురించే ఆలోచిస్తుంటాం. ఇతరులను పట్టించుకోం. కనుక మాకు అదొక దివ్యసంకేతం. మేము మాకున్నది అభాగ్యులకు దానం చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.ప్రజాపతి సంతోషించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు అన్నారు. చివరగా అసురులు వచ్చారు. అప్పుడు ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో మెరిసింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగగా మేము ‘ద’ ని దయాగుణంగా అర్థం చేసుకున్నాము. అనగా దయాగుణం కలిగి ఉండడం. మాది క్రూరస్వభావం. మా మనసు చెబుతున్నదేమంటే, ఇతరుల ఎడ ఎక్కువ దయ, జాలి కలిగి ఉండాలని, తద్వారా ప్రశాంతంగా, సంతోషంగా వుండాలని. మనం గమనిస్తే మనిషిలో ఒక్కొక్కప్పుడు దైవత్వం, మరొకప్పుడు రాక్షసత్వం కనబడతాయి.మెరుపు నుంచివచ్చిన 3 రహస్యసంకేతాలూ ద ద ద మనిషికి చక్కగా అన్వయించబడతాయి. మనలో దేవత్వం కనిపించినపుడు స్వయం నిగ్రహం పాటించాలి. అది మనకు సమయాన్ని, శక్తిని, అస్థిత్వాన్నీ ఇస్తుంది. మనం మన శక్తిని, అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం యితరులతో పంచుకుంటుంటే, అది మనలో దయను కలిగించి ఇతరులలో ఎంతో మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
'చెట్టునీడ నీకెందుకు బాబూ.. నీ నీడలో నువ్వు సేద తీర్చుకో'..
ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని. ఇక నేను ఎవరిపైనా ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరం లేదని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ ‘‘బాబు నాతో కాస్త దూరం నడవగలవా’’ అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేశాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి దరిదాపులలో ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో... ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడా ఏ చెట్టూ కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ‘‘ఏంటి బాబూ... వెతుకుతున్నావు?’’ అని అడిగాడు. ‘‘అయ్యా చాల దూరం వచ్చాము. కాసేపు చెట్టునీడలోకి వెళ్లి సేదతీర్చుకుని ఆ తర్వాత తిరిగి ముందుకు సాగుదాం’’అని చెప్పాడు. అతడి మాటలకు ఆ జ్ఞాని ‘‘చెట్టునీడ నీకెందుకు బాబూ... నీ నీడలో నువ్వు సేద తీర్చుకో’’ అన్నాడు. ‘‘నా నీడలో నేను ఎలా ఉండగలను స్వామీ! ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అని కాస్తంత ఆశ్చర్యంగా మరికాస్త నిష్ఠురంగానూ అడిగాడు ఆ వ్యక్తి. అందుకు ఆ జ్ఞాని, చిరునవ్వుతో అతడివైపు చూస్తూ... అదేంటి, నీ నీడలో నువ్వు తల దాచుకోలేవా? నువ్వే కదా బాబూ, నాదగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూశావా! ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు’’ అన్నారు. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకూ వెళ్లకుండానే. అందుకే పెద్దలన్నారు... అహంకరించవద్దు అని. ఎంత ధనవంతులైనా, వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. అన్నింటికీ మించి మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకానీ, ఇతరులపైన ఏమాత్రం చులకన భావం ఉండకూడదు.. మనసులోకి రాకూడదు. ఇవి చదవండి: Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది.. -
అంబేడ్కర్ ఆలోచనల వక్రీకరణ బాధాకరం
అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్తుంబ్డే హైదరాబాద్: అంబేడ్కర్ ఆలోచనలు, తాత్విక చింతనపై ‘ఆర్గనైజర్’ పత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేయడం హర్షణీయమని, అదే సమయంలో ఆయన ఆలోచనలను వక్రీకరించడం బాధాకరమని, అంబేడ్కర్ మనవడు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే అన్నారు. తాత్విక చింతన, సామాజిక, ఆర్థిక అంశాలపై అంబేద్కర్ భావజాలం చాలా విశిష్టమైనదని కొనియాడారు. ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు.’ అనే పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ చెప్పినవి చెప్పినట్లు రాస్తే తమకు బాధ కలిగి ఉండేది కాదని, అబద్ధాలను జోడించి పుస్తకాన్ని విడుదల చేయడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం మాట్లాడుతూ అంబేడ్కర్‌పై ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక తీసుకువచ్చిన ప్రత్యేక సంచికలో ఒకటి తప్ప అన్ని వ్యాసాల్లోనూ వక్రీకరణలు ఉన్నాయన్నారు. వక్రీకరణలను, మోసాలను, అవమానాలను ఎదుర్కొనేందుకే ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. అన్ని ప్రధాన నగరాల్లో సదస్సులను ఏర్పాటు చేసి ఈ వక్రీకరణలను ప్రజల్లో ఎండగడతామన్నారు. కార్యక్రమంలో ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, హెచ్‌సీయూ అసోసియేట్ ప్రొఫెసర్లు కె.వై.రత్నం, కె.లక్ష్మీనారాయణ, విరసం నేత వరవరరావు పాల్గొన్నారు.