తాత్త్వికథ
ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని. ఇక నేను ఎవరిపైనా ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరం లేదని చాలా గొప్పగా చెప్పుకున్నాడు.
ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ ‘‘బాబు నాతో కాస్త దూరం నడవగలవా’’ అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేశాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి దరిదాపులలో ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో... ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడా ఏ చెట్టూ కనిపించలేదు.
ఇది గమనించిన జ్ఞాని ‘‘ఏంటి బాబూ... వెతుకుతున్నావు?’’ అని అడిగాడు.
‘‘అయ్యా చాల దూరం వచ్చాము. కాసేపు చెట్టునీడలోకి వెళ్లి సేదతీర్చుకుని ఆ తర్వాత తిరిగి ముందుకు సాగుదాం’’అని చెప్పాడు.
అతడి మాటలకు ఆ జ్ఞాని ‘‘చెట్టునీడ నీకెందుకు బాబూ... నీ నీడలో నువ్వు సేద తీర్చుకో’’ అన్నాడు.
‘‘నా నీడలో నేను ఎలా ఉండగలను స్వామీ! ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అని కాస్తంత ఆశ్చర్యంగా మరికాస్త నిష్ఠురంగానూ అడిగాడు ఆ వ్యక్తి.
అందుకు ఆ జ్ఞాని, చిరునవ్వుతో అతడివైపు చూస్తూ... అదేంటి, నీ నీడలో నువ్వు తల దాచుకోలేవా? నువ్వే కదా బాబూ, నాదగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూశావా! ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు’’ అన్నారు.
ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకూ వెళ్లకుండానే.
అందుకే పెద్దలన్నారు... అహంకరించవద్దు అని. ఎంత ధనవంతులైనా, వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. అన్నింటికీ మించి మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకానీ, ఇతరులపైన ఏమాత్రం చులకన భావం ఉండకూడదు.. మనసులోకి రాకూడదు.
ఇవి చదవండి: Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది..
Comments
Please login to add a commentAdd a comment