ప్రజాపతి దగ్గర సురలు, అసురులు, మానవులు తమ బ్రహ్మవిద్యాశిక్షణ పూర్తయిన తరువాత ప్రజాపతిని కలసి సందేశాత్మక ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ప్రజాపతిని కలసి గురుదేవా ‘‘మీ నుంచి మేం నేర్చుకున్నది మా జీవితాల్లో అలవరుచుకుంటూనే విధులు, బాధ్యతలు నిర్వహించదలచాము’’ అన్నారు. ప్రజాపతి ధర్మపథంలో నడవమని ఆదేశించారు. దేవతలు ముందుకొచ్చి, ‘‘మీ ఆదేశానుసారం మేము విధులను ధర్మపథంలో నిర్వహిస్తాం. మీ ఆశీస్సులతో పాటు మంచి సందేశమివ్వమని కోరారు.
అప్పుడు ఒక మెరుపు ఆకాశంలో మెరుస్తూ ‘ద’ అనే శబ్ద సంకేతాన్నిచ్చింది. అప్పుడు ప్రజాపతి మీకు ఆ మెరుపు సంకేతం ఏమి అర్థమయిందని? దేవతలన్నారు మేము ‘ద’ ని దమ్యత అంటే స్వయంనిగ్రహంగా అర్థం చేసుకున్నాం. మా మనస్సాక్షి చెబుతున్నదేమంటే సుఖ, సౌఖ్య జీవనాన్ని అనుభవించేటపుడు లేదా ఆ వాంఛలు కలిగినపుడు స్వయంనిగ్రహం కావాలని. ప్రజాపతి సంతసించి బాగా అర్థం చేసుకున్నారు అన్నారు.
తదుపరి ఇది చూసి మనుష్యులు కూడా ప్రజాపతిని దివ్య ఆశీస్సులతో కూడిన వీడ్కోలు సందేశాన్ని కోరారు. అప్పుడు మళ్ళీ ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో కనిపించింది. దాని సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగ్గా మనుషులన్నారు ‘‘మేము ‘ద’ ని దత్త గా అర్ధం చేసుకున్నాము. దత్త అంటే ఇవ్వు లేదా దానంచెయ్యి అని అర్థం. మేము స్వార్థ పరులం. మేము మా గురించే ఆలోచిస్తుంటాం. ఇతరులను పట్టించుకోం. కనుక మాకు అదొక దివ్యసంకేతం. మేము మాకున్నది అభాగ్యులకు దానం చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.
ప్రజాపతి సంతోషించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు అన్నారు. చివరగా అసురులు వచ్చారు. అప్పుడు ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో మెరిసింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగగా మేము ‘ద’ ని దయాగుణంగా అర్థం చేసుకున్నాము. అనగా దయాగుణం కలిగి ఉండడం. మాది క్రూరస్వభావం. మా మనసు చెబుతున్నదేమంటే, ఇతరుల ఎడ ఎక్కువ దయ, జాలి కలిగి ఉండాలని, తద్వారా ప్రశాంతంగా, సంతోషంగా వుండాలని. మనం గమనిస్తే మనిషిలో ఒక్కొక్కప్పుడు దైవత్వం, మరొకప్పుడు రాక్షసత్వం కనబడతాయి.
మెరుపు నుంచివచ్చిన 3 రహస్యసంకేతాలూ ద ద ద మనిషికి చక్కగా అన్వయించబడతాయి. మనలో దేవత్వం కనిపించినపుడు స్వయం నిగ్రహం పాటించాలి. అది మనకు సమయాన్ని, శక్తిని, అస్థిత్వాన్నీ ఇస్తుంది. మనం మన శక్తిని, అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం యితరులతో పంచుకుంటుంటే, అది మనలో దయను కలిగించి ఇతరులలో ఎంతో మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు
Comments
Please login to add a commentAdd a comment