‘‘ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు దుర్గాదేవి పట్ల భక్తితో వివిధ మార్గాల్లో కలిసి మెలిసి పూజలు జరుపుకుంటున్నారు. ఈ సంతోషంతో ఆమె దయకు పరవశుడనై రాసిన ‘ఆవతికలాయ్’ అనే గర్బా గేయాన్ని ఇక్కడ ఉంచాను. ఆమె ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాయని పూర్వామంత్రి పాడిన ఈ గేయం గర్బా నృత్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేలా చేయడంతోపాటు ప్రతి మదిని ఆధ్యాత్మిక సౌరభమై తాకుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
గర్బా నృత్యం అనగానే సంప్రదాయదుస్తులు ధరించిన సమూహాలు, ఆనందంగా నృత్యం చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందు మెదలుతాయి. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
చిల్లులు గల మట్టి కుండలో దీపం వెలిగించి, తలపైన పెట్టుకుని అమ్మవారి విగ్రహం చుట్టూ వలయాకారంగా తిరుగుతూ భక్తి పారవశ్యంలో నృత్యం చేస్తారు. మట్టికుండ తల్లి గర్భాన్ని, జ్యోతి నుండి వెలువడే కాంతి లోపల పెరుగుతున్న కొత్త జీవిని సూచిస్తుంది. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను ఈ నృత్యం ద్వారా తెలియజేస్తారు. మనలో ఉన్న అన్ని చెడులను నాశనం చేయడానికి, లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే విధానంగా కూడా గర్బా నృత్యాన్ని చెబుతారు. గర్బా నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ. ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్బాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు.
కాలచక్రం .. పునరావృతం
దేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకునే ఈ నృత్యాన్ని స్త్రీ–పురుషులు ఇద్దరూ తొమ్మిది రాత్రులు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజులూ కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు పాటిస్తారు. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్ని అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. జీవన చక్రం దాని చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక.
మహిషుని అంతం చేసిన మహిళా శక్తి
ఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించకుండా ఉండాలన్న వరబలంతో మహిషాసురుడు తన శక్తులను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతడి దాడికి దేవతలు నిస్సహాయలైపోయారు. దుర్గాదేవి వద్దకు వెళ్లి, వేడుకున్నారు. దుర్గాదేవి ఒక్క కంటిచూపుతో ఆ రాక్షసుని అంతం చేయగలదు.
కానీ, అసుర సంహారానికి ముందు తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగిన సర్వోన్నతమైన యుద్ధం ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అసాంఘిక, అధార్మిక శక్తులు ఎంత బలంగా కనిపించినా, యుద్ధం ఎంతకాలం సాగినా, చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాన్ని గర్బా నృత్యం ద్వారా ప్రదర్శించడం అంతర్లీనంగా కనిపిస్తుంది.
బేతే గర్బా
గుజరాత్‌లోని నాగర్ కమ్యూనిటీ ‘బేతే గర్బా’ అంటే కూర్చున్న గర్బా అని జరుపుకుంటారు. ఇక్కడ, భక్తులు ఒకరి ఇంటి వద్ద గుమిగూడి, గర్బా పాటలు పాడతారు. హిందువులు తమ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిజాం నిషేధించినప్పుడు, ఇస్లామిక్ పాలనలో జునాగఢ్ లో బేతే గర్బా ప్రారంభమైంది. చాలామంది కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా మారి΄ోతారు. ఉత్తర భారతదేశంలో గర్బాలో భక్తులు తబలా, మంజీరను ఉపయోగిస్తారు.
సంప్రదాయ దుస్తులతో...
ఈ నృత్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. దాండియాలో కోలాటం కర్రలను ఉపయోగిస్తారు. గర్బా పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై
ఉంటాయి.
పాదరక్షలు లేకుండా..
గర్బా దైవారాధనా రీతుల్లో చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.
గర్బా.. యునెస్కో
నవరాత్రి ఉత్సవాలను గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. మన దేశానికే ప్రత్యేకమైన ఈ ప్రముఖ నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్) జాబితాలో కిందటేడాది చేర్చింది. అమ్మవారి ఎదుట భక్తిని నృత్య రూపంలో చాటే ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే అనడానికి ప్రతీకగా నిలుస్తోంది గర్బా.
(చదవండి: ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..! )
Comments
Please login to add a commentAdd a comment