‘‘నానమ్మా... అనవసరంగా స్ట్రెస్సు పెంచుకోకు. తగ్గే మార్గం చెబుతా విను గ్రానీ డ్యూడ్’’ అంది నా కూతురు.
‘‘ఏం చెబుతావో ఏమో... ఈమధ్య అంతా సైన్సు మాట్లాడుతున్నావ్. స్ట్రెస్సు ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షన్ టు పిండిపైన ఉండే అప్పడాల కర్ర అండ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షన్ టు కిందనుండే రౌండు పీట అండ్ బీటా టీటా అల్ఫా ఒమెగా అంటూ అదేదో అంటుంటావ్. నా పాట్లేవో నన్ను పడనీ మనవరాల్ డ్యూడ్’’ అంది మా అమ్మ.
మా అమ్మకూ ఈమధ్యే బీటెక్‌లో చేరిన నా కూతురికీ మధ్య భలే ఫ్రెండ్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరిమధ్యా ‘షోలే’ వీరూ, జైయంత చనువు. టైము దొరికినప్పుడల్లా ఇప్పటి సినిమాల్ని ఓటీటీలో మా అమ్మకు చూపిస్తూంటే, మా అమ్మ అప్పటి సినిమాల్ని టీవీలో నా బిడ్డకు చూపిస్తూ యమా టైంపాస్ చేసేస్తుంటారు ఇద్దరూ! ఈ వైభోగానికి తోడు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్‌స్టీ, లోకల్ టాక్సెస్ ఎక్‌స్ట్రాల్లాగా నానమ్మా, మనవరాళ్లిద్దరి మధ్యా ఎక్స్‌ట్రా వాదులాటలూ, కీచులాటలూ, గొడవలూ... ఆ తర్వాత ఎదుటాళ్లను గెలిపించి తామోడిపోవడానికి పోటీలూ, పేచీలు!
ఫరెగ్జాంపుల్... ‘‘హే యూ ఓల్డ్ లేడీ... చూస్తుండగానే అన్నపూర్ణవు కాస్తా నిర్మలమ్మ అయిపోతున్నావు నువ్వు’’ అంటూ నా కూతురంటే... ‘‘మీ అమ్మ మాత్రం అవ్వడం లేదా... రమ్యకృష్ణలాంటిది కాస్తా వదినమ్మ వేషాల సుధాలాగా’’ అంటుంది మా అమ్మ.
ఇదెలా ఉంటుందంటే హీరోని పొడవలేని విలన్ అనుచరుడు కాస్తా చివరకు సెకండ్ హీరోయిన్‌ని పొడిచేసినంత చిత్రంగా. ఇలా ఎందుకంటే... తన మనవరాల్నేమీ అనలేకా... అందమైన హీరోయిన్‌లతోనే గాక... ఇంకెవ్వరితోనూ పోల్చలేక! ఆ కూతురితో పోల్చదగ్గది మరొకరుండరూ... ఉండకూడదనే అత్యాశకొద్దీ!!
అసలీ సంభాషణకు కారణం... దసరా సెలవలు కదా. అమ్మమ్మ గారి ఇంటికంటూ మా అక్కవాళ్ల పిల్లలు మా ఇంటికి రావడమూ... పండక్కి మా అమ్మను కొన్ని కోర్కెలు కోరడమూనూ. మనవరాళ్లు కదా! వాళ్ల వరాలు తీర్చకుండా ఎలా ఉంటుంది మా అమ్మ. అవేమిటంటే... మా పిల్లలకేమో చిట్టిగారెల్లో మటన్ కూర కావాలట. అక్క పిల్లలేమో ‘గారెలు మేం మామూలుగానే తినేస్తాం. మటన్‌లో పూరీలు ముంచుకుతింటాం. కాబట్టి ఎక్స్‌ట్రాగా పూరీలు చేయమంటు’న్నారు. దాంతో రెండూ చేసే పనిలో బోల్డెంత ఒత్తిడికి లోనవుతోంది మా అమ్మ. ఆమెను అనునయిస్తూ స్ట్రెస్సును తగ్గించే పనిలో ఉంది నా బిడ్డ.
‘‘అయినా... పూరీలు టైముకు ప్రిపేర్ అవ్వాలంటే... అసలెంతో కొంత స్ట్రెస్ ఉండాల్సిందేలే నానమ్మా’’ అంది నా కూతురు. ‘‘అదేందోగానీ పిల్లా... ఈ స్ట్రెస్సొచ్చినప్పుడల్లా నా కిడ్నీల్లో హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంటుంది బ్రో. ఈ ఒత్తిడి అనేది ఉంది చూశావూ... మొదట ‘అగ్నిపర్వతం’
‘ఈగాలిలో...’పాటలోలాగా కృష్ణ పాస్‌పోర్టు ఫొటోంత సైజులో ఉంటుందా! కాసేపటికే విజయశాంతి పట్టుకున్న సూపర్‌స్టార్ కటౌటంతగా పెరుగుతుంది. అబ్బో... అలా పెరిగినప్పుడు నాకెంత దాహం వేస్తుంటుందో తెలుసా పిల్లా? ‘దేవత’లో శోభన్‌బాబు, శ్రీదేవీ పాటలోని అన్ని బిందెల్లోకీ ఎల్లువొచ్చిన గోదారి నీళ్లన్నీ తాగీ తాగీ ఇంకా తాగుతున్నా ఇంకా దాహమేస్తున్నట్టే అనిపిస్తుంటది’’
‘‘నీకెందుకు నానమ్మా. నీ నర్వస్‌నెస్‌ను ‘రోబో–2’లో పావురమ్మీద స్వారీ చేసే రజినీకాంత్ సైజుకు తగ్గిస్తా’’
‘‘ఓహో... భైరవద్వీపం ‘నరుడా ఓ నరుడా’ పాటలో మరుగుజ్జుల సైజుకా?’’ అంటూ తన పాత సినిమా ఎగ్జాంపుల్‌కు వెళ్తూనే... ‘‘అయినా పెద్ద చెప్పొచ్చావ్ గానీ... స్ట్రెస్సుంటే వంట వీజీగా ఎలా అవుతుందే అమ్మాయ్?’’ అడిగింది.
‘‘నా ఇంజనీరింగ్ మ్యాథ్స్‌లా కాకుండా మీ ΄ాతసినిమాల భాషలోనే చెబుతా విను. కొద్దిగా స్ట్రెస్సుంటే... అప్పట్లో మీ ఓల్డుమూవీసులో పోగరుమోతు హీరోయిన్ని ఒక్క టీజింగుసాంగుతోనే హీరో లొంగదీసినంత వీజీగా చేసేగలవు పూరీలన్నీ’’ అంటూ మా అమ్మకు తన ఉపదేశాన్ని మొదలుపెట్టింది నా కూతురు.
∙∙
‘‘అన్నట్టు నానమ్మా... ఈ స్ట్రెస్సూతో హెల్త్ సమస్యలూ అవీ వస్తాయని దాన్ని ఆడిపోసుకుంటుంటారు గానీ... ఒక్క వంటే కాదు. ఏ పనైనా హాయిగా జరిగి΄ోవాలంటే కాస్త ప్రెషరో, గిషరో వర్కవుట్ అవుతూ ఉండాలి. అదెంతుండాలంటే... కడాయిలో పూరీని పొంగించడానికీ, కుక్కరులోని రైసును ఉడికించడానికీ ఎంత కావాలో... పని సజావుగా జరగడానికి అంతే స్ట్రెస్సుండాలి’’
‘‘ఎందుకే పాపం ఒత్తిడితో ఆ పూరీల్ని అంతలా పొంగించడం? ఎంత పొంగినా చివరకు పూరీకి బొక్కెట్టే కదా తింటారు. విజిళ్లతో ఎంతగా మిడిసిపడ్డా ఆవిరి ΄ోయాకే కదా కుక్కర్లోంచి అన్నాన్ని దించుతారు!’’
‘‘నువ్వన్నది కరెక్టేగానీ నానమ్మా... ఎలాగూ తొక్క వలిచే తింటాంగదా అని తొడిమ ఊడిన అరటిపండు తినగలమా? అలాగే పొంగని పూరీతో పూరీ చేయగలమా చెప్పు. పొంగినదానికీ, పొంగనిదానికీ టేస్టులో ఏమాత్రం తేడా లేక΄ోయినప్పటికీ పొంగినదాన్నే కదా ప్లేట్లో వేసుకోబుద్ధవుతుంది! అలా పూరీలోకి చేరి పొంగేలా చేయడమే గాలి గొప్ప. అండ్... వంటలో ఆయొక్క ఐడియల్ ఒత్తిడి ఎంతుండాలంటే... పూరీపొరను చీల్చకూడదూ – అన్నాన్ని మాడ్చకూడదు. సమ్‌ఝే నానమ్మా డ్యూడ్?!’’
‘‘నువ్వు ఎన్నైనా చెప్పవే... ఒత్తిడిలో పని జరగదు గాక జరగదు. పైగా నువ్వుంటే ఇంకా డిస్ట్రబెన్సు. కాబట్టి.... రాకమ్మా మనవరాలా రాకమ్మా.... నీ కోవేలా కాలేజీ... కిచేనెందుకూ నీకూ కొలువై ఉండేందుకూ...’’
‘‘నేనేమీ రాన్లేగానీ... నువ్వనుకునేది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఎంతుండాలంటే... భోజనం విషయానికి వస్తే అన్నం మాడి ఆకలితో మనల్ని మాడ్చకూడదు... ఆబగా ఓ ముద్ద ఎక్కువ తినేస్తే ఒంటిని జ్వరంతో కాల్చకూడదు. తలనొప్పి రానీకుండా చూసే కాఫీ అనే అమృతానికీ... అమృతాంజనానికీ సరిగ్గా మధ్యన గీత గీసేంత ఒడుపు కలిగి ఉండటమే ఐడియల్ ఒత్తిడి. దాన్ని నువ్వు స్ట్రెస్సనూ, ప్రెషరను. ఆ నర్వస్‌నెస్సులో ఓ వైబ్రేషనుంది. ఓ ఎమోషనుంటది. అది ఉండి తీరాలి నానమ్మా. కాబట్టి చపాతీలా చతికిల పడకు. పూరీలా ΄ పొంగనీ ఉత్సాహం నీలో’’
‘‘అమ్మో అమ్మో... పైకి చూడ్డానికి పూరీలోని పైపొరలా సాఫ్ట్‌గా కనిపిస్తదిగానీ... కింది పొరలా భయంకరమైన టఫ్‌రా నీ కూతురూ. ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ను ముందుకు తీస్కెళ్లడానికి అప్పుడప్పుడూ వంటగదిలోకి ఒకతొస్తుంది. ఆ పిల్లనే అప్పడాలకర్ర బేరర్ అంటార్రా’’ అపూరూపంగా మనవరాల్ని చూసుకుంటూ నాతో అబ్బురంగా అంది మా అమ్మ.
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment