"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు."
‘‘భగవాన్! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు.
అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది.
‘‘భగవాన్! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు.
‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు.
‘‘భగవాన్! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు.
కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు.
అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా.. ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది.
‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు.
‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి.
‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు.
‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు.
వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment