borra govardhan
-
ధర్మ జ్ఞానోదయం
సూర్యోదయం అయ్యింది. సూర్యుని చేత కిరణాలు దట్టమైన చెట్ల చిటారు కొమ్మలపై పడుతున్నాయి. లేలేత ఎరుపు రంగులో ఉన్న కొమ్మల చివుర్లు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. చల్లని గాలి చెట్ల మధ్య దూరి కొమ్మల్ని తాకుతూ పయనిస్తుంది. అప్పుడే నదిలో స్నానం చేసి వచ్చి పాలవృక్షం క్రింద కూర్చున్నాడు బుద్ధుడు. ఆ ఉషోదయ తేజస్సు అంతా అతని ప్రశాంత వదనంలోంచి ఉదయిస్తోంది! పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కనురెప్పలు మెల్లగా వాలాయి! ఆలోచనల ΄÷రలు తెరచుకున్నాయి!తాను జ్ఞానోదయం ΄పొంది ఇది నలభై తొమ్మిదో రోజు. అంటే సిద్దార్థుడు బుద్ధిని పొంది, బుద్ధుడైన రోజు. అప్పటికి రెండు నెలల క్రితం నిరంజనా నదీ తీరంలో తన ఐదుగురు మిత్రులతో కలిసి కఠోర తపస్సు చేశాడు. చిక్కిశల్యమై నీరసించి పడిపోయాడు. జ్ఞానసాధనకు అది సరైన మార్గం కాదని నిర్ణయించుకున్నాడు. నిరాహార వ్రతం మానాడు. మిత్రులు తనని దూషించి వెళ్ళిపొంయారు. అయినా నిరాశపడలేదు. గయకు చేరాడు. అక్కడ నదీతీరంలోని రావిచెట్టు కింద ధ్యానదీక్ష కొనసాగించాడు. అంతకాలంగా వెదుకుతున్న దుఃఖానికి కారణం తెలిసింది కాబట్టి దానికి నివారణ మార్గం కూడా తెలిసింది. ఆ నిదారణా మార్గమే అష్టాంగ మార్గం! అష్టాంగమార్గ ఆవిష్కరణే బుద్ధునికి జ్ఞానోదయం. ఏ విషయంలోనూ అతి ఉండకూడదు అనేది అవగతం అయ్యింది. తిండి మాని శరీరాన్ని ఎండగట్టుకోవడం ఎంత త΄్పో, అతిగా తిని శరీరాన్ని సోమరిగా చేయడం అంతే తప్పు. నిద్రాహారాలు మాని పగలూ రేయి అవిశ్రాంతంగా పని చేయడం ఎంత త΄్పో, పనీ ΄ాటా మాని తిని తిరగడం అంతే తప్పు. ఇలా... రెండు అంచులకు చేరకుండా మధ్యస్థంగా ఉండడం వల్ల కర్తవ్య ΄ాలన చిరకాలం సాగించగలం. దీన్నే మధ్యమమార్గం అంటాం. ఈ మార్గమే బుద్ధుని బోధనలకు పునాది. ఈ మార్గాన్ని ఎంచుకునే అష్టాంగ మార్గాన్ని రూపొందించాడు. అదే బుద్ధునికి జ్ఞానోదయం. బుద్ధుని ఆలోచనల్లో ప్రశాంత వెలుగులు నింపిన ఆరోజు వైశాఖ పున్నమి. బుద్ధత్వం సిద్ధించిన రోజు. బుద్ధుడు సంబోధిని పొందిన రోజు. నేడు ప్రపంచానికి పండుగరోజు. దుఃఖ నివారణా మార్గాన్ని సాధించిన బుద్ధుడు వెంటనే అక్కడినుంచి లేచి వెళ్ళి΄ోలేదు. తాను ΄పొందిన జ్ఞానాన్ని ప్రకటించుకోలేదు. ఆ మార్గాన్ని దాని ఆచరణలో కలిగే అవరోధాల్ని, అసలు ఆ మార్గం ప్రజలకు అర్థమవుతోందా? లేదా? అనే విషయాల్ని పలు పలు విధాలుగా తర్కించుకున్నాడు. తర్కించి తర్కించి.. చివరికి తనది సరైన మార్గమే అని నిర్ణయించుకున్నాడు.మెదటివారం అంతా తనకు ఏ చెట్టుకింద జ్ఞానోదయం కలిగిందో.. ఆ చెట్టుకిందే కూర్చున్నాడు. మానవుల పుట్టుక, మరణాల మధ్య ఉన్న దశల్ని పన్నెండు భాగాలుగా విభజించుకుని ఒక్కో దశ గురించి దీర్ఘంగా ఆలోచించాడు. అవిద్య, సంస్కారాల పరంపరలో ముసలితనం, మరణం కలుగు తాయని, ఆ మరణం వల్లే శోకం, రోదనం, దుఃఖం, బాధలు కలుగుతాయని తెలుసుకున్నాడు. ఈ దుఃఖ బాధలకు కారణం అలవిమాలిన కోరిక (తృష్ణ), కాబట్టి కోరికల్ని నశింపచేసుకుంటే మనస్సు దుఃఖ రహితమవుతుందని గ్రహించాడు. దానితో తన ఆలోచనలకి మరింత బలం చేకూరింది. అలా మొదటి వారం గడిచింది. రెండోవారం కూడా ఆ బోధి వృక్షం కిందే ఉండి ధ్యానానందాన్ని పొందాడు. మూడోవారం ఆ చెట్టుకు కొద్ది దూరంగా వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చొని, బోధివృక్షాన్ని పరిశీలిస్తూ తన మార్గాన్ని మరింత విస్తృత పరుచుకుంటూ గడి΄ాడు. అక్కడి నుండి లేచి, అక్కడికి దగ్గరలో ఒక కొలనుగట్టున ఉన్న ఒక మందిరంలో చేరాడు. అక్కడే ‘అభిధర్మాన్ని’ పరిష్కరించాడు. ధ్యానసాధనా సో΄ానాల్ని, మనస్సుని కేంద్రీకరించే విధానాన్ని రూపొందించుకున్నాడు. మనస్సు నిర్మలం అయింది. బుద్ధుని ముఖంలోంచి తేజస్సు ప్రకాశించింది. తల చుట్టూ ఆరు రంగుల కాంతి .... వెల్గులు ప్రసరించింది. అది ఒక జ్ఞాన కాంతిపుంజం.మరలా ఆ తేజోమూర్తి అక్కడి నుండి లేచాడు. అజ΄ాల అనే మర్రి చెట్టు కిందికి చేరాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో – చెడ్డ పనులు ఎవరు చేయరో, మోహరాగాల నుండి ఎవరు ముక్తులవుతారో, స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ, సర్వోన్నత జ్ఞానిగా ఎవరు ఉంటారో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణత్వం అలా సిద్ధిస్తుంది గాని, పుట్టుకను బట్టి కాదు. అని బుద్ధుడు చె΄్తాడు. ‘సత్యాన్ని తెలుసుకుని, ఏకాంతంగా గడపడం సుఖం. మంచి పనులు చేయడం అంతకంటే సుఖం. జీవుల పట్ల కరుణ, మైత్రి కలిగి జీవించడం అన్నింటికంటే పరమసుఖం. అని బోధిస్తాడు. జనులు కోర్కెలతో, క్లేశాలు అనే వాసాలతో ఇల్లు నిర్మించుకుంటారు. వాటిని తృష్ణ అనే తాళ్ళతో గట్టిగా బంధించుకుంటారు. ఆ తాళ్ళను తెంచి, వాసాలు దించి, ఆ కోర్కెల కొంపను కూల్చుకుంటేనే దుఃఖం నుండి విముక్తి అనే విషయాన్ని ఆవిష్కరించగలుగుతారు. కోర్కెల వాసాలతో దుఃఖం అనే ఇంటిని నిర్మించుకుని ప్రజలు అందులో జీవిస్తున్నారు. ఆ ఇంటికి బలం కోర్కెలనే వాసాలు. జ్ఞానం అనే గొడ్డలితో ఆ కోర్కెల్ని కూల్చితే దుఃఖం దూరమై΄ోతుంది. ఇదే బుద్ధునికి కలిగిన జ్ఞానోదయం. దుఃఖం లేని జగతికి సూర్యోదయం. ధర్మ అరుణోదయం.– డా. బొర్రా గోవర్ధన్(23, గురువారం బుద్ధ పూర్ణిమ) -
బౌద్ధవాణి : మాకు పిచ్చుకలతో పోలికా..!?
"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు." ‘‘భగవాన్! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు. అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది. ‘‘భగవాన్! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు. ‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు. ‘‘భగవాన్! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు. కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు. అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా.. ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది. ‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు. ‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి. ‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు. ‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు. వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలూ అలాంటివే! కాబట్టి..
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. అప్పటినుంచి బుద్ధుడి పట్ల ద్వేషం, అసూయ పెంచుకుంటాడు దేవదత్తుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృవు పంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాత శతృవు దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు – ‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వులాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తుంది. వెదురు చెట్టు ఒక్క పూతతోనే తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – బొర్రా గోవర్ధన్ -
స్థిరచిత్తం అంటే అదే!
అది గంగానదీ తీరం. లోతు తక్కువ ప్రదేశం. నది మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నదీ తీరంలో గట్టు వెంట గొర్రెల మంద మేస్తోంది. ఆ మందను చూసింది ఒక తోడేలు. మందలో చివరిలో మందకు కొద్దిదూరంలో ఒంటరిగా మేస్తోంది ఒక పొట్టేలు. తోడేలు చూపు దాని మీద పడింది. ‘ఈ బలిసిన పొట్టేలు అయితే రెండు రోజులకు సరిపోతుంది’ అనుకుంది. మాటు కాచి, పొంచి పొంచి దాని దగ్గరకు వచ్చింది. ఎండుటాకుల ధ్వనిని బట్టి ఏదో తనవైపు వస్తున్నట్లు గుర్తించింది పొట్టేలు. తల పైకెత్తి చూసింది. తన మీదికి దూకి వస్తున్న తోడేలు కనిపించేసరికి నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీదికి పరుగుతీసింది. అలా రెండు మూడు తిన్నెలు దాటి తీరాన్నుండి దూరంగా పోయాయి రెండూ. అంతలో వరదనీరు ఉరకలేస్తూ ఉరవడిగా వచ్చిపడుతోంది. పొట్టేలు ప్రాణ భయంతో ఇసుక దిబ్బ మీదినుండి నది నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలు మాత్రం దిబ్బమీదే నిలబడిపోయి, పొట్టేలు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వరద నీరు హెచ్చింది. మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు మునిగిపోసాగాయి. తోడేలు పొట్టేలు మీదినుంచి చూపు తిప్పుకునేసరికే అది నిలబడ్డ దిబ్బ చాలా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఆ దిబ్బమీది కొద్ది ఎత్తైన ప్రదేశం మాత్రమే మిగిలింది. తోడేలు ఆ ఎత్తు ప్రదేశానికి చేరింది. ఆ వరద అలా రెండురోజులు ఉంది. వేటాడటం అటుంచి, కనీసం ఒడ్డుకు చేరే మార్గం కనిపించలేదు. అది తనలో తనే ‘ఈ ప్రమాదాన్నుండి బయట పడతానో లేదో, ఇప్పటిదాకా ఎంతో హింస చేశాను. ఎన్నో జీవుల్ని చంపాను. ఆ కర్మ ఫలం నాకు మంచిని చేకూర్చదు. కాబట్టి బతికినన్ని రోజులు ఇక అహింసను, మైత్రిని, మంచితనాన్ని పాటించాలి’ అనుకుంది. ఆ దిబ్బమీదికి చేరి, కూర్చొని ధ్యానం చేయసాగింది. కొంత సమయం గడిచింది. ఎక్కడో సన్నగా మేక అరుపు దాని చెవులబడింది. తపస్సు భగ్నం అయ్యింది. మెల్లగా కళ్లు తెరిచింది. అటూ ఇటూ చూసింది. వరద కొద్దిగా తగ్గింది. తాను ఉన్న ఇసుక దిబ్బ ఇంకొద్దిగా బైట పడింది. దాని మీదకు చేరి అరుస్తూ ఉన్న మేకపిల్ల కనిపించింది. తోడేలు మెల్లగా లేచి మేక పిల్లకేసి వంగి వంగి నడవసాగింది. దాదాపు దగ్గరగా పోయి ఒక్క ఉదుటున దూకింది. కానీ.. గురి తప్పి నీటిలో పడడంతో శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని అటు చూసిన మేకపిల్లప్రాణభయంతో నది నీటిలోకి ఎగిరి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలుకు మరలా నిరాశ.‘లేదు. మరలా నేను నా మనస్సును కుదుట పరచుకోవాలి. హింసను విడనాడాలి. అహింసతో జీవించాలి. తపస్సు చేసి, చేసినపాప ఫలాన్ని రూపు మాపుకోవాలి’ అనుకుంది. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు శాంతంతో, అహింసతో, జీవ కారుణ్యాన్నీ, ధర్మాన్నీ ఆచరించడం కాదు. కోపం రావడానికి కారణాలు ఉన్నప్పుడూ, హింస చేసే అవకాశం వచ్చినప్పుడూ తప్పు చేసే పరిస్థితులు కలిగినప్పుడు అవి చేయకుండా ఉండటమే గొప్పతనం. అలా ఉంచగలిగిందే ధ్యానం. అలా మన చిత్తాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా మార్గం మనస్సును అలా దృఢంగా మలుస్తుంది’’అని చెప్పాడు. స్థిర చిత్తం అంటే అదే మరి! – డా. బొర్రా గోవర్ధన్ -
ఆంతరంగిక శుద్ధి
మనిషికి బాహ్య అంగాల శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి అవసరం అంటుంది బౌద్ధం. ఈ మనోశుద్ధి వల్ల మనస్సు మలిన రహితం అవుతుంది. తేటదనం ఉట్టిపడుతుంది. శారీరక శుద్ధి కంటే మనోశుద్ధే మేలు. మనో వాక్కాయ కర్మల్లో మనో శుద్ధి ఉంటే వాక్కులూ చేసే పనులూ, వాటంతట అవే శుద్ధి అయిపోతాయి. అందుకే అన్నింటికీ అగ్రగామి మనసే’’ అంటుంది ధమ్మపదం. ఎంత విన్నా, ఎంత చదివినా హీనబుద్ధి గలవాడు తమగుణం మానలేడు అంటారు. దేహాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నా అవగుణం ఉన్నవాడికి ఒక్కసారి కాకపోతే ఎప్పుడో ఒక్కసారైనా దేహశుద్ధి తప్పదు. మనోశుద్ధి ఉంటే వారు మణిలా జీవితాంతం రాణిస్తారు. కానీ శారీరక శుద్ధి వల్ల పాపాలు పోయి పుణ్యం వచ్చిపడుతుంది అని నమ్మే పండితుడు చివాట్లు తిన్న కథ ఇది. మగధ దేశంలో మల్లిక అనే ఒక దాసి ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. నిండు యవ్వనంలో ఉన్నా నిలకడ గల మగువ. ఒకరోజు తెల్లవారు జామునే నీటికోసం నదికి పోయింది. మంచు పట్టి ఉంది. చలి వణికిస్తోంది. ఆమె నదీతీరం చేరి అక్కడ నదిలోకి కట్టి ఉన్న మెట్ల మీద నుండి దిగింది. అప్పటికే అక్కడ ఒక పండితుడు నీటిలో స్నానం చేస్తూ ఉన్నాడు. బుడింగిన మునిగి పైకి లేచాడు. ఎదురుగా మల్లిక కనిపించింది. ఆమె అప్పటికే నీరు ముంచుకుని కడవ నడుమున పెట్టింది. ఆ క్షణంలో ఆమె అందాన్ని, వయ్యారాన్ని చూసి, పండితుని మనస్సు చలించింది. అలాగే నిలబడి చలికి వణుకుతూ ఆమె వంకే చూస్తుండిపోయాడు. అతని వాలకం మల్లిక పసిగట్టి– ‘‘అయ్యా నేను దాసిని. ఈ తెల్లవారు వేళ నీటికోసం ఈ నదికి రాక తప్పదు. చలి బాధను భరించకా తప్పదు. కానీ, మీరు దాసులు కారే? తమరెందుకు ఈ వేళ ఇక్కడికి వచ్చారు? ఈ నీట్లో దిగి ఇలా వడ వడ వణికిపోతున్నారు?’’ అని అడిగింది. ‘‘మల్లీ! నీకు ఆమాత్రం తెలియదా? ఈ జలం పవిత్రమైనది. దీనిలో స్నానం చేస్తే ఎప్పటి పాపాలు అప్పుడు కొట్టుకుపోతాయి. ఈ నీట్లో దిగి మూడు మునకలు వేస్తే సరి. చేసిన దోషాలన్నీ హరించుకుపోయి, పుణ్యం పోగుపడుతుంది. ఆ మాత్రం తెలియని అజ్ఞానివి’’ అంటూ మునిగి లేచాడు. మల్లిక నడుమున ఉన్న నీటి కడవను సరిచేసుకుని – ‘‘అయ్యా! నిజమా! నీటిలో మునిగితేనే పాపాలు హరించుకుపోతాయా?’’ అంది అమాయకంగా! ‘‘అవును మల్లికా! ఇది శాస్త్రం’’ అన్నాడు. ‘‘అయితే స్వామీ! మీ కంటే ఎప్పుడూ ఈ నీటిలోనే ఉండే కప్పలు, చేపలు, పీతలు, జలగలు ఎంతో పుణ్యశాలురన్నమాట. మూడు మునకలకే మీకు పుణ్యం పోగుపడితే.. నిరంతరం మునకలేసే అవి ఎంతటి పుణ్యాన్ని పోగుపెట్టుకుని ఉంటాయి? అవును లెండీ, మీకంటే కప్పలే గొప్ప’’ అంటూ నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోయింది. తనకు చిత్తశుద్ధి లేదని తెలియ చెప్పడానికే మల్లి అలా వ్యంగ్యంగా మాట్లాడిందని పండితుడు గ్రహించాడు. శారీరక శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాడు. ఆంతరంగిక శుద్ధి జరగాలంటే బుద్ధుని బోధనలే శరణు అని బుద్ధుణ్ణి శరణు వేడాడు. ఆ తరువాత గొప్ప పండితునిగా... శీలవంతునిగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధ ధర్మ బోధనలు: తెలిసి చేసిన తప్పు!
ఒక ఆరామంలో చక్షుపాలుడు అనే భిక్షువు ఉండేవాడు. అతను వృద్ధుడు. పైగా అంధుడు. తెల్లవారు జామున బయటకు వచ్చి నడిచే సమయంలో అతని కాళ్ల కింద పడి కొన్ని కీటకాలు నలిగి చనిపోయాయి. భిక్షువు కాళ్ల కింద పడి కీటకాలు చనిపోవడం ఆ రోజుల్లో నేరంగా పరిగణించే వారు. కాబట్టి చక్షుపాలుణ్ణి తీసుకుని కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చి– ‘భగవాన్! ఇతను ప్రతిరోజూ కీటకాల్ని చంపుతున్నాడు’ అని అభియోగం మోపారు. బుద్ధుడు విషయం తెలుసుకుని ‘‘భిక్షువులారా! ఇతనికి చూపు లేదు. కాబట్టి ఇతను చేసిన పని తెలిసి చేసింది కాదు. కాబట్టి నేరం కాదు. దానికి ఇతణ్ణి శిక్షించవలసిన పని గానీ నిందించవలసిన పని గానీ లేదు’’ అని చెప్పాడు. చక్షుపాలునితో ‘‘చక్షుపాలా! నీవు చేసింది నేరం కాకపోయినా జీవహింస జరిగింది. కాబట్టి అది తప్పు. నీవు మరింత జాగ్రత్త వహించు. ఆ తప్పు కూడా జరగకుండా చూసుకో’’ అన్నాడు. ఇంకా భిక్షువులు అక్కడే నిలబడి ఉన్నారు. అది గమనించిన బుద్ధుడు– ‘‘భిక్షులారా! మీకు ఒక కథ చెప్తాను వినండి– అంటూ ఇలా చెప్పాడు. పూర్వం ఒక పట్టణంలో ఒక నేత్ర వైద్యుడు ఉండేవాడు. అతడు మంచి వైద్యుడే గానీ, అనైతిక వాది. ఒక రోజు కట్టెలు కొట్టుకోవడానికి ఒక గ్రామీణ స్త్రీ అడవికి వెళ్ళింది. ఒక ఎండుపుల్ల ఆమె కంటికి తగిలింది. కన్ను ఎర్రబడింది. వాచింది. పట్టణంలోని వైద్యుని విషయం తెలిసి ఆయన దగ్గరకు వచ్చి– ‘‘అయ్యా! నేను పేదరాలిని! మీకు ధనం ఇచ్చుకోలేను. నా కన్ను బాగు చేయండి. అప్పటిదాకా మీ ఇంట్లో దాసి పని చేస్తాను’’ అని ప్రాధేయపడింది. వైద్యుడు ‘సరే’నన్నాడు. కన్ను పరీక్షించాడు. కంటికి ఎలాంటి నష్టం లేదని గ్రహించాడు. వైద్యం ప్రారంభించాడు. కంట్లో మందు వేశాడు. కొన్నాళ్లకి ఆమెకు చూపు మరింత తగ్గిపోయింది. కళ్లు కనిపించడం మానేశాయి. విషయం చెప్పింది. ‘‘చూపు వస్తుంది, భయపడకు’’ అన్నాడు. ‘‘అయ్యా! నాకు చూపు తెప్పించండి. నేను, నా బిడ్డా జీవితాంతం మీ ఇంట్లో దాసులుగా సేవ చేస్తాం’’ అని కాళ్లావేళ్ళా పడింది. వైద్యునికి కావలసింది అదే! కావాలనే ఆమెకు చూపు పోగొట్టాడు. ఇద్దరు సేవకులు దొరకడంతో ఆ ఒప్పందానికి ఒప్పుకున్నాడు. తిరిగి కంట్లో మందులు వేశాడు. ఆమెకి క్రమేపీ చూపు వచ్చింది. ఆమె వైద్యుని మోసం తెలుసుకుంది. కానీ బయట పడలేదు. నెమ్మదిగా గ్రామాధికారి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. ఆయన జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ తర్వాత వైద్యుడికి తగిన శిక్ష విధించాడు. ఈ కథలో వైద్యుడు కావాలనే, స్వార్థంతో ఆమె కళ్ళు పోగొట్టాడు. ఇది తెలియక చేసిన తప్పు కాదు. తెలిసి చేసిన మోసం. కాబట్టి వైద్యుడు చేసింది నేరం. అందుకు తగిన శిక్ష అనుభవించాడు. అని భిక్షువులకు చెప్పాడు బుద్ధుడు. అప్పుడు చక్షుపాలుడు చేసింది నేరం కాదని గ్రహించారు. భిక్షువులు ఇక ఆనాటి నుండి అన్ని పనుల్లో అతనికి సహాయపడుతూ, చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా చూశారు. – డా. బొర్రా గోవర్ధన్ -
అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి..
కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. కుశల ధర్మాలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది. కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. నడవాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి... ‘భగవాన్! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి. వానినుండి ఎలా బైటపడగలం’’ అని అడిగేవారు. అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి. అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి. మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు! – డా. బొర్రా గోవర్ధన్ -
సమాజ సేవ గౌరవాన్ని తెస్తుంది
పచ్చని ప్రకృతి మధ్య ఉండే గ్రామం తోటపల్లి. పేరుకు తగ్గట్టే ఆ గ్రామం చుట్టూ పండ్ల తోటలు. ఊరికి దూరంగా చిన్న చిన్న కొండలు. ఊరి మధ్య ఒక ప్రభుత్వ పాఠశాల. చాలా మంచి పాఠశాలగా పేరు పొందడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల పిల్లలు కూడా ఆ పాఠశాలకు వస్తారు. అలా చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చే గ్రామం పెద్దవరం. అయితే ఆ గ్రామం నుండి పాఠశాలకు వచ్చే దారిలో ఒక పిల్ల కాలువ ఉంది. అది ఎగిరి దూకి రాగలినంత చిన్నది కాదు. వంతెన నిర్మించ వలసినంత పెద్దది కూడా కాదు. కాబట్టి కాలువ మధ్యలో ఒక తూము వేసి మట్టిపోసి దారి ఏర్పాటు చేశారు. ఐతే... ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ఆ దారి దెబ్బతింది. వాహనాల తాకిడికి తూము కూడా కొద్దిగా పగిలిపోయింది. దానితో నీటిప్రవాహానికి దారంతా కొట్టుకుపోయింది. తూము కూడా దూరంగా జరిగిపోయింది. చిత్తడి నేల కావడంతో నేలంతా బురద బురద అయ్యింది. ఆ దారి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. అయినా ఆ దారి గుండా బడి పిల్లలు అలాగే నడిచి పోతున్నారు. కొందరైతే కాలు జారి పడిపోతున్నారు. బట్టలు, పుస్తకాలు తడిసి తిరిగి ఇంటికి వెళ్లి పోతున్నారు. మామూలుగా ఆ దారి వెంట కొందరు టీచర్లు కూడా మోటారు సైకిళ్లపై వస్తూనే ఉంటారు. ఇప్పుడు వారు ఈ దారిగుండా పోవడం మాని... చాలా దూరం ప్రయాణం చేసి బడికి పోతున్నారు. వారిలో సుధీర్ మాస్టర్ కూడా ఒకరు.ఆయన ఒక రోజున ధైర్యం చేసి ఈ దగ్గరి దారిమీదుగా పాఠశాలకు వెళ్లడానికి వచ్చాడు. కాలవ దగ్గర జాగ్రత్తగా మోటార్ సైకిల్ దించాడు. కానీ అవతలి ఒడ్డుకు పోగానే చక్రం జారిపోయింది. బండి పక్కకి ఒరిగిపోయింది. మాస్టారు కాలు ఆనించాడు. కాలు బురదలో దిగబడింది. ఫ్యాంటుకు బురద అంటింది. అప్పుడు అక్కడే ఉన్నారు తథాగత్, అతని చెల్లెలు సుజాత. వారు వెళ్లి మోటార్ సైకిల్ పడకుండా పట్టుకున్నారు. వెనక నుండి బలంగా పైకి నెట్టారు. సుధీర్ మాస్టారు గట్టెక్కి, వారిద్దరికీ థాంక్స్ చెప్పి – ‘నా ఫాంట్ స్కూలుకు వెళ్లి కడుక్కుంటాను. ఈ రోజున ఆటల పోటీలు ఉన్నాయి. త్వరగా వచ్చేయండి’ అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ అన్నాచెల్లెళ్ళు చదువులోనే కాదు ఆటల్లో కూడా మంచి మంచి బహుమతి పొందగలరు. తథాగత్ ఎనిమిదో తరగతి. అతని చెల్లి ఏడు. తథాగత్ ఆలోచిస్తూ బ్యాగ్ పక్కన పెట్టి – ‘చెల్లి! మొన్న నీవు ఇక్కడ పడిపోయావు. అంతకుముందు చాలా మంది మన స్కూల్ పిల్లలు పడిపోయారు. ఈ రోజు మాస్టారు కూడా పడిపోయారు. కాబట్టి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈ రోజే ఈ దారిని సరి చేస్తాను. కాబట్టి స్కూల్‌కి రాను. నువ్వు వెళ్ళు’ అన్నాడు ‘మాస్టర్లు, అమ్మానాన్నలు తిడతారేమో’ అంది గౌతమి. ‘అయినా సరే ఈ దారి బాగు చేస్తాను. నీవు వెళ్లు’ అన్నాడు. ‘లేదన్నయ్య! నేనూ వెళ్ళను. నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాను’ అంటూ సుజాత తన సంచిని కూడా కింద పెట్టింది. అలా వారిద్దరూ పని ప్రారంభించారు. దూరంగా పడి ఉన్న తూమును బలంకొద్దీ తెచ్చారు. మధ్యలో పెట్టారు. దూరంగా ఉన్న రాతిముక్కలు తెచ్చి బలమైన దారి నిర్మించారు. సాయంత్రం ఇంటికి చేరి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారెంతో సంతోషపడ్డారు. ఆ రోజు సాయంత్రం స్కూల్లో జరిగిన సభలో అన్నా చెల్లెలు ఇద్దరూ చదువుల్లో బహుమతులు పొందారు. ఆటలో పాల్గొనక పోవడం వల్ల బహుమతులు రాలేదు. కానీ వారిద్దరినీ హెడ్మాస్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు. వారు చేసిన పనికిగాను ఇద్దరినీ సత్కరించి బహుమతులు అందించారు. సుధీర్ మాస్టారు అయితే ప్రత్యేకంగా ఇద్దరికీ ఖరీదైన పెన్నులు ప్రజెంట్ చేశారు. సమాజ సేవ ఎలాంటి గౌరవాన్ని తెస్తుందో అందరికీ అర్థం అయింది. – బొర్రా గోవర్ధన్ -
దూడను కాదు, నన్ను కొట్టాలి
బర్రె దూడ గట్టుమీద మేస్తోంది. దాని వంక ఒకసారి కళ్ళు తెరచి చూసి గట్టిగా మూసుకున్నాడు విశాల్. దాన్ని వాడు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకసారి కురిసిన భారీ వర్షాలకు చావిడి గోడ విరిగిపడి దూడ కాళ్ళు విరిగాయి. తర్వాత నెమ్మదిగా కోలుకుంది. దాన్ని ఇప్పుడు మరింత భద్రంగా పెంచుకుంటున్నాడు విశాల్. ఆ రోజు బడి నుండి వచ్చాక ఊరి చివరికి పశువులను తోలుకు పోయాడు. మిగిలిన పిల్లలతో కలసి ఆటలలో పడ్డాడు. అంతలో దూడ అరుపు వినిపించి చుట్టూ చూశాడు. అక్కడ విశాలాక్షి తన బర్రె దూడను కొట్టేస్తోంది. పరుగున వెళ్లి ‘ఎందుకలా కొడుతున్నావు? అది అవిటిది కదా! కనిపించట్లేదా?’ అన్నాడు కోపంగా. ‘మా నారుమడిలో పడి మేసేసింది. దీన్ని కొట్టాలా వద్దా?’ అంటూ మళ్లీ కొట్టింది. ‘పచ్చగా ఉంటే పశువుల రావా? ముందు అలా కొట్టడం ఆపు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావ్’ అన్నాడు తన చేతిలోని కర్రను ఎత్తి పెట్టి. వాళ్ళిద్దరి మధ్య గొడవ. తిట్లు. ‘ఆపుతావా ఆపవా’ అంటూ తన చేతిలో ఉన్న కర్రతో విశాలాక్షిని కొట్టాడు. ఏడుస్తూ ఇంటికి పోయింది విశాలాక్షి. అరగంట తర్వాత తన కూతురు విశాలాక్షిని తీసుకుని విశాల్ వాళ్ళ ఇంటికి వచ్చాడు సోమన్న. వాళ్ళు వచ్చేసరికి విశాల్ తండ్రి సత్యం వసారా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. విశాల్ ఆయన పక్కనే ఉన్నాడు. ‘చూడు బావా! మీ వాడు మా పిల్లని ఎలా కొట్టేశాడో’ అంటూ కందిపోయిన దెబ్బలను చూపించాడు. విశాలాక్షి ఏడుస్తూనే ఉంది. ‘ఏం జరిగింది?’అని పిల్లలిద్దర్నీ అడిగాడు సత్యం. ఎవరి వాదన వారిది. ‘మా చేలో పడి మేసిన దూడను కొట్టక ఏం చేయాలి?’ అన్నాడు సోమన్న. ‘‘దూడను కాదు, నన్ను కొట్టాలి’ అంటూ ముందుకు వచ్చి నిలబడ్డాడు విశాల్. ‘నిన్నా?’ ‘అవును మామ. నన్నే. పశువు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేస్తుంది. దానిని నేను జాగ్రత్తగా కాయాలి. నా తప్పు వల్ల అది దెబ్బలు తింది. పైగా కుంటిది. తప్పు నాది కాబట్టి నన్నే కొట్టాలి‘ అన్నాడు మరింత ధైర్యంగా. ఆ మాటలకు అక్కడ ఉన్న వారంతా నిశ్చేష్టులయ్యారు. సోమన్నకు కోపం మాయమైపోయింది. పెద్దగా నవ్వి ‘బావా! వీడు మామూలోడు కాదు. నాకే బుద్ధి చెప్పాడు’ అంటూ నవ్వాడు. ‘నీకు బుద్ధి చెప్పటం ఏమిటి?’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సత్యం. ‘అవును బావా! తప్పు దీనిది కాదు. వీడిది కాదు. బర్రె దూడదీ కాదు. నాది. నా మడి చుట్టూ కంచె వేసుకుంటే ఈ గొడవ లేదు కదా. ఇప్పుడే వెళ్లి ఆ పని చేస్తాను‘ అన్నాడు భుజం మీద ఉన్న కండువా తలకు చుట్టుకుని. ‘మామ! నేనూ వస్తా. నీకు సహాయం చేస్తా.‘ అంటూ ఆ వెనకే వెళ్లాడు విశాల్. – డా. బొర్రా గోవర్ధన్ -
ధర్మ దాన దీపోత్సవం
బౌద్ధం వల్ల ఎన్నో పండుగలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. వాటిలో దీపావళి ఒకటి. బౌద్ధ దీపావళికి ఒక ధార్మిక పునాది ఉంది. చారిత్రక నేపథ్యం ఉంది. అంతకుమించి ఒక మంచి సందర్భం కూడా ఉంది.అది ఇది కపిలవస్తు నగర రాజమందిరం. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు భార్య గౌతమీ సమేతంగా శుద్ధోదన మహారాజు. ఆయన ఒక మంత్రి ని పిలిపించి – ‘అమాత్య! నా కుమారుడు సిద్ధార్థుడు ఇల్లు విడిచి ఆరేళ్లు దాటింది. అతనిప్పుడు బోధి వృక్షం కింద సంబోధిని పొంది బుద్ధుడు అయ్యాడు. బుద్ధత్వం పొందటం అసాధారణ విషయం. అన్యులకు అసాధ్యం. ఇప్పుడు నా బిడ్డను చూడాలనే కోరిక ఉంది. వారిప్పుడు మగధ రాజధాని రాజగృహæ నగరం లోని వేణు వనంలో ఉన్నారు. మీరు వెంటనే వెళ్లి నా బిడ్డను తీసుకుని రండి’‘అన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆత్రుత. ఆనందం. ‘ఈ అమ్మ మాట గా కూడా చెప్పండి. మీ తల్లి మిమ్మల్ని చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పండి’ అంది గౌతమి. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రాజుగారి ఆజ్ఞ మేరకు ఆ మంత్రి రాజగృహకి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. ఆయన బుద్ధుని ప్రబోధం విని తాను కూడా బౌద్ధ సంఘంలో చేరి పోయాడు. భిక్షు గా మారిపోయాడు. అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత మరో మంత్రి వెళ్ళాడు. ఆయన కూడా అంతే. తిరిగి పోలేదు. అలా మొత్తం తొమ్మిది మంది మంత్రులు వెళ్లారు. ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి సిద్ధార్థుని చిన్ననాటి మిత్రుడు అయిన కాలు ఉదాయి ని పంపాడు. ఈ కాలు ఉదాయి బుద్ధుడు పుట్టిన రోజునే పుట్టాడు. సిద్ధార్థుని బాల్యమిత్రుడు. ఉదాయి వెళ్లి విషయం చెప్పి బుద్ధుని ఒప్పించాడు. అలా బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో కలిసి తన జన్మ స్థలానికి బయలుదేరారు. జ్ఞానాన్ని పొందడం అంటే.. అజ్ఞానపు చీకట్లను పారద్రోలడం. అది చీకటి ని చీల్చి వెలుగులు విరజిమ్మే విజ్ఞానపు వెలుగు దీపం. కాబట్టి విజ్ఞానానికి వెలుగుల దీపం ప్రతీక కాబట్టి తన బిడ్డ నడిచివచ్చే దారిపొడవునా... ఊరూరా.... దీపాలు వెలిగించి స్వాగతం పలికే ఏర్పాటు చేశాడు శుద్ధోదనుడు. బుద్ధుడు బహుళ చతుర్దశి నాటికి కపిలవస్తు నగరం లో అడుగుపెట్టాడు. ఆరోజు బౌద్ధులకు అతి ముఖ్యమైన రోజు. ఉపవాసం పాటించే పర్వదినం. కాబట్టి నగరాన్ని అంతా దీపాలతో అలంకరించి బుద్ధునికి స్వాగతం పలికారు కపిలవస్తు ప్రజలు. అలా ఆనాటినుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు వేలాది దీపాలతో బౌద్ధ ఆరామాలను... స్తూపాలను అలంకరించి సంప్రదాయం మొదలైంది. అందుకే ఈ స్తూపాలకు దీపాలదిన్నెలు అనే పేరు వచ్చింది. గహస్తులు ఈరోజు తమ ఇండ్లను దీపాలతో అలంకరించి విశేషంగా దానధర్మాలు చేస్తారు. కాబట్టి ఈ పండుగను ధర్మ దాన దీపోత్సవం గా కూడా పిలుస్తారు. ప్రపంచంలో అందరూ విశేషంగా జరుపుకుంటారు. –డా. బొర్రా గోవర్ధన్ -
అరటి పువ్వులా ఉండ కూడదు!
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృపంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాతశతృ దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు –‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వు లాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తోంది. తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మనోసాధన
మనిషి చేసే కర్మలన్నింటికీ కారకం, ప్రేరకం మనస్సే. అయితే, అది అతి చంచలం. దాన్ని అదుపు చేయడానికి, పొదుపుగా వాడుకోవడానికి, మంచిగా తీర్చిదిద్దుకోవడానికి చాలా సాధన కావాలి. ఆ సాధనే బౌద్ధంలోని అష్టాంగమార్గం. మనస్సుకు ఎలా సాధన ఇవ్వాలి? అని బుద్ధుని అడిగాడు కేశి అనే వ్యక్తి. కేశి మంచి గుర్రపు రౌతు. అప్పుడు బుద్ధుడు ‘‘కేశీ! నీవు మంచి గుర్రపు రౌతువు కదా! నీవు నీ గుర్రాన్ని ఎలా మచ్చిక చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! నేను ముందు చాలా మృదువుగా శిక్షణ ఇస్తాను’’ అన్నాడు కేశి. ‘‘మరి ఎన్నిసార్లు మృదువుగా చెప్పినప్పటికీ వినకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! అప్పుడు కఠినంగానే శిక్షణ ఇస్తాను. మళ్లీ మళ్లీ చేయిస్తాను’’ ‘‘నీవు ఎంత శిక్షణ ఇచ్చినా అది నీ దారికి రాకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! చంపి వంటశాలకు పంపుతాను’’ ‘‘కేశీ! నేను కూడా అంతే! మనిషినిలోని మనస్సుకు శిక్షణ ఇస్తాను. నా దగ్గరకు వచ్చిన వారి మనసుల్ని అకుశలాల నుండి కుశలంవైపు మళ్లేలా చేస్తాను. నా శిక్షణ ఎప్పుడూ ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. కొందరి మనస్సు కరడు గట్టి ఉంటుంది. అలాంటి మనస్సుకు కాస్త కఠినంగానే శిక్షణ ఇస్తాను. ఇక ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వినని వారిని నీవు గుర్రాన్ని చంపినట్లు మాత్రం చంపను. నా ధర్మంలో, నా మార్గంలో హింసకు తావులేదు. పదే పదే ప్రయత్నిస్తాను’’ ‘‘కేశీ! మనం మనస్సును రౌతు గుర్రాన్ని అదుపులో ఉంచేట్టు అదుపులోనే ఉంచుకోవాలి. నీవు గుర్రాన్ని దారిలోకి తెచ్చుకోడానికి ఎలా శిక్షణ ఇచ్చావో, సాధన చేశావో, నీ మనస్సు విషయంలో కూడా అలాగే సాధన చేయి’’ అని చెప్పాడు. కేశి ఆ మార్గాన్ని పాటించి, అతి తక్కువ సమయంలో మనోసాధనలో మేటిగా నిలిచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఆ గౌరవం... అనుభవానికే!
ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచిపోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతి –‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ –‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది. మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ కూడా తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
అహింసే గొప్ప ధర్మం
పూర్వం సారనాథ్‌ని రిషిపట్టణం అనేవారు. అక్కడ సువిశాలమైన మృగదావనం ఉంది. ఆ వనంలో జింకలు జీవిస్తూ ఉండేవి. ఆ జింకలకు ఒక రాజు ఉన్నాడు. అతని పేరు బోధిసత్వుడు. ఈ మృగదావన ప్రాంతం కాశీరాజైన బ్రహ్మదత్తుని ఏలుబడిలో ఉంది. బ్రహ్మదత్తుడు ప్రతిరోజూ ఈ వనానికి వచ్చి జింకల్ని వేటాడేవాడు. చనిపోయినవి చనిపోగా, మిగిలిన జింకలు భయంతో పొదల్లో దూరి బిక్కుబిక్కుమంటూ బతికేవి. కొన్ని భయంతో ప్రాణాలు విడిచేవి. ఒకనాడు అవన్నీ తమ జింకలరాజు సమక్షంలో సమావేశమై ‘‘కాశీరాజు బాణాలకు చచ్చేవారి కంటే, భయంతో చచ్చేవారే ఎక్కువ. కాబట్టి మనం ఇకనుండి రోజుకు వంతులవారీగా ఒక్కోజింక చొప్పున రాజుగారి వంటశాలకు వెళ్దాం’’ అని తీర్మానించుకున్నాయి. తమ తీర్మానాన్ని, జింకల రాజు బోధిసత్త్వుని ద్వారా కాశీరాజుకి చేరవేశాయి. ఆ ఒప్పందానికి కాశీరాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి తమ తమ వంతు ప్రకారం ఒక్కో జింక కాశీ రాజు వంటశాలకు పోసాగింది. ఒకరోజున నిండు గర్భిణిగా ఉన్న ఒక తల్లి జింక వంతువచ్చింది. అది జింకల రాజు దగ్గరికి వచ్చి ‘‘రాజా! నేను నేడోరేపో ప్రసవిస్తాను. ఈ రోజుకి నాకు బదులుగా మరొకర్ని పంపండి. నేను తర్వాత వారి వంతు వచ్చినప్పుడు వెళ్తాను. నా బిడ్డలు కూడా వారి వారి వంతు వచ్చినప్పుడు వారూ వెళ్తారు. ఇప్పుడు నాతోపాటు నా బిడ్డల ప్రాణాలు పోతాయి. నాకు న్యాయం చేయండి’’ అని ప్రాధేయపడింది. తల్లిజింక ఆవేదన విన్న బోధిసత్త్వుడు, జింకలన్నిటినీ సమావేశపరిచి విషయం చెప్పాడు. ఆమె స్థానంలో పోడానికి ఏ ఒక్కజింకా అంగీకరించలేదు. సమావేశానంతరం తల్లి జింకను ఓదార్చి పంపిన జింకలరాజు బోధిసత్త్వుడు ఆమె స్థానంలో ఆయనే స్వయంగా కాశీరాజు వంటశాలకు వెళ్లి, తనను వధించమని చెప్పాడు. జింకలరాజే స్వయంగా రావడంతో, వంటవాళ్లు వధించకుండా ఈ విషయం కాశీరాజుకు విన్నవించారు. కాశీరాజు తన భవనం దిగి వంటశాలకు వచ్చి– ‘‘మృగరాజా! తమరు పాలకులు. మీరు ఇలా రావడం తగదు. అయినా, మీ ప్రజల్ని పంపాలిగానీ, మీరెందుకు వచ్చారు?’’అని ప్రశ్నించాడు. జింకలరాజు విషయం చెప్ప– ‘‘రాజా! రాజు అంటే రక్షకుడు. భక్షకుడు కాదు. నా ప్రజల్లో ఒకరికి ఇబ్బంది వచ్చింది. వారిని రక్షించడం న్యాయం కాబట్టి వారి స్థానంలో నేనే వచ్చాను. ధర్మరక్షణ అంటే ఇదే. మీరేం బాధపడకండి. నన్ను చంపుకుని తినండి’’ అని బలిపీఠం ఎక్కాడు. జింకలరాజు మాటలకు కాశీరాజుకి కనువిప్పు కలిగింది. కన్నీరు పెట్టుకుని – ‘‘రాజు ప్రజల్ని ఎలా చూడాలో ‘నాలుగు కాళ్ల జంతువు’గా పుట్టినప్పటికీ నీకు తెలిసింది. మనిషిగా పుట్టిన నాకు తెలియలేదు. నన్ను క్షమించండి’’ ఇక మీ సారనాథ్‌లోని మృగదావనంలో వేటకు రాను. ఇదే నా అభయం. ఇక మీరు సంతోషంగా వెళ్లవచ్చు’’ అన్నాడు. అయినా, జింకలరాజు అక్కడినుండి కదలక పోవడంతో ఏమిటని అడిగాడు కాశీరాజు. ‘‘నాకు అన్ని జీవులూ సమానమే, జీవహింస ఎక్కడ జరిగినా నాకు అది మనస్కరించదు రాజా!’’ అన్నాడు. కాశీరాజు ఇక తాను జీవహింస చేయనని వాగ్దానం చేశాడు. జింకలరాజు సంతృప్తితో వెళ్లిపోయాడు. ‘దుర్మార్గులైన వ్యక్తిని చంపడం కాదు, అతనిలో ఉన్న దుర్మార్గాన్ని చంపాలి’ అనే బుద్ధ ప్రబోధానికి తగిన స్థలపురాణం ఈ సారనాథ్ కథ. (బుద్ధుడు సారనాథ్‌లో తొలి ప్రబోధం చెప్పినది ఆషాఢ పున్నమినాడు. ఈ నెల 27న ఆషాఢపున్నమి సందర్భంగా) – డా. బొర్రా గోవర్ధన్ -
మాట్లాడకపోవడమే మౌనం కాదు!
మౌనేన కలహం నాస్తి అంటారు. నిజమే! అసలు మాట్లాడక పోతే తగాదాలు ఏమి వస్తాయి? అభిప్రాయ భేదాలు ఏముంటాయి? కాబట్టి మౌనం పాటించాలంటారు కొందరు. కానీ, భావాల్ని వాక్కు రూపంలో చెప్పగలది మానవులు ఒక్కరే. మనుషులకున్న ఈ ఒక్క అవకాశాన్నీ ఉపయోగించుకోకపోతే ఎలా? మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు. చెడు మాట్లాడకపోవడమే అంటాడు బుద్ధుడు. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, పరుషంగా మాట్లాడటం, వక్రంగా మాట్లాడడం, పెడర్థాలతో మాట్లాడ్డం, లొడలొడ వాగడం, అసత్యాల్ని పలకడం ఇవన్నీ లేకుండా పలికే ఏ వచనమైనా మధుర వచనమే. మనిషి మధురంగా సంభాషించాలి. తన మాటల ద్వారా, ప్రబోధాల ద్వారా మంచిని పెంచాలి అనే బుద్ధ ప్రబోధంలో ఎందరో భిక్షువులు ధ్యానం చేస్తూ, ధ్యానానంతరం ధర్మాన్ని ప్రబోధాల రూపంలో ప్రచారం చేస్తూ ఉండేవారు. తమకు భిక్ష వేసిన గృహస్థులకు ఇంటిల్లిపాదినీ కూర్చోబెట్టి వారికి ధర్మప్రబోధం చేసేవారు. ఆశీర్వచనాలు పలికేవారు. ఇది చూసిన కొందరు మౌన సన్యాసులు– ‘‘చూశారా! బౌద్ధ భిక్షువులు మౌనం పాటించరు. భిక్ష స్వీకరించి మౌనంగా తిరిగి రారు. ఇది వారి వాచాలత్వమే! వారెలా మౌనులవుతారు? ఎలా సాధుజనులు కాగలరు?’’ అని విమర్శించేవారు. ఈ విషయాన్ని కొందరు భిక్షువులు బుద్ధునికి చెప్పగా– ‘‘భిక్షువులారా! మౌనం అంటే నోరు మూసుకుని కూర్చోవడం కాదు. ఎవరైతే మౌనాన్ని పాటిస్తారో వారు నిజానికి దుర్బలురు. తమ జ్ఞానాన్ని, తమ సాధనని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడని స్వార్థపరులు. మౌనాన్ని పాటించేవాడే వాడే ముని కాదు. త్రికరణ శుద్ధిగా ఎవరు చెడుపనులు చేయరో వారే మౌని’’ అని చెప్పాడు. మాటలకంటె మనస్సు, ఆలోచనలు, ఆచ రణలే ముఖ్యం అని వారికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
సహన ఫలం
ఒక అడవిలో రెండు చిలకలు ఉన్నాయి. ఒక వేటగాడు ఆ రెంటినీ పట్టి రాజుగారికి కానుకగా సమర్పించాడు. రాజు వాటి అందానికి, మాటలకు ముగ్ధుడై బంగారు పంజరాలు చేయించి పెంచుకోసాగాడు. వాటికి రుచికరమైన ఆహారం అందిస్తూ, వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజున అదే వేటగాడు ఒక అందమైన కోతిని పట్టి తెచ్చి రాజుకు సమర్పించాడు. దాని చేష్టలకు ముచ్చటపడ్డ రాజు, దాన్ని ఎంతో శ్రద్ధతో పెంచుతున్నాడు. కొత్తగా వచ్చిన కోతి మీద శ్రద్ధ పెరగడంతో చిలుకల మీద అశ్రద్ధ ఏర్పడింది. వాటికి సరైన ఆలనాపాలన లేక చిక్కిపోయాయి. ఈ పరిస్థితి చూసిన చిన్న చిలుక, పెద్ద చిలుకతో –‘‘చూశావా అన్నా! రాజుగారికి కోతిమీద ఇష్టం పెరిగింది. మనకు అన్న పానీయాలు అందడం లేదు. మనం ఇక్కడినుంచి వెళ్లిపోదాం’’ అంది. అప్పుడు అన్న చిలుక– ‘‘తమ్ముడూ! తొందరవద్దు. రాజుకి మన మీద ప్రేమ లేక కాదు. కొత్తగా వచ్చింది కాబట్టి కోతిమీద అతని ప్రేమ మళ్లింది. అది కోతి. దాని చేష్టలే దాన్ని ఇక్కడినుంచి తరిమేస్తాయి. సహనం వహించు’’ అన్నాడు. ఆ రాజుగారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారు ఆ కోతి దగ్గరకు వచ్చి ఆటపట్టించారు. కోతికి కోపం వచ్చి, పళ్లు బైటకు తీసి, చెవులు రిక్కించి గట్టిగా అరిచి వాళ్ల మీదికి దూకింది. దానితో వాళ్లు భయంతో కేకలు పెట్టారు. రాజుకి విషయం తెలిసి, ‘ఆ కోతిని బైటికి తరిమేయండి’అని ఆజ్ఞాపించాడు. కోతిపోయాక రాజుగారి ఆలనాపాలనా చిలుకల మీదకి మళ్లింది. చిలుకల అందం, మధుర భాషణం వల్ల వీటికి తిరిగి మర్యాదలు దక్కాయి. వాటి సహన గుణమే వాటికి మేలు చేసింది. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధ యశోధరం
యువరాణి స్వయంవరం జరుగుతోంది. పదహారు రాజ్యాల యువకులు పోటీ పడుతున్నారు ఆ గణరాజ్యాల మొత్తంలో అతి సుందరమైన, సుగుణవతి అయిన ఆ రాకుమారిని తన భాగస్వామిగా చేసుకోవాలని. గదాయుద్ధం, కత్తిసాము, గుర్రపు స్వారీ, మల్లయుద్ధం పోటీలు ముగిసాయి. వందలమంది యువకుల్లో కేవలం ముగ్గురే మిగిలారు. ఆఖరిపోటీ విలువిద్య. ఒంటిచేత్తో లేపలేనంత బరువైన సింహ హనువు అనే ధనుస్సును ఎత్తిపట్టి బాణాన్ని సంధించాలి. తొలిగా వచ్చిన ఇద్దరు సాధ్యం కాక చతికిల పడ్డారు. ఆఖరిగా వచ్చాడు ఒక బాహుబలి. అవలీలగా ధనుస్సు ఎత్తి విల్లు ఎక్కుపెట్టాడు. విజయం సాధించాడు. తాను కోరుకున్న యువతిని భార్యగా పొందగలిగాడు. ఆమె కూడా తన మనస్సు నిండా నిండిన ప్రియుణ్ణే వరించింది. ఆమె యశోధర... కొలియ సామ్రాజ్య రాకుమారి. అతనే సిద్ధార్థుడు. శాక్యవంశ రాకుమారుడు. వారిద్దరి అనురాగ జీవితం పన్నెండేళ్లు సాగింది. యశోధర గర్భవతి అయ్యింది. చూస్తూండగానే నెలలు నిండాయి. ఒక పున్నమి రోజున పండంటి బిడ్డను కన్నది. రాజ్యం అంతటా సంతోష సంబరాలు.. రాజ్యం, అధికారం, వందిమాగధులు, కుటుంబం, ఇప్పుడు ఈ సంతానం... తనను సంసార చక్రం మరింత బంధిస్తుంది అని అనుకున్నాడు సిద్ధార్థుడు. జ్ఞానసాధన సాధ్యం కాదనుకున్నాడు. మానవాళి దుఃఖ నివారణ మార్గాన్వేషణకు ఇవన్నీ అడ్డంకులే అనుకున్నాడు. ఆ రోజే... తాను సంసార పరిత్యాగం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ విషయం అందరికీ చెప్పాడు. యశోధర అడ్డు చెప్పలేదు. ఉండిపొమ్మనీ విలపించలేదు. మౌన గంభీర సాగరంగా ఉండిపోయింది. ఆనాటి రాచకుటుంబాల ఆచారం ప్రకారం ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చు. ఎందరో యువకులు ఆమెను వేడుకున్నారు. ‘మేలు వివాహం చేసుకుంటాం’’అని బతిమాలారు. భయపెట్టారు. కాని, ఆమె తన భర్త అడవిలో ఎలా జీవిస్తున్నాడో అలాగే జీవించాలనుకుంది. కాషాయబట్టలు కట్టింది. ఒంటిపూటే తిన్నది. కటిక నేలమీద పడుకున్నది. సిద్ధార్థుడు ఆరేళ్ల అన్వేషణానంతరం జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. ఏడేళ్లకు తిరిగి ఇంటికి వచ్చాడు. తన బిడ్డ రాహులుణ్ణి భిక్షువుగా మార్చి తన వెంట తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత బుద్ధుని తల్లిదండ్రులూ బౌద్ధ అనుయాయులయ్యారు. తండ్రి మరణానంతరం తల్లి గౌతమి, మరికొందరు శాక్యవంశ స్త్రీలు బుద్ధుని భిక్షుణీ సంఘంలో చేరారు. వారిలో యశోధర కూడా ఉంది. సంఘంలో చేరిన నాటి నుండి ఆమె పేరు భద్ర కాత్యాయని. ఒకరోజున... ఆమెకు కడుపు బిగదీసింది. ఉదర శూల వేధించింది. ఈ విషయం భిక్షువుగా జీవిస్తున్న రాహులునికి తెలిసింది. వచ్చి విషయం అడిగాడు. ‘‘నాయనా! రాహులా! నేను అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వస్తూ ఉండేది. మామిడిపండు రసంలో చక్కెర కలుపుకుని తాగితే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నేను భిక్షువుని. భిక్షకు వెళ్లినప్పుడు వారు ఏది పెడితే దాన్నే స్వీకరించాలి. నాకు అది కావాలి, ఇది కావాలని అడగకూడదు కదా!’’ అంది.అంతటి ఉదాత్త మహిళ యశోధర. 40 ఏళ్లపాటు భర్త నడిచిన బౌద్ధ ధర్మప్రచారం చేసి 78 ఏళ్ల వయసులో బుద్ధుని కంటె రెండేళ్ల ముందు ‘పరినిర్వాణం’ చెందింది. భరతదేశానికి మహారాణి కావలసిన యశోధర... బౌద్ధ భిక్షుణిగా అలా సాధారణ జీవితం గడిపిన త్యాగశీలి! బౌద్ధ సాపత్యం ప్రకారం ఇది బుద్ధ జయంతే కాదు.. యశోధర జయంతి కూడా! – డా. బొర్రా గోవర్ధన్ -
తనది కాని దానం!
ఒకరోజున శీలవర్థనుడు అనే భిక్షువు తన మార్గంలో పోతూ ఒక మామిడి తోపులో ఆగాడు. కొంతసేపు ఒక చెట్టుకింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. తోటలో చెట్లన్నీ మామిడిపండ్లతో నిండి ఉన్నాయి. అతనికి బాగా ఆకలిగా ఉంది. పైగా తోటలో కాపలాదారు కూడా లేడు. కోసుకు తినడం దొంగతనంగా భావించి అలాగే కూర్చొని పోయాడు. ఇంతలో ఒక మామిడిపండు రాలి తన ముందే పడింది. దోరమగ్గిన పండు వాసన ఘుమాయించి కొచ్చింది. ఇతరులు దానంగా ఇవ్వకుండా ఇలా తీసుకుని తినడం కూడా నేరంగానే భావించాడు. ఆ పక్క పొలంలో పశువుల్ని మేపుకుంటున్న ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు. గబగబా వచ్చి ‘‘భంతే! మీ ముందు రాలి పడిన పండు ఉంది కదా! తీసుకోలేదేం?’’ అని అడిగాడు. ‘‘ఇతరులు దానం చేయకుండా గ్రహించను’’ అన్నాడు. ‘‘సరే, ఇదిగో తీసుకోండి’’ అని ఆ వ్యక్తి ఆ పండుని తీసి, భక్తితో భిక్షువుకి ఇచ్చాడు. ‘‘ఈ తోట నీదేనా?’’ అని అడిగాడు భిక్షువు. ‘‘కాదు భంతే! నాకు తెలిసిన వారిదే!’’అన్నాడు. ‘‘నీది కానప్పుడు దీన్ని దానం చేసే అర్హత నీకు లేదు. దాన్ని గ్రహించడం కూడా దోషమే’’ అన్నాడు భిక్షువు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడి, వెంటనే పోయి తోట యజమానిని తీసుకుని వచ్చాడు. ఆ యజమాని ఇస్తే ఆ పండు స్వీకరించి ఆకలి తీర్చుకున్నాడు భిక్షువు. తగిన యజమానులు దానం చేయకుండా ఏ వస్తువుని గ్రహించినా అది ‘దొంగతనమే’ అని బుద్ధుడు చెప్పిన సూత్రాన్ని నిజాయితీగా పాటించి, అనతి కాలంలోనే మంచిభిక్షువుగా రాణించాడు శీలవర్థనుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
బాహ్యం సౌందర్యం అంతరం దుర్గంధం
ఒకరోజు బుద్ధుడు కోసలరాజు ప్రసేనజిత్తు ఆస్థానంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఎందరో భిక్షువులు, పండితులు, రాచకుటుంబీకులు, పౌరులు బుద్ధుని ధర్మ ప్రసంగం వినడానికి వచ్చారు. అప్పుడు ఒక జాలరి బంగారు రంగుతో తళతళ మెరుస్తూ కాంతులీనుతున్న ఒక చేపను తీసుకు వచ్చాడు. ‘‘మహారాజా! ఇది అరుదుగా దొరికే బంగారు తీగ చేప. దీని గురించి వినడమే కాని, ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్లకి మాకు చిక్కింది. దీన్ని మీకు కానుకగా సమర్పించడానికి తెచ్చారు’’ అన్నాడు జాలరి. రాజు చేపను చూసి ఆశ్చర్యపోయాడు. సభికులు చూడాలనే తలపుతో ఒక బంగారు పళ్లెంలో పెట్టించి సభముందుంచాడు. సభికులు దాని అందాన్ని, దాని రంగుని, మెరుపుని, ఆకారాన్ని గురించి గొప్పగా చెప్పుకోసాగారు. ఇంతలో చేప పెద్దగా నోరు తెరిచింది. అంతే..! దాని నోట్లోంచి గుప్పున దుర్వాసన వచ్చింది. సభికులందరూ ‘ఛీ ఛీ’ అంటూ ముక్కులు మూసుకున్నారు. అప్పుడు బుద్ధుడు– ‘‘పాండిత్యం, జ్ఞానం, ప్రతిభాపాటవాలు, నైపుణ్యం మనకి బాహ్య అందాన్ని కలిగిస్తాయి. అవన్నీ ఈ చేపకు ఉన్న శరీరం రంగులాంటివే. ఇక మన మంచి నడవడిక, కుశల ధర్మాన్ని ఆచరించడం, మన శీల సంపద మనలో దుర్గంధాన్ని దూరం చేస్తాయి. పాండిత్యం ఉన్నా శీలగుణం లేని వారి అంతరంగం, హృదయం ఈ చేపలాగే దుర్వాసన కొడుతుంది’’ అంటూ తన ప్రబోధాన్ని ప్రారంభించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ధ్యానసాధన... జ్ఞాన శోధన
తన మార్గం తప్పి, తన నైపుణ్యాన్ని, తెలివితేటల్ని మరో దారిలోకి మళ్లించిన ఒక భిక్షువుకి బుద్ధుడు సరైన ప్రబోధం చేసి, సరైన దారిలోకి తెచ్చిన ఘటన ఇది. ధనియుడు మంచి నేర్పరి. మట్టితో అందమైన కుండలు మలచగల నిపుణులు. అతను బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. ధర్మసాధన కోసం ధ్యానాన్ని అభ్యసించడం కోసం ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లాడు. ధ్యానసాధన సాగిస్తున్నాడు. ఒకరోజున అతను తన కుటీరంలో లేని సమయంలో, సమీప గ్రామంలోని ప్రజలు ఒక శవాన్ని ఆ ప్రాంతానికి తెచ్చారు. వర్షం పడటం వల్ల వారికి ఎండుకట్టెలు కనిపించక ధనియుని పర్ణశాలను పీకి, శవాన్ని తగులబెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ధనియుడు వచ్చి, ‘గడ్డిపాక’ ఉంది కాబట్టి ఇలా చేశారు. అదే రాతి కట్టడం ఉంటే చేయలేరు కదా!’ అనుకొని, మట్టితో ఇటుకరాళ్లు మలిచి, వాటితో గంట ఆకారంలో గట్టి నివాసాన్ని నిర్మించుకున్నాడు. దీనికోసం ఏడు నెలలు వెచ్చించాడు. ఈ విషయం తెలిసి, బుద్ధుడు అక్కడికి వచ్చి– ‘‘ధనియా! నీ కుటీర నిర్మాణం చాలా బాగుంది. గట్టిది. అందమైనది. విలువైనది. కానీ నీవు దీనికోసం అంతకంటే విలువైన సమయాన్ని వెచ్చించి, ధ్యానసాధన పోగొట్టుకున్నావు. ధ్యానం, జ్ఞానం ఈ కుటీరం కంటే అందమైనవి. గట్టివి. ఉపయోగకరమైనవి. నీలో నైపుణ్యాన్ని ఇలా వృథా చేసుకున్నావు. మనం జ్ఞానసాధనలోనే సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రజల దుఃఖాన్ని నిరోధించే పనిలోనే నిరంతరం ఉండాలి. మనం తల దాచుకోవడానికి ఇలాంటి అధునాతన నిర్మాణాలు అవసరం లేదు. సమయానికి మించిన సంపద లేదు. జ్ఞానానికి మించిన గొప్ప నివాసం లేదు. నీ నైపుణ్యాన్ని జ్ఞానశోధనకోసం, జ్ఞాన సాధన కోసం ఉపయోగించు’’ అని చెప్పాడు. తాను భిక్షువుగా రాణించాలంటే జ్ఞానసాధనే ముఖ్యం అని తెలుసుకున్న ధనియుడు, ఆనాటినుండి ధ్యానసాధనలో, జ్ఞానసముపార్జనలో మేటిగా నిలిచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
అది మనుషులకు వర్తించదు
ఒక జాతిగాని, కులంగానీ, వంశంగానీ మొత్తంగా ఉన్నతోన్నతమైంది ఉంటుందా అనే ధర్మసంశయం ఆనందుణ్ణి పట్టి పీడించసాగింది. ఆనందుడు బుద్ధుని సోదరుడు. భిక్షువై, తన అన్న ఆదర్శాలను పాటిస్తూ, భిక్షు సంఘంలో జీవించాడు. ఆనందుడు ఒకసారి బుద్ధునితో– ‘‘భగవాన్! మీరు సింధూ దేశంలో మేలు జాతి సైంధవ అశ్వాలు ఉంటాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో శ్రేష్ఠమైన వృషభాలు జన్మిస్తాయని చెప్పారు. మేలు జాతికి చెందిన ఛద్ధంతి ఏనుగులు ఏనుగుల్లో ఉత్తమమైనవని సెలవిచ్చారు. అలాగే ధాన్యాల్లో, ఫలాల్లో, వృక్షాల్లో ఉత్తమ జాతి గురించి వివరించారు. కానీ, ఉత్తమమైన మానవ జాతి గురించి, ఆ జాతి జీవించే ప్రదేశాలూ, దేశాలూ, వంశాలూ, జాతుల గురించి చెప్పనే లేదు?’అని ప్రశ్నించాడు. దానికి బుద్ధుడు –‘‘ఆనందా! అలాంటి ప్రత్యేక జాతులూ, వంశాలు మానవుల్లో ఉండవు. ఒకే గుణాన్ని అందిపుచ్చుకునే వంశంగానీ, జాతిగానీ, కులంగానీ ఉండవు. ఉత్తముడైన వాడు ఎక్కడో ఒకచోట జన్మించవచ్చు. అలా ఒక ఉత్తముడు జన్మించడం వల్ల ఆ వంశానికో, జాతికో కీర్తీ సంతోషాలు కలగవచ్చు. అంతేకానీ, ఉత్తమమైన జాతిగానీ, అధమమైన జాతిగానీ మనుషుల్లో ఉండవు’’ – అని చెప్పాడు. జంతువులు తమ బలాల్ని బట్టి ఉత్తమమైనవి ఎంచబడతాయని, మనుషులు బలాన్ని బట్టిగాక, గుణాల్ని బట్టి ఎంచబడతారనే బుద్ధ సందేశాన్ని ఆనందుడు గ్రహించాడు. జాత్యహంకారులకు ఈ బుద్ధప్రబోధం పెద్ద కనువిప్పు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఎరుకతో ఉండటమంటే అదే!
ఇంద్రియాలను అదుపు చేయడానికి ధ్యానప్రక్రియ ఒక సాధనం మాత్రమే. అంతేకానీ, ధ్యానం చేస్తే చాలు ఇంద్రియాలు అదుపులోకొస్తాయి, జితేంద్రియులమై పోతాము అనే ఆలోచన కేవలం అపోహ మాత్రమేనని చెబుతూ, ధ్యానానంతరం జితేంద్రియుడినై పోయాను అనుకునే కొందరు భిక్షువులకు బుద్ధుడు ఇలా బోధించాడు. ‘‘భిక్షువులారా! ఒక వ్యక్తి ఒక కుక్కని, ఒక పక్షిని, ఒక నక్కని, ఒక మొసలిని, ఒక పాముని, ఒక కోతిని పెంచాలనుకున్నాడు. వాటిని తెచ్చి బంధించాడు. తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. వాటికి ఎలాటి లోటూ లేకుండా అన్ని వసతులూ ఏర్పాటు చేశాడు. అవన్నీ అతనికి మాలిమి అయ్యాయి. ‘ఇక ఇవి నన్ను వదిలిపోవు’ అనుకొని ఒకరోజున అన్నింటినీ వదిలిపెట్టాడు. అంతే... కుక్క తన పూర్వ గ్రామానికి పరుగు తీసింది. పక్షి టపటప రెక్కలాడిస్తూ ఆకాశంలోకి లేచిపోయింది. నక్క శ్మశానానికి దౌడు తీసింది. మొసలి చరచరా పాక్కుంటూ దగ్గరలోని సరస్సులోకి వెళ్లిపోయింది. పాము వేగంగా పోయి ఒక పుట్టలో దూరింది. ఇక కోతి, అతన్ని వెక్కిరిస్తూ, ఒక చెట్టుమీదికి ఎగిరి దూకింది. అలా అవన్నీ తమ సహజ నివాసాలకే వెళ్లిపోయాయి. ఆ ఆరు జంతువులు ఎలా బంధనాలు విడిపోగానే తమ సహజరీతిని ప్రదర్శించాయో, మన ఇంద్రియాలూ అంతే! ఏమాత్రం ఆదమరచి ఉన్నా అదుపు తప్పుతాయి. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. దీనినే ‘ఎరుక’ అంటారు. మనల్ని మనం నిరంతరం పర్యవేక్షించుకోవడమే ఎరుకతో ఉండటం. ఎరుక లేకపోతే ఆరు జంతువుల్లా ఆరు ఇంద్రియాలు తమ తమ పాత పద్ధతులకేసి పరుగు తీస్తాయి. ఈ విషయం గ్రహించిన భిక్షువులు తమలో ఎరుకను పెంపొందించుకున్నారు. – డా. బొర్రా గోవర్ధన్ -
మరుగున పడేస్తే మెరుగు దాగుతుందా?
పూర్వం హిమాలయ ప్రాంతంలో మణిశిలలతో నిండిన ఒక ప్రదేశం ఉండేది. అక్కడ ఉన్న ఒక కొండగుహలో దాదాపు ముప్ఫై సూకరాలు జీవిస్తూ ఉండేవి. ఆ చుట్టుపక్కల దొరికే దుంపల్ని ముట్టెతో తవ్వుకొని తిని జీవించేవి. కొంతకాలం పాటు అక్కడ ఎలాంటి భయం లేకుండా బతికాయి. కొన్నాళ్ల తర్వాత... ఒక సింహం వచ్చి ఆ పర్వతం మీద తిరుగుతూ ఉండేది. అది ఆ గుహమీదికి గాని, దగ్గరకు కానీ వచ్చినప్పుడు ఆ మణిశిలమీద దాని రూపం ప్రతిఫలించేది. దాంతో అది మరింత పెద్దగా కనిపించేది. ఆ సింహాన్ని చూసి సూకరాలకి భయం పుట్టి, గజగజలాడేవి. గుహదాటి బైటకు వచ్చేవి కావు. అలా అవి రోజురోజుకూ భయం పెంచుకుంటూ, తిండి తినక బక్కచిక్కి పోయాయి. అప్పుడు వాటిలో కొన్ని సూకరాలు ఇలా అన్నాయి... ‘‘అయ్యో! మనకు ఏమిటి ఈ సింహపు దడుపు? అది కనిపించితేనే వణుకు పుట్టిస్తుంది. దానికి కారణం ఈ మణిశిలే. లేని దాన్ని మరింత పెద్దగా చూపుతుంది. కాబట్టి మనం బయటకు పోయి, బురద పులుముకొని వద్దాం. ఆ బురదను ఈ మణిశిల గుహగోడలకు పూద్దాం. అప్పుడు అది మనకు కనపడదు’’అన్నాయి. ‘సరే’ అని సూకరాలన్నీ చెరువు గట్టుకు పోయి, ఇసుక మట్టిలో పొర్లాడి గుహ దగ్గరకు వచ్చి గుహ గోడలకి రుద్దడం మొదలు పెట్టాయి. సూకరాల శరీరాలకంటిన ఇసుక రేణువులకు, వాటి వెంట్రుకల రాపిడికి శిలలు మరింత ప్రకాశమానమయ్యాయి. గోడలకు మకిలి అంటకపోగా మరింతగా మెరిశాయి. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం అనవసరంగా మంచివారిపై లేనిపోనివి కల్పించి చెబితే నిజం తెలిశాక వారి గుణగణాలు మరింత ప్రకాశిస్తాయి కానీ, వారికెలాంటి అపఖ్యాతీ కలగదు’’అని ప్రబోధించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మనోవీధులు ఊడ్పించాడు! గురువును చేశాడు!!
అది మగధ రాజధాని. అందులో వీధులు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు సునీతుడు. రాత్రంతా వీధులు ఊడ్చి పగలు ఊరి చివరి తన గుడిసెలో గడిపేవాడు. బుద్ధుని గురించి విని, ఒకసారి బుద్ధుని ప్రబోధం వినాలనే కుతూహలం కలిగింది. తాను అంటరాని వాడు. అందరితో కలసి కూర్చొని వినడం ఎలా? అని ఆలోచించుకుని బాధపడ్డాడు. ఒక తెల్లవారు జామున వీధి ఊడ్చే సమయంలో బుద్ధుడు అటుగా రావడం చూసి, పక్కకు తప్పుకుని ఆయన వెనకే అనుసరించాడు. చాటుగా దాగి, ధర్మప్రబోధం వినసాగాడు. ఆ రోజుల్లో ధార్మిక విషయాలు ప్రబోధించడానికి కేవలం బ్రాహ్మణ, క్షత్రియులే అర్హులు. మిగిలిన వారు దూరంగానే ఉండేవారు. సునీతుణ్ణి గమనించిన బుద్ధుడు, ‘‘రా! ఇటురా! నా దగ్గరకు రా!’’ అని పిలిచి దగ్గరకు తీసుకున్నాడు. వివరాలు అడిగి తెలుసుకుని,‘‘సునీతా! ధర్మప్రబోధానికి నీవూ అర్హుడివే!. నీవు ఇన్నాళ్లూ ఈ చీపురుతో వీధుల్లోని మురికిని ఎత్తిపోశావు. నేలను శుభ్రం చేశావు. ఇకనుండి జ్ఞానం అనే చీపురును చేతబట్టు. నీ మనసులోని మలినాలను శుభ్రం చేసుకో. నీ ధర్మప్రబోధాలతో మనుషుల మనసుల్లోని చెడ్డ ఆలోచనల్ని, దురలవాట్లని, అనైతిక కార్యక్రమాల్ని ఊడ్చిపారెయ్యి’వారిలోని అజ్ఞానాన్ని తొలగించు. వారి మనోవీధుల్ని పరిశుద్ధపరచు. రా!’’అంటూ భిక్షుదీక్ష ఇచ్చాడు. సునీతుడు అహోరాత్రాలూ కష్టపడి, విద్య నేర్చుకుని, తక్కువ కాలంలో గొప్ప భిక్షువుగా రాణించాడు. గౌరవ మర్యాదలు పొందాడు. అలా మొదటిసారిగా అన్ని కులాలవారికీ ధర్మంలో ప్రవేశం కల్పించిన వాడు బుద్ధుడు. వారితో ధార్మిక ప్రబోధం చేయించాడు. గౌరవం, కీర్తి కల్గించాడు. అలాంటి వారిలో ఒకడే సునీతుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధవాణి: మీలో మీరు వెతుక్కోండి!
ఒకసారి బుద్ధుడు నిరంజన నదీతీరంలో ఒక వనంలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పట్టణం నుండి ముప్ఫైమంది యువకులు తమ భార్యలతో సహా ఆ వనానికి విలాసయాత్రకు వచ్చారు. వీరిలో ఒక యువకునికి భార్యలేదు. మిగిలిన వారంతా కలసి ఒక గణిక (వెలయాలు)ను వెంట తెచ్చుకోమన్నారు. అతను అలాగే చేశాడు. వారంతా ఆ రోజు వనంలో విహరించి, విలాసంగా గడిపారు. పొద్దుపోయేదాకా ఆటలతో, పాటలతో ఆనందంగా గడిపారు. అర్ధరాత్రికి నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచి చూస్తే, ఆ గణిక కనిపించలేదు. అంతేకాదు, వారందరి దగ్గరా ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలూ కనిపించలేదు. వారు భార్యలని ఇళ్లకి పంపి, ఆ గణిక కోసం వెతకడం ప్రారంభించారు. దారిలో బుద్ధుడు కనిపిస్తే, ఆయన దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పి ‘‘భంతే! మేము మోసపోయాం. విలువైన సంపద పోగొట్టుకున్నాం. వాటికోసమే వెతుకుతూ ఇటు వచ్చాం. ఆ స్త్రీ ఇటేమైనా వచ్చిందా?’’ అనడిగారు. అప్పుడు బుద్ధుడు ‘‘యువకులారా! మిమ్మల్ని ఎవరూ మోసగించలేదు. మిమ్మల్ని మీరే మోసగించుకున్నారు. మీరు పోగొట్టుకున్న సంపదకంటే విలువైన సంపదనే పోగొట్టుకున్నారు. అది శీలసంపద. మీరు ఆ శీలసంపదకోసం వెతుక్కోండి. అది వనాల్లో దొరకదు. మీలోనే దొరుకుతుంది. మీలో మీరు వెతుక్కోండి. మీ కోసం మీరు వెతుక్కోండి. శీలసంపద కోసం వెతుక్కోండి’’ అని ప్రబోధించాడు. బుద్ధుని ప్రవచనం విన్న వారికి తాము ఏమి పోగొట్టుకున్నామో తెలిసింది. ఆ తర్వాత వారు శీలసంపన్నులై ధర్మమార్గంలో నడిచారు. – డాక్టర్ బొర్రా గోవర్ధన్