
తెప్పను నెత్తిన పెట్టుకుని పోతామా?
కొందరు తమకి ఉపయోగపడిన వస్తువు మీద అతి మమకారం పెంచుకుని, అది తమకే చెందాలనీ, దానిపై తమకు ఎంత ప్రేమ ఉందో నలుగురికీ తెలియజెప్పాలని తెగ ఆరాటపడిపోతుంటారు.
బౌద్ధవాణి
కొందరు తమకి ఉపయోగపడిన వస్తువు మీద అతి మమకారం పెంచుకుని, అది తమకే చెందాలనీ, దానిపై తమకు ఎంత ప్రేమ ఉందో నలుగురికీ తెలియజెప్పాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అలాగే బుద్ధుని కాలంలో కూడా తాము నమ్మే సిద్ధాంతమే గొప్పదని, సర్వకాల సర్వావస్థలకూ అదే పనికొస్తుందని మూఢంగా నమ్మేవారు ఉండేవారు. తామే గొప్ప వారమనీ, తమ ధర్మమే గొప్పదని అహంకారంతో గడిపేవారు. అలాంటి వాళ్లు బౌద్ధ సంఘాలలో కూడా ఉండేవారు.
ఈ విషయాన్ని గ్రహించిన బుద్ధుడు ఒకనాడు వారిని పిలిపించి, ‘‘భిక్షులారా! ఒక నదికి వరద వచ్చింది. మనం అవతలి ఒడ్డుకు చేరాలి. కాబట్టి కర్రలు, గడ్డీ ఉపయోగించి ఒక తెప్పను తయారు చేస్తాం. దాని సాయంతో అవతలి ఒడ్డుకు చేరుతాం. చేరాక, ఈ తెప్ప నాకు సాయపడింది అని చెప్పి దాన్ని నెత్తిన పెట్టుకుని పోతామా? అలా పోవడం కంటే దాన్ని అక్కడే ఉంచి లంగరు వేస్తే, మరొకరు దాని సాయంతో నదిని దాటుతారు. అలా ఎందరికో ఉపయోగపడుతుంది.
అందరికీ ఉపయోగపడేదాని పట్ల అతి మమకారంతో దాన్ని మోసుకుపోతే... ఇతరులకూ ఉపయోగపడదూ, మనకూ భారమైపోతుంది. ఏ వస్తువైనా, ఏ ధర్మమైనా అంతే. చివరికి నేను చెప్పే ధర్మం అయినా ఇంతే. దుఃఖం అనే వరదను దాటడానికే నా ధర్మం. నా ధర్మం తెప్పలాంటిది. మనం కూడా అంతే. మనం సాయం చెయ్యాలి. సహాయం పొందిన వారికి భారం కాకూడదు’’ అని చెప్పాడు.
ఈ బోధతో వారిలోని అహంకారం నశించిపోయింది.
- బొర్రా గోవర్ధన్