Bauddhavani
-
పాపమా? పుణ్యమా?!
శ్రావస్తి బౌద్ధ సంఘంలో విమలుడు మంచి భిక్షువు. బుద్ధుని ప్రబోధాల్ని చక్కగా ఆచరిస్తాడని పేరు. పంచశీల పాటించడంలో మేటి. ఒకరోజున ఒక అడవిమార్గంలో వెళ్తున్నాడు విమలుడు. అతని చెవికి ఒక జింక రోదన వినిపించింది. వెంటనే విమలుడు ఆ ఆర్తి, అరుపు వినిపించే వైపుకు నడక సాగించాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ ఒక జింక, దాని పిల్లలు కనిపించాయి.అవి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. అది గింజుకుంటూ మోర పైకెత్తి అరుస్తోంది. విమలుడు దగ్గరకి వెళ్లాడు. తల్లి జింక భయంతో మరింత బిగ్గరగా అరిచింది. పిల్ల జింకలు రెండూ దూరంగా పారిపోయాయి. ఎవరో వేటగాడు ఉచ్చులు పన్నాడు. ఆ ఉచ్చులో తల్లి జింక కాలు తగిలించుకుంది. అది ఎప్పటినుండి బలవంతాన లాక్కుంటోందో గానీ, ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. కాలి చర్మం కూడా చీరుకుపోయి ఉంది. విమలుడు వెంటనే ఆ ఉచ్చు తొలగించాడు. తల్లి జింక విమలుడి వంక మెరిసే కళ్లతో చూస్తూ తన పిల్లల దగ్గరకు గెంతుతూ అరుస్తూ వెళ్లిపోయింది. ఈసారి దాని అరుపులో ఆనందం వినిపిస్తోంది. విమలుడు వాటివైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అంతలో.. అతని వెనుకనుండి... ‘‘ఓరీ! బోడిగుండూ! దుర్మార్గుడా! ఎంత పని చేశావు?’’అనే అరుపు వినిపించి వెనక్కి తిరిగాడు. వేటగాడు కోపంతో తన దగ్గరకు వేగంగా వస్తున్నాడు. ‘‘నేను ఆహారం కోసం ఉచ్చులు పన్నాను. నాకు దొరికిన ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. నీవు చేసిన ఈ పనివల్ల ఈ రోజు నా కుటుంబం పస్తుండాలి. మా నోటికాడ కూడు తీసిన పాపం నీదే...’’ అని తిట్టుకుంటూ ఉచ్చులు తీసుకుని భిక్షువు వంక చుర చుర చూస్తూ చరచరా వెళ్లిపోయాడు. విమలుడు దారిలోకి వచ్చి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. ‘‘నేను పాపం చేశానా?పుణ్యం చేశానా?’’ అనే సందేహంలో పడ్డాడు. ఆరామానికి వచ్చి, బుద్ధుని దగ్గరకు వెళ్లి, నమస్కరించి, విషయం చెప్పాడు. ‘‘విమలా! నీవు చేసింది పాపం కాదు. జీవ కారుణ్యానికి మించిన ధర్మం లేదు. నీవు శీల భ్రష్టుడివి కావు. నిందితుడివి కావు’’ అని మెచ్చుకున్నాడు.ఒక మంచిపని చేయడం వల్ల కొందరు నిందించినా బాధపడకూడదని విమలునికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
బుద్ధుని ప్రసంగ పాఠాలు
బౌద్ధవాణి పూర్వం వారణాసిలో ఏరకపత్రుడనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన ఒక కూతురుంది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎందరో ధనికయువకులు ముందుకొచ్చారు. తన కుమార్తె అందం, తన ఐశ్వర్యం చూసి వారంతా వస్తున్నారని గ్రహించాడు ఏరకపత్రుడు. సాధారణంగా ధనం కలిగిన యువకులు దురలవాట్లకు లోనవుతారు. అహం, నిర్లక్ష్యం రెండూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు లేని వారికోసం వెదుకుతున్నాడు. అలాంటి వారిని గుర్తించడానికి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. వచ్చిన ప్రతి యువకుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి, అతనికి ప్రవర్తన, మనోస్థితిని అర్థం చేసుకునేవాడు. అలా పరీక్షించి, వచ్చిన వాళ్లందర్నీ తిప్పి పంపుతున్నాడు. ఆ పక్కనే ఉన్న పట్టణంలో ఓ సాధారణ కుటుంబానికి చెందిన ఉత్తరుడు అనే యువకునికి ఈ విషయం తెలిసి పరీక్షకు వెళ్లాడు. ఏరకపత్రుడు ప్రశ్నలు అడిగాడు. ‘‘ఎవరు స్వతంత్రుడు?’’ ‘‘ఇంద్రియాల్ని, ఆశల్ని అదుపులో పెట్టుకున్నవాడు’’ ‘‘కుబేరునికి ఉన్నంత ధనరాశి మొత్తం ఒక పిడికెడు మట్టితో ఎప్పుడు సమానం అవుతుంది?’’ ‘‘దానం చేయనప్పుడు, అవసరాలకు వినియోగించుకోనప్పుడు ఆ ధనం పనికిరానిది అవుతుంది’’ ‘‘మామూలు మూర్ఖుడెవరు? పండిత మూర్ఖుడెవరు?’’ ‘‘పదాల భావాన్ని కాకుండా వాటి అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు తెలియడమే జ్ఞానంగా భావించే వాడు పండిత మూర్ఖుడు. ఈ పండిత మూర్ఖుణ్ణి గొప్ప పండితుడు అనుకునేవాడు మామూలు మూర్ఖుడు’’ ఇలా మూడు ప్రశ్నలకూ, మూడు సమాధానాలు చెప్పాడు ఉత్తరుడు. ఆ సమాధానాలు ఏరకపత్రునికి నచ్చి, ‘‘నాయనా నీవు బుద్ధుని ప్రసంగాలు వింటావా?’’ అని అడిగాడు. ‘‘అవునండీ, నేనూ, మా కుటుంబం ఎప్పుడూ బుద్ధుని ప్రసంగాలు వింటాం, ఆచరిస్తాం’’ అని చెప్పాడు. బుద్ధుని ప్రసంగాల్లో ఉండే శాంతం, అహింస, దయ, కరుణ, ప్రేమ, దానం, శీలం... ఇలాంటి గుణాలు కలిగిన యువకుడై ఉంటాడని గుర్తించి తన కుమార్తెను సంతృప్తితో కూడిన సంతోషంతో ఉత్తరునికిచ్చి వివాహం చేశాడు ఏరకపత్రుడు. - బొర్రా గోవర్ధన్ -
ఏది ఉత్తమ ధర్మం?
బౌద్ధవాణి శ్రావస్తి నగరంలో వజ్రాలకు సాన పెట్టే పనివాడు ఒకడు ఉండేవాడు. వాని పేరు నికషుడు. ఒకనాడు నికషుడు ఒక బౌద్ధభిక్షువుని భిక్ష కోసం తన ఇంటికి పిలుచుకు వచ్చాడు. మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు. అప్పుడు రాజభటులు వచ్చి ఒక ఎర్రని వజ్రాన్ని ఇచ్చి సాన పెట్టమని చెప్పి వెళ్లిపోయారు. నికషుడు ఆ వజ్రాన్ని ఒక పళ్లెంలో ఉంచి, దానిని చిన్న ముక్కాలిపీట మీద ఉంచి లోనికి వెళ్లాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న నికషుని పెంపుడు కోడిపుంజు దాని రంగు చూసి ఒక్క ఉదుటున నోట కరుచుకుని మింగేసింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నికషునికి ఆ వజ్రాన్ని ఆ భిక్షువే కాజేశాడని అనిపించింది. ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా భిక్షువు మాట్లాడకపోవడంతో కోపం ముంచుకొచ్చి, ‘‘భిక్ష కోసం నేను నిన్ను పనిమాలా పిలుచుకొస్తే ఇలాంటి దొంగతనానికి పాల్పడతావా?’’అంటూ మూలనున్న కర్ర తీసుకుని భిక్షువుని కొట్టడం మొదలుపెట్టాడు. అయినా ఆ భిక్షువు మాట్లాడలేదు. విషయం తనకు తెలిసినా ‘కోడిపుంజు మింగిందనీ’’ చెప్పలేదు. దెబ్బలు భరిస్తూనే ఉన్నాడు. చివరికి నికషుని చేతిలోని కర్రకూడా సగానికి విరిగిపోయింది. ‘‘చూడు, ఎంతకొట్టినా నోరు మెదపడం లేదు. ఇది కాదు. ఇంకో కర్ర తెస్తాను’’ అంటూ తన చేతిలోని కర్రను గట్టిగా నేలకు విసిరికొట్టి, గది మూలకు మరో కర్రకోసం వెళ్లాడు. ఈలోగా నేలకేసి కొట్టిన కర్రముక్క పైకి ఎగిరి ఆ పుంజుకు తగిలి అది గిలగిలా తన్నుకుని చనిపోయింది. రెండో కర్ర తీసుకువచ్చిన నికషునితో అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆ భిక్షువు. ‘‘ఇంతసేపూ ఎందుకు నోరు మెదపలేదు?’’ అని అడిగాడు నికషుడు. తన వల్ల ఒక మూగజీవి ప్రాణం పోవడం ఇష్టం లేక చెప్పలేదని అన్నాడు భిక్షువు. ఆ మాటకు వెంటనే భిక్షువు కాళ్ల మీద పడి, క్షమించమని వేడుకున్నాడు నికషుడు. బుద్ధ భగవానుడు ఈ విషయం చెప్పి ‘‘జీవకారుణ్యానికన్నా ఉత్తమ ధర్మం మరొకటి లేదు’’ అని తన శిష్యులతో అన్నాడు. - బొర్రా గోవర్ధన్ -
అసలైన స్నానం
బౌద్ధవాణి బుద్ధుని కాలంలో వైశాలి ఒక గణతంత్ర రాజ్యం. దాని మహారాజు నందకుడు. ఒకరోజు బుద్ధుడు వైశాలిలోని మహావనంలో ఉన్నాడు. ఆ సాయంత్రం అక్కడే ఆయన తన ధర్మప్రసంగం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి, ఆ వనం పక్కనే ఉన్న తన నివాసం నుండి వెళ్లి బుద్ధుని ధర్మ ప్రసంగాన్ని వింటున్నాడు నందకుడు. బుద్ధుడు ఆ రోజు పంచశీల గురించి, అష్టాంగమార్గం గురించి వివరిస్తున్నాడు. బుద్ధుని ధర్మోపన్యాసం వింటూ అందులో లీనమై పోయాడు నందకుడు. ఇంతలో నందకుని రాజసేవకుడు వచ్చి, నందకునితో ‘‘రాజా! తమ స్నానానికి వేళయింది. వేన్నీళ్లు, చన్నీళ్లు సిద్ధం చేశాము’’ అని నెమ్మదిగా చెప్పాడు. ‘‘సేవకా! చాలు చాలు. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. భగవానుని ధర్మ ప్రవచనాలు వింటూ నా మనస్సును కడిగేసుకుంటున్నాను. ధర్మస్నానం చేస్తున్నాను. నీవు చెప్పే బాహ్యస్నానాలకంటే ఇదెంతో మేలైంది. ఆ స్నానం ఇప్పుడు కాదు.. నువ్వు వెళ్లు !’’ అని పంపించేశాడు. తిరిగి బుద్ధుని ధర్మోపన్యాసాల్లో లీనమై పోయాడు. బాహ్యస్నానం వల్ల శరీరం తేలికపడ్డట్టు, ధర్మస్నానం వల్ల అతని మనస్సు తేలిక పడింది. - బొర్రా గోవర్ధన్ -
నిజమైన దిక్పాలకులు
బౌద్ధవాణి మగధకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కొడుకు సింగాలకుడు. రోజూ క్రమం తప్పకుండా నగరం వెలుపలగల కోనేటిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చి, దిక్కు దిక్కుకు తిరిగి సాష్టాంగ ప్రణామాలు చేస్తాడు. ఒక రోజున నమస్కరించి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చిరునవ్వుతో బుద్ధుడు కన్పించాడు. భక్తితో బుద్ధునికి నమస్కరించాడు సింగాలకుడు. ‘‘సింగాలకా! ఎవరికి నమస్కరిస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు.‘‘భగవాన్! రోజూ ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను’’ అన్నాడు సింగాలకుడు. ‘‘మంచిది సింగాలకా! దిక్కులకు ఎందుకు నమస్కరించాలో తెలుసా?’’ ‘‘ఆరు దిక్కులకూ ఆరుగురు దిక్పాలకులుంటారో గదా! వారికే నమస్కరిస్తున్నా!’’ అని ఏయే దిక్కుకు ఎవరెవరు అధిపతులో చెప్పాడు సింగాలకుడు. బుద్ధుడు నవ్వి...‘‘సింగాలకా! నీవు చెప్పిన వారికంటే గొప్ప దిక్పాలకులున్నారు. తూర్పు దిక్కుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దక్షిణ దిక్కుకు మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువు, పశ్చిమానికి భార్యా-బిడ్డలు, ఉత్తర దిశకు మిత్రులు అధిపతులు. ఉద్యోగులు శ్రామికులు అధోదిశకు, పండితులు ఊర్ధ్వదిశకు ప్రతీకలు కాబట్టి వారికి నమస్కరించు. వీళ్లే నిజమైన దిక్పాలకులు’’ అని చెప్పాడు బుద్ధ భగవాన్. ‘‘అలాగే భగవాన్’’ అని వినయంగా పలికాడు సింగాలకుడు. - బొర్రా గోవర్ధన్ -
తెప్పను నెత్తిన పెట్టుకుని పోతామా?
బౌద్ధవాణి కొందరు తమకి ఉపయోగపడిన వస్తువు మీద అతి మమకారం పెంచుకుని, అది తమకే చెందాలనీ, దానిపై తమకు ఎంత ప్రేమ ఉందో నలుగురికీ తెలియజెప్పాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అలాగే బుద్ధుని కాలంలో కూడా తాము నమ్మే సిద్ధాంతమే గొప్పదని, సర్వకాల సర్వావస్థలకూ అదే పనికొస్తుందని మూఢంగా నమ్మేవారు ఉండేవారు. తామే గొప్ప వారమనీ, తమ ధర్మమే గొప్పదని అహంకారంతో గడిపేవారు. అలాంటి వాళ్లు బౌద్ధ సంఘాలలో కూడా ఉండేవారు. ఈ విషయాన్ని గ్రహించిన బుద్ధుడు ఒకనాడు వారిని పిలిపించి, ‘‘భిక్షులారా! ఒక నదికి వరద వచ్చింది. మనం అవతలి ఒడ్డుకు చేరాలి. కాబట్టి కర్రలు, గడ్డీ ఉపయోగించి ఒక తెప్పను తయారు చేస్తాం. దాని సాయంతో అవతలి ఒడ్డుకు చేరుతాం. చేరాక, ఈ తెప్ప నాకు సాయపడింది అని చెప్పి దాన్ని నెత్తిన పెట్టుకుని పోతామా? అలా పోవడం కంటే దాన్ని అక్కడే ఉంచి లంగరు వేస్తే, మరొకరు దాని సాయంతో నదిని దాటుతారు. అలా ఎందరికో ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడేదాని పట్ల అతి మమకారంతో దాన్ని మోసుకుపోతే... ఇతరులకూ ఉపయోగపడదూ, మనకూ భారమైపోతుంది. ఏ వస్తువైనా, ఏ ధర్మమైనా అంతే. చివరికి నేను చెప్పే ధర్మం అయినా ఇంతే. దుఃఖం అనే వరదను దాటడానికే నా ధర్మం. నా ధర్మం తెప్పలాంటిది. మనం కూడా అంతే. మనం సాయం చెయ్యాలి. సహాయం పొందిన వారికి భారం కాకూడదు’’ అని చెప్పాడు. ఈ బోధతో వారిలోని అహంకారం నశించిపోయింది. - బొర్రా గోవర్ధన్ -
వర్షించిన మేఘం!
బౌద్ధవాణి భిక్షువులు కొందరు సోమరిపోతుల్లా గడుపుతుండేవారు. జ్ఞానబోధ చేయని భిక్షువు భిక్షకు అర్హుడు కాదని బుద్ధుడు చెప్పేవాడు. చదువు పట్ల, బోధ పట్ల నిర్లక్ష్యం చూపి, సోమరుల్లా విహారాల్లో గడిపేవారిని వారించేవాడు. సోమరితనం సర్వనాశనానికి కారణం అని పదే పదే చెప్పేవాడు. ఒకరోజు కొందరు శిష్యులు ఒక సోమరి భిక్షువును బుద్ధుని దగ్గరకు తీసుకువచ్చారు. బుద్ధుడు అతడితో ఇలా చెప్పాడు... ‘‘ఒక ఊళ్లో ఎందరో కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ఒక వేదాంతి వచ్చి ‘నాయనా, ఈ ఊళ్లో ఓ పుష్కరం పాటు వానలు పడవు’ అని చెప్పాడు. ఆయన మాటలు విని రైతులంతా ఊరు ఖాళీ చేసి, పొరుగూరు వెళ్లిపోయారు. కానీ ఒకే ఒక రైతు నాగలి కట్టి పొలం దున్నుతున్నాడు. ఆకాశంలో పోయే మేఘాలు అతడిని చూసి ఆశ్చర్యపడి, దిగి వచ్చి, ‘ఓ కర్షకుడా... మేము పన్నెండేళ్ల పాటు వర్షించబోమని తెలిసి కూడా ఎందుకు పొలం దున్నుతున్నావు?’ అని అడిగాయి. దానికా రైతు నవ్వి - ‘ఈ పన్నెండేళ్లూ నేను పనులు చేయకుండా కూర్చుంటే, పన్నెండేళ్ల తర్వాత మీరు వర్షించినా నాకు ఉపయోగం లేదు. ఈలోపు సోమరితనం పెరిగి, నా పనులు నేను మరిచేపోతాను. అప్పుడు మీరు వర్షించినా, వర్షించకున్నా ఒకటే’ అన్నాడు. రైతు మాటలు విని మేఘాలకు భయం వేసింది. తామూ తమ పనిని మరచిపోతామేమో అనుకుని వెంటనే వర్షించాయి’’ అని కథ ముగించాడు బుద్ధుడు. భిక్షువుకి జ్ఞానోదయం అయింది. - బొర్రా గోవర్ధన్ -
మానవత్వమే మనిషి సహజగుణం
బౌద్ధవాణి నిరంజనా నది ఒడ్డున ఒక బౌద్ధ భిక్షువు స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసే చోటుకు దగ్గరగా ఒక మేడి చెట్టు ఉంది. అది ఏటి గట్టున ఉండి నదిలోకి వాలి ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక తేలు ఉంది. అది ఆ చెట్టు కొమ్మలను అల్లుకున్న సాలెగూడు కేసి పాకుతూ జారి తటాలున నీటిలో పడింది. తేలు నీటిలో జారి పడడం చూసిన భిక్షువు గబాలున పోయి రెండు చేతులను దోసిలిగా చేసి ఆ తేలును నీటిలో మునగకుండా పెకైత్తాడు. దాన్ని మెల్లగా మరలా కొమ్మ మీద పెట్టాడు. ఆ సమయంలో తేలు కసుక్కున కుట్టింది. అది అలా కుట్టగానే భిక్షువు బాధతో ‘‘అమ్మా’’అంటూ పెద్దగా అరిచాడు. అంతలోనే ఆ తేలు మరలా జారి పడింది. ఆ భిక్షువు మరలా రక్షించి, కొమ్మ మీద ఉంచాడు. అది మరలా కుట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. అది నీటిలో పడడం, భిక్షువు దానిని రక్షించడం, తిరిగి అది కుట్టడం, భిక్షువు బాధతో అరవడం... ఈ తతంగాన్నంతా ఒడ్డున గొర్రెలు మేపుకుంటున్న ఒక వ్యక్తి చూసి, పగలబడి నవ్వుతూ, ‘‘స్వామీ! తేలు కుడుతుందని తెలియదా! దాన్ని కాపాడడం ఎందుకు? కుట్టినప్పుడల్లా అమ్మా అబ్బా అని అరవడం ఎందుకు? మీకేమైనా పిచ్చా?’’ అన్నాడు. దానికి భిక్షువు నవ్వుతూ, ‘‘నాయనా, కుట్టడం దాని నైజం. రక్షించడం నా నైజం. కుట్టకపోతే అది దాని సహజగుణాన్ని మరచిపోయినట్లు. రక్షించకపోతే నేను నా సహజగుణాన్ని మరచినట్లు. మానవత్వం అంటే ఇదే! ఎదుటివారి కష్టసుఖాల్ని అర్థం చేసుకునే గుణం ఈ చరాచర సృష్టిలో మనిషి ఒక్కడికే ఉంది. దాన్ని కోల్పోతే మనం మానవత్వాన్ని కోల్పోయినట్లే’’ అన్నాడు. పశువుల కాపరి భిక్షువుకు నమస్కరించాడు. - బొర్రా గోవర్థన్ -
మహాదాత
బౌద్ధవాణి వైశాలి నగరంలో సువర్ణదత్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలో అతనికంటే ధనవంతుడు లేడు. ఎన్నో దేశాలలో వ్యాపారం చేసేవాడు. ఎంత ధనవంతుడో అంత దాత కూడా. ఆయన చేసిన చిన్నచిన్న దానాలకు లెక్కేలేదు. భూరి దానాలూ అంతగానే చేశాడు. ప్రజలు సువర్ణదత్తుడిని గొప్పదాతగా చెప్పుకునేవారు. వారు పొగిడిన కొద్దీ దానాలు చేసేవాడు సువర్ణదత్తుడు. అతని దగ్గర ఎందరో నౌకర్లు ఉండేవారు. అతని వ్యక్తిగత పనులు చేసే సుదత్తుడనే పనివాడు వారిలో ఒకడు. సుదత్తుడు కూడా దానధర్మాలు చేసేవాడు. సువర్ణదత్తునిలా పెద్దపెద్ద దానాలు చేయకపోయినా తనకు తగినంతలోనే దానాలు చేసేవాడు. కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు. వారి వారి దానఫలాన్ని బట్టి ఇద్దరూ తుషిత స్వర్గంలో చేరారు. అక్కడ దేవతలు సువర్ణదత్తునికీ, సుదత్తునికీ సన్మానం ఏర్పాటు చేశారు. తనతో పాటు తన సేవకుడూ స్వర్గానికి రావడం చూసి సువర్ణదత్తుడు ఆశ్చర్యపోయాడు. పైగా తనతో కలిసి సన్మానం పొందడం చూసి మరింత అవాక్కయ్యాడు. ఇద్దరికీ సన్మానం జరిగింది. సువర్ణదత్తునికి ‘గొప్పదాత’ అనే బిరుదు ప్రదానం చేసి, బంగారు కిరీటం పెట్టారు. సుదత్తునికి ‘మహాదాత’ అనే బిరుదునిచ్చి వజ్రాలు పొదిగిన కిరీటం అలంకరించారు. ఈ సన్మానం తనకు అవమానంగా భావించాడు సువర్ణదత్తుడు. వెంటనే అక్కడివారిని అడిగాడు. అప్పుడు దేవరాజు - ‘‘సువర్ణదత్తా! నువ్వు భాగ్యశాలివి. నువ్వు ఎంత దానం చేసినా అది నీ సంపదలో కొద్ది మాత్రమే. కానీ సుదత్తుడు ఒక సేవకుడు. పనివాడు. తన సంపాదనలో అతను చేసిన పాలు చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు గొప్పదాతవు, అతను మహాదాత అయ్యారు. ఇక కిరీటాలు అంటావా, దాతలుగా ఇద్దరూ బంగారు కిరీటాలకు అర్హులే. కానీ నువ్వు గొప్పదనం కోసం దానాలు చేశావు. సుదత్తుడు ఎదుటివారి కష్టాల్నీ, కన్నీటినీ చూసి కరిగిపోయి దానాలు చేశాడు.అతని మనసు కరిగి కన్నీరుగా మారేది. అతను ఎదుటివారి కష్టాలు చూసి కార్చిన ఒక్కో కన్నీటి బొట్టుకూ, ఒక్కొక్క వజ్రం దానఫలంగా అతని కిరీటంలో చేరింది’’ అన్నాడు. ‘‘సుదత్తా! నీలాంటి సేవకుణ్ణి పొందిన భాగ్యం నాది’’అంటూ సువర్ణదత్తుడు సుదత్తుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. - బొర్రా గోవర్థన్