ఏది ఉత్తమ ధర్మం?
బౌద్ధవాణి
శ్రావస్తి నగరంలో వజ్రాలకు సాన పెట్టే పనివాడు ఒకడు ఉండేవాడు. వాని పేరు నికషుడు. ఒకనాడు నికషుడు ఒక బౌద్ధభిక్షువుని భిక్ష కోసం తన ఇంటికి పిలుచుకు వచ్చాడు. మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు. అప్పుడు రాజభటులు వచ్చి ఒక ఎర్రని వజ్రాన్ని ఇచ్చి సాన పెట్టమని చెప్పి వెళ్లిపోయారు. నికషుడు ఆ వజ్రాన్ని ఒక పళ్లెంలో ఉంచి, దానిని చిన్న ముక్కాలిపీట మీద ఉంచి లోనికి వెళ్లాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న నికషుని పెంపుడు కోడిపుంజు దాని రంగు చూసి ఒక్క ఉదుటున నోట కరుచుకుని మింగేసింది.
కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నికషునికి ఆ వజ్రాన్ని ఆ భిక్షువే కాజేశాడని అనిపించింది. ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా భిక్షువు మాట్లాడకపోవడంతో కోపం ముంచుకొచ్చి, ‘‘భిక్ష కోసం నేను నిన్ను పనిమాలా పిలుచుకొస్తే ఇలాంటి దొంగతనానికి పాల్పడతావా?’’అంటూ మూలనున్న కర్ర తీసుకుని భిక్షువుని కొట్టడం మొదలుపెట్టాడు. అయినా ఆ భిక్షువు మాట్లాడలేదు. విషయం తనకు తెలిసినా ‘కోడిపుంజు మింగిందనీ’’ చెప్పలేదు. దెబ్బలు భరిస్తూనే ఉన్నాడు. చివరికి నికషుని చేతిలోని కర్రకూడా సగానికి విరిగిపోయింది.
‘‘చూడు, ఎంతకొట్టినా నోరు మెదపడం లేదు. ఇది కాదు. ఇంకో కర్ర తెస్తాను’’ అంటూ తన చేతిలోని కర్రను గట్టిగా నేలకు విసిరికొట్టి, గది మూలకు మరో కర్రకోసం వెళ్లాడు. ఈలోగా నేలకేసి కొట్టిన కర్రముక్క పైకి ఎగిరి ఆ పుంజుకు తగిలి అది గిలగిలా తన్నుకుని చనిపోయింది.
రెండో కర్ర తీసుకువచ్చిన నికషునితో అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆ భిక్షువు.
‘‘ఇంతసేపూ ఎందుకు నోరు మెదపలేదు?’’ అని అడిగాడు నికషుడు.
తన వల్ల ఒక మూగజీవి ప్రాణం పోవడం ఇష్టం లేక చెప్పలేదని అన్నాడు భిక్షువు.
ఆ మాటకు వెంటనే భిక్షువు కాళ్ల మీద పడి, క్షమించమని వేడుకున్నాడు నికషుడు.
బుద్ధ భగవానుడు ఈ విషయం చెప్పి ‘‘జీవకారుణ్యానికన్నా ఉత్తమ ధర్మం మరొకటి లేదు’’ అని తన శిష్యులతో అన్నాడు.
- బొర్రా గోవర్ధన్